Wednesday, April 11, 2012

కమ్యూనిస్టుల సా.న్యాయ జపం! కమ్మ, రెడ్ల పట్టు సడలుతుందా?-- Y K



- ఉభయ పార్టీల ‘సరి కొత్త’ నినాదం 
- ఇప్పుడు అన్ని పార్టీలదీ అదే పాట!
- సామాజిక న్యాయంలో భాగమే రిజర్వేషన్లు 
- కులాల జనాభా, దామాషా ప్రాతినిథ్యం పరిగణిస్తారా?
- ఆధిపత్య కుల శక్తులతో సయోధ్య వదలుకోవాలి!
- దళిత, బహుజన శక్తులతో మిత్రత్వం ప్రకటించాలి!
- బీసీ మహిళలకు ఉప కోటాకోసం పోరాడతారా? 

cpm
భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత మొదటి పత్రికా విలేకరుల సమావేశంలో సురవరం సుధాకరరెడ్డి- కుల రాజకీయాలు, కుల సమీకరణలు, ప్రాంతీయ పార్టీలు, కులపార్టీలు- వంటి అనేక అంశాలతోబాటు ‘సామాజిక న్యాయం’ గురించి మాట్లాడారు. గతంలో కుల వివక్షకు గురైన కులాలకు సామాజిక న్యాయం చేయగలమన్న విశ్వాసం కల్పించి వారిని తమ పార్టీ వైపు ఆకర్షిస్తామని ఆయన చెప్పారు. అలాగే కేరళలోని కోజికోడ్‌లో ప్రారంభమైన సీపీఎం జాతీయ మహాసభ- భూమి, ఆహారం, ఉపాధి అంశాలతో బాటు ‘సామాజిక న్యాయం’ గురించి పోరాటాలు నిర్వహించవలసి ఉంటుందని రాజకీయ తీర్మాన ముసాయిదాలో పేర్కొన్నది. అంటే, రెండు కమ్యూనిస్టు పార్టీలూ జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం గురించి విధానపరమైన వైఖరిని ప్రకటిస్తోన్నాయి. 

అయితే, సామాజిక న్యాయం అంటే ఏమిటో ఆ పార్టీలు స్పష్టంగా నిర్వచించవలసి ఉంది. ఎందుకంటే, సోషలిజం తమ లక్ష్యమని ప్రధానంగా కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు చెప్పినా, సోషలిజమే తమ ధ్యేయమంటూ ఇతర పార్టీలూ ప్రకటించాయి. తొలిసారిగా కాంగ్రెస్‌ పార్టీ 1955లో ఆంధ్రలో బలమైన కమ్యూనిస్టు పోటీని ఎదుర్కొనే సందర్భంలో ‘ఆవడి’లో సమావేశమై తమ లక్ష్యం ‘సోషలిస్టు తరహా సమాజం’ అని ప్రకటించింది. చివరికి ఆనాటి జనసంఘ్‌ పార్టీ కూడా తమది ‘జాతీయ సోషలిజం’ అని చెప్పుకున్నది. ఈవిధంగా ప్రతి పార్టీ తమ లక్ష్యం సోషలిజమేనని చెప్పుకొంటూ రకరకాల అర్థాలూ, నిర్వచనాలు ఇచ్చుకుంటూ పోయి- చివరికి ఏది అసలు, ఏది నకిలీ అని తేల్చుకొనడం ప్రజలకు కష్టతరమైనదిగా తయారు చేశారు. ఇప్పుడు కూడా ‘సామాజిక న్యాయం’ బహుళ ప్రచారంలో ఉండటంతో అన్ని పార్టీలూ తమ లక్ష్యమూ అదేనంటూ మాట్లాడటం మొదలెట్టాయి. 

సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యం గురించి మహాత్మ జోతిరావ్‌ ఫూలే, డా బి.ఆర్‌. అంబేడ్కర్‌లు ఈ దేశంలో అందరికన్నా ముందు మాట్లాడారు. అలాగే, అందుకోసం పెరియార్‌ రామస్వామి నాయకర్‌, నారాయణ గురు, సాహు మహరాజ్‌ వంటి సామాజిక ఉద్యమకారులు పోరాడారు. ‘సామాజిక న్యాయం’ లక్ష్యం రాజ్యాధికారంతో ముడిపడి ఉందని తేల్చిచెప్పారు కాన్షీరామ్‌. భారత రాజ్యాంగ పీఠికలోనే సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం పౌరులకు సమకూర్చుకొనడం లక్ష్యాలుగా పేర్కొంటూ ఆ మూడింటిలోనూ మొదటి స్థానాన్ని సామాజిక న్యాయానికే ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ మొట్టమొదటి సవరణ గూడా ఆర్టికల్‌ 15కి- 4వ క్లాజ్‌ చేర్చటం ద్వారా జరిగింది. ప్రభుత్వ వ్యవస్థల్లో తగినంత ప్రాతినిధ్యంలేని సామాజిక సమూహాలకి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నదే ఆ సవరణ సారాంశం. పెరియార్‌ రామస్వామి కృషి ఈ సవరణ వెనుక ఉన్న వాస్తవమని అందరికీ తెలిసిందే.

రిజర్వేషన్ల రూపంలో కల్పిస్తున్న ఈ ప్రత్యేక సదుపాయాలు సామాజిక న్యాయంలో అంతర్భాగమే. కులాలుగా విడదీసిన సమాజంలో అన్ని కులాలకీ సరైన న్యాయం జరగడం సామాజిక న్యాయం. సమస్త జీవన రంగాల్లో ప్రతికులానికీ వారి జనాభా దామాషా ప్రకారం వాటాలు, ప్రాతినిధ్యాలు ఒక హక్కుగా దక్కడమే సామాజిక న్యాయం. ఆధిపత్య కులాలు తరతరాలుగా వారి జనాభా దామాషాతో సంబంధం లేకుండా అత్యధికంగా కబ్జా చేస్తూండటం ఒక కఠోర సత్యం.ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లు కూడా లేకపోతే, ఆధిపత్య కులాలే దాదాపు సర్వం తమ గుప్పెట్లోనే పెట్టుకొని- ప్రస్తుతం ఉన్న స్థానాన్నయినా బడుగు బలహీన వర్గాలకు దక్కనిచ్చేవి కావు. 

రాజకీయ రిజర్వేషన్లు లేని బీసీ, ముస్లిం మైనారిటీల స్థానం ప్రస్తుత రాజకీయరంగంలో బీసీలకు 50 శాతానికి బదులు 15 శాతం, ముస్లింలకు 10 శాతానికి బదులు 3 శాతం మాత్రమే లభించటాన్ని బట్టి ఆధిపత్య కులాల కబ్జాశక్తి ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు.కనుక సామాజిక న్యాయం అంటే కమ్యూనిస్టు పార్టీల దృష్టిలో కులాల జనాభా, దామాషా ప్రాతినిధ్యం వంటి అంశాలు ఉన్నాయా లేదా అనేది స్పష్టం కావాలి. ఎందుకంటే, ఇక్కడ కులం, ఆ కులాల జనాభాలను ప్రాతిపదికగా తీసుకొనడం జరుగుతుంది. ‘కులాన్ని మేము పరిగణనలోకి తీసుకోం’’ అనే తమ పాత వాదనకు తాము కమ్యూనిస్టులుగా కట్టుబడి వున్నామంటే, సామాజిక న్యాయం గురించి వాళ్ళు అసలు మాట్లాడనే కూడదు. ఆ పాత తప్పు వైఖరిని మార్చుకొనవలసి వుంటుంది. 

అసలు కులం ప్రాతిపదికగా రిజర్వేషన్లు కల్పించటానికి రెండు పార్టీలూ సూత్రబద్ధంగా ఆమోదిస్తోన్నయా లేదా అనే ప్రశ్నకు జవాబు కావాలి. సామాజిక న్యాయాన్ని నిజంగా ఆమోదిస్తే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకోసం జరుగుతోన్న ఉద్యమాన్ని ఆ పార్టీలు గట్టిగా సమర్థించవలసివుంటుంది. ఆ పార్టీలే ఇక నుండి బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం ఉద్యమాన్ని నడపవలసి కూడా వుంటుంది. అలాగే, ముస్లిం మైనారిటీలకు కూడా, విద్య, ఉద్యోగ రంగాల్లోనేగాక చట్టసభల్లో గూడా వారి జనాభా దామాషా ప్రకారం స్థానాలను రిజర్వ్‌ చేయాలనే డిమాండ్‌లను బలపరచడమేగాక, ఆ దిశగా ఉద్యమాన్ని నిర్వహించవలసి వుంటుంది. రంగనాథమిశ్రా కమిటీ సిఫారసు చేసిన 10 శాతం రిజర్వేషన్‌ను చట్టసభల్లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేయవలసి ఉంటుంది. 

సామాజిక న్యాయం కోసం పోరాడతామంటున్న కమ్యూనిస్టు పార్టీలు ఈ సూత్రాన్ని ఎన్నికల సందర్భంలో కూడా అన్వయింప చేయాల్సిందే. ముందు- రెండు కాంగ్రెస్‌ పార్టీలను, తెలుగుదేశం పార్టీని ఆధిపత్య కుల పార్టీలుగా ప్రకటించాలి. తమ పార్టీల స్వభావమూ అలాగే ఉంది గనుక ఆ విషయంలోకి వెళ్ళి కందిరీగల తుట్టెను కదిలించగూడదనుకుంటే సీపీఐ, సీపీఎంల సామాజిక న్యాయం మాటలకే పరిమితమౌతుంది. అంతేకాదు; ఆ పార్టీలతో రాజకీయ సయోధ్యకు ఆస్కారమేలేదని స్పష్టం చేయవలసి ఉంటుంది. మరో వైపు శత్రువులెవరు, మిత్రులెవరోకూడా తేల్చుకోవలసి ఉంటుంది. 

ఆధిపత్య కులశక్తులను ఓడించి రాజ్యాధికారాన్ని వారి కబంధ హస్తాల నుండి విడగొట్టాలంటే తమకు నిజమైన మిత్రులెవరో కూడా స్పష్టం చేసుకోవాలి. దళిత బహుజన రాజకీయ పార్టీలుగాని, సంస్థలుగాని మిత్రులుగా ఉంటారు. ఎన్నికల సయోధ్య కూడా ఆ ప్రాతిపదికనే ఉండాలి. త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లోగూడా సామాజిక న్యాయ సూత్రాన్ని నిజంగా ఆమోదించి ఉంటే సీపీఐ, సీపీఎంలు అణగారిన కులాల రాజకీయ శక్తులతో సంబంధాలు పెంచుకోవాలి. తాము పోటీ చేయని స్థానాల్లో సామాజిక న్యాయ రాజకీయ ప్రతినిధులుగా రంగంలో ఉన్న అభ్యర్థుల్ని బలపరచవలసి ఉంటుంది.

సామాజిక న్యాయాన్ని ఆమోదించి, జనాభా దామాషా ప్రకారం కులాలకు వాటాలు- ప్రాతినిధ్యాలు అన్నప్పుడు కులాల వారీగా జనగణన జరగవలసి ఉంటుంది. ప్రస్తుతం లోక్‌సభ ముందు మహిళా రిజర్వేషన్‌ బిల్లు పెండింగులో ఉంది. కోటాలో బీసీ మహిళలకు ఉపకోటా కల్పించాలని ఉద్యమం సాగుతోంది. ఈ అంశంపై ఏకాభిప్రాయం కుదరక గత14 సంవత్సరాలుగా బిల్లుకు చట్టరూపం లభించలేదు. కమ్యూనిస్టు పార్టీల అనుబంధ మహిళా సంఘాలు బీసీమహిళలకు ఉపకోటా లేకుండానే ప్రస్తుతబిల్లును యధాతథంగా ఆమోదించాలని ఆందోళన చేస్తున్నాయి. బీసీ మహిళలకు రిజర్వేషన్‌ లేకపోతే- దొరల స్థానాల్లో దొరసానులు వచ్చి కూర్చుంటారనే ఆందోళనను బీసీలు వ్యక్తం చేస్తున్నారు. బీసీ మహిళలకు ఉపకోటా కల్పించడమే సామాజిక న్యాయసూత్రం. ఇప్పుడు రెండు కమ్యూనిస్టు పార్టీల మహిళా సంఘాలు బీసీ మహిళలకు ఉపకోటా కల్పించాలనే న్యాయమైన డిమాండును ఆమోదించడమేగాక, అందుకోసం పోరాడతాయా?

సామాజిక న్యాయం కోసం పోరాడతామని కమ్యూనిస్టు పార్టీలు ప్రకటించడమంటే- ఈ సూత్రాన్ని తమ తమ పార్టీల నిర్మాణాలకు గూడా వర్తింపచేసుకోవటానికి సిద్ధపడాలి. తమ పార్టీల సభ్యుల్లో కులాలవారీగా ఎవరు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలి. సభ్యత్వంలో ఉన్న సంఖ్యకి అనుగుణంగా ఆయా కులాల సభ్యులకి నాయకత్వ కమిటీల్లో స్థానాలు లభించాయో లేదో పరిశీలించాలి. మొత్తం పార్టీ సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సభ్యుల శాతమెంత, నాయకత్వ కమిటీల్లో వారి స్థానాల శాతమెంత, ఆధిపత్య కులాలైన రెడ్డి, కమ్మ కులస్థుల సభ్యత్వ శాతమెంత- నాయకత్వ కమిటీల్లో వారి సంఖ్యా శాతమెంత అనే లెక్కలు తేల్చి, ఈ సంఖ్య గనుక దామాషా పద్ధతికి భిన్నంగా ఉంటే సరిదిద్దుకొని సామాజిక న్యాయ సూత్రాన్ని తమ తమ నిర్మాణాలకు అన్వయింపచేసుకోవాలి. కీలకమైన కార్యదర్శుల స్థానాల పరిస్థితి ఏమిటి- గ్రామ, పేటల స్థాయిల నుండి కేంద్ర కమిటీదాకా ఈ అంశాన్ని పరిశీలించాలి. సభ్యత్వ సంఖ్య దామాషా ప్రకారం కార్యదర్శుల సంఖ్యని సవరించుకోవాలి.

పార్టీ నిర్మాణాల్లో ముఖ్యమైనవి కేంద్ర, రాష్ట్ర కార్యదర్శుల స్థానాలు. పార్టీ నిర్మాణం నాటినుంచి వాస్తవ స్థితిని తెలియజేస్తూ నిర్మాణ శ్వేతపత్రాన్ని రెండు కమ్యూనిస్టు పార్టీలూ ప్రకటించాలి. కార్యదర్శుల కులాన్ని పేర్కొనాలి. సీపీఎం రాష్ట్ర మహాసభ ఇటీవల ఖమ్మంలో జరిగే సందర్భంలో బీసీ కులానికి చెందిన ఎస్‌. వీరయ్య కార్యదర్శి అవుతారన్న ప్రచారం జరిగింది. ఆయనకి వేరెవరో పోటీఉన్నట్లు గూడా వార్తలు వెలువడ్డాయి. తీరా మహాసభలో పాత సాంప్రదాయం ప్రకారమే కమ్మ సామాజిక వర్గానికే చెందిన బి.వి. రాఘవులునే కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. 1964లో సీపీఎం ఏర్పడినప్పటినుండి సుందరయ్య తప్ప ఇంత వరకూ కమ్మ సామాజిక వర్గం వ్యక్తే కార్యదర్శి అవుతున్నారు. సుందరయ్య కూడా ఆధిపత్య కులానికి చెందినవారేనన్న వాస్తవం మరచిపోరాదు. ఇక్కడ- పార్టీ నాయకులకు వ్యక్తిగతంగా గానీ, కమిటీలకు సమష్ఠిగా గానీ కులతత్వం అంటగడుగున్నట్టుగా అర్థం చేసుకోరాదు. 

ఇది సామాజిక న్యాయం ప్రాతిపదికగా విషయ పరిశీలన మాత్రమే. సీపీఎంకి కుల వివక్షా వ్యతిరేక సంఘం స్థాపన అవసరమైంది. అంటే, అది బయటి వాళ్ళకోసమే కాకుండా- తమ సొంత ఇంట్లో అమలౌతోన్న కుల వివక్షని గురించి కూడా ఆత్మ పరిశీలన చేసుకొనడం కోసం ఉపయోగపడాలి. పుట్టుకలోనే కులం పునాది ఉన్న తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడుగా మరే ఇతర సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికీ అవకాశం లేకపోవడం వింత కాదు. కానీ ‘ప్రపంచ కార్మికులారా, ఏకం కండి, మీరు పోరాడితే పోయేది బానిస సంకెళ్ళే’ అని చెప్పుకొనే పార్టీలకి కార్యదర్శులుగా దాదాపు అర్థ దశాబ్దం కాలంపాటు ఒకే ఒక ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తులే కొనసాగడం వింత కాదా?

సీపీఐ నాయకత్వ పరిస్థితి గూడా సీపీఎంకి నకలుగానే ఉంటోంది. ఆ పార్టీదీ పార్టీ నిర్మాణంలో సామాజిక న్యాయ సూత్రాన్ని అన్వయించిన చరిత్ర కాదు. సీపీఎం విడిపోయిన తొలి రోజుల్లో ఆధిపత్య కులానికే చెందిన నీలం రాజశేఖరరెడ్డి, తమ్మారెడ్డి సత్యనారాయణ కార్యదర్శి పాత్ర పోషించారు. ఆ తర్వాత మొదలైన కమ్మ సామాజిక వర్గ ఆధిపత్యం నల్లమల గిరి ప్రసాద్‌తో ప్రారంభమై, దాసరి నాగభూషణరావు ద్వారా నేటి ‘వార్తల్లోని వ్యక్తి’ నారాయణ దాకా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి కులవారసత్వానికి దూరంగా ఉండడానికి సామాజిక న్యాయ సిద్ధాంతం అవసరం లేదు. మానవతా వాదంతో ఆలోచించినా సరిపోతుంది. పైగా కమ్యూనిస్టు పార్టీలకు చాలా పెద్ద లోతైన సోషలిస్టు, కమ్యూనిస్టు సిద్ధాంతం మార్క్సిజం-లెనినిజం ఉండనే ఉన్నది గదా!

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సురవరం సుధాకర్‌ రెడ్డి ఎన్నిను గూడా సామాజిక న్యాయం సూత్రం ప్రకారం చర్చించవలసిందే. ఆధిపత్యకుల సంకెళ్లనుండి పార్టీ అధినాయకత్వం బయట పడలేక పోవటానికి అది ఒకానొక పెద్ద దృష్టాంతం మాత్రమేనని చెప్పక తప్పదు. ‘అణగారిన కులాల వ్యక్తులలో ఆ స్థాయికి ఎదిగిన వారు పార్టీలో లేరు’ అనే నాయకత్వ సాంప్రదాయ, స్టాకు వాదనకు గూడా ప్రస్తుతం సీపీఐ విషయంలో ఆస్కారం లేదు. తమిళనాడుకు చెందిన డి. రాజా చాలా సీనియర్‌ నాయకుడు. ఇప్పటికే కేంద్ర సెక్రటేరియట్‌లో ముఖ్యమైన నాయకుడుగా ఉంటూ కేంద్ర కమిటీ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి. 

వయసు రీత్యా ఎ.బి. బర్దన్‌ ప్రధాన కార్యదర్శి పదవి నుండి తప్పుకోవలసివస్తే ఆ స్థానాన్ని భర్తీ చెయ్యటానికి డి. రాజా అన్ని విధాలా అర్హుడనే అభిప్రాయం పార్టీలోనే బలంగా ఉంది. అయితే ఆయన దళితుడు. కనుక ఆయన ప్రధాన కార్యదర్శి అయితే అగ్రకుల వారసత్వ సాంప్రదాయం దెబ్బతింటుంది. ఈ విషయంలో పార్టీ అగ్రకుల నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి గత హైదరాబాద్‌ మహాసభలోనే సుధాకరరెడ్డిని సహాయ కార్యదర్శిగా చేసింది. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అవడానికి మార్గం సుగమం చేశారు. ఎన్నికైన వెనువెంటనే కుల వివక్ష గురించి, సామాజిక న్యాయాన్ని గురించీ సుధాకరరెడ్డి మాట్లాడుతున్నారు.పార్టీ శ్రేణుల్లో, అభిమాన ప్రజారాసుల్లో ఉన్న బడుగు, బలహీనవర్గాలను బుజ్జగించే చర్యగా తప్ప ఆయన ప్రకటనని ఏవిధంగా అర్థం చేసుకోవాలి? సామాజిక న్యాయమంటే ఏమిటో ఎప్పుడైనా ఆ పార్టీ స్పష్టం చేసి ఉంటే, తాజా ప్రకటన ఎందుకు చేసినదో అందరికీ అర్థమయ్యేది.

సామాజిక న్యాయం కోసం పోరాడతామని ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ నిర్ద్వంద్వంగా ప్రకటించడం- పార్టీ శ్రేణుల్ని, అభిమాన ప్రజారాసుల్నీ నిలబెట్టుకొనడానికి ఒక ఎత్తుగడ కారాదు. అది ఖచ్చితమైన సామాజిక రాజకీయ లక్ష్యం కావాలి. అయితే, సామాజిక న్యాయ భావజాలం రకరకాల అర్థాలతో అసలుకే ఎసరు పెట్టకుండా నిజమైన సామాజిక న్యాయ ఉద్యమకారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. మిగిలిన పార్టీల సంగతెలా ఉన్నా కమ్యూనిస్టు నాయకుల వక్రభాష్యాల నుండి కూడా సామాజిక న్యాయ భావజాలాన్ని పరిరక్షించుకోవాలి. 

సామాజిక న్యాయ భావజాలానికి మహాత్మ జోతిరావ్‌ ఫూలే, డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ల సిద్ధాంతాలు ప్రాతిపదిక. ఆ సిద్ధాంతాల ఎడల తమ వైఖరేమిటో కమ్యూనిస్టు పార్టీలు స్పష్టం చేయాలి. గతంలో ఎలాంటి దృక్పథంతో వ్యవహరించారో, ఇప్పుడే దృక్పధంతో వ్యవహరించ దలచుకొన్నారో తెలియచెప్పాలి. సిద్ధాంత, రాజకీయ రంగంలో స్పష్టతతో పాటు పారదర్శకత గూడా తప్పనిసరి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తెలంగాణలో బహిరంగంగా సమర్థిస్తూ, శాసన సభ్యత్వానికి రాజీనామా ఇచ్చే వరకూ వెళ్లిన సీపీఐ- ఆంధ్ర, రాయలసీమల్లో వ్యూహాత్మక మౌనాన్ని పాటించడం గౌరవప్రదంకాదు గదా, విశ్వాసనీయతను కూడా కోల్పోతుంది.

yk
అలాగే, సామాజిక న్యాయాన్ని ఆమోదించడం కమ్యూనిస్టు పార్టీలకు ఒక ఎన్నికల ఎత్తుగడ కారాదు; అది ఖచ్చితమైన తాత్విక, సైద్ధాంతిక, రాజకీయ విధానంగానే ఉండాలి. భారత సమాజం కేవలం కులవ్యవస్థ మాత్రమేకాదు, వర్గ వ్యవస్థ కూడా. కనుక కమ్యూనిస్టు పార్టీలు తమ మార్క్సిస్టు వర్గదృక్పథాన్ని విడిచిపెట్టనవసరంలేదు. మరింత ఖచ్చితంగా అనుసరించాలి. అయితే అవి ఇప్పటికే బూర్జువా- భూస్వామ్య శక్తులతో చేతులు కలుపుతూ వర్గ సంకర్ట విధానాన్ని అనుసరిస్తూ ఉండటాన్ని ప్రజలు బాగా అర్థం చేసుకొన్నారు. కనుకనే, రెండు కమ్యూనిస్టు పార్టీలపైన మొత్తంగానే ప్రజలకు విశ్వాసనీయత బాగాసన్నగిల్లింది. ఈనేపథ్యంలో తమ విధానాలను, కార్యాచరణను ‘సామాజిక న్యాయం, సామాజిక ప్రజాస్వామ్యం’ లక్ష్య దిశగా సరైన రీతిలో సవరించుకొంటారో, లేక పూర్తిగా తెరమరుగై పోతారో తేల్చుకోవలసింది ఆ పార్టీల నాయకత్వాలే.

Surya News Paper Dated : 12/04/2012 

No comments:

Post a Comment