Thursday, April 12, 2012

ఆహార సంస్కృతి : అప్రజాస్వామికత---- సుదర్శన్ బాలబోయిన



ఏ ఆహారాన్ని అయినా నీచంగా అపవిత్రంగా చూసే పద్ధతి అశాస్త్రీయమైనది. ఆవుకూర తినే జాతుల్ని, కులాల్ని అంటరానివారుగా చూడటం ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం. దీన్ని మార్చడమే ఇప్పుడు మా కర్తవ్యం. 


పెద్ద కూర(బీఫ్)ను కామన్ మెనూలో చేర్చి వర్సిటీ మెస్‌లలో వడ్డించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ దళిత విద్యార్థులు చాలాకాలంగా కోరుకొంటున్నారు. గత ఏడాది ఇ.ఎఫ్.ఎల్ యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించటానికి ఎస్సీ, ఎస్టీ, బిసీ విద్యార్థుల ప్రయత్నాన్ని అగ్ర వర్ణ మతోన్మాదులు జుగుప్సాకరంగా అడ్డుకొన్నారు. రాజ్యం (యూనివర్సిటీ అధికారులు, పోలీసులు) దానికి మద్దతుగా నిలిచింది. సంవత్సరం దాటిపోయినా ఆ కేసు సంగతి ఏమైందో ఇంతవరకు తెలియదు. 



ప్రస్తుతం ఉస్మానియా విద్యార్థులు తలపెట్టిన పెద్దకూర పండుగ (బీఫ్ ఫెస్టివల్) విస్తృత స్థాయిలో విపరీతమైన చర్చకు దారి తీసింది. ఆవు చుట్టూ పవిత్రతను అల్లి రాజకీయాల్ని నిర్దేశించే ప్రక్రియను హిందుత్వ శక్తులు కొనసాగిస్తున్నాయి. గోవుకు ఎటువంటి ప్రత్యేకమైన పవిత్రత లేదని, అది కూడా ప్రకృతిలోని అన్ని జీవుల్లాంటిదేనని, అనాదిగా వస్తున్న మా ఆహార సంస్కృతిని అడ్డుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేదిలేదని ఈ తరం దళిత విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. 



మనకు సెక్యులర్ రాజ్యాంగం ఉన్నది. అయినా ఈ దేశ విద్యా సంస్థలకు మనువాదపు వాసనలు పోవడం లేదు; హిందుత్వ ఆచరణ నిరాటంకంగా కొనసాగుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హిందుత్వ ఫాసిజం పరిఢవిల్లుతున్నది. ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా జాతీయ విద్యా వ్యవస్థను ప్రజాస్వామికీకరించే ప్రక్రియను దళిత విద్యార్థులు చేపడుతున్నారు. దళిత సాంస్కృతిక చైతన్యాన్ని ఎత్తి పడుతూ మొత్తం సమాజ వ్యవస్థను సెక్యులర్ దిశగా మళ్లిస్తున్నారు.తమ ఆహారాన్ని నీచంగా చూసే భావజాలానికి విరుద్ధంగా, మత ఆధ్యాత్మికతకు వ్యతిరేకంగా పవిత్ర గోవు వాదాన్ని పటాపంచలు చేస్తూ ఆత్మగౌరవ నినాదం ఇస్తున్నారు. ఉస్మానియా వర్సిటీ దళిత విద్యార్థులు జరపతలపెట్టిన 'పెద్దకూర పండగ' జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మేధావులు, పాలకులకు, విభిన్న మతాలు, భావజాలాలకు అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్దేశించింది. దళిత విద్యార్థుల సాంస్కృతిక ఎజెండా దేశ రాజకీయ పునాదులను తట్టి లేపనున్న ముందస్తు హెచ్చరికను సూచిస్తున్నది. 



సాంస్కృతిక విప్లవాల పరిణామం రాజకీయ రంగంపై విస్తృత ప్రభావాన్ని చూపిస్తున్నదని చారిత్రక ఆధారాలు చెప్పుతున్నాయి. 'చంద్రగుప్తుడి నాయకత్వంలో కొనసాగిన రాజకీయ విప్లవానికి ముందే బుద్ధుడు నిర్మించిన మత, సాంఘిక విప్లవాల నేపథ్యం ఉంది. సిక్కులు రాజకీయ పరమైన విప్లవాన్ని తీసుకొని రాకముందే గురునానక్ సాంఘిక విప్లవాలను నిర్మించాడ'ని సాంస్కృతికోద్యమ ప్రాధాన్యాన్ని డాక్టర్ అంబేద్కర్ మనకు గుర్తు చేశారు. ఆవుకు ఎటువంటి ప్రత్యేకతా లేదని, గో మాంసంలో ప్రొటీన్స్ మాత్రం విపరీతంగా ఉన్నాయని జీవ శాస్త్ర నిపుణులు వెల్లడించారు. 



వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులు, రామాయణ మహాభారతాలలో ఆవు మాంసాన్ని ప్రీతిగా తిన్న దేవతల ఆధారాలు కనిపిస్తాయి. ప్రాచీన భారతీయ చరిత్రను కూలంకషంగా పరిశోధించిన చరిత్రకారుడు డిఎన్ ఝా, 'బ్రాహ్మణుల ప్రధాన ఆహారం ఆవు' అని ఆధారాలతో సహా నిరూపించారు. నిర్దిష్ట స్థల, కాల పరిస్థితులలో జీవిస్తున్న ప్రతి జీవజాతి (ముఖ్యంగా మానవుడు) ప్రకృతి నుంచి తన ఆహారాన్ని విచక్షణ జ్ఞానంతో సంపాదించుకుంటుంది. ప్రాచీనకాలంలో అందరి ఆహారంగా ఉన్న ఆవు క్రమ క్రమంగా కొన్ని వర్గాలకే పరిమితమై ఒక ప్రధాన రాజకీయ అంశంగా పరిణామం చెందింది. 



1882లో దయానంద సరస్వతి 'గో రక్షణ' పేరుతో ఆవుకి పవిత్రతని అంటగట్టారు. 1888లో నార్త్ ప్రావిన్సెస్ కోర్టు ఒకటి ఆవుకి ఎటువంటి పవిత్రత లేదని తీర్పు ఇచ్చింది. 1966లో పార్లమెంట్ సమీపాన గోరక్షణ యాత్రను నిర్వహించారు. గోవధను నిషేధించాలనే డిమాండ్‌తో ఆచార్య వినోబా భావే ఆమరణ దీక్షను చేపట్టి జనతా పార్టీ ప్రభుత్వాన్ని పొలిటికల్ బ్లాక్‌మెయిల్ చేశారు. దరిమిలా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో గోపరిరక్షణ చట్టాల్ని అప్రజాస్వామికంగా అమలులోకి తెచ్చారు. మనిషి ఏ ఆహారమైనా తీసుకోవటం ప్రాథమిక హక్కు. గోవుల్ని పరిరక్షించాలనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కాదు కేవలం ఒక ఆదేశిక సూత్రం మాత్రమే. 



అనీస్ కురేషి వర్సెస్ బీహార్ స్టేట్ గవర్నమెంట్ కేసు విషయంలో మత విశ్వాసాలతో ముడివేసే జంతు హింసను సుప్రీం కోర్టు వ్యతిరేకించింది. గోమాంసాన్ని ఆహారంగా నిరాకరించడం అంటే ప్రాథమిక హక్కులన్నిటినీ మత మూఢత్వం మింగేయటంగా భావించాలి. మాంసాహారులు అంతా హింసావాదులు, శాకాహారులు అంతా శాంతి కాముకులు అనే వాదన అతి పెద్ద అబద్ధం. హిందూత్వ మతవాద రాజకీయ సాంస్కృతిక, విద్యార్థి సంస్థల ప్రధాన లక్ష్యం ఆవు చుట్టూ రాజకీయాల్ని అల్లడం. ముస్లిం సమాజానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలను దూరంచేసే అతి పెద్ద కుట్ర ఇది. పవిత్ర ఆవు పేరుతో మెజారిటీ మతస్థుల ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టే రాజకీయ వజ్రాయుధం. భారతదేశం సెక్యులర్ సమాజం అన్న ఆలోచనను విస్మరించి ఆహారంగా తీసుకోవాల్సిన జంతువులకు పవిత్రతను ఆపాదించడం, వాటిన తినే దళిత, ముస్లిం, ఆదివాసీ వర్గాల వారిని నీచంగా చూసి దాడులు చేయటం మొత్తం సమాజాన్ని భయకంపితులను చేయడం ఖచ్చితంగా ఫాసిజమే అవుతుంది. 



హిందుత్వ శాకాహార రాజకీయాల వల్ల ఈ దేశంలో దళిత, బహుజన, ముస్లిం, ఆదివాసులు శారీరకంగా మరుగుజ్జులుగా మారబోతున్నారని న్యూట్రిషన్ సైంటిస్ట్ వీణా శతృఘ్న చెబుతున్నారు. శాకాహారం మంచిదని డాక్టర్స్ చెప్పటం అంటే అది వారి అజ్ఞానమేనని ఆమె అంటున్నారు. అతి విలువైన ప్రొటీన్స్ ఉన్న ఆహారాన్ని అందించాలంటే ప్రతిరోజు మాంసాహారాన్ని అందించాలని ప్రభుత్వాలకు ఆమె సలహా ఇస్తున్నారు. ఆవు పంచగవ్య పవిత్రం అయినప్పుడు దాని మాంసం ఎందుకు అపవిత్రం అవుతుందో హిందుత్వ వాదులు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఎద్దు మాంసాన్ని ఆహారంగా తీసుకోవటం వల్లనే బాలింతలకు పాల ఉత్పత్తి అధికంగా జరిగి తమ బిడ్డ ఆకలి తీర్చి బలాన్ని ఇవ్వగలుగతారు. ఇంతటి బలవర్ధక ఆహారాన్ని పవిత్రత, నీచత్వం పేరుతో నిరాకరించటం అంటే జాతీయ అభివృద్ధిని అడ్డుకోవటంగానే భావించాలి. 



ఏటా లక్ష టన్నుల గో మాంసాన్ని విదేశాలకు తరలిస్తూ అపారంగా డాలర్లు సంపాదిస్తున్న ఆధునిక గో వధ శాల 'అల్ కబీర్' ఒక హిందువుదే కదా! దానికి ముస్లిం పేరు ఎందుకు పెట్టినట్లు? ఆవుని పూజించే వాళ్లు ఏనాడైనా చచ్చిన ఆవును ముట్టడానికి సాహసించారా? చనిపోయిన ఆవులను ఊరికి దూరంగా ఎత్తుకుపోయి సమాజానికి అంటు వ్యాధులు సోకకుండా కాపాడింది చమార్‌లే కదా! గొడ్డు చర్మం ఒలిచి కాళ్లకు మొత్తని చెప్పులు అందించే శాస్త్రవేత్తలు మాదిగలే సుమా. ఏ ఆహారాన్ని అయినా నీచంగా అపవిత్రంగా చూసే పద్ధతి అశాస్త్రీయమైనది. ఆవుకూర తినే జాతుల్ని అంటరానివారుగా చూడటం ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం. దీన్ని మార్చడమే ఇప్పుడు మా కర్తవ్యం.

రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ
Andhra Jyothi Telugu News Paper Dated : 13/04/2012 

No comments:

Post a Comment