Tuesday, April 24, 2012

ఏది అప్రజాస్వామికం? - కళ్యాణ్ పవార్



'ఏ ఆహారాన్ని అయినా నీచంగా అపవిత్రంగా చూసే పద్ధతి అశాస్త్రీయమయినది' అనే వాక్యంతో మొదలయింది బాలబోయిన సుదర్శన్ గారి 'ఆహార సంస్కృతి - అప్రజాస్వామికత' (ఏప్రిల్ 13, ఆంధ్రజ్యోతి) వ్యాసం. మరి ఇస్లాంలో తినదగిన ఆహారాలుగా భావించే వాటిని 'హలాల్'గానూ తినదగని ఆహారాలను 'హరాం'గానూ భావిస్తారు కదా! యూదుల మతంలో 'కష్రూత్' లేదా 'కోషర్' నియమం ఆహారం విషయంలో ఉంది కదా! అవన్నీ కూడా అశాస్త్రీయులు కనుక పాటించనక్కరలేదని సుదర్శన్ లాంటి వారు అనదలుచుకున్నారా? 

ఒక వేళ అలా అని మహమ్మదీయ సోదరులను హలాల్ నియమం పాటించనివ్వకపోతే అది అప్రజాస్వామికమా? 'శాస్త్రీయం' 'అశాస్త్రీయం' లాంటి వాదాల జోలికి పోకుండా మీ మత విశ్వాసాలు మీవి అని మహమ్మదీయ సోదరులను వాళ్ల హలాల్, హరాం నియమాల ప్రకారమే తిననివ్వడం ప్రజాస్వామికమా? అమెరికాలో ఉన్న బహిరంగ/సామూహిక ఆహార వినిమయ సందర్భాల్లోనూ యూదుల కోషర్ విశ్వాసాలకు విఘాతం కలగకుండా చూసుకుంటారే, అది ప్రజాస్వామికమా అప్రజాస్వామికమా? 

'ఆవుకు ఎటువంటి ప్రత్యేకతా లేదనీ గోమాంసంలో ప్రొటీన్స్ మాత్రమే విపరీతంగా ఉన్నాయనీ జీవశాస్త్ర నిపుణులు వెల్లడించారు' అని కూడా సుదర్శన్ ఉటంకించారు. జీవశాస్త్ర నిపుణులకేముందీ, వాళ్లు పంది మాంసంలో కూడా ఉప్పు పాళ్లు తక్కువ, థయామిన్, విటమిన్ బి12 లాంటివి పుష్కలంగా ఉన్నాయి, కనుక మంచి ఆరోగ్యవర్ధక ఆహారం అని కూడా వెల్లడిస్తారు. కాని వాళ్ల ప్రతిపాదనల ఆధారంగా ఒక మతం వాళ్ల ఆహార నియమాలను తప్పు పట్టడం ప్రజాస్వామికంగా ఉంటుందా? 

'1888లో నార్త్ ప్రావింసన్ కోర్టు ఒకటి ఆవుకు ఎటువంటి పవిత్రతా లేదని తీర్పునిచ్చింది' అని కూడా ఆయన ఉదహరించారు. 'ఆవుకు పవిత్రత లేదు పందికి అపవిత్రత లేదు' లాంటి నిర్ణయాను చేయడం కోర్టుల పరిధిలోని విషయమేనా? ఒక వేళ ఏదయినా కోర్టు అటువంటి విషయాల్లో తల దూరిస్తే దాన్ని అనుమతించడం ప్రజాస్వామికమా? 

ఈ అంశంలోకి ఆదివాసీ గిరిజనులను ఆహారపు అలవాట్లను కూడా తీసుకువస్తే మరిటోటెం లాంటి పేర్లతో పిలవబడే కొన్ని నియమాల కారణంగా ఒక్కొక్క ఆదివాసీ గిరిజన తెగ వాళ్లకు ఒక్కొక్క జంతువు ఆహారం తినడం నిషిద్ధంగా ఉంటుంది. 'అశాస్త్రీయం' అనే కారణం చెప్పి వాళ్ల ఈ ఆహార నియమాల్ని వ్యతిరేకించడం ప్రజాస్వామికంగా ఉంటుందా? 

గోవుల్ని పరిరక్షించాలనేది భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కు కాదు. ఒక ఆదేశిక సూత్రమే అన్నారు. రాజ్యాంగంలో నిమ్నకులాల కోసం చేయవలసిన ప్రత్యేక సదుపాయాలన్నింటిని ప్రాథమిక హక్కుల్లో కాకుండా ఆదేశిక సూత్రాల్లోనే చేర్చారు. ఆ కారణంగా వాటికి ఉన్న రాజ్యాంగ పరమైన ప్రాముఖ్యాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఎంత అప్రజాస్వామికంగా ఉంటుంది? మరి గో రక్షణకు సంబంధించిన ఆదేశిక సూత్రాలైనా అంతేకదా? 

పూర్వం వేదాలు, ఉపనిషత్తులూ స్మృతులూ రామాయణ మహాభారతాల్లో దేవతలు గోవు మాంసాన్ని ప్రీతిగా తిన్నట్టు ఆధారాలు కనపడతాయి అన్నారు. దేవతల ఉనికికే ఆధారాలు కనపడని వారికి వాళ్ల ఆహారపు అలవాట్ల ఆధారాలు ఎక్కడి నుంచి కనపడ్డాయి? ఊరకే వాదన కోసం కొద్దిసేపు కనపబడ్డాయి అనే అనుకుంటే కూడా దేవతలు, అప్పటి రాజులూ కూడా కిరీటాలూ అవీ పెట్టుకుని తిరిగినట్లుగా కనపడుతుంది ఆ గ్రంథాల్లో. మరి దాన్ని చూసి మనమంతా ఇప్పుడు కిరీటాలు పెట్టుకుని తిరుగుదామంటే ఎట్లా ఉంటుంది?

ఆహారం పట్ల మతాల్లో ఉండే నియమాలను గుర్తించకపోవడం అశాస్త్రీయం అప్రజాస్వామికం. అంతే కాదు బహు మతాలూ సంస్కృతుల సహజీవనంగల భారతదేశంలో ఈ రకం వాదనలు ప్రమాదకరం కూడా. 

- కళ్యాణ్ పవార్,
రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్శి

Andhra Jyothi News Paper Dated : 24/04/2012 

No comments:

Post a Comment