Wednesday, April 25, 2012

వేదికలపై అస్తిత్వాలు వెనక తిరస్కారాలు--- జ్వలిత



'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' ఏర్పాటు, రంగనాయకమ్మ ప్రసంగ పాఠం చదివిన తరువాత పాత సందేహాలతోపాటు స్పందించవలసిన కొత్త సందర్భం ఏర్పడింది. 10.1.2009న జరిగిన 'మనలో మనం' సమావేశంలో మేమెక్కడ? అన్న ప్రశ్నకు సమాధానం దొరకలేదు అనే కంటే సమాధా నం చెప్పవలసిన అవసరం లేదు అన్నట్టుగా దాటవేయడం జరిగింది. మిగిలిన వేదికలలాగే కొందరు మాత్రమే కొందరికి మాత్రమే ప్రాధాన్యతను ప్రదర్శించారు. దళిత, బిసి, మైనారిటీ రచయిత్రుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఒక రకంగా అవమాన పరిచారు.

మీలో 'మేం' లేము కాబట్టి ఎస్సి, ఎస్‌టి, బిసి, మైనారిటి రచయిత్రులతో 23.3.2009న హైదరాబాద్‌లో 'మట్టిపూలు' వేదిక ఏర్పాటు అయ్యింది. దాదాపు 18 నెలలు గడిచిన తరువాత కూడా అతి తక్కువ సంఖ్యలో దళిత, ఆదివాసి, బిసి, మైనారిటీ రచయిత్రులను కలుపుకొని పలుచోట్ల సమావేశాలు జరిపి విశ్వవిద్యాలయాలు కూడా మాకే సహకరిస్తున్నాయన్నట్లు వ్యవహరించారు. ఉన్నట్టుండి 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' అని పేరు పెట్టారు కాబట్టి ప్రజాస్వామ్యం ఎంతమేరకు? అనే ప్రశ్న తలెత్తుతుంది. 'నేతి బీరకాయలో నేతి చందమేనా!'

రంగనాయకమ్మ అస్తిత్వాలు లేని సమసమాజం కోసం ప్రయత్నం జరగాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఫలితాలు మాత్రం శూన్యమని అందరికీ తెలిసిందే. 

ఒక వ్యక్తి అనేక అస్తిత్వాలు కలిగివున్నపుడు ఏది మౌలికం అనే విషయం గుర్తుచేశారు. ఆధిపత్యేతర వర్గవ్యక్తులు ఎవరైనా ఆయా సందర్భాలలో ఆయా సమయాలలో ఏది ముఖ్యమయినదో దానితో పోరాటం జరుపుతారు. సమానత్వం లభించనపుడు అణిచివేతలకు గురవుతున్నపుడు అస్తిత్వాలను కాపాడుకోవలసిన అవసరం ముఖ్యమయినది.

శ్రామిక అస్తిత్వం దోపిడి అస్తిత్వం రెండే అస్తిత్వాలు అని చెప్తూ శ్రమదోపిడీ నశించాలి సమానత్వం రావాలి అన్నారు కాని మన భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో శ్రమదోపిడీ మాయమవ్వడం అంత తొందరగా జరగదు. జరిగినా ఇద్దరిదీ ఒకే అస్తిత్వం కాదు. సోషలిస్టు దేశాల్లో అస్తిత్వ పోరాటాలు, హింస, దోపిడి లేకుండా ప్రశాంతంగా సౌఖ్యంగా సఖ్యంగా ఉంటున్నారా? శ్రమ సౌందర్యం/డిగ్నిటీ ఆఫ్ లేబర్ భావన ఆధిపత్య వర్గాలకు దోపిడీ సమూహాలకు ఎప్పుడూ అర్థం కాని విషయమే.

రచయిత్రుల వేదిక స్త్రీల అస్తిత్వం కాపాడే ఉద్దేశంతో ఏర్పడిందే అయితే అందరు స్త్రీలు సమానమేనా. ఆధిపత్య వర్గాల రచయిత్రులు దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ రచయిత్రులతో మాట్లాడటానికి, వారి పక్కన కూర్చోటానికే చిన్నతనంగా భావించినపుడు, ఎవరో ఒక్కరిద్దరిని మీ పేర్ల పక్కన చేర్చుకొని ప్రజాస్వామికం అంటే అది సూడో ఐక్యతే అవుతుంది.

భాష గురించి, యాస గురించి, తిండి గురించి, రంగు గురించి, అలవాట్ల గురించి వెక్కిరిస్తూ చిత్తశుద్ధి లేకుండా చేసే ఏ కార్యక్రమమయినా, ఏ వేదికయినా కొందరి స్వార్థం కొందరి విశాలత్వం చాటుకోవడానికే కాని, వారన్న చిన్న కులాల రచయిత్రులకు కొత్తగా ఒరిగేది ఏమి ఉండదు. విద్యావంతురాలైన స్త్రీ తన వివిధ అస్తిత్వాలను కాపాడుకునేందుకు ఎంత శ్రమ పడుతుందో విద్య లేని శ్రామిక వర్గం స్త్రీలు అంతకంటే ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటున్నారు.

రంగనాయకమ్మ ఒక విషయం చక్కగా చెప్పారు- రచయిత్రుల వేదిక లక్ష్యాలను ప్రస్తావిస్తూ దామాషా పద్ధతిలో వివిధ అస్తిత్వాలకు ప్రాధాన్యత నివ్వడం వల న కొత్తగా జరిగే ఉద్ధరణ ఏమి ఉండదు. పైగా అంద రూ సమానమే అయితే బలహీనంగా కొందరెందుకు ఉన్నారు. అటువంటివారికే కదా ఎక్కువ ప్రాధాన్యత, ప్రోత్సాహం అవసరం. సమానత్వం అడుగుతుంటే దామాషా అనడమే ఒక ద్రోహపూరిత వ్యూహం.

అస్తిత్వం, అస్తిత్వ స్పృహ వంటి పదాలతో ఏదో ఉద్యమం చేస్తున్నట్టు భ్రమల్లో మునుగుతున్నారని రంగనాయకమ్మ ఉద్యమాలను భ్రమల వలయాల్లోకి నెట్టారు. చట్టాలు చేయని పనులను ఉద్యమాలు చేయిస్తాయని చట్టాలను మార్చి చట్టసభలను కదిలించే శక్తి ఉద్యమాల కుందని తెలియని దెవరికి? 

ఇప్పుడిప్పుడే సమీకరించబడి ఉద్యమిస్తున్నవారిని విడదీసే ప్రయ త్నం, ఉద్యమాలను నీరుకార్చే వ్యూహం, ఉద్యమాలపై నమ్మకం పోగొట్టి గందరగోళం సృష్టించే ద్రోహ పూరిత యత్నం ఇది. ఒక సమస్యను గురించి ఉద్యమిస్తున్నపుడు సమాధానం చెప్పక, స్పందించకుండా ఉండటం ఒక కుట్రయితే, మరో కొత్త సమస్యను సృష్టించి దృష్టి మరలించి, విభజించి, బలహీన పరిచే దిక్కుమాలిన రాజకీయ కుత్సితం ఇది.

ప్రకటనలు ప్రచారాలు కాకుండా కార్యాచరణ కావా లి. సాధ్యాసాధ్యాల చర్చ కావాలి. 'మట్టిపూలు' అవస రం గుర్తించాలి. అస్తిత్వ ఉద్యమాలను పక్కతోవ పట్టిం చే ప్రయత్నాలు చేయకండి. 'కొలుప్పెట్టి ప్రశంసించి, తలుప్పెట్టి హింసించే' తెలివిడి మాటలు, పనులు ఆపండి. 

సవాలక్ష 'ఇగో'లను కప్పుకొని, శతకోటి 'ఇజా'లు అలంకరించుకొని 'సహానుభూతి' లేని ప్రజాస్వామికత హాస్యాస్పదమే అవుతుంది. 

దళిత, బహుజన, ఆదివాసి, మైనారిటీ రచయిత్రులారా..! ఐక్యమవ్వాల్సిన అవసరం, అస్తిత్వాలను కాపాడుకోవలసిన అవసరం, ఆధిపత్య వర్గాల వ్యూహాలను తిప్పికొట్టవలసిన అవసరం, కుట్రలను గుర్తెరిగి మసలుకోవలసిన అవసరం ఉంది. పారా హుషార్!

Andhra Jyothi News Paper Dated : 19/07/2010

No comments:

Post a Comment