Sunday, September 4, 2011

75 ఏళ్ళ పౌరహక్కుల ఉద్యమం-1 నెహ్రూ నేతృత్వంలో...- సి.భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి, ఓపీడీఆర్ Andhra Jyothi 24/08/2011


75 ఏళ్ళ పౌరహక్కుల ఉద్యమం-1
నెహ్రూ నేతృత్వంలో...
మనదేశ సంఘటిత పౌర, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమం ఆగస్టు 24, 2011 నాటికి 75 సంవత్సరాలు పూర్తిచేసుకొని 76వ పడిలో బలంగా అడుగువేయనుంది. రాజ్యం ఉన్నంతకాలం అణచివేత వుంటుంది (మార్క్స్ మాట) కనుక దాన్ని ప్రశ్నించే సంఘాలు వుండాలి, వుంటాయి. అధికారంలో లేనపుడు హక్కుల గురించి ఆందోళన చేసినవారంతా అధికార పీఠాన్ని అధిష్టించగానే ప్రజల హక్కులపై దాడిచేస్తున్నవారే.
దేశంలో తొలి పౌరహక్కుల సంఘం (ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్)కి ఆద్యులైన జవహర్‌లాల్ నెహ్రూ నుంచి నేటి వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాలు, 1964-66లో పెద్దఎత్తున పౌరహక్కుల ఉద్యమం సాగించడంలో ప్రముఖపాత్ర పోషించిన సీపీఐ(ఎం) ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో సాధారణ ప్రజలపైనా, వారి ఉద్యమాలపైనా నిరంకుశ చట్టాలు, లాఠీలు, తూటాలతో దాడులు చేసిన/చేస్తున్నవారే. ఇక బీజేపీ, టీడీపీ, డీఎంకే లాంటి పార్టీల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు.
ఈ దాడిని ప్రశ్నించే వారిపై దాడులు సాగుతాయని 75 సంవత్సరాల చరిత్ర చెబుతున్నది. ఈ క్రమంలో పడుతూ లేస్తూ 1965దాకా సాగిన పౌరస్వేచ్ఛల ఉద్యమం 1971 నాటికి ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమంగా ఎదిగి నాటి నుండి అవిచ్ఛిన్నంగా సాగుతోంది. ఈ స్వల్ప/సుదీర్ఘ కాలంలోని ప్రధాన ఘట్టాలను ఆవిష్కరించడమే ఈ వ్యాసం ఉద్దేశం. జాతీయ స్వాతంత్య్ర ఉద్యమాలన్నింటినీ రక్తపాతంలో ముంచెత్తిన బ్రిటీష్ వలస పాలకులు చివరకు గాంధీ నాయకత్వాన సాగిన అహింసాయుత ప్రజా ఉద్యమంపైనా అణిచివేత ధోరణి అవలంబించారు. దాని పరాకాష్టయే జలియన్‌వాలాబాగ్ దారుణ మారణకాండ. ఈ నేపథ్యంలో వలసపాలన కాలంలో పౌరస్వేచ్ఛల ఉద్యమానికి అంకురార్పణ జరిగింది.
1918 బొంబాయి కాంగ్రెస్ మహాసభ హక్కుల ప్రకటన అనే ఒక పౌర స్వేచ్ఛల డాక్యుమెంట్‌ను ఆమోదించి, దానిని మాంటింగ్ - చెమ్స్‌ఫర్డ్ రాజ్యాంగ బిల్లులో చేర్చాలని డిమాండ్ చేసింది. ఈ ప్రకటన వాక్ స్వాతంత్య్రం, సభా స్వాతంత్య్రం, సమావేశ స్వాతంత్య్రం, సంచార స్వాతంత్య్రం, సంఘస్థాపన స్వాతంత్య్రం, శాంతియుతంగా నిరసన తెలియజేసే స్వాతంత్య్రం వంటి ప్రాథమిక హక్కులను కోరింది. వీటన్నింటికన్నా ముఖ్యమైనది జాతివిచక్షణ రద్దు అని ఆ పత్రంలో పొందుపరిచారు. కానీ, తమ దేశ పౌరులకు వున్న ఈ స్వేచ్ఛలను వలస భారత ప్రజలకు ఇచ్చేందుకు బ్రిటీష్ పార్లమెంటు నిరాకరించింది.
1919 అమృత్‌సర్ కాంగ్రెస్ మహాసభలో మోతీలాల్ నెహ్రూ మాట్లాడుతూ, బొంబాయి మహాసభ ఆమోదించిన హక్కుల ప్రకటనను సమర్థిస్తూ చెప్పిన మాటలకు నేటికీ ఎంతో ప్రాధాన్యం వుంది. పంజాబ్‌లో ఇటీవల మన ప్రాథమిక హక్కులు అత్యంత పాశవికంగా ఉల్లంఘించబడ్డాయి. అలాంటి ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వని ఏ రాజ్యాంగం కూడా మన అవసరాలను తీర్చలేదు. ఇలాసాగిన కృషి సంఘటిత రూపం దాల్చేందుకు చాలా కాలమే పట్టింది. 1936, అగస్టు 24న ఏర్పడిన ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ భారత ఉపఖండంలో మొదటి పౌరహక్కుల సంఘం. దీని మహాసభ బొంబాయిలో అదే రోజున జరిగింది.
ఈ సంఘం ఏర్పాటు కోసం జవహర్‌లాల్ నెహ్రూ 150 మందికి ఉత్తరాలు రాయగా ఇద్దరు మినహా అందరూ సానుకూలంగా స్పందించారని చరిత్ర చెబుతోంది. ఈ సంఘం ఏర్పాటుకు దాదాపు మూడు దశాబ్దాల ముందుకాలం నుంచీ భారతదేశ విముక్తి కోసం పోరాటాలు నిర్వహించిన గదర్ వీరులు, చిట్టగాంగ్ వీరులు, అనుశీలన సమితి, తిలక్ లాంటి కాంగ్రెస్ నాయకులు, అనేక మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు, పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ నాయకులు తదితరులపై బ్రిటీష్ వలస ప్రభుత్వం అనేక అక్రమ కేసులు బనాయించింది. 20 మంది గదర్ వీరులను ఉరితీసింది. భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను ఉరితీసింది. ఒక్క మీరట్ కుట్రకేసులోనూ, అంతకుముందు తిలక్‌పై పెట్టిన కుట్రకేసులను మినహాయించి మరే కుట్రకేసుకూ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కానీ, నాయకులు కానీ ప్రకటన చేసిన దాఖలాలు లేవు.
అయినప్పటికీ 1936, ఆగస్టు 24న బొంబాయిలో జరిగిన సంఘం వ్యవస్థాపక మహాసభల్లో నెహ్రూ చెప్పిన కింది విషయం నేటికీ గమనంలో వుంచుకోవలసిన విషయమే. 'పౌరస్వేచ్ఛల అణచివేతకు వ్యతిరేకంగా సాగేపోరాటం భారత స్వాతంత్య్రోద్యమంలో భాగంగా పరిగణిస్తాను. ఒక ప్రయోజనం కోసం భిన్న రాజకీయ దృక్ప«థాలు కలిగివున్న వారంతా ఒక వేదికపై చేరి సాధ్యమైన ప్రతిచోటా కలిసి చేయడం అవసరం. భారతీయుల స్వేచ్ఛ కోసం కాంగ్రెస్ పోరాడుతోంది.
కాంగ్రెసు విధానాలతో ఏకీభవించని అనేకమంది కూడా పౌర స్వేచ్ఛల అణచివేతకు వ్యతిరేకంగా బలమైన దృష్టిని కలిగివున్నారు. అలాంటి వారంతా ఆ సమస్యపై సమష్టిగా పనిచేయాలి... ఒక వ్యక్తికి రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోవచ్చు. కానీ, బానిస దేశంలో బతికే ఏ మనిషి అయినా తనను తాను రాజకీయేతర వ్యక్తిగా ఎలా భావిస్తాడో నాకు అర్థంకావడం లేదు... పౌర సహాయ నిరాకరణ ఉద్యమం ప్రాంరంభమైందనుకోండి. ఆ ఉద్యమంలో పాల్గొన్నవారు జైళ్లలో బంధించబడతారు. అప్పుడు పౌర స్వేచ్ఛల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయడం బయటవున్నవారి బాధ్యత అవుతుంది... ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హక్కును కాపాడడమే పౌర స్వేచ్ఛ అనేదాని భావన.
అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, గ్రేట్ బ్రిటన్ జాతీయ సివిల్ లిబర్టీస్ యూనియన్ నమూనాలను ఆధారం చేసుకుని ఐసీఎల్‌యూ ప్రణాళిక, నిబంధనావళి రచించారు' అని నెహ్రూ ఆ సందర్భంగా చెప్పారు. రామ్‌మనోహర్ లోహియా స్ట్రగుల్ ఫర్ సివిల్ లబర్టీస్ అనే పుస్తకాన్ని నెహ్రూ రాసిన ముందుమాటతో ఆ సందర్భంగా ప్రచురించారు. ఆ పుస్తకంలో ఇండియాలో పౌర హక్కుల దృక్పథం వ్యాసంలో లోహియా వ్యక్తిగత ఆస్తి పౌర స్వేచ్ఛలకు మూలం అన్నారు. అందరికీ తగినంత వ్యక్తిగత ఆస్తి వుండే సమాజాన్ని ఒకదానిని ఊహించి సోషలిస్టు లోహియా ఈ మాటచెప్పి వుంటారని నాకు అనిపిస్తోంది.
ఐసీఎల్‌యూకి గౌరవాధ్యక్షులుగా రవీంద్రనాథ్ ఠాగూర్, క్రియాశీలక అధ్యక్షురాలిగా విజయలక్ష్మీ పండిట్, ప్రధాన కార్యదర్శిగా కేబీ మీనన్ ఎన్నుకోబడ్డారు. ఈ మొత్తం క్రమం రాజకీయ రంగంలో పెద్ద చైతన్యాన్ని తెచ్చింది. అందువల్లనే 1937లో దేశంలోని కొన్ని ప్రావిన్సిస్‌లో కాంగ్రెస్ పార్టీ పరిమిత అధికారాల ప్రభుత్వాలను ఏర్పరిచినపుడు, పౌర స్వేచ్ఛలను గుర్తించాలంటూ మంత్రిత్వ శాఖలకు ఒక సర్క్యులర్ పంపింది. ఆ ప్రభుత్వాలు పౌర స్వేచ్ఛలను ఏ మేర పాటిస్తున్నాయనే విషయాన్ని పరిశీలించి ప్రతి సంవత్సరమూ నివేదిక తయారు చేయాలని కూడా ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. కానీ, ఆ సర్క్యులర్ ఒట్టి కాగితంగానే మిగిలిపోయిందని కొద్ది రోజులలోనే స్పష్టమైంది.
మద్రాసు జైలులోని కొంతమంది రాజకీయ ఖైదీలు తమను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని, పత్రికలు, రాత కాగితాలు, కలం లాంటి సౌకర్యాలను కల్పించాలని, సరైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించలేదు. నిరాహారదీక్ష, ఆందోళన ప్రారంభించారు. దానిపై కాంగ్రెస్‌కు చెందిన దర్శి చెంచయ్య తదితరులు మద్రాసు ప్రభుత్వ కాంగ్రెస్ హోం మంత్రి వద్దకు వెళ్లి ఖైదీల న్యాయమైన కోర్కెలను తీర్చాల్సిందిగా అడిగారు. ప్రభుత్వం వద్ద అందుకు అవసరమైన పైకం లేదని మంత్రి సమాధానం ఇవ్వగా... వారి స్వంత ఖర్చులపై ఆ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడానికైనా అనుమతి మంజూరు చేయాలని కోరారు.
దానికి సమాధానంగా హోం మంత్రి ఆ ఖైదీలు మన పార్టీకి చెందినవారు కాదు కదా. ఈ విషయం ఇంతటితో వదిలివేయండి అని బృందంతో కరాఖండిగా చెప్పారు. (నేను-నా దేశం: దర్శి చెంచయ్య). ఖైదీలు ఆందోళన ఉధృతం చేశారు. ఖైదీలపై అమానుషంగా లాఠీచార్జి చేశారు. దీనిపై నిజ నిర్ధారణ కమిటీని వేయటానికి ఐసీఎల్‌యూ మద్రాసు శాఖకు సంఘం కేంద్ర నాయకత్వం అనుమతి నిరాకరించింది. ఈ సంఘటన దేశ స్వాతంత్య్రం నాటి నుంచి ఈ నాటి వరకూ ఉద్యమకారుల ఎడల కాంగ్రెస్ పాలకులు, తదుపరి ఇతర పార్టీల పాలకులు తీసుకునే పౌర హక్కుల ఉల్లంఘనకు నాందిగా మనం భావించవచ్చు.
- సి.భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి, ఓపీడీఆర్

No comments:

Post a Comment