Sunday, September 4, 2011

75 ఏళ్ళ పౌరహక్కుల ఉద్యమం - 2 స్వాతంత్య్రానంతరం.. - సి.భాస్కరరావు Andhra Jyothi 26/08/2011


75 ఏళ్ళ పౌరహక్కుల ఉద్యమం - 2
స్వాతంత్య్రానంతరం..
- సి.భాస్కరరావు
దీనిని రెండు దశలుగా విభజించవచ్చు. 1947-66 తొలిదశ కాగా ఆ తరువాత కాలమంతా రెండో దశ. తమ మౌలిక ప్రయోజనాలకు తమ ప్రాపకంలో పెంపొందిన ఫ్యూడల్ భూస్వాముల, పెట్టుబడుదారుల ప్రయోజనాలకు గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ వల్ల పెద్ద ప్రమాదమేమీ వాటిల్లదనే నిర్ణయానికి బ్రిటీష్ పాలకులు వచ్చారు. ప్రజల తిరుగుబాట్లు పూర్తి విప్లవ స్థాయికి చేరకముందే అధికార పగ్గాలను కాంగ్రెస్ పార్టీకి అప్పగించి తెరవెనక్కి తప్పుకోదలిచారు. ఆ విధంగా బ్రిటీష్ పార్లమెంటు చేసిన అధికార బదలాయింపు చట్టం ద్వారా 1947 ఆగస్టు 15న భారతదేశం ఇండియా, పాకిస్థాన్ అనే రెండు దేశాలుగా విభజితమై స్వాతంత్య్రం పొందాయి.
ఫ్యూడలిజం, సామ్రాజ్యవాదం రద్దు ద్వారా భారతదేశ విముక్తి పోరాటాన్ని నడుపుతున్న సీపీఐ స్వతంత్ర భారత పాలకులకు పెద్ద శత్రువుగా కనపడింది. తెలంగాణ, కేరళలోని పునప్రా-వాయిలర్, మహారాష్ట్రలోని వర్లి, పశ్చిమ బెంగాల్ తెభాగా రైతాంగ ఉద్యమాలపై వలస ప్రభుత్వ తరహాలోనే స్వత్రంత్య రాజ్యం పాశవిక దమనకాండ సాగించింది. వలస పాలకుల రూల్ ఆఫ్ లా కూడా ఆ సందర్భంలో నిరంతరం ఉల్లంఘనకు గురైంది. ఈ నేపథ్యంలో తిరిగి పౌరహక్కుల ఉద్యమం పునరుజ్జీవం పొందింది. 1947లోనే పాత ఐసీఎల్‌యూ మద్రాసు శాఖ పునరుద్ధరించబడింది. 1949 జూలైలో దాని మహాసభ కూడా జరిగింది. బొంబాయి శాఖ మహాసభ 1949 జనవరిలో జరిగింది.
కలకత్తా కేంద్రంగా 1948 బెంగాల్‌లో ఒక కొత్త సివిల్ లిబర్టీస్ కమిటీ ఏర్పడింది. అలాగే హైదరాబాద్‌లో 1948లోనే ఒక లీగల్ డిఫెన్స్ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ కన్వీనర్ మహేంద్రనాథ్ సక్సేనా (ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు రాజ బహదూర్ గౌడ్ మేనల్లుడు). ఈ కమిటీలో గుంటూరు జిల్లాకు చెందిన నర్సయ్య, హైదరాబాద్ నివాసి లతీఫ్ తదితర లాయర్లు కూడా ఉన్నారు. ఈ కమిటీలన్నీ ఉద్యమ అణచివేతకు వ్యతిరేకంగా కోర్టుల్లోనూ, బెంగాల్‌లో అయితే ప్రజల్లోనూ ఉద్యమించారు. బెంగాల్ కమిటీ ముగ్గురు కార్యదర్శులు కమల్ బోస్, జె.భట్టాచార్య, ప్రమోద్‌సేన్ గుప్తాలను వెనువెంటనే అరెస్టు చేసింది.
కమిటీ అధ్యక్షుడుగా ఆచార్య కేపీ ఛటోపాధ్యాయ అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛపై కలకత్తా పోలీసులు కమిషనర్ అనేక పరిమితులు విధించారు. వీటిని తట్టుకుంటూ పౌరహక్కుల ఉద్యమం 1950-51 వరకు నడిచింది. 1951లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులు జైలు నుంచి విడుదలై 1952లో జరిగిన మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ పాల్గొన్న తర్వాత ఆ పార్టీ హక్కుల ఉద్యమ ఆవశ్యకత తీరిందని భావించడంతో పౌర స్వేచ్ఛల దీపం మరోసారి కొండెక్కింది. ఒకే రాజకీయ పార్టీ నాయకత్వంలో హక్కుల ఉద్యమం సజావుగా సాగదని రెండోసారి స్పష్టమైంది.
1960 నాటికి కమ్యూనిస్టు పార్టీలో కార్మిక వర్గ అంతర్జాతీయ కర్తవ్యాల గురించి తీవ్ర అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. చైనా కమ్యూనిస్టు పార్టీకి, రష్యా కమ్యూనిస్టు పార్టీకి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం నిలువునా చీలిపొయింది. భారత కమ్యూనిస్టు పార్టీలో 1964లో జరిగిన చీలిక దీని ఫలితమే. 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధం నేటికి పార్టీ లోపలి ఓ విభాగంలో భారత ప్రభుత్వందే తప్పుగా భావించిన పెద్ద సెక్షనే ఉంది. వారిలో కొంతమందిని ఇండియా ప్రభుత్వం డీఐఆర్ కింద అరెస్టు చేసింది. ఆహార సమస్య లాంటి ప్రజా సమస్యలపై ఆందోళన చేసిన సోషలిస్టు నాయకులను, రిపబ్లిక్ పార్టీ వారిని కూడా అరెస్టు చేసింది.
1964-65 ఇండియా-పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. ఆనాటికి సీపీఐ(ఎం) పార్టీ ఏర్పడింది. ఆ పార్టీని చైనా పంచమాంగ దళం అని ముద్రవేసి 1000 మంది కార్యకర్తలను, నాయకులను 1964 డిసెంబర్‌లో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం జైళ్లలో బంధించింది. ఆ సందర్భంగా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అన్ని నిరసన చట్టాలను రద్దు చేయాలని మరొకసారి పౌర హక్కుల సంఘం ఉద్యమించింది.
బొంబాయి, కలకత్తా, మహానగరాల్లోను, విజయవాడలోను వేలాది మందితో ప్రదర్శనలు, సభలు జరిగాయి. 1948లో కలకత్తాలో ఏర్పడిన సివిల్ లిబర్టీస్ కమిటీకి లీగల్ విషయాల్లో అపార సహాయాన్ని అందించిన ఎన్.ఛటర్జీ ఈ ఉద్యమ అగ్రభాగాన నిలిచారు. ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర వ్యవస్థలపై ప్రభుత్వ దాడి, అరెస్టులను ఖండిస్తూ మహాసభలు తీర్మానించాయి. విచారణ లేకుండా నిర్బంధంలో వున్న వారినందరినీ విడుదల చేయాలని, విచారణ లేకుండా అరెస్టు చేయడానికి వీలు కల్పించే చట్టాలు, నిబంధనలు రద్దు చేయాలని ఈ సభలు డిమాండ్ చేశాయి.
విజయవాడ సభలో శ్రీశ్రీ అధ్యక్షతన ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఏపీసీఎల్ఎ) ఏర్పడింది. దీనికి శ్రీశ్రీ అధ్యక్షుడు, కె.గోపాలరావు, ప్రధాన కార్యదర్శి, విజయవాడ ప్రముఖ లాయరు కేవీఎస్ఎన్ ప్రసాద్, ఉపాధ్యక్షుల్లో ఒకరు. ప్రపంచ వ్యాపితంగా ఈ అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన వెల్లువెత్తింది. చివరకు 1965 చివరల్లోను, 1966 ప్రారంభంలోను జైళ్లలో డీఐఆర్ కింద వుంచబడ్డ వారినందరినీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత డీఐఆర్ లాంటి నిరంకుశ చట్టాల రద్దు కోసం ఎలాంటి ఉద్యమం సాగకపోవడం గమనార్హం.
అసలు అప్పటివరకు ఏర్పడిన హక్కుల సంఘాలేవీ సాధారణ ప్రజలపైనా, అసంఘటిత ప్రజల ఆందోళనలపై సాగుతున్న రోజువారీ దాడుల గురించి, సాధారణ ఖైదీల అమానుష పరిస్థితులను గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. 1970 తర్వాత హక్కుల ఉద్యమం. ఇది సమకాలీన హక్కుల ఉద్యమం. దీనిలో రెండు ప్రధాన స్రవంతులు ఉన్నాయని అనిపిస్తుంది. 1. రాజ్యాంగం ఆధారంగా - ముఖ్యంగా రాజ్యాంగంలోని ప్రవేశిక (ప్రియాంబుల్), ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను భూమికగా చేసుకుని కృషి సాగిస్తున్న సంస్థలు.
2. రాజ్యాంగంతో నిమిత్తం లేకుండా ప్రస్తుత రాజకీయ, ఆర్థిక వ్యవస్థ మౌలికంగా ప్రజా వ్యతిరేకమైందనే భూమికతో 'హక్కుల ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్న సంస్థలు. నక్సల్‌బరి, శ్రీకాకుళం రైతాంగ ఉద్యమాలు(1967-69)పై ప్రభుత్వాల క్రూర నిర్బంధ నేపథ్యంలోను, ఈశాన్య భారతంలోని జాతీయ ఉద్యమాలు, కాశ్మీరు స్వయం నిర్ణయాధికారం నేపథ్యంలోను ఏర్పడిన సంఘాలు- పశ్చిమ బెంగాల్‌లోని ఏపీడీఆర్, ఆంధ్రప్రదేశ్‌లోని ఓపీడీఆర్, ఏపీసీఎల్‌సీ, పంజాబ్‌లో ఏఎఫ్‌డీఆర్, మహారాష్ట్రలోని ఎల్‌హెచ్ఎస్, అస్సాంలోని ఎంఏఎస్ఎస్, మణిపూర్‌లోని ఎంహెచ్ఆర్ఓ లాంటి వాటిని రెండవ తరహాకు చెందిన సంస్థలు అని చెప్పవచ్చు. పీయూసీఎల్ (ఇది అఖిల భారత సంస్థ), పీయూడీఆర్ ఢిల్లీ, సీపీడీఆర్ బొంబాయి సంస్థలు మొదట తరహా సంస్థలుగా చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోని మానవ హక్కుల వేదిక ఈ రెండు స్రవంతుల అనుభవాలను మేళవించుకుని ఏర్పడిన సంస్థా? వేచి చూడాలి. ఈ సంస్థలన్నీ 30 లేదా 40 సంవత్సరాల క్రితమే ఏర్పడి ఒక వైపు ప్రభుత్వాల దాడులను, మరొక వైపు సంక్షిప్త సామాజిక పరిస్థితుల ఒత్తిడులను మదుపు చేసుకుంటూ, కార్యక్రమాల్లో సమన్వయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ కార్యక్షేత్ర విస్తృతిని వ్యవస్థీకృత హింసను, అంటే స్త్రీలపై పురుష అహంకారపు దాడులు, మత మైనారిటీలపై సంఘ్ పరివార్ మతోన్మాద దాడులు, అభివృద్ధి పేరుతో ప్రజల సంప్రదాయక జీవన విధానంలోనే వుండిపోయిన ప్రజల జీవితాలపై జరుగుతున్న దాడులు, హిందూ సమాజంలోని నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ దళితులపై చేస్తున్న దాడులు, వీటన్నింటినీ ప్రశ్నించే, నిరసించే స్థాయికి ఎదిగాయి.
అదే సమయంలో ప్రత్యామ్నాయ రాజకీయ ఆర్థిక వ్యవస్థ కోసం నూతన ప్రజాస్వామిక వ్యవస్థ కోసం పోరాటాలు చేస్తున్న వారిని బూటకపు ఎన్‌కౌంటర్లతో చంపడానికి వ్యతిరేకంగా తమ గొంతులను సంఘాలన్నీ బలంగానే వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అలాగే అన్ని నిరంకుశ చట్టాలను రద్దు చేయాలి. ఉరి శిక్షలను పూర్తిగా రద్దు చేయాలి. అన్ని అంశాలపై దాదాపు అన్ని సంఘాలూ ఒకే అభిప్రాయంలో ఉన్నాయి. ఖైదీల పరిస్థితులను మానవీయం చేయాలన్న విషయంలో కూడా ఏకాభిప్రాయముంది. అయితే కొన్ని ముఖ్యమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.
రాజ్యహింసతోపాటు, ప్రత్యామ్నాయ వ్యవస్థల కోసం పోరాటాలు సాగిస్తున్న సంస్థలు కొన్ని సామూహిక హత్యాకాండలను సాగిస్తున్నాయి. మరికొన్ని ఉద్యమ సంస్థలు చిన్న రాజకీయ కార్యాచరణ గలవారిపైన, సామాన్య పౌరులపైన ముద్రలు వేసి హత్యచేయడంతో సహా వివిధ రకాల భౌతిక దాడులు చేస్తున్నాయి. వీటిని ఖండించాలా లేదా అనే విషయం ఓ రాజకీయ లక్ష్యాలతో పనిచేసినందు వల్ల అరెస్టు చేయబడిన వారిని ప్రత్యేక తరహా ఖైదీలుగా గుర్తించి, వారి విడుదలకై డిమాండ్ చేయాలి.
ఒకే రకం అభిప్రాయం గల సంఘాలన్నీ ఒకే అఖిల భారత నిర్మాణ్ కిందకు రావాలని గతంలో జరిగిన ఒక ప్రయోగం అఖిల భారత ప్రజాస్వామ్య హక్కుల సంఘం సమాఖ్య (ఏఐఎఫ్ఓఎఫ్‌డీఆర్) ఇందులో ఓపీడీఆర్, ఎల్‌హెచ్ఎస్ (మహారాష్ట్ర ఏఎఫ్‌డీఆర్(పంజాబ్), జేఎఎస్ఎస్(కేరళ) సభ్య సంఘాలు, ఆపరేషన్ బొంబాయి కేంద్రంగా పది సంవత్సరాలు విశిష్టమైన కృషి చేసి, బాహ్య కారణాలకు తలొగ్గి క్రమంగా బలహీనపడి 1999 తరువాత పూర్తిగా ఉనికిని కోల్పోయింది. అయినప్పటికీ సమాఖ్య పనిని నిర్దేశించే డిక్లరేషన్ ఓపీడీఆర్ నూతన ప్రణాళిక రూపంలో సజీవంగానే ఉంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో హక్కుల సంఘాల వేదికలు రెండు వున్నాయి.
1. 1980లో ఏర్పడిన పీయూసీఎల్ 2. 2004లో ఏర్పడిన 22 హక్కుల సంఘాల సమన్వయ వేదిక, సీడీఆర్ఓ. సీడీఆర్ఓ ఒక కనీస సామాన్య కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకునే ప్రయత్నంలో వుంది. మొత్తం మీద భారతదేశంలో స్వాతంత్య్రానంతరం పౌర, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమ గమనం పరిశీలిస్తే పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాల్లోని పౌర హక్కుల సంఘాలకున్న లక్షల సభ్యత్వ పునాది గానీ, అందువల్ల ప్రభుత్వ పౌర హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా గణనీయ బలమైన ఉద్యమాన్ని నిర్మించగల్గిన శక్తిని సంపాదించుకోవాల్సి ఉండడం ఒక విచిత్ర పరిస్థితిగా కనిపించవచ్చు.
అయితే కొంచెం లోతుగా పరిశీలిస్తే ఫ్యూడలిజం పూర్తిగా రద్దయిన దేశాల్లో మాత్రమే పౌర హక్కుల ఉద్యమం మధ్యతరగతిలో విస్తృత పునాదిని వేసుకోలేదన్న వాస్తవం గమనంలోకి తెచ్చుకుంటే ఇండియాలోని పౌర, ప్రజాస్వామ్య హక్కులు కార్యకర్తలు ఎలాంటి నిరుత్సాహానికీ లోనుకావాల్సిన అవసరం లేదు. ముగింపులో ఒక ముఖ్యమైన మాట. నూతన ప్రజాస్వామ రాజ్యం, సోషలిస్టు రాజ్యం, పౌర హక్కుల సంఘాల అవసరముందా, లేదా? అనేది హక్కుల సంఘాలన్నీ సమష్టిగా ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుతానికి ఈ ప్రశ్నను వాయిదా వేసి ఇప్పుడు మన వ్యవస్థలో పౌర ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనపై దృష్టి కేంద్రీకరించి ఉద్యమాన్ని నిర్మించడానికి పీయూసీఎల్, సీడీఆర్ఓలు సిద్ధపడడం మంచి పరిణామం.
- సి.భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి, ఓపీడీఆర్
(ఈ వ్యాసం మొదటి భాగం ఈ నెల 24 వ తేదీన ప్రచురితమయింది)

No comments:

Post a Comment