Sunday, September 4, 2011

బి.సి.లకు ప్రత్యేక ప్రణాళిక - కంచ ఐలయ్య Andhra Jyothi 01/09/2011


బి.సి.లకు ప్రత్యేక ప్రణాళిక
- కంచ ఐలయ్య
వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ (2012-13) మన రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాల వారికి ఒక ప్రత్యేక ప్రణాళిక (స్పెషల్ కంపోనెంట్ ప్లాన్) రూపొందించాలి. గత ఆదివారంనాడు హైదరాబాద్ జూబ్లీ హాలులో జరిగిన బిసి మేధావుల, ప్రజా సంఘాల, రాజకీయ నాయకుల సదస్సు తీర్మానమది. జాతీయ స్థాయిలో ఎస్‌సి/ఎస్‌టిలకు స్పెషల్ కంపోనెంట్ ప్లాను, సబ్ ప్లానులు ఉన్నాయి. బిసిలకు ఇప్పటివరకు కేంద్ర స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ అటువంటి ప్రణాళిక లేదు. ఆ మాట కొస్తే బిసిలకు ఇటీవలివరకు కేంద్ర స్థాయిలో రాజ్యాంగబద్ధ గుర్తింపు లేదు. మండల్ ఉద్యమం ఫలితంగా ఒక గుర్తింపు లభించింది.
దాని ఫలితమే బిసిలకు విద్యా ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు. ఇంతకు మించి ఏ గుర్తింపూ లేదు. వనరులు అసలే లేవు. బిసిలు హిందూయిజంలో భాగం అనే దృక్పథం, దానితోపాటు కొంత అభివృద్ధి చెందిన వారనే భావనతో బిసిలకు ఏ రంగంలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు రాకుండా చూస్తున్నారు. అయితే, అభివృద్ధిపరంగా చూసినప్పుడు, (మన రాష్ట్రాన్నే తీసుకుందాం) 'ఏ' గ్రూపులోని బిసిలంతా సంచార కులాల వారై, హిందువులు నీచవృత్తులుగా భావించే 'గొప్ప' వృత్తులు చేసేవారుగా ఉన్నారు.
గంగిరెద్దుల, పిచ్చగుంట్ల నుంచి చాకలి, మంగలి కులాల వరకు ఆర్థికంగా అధోగతిలో ఉన్నారు. విద్యాపరంగా దాదాపు జీరో లెవల్ అభివృద్ధిలో ఉన్నారు. బిసిల పాత జాబితాలోని 93 కులాల్లో, ఇంగ్లీషు మీడియం విద్యారంగంలో అడుగుపెట్టిన వారు చాలా తక్కువ. కనుక బిసిలకు సైతం ఒక 'నిర్దిష్ట విద్యాప్రణాళిక'ను రూపొందించాలి. అటువంటి విద్యా ప్రణాళికను రూపొందించని పక్షంలో కొన్ని బిసి కులాల్లోని పిల్లల్ని స్కూలుకు పంపడం కూడా అసాధ్యమవుతుంది.
ఇక వృత్తులతో బతికే బిసిలకు ఇప్పటివరకు 17 ఫెడరేషన్లు ఉన్నాయి. వాటిలో కొన్నిటికి ఒక చైర్మన్, ఒక కారు, ఆయనతోనే తిరిగే ఒక ప్యూను ఉంటారు. అంతే తప్ప ఆ వృత్తికారుల అభివృద్ధికి పైసలు కానీ, ప్రణాళికలు గానీ లేవు. అధ్యయనమనే ఆలోచన అంతకన్నా లేదు. కొత్తగా వచ్చి చేరిన (139) బిసి కులాల్లో కొందరికి నిర్దిష్టమైన వృత్తులున్నాయి. మిగతావారికి, రోడ్లమీద పడి తిరగడం, అడుక్కు తినడమే వృత్తి. 65 ఏళ్ల స్వాతంత్య్రం తరువాత ఇన్ని కులాలు అడుక్కు తినే వృత్తిలో ఎట్లా ఉన్నాయి? ఈ స్థితిని ఎట్లా మార్చాలి? వారు ఇలా ఉండడం దేశానికే అవమానం కాదా?
అందుకే కొన్ని కులాల వ ృత్తుల్ని పూర్తిగా మార్చే ప్రణాళికతోపాటు మరికొన్ని వృత్తుల్ని, ఆధునికీకరించి పారిశ్రామికీకరణలోకి ప్రవేశపెట్టే ప్రణాళికను నిర్దిష్టంగా రూపొందించాలి. అది ఇప్పుడున్న సాధారణ ప్లాను వల్ల సాధ్యంకాదు. బిసి ప్రత్యేక ప్రణాళిక వల్లనే సాధ్యమవుతుంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం ఆదాయ వ్యయాల మొత్తం విలువ 129 వేల కోట్ల రూపాయలని అంచనా. అందులో రమారమి 56 వేల కోట్ల రూపాయలను ప్లాన్డ్ బడ్జెట్‌గాను, 73 వేల కోట్లు నాన్-ప్లాన్డ్ బడ్జెట్‌గాను చూపించారు. నాన్ ప్లాన్ బడ్జెట్ జీతభత్యాలకు, ఎస్టాబ్లిష్‌మెంట్‌కు, పాత స్కీములను నడపడానికి మాత్రమే వాడుతారు.
ఆ డబ్బులో ఒక కొత్త ప్లాను ప్రతిపాదించలేదు. అందువల్ల 56 వేల కోట్ల రూపాయల ప్లాన్డ్ బడ్జెట్‌లో 25 శాతం స్పెషల్ బిసి ప్లానుకు 14వేల కోట్ల రూపాయలు ఇవ్వొచ్చు. 2012 నాటికి బడ్జెట్ పెరగనుంది కనుక దాదాపు 15 వేల కోట్ల రూపాయలతో బిసి బడ్జెట్ రూపొందించాలి అనేది వాదన. దాన్ని ఎట్లా ఖర్చు చెయ్యాలన్నది కూడా పెద్ద సమస్య. ఎస్‌సి, ఎస్‌టి ప్లాన్ డబ్బును పూర్తిగా ఖర్చు కాలేదన్ననెపంతో దారిమళ్ళించిన సంగతి తెల్సిందే. అందుకే ఖర్చు ప్లాను చాలా కీలకమైనది. ఐతే ఇప్పుడు బిసిలకు కేటాయించిన 3,400 కోట్ల రూపాయలు స్కాలర్‌షిప్‌ల కోసం మాత్రమే. ఈ అన్యాయాన్ని కచ్చితంగా సవరించాలి.
బిసి ప్లాన్ బడ్జెట్‌లో 40 శాతం డబ్బును బిసిల విద్యకు ప్రత్యేకంగా కేటాయించాలి. ముఖ్యంగా 'ఏ' గ్రూపులోని కులాల పిల్లలకు మూడేళ్ళ వయసు నుంచి 18 ఏళ్ల వయసు వచ్చేంతవరకు చదువు, తిండి ఇవ్వకుండా వారి బతుక్కు ఒక అర్థాన్ని ఇవ్వలేం. 'బి' గ్రూపుల్లో కూడా సంచార కులాలున్నాయి. కురుమ కులమే అందుకు మంచి ఉదాహరణ. ఈ కులంలో దాదాపు 50 శాతం కుటుంబాలు 'మందల మన్యాల్లో' ఉంటారు. వారు పిల్లలను బడికి తోలలేరు. వారికో వృత్తి ఉన్నా, సంచార అవసరం వారిని వెన్నాడుతూనే ఉంది. ఇటువంటి కులాల వృత్తులకు నిలకడ కల్పించాలి.
వృత్తులున్న కులాలకు, ఆ వృత్తులను ఆధునికీకరించేందుకు, అవి పారిశ్రామీకరణ వైపు పయనించేందుకు ప్లాను తయారు చేయాలి. వృత్తులు లేనివారికి ఒక వృత్తిని కల్పించాలి. అది సాధించేందుకు అన్ని కులాల పిల్లల్ని ఇంగ్లీషు-తెలుగు సమపాళ్ళలో ఉండే విద్యా వ్యవస్థను గ్రామస్థాయిలో ఏర్పాటు చే యాలి. ఈ కులాల పిల్లలు కామన్‌స్కూళ్ళలో ఉన్నా వారి పోషణ, పుస్తకాలు ప్లాన్డ్ బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టాలి. బిసిలకు ప్రతి తాలూకాలో ఒక ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్/ఇంటర్‌మీడియట్ కాలేజీని ఈ డబ్బులో నుంచి ఖర్చు చేసి నడపాలి.
ప్రతి జిల్లాలో ఒక క్వాలిటీ ఇంగ్లీషు మీడియం డిగ్రీ కాలేజీని (రెసిడెన్షియల్) తప్పకుండా నడపాలి. ఇక్కడే వారిని ఐఏఎస్, ఐపిఎస్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చెయ్యాలి. విద్య ఒక్కటి మాత్రమే కుటుంబాన్ని, కులాన్ని ఆధునికీకరిస్తుందనే ఆదర్శాన్ని ప్రజల జీవితాల మార్పులో నిరూపించాలి. ఇందుకు ముందే చెప్పినట్లు 40 శాతం ప్లాన్ బడ్జెట్‌ను ఖర్చు చెయ్యడం అవసరం.
మిగతా 60 శాతాన్ని అన్ని కులాలకు ఫెడరేషన్‌లను ఏర్పరిచి ప్రతికులానికి జనాభా ప్రాతిపదికన వాటా అందేట్లు చూడడం. అందుకోసం ఇప్పుడున్న 17 ఫెడరేషన్లు పోగా మిగిలిన కులాలన్నిటినీ ఫెడరేషన్ల కిందకి రాబట్టాలి. ఏ వృత్తిలేని చిన్న కులాలను ఆ కులాల అభివృద్ధి ఫెడరేషన్ ఏర్పరిచి, వాటికి స్థిర జీవితాన్ని, ఒక మంచి ఇల్లును, కొద్దో గొప్పో భూమి లేదా గౌరవప్రద వ్యాపారం లేదా మరో వృత్తిని ఏర్పరచాలి. తల్లిదండ్రులు అడుక్కొచ్చి పెడితే తిని పిల్లలు ఆత్మగౌరవంతో స్కూల్లో కూర్చోలేరు.
అందుకని ఈ ప్లాను వాళ్ళ కుటుంబాలు సెటిల్‌మెంట్‌పై ఎక్కువగా ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది. మొత్తంగా అన్ని కులాల్ని (మున్నూర్ కాపులతో సహా) కాన్ఫెడరేషన్‌లుగా రూపొందితే వాటి ద్వారా (వాటికి ఆఫీసులు, మంచి అధ్యయన సిబ్బంది ఉండాలి) వృత్తుల ఆధునికీకరణకు పూనుకోవచ్చు.
ఉదాహరణకు కల్లుగీత వృత్తిని ఆధునికీకరించాలంటే చెట్లు పెంచడంతో (ఫారెన్ లిక్కర్ కంటె కల్లు మంచిది కనుక)పాటు తాటికి, లొట్టి దాచే యంత్రాన్ని తయారు చెయ్యడం కష్టం కాదు. మనిషి చెట్టెక్కి పడిచచ్చే స్థితిని మార్చాలి. అలాగే చాకళ్ళు గాడిదల్లా బట్టలుమోసే స్థితి మార్చాలి. ఉతుకుడు పద్ధతిని, ఇస్త్రీ పద్ధతిని బాగా ఆధునికీకరించాలి. నేత గాళ్ళకు మిషన్లద్వారా నేసే పద్ధతిని ఇంటింటికి తీసుకుపోవాలి. బట్టలమ్మే మార్కెటును కొంతైనా వారి చేతిలోకి తేవాలి.
షీప్ బ్రీడర్స్ ఫెడరేషన్ ద్వారా ఎరువు సమీకరణ, ఉన్ని కత్తిరిం పు, పాలు పితకడం, మాంసం ఎగుమతి వంటి పనులన్నిటికీ, అలాగే తమ గ్రామాల నుంచి ఆధునిక పద్ధతిలో అమ్మకానికి, ఎగుమతికి ఉపయోగపడే శాస్త్రీయ పద్ధతుల్ని రూపొందించాలి. కుం డల తయారీ వ్యవస్థను సంపూర్ణంగా ఆధునికీకరించవచ్చు. ఐతే వీటన్నిటికి ఫెడరేషన్‌ల ద్వారా ప్రత్యేక అధ్యయనాలు, మేధావులతో కూడిన చర్చలు జరగాలి. ఈ పనికి ప్రతి ఫెడరేషన్‌లో రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ కోసం డబ్బు కేటాయించుకొని నిపుణుల కమిటీలు వేయాల్సి ఉంటుంది. ఇవేకాక వ్యవసాయ రంగంలో ఈ వృత్తులను ముడేసి అభివృద్ధి చెయ్యాల్సి ఉంటుంది.
బిసిల్లో కొన్ని కులాలు ప్రత్యేక వ్యవసాయ కులాలు, కొన్ని పాక్షిక వ్యవసాయ కు లాలు ఉన్నాయి. వ్యవసాయ పనిముట్లను ఆధునీకరిస్తే దున్నుడు, కలుపుతీసుడు నీళ్ళు పెట్టుడు వంటి పనులపై కూడా కొత్తకోణం లో రీసెర్చ్ జరగాలి. అందుకు ఒక బిసి వ్యవసాయ ఆధునిక ఫెడరేషన్ కూడా ఏర్పాటు చేయవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా చేపల పెంపకం, కుందేళ్ళ పెంపకం వంటి పనులు పల్లెకార్ల ఫెడరేషన్ ఆధునిక రూపంలో చెయ్యవచ్చు. నీటి, ఆహార వనరులను బిసి ఫెడరేషన్ల ద్వారానే అభివృద్ధి చెయ్యగలం.
ఇక్కడ అన్ని కులవృత్తులను ప్రస్తావించలేకపోయినప్పటికీ బిసి ప్లానుతో ఆర్థిక వ్యవస్థలో విప్లవాన్ని తేవ చ్చు. ఇటువంటి ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి ద్వారా కులాల మధ్య సంబం«ధం మారుతుంది. ఎస్‌సి, బిసిల మధ్య ఉండే వైరుధ్యం, అగ్రకులాలతో వీరికుండే వైరుధ్యం బాగా మారుతుంది. ఇది ప్లాన్ ్డ బడ్జెట్‌ద్వారా మాత్రమే సాధ్యం. ఈ ప్లానులో (విద్యా ప్లానులో భాగంగా) ఫూలే నాలెడ్జ్ కేంద్రాల అభివృద్ధి, చాకలి ఐలమ్మ సాంస్కృతిక రంగాల అభివృద్ధిని, లైబ్రరీలను పెట్టవచ్చు. బిసి కళల ఆధునీకరణ జరపొచ్చు.
వీటన్నింటికీ ప్రత్యేక అధ్యయనాలు, ప్లాను రూపొందించాల్సి ఉంటుంది. కుల-సమీకరణ, వృత్తి-సమీకరణ ఏకకాలంగా జరగాలంటే చైతన్యవంతమైన శక్తులు కూడా ఆయా కులాల్లో ఎదగాల్సి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ వైపు యువత మరలుతుంది. ఈ మౌలిక మార్పును, త్వరితగతిని తీసుకురావడానికి, బిసిల్లోని మనుషుల్ని నాగరిక మానవులుగా తీర్చి ద్దిడానికి ఈ బిసి ప్లాన్ తప్పక అవసరం. అది బిసిల ఐక్యపోరాటంతోనే సాధించుకోగలం.
అంతుకు ముందుగా జరగాల్సింది ఈ ఆలోచనను బిసిల ముందుంచడం. వారిని తమ కుల చైతన్యం నుంచి, ఒక బిసి చైతన్యంలోకి ఎదిగించడం. అందుకు ప్రతి పాత తాలూకా కేంద్రంలో, జిల్లా కేంద్రాల్లో బిసి సదస్సులు జరుపుకొని ఈ అంశంపైనే చర్చించడం అవసరం. ఈ క్రమంలోనే అన్ని పార్టీల్లోని బిసి నాయకులపై వత్తిడి పెంచాలి. అన్ని పార్టీల్లో, ప్రజాసంఘాల్లో ఇదొక 'పిచ్చి వా దంగా' మారితే తప్ప బిసిలు బిసి స్పెషల్ ప్లానును సాధించుకోలే రు. అది రాకుండా ఆత్మహత్యలు తప్ప బిసిలకు మరోదారి కనిపించదు. రాష్ట్రంలో బిసిల ఆత్మహత్యలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం. ఈ పోరాటం 2012 ప్లాన్ బడ్జెట్ ప్రతిపాదనలోపే జరగాలి.
- కంచ ఐలయ్య
(వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత)

No comments:

Post a Comment