Sunday, September 4, 2011

బడుగుల భాగస్వామ్యం తేల్చాలి - మంద కృష్ణ మాదిగ Andhra Jyothi News Paper 31/08/2011


బడుగుల భాగస్వామ్యం తేల్చాలి
- మంద కృష్ణ మాదిగ
'భారతదేశమా నీ ప్రయాణం ఎటు?' -పండిట్ నెహ్రూ1928లో రాసిన ఒక గ్రంథ శీర్షిక అది. ప్రపంచం పెట్టుబడిదారీ, సోషలిస్టు వ్యవస్థలుగా చీలిపోతున్న సందర్భమది. భారతదేశానికి స్వాతంత్య్రం వస్తే సోషలిస్టు వ్యవస్థవైపే భారత్ పయనిస్తుందని నెహ్రూ విస్పష్టంగా చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ తెలంగాణ ఏ లక్షణం కలిగివుంటుంది? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నామని చెప్పే ఏ అగ్రకుల నాయకులూ ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా లేరు.
ఒక పోరాటానికి నాయకత్వం వహించే శక్తులు అవలంభించే విధానం వల్ల ఆ పోరాటం ద్వారా వచ్చే ఫలాలు అన్ని వర్గాలకు అందే విధంగా ఉంటాయా లేదా అనే విషయం ఆ పోరాటం జరుగుతున్న సందర్భంలోనే తెలిసిపోతుంది. తెలంగాణను కోరే వారిలో ప్రధానంగా మూడు శక్తులు పనిచేస్తున్నాయి. అవి: (అ) ముందు తెలంగాణ వస్తే చాలు అనుకునే శక్తులు.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేంతవరకు ఎలాంటి సామాజిక అంశాలను చర్చకు తేకూడదని అనుకునే శక్తులు ఇవి. ఈ శక్తులు అగ్రకుల భూస్వామ్య వర్గాలు; (ఆ) ప్రజాస్వామిక తెలంగాణ కోరుకునే శక్తులు. వీరిని ఒక్క మాటలో చెప్పాలంటే విప్లవోద్యమ అనుకూల శక్తులుగా చెప్పవచ్చు; (ఇ) తెలంగాణను కోరుకునే సామాజిక శక్తులు. ఈ శక్తులు వచ్చే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం భాగస్వామ్యం అన్ని రంగాలలో ఉండాలని కోరుకునేవి.
తెలంగాణ ఏర్పడిన వెంటనే తాము అధికారాన్ని కైవసం చేసుకోవడంతో పాటు అన్ని రంగాల మీద ఆధిపత్యం చెలాయించడానికి, తెలంగాణలోని అణగారిన కులాల ప్రజల్ని అన్ని రంగాలలో వెనక్కు నెట్టివేయడానికి అగ్రకుల భూస్వామ్య వర్గాలు పకడ్బందీగా ఇప్పటి నుంచే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే క్రమంలోనే భూస్వామ్య వర్గాల ఆధిపత్యాన్ని ఎండగడుతూ వారి దోపిడీ రాజకీయాలను ఎదుర్కొనే విధంగా, ప్రజాస్వామిక తెలంగాణను కోరుతున్న విప్లవోద్యమ అనుకూల శక్తులు తమ ప్రయత్నాలను కొనసాగించాలి. దురదృష్ట వశాత్తు ఒక స్పష్టమైన ఎజెండాతో తమ కార్యాచరణను ఆ శక్తులు ప్రజల ముందు ఇప్పటివరకు పెట్టలేకపోయాయి. ఇక సామాజిక శక్తుల పక్షాన ఎంఆర్‌పిఎస్ ముందు వరుసలో ఉండి, వచ్చే తెలంగాణలో 90 శాతంగా ఉన్న అణగారిన వర్గాలకు అన్ని రంగాలలో న్యాయమైన వాటాను డిమాండ్ చేస్తోంది. అణగారిన వర్గాలను అప్రమత్తం చేస్తూ తమ బాధ్యతను ఈ సంస్థ నెరవేరుస్తోంది.
ఈ కారణంగా తెలంగాణలో ఉన్న అగ్రకుల భూస్వామ్యశక్తులు సామాజిక న్యాయాన్ని కోరే శక్తులను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది రెండు విధాలుగా జరుగుతోంది. మొదట అగ్రకులాలు డైరెక్టుగా దుష్ప్రచారం చేస్తున్నాయి. రెండవది అణగారిన కులాల నుంచి కొంత మంది స్వార్థపరులను చేరదీసి డబ్బులకు, పదవులకు ఆశపడ్డవారితో చేయించడం కూడా జరుగుతుంది. అగ్రకుల శక్తులకు, అణగారిన కులాల శక్తులకు మధ్య జరిగిన ప్రతి సంఘర్షణలో గతం నుంచి నేటివరకు ఈ వైఖరినే అగ్రకుల శక్తులు కొనసాగిస్తున్నాయి.
చెప్పవచ్చినదేమిటంటే ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో ఆ ఉద్యమం తన లక్ష్యాన్ని సాధించాలంటే, ఆ ఉద్యమం అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిని పరిష్కరించుకోవాలి. ఆ అంతర్గత సమస్యలను న్యాయబద్ధంగా పరిష్కరించుకున్నప్పుడే ఉమ్మడి లక్ష్యం త్వరగా నెరవేరుతుంది. అలా కాక లక్ష్య సాధనలో అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారాన్ని విస్మరిస్తే ఉమ్మడి లక్ష్య సాధన కూడా జాప్యం జరిగి అది మరింత జటిలంగా మారే ప్రమాదం ఉందని ఎంఆర్‌పిఎస్ విశ్వసిస్తుంది. అంతర్గతంగా ఎదుర్కొంటున్న సమస్యలను ముందుగా గుర్తించి పరిష్కరించుకున్న ప్రతి ఉద్యమం తమ లక్ష్యాన్ని సులువుగా చేరుకున్న సందర్భాలు మన రాష్ట్ర, దేశచరిత్రలో ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు కొన్నిటిని నిశితంగా చూద్దాం.
(అ) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు లక్ష్యం :- తెలుగు ప్రజల హక్కుల్ని, అవకాశాల్ని తమిళులు కొల్లగొడుతున్నట్లుగా, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే కోస్తాంధ్ర ప్రాంత ప్రజలు తమ హక్కుల్ని హరించరనే గ్యారంటీ ఏమిటని రాయలసీమ ప్రజలకు అనుమానం వచ్చింది. రాయలసీమ సోదరులలో ప్రగాఢంగా ఉన్న ఈ అనుమానాలను తొలగించడానికై కోస్తాంధ్ర నాయకులు, సీమ నాయకులకు లిఖిత పూర్వకమైన హమీలు ఇచ్చారు. 1937 నవంబర్ 16న ఈ లిఖిత పూర్వక హామీలపై ఇరుప్రాంతాల మధ్య జరిగిన ఒప్పందమే శ్రీబాగ్ ఒప్పందంగా ప్రసిద్ధి పొందింది. దరిమిలా రెండు ప్రాంతాల ప్రజల సమష్టి కృషితో 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
(ఆ) ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు :- స్వాతంత్య్రానంతరం దేశవ్యాప్తంగా భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలనే ఆకాంక్ష బలపడుతున్న సందర్భం అది. ఆంధ్ర, హైరదాబాద్ రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనే బలమైన ఆకాంక్ష ఆంధ్ర నాయకుల నుంచి ఉత్పన్నమయింది. అయితే సమైక్య రాష్ట్రంలో తాము దోపిడీకి గురవుతామనే భయాందోళనలు తెలంగాణ వారిలో వ్యక్తమయ్యాయి. ఆ భయాందోళనలను ఎన్నో సందర్భాలలో తెలంగాణ నాయకులు బహిరంగంగానే వ్యక్తపరచడం జరిగింది.
ఆ భయాందోళనలను తొలగించడానికే 1956 ఫిబ్రవరి 20న ఆంధ్ర, తెలంగాణ నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. దానివల్ల తెలంగాణ ప్రాంతీయ బోర్డు మొదలు కొని విద్యా, ఉద్యోగ అవకాశాలు, నీటి పంపిణీ, బడ్జెట్ మొదలగు విషయాల మీద తెలంగాణకు రావాల్సిన, దక్కాల్సిన అన్ని విషయాల మీద ఒప్పందం జరిగింది. దీనినే పెద్ద మనుషుల ఒప్పందం అన్నారు. ఈ ఒప్పందం జరిగిన తరువాతనే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు ఏకమై 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది.
(ఇ) స్వాతంత్య్ర పోరాటం : 1917లో హోం రూల్ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. భారతీయులకు స్వయం పాలనాధికారాలు ఇస్తున్నామని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు దేశరాజకీయాల్లో కాంగ్రెస్, ముస్లిం లీగ్‌లు మాత్రమే ప్రధాన శక్తులు. యావత్ భారతీయుల పేరిట వచ్చిన రాజకీయ అధికారాన్ని కాంగ్రెస్ పేరుతో అగ్రకుల హిందువులు, ముస్లింలీగ్ పేరుతో సంపన్న ముస్లిం వర్గాలు అధికారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే చట్ట సభల్లో మాకు కూడా ప్రాతినిధ్యం కావాల్సిందేనంటూ దళిత గిరిజన బలహీన వర్గాలు దేశవ్యాప్తంగా పోరాటాన్ని మొదలుపెట్టాయి.
అప్పటికి గాంధీ, అంబేద్కర్, జిన్నాలు దేశ రాజకీయ చిత్రపటంలోకి ఇంకా రాలేదు. 1928లో సైమన్ కమిషన్ ఎదుట, ఆ తరువాత లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో స్వాతంత్య్రాన్ని అగ్రకులాలతో పాటు నిమ్నకులాలు కూడా కోరుతున్నాయని, స్వాతంత్య్రానంతరం అన్ని రంగాలలో తమకు న్యాయమైన వాటా ప్రాతినిధ్యం సంగతి ఏమిటో మీరు ముందే తేల్చాలని అంబేద్కర్ పట్టు పట్టారు. దేశ స్వాతంత్య్రాన్ని స్వాగతిస్తూనే అణగారిన కులాల పక్షాన అంబేద్కర్ బలంగా నిలబడ్డారు. నిమ్న కులాల వాణిని బ్రిటిష్ పాలకులు, కాంగ్రెస్ నాయకుల ముందు విన్పించిన తరువాతనే బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును 1932లో ప్రకటించింది.
ఆ అవార్డును అడ్డుకోవడానికి అగ్రకుల శక్తులు గాంధీని ముందుపెట్టడం, ఆయన ఆమరణ దీక్షకు పూనుకోవడం, అప్పటివరకు అంబేద్కర్‌కు అనుసరించిన కొంతమంది దళితనాయకులు కాంగ్రెస్‌కు లొంగిపోయి, దళారులుగా మారి కమ్యూనల్ అవార్డు దళితులకు అవసరం లేదంటూ అంబేద్కర్‌కు వెన్ను పోటు పొడవటం జరిగింది. గాంధీ చనిపోతాడనే వదంతులతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడడం, అటు గాంధీ ప్రాణాలు కాపాడటానికి, పీడితకులాల కనీసహక్కులను సంరక్షించుకోవడానికి అంబేద్కర్ ముందుకు రావడం జరిగింది. ఆ విధంగా గాంధీ, అంబేద్కర్‌ల మధ్య 1932లో జరిగిన పూనా ఒడంబడిక ఫలితమే స్వాతంత్య్రానంతరం అమలు జరుగుతున్న నేటి రిజర్వేషన్ల విధానమని అందరికి తెలిసిందే.
పై మూడు ఒప్పందాలు జరిగిన వివిధ సందర్భాలను గమనిస్తే తమిళుల నుంచి విడివడే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న కాలంలోనే రెండు అసమాన ప్రాంతాల మధ్య కొనసాగుతున్న అసమానతలను రూపుమార్పించే దిశగా శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. రెండు తెలుగురాష్ట్రాలు కలిసి ఒక్కటిగా ఏర్పడే సందర్భంలోకూడా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అసమానతలు, దోపిడీని తొలగించుకునే విధంగా అన్ని రంగాలలో సమాన పంపిణీ జరిగే విధంగా ముందే పెద్దమనుషుల ఒప్పందం జరిగింది.
దేశ స్వాతంత్య్రం సాధించుకునే సందర్భంగా దేశంలో కుల అసమానతలు సాంఘిక వివక్షలను తొలగించుకునే విధంగా అస్పృశ్యులకు, గిరిజనులకు అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం దక్కే విధంగా గాంధీ, అంబేద్కర్‌ల మధ్య పూనా ఒడంబడిక జరిగింది. ఆ తర్వాతే దేశానికి స్వాతం త్య్రం సాధించడం జరిగింది. ఒప్పందాలు చట్టాలుగా అమలులోకి వచ్చి, నిజాయితీగా అమలయితే దేశంలోని వివిధ వర్గాల ప్రజలు అసమానతలు తొలగించుకుని ఐక్యంగా జీవిస్తారని గాంధీ, అంబేద్కర్ల మధ్య జరిగిన ఒప్పందం సాక్ష్యం చెప్పింది.
ఒప్పందాల మీద కలిసిన రాష్ట్రం ఆ ఒప్పందాలను అమలు చేయకపోతే తిరిగి ప్రత్యేక రాష్ట్రమే శరణ్యం అనే డిమాండ్ వస్తుంది. అందుకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే సాక్ష్యం. అందువల్ల తెలంగాణలోని అణగారిన కులాలు, అగ్రకులాల మధ్య ఒక ఒప్పందం జరగడంతో పాటు ఆ ఒప్పందం తెలంగాణ, ఆంధ్ర ఒప్పందంలా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అగ్రకులనాయకులదేనని ఎంఆర్‌పిఎస్ భావిస్తోంది. తెలంగాణ జనాభాలో 90 శాతంగా ఉన్న అణగారిన కులాలకు రాజకీయ అధికారంలోను, సంపదలోను, విద్యా, ఉపాధి అవకాశాలలోను వారి వారి జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో భాగస్వామ్యం ఉండే హక్కును గుర్తించే విధంగా, అది త్రికరణ శుద్ధిగా అమలు జరిగే విధంగా ఒప్పందం కుదరాలి.
ఇందుకు తెలంగాణ అగ్రకుల శక్తులు ముందుకు వచ్చి అణగారిన కులాల ప్రజల ఆకాంక్షలను గౌరవించటడం, గుర్తించడం చేయాల్సి ఉంటుందని గుర్తుచేస్తున్నాం. అప్పుడే తెలంగాణలోని అగ్రకులాలు, అణగారిన కులాల మధ్యన మరింత ఐక్యత ఏర్పడి, సీమాంధ్ర అగ్రకుల రాజకీయ పెట్టుబడిదారులు కల్పించే ప్రతి అడ్డంకిని తొలగించుకోవడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే అవకాశం ఉంటుందని ఎంఆర్‌పిఎస్ సంపూర్ణంగా విశ్వసిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే. కాని అంతకు ముందే అణగారిన కులాల భాగస్వామ్య విషయం కూడా తేల్చాల్సిందే.
- మంద కృష్ణ మాదిగ
ఎమ్ ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు

No comments:

Post a Comment