Sunday, September 4, 2011

సబ్‌ప్లాన్‌ నిధులు కోసం సమరం అనివార్య---జాన్‌వెస్లి (రచయిత కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌)


సబ్‌ప్లాన్‌ నిధులు కోసం సమరం అనివార్య
Share
నేటి వ్యాసం Wed, 3 Aug 2011, IST
ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలు జరగాలంటే ప్రత్యేక చట్టం తీసుకురావాలని జాతీయ ప్రణాళికా సంఘం చేసిన సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడ చెవిన పెడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగాల్లో ప్రజా ప్రాతినిధ్యంలో రిజర్వేషన్ల అమలుకు చట్టం ఉండడం వల్ల అమలు జరుగుతున్నాయి. చట్టం చేస్తే దీనిని అమలు చేయని ప్రభుత్వ శాఖలు, అధికారులపై కోర్టుకెళ్లి అమలు చేయించుకునే హక్కు వస్తుంది.
స్వతంత్ర భారతం 65వ యేట అడుగిడుతున్నా దళితులు, గిరిజనులు అంట రానితనం, కులవివక్ష దాడులు, అత్యాచారాలు, హత్యలకు గురవుతూనే ఉన్నారు. భూమి, నీరు వంటి సహజ వనరులు, ఉత్పత్తులు, సంపద పంపిణీలోను, కేంద్ర- రాష్ట్ర బడ్జెట్లలోనూ తగిన వాటా దక్కడం లేదు. ఈ విధంగా అభివృద్ధిలోనూ వీరు కుల వివక్షకు గురవుతున్నారు. అగ్రకుల భూస్వాములు పెట్టుబడిదారీ దోపిడీ వర్గాల పాలన కొనసాగడం వల్లే బూజు పట్టిన ఫ్యూడలిస్టు భావజాలం ఇంకా చెలామణి అవుతోంది. దళితులు, గిరిజనులకు కేంద్ర, రాష్ట్ర ప్రణాళికలు, బడ్జెట్‌లలో జనాభా నిష్పత్తి ప్రాతిపదికన నిధులు కేటాయించి, వాటిని సక్రమంగా అమలు చేయాలని అనేక ఏళ్లుగా సాగించిన పోరాటం ఫలితంగా ఎస్‌సిపి, టిసిపిలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, వాటి అమలును మరచింది. పైగా, వీరికి కేటాయించిన నిధులను ధనిక వర్గాలకు ఖర్చు చేస్తోంది. అందరినీ అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికల లక్ష్యాన్ని కూడా అది నీరుగార్చుతోంది. అయిదో పంచవర్ష ప్రణాళిక సమీక్షలో తేలిందేమిటంటే ప్రభుత్వాలు కేటాయిస్తున్న అరకొర నిధులు సైతం దళిత, గిరిజనుల దరి చేరడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రణాళికా, బడ్జెట్లలో ఎస్‌సి, ఎస్టీల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి ఖర్చు చేయాలన్న ఉద్దేశంతో స్పెషల్‌ కంపోనెంట్‌ ప్లాన్‌ (ఎస్‌సిపి), ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ (టిఎస్‌పి)లను రూపొందించారు. వీటిని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ లేఖలు రాశారు. నేటి ప్రధానిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ గతంలో జాతీయ ప్రణాళికా సంఘం మెంబర్‌ సెక్రటరీ హోదాలో వీటి అమలుకు సూచనలు చేస్తూ లేఖలు రాశారు. మాజీ రాష్ట్రపతి కె ఆర్‌ నారాయణన్‌ వీటి అమలుకు గవర్నర్ల కమిటీని వేశారు. ప్రణాళికా సంఘం, ఎస్సీ, ఎస్టీ కమిషన్లు, గవర్నర్ల కమిటీ సూచనలను కూడా ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. వీటి సూచనల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక, బడ్జెట్‌లలో ఆయా రాష్ట్రాల్లో దళిత, గిరిజనుల జనాభా నిష్పత్తి ప్రకారం నిధులను కేటాయించాలి. నేరుగా ఈ వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా ఈ నిధులను ఖర్చు చేయాలి. నిధుల కోత కానీ, దారిమళ్లింపు కానీ చేయకూడదు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఏ కారణం చేతనైనా ఆ సంవత్సరం ఖర్చు చేయలేకపోతే మరుసటి సంవత్సర బడ్జెట్‌లో వాటిని అదనంగా జోడించాలి. అన్ని శాఖలు ఎస్సీలకు 789, ఎస్టీలకు 796 పద్దుల కింద ఈ నిధుల కేటాయింపులు, ఖర్చులు చూపించాలి. దళిత, గిరిజనుల జనాభా అధికంగా ఉన్న గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల్లోని దళిత, గిరిజన వాడలు, వ్యక్తుల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి వీటిని ఖర్చు చేయాలి. రాష్ట్రాలు, జిల్లాలలో పర్యవేక్షణ కమిటీలు వేయాలి. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించి నివేదికలు పంపాలి.
రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌సిపి, టిఎస్‌పి కింద ఎన్ని నిధులైతే కేటాయిస్తాయో అంతే మేర నిధులను ప్రత్యేక సహాయ నిధి నుండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కేటాయిస్తుంది. ఉదాహరణకు రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌లో అన్ని శాఖలకు కలిపి ఎస్‌సిపి కింద ఏడు వేల కోట్లు కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో ప్రత్యేక సహాయ నిధి నుండి కేటాయించాలి. రెండూ కలిపితే అయ్యే 14వేల కోట్ల మొత్తాన్ని దళితుల అభివృద్ధికి ఖర్చు చేయాలి. దీంతోపాటు జనరల్‌గా అందరికీ ఖర్చు చేసే నిధులలో కూడా ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేయాలి. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సూచనలను అమలు చేయడం లేదు. మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ప్రకారం దళితుల జనాభా 16.2 శాతం, గిరిజన జనాభా 6.6శాతం ఉందని, ఆ మేరకు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని 2005లో అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. కెవిపిఎస్‌ నిర్వహించిన ఉద్యమం, బి.వి రాఘవులుతోపాటు 25 మంది నిరవధిక నిరాహార దీక్షలు ఈ పోరాటాలన్నిటి ఫలితంగానే ఆనాటి ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర రెడ్డి 2007లో ఎస్సీ, ఎస్టీ నోడల్‌ ఏజెన్సీలను ఏర్పాటు చేశారు. ఆ తరువాత జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపులు చూపిస్తున్నా ఖర్చు చేయకుండా కోత, దారి మళ్లింపు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఎస్సీ సబ్‌ ప్లాన్‌ ప్రకారం (ఎస్‌సిపిని ఎస్సీ సబ్‌ప్లాన్‌గా మార్చారు) 7,500 కోట్లు కేటాయించాల్సి ఉండగా ఇందులో 3వేల కోట్లు దారి మళ్లించారు. మరో 500 కోట్లు కోత పెట్టారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఎస్‌సిపికి రావాల్సిన 7,500 కోట్లలో 350 కోట్లు మాత్రమే కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలు జరగాలంటే ప్రత్యేక చట్టం తీసుకురావాలని జాతీయ ప్రణాళికా సంఘం చేసిన సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెడ చెవిన పెడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు విద్య, ఉద్యోగాల్లో ప్రజా ప్రాతినిధ్యంలో రిజర్వేషన్ల అమలుకు చట్టం ఉండడం వల్ల అమలు జరుగుతున్నాయి. చట్టం చేస్తే దీనిని అమలు చేయని ప్రభుత్వ శాఖలు, అధికారులపై కోర్టుకెళ్లి అమలు చేయించుకునే హక్కు వస్తుంది. ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ అమలు చేయాలని, సబ్‌ప్లాన్‌ అమలుకు చట్టం కూడా తీసుకురావాలని దళిత గిరిజన వాడల అభివృద్ధికి ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఐదు వేల కోట్లు కేటాయించాలని తదితర డిమాండ్ల పరిష్కారానికై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి రాఘవులుతో పాటు నలుగురు నాయకులు నిరవధిక నిరాహారదీక్ష చేశారు. కె.వి.పి.ఎస్‌, గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వేలాదిమంది ఛలో అసెంబ్లీకి తరలి వచ్చారు. ఈ సందర్భంగా రెండు రోజులు శాసనసభలో చర్చ అనంతరం ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ వాడల అభివృద్ధికి ఈ సంవత్సరం 1000 కోట్లు కేటాయిస్తామని, ఉపాధిహామీ పథకం పనుల ద్వారానూ దళిత గిరిజన వాడల అభివృద్ధికి నిధులు ఖర్చు చేస్తామని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు మేధావులతో సమావేశం నిర్వహించి ఆ సూచనల అమలుకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రులను పంపి నాయకుల దీక్షను విరమింపజేశారు. కానీ, హామీ ఇచ్చి నాలుగు నెలలు గడిచినా సబ్‌ప్లాన్‌ సమస్యపై మేధావుల సమావేశం మాత్రం వేయడం లేదు. ప్రభుత్వానికి దళిత గిరిజనుల అభివృద్ధి పట్ల ఏపాటి చిత్తశు ద్ధి ఉందో దీనిని బట్టే అర్థమవుతుంది. రాష్ట్ర రాజకీయాలు, ప్రాంతీయ ఉద్యమాల వల్ల దళితులు పేదల సమస్యలు పక్కదారి పడుతున్నాయి. పాలకవర్గాలు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఇవి దోహదపడుతున్నాయి.
ఐక్య ఉద్యమం
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధుల సమగ్ర చట్టం సాధనకై విశాల ఐక్య ఉద్యమం నిర్వహించాలని రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపిఎస్‌లతో పాటు మేధావులు దళిత గిరిజన ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు కలిసి వచ్చే శక్తులన్నింటితో ఐక్యంగా ఉద్యమించేందుకు హైదరాబాద్‌లో 100 సంఘాలతో ఎస్‌సిపి, టిఎస్‌పి నిధుల సాధన జెఏసి ఏర్పడింది. దీనికి కాకి మాధవరావు (మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ఇప్పటికే 20 జిల్లాల్లో జెఏసిలు ఏర్పడ్డాయి. డివిజన్‌, మండల, గ్రామ స్థాయిలలో కూడా కమిటీలు ఏర్పడుతున్నాయి. ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను కలిసి కోరింది. ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలకు ఎలాగైతే సిద్ధమయ్యారో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ అమలుకు, చట్ట సాధనకు అంతకంటే తీవ్రంగా ఉద్యమించాల్సిన అవసరముంది. హక్కులు అడగకుంటే రావనీ పోరాటాలు, ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతాయని అనేక పోరాటాలు నిరూపించాయి. బోధించు సమీకరించు పోరాడమన్న అంబేద్కర్‌ పిలుపు ప్రకారం దళిత, గిరిజన బలహీన వర్గాలు కలిసి వచ్చే శక్తులన్నీ ఏకమై సమర శంఖం పూరించాలి.
జాన్‌వెస్లి (రచయిత కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్‌) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)

No comments:

Post a Comment