Sunday, September 4, 2011

అమానుషం-- ఆదివాసీ కళాకారులు. వీరు చేసిన నేరం ఏమిటి? -సంపాదకీయం Namasethe Telangana 30/08/2011


అమానుషం
జీతన్ మరాండి, అనిల్ రామ్, మనోజ్ రాజ్వర్, ఛత్రపతి మండల్.. వీరు ఎవ రు? ఆదివాసీ కళాకారులు. వీరు చేసిన నేరం ఏమిటి? జార్ఖండ్‌లోని అడవులు, ఖనిజాల వంటి వనరులను పెద్ద కంపెనీలకు దోచి పెడుతూ ఆదివాసీల మనుగడకు ముప్పు తెస్తున్న విధానాలపై గళమెత్తిన కళాకారులు. వీళ్ళు తుపాకులు పట్టుకుని ప్రభుత్వంపై కొట్లాడారా? కాదు.. కాళ్ళకు గజ్జెలు కట్టుకున్నారు, ఢోలక్, హార్మోనియం పట్టుకున్నారు. జనంలో తిరిగారు. ఇందుకు వారు పొందిన సత్కారం ఏమిటి? మర ణ శిక్ష. తుపాకీ పట్టుకొన్న వాడిని హతమార్చి, ఆత్మరక్షణ చేసుకుంటున్నామని బుకా యించే రోజులు కూడా పోయాయి. ఏకంగా పాట పాడుతున్న వారిని, గజ్జె కట్టుకున్న వారిని కూడా నేరస్థులుగా ముద్రవేసి మరణశిక్ష విధించే స్థాయికి దిగజారింది మన ‘నాగరికత’.
కళాకారులు, మేధావులు తాము నమ్మిన భావజాలాన్ని ప్రచారం చేస్తారు. పాలకులకు నచ్చని భావజాలాన్ని కూడా ప్రచారం చేయవచ్చు. అది ప్రజాస్వామిక హక్కు. అసమ్మతిని అనుమతించడం ప్రజాస్వామ్య మూల సూత్రం. ప్రభువుల కీర్తనలే పాడాలని శాసిస్తే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది. ఒక ప్రజాస్వామ్య విరుద్ధ సంప్రదాయం ఏర్పడాలే కానీ, అది ఒక దగ్గర ఆగిపోతుందని చెప్పలేం. ఇవాళ జార్ఖండ్‌లో జరిగింది. రేపు తెలంగాణలో జరగవచ్చు. గళానికి గజ్జె తోడై ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తున్నది. ఈ కళాకారుల ఆట పాటల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడితే ఏమి చేయాలె? తెలంగాణ సమస్యను పరిష్కరించాలె.
అంతే కానీ, సమస్య మూలాలను పెళ్ళగించకుండా, కళాకారులను నేరస్థులుగా ముద్రవేసి శిక్షించడమేమిటి? పోలీసులు తలుచుకుంటే కేసులకు కొదువా? అంత మాత్రాన కళాకారులు నేరస్థులవుతారా? ప్రతి మనిషికి తమకంటూ ఒక రాజకీయ భావజాలం ఉంటుంది. అంత మాత్రాన వారు నేరస్థులై ఉరికంబం ఎక్కాలనడం ఏ కాలపు రాజనీతి? ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? జార్ఖండ్‌లోని వనరులను అక్కడి ప్రజల అభివృద్ధి కోసం వినియోగించకుండా, అభివృద్ధి పేరిట కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న పాలకవర్గం గిరిజనుల కోసం ఆడే, పాడే కళాకారులపై కేసులు బనాయించడ మే కాకుండా ఏకంగా బలిపీ నిలబెట్టింది!
మరణ శిక్ష అనేదే ఒక పాతకాలపు అవశేషం. ఇంతటి క్రూర, అమానుష శిక్ష ప్రజాస్వామ్య విరుద్ధమైనది. ప్రపంచమంతా మరణ శిక్ష రద్దు వైపుగా పయనిస్తున్నది. ఇప్పటికే 96 దేశాలు మరణ శిక్షను రద్దు చేశాయి. మరో 34 దేశాలు మరణ శిక్షను చట్టాల నుంచి తొలగించనప్పటికీ, అమలు చేయడం మానివేశాయి. వీటిని ఆదర్శంగా తీసుకోకుండా మన దేశం మాత్రం నిరంకుశ రాజ్యాలైన అమెరికా, చైనాల మాదిరిగా మర ణ శిక్షలు అమలు చేయడం చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు.
కఠిన శిక్షలు విధించినంత మాత్రాన నేరాలు అంతం కావనేది ఇప్పటికే వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా నేరపరిశోధనా వ్యవస్థ లోప రహితంగా లేదు. అనేక మంది దోషులకు శిక్ష పడుతున్నది. అందువల్ల ఒకసారి పొరపాటున మరణ శిక్ష అమలు జరిపితే మళ్లీ చక్కదిద్దుకోవడం సాధ్యం కాదు. దోషికి పశ్చాత్తాపం చెందడానికి అవకాశం ఇవ్వాలె తప్ప, మొత్తం ప్రాణాన్నే బలిగొనాలనడం ఆధునిక సమాజంలో అభిలషణీ యం కాదు. ఇప్పటి వరకు మరణ శిక్ష పడిన ఉదంతాలు పరిశీలిస్తే- నేరస్థులు రెండు రకాలుగా కనిపిస్తారు.
ఒకటి- సాధారణ నేరాలు చేసినవారు. రెండు- రాజకీయ కారణాల వల్ల దోషులుగా నిలబడ్డవారు. సాధారణ నేరాలు చేసిన వారిలో అనేక మంది పేదలు, అట్టడుగు వర్గాల వారుంటారు. సామాజిక అసమానతలు ఇంకా కొనసాగు తూ, ఆర్థిక అసమానతలు పెరుగుతున్న మన దేశంలో చట్టంతో సంబంధం లేకుండానే ‘ఎన్‌కౌంటర్లు’ జరగడం సాధారణం. అటువంటిది చట్టబద్ధంగా మరణ శిక్ష విధించే ఏర్పాటు ఉంటే దానికి ఎక్కువగా బలయ్యేది తమ తరఫున గట్టిగా వాదించుకోలేని పేదలేనని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందుకు మన కళ్ళముందే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆంధ్రలోని చిలుకలూరి పేట బస్సు దగ్ధం కేసులో మరణ శిక్ష పడిన వారు దళితులు. తినడానికి తిండి లేక, ఉపాధి దొరుకక, బస్సులో ఉన్నవారిని బెదిరించబోయిన క్రమంలో బస్సు దగ్ధమై ప్రయాణీకులు సజీవ దహనమైన విషాదం చోటు చేసుకున్నది.
ఈ ఘటన తరువాత విధానకర్తలు చేయాల్సిందేమిటి? నేరం ఏ పరిస్థితుల్లో జరిగిందో తెలుసుకొని అప్రమత్తం కావాలె. రోజుకు ఒక పూట తిండికి నోచుకోని జనం గురించి ఆలోచించాలె. కానీ పాలకులు ఆ పని చేయలేదు. దోషులపై అతివేగంగా విచారణ సాగింది, మరణ శిక్ష పడింది. అత్యంత అమానుషంగా ఫ్యాక్షన్ హత్యలకు పాల్పడిన వారి విచారణ, శిక్షలతో వీరికి పడిన శిక్షను పోల్చి చూస్తే అసమన్యాయం అంతు దొరుకుతుంది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో మురుగన్, శంతన్, పేరారివళన్‌లకు మరణ శిక్షపడిం ది. కానీ శ్రీలంక తమిళుల కన్నీళ్ళు ఆరనేలేదు. పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురుకు మరణ శిక్ష పడింది. కానీ గాయపడిన కాశ్మీర్ హృదయానికి స్వాంతన చేకూర్చాలని కేంద్రం ఇప్పటికైనా భావిస్తున్నదా? ప్రభుత్వాలు చేయాల్సింది ఈ సమస్యలను పరిష్కరించడం. దోషులకు తాము తప్పు చేశామని గ్రహించి పశ్చాత్తాపపడే అవకాశం ఇవ్వాలె. అదే నాగరిక సమాజం గొప్పదనం. అంతే కానీ ప్రతీకారంగా శిక్ష లు విధించడం కాదు. ఈ మధ్య మన దేశంలో దోషులను వారి నేరం వల్ల గాకుండా వారు ఏ సామాజికవర్గం వారనే దృష్టితో చూస్తున్నారు. మరణ శిక్ష విధించమనే డిమాండ్లు కూడా వస్తున్నాయి. దీని వల్ల బలహీన వర్గాల వారు బలయ్యే అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. అందువల్ల మరణ శిక్ష రద్దు చేయడమొక్కటే ఉత్తమమైన మార్గం.

No comments:

Post a Comment