Wednesday, February 1, 2012

...అనంతరవాదం అర్ధ సత్యమే

ప్రభుత్వాల గడువు తీరినప్పుడు, ప్రభుత్వాధినేతలు మరణించినప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వాలు రావడం సహజం. అలాగే సమాజంలో ఒక సిద్ధాంతం గడువు తీరినప్పుడు, సంక్లిష్ట సమయంలో ఉన్నప్పుడు నూతన సైద్ధాంతిక ప్రాతిపదికలు రావడం సహజమే. అనేక నూతన ప్రాతిపదికలు వచ్చినప్పుడు ఏ ప్రాతిపదిక అయితే శాస్త్రీయంగా ఉంటుందో అది మనగలగడానికి అవకాశం ఉంటుంది. కుల వ్యవస్థ, బ్రాహ్మణీయ భావజాలం, అగ్రకుల ఆధిపత్యంతో సతమతమవుతున్న భారతీయ సమాజం అసమానతల నుంచి బయటకు వచ్చే క్రమంలో హిందూ మతం అంతరించిపోతుందని కంచ ఐలయ్య తన 'హిందూ మతానంతర భారతదేశం' అనే గ్రంథంలో వెల్లడించారు. ఇది నిజమే అయినప్పటికీ ఒక ఆపద్ధర్మ సిద్ధాంతమే అవుతుంది కానీ పరిపూర్ణ సిద్ధాంతం కాదు.

ఎందుకంటే అసమానతలు పోతాయనే గ్యారంటీ లేదు. క్రైస్తవ, ఇస్లాం సమాజాల్లో కూడా మనం అసమానతలను చూస్తూనే ఉన్నాం. అయితే కాలానుగుణ పరిస్థితులకు తన పరిస్థితులను మార్చుకుంటున్న మతాలు మరికొంత కాలం బతికి బట్టకట్టవచ్చు. వస్తున్న మార్పులకు సానుకూలంగా మారకుండా సనాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందూ మతం నిజంగానే మొదట అంతరించే అవకాశం నూటికి నూరుపాళ్ళు ఉంది. ఆ తర్వాత దేవుడే ప్రాతిపదికగా ఏర్పడిన క్రైస్తవ, ఇస్లాం మతాలు కూడా అంతరిస్తాయి.

నా మాటల్ని చదివి ఈ రచయిత అమాయకుడు అని అని అనుకోవచ్చు. నిజమే, ఎందుకంటే దేవుడనే మాయకుడి చేతిలో పడ్డ వారందరికీ నేను అమాయకంగానే కనిపిస్తాను. ప్రపంచ మేధావులందరూ దేవుని చుట్టూ మతం నిర్మితమైందని భావిస్తున్నారు. కానీ బౌద్ధం లాంటి మతాలు దేవుని నమ్మకుండా నడుస్తున్నాయి. అంటే ప్రపంచంలో దేవుణ్ణి నమ్మే మతాలు, నమ్మని మతాలు కూడా ఉన్నాయి. దేవుని నమ్మే మతాలన్నింటికి నాశనం తప్పదు. ఎందుకంటే దేవుడు అశాస్త్రీయం, అసమానతల మాతృక. దేవుని దృష్టిలో మనుషులంతా సమానులే అనే నానుడిని విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ అది ఆచరణలో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది.

మరి ఒక దేవుని దృష్టిలో మరొక దేవుడు సమానమేనా? అని ప్రశ్నిస్తే దేవుళ్ళందరూ సమానులు కారు. అందుకే, రాముడికి- అల్లాకు, కృష్ణుడికి- క్రీస్తుకు ఎప్పుడూ గొడవ; నీవు తప్పంటే నీవు తప్పని వాదన; అందరూ అశాస్త్రీయ ఖాతాలో పుట్టిన వారే కాబట్టి. ఒక దేవుని దృష్టిలో మరొక దేవుడు సమానం కానప్పుడు వారి అనుచరులు ఎలా సమానమవుతారన్నది అసలు ప్రశ్న. సమానం కాని వీరు సమానత్వాన్ని ప్రపంచానికి ఎలా బోధిస్తారు? ఈ ప్రశ్నలు ఏదో ఒకనాడు మానవుల మెదళ్ళను తొలచకపోవు.

నిగూఢ మర్మం దొరకకపోదు కాబట్టే ఐలయ్యతో ఏకీభవిస్తూనే విభేదిస్తున్నాను. ఎందుకంటే హిందూ మతమే కాదు ఇస్లాం, క్రైస్తవం కూడా కనుమరుగవుతాయి. ఐలయ్య, మార్పుకు వీలులేకుండా వుండి చనిపోతున్న హిందూ మతాన్ని పునరుజ్జీవం చేసుకొమ్మని ఉచిత సలహా ఇస్తే, అంతే చాకచక్యంగా మాజీ డిజిపి అరవిందరావు కూడా హిందూ మతానికి 13 ప్రశ్నలు, ఐలయ్యకు ఐదు ప్రశ్నలు సంధించి చస్తున్న హిందూ మతాన్ని పునరుజ్జీవం చేయాలని చెప్పకనే చెప్పారు.

నిజానికి భారతదేశం హిందూ దేశం కాదు. హిందువులు ఈ దేశ మూలవాసులు కారు. భారతదేశానికి హిందువులు (ఆర్యులు), క్రైస్తవులు, ముస్లింలు ఒకరి తర్వాత ఒకరు వలస వచ్చారు. భారత ఉపఖండంపై మతాధిపత్య పోరు చేస్తున్నారు. వాస్తవానికి హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాలు ఒక్కటే. మొదట బలప్రయోగంతో, నేనే దేవుడిని అని ప్రచారం చేసుకునే వర్గం వైదిక మతం (హిందూ)గా ఏర్పడింది. అందుకే వామనుడు, రాముడు, కృష్ణుడు వంటి వారు మనుషులైనప్పటికీ తామే దేవుళ్ళుగా చెలామణి అయ్యారు.

ఆ తర్వాత మరొక వర్గం దేవుని కుమారుడుగా చెలామణి అయి ఆధిపత్యం సాగించింది. అదే క్రైస్తవ మతం. క్రీస్తు, దేవుని కుమారుడు కాదని, మహమ్మద్ ప్రవక్త, జీసస్‌లు దేవుని దూతలని ప్రచారం చేస్తూ ఇస్లాం మతం నడుస్తుంది. గణిత శాస్త్రంలోని సెట్ థియరీలో ఈ మూడు మతాలను ఇంటిగ్రేషన్ చేస్తే దేవుడనే ఒక కామనాలిటి వస్తుంది. అంటే ఒకరు తానే దేవునిగా, మరొకరు తాను దేవుని కుమారుడుగా, ఇంకొకరు దేవుని దూతగా తమకు తామే అభివర్ణించుకుంటున్నారు.

ఈ మూడు మతాలు ఒకే తాత్విక పునాదిపై ఉన్నందున ఫూలే, అంబేద్కర్, పెరియార్ వంటి దేశీయ మేధావులు వాటిని నిరాకరించారు. బుద్ధుడు, దేవుడిని నమ్మనందున, కొంతవరకు శాస్త్రీయ ప్రాతిపదికపై ఏర్పడ్డ బౌద్ధంలోకి అంబేద్కర్ వెళ్ళారు. నిజానికి బౌద్ధం ఒక మతం కాదు. అది ఒక శాస్త్రీయ జీవన విధానం. అందుకే బౌద్ధాన్ని పాటించకున్నా బుద్ధుడిని అభిమానించని వాళ్ళు ఎవరూ ఉండరు. కాబట్టి ఈ దేశానికి భగవంతుణ్ణి నమ్మే రాముడు, క్రీస్తు, మహమ్మద్ కంటే దేవుడిని నమ్మని బుద్ధుని అవసరం ఎంతైనా ఉంది.

ఒకనాడు వేలాది గిరిజన మతాచారాలు ఉంటే నేడు వాటిని మింగిన మతాలు మాత్రమే విశ్వవ్యాప్తమైనవి. కారణాలు ఏమైనప్పటికీ గిరిజన మతాచారాలు ధ్వంసమయ్యాయి. మత వైవిధ్య ప్రపంచానికి బదులు ఏక మతం ఉపాసన వైపు వెళ్ళడం పూర్తిగా ఒక ఆధునిక ధోరణి మాత్రమే. దైవ భావనను రివైవల్ చేసిన ఆధునికాంతర వాదం (ఞౌట్టఝౌఛ్ఛీటnజీటఝ) విభేదీకరణను, వైవిధ్యతను కోరుకుంటే దేవుని అనుచరులు మాత్రం ఏకమతం ప్రపంచంలోకి రావాలని ఎవరికి వారే కోరుకోవడం మూలంగా మతాల మధ్య వైరుధ్యం, పోటీ అనివార్యమైంది. అందుకే మతం పేరు మీద మారణ హోమాలు, టెర్రరిజాలు పుట్టుకొచ్చాయి. దేవుడు చస్తే తప్ప ఈ దాష్టీకాలు ఆగవు.

సజాతీయ మూలవాసులు తమ సమాజంలో జీవించిన గొప్ప వ్యక్తులను, తమ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆరాధించారే తప్ప ఏనాడూ ఒక నిర్దిష్టమైన మతాన్ని ఏర్పరచుకోలేదు. కాబట్టి ఈ మూల వాసుల్లో చాలా మంది మొదట పరిచయమైన హిందూ మతమే తమ మతమనే భ్రమలో ఉన్నారు. మరికొందరు ఈ హిందూ మతంలో సమానత్వం లేదని, ఇస్లాం, క్రైస్తవంలోకి వెళుతున్నారు. మూలవాసుల ఆరాధన అత్యంత శాస్త్రీయమైనప్పటికీ ఈ మూడు మతాలు వాటిని గుర్తించడం లేదు.

మూలవాసుల బిడ్డలు అయిన పోచమ్మను వైద్యురాలిగా, మైసమ్మను ట్యాంకు నిర్మాణ ఇంజనీర్‌గా, దుర్గమ్మను ఒక కన్‌స్ట్రక్టివ్ ఇంజనీర్‌గా, మల్లన్నని గొంగడి సృష్టికర్తగా, మార్కండేయుని వస్త్ర నిర్మాణ వేత్తగా, సమ్మక్క- సారక్కలను ధర్మపోరాట యోధులుగా ఏ మతమూ గుర్తించడం లేదు. హిందూ పూజారి వర్గం అయిన బ్రాహ్మణులు వీరిని క్షుద్ర దేవతలుగా, క్రైస్తవ, ఇస్లాం పూజారులు సైతానులుగా పరిగణిస్తున్నారు. ఇది పూర్తిగా అశాస్త్రీయం, అనైతికం. శూద్రులైన మూలవాసులకు చదువు నిరాకరించడం వల్ల శాస్త్రీయత కోల్పోయిన మూల వాసులు తమ శాస్త్రకారుల్ని దేవుళ్ళుగా పరిగణించేటట్లు చేసింది హిందూ మతం.

అసలు వాళ్ళు దేవుళ్ళు కారు దయ్యాలని చెబుతున్నవి క్రైస్తవ, ఇస్లాం మతాలు. స్థూలంగా చెప్పాలంటే వైజ్ఞానిక శాస్త్రాన్ని దైవంగా, దైవాన్ని దయ్యంగా మార్చింది ఈ మూడు మతాలే. కాబట్టే సింధూ నాగరికతలో అభివృద్ధిచెందిన భారతీయ శాస్త్ర విజ్ఞానం హిందూ, క్రైస్తవ, ఇస్లాం మతాల వల్లే శిథిలావస్థకు చేరుకుంది. జ్ఞాన వికాసం ద్వారా దేవుడిని చంపిన పాశ్చాత్య దేశాల్లో సైన్స్ అభివృద్ధి చెందింది. దేవుని ఉనికినే ప్రశ్నించిన బుద్ధుడిని భారతదేశంలో లేకుండా చేశారు.

దేవుడు, శాస్త్రీయత రెండూ పూర్తిగా విరుద్ధ భావాలు. ఈ మూడు మతాల పవిత్ర గ్రంథాలు మానవుడు దేవుని సృష్టియని నమ్మితే.. వాటిని కూలదోస్తూ డార్విన్ మానవుడు కోతి నుంచి ఆవిర్భవించాడని శాస్త్రీయంగా నిరూపించాడు. అందుకే మతాలను పునరుజ్జీవం చేయాలని తహతహలాడుతున్న వారందరికీ చెబుతున్నాను-మీ పిల్లలను అడగండి మనిషి ఆవిర్భావం ఎక్కడి నుంచి అని. వారి పాఠ్య గ్రంథాల్లో ఏమి రాసివుందని? బడిలో, మనిషి పుట్టుక కోతి నుంచి అని; ఇంట్లో, మత ఛాందస వాదులు మనిషి దేవుని సృష్టి అని చెబుతుంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? ఈ ద్వంద్వ విధాన దందా ఎందుకు? ఇందులో ఏ కుట్ర దాగి లేదంటే నమ్మేది ఎలా?

శంభూకుడి వధ, ఒక దేవుని వల్లే, కోపర్నికస్ తల్లికి కడుపుకోత ఒక దేవుని కుమారుని వల్లే. హిందూ మతంలో దేవుడే స్వయంగా చంపితే, కిరస్థానంలో దేవుని కొడుకులు చంపుతారు. జిహాద్ పేరిట దేవుడి కోసం ముస్లింలు చస్తారు. శాంతికాముకులైతే చావులెందుకు? కుటిల నీతి లేకుంటే క్రూసేడులెందుకు? మతం శాంతిని బోధిస్తుందంటే నమ్మేది ఎట్లా?

కిందనున్న ప్రజలు మీదికి రాకుండా ఉండేందుకే కిందా మీదా లేని దేవుళ్ళను మనుషుల మధ్యకు పట్టుకొచ్చారు. మూల వాసుల చరిత్రల్ని ముక్కలు చేశారు. ఎక్కడో చనిపోయిన ఆసన్, ఉస్సేన్‌ల అమరత్వానికి, త్యాగానికి పీర్ల పండుగను శూద్రులైన మూలవాసులు చేస్తుంటే బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరిపిన క్రీస్తును చారిత్రక పురుషుడని నమ్మి బర్త్‌డేలు చేస్తుంటే, ఆర్యుల కుట్రలో చనిపోయి చిరంజీవి అయిన బలి చక్రవర్తి గురించి ఇస్లాం, క్రైస్తవం మౌనంగా ఉండటం ధర్మమా? చంపింది మన తమ్ముడే.. చప్పుడు చేయకుండా ఉండు అన్న చందంగా ఉంది ఈ ముగ్గురి మౌనం. ధర్మాన్ని ధైర్యంగా మాట్లాడలేని, శాస్త్రీయ అవగాహన లేని మతాలు ఎలా మనగులుగుతాయి?

ఐలయ్య అన్నట్లు హిందూ మతం చనిపోతే, పోస్ట్ క్రిస్టియానిటీ ఇండియా, పోస్ట్ ఇస్లాం ఇండియా వంటి గ్రంథాలు వస్తాయో, రావో కాని ప్రపంచవ్యాప్తంగా పోస్ట్ గాడ్ వరల్డ్ అనే పుస్తకం హాట్‌కేకులా అమ్ముడుపోయే రోజు అతి దగ్గరలో ఉంది. కాబట్టి అరవిందరావు వంటి వాళ్ళు ఆత్మ విమర్శ, అంతర్యుద్ధాలను పక్కకు పెట్టి అసలు యుద్ధం చేయాలే కానీ ఏ మాత్రం శాస్త్రీయ దృక్పథం, మెథడాలజీ లేని ఉపనిషత్తులను వక్కాణించరాదు.

- భీనవేణి
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓ.యూ. సోషియాలజీ విభాగం 
Andhra Jyothi News Paper Dated 1/2/2012 

No comments:

Post a Comment