Sunday, February 26, 2012

నిద్రపో, హైమన్‌డార్ఫ్!


ఆదివాసుల జీవితాలపై చెరగని ముద్ర వేసిన గొప్ప గిరిజన అధ్యయన వేత్త హైమన్‌డార్ఫ్ చితా భస్మాన్ని ఆయన కుమారుడు లచ్చు పటేల్ ఆదిలాబాద్ జిల్లాలోని మార్లవాయి గ్రామానికి తీసుకు రావడం, స్థానిక గిరిజనులు సమాధి చేయడం ఉద్వేగభరిత సన్నివేశం. తెలంగాణ గడ్డతో జీవితం పెనవేసుకున్న అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల్లో హైమన్‌డార్ఫ్ ఒకరు. తెలంగాణ సమాజ స్మృతి ఫలకంపై హైమన్‌డార్ఫ్ స్థానం చెక్కుచెదరనిది. పరిశోధనకే పరిమితమై పోకుండా,గిరిజనుల శ్రేయోభివృద్ధికి పాటుపడిన మహనీయుడు హైమన్‌డార్ఫ్.ఈశాన్య ప్రాంత గిరిజనులపై మొదట అధ్యయనం సాగించిన హైమన్‌డార్ఫ్ ఆ తరువాత తెలంగాణకు వచ్చారు. మధ్యలో నేపాల్ వెళ్ళి కూడా అధ్యయనాలు జరిపారు. దాదాపు డజను గిరిజన జాతులపై ఆయన పరిశోధన సాగింది. ఈ పరిశోధన ఎంత విస్తారమైనదైనా ఆయనకు జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చింది మాత్రం తెలంగాణలోని - నాటి హైదరాబాద్ రాజ్యంలోని - గిరిజనుల మధ్య సాగించిన కృషి. 

ఇరవయవ శతాబ్ది ద్వితీయార్ధం ప్రారంభానికి ముందే గిరిజనుల అధ్యయనం కొత్త పుంతలు తొక్కినప్పుడు దానిని అందిపుచ్చుకుని మరింత ముందుకు తీసుకుపోయిన ఘనత హైమన్‌డార్ఫ్‌ది. భారత దేశం పట్ల ఆసక్తి గల హైమన్‌డార్ఫ్‌కు ఆగ్నేయాసియా గిరిజనుల జాతులపై అధ్యయనానికి ఆద్యుడైన గెల్డెర్న్ స్ఫూర్తినిచ్చారు. ఆనాడు గిరిజన అధ్యయన విధానాలను మలుపు తిప్పిన పరిశోధకుడిగా మొదట బ్రానిస్లా్ మాలినోవ్‌స్కీని చెప్పుకోవాలె. గిరిజనుల అధ్యయనం గదిలో కూర్చుండి జరిపేది కాదని, ఎవరిపైనైతే అధ్యయనం సాగిస్తున్నామో, వారి మధ్య చేరి రోజువారీ జీవన శైలిని క్షేత్ర స్థాయిలో పరిశీలించాలనేవాడు మాలినోవ్‌స్కీ. ఆయనది అనుభవైక అధ్యయనం. హైమన్‌డార్ఫ్ ఈ మాలినోవ్‌స్కీ బోధనలు వినడానికే అమెరికా నుంచి లండన్‌కు మకాం మార్చాడు. హైమన్‌డార్ఫ్ క్షేత్ర పర్యటనలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ గిరిజనుల భాష నేర్చుకోని తీరాలని భావించారాయన. 

గిరిజనుల పట్ల అనురాగం, పరిశోధన పట్ల ఆపేక్ష, అందుకు తగిన శ్రమైక జీవనం, కఠిన క్రమశిక్షణ హైమన్‌డార్ఫ్‌ను ఉన్నత స్థాయి పరిశోధకునిగా, మహోన్నత మానవునిగా నిలబెట్టాయి. ఆయన ప్రచురించింది తన పరిశోధనలో కొంత భాగమే. వేల కొద్ది పేజీల క్షేత్ర పర్యటన నోట్స్. గిరిజన సంస్కృతిని శాశ్వతంగా నమోదు చేసే వేలకొద్ది ఫోటోలు. చిత్రీకరణలు, చేసిన మాటలు, సేకరించిన అనేక గిరిజన కళా ఖండాలు- ఆయన చెప్పదలుచుకున్నది, ప్రపంచానికి వినిపించాలంటే- వీటన్నిటిపై అనేక అధ్యయనాలు జరగాలె. గిరిజన సమాజాల తాత్విక భావజాలాన్ని కూడా ఆయన మూటకట్టి పెట్టాడు. హైమన్‌డార్ఫ్ కొంతకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బోధన సాగించి లండన్‌లోని ప్రాచ్య, ఆఫ్రికా అధ్యయన సంస్థలో చేరారు. ఆయన పరిశోధనలన్నీ అక్కడే భద్రంగా ఉన్నాయి.

హైమన్‌డార్ఫ్ పరిశోధన, సేవ తెలంగాణతో విచివూతమైన రీతిలో ముడిపడింది. ఆయన భారతదేశంలో అధ్యయనానికి వచ్చినప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. జర్మనీ పాస్‌పోర్టుతో ఇక్కడికి రావడంతో, ఆయనను నిర్బంధించాల్సి ఉంది. కానీ బ్రిటిష్ అధికారులు ఈ పరిశోధకుడిని నిర్బంధించకుండా హైదరాబాద్ రాజ్యానికి పరిమితం చేశారు. అయితే అనుమతి లభించగానే నేపాల్ వెళ్ళి అక్కడ అధ్యయనాలు సాగించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే నిజాం ప్రభుత్వం హైమన్‌డార్ఫ్‌ను పిలిపించి గిరిజనుల, వెనుకబడిన తరగతుల సలహాదారుగా నియమించింది. అప్పటికే గోండుల తిరుగుబాటు వచ్చినందున, ఇక్కడి గిరిజనులపై అధ్యయనం చేసి, అభివృద్ధి చర్యలు సూచించే బాధ్యత హైమన్‌డార్ఫ్‌కు నిజాం ప్రభుత్వం అప్పగించింది. గిరిజనుల సంస్కృతిని, జీవన విధానాన్ని పరిరక్షిస్తూ వారి అభివృద్ధికి తోడ్పడే విధానాలు రూపొందించడం హైమన్‌డార్ఫ్ ఆదిలాబాద్ జిల్లాలో చేసిన చూపిన గొప్ప ప్రయోగం. కేస్లాపూర్ జాతర సందర్భంగా గిరిజనుల వద్దకే ప్రభుత్వం వెళ్ళడమనేది వినూత్న సూచన. 1943లోనే నిజాం కాలంలో గిరిజనుల విద్యా బోధనా పథకాన్ని రూపొందించి బలమైన పునాది వేశారు. గోండు భాషలోనే విద్యాబోధన సాగించే గోండు ఉపాధ్యాయులను, గోండు ఉద్యోగులను తయారు చేయడానికి శిక్షణా కేంద్రాన్ని, దాదాపు వంద పాఠశాలలను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఆనాడు మొదటి తరం గోండు విద్యావంతులు, ఉద్యోగస్థులు రూపొందారు! 

హైమన్‌డార్ఫ్ గిరిజనులపై అధ్యయనాన్ని సాగిస్తున్న సమయంలోనే తన సహ కార్యకర్త ఎలిజబెత్‌ను వివాహం చేసుకున్నారు. గిరిజనులు ఆమెను ప్రేమగా బెట్టీ అని పిలుచుకునేవారు. తెలంగాణలో పరిశోధన అనంతరం హైమన్‌డార్ఫ్ దంపతులు లండన్‌లో గడిపారు. అయినా ఇక్కడి గిరిజనులతో వారి అనుబంధం పెనవేసుకునే ఉన్నది. 1969 ఉద్యమం నాడే తెలంగాణ ఏర్పడి ఉంటే, మళ్ళీ హైమన్‌డార్ఫ్ దంపతులను సాదరంగా ఆహ్వానించి సేవలు ఉపయోగించుకునేవారం. కానీ తెలంగాణ క్షోభిస్తున్న సమయంలో, బెట్టీ హైదరాబాద్‌లో మరణించారు. ఈ దంపతులు ఒకప్పుడు గడిపిన ఆదిలాబాద్ జిల్లాలోని మార్లవాయి గ్రామం వద్దనే ఆమెను సమాధి చేశారు. హైమన్‌డార్ఫ్ బతికి ఉన్నప్పుడే ఆయన కోరిన ప్రకారం భార్య సమాధి పక్కన ఆయన సమాధి కూడా నిర్మించి పెట్టారు. భార్య మరణించిన తరువాత ఆయన క్రమంగా కుంగి కృశించారు. క్షేత్ర పర్యటనల్లో కఠోర శ్రమతో పరిశోధనలు చేసిన హైమన్‌డార్ఫ్ 1995లో శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు. ఇన్నాళ్ళకు ఆయన చితా భస్మం ఆదిలాబాద్ గిరిజనుల మధ్యకు చేరింది. ఏ గిరిజనుల ఆప్యాయతను చూరగొని అన్యోన్యంగా గడిపారో వారి మధ్యనే హైమన్‌డార్ఫ్ దంపతులు శాశ్వత నిద్రకు ఉపక్షికమించారు. ఆ గిరిజనులే హైమన్‌డార్ఫ్ దంపతులకు గుండెల్లో గూడు కట్టి జోకొడుతున్నారు.
Namasete Telangana News Paper Dated : 27/02/2012   (Sampadakiyam )

No comments:

Post a Comment