Tuesday, February 7, 2012

బ్రాహ్మణ ధర్మమూ పరాయిదే - దొమ్మటి ప్రవీణ్‌కుమార్


'హిందూ మతానంతర భారతదేశం' అని కంచ ఐలయ్య రాసిన పుస్తకం మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చానల్‌లో మొదటిసారి చర్చ జరిగింది. ఆ చర్చ జరిగిన తర్వాత రిటైర్డ్ డిజిపి అరవిందరావు ఆంధ్రజ్యోతిలో సుదీర్ఘ వ్యాసం రాశారు. హిందూమతం విశిష్టతను తెలిపే ఉపనిషత్తులు, ఇతర పవిత్ర గ్రంథాల ప్రాముఖ్యాన్ని ప్రచారం చేసే బాధ్యతను హిందూమత పీఠాధిపతులు విస్మరిస్తున్నారని అరవిందరావు ఆవేదన చెందారు. హిందూమత పునరుద్ధరణకు ఆయన అనేక సూచనలు చేశారు. 

ప్రాక్సీ యుద్ధం అనే మిల్ట్రీ భావనను మేధో రంగానికి వర్తింపచేసి కంచ ఐలయ్యను దేశద్రోహిగా చిత్రించే ప్రయత్నం చేశారు. డిజిపి హోదాలో అనేక సంవత్సరాల పాటు అరవిందరావు పనిచేశారు. రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను ఆయన గుర్తించ నిరాకరిస్తున్నారు.అమెరికా జోక్యాన్ని ఐలయ్య కోరుతున్నాడని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించి, రాజద్రోహానికి పాల్పడుతున్నాడని అరవిందరావు ఆరోపించటమే చాలా విడ్డూరం. 

కుల, మత, లింగ, ప్రాంత, భాషాపరమైన వివక్ష లేకుండా భారత పౌరులందరికీ సమానంగా ఫండమెంటల్ రైట్స్ (మౌలిక హక్కులు) వర్తిస్తాయని రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16లు హామీ ఇస్తున్నాయి. కానీ, అరవిందరావు కులతత్వం, మతతత్వం వల్ల బ్రాహ్మణీయ అగ్రకులేతర పీడిత ప్రజలకు చట్టబద్ధమైన న్యాయం లభించలేదు. అంతేకాదు, ఆర్టికల్ 13 ప్రకారం రాజ్యాంగ హామీ ఇచ్చిన మౌలిక హక్కులకు భంగకరంగా ఉండే ఆచారాలు, సంప్రదాయాలు, విశ్వాసాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుక్షణం నుంచి రద్దు కావటమే కాదు చట్ట వ్యతిరేకం కూడా. 

వేదాలు, ఉపనిషత్తుల గొప్పదనం పేరుతో బ్రాహ్మణ మతాన్ని ఈ దేశం మీద రుద్దాలని అరవిందరావు వాదిస్తున్నారు. అంటే ఆయన రాజ్యాంగం గుర్తించిన రాజ్య వ్యవస్థకు, దాని ఆశయాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాజద్రోహం. అందుకే అరవిందరావు చేస్తున్న వాదనలన్నీ రాజ్యాంగ విరుద్ధమే కాదు మానవ జాతి మీద చేస్తున్న అత్యాచారం కూడా. కాబట్టి ఐలయ్య మీద అరవిందరావు చేస్తున్న ఆరోపణలన్నీ తన తప్పుల్ని కప్పి పుచ్చుకునేవే. 

హిందూ అనే మాట ఋగ్వేదంలో కాని ఆ తర్వాత అల్లిన ఇతర వేదాల్లో గానీ, చివరికి పురాణాలు, ఇతిహాసాలు, మనుధర్మం, భగవద్గీతలో గానీ ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఈ విషయం మీద అంబేద్కర్ 'విప్లవం, ప్రతివిప్లవం' అనే గ్రంథంలో ఆధారాలతో సహా నిరూపించారు. మనుధర్మం, భగవద్గీతలను పవిత్రమైనవిగా భావించే బ్రాహ్మణవాదులు సైతం హిందూ అనే పదాన్ని ఈ యురేషియన్ బ్రాహ్మణ సాహిత్యంలో చూపించగలరా? 

మొగలాయిలు ఇండియాను జయించిన తర్వాతే ఓడిన వాళ్లని పిలువడానికి హిందువులు అనే పేరు పెట్టారు. పర్షియా నుంచి దండెత్తి వచ్చిన మొగలాయిల కాలం నుండే హిందూ అనే శబ్దం కనబడుతుందని 'కుల నిర్మూలన గ్రంథం'లో బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నారు. అందుకే మధ్య యుగాల కాలంలో సైతం బ్రాహ్మణులు ఈ శబ్దా న్ని అంగీకరించలేదు. హిందూ అనే శబ్దానికి పరాజితులు, రంగు తక్కువ వాళ్లు, బానిసలు అనే అర్థం పర్షియన్ భాషలో ఉందనీ, అందుకే ఈ శబ్దా న్ని అంగీకరించమని దయానంద సరస్వతి నిరాకరించారు. ఆయన తను ఏర్పాటు చేసిన సమాజానికి ఆర్యసమాజం అని పేరు పెట్టడంలో ఒక ఆత్మగౌరం కనిపిస్తుంది. కాని, నేటి బ్రాహ్మణవాదులకు అది లేనట్టుంది. 

భావాల చరిత్రను గమనిస్తే హిందూ శబ్దం అనేది ఒక రాజకీయ వ్యవహారమని తేలుతుంది. వలస పాలన కాలంలో మాత్రమే బ్రాహ్మణులు ఈ శబ్దాన్ని అంగీకరించారు. ఈస్టిండియా కంపెనీలో విద్యా, ఉద్యోగ అవకాశాలు కొట్టేయడానికీ, అటు తర్వాత బ్రిటీషు ప్రభుత్వం కల్పించిన మతపరమైన ప్రాతినిధ్యం (కమ్యూనల్ రిప్రజెంటేషన్) అనే పద్ధతి ద్వారా చట్టసభలను ఆక్రమించుకోవాలని ఆలోచించారు. అందుకే అప్పటి దాకా హిందూ శబ్దాన్ని అంగీకరించని వారు మేమే హిందువులం అని దబాయించారు. 

బ్రిటీషు వారిని అనేక విధాల ప్రభావితం చేశారు. కాని, వయోజన ఓటు హక్కు అనేది అన్ని కులాలకు బ్రిటీషు వాళ్లు ఇవ్వాలని నిర్ణయించగానే అస్పృశ్యులు, శూద్రులు, ఆదివాసులను కూడా హిందువులనే భావన కిందికి తెచ్చారు. ఈ విషయం మీద గాంధీకి అంబేద్కర్‌కు మధ్య జరిగిన తీవ్రమైన చర్చ, రౌండ్ టేబుల్ సమావేశాల్లో వారి మధ్య తలెత్తిన సంఘర్షణను నేడు గుర్తు చేసుకోవాలి. 

బ్రాహ్మణులు అల్పసంఖ్యాకులని, కాని వారే ఈ దేశ సామాజిక వ్యవస్థను శాసిస్తున్నారని, అల్పసంఖ్యాకులైన బ్రాహ్మణులు బహు సంఖ్యాకులు కావడానికీ, దేశ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి తయారు చేసిన శబ్దమే హిందువు, హిందూ మతమని కాన్షీరాం విశ్లేషించారు. హిందువులమని భ్రమిస్తున్న అగ్రకులాలతో పాటు బిసి కులాలు కంచ ఐలయ్య మీద కత్తిగడుతున్నాయి. అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నాయి. 

బ్రాహ్మణులు విదేశీయులని ఏబిఎన్ చానల్‌లో ఒక బహుజన మేధావి డా.జిలుకర శ్రీనివాస్ వాదిస్తే, దాన్ని పరిపూర్ణాంద స్వామి ఖండించారు. సింధూ నది మొదలుకొని కన్యాకుమారి వరకూ ఉన్నదంతా, హిందూ దేశమే అని వాదించారు. ఇక్కడే ఫూలే, పెరియార్‌ల వాదనలను గుర్తుచేసుకోవాలి. ఇరాన్ అనే దానికి వికృత రూపమే ఆర్యాన్ అని ఫూలే అన్నారు. అందువల్ల బ్రాహ్మణ, వైశ్యులు ఆర్యులని, వాళ్లు మధ్యాసియా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లని ఆయన అన్నారు. అంటే బ్రాహ్మణులు విదేశీయులు. 

ప్రపంచ ప్రామాణికమైన జినోమ్ ప్రాజెక్ట్ పరిధిలో బ్రాహ్మణ, బనియాల మైటోకాండ్రియల్ డియన్ఏ నల్ల సముద్రం పక్కనున్న యురేషియా ప్రాం త ప్రజల డియన్ఏతో పోల్చితే వందశాతం సరిపోలింది. కాని, ఎస్టీ, ఎస్టీ, బిసి, మతం మార్చి అల్పసంఖ్యాకుల డియన్ఎతో పోల్చితే ఒక్క శాతం కూడా సరిపోలటం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మతం మారిన అల్ప సంఖ్యాకులు ఈ దేశ అసలైన భూమి పుత్రులనీ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు విదేశీయులని జన్యు పరిశోధనల వల్ల నిర్ధారణ జరిగి పదకొండేళ్లు అవుతుంది. 

భగవద్గీత, మనుధర్మం, వేదాలు, ఉపనిషత్తులు ఆర్య బ్రాహ్మణ మత పవిత్ర గ్రంథాలు అందులో అనుమానం లేదు. కాబట్టి, డియన్ఏ పరిశోధన ప్రకారం బ్రాహ్మణ, వైశ్యులు విదేశీయులైతే వారి మతం కూడా విదేశీయమైనదే. ఇస్లాం, క్రైస్తవం విదేశీ మతాలని అంగీకరిస్తే, బ్రాహ్మణ మతం కూడా విదేశీ మతమే అవుతుంది. హిందూ మతం పేరుతో బ్రాహ్మణ ధర్మాల్ని కాపాడాలని చేసే ఏ వాదనైనా అది రాజ్యాంగ ద్రోహం. అలాంటి వారిమీద చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. 

- దొమ్మటి ప్రవీణ్‌కుమార్
Andhra Jyothi News Paper Dated 08/02/2012 

No comments:

Post a Comment