Friday, February 10, 2012

ఎస్సీ సబ్‌ప్లాన్‌ అమలుపై ఎందుకింత నిర్లక్ష్యం ?



(సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు కె వరదరాజన్‌ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం జనవరి27న కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీని కలిసి ఎస్‌సిలకు జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయింపులు, ఎస్‌సి సబ్‌ ప్లాన్‌ (స్పెషల్‌ కంపోనెంట్‌ ప్లాన్‌) అమలు తీరు తదితర అంశాలపై ఒక మెమోరాండంను సమర్పించింది. ఈ ప్రతినిధి బృందంలో లోక్‌సభలో సిపిఎం పక్ష నాయకుడు వాసుదేవ్‌ ఆచార్య, పార్టీ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి. శ్రీనివాసరావు, సిపిఎం సభ్యులు విజూ కృష్ణన్‌, జి. మమత సభ్యులుగా ఉన్నారు. ఈ బృందం ఆర్థిక మంత్రికి అందజేసిన మెమోరాండంలోని ముఖ్యాంశాలను ఈ దిగువన ఇస్తున్నాము.)
షెడ్యూల్డ్‌ కులాలవారు ఎదుర్కొంటున్న దయనీయ స్థితిని, అనేక సంవత్సరాలుగా ఎస్‌సి సబ్‌ప్లాన్‌ (స్పెషల్‌ కంపోనెంట్‌ ప్లాన్‌)ను అమలులో నీరుగారుస్తున్న వైనాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. దేశం స్వాతంత్య్రం వచ్చి 64 ఏళ్లు గడచినా షెడ్యూల్డ్‌ కులాలు, తెగలు సామాజికంగా, ఆర్థికంగా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నాయి. మానవాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ వారు ఇప్పటికీ చాలా వెనకబడి ఉన్నారు. వారి పట్ల ఆర్థిక, సామాజిక వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎన్నో వాగ్దానాలు చేసినప్పటికీ, పథకాలు ప్రకటించినప్పటికీ వీరి జీవితాల్లో పెద్దగా పురోగతి లేదు. ఈ వాగ్దానాల్లో ఎక్కువ భాగం సరిగా అమలుకునోచుకోలేదు. దళితుల జీవన స్థితిగతులపై గణనీయమైన ప్రభావం చూపేది షెడ్యూల్డ్‌ కులాల సబ్‌ప్లాన్‌(స్పెషల్‌ కంపోనెంట్‌ ప్లాన్‌).
ఎస్‌సి సబ్‌ప్లాన్‌(ఎస్‌సిపి)- దాని అమలు:
ఎస్సీల అభివృద్ధి ఇంతగా నత్తనడకన సాగడానికి ప్రధాన కారణం మునుపటి ప్రణాళికల్లో తగినంత ఆర్థిక మద్దతు లభించకపోవడమేనని ఆరవ ప్రణాళిక స్పష్టంగా పేర్కొంది. దీనిని పరిష్కరించేందుకు అది సరి కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. దళితులు, దళితరేతరుల మధ్య అసమానతలను తగ్గించడం ఈ వ్యూహం ప్రధాన ధ్యేయంగా ఉంది. కొత్తగా చేపట్టిన షెడ్యూల్డ్‌ కులాల ప్రత్యేక కంపోనెంట్‌ ప్లాన్‌ (ఎస్‌సిపి)నిఅమలుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత గురించి ఇది నొక్కిచెప్పింది. తరువాత ఈ ఎస్‌సి కంపోనెంట్‌ ప్లాన్‌ని ఎస్‌సి సబ్‌ప్లాన్‌ (ఎస్‌సిఎస్‌పి)గా మార్చారు. జనాభాలో ఎస్సీల దామాషా ప్రాతిపదికన ఇతర అన్ని అభివృద్ధి రంగాల్లో వీరికి చెందాల్సిన నిధులనన్నిటినీ సులువుగా ఒక చోట చేర్చేందుకు, దళితులకుద్దేశించిన వివిధ పథకాల అమలును పర్యవేక్షించేందుకు వీలుగా ఈ ఎస్సీ సబ్‌ప్లాన్‌ను తెచ్చారు. దళితులకు ఆర్థికంగా, సాధికారత చేకూర్చే యంత్రాంగంగా ఇది ఉపయోగపడుతుందన్నారు. దళితులకు రాజ్యాంగం ఇచ్చిన హామీలు అమలు జరిగేలా చూడడంలో విధానపరమైన సాధనంగా ఇది ఉంటుందన్నారు. అయితే ఎస్‌ సబ్‌ప్లాన్‌ అమలు తీరు చాలా పేలవంగా వుంది. దీంతో దళితుల ఆకాంక్షలు నెరవేరలేదు. స్పెషల్‌ కంపోనెంట్‌ ప్లాన్‌ ప్రకారం దళితులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ పరంగా చేసే కేటాయింపులు, వ్యయం జనాభాలో వారి దామాషా ప్రాతిపదిక ప్రకారం కచ్చితంగా జరగాలి. అయితే ఎస్‌సిపి లేదా ఎస్‌సిఎస్‌పి అమలులోకి వచ్చాక ఈ నిబంధనను అనేక రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంలోని అనేక విభాగాలు ఘోరంగా ఉల్లంఘించాయి. 2006-07లో మొత్తం ప్రణాళికా కేటాయింపు రు. 1,65, 499 కోట్లు కాగా ఇందులో 4.25 శాతం, అంటే రు. 7,031.86 కోట్లు మాత్రమే దళితుల కోసం కేటాయించారు. 2007-08లో మొత్తం ప్రణాళికా బడ్జెట్‌ రు. 2,05,000 కోట్లు కాగా, ఇందులో దళితులకు కేటాయించింది 12,535.75 కోట్లు (6.1శాతం) మాత్రమే. నిజానికి రు.32, 816 కోట్లు కేటాయించాలి. అంటే, 2008-09లో సుమారు రు. 20280 కోట్లు తక్కువ కేటాయింపులు జరిపారు. 2008-09లో మొత్తం ప్రణాళికా పెట్టుబడి రు. 2,43,385.5 కోట్లు. ఈ నిబంధన ప్రకారం దళితులకు ఇందులో రు. 40,090 కోట్లు కేటాయించాల్సి వుండగా, ప్రభుత్వం కేవలం రు. 11,715.07 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే దళితుల సంక్షేమం కోసం కేటాయించాల్సిన మొత్తంలో 29 శాతం మాత్రమే కేటాయించిందన్నమాట. దళితులకు న్యాయంగా దక్కాల్సిన వాటాలో 71 శాతం మేర అంటే రు. 28,375.9 కోట్లు కోత పడింది. 2010-11లో మొత్తం ప్రణాళికా పెట్టుబడి రు.2, 84, 284 కోట్లు కాగా, ఇందులో కేవలం 8.4 శాతం అంటే రు. 23,795 కోట్లు మాత్రమే దళితుల సంక్షేమానికి కేటాయించారు. 2011-12లో మొత్తం ప్రణాళికా పెట్టుబడి రు. 3,40, 255 కోట్లు కాగా దళితుల కోసం ఎస్‌సిపి కింద రు.30,551 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే రు. 24,570 కోట్ల మేర కోతపెట్టారు. తొమ్మిదవ ప్రణాళికా కాలంలో, మొత్తం 62 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో 11 మాత్రమే ఎస్‌సిపిని అమలుచేశాయి. 2011-12లో 24 శాఖలు మాత్రమే దళితులకు నిధులు కేటాయించాయి. కేటాయించిందే తక్కువ, అందులోనూ వాస్తవికంగా ఖర్చు చేసింది మరీ తక్కువ.
అనేక రాష్ట్రాలు ఎస్‌సిఎస్‌పిని అమలు చేయలేదు. కొన్ని ఈ విధానాన్ని ఇటీవలే ప్రవేశపెట్టాయి. అనేక రాష్ట్రాల్లో ఎస్‌సిఎస్‌పి నిధులను ఇతర కార్యక్రమాలకు బదిలీ చేయడం జరుగుతోంది. నిధులను తక్కువగా ఖర్చుపెట్టడం, మురగబెట్టడం, దుర్వినియోగం చేయడం రివాజుగా మారింది. ఎస్‌సిఎస్‌పి కోసం ఉద్దేశించిన రు.744.354 కోట్ల నిధులను (2006-07 నుండి 2010-11మధ్య కాలానికి సంబంధించినవి) కామన్వెల్త్‌ గేమ్స్‌ తత్సంబంధిత కార్యక్రమాలకు మళ్లించిన సంఘటన ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. కొన్ని శాఖలు, విభాగాలు ఎస్‌సిఎస్‌పి, టిఎస్‌పిలను అమలు చేయకపోవడానికి సాకులు చెబుతున్నాయి. ప్రణాళికా సంఘం ముఖ్య సలహాదారు 2006లో సమర్పించిన నివేదికలో ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. జనాభా ప్రాతిపదికగా జరపాల్సిన స్థాయిలో ఎస్‌సిఎస్‌పి, టిఎస్‌పిలకు నిధులు కేటాయించడం లేదని పేర్కొన్నారు. ఇటువంటి బాధ్యతలు లేని మంత్రిత్వ శాఖలు, విభాగాల విషయంలో పునరాలోచించాలని ప్రణాళికా సంఘం 2010 నవంబర్‌లో సమర్పించిన నివేదికలో పేర్కొంది. దళితుల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకానికి ప్రధాన మంత్రి ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన (పిఎంఎజివై) అని పేరు పెట్టింది. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని గ్రామాలను ఇందుకోసం ఎంపిక చేసింది. 2010-11 బడ్జెట్‌లో రు.400 కోట్లు కేటాయించింది. ఆ తరువాత దానిని రు. 98 కోట్లకు కుదించింది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ రంగానికి సవరించిన బడ్జెట్‌లో నిధులను రు. 200 కోట్ల మేరకు కుదించింది. ఇదీ నిధుల కేటాయింపులో ప్రభుత్వాల తీరు. ఇది దళితులకు సమాన హక్కులను ఇవ్వ నిరాకరించే పరిస్థితికి దారి తీసింది. ఈ పరిస్థితుల్లో జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయింపు జరిగేలా చూడటం కేంద్ర ప్రభుత్వ బాధ్యత.
కొనసాగుతున్న కుల అణచివేత, అస్పృశ్యత, అసమానత్వం
ఎస్‌సి సబ్‌ప్లాన్‌(స్పెషల్‌ కంపోనెంట్‌ ప్లాన్‌) అమలును పలచన చేయడం దళితుల జీవితాలపై, వారి జీవన విధానాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎస్‌సి సబ్‌ప్లాన్‌ను సమర్ధవంతంగా అమలు చేయకపోవడం వల్ల దళితులు దారుణమైన పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. హుందాగా జీవించేందుకు అవసరమైన అత్యంత మౌలిక అవసరాలు వారికి అందుబాటులోకి రాకుండాపోతున్నాయి. వారు నివసిస్తున్న ప్రాంతాల్లో మంచినీరు, డ్రయినేజి వసతులు, టాయిలెట్లు, విద్యుచ్ఛక్తి, వీధిదీపాలు, రోడ్లు వంటి మౌలిక వసతులు కరువయ్యాయి. విద్యావసతులు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు, రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం అమలుకు నోచుకోవడం లేదు. 2000 సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్‌సి కుటుంబాల్లో మూడింట రెండొంతు కుటుంబాలు అసలు భూమి లేకుండానో, అత్యంత స్వల్పంగా భూమి కలిగివుండడమో జరుగుతోంది. షెడ్యూల్డ్‌ కులాలు, తెగయేతర కుటుంబాల్లో ఈ సంఖ్య మూడింట ఒక వంతు మాత్రమే ఉంది. ఎస్‌సి కుటుంబాల్లో మూడింట ఒక వంతు కంటే తక్కువ కుటుంబాలు మాత్రమే భూమి, గృహాలు వంటి మూలధన ఆస్తులు కలిగి ఉన్నాయి. ఎస్‌సి, ఎస్‌టి యేతర కుటుంబాల్లో 60 శాతం కుటుంబాలు ఇటువంటి ఆస్తులను కలిగి ఉన్నాయి. ఎస్‌సి, ఎస్‌టిల్లో సుమారు 60 శాతం కుటుంబాలు ఇప్పటికీ కూలినాలిపౖౖె ఆధారపడుతున్నాయి. ఎస్‌సి, ఎస్‌టియేతర కుటుంబాల్లో ఈ సంఖ్య నాల్గింట ఒక వంతు మాత్రమే ఉంది. షెడ్యూల్డ్‌ కులాల్లో 51.4 శాతం మంది వ్యవసాయ కార్మికులుగా ఉన్నారు. మిగిలినవారిలో ఈ శాతం 19 శాతం మాత్రమే ఉంది. (1999-2000 గణాంకాల ప్రకారం).2001 గణాంకాల ప్రకారం అక్షరాస్యతా శాతం 54.69 ఉంది. దళితుల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారి సంఖ్య 8.37 శాతం మాత్రమే ఉంది. ఇతరుల్లో ఇది 91.63 శాతం ఉంది. వారి ఆరోగ్య స్థాయిలో కూడా ఇటువంటి వ్యత్యాసాలే కనిపిస్తాయి. ఎస్‌సి మహిళల్లో రక్తహీనత, శిశుమరణాలు రేటు ఎస్‌సి, ఎస్‌టియేతరుల్లో కంటే ఎక్కువగా ఉంది. విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం మొదలైన సామాజిక సర్వీసులు, మార్కెట్‌, మార్కెట్‌యేతర లావాదేవీల్లో, రాజకీయాల్లో భాగస్వామ్యంలో ఈ వివక్షత సర్వసాధారణమైంది. వీటి ప్రభావం దళితుల పేదరిక స్థాయిలో ప్రతిబింబిస్తోంది. రిజర్వేషన్ల వల్ల పొందుతున్న ఉద్యోగాల కారణంగా దళితుల్లోని కొన్ని సెక్షన్లలో స్వల్ప మెరుగుదల కనిపిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆశించిన స్థాయి కంటే బాగా తక్కువగానే ఉంది. దళిత మహిళలపై వివక్షత మరీ దారుణంగా వుంది.
ఎస్‌సి సబ్‌ ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేయాలి
దళితులకు గౌరవప్రదమైన జీవన పరిస్థితులకు పూచీ కల్పించడంలో పేలవమైన రికార్డును అధిగమించేందుకు ఎస్‌సి సబ్‌ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయడం తక్షణావసరం. అయితే ఇందుకోసం కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించకుండా రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాలను అడ్డుకునే చట్టం ఏదీ లేదు. ప్రణాళికా సంఘం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తూనే ఉంది. అయితే వీటిని అనుసరించడం లేదు. ఎస్‌సిఎపి/టిఎస్‌పి పథకాల అమలును పర్యవేక్షిం చేందుకు కేంద్రంలో త్రైపాక్షిక కమిటీ ఉంది. అయితే అది సక్రమంగా పనిచేయడం లేదు. ఎస్‌సిఎస్‌పి, టిఎస్‌పి వార్షిక, పంచవర్ష ప్రణాళికల్లో అంతర్భాగం కావాలని ప్రధాని 2005 జూన్‌ 27న చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. సోనియా గాంధీ అధ్యక్షతన గల జాతీయ సలహా మండలి కూడా ఈ విషయమై ఇటీవల కొన్ని సిఫార్సులు చేసింది. ఈ పథకాలు, మార్గదర్శకాలు అమలు కావడం లేదని అనేక నివేదికలు అంగీకరిస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఆ పరిస్థితిలో మార్పు లేదు. కాబట్టి ఎస్‌సిఎస్‌పి, టిఎస్‌పి కేటాయింపులను ఇతర పథకాలకు మళ్లించకుండా సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలి. దీనిని నిరంతరం పర్యవేక్షించేందుకు అన్ని స్థాయిలో తగిన యంత్రాంగాన్ని రూపొందించాలి. పథకాలను, మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేయని రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వశాఖలు, విభాగాలు ప్రణాళికా కేటాయింపులు పొందకుండా నిషేధించే నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. ఈ మార్గదర్శకాలను సక్రమంగా అమలు జరిపితే పరిస్థితి మెరుగుపడి ఉండేది. పాలనాపరమైన చర్యలతోనే ఈ పథకాలను అమలు చేయడం సాధ్యం కాదు. అమలు ప్రక్రియలో లబ్ధిదారులు, ముఖ్యంగా అట్టడుగు స్థాయిలో ఉన్నవారిని భాగస్వాములను చేయాలి. ఈ పథకాలకు సంబంధించిన సమాచారం బహిరంగ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలి. సమస్యల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలి. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎలో మాదిరిగా సోషల్‌ ఆడిట్‌ వ్యవస్థను ప్రవేశపెట్టి పారదర్శకతను పెంపొందింపచేయాలి. నిధుల దుర్వినియోగం, మళ్లింపును అరికట్టాలి. ఏమైనా లోపాలుంటే పన్నెండవ పంచవర్ష ప్రణాళిక ముసాయిదా పత్రంలో సరిదిద్దాలి.
పరిష్కార మార్గాలివిగో
దళితులు, దళితయేతరుల మధ్య అసమానతలను సాధికారికతను విస్తరించడం, పటిష్టం చేయడం, సమాన హక్కులు కల్పించడం ద్వారా మాత్రమే తగ్గించవచ్చునని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ దిశగా ప్రభుత్వం ఈ కింది చర్యలను అత్యవసర ప్రాతిపదికగా తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం.
1. ఎస్‌పిఎస్‌పి, టిఎస్‌పిలకు దళితులు, గిరిజనుల జనాభా ప్రాతిపదికగా నిధులను కేటాయించేందుకు, వాటి సక్రమ వినియోగానికి తగిన కేంద్ర శాసనాన్ని తీసుకురావాలి. 2.ఎస్‌సిఎస్‌పి, టిఎస్‌పిను వార్షిక, పంచవర్ష ప్రణాళికల్లో అంతర్భాగంగా చేయాలి. ఈ నిధులను ఇతర అవసరాలలకు మళ్లించే అవకాశం లేకుండా, మురిగిపోకుండా తగిన నిబంధనలు రూపొందించాలి. లక్షిత పథకాలు ఎస్‌సి, ఎస్‌టి వ్యక్తులు, కుటుంబాలు, ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకురావాలి. 3.దళితుల స్థాయి, ఎస్‌పిఎస్‌పి, టిఎస్‌పిల అమలు జరుగుతున్న తీరుపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రచురించాలి. 4.ఎస్‌సి, ఎస్‌టిల సమస్యల గురించి చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేయాలి.
5. భూమి లేనివారికి భూమిని పంపిణీ చేయాలి. ఇందులో అత్యధికులు దళితులు, ఆదివాసీలే. 6. ప్రతి విభాగంలో, మంత్రిత్వశాఖల ప్రణాళికా పెట్టుబడిలో ప్రత్యేక ఖాతాలు ఏర్పాటుచేయాలి. ఎస్‌సి/ఎస్‌టి స్పెషల్‌ కంపోనెంట్‌ ప్లాన్‌ను పంచాయతీ, మున్సిపల్‌ బడ్జెట్‌లకు విస్తరించాలి.7. అన్ని విభాగాలను సమన్వయపరిచేందుకు, పర్యవేక్షించేందుకు నోడల్‌ ఏజెన్సీలను ఏర్పాటు చేయాలి. 8.ఎస్‌సిఎస్‌పి అమలును పటిష్టంగా పర్యవేక్షించాలి. జిల్లా స్థాయిలో ప్రత్యేకాధికారిని నియమించాలి.వారికి మెజిస్ట్రేట్‌ అధికారాలు కల్పించాలి.9. ప్రతి సంవత్సరం సోషల్‌ ఆడిట్‌ చేయించాలి. నిర్దిష్ట కాలపరిమితిలోగా సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలి. 10. ప్రణాళికా సంఘం పర్యవేక్షణలో సామాజిక న్యాయ విభాగాన్ని ఏర్పాటుచేయాలి. 11.దళిత మహిళలపట్ల సమాన థృక్పథంతో వ్యవహరించాలి. అన్ని పథకాల్లో ప్రత్యేక పథకాలను రూపొందించి ప్రత్యేక కంపోనెంట్‌ ప్రణాళిక కింద అమలుచేయాలి.దేవదాసీ వ్యవస్థను రద్దు చేయాలి. వారికి తగు జాగ్రత్తలు తీసుకుని పునరావాసం కల్పించాలి. 12.ఎస్‌సి, ఎస్‌టి బాలబాలికలకు మరింత ఎక్కువ స్థాయిలో రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటుచేయాలి. 13.స్పెషల్‌ కంపోనెంట్‌ ప్రణాళిక అనే పదాన్ని సబ్‌ప్లాన్‌ స్థానంలో పునరుద్ధరించాలి. ఎస్‌సి సబ్‌ప్లాన్‌ అమలుకు సంబంధించిన అన్ని సమస్యలను మీరు గ్రహించి సమస్యలను పరిష్కరించేందుకు తక్షణం చర్యలు తీసుకోగలరని ఆశిస్తున్నాం. రానున్న బడ్జెట్‌లో దళితుల అభ్యున్నతికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత చూపాలి.షెడ్యూల్డ్‌ కులాల సబ్‌ప్లాన్‌(స్పెషల్‌ కంపోనెంట్‌ ప్లాన్‌) సక్రంగా అమలు జరిగేందుకు చర్యలు తీసుకోవాలి. 
-prajasakti
P

No comments:

Post a Comment