Saturday, February 25, 2012

నిజాం బహుజన పక్షపాతా?--కదిరె కృష్ణ

నిజాం బహుజన పక్షపాతా?

ఆంధ్ర జ్యోతిలో ఏప్రిల్ 11వ తేదీన 'నిజాం సరే, అరసం నిరంకుశత్వం మాటేమిటి?' అనే పేర జిలుకర శ్రీనివాస్ రాసిన వ్యాసం చదివాను. శ్రీనివాస్ కొందరి మెహర్బా నీ కోసం రాసినట్టనిపించిందే తప్ప, నిష్పక్షపాత ధోరణి లేదనిపించింది. తెలంగాణ చరిత్ర పట్ల, అరసం వైఖరి పట్ల శ్రీనివాస్ అభిప్రాయాలు, మార్క్సిస్టు మూలసూత్రాలపై శ్రీనివాస్ నిబద్ధతపై నాకెలాంటి సందేహాలు, విభేదాలు లేవు. సమస్యంతా 'బహుజనులను లేదా ఈ దేశ మూలవాసులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలను నిజాముకు భక్తులుగా మార్చే ప్రయత్నమే. బహుజనుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా నిజాం పరిపాలన సాగినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడమే'. నిజాం గొప్పవాడు కావచ్చునేమో కానీ బహుజన పక్షపాతి మాత్రం కాదు.

అయితే నిజామంటే ఎన్నవ నిజామనే ప్రశ్న దాగున్నదని గమనించాలి. మహాత్మా జ్యోతిరావు పూలే, నిజాం పాలనను ప్రశంసించాడని శ్రీనివాస్ రాశాడు. కానీ ఎన్నవ నిజామో చెప్పలేదు. ఏ ఒక్క నిజామో కొంత మేలురకంగా పాలిస్తే, అందరు నిజాముల పాలన అదే విధంగా సాగిందనుకోవ డం పొరపాటు. చరిత్ర పునర్మూల్యాంకనము మంచిదే. రంగులు అద్దడమే ఘోరం. నిజాం పాలకులు మొత్తం ఏడుగురు. ఫూలే (1827-1890) సమకాలికులు అఫ్జలుద్దౌలా బహదూర్ (1857- 1869) ఐదవ నిజాం, మిర్ మహబూద్ అలీఖాన్ (1869- 1911) ఆరవ నిజాం. వీరిది మెరుగైన పాలనే అయి ఉండవచ్చు. 

తెలంగాణలో ఊచకోతకు, దుశ్చర్యలకు కారకుడైన ఏడో నిజాం మిర్ ఉస్మా న్ అలీఖాన్ (1911- 1948)కు ఫూలేకు కాల సంబంధమే లేదు. నిజాములందరినీ ఒకే గాటన కట్టలేము. ఏడో నిజాం ప్రత్యక్ష, పరోక్ష పాలనలో మిక్కిలి హింసకు గురైంది బహుజనులే. గ్రామాల్లో భూస్వాములు, జాగీర్దారులు, పట్వారీ, కరణాలు, పెత్తందార్లు ఏనాడూ ఊరొదిలి పారిపోలేదు. రజాకార్ల దుశ్చర్యలకు భయపడి పారిపోయి తలదాచుకున్నదీ, మానాలు, ప్రాణాలు పోగొట్టుకున్నదీ బహుజనులే. భూస్వాముల, పెత్తందార్ల దోపిడి, దురన్యాయాలకు ఏడవ నిజాం తప్పక బాధ్యుడే. 

అదే సందర్భంలో కమ్యూనిస్టులూ బాధ్యులే. వేల లక్షల ఎకరాల భూమి ఆధిపత్య కులాల చేతిలో పెట్టి వెట్టి చాకిరిని బహుజనుల మెడకు చుట్టిందెవరు? నిజాం నవాబులైనా, బ్రిటిష్‌వారైనా , సంప్రదాయ కులస్తులైనా ఆర్యసంతతివారే. పాలకపక్షాల వారే. పాలకుల స్వభావం హింసేనని శ్రీనివాస్‌కు ఎరుకలేదనుకోను. నిజాం ప్రత్యక్ష పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దేశంలో ఎక్కడా లేని ప్రాధాన్యం ఉండేదని శ్రీనివాస్ వ్యాఖ్యానం. ఇందుకు ఉదాహరణ భాగ్యరెడ్డి వర్మ విద్యా శాఖ మంత్రిగా నియమించబడ్డారని ధృవీకరించడం. 

ఇది ముమ్మాటికీ అబద్దం. నూటికి నూరు పాళ్ళు తప్పుడు చరిత్ర. శ్రీనివాస్ భాషలో చారిత్రక అజ్ఞానం. నిజానికి భాగ్యరెడ్డి వర్మ నిజాం పాలనలో ఏ పదవీ పొందలేదు. విద్యాశాఖ మంత్రి ఎట్లయ్యారో, చరిత్రలో ఏ పేజీలో ఉందో చెబితే బాగుండేది. ఒక్కరో ఇద్దరో పదవులు పొందితే పొందవచ్చు. అంతమాత్రాన దేశంలోనే అధిక ప్రాధాన్యం ఉందని వర్ణించడం చరిత్రను తప్పుగా వ్యాఖ్యానించడం కాదా? సంప్రదాయ వర్గ పార్టీలైన కాంగ్రెస్ బిజెపిలు ఏ కొద్దిమందికో పదవులు అంటగట్టి బహుజనోద్ధారకులమంటే ఒప్పుకుంటామా? 

1947 డిసెంబర్ 17న బి.ఎస్.వెంకట్రావ్ విద్యాశాఖ మంత్రిగా నియమించబడ్డారు. 1940లో జాతీయ స్థాయి పరిణామాల నేపథ్యంలో బాబాసాహెబ్ జాతీయ రాజకీయాల్లో తలమునకలైన కారణంగా హైదరాబాద్ దళితోద్య మం, నాయకగణ విభేదాలు తారస్థాయికి చేరడం మూలం గా రెండు ముక్కలైంది. ఒకటి ముస్లిం అనుకూల వర్గమైన బి.ఎస్. వెంకట్రావ్ నాయకత్వంలోని డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ (డిసిఎ) కాగా, రెండవది జె.హెచ్.సుబ్బయ్య సారథ్యంలోని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు అనుకూలమైన షెడ్యూల్డు క్యాస్ట్స్ ఫెడరేషన్(ఎస్.సి.ఎఫ్.). అంబేద్కర్‌కు మద్దతు ఇస్తున్న షెడ్యూల్డు క్యాస్ట్స్ ఫెడరేషన్‌ను బలహీనపరిచే నిజాం ఎత్తుగడల ఫలితమే బి.ఎస్.వెంకట్రావ్, శ్యాం సుందర్‌లను వరించిన వివిధ పదవులు. 

ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావించడం అవసరమనుకుంటున్నాను. 1947 జూలై 29న హైదరాబాద్ ఇండెపెండెన్స్‌డేను జరుపుకున్నారు. ఈ ఉత్సవం బి.ఎస్.వెంకట్రావ్ ఇంటి వద్ద జరిగింది. ఈ కార్యక్రమానికి కాసీం రజ్వీ హాజరై బహుజనోద్ధారకునిగా ప్రసంగించారు. ఈ కారణం చేత రజ్వీని బహుజన పక్షపాతిగా చూడాలా? మూలవాసులను రజ్వీ అనుచరులుగా భావించాలా? తదనంతర హత్యాకాండకు రజ్వీ కారకుడు కాకుండా పోతాడా? భాగ్యరెడ్డి వర్మ , అరిగె రామస్వామి నిజామును ఆదరించారనేది జిలుకర మరో వాదన. ఇది శుద్ధ తప్పు.

వీళ్ళిద్దరూ ఆర్యసమాజ ప్రభావిత 'ఆది- హిందూ ఉద్యమ నాయకు లు'. ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యాభివృద్ధికి నిజాం కోట్లాది రూపాయలు కేటాయించారనేది మరో విచిత్రమైన వాదన. అది అర్ధ సత్యం. ఏడో నిజాం కాలంలో ఈ వర్గాల విద్యాభివృద్ధికి 1923లో 7,980 రూపాయలు కేటాయిస్తే, 1932లో 5622, 1938లో 8880, 1944-46లో 2,50,000 , 1946- 47లో కోటి రూపాయల బడ్జెట్ కేటాయించారు. 

1944- 47 సంవత్సరాల మధ్య కాలం మినహాయిస్తే, గత 20 ఏళ్ల పాలనలో కేటాయించిన మొత్తం బడ్జెట్ 20 వేలకు మించి లేదు. బి.ఎస్.వెంకట్రావ్ ప్రభుత్వంలో ఉండడం, అంబేడ్కర్ లాం టి జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించే క్రమంలో భాగంగా, రాజ్యాన్ని నిలుపుకోవడానికి నిజాంకు ఎస్సీల మద్దతు అనివార్యమైన దృష్ట్యా కోటి రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగిందనేది చారిత్రక సత్యం. 

తప్పుడు చరిత్ర నిలిచినా, నిత్యం చలించినా వాస్తవా లు,అవాస్తవాలు వేర్వేరని శ్రీనివాస్ లాంటి దళిత మార్క్సి స్టు మేధావులు గ్రహించాలి. తెలంగాణ చరిత్రను వక్రీకరిం చి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్న మేధావులనైనా, సంస్థలైనా ఖండించాల్సిందే. కానీ సద్విమర్శనా పటిమతో నిరూపించి కండ్లు తెరిపించాలె గానీ సంబంధం లేని విషయాల్లోకి బహుజనులను లాగడం సరైంది కాదు. బహుజనుల సమస్యలను ఆకోణంలోనే, ఆ చారిత్రక తాత్విక దృక్పథంతోనే చూడాల్సి ఉంటుంది. 

- కదిరె కృష్ణ 
మూలవాసీ రచయితల సంఘం

No comments:

Post a Comment