Saturday, February 25, 2012

చేసింది చాలక సమర్థింపులా? - పసునూరి రవీందర్


'హక్కులు ఒకరిని అడుక్కునే భిక్ష కాదు, పోరాడి సాధించుకోవాలి' 
-మార్టిన్ లూథర్ కింగ్

అవార్డులు, అభినందనల కోసం ఎగబడడం ఇటీవల బాగాపెరిగిపోయింది. ఆ విధంగా ఎగబడుతున్నది మామూలు జనం కాదు. ఉద్యమాల్లో పనిచేసి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకొని, ఆ పేరుతో ప్రభుత్వం వద్ద దళారులుగా మారినవాళ్ళే ఆ పనిని సమర్థించుకోవడం విచారకరం. వీరు దళిత సర్టిఫికెట్ చూపి వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. ఇటువంటి సంఘటనల్లో వెలుగు చూడకుండానే కాలగర్భంలో కలసిపోతున్నవి కొన్నైతే, మీడియా ముందుకొచ్చి న్యాయంవైపు నిలబడ్డవాళ్లపై బురదచల్లేవి మరొకొన్ని. 

ఈ కోవలోనే- ఈ నెల నాలుగవ తేదీన 'ఆంధ్రజ్యోతి'లో కృపాకర్ మాదిగ 'అవార్డులు దళితులకు అంటరానివా?' అంటూ కుతర్కాన్ని లేవదీశారు. పైగా దళిత కవితోత్సవాన్ని తిరస్కరించడం తీవ్ర అభ్యంతరకరమంటున్నారు. ప్రభుత్వమే దళితుల ప్రతిభను గుర్తించినపుడు ఆ అవకాశాన్ని అందుకోవాలంటూ కృపాకర్ దళితులకు దళారిగా మారి తాను బేరం కుదుర్చుకున్న విషయాన్ని మరింత బట్టబయలు చేశాడు. కృపాకర్ వాదనం తా ప్రభుత్వ ఎంగిలి మెతుకుల కోసం ఎగబడాలి. అందుకోసం ఉద్యమాలు నిర్వాహించాలన్నట్టుగా ఉంది.

ప్రాణత్యాగాలు చేసిన అమరుల ఆశయ ఫలం నెరవేరకముందే ప్రభుత్వం ఇచ్చే అవార్డులను స్వీకరించాలని, వాళ్లు అందుకోసమే ప్రాణాలిచ్చినట్టు దళితులను పక్కదారి పట్టిస్తున్నారు. కృపాకరే ప్రభుత్వానికి దళిత కవులకు మధ్యలో దళారిగా వ్యవహరించడం వల్ల తాను చేసిన పని ని సమర్థించుకుంటున్నారు. ఈ పనివల్ల దళిత పోరాటాలన్నీ అవార్డులు, అభినందనల కోసమే అనుకునే దిగదుడుపు ఆలోచనను కలిగించారు. దీనివల్ల కృపాకర్‌కు రాజ్యం పట్లగానీ, రాజ్య స్వభావం పట్ల గానీ అవగాహన లేదని అర్థమవుతున్నది.

ప్రభుత్వాలు ఎప్పుడు సామ, దాన, భేద దండోపాయాలను ఉపయోగిస్తాయని కృపాకర్ కు తెలియదనుకోవాలా? ఏ దేశంలోనైనా రాజ్య స్వభా వం ఒకే తీరుగా ఉంటుంది. ప్రజలను బుజ్జగించే సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు ప్రజల పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి నిదర్శనమనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదు. ప్రభుత్వాలు తమ మనుగడ కోసం, ప్రజాగ్రహం వెల్లువెత్తకుండా నివారించడం కోసం అనేక కార్యక్రామాలు చేపట్టడమో, వాగ్దానాలు ఇవ్వడమో చేస్తా యి. వాటిని కాదని ఎదురు తిరిగితే రాజ్యహింస ద్వారా నేలరాల్చడం చరిత్ర చెబుతున్న అనుభవం. 

అరవయో దశకంలో బ్లాక్ పాంథర్స్ ఉద్యమాన్ని అణచివేయడానికి అమెరికా ప్రభుత్వం ఉపయోగించిన ఆయుధాల్లో అవార్డులియ్యడం కూడా ఒకటి. ఉద్యోగాలు, అవార్డులు, డబ్బు, మద్యానికి లొంగే వారికి వాటిని అందజేసి తమ శ్వేతజాతి ఆధిపత్యాన్ని కాపాడుకొని, బ్లాక్ పాంథర్స్ ఉద్యమాన్ని తాత్కాలికంగా నిర్వీర్యం చేసింది. మరాఠీ దళిత చైతన్యాన్ని అణిచివేయడానికి అక్కడి ప్రభుత్వాలు అనేక ప్రయత్నాలు చేసి అఖరుకి అవార్డులు రివార్డులతో ఆ కవులను పతనం చేశాయి. 

మన రాష్ట్రంలోనూ ప్రభు త్వం అవార్డులు, ఉద్యోగాలను ఎరచూపి దళిత సాహిత్యా న్ని స్తబ్దతకు గురిచేసేందుకు దశాబ్దంన్నర కాలంగా కృషి చేసి కొంతమందిని లొంగదీసుకోగలిగింది. ఈ విషయా న్ని మరిచిన కృపాకర్ ప్రభుత్వ సన్మానాలను సమర్థించుకొని దళితుల ఆత్మగౌరవాన్ని, దళిత సాహిత్య పరువును దిగజార్చేందుకు పూనుకున్నారు. తన ఒక్కడి కోసం జాతి ప్రయోజనాలు దెబ్బతీయడం క్షమార్హం కాదు.

ఉత్సవాలు నిర్వహించుకోవడానికి ఎవరు అడ్డంకి కాదు. అయితే అవి చేసుకునే సందర్భం కూడా ముఖ్యం. దళిత కవితోత్సవాన్ని వ్యతిరేకించిన కవుల్లో నేనూ ఒకణ్ణి. దళిత కవితోత్సవాన్ని జీవిత కాలంలో ఎన్నడూ జరుపుకోకూడదని మేం ఆ సభను ఖండించిన కరపత్రంలో పేర్కొనలేదు. సుమారు నాలుగువందల మంది యువతీ యువకులు తెలంగాణ కోసం ప్రాణాలను బలిదానమిచ్చిన సందర్భంలో 'చావులొక పక్క, ఉత్సవాలొక పక్కా?!' అని ప్రశ్నించాము.

సమైక్యాంధ్రకు వ్యతిరేకినని చెప్పుకున్న కృపాకర్‌కు ఏ మాత్రం నైతిక విలువలున్నా మా ప్రశ్నను, మా ఆవేదనను అర్థం చేసుకొని పశ్చాత్తాప పడి, ప్రజలను క్షమాపణలు కోరాల్సింది. కానీ కవితోత్సవం జరుపడమే కాకుండా తాను చేసిన దళారీ పని గొప్పదైనట్టు సమర్థించుకుంటున్నారు. తెలంగాణ పది జిల్లాల్లో ఉద్యమం ఉవ్వెతున్న నడుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు ఊరూరా చేస్తున్న దీక్షా శిబిరాలు రెండు వందల రోజులకు చేరాయి. ఒక బలమైన కాంక్ష కోసం తెలంగాణ బిడ్డలు బలిదానాలు చేస్తుంటే, వారిని నమ్ముకున్న కుటుంబాలు శోక సముద్రాలవుతున్నాయి. ఇటువంటి సమయాన ఉత్సవాలు జరుపుకోవడం సరైన సందర్భమా?

ప్రభుత్వ ఉత్సవాలకు, సన్మానాలకు, అవార్డులకు దళితులు దూరంగా ఉండాలని దళితేతరుల నాయకత్వంలో ని తెలంగాణ రచయితల సంఘం పిలుపివ్వడం సరైంది కాదన్నారు కృపాకర్. ఇట్లా అనడంలో కృపాకర్ ఆంధ్రా ఆధిపత్య ధోరణితో పాటు తెలంగాణ దళిత రచయితల పట్ల చిన్న చూపు కూడా కనిపిస్తున్నది. మంచిమార్గం మనో డు చెప్పినా, మందోడు చెప్పినా దాంట్లోని నిజానిజాలను గ్రహించి సరైన మార్గంలో నడుచుకోవాల్సింది పోయి రంధ్రాణ్వేషణకు సిద్ధమయ్యారు. అయినా 'సింగిడి'లో పనిచేసే తెలంగాణ రచయితలు (నాతో సహా) ఒకరు చెప్తే నడుచుకునే దయనీయమైన అజ్ఞానంలో జీవించడం లేద ని కృపాకర్ తెలుసుకోవాలి. తెలంగాణ రచయితల సంఘంలో పని చేస్తున్న దళిత కవుల స్థాయిని దిగజార్చిన తీరే ఆయనలోని ఆంధ్ర పెత్తందారును ఎత్తి చూపిస్తున్నది.

దళిత జాతి కోసం ప్రాణ త్యాగాలు చేయడానికి వెనుకాడనిది ఒకరైతే, ప్రభుత్వంతో సన్మానాలు చేయించుకుంటూ సమర్థించుకుంటున్నది మాత్రం ఈ దండోరా నాయకుడు. గాంధీభవన్ ఘటనలో వర్గీకరణకోసం ప్రాణాలొదిలిన సురేందర్ మాదిగ సంస్మరణ సభకు రాలేని ఈ నాయకు డు ఇదే హైదరాబాద్‌లో దళిత ఉత్సవాలను నిర్వహించ డం ఏ నాయకత్వ లక్షణం? సురేందర్ తదితర అమరులు తెలంగాణ మాదిగలు కావడమే కారణమా? 

ప్రభుత్వానికి మెలకువ వచ్చి దళితులకు సన్మానాలు చేస్తున్నదంటూ ప్రభుత్వ మొక్కుబడి కార్యక్రమాలకు ప్రచార కార్యదర్శి బాధ్యతలు స్వీకరిస్తున్నారు కృపాకర్. పదిహేనేళ్ల పాటు పోరాడినా వర్గీకరణ కొట్లాట ఇంకా తెగనేలేదు. తెలంగాణ ఏర్పాటు ఇంకా జరగనే లేదు. ఇవన్ని మరిచిపోయి వర్గీకరణ-తెలంగాణ వ్యతిరేకుల పంచన చేరడం ఏ మెలుకువో జాతి ప్రజలకు చెప్పాలి.

ప్రభుత్వం దశాబ్ద కాలం కిందటి వరకు అంబేద్కర్ జయంతిని అధికారికంగా జరపలేదు. కానీ దళితోద్యమ ఉధృతి వల్లనే ఈ మాత్రం పుష్పగుచ్చాలు అంబేద్కర్ విగ్రహాల మెడలో వేస్తున్నది. పాపం కృపాకర్ ఈ చరిత్రనంతా మరిచి ప్రభుత్వానికి మెలుకువ వచ్చిందని ఒక పగటి కల కంటున్నారు.

ఈ దేశంలో సుదీర్ఘ కాలం పాటు దళితులు పోరాటం జరిపింది సన్మానాలు, సంబరాల కోసమో కాదు. అసలు దళితుల ఏ ఉద్యమంలోనూ అవార్డుల, అభినందనల ఎజెండా లేదు. కానీ కార్యవర్గం లేని ఒక సంఘానికి వ్యవస్థాపకునిగా చెప్పుకునే ఈ నాయకునికి దళితోద్యమ పోరాటాలన్నీ సన్మానాల కోసం చేసినవిగానే తోచడం చిత్రం.

ప్రభుత్వం ఇచ్చే అవార్డులు, అభినందన పత్రాలు స్వీకరించిన తర్వాత ఏ కవికైనా, కళాకారునికైనా ప్రభుత్వ విధానాల మీద పోరాడే నైతిక హక్కు ఉంటుందా? అతడు చేసే పోరాటం నిజమైన పోరాటం అవుతుందా? అసలైన ఉద్యమకారులు జరిపే పోరాటాలను దెబ్బతీయడానికి ఆధిపత్య వర్గాలు తమ ఏజెంట్ల ద్వారా జరిపించే ఉత్తుత్తి పోరా టం కాదా? అయినా ఫర్లేదు అనుకోవడం కేవలం బూర్జువా ఆలోచనా విధానం మాత్రమే! కట్టె విరుగొద్దు, పాము చావొద్దనే ద్వంద్వ నీతిని స్వీకరించడానికి తెలంగా ణ మాదిగ బిడ్డలు సిద్ధంగా లేరు.

నిజానికి దళితోత్సవాల ను దళితులే నిర్వహించుకుంటే ఎవరికి ఏ అభ్యంతరం ఉండదు. కానీ దళితుల హక్కుల్ని కాలరాచి, దళితులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలతో కుమ్మక్కై ఉత్సవాలు జరపడాన్ని మాత్రమే మేము వ్యతిరేకించాము. రాష్ట్ర విభజన ను, వర్గీకరణను వ్యతిరేకించే వారితో తెలంగాణ గడ్డపై ఉత్సవాలు జరపడం పైనే మా అభ్యంతరం.

ఉద్యమ నేపథ్యం లేనివాడు ఆ పూటకు తన ప్రయోజ నం నెరవేరితే చాలనుకుంటాడు. అవార్డుతో పాటు వచ్చే నగదు పట్ల వ్యామోహానికి గురవుతాడు. ఆ తర్వాత మరో అవార్డు కోసం కాచుకొని కూర్చుంటాడు. తనకు తెలియకుండానే అవార్డులకు బానిసై రాజ్యానికి బానిసగా మారుతాడు. ఇప్పటికే కొంతమంది దళిత సాహిత్యకారుల, విశ్వవిద్యాలయాల ఆచార్యుల జీవితాలను చూస్తే ఇదే అర్థమవుతుంది. చివరికి 'న ఘర్‌కా, న ఘాట్‌కా' అన్నట్టు సమాజానికి కాక, వారి కోసం వారుకాక కేవలం కేరీరిస్టులుగా మిగలడం అందరికి తెలిసిందే. అకాడమీ పోటీలలో ముందుండాలని కృపాకర్ దళిత సాహిత్యకారులకు సాహి త్య మార్గనిర్దేశం చేస్తున్నారు. సామాజిక ఉద్యమానికి అంకితం కాలేని కృపాకర్ అనతికాలంలోనే దళిత సాహిత్యకారులకు సూచనలు, దిశానిర్దేశాలు చెప్పే ఉచిత సలహాదారుగా మారడం విచారకరం. 

ఆంధ్ర దోపిడీ పాలనను విమర్శించేవాళ్లు, వారిచ్చే ప్రైవే టు ఉద్యోగాలను వదులుకోవడం లేదనేది కూడా కృపాకర్ విమర్శ. దోపిడీ వ్యవస్థలో ప్రకృతి, సామాజిక వనరులన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధిపత్య వర్గాల ఆధీనంలో ఉంటాయి. పాలక వర్గాల చేతిలో ప్రభుత్వం అణచివేత సాధనమే. ప్రభుత్వ ఉద్యోగులు పాలకవర్గాలకు సేవ చేయడం లేదనుకుంటే అవగాహనా రాహిత్యమే. 

రాజ్యంతో కుమ్మక్కై చేసే స్పాన్సర్డ్ కార్యక్రమాల ద్వారా సాధికారత సాధించడం ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి దళిత కవితోత్సవం అనేది జరిగిపోయిన ఒక పీడకల. దాన్ని నిర్వహించిన వ్యక్తిగా తప్పును ఒప్పుకోవాలి. లెనిన్ చెప్పినట్టు చేసిన తప్పును ఒప్పుకోకపోవడం అంటే వంద తప్పులు చేసినట్టు లెక్క.
- పసునూరి రవీందర్
కవి, రీసెర్చ్ స్కాలర్, సెంట్రల్ యూనివర్సిటీ
Andhra Jyothi News Paper Dated : 11/07/2010

No comments:

Post a Comment