Thursday, February 2, 2012

ఆకలిపై సంస్కరణల పోటు


లక్షిత వర్గాలను ఉద్దేశించి ప్రవేశపెట్టే నగదు బదిలీ, ఆహార కూపన్లు, లేక ఇతర పథకాలు ఇందులో ఉన్నాయి. ఆహార ధాన్యాలకు బదులుగా వీటిని పంపిణీ చేస్తారు. బయోమెట్రిక్‌ సమాచారంతో విశిష్ట గుర్తింపు కార్డులు జారీ చేసి లబ్ధిదారుల సంఖ్యను వీలైనంతగా కుదించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా వివాదాస్పదమైన విధాన నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించేందుకు ఆహార భద్రతా బిల్లు ఉద్దేశింపబడింది. ఇది అత్యంత అభ్యంతరకరమైన విషయం. ఈ సంస్కరణలను నిర్బంధంగా అనుసరించేందుకు రాష్ట్రాలను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఈ బిల్లు దోహదం చేస్తుంది.

ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టి, స్థాయీ సంఘానికి నివేదించిన 2011 ఆహార భద్రతా బిల్లు ప్రస్తుత ఆకలి, పౌష్టికాహార లోపానికి దారితీసిన ప్రభుత్వ విధానాలకు చట్టబద్ధత కల్పించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ బిల్లులోని ముఖ్యమైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. 1. లక్ష్యాలు చిన్నవిగా నిర్ణయించుకోవడం, వర్గీకరణ, నిర్వచనాలు కూడా అదే రీతిలో ఉండటం, 2. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపికకు షరతులు 3. మితిమీరిన అధికార కేంద్రీకరణ, రాష్ట్రాల హక్కులను హరించడం, 4. ఖర్చులు, విలువలను పంచుకోవడం
లక్ష్యాల పెంపు
ఆహార భద్రతకు లక్ష్యాలను నిర్దేశించడం ప్రతికూల ఫలితాలను కలగజేస్తుందని గత అనుభవం తెలియజేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు మరి కొన్ని కొత్త అంశాలను జోడించింది. లక్ష్యాలు ఎంత అసాధ్యమైన స్థాయిలో నిర్ణయించవచ్చో ఈ బిల్లును చూస్తే తెలుస్తుంది. లక్ష్యాలను నిర్ణయించే యంత్రాంగం ఎంత నిర్దయగా వ్యవహరించగలదో కూడా ఇది తెలియజేస్తుంది.
ఇప్పటివరకు ప్రజాపంపిణీ వ్యవస్థలో ఆహార ధాన్యాలను మూడు వర్గాలకు సరఫరా చేస్తున్నారు. వారు పేదరిక రేఖకు ఎగువ ఉన్న వారు (ఎపిఎల్‌), పేదరిక రేఖకు దిగువ ఉన్నవారు (బిపిఎల్‌), అంత్యోదయ. ఇందులో చివరి వర్గాన్ని బిపిఎల్‌ జనాభా నుండి వేరు చేసి వారికి కిలో రెండు రూపాయల చొప్పున 35 కిలోల మొత్తాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన బిల్లు ఈ అంత్యోదయ పథకాన్ని రద్దు చేస్తోంది. ఇక నుండి అంత్యోదయ పథకం కింద లబ్ధి పొందుతున్న 2.5 కోట్ల కుటుంబాలు బిపిఎల్‌ వర్గం కిందకే వస్తాయి. వారు ఇక ముందు కిలోకు అదనంగా ఒక రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రేటు ప్రకారం బిపిఎల్‌ కుటుంబాలు కిలోకు మూడు రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పటివరకు అంత్యోదయ పథకం కింద ఉన్నవారు నెలకు మరో 35 రూపాయలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
వర్గీకరణలో ఒంటెత్తు పోకడలు
బిల్లు పరిధిలోకి నాలుగు కేటగిరీలను ఈ బిల్లు తీసుకువచ్చింది. అవి ఇవా ఇలా ఉన్నాయి.
1.బిపిఎల్‌: మొదటి కేటగిరీలో బిపిఎల్‌కు 'ప్రాధాన్యతా వర్గాలు'గా పేరు మార్చారు. ఈ వర్గానికి కుటుంబంలోని వ్యక్తికి ఏడు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు సరఫరా చేస్తారు. అయితే కుటుంబంలోని పిల్లలు ఒక వ్యక్తిగా వస్తారా, రారా అన్న విషయాన్ని స్పష్టంగా నిర్వచించలేదు. బియ్యం అయితే కిలోకు మూడు రూపాయల చొప్పున, గోధుమ అయితే రెండు రూపాయల చొప్పున, చిరు, ముతక ధాన్యాలైతే కిలోకు రూపాయి చొప్పున చెల్లించాల్సి ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో 46 శాతం, పట్టణాల్లో 28 శాతం దేశంలో బిపిఎల్‌ కుటుంబాలున్నాయని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. రాష్ట్రాలవారీగా ఉన్న తేడాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అనేక రాష్ట్రాలు ప్రస్తుతం రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. ఈ కొత్త బిల్లు వల్ల ఆ పథకం కింద లబ్ధి పొందుతున్న వారు కూడా కిలోకు మూడు రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే వారు అదనంగా మరో రూపాయి చెల్లించాలి. ఈ విధంగా రాష్ట్రాలు ప్రవేశపెట్టిన రెండు రూపాయల బియ్యం పథకం రద్దవుతుంది.
2.ఎపిఎల్‌: రెండో కేటగిరీలో ఎపిఎల్‌ను 'సాధారణ వర్గాలు'గా పేరు మార్చారు. గ్రామీణ ప్రాంతాల్లో 29 శాతం, పట్టణాల్లో 22 శాతం ఈ వర్గం కింద వస్తారని బిల్లు పేర్కొంది. ఇది ఎపిఎల్‌ కార్డు కలిగి ఉన్న వారి సంఖ్య కంటే తక్కువే. ఇందువల్ల కొత్త బిల్లు అమలులోకి వస్తే ప్రస్తుతం ఎపిఎల్‌ కార్డు ఉన్న అనేక మందికి ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండవు. కార్డును కొనసాగించే అవకాశం ఉన్న కుటుంబాల్లో ఒక్కొక్కరికీ మూడు కిలోల చొప్పున మాత్రమే రేషన్‌ లభిస్తుంది. ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి గరిష్టంగా పదిహేను కిలోల రేషన్‌ మాత్రమే సరఫరా అవుతుంది. ఇది ప్రస్తుతం ఎపిఎల్‌ కార్డు గల వారు పొందుతున్న 35కిలోల కంటే బాగా తక్కువ. కనీస మద్దతు ధరలో సగం రేటు చొప్పున వారి వద్ద నుండి వసూలు చేస్తారు.పెట్టుబడి ఖర్చులు పెరగడంతో కనీస మద్దతు ధరను ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెంచుతుంటుంది. ఇందువల్ల ఎపిఎల్‌ కుటుంబాలు ఒక కచ్చితమైన ధరకు రేషన్‌ పొందలేరు. ప్రతి సంవత్సరం వారు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రస్తుతం లభిస్తున్న ధర, పరిమాణంతో పోలిస్తే ఎపిఎల్‌ కుటుంబాలకు నష్టం వాటిల్లుతుంది. కొత్త బిల్లులో మరో అత్యంత అభ్యంతరకరమైన నిబంధన ఉంది. ఎపిఎల్‌ కుటుంబాలకు తగ్గిన సరఫరాలు కూడా సంస్కరణలతో ముడిపడి ఉంటాయి.
3. రేషన్‌ సదుపాయం కోల్పోయే తరగతులు: కొత్త బిల్లు రూపంలో యుపిఎ ప్రభుత్వం కొన్ని కేటగిరీలకు అసలు రేషన్‌ దక్కకుండా చేసింది. ఈ కేటగిరీని ప్రజాపంపిణీ వ్యవస్థలో కొత్తగా ప్రవేశపెట్టారు. గ్రామీణ భారతంలో 25 శాతం మంది, పట్టణాల్లో 50 శాతం మంది ఈ వర్గం కిందకు వస్తారు. ఈ బిల్లు వీరికి రేషన్‌ను పూర్తిగా నిలిపివేస్తుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తుంది. ఈ మినహాయింపుకు ఆహార భద్రతా బిల్లు చట్టబద్ధత కల్పిస్తుంది.
4.బిపిఎల్‌ జనగణన కింద మినహాయింపు పొందే కేటగిరీలు: ఈ మూడు వర్గాలు కాకుండా కొత్త బిల్లు మరో కేటగిరీనీ రూపొందించింది. బిపిఎల్‌ కులగణనలో రూపొందించిన ప్రశ్నావళి ఈ కొత్త కేటగిరీ ఆవిర్భావానికి అవకాశం కల్పించింది. ప్రజాపంపిణీ వ్యవస్థ నుండి రేషన్‌ పొందేందుకు అర్హత కోల్పోయే కొన్ని కేటగిరీలను ఈ కులగణన నిర్దేశించింది. ఈ ప్రశ్నావళిలోని కొన్ని ప్రశ్నలు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయి. ఈ ప్రక్రియ ద్వారా రేషన్‌కు అర్హులైన వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం, పట్టణాల్లో 50 శాతం స్థాయిని మించకపోతే అసలు భద్రతా చట్టం పరమార్థం ఏమిటి? ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని పూరించేందుకు ఈ నాల్గవ కేటగిరీ దోహదం చేస్తుంది. బిపిఎల్‌ జనగణన ప్రకారం లక్షిత వర్గాలకే రేషన్‌ అందుబాటులో ఉంటుంది.
ఈ ఒంటెత్తు పోకడకు సంబంధించి నైతిక అంశాలతోపాటు విస్తృత ఆహార భద్రతా హక్కును గుర్తించాల్సి ఉంది. ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాల పరంగా చూసినా రేషన్‌ పొందే ప్రజలను బహుళ కేటగిరీలుగా విభజించడం అదనపు వ్యయానికి, రేషన్‌ దుర్వినియోగానికి, అవినీతికి దారితీస్తుంది.
నిర్వచనాల్లో అసంబద్ధత
ఈ బిల్లులోని నిర్వచనాల విభాగం లక్ష్యాల నిర్దేశం ఎంత లోపభూయిష్టంగా ఉందో విశదం చేస్తుంది. 'ప్రత్యేక కేటగిరీల' విభాగంలో కొన్ని కేటగిరీలకు తప్పనిసరిగా రేషన్‌ పొందే సదుపాయం కల్పించారు. అయితే వీరిని నిర్వచించడం ఎలా? ఆకలితో అలమటించేవారికి రోజూ రెండు ఫుల్‌మీల్స్‌ సదుపాయం కల్పించారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాల్సి ఉంది. ఆకలితో అలమటించడాన్ని ఒకటవ అధ్యాయం 2(24) క్లాజు నిర్వచించింది. ఒక మనిషి ప్రాణానికే ముప్పుగా పరిణమించే రీతిలో దీర్ఘకాలం ఆహారం అందుబాటులో లేకపోవడాన్ని ఆకలితో అలమటించడంగా ఈ క్లాజు నిర్వచించింది. అయితే ఆహారం అందుబాటులో లేకపోవడం స్వచ్ఛంద చర్యల ఫలితం కాకూడదని ఈ క్లాజు నిర్దేశించింది. ప్రాణంతో బతికి ఉండటం కష్టమని ఎవరు నిర్ణయిస్తారు? నేడు ఒక వ్యక్తి ఆకలి చావుకు గురైనా ఆ వ్యక్తి ఇంకేదో కారణంతో మరణించినట్లు ప్రభుత్వ మీడియా ప్రచారం చేస్తుంది. ఆకలిచావు సంభవించినట్లు అత్యంత అరుదుగా మాత్రమే గుర్తిస్తారు. మరి అర్ధాకలితో ఉంటున్న వారి సంగతి ఏమిటి? ఈ బిల్లు కింద ప్రయోజనం పొందేందుకు వారు పూర్తిగా ఆకలితో అలమటించే స్థాయికి చేరుకోవాల్సిందేనా? అది అలా ఉంచితే అనాథల మాటేమిటి? మూడవ అధ్యాయం 8(ఎ) క్లాజులో అనాథ అయిన ఒక వ్యక్తి రోజుకు కనీసం ఒక సారి భోజనానికి అర్హుడని స్పష్టం చేస్తుంది. అంటే ఆకలితో అలమటించేవారికి, అనాథలకు మధ్య స్పష్టమైన తేడాను ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది. ఆకలితో అలమటించేవారు రెండు భోజనాలకు అర్హులు కాగా అనాథలు ఒక్క భోజనానికి మాత్రమే అర్హులు. ఒకటవ అధ్యాయంలోని 2(3) క్లాజు అనాథలను ఈ విధంగా నిర్వచించింది. 'జీవించడానికి అవసరమైన ఆహారం తీసుకోవడానికి ఎటువంటి వనరులు, సదుపాయాలు లేకుండా, జీవించలేని లేదా ఆకలిచావుకు గురికాలేని పరిస్థితిలో ఉన్నవారు''. సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా ఆహారం అందుబాటులో లేకపోవడంతో ఆకలితో అలమటించడానికి, ఆహారం అందుబాటులో లేకపోవడానికి మధ్య తేడా ఉంటుందని చెప్పగలరా?అయితే ప్రపంచబ్యాంక్‌ సుశిక్షితులైన వారు, అంతగా పరిజ్ఞానం లేని ఆర్ధికవేత్తలు వీరిలో తేడా గుర్తిస్తారు. సమానంగా ఆకలిగొన్న వ్యక్తుల్లో రెండు పూటల ఆహారానికి అర్హులు, ఒక పూట మాత్రమే పొందడానికి అర్హులను గుర్తించగలరు. ఇది నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు, లక్షిత విధానాల మౌలిక విధానం. ప్రజలు ఎలా ఆహారం తీసుకుంటారు, వారు ఆకలితో అలమటిస్తున్నారా లేక అనాథలా, లేక ఒక పూట మాత్రమే భోజనం తినేందుకు అర్హత ఉన్నప్పటికీ రెండు పూటలా తింటూ ఖజానాకు నష్టం తెస్తున్నారా అన్న విషయాన్ని నిగ్గుతేల్చేందుకు తనిఖీదారులు వస్తారు. 1930 దశకంలో పెట్టుబడిదారీ సంక్షోభం తలెత్తి మహా మాంద్యం ఏర్పడినపుడు అమెరికాలో ఉచిత సూప్‌ వంటశాలలను నిర్వహించారు. అయితే ఆకలిగొన్న వారని నిరూపించుకునేందుకు కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే వంటశాలల్లో వారికి ప్రవేశం కల్పించారు. అవసరమున్న వారు మాత్రమే ఆహారం కోసం క్యూలో నిలబడతారని ప్రభుత్వం భావించింది. సంక్షేమ పథకాల్లో, సబ్సిడీల్లో కోత పెట్టే సమయాల్లో ఆ సునిశితత్వం కూడా ప్రస్తుత నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అవలంభించేవారిలో కరువైంది. నయా ఉదారవాద ఆర్ధిక విధానాలే ప్రభుత్వాలను కట్టిపడవేసే మంత్రంగా తయారైంది.
ప్రపంచంలో పోషక పదార్థాలు అందుబాటులో లేని దేశాల్లో అగ్రగామిగా పేరుగాంచిన మన దేశంలో స్వల్ప సంఖ్యలో ప్రజలకు ఉచిత ఆహారం అందించడం కూడా పూర్తిగా సరిపోని చర్యే. అంతకంటే ఉదారంగా ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వారికి తక్కువ ధరకు ఆహారధాన్యాలు నిత్యావసర సరుకులను కూడా అందించడం వంటి మరి కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఆహార భద్రతా బిల్లు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది.
హక్కులను సంస్కరణలతో ముడిపెట్టడం
ఇంతకుముందు ముసాయిదాలోని ఒక కొత్త అంశం ఆహార భద్రతా బిల్లులో చోటుచేసుకుంది. ఎపిఎల్‌ కేటగిరీకి ఆహార పదార్థాల కోటాను గణనీయంగా తగ్గించినప్పటికీ వాటిని కూడా సంస్కరణల ప్రక్రియతో ముడిపెట్టారు. సాధారణ కేటగిరీ కిందకు వచ్చే కుటుంబాల వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేసే రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్దేశించే సంస్కరణలకు ముడిపెట్టవచ్చని రెండవ అధ్యాయం 3(3) క్లాజు స్పష్టం చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో సంస్కరణలు అనే పేరుతో రూపొందించిన ఏడవ అధ్యాయం కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రకాల సంస్కరణలను నిర్దేశించింది. లక్షిత వర్గాలను ఉద్దేశించి ప్రవేశపెట్టే నగదు బదిలీ, ఆహార కూపన్లు, లేక ఇతర పథకాలు ఇందులో ఉన్నాయి. ఆహార ధాన్యాలకు బదులుగా వీటిని పంపిణీ చేస్తారు. బయోమెట్రిక్‌ సమాచారంతో విశిష్ట గుర్తింపు కార్డులు జారీ చేసి లబ్ధిదారుల సంఖ్యను వీలైనంతగా కుదించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా వివాదాస్పదమైన విధాన నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించేందుకు ఆహార భద్రతా బిల్లు ఉద్దేశింపబడింది. ఇది అత్యంత అభ్యంతరకరమైన విషయం. ఈ సంస్కరణలను నిర్బంధంగా అనుసరించేందుకు రాష్ట్రాలను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఈ బిల్లు దోహదం చేస్తుంది. 
-బృందాకరత్‌

No comments:

Post a Comment