Saturday, February 25, 2012

రాష్ట్రం లోపల రాష్ట్రం! -పి. ఎస్. కృష్ణన్


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా కోస్తా, రాయలసీమలో ను జరుగుతోన్న ఆందోళన, మరీ ముఖ్యంగా గత మూడు నెలలుగా చోటుచోసుకొంటోన్న పరిణామాలు ఒక అనిశ్చిత పరిస్థితిని సృష్టించాయి. దీనివల్ల అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ప్రాంతాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి తీవ్ర అవరోధాలు ఏర్పడుతున్నాయి. రెండు ప్రాంతాలవారు ఇప్పటికే అనేక సమస్యల నెదుర్కొంటున్నారు. 

ఆ అనిశ్చిత పరిస్థితి కొనసాగినచో పర్యవసానాలు మరింత విషమంగా ఉంటా యి. తెలంగాణలో పలువురు విద్యార్థినీ విద్యార్థుల ఆత్మహత్యలే ఇందుకు తార్కాణం. అసలు ఆంధ్రప్రదేశ్‌కు జరిగే ఎలాంటి నష్టమైనా యావద్భారత పురోగతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంకెలాంటి ఆలశ్యం చేయకుండా ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను తొలగించేందుకు పూనుకోవాలి. 

navya.(2) తమ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని సాధించుకోవాలనే ఆకాంక్ష తెలంగాణ వారందరిలోను ప్రగాఢంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ సమైక్యతను కాపాడుకోవాలన్న కోరిక ఆంధ్ర, రాయలసీమ ప్రజల్లో చాలా బలీయంగా ఉంది. పరస్పర విరుద్ధమైన ఈ ఆకాంక్షలను సామరస్యపూర్వకంగా నెరవేర్చడంలోనే రాజనీతిజ్ఞత ఉంది. 

(3) ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ఆంధ్ర ప్రాంతీయులు, శాసనసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించడానికి రెండు ప్రధాన కారణాలు: (అ) భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజన, తెలుగు ప్రజల సమైక్యత విచ్చిన్నత పట్ల వ్యతిరేకత; 
(ఆ) తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ను, దాని చుట్టు పక్కల ప్రాంతాలలోను గత యాభై ఏళ్ళుగా పలు విధాల పెరిగిన ఆంధ్రుల ప్రయోజనాల పరిరక్షణ. హైదరాబాద్ రాష్ట్రరాజధాని కావడంతో లక్షలాది ఆంధ్ర ప్రాంతీయులు ఆ నగరంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుక్నారు. కొద్ది మంది పారిశ్రామికవేత్తలు, రియల్టర్లను మినహాయిస్తే అత్యధికులు మధ్యతరగతి ప్రజలు. 

(4) క్రింద సూచించిన, రాజ్యంగబద్ధత ఉన్న చర్యలను, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు వర్తించే విధంగా సవరణలు/ మార్పులతో అమలుపరచడం ద్వారా రెండు ప్రాంతాల వారి ఆకాంక్షలను సామరస్య పూర్వకంగా నెరవేర్చడం సాధ్యమవగలదు.
(అ) ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా స్వతంత్ర ప్రతిపత్తిగల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు; 
(ఆ) స్వయంపాలిత తెలంగాణకు స్వంత శాసనసభ, స్వంత మంత్రి మండలి ఉండాలి; 

(ఇ) రాజ్యాంగం లోని రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో పేర్కొన్న అంశాలన్నిటిపైన చట్టాలు చేసే అధికారం స్వయంపాలిత తెలంగాణ రాష్ట్రానికి ఉండాలి. ప్రజల ప్రయోజనాల ను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న చట్టాలను రద్దు చేసే అధికారం కూడా తప్పనిసరిగా ఉండాలి. తెలంగాణ శాసనసభ పరిధిలోకి రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలోని ప్రతి అంశాన్ని చేర్చాలా లేక ఉమ్మడి ప్రయోజనాలు గల కొన్నిటిని (ఉదాహరణకు హైదరాబాద్/గ్రేటర్ హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ) చేర్చాలా అన్న విషయాన్ని సమగ్ర సంప్రతింపుల ద్వారా నిర్ణయించుకోవాలి.

హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిరక్షణ అంశాన్ని, ఇరువర్గాలు ఆమోదించి న పక్షంలో దానిని ఉమ్మడి జాబితాలో లేదా స్వయంపాలిత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారత ప్రభుత్వానికి ప్రమేయముం డే కొత్త ఉమ్మడి జాబితాలో చేర్చాలి. తద్వారా హైదరాబాద్ మొదలైన నగరాలకు ఉగ్రవాదుల నుంచి ఎదురవుతున్న ముప్పును సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యమవగలదు.

హైదరాబాద్‌పై ఉగ్రవాదుల దాడిని నివారించడానికి నిరంత ర గగనతల నిఘాను కూడా నిర్వహించాలని యోచిస్తున్నా రు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమవుతుంది. ఈ దృష్ట్యా హైదరాబాద్ శాంతి భద్రతల పరిరక్షణను కొత్త ఉమ్మ డి జాబితాలో చేర్చితే అది, ఒక విశాల పరిధిలో ఇతర మహానగరాల రక్షణకూ ఆదర్శప్రాయమైన నమూనా అవగలదు; 

(ఇ) స్వయంపాలిత తెలంగాణ శాసనసభ పరిధిలోకి తీసుకొచ్చిన రాష్ట్ర, ఉమ్మడి జాబితాలలోని అంశాలన్నిటికీ తెలంగాణ కార్యనిర్వాహక అధికారాలు విస్తరించాలి; 
(ఈ) జలవనరులు, ముఖ్యంగా కృష్ణా ,గోదావరీ జలాల ను సంప్రతింపుల ప్రాతిపదికన స్వయంపాలిత తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లోని ఆంధ్ర ప్రాంతం మధ్య న్యాయబద్ధంగా పంపకం చేయడానికి అవసరమైన ఒక నిపుణుల కమిషన్ లేదా అటువంటి యంత్రాంగాన్ని సృష్టించాలి. బచావత్ కమిషన్ గడు వు ముగిసిపోయినందున ఇప్పటికే ఒక కొత్త కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. స్వతంత్ర తెలంగాణ రాష్ట్రం నదీ జలాల పై తన హక్కు గురించి కొత్త కమిషన్ ఎదుట వాదించుకొనే స్వేచ్ఛ స్వయం పాలిత తెలంగాణకు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం రాష్ట్రానికి సంబంధించి, వివిధ ప్రాంతా లు, ఉప ప్రాంతాల మధ్య నదీజలాల పంపకాలకు సంబంధిం చి ప్రాతినిధ్యం వహిస్తుంది. కమిషన్ అవార్డు జారీ అయిన నాటి నుంచి అది అమలయ్యే తీరుతెన్నులను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా సంప్రతింపుల ప్రాతిపదికన ఒక శాశ్వ త నిపుణుల కమిషన్ లేదా నిపుణుల యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి; 

(ఉ) తెలంగాణకు స్వయం ప్రతిపత్తిని సమకూరిస్తే ప్రభుత్వోద్యోగాల భర్తీలో ప్రాంతీయ వివక్షలకు ఆస్కారం ఉండబో దు. సంప్రతింపుల ద్వారా తెలంగాణ ఉద్యోగుల ఫిర్యాదుల ను పరిష్కరించేందుకు జి.ఓ. 610 అమలును అవసరమైన సవరణలతో కొనసాగించాలి. దీనివల్ల ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు సాధ్యమైనంతవరకు తక్కువ సమస్యలు ఏర్పడేలా జాగ్రత్త వహించాలి; 

(ఊ) పన్నుల రాబడిని ముఖ్యంగా హైదరాబాద్ ద్వారా సమకూరే ఆదాయాన్ని పంచుకొనేందుకు, సరైన ఆర్థిక సూత్రాలు, నిపుణులు నిర్ధారించిన గణాంకాల ప్రాతిపదికన సంప్రతింపుల ద్వారా ఒక ఫార్ములాను రూపొందించుకోవాలి; 

(ఎ) హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం. ఆ నగరం స్వయంపాలిత తెలంగాణకు రాజధాని గా ఉండాలి. 
అలాకాక వేరే విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా నిష్ప్రయోజనం. తెలంగాణకు స్వతంత్ర ప్రతిపత్తి నిస్తున్నందున రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం లేదు. హైదరాబాదే ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా కొనసాగుతుంది. తద్వారా హైదరాబాద్‌కు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమవుతుంది. (ఏ) గత యాభై ఏళ్ళుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇతోధికంగా పెరిగిపోయిన ఆంధ్ర ప్రాంతీయుల ప్రయోజనాలకు స్వయం పాలిత తెలంగాణ చట్ట బద్ధమైన పరిరక్షణ కల్పించాలి. ఈ సూచనలను అనుసరించిన పక్షంలో తెలంగాణకు స్వతంత్ర ప్రతిపతి సిద్ధించడమే కాక ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటుంది. 

ఈ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా స్వతంత్ర తెలంగాణ నేర్పా టు చేయడానికి ఉద్దేశించిన తీర్మానాన్ని ఆమోదించడానికి శాసనసభలోని రెండు ప్రాంతాలకు చెందిన సభ్యులకు అభ్యంతరముండబోదు. శాసనసభ సంబంధిత తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే పార్లమెంటు స్వయంపాలిత తెలంగాణను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలను చేపడుతుంది. మరెలాంటి నష్టం లేకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు సాగడానికి వీలవుతుంది. అలాగే స్వయంపాలిత తెలంగాణ తన ప్రజల సర్వతో ముఖాభివృద్ధికి ఎటువంటి జాప్యం లేకుండా పూనుకోగలుగుతుంది. 

పైన పేర్కొన్న నాల్గవ అంశంలోని తొమ్మిది చర్యలకు చట్టబద్ధత కల్పించడానికి అవసరమైన అధికారాలు పార్లమెంటు కు రాజ్యాంగంలోని 244ఎ అధికరణ ద్వారా లభ్యమవుతున్నాయి (ఈ అధికరణ అస్సాంలోని కొన్ని గిరిజన ప్రాంతాలకు స్వయంపాలిత రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించేందుకు, వాటికి స్వతంత్ర శాసనసభలు, మంత్రిమండళ్లు నేర్పాటు చేసేందు కు సంబంధించినది).

1969లో 'అస్సాం పునర్వ్యవస్థీకరణ (మేఘాలయ) చట్టం' ద్వారా అస్సాంలో భాగంగా స్వతంత్ర మేఘాలయ రాష్ట్రాన్ని సృష్టించేందుకు పార్లమెంటు ఈ అధికరణను ఉపయోగించుకొంది. దరిమిలా ఆ అధికరణను మరోసారి ఉపయోగించుకోవడం జరగలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు అనుగుణంగా ఆ అధికరణలో సవరణలు చేయడం ద్వారా తెలంగాణకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించవచ్చు. 

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రజలు ప్రగాఢంగా వాంఛిస్తున్నందునే మన రాజ్యాంగ నిర్మాతలు అధికరణ 3 కింద కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అవసరమైన నిబంధనలను పొందుపరిచారు. ఆ అధికరణను తొలుత 1953లోను, ఆ తరువాత 1956లో విస్త­ృతస్థాయిలోను, అలాగే 1960, 1966, 2000 సంవత్సరాలలో భారత ప్రభుత్వం ఉపయోగించుకొంది.

అలాగే అధికరణ 343కు సవరణలు చేయడంలోను, ఎనిమిదో షెడ్యూలును అవసరమయినప్పుడు విస్తరించడంలోను భారత ప్రభుత్వం వివేకవంతమైన నిర్ణయాలు తీసుకొంది. ఇవన్నీ మన ప్రజల ప్రాంతీయ, భాషాపరమైన ఆకాంక్షలను నెరవేర్చడానికి విశేషంగా దోహదం చేశాయి. ఇప్పుడు మరో సారి మరెలాంటి జాప్యం చేయకుండా (తెలంగాణ విషయంలో) అటువంటి వివేకవంతమైన నిర్ణయం తీసుకోవల్సిన సమయమాసన్నమయింది. 

ఆంధ్రప్రదేశ్‌తో నాకు ఉన్న సుదీర్ఘ అనుబంధం ద్వారా ఆ రాష్ట్రం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభ నివారణకుపై సూచనలు చేశాను. 1956లో నన్ను హైదరాబాద్ కేడర్‌కు కేటాయించారు. దరిమిలా ఆ రాష్ట్రం మూడు భాగాలుగా విడిపోయి తెలంగాణ ఆంధ్రతో విలీనమయినప్పుడు కొత్తగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ కేడర్‌లో చేరాను. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల- తెలంగాణ, కోస్తా, రాయలసీమ-లోను వివిధ స్థాయిలలో పని చేశాను.

తెలంగాణ ప్రజల సమస్యలు, మనో భావాలు నాకు బాగా తెలుసు. అలాగే కోస్తా, రాయలసీమ ప్రజల మనోభావాలూ నాకు బాగా తెలుసు. మూడు ప్రాంతా ల ప్రజల సహృదయత; అభివృద్ధి, సంక్షేమం, సమానత్వ లక్ష్యాల సాధన పట్ల వారి ఉత్సాహం నాకు బాగా తెలుసు.

నా జీవితంలో చాలాకాలం ఎవరికైతే దగ్గరగా ఉన్నానో ఇప్పుడు ఆ ప్రజలు ఎదుర్కొంటొన్న సమస్యలు నన్ను కలవరపరుస్తున్నాయి. అటు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఇటు ఆంధ్ర ప్రజల అభీష్ట్టమూ సామరస్యపూర్వకంగా నెరవేరడానికి తోడ్పడేందుకే ఈ సూచనలను ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల ప్రజల, నాయకుల పరిశీలనకు నివేదిస్తున్నాను. 

(వ్యాసకర్త రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. భారత ప్రభుత్వ సంక్షేమ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి) (జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి సమర్పించిన నివేదిక సంక్షిప్త పాఠమిది)
Andhra Jyothi News Paper Dated : 9/03/2010

No comments:

Post a Comment