Friday, February 17, 2012

తెలంగాణ: దళిత ఎజెండా ----కె చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ అధినేత




kcr-caric talangana patrika telangana culture telangana politics telangana cinema


మన దేశంలో దళితుల సమస్య. రాసుకుంటే రామాయణమంత.. వింటే భారతమంత. చాలా బాధ కూడా కలుగుతుంది. నాయకులు, పార్టీ లు, ప్రభుత్వాలు మైకులు బద్ధలవుతున్నయి. అరవై నాలుగు సంవత్సరాల స్వతంత్ర భారతంలో నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను. ఎంటైర్ ఇండియాలో కానీ, ఇక్కడ మన రాష్ట్రంలో కానీ.. ఫలాని దగ్గరికని కాకుండా మామూలుగా వెళ్లిపోయి ఆ ఊరు మధ్యలో నిలబడి నలుగురు పెద్దమనుషుల ను పిలిచి మీ ఊళ్లో కడు నిరుపేదలు ఎవరయ్యా అని అడిగి తే.. దళితులని చెబుతరు. ఎక్కడి కన్నా పోండ్రి. ఏ గ్రామానికన్నా పోండి కశ్మీర్ నుంచి కన్యాకుమా రి వరకు ఇదే పరిస్థితి.మన ఆంధ్రవూపదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి.



నాకు బాగా జ్ఞాపకముంది. సిద్దిపేటలో ఇరవై సంవత్సరాలు నేను ఎమ్మెల్యే గా పనిచేశాను. ఆ సమయంలో ఒక టర్మ్ గెలిసినం. నా మీద నిలబడ్డ వ్యక్తి లక్ష లు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున లారీలకు లారీలు మద్యం పంచి హడావుడి చేసిండు. నేను పెద్ద మెజారిటీతో గెలిచిన. ఒక ఎలక్షన్లలో కల్లు, సారా ఇయ్యడం కానీ ఓట్ల కోసం డబ్బులియ్యడం కానీ నా జీవితంలో నేనెప్పుడు చెయ్యలే. పనిచేస్తూ పోయినం. మళ్ల వాళ్లు గెలిపిస్తే పనిచేసుకుంటూ పోదాం లేకపోతే రెస్టు దీసుకుందాం అనే పద్ధతిలో ఉన్నం. సరె అవుతలి వాళ్లు అంత డబ్బు ఖర్చుపెట్టినా అంత సారాయిబాండి ఇచ్చినా జనం ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించిండ్రు. ఇక్కడ హైదరాబాద్‌లో మా నియోజకవర్గ నాయక బృందమంతా వస్తే భోజనం చేసి కూర్చున్నం పిచ్చాపాటిగా.



కూర్చున్న తర్వాత నిజంగా ఇంత పడిపడి మనల్ని ప్రజలు గెలిపిస్తున్నరు. మరి ఆ స్థాయికి తగిన పని మనం చేస్తున్నమా? ఆ బ్రహ్మాండంగా చేసినం సార్. నీళ్ల స్కీములు, రోడ్లు అవీ ఇవీ చేసినం. అని రొటీన్ విషయాలు వాళ్లు చెబుతున్నరు. నేను ఒక మాట అడిగిన వాళ్లను. ఎందుకంటే, ఏదైనా చెయ్యాలనే ముందు సమాజం అంగీకారం, సపోర్టు కూడా తీసుకోవాలి కాబట్టి. అక్కడ ఉండే నా సహచరుల బృందం అంగీకారం తీసుకోవాలె కాబట్టి. ఆ రోజు నేను ఒక థాట్ ప్రవేశపెట్టిన అక్కడ. సరే నేను ఎమ్మెల్యే అయిపోయి పదేండ్లయితంది. దళితులు ఎక్కడ ఉన్నోళ్లు గక్కడనే ఉన్నరు. పైస మందం కూడామార్పు లేదు. వాళ్లేమనుకుంటున్నరన్నది పక్కనబెడదాం. మనకు సాటిస్‌ఫ్యాక్షన్ ఉందా వాళ్ల అభివృద్ధి మీద? మన ఆత్మలేమంటున్నయి. నిజంగనే బాగలేదు సార్ అన్నరు. మరి బాగలేదని మనం కూడా అందరిపూక్క వదిలేద్దామా? ఏదైనా చేద్దామా అంటే వాళ్లేమన్నరంటే...అంత స్టేట్ గవర్నమెం టు లెవల్లో ఉంటయి కదా మనమేం చేద్దాం అన్నరు.



ఎంతయితే గంత. పదివేల కిలోమీటర్ల ప్రయాణం అయినా మొదటి అడుగుతోనే ప్రారంభమవుతది.ఏం చేయగలిగితే అది చేద్దాం. మీరు సహకరిస్తమంటే చేద్దామని చెప్పిన. 
వాతావరణం ఎట్ల తయారైందంటే..ఈ రాజకీయ పార్టీలు, నాయకులు ఊకె మాట్లాడి, బడుగు బలహీన వర్గాలు, దళితవర్గాలు అనుకుంట ఊదరగొట్టే వర కు, ఎంతో మందిసొమ్మంతా తీసుకపోయి దళితులకు పెడుతున్నరు అన్న ఇంప్రెషన్ వచ్చింది సొసైటీకి. అక్కడక్కడ ఒగడొగడు అంటడు. అవివేకంగా.. ఏదైన కార్యక్షికమం తీసుకుందామంటే..మళ్ల మీరు మాల, మాదిగల ముచ్చ మొదలు వెట్రిండా..అని అంటరు. అంటే...ఏదో మందిసొమ్ము..దేశం సొమ్మంతా ఖజానంత దోచి వాళ్లకు పెడుతున్నటు ప్రచారం.. వాస్తవానికి ఏంది ఎనుకకు తిరిగి చూస్తే ఏమీ లేదు. ఎక్కడి గొంగడి అక్కడే ఉన్నది.. ఆ చెప్పిందాంట్లో పదిశాతం పని జరిగినా కూడా ఈ పాటికి మొత్తం ఫోకస్ అయ్యేది. దరివూదమంతా పోయేది.



కానీ.. కమిట్‌మెంట్ లేదు. నినాదాత్మకమైనటువంటి అప్పటికప్పుడు తాత్కాలికంగా వాళ్లను రంజింపజేసి ఓట్లను గుంజుకునేటువంటి పనులు ప్రభుత్వాలు పార్టీలు చేస్తున్నయి. కాబట్టి మన దేశంలో దళితుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. అందుకని నేను వాళ్ల సమ్మతి తీసుకున్న. 
ఇంకొక అనుభవం ఉన్నది నాకు.నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో.యగామాలపొంటి పోతుంటే నాకో విచివూతమైన అనుభవం. నేను మొదటిసారి గెలిచింది తెలుగుదేశం ఎమ్మెల్యేగ. నేనో కమిట్‌మెంట్ పెట్టుకున్న. ఎమ్మెల్యే అయిన తర్వా త నా సంతకంతోని.. నా రెకమండేషన్ తోని ఓ పోస్టు వస్తే ఓ దళిత సోదరుని కి ఇప్పియ్యాలె ఫస్ట్ పోస్టు అనుకున్నం. సిద్దిపేటలో మ్కాట్ కమిటీ ఛైర్మన్ పోస్టు వచ్చింది. నేను ఎమ్మెల్యేగా రికమండేషన్ చేసి ఇప్పించేది. దానయ్య గారు అనే ఒక మివూతుణ్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఇప్పించినం.



పేరు చెప్పంగనె, కొంద రు అగ్రకులస్తులు వచ్చిండ్రు. నేను అడిగినాయన కూడా మంచి వర్కరు. నా క్లాసుమేటు, గ్రాడ్యుయేట్. ఎలక్షన్లలో బాగా తిరిగిండు. ఆయన కూడా దెబ్బలవడ్డడు కాంగ్రెసోళ్లు కొడితే. .మరి ఆయనకు లేని అర్హత ఏందయ్య?మీకు ఉన్న ఎక్స్‌ట్రా అర్హత ఏంది ఆయనకు లేని అర్హత ఏంది. ఒక ఎస్సీ అనా మీరుమాట్లాడేది..సాలు ఈ ఐదేండ్లు ఉంటే సాలు పొమ్మని చెప్పిన. ఆయనను బ్రహ్మాండంగా కంటిన్యూ చేసినం. ఆయన చాలా గొప్పగా పనిచేసిండు.. ఆ మార్కెట్ కమిటీకి చాలా లాభంచేసిండు. ప్రజలకు రైతులకు. ప్రూవ్ అయ్యింది, ఎవరైనా సరే పనిచేయగలుగుతరని. దాని తర్వాత అప్పటికి పాపం దళితులు ఇందిరాగాంధీ తమకేమో చేసిందనే అభివూపాయంతో ఉన్నరు. కాంగ్రెస్ పార్టీకి ఏకబిగిన ఓట్లు ఏత్తు రు. అప్పటికి ఆమె కొంత చేసింది. ఈ జాతి ఎంత గొప్పదంటే ఇమాన్‌దారీ జాతి. బేమాన్‌దారీ జాతి కాదు.



అసలు ఇందిరాగాంధీని రాజకీయాలలో బతికించిందే దళితులు. కశ్మీర్ టూ కన్యాకుమారి వరకు.ఆమెను అంత పెద్ద లీడర్‌ను చేసిండ్రు. కొద్దిపాటి సాయం ఆమె ఏం చేసిందోకానీ మాకు ఈమె చేసింది అనే అభివూపాయంతో కాపాడిండ్రు. అయితే అప్పుడేందంటే వీళ్ల నాకు ఓటు వేయలేదు. ఎందుకంటే నేను టీడీపీ నుంచి వచ్చిన కాబట్టి. ఎమ్మెల్యే అయిన. గ్రామాలు తిరుగుతున్న. దళిత వాడలు మన కర్మగాలి ఈ దేశంలో ఊరు అటువైపో ఇటువైపో ఉంటయి. ఊళ్ల సభచేసి దాటుతున్నం. దళితవాడల కొంత మంది లేడీస్ కొంతమంది జంట్స్ పాపం. వాళ్లకు గిల్టీగా ఉన్నది. ఎందుకంటే మేం ఈయనకు ఓటు వేయలేదు. ఎందుకంటే గ్రూపు రాజకీయాలు ఉండే కదా. ఇగ నేను పోతుంటే, ఆహాఁ ఏమేమి ఇచ్చిపోతుండ్రో. ఏమేమి చేసి పోతండ్రో .. అనిఎకసెక్కంగా మాట్లాడుతున్నరు. నేను ఫీలవుతున్న. నేను ఎమ్మెల్యేనయిన వీళ్లు నా ప్రజలు.



వాళ్లు ఐసోలేటై సపరేటయి ఉన్నరు.. ఇంకో గ్రామం పోతే సేమ్ సిచువేషన్. ఆ మండలం అయిపోయింది.. సిద్దిపేటకు వచ్చినం. నగునూరు అని మరో మండలానికి పోవాలె. పోతున్నం. నేను మథన పడుతున్న మైండ్ల. సరే ఒక ప్రోగ్రాం సెట్ చేసుకున్న. ఇదే సిచువేషన్ ఎదురైతే ఏం చేయాలె అని. నా అంతట నేనే ఒక అవగాహన చేసుకున్న. నగునూరు మండలంలో అంకుశాపురం అనే గ్రామం. సేమ్ సిమిలర్ సీన్ రిపీట్ అయ్యింది ఆడ కూడా. ఊరు తర్వాత ఉన్నది దళితవాడ. ఆ ఊరు దాటి పై గ్రామానికి పోవాలె. అక్కడ కూడా సేమ్ సిచువేషన్ ఉంటే నేను డ్రైవర్‌ను బండి అపమని చెప్పి దిగి... అందట్ల ఒక ముసలామె ఉన్నది పెద్దమనిషి. ఆమె దగ్గరికి పోయి నిలబడి అమ్మా నీ పేరేందని అడిగిన. ఏమో పేరడగవడితివి పోలీసుకు ఇత్తవా.. నేను ఎమ్మెల్యేగా ఉండి మీ ఊరుకొచ్చి నిన్ను పోలీసుకువట్టిస్తే నాకేమత్తది నాకు అర్థం కాదు. నీతోని మాట్లాడదామని అడుగుతున్న అంటే సరే అని చెప్పి మల్లవ్వ అని చెప్పింది. పా అవ్వ మీ ఇంటికి పోదాం పా అన్న. పోదాం పద అని ఆమె తన ఇంటికి తీసుకొనిపోయింది.



ఇంటికి పోయినంక రెండు సాపలు తెమ్మని చెప్పి అందరిని కూసొమ్మని చెప్పిన. అందరం కూసున్నం. కొంచెం మంచి నీళ్లిమ్మని అడిగి తెప్పించుకున్నం. కూసున్నంక నేను అడిగిన. మీరేం చెప్పక పోతిరి.నేను ఎమ్మెల్యే అయి నాలుగు నెలలు అయితంది. నాకేం తెలువదు. మీ కడుపులున్నది నాకెట్ల తెలుస్తది అన్న. సార్ అంత మంది ముందర మమ్ముల్ని అడగనిత్త రా?అంత తెల్ల బట్టలొల్లే నాయె అన్నరు.అప్పుడు నేను చాలా బాధపడ్డ.అక్కడినుంచి నేను అనుకున్న. ఇప్పటినుంచి ఎక్కడికి పోయిన ఏ ఊరికి పోయినా ఊళ్లొక సభ, దళితవాడల ఒక సభ. వారు మన దగ్గరికి వచ్చుడు కాదు. మనమే వాళ్ల దగ్గరికి పోవాలె. ఇగ వాళ్లనడిగిన . ఏం సమస్యలున్నయని. సార్ మత్తు మందికి అడిగినం. ఓ మైలు దూరం పోయి నీళ్లు తెచ్చుకుంటున్నం.



ఓ బోరు ఏత్తే కాదా అన్నది. సరే ఓ బోరు కావాలె. ఇంకేం సమస్యలున్నయని అడిగిన. మా బస్తిల 19 మందికి ఇండ్ల ప్లాట్లు ఇచ్చిండ్లు. పదేండ్లాయె. ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలె. ఇదంతా ఎందుకు చెప్పుతున్ననంటే.. ఇక్కడే మన ఎమ్మెల్యేలున్నరు. వారికి కూడా తెలువాలని చెప్పుతున్న. ఎమ్మెల్యేగా పని చేసేటప్పుడు పొత్తుల సద్దిలాగా బతకాలె. ఓ కులానికో, మతానికో సంబంధించి పనిచేయొ ద్దు. అందరిని కులుపుకొని పోవాలె. ఏ ఒక్క కులపోడో ఓటేస్తే నువ్ గెలువవ్. ఎమ్మెల్యే అనే వాడు ప్రజల్లో పనిషిగా బతకాలె. ఇదంతా అయినంక సరె.. మల్ల వ్వ నీకు రెండే సమస్యలు కదా. ఒకటి బోరింగు, రెండు ఇండ్లు. ఆపేర్లు ఇవ్వమ ని తీసుకున్న పందొమ్మిది పేర్లు. మల్లవ్వ నువ్వు ఆరున్నర ఏడుగంటల వరకు మీకు బోరుబండి అత్తది. మీ ఇంటి పేరు ఏందవ్వ అంటే మల్లమారి మల్లవ్వ అనిచెప్పింది. అది రాసుకున్న డైరీల. బస్తిల నువ్వే పెద్దమనిషి అంటే నేనే పెద్దమనిషిని అన్నది. పొద్దుగాల ఏడుగంటల వరకు మీ ఊరుకు బోరువస్తది.



నువ్వు మంచిగ స్నానం చేసి ఉండు. దేవునికి దండం పెట్టి ఓ కొబ్టరి కాయకొట్టి, రెండు ఊదుబత్తీలు ముట్టించి బోరుస్టార్ట్ చెయ్యమని చెప్పి, తర్వాత నువ్వు 11 గంటల బస్సుకు సిద్దిపేటకు రమ్మని ఓ యాభై రూపాయల నోటు తీసి ఆమె చేతిలో పెట్టి న. మీకు ఇండ్లది ఆర్డర్ ఇప్పిస్తా అని. ఇచ్చినంక ఆమె ఏమంటదంటే లీడర్ల మీద ఆ రోజుల్లో ఉన్న నమ్మకం అట్లాంటిది. నేను యాభై రూపాయలు ఇచ్చినంక ఖాయమేనా మరి అన్నది. అంటే లీడర్ల మీద అపనమ్మకం. చెప్పుతరు దాటుతరు అవుతల పడతరని. మళ్లిటు పోతే తిరిగిచూడరని. అప్పటి వరకు నాయకుల మీద ఉన్న నమ్మకం అట్లాంటిది. ఖాయమేనా అంటే ఖాయం కాకపోతే మల్లవ్వ నీకు యాభై రూపాయలు ఎందుకిత్త అన్న. అంటే వచ్చింది. వచ్చే వరకు ఆ బోరుపోయింది. మంచిగ కొబ్టరి కాయ కొట్టింది. దేవునికి దండం పెట్టి స్టార్ట్ చేసింది బోరు. అన్నం దిన్నది సక్కగ సిద్దిపేటకు వచ్చింది.



ఇంటికి వచ్చింది. వచ్చేవరకు ఈ హౌజింగ్‌ల సాంక్షన్లు ఉంటయి కదా.కొన్ని నాట్ స్టార్టెడ్ అవీ ఇవీ ఉంటయి. నేను ఆ డిప్టీలను అందరిని పిలిచి, నాకు కమిట్‌మెంట్ ఉందయ్య ఒక పందొమ్మిది ఇండ్లు కావాలంటే వాళ్లు సాంక్షన్ చేసి అన్ని రెడీ చేసి నాకు సాంక్షన్ ఆర్డర్ తెచ్చి ఇచ్చిండ్రు. ఆ ఏఈని తెచ్చి రెడీగా పెట్టిన ఆమె వచ్చే వరకు. ఇంట్లకొచ్చింది. వచ్చేటప్పుడు ఓ ముగ్గురు నలుగురిని వెంటబెట్టు కుని వచ్చింది. నేను కూసున్న ఎదురుగ చైర్ ఉన్నది. కూసో మల్లవ్వ అంటే అబ్బో నీముందట నేను కూసోను అంటది. నువ్వన్న కూసుంటవా నేనన్న నిలవడాల్నా అన్న. అవి ఉన్నయే మీ కోసం మీరు కూర్చోవాలని ఆమె జబర్దస్తీగా కూర్చోబెట్టి మాట్లాడి, మంచిగా ఆ ఏఈతోని ఆ సాంక్షన్ కాపీ ఇప్పించి, ఇగో ఈయనే వచ్చి ముగ్గుపోత్తడు మళ్లో కొబ్టరికాయ తయారు పెట్టుకో.. ఎప్పుడు పోతవయ్య అంటే ఎల్లుండి పోత సార్ అన్నడు. ఖాయం గా పోవాలె మాట తప్పద్దు అని మాట తీసుకుని.. ఎల్లుండి వస్తడు.. ముగ్గు లు పొయ్యి... మంచిగ ఇండ్లు కట్టినంక నేను ఇనాగరేషన్‌కు వస్త.



అప్పుడు మాట్లాడుదాం..అని చెప్పిన. మళ్లొక వంద రూపాయలు ఇచ్చి వీళ్లందరికి అన్నం తినబెట్టి ఇంటికి తీసుకపో అని చెప్తె పోయిందామె. పాపం ఈయనకు ఓట్ల తోని సంబంధం లేదు. పనిచేస్తండు మనకు అని దళితులకు కూడా తెలిసిపోయింది. ఆపక్కూరోల్లు , ఆపక్కూరోల్లు, ఆ పక్కూరోల్లు వచ్చిండ్రు. అద్భుతంగా రెండు సంవత్సరాలల్లో నియోజకవర్గంలో నేను కూడా ప్రతి దళితవాడలో మీటింగ్ పెట్టి సమస్యలు నేనే రాసుకుంటున్న కాబట్టి.. గ్రామాల్లో ఫిఫ్టి ఫిఫ్టి ఉండే, కానీ దళిత వాడల నిండా టీడీపీ జెండాలయినయి. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. ఇమాన్‌దారీ జాతి అని ఎందుకు చెప్తున్నా అంటే వాళ్లకు మంచి మెదిలి పనిచేస్తే అంతే మద్దతును అంతే ప్రేమను వాళ్లు కూడా రిటర్న్‌గా ఇస్తరు. ఇందిరాగాంధీకి ఇచ్చిన రిటర్న్స్ కూడా మనం చూసినం. ఇంకొక బాధ ఏదంటే...దళిత ప్రజల్లో అన్నింటిని ముంచి పెట్టే బాధ.. మా ఖర్మ ఇంత అనేటువంటి.. ఆలోచనా విధానం. ఇప్పు డు కొంత మారుతున్నది. కొంత కొత్తతరం వస్తుంటే మారుతున్నది. 



ఎమ్మెల్యే అయిన తర్వాత ఊళ్లల్లో పోతుంటే జీతగాళ్ల డబ్బులు ఇప్పించగల రు అని కోరుతున్నాం అని దరఖాస్తులు ఇస్తరు. నేను కొత్తకదా ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యేను కదా నాకు తెలవదు. ఆ తాసీల్దార్‌ను అడిగి ఏందయ్య ఈ జీతగాళ్ల డబ్బులేందని అడిగితే.. బాండెడ్ లేబర్ స్కీం సార్ అన్నడు. ఏమతయిది బాండెడ్ లేబర్ ఏం జేస్తరు అంటే.. ఇగ ఓ పటేల్ దొడ్లె కెళ్లి బండి తెస్తడు. ఓ పటేల్ దొడ్లకెళ్లి ఎడ్లు తెస్తరు. వీళ్లను నిలబెట్టి ఫోటో తెస్తరు. దానికింద ఐదు వేల స్కీం అత్తది. ఐదువేలల్ల సర్పంచ్ పదిహేను వందలు, వీఎల్‌డబ్య్లూ పదిహేను వందలు తీసుకుని ఈయనకో రెండువేలు చేతిలపెడ్తరు. ఆ ఊరు దాటంగనే ఆ బండి అటు పోతది ఈ ఎడ్లు పోతయి. ఈ రెండు వేలు అచ్చినయి ... నా నియోజకవర్గంలో బాండెడ్ లేబర్ స్కీమే వద్దు. ఆ పైసలు ఎన్ని వస్తయో మొత్తం మాకు ఇవ్వమని అడిగిన. వాటిని ఏం జేస్తరు సార్ అన్నడు కలెక్టర్. వాటితో.. భూములున్న దళితులకు వెల్స్ తవ్విస్త. వాటితో వ్యవసాయం చేసుకుంటరు. కొద్దో గొప్పో పండించుకుంటరు.



నేను మల్లయ్య దగ్గరికి ఎళ్లి నువు ఇక నుంచి బాండెడ్ లేబర్ కావు. ఇక పోదాం పా. బాయి తవ్వుదాం అన్న. బాయి ఏంటిది సార్ అన్నడు. నీభూమిలో బాయి తవ్వి వ్యవసాయం చెయ్యాలె అన్న. అప్పుడు ఆయన ఏమన్నడంటే.. ఇగ మేం బాయి తవ్వి, వ్యవసాయం చేసి పటేన్లమైతాం అన్నడు. అంటే ఇగ మేం పైకిరాం అన్న స్థితిలో ఉన్నరు. అట్లనే ఆలోచిస్తున్నరు. ఖర్మ సిద్ధాంతాన్ని నమ్మి అలా అంటున్నరు. కాని నేను పనిగట్టుకొని కొందరిని ఒప్పించి బావులు తవ్వించిన. వారిని చూసినంక ఒకరు ఒకరు అందరూ బావులు తవ్వుకున్నరు. దుబ్బాక మండలంలోని దుంపలపల్లి గ్రామంలో బాయిలేని, కరెంటుమోటర్ లేని దళిత కుటుంబం లేదు. నేను ఎమ్మెల్యే దిగిపోయే నాటికి మూడువేల బావులు తవ్వించిన.



ఆ తర్వాత నేను నా నియోజక వర్గంలో దళితచైతన్యజ్యోతి అనే ఓ కార్యక్షికమం తీసుకున్నం. పాటలతో క్యాసెట్ తీసినం. చైతన్య కార్యక్షికమం తీసుకు న్నం.మండలానికొక ఊరు దత్తత తీసుకున్నం. అప్పుడున్న కలెక్టర్ కూడా దళితుడే. డీసీ రోశయ్య అనే కలెక్టర్ సాయంతో.. ప్రోగ్రాం మొదలు పెట్టినం. ఊళ్ల ప్రతి ఒక్కరికీ ఇల్లు ఉండాలని తీర్మానించుకున్నం. 1 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కడికి ఇల్లుండాలని ఇండ్లు కట్టించినం. దళితులకు ఒక్క దగ్గర భూమి ఉండది. అక్కడో గుంట, ఇక్కడో రెండు దొయ్యలు అంటరు. ఊరు చుట్టూ ఇసిరేసినట్లున్న భూమిలో వ్యవసాయం చేయడానికి వీలుగాదు. అప్పుడు కమతాలు ఏకీకరణ కార్యక్షికమాన్ని చేపట్టినం. దీనితో.. దళితులకు వ్యవసాయ యోగ్యంగా ఉండే విధంగా ఎకరమో, ఎకరం నరో భూమి తయారైంది. అది ఒక ఎకనామిక్ యూనిట్ అయ్యింది. దీంతో.. దీనిపై బ్యాంకు అప్పు ఇస్తది. అప్పో సప్పో చేసి ఏదో అభివృద్ధి చేసుకుంటడు.



ఇక దళితులకు నేను ట్రాక్టర్లు కూడా కొనిచ్చిన. ప్రతి దళిత వాడకు ఓ ట్రాక్టర్.అలాగే సిద్దిపేటకు పిలిపించి క్లాసులు పెట్టించినం. మహిళను కూడా పిలిపించి క్లాసులు నిర్వహించినం. బాగా చైతన్యం చేసినం. ఇట్ల చేస్తుండగనే దండోరా ఉద్యమం వచ్చింది. దళితులలో సమస్య వచ్చింది. దళితుల ట్రాక్టర్ మాదిగల వాడల ఉండాల్నా, మాలల వాడల ఉండాల్నా అని పంచాయితీ. ఏం చేయలేని పరిస్థితి. కలిసికట్టుగా ఉన్న వారు రెండుగా విడిపోయిండ్రు. ఖర్మ అని నెత్తి కొట్టుకొని.. చిన్న చిన్నగా దళిత మహిళా సంఘాలు పెట్టినం. చిన్న చిన్న మొత్తాలతో సేవింగ్స్ చేయించినం. ఇలా అనేక చిన్న చిన్న కార్యక్షికమాలతో దళితులలో మార్పుకు కృషి చేసినం. అంటే వీటన్నింటితో.. గొప్ప మార్పు వచ్చిందని నేను అనను. కానీ.. కొద్దో గొెప్పో మార్పు వచ్చింది. ఉపయోగపడింది. నేననేది ఏంటంటే.. ఒక ముఖ్యమంత్రో, ప్రధాన మంత్రో ఇలా ఆలోచిస్తే..



దళితుల పరిస్థతి ఇలా ఉండేదా అని? దళితుల సమస్యల గురిం చి మిత్రులు అనేక రెప్రజం ఇస్తున్న రు. వీటన్నింటిపై మన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని శాసనసభా సమావేశాలలో నిలదీస్తరు. తప్పక ప్రభు త్వం మెడలు వంచి దళితుల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడుతరు.
ఎంత దుర్మార్గమంటే.. మన ప్రభుత్వాలు, నాయకులు దళితుల సంక్షేమం గురించి మాట్లాడుతరు .కానీ..దళితుల ఫండును దేనికి పడితే దానికి మళ్లిస్తరు. ట్యాంకు బండుకు, మూసీ మురికి శుభ్రత కోసం ఖర్చు చేసి దళితులు ఖాతాలో రాస్తరు. ఇప్పటి దాకా ఈ ప్రభుత్వం 16 వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేసింది. ఈ మధ్యన చంద్రబాబు కూడా దళితుల సంక్షేమం గురించి మాట్లాడుతుండు. నాకు సిగ్గైంది. ఆయన హయాంలో అయితే 4, 047 కోట్లు ఇతర పనులకు మళ్లించిండు. ఈ నంగనాచి నాయకులు చెప్పేదంతా దండగ. మన ఫోరం ఫర్ దళిత్ స్టడీస్ మల్లెపల్లి లక్ష్మయ్య ఈ విషయంపై వివరంగా స్టడీ చేస్తున్నడు. మేం కలుస్తుంటం.



అండ్ల మంచి మేధావులున్నరు. రేపు తెలంగాణ వచ్చినంక దళితులను ఎట్ల బాగు చేసుకోవాలె. ఏం సంగతి. ఇండియాకు ఆదర్శం కావాలె అనే పద్ధతిలో డిస్కషన్ చేస్తుంటం. ఆయన దగ్గర ఉంది ఈ రిపోర్టు అంతా. గవర్నమెంటు ఇచ్చిన లెక్కలే మనం చెప్పే లెక్కలు కాదు. చంద్రబాబు నాయుడు పీరియడ్ 4,047 కోట్లు సంవత్సరం వారీగా లెక్క ఉంది. ఆయన డైవర్ట్ చేసిండు. ఆయనే ఇప్పుడు మళ్ల మాట్లాడుతడు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అపోజిషన్‌లో ఉంటే ఇంకోమాట. ఎవరున్నా ప్రజలకు మాత్రం చేసేది ఏమీ లేదు. శాస్త్రీయ దృక్పథంతోని పనిచేసే అవగాహన లేదు. నాకు ఇంకో అసంతృప్తి కూడా ఉంది. కంప్లయింట్ కూడా.. మీరు ఏమైనా అనుకొండి. దళితుల సంఘా ల పేరు మీద సంఘాలు పెట్టి రియల్ కాజ్ కోసం పనిచేసే వాళ్లు. అంత రియలిస్టిక్‌గా పనిజరుగలేదు. ఎట్ల పోతయి. ఎట్ల జరుగుతుందండీ, గీ కాలంలో గింత ఎడ్యుకేషన్ ఉండి, గింత చైతన్యం ఉన్న టైం.. 16 వేల కోట్లు డైవర్ట్ చేస్తే దళిత జాతి ఎందుకు మౌనంగా ఉంటున్నది.



దళిత మేధావులు ఎందుకు మౌనం వహిస్తున్నారు. ఎందుకు కొట్లాడలేకపోతున్నం మనం. అది సమీక్ష చేసుకోవాల్సిన అవసరముంది. దళిత వర్గంలోని మేధావులు అంబేడ్కర్ చెప్పిన సిద్ధాం తం ప్రకారం దళిత వర్గాన్ని సమీకరించి, బోధించి, పోరాడితే.. తప్పకుండా రిజల్ట్స్ వస్తయి. గజ్జున వణికియ్యాలె. ఎందుకంటే మనది సానా దిక్కుమాలిన దేశం. అంటే బాధ. నేను దేశ ద్రోహం మాట్లాడుతున్నరంటరు. ఏ దేశానికి లేని జబ్బులు మనకు కొన్ని ఉన్నయి..మానవ జాతికి లభించే అపూర్వమైన అమూల్యమైన సంపదే.. మానవ సంపద. చాలా దేశాల్లో కొత్తగ పిల్లలు పుడితే వాళ్ల స్లోగన్ ఏముందంటే.. మా దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇయ్యాల మాకు రెండు చేతులు జోడయినయి అంటరు. అంత విలువగా చూస్తరు మనిషిని. మన దేశంల నువ్వు ఎస్సీవి, నువ్వు ఎస్టీవి.. నువ్వు ఊరు బయటుండు.. నువ్వు తండాలుండు.. పుట్టిన మనిషిని ఈ జాతికి సంపదగ వచ్చిన ఆ మానవ రత్నా న్ని సానబెట్టి నువ్వు డైమండ్ చేస్తవా.. 



ఇన్‌ఫీరియర్‌చేస్తవా సుపీరియర్‌చేస్తవా.. సుపీరియర్ చేస్తే మనిషి పైకి పోతడు సుపీరియర్ అయితడు. నువ్వు అంటరానివాడిని నువ్వు గుళ్ళెకు రావద్దు.. నువ్వు బళ్లెకు రావద్దు.. ఇట్లా మాట్లాడెటప్పటికీ...అయిపాయె మా ఖర్మ గింతే.. నాకే ఎదురయింది కదా.. హఁ మేం బాయి లు తవ్వి పటేండ్లమయితమా.. అట్లా ఎందుకయిండ్రు... మా ఖర్మ గింతే మేం దళితవాడలో పుట్టినం మా బతుకుగింతే...ఇట్టే బతకాలి అనే ఒక అపనమ్మక స్థితి.. మేం కూడా పైకి రాగలుతమనే విశ్వాసంలేని స్థితి... ఆ స్థితికి వాళ్లు నెట్టివేయబడ్డారు. దళితులు గిరిజనులు కలిపితే దాదాపు ఇరవై ఐదు శాతం. ఇరవై ఐదుశాతం మందిని ఇట్ల సంపుకుంటిమా... ఇన్‌ఫీరియర్ చేస్తిమా.. మహిళలు యాభై శాతం..ఆడవాళ్లు చేయగలిగే పని మగవాళ్లు చేయగలిగే పని..అని మిగతా ఏ దేశంలో లేదు.. ఆడవాళ్లు అనంగనే కిచన్‌లో పనిచేయాలి. ఎందుకు పనిచేయాలె..



ఆడవాళ్లల్లో ప్రతిభామూర్తులు లేరా? కిచన్ కూడా ఇంప్టాంటే.. కానీ కిచన్ ప్రొడక్టివ్ సెక్టర్ కాదు. అన్‌వూపొడక్టివ్ సెక్టర్ అది... తెలివికల్ల దేశాలు ప్రతిభ, మేధస్సు ఎక్కువ ఉన్నవాళ్లను ఉత్పాదక రంగంలో పెట్టుకుంటరు. కొద్దిగ తక్కు వ ప్రతిభ ఉన్న వాళ్లను అనుత్పాదక రంగంలో పెట్టుకుంటరు. ఆ దేశాలు బాగుపడతయి. ఆ దేశాలు గొప్పగ ఉజ్వలంగా ఉంటయి. కానీ జెండర్ బయాస్ పేరు మీద ఆడవాళ్ల మీద.. యాభై శాతం కదా నువ్వు వంటింట్లోనే ఉండాలె...అని వాళ్లను చంపితివి.. ఇరవై శాతం ఇటు సంపితివి. యాభై శాతం అటు సంపితివి. ఇగ మిగిలిన ఇరవై ఐదు శాతంల తినితిరిగే జులాయిపూందరు. ఏం పని చేయక, హఁ నేను పనిచేస్తనా అనే సిపాయిలున్నరు కదా మనకు. గీ పరిస్థితులు పెట్టుకొని మన దేశం బాగుపడతదా? ఈ కుల వివక్ష, మత వివక్ష, జెండర్ వివక్ష.. లింగ వివక్ష ఇవన్నీ పెట్టుకుని చంపుకుంటున్నం ఈ దేశాన్ని మనమే..ఇది పోవల్సిన అవసరముంది. దీని మీద కొంత పని జరగాల్సిన అవసరముంది.



ఆ కోణంలోనే మేం దళిత పాలసీ తయారు చేసినం. రేపు తెలంగాణ స్టేట్ ఎట్ల ఉండాలని దళిత పాలసీ తయారు చేసినం. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారానికి వస్తే దళిత నాయకుడే ముఖ్యమంత్రి అవుతడని చెప్పిన. దళితుల కోసమే దళిత ముఖ్యమంత్రి కాదు.. పేద వర్గాల ప్రతినిధిగా.. పేద వర్గాలు ఎంత మంది ఉన్నరో వాళ్లు బీసీలు కావచ్చు.. ఎస్సీలు కావొచ్చు.. మైనారిటీలు కావొచ్చు. ఒక పేద వర్గాల ప్రతినిధి టాప్ పొజిషన్‌లో ఉంటే ఎజెండా చాలా పర్‌ఫెక్ట్‌గా అమలయితది. కింద అధికారులకు భయం ఉంటది. ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి సమకూర్చమని చెప్పినం. ఓ టెలివిజన్ సన్నాసి అన్నడు యాడికెల్లి ఇస్తవని.. 



ఓ లక్షయాభై వేల ఎకరాలు పంచినమని ముఖ్యమంత్రి అనంగనే ఆ ఎమ్మెల్యేలంతా బల్లలు కొడతరు.. ఆ పంచిన పద్ధతి ఏందండి.. మా ఊర్లనే మా సొంత ఊరిలో... చింతమడకలో ఓ పడమటి గడ్డకు తొంభై ఎకరాల భూమి ఉంటే.. 120 మందికి సర్టిఫికెట్లు ఇచ్చిండ్రు.. ఆ తొంభై ఎకరాల సీకు మీద గీత లు గీసుకంట పోయిండ్రు. ఇది ఎల్లయ్యకు ఇది మల్లయ్య ఇది పుల్లయ్యకు.. ఓ దారిలేదు. ఇటుసైడున్నోడు అవుతలికి పోవాలంటే ఎలిక్యాప్టర్ ఎక్కి ఎగిరిపోవా ల్నా. ఎంత అశాస్త్రీయంగా.. ఇచ్చే యూనిట్ ఎంత? ఇరవై గుంటలు.. పదకొం డు గుంటలు.... ఆ రోజుల్లో పటేళ్లదాయె పట్వారీలదాయె... వానికో సారా సీస ఇస్తే పది గుంటపూక్కువ రాస్తడు..లేకుంటే రాయడు. ఇట్లా అశాస్త్రీయంగా.. చెప్పుకోవడాలు ప్రచారాలుచేసుకోవడాలు, మేం ఇంత భూమి పంచినమని..



ఏదీ భూమి, ఏదీ దానికి ఏమైనా ఎవల్యూషన్ ఉందా? ఆ భూమికి నీళ్లున్నయా లెవ్వా... అది ఎకనామిక్ యూనిటా కాదా..? ఆ ఫ్యామిలీ దాంట్ల బతుకుందా అది ఏమైనా పనిచేస్తుందా.పభుత్వానికేమైనా పట్టింపుందా.. దానికింకెవడన్నా ఆఫీసరున్నడా... మెకానిజం ఉందా.. నో...అంటే నామ్‌కే వాస్తే ఇస్తరన్న మాట.. ఓట్లు గుంజుకోవడానికి నినాదం.. మేం పంచినం అంటే పంచినం. ఎంత అశాస్త్రీయం ఇది, ఎంత క్రైం ఇది.. గొప్ప సోషల్ క్రైం ఇది. సమాజం పట్ల మీ బాధ్యత ఏం నిర్వర్తిస్తున్నరు మీరు... ప్రజలను గోల్‌మాల్ చేసి పాగల్ చేసి. ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నరు తప్ప హృదయపూర్వకంగా..ఏది పని.. అందుకనే నేనేమన్ననంటే.. కచ్చితంగా తెలంగాణలో కమతాల ఏకీకరణ జరగాలి.. ముఖ్యంగా దళితుల భూముల ఏకీకరణ టాప్ ప్రయారిటీలోజరగాలి.. మూడెకరాలు మినిమం ఉంటే ఒడ్డుకో ఒరానికో, కాలువకో, కల్లానికో,ఓ పావెడంత..
పోయినా కూడా రెండు ముప్పావు ఎకరాలు నెట్టు ఉంటది. దాని కింత వాటర్ సోర్సు, ఒక సంవత్సరానికి కావల్సిన పెట్టుబడి సబ్సిడీ వంద శాతం ఇస్తమని చెప్పినం.. తెలంగాణ రాష్ట్రంలో. ఆయన దగ్గర పెట్టుబడి ఉండదు కాబట్టి.. ఇస్తే.. ఏదన్న చేసుకుంటడు దాన్ని. బతకగలుగుతడు.. అదొక యూనిట్ అయితది.. ఈ రకమైన ఆలోచన చేస్తే తప్ప తెలంగాణలో మనకు తెలంగాణ వచ్చినం క కూడా..అంత గొప్పగా ఏముండదు.. మళ్లా గిదే.. ఈన గాచి నక్కల పాలు చేసినట్టు మళ్లా పాత పద్ధతే.... గదే సిస్టం ఉంటే మనం ఏం సాధించినట్టు. దేని కోసం తెలంగాణ...అని చర్చ జేసినం.. చర్చ జేసి ఇదంతా ఓ పాలసీ చేసినం.. 



రెండవది ఈ మధ్య నేను ఒకటి ప్రకటిస్తున్న. మీరు ఉపాధ్యాయులు కాబట్టి.. కచ్చితంగా ఉచిత నిర్బంధ విద్య.. ఇప్పుడున్నోళ్ల పద్ధతి ఏంటండి. కుల వివక్ష వద్దంటు ముఖ్యమంత్రి ఊదర గొడ్తడు.. కానీ ఆయనే సంతకం పెడ్తడు. ఎస్సీ హాస్టల్, ఎస్టీ హాస్టల్, బీసీ హాస్టల్.. కులాలు వర్ధిల్లు గాక.. ఏంది దాని ఆంత ర్యం? ఎందుకు ఎస్సీ హాస్టల్ పేరు పెడుతున్నవ్.. ఎందుకు ఐసోలేట్ చేస్తున్నవ్ మెయిన్ స్ట్రీమ్ నుంచి.. కుట్ర కాదా .. అందుకే రేపు తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు ఉండయ్..‘స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్’ ఉంటది..బాపనాయన, రెడ్డాయన, కోమటాయన, వెలమాయన, మాదిగాయన, మాలాయన అందరు ఒక్క బళ్లె చదవాలె. ఎందుకు సదవద్దు.. హైదరాబాద్ లాంటి అర్బన్‌లో కులాల ప్రసక్తి లేకుండానే కలిసి చదువుకుంటున్నరు.



పదిహేనేళ్ళు కలిసి చదువుకున్న వాళ్లు ఏ కులమో తెలువకుండా కలిసిమెలిసి ఉన్నరు. అందరూ కలిసి చదువుకుంటే.. ఆప్యాయత, ప్రేమ ఉంటది. ఎలాగూ ఊళ్లలో ఊరిబయట పెట్టా రు. కనీసం విద్యార్థులుగా నన్న కలిసి ఉండనీయరా? సమాజంలో ఎలాగూ కుల వివక్ష ఉంది. విద్యార్థులంతా కలిసి చదువుకుంటే కులసమస్యకు ఓ పరిష్కారం దొరుకుతది. అందుకే వంద శాతం మందికి సెంట్రల్ సిలబస్‌తో ఇంగ్లిష్ మీడియం చదువులు అందుబాటులో ఉండాలె. సకల సౌకర్యాలతో బట్టలు, భోజనం.. అదీ వానకాలం హాస్టళ్లలో నాసిరకం భోజనంతో కాదు.. సకల సదుపాయాలతో.. హాస్టళ్లలో కేజీ నుంచి పీజీ వరకు అందరూ కలిసి చదువుకునే స్థితి కల్పించాలె. వచ్చే కాలంలో గ్లోబల్ కాంపి దీనిని తట్టుకునే విధంగా మానవ వనరులను అభివృద్దిచేయాలె. మనిషిని మనిషిగా చూడనీయని ఆలోచనా విధానాన్ని నిర్మూలించేది ఎట్లనో ఆలోచించాలె.



దాని కోసం సెంటర్ ఫర్ సబాల్టర్న్ స్టడీస్ అని ఓ సెంటర్ పెట్టి కృషి చేసిన. ఈ దిశగా ఆలోచించాలె. మనుషులమంతా సంతోషంగా,.. కలిసిమెలిసి ఉండే సమాజం కోసం ఆలోచించాలె. ఆ దిశగా అడుగులు వేయాలె. అప్పుడే మనం, దేశం, ప్రాంతం ప్రపంచంతో పోటీ పడుతుంది. పోటీని తట్టుకుంటుంది. నెగ్గుతుంది. అభివృద్ధి చెందుతుంది. 



రేపు తెలంగాణ వస్తే, తెలంగాణలోని ప్రజలకు సరియైన న్యాయం జరుగుతుంది. అంటే.. మెజారిటీగాఉన్న దళిత, బీసీ, మైనారిటీ, గిరిజన వర్గాలకు తగు ప్రాతిపదికన న్యాయం జరుగుతుంది. సమైక్య రాష్ట్రంలో జరుగని న్యాయం రేపు తెలంగాణలో జరుగుతుంది. ఈ స్పష్టమైన విధానంతోనే తెలంగాణకు దళిత ముఖ్యమంత్రి అవుతాడని అన్నాం. ఒట్టిగా, ఆషామాషీగా అనలే. విద్యార్థుల ఫీజుల సమస్య మొదలు దళిత, బీసీ వర్గాల ఫండ్స్ విషయం దాకా తెలంగాణ లో కచ్చితంగా నిధులు కేటాయించి అభివృద్ధి పరుస్తం. ఇప్పటి పాలకుల మాదిరిగా గాకుండా.. చాలా స్పష్టమైన పాలసీతో ముందుకు పోదాం. అన్ని వర్గాల, సెక్షన్ల ప్రజల, మేధావుల నుంచి అభివూపాయాలు, ఆలోచనలు తీసుకొని, క్రోడీకరించి తెలంగాణ అభివృద్ధి కోసం ఉత్తమమైన పాలసీని తయారు చేద్దాం. తెలంగాణను ప్రపంచంలో అగ్రభాగాన నిలుపుదాం. 

-కె చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్ అధినేత
( టీజీటీయూ డైరీ ఆవిష్కరణ సభలో ప్రసంగ పాఠం
Namasete telangana News Paper Dated 18/02/2012 

No comments:

Post a Comment