Friday, February 3, 2012

లైంగిక నేరాలపై మరో చూపు


స్త్రీల వస్త్రధారణ -లైంగిక నేరాలపై డీజీపీ వ్యాఖ్యలను, స్త్రీ వాద, హక్కుల ఉద్యమకారులు కేవలం 'స్త్రీ హక్కులు, పురుషాహంకార ధోరణు'ల కోణంలో మాత్రమే విశ్లేషించి రాద్ధాంతం చేయటం సమంజసమేనా? ఈ అంశానికి ఇతర కోణాలుండే అవకాశం ఉందా అనే ముఖ్యమైన ప్రశ్న ఉంది. తాము గాఢంగా విశ్వసించే ఒక దృక్పథాన్ని మాత్రమే 'ఏకైక సత్యం' గా స్త్రీ హక్కుల వాదులు భావిస్తే, ఈ విషయమై వారిది 'సొరంగ వీక్షణం' (టన్నెల్ విజన్)గా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. 

ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ముఖ్య అధికారి మహిళల పట్ల జరుగుతున్న శారీరక, లైంగిక నేరాలను విశ్లేషించే క్రమంలో, మహిళలు ధరించే దుస్తులు కూడా వారిపై జరిగే లైంగిక వేధింపులు, నేరాలకు కారణాలయిన అనేక అంశాల్లో ఒక పరోక్ష అంశం అయి ఉండవచ్చుననే భావన వ్యక్తపరచారు. దానిపై ముఖ్యంగా హక్కుల నాయకులు, స్త్రీ హక్కుల ఉద్యమ కారులూ దాదాపు విరుచుకు పడ్డారు. డీజీపీ మాటలను పురుషాధిక్య ధోరణికీ, పురుషాహంకారానికి ప్రతీకలుగానే వర్ణించారు. కానీ, ఈ విషయంలో హక్కుల నాయకులూ, స్త్రీ వాద ఉద్యమకారులూ తొందరపడ్డారా? డీజీపీ చెప్పిన అంశాన్ని కూలంకషంగా పరిశీలిద్దాం. 

ఇది, స్త్రీల వస్త్రధారణకు సంబంధించినది. 'రెచ్చగొట్టే' విధంగా స్త్రీల వస్త్ర ధారణ ఉండటం, వారిపై జరుగుతున్న 'శారీరక, లైంగిక' నేరాలకు ఒక కారణం అయివుండవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. 'మా శరీరం, మా ఇష్టం; మాకు నచ్చినట్టు, మేము మెచ్చినట్టు బట్టలు వేసుకుంటామ'నీ, 'నేరాలకు హింసకూ పాల్పడిన వారిని వదలిపెట్టి, గురి అయిన వారిదే తప్పు అన్నట్లు మాట్లాడతారేమిటి'' అని స్త్రీ హక్కుల ఉద్యమకారులు ఎలుగెత్తి నిరసిస్తున్నారు. ఎవరి వాదన ఎంత వరకూ సమంజసం? 

బహుశా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆడా మగా ఒకరినొకరు ఆకర్షించుకోవటానికై ఒక సాధనంగా దుస్తులను రూపొందించటం మొదలై ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని సమాజాలలోనూ, ఒకరినొకరు ఆకర్షించే వయస్సులో ఉన్న స్త్రీ పురుషులు, స్త్రీలయితే పురుషులను ఆకర్షించటానికి, అంతేకాక అటువంటి ఆకర్షణలో తోడ్పటానికై తన చుట్టు పక్కల ఉన్న స్త్రీలందరిలోనూ తానే వీలైనంత ప్రత్యేకంగా, విశిష్టంగా కనిపించటానికీ; అదే విధంగా పురుషులు కూడా స్త్రీలను ఆకర్షించటానికి, దుస్తులను రూపొందించుకుంటున్నారని అనటంలో సందేహం లేదు. 

ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలకూ, తీవ్రవాద ప్రతివాదాలకూ ఎంతైనా అవకాశం ఉంది. 'మా శరీరం, మా ఇష్టం' అనే మాట, ఈ విషయంలో స్త్రీ హక్కుల ఉద్యమకారులందరకూ దాదాపు ఒక 'యుద్ధ నినాదం' అయింది. స్త్రీల దుస్తుల విషయంలో తప్పొప్పుల జోలికి పోకుండా, చరిత్రలో జరిగిన వివిధ మానవసమాజాల అనుభవాలను పరిశీలిస్తే ఆసక్తికరంగా ఉంటుంది. మధ్యప్రాచ్య దేశాలలోనూ, కొన్ని ఇతర దేశాలలోనూ కొన్ని వందల సంవత్సరాల పూర్వం నుంచి ఇప్పటికీ ఒక మతానికి చెందిన స్త్రీలు తలనుంచి కాళ్ళ వరకూ తమ శరీరాన్ని దాదాపు పూర్తిగా కప్పివేసేలా ఒక ముసుగు ధరిస్తున్నారు. 

అది కూడా, కేవలం ఇల్లు వదలి బయటకు పరపురుషుల మధ్యకు వెళ్ళేటప్పుడు మాత్రమే ధరిస్తున్నారు. మన దేశంలోనే, ఉత్తర ప్రాంతాలలో కొన్నింటిలో, గత కొన్ని వందలు లేదా అంతకన్న ఎక్కువ సంవత్సరాలుగా, వివాహితలైన స్త్రీలు, భర్త, కుటుంబ సభ్యలు తప్ప పరపురుషులకు తమ ముఖం కనిపించకుండా ఉండే రీతిలో, తల మీదనుంచి ముఖం కప్పేలా చీర కొంగును ధరిస్తున్నారు. కమ్యూనిస్టు విప్లవం తర్వాత చైనాలో అనేక దశాబ్దాల పాటు, స్త్రీపురుషులందరూ, 'స్త్రీ పురుష శరీరావయ నిర్మాణంలోని తేడాలు బయటకు స్ఫురించని' రీతిలో 'మావో కోట్లు' ధరించే వారు. కాని పైన చెప్పిన మూడు ఉదాహరణలలోనూ, అన్నింటికీ వర్తించే ఒక సమానాంశం ఉంది: చాలా సమాజాలలో స్త్రీలకు ఇటువంటి 'ప్రత్యేక' దుస్తుల ఏర్పాటు వారి అంగీకారంతో జరిగి ఉండకపోవచ్చు. ఆయా సమాజాలలోని పెద్దలే, స్త్రీలకు సంబంధించిన ఈ దుస్తుల ఏర్పాట్లు చేసి, వాటిని ఆయా సమాజాలలోని స్త్రీ లందరకూ 'తప్పనిసరి' చేసి ఉండవచ్చు. 

మానవనాగరికత-అభివృద్ధి పరిణామక్రమంలో, వివిధ మానవ సమాజాల్లోని మతం, కులం, దేశం, ప్రాంతం వంటి వాటిలో సంబంధం లేకుండా, 'వెనక్కు మరలించలేని' రీతిలో కొన్ని అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఎటువంటి దేశంలోనైనా, ప్రాంతంలోనైనా, కుటుంబ ఆదాయాలు పెరిగి, ఆర్థిక పరిపుష్టి కలిగే క్రమంలో, ఆయా సమాజాలలోని స్త్రీలకు విద్య, ఉద్యోగావకాశాలు నెమ్మదిగా పెరుగుతాయి. విద్య, ఉద్యోగావకాశాలు పెరిగి, ఆర్థిక స్వాతంత్య్రం ఏర్పడినప్పుడు, స్త్రీలలో తమ తమ ప్రత్యేక వ్యక్తిత్వం గురించిన అవగాహనా చైతన్యాలు దృఢంగా చోటు చేసుకుంటాయి. ఇది కేవలం ఒక 'మంచి' పరిణామం మాత్రమే కాదు; ఇది ఒక 'వెనక్కు మళ్ళించలేని' పరిణామ క్రమం. 

విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక స్వాతంత్య్రం అంది పుచ్చుకొని, తమ వ్యక్తిత్వ ప్రత్యేకతల పట్ల నమ్మకం ఉన్న స్త్రీలలో, ఇంకొకరికి అణిగి మణిగి ఉండే నిస్సహాయత ఉండదు. అటువంటి నేపథ్యంలో, 'నా శరీరం, నా దుస్తులు, నా యిష్టం' అని అనటంలో ఏ మాత్రం తప్పులేదు. కానీ, స్త్రీవాద, హక్కుల ఉద్యమ కారులు డీజీపీ వ్యాఖ్యలను, కేవలం 'స్త్రీ హక్కులు, పురుషాహంకార ధోరణు'ల కోణంలో మాత్రమే విశ్లేషించి రాద్ధాంతం చేయటం సమంజసమేనా; ఈ అంశానికి ఇతర కోణాలుండే అవకాశం ఉందా అనే ముఖ్యమైన ప్రశ్న ఉంది. తాము గాఢంగా విశ్వసించే ఒక దృక్పథాన్ని మాత్రమే 'ఏకైక సత్యం'గా స్త్రీ హక్కుల వాదులు భావిస్తే, ఈ విషయమై వారిది 'సొరంగ వీక్షణం' (టన్నెల్ విజన్)గా మాత్రమే మిగిలిపోయే ప్రమాదం ఉంది. 

'స్త్రీలు ధరించే దుస్తులు వారిపై జరిగే లైంగిక వేధింపులకు, దాడులకూ కారణం కావచ్చు' అనే ప్రతిపాదనను, హక్కుల ఉద్యమాల కోణంనుంచి కాకుండా, ఇతర కోణాల నుంచి పరిశీలిద్దాం. వ్యక్తులపై, ముఖ్యంగా స్త్రీలపై జరిగే శారీరక, మానసిక హింస; అది గృహ హింస కావచ్చు, కార్యాలయాల్లో లేదా పనిచేసే చోట్లా అడపాదడపా వినిపించే లైంగిక వేధింపులు కావచ్చు లేదా జనం తిరుగాడే స్థలాల్లో (రోడ్లు, రైళ్ళు, బస్సులు, పార్కులు, సినిమా హాళ్ళు వంటివి) జరిగే లైంగిక వేధింపులు, హింసకావచ్చు; ఇవన్నీ ప్రస్తుతం మన దేశంలో ఎక్కువగా 'నేర కోణం'లో మాత్రమే పరిగణింప బడుతున్నాయి. 

కానీ, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటువంటి సంఘటనలను కేవలం నేరాలుగా మాత్రమే కాకుండా, 'ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అంశాలు'గా పరిగణింపబడి, వాటిని మళ్ళీ జరగకుండా నిరోధించటానికై తగిన చర్యలు ప్రభుత్వ వ్యవస్థ తీసుకుంటున్నది. అటువంటి నేరాలకు పాల్పడిన వారికి 'మానసిక సలహా, సహాయం' అందించే ఏర్పాట్లు కూడా ఉంటున్నాయి. ఇదే అంశాన్ని ఇంకొక కోణం నుంచి చూడవచ్చు. స్త్రీలపై లైంగిక వేధింపులు, హింస, మానభంగాలు వంటి నేరాలు చేసే పురుషులు, తమలోని శారీరక మానసిక వత్తిడులను నిగ్రహించుకోవటంలో సఫలం కాలేకపోతున్నారని అనవచ్చు. 

ఒక విధంగా, కొన్ని వేల సంవత్సరాలుగా, మనిషి తనలోని పాశవిక ప్రవృత్తులను మనోనిగ్రహంతో అణచుకుని, ఇంకొక మనిషిని శారీరక, మానసిక వత్తిడికి, హింసకూ, దుఃఖానికీ గురిచేయకుండా ఉండేందుకు చేసే నిరంతర ప్రయత్నమే 'నాగరికత'. కానీ, సమస్య ఏమిటంటే, మన చుట్టూ ఉన్న సమాజంలో, ముఖ్యంగా మనకు పరిచయంలేని వ్యక్తులలో, ఎవరు ఎంత 'నాగరికత'కలవారో, లేదా, ఇంకా పశు ప్రవృత్తులు బలంగా ఉన్నవారో తెలిసే మార్గం లేదు. అటువంటి పరిస్థితుల్లో, ప్రతి వ్యక్తీ, తన 'మంచి' లేదా 'క్షేమం' కోసం, తాను ఇతరుల వలన శారీరక లేదా మాససిక లైంగిక హింస, వేధింపులకు గురికాకుండా ఉండేలా, తన 'కట్టూ-బొట్టూ' తగిన రీతిలో కలిగిఉండటం మంచిది కదా! స్త్రీలు 'రెచ్చగొట్టే' దుస్తులు ధరించకుండా ఉంటే వారికే మంచిదనే భావన ఈ కోవకు వస్తుందేమో? దీనికి అనేక ఇతర ఉదాహరణలు చూడవచ్చు. 

మోటారు వాహనాలు నడపటంలో 'డిఫెన్సివ్ డ్రైవింగ్' అనే ఒక సిద్ధాంతం లేదా పద్ధతి ఉంది. అంటే, తాను వాహనం నడుపుతున్న సమయంలో, రోడ్డుపై ఉన్న ఇతర వాహన డ్రైవర్లూ, పాదచారులూ చేయటానికి అవకాశముండే పొరపాట్లను ఊహించి, వాటి వలన తన వాహనానికి ఏర్పడగలిగే 'రోడ్డు ప్రమాద' పరిస్థితిని తప్పించే విధంగా, తగు జాగ్రత్తతో తన వాహనాన్ని నడపటమే 'డిఫెన్సివ్ డ్రైవింగ్'. డీజీపీ సూచన ఇటువంటి మంచి ఉద్దేశ్యంతో చేసినదేనని ఎందుకనుకోకూడదు? 

ఇంకొక ఉదాహరణ. అభివృద్ధి చెందిన దేశాలలోని పోలీసులు, తమ పౌరులకు తరచూ ఈ విజ్ఞప్తులు చేస్తుంటారు: 'మీకు శారీరక హానికలిగే అవకాశముండే పరిస్థితులలో, మారణాయుధాలు కలిగిన దోపిడీదార్లు మీ డబ్బు లేదా విలువగల వస్తువులను మీ నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తే, వాటిని వారికి ఇచ్చి వేయండి. దోపిడీదారులతో తలపడేందుకు ప్రయత్నం చేయకండి' అని. ప్రస్తుత అంశంలో స్త్రీ ఉద్యమ కారులు వాదిస్తున్న రీతిలో, ఆ దేశాలలోని పౌరులు, పోలీసులను, 'మీరు చేత కాని దద్దమ్మలు; మీరు నేరస్థులను నిరోధించటం, నేరాలను అరికట్టడం మానేసి, మమ్మల్ని దోపిడీదార్లకు మా డబ్బూ వస్తువులూ ఇచ్చెయ్యమని సలహా ఇస్తారా' అని ఆగ్రహించ వచ్చు. కానీ ఆ దేశాలలో ఎవరూ కూడా ఈ విషయంలో పోలీసులను తప్పు పట్టరు. 

దాదాపు అందరూ ఈ సూచనలను పాటిస్తారు. ఎందుకంటే, దీనిలోని ముఖ్య ఉద్దేశ్యం పౌరులకు జరుగగలిగే అవకాశమున్న శారీరక హానిని వీలైనంతవరకూ నివారించటమేకాని, దోపిడీ హానిని వీలైనంతవరకూ నివారించటేమేకాని, దోపిడీదారులను ప్రోత్సహించటం కాదు. కనుక, స్త్రీల వస్త్రధారణ, వారిపై జరుగుతున్న లైంగిక హింస అనే అంశంపై, డీజీపీ విశ్లేషణలో ఒక నిజాయితీతో కూడిన మంచి ఉద్దేశ్యం ఉందని చెప్పవచ్చు. ఆఖరిగా, మనం, మన కుటుంబాలలో మన పిల్లలు బయటకు వెడుతున్నప్పుడు, వాళ్ళ దుస్తులు 'సమంజసమైనవి'గా మనకు అనిపించకపోతే, ఆ విషయం వారికి చెప్పటానికి మనం ప్రయత్నం చేయమా? తాను వెలిబుచ్చిన భావన, ఒక సాటి పౌరునిలా, మన కుమార్తెలు, చెల్లెళ్ళు హితం కోరే వానిలా డీజీపీ చెప్పారని ఎందుకు అనుకోకూడదు? ప్రతి విషయంలో, ప్రతి మాటకీ అధికారుల మాటలను తప్పుగా మాత్రమే ఎందుకు అన్వయించాలి? ఆలోచించండి.
- సి.బి.ఎస్. వేంకటరమణ
(రచయిత ఐఏఎస్ అధికారి. అభిప్రాయాలు వ్యక్తిగతం)
Andhra Jyothi news paper dated 04/02/2012 

No comments:

Post a Comment