Saturday, February 25, 2012

'డ్యాన్స్' పేరిట ధ్వంసమౌతున్న బాల్యం--మహెజబీన్


పబ్లిక్‌గా పిల్లల మీద జరుగుతున్న మానసిక, శారీరక హింస, దోపిడికి సంబంధించిన కొన్ని విషయాలను రాష్ట్ర ప్రభుత్వం ,ప్రజల దృష్టికి తెస్తున్నాను. చాలా రోజుల నుంచి టీవీలో పిల్లల డ్యాన్స్ ప్రొగ్రాం 'ఆట' గమనిస్తున్నాను. ఇందులో సృజనాత్మకత, కౌశలం తక్కువగా, అశ్లీలత ఎక్కువగా కనిపించింది. ఈ మధ్య ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను చూశాను. గుండె రగిలిపోయింది.

ఇందులో ఒకతను డాన్స్ మాస్టర్ కావచ్చు, అతడి ఒంటి మీద కూడా బట్టలు ఉన్నట్టు అనిపించలేదు. అతడు చిన్న వయసులో ఉన్న ఒక అమ్మాయిని (ఆ బాలిక బిగించి కట్టిన ఒక చిన్న జాకెట్టు, నిక్కర్ లాంటిది వేసుకుని ఉంది) ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అతడి ఒక చేయి బాలిక గుండెను అదిమి పట్టి ఉంది. మరో చేయి బాలిక కాళ్ళ మధ్య ఉంది. చిన్న ఆడపిల్లలకు ఒళ్ళంతా కనిపించే బట్టలు వేయడం, జాకెట్టు లాంటిది బిగించి కట్టి కండలు, కండలుగా ఒళ్ళు కనిపించేటట్టు మేకప్ చేయడం, వాళ్ళ చేతి అశ్లీల పాటలు పాడించడం ఏ సంస్కృతిలో భాగం? 

ఒక బాలిక బూతు పాటకు డ్యాన్స్ చేస్తే, సుందరం మాస్టర్ (మాస్టర్ తాతా అని పిల్లలు పిలుస్తారు) 'చింపేసావ్, నీ షేపులు జ్యోతి లక్ష్మిలా ఉన్నాయి, నీ పొట్ట పొట్ట జ్యోతిలక్ష్మిలా ఉంది, నువ్వు డ్యాన్స్ చేస్తున్నంత సేపు జ్యోతిలక్ష్మి గుర్తుకు వచ్చింది' అని కామెంట్ చేశాడు. నాకు ఈ మాస్టర్ అంటే గౌరవం ఉంది, కానీ అభ్యంతరమంతా కామెంట్స్‌లో వాడిన భాష గురించి. పెద్ద వాళ్ళు మాట్లా డే ఈ రెండు అర్థాల మాటల్ని పిల్లలకు కూడా నూరి పోస్తున్నారు. పిల్లలను న్యాయ నిర్ణేతల కుర్చీలో కూర్చోబెట్టి, వాళ్ళ చేత ఈ మాటలే చెప్పిస్తున్నారు.

edit.చిన్న పిల్లలకు అసభ్యతను, అశ్లీలతను స్లో పాయిజన్‌లా కొంచెం కొంచెంగా ఎక్కిస్తున్నారు. దీని వల్ల ఈ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక లైంగిక నేరాలు చేయడం లేదా బాధితులుగా మారే ప్రమాదం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పిల్లలపై లైంగిక నేరాలు పెరిగిపోయాయి. దీనికి మొగ పిల్లలు మినహాయింపు కాదు. చైల్డ్ పొర్నొగ్రఫీ విస్తృతంగా వస్తున్న నేపథ్యంలో మనంపిల్లలను మరింత జాగ్రత్తగా పెంచాలి. లేక పోతే మానసికంగా దెబ్బతినవచ్చు. 

డ్యాన్స్ నేర్చుకుంటున్న పిల్లలు మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు. వాళ్ల పై విపరీతమైన పోటీని రుద్దుతున్నారు. ఎక్కువ సమయం షూటింగ్ లైట్ల మధ్య గడపడం వల్ల వారి చర్మం మీద రేడియేష న్ ప్రభావం ఉంటుంది. ఆహారం, నిద్ర సరిపోక ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇంత చేసి వీళ్ళు సమాజానికి ఇచ్చేది ఏమిటీ అంటే జుగుప్స, అశ్లీలత. 

ఒకసారి పాత సినిమాలలో బాల నటులను గుర్తుకు తెచ్చుకుంటే... వాళ్ళు కూడా డ్యాన్సులు చేసారు. పాటలు పాడారు. వాళ్ళ మేకప్, వాళ్ళ అభినయం చాలా అద్భుతంగా ఉంటుంది. పాత తెలుగు సినిమాలలో చిన్న ఆడపిల్లలకు స్త్రీలు వేసుకునే జాకెట్టు లాంటిది వేసి ముడి వేసేవారు. చూసేందుకు చాలా బాగుంటుంది. ఏ మాత్రం కూడా అశ్లీలత, అసభ్యత కనిపించదు. అలీని, శ్రీదేవిని బాల నటులు గా చూస్తూ వచ్చాం.

'కోడి ఒక కోనలో... పుంజు ఒక కోనలో ' అంటూ పిల్లలు పాడిన పాట, ఆ అభినయం మనకు ఎప్పటికీ గుర్తుంటుంది. 'పాపం పసివాడు' సినిమాలో ఎడారిలో నడుస్తూ 'అమ్మా చూడాలి... నాన్నను చూడాలి.. నాన్నకు ముద్దు ఇవ్వాలి... అమ్మ ఒడిలో నిద్దుర పోవాలి... అమ్మా ...' అంటూ ఓ చిన్న పిల్లవాడు చేసిన అభినయం మన చేత కంట తడి పెట్టిస్తుంది. మన కొడుకు ఎడారిలో తప్పి పోయిన భావన కలుగుతుంది. కానీ 'ఆట' కార్యక్రమంలో పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే ఇటువంటి భావన కలుగదు. జుగుప్స తప్ప. 

చిన్న ఆడపిల్లల చేత సెక్సీ డ్రస్సులు వేయించి, బూతు పాటలకు డ్యాన్సులు చేయించి డబ్బులు సంపాదించే తల్లిదండ్రులను ఎక్కడా చూడలేదు. చేసింది చాలక పిల్లల హక్కుల కార్యకర్తలపై మానవ హక్కులకు ఫిర్యాదు చేశారు. ఆడపిల్ల అంటే నేడు చిన్నది, రేపటికి పెద్దది. ఎదుగుతున్న వయసులో ఉన్న ఆడపిల్ల ల్ని డ్యాన్స్ పేరతో మగవాళ్లు ఒకరి చేతుల నుంచి ఒకరు విసిరేస్తుంటే, ఆది చూసి ఆనందించే తల్లిదండ్రులను ఏమనాలో తెలియడం లేదు. బాల్యం కేవలం చదువు కోసం మాత్రమే (ఆటలు, పాటలు,కథలు కలిసి) అని వారు తెలుసుకుంటే మంచి ది. 

పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టరూపంలో వచ్చినందు కు, పిల్లల హక్కుల కార్యకర్తగా నేను ఎంతో సంబర పడ్డాను. ఒకవైపు బాల కార్మికుల కోసం పని చేస్తూ, మరోవైపు విద్యా హక్కు చట్టం బాగా అమలు జరిగేటట్టు చూస్తున్న సందర్భంలో 'ఆట' డాన్స్ కార్యక్రమం నాకు తీవ్రమైన మనస్తాపాన్ని కలిగించింది. ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు, చానెల్ యజమానులు, బూతు వ్యాఖ్యలు చేసిన న్యాయనిర్ణేతలు సంపాదించిన డబ్బును అంతా ఎ.పి. చైల్డ్ లేబర్ ప్రాజెక్టుకు విరాళంగా ఇస్తే సమంజసంగా ఉంటుంది. 

నాకేమీ ఛాందస భావ జాలం లేదు. అత్యాధునిక ఆలోచనలే ఉన్నాయి. 25 ఏళ్ళ వయసులో నా కూతురు సినిమాలో నటిస్తాను, మాడలింగ్ చేస్తాను, అందాల పోటీలో పాల్గొంటాను అంటే నాకేమీ అభ్యంతరం లేదు. అయితే చదువుకోవలసిన బాల్యంలో నా కూతురికి సెక్సీ డ్రస్సులు వేసి డ్యాన్సులు చేయించడానికి నేను ఒప్పుకోను. నా కూతురికి ఏ న్యాయమో మరొకరి కూతురికి కూడా అదే న్యాయం. 

- మహెజబీన్ 
(వ్యాసకర్త కవయిత్రి, న్యాయవాది)  
Andhra Jyothi News Paper Dated : 11/05/2010

No comments:

Post a Comment