Saturday, February 25, 2012

నిజాం సరే, అరసం నిరంకుశత్వం మాటేమిటి? - జిలుకర శ్రీనివాస్


నిజాం నిరంకుశత్వం గురించి చర్చ ఎంతో కాలంగా సాగుతున్నా, కమ్యూనిస్టులు మాత్రం ఇప్పటికీ పూర్వ వైఖరినే పునరుద్ఘాటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను దాదాపు ఆరు దశాబ్దాల పాటు వ్యతిరేకించిన 'కమ్యూనిస్టుపార్టీ' చివరకు 'ఓట్ల రాజకీయాల' నేపథ్యంలో అంగీకరించక తప్పలేదు. దీంతో అభ్యుదయ రచయిత సంఘం వైఖరి కూడా తదనుగుణంగా మారింది. 

అరసం కొత్త వైఖరిని పైకి ప్రదర్శిస్తున్నప్పటికీ తెలంగాణ చరిత్ర విషయంలో ఎస్వీ సత్యనారాయణ, వేల్పుల నారాయణ వ్యాసాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రత్యేక- సమైక్య వాదాలలో దేనికీ చెందని వానిగా మిత్రుల వ్యాసానికి స్పందిస్తానని దివికుమార్ అన్నప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు దక్షిణ భారత దేశంలో నిలదొక్కుకోవడానికి తెలుగువారు ముక్కలు కావడానికి కారకుడు నిజాం అని సమైక్యవాదం వినిపించారు. 

ఈ తటస్థ వాదం అంతిమంగా ప్రజా వ్యతిరేకవాదంలో అంతర్భాగం అవుతుందనడానికి దివి కుమార్ వ్యాసమే ఉదాహరణ. తెలంగాణ చరిత్ర పేరుతో ఇప్పటి వరకు కమ్యూనిస్టు దృక్పథం నుంచే ప్రధానంగా రచనలు వెలువడ్డాయి. నిజాం వ్యతిరేకత కేంద్రంగా ఉన్న సాహిత్యమంతా విద్వేషంతో, చారిత్రక అంశాల పట్ల తగినంత ఎరుకలేని అజ్ఞానంతో, స్వీయ తప్పిదాలను ఇతరులపై నెట్టే ఆధిపత్య భావజాలంతో నిండి ఉంది. 

ఇంతటి అశాస్త్రీయమైన, ప్రజా వ్యతిరేక దృక్పథం ప్రబల శక్తిగా మారడంలో అరసం పాత్ర కూడా ఉంది. చరిత్రను జడమైందిగా అరసం భావిస్తున్నదని వీరి వ్యాసాలు తెలుపుతున్నాయి. నిరంతరం నిర్మించుకునేదే చరిత్ర. ఇందుకు అవసరమైన అకరాలు సేకరించి, మారిన సందర్భంలో పునర్ వ్యాఖ్యానించుకోవాలి. పూర్వ అభిప్రాయాలను విశ్లేషించుకుని కొత్త ఫలితాల ఆధారంగా నిశ్చితాభిప్రాయాలను నిజాయితీగా మార్చుకోగలగాలి. ఇదొక నిరంతర ప్రక్రియే తప్ప నిశ్చలమైనది కాదు. కానీ మార్కిస్టు సాహిత్యకారులుగా చెప్పుకుంటున్నవారు మార్క్సిస్టు మూల సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. 

తెలంగాణ బహుజన దృక్పథాన్ని చరిత్రను నిర్‌బ్రాహ్మణీకరించే సందర్భమిది. తెలంగాణ చరిత్ర అంటే నిజాం వ్యతిరేక పోరాటమనే మూఢవాదం వల్ల బహుజనుల సగర్వమైన చరిత్ర మరుగున పడింది. కొన్ని లక్షల ఏళ్ల చరిత్రను ఏడేళ్ళకు కుదించే కుట్ర నిస్సిగ్గుగా ఇంతకాలం జరిగింది. తెలంగాణ తెలంగాణ ప్రాంతంలో ఆర్యుల దురాక్రమణకు ఆరు వందల ఏళ్ల పూర్వమే వ్యవసాయిక కోట నాగరికత, పట్టణ నాగరికత నిర్మాణమై ఉన్నాయని పురావస్తు ఆధారాలు నిరూపిస్తున్నాయి. 

నాణాల ద్వారా కనుగొన్న తెలంగాణ జాతి సమున్నత చరిత్రను ఆంధ్ర సంపన్న పాలక కుల భావజాలం తెలియకుండా చేసింది. అదే భావజాలాన్ని మార్క్సిజం పేరుతో ఎస్వీ, వేల్పుల ప్రచారం చేస్తున్నారు. నిజాంను కీర్తించే వారిని విమర్శిస్తున్న వారి అజ్ఞానం కొండంత. జాతిపిత మహాత్మా జ్యోతిబా పూలే నిజాం రాజును శ్లాఘించారు. 1880లోనే జ్యోతిబా పూలే హైదరాబాద్ రాజ్యంలో నిజాం అమలు చేసిన నీటిపారుదల విధానం వల్ల ఇక్కడి రైతుల పరిస్థితి గణనీయంగా మారిపోయిందన్నారు. బ్రిటిష్ వారు అమలు చేస్తున్న నీటి పారుదల విధానం వల్ల కేవలం భట్ బ్రాహ్మణులు, కులకర్ణీలు, పటేల్, పట్వారీలు మాత్రమే లబ్ది పొందుతున్నారని ఆయన విమర్శించారు. 

కమ్యూనిస్టులు ప్రచారం చేస్తున్న నిజాం రాజ్యం శిలా సదృశమైనది. కానీ నిజాం ప్రత్యక్ష పాలనలో ఉన్న తెలంగాణ వేరు. దేశ్‌ముఖులు , జాగిర్దారుల అధీనంలో ఉన్న తెలంగాణ వేరు. నిజాం ప్రత్యక్ష పాలనలోఉన్న తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు దేశంలో ఎక్కడా లేని ప్రాధాన్యం ఉండేది. ఆది హిందూ ఉద్యమ నిర్మాత భాగ్యరెడ్డి వర్మ , అరిగె రామస్వామి వంటి మహనీయులు ఆదరించిన నిజాం ఎస్సీ, ఎస్టీ, బిసిల విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయించారు. భాగ్యరెడ్డి వర్మను విద్యాశాఖమంత్రిగా నియమించిన నిజాం ఎస్సీ,ఎస్టీ, బిసిలకు గొప్పవాడే. 

నిజాం 1910 నాటికే వెట్టిచాకిరిని రద్దు చేస్తూ చట్టం చేసారు. సురవరం ప్రతాప రెడ్డి రాసిన 'సంఘాల పంతులు' కథ ఇందుకు నిదర్శనం. నిజాం ప్రత్యక్ష పాలనలో ఉన్న హైదరాబాద్ రాజ్యంలో వెట్టిచాకిరీ లేదు. దేవదాసీ వ్యవస్థను రద్దు చేసారు. మద్యపాన నిషేధం కోసం అనేక చైతన్య కార్యక్రమాలు చేపట్టారు.జగన్ మిత్ర మండలిగా పారంభమైన అంటరానివారి ఉద్యమం ఆదిహిందూ ఉద్యమంగా, ఆది ఆంధ్ర ఉద్యమంగా పరిణామం చెందింది. ఎస్సీ, ఎస్టీ, బిసిల విద్యాభివృద్ధికి 1930 నాటికే తెలుగు మాధ్యమంలో ఉచిత పాఠశాలలు ప్రారంభించారు. 

కులం, మతం, లింగం ఆధారంగా విద్యార్థులకు ప్రవేశం నిరాకరిస్తే శిక్ష పడుతుందని నిజాం హెచ్చరించాడు. నిజాంను ఎస్సీ, ఎస్టీ, బిసి సంఘాల నాయకులు సన్మానించారు. నిజాం సైన్యంలోని జంబన్న వంటి వీరులైన మాదిగలెంతో మంది పదవులు, గౌరవాలు పొందారనేది కమ్యూనిస్టులు ఏనాడూ చెప్పలేదు. రోలు పన్ను, రోకలి పన్ను... వంటివి వసూలు చేసి నిజం ఖజానా నింపుకున్నాడనేది ఎస్వీ ఆరోపణ. ఇన్ని రకాల పన్నులు ఏ ఉత్తర్వులో నిజాం పేర్కొన్నాడో ఒక్క జి.వొ. నెంబరైనా పేర్కొనలేదు. అగ్రవర్ణ జమీందార్లు చేసిన దోపిడీకి నిజాంను బాధ్యుడిని చేయడం ఎంతవరకు న్యాయం. పాలకునిగా నిజాం బాధ్యుడే అయినప్పటికీ,ఆయన ఒక్కడే బాధ్యుడు కాదు. నిజాం పాలన చివరి దశలో రాజకీయ పరిస్థితి దారుణంగా మారింది. 

ఈ జమీందార్లు, ఖాసీం రజ్వీతో కుమ్మక్కై నిజాంను బలహీనుడిని చేశారని చరిత్రచెబుతుంటే ఎస్వీ, వేల్పుల మాత్రం కాదని బుకాయిస్తున్నారు. సాయుధ రైతాంగ పోరాటంలో 4,500 మంది బలైంది నిజాం నిరంకుశత్వానికే అని గుర్తించాలని వేల్పుల దబాయిస్తున్నారు. రజాకార్లతో జరిగిన పోరాటంలో 400 మంది మరణిస్తే, పోలీస్ యాక్షన్ తరువాత నాలుగు వేల మంది మరణించారని సంగిశెట్టి శ్రీనివాస్ తెలిపారు.వేల్పుల మాత్రం దానిని అంగీకరించేది లేదని నిజాం నిరంకుశత్వమే కారణమని వాదిస్తున్నారు. 

పోలీసు యాక్షన్ తరువాత నాలుగు వేల మంది మరణించడానికి కమ్యూనిస్టులు కూడా బాధ్యత వహించాలి. పోలీస్‌యాక్షన్ తరువాత సాయుధ పోరాటం సాగించకూడదని తెలంగాణ రావి నారాయణ రెడ్డి వంటి నాయకులు వాదించారు. రజాకార్ల పేరుతో అమాయక ముస్లింలను ఊచకోత కోయడాన్ని రావి నారాయణ రెడ్డి ఫాసిజంగా పేర్కొన్నారు. పోలీసు యాక్షన్ తరువాత సాయుధ పోరాట విరమణ చేయాల్సి ఉంది. కానీ ఆంధ్ర నాయకత్వం పెత్తనం చేసి తప్పుదోవ పట్టించడం వల్ల ఈ ఘోరం జరిగింది. ప్రజలు సాయుధ పోరాటానికి సిద్ధంగా ఉన్నారని , రష్యామార్గంలో పోరాటంసాగించాలని రణదీవె, చైనా మార్గంలో సాగించాలనిమాకినేని బసవ పున్నయ్య వాదించారు. డాక్యుమెంట్లు రాసుకున్నారు. 

దీని వల్ల వేలాది మంది అమాయక ఎస్సీ, ఎస్టీ,బిసి మైనారిటీ ప్రజలు ప్రాణార్పణ చేసారు. కమ్యూనిస్టులు ఇందుకు బాధ్యత వహించి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పడానికి బదులు నిజాంను బాధ్యుడిని చేస్తున్నారు.ఉద్యమ దిశ నిర్ణయించుకోలేని కమ్యూనిస్టులు, దాని తోక సంస్థల వారు తెలంగాణ ప్రజలకు సుద్దులు చెబుతారా? 

ఆధిపత్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడే ప్రతిసందర్భంలో ఆయా జాతులు, వర్గాలు, ప్రాంతాలు వాటి చరిత్రను పునర్నిర్మించుకుంటాయి. తెలంగాణ ప్రజలు చేస్తున్నది అదే. బానిస చరిత్ర మాత్రమే తెలంగాణ ప్రాంతానికి ఉందని కమ్యూనిస్టులు చేసిన తప్పుడు ప్రచారం వల్ల ఆంధ్రవలస వాదులు మేమే మీకు విముక్తికలిగించాం, మీరింకా దొరల బానిసలే అని వాదిస్తున్నారంటేఅందుకు అరసంవంటి సంస్థలు బాధ్యత వహించాలి. 

స్వంతంత్ర రాష్ట్రంగా ఉన్న తెలంగాణను ఆంధ్రలో విలీనం చేయాలని ఆనాటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం పైరవీలుచేసింది.అరసం కూడా దానికి వత్తాసుపలికింది. ఆ విధంగా తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసిన సంస్థకు నాయకత్వం వహిస్తున్న దోపిడీ అనుకూల శక్తులు నిజాంను విమర్శిస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయి. బహుజనులు ఈ దురహంకారాన్ని ఇంకెంత మాత్రం సహించరు.
Andhra Jyothi News Paper Dated 11/4/2010

No comments:

Post a Comment