తెలంగాణ అభివృద్ధి సోషల్ రిఫామ్‌తో ముడివడి ఉంది. సోషల్ రిఫామ్ ముఖ్యంగా జరుగాల్సింది ఈ ప్రాంతపు అగ్ర కులాల్లో. తెలంగాణ సాయుధపోరాటం, తొలి జై తెలంగాణ ఉద్యమం, సిరిసిల్ల జగిత్యాల పోరాటం, మలి జై తెలంగాణ పోరాటాలు సోషల్ రిఫామ్ జోలి పోలేదు. కింది కులాల్లో కూడా బాగా మూఢ నమ్మకాలున్న రాష్ట్రమిది. వాటిని రూపుమాపకుండా వారి ఆర్థిక అభివృద్ధి కూడా జరుగదు.
అప్పుల భయంతో, ఆకలి బాధతో రైతులు చస్తున్న రోజులివి. ఎన్నడెరుగని చలిలో కన్నతల్లులు చంటి పిల్లల్ని కడుపుకు అద్దుకుని కాపాడుకుంటున్న రోజులివి. కరు వు కండ్లలోని నీళ్లను కూడా పిండేసిన రోజులివి. ప్రజల ఆకలి దప్పుల్ని, అసమానతలనూ, అంటరానితనాన్ని రూపుమాపడానికొచ్చిన ప్రవక్త ఏసు. ఈ ఏసు జన్మదిన వేడుకగా కొత్త రాష్ట్ర ముఖ్యమంత్రి క్రైస్తవ నాయకులకు గొప్ప విందు ఇచ్చాడు. క్రైస్తవ భవనానికి స్థలమిచ్చాడు, రూ. 10 కోట్లు డబ్బు ఇచ్చాడు, ఆర్చిబిషప్‌తో భూమి ప్రార్థన కూడా చేయించాడు. బహుశా ఏసు పుట్టక ముందనుకుంట.. ఈ ప్రాంతంలో మల్లయ్య అనే గొర్రెల-బర్రెల కాపరి పుట్టాడు. ఆయన పుట్టిన తేది మెట్టిన తేది లెవ్వు. ఆయన కాపులో మంద మంచిగున్నదని, పాలు, పెరుగు, చల్ల సమృద్ధిగా దొరికాయని, మాంసం మస్తుగా తినగలిగేవారని, చలిని చంపే గొంగళ్ళు బోలెడుండేవని, బహుశా మల్లన్న మరణించిన కొంరెళ్ళిలో కురుమ-గొల్లలంతా గుడి కట్టుకున్నారు. ఈ మల్లన్నకు తెలంగాణలో మరో రెండు గుళ్ళు కూడా ఉన్నాయి. అవే ఐలోని మల్లన్న, కట్ట మల్లన్న గుళ్ళు. ఈ గుళ్ళు ఐలోని పేరులోనే నా పేరు కూడా ఉంది. కట్ట మల్లన్న పేరులో మా అవ్వ ‘కంచ కట్టమ్మ’ ఉన్నది. కాలినడకన గుళ్ళన్నీ తిరిగింది. నా ఎంటుకలు ఐలోని లోనే తీసిందట. పట్నాలేసింది, బోనాలు చేసింది. మా అయ్య పేరు కొమురయ్య కొమురెల్లి మల్లన్న నుంచే వచ్చింది. మా తాత పేరు కంచ మల్లయ్య ఈ అందరి దేవ తల పునాది పేరది. ఈ విధంగా దేవుడైన మా ముత్తాత ముత్తాత దగ్గర ఒక దేవుడిగా ఎలిసిన కొమురెళ్ళి మల్లన్న గుడి దగ్గర ముఖ్యమంత్రి దొడ్డి కొంరయ్య భవనం కట్టిస్తానని ప్రకటించాడు. దొడ్డి కొంరయ్య పేరు కొంరెల్లి మల్లన్న నుంచి వస్తే గొర్ల-మేకల దొడ్డి కాపల కాసినోళ్ళయింనందుకు వాళ్ళ ఇంటిపేరు ‘దొడ్డి’ అని వచ్చి ఉంటుంది. ఈ దొడ్డి కొంరయ్యను సాయుధ పోరాటం ఆరంభ దశలో కడివెండి భూస్వాములు, ఆ ప్రాంతపు పోలీసులు కాల్చిచంపారు. కమ్యూనిస్టులు సైతం మర్చిపోయిన ఈ దొడ్డి కొంరయ్య చ రిత్రను మళ్ళీ, మళ్ళీ తవ్వి తీసింది దళిత బహుజన ఉద్యమం. ఇప్పుడాయన పేరుతో ఒక భవనం వస్తుంది. ఈ ప్రకటనలకంటే ముందే ముఖ్యమంత్రి కొమురం భీం భవనం ప్రకటించాడు. ఇక మిగిలింది చాకలి ఐలమ్మ భవనమొక్కటే. అది కూడా కట్టించాలని దళిత బహుజన ఉద్యమకారులు, చాకలి సమాజం కోరుకుంటుంది. జీసెస్, కొమురంభీం, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మలకు భవనాలు, వాళ్ళ జీవితాలపై అధ్యయనాలు, వాళ్లపై పాటలు ఉండాలని నేనూ కోరుకుంటాను. కష్టజీవులకు తమ బాంధవ్యుల పేర్లతో భవనాలు, సంబరాలు, ఆటలు పాటలు ఉండాలి. ఐనా ఒకవైపు రైతులు అప్పుల బాధలతో, ఆకలి బాధలతో కరువు కోరల్లో ఉండగా ఇన్ని భవనాలు ఈ సంవత్సరమే కట్టడాన్ని మనమే కాదు ఆ మహానుభావులు ముఖ్యంగా జీసెస్-ఒక ప్రవక ్తగా, ఒక ప్రపంచ ఆకలి, దోపిడి విముక్తి దాతగా పూర్తిగా వ్యతిరేకిస్తాడు. జీసెస్ ప్రపంచానికి మానవత్వాన్ని నేర్పిన ప్రవక్త. ఈ సంవత్సరం ఈ భవనాలకు భూమి ఇవ్వడం, కట్టిస్తామని హామీ ఇవ్వడంలో తప్పులేదు. కానీ ఈ 25 కోట్లు కరువు కాటకాల్లో, అప్పుల ఆవేదనలో, ఆకలి కోరల్లో ఉన్న తెలంగాణ ప్రజల్ని ఆదుకోవడానికి ఖర్చు చేస్తే వాళ్ళు సంతోషిస్తారు. రోజూ ఆత్మహత్యల వార్తలు బాధాకరంగా లేదా? ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు క్రైస్తవ సమాజానికిచ్చిన హామీ వారిపై ఈ రాష్ట్రంలో దాడులు జరుగవని. చర్చీలను ఎవరూ ఎటాక్ చెయ్యలేరని, పాస్టర్లకు, సిస్టర్లకు రక్షణ యిస్తామని అందరి బిషప్‌లు, పాస్టర్ల సమక్షంలో చెప్పడం మెచ్చుకోదగ్గది. ఆ వాగ్దానాలు ఈ రాష్ట్రంలో అమలైతే ఈ క్రి స్మస్ వేడుకలు సార్థకమైనట్టే. తెలంగాణలోని క్రైస్తవులకు భవనం కంటే వాళ్ళ మత ప్రచార హక్కు చాలా ముఖ్యమైంది. ఏ క్రైస్తవుడూ రాష్ట్ర ప్రజలు అప్పులో, ఆకలిలో మలమల మాడుతున్నప్పుడు 10 కోట్లతో తమకో భవనం కట్టండని అడుగకూడదు. రాష్ట్రమంతటా మంచి పంటలు పండి, తిండికి తిప్పలులేని సంవత్సరంలో ప్రభుత్వం దగ్గర పైసలు దండిగా ఉన్నప్పుడు ఇటువంటి భవనాలు కట్టిస్తే మంచిదే. ఒకవేళ ఈ సంవత్సరమే ప్రభుత్వం దగ్గర డబ్బు కోకొల్లలుగా ఉన్నదనుకుంటే- చనిపోయే రైతాంగాన్ని, మాకో రెండువందల పించనైనా ఇయ్యండని రోడ్లమీద నిదురపోతన్న ముసలవ్వల, ముసలయ్యల రోదన వినకుండా డబ్బులేదని బుకాయిస్తూ భవనాల మీద కోట్లు పెడితే అది దేవుడు కూడా క్షమించనటువంటి నేరం. ఎన్ని యాగాలు చేసినా పాలకులు ఇటువంటి పాపం నుంచి బయటపడలేరు. ఏది ఎప్పుడు చెయ్యాలో కాలాన్ని బట్టి ఉంటుంది. మనముందున్న ప్రజల సాధక బాధకాలను బట్టి ఉంటుంది. ఇల్లుకాలి ఒకడేడుస్తుంటే పల్లికాలేదని మరొకడు ఏడ్వడం మంచిదికాదు. ఈ ప్రాంతపు అతిపెద్ద మెదక్ చర్చిని తీవ్రమైన కరువున్న రోజుల్లో విదేశాల నుంచి డబ్బు తెచ్చి కట్టారు. ఆ కట్టడంలో వేలాది మందికి పని కల్పించారు. ఆ రూపంలో కాకుండా మరో రూపంలో ఆ డబ్బు తేగలిగేవారు కాదు. ఆనాడు ఆ పని మేలు చేసింది. ఒక బ్రహ్మాండమైన చర్చినికూడా చరిత్రలో నిలిపింది. దేవుని పేరు తో చేసే పనైనా సొంత లాభాలు లేకుండా చెయ్యాలి కదా? తెలంగాణ ప్రజలు ఇంకా ఫ్యూడలిజం ప్రభావంలో ఉన్నారు. ‘కుడుమే పండుగనే’ అమాయకత్వం చైతన్యం కాదు. వందల వేల కోట్లు ఖర్చు చేసి రాషా్ట్రన్ని కాపాడవలసిన రోజుల్లో పదుల కోట్లతో కులానికో మతానికో భవనం కడితే ప్రజలు బతకరు. నాకు ఇల్లు లేదు. నాకు వద్దు కూడా కానీ ప్రతి మనిషికీ-సీ్త్రకి, పురుషునికి - ఇల్లు నిర్మించేందుకే నా తండ్రి నన్ను పంపాడు అని చెప్పిన జీసెస్ మాట మరచి వేలాది మంది ఇల్లు లేక, తిండిలేక కరువు తమపై కరాల నృత్యం చేస్తున్న రోజుల్లో క్రైస్తవ భవంతికి పది కోట్లు ఇస్తే క్రైస్తవులెట్లా సంబరపడతారు. ఇక్కడే కదా ఒక బ్రాహ్మణీయ హిందువుకు, ఇతరుల కోసం తన శరీరాన్ని తన రక్తాన్నీ ధార పోసిన ఏసును నమ్మే క్రైస్తవునికి ఉండాల్సిన తేడా. కొమురెల్లి మల్లన్న దగ్గర దొడ్డి కొమురయ్య భవనం కడుతానని ప్రకటించిన ముఖ్యమంత్రి రాషా్ట్రన్ని పరిపాలించే వెలమ భూస్వాముల్లో కొమురెల్లి మల్లన్న పట్ల ఎంత ప్రేమ ఉందో చూడాలి కదా! వారి సంస్కృతిలో మార్చు తెచ్చే సంఘ సంస్కర్త ఆ కులంలో ఎందుకు పుట్టలేదో ఆలోచించాలికదా! నేను ఇంతకు ముందే చెప్పినట్లు మా ఇంట్లో పేర్లన్నీ - మల్లయ్య, కొమురయ్య, కట్టమ్మ, ఐలయ్య - ఈ దేవుడి పేరు నుంచి వచ్చినవే. కానీ వెలమల్లో ఈ పేర్లున్న ఒక్క మగ లేదా ఆడ వ్యక్తి మనకు కనిపించరు. నరసింహరావు, రామారావు, విద్యాసాగర్‌రావు, రాజేశ్వరరావు అనే బ్రహ్మణీయ దేవతల పేర్లతో, అణచివేతే ఆనందంగల సంస్కృతితో జీవించే సంస్కృతి నుంచి వాళ్ళు మారుతున్న దాఖలాలుకూడా లేవు. నిజానికి రెడ్లల్లో, కాపుల్లో కొంరెల్లి మల్లన్న పేర్లు కనబడతాయి. మల్లారెడ్డి, ఐల్ రెడ్డి, కోట్రెడ్డి, మగపేర్లు, మల్లమ్మ, కొంరమ్మ వంటి ఆడపేర్లు కాపు రెడ్లలో చాలామందికి ఉన్నాయి. ‘కడుపులో లేంది కౌగలించుకుంటే రాదు’. దొడ్డి కొంరయ్య భవనం ఒక్క గొల్ల కురుమలకే కాదు తెలంగాణ సాయుధ పోరాటంపై గౌరవం ఉన్న వారందరికీ కావాలి. చాకలి ఐలమ్మ ఒక్క చాకలోళ్ళ హీరోయినే కాదు. తమ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటం చేసే సీ్త్రలకు-పురుషులకు ఆమె ఆదర్శం. కొమురం భీం ఒక్క ఆదివాసుల హీరోనే కాదు. మొత్తం మానవజాతికి ఆయన ఆదర్శం. వీరిని పట్టించుకోకుండా సమైక్య రాష్ట్ర పాలకులు, కమ్యూనిస్టు-సోషలిస్టు నాయకులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద తప్పు చేశారు. రాష్ట్రం విడిపోవడానికి ఇదొక కారణం. ఈ ముగ్గురి పోరాటయోధుల్లో కొంరెల్లిమల్లన్న, ఐలోని మల్లన్న సంస్కృతి ఉంది. అందుకే ఆ ఆదివాసి నాయకుని పేర్లో ‘కొమురం’ ఉంది. కొత్త రాష్ట్ర పాలకులుగా మారిన వెల మల్ని నేనడిగేదేమంటే తెలంగాణ సంస్కృతికే మూల విరాట్టులైన కొమురెల్లిమల్లన్న, ఐలోని మల్లన్న, కట్ట మల్లన్న, సమ్మక్క, సారక్క, పోచమ్మ కట్టమైసమ్మ, పోతరాజు, బతుకమ్మల ప్రభా వం మీ సంస్కృతిక జీవనంలో కనబడటం లేదు. తెలంగాణ ఉత్పత్తి కులాల్ని వీళ్ళు నిజంగా ప్రేమించాలంటే ఈ కులంలో కూడా సంఘసంస్కరణ ఆలోచన చెయ్యాలి కదా! ఈ కులంలో పుట్టిన ఒక్క సంఘం సంస్కర్త పేరన్నా చెప్పగలరా? ఆ మధ్య మాజీ విప్లవకవి, జగిత్యాల ఉద్యమంలో అండర్‌గ్రౌండ్‌లో ఉండి రచనలు చేసిన మిత్రుడు, కమ్మల వలెనే వెలమలు క్యాపిటలిస్టులు కావడానికి నేను దోహదపడదల్చుకున్నానన్నాడు. ఐతే వెలమల్లో సంఘ సంస్కరణ విలువలు కనబడవు. చెన్నమనేని రాజేశ్వరరావు తరువాత ముప్పాళ్ళ లక్ష్మణరావు కమ్యూనిస్టులుగా ఎదిగినా వారు సంఘ సంస్కరణ కోసం చేసింది ఏమీ లేదు. విప్లవం రాదనుకున్న రాజేశ్వరరావు పూర్తిగా పాలక సంస్కృతిలోకి జారుకున్నారు. లక్ష్మణరావు ప్రభావం కులంపైగాని, ఆ ప్రాంత ప్రజల సాంస్కృతిక జీవన విధానంపై గాని ఏమీలేదు. దురదృష్టవశాత్తు భారత దేశంలో కమ్యూనిస్టులు సోషల్ రిఫామ్‌ను ఎన్నడూ పట్టించుకోలేదు. కనుక ఈ ప్రభుత్వానికి కనీసం కమ్మలకున్న రామస్వామి చౌదరులో, ఎన్.జి. రంగాలో లేరు. కనుక వాళ్ళ అధికారాన్ని, రాజకీయ ఆధిక్యతను కాపాడుకోవాలనుకున్నా, కొమురం భీమ్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మలే అండ. ముందు, ముందు వీరి ఆదరణ పెరుగుతుంది కానీ తరుగదు. అందువల్ల వారి పేర్లతో భవనాలు ఇవ్వాళ కాకపోతే రేపైనా వస్తాయి. వాటిని కరువులో ప్రజలకు తిండి పెట్టకుండా కట్టాల్సిన అవసరం లేదు. వారికి భవనాలు కావాలని ప్రజల్లో ఎంతో సెంటిమెంటు ఉన్నప్పటికీ ఇది తరుణం కాదని నా అభిప్రాయం. తెలంగాణ అభివృద్ధి సోషల్ రిఫామ్‌తో ముడివడి ఉంది. సోషల్ రిఫామ్ ముఖ్యంగా జరుగాల్సింది ఈ ప్రాంతపు అగ్ర కులాల్లో. తెలంగాణ సాయుధపోరాటం, తొలి జై తెలంగాణ ఉద్యమం, సిరిసిల్ల జగిత్యాల పోరాటం, మలి జై తెలంగాణ పోరాటాలు సోషల్ రిఫామ్ జోలి పోలేదు. కింది కులాల్లో కూడా బాగా మూఢ నమ్మకాలున్న రాష్ట్రమిది. వాటిని రూపుమాపకుండా వారి ఆర్థిక అభివృద్ధి కూడా జరుగదు. ఈ ప్రాంతంలోని రెడ్డి, వెలమ, కాపు కులాల్లో ఫ్యూడల్ విలువలు చాలా బలంగా ఉన్నాయి. కింది కులాల్లో ఈ ఫ్యూడల్ విలువలకు బానిసత్వంలో బతికే లక్షణం చాలా ఎక్కువ. అన్ని కులాల్లో పురాతన విగ్రహారాధన చాలా బలంగా ఉంది. మతం రంగంలో కూడా పుస్తక పఠన సంస్కృతి ఏ కులంలో అంతగా లేదు. ఇక్కడి బ్రాహ్మలు కూడా ఫ్యూడలిజాన్ని పూజించే పండితులే. ఈ మౌలిక రంగంలో మార్పు రాకుండా తెలంగాణ దక్షిణాది బీహార్‌గా మారే అవకాశముంది. ఈ స్థితి మార్చడానికి స్మారక భవంతుల కంటే సంఘ సంస్కరణ పోరాటాలు ఎక్కువ జరగాలి. ఐతే ఏ పోరాటాలైౖనా కరువును, ఆకలిని, అప్పుల బాధను అధిగమించాకే అర్థవంతంగా జరుగుతాయి. కంచ ఐలయ్య సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త
Andhra Jyothi Telugu News Paper dated : 2/1/2015
|
Friday, January 2, 2015
భవంతులు బతుకుదెరువైతయా? - కంచ ఐలయ్య
Subscribe to:
Posts (Atom)