Showing posts with label ప్రొఫెసర్ భంగ్యా భూక్యా. Show all posts
Showing posts with label ప్రొఫెసర్ భంగ్యా భూక్యా. Show all posts

Sunday, October 26, 2014

హైందవ పునాదులపై ఇండియా - డాక్టర్‌ భంగ్యా భూక్యా



పెరి ఆండర్‌సన్‌ రచించిన ది ఇండియన్‌ ఐడియాలజీ గత రెండు సంవత్సరాలుగా ఇండియన్‌ మేధావి వర్గంలో పెద్ద దుమారాన్నే లేపింది. ఈ వర్గం తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ అనువదించి ప్రజలకు పరిచయం చేయటం చాలా సంతోషం. ఇండియాను బ్రిటిష్‌ పాలకులే డిస్కవరీ చేశారన్న ఆండర్‌సన్‌ వాదనతో నేను వ్యక్తిగతంగా ఏకీభవించను. కానీ అతను లేవనెత్తిన అనేక వాదనలు, ప్రశ్నలు భారత దేశంలోని వాస్తవాలను ఎత్తి చూపుతున్నాయి. ఎందుకు అత నితో ఏకీభవించనంటే ఇండియాను డిస్కవరి చేసింది హిందూ మేధావి వర్గం. రాజారామ మోహన్‌ రాయ్‌ దగ్గర నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ వరకు ఆంగ్ల విద్యను వంటబట్టించుకున్న తరం ఇండియాను డిస్కవరీ చేయటమే పనిగా పెట్టుకొని వేదకాలం నుంచి నేటి వరకు ఇండియాలో దాగి వున్న హిందూత్వాన్ని వెలికి తీశారు. ఇది ఇండియాను ఒక అప్రకటిత హిందూ దేశంగా తీర్చిదిద్దింది.
ఈ పుస్తకం ప్రధానంగా చెప్పేదేమంటే ప్రతి రాజకీయ పార్టీ సిద్ధాంత రాద్ధాంతాలకు అతీతంగా హైందవ సాంస్కృతిక పునాదుల మీద నిర్మించబడి ఆ సంస్కృతిని బలోపేతం చేసింది. అదే విధంగా సనాతన వాదులు, ప్రగతిశీలవాదులన్న తేడాలేకుండా ప్రతి హిందువూ ఇండియన్‌ హైందవ ధర్మరక్షణకే పాటు పడ్డాడు, పడతాడూ కూడా. ఆందుకే ఆ రోజు వల్లబ్‌ భాయ్‌ పటేల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కావాలని కోరాడు. ఇప్పుడు ఆరు వందల అడుగుల ఎత్తు పటేల్‌ విగ్రహాన్ని (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) నిర్మించటానికి నరేంద్ర మోదీ తాపత్రయపడుతున్నారు. అంటే దేశంలోని ఐక్యత విషయం ప్రక్కన పెడితే, కాంగ్రెసుకి, బీజేపీకి హిందూత్వ విషయానికి వచ్చినప్పుడు ఎటువంటి తేడా లేదు. కాంగ్రెస్‌ లౌకికవాదానికి ఈ దేశం మోసపోయిందని ఈ పుస్తకం బలంగా చెబుతుంది. అంతేకాదు, కాంగ్రెస్‌ దాని నాయకులు గాంధీ, నెహ్రూలు చేసిన మోసాలు ఇన్నీ అన్నీ కావని ఈ పుస్తకం రూఢి చేస్తుంది.
సాధారణంగా వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన అధ్య యనాన్ని మనం జాతీయ ఉద్యమంలాగా భావిస్తాము. మన అగ్రకుల చరిత్రకారులు దీన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజా ఉద్యమంగా అభివర్ణించారు. అయితే ఈ ఉద్య మం హైందవ ధర్మరక్షణకే జరిగిందన్న విషయం మనకు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది. గాంధీకి స్వరాజ్‌ మతపరంగా ఒక తప్పనిసరి ఆవశ్యకత. రాజకీయ రూపం అనేది దీనిని ముందుకు తీసుకెళ్ళే సాధనం తప్ప మరొకటికాదు. మతాన్ని రాజకీయాలతో జోడించి ఉద్యమాన్ని నిర్మించటం గాంధీ ప్రత్యేకత. ఈ క్రమంలో హైందవ మత ఉద్ధరణం ప్రధానాంశం కావటం చూస్తాము. రాజకీయ స్వేచ్ఛ రెండవ అంశం కావటం చూస్తాము. వాస్తవంగా గాంధీ చేసిన రాజకీయ ఉద్యమాలు ఏవీ కచ్చితమైన ఫలితాలను సాధించకుండానే ముగుస్తాయి. అట్టహాసంగా మొదలుపెట్టిన సహాయనిరాకరణ ఉద్యమం చౌరిచౌరాలో జరిగిన హింసాత్మక సంఘటనతో అర్థాంతరంగానే ముగుస్తూంది. కానీ అసలు కారణం హింసకాదు. ఈ ఉద్యమం కొద్ది రోజు ల్లోనే ప్రజా ఉద్యమంగా మారింది. బ్రిటిష్‌ పాలన కంటే ప్రజా విప్లవమే ప్రమాదకరమని భావించి సహాయ నిరాకరణోద్యమాన్ని ముగిస్తారు. అప్పటికి ఇండియా హిందువైజేషన్‌ కాకపోవటం కూడా ఒక ప్రధాన కారణం. దండి సత్యాగ్రహం ఒక ఢిఫెన్సివ్‌ ఆట. క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రజల నుంచి వచ్చింది. ఇందులో గాంధీ ప్రమేయం అంతంత మాత్రమే. గాంధీ రాజకీయ ఉద్యమాల్లో విజయం సాధించలేదు. కానీ హైందవ మత విషయంలో విజయాన్ని సాధించారు.
గాంధీ తన ప్రజా జీవితం మొత్తాన్ని హిందూ ధర్మరక్షణ కోసమే వెచ్చించ్చారని ఈ పుస్తకం రూఢీ చేస్తుంది. వ్యక్తిగత, ప్రజా జీవితం రెండూ మత మౌఢ్యంలోనే నడిచాయి. గాంధీ బ్రహ్మచర్యం కూడా హిందువులం మైలపడతామన్న భయం నుంచి రూపు దిద్దుకుంది. వ్యక్తిగత స్థాయిలో అన్ని మతాలు సమానమని నమ్మిన, రాజకీయ స్థాయిలో మాత్రం హిందూ మతం, ఇస్లాం మతం కంటే కాస్త ఎక్కువ అని నమ్మేవారు. ఒక ముస్లిం యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న తన కుమారునికి అది ‘ధర్మ విరుద్ధం’ అని హెచ్చరించారు. రాజకీయాల్ని పక్కనబెట్టి ఈ పెళ్లి కాకుండాచూశారు.
గాంధీ లౌకిక వాదంలో హిందూత్వం దాగి ఉందని ముస్లింలు చాలా కొద్దికాలంలోనే కనిపెట్టారు. నాటకీయంగా జరిగిన ఖిలాఫత్‌ ఉద్యమం తరువాత గాంధీ ముస్లింలను వదిలివేశారు. ఆనాటి నుంచి అత్యధిక శాతం ముస్లింలు ఆయనను ఎప్పుడూ నమ్మలేదు. లౌకిక వాదానికి ప్రతీకగా ఉన్న మహమ్మదలీ జిన్నా కూడా గాంధీ హిందూత్వ రాజకీయాలకు విసిగిపోయి కాంగ్రెస్‌ నుంచి బైటికి వచ్చేశారు. నిష్పక్షపాతి అయిన మోతీలాల్‌ నెహ్రూ కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా హిందూ పార్టీయే అనడం గమనించదగ్గ విషయం. ఈ హైందవ రాజకీయాలే దేశ విభజనకు దారితీశాయి. కానీ చరిత్రలో దేశ విభజనకు జిన్నాను దోషిగా నిలబెట్టారు.
కాంగ్రెస్‌ పార్టీయే పాకిస్థాన్‌ స్థాపనకు నాంది పలికింది. జిన్నా భారత దేశంలో ఒకటి కాదు, రెండు దేశాలున్నాయని 1940లో ప్రకటించారు. ఆ రెండు దేశాలు సహజీవనం చేసేందుకు భారత స్వాతంత్య్రం వీలుకల్పించాలి, ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో వారికి స్వయంప్రతిపత్తినీ, సార్వభౌమాధికారాన్ని ఇవ్వాలన్నారు. అంటే జిన్నా ప్రత్యేక దేశం కావాలని కోరలేదు. ముస్లింలకు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకున్నారు. ఈ విషయాన్ని గందరగోళం చేసి కాంగ్రెస్‌ పార్టీ పాకిస్థాన్‌ ప్రతిపాదనను జిన్నాకు అంటగట్టింది. దే శ విభజన బ్రిటిష్‌ ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదు. క్యాబెనెట్‌ మిషన్‌ ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రాం తాలన్నీ స్వయం పాలనాధికారంతో ఉండే విధంగా ప్లాన్‌ రూపొందించింది. కానీ అది నెహ్రూకు రుచించలేదు. ముస్లింలకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి, ఇవ్వడం కంటే దేశ విభజనే మేలని నెహ్రూ భావించారు.
విచిత్రమేమంటే, కాంగ్రెస్‌, ముస్లిం లీగ్‌ దేశ విభజన గురించి మాట్లాడుతున్నప్పుడు జిన్నా మాత్రం అఖండ భారత దేశంలో సంకీర్ణ ప్రభుత ్వం గురించి కలలు కనేవారు. భారత దేశంలో ఆంక్ష లు లేని సంపూర్ణ అధికారంతో కూడిన బలమైన కేంద్ర ప్రభుత్వం కావాలని నెహ్రూ కోరుకున్నారు. అది విభజనతోనే సాధ్యపడుతుందని భావించారు. చివరకు ఈస్ట్‌ బెంగాల్‌ని కూడా జిన్నా కోరుకోలేదు కానీ, ఈ ప్రాంతం ఇండియాతో ఉంటే కోల్‌కతాలో ముస్లింల ప్రాబల్యం పెరుగుతుందని పాకిస్థాన్‌కు అంటకట్టారు. రేపటి భారత్‌లో హిందువుల ఆధిపత్యమే పునాదిగా దేశవిభజన జరిగిందన్న విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.
గాంధీ, నెహ్రూల కుల రాజకీయాల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరంలేదు. కుల రాజకీయాలు కాంగ్రెస్‌ పుట్టకలోనే ఉన్నాయి. గాంధీ ప్రకారం అంటరానితనానికి కులానికి మధ్య ఎలాంటి సంబంధమూ లేదు. కానీ అంబేద్కర్‌ కులసమస్యను లేవనెత్తినప్పుడు అగ్రకుల హిందువులంతా ఏకమై అతని ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. గాంధీ దృష్టిలో అంటరానితనం పాపమే కావచ్చు కానీ, అది ఆమరణ దీక్ష చేయాల్సినంత నైతిక సమస్య కాదు. కానీ అంటరాని వాళ్లకి ప్రత్యేక నియోజకవర్గాలు మంజూరు చేయటం మాత్రం ఆయనదృష్టిలో చాలా తీవ్రమైన సమస్య వాటికి వ్యతిరేకంగా ఆయన తన జీవితాన్నే పణంగా పెట్టడానికి సిద్ధం. అగ్రకుల హిందువుల ఒత్తిడికి, గాంధీ బ్లాక్‌మెయిలింగ్‌కు పూనా ఒప్పందం సమయంలో లొంగి పోయినందుకు అంబేద్కర్‌ తను చనిపోయేవరకు బాధపడ్డారు.
వలసవాద వ్యతిరేక ఉద్యమ రూపంలో హిందూయిజం, అగ్రకుల తత్వం బలంగా తన ఆధిపత్యాన్ని సాధించుకుంది. అందుకే స్వతంత్ర భారతంలో మత మైనార్టీలు, అణగారిన కులాలు, ఆదిమ జాతులు భయంకరమైన అణచివేతకు, దోపిడీకి గురవుతున్నాయి. రాజ్యాంగంలో లౌకిక వాదాన్ని లిఖించుకున్నారు, కానీ రాజ్యాంగంలో హిందువులకు తప్ప మరే మతస్థులకు రక్షణ లేదు. హిందూ అణగారిన కులాలకు రిజర్వేషన్‌ కల్పిస్తే మతం అడ్డురాదు. కానీ ముస్లిం, క్రిష్టియన్‌ మతాల్లోని పేదలకు రిజర్వేషన్‌ కల్పిస్తే మతం అడ్డువస్తుంది. అంటే హిందూ మత రక్షణ మన రాజ్యాంగంలో బహిరంగంగానే దాగి ఉంది. ఎందుకు ఒక్క ముస్లిం కూడా ఇండియన్‌ రక్షణ పరిశోధన సంస్థల్లో లేరు? కానీ నేపాల్‌కు చెందిన గూర్ఖాలు ఆర్మీలో ఉండవచ్చు. ఎందుకు కాశ్మీరులోని ముస్లింల మీద, ఈశాన్య రాషా్ట్రల్లోని క్రిష్టియన్‌ ఆదివాసుల మీద నిరంతరం నరమేధం నడుస్తుంది? ఎందుకు ఈ దేశ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి? ఈ దేశ అగ్రకుల మేధావి వర్గం ఎందుకు ఈ హింస గురించి మాట్లాడదని ఈ పుస్తకం ప్రశ్నిస్తుంది.
- డాక్టర్‌ భంగ్యా భూక్యా
యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌
Andhra Jyothi Telugu News Paper Dated: 26/10/2014 

Monday, April 21, 2014

స్వయంపాలన దొరలపాలన కాకూడదు(సంపాదకీయం)-ప్రొ. భంగ్యా భూక్యా


Published at: 22-04-2014 06:32 AM
తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారిగా జరుగుతున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒక ప్రత్యేక రాజకీయ, సామాజిక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఇవి తెలంగాణ భావి రాజకీయాల్ని నిర్ణయించబోతున్నాయి. ఈ ఎన్నికలలో పార్టీల పొత్తులు వాటి తీరుతెన్నులు తెలంగాణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాజకీయ పార్టీలన్నీ పాత రాజకీయాల్ని భద్రపర్చడానికే అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాయి. ప్రజల స్వయంపాలన ఆకాంక్షను ఈ పరిణామాలు వెనక్కినెట్టే ప్రమాదముంది.
తెలంగాణ ప్రజలు స్వయంపాలన కోసం సర్వాయి పాపడు కాలం నుంచి పోరాడుతూనే ఉన్నారు. కానీ దొరల కుటిల రాజకీయాల వల్ల అది అందినట్టే అంది చేజారిపోతుంది. ఈ విషయాన్ని తెలంగాణ గ్రామాల్లో దర్శనమిచ్చే ఏ స్మారక స్థూపాన్ని అడిగినా చెబుతుంది. దొరలకు వ్యతిరేకంగా జరిగిన 1946 రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజలు వీరోచితంగా పోరాడి అనేక విజయాలు సాధించారు. కానీ ఆ విజయాలు ఎంతో కాలం నిలబడలేదు. భారత సైన్యం హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆక్రమించిన వెంటనే దొరలు రాత్రికి రాత్రే సైన్యం పక్కన చేరి ప్రజల మీద దాడులకు ఉసిగొల్పారు. పోరాట కాలంలో ప్రజలు అక్రమించుకున్న భూములను సైన్యం సహాయంతో దొరలు తిరిగి ఆక్రమించుకున్నారు. తదనంతరం ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరి ప్రజలను మరింత దోపిడీకి, అణచివేతకు గురిచేశారు.
1969లో జరిగిన శ్రీకాకుళం ఆదివాసీ పోరాటం తెలంగాణలో బలమైన అతివాద వామపక్ష (నక్సలైట్) ఉద్యమానికి దారితీసింది. నక్సలైట్ ఉద్యమ సిద్ధాంత, రాద్దాంతాలు పక్కన పెడితే, ఇది తెలంగాణ దొరల పెత్తనం మీద పెద్ద ప్రభావాన్నే చూపించింది. చాలామంది దొరలు గ్రామాలని వదిలి పట్టణాల్లో స్థిరపడ్డారు. పట్టణాల్లో ఆంధ్ర పెట్టుబడిదారులతో కలిసి భూస్వామ్య క్యాపిటలిస్టులుగా అవతారమెత్తారు. 1985లో ఎన్.టి. రామారావు కరణం, పటేల్ వ్యవస్థను రద్దు చేయటంతో పట్టణాలకు దొరల వలసలు క్రమంగా పెరిగాయి. ఆంధ్ర పాలక వర్గంతో అధికారాల్ని పంచుకుంటూ ఆర్థికంగా బలపడ్డారు. 1990 ఆర్థిక సంస్కరణలు ఈ దొరలకు మంచి అవకాశం వరించాయి. ఇది వారికి పూర్తిస్థాయి భూస్వామ్య పెట్టుబడిదారులుగా రూపాంతరం చెందటానికి ఉపయోగపడింది. సారా కాంట్రాక్టర్‌లుగా, బీడీ ఆకుల కాంట్రాక్టర్‌లుగా గ్రామాల్లో ఉండే దొరలు ఇప్పుడు అనేక ఆధునిక వ్యాపార రంగాల్లో విస్తరించి ప్రజలను పీడించటం మొదలుపెట్టారు.
ఈ పరిణామాలు దొరల పెత్తనం పోయిందనుకున్న అణగారిన కులాలకు, వర్గాలకు నిరాశే మిగిల్చాయి. దొరల పెత్తనం కొత్త తరహాలో పట్టణాల నుంచి పల్లెలకు విస్తరించింది. ఊరి మధ్యలో ఉండే గడీల పెత్తనం పోయింది. ఫామ్ హౌస్ రూపంలో నూతన గడీలను ఊరి బయట నిర్మించుకుని దొరలు మళ్ళీ పెత్తనం చెలాయించటం మొదలుపెట్టారు. హైవే కాంట్రాక్టర్‌లుగా, గనుల యజమానులుగా, సెజ్‌ల యజమానులుగా, మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ యజమానులుగా, రాజకీయ నాయకులుగా, ఉద్యమకారులుగా దొరలు వస్తున్నారు. తెలంగాణ ఉద్యమం ఆంధ్ర పాలక వర్గానికి వ్యతిరేకంగానే కాకుండా ఇక్కడి దొరల దోపిడీకి, పెత్తనానికి వ్యతిరేకంగా జరిగింది. అణగారిన కులాల వారు తమ కుల అస్తిత్వాలను తెలంగాణ అస్తిత్వంతో జోడించి స్వయంపాలనే ధ్యేయంగా పోరాటాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమంలోని బలాన్ని గుర్తించిన దొరలు కొలది కాలంలోనే ఉద్యమాన్ని తమ నాయకత్వంలోకి తెచ్చుకున్నారు.
దొరలకు తెలంగాణ వస్తుందన్న నమ్మకం లేదు, రావడం ఇష్టం కూడా లేదు. దొరలు తెలంగాణ ఉద్యమాన్ని ఒక అవకాశంగానే చూశారు. ఉద్యమాన్ని బూచిగా చూపించి ఆంధ్ర పాలకవర్గ దోపిడీలో అత్యధిక వాటాను పొందటం ఒక ఎత్తైతే, తమ కుల, కుటుంబ నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవటం మరో ప్రధాన అంశంగా మనకు కనిపిస్తుంది. అందుకే దొరలు ప్రతిసారీ ఉప ఎన్నికలు తెచ్చి ప్రజలకు అగ్ని పరీక్ష పెట్టేవారు. కనీసం ప్రచారం కూడా చేసేవారు కాదు. ప్రజలు తెలంగాణ వాదాన్ని గెలిపించుకోవటానికి అయిష్టంగానే తిట్టుకుంటూనే ఈ దొరలకు ఓట్లు వేసేవారు.
ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. దొరలను గెలిపించుకోవలసిన అవసరం అణగారిన కులాలకు, వర్గాలకు అవసరం లేదు. అందుకే దొరలకు ఏంచేయాలో తోచని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని అధిగమించటానికి దొరలు పార్టీల సిద్ధాంతాలకు అతీతంగా పొత్తులు, అంతర్గత అవగాహన కుదుర్చుకుంటున్నారు. దొరతనానికి మతోన్మాదంను జోడించే ప్రయత్నం ఒకటి జరుగుతూ ఉంది.ప్రజలు సంఘటితమవుతున్న ప్రతిసారీ దొరలు ఏదో ఒక రూపంలో వచ్చి దాన్ని విచ్ఛిన్నం చేస్తూ వస్తున్నారు. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమ రూపంలో కుల ఉద్యమాలను కొంతవరకు విచ్ఛిన్నం చేయగలిగారు. ఇప్పుడు హిందూ మతోన్మాదాన్ని ఉసిగొలిపి కుల చైతన్యాన్ని వెనక్కినెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సాధారణంగా ఇండియా పాలక వర్గానికి హిందూత్వ ధోరణులు బలంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో పాలక వర్గంగా చలామణి అవుతున్న దొరలకు హిందూత్వ ధోరణులు బలంగానే ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రజలు చారిత్రకంగా మత సామరస్యానికి ప్రతీకలుగా వున్నారు. చారిత్రకంగా దక్కన్ ప్రాంతం అనేక మతాలకు, సంస్కృతులకు నిలయంగా ఉంటూ వచ్చింది. ఇక్కడి ముస్లిం పాలకులు కూడా ఇక్కడి సంస్కృతిలో భాగమై పాలించారు. ఏ ఒక్క ముస్లిం పాలకుడు కూడా ఖలీఫా పేరు మీద ప్రమాణ స్వీకారం చేసి సింహాసనం ఎక్కలేదు. దక్కన్‌లో ఇస్లాం వ్యాప్తి కూడా బలవంతంగా జరగలేదు. ప్రజలు సూఫీ ప్రవక్తల భావాలతో ప్రభావితమై స్వచ్ఛందంగానే ఇస్లాంను స్వీకరించారు. అందుకే దక్కన్‌లో ఇప్పటికీ మత సామరస్యం బలంగా వుంది. ఈ సంస్కృతిని దొరలు ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
దొరలు హిందూత్వాన్ని నెత్తిన పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో దానికి ఒక లెజిటమసీని ఇచ్చారు. విచిత్రమేమంటే ఎమ్.ఎల్. పాలిటిక్స్‌కి ప్రతినిధులమని చెప్పుకునేవారు కూడా హిందూత్వ శక్తులను ప్రోత్సహించారు. తెలంగాణలో బీజేపీ తర్వాత హిందూత్వ ధోరణులు బలంగా ఉన్నది టీఆర్ఎస్ పార్టీకే. టీఆర్ఎస్ పార్టీ హావభావాలు, దాని అధినేత చేష్టలు శివసేన పార్టీకి దగ్గరగా ఉన్నాయి. టీఆర్ఎస్‌కు తెలంగాణ శివసేనగా రూపాంతరం చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది తెలంగాణ సంస్కృతికి, ప్రజలకి చాలా ప్రమాదకర పరిణామమే. ఈ ఎన్నికల్లో పార్టీల అభ్యర్థుల ఎంపిక చూస్తే దొరల ఆధిపత్యంలో ఉన్న పార్టీలు దొరతనాన్ని మతోన్మాదంతో జోడించే ప్రయత్నం చేశాయి. అందుకే బీజేపీ, దొరలకు 8 శాతం స్థానాలు కల్పించింది. బీజేపీ తరువాత దొరలకు అత్యధిక స్థానాలు (47 శాతం) కల్పించింది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 37 శాతం సీట్లు దొరలకు కేటాయించగా తెలుగుదేశం 34 శాతం కేటాయించింది. ఈ పరిణామాలు తెలంగాణను దొరల పాలన వైపు తీసుకెళుతున్నాయి.
తెలంగాణలో కనీసం 10 శాతం జనాభా కూడా లేని దొరల కులాలకు దాదాపు 50 శాతం కంటే పైచిలుకు స్థానాలను బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కేటాయించాయి. ఈ పరిణామాలు దేశ ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. జనాభాలో 90శాతం ఉన్న ప్రజలకు సముచిత స్థానం కల్పించకుండా కుల రాజకీయాలు చేస్తున్న పార్టీలకు బుద్ధిచెప్పాల్సిన అవసరం వుంది. దొరలను, మతోన్మాద శక్తులను ఈ ఎన్నికల్లో ఓడించటం ఒక చారిత్రక అవసరం. ప్రజాస్వామిక వాదులు, సామాజిక ఉద్యమకారులు ప్రజల పక్షాన నిలబడాల్సిన సమయమిది. మావోయిస్టులు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చి కూర్చుంటే ప్రజలకు అన్యాయం చేసిన వారే అవుతారు. ఎన్నికల్లో ప్రజలందరూ పాల్గొని మన దేశ ప్రజాస్వామ్యాన్ని, లౌకిక స్ఫూర్తిని కాపాడుకోవలసిన చారిత్రక సందర్భమిది.
- ప్రొ. భంగ్యా భూక్యా
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ

Andhra Jyothi Telugu News Paper Dated: 22/4/2014 

Thursday, October 31, 2013

తండా నుండి లండన్ దాకా By ప్రొఫెసర్ భంగ్యా భూక్యా జీవితంలోని కొన్ని సంఘటనలే ఈ వారం అనుభవం.


Published at: 01-11-2013 07:00 AM
 
1 
 
0 
 
0 
 
 

అడుగడుగునా పడదోసే పాము పడగలే ఉన్నా, మునుముందుకే సాగిపోయిన వాడు భంగ్యా భూక్యా. తండాలో జన్మించి తిండికోసం విలవిల్లాడే స్థితి నుంచి ఇంటర్నేషనల్ ఫెలోషిప్‌తో లండన్‌లో పిహెచ్.డి చేసే దాకా ఆయన జీవితం ఒక అగ్ని సరస్సులాగే సాగింది. నిజాం పాలనలో లంబాడీల జీవితాలపౖౖెన ఆయన సమర్పించిన సిద్ధాంత గ్రంథం 'సబ్జుగేటెడ్ నోమాడ్స్' ఎన్నో యూనివర్సిటీల సిలబస్‌లో విధిగా చదవాల్సిన పుస్తకం అయ్యింది. ఆ పుస్తకం తెలుగుతో సహా పలు భాషల్లోకి అనువాదం కూడా అయ్యింది. ప్రస్తుతం 'ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ'లోని సోషల్ ఎక్స్‌క్లూషన్ స్టడీస్ విభాగపు అధిపతిగా ఉన్న ప్రొఫెసర్ భంగ్యా భూక్యా జీవితంలోని కొన్ని సంఘటనలే ఈ వారం అనుభవం.
నాకు ముగ్గురు అక్కలు, ఒక అన్న. నేను చివరి వాణ్ని. నేను స్కూలుకు వెళ్లడమన్నది యాదృచ్ఛికమే. ఖమ్మం జిల్లాలోని బండమీది తండ మా ఊరు. మాకు ఓ పది గొర్రెలు, ఓ ఐదారు పశువులు ఉండేవి. నేనూ, మా అక్క కలిసి మా ఊరి పక్కనున్న ఒక చిన్న కుంటలో వాటిని మేపుతూ గడిపే వాళ్లం. నాకన్నా ముందు ఓ ముగ్గురు మా తండా నుంచి స్కూలుకు వె ళ్లే వారు. ఆ రోజుల్లో స్కూళ్లలో మధ్యాహ్నం వేళ ఉప్మా పెట్టేవాళ్లు. వీళ్లు అక్కడ తిని, ఇంటికీ కొంత తీసుకు వచ్చేవారు. నాకు కొంచెం పెట్టమని అడిగితే వాళ్లు పెట్టేవాళ్లు కాదు. నాకు కోపం వచ్చింది. అయినా వాళ్లు పెట్టేదేమిటి? నేనే స్కూల్లో చేరుతా అనుకున్నాను. అలా కేవలం ఉప్మా కోసమని నేను స్కూల్లో చేరాను. అయితే క్రమక్రమంగా చదువు మీద నాకు బాగా మక్కువ పెరుగుతూ వచ్చింది. ఆ రోజుల్లో మా ప్రాంతంలో మార్క్సిస్టు పార్టీ రాజకీయాలే బలంగా ఉండేవి. అందుకే ఆ రోజుల్లో నా మీద ఆ ప్రభావం కొంత ఉండేది.
నాలుగో తరగతి దాకా మా పక్క ఊళ్లలోనే నా చదువు సాగింది. ఆ తరువాత సుబ్లేడు గ్రామంలోని గిరిజన సంక్షేమ హాస్టల్‌లో సీటు రావడంతో 5వ తరగతి నుంచి అక్కడ చేరిపోయా. అది మా ఊరి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే హాస్టలంటే ఒకటే హాల్. ఆ హాల్‌లో 120 మంది విద్యార్థులం ఉండేవాళ్లం. బాగా ఇరుకుగా ఉండడమే కాకుండా భోజనం చాలా దారుణంగా ఉండేది. అన్నంలోకి రోజూ చారు తప్ప మరేమీ ఉండేది కాదు. రెండు రూపాయల కిలో బియ్యమే హాస్టల్‌కు సరఫరా అయ్యేవి. అన్నంలో ఎప్పుడూ తెల్లతెల్లని పురుగులు ఉండేవి. చారు పోశాక ఆ పురుగులు పైకి తేలేవి. తేలిన పురుగుల్ని తీసేసి ఆ భోజనం తినేవాళ్లం. దీనికి తోడు దాదాపు అందరికీ నిలువెల్లా గజ్జి సమస్య ఉండేది. ఇవన్నీ కాక అక్కడ ఉండే సుబ్బారెడ్డి అనే టీచర్ నన్ను కులం పేరుతో చాలా అసహ్యంగా తిట్టేవాడు. భరించలేక ఇక చదువొద్దు ఏమీ వద్దనుకుని మా ఊరికి వెళ్లిపోవాలనుకున్నా. ఒకసారి వెళ్లిపోయాను కూడా. అయితే మా అమ్మ నచ్చచెప్పి మళ్లీ తీసుకు వచ్చి స్కూల్లో వదిలేసి పోయింది.
చంపేస్తాడనుకున్నా
ఎనిమిదో తరగతిలో దాదాపు అందరూ ప్యాంట్ వేసుకునేవారు. చెప్పులు కూడా ఉండేవి. నాకు మాత్రం ప్యాంట్లు గానీ, చెప్పులు గానీ లేవు. ఎంతో కోరికగా ఉన్నా వీలు కాక నిక్కర్ల మీదే స్కూలుకు వెళ్లేవాణ్ని. అప్పుడు దసరా సెలవులు వచ్చాయి. సెలవుల్లో ప్రతిసారీ పెసరకాయలు తెంపడానికి, వేరుశెనగ కాయలు పెరకడానికి వెళుతుండేవాణ్ని. ఈసారి కూడా ఆ పనుల్లోకి వెళ్లి ఎలాగైనా ప్యాంటు, షర్ట్ కొనుక్కోవాలని గట్టిగా అనుకున్నా. వాటికోసం ఆ రోజుల్లో 70 రూపాయలైనా కావాలి. అందుకోసం సెలవులు అయిపోయాక కూడా ఓ ఐదు రోజులు పని చేసి వచ్చిన డబ్బులతో ప్యాంట్ షర్ట్, స్లిప్పర్స్ కొనుక్కున్నాను. పది మైళ్ల దూరంలో ఉన్న సుబ్లేడుకు నడిచే వెళ్లాలి కాబట్టి, కొత్త బట్టలు వేసుకుని నేరుగా స్కూలుకు బయల్దేరాను. వెళ్లేసరికి ప్రార్థన అయిపోయింది. ఫస్ట్ పీరియడ్ సుబ్బారెడ్డిదే కాబట్టి ఆయన క్లాసు తీసుకుంటున్నాడు. మామూలుగానే హీనాతిహీనంగా తిడుతూ, అతి చిన్నకారణాలకే ఒళ్లు హూనమయ్యేలా కొట్టేవాడు. ఏనాడూ ఆయన నన్ను నా పేరుతో పిలవలేదు. 'అరే ఓ లంబాడి... కొడుకా' లాంటి బూతులే.

ఐదు రోజులు స్కూలుకు రాకపోవడం, ఆ వచ్చిన రోజు కూడా కాస్త ఆలస్యంగా రావడం అతని కోపానికి ఆజ్యం పోశాయేమో! క్లాసులోకి అడుగు పెట్టగానే కర్ర తీసుకుని కొట్టడం మొదలెట్టాడు. కొడుతూనే ఉన్నాడు. కొడుతూనే ఉన్నాడు. క్లాసులో అందరూ ఉన్నారు. నేను దెబ్బలు తప్పించుకోవడానికి బెంచీల మధ్యలోంచి అటూ ఇటూ పరుగులు తీస్తున్నాను. ఆయన నన్ను వెంటాడి వెంటాడి కొడుతూనే ఉన్నాడు. ఒక కర్ర విరిగిపోతే మరో కర్ర, అలా నాలుగు కర్రలు విరిగిపోయాయి. అరగంట పాటు ఆ దుర్మార్గం కొనసాగుతూనే ఉంది. ఆ రోజు నేను చనిపోతాననే అనుకున్నా. ఈ చదువింక మనతో కాదనుకుని మా ఊరికి వెళ్లిపోవాలనుకున్నా. ఆ మాట హాస్టల్ వార్డన్‌కు కూడా చెప్పేశా. కానీ, హాస్టల్ వర్కర్సంతా నామీద ప్రేమతో నన్ను వారించారు. ఎలాగో గుండె చిక్క బట్టుకుని ఉండిపోయాను. పాఠాలు చెప్పే పంతుళ్లు స్కూలుకు ఆవల విద్యార్థుల జీవితమేమిటన్నది కొంతైనా ఆలోచించాలి కదా! ఆనాడు నా ఒంటి మీద పడిన దెబ్బల బాధ ఈ నాటికీ తాజాగానే ఉంది. కుంగదీసే గాయాల్ని కూదా నిచ్చెనగా చేసుకుని పైకెక్కిపోవాలేమో మాలాంటివాళ్లం! ఇన్నిన్ని అవమానాల్ని భరించే శక్తి ఉంటే తప్ప ఒక పేద వాడు ముందుకు సాగడం సాధ్యం కాకపోతే ఎలా?
ఏమిటా బంధం?
మా ప్రాంతంలో బలంగా ఉన్న లెఫ్టిస్ట్ పార్టీల ప్రభావం నా మీద బాగానే ఉందని చెప్పా కదా. ఇది సామాజిక విషయాల మీదికి నా దృష్టి మళ్లేలా చేసింది. నేను మంచి మార్కులతో పాసైనా సామాజిక శాస్త్రాలు చదవాలన్న నిర్ణయానికి రావడానికి ఆ ప్రభావమే కారణం. ఖమ్మంలోని సిద్దారెడ్డి కాలేజ్‌లో హెచ్.ఇ.సి. గ్రూపుతో ఇంటర్‌లో జాయినయ్యాను. ఆ ఈ రెండేళ్ల కాలం నా జీవితంలో చాలా కీలకమైనది. మా ఊరికి ఖమ్మం 30 కి.మీ. మా ఊరి నుంచి ఒకే ఒక్క ట్రిప్ బస్సు వెళ్లేది. దానివ్లల ఖమ్మంలోనే ఉండటం తప్పనిసరి అయ్యింది. అందుకే ముగ్గురు మిత్రులం కలిసి ఒక రూము తీసుకున్నాం. నెలకు ఒక్కొకరికీ తక్కువలో తక్కువ 100 రూపాయల ఖర్చు వచ్చేది. అయితే మా కాలేజీ లెక్చరర్‌లు పూనాటి వెంకటేశ్వరరావు గారు, సీతారాంగారు ఆర్థికంగా మేమందరం ఇబ్బందుల్లో ఉన్నామన్న విషయాన్ని పసిగట్టారు. ఇద్దరూ కలిసి ఒక రోజు మా రూముకు వచ్చి, మా పరిస్థితుల్ని మరింత క్షుణ్ణంగా తెలుసుకుని, ఇక నుంచి ఆర్థికంగా ఎంతో కొంత సాయం చేస్తాం అంటూ హామీ ఇచ్చారు.

సీతారాం గారు ఆర్థిక సహాయం అందించలేకపోయినా గొప్ప నైతిక బలాన్ని నాలో నింపేవారు. ఇచ్చిన మాట మేరకు ఎప్పుడూ ఏదో రకంగా సాయం అందచేస్తూ వచ్చారు. వీటి వల్ల మాకొక మానసిక స్థిమితత్వం ఏర్పడింది. వారు ఆ సాయానికి పూనుకోకపోతే, నిజంగా చదువుకు సంబంధించి మా అధ్యాయం అక్కడితో ముగిసిపోయేది. ఇంటర్ అయిపోగానే డిగ్రీ కోసం రెసిడెన్షియల్ కాలేజ్‌లో చేరడం మేలని ఆయనే దరఖాస్తులు తెప్పించారు. ఎంట్రన్స్ రాశాను. కర్నూలులోని సిల్వర్‌జూబ్లీ రెసిడెన్షియల్ కాలేజ్‌లో బి.ఏ.లో సీటు వచ్చింది. సీతారాంగారు నాతో పాటే కర్నూలు వచ్చి, కాలేజ్ అడ్మిషన్, హాస్టల్ అడ్మిషన్ అయ్యాకే వెళ్లిపోయారు. ఆయన వెళ్లిపోతుంటే పైకి కనిపించని నా కన్నీళ్లు నా నిలువెల్లా ప్రవహించడం మొదలెట్టాయి. నేనెవరు? వీళ్లెవరు? నాకోసం ఇంత చేయడం ఏమిటి? కళ్లల్లో కారం చల్లే సుబ్బారెడ్డి లాంటి టీచర్లు ఉన్న ఈ సమాజంలో వెంకటేశ్వరరావు గారు, సీతారాం గారి లాంటి వాళ్లు లేకపోతే సమాజం మీద నమ్మకమేముంటుంది? నా నె త్తిన పాలు పోసి, నా జీవితంలో అమృతం నింపిన వాళ్లు వారు. ఆ రోజుల్ని, వారు చేసిన సాయాన్ని తలుచుకుంటే ఈ రోజుక్కూడా నా కళ్లు చెమ్మగిల్లుతాయి.
వర్గం కాదు కులమే
ఎం.ఏ (చరిత్ర) కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుంటే నాకు సీటు వచ్చింది. కాకపోతే, డిగ్రీ దాకా తెలుగు మాధ్యమమే చదువుకున్న మాకు ఇంగ్లీషు సంభాషణ కష్టంగా ఉండేది. అదో ఇబ్బంది. దీనికి తోడు మేమంతా పాత దుస్తులు, స్లిప్పర్స్ వేసుకుని తిరుగుతుంటే చూసేవాళ్లంతా మా భాష మీద, మా దుస్తుల మీద జోకులు వేసేవారు. ఎంత పట్టించుకోకుండా ఉందామనుకున్నా వారి మాటలు ఎంతో కొంత ఆత్మన్యూనతా భావానికి గురిచేసేవి. ప్రారంభంలో ట్రైబల్ స్టూడెంట్స్ ఆరుగురు ఉన్నా ఈ పరిస్థితులు తట్టుకోలేక వాళ్లల్లో ముగ్గురు వెళ్లిపోయారు. మెల్లమెల్లగా ఎస్‌సి, ఎస్‌టి వాళ్లంతా ఒక గ్రూపుగా, అగ్రకులాల వారంతా ఒక గ్రూపుగా విడిపోవడం జరిగింది. కుల ప్రాతిపదికన స్నేహాలు ఏర్పడటం అన్నది బాధాకరంగా ఉండేది. ఆంధ్రాప్రాంతం నుంచి వచ్చిన దళిత విద్యార్థులు తాము దళితులమని చెప్పుకునే వాళ్లు. ఒకసారి బాపట్ల నుంచి సుధాకర్, నాగభూషణం అనే ఇద్దరు దళిత విద్యార్థులు వచ్చి పి.జి.లో చేరితే వారిని కూడా ఇతరులు అలాగే అవమానించడం మొదలెట్టారు. వీళ్లు తిరగబడటంతో విషయం పరస్పర భౌతిక దాడుల దాకా వెళ్లింది. ఆ తరువాత దళిత విద్యార్థులంతా సంఘటితం కావడం మొదలెట్టారు. అప్పటిదాకా మార్క్సిజం భావజాలంతో ఉన్న నేను అంబేద్కరిజం వైపు మొగ్గు చూపాను. సమాజంలో ఉన్నవి వర్గ సమస్యలు కాదు, కుల సమస్యలేనన్న భావన నాలో బలపడింది. ఈ స్థితిలోనే యూనివర్సిటీలో తొలిసారిగా అంబేద్కర్ అసోసియేషన్ ఊపిరిపోసుకుంది. దాని సంస్థాపక సభ్యుల్లో నేనొకడ్ని. అప్పటిదాకా చౌదర్లమని చెప్పుకుంటూ బతికిన విద్యార్థులంతా తాము దళితులమనే నిజాన్ని బహిర్గతం చేశారు.

తరాలు మారితేనేమిటి?
ఎం.ఏ అయిపోగానే ఎం.ఫిల్‌లో చేరాను. ఎం.ఫిల్ థీసిస్ సమర్పించక ముందే నాకు ఉస్మానియా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. అప్పుడే దసరా సెలవులు రావడంతో నేను మా ఊరికి వెళ్లాను. మాతో మొదట్నించి ఎంతో సాన్నిహిత్యం ఉన్న ప్రభాకర రెడ్డి అనే ఆయనతో ఈ శుభవార్త చెబుదామని మా కజిన్‌తో క లిసి వారింటికి వెళ్లాను. అతను పది ఫెయిలవడంతో చదువు అంతటితో ఆపేసి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ ఉండేవాడు. వాళ్లదో పెద్ద బంగళా. నేను వాళ్ల ఇంటికి వెళ్లడం అదే మొదటిసారి. నేను వెళ్లినప్పుడు ప్రభాకరరెడ్డ్ది ఇంట్లోనే మంచం మీద కూర్చుని ఉన్నాడు. వాళ్ల అమ్మానాన్నా అక్కడే ఉన్నారు. వెళ్లి విషయం చెప్పాను. 20 నిమిషాల పాటు నన్ను నిలబెట్టి మాట్లాడాడే తప్ప కూర్చోమనలేదు. ఇంక ఉండలేక తిరిగి వచ్చేశాను. బయట ఎంతో ఆత్మీయంగా ఉండే అతను ఆ సమయాన అలా ఎందుకు చేశాడా? అన్న ఆలోచనల్లో పడ్డాను. ఆ రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు. ఉద్యోగం వచ్చిన సంతోషమే లేకుండా పోయింది నాకు. ఏమీ చదువుకోని మా నాన్న పట్ల వ్యవహరించిన తీరుకు, చదువుకుని ఒక స్థాయికి వచ్చిన నా పట్ల వ్యవహరించిన తీరుకు పెద్ద తేడా లేదనిపించింది. సమాజంలో ఉన్నది కుల సమస్యే అని అంతకు ముందే ఏర్పడిన భావన ఆ సంఘటనతో మరింత బలపడింది. క్లాసు లేదు. కులమే ఉంది అనే భావన నాలో పాదుకుపోవడానికి ఈ అనుభవం బాగా దోహదం చేసింది.

వచ్చిన దారిని మర్చిపోతామా?
పి.హెచ్‌డి కోసం నేను లండన్ వెళ్లాను. అక్కడే ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి, చేస్తావా అని మా గైడ్ అడిగారు. కాని నేను నా దేశానికి తిరిగి వెళ్లిపోవాలనుకుంటున్నట్లు చెప్పాను. నా శక్తి మేరకు మా గిరిజనులకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను, అందుకే ఏం చేసినా ఇండియాలోనే చేస్తానని చెప్పాను. ఆయన ఎంతో సంతోషించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా దాటి వచ్చిన లోయల్ని మరిచిపోకూడదని నేన నుకుంటాను. ఈనాటికీ అడుగడుగునా ఎన్నో అవమానాల్ని ఎదుర్కొంటూ దుర్భరమైన జీవితం గడుపుతున్న వారికి ఆసరా అందించడం కన్నా గొప్ప పని ఏముంటుంది? నా కృషి వెనుక ఒక ఉన్నత స్థానాన్ని అందుకోవాలన్న ఆశ కన్నా, లంబాడాలకు ఎదురవుతున్న అవమానాలకు అడ్డుకట్ట వేయాలన్న కసి ఉంది. పాజిటివ్ కసి సమాజానికి మంచే చేస్తుందన్న సత్యాన్ని నా జీవితమే నాకు నేర్పింది.

హీనాతిహీనంగా తిడుతూ, అతి చిన్నకారణాలకే ఒళ్లు హూనమయ్యేలా కొట్టేవాడు. ఏనాడూ ఆయన నన్ను నా పేరుతో పిలవలేదు. 'అరే ఓ లంబాడి... కొడుకా' లాంటి బూతులే తిట్టేవాడు.
-బమ్మెర
ఫోటోలు: నవీన్

Navya, Andhra Jyothi Telugu News Paper Dated: 1/11/2013 

Wednesday, October 16, 2013

సామాజికన్యాయంతో నవ ప్రస్థానం - ప్రొఫెసర్ భంగ్యా భూక్యా

10 శాతం జనాభా కలిగి ఉన్న అగ్రకులాలు దాదాపు 50 శాతం శాసన సభ్యులను కలిగి ఉన్నాయి. అగ్రకుల శాసన సభ్యులను 10 శాతానికి ఎలా తీసుకురావాలన్న ప్రాతిపదికగా తెలంగాణ పునర్ నిర్మాణం జరగాలి. అణగారిన కులాలు రాజ్యాధికారం సాధించి ఆత్మగౌర వంతో బతికే విధంగా పునర్ నిర్మాణం జరగాలి. అభివృద్ధి ఫలాలు ఏ ఒక్క కులానికో, వర్గానికో పరిమితం కాకుండా సామాజికన్యాయ సూత్ర ప్రాతిపదిక మీద అన్ని కులాలకు, వర్గాలకు, అందేలా పునర్‌నిర్మాణం జరగాలి.
కాంగ్రెస్‌పార్టీ వర్కింగ్ కమిటీ జూలై 30 ప్రకటనతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయిందనే అభిప్రాయానికి తెలంగాణ ప్రజలు వచ్చేశారు. పార్లమెంటు ఆమోదమే మిగిలింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పునర్నిర్మాణం గురించి మీడియా లోపట, బైట చర్చలు మొదలైనాయి. ఇక్కడ ప్రశ్న ఏమంటే ఏ ప్రాతిపదికన పునర్నిర్మాణం జరగాలి? తెలంగాణ విద్యావంతులుగా, ఉద్యమ పార్టీలుగా చలామణి అవుతున్నవారు 'అభివృద్ధి' ప్రాతిపదికన పునర్నిర్మాణం జరగాలని వాదిస్తున్నారు. చాలా తెలివిగానే వీరు ఈ వాదనను ముందుకు తీసుకు వ స్తున్నారు. ఈ వాదనలో అణగారిన కులాల రాజకీయ ఆకాంక్షను తొక్కిపెట్టే కుట్ర దాగి ఉంది. మొదటి నుంచే అణగారిన కులాల ఆకాంక్ష తెలిసే వీరు ఈ ఉద్యమాన్ని ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగా చిత్రీకరించారు.
అణగారిన కులాలు నిజంగానే నీరు, వనరుల కోసం ఉద్యమిస్తున్నాయా? దున్నటానికి కుంట భూమి లేనివాడికి, పైసా పెట్టుబడి పెట్టలేని వాడికి నీరెందుకు, వనరులెందుకు. నీరు, వనరులనేది కేవలం తెలంగాణ దొరల ఎజెండా. అణగారిన కులాల, జాతుల ఎజెండాలో అవి ఎన్నడూ లేవు. నాకు తెలిసినంత వరకు తెలంగాణ ప్రజలు ఆర్థిక ఎజెండాతో పోరాటం చేయడం చాలా అరుదు. వారి పోరాటంలో సామాజిక, రాజకీయ ఎజెండాలే ప్రధానంగా కనిపిస్తాయి. ప్రపంచ అణగారిన వర్గాల ఉద్యమాల్ని పరిశీలిస్తే అవి రెండే రెండు ఎజెండాల చుట్టూ నడుస్తుంటాయి. ఒకటి 'ఆకలి', రెండవది-'అవమానం'. ఇండియా విషయానికివస్తే 'అవమానం' ఒక ప్రధానమైన సమస్య. అణగారిన కులాలు, జాతులు, ఈ సమస్య నుంచి అధిగమించటానికి అవకాశం వచ్చినప్పుడల్లా వివిధ రూపాల్లో ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నం జాతీయ, ప్రాంతీయ, ఉప ప్రాంతీయ ఉద్యమాలన్నిటిలోనూ కనిపిస్తోంది.
తెలంగాణ ఉద్యమం జరిగిన తీరును నిశితంగా పరిశీలిస్తే 'అవమానం' ఏ విధంగా ప్రధాన ఎజెండాగా ఉద్యమంలో ఉండింది ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణలోని కులాలు తమ తమ ఉత్పత్తి పనిముట్లతో వచ్చి తమ ఉనికిని చాటుతూ ఉద్యమంలో పాల్గొన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఒక కారణం కావచ్చు కానీ దాని చుట్టూ తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని, స్వయంపాలనా ఆకాంక్షను చాటుకునే ప్రయత్నం చేశాయి. ఉద్యమ నాయకులుగా చలామణి అవుతున్నవారు ఎంతమంది ఈ విషయాన్ని గుర్తించారన్నది తెలియదు. కానీ, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ నర్సింహ ఢిల్లీ ప్రెస్ మీట్‌లో తెలంగాణ ఉద్యమం ఆర్థిక అసమానతల నిర్మూలన కోసం జరిగింది కాదని, ఇది ప్రత్యేక ఉనికి, ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం జరిగిందని చెప్పటం చాలా సంతోషకరం. బహుశా ఇదే విషయాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పి ఉండవచ్చు.
తెలంగాణకు ఈ కోణం ఉందన్న వాస్తవాన్ని ఢిల్లీ పెద్దలు గుర్తించటం వల్లనే రాష్ట్ర ఏర్పాటుపై త్వరితగతిన నిర్ణయాలు జరిగిపోయాయి. ఎందుకంటే దానికి రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.
తమ రాజకీయ ఆకాంక్షను ఇప్పుడు ఎలా సాకారం చేసుకోవాలన్నదే అణగారిన కులాల ముందున్న ప్రధాన సమస్య. ఫ్యూడల్ వ్యవస్థను ఢీ కొనడం కష్టతరమైన పనే. దీనికి దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. కాకతీయుల తదనంతరం వచ్చిన కుతుబ్ షాహిల కాలంలో నాయకర్‌లు(గ్రామాధికారులు)గా ఆంధ్ర, మరాఠ ప్రాం తాల నుంచి వచ్చిన రెడ్డి, వెలమలు కొలది కాలంలోనే 'కులాన్ని' ఫ్యూడల్ వ్యవస్థతో జోడించి ఒక భయంకరమైన దోపిడీ వ్యవస్థను సృష్టించారు. ఈ వ్యవస్థ అణగారిన కులాలను పూర్తి స్థాయి బానిసలుగా మార్చివేసింది. ఈ వ్యవస్థ అసఫ్‌జాహీల కాలంలో మరింత బలపడి నేటికీ వివిధ రూపాల్లో కొనసాగుతూనే ఉంది.

1995 నుంచి సాగిన ఉద్యమాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఆంధ్ర పెట్టుబడిదార్లకు, తెలంగాణ దొరలకు వ్యతిరేకంగా జరిగిన ట్రయాంగిల్ పోరాటంగా కనిపిస్తుంది. దొరల నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఒకవైపు జరుగుతూ ఉంటే, అణగారిన కులాలు, జాతులు తమ తమ కుల, జాతుల సంఘాలు పెట్టుకొని తమ ప్రత్యేక ఉనికి, ఆత్మగౌరవాన్ని, స్వయం పాలనను చాటుకుంటూ ఉద్యమించాయి. ఈ ఉద్యమాలు దొరల ఉద్యమాల్లో భాగంగా కాకుండా సమాంతరంగా నడిచాయి. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను దొరల ఉద్యమం కంటే ఈ అణగారిన కులాల ఉద్యమమే బలంగా వినిపించింది. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష సాకారం కావడటానికి అణగారిన కులాల పాత్రే ప్రధాన భూమిక పోషించింది. దొరలు తెలంగాణ పేరుతో తమ కులాన్ని రాజకీయంగా బలోపేతం చేసుకొని, వేల కోట్ల ఆస్తులను సంపాదించుకున్నారు. దొరల నాయకత్వాన్ని ఢిల్లీ పెద్దలు ఎప్పుడు చీదరించుకుంటూనే వచ్చారు. ఇంతటి పోరాట పటిమ కలిగిన తెలంగాణ ప్రజలకు వీరా నాయకులని ఆశ్చర్యపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అణగారిన ప్రజల ఆకాంక్షను ఢిల్లీ నాయకత్వం చివరికి గౌరవించింది.
తెలంగాణ వారి నాయకత్వంలో తమతో సంబంధం లేకుండా ఉద్యమాలు వస్తుండటం చూసి ఈ దొరలు మళ్లీ కొత్త నాటకాలు మొదలెట్టారు. వీరి మాటలు విని 1948లో తెలంగాణ ప్రజలు ఒకసారి మోసపోయారు. మరోసారి అది పునరావృతం కాకుండా ఉండాలంటే అణగారిన కులాలు అప్రమత్తంగా ఉండాలి. పునర్‌నిర్మాణం చర్చల్లో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారంలా అభివృద్ధి చేస్తామని దొరలు ఊదరకొడుతున్నారు. వీరు చెప్పే అభివృద్ధి ఎందుకు, ఎవరికోసమన్న ప్రశ్నలు వేసుకోవాలి. దొరలు చెప్పే అభివృద్ధి కేవలం వారి ఆస్తులను పెంచుకోవడానికే ఉపయోగపడుతుంది. దొరలు చెప్పే అభివృద్ధిలో అణగారిన కులాలకు మిగిలేది కేవలం గొర్ల, బర్ల లోన్‌లు మాత్రమే అన్న విషయాన్ని గమనించాలి. మరి వీటి కోసమేనా తెలంగాణ తల్లులు వేలమంది కొడుకులను త్యాగం చేసింది? అసలు ఈ దొరలు చెప్పే అభివృద్ధి అణగారిన కులాలకు అవసరమా?
వాస్తవంగా తెలంగాణ ఉద్యమానికీ, అభివృద్ధికీ ఏ సంబంధం లేదు. ఇది ఒక రాజకీయ ఉద్యమం. కాబట్టి ముందు రాజకీయ పునర్ నిర్మాణం జరగాలి. అలా అని నేను అణగారిన ప్రజలకు అభివృద్ధి అవసరం లేదని అనటం లేదు. రాజ్యాధికారం అణగారిన కులాలకు వస్తే ఆర్థిక అభివృద్ధి, సామాజిక పునర్ నిర్మాణం (సోషల్ ఇంజనీరింగ్) దానంతటికి అదే జరిగిపోతుంది. దళిత, బహుజన, ఆదివాసీ మేధావులు, కవులు, కళాకారులు ఈ ప్రాతిపదిక మీదనే తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసి నిర్మించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా ఈ ప్రాతిపదిక మీదనే చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు ఇచ్చారు. 90 శాతం అణగారిన కులాలు జాతులున్న తెలంగాణలో అంబేద్కర్ ఆశించిన రాజ్యం వచ్చే అవకాశం బలంగానే ఉన్నది.
ఇక్కడ ప్రశ్న ఏమంటే 10 శాతం జనాభా కలిగి ఉన్న అగ్రకులాలు దాదాపు 50 శాతం శాసన సభ్యులను కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ 50 శాతం ఉన్న అగ్రకుల శాసన సభ్యులను 10 శాతానికి ఎలా తీసుకురావాలన్న ప్రాతిపదికగా తెలంగాణ పునర్ నిర్మాణం జరగాలి. అణగారిన కులాలు రాజ్యాధికారం సాధించి ఆత్మగౌరవంతో బతికే విధంగా పునర్ నిర్మాణం జరగాలి. అగ్ర కులాలే పాలకులుగా, ప్రతిపక్షాలుగా, ఉద్యమ నాయకులుగా, ఉండే పరిస్థితి మారే విధంగా పునర్ నిర్మాణం జరగాలి. అభివృద్ధి ఫలాలు ఏ ఒక్క కులానికో, వర్గానికో పరిమితం కాకుండా సామాజికన్యాయ సూత్ర ప్రాతిపదిక మీద అన్ని కులాలకు, వర్గాలకు, అందేలా పునర్ నిర్మాణం జరగాలి. మానవ హక్కుల ఉల్లంఘన లేని సమాజ నిర్మాణం కోసం పునర్ నిర్మాణం జరగాలి.
- ప్రొఫెసర్ భంగ్యా భూక్యా
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ

Andhra Jyothi Telugu News Paper Dated : 17/10/2013 


Thursday, July 18, 2013

ముస్లిం కోణంలో '1948' By భంగ్యా భూక్యా ,ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ


July 19, 2013
హైదర్ చాలా చిత్తశుద్ధితో 1948 జనవరిలో హైందవ జాతీయవాదులు, రజాకార్ల పరస్పర దాడులను అరికట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసినందుకు సైనిక చర్య అనంతరం హైదర్‌ను ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించి, అరెస్ట్ చేసి, ఆయన పనిచేసిన ఉస్మానాబాద్ జిల్లాలోనే మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆయనపై ఏడు కేసులు నమోదు చేశారు. హైదర్ పాకిస్థాన్‌కో, విదేశాలకో పారిపోకుండా ధైర్యంగా న్యాయపోరాటం చేసి తనపై మోపిన ఆరోపణల్ని నివృత్తి చేశారు. మొహమ్మద్ హైదర్ రచించిన 'అక్టోబర్ కూ' అనే పుస్తకాన్ని గత ఏడాది చివరలో ఢిల్లీ వెళ్లుతూ హైదరాబాద్ విమానాశ్రయంలో కొని ఆత్రుతగా రెండు రోజుల్లో తిరిగి హైదరాబాద్ వచ్చే లోపే చదివేశాను.

అప్పుడే ఈ పుస్తకాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేస్తే బాగుంటుందనిపించింది. గత ఏప్రిల్‌లో ఈ పుస్తకాన్ని గీతా రామస్వామి '1948: హైదరాబాద్ పతనం' గా తెలుగులో తీసుకురావడం చూసి చాలా సంతోషించాను. ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్ బుక్ ట్రస్ట్, అన్వేషి సంస్థల ఆధ్వర్యంలో 'ఆంధ్ర సారస్వత పరిషత్' హాలులో భారీ ఎత్తున జరిగింది. చరిత్ర అభిమానిగా , పరిశీలకుకుడిగా నేను కూడా ఆ సభకు వెళ్ళాను. పుస్తకావిష్కరణ సమయంలో ఇద్దరు ముస్లిం యువకులు చెరో ప్లకార్డు పట్టుకొని వేదిక ముందుకు వచ్చారు. ఒక ప్లకార్డులో 'గీతా రామస్వామి, ఉయ్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యు', అనీ, మరో ప్లకార్డులో 'గీతా రామస్వామి, శాల్యూట్ యు' అనీ రాసి ఉంది.


అది చూసి హైరదాబాద్ చరిత్ర అంతా ఒక్కసారిగా కళ్ల ముందు తిరిగింది. ఆ అక్షరాల్లో ముస్లింల నిస్సహాయ దీనస్థితి కనిపించింది. 1948 సెప్టెంబర్ 17 సంఘటన తరువాత మొదటిసారిగా ఒక ముస్లిం తనకు అన్యాయం జరిగిందని గొంతు చించుకొని చెప్పుకున్న గాథే ఈ పుస్తకం. భారత సైన్యం దాడి అనంతరం జరిగిన మారణహోమం, తదనంతరం ఆంధ్ర పాలకులు సృష్టించిన మత ఘర్షణలు హైదరాబాద్ ముస్లింలను ఒక భయానక స్థితికి నెట్టేశాయి. గొంతు విప్పితే నిరంతర నిర్బంధాలు, చిత్రహింసలు. దాంతో ఏ ముస్లిం కూడా గొంతు విప్పి మాట్లాడే ధైర్యం చేయలేదు. హైదర్ పుస్తకం ఈ పరిస్థితిని ఛేదించిందనే చెప్పాలి.

ఈ పుస్తకం హైదర్ ఆత్మకథ అయినప్పటికీ హైదరాబాద్ రాజ్యం చివరి రోజుల గురించి అనేక ఆసక్తికరమైన విషయాల్ని తెలియజేసింది. ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో హైదర్ ఒక ఉన్నత పదవిలో ఉన్న అధికారి. 1937లో చిన్న వయస్సులోనే, ఉన్నత స్థాయి సివిల్ సర్వీస్‌కు ఎంపికైన ప్రతిభావంతుడు. ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ఉదారవాద అధికారుల్లో హైదర్ ఒకరు. ఈ తరహా అధికారులు ప్రజల బాధలను చూసి చలించిపోవటం, ప్రజల సమస్యలను అర్థం చేసుకొని తక్షణమే పరిష్కరించటం చేస్తుండేవారు. బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన అనంతరం హైదరాబాద్ పరిస్థితి విచిత్రంగా మారింది. స్వతంత్రంగా ఉన్న హైదరాబాద్‌ను తనలో కలుపుకోవటానికి భారత్ ముమ్మర ప్రయత్నాలు చేయసాగింది.


ఇందులో భాగంగా హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ ముసుగులో ఉన్న హైందవ జాతీయవాదులు, ఇండియా-మహారాష్ట్రలోని హైందవ జాతీయవాదులతో కలిసి హైదరాబాద్ మీద దాడులు చేయటం మొదలుపెట్టారు. ఆ దాడులు 1947 నవంబర్‌లో యథాతథ ఒడంబడిక (1947 నవంబర్) నాటి నుంచి సైనిక చర్య అనంతరం కూడా కొనసాగాయి. ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలోని రజాకార్లు ప్రతి దాడులు చేయడం మొదలుపెట్టారు. దీంతో సరిహద్దు జిల్లాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ దాడులను చూసి చలించిపోయిన హైదర్ తనను దాడులకు గురవుతున్న జిల్లాకు కలెక్టర్‌గా నియమించమని అప్పటి రెవెన్యూ మంత్రి దగ్గరికి వెళ్ళి కోరాడు. 1948 జనవరిలో హైదర్ చాలా చిత్తశుద్ధితో హైందవ జాతీయవాదులు, రజాకార్ల పరస్పర దాడులను అరికట్టే ప్రయత్నం చేశారు.

ఈ ప్రయత్నం చేసినందుకు సైనిక చర్య అనంతరం హైదర్‌ను ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించి, అరెస్ట్ చేసి ఆయన పనిచేసిన ఉస్మానాబాద్ జిల్లాలోనే మూడేళ్లపాటు జైల్లో నిర్బంధించారు. ఆయనపై ఏడు కేసులు నమోదు చేశారు. వీటిలో రెండు బందిపోటు కేసులు, ఐదు హత్యకేసులు. హైదర్ ఈ కేసులతో భయపడి పాకిస్థాన్‌కో, విదేశాలకో పారిపోకుండా ధైర్యంగా న్యాయపోరాటం చేసి తనపై మోపిన ఆరోపణల్ని నివృత్తి చేశారు. గోల్కొండ పక్కనే నివాసముంటూ 1973లో చనిపోయారు. హైదర్ ఈ పుస్తకంలో సెప్టెంబర్ 17 సంఘటనకు ఒక కొత్త కోణాన్ని మన ముందు ఉంచారు. ఇప్పటి వరకు ఈ సంఘటన కాంగ్రెస్ జాతీయవాదులకు, హిందూ జాతీయవాదులకు, కమ్యూనిస్టులకు ఒక విజయోత్సాహం. కాంగ్రెస్ వాదులకు ఈ సంఘటనతో ఇండియా ఏకీకరణ పూర్తయింది. హిందూ జాతీయవాదులకు ఈ సంఘటన ముస్లిం పాలకులపై హిందువులు సాధించిన విజయం. కమ్యూనిస్టులకు ఈ సంఘటన రాచరిక వ్యవస్థపై ప్రజలు సాధించిన విజయం.

కానీ, హైదర్ చెప్పినట్లు ఈ సంఘటన లక్షలాది మంది ముస్లింలకు ఒక విషాద ఘటన. కొన్ని లక్షల కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. లక్షలాదిమంది నిరంతర నిర్బంధానికి, ఊచకోతకు గురయ్యారు. హైదర్ జీవితమే దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఒక ఉన్నత స్థాయి సివిల్ సర్వెంట్ ఇంతటి నిర్బంధానికి గురైతే సామాన్య ముస్లింల పరిస్థితి ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. తోటి ముస్లింలు కూడా హైదర్‌కు సాక్షులుగా ముందుకు రాలేదు . చివరకు నిజాం కూడా హైదర్‌ను అపరాధిగానే ముద్ర వేశాడంటే ముస్లింలలో ఎంత అభద్రతా భావం ఉందో అర్థమవుతుంది. ఈ పుస్తకం చాల బలంగా మన ముందు ఉంచిన మరో విషయం ఏమంటే, ఇంతవరకు మన చరిత్ర పుస్తకాలు మనకు రజాకార్లు, భారత సైన్యం చేసిన దుర్మార్గాలనే చెప్పాయి కానీ హిందూ మతోన్మాదులు దాదాపు ఒక సంవత్సరం పొడవునా జరిపిన మారణకాండ , దోపిడీలను గురించి ఎక్కడా చెప్పలేదు. మరో విషయం ఏమంటే, హైదరాబాద్ పతనానికి భారత సైన్యంతోపాటు హిందూ జాతీయవాదులు కూడా సమాన పాత్ర నిర్వహించారన్న విషయం ఈ పుస్తకం ద్వారానే తెలిసింది. హైదరాబాద్‌ను స్వతంత్రదేశంగా నిలబెట్టాలన్న రజాకార్ల ప్రయత్నం, స్వయం ప్రతిపత్తితో కూడిన హైదరాబాద్‌ను ఇండియాలో చూడాలన్న నిజాం రాజు ప్రయత్నాన్ని ఈ పుస్తకం చాలా విపులంగా వివరించింది. కాశిం రజ్వీ మతోన్మాది అయినప్పటికీ ఒక మంచి మాట అన్నాడు. అదేమంటే 'ఇండియా ఒక భౌగోళిక భావన, హైదరాబాద్ ఒక రాజకీయ వాస్తవం'. ఈ మాట నేటికీ అక్షరాలా సత్యం. ఇండియా అనేక జాతుల సమ్మేళనమే కానీ ఏ నాటికీ ఒక జాతి కాలేదు.


మొత్తంగా ఈ పుస్తకం ముస్లిం సోదరులకు అయిన గాయాల్ని కళ్ళకు కట్టిననట్టుగా వివరిస్తుంది. ఆ గాయం రాచపుండులా ముస్లింలనే కాదు, ప్రజలందర్నీ నేటికీ వేధిస్తూనే ఉంది. భారత్, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య, సెక్యులర్ దేశమని గొప్పలు చెప్పుకుంటున్న మన ప్రభుత్వం హైదరాబాద్‌లో సైన్య ం సృష్టించిన మారణ హోమం మీద సుందర్‌లాల్ కమిటీ రిపోర్టును బహిర్గతం చేయకపోవటం విచారకరం. జరిగిన ఈ ఘోరానికి భారత ప్రభుత్వం ముస్లిం సోదరులకు బహిరంగ క్షమాపణ చెప్పకుండా వారి హృదయాలను గెలుచుకోలేదు. ఈ దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తల ఎత్తుకుని బతికే హక్కును కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది.


- భంగ్యా భూక్యా
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ

Andhra Jyothi Telugu News Paper Dated : 19/07/2013 

Sunday, January 20, 2013

ఇంగ్లీషు, విదేశీభాషల యూనివర్సిటీలో సామాజికవివక్ష అధ్యయన విభాగంలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న భూక్యా


చాయ్, సమోస ఔర్ లామకాన్

భంగ్యా భూక్యా. ఇటువంటి పేర్లను విద్యావిషయకమైన బృందాల్లో వినడానికి మనం ఇంకా పూర్తిగా అలవాటు పడలేదు. వేరే స్థలాల్లో వేరే సందర్భాల్లో వేరే కోవల్లో మాత్రమే కనిపించే పేర్లు అధికార స్థానాల్లో, జ్ఞానపీఠాల్లో, పత్రికల కాలమ్స్‌లో తరచు తారసపడితే తప్ప సమాజంలోని అహంకారాలూ అర్థసత్యాలూ అంతరించిపోవు. ఇంగ్లీషు, విదేశీభాషల యూనివర్సిటీలో సామాజికవివక్ష అధ్యయన విభాగంలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న భూక్యా నిజాం పాలనలో లంబాడాల స్థితిగతుల మీద ఇంగ్లండ్‌లోని వార్‌విక్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. అంతర్జాతీయంగా పేరుపొందిన చరిత్రకారులతో కలసి పనిచేశారు. 2010లో ఇంగ్లీషులో వచ్చిన ఆయన పరిశోధనాగ్రంథం తెలుగు సంక్షిప్త అనువాదం జనవరి 5న హైదరాబాద్‌లో ఆవిష్క­ృతమైంది. 

ఆ పుస్తకం నుంచి కోకొల్లలుగా కొత్త సత్యాలు నేర్చుకోవచ్చును. అవన్నీ ఒక ఎత్తు, పుస్తకావిష్కరణ జరిగిన వేదిక 'లామకాన్' నేర్పే కాలజ్ఞానం మరో ఎత్తు. గ్రంథకర్తకూ, ప్రచురించిన హైదరాబాద్ బుక్‌ట్రస్ట్‌వారికీ ఆ సమయంలో ఆ స్ఫురణ కలిగిందో లేదో కానీ, బంజారా హిల్స్‌లో, మేడాగూడూ కాకుండా మధ్యరకంగా, బృహత్‌శిలలను కడుపులోనే పెట్టుకుని కట్టుకున్న ఒక పొదరింటిలో భూక్యా పుస్తకావిష్కరణ జరగడం ఒక చారిత్రక న్యాయంగా తోచింది నాకు. ఒక వైపు జివికె మహాసామ్రాజ్యం, మరో పక్కన వెంగళరావు పార్కు, తక్కిన వైపులంతా విషంలా వ్యాపించిన నవసంపన్నత, వీటి మధ్య 'లామకాన్' ఒక చెలిమె. సాహిత్యం, సంస్క­ృతి, సమాజం- ఏదైనా సరే, నలుగురు కూర్చుని మాట్లాడుకోవడానికి, పాడుకోవడానికి ఒక మంచి మనిషి అందించిన కాసింత స్థలం. అతి విలువైన అతి అరుదైన స్థలం. ఆ స్థలం ఉండబట్టే, బంజారాల చరిత్రను ఆవిష్కరించిన పుస్తకం బంజారాహిల్స్‌లో ఆవిష్క­ృతమైంది. ఆ సన్నివేశం మీటిన రహస్తంత్రి ఏమి చెబుతున్నది? ఈ దేశపు మహాజనులారా! మీరు కోల్పోయిన స్థలాలన్నిటినీ తిరిగి ఆక్రమించుకోండి, మీరు విస్మ­ృతులైన కాలాలన్నిటినీ నిద్రలేపండి!

సంపన్నతతో విర్రవీగుతున్న బంజారాహిల్స్‌ను ఉద్రిక్త వక్షోజాలతో పోల్చాడు తిలక్. మహానగరంలోని ఉన్నతవర్గాల కేంద్రంగా బంజారాహిల్స్ ప్రఖ్యాతినో అపఖ్యాతినో మూటగట్టుకున్నది కానీ దాని నామవాచకం వెనుక ఉన్న చారిత్రక అర్థం మరుగున పడిపోయింది. ఒకనాడు సంచారవర్తకులుగా, రవాణాదారులుగా ఉన్న లంబాడాల ఆవాస ప్రాంతాలు నేటి బంజారాహిల్స్. ఆ కొండలు ఇప్పుడు బంగారు కొండలయిన క్రమం గానీ, ఎవరెవరినుంచి చేతులు మారి అవి నేడు కొండచిలువలకు కొలువైన కథ గానీ చరిత్రలో కనిపించదు. భంగ్యా భూక్యా- ఆ చరిత్ర డొంకను కదిలించాడు. 'లామకాన్'లో ఆ పుస్తకం గురించి చర్చించుకున్న కాసేపయినా బంజారాహిల్స్‌ను తిరిగి బంజారాలకు అంకితం చేశాడు.

'లామకాన్' ఒక సాంస్క­ృతిక బహిరంగ వేదిక కాకముందు, అది ఒక నివాసం. అప్పుడు కూడా దానిపేరు లామకానే. లామకాన్ అంటే ఇల్లులేని వారు అని అర్థం. ఇల్లు లేకపోవడం అంటే నిరాశ్రయత కాదు. సర్వవ్యాపిత్వం అని. ఇస్లామ్‌లో అల్లాకు ఉన్న అనేక నామాలలో లామకాన్ కూడా ఒకటి. నిరాకారుడైన దైవం స్థావరుడు కాదు. అన్నిటా ఉండే మహాశక్తి. జంగమతత్వానికి దగ్గరగా కనిపించే అద్భుతమైన భావన అది. భాగ్యనగరానికి ఆభరణాల వంటి మహాశిలలను ధ్వంసం చేయకుండా, వాటిని గర్భీకరించుకుంటూ, కళాత్మకంగా, నిరాడంబరంగా నిర్మించుకున్న ఆ నివాసం మొయిద్ హసన్‌ది. హైదరాబాదీ శిలా రక్షణ ఉద్యమకారుడు, ఛాయాగ్రాహకుడు, డాక్యుమెంటరీల నిర్మాత, చిత్రకారుడు మొయిద్ హసన్. ఉర్దూ రచయిత్రి జిలానీ బానో సోదరుడు ఆయన. తన తండ్రి స్నేహితుడైన హైదరాబాద్ అద్భుత కవి మగ్దూం మొహియుద్దీన్ ఒడిలో బాల్యకౌమారాలు గడిపిన అదృష్టవంతుడు.

పదిహేనేళ్ల కిందట హసన్‌ను 'లామకాన్' లో కలిశాను. చలపతి, విజయవర్థనరావు ఉరిశిక్షల రద్దు ఉద్యమంపై ఆయన, సజయ కలిసి ఒక డాక్యుమెంటరీ నిర్మించిన సందర్భం అది. సందర్భం అదే అయినా సంభాషణ బహుముఖాలుగా సాగింది. ఆయన ఆదరణలాగే ఉన్న పరిమళభరితమైన వెచ్చటి టీ తాగాను. ఆయన స్వయంగా వండి వడ్డించిన ఆతిథ్యాన్ని స్వీకరించాను. అప్పుడప్పుడే తెలంగాణ చరిత్రపై ఆసక్తి పెంచుకుంటున్న నేను నా అజ్ఞానాన్ని, కుతూహలాన్ని ఆయనతో పంచుకున్నాను. వెలుగునీడల మర్మం తెలిసినవాడేమో, సత్యాసత్యాల మధ్య ఉండే పొరలను విప్పిచెప్పాడు. ట్యూబ్‌లైట్‌లు నిర్జీవ దీపాలని అన్నాడు. నీడలు రాని దీపం వృథా అన్నాడు. ఆయన ఇంట్లో అన్నీ గుండ్రటి ఫిలమెంట్ బల్బులే.

ఏ ఉత్తరాది నుంచో ఏడెనిమిది దశాబ్దాల కిందట వలసవచ్చిన హసన్ కుటుంబం, హైదరాబాద్‌ను ప్రాణప్రదంగా ప్రేమించింది. మఖ్‌మల్ బట్టలో చుట్టి కుట్టిన ఒక చిన్న హైదరాబాదీ శిలను చూపిస్తూ, అభివృద్ధి చేస్తున్న విధ్వంసం గురించి, జనజీవనంలో వస్తున్న శైథిల్యం గురించి హసన్ వేదనతో మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనపై ఆయనకు ఎంతటి వ్యతిరేకతో, హైదరాబాద్ చరిత్రపై, తెహజీబ్ పై ఆయనకు అంత మక్కువ. కర్కోటకుడని పేరుపొందిన ఏడో నిజాం హయాంలో ఒక్క ఉరిశిక్ష కూడా అమలు కాలేదనే విషయం ఆయన చెబితేనే నాకు తెలిసింది. వాస్తవాలను కమ్మివేసిన అభిప్రాయాల పొరలను తొలుచుకుని చూడకపోతే చరిత్రను అర్థం చేసుకోవడం కష్టమని హసన్ నన్ను హెచ్చరించారు.

ఆయనను కలిసింది ఒక్కసారే కానీ, జ్ఞాపకం మాత్రం బలంగా మిగిలిపోయింది. 2004లో ఆయన చనిపోయినప్పుడు, ఆలస్యంగా తెలిసింది. సమాచార విప్లవ యుగంలో కూడా అన్ని వార్తలూ వేగంగా ప్రసరించవని అర్థమయింది. ఆయనను ఎవరెంత గుర్తించారో అనవసరం కానీ, ఆయన బలమైన ఆకాంక్షలు నిరాకరించలేని గుర్తింపును సాధించుకున్నాయి. ఆయన అభిమతాన్ని గుర్తించిన వారసులు, ఆయన నివసించిన ఇంటిని ఒక ఊరుమ్మడి సాంస్క­ృతిక వేదికగా మలిచారు. మంచితనాన్ని పంచుకునే ఏ ప్రయత్నానికయినా ఉచితంగా దొరికే వేదిక 'లామకాన్'. మిత్రుడు రామ్మోహన్ హోలగుండి ప్రదర్శించిన నాటకాలో, మానవహక్కుల వేదిక 'సోంపేట' మీటింగో, కవి శివారెడ్డి కవిత్వాలాపనో, కచేరీలో, ఆటపాటలో బంజారాహిల్స్ రాళ్లలోపల పూలు పూయిస్తూనే ఉన్నాయి. వేడివేడి చాయ్ సమోసాల మధ్య కొత్త మెహఫిళ్లను తీర్చిదిద్దుతున్నాయి. ఎదురీతల్లో రాటుదేలిన భూక్యాల మేధావిత్వం ఒక శిఖరం. విలువలను, సమష్టిని వదలని హసన్‌ల మంచితనం మరో శిఖరం. 

- కె. శ్రీనివాస్ 
srinivask99@gmail.com

Andhra Jyothi Sunday Special Dated: 20/1/2013

Wednesday, December 26, 2012

ఆదివాసీ భాషల మాటేమిటి? ----- ప్రొ. భంగ్యా భూక్యా


ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం తెలుగుకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. బహు భాషల్లో ఉన్న విద్యావిధానం క్రమంగా తెలుగు మయమైంది. ఆదివాసీ పిల్లల మీద తెలుగు బలవంతంగా రుద్దబడింది. దీనికి తోడు తెలుగు సినిమాలు, తదనంతరం వచ్చిన టి.వి. సంస్కృతి ఆదివాసీ భాషలను ధ్వంసం చేసింది. 


తెలుగు ప్రజలూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ నేటి నుంచిమూడు రోజుల పాటు తిరుపతిలో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకోనున్నారు. తెలుగు భాషాభిమానులు, పండితులు తెలుగు భాష ఇంగ్లీష్ ప్రపంచంలో కొట్టుకుపోతుందని ఎక్కడలేని బాధను వ్యక్తపరుస్తున్నారు. ఎవరి భాషను వారు అభిమానించటంలో, పరభాష నుంచి తమ భాషను రక్షించుకోవటంలో తప్పు ఏమీలేదు. నా బాధంతా తెలుగు ప్రపంచంలో ఆదివాసీ భాషలు ఏవిధంగా కొట్టుకుపోతున్నాయో ఈ పండితులు, ప్రభుత్వం ఆలోచించాలి. ఈ సదస్సులో ఆదివాసులను తెలుగు ప్రజలుగా చిత్రించే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఆదివాసీ భాషల ఉనికినే తుడిచిపట్టే ప్రమాదం ఉంది.



మన రాష్ట్రంలో 33 ఆదివాసీ, సంచార తెగలున్నాయి. ప్రతి తెగ తన ప్రత్యేక భాషను కలిగి ఉన్నాయి. రెండు లక్షల పైన జనాభా కలిగిన తెగలు ఆరు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆయా తెగల జనాభా ఇలా ఉంది. లంబాడా 20,77,947, కోయ 5,68,019, యానాది 4,62,167, ఎరుకల 4,37,459, గోండు 2,52,038, కొండ దొర 2,06,381. లక్షలాది ప్రజలు ప్రత్యేక భాషలను కలిగిఉన్నా వీరి భాషలకు జాతీయస్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలోనూ ఎటువంటి గుర్తింపు లేదు.



ఈ భాషల్లో కొన్ని ఇప్పటికే కనుమరుగుకాగా, మరికొన్ని ఆ ప్రమాదం అంచున ఉన్నాయి. ఈ భాషల మనుగడకు అనేక సవాళ్ళు ఉన్నాయి. ఆదిమ జాతులు తమ మాతృభాషతో పాటు తెలుగును కూడా తప్పనిసరిగా నేర్చుకొని మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలుగు మెజార్టీ ప్రజల భాషగా, రాష్ట్ర భాషగా చలామణి కావటమే అందుకు కారణంగా చెప్పవచ్చు. చిన్న తెగల పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ఈ తెగలు తెలుగుతో పాటు వారి ప్రాంతంలోని మెజార్టీ తెగల భాషను కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. ప్రతి తెగ తెలుగుతో పాటు రెండు, మూడు ఇతర తెగల భాషలను మాట్లాడాల్సి వస్తుంది. మొత్తంగా ఆదివాసీ భాషలు ఒక దుర్భర పరిస్థితిలోకి నెట్టివేయబడ్డాయి.



ప్రభుత్వంగానీ, భాషా పండితులు గానీ ఈ భాషల పరిరక్షణకు ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఈ భాషలను అభివృద్ధి చేయకపోవటానికి వీరు చెప్పే ఒక ప్రధాన సాకు ఏమంటే ఈ భాషలకు 'లిపి' లేదని. విచిత్రం ఏమంటే, ప్రపంచ భాషగా చలామణి అవుతున్న ఇంగ్లీష్ భాషకు సొంత లిపి లేదు. జాతీయ భాషగా చలామణి అవుతున్న హిందీ భాషకు సొంత లిపి లేదు. మరి ఆదివాసీ భాషల అభివృద్ధికి లిపి ఎందుకు అడ్డంకిగా మారుతుందో అర్థంకాని ప్రశ్న.



అసలు భాషకు, లిపికి ఎటువంటి సంబంధం లేదు. ఏ భాషనైనా, ఏ లిపిలోనైనా రాయవచ్చు. ఆ భాషని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే చాలు. మన పాలకులకు ఆదివాసీ భాషల పట్ల నిజాం రాజులకు ఉన్న చిత్తశుద్ధి కూడా లేదు. ఆధునిక విద్యలో భాగంగా చివరి నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ ఆదివాసీ భాషల ప్రత్యేకతను గుర్తించి పాఠశాల పాఠ్యాంశాలను తెలుగు లిపిని ఉపయోగించి లంబాడా, గోండు, కోయ భాషల్లో రాయించారు. ఈ తెగల నుంచే టీచర్‌లను నియమించి వారి శిక్షణ కోసం ప్రత్యేక టీచర్ ట్రయినింగ్ సెంటర్‌లను స్థాపించారు. ఈ విధానం 1956లో హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో విలీనమయ్యేంత వరకూ కొనసాగింది.



ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం తెలుగుకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. బహు భాషల్లో ఉన్న విద్యావిధానం క్రమంగా తెలుగు మయమైంది. ఆదివాసీ పిల్లల మీద తెలుగు బలవంతంగా రుద్దబడింది. దీనికి తోడు తెలుగు సినిమాలు, తదనంతరం వచ్చిన టి.వి. సంస్కృతి ఆదివాసీ భాషలను ధ్వంసం చేసింది.



ముఖ్యంగా మైదాన ప్రాంత తెగల భాషల మీద ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఎరుకల, యానాది భాషలు దాదాపుగా కనుమరుగయ్యాయనే చెప్పాలి. ఈ తెగలు చారిత్రకంగా సంచార జాతులు. ఇవి గ్రామ సమాజంలో స్థిరపడటంతో త్వరిత కాలంలోనే తెలుగు ప్రభావంలోకి వెళ్ళిపోయాయి. మరొక్క సంచార జాతి లంబాడాలు. వీరు వారి నివాసాలను గ్రామ సమాజానికి కాసింత దూరంలో ఏర్పరచుకోవటంతో వారి భాషను కొంత వరకు భద్రపరుచుకోగలుగుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో వీరు జీవనోపాధి కోసం గ్రామ, పట్టణాలపై ఆధారపడటం ఎక్కువ కావటంతో వీరి భాష కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది.



ఆదివాసీ భాషల క్షీణత వారి సంస్కృతి మీద బలమైన ప్రభావాన్నే చూపిస్తున్నాయి. భాషకు, సంస్కృతికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఒక విధంగా భాష ద్వారానే ఈ జాతులు ప్రత్యేక ఉనికిని కలిగి ఉన్నాయి. భాషలు నశిస్తే ఈ జాతుల ఉనికి కూడా నశించే ప్రమాదం ఉంది. పాలకవర్గాలు ఇదే కోరుకుంటున్నాయి. ఎందుకంటే ఈ జాతులు తమ ప్రత్యేక ఉనికిని ఉద్యమ రూపాలుగా మార్చి పాలకవర్గాల ఆధిపత్యాన్ని సవాలు చేస్తుంటాయి. అందుకే పాలకవర్గాలు జాతుల ప్రత్యేక ఉనికిని ప్రమాదంగా భావిస్తాయి. ఈ విభిన్న జాతుల ఉనికిని ధ్వంసం చేసి ఒకే సంస్కృతిని స్థాపించటానికి పాలకవర్గాలు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. అదే పాలకవర్గ సంస్కృతి.



మన దేశంలోని పాలకవర్గాలు విభిన్న కులాల సమ్మేళమైనప్పటికీ సాంస్కృతిక వైరుధ్యాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఈ వర్గాలు ప్రాచీన కాలం నుంచి క్రమంగా తమకంటూ ఒక ప్రత్యేక సంస్కృతిని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సంస్కృతి బ్రాహ్మణ సంస్కృతికి దగ్గరగా ఉంటుంది. పాలకుడు ఏ కులస్తుడైనా ఈ సంస్కృతిని పెంచి పోషించటమో, బలోపేతం చేయటమో జరుగుతూ ఉంటుంది.



తెలుగు భాష అభివృద్ధి కోసం కాకతీయుల కాలం నుంచి నేటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వరకు జరుగుతున్న ప్రయత్నాలన్నీ రాష్ట్రంలోని ఆదివాసీ భాషల మీద జరుగుతున్న దాడిగానే చూడాల్సి ఉంటుంది. తెలుగు సామాన్య ప్రజల వ్యవహారిక భాషే అయినప్పటికీ ఈ భాషకు లిఖిత రూపం వచ్చిన అనంతరం ప్రజల భాష కాకుండా పోయింది. తెలుగు లిఖిత భాషగా రూపాంతరం చెందే క్రమంలో పూర్తిగా బ్రాహ్మణైజ్ అయింది. ఈ రోజు మనం మాట్లాడే, రాసే తెలుగులో అరవై శాతం సంస్కృత పదాలున్నాయంటే బ్రాహ్మణిజం ప్రభావం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాఠ్యపుస్తకాలలోని తెలుగుకి, అణగారిన కులాలు, జాతులు మాట్లాడే తెలుగుకి పొంతనే లేదు. విశ్వవిద్యాలయాల్లోని తెలుగు డిపార్ట్‌మెంట్‌లు హైందవ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ కారణంగానే ఈ రోజు అణగారిన జాతులు, కులాలు తెలుగును వ్యతిరేకిస్తున్నాయి.



పాలకవర్గాలు ఒక్క విషయం గుర్తించాలి. ఆదివాసుల భాషను రక్షించకపోతే అపారమైన ఈ దేశ చరిత్ర, సంస్కృతి కనుమరుగయ్యే ప్రమాదముంది. భాష కేవలం కమ్యూనికేషన్ మీడియం కాదు. భాష ప్రజల చరిత్రను, సంస్కృతిని, భావాలను ప్రతిబింబిస్తుంది. ఆదివాసుల విషయంలో ఇది మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆదివాసుల భాషల్లో అద్భుతమైన మౌఖిక చరిత్ర పాటల, కథల రూపంలో దాగి ఉంది. ఈ చరిత్ర వారి జాతుల పుట్టుపూర్వోత్తరాలను, సమాజ మార్పులను, రాజ్యంతో వారు చేసిన పోరాటాలతో పాటు వారి ఆర్థిక, సాంఘిక, రాజకీయ, మత భావాలను తెలియజేస్తాయి.



ఈ చరిత్ర పాలకవర్గ చరిత్రకు భిన్నంగా ఉంటుంది. ఇది ఒక ప్రత్యామ్నాయ (అజ్ట్ఛూటn్చ్టజీఠ్ఛి) చరిత్ర. సమాజం మరో కోణాన్ని చూపించే చరిత్ర. ఆదివాసుల సంప్రదాయాల్ని, భావాల్ని వారి భాషలోనే అర్థం చేసుకోగలం.



గుత్తికోయలు తయారుచేసే 'చిగురు' సారను వివరించటానికి తెలుగులో కానీ, ఇంగ్లీషులో కానీ పదాలు లేవు. దీన్ని కేవలం గుత్తి కోయల భాషలోనే వివరించగలం. గుత్తికోయల భాష కనుమరుగైతే 'చిగురు' సారను ఏమని పిలవాలన్నది మన ముందు ఉన్న సమస్య. ఇలా చెప్పుకుంటూపోతే ఆదివాసీ యేతర భాషలకు అందకుండా ఉండే అనేక విషయాలు ఆదివాసీ భాషల్లో ఉన్నాయి.



గ్లోబలైజేషన్‌లో భాగంగా దేశంలో వస్తున్న మార్పులు ఆదివాసీ సమాజంపై విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆదివాసీ సాంస్కృతిక రూపాలు క్రమంగా నశించిపోతున్నాయి. భాష ఒక్కటే వారి సంస్కృతి ఆనవాళ్లుగా మిగిలే పరిస్థితి ఉంది. నశించిపోతున్న ఆదివాసీ ప్రజల భాషలను చిగురింప చేయాలంటే పాలకులు, భాషా పండితులు నా ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకాలి.



తెలుగు, ఉర్దూ యూనివర్సిటీ తరహాలో ఆదివాసీ భాషలకు ఎందుకు ఒక యూనివర్సిటీని స్థాపించకూడదు? పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఆదివాసులు తమ భాషను చదువుకునే పరిస్థితి ఎందుకు ఉండకూడదు? ఆదివాసులు తమ భాషను తాము చదువుకునే హక్కు ఎందుకు ఉండకూడదు? రాష్ట్రంలోని 33 ఆదివాసీ భాషలు ఈ రాష్ట్రానికే ప్రత్యేకం. మరి ఎందుకు ఈ భాషలను ఈ రాష్ట్ర భాషలుగా గుర్తించకూడదు. ఆదివాసులు తెలుగును కాకుండా తమ సొంత భాషను సగర్వంగా మాతృభాషగా రాసుకునే రోజు వస్తుందా! ఆ రోజు వచ్చిన నాడు ఆదివాసులు కూడా సగర్వంగా తమ భాష మహాసభలు జరుపుకునే రోజు వస్తుంది.



- ప్రొ. భంగ్యా భూక్యా
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ

Andhra Jyothi News Paper Dated: 27/12/2012 

Sunday, December 2, 2012

'సింధు' స్ఫూర్తి ఆవాహన--సత్య బత్తుల (యుఎస్ఏ), డాక్టర్ ఘంటా చక్రపాణి, డాక్టర్ అడపా సత్యనారాయణ, డాక్టర్ భంగ్యా భుక్యా, సుదర్శన్, కుమారస్వామి



ప్రాచీన భారత సంస్కృతిలో అంతర్భాగమైన బ్రాహ్మణ, శ్రమణ వైరుధ్యాలు నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్తరూపుని సంతరించుకొని సామాజిక న్యాయం, ఆత్మగౌరవ నినాదాల్ని బహుముఖంగా వ్యాప్తి చెందిస్తున్నాయి. ఈ తరుణంలో మొత్తం వైదిక సంస్కృతి, ధర్మాల స్వరూప స్వభావాల్ని విమర్శనాత్మకంగా పరిశీలించవల్సి ఉంది. వైదిక మతాన్ని, దాని తాత్వికతను, భావజాలాన్ని, సామాజిక వ్యవస్థననుసరించి ప్రగతి సాధించలేమని, వైదిక సంస్కృతి మూల సూత్రాలను సమూలంగా పెకిలించాలనే ఆకాంక్షను నేటి బహుజన ఉద్యమాలు స్పష్టం చేస్తున్నాయి. 

భారత దేశ సంస్కృతి, వారసత్వం విశ్లేషణలో లిబరల్ బూర్జువా మేధావి జవహర్ లాల్ నెహ్రూ, సనాతన ధర్మ ప్రచారకుడు సంపూర్ణానందలో భావ సారూప్యత కనబడుతుంది. అదేమంటే భారత దేశ చరిత్ర, నాగరికత ఆర్యులతోనే ప్రారంభమైంది. భారత జాతీయతకు ఆర్య వైదిక సంస్కృతి ప్రధాన భూమిక. 'డిస్కవరీ ఆఫ్ ఇండియా'లో నెహ్రూ ప్రతిపాదించిన సాంస్కృతిక జాతీయవాదానికి హైందవ జాతీయతకు చాలా దగ్గర పోలికలున్నాయి. ఈ రెండు వాదాలు ఆర్య వైదిక సంస్కృతికి ప్రాముఖ్యతనిచ్చి, ఆర్యేతర ద్రవిడ సంస్కృతుల్ని తోసిపుచ్చాయి. వాస్తవానికి భారత ఉపఖండ చరిత్ర, సంస్కృతి ఆర్యులతోనే మొదలైంది. నెహ్రూవియన్ విశ్లేషణకు దగ్గరగా సాంస్కృతిక జాతీయ వాదులు కూడా హైందవ/బ్రాహ్మణ మతాన్ని జాతీయ మతంగా ప్రచారం చేస్తున్నారు. వారి విశ్లేషణలో భారతీయ జాతీయ మతం సంస్కృతి అంటే ఆర్యనిజం/బ్రాహ్మణిజం అని అర్థం. హిందువు-హిందు-హిందుస్తాన్.

వైదిక మతాన్ని జాతీయ మతంగా చిత్రీకరించి భారతీయ సంస్కృతికి హైందవాన్ని అంటగట్టి, ఆర్యేతర ముఖ్యంగా ద్రవిడ సంస్కృతి, నాగరికతల్ని తృణీకరించడం హిందూత్వ తాత్వికత భావజాలంలో ప్రధాన అంశం. రొమిల్లా థాపర్ అన్నట్లు సంప్రదాయ చరిత్ర రచనల్లో భారతీయ సంస్కృతి అంటే హిందూయిజమే అనే ధోరణులు ప్రబలంగా ఉన్నాయి. ప్రధానంగా మతతత్వవాద చారిత్రక దృక్పథంలో భారత సాంస్కృతిక పునాదులు వేదాల్లో ఉన్నాయని, వేదమంటే భారతీయత అనే అర్థం ప్రస్ఫుటంగా కనబడుతుంది.

ఇటీవల కాలంలో ఆర్కియాలజిస్టులు, ఇండాలజిస్టులు జరిపిన పరిశోధనల ఫలితంగా భారతదేశ చరిత్ర, సంస్కృతి వారసత్వాలకు సంబంధించిన అనేక నూతన అంశాలు వెలికి తీయడం జరిగింది. గత శతాబ్దపు మొదటి దశకాల్లో పురాతత్వ త్రవ్వకాల్లో బయల్పడిన అవశేషాల ఆధారంగా భారతదేశంలోని మొట్టమొదటి నాగరికత అయిన సింధు (ఇండస్) నాగరికతను ఈ దేశ మూలవాసులైన ద్రావిడులు (వేద పరిభాషలో దాస్యులు) నిర్మించారనే విషయం రూఢీ అయింది. ఆర్యులు భారతదేశానికి రాకపూర్వం ఈ దేశంలో ఆనాటి ప్రాచీన నగర సమాజాలైన ఈజిప్టు, మెసపటోమియా, చైనాలకు దీటుగా హరప్పా, మొహంజదారో, డోళవీర, లొథల్, రాఖిగడి, గన్వెరివాల లాంటి న గరాలు, దాదాపు రెండు వేల చిన్న పట్టణాలతో క్రీస్తుకు పూర్వం 3000 నుంచి 1700 సంవత్సరం వరకు దాదాపు 1300 సంవత్సరాలు సింధూ నది పరివాహక ప్రాంతంలో పట్టణ నాగరికత విలసిల్లింది. 

ప్రాచీన భారత దేశంలో క్రీస్తుకు పూర్వం 2,600 సంవత్సరం నాటికే (అంటే 4,700 సంవత్సరాల క్రితం), ప్రతి ఇల్లు ఇటుకలతో కట్టబడి, బాత్‌రూం, లెట్రిన్, భూగర్భ మురుగునీటి పారుదల, నగర ప్రణాళిక వ్యవస్థతో ప్రపంచ ప్రాచీన నాగరికతల్లో, ప్రాచీన అమెరికాగా ప్రసిద్ధికెక్కింది. వర్తక వ్యాపారస్తులు, రైతులు, వృత్తి పనివారు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి వంటి ఉత్పాదక వర్గాలు వినూత్న పరికరాలు కనిపెట్టి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రగతిని సాధించారు. లిపి కలిగిన భాషతో అద్భుతమైన నాగరికతను సృష్టించారు.

సింధు (ఇండస్) నాగరికత సమాజ వ్యవస్థలో వ్యక్తి స్థానం వృత్తి, ప్రావీణ్యతను బట్టి నిర్ణయించబడింది కానీ పుట్టుక మీద కాదు. సింధు (ఇండస్) నాగరికత మతంలో ప్రకృతి ఆరాధన అమ్మ తల్లి ప్రధానాంశాలు. పూజారి వర్గానికి ప్రత్యేక స్థానం లేదు. స్త్రీ పురుష సంబంధాల్లో అన్యోన్యత, సమానత్వం కనబడుతుంది. సతి, బాల్య వివాహాలు లాంటి సాంఘిక దురాచారాలున్నట్లు కనపడదు. ద్రావిడ సంస్కృతి మత విధానం సమాజ శ్రేయస్సుకు దోహదం చేసింది. ప్రాచీన భారతదేశంలో అత్యున్నత పట్టణ నాగరికతను సృష్టించిన ద్రావిడ సంస్కృతి, దేశ దిమ్మరులైన ఇండో-ఆర్యన్ దండయాత్రకులోనై అంతరించి పోయింది. తత్ఫలితంగా భారతదేశం పట్టణ సమాజం నుంచి పశు పోషణ సమాజంగా మారిపోయింది. 

ఈ పరిణామం పురోగతికి బదులు తిరోగమనాన్ని సూచిస్తుంది. పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన అవశేషాల ఆధారంగా పశుకాపరులైన ఆర్యులు సింధూ ఉపనది అయిన సరస్వతి నది ఒడ్డున తమ నివాసాలు (గూడాలను) ఏర్పరచుకున్నట్లు, యగ్న యాగాదులు నిర్వహించిన పొయ్యిలు కల్గి ఉన్నట్లు తెలుస్తుంది. వీరి నాగరికత, సంస్కృతిని వివరించిన మొదటి గ్రంథం రుగ్వేదం. క్రీస్తుకు పూర్వం 1100 సంవత్సరంలో రుగ్వేదాన్ని కంపోజ్ చేసినట్లు, క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరంలో సంస్కృత భాషలోని శ్లోకాలని దేవనాగరి లిపిలో రాసినట్లు ఇండాలజిస్టులు నిర్ధారించారు. ఆ తర్వాతి కాలంలో యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం, ఉపనిషత్తులు, పురాణాలు వంటి ఎన్నో గ్రంథాలు సంస్కృత భాషలో రాయబడినాయి.

వేదవాజ్ఞ్మయంలోని శ్లోకాలని పరిశీలిస్తే, ఈ ఆర్యులు వర్గీకరణ (వర్ణ) వ్యవస్థని కనిపెట్టినట్లు తెలుస్తుంది. వర్గీకరణ సిద్ధాంతం ప్రకారం సమాజాన్ని త్రివర్గాలుగా (త్రివర్ణ), అంటే బ్రాహ్మణ (మతం), క్షత్రియ (పాలన, రక్షణ), వైశ్య (ఉత్పాదకత)గా విభజించారు. అంతేకాకుండా ఈ వర్గీకరణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన బ్రాహ్మణ వర్గం మిగిలిన వర్గాలు (వర్ణాల) కంటె కూడా పై స్థాయిలో తమకు తాము పెట్టుకున్నట్లు అర్ధం అవుతుంది. త్రివర్ణాల వారు ద్విజులుగా (రెండవసారి జన్మించిన వారు) పిలవబడతారు. ఎందుకంటె వారికి మాత్రమే ఉపనయనం చేసుకునే హక్కు ఉంది. శూద్రులు, అంటరాని వారికి ఉపనయనం ఉండదు. హిందూ సమాజంలోని కుల వ్యవస్థకి మూలం బ్రాహ్మణిజం. ఈ బ్రాహ్మణ సంస్కృతి (వర్ణ వ్యవస్థ) మన భారతదేశానికి సుమారు క్రీ.పూ. 1700 సంవత్సరంలో ఇరాన్‌లోని మిట్లాని రాజ్యం నుంచి ఆర్యులు తీసుకువచ్చారు. వీరి భాష సంస్కృతం. ఇరానియన్ల ప్రాచీన భాష అవెస్తన్, సం స్కృత భాషలకు పోలికలు ఉండడమే కాక రుగ్వేదంలోని ఇంద్ర, మిత్ర, వరుణ లాంటి దేవుళ్ళందరి పేర్లు వాటిలో ఉన్నాయి.

ఆర్యులు సింధు నాగరికుల మీద దాడిచేసి, తమ త్రివర్గ (మూడు కేటగిరి) స్కీంని విస్తరించి ఓడిపోయిన భారతదేశ మూలవాసులైన సింధూ నాగరికత ప్రజలను 'శూద్రులు'గా, నాలుగవ వర్ణంలో చేర్చారు. చరిత్రని లోతుగా పరిశీలిస్తే క్రీ.శ. 320-520 సంవత్సరంలో, గుప్తుల కాలంలో చాతుర్వర్ణాన్ని అయిదుకి పెంచి పంచముడిని సృష్టించినట్లు ఫాహియాన్ అనే బౌద్ధ భిక్షువు రచనల ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత ఉత్తర భారతదేశం నుంచి, దక్షిణ భారత దేశానికి ఈ ఆర్యన్ సంస్కృతి (వర్ణ వ్యవస్థ) విస్తరించే క్రమంలో అనేక ఆర్యేతర జాతుల్ని, అటవిక తెగల్ని వర్గీకరణ సిద్ధాంతాన్ని పెంచుతూ, ఆరు, ఏడు, ఎనిమిది ఇలా తీసుకొని రావడం జరిగింది. వీరు రాసిన వేదాలు, సత్పథ, జైమిన్య ఉపనిషత్తులలోని శ్లోకాల ప్రకారం ఇండొ-ఆర్యన్లు త్రివర్గ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినట్లు తెలుస్తుంది. త్రిశబ్దాలైన భు, భవహ్, స్వహ్‌లతో ప్రజాపతి ఆత్మను, మనుషులను, పశువులను; అలా అవే శబ్దాలతో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను; అలాగే భూమి, వాతావరణం, ఆకాశంలను; ఇంకా గాయత్రి, త్రిస్తుబ్, జగతి మంత్రాలని సృష్టించినట్లు ఈ శ్లోకాల ద్వారా తెలుస్తుంది.

వేద వాజ్ఞ్మయంలోని శ్లోకాల ద్వారా రూపొందించిన వర్గీకరణ, విశ్వంలో ఉన్న ప్రతిదాన్నీ, ప్రకృతి, పశువులు, చెట్లు, మనుషులు, వేదాలు, సంస్కృత భాష, మానవ శరీరం, ఇలా అన్ని మూడు వర్గాలుగా విడగొట్టి ద్విజులకు రిజర్వేషన్ కల్పించింది. చివరికి దేవుళ్ళని మూడు వర్గాలుగా విడగొట్టి బ్రాహ్మణులకి అగ్ని, వాసు దేవుళ్లని, క్షత్రియులకి ఇంద్ర, వాయు, రుద్ర దేవుళ్ళని, వైశ్యులకి సూర్య, వరుణ, ఆదిత్య దేవుళ్ళని రిజర్వ్ చేశారు..... ఇలాగే పశువులు... మేకని బ్రాహ్మణులకి, గుర్రాన్ని క్షత్రియులకి, ఆవుని వైశ్యులకి రిజర్వేషన్ చేశారు. చాతుర్వర్ణ సృష్టి గురించి రుగ్వేదంలోని పురుష సూక్తం పదవ (10-90-11-12) మండలంలో చెప్పబడింది. 

దీని ప్రకారం పురుష ముఖం బ్రాహ్మిణ్, భుజాలు క్షత్రియ, తొడలు వైశ్య, పాదం శూద్రులు. తద్వారా ప్రజాపతి అసమానమైన సమాజాన్ని సృష్టించి, బ్రాహ్మణునికి అగ్రస్థానం కల్పించి, 'శూద్రులు'కి పాదాలు, ఆర్యన్ మూడు వర్ణాలకి సేవచేసే పవిత్ర కార్యక్రమాన్ని రిజర్వేషన్ చేయడం జరిగింది. అయితే పంచములకి ఏ రిజర్వేషన్ లేదు, ఎందుకంటే వాళ్లు అంటరాని వారు. వైదిక తాత్వికత భావజాలంలోని ప్రధాన అంశం ద్విజులకు ముఖ్యంగా బ్రాహ్మణ, పురోహితవర్గం ఆధిపత్యాన్ని కొనసాగించడమే. బైబిల్, ఖురాన్‌లో లేనివిధంగా సృష్టికర్త హిందూ సమాజాన్ని వర్గీకరించి హెచ్చుతగ్గులకు ప్రామాణికతను కల్పించారు.

వైదిక ధర్మం పేరిట కొనసాగింపబడుతున్న వర్గీకరణలో అణిచివేతకు గురైన దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ సమూహాలు నేడు బ్రాహ్మణీయ సంస్కృతిపై తిరుగుబాటు చేస్తున్నాయి. మరొకపక్క సనాతన ధర్మ ప్రచారకులు అగ్ణానంద, అపరిపూర్ణ స్వాములు, హిందూత్వ వాదులు పురుషసూక్త వ్యవస్థను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాచీన భారత సంస్కృతిలో అంతర్భాగమైన బ్రాహ్మణ, శ్రమణ వైరుధ్యాలు నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కొత్తరూపుని సంతరించుకొని సామాజిక న్యాయం, ఆత్మగౌరవ నినాదాల్ని బహుముఖంగా వ్యాప్తి చెందిస్తున్నాయి. ఈ తరుణంలో మొత్తం వైదిక సంస్కృతి, ధర్మాల స్వరూప స్వభావాల్ని విమర్శనాత్మకంగా పరిశీలించవల్సి ఉంది. వైదిక మతాన్ని, దాని తాత్వికతను, భావజాలాన్ని, సామాజిక వ్యవస్థననుసరించి ప్రగతి సాధించలేమని, వైదిక సంస్కృతి మూల సూత్రాలను సమూలంగా పెకిలించాలనే ఆకాంక్షను నేటి బహుజన ఉద్యమాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ సందర్భంలో వైదిక/ ఇండిక్ సంస్కృతికి ముందే విలసిల్లిన ద్రావిడ నాగరికత, సంస్కృతి, మూల వాసుల సైన్స్, టెక్నాలజీ, ప్రాపంచిక దృక్పథాన్ని, సింధూ వారసత్వ ఔన్నత్యాన్ని తెలుసుకోవడం అవసరం. కొంతమంది మేధావులు సమష్టి ఆలోచనతో 'సింధూ వారసత్వ కేంద్రం'ని ఏర్పాటు చేయడమైనది. ఈ అధ్యయన కేంద్రం సింధూ నాగరికతకు సంబంధించిన పలు సామాజిక అంశాలపై పరిశోధనలు చేపడుతుంది. ఇండో-ఆర్యన్, వైదిక యుగ వేద వాఙ్మయాన్ని విమర్శనాత్మకంగా వివరించడం, వర్ణ వ్యవస్థ పుట్టు పూర్వోత్తరాల్ని సోదాహరణముగా వివరించడం, వర్గీకరణ, ద్విజులకి రిజర్వేషన్ సిద్ధాంతాన్ని సమర్థించే వైదిక సాహిత్యాన్ని డీ కోడ్ చేయడం జరుగుతుంది. పురుషసూక్త వర్గీకరణ, మూలవాసుల ప్రతిఘటన చైతన్యం ప్రాముఖ్యతను రికార్డ్ చేయడం ఈ సంస్థ ఉద్దేశం. ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఆర్యన్ నాగరికతకు పూర్వం భారతదేశంలో విలసిల్లిన నాగరికతకు సంబంధించిన అనేక అంశాల్ని ఆర్కియాలజిస్టులు, ఇండాలజిస్టులు, శాస్త్రవేత్తలు బహిర్గతం చేశారు.

అందుబాటులో ఉన్న శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని శాస్త్రీయ పద్ధతుల ద్వారా భారతదేశ మూల వాసుల నాగరికత, సంస్కృతికి సంబంధించి, ఇప్పటివరకు మరుగుపడిన అంశాలని వెలికితీసి సమాజానికి అందించడం అధ్యయన కేంద్రం ముఖ్య ఉద్దేశం. ఆర్యులకు పూర్వం వైదిక సంస్కృతికి భిన్నంగా ఆర్యేతరులు ముఖ్యంగా ద్రావిడులు నిర్మించిన నాగరికత విశిష్టతను ప్రచారం చెయ్యడం ద్వారా ప్రస్తుత బహుజనుల ఉద్యమాలకు చేయూతనియ్యడం జరుగుతుంది. 

బహుజనుల, మూలవాసీల అస్తిత్వ, ఆత్మగౌరవ పోరాటాలకు శాస్త్రీయమైన తాత్వికతను, భావజాలాన్ని అందించడం ప్రస్తుత సమయంలో ఆవశ్యకం. ఎందుకంటే వైదిక బ్రాహ్మణ శక్తులు, సంస్కృతి, ఆచారం పేరిట వర్గీకరణ భావజాలాన్ని వివిధ రూపాల్లో ప్రచారం చేస్తుండటం, మరొక పక్క బ్రాహ్మణేతర మూలవాసీ సమూహాలు తమ చరిత్ర, సంస్కృతి, వారసత్వాన్ని పునర్నిర్మించుకొనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్యేతర, ఆర్య వైదిక సంస్కృతి, మతం, ఆచార వ్యవహారాలకు సంబంధించిన అంశాలని శాస్త్రీయంగా హేతుబద్ధంగా బేరీజు వేయాల్సిన అవసరాన్ని సింధూ వారసత్వ సంస్థ గుర్తించింది.
సత్య బత్తుల (యుఎస్ఏ),
డాక్టర్ ఘంటా చక్రపాణి,
డాక్టర్ అడపా సత్యనారాయణ,
డాక్టర్ భంగ్యా భుక్యా,
సుదర్శన్, కుమారస్వామి
www.indusheritagecenter.com

Andhra Jyothi News Paper Dated: 2/12/2012