Showing posts with label దళిత ప్రతిఘటనా నినాదం. Show all posts
Showing posts with label దళిత ప్రతిఘటనా నినాదం. Show all posts

Wednesday, July 23, 2014

పీడితులకు పోరాటమే మార్గం By కొంకల వెంకటనారాయణ


Updated : 7/24/2014 3:24:51 AM
Views : 20
1998 జూలై16న వేంపెంట నరమేధం జరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని పౌరప్రజాస్వామిక,విప్లవ సంస్థల వైఖరుల బండరాన్ని బయట పెడుతూ కారంచేడు నుంచి వేంపెంట దాకా దళితులపై దాడులు ఎందు కు జరుగుతున్నాయి? ఏం చేయాలి? అని అమరుడు మారోజు వీరన్న స్థాపించిన దళిత బహుజన మహాసభ రికార్డు చేసింది. ఆ కొనసాగింపుగానే కులవర్గ జమిలి పోరాట అవగహానలోనే 2012లో లక్షింపేట దళితుల హత్యాకాండపై పౌర, ప్రజాస్వామిక, విప్లవ సంస్థల, దళిత, బీసీ కుల సంస్థల వైఖరుల్ని వివిధ తెలుగు దిన, వార, మాస పత్రికల్లో జరిగిన చర్చవిశ్లేషణల్ని ఒక చోట చేర్చి విలువైన డాక్యుమెంట్ రూపంలో జాబాలి ప్రచురణల పేర కొంకల వెంకటనారాయణ, పాపని నాగరాజు, కమ్మరి రేణుక తీసుకురావడం జరిగింది.

గతంలో దళిత రణన్నినాదం సంకలన వేసిన ఉ.సా అయినా, నేడు దళిత ప్రతిఘటనా పోరాటాల నినాదం పేరు తో కారంచేడు, చుండూరు, నీరుకొం డ, తిమ్మసముద్రం, వేంపెంట, ప్యాపి లి, లక్షింపేట, కంబాలపల్లి (కర్నాటక రాష్ర్టం), ఖైర్లాంజీ (మహారాష్ర్ట రాష్ర్టం) సంఘటనలపై వివిధ విప్లవ, ప్రజాస్వామిక సంస్థలు జరిపిన సైద్ధాంతిక చర్చను ఒకచోట చేర్చిన నాగరాజులు బీసీలు కావడం యాదృచ్ఛికం. కానీ ఇండియా సమాజాన్ని కులవర్గ సమాజమని, ఈ సమాజాన్ని కుల-వర్గ జమిలి పోరాటాల ద్వారానే నిర్మూలించే వీలు ఉంటుదని నమ్మిన వ్యక్తులుగా కొనసాగుతున్నారన్నది చారిత్రక సత్యం.

వీరన్న రూపొందించి నిర్మించిన కులవర్గ జమిలి పోరాట కార్యక్రమాన్ని మోసుకువెళ్లే కార్యకర్తగా, ఆపార్టీ విద్యార్ధి విభాగామైన బిడియస్‌ఎఫ్‌కు రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా పాపని నాగరాజు వెలుగులోనే కారంచేడు నుండి లక్షింపేట వరకు జరిగిన సంఘటనలను సంకలనంగా ముద్రించే బాధ్యతను స్వీకరించాడు. ఇది భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏ విధంగా అరికట్టాలో అన్వేషించే క్రమంలో అధ్యయనంచేసి ముందుకు పోవడానికి కార్యకర్తలకు, ప్రజాసంస్థకు తొడ్పడుతుందీ దళిత ప్రతిఘటనా పోరాటాల నినాదం. ఈ గ్రంథం ఆ కర్తవ్య నిర్వహణనకు తోడ్పడుతుందని భావించే నాగరాజు ఈ ముద్రణను పూనుకున్నాడు. 

నేడు కొన్ని సంఘటనలు సాకుగా చేసుకొని దళితులను బీసీలను శత్రువులుగా చిత్రించి మిత్రవైరుధ్యాలను శత్రు పూరిత వైరుద్యాలుగా సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుచేతనే బ్రాహ్మణీయ అగ్రకుల అకృత్యాలు దళితులపై ఎన్ని జరిగిన ఆపలేకపోతున్నాం. కనక ఈ వాస్తవాన్ని గుర్తించి కులవర్గ జమిలిపోరాటాల ద్వారానే దళితుల, పీడితకుల ప్రజల విముక్తి ఉంటుందనే విశ్వసించి ప్రయాణిద్దాం. 

‘దళిత ప్రతిఘటనా నినాదం’ - దుడ్డు ప్రభాకర్‌

Published at: 24-07-2014 01:11 AM
ఈ దేశంలో పేదలందరికీ ఆకలి సమస్య అయితే, ఆ పేదల్లోని దళితులకు ఆకలితో పాటు అంటరానితనం కూడా సమస్యగా ఉంది. రెండు సమస్యలతో పోరాడుతున్న ఈ దేశ నిషిద్ధ మానవుడు ఆకలి, అంటరానితనం లేని సమాజ నిర్మాణంలో ముందు వరుసలో నిలబడ్డానికి ‘దళిత ప్రతిఘటనా నినాదం’ పుస్తకంలోని వ్యాసాలు, విశ్లేషణలు, డిబేట్‌లు ఉపయోగపడతాయి.
కారంచేడు నరమేధం (1985) నుంచి లక్షింపేట మారణకాండ (2012) దాకా దళితులపై జరిగిన సామూహిక దాడులు, ఆ హంతక మూకల అరెస్టుకై జరిగిన పోరాటాలు, ఆ సందర్భంగా జరిగిన చర్చలను రికార్డు చేసి పుస్తక రూపంలో మనముందుంచిన పాపని నాగరాజు అభినందనీయుడు. కారంచేడు నుంచి ప్యాపిలి దాకా దళితుల పోరాట చరిత్రను ‘దళిత రణన్నినాదం’ పేరుతో ఉ.సా. 2005లో రికార్డు చేశారు. ప్యాపిలి నుంచి లక్షింపేట దాకా ‘దళిత ప్రతిఘటనా పోరాటాల నినాదం’ పేరుతో నాగరాజు పుస్తకరూపంలో తేవడాన్ని ఉసా రాజకీయ వారసత్వ కొనసాగింపులో భాగమని నేననుకుంటున్నాను. అయితే కారంచేడు నుంచి లక్షింపేట దాకా రాష్ట్రంలో అన్ని సంఘటనలు ఇక్కడ రికార్డు కాలేదు. ఇక్కడే కాదు ప్రతిఘటనా దళిత నెత్తుటి చరిత్రగా ఎక్కడా రికార్డు కాలేదు. కారణాలు అనేకం ఉన్నాయి. దళితుల ఆత్మగౌరవ సమస్య ముందుకొచ్చిన ప్రతి సందర్భంలో ప్రతి చోటా దళితసమూహంపై అత్యంత క్రూరమైన సామూహిక హత్యాకాండ జరుగుతూనే ఉంది. మనిషిగా బతకడం కోసం దళితులు వేస్తున్న ప్రతి అడుగూ నెత్తుటి మడుగవుతుంది. అవన్నీ వెలుగు చూడడం లేదు. బయటి ప్రపంచానికి తెలుస్తున్నవి కొన్నిమాత్రమే. వాటిలో ఉద్యమరూపం తీసుకున్నవి అత్యల్పం. దాడితీవ్రత, పారిన నెత్తుటి పరిమాణం, పెరుగుతున్న టీవీల రేటింగ్‌ను బట్టి లాభాల్ని అంచనావేసుకొని ప్రచారానికి ప్రాధాన్యతస్తున్న కార్పొరేట్‌ మీడియా మాయజాలంలో నాగరాజు చేసిన ప్రయత్నం చిన్నది కాదు.
ఈ దేశ చరిత్రలో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరా టాలలో చిందిన నెత్తుర్ని, జరిగిన కుట్రల్ని, తెగిపడిన తలల్ని ఏ చరిత్రకారుడు లెక్కగట్టలేదు. అందుకే ప్రపంచ చరిత్రంతా వర్గపోరాటాల చరిత్రగా రికార్డయింది. ఈ దేశ ప్రత్యేక పరిస్థితుల్ని నిర్దిష్టంగా పరిశీలించనందువల్ల జరిగిన పొరపాటు కాదది. ఉద్దేశపూర్వకంగా దాటవేసిన కుట్ర. లక్షింపేట మారణకాండ సందర్భంగా జరిగిన డిబేట్‌లో ఆ కుట్రలు ఇంకా స్పష్టంగా, నగ్నంగా బయటపడ్డాయి. అభ్యుదయ వాదులుగా చెలామణి అవుతున్న అనేకమంది ముసుగుల్ని లక్షింపేట దళిత మృతవీరులు బదాబదలు చేశారు. అందుకే ఈ సంకలనం ఒక చారిత్రక అవసరం. మనిషిని మనిషిగా గుర్తించే సమాజాన్ని ఆకాంక్షించే ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిన పుస్తకమిది. కారంచేడు నాటి దళిత ఆత్మగౌరవ ప్రతిఘటనా పోరాట చైతన్యం లక్షింపేట జరిగిన నాటికి నిర్జీవమయింది. ఎందుకయింది? కారకులెవ్వరు? అని చెప్పడానికే ఆ గాయాల్ని మళ్లీ ఒకసారి గుర్తు చేశాను. ఆ నెత్తుటి బాటలోని ప్రతి మలుపూ వివరంగా పరిశీలించడానికి మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను.
కారంచేడు మాదిగలు చిందించిన రక్తం దళిత ఆత్మగౌరవ పోరాటాల్ని పదునెక్కించి ప్రతిఘటనా పోరాటాలకు బాటలు వేసింది. అనేకమంది ఉద్యమకారులు, కవులు, కళాకారులు, రచయితలు, మేధావులకు జన్మనిచ్చింది. తరతరాలుగా అగ్రకుల పెత్తందారుల దాడులకు అణచివేతకు గురైన దళితులు స్వతంత్రంగా ఉద్యమం నడుపుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చింది. అంటరానితనం, అవమానాలు, అత్యాచారాలు మౌనంగా భరిస్తూ మూగగా రోదిస్తున్న గొంతుల్లో పొలికేకల్ని ధ్వనింపజేసింది. కుల సమస్య ఈ దేశంలోని అన్ని పార్టీ ఎజెండాల్లో ప్రధాన అంశంగా చేర్చింది.
మహారాష్ట్రలో జరిగిన దళిత పాంథర్స్‌ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటున్న సమయంలోనే అగ్రకుల భూస్వామ్య పాలకవర్గాలు వ్యూహాలు మార్చుకున్నాయి. వేంపెంట మారణహోమంలో రెడ్లు వెనకుండి మాదిగలు, బీసీలపైకి మాలల్ని కొందరు బీసీలను రెచ్చగొట్టి దాడులు చేయించారు... ఈ నేపథ్యంలో దళిత, బహుజనులకే రాజ్యాధికారం అంటూ రాజ్యాధికారమే ఇలాంటి దాడులకు పరిష్కారమని ఉద్యమనాయకులు తేల్చేశారు. ఆశయం మంచిదే. వారంతా పల్లెల్ని వదిలి పదవులపై ఆశలు పెంచుకోవడమే విషాదం.  అదే అదనుగా స్థానిక ఆధిపత్య శక్తులు పీడిత కులాల మధ్య మిత్ర వైరుధ్యాలను శత్రు వైరుధ్యాలుగా మార్చుతున్నారు. అందులో భాగంగానే లక్షింపేట జరిగింది. లక్షింపేట మాత్రమే కాదు. వేంపెంట తర్వాత ద ళితులపై జరిగిన మెజారిటీ దాడులు బీసీలు కాకుంటే ఊరు ఊరంతా కలిసి చేసినవే. లక్షింపేట మాలలపై జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా ఉద్యమం కంటే మేధాపరమైన చర్చే ఎక్కువగా జరిగింది. కాంగ్రెస్‌ నుంచి సీపీఐ, సీపీఎం దాకా దళితులు నమ్ముకున్న అన్ని ఓట్ల పార్టీలు మెజారిటీ ‘ఊరు’ ఓట్ల కోసం ‘వాడ’ బతుకుల్ని నిర్లక్ష్యం చేశాయి. అంతేకాదు ఊరుకి ప్రత్యక్ష మద్దతు తెలియజేస్తున్నాయి. కారంచేడు తర్వాత కొన్ని ప్రత్యామ్నాయ కుల ఉద్యమ సం స్థలు మినహా అనేక కుల సంఘాల నాయకుల్ని నమ్ముకుంటే స్వార్థ ప్రయోజనాలకు, ప్రలోభాలకు లొంగినట్టే ముంచి హంతక మూకలతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారు. ఎవరెన్ని ‘దగా’లు చేసినా దళితులు మాత్రం ప్రత్యక్ష యుద్ధక్షేత్రాలుగా మారుతున్న వెలివాడలో జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. ఈ దేశంలో పేదలందరికీ ఆకలి సమస్య అయితే, ఆ పేదల్లోని దళితులకు ఆకలితో పాటు అంటరానితనం కూడా సమస్యగా ఉంది. రెండు సమస్యలతో పోరాడుతున్న ఈ దేశ నిషిద్ధమానవుడు ఆకలి, అంటరానితనంలేని సమాజ నిర్మాణంలో ముందు వరుసలో నిలబడ్డానికి ఈ పుస్తకంలోని వ్యాసాలు, విశ్లేషణలు, డిబేట్‌లు ఉపయోగపడతాయని ఆశిస్తూ...
దుడ్డు ప్రభాకర్‌
కులనిర్మూలన పోరాట సమితి
(‘దళిత ప్రతిఘటనా నినాదం’ అనే సంకలనం నేడు  హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంగా ముందుమాటలోని కొన్ని భాగాలు)

Andhra Jyothi Telugu News Paper Dated: 24/07/2014