Showing posts with label ఎస్సీ వర్గీకరణ. Show all posts
Showing posts with label ఎస్సీ వర్గీకరణ. Show all posts

Thursday, December 12, 2013

విభజనతో పాటు వర్గీకరణ- గడ్డం దేవదాస్

ఏ ఊరిలో పుడతారో, ఏ ఊరిలో చస్తారో తెలియని ఈ జాతికి తలదాచుకునే ఇల్లు, పాతి పెట్టుకునేందుకు గుంట భూమి లేదు. ఏళ్ళ తరబడి మాల, మాదిగలతో మమేకమై జీవిస్తున్న చిందు, మాస్టీ, డెక్కలి జాతులను వారి అభివృద్ధి క్రమాన్ని మంత్రులెక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ సందర్భంగా వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అందువల్ల ఎస్సీ వర్గీకరణలో సమతుల్యత దెబ్బతింది. పునర్ వర్గీకరించాలి. తెలంగాణ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలి.
హిందూ మత పునాదులపై ఏర్పడిన కులవ్యవస్థ, ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలను సృష్టించి, శ్రామిక ప్రజలను కలిసి మెలిసి జీవించకుండా అడ్డుకుంటుంది. ఈ అడ్డును తొలగించే ప్రయత్నానికి పూనుకున్న బౌద్ధాన్ని ఈ దేశ సరిహద్దులను దాటించామని భ్రమపడింది. డా.బి.ఆర్. అంబేద్కర్ నాగపూర్ కేంద్రంగా లక్షలాది ప్రజలతో బౌద్ధాన్ని స్వీకరించడం వల్ల హిందూమతం భవిష్యత్ తలక్రిందులుగా మారింది. దేశ కమ్యూనిస్టులను, సోషలిస్టులను, నక్సల్స్‌ను అణిచి వేసినట్లుగా, అంబేద్కరిస్టులను అణిచి వేయలేకపోయింది. కులం, మతం, పునాదుల నిర్మూలనకే రంపంలా మారిన డా.బి.ఆర్. అంబేద్కర్ ఆలోచనా విధానం, నాడు, నేడు సజీవమై నిమ్నజాతుల హృదయాలలో పదిలమై యావత్ భారత జాతి ప్రజలను తట్టి లేపుతుంది. బౌద్ధ దమ్మం పుట్టిన ఈ పుణ్య భూమిపై మనువాద పెత్తనం, అది సృష్టించిన ఆర్థిక, రాజకీయ, సాంఘిక అసమానతలను తొలగించలేకపోతే బహుజనులు ఏరకమైన స్వేచ్ఛను అనుభవించలేరని మహాత్ముడు జ్యోతిరావు ఫూలే గ్రహించారు. దీనికి రాజ్యాధికారం ఒకటే పరిష్కార మార్గమని ప్రబోధించాడు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే శూద్రులకు విద్య తప్పనిసరని ప్రతిపాదించిన ఆ మహాత్ముడు డా.బి.ఆర్. అంబేద్కర్‌కు గురువు కావడం గమనార్హం. ఫూలే పడమర ఆస్తమించిన సూర్యుడైతే, డా.బి.ఆర్. అంబేద్కర్ తూర్పున ఉదయించిన సూర్యుడి వలే గతి క్రమాన్ని ప్రతిబింబింపచేసి భారత్ దిక్సూచికి ధ్రువతారలై నిలిచిపోయారు.
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అతి శూద్రులనే ఈ పంచమ వర్ణాలు క్రమంగా 16వేల కులాలుగా రూపాంతరం చెంది, మానవ అభివృద్ధి క్రమాన్నే అడ్డుకుంటున్నాయి. ఇది శ్రమ విభజన కాదు. శ్రామికుల విభజనగా డా. బి.ఆర్. అంబేద్కర్ విశదీకరిస్తారు. ప్రకృతి విరుద్ధమైన కుల అసమానత నియమాన్ని మనిషి సృష్టించాడు. ప్రకృతి నియమం, దైవ సంకల్పం అసలే కాదు. మనువు సృష్టించిన ఈ కుల అధర్మాన్ని, దాని భావజాలాన్ని నాశనం చేయాలని కోరుతారు. దాన్ని నాశనం చేయకపోతే, అది మనల్ని మనం నిర్మించుకునే సమాజాన్ని నాశనం చేసి తీరుతుందని హెచ్చరించారు.
దేశంలో బహుజనులు ఒక కులం, ఒక వర్ణంగా లేకపోవడం వల్ల రాజకీయ అధికారాన్ని స్థాపించలేకపోతున్నారు.అగ్రకులంగా చలామణిలో ఉన్న సంపన్నులు, కోటీశ్వరులు, భూస్వాముల ఆర్థిక పరిపుష్టి బలమైనందువల్ల రాజకీయ అధికారంలో ఎక్కువ కాలం మనగలుగుతున్నారు. సర్వ సంపదల సృష్టికి బహుజనులు పునాదిగా ఉన్నందువల్లే, విద్యనభ్యసించలేక, నిరక్ష్యరాస్యులుగా, నిరుద్యోగులుగా, చైతన్య రహితులుగా, ముఖ్యంగా కడు పేదలుగా, దేశ దిమ్మరులుగా బతుకులీడుస్తున్నారు. వీరిపై అగ్రకులాల ఆధిపత్యాన్ని నిరంతరం కొనసాగిస్తూ, కఠినమైన నిబంధనల ద్వారా అదుపు చేసి, అణిచివేసేవారు. అణిచివేతే అగ్రకులాలకు ప్రధాన ఆయుధం అయింది.
తరతరాలుగా ఊరికి, ఆస్తికి, విద్యకు, ఆయుధానికి, అధికారానికి దూరంగా విసిరి వేయబడిన జాతుల కోసం డా. బి.ఆర్. అంబేద్కర్ నిరంతరం కృషిచేసి గొప్ప రాజ్యాంగ నిర్మాతగా, భారత దేశ దార్శనికుడైనారు. ఆయన రచించిన కుల నిర్మూలన గ్రంథం బహుజనుల జీవిత కరదీపికైంది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని బ్రతకగలిగిన జీవులు మాత్రమే బ్రతికి బట్టకడతాయి. తట్టుకోలేనివి, నిలబడనివి పూర్తిగానే అంతరించిపోతాయనే ప్రాకృతిక సూత్రాన్ని కష్టజీవులైన ఈ దేశ బహుజనులకు అన్వయిస్తూ ఇలా అంటారు. సంపన్నులు, కోటీశ్వరులు, భూస్వాములు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక, రాజకీయ, సాంఘిక అణచివేత, వారి ప్రలోభాలను ప్రశ్నించి, ఎదురు తిరగబడిన జాతులు మాత్రమే బ్రతికి బట్టకట్టుతాయి. ఎదురు తిరగనివి, ప్రశ్నించలేని జాతులు కనుమరుగై పోతాయనే సూత్రీకరణ తెలంగాణలోని ఎస్సీ కమ్యూనిటీలోని మాదిగ ఉపకులాలైన చిందు, మాస్టీన్, డెక్కలి వంటి కులాలు కనుమరుగవుతున్న జాబితాలోనివే. డా.బి.ఆర్. అంబేద్కర్ పోరాటాల ఫలితంగా ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ అవకాశాలను మాల, మాదిగలే ఎక్కువ అనుభవిస్తూ తమ క్రింది జాతుల పట్ల దురుసుగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. ఆర్థిక, రాజకీయ పరిపుష్టిని ఆ మేరకు సాధించుకున్న ఎదిగిన పై రెండు కులాలు తమలోని క్రింది కులాలకు సామజికతను ఉల్లంఘిస్తూ, పై కులాలతో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం వంటి పద ప్రయోగాలు చేస్తున్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ ఈ విధంగా అంటారు. నీవు నీ క్రింది కులపోన్ని గౌరవిస్తేనే, పై కులపోడు నిన్ను గౌరవిస్తాడని అంటారు. మాల మాదిగను గౌరవించడం లేదు. మాదిగ చిందు, మాస్టీ, డెక్కలిని గౌరవించడం లేదు. ఈ విధానం అంబేద్కర్ ఆలోచనా విధానానికి పూర్తిగా విరుద్ధమైంది. అసభ్యకరమైంది. మొత్తం ఎస్సీ కమ్యూనిటీలోని యువకులు, విద్యావంతులు, ఉద్యమ సంస్థలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
స్వాతంత్య్ర కాలం నుంచి నేటి వరకు చట్టసభలకు ఎంపికైన ఎస్సీ కమ్యూనిటీ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యంగా మంత్రులుగా నియమించబడినవారు దోపిడీ పాలకులకు ఏజెంట్లుగా మారి కమ్యూనిటీ ప్రజలకే నష్టం చేస్తున్నారు. ఎస్సీ/ఎస్టీ సబ్‌ప్లాన్ కమిటీ, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థలు అనుసరిస్తున్న విధానాలు సంతృప్తికరంగా లేవు. నిధుల దారి మళ్ళింపు, బ్యాంక్ సబ్సిడీ రుణ పథకమే కావచ్చు, అభివృద్ధి అనేది కులాల వారీగా కాకుండా ఉమ్మడి నిధుల ఖర్చులుగా చూపడం సరికాదు. అనేక షరతులతో సబ్సిడీ రుణ పథకం ఇవ్వ నిరాకరణకే దారితీస్తుంది. స్వంత ఇల్లు, భూమి, ఆస్తి, గ్రామం లేని చిందు, మాస్టీన్, డెక్కలికి మోరి, రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, వాటర్ ట్యాంకుల నిర్మాణం వీధి దీపాలతో పనేంటి? విద్యకు, పూజకు నోచుకోలేని ఈ జాతులకు బడి, గుడి దేనికోసం? ఏ ఊరిలో పుడతారో, ఏ ఊరిలో చస్తారో తెలియని ఈ జాతికి తలదాచుకునే ఇల్లు, పాతి పెట్టుకునేందుకు గుంట భూమి లేదు. ఏళ్ళ తరబడి మాల, మాదిగలతో మమేకమై జీవిస్తున్న చిందు, మాస్టీ, డెక్కలి జాతులను వారి అభివృద్ధి క్రమాన్ని మంత్రులెక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవు.
ఈ సందర్భంగా వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. అందువల్ల ఎస్సీ వర్గీకరణలో సమతుల్యత దెబ్బతింది. పునర్ వర్గీకరించాలి. తెలంగాణ బిల్లుతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించాలని కోరుతున్నాం.
కావున చిందు, మాస్టీ, డెక్కలి కులాలను ఏ గ్రూపులో చేర్చి ఉమ్మడి రిజర్వేషన్లు అమలు చేయాలనే సంకల్పంతో ఈ జాతులు పోరాడుతున్నాయి. అందుకు మందకృష్ణ మాదిగ అధికారికంగా స్పష్టం చేయాలి. భూమి పుట్టిన నాటి నుంచి నేటికీ స్వంత భూమిలేని ఈ జాతులకు ప్రతి కుటుంబానికి 2 ఎకరాల వ్యవసాయ భూమి ఇవ్వాలి. జీవన భృతి కోసం, వ్యాపార నిమిత్తం ఎలాంటి షరతులు లేని బ్యాంక్ సబ్సిడీ రుణాలను దరఖాస్తు పెట్టుకున్న ప్రతి వ్యక్తికీ సదుపాయం కల్పించి, గత 66 ఏళ్ళుగా విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాల్లో పూర్తిగానే రిజర్వేషన్లను అనుభవించలేని, ఈ జాతి విద్యావంతుడికి ప్రభుత్వం స్వయంగా పిలిచి ఉద్యోగమివ్వాలని పోరాడాలి. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, కమ్యూనిటీ ప్రజ్రాపతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కుల సంఘాలు, సామాజిక దృక్పథం కలిగిన వ్యక్తులు, శక్తులు, ఉద్యోగ సంఘాలు పూర్తి స్థాయి లో మద్దతు ఇవ్వడమా? లేదా చరిత్రలో జాతి హీనులుగా మిగిలిపోవడమా? తేల్చుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని స్పష్టం చేస్తున్నాం.
- గడ్డం దేవదాస్
అంబేద్కరిస్ట్

-
Andhra Jyothi Telugu News Paper Dated : 13/12/2013 

Sunday, September 1, 2013

చిన్న రాష్ట్రాలు-ఎస్సీ వర్గీకరణ-రాజ్యాధికారం By -బత్తుల రాంప్రసాద్


దేశంలో ప్రతి అంశం కుల పునాదుల మీద నడుస్తూ, తరాలు మారినా కుల వివక్ష సమసిపోవడం లేదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశించిన కుల రహిత సమాజం ఏర్పాడాలని, రాజ్యాంగంలో హక్కులు కల్పిస్తే, వాటిని సరిగ్గా అమలు చేయడంలో పాలకవర్గాలు విఫలమయ్యాయి. దేశంలో పీడిత వర్గాలు భవిష్యత్తులో రాజ్యాధికారం సాధించాలని, వారు ఐక్యతతో మెలిగి హిందుత్వ కుల సమాజ పునాదులను బద్దలుకొట్టి పాలితులుగా ఎదగాలన్నారు. కానీ నేడు దోపిడీ వర్గాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి, తమ సొంత కులాలలోనే అసమానతల ఎర చూపి, వర్గీకరించాలనడం విషాదం. వాస్తవాల కు దూరంగా వున్న కల్పిత లెక్కల ఆధారంగా, అర్ధరహిత ఉద్యమాలతో స్వలాభం పొందుతూ సొంత కులాలకు అన్యాయం చేస్తున్నారు. 

ఆంధ్రవూపదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోనున్నది. ఈ రెండు రాష్ట్రాల్లో రాజ్యాధికారం సాధించాలంటే రాజ్యాంగ వ్యతిరేక వర్గీకరణ అంశాన్ని బొందపెట్టాలి. అందుకోసం కేంద్ర గణాంక శాఖ 2011 జనాభా లెక్క లు, అందులో ఎస్సీల జనాభా వారి స్థితిగతులను సూక్ష్మంగా అధ్యయ నం చేయవలసిన అవసరం ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో జనాభా 8,45,80,777. ఇందులో ఎస్సీల జనాభా 1,38,78,078. ఇది రాష్ట్ర జనాభాలో 16.41 శాతం. 2001 రాష్ట్ర జనాభాలో ఎస్సీల జనాభా 1,23,39,496. ఇందులో ఎస్సీల జనాభా 54 లక్షలు. (16.19 శాతం). గత పదేళ్లలో ఎస్సీల జనాభా 0.22 శాతం అభివృద్ధి చెందింది. ఇందులో షెడ్యూల్డ్ కులంలోని 60 కులాలలో ప్రధానకులాలైన మాల, మాదిగల జనాభా 91 శాతం ఉంటే, మిగతా తొమ్మిది శాతం 58 కులాలు ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో ఎస్సీల జనాభా ప్రధానంగా ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని కడప, చిత్తూరు జిల్లాల్లో 80శాతం మాలల జనాభా ఉండగా, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మాదిగల జనాభా ఎక్కువగా ఉన్నది.

తెలంగాణ ప్రాంతంలోని ఎస్సీల జనాభాలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ మాలల జనాభా ఎక్కువగా ఉన్నది. గతం లో రంగాడ్డి జిల్లాలటో మాదిగల జనాభా ఎక్కువగా ఉండేది. కానీ అటు ఆంధ్రా నుంచి షెడ్యూల్డ్ కులాలలోని మాలలు రంగాడ్డి జిల్లాలో స్థిరపడడంతో కొంత ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్‌లో కలవడం వల్ల మాల, మాదిగల జనా భా దాదాపు సరిసమానమైంది. మొదటి నుంచి వరంగల్, నల్గొండ జిల్లాల్లో మాదిగల జనాభా ఎక్కువే. మహబూబ్‌నగర్ జిల్లాలో పట్టణ ప్రాంతా ల్లో మాలలు అధికంగా ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో మాదిగలు ఎక్కువగా ఉన్నారు. మాలలకు కుల వృత్తిలేని కారణంగా ఏ ప్రాంతమైతే అభివృద్ధి చెందు తుంటుందో, ఆ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడతారు. దీంతో ప్రతి జిల్లాల్లో మాలల జనాభా పెరిగి ఆంధ్రాలోని 13 జిల్లాల్లో, తెలంగాణలోని ఏడు జిల్లాల్లో సంఖ్యాపరంగా మాలలు ఎక్కువగా ఉన్నా, స్థిరాస్తులు (భూమి, ఇల్లు) ఉద్యోగాలలో, మాదిగలకు కులవృత్తి కారణంగా, ప్రభుత్వాలు కుల వృత్తి గల వారికి ప్రత్యేక పథకాలతో ఆర్థికంగా సహాయం చేయడంతో మాదిగలు ఆర్థికంగా బలపడ్డారు. ముఖ్యంగా రిజర్వేషన్ల లబ్ధి మాలలే ఎక్కువ పొందారని, ఉద్యోగాల్లో మాలలే ఎక్కువని, మాదిగలు తక్కువ అన్న ప్రచారం అబద్ధమని తేలింది.

ఉన్నత పదవిలో ఉన్న పదుల సంఖ్యలో ఉన్న మాల అధికారులను చూసి, వేల సంక్యలో ఉన్న మిగతా మాదిగ ఉద్యోగుల సంఖ్యను చెప్పకుండా అధికారులంతా మాలలే అని, మాదిగలు రిజర్వేషన్ల లబ్ధి పొందలేదని గోబెల్స్ ప్రచారంతో తప్పుడు లెక్కలు చూపారని తేలింది. అసలు రిజర్వేషన్లను ప్రస్తావించడం అప్రజాస్వామికం. దీనికి షెడ్యూల్డ్ కులాల వర్గీకరణాన్నే ఏకైక పరిష్కారమని వితండవాదంతో, స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమాలు చేస్తూ, సమాజంలో భయాందోళనలు సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. రెండు రాష్ట్రాలలో దళిత వర్గాలు రాజ్యాధికారం కోసం పయనించకుండా అగ్రకుల ఆధిపత్యానికి ఊతమిస్తూ వారికి సహకరిస్తున్నట్టుంది. ఎస్సీలలోని మాదిగలు ఆర్థికంగా భూమి, ఇండ్లు, ఉద్యోగ, కులవృత్తి రంగాల్లో ముందంజలో ఉన్నా రు. జనాభాపరంగా మాలలు ఎక్కువగా ఉన్నా ఆర్థికంగా వెనుకంజలో ఉండి, కేవలం విద్యలో కొంత శాతం ముందంజలో ఉన్నారని తెలుస్తోంది.

ఇలాంటి అంశాలను పరిశీలించకుండా ఎస్సీ వర్గీకరణ గూర్చి రాజకీయ పార్టీలు స్మూక్ష పరిశీలన చేయకుండా హిందు త్వ భావజాలంతో స్పాన్సర్డ్ ఉద్యమాలకు, మీడియా ప్రచారాలకు ఎమ్మార్పీఎస్ బ్లాక్‌మెయిలింగ్‌లకు వత్తాసు పలుకుతున్న రాజకీయ పార్టీలు తమ వ్యవహారశైలిని మానాలి. రిజర్వేషన్లు మొదలైన నాటి నుంచి నేటి వరకు ఎస్సీ రిజర్వేషన్ల మొత్తం శాతంలో కనీసం సగం కూడా పూర్తి చేయలేకపోయిన పాలక ప్రభుత్వాలు అతి కష్టంగా అయిష్టంగానైనా అమలుపరిచి న రిజర్వేషన్ లబ్ధిలో ఓ కులం ఎక్కువ పొందిందని, ఓ కులం వెనుక బడిందని ఎస్సీల ఐక్యతకు విఘాతం కలిగిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశం జాతీయ అంశమని తెలిసినా, జాతీయస్థాయిలో ఈ సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో ఒక రాష్ట్రంలో ఒక కులం ముందంజలో ఉంటే, మరో రాష్ట్రంలో ఇంకో కులం ముందంజలో ఉండొచ్చు. 

అదేవిధంగా జిల్లాల్లోనూ పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్లు, అంటరానితనం, ఆర్థిక వెనుకబాటుతనం, వివక్ష ప్రామాణికాలను మరిచి రిజర్వేషన్లకు ఆర్థిక కోణంలో కొలుస్తున్నారు. దేశవ్యాప్తంగా అంటరానితనం, వివక్ష రూపం మార్చుకున్నదే తప్ప సమసిపోలేదు. దేశ, దశ దిశా నిర్దేశకులు, చిన్న రాష్ట్రాల స్ఫూర్తివూపదాత అంబేద్కర్ ఆశించిన ఆశయాలు సాధించాలన్నా, దళిత, బహుజనులు పాలకులు కావాలన్నా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఆయన చెప్పిన బాటలో నడవాలి. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు సహకరించి కొత్త రాష్ట్రంతో పాలనా సౌలభ్యంతో దళిత, బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడి సాధించుకుందాం.

-బత్తుల రాంప్రసాద్
మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు


Namasete Telangana Telugu News Paper Dated : 01/09/2013 

Sunday, July 7, 2013

పీడితుల విముకి ్తబాట దండోరా ------గోవిందు నరేష్ మాదిగ



మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపంగా అంబేద్కర్ సాధించిపెట్టిన ఎస్సీ రిజర్వేషన్లను జనాభా దామాషాకనుగుణంగా వర్గీకరించి సమాన పంపిణీ చేయాలనే సామాజిక న్యాయ సూత్రం తో మాదిగ దండోరా ఉద్యమం జూలై ఏడుతో 20 వసంతంలోకి అడుగుపెడుతుంది. ఈ రాష్ట్రంలో చెక్కు చెదరని నిర్మాణం,విశాల పోరాట దృక్పథం కలిగి నిరంతర పీడిత జనపక్షం వహిస్తూ రెండు దశాబ్దాలుగా పేద వర్గాల గొంతుకగా వర్ధిల్లుతున్నది మాదిగ దండోరా. 1994లో ప్రకాశం జిల్లా ఈదుముడి అనే చిన్న గ్రామంలో మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో 20మంది యువకులతో ప్రారంభమైన ఉద్యమం ఇరవై ఏళ్లుగా నిలువడం చారివూతాత్మకమైన క్రమం. ఉద్యమానికి ఎన్నో అవరోధాలు,అవమానాలు, నిందలు, నిర్బంధాలు,కష్టాలు, కన్నీళ్లు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ఇరవైఏళ్లుగా సజీవంగా ఉద్యమ ప్రయాణంలో ఉండడానికి దండోరాకు మందకృష్ణ నాయకత్వమే కారణం. గడిచిన రెండు దశాబ్దాలకాలంలో అనేక సామాజిక సమస్యలపై పోరాటాలను నిర్మిస్తూ వాటికి పరిష్కారాలు చూపుతూ ముందుకు సాగడమే కారణం. రాజకీ య పార్టీలకు ధీటైన ప్రత్యామ్నాయ రాజకీయేతర శక్తిగా ఎంఆర్‌పీఎస్‌ను మంద కృష్ణ తీర్చిదిద్దారు. చాలా మంది ఈ ఉద్యమ సంస్థను మాదిగలకు నీడనిచ్చే చెట్టుగానే భావించారుగానీ,అది యావత్ పేదవర్గాలకు నీడను పరిచే మహా వృ క్షంగాఎదుగుతుందని ఊహించలేకపోయారు.ఈ క్రమంలోనే మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజల కోసం వర్గీకరణ కోసం, వికలాంగుల పెన్షన్ పెంపు కోసం రాజకీయ రిజర్వేషన్లు, వితంతువుల పెన్షన్ల కోసం ఎంఆర్‌పీఎస్ పోరాడింది. పేదవారికి కడుపునిండా అన్నం కోసం రేషన్ బియ్యం పెంపు కోసం పోరాటం కొనసాగిస్తున్నది. 

కులం పేరు చెప్పుకోవడానికి బాధపడిన మాదిగల్లో ఆత్మ గౌరవాన్ని నింపి ఐక్యతను తెచ్చి హక్కుల కోసం పోరాడే చైతన్యాన్ని తీసుకురావడంలో ఎంఆర్‌పీఎస్ గణనీయమైన కృషి చేసింది. చిన్నారుల ఆరోగ్యాల కోసం, గుండెజబ్బుల పిల్లల కోసం దండోరా పోరాడి సరికొత్త మానవీయ ఉద్యమానికి పురుడు పోసిం ది. ఇలా సమాజంలోని సమస్త వర్గాల హక్కులు, సమస్యల కోసం పోరాడి ఉన్నతమైన మానవీయ హక్కుల ఉద్యమంగా దండోరా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం మొదటిదశలో ఆరేళ్లు అలుపెరుగని పోరాటం చేసి 2000 సంవత్సరంలో ప్రభుత్వం మెడలు వంచి వర్గీకరణ సాధించడం జరిగింది. దీంతో ఎస్సీల్లోని అట్టడుగు ఉపకులాలు రిజర్వేషన్లు పొంది ఎన్నో ఫలాలను అనుభవించారు. కానీ ఇది గిట్టని కొన్ని స్వార్థపరశక్తులు సుప్రీంకోర్టుకు ఎక్కి సాంకేతిక కారణాల సాకుతో వర్గీకరణను రద్దు చేయించడం జరిగింది. దీంతో అనివార్యంగా రెండోదశ వర్గీకరణ పోరాటం చేయాల్సివస్తున్నది. వర్గీకరణ న్యాయమే అని జస్టిస్ ఉషామెహ్రా కమిషన్ కేంద్రానికి నివేదిక సమర్పించడంతోపాటు, రాష్ట్ర అసెంబ్లీ మూడుసార్లు వర్గీకరణ కోసం తీర్మానం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ పార్లమెంటులో బిల్లు పెడితే మద్ధతిస్తామని ప్రకటించాయి. ప్రధానికి లేఖలు రాశాయి. ప్రస్తుతం వర్గీకరణ చట్టంగా కావడానికి సాంకేతిక ప్రక్రియలన్నీ ముగించుకున్నది. 

ఈక్రమంలోనే దండోరా నాయకత్వం యూపీఏ ప్రభుత్వ పెద్దలకు వర్గీకరణ చేయాలని లేఖలు కూడా రాయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది మాల స్వార్థపర శక్తులు తప్ప వర్గీకరణను వ్యతిరేకించే శక్తలేవీ లేవు. ఈ నేపథ్యంలోనే వర్గీకరణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి, కాంగ్రెస్ పెద్దల నిద్దుర మత్తు వదిలించడానికి దండోరా ఉద్య మం సమాయత్తమవుతున్నది. ఇంత సుదీర్ఘ ఉద్యమంలో చేసి న త్యాగాలను చూసైనా మాల సోదరుల వర్గీకరణకు సహకరించాలని దండోరా కోరుతున్నది. ఇరవైఏళ్ల దండోరా ఉద్యమం లో మాల సోదరులను సోదర ఉద్యమ సహచరులుగానే చూ స్తుంది తప్ప శత్రువులుగా చూడటం లేదు. కాబట్టి సామాజిక పీడితులుగా సాటి పీడితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నది.దండోరా ఉద్యమం రాష్ట్ర రాజకీయ, ఉద్యమ ముఖ చిత్రం మీదనే కాదు, మొత్తంగా దేశ ఉద్యమాల ముఖ చిత్రం మీదనే ప్రత్యేక ముద్ర వేసింది. తమ జాతి సమూహాల సమస్యల పరిష్కారం కోసం మాత్రమేగాక, సమాజంలోని సకల పీడితుల సమస్యలను తమ భుజస్కంధాలపై వేసుకుని పోరాడటం ద్వారా దండోరా ఉద్యమం ఉద్యమాల చరివూతలో సరికొత్త అధ్యాయాన్ని రచించింది. వికలాంగులకు పెన్షన్ పెంచాలన్న డిమాండ్‌తోపాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని దండోరా డిమాండ్ చేస్తున్నది. తెల్ల రేషన్ కార్డుమీద బియ్యం కోటా పెంపు కోసం ఉద్యమం మరింత ఉధృతంగా దండోరా నిర్వహిస్తున్నది. పిల్లలు, వృద్ధులు, వితంతువులు ఇలా సకల వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం దండోరా ఉద్యమిస్తున్నది. 

భారత దేశ చరివూతలో దండోరా ఉద్యమం సరికొత్త పుటగా నిలిచింది. చెప్పులు కుట్టే చేతులతో చరిత్ర తిరగరాసిన ఉద్యమం దండోరా. కులం పేరు చెప్పుకోవడానికి ఆత్మన్యూనతకు గురైన జనాన్నే తలెత్తుకుని నేను మాదిగను అని సగౌరవంగా చెప్పుకునే స్థితికి దండోరా ఆత్మగౌరవ పోరాటం తెచ్చింది. ఈ నేపథ్యంలోనే సమాజంలోని అనేక నిమ్న, వెనుకబడిన బడుగు కులాలన్నీ దండోరా స్ఫూర్తితో కుల చైతన్యంతో ఉద్యమాల బాట పట్టినయ్. అదే క్రమంలో అన్ని అణచబడ్డ కులాల పోరాటాలకు మాదిగ దండోరా ఉద్యమం బాసటగా నిలిచి ప్రోత్సహించింది.ఆ ఉద్యమాల విజయానికి చేయూతనిచ్చింది. దండోరా ఉద్య మం కుల సంఘమే. అయినా అది కులతత్వంతో ఆలోచించకుండా సబ్బండ వర్గాలను సోదరత్వంతో చూసి వారిని అక్కున చేర్చుకున్నది. వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటునందించింది. మాల మాదిగల ఐక్యతను కోరుతూనే మాల ఐఏఎస్ అధికారి అర్జునరావుకు అన్యాయం జరిగినప్పుడు, గద్దర్‌పై కాల్పులు జరిపినప్పుడు, ఢిల్లీలో చందర్‌రావు అనే మాల ఉద్యోగిపై టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు దాడిచేసినప్పుడు, మాజీ మంత్రి శంకర్‌రావుపై అగ్రకులాలు దాడిచేసినప్పుడు, గీతాడ్డిపై కోదండరాం అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, ఈ మధ్యకాలంలోనే శ్రీకాకుళంలో లక్షింపేటలో జరిగిన హత్యాకాండ ఘటనపై కూడా దండోరా ఉద్యమించింది. బాధితుల పక్షాన నిలిచి అన్యాయాన్ని ఎదిరించింది. ఇలా పోరాడడం ద్వారా మాదిగ దండోరా ఉద్యమం మాలలకు వ్యతిరేకం కాదని చాటాం.

అలాగే విప్లవోద్యమాలపై ప్రభుత్వాల దమ నకాండను నిరసిస్తూ ఉద్యమాల పక్షాన నిలిచి నిర్బంధకాండను ఖండించాము. ఉద్యమాలను అణచడానికి తీసుకురాదలచిన ‘పోటా’ చట్టా న్ని ఎంఆర్‌పీఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. విప్లవోద్యమనేతలు ఎన్‌కౌంటర్ల పేరుతో అమరులైనప్పుడు ఆ బూటకపు ఎన్‌కౌంటర్లను ఖం డించింది. ప్రజాస్వామిక, విప్లవోద్యమాల పట్ల రాజ్యహింసకు వ్యతిరేకంగా దండోరా ఉద్య మం గొంతు విప్పంది.అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఉద్యమానికి మద్ధతు నిచ్చిం ది. అనేక తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నది.అలాగే తెలంగాణ జిల్లాల్లో మెజార్టీగా ఉన్న ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కాలనే డిమాండ్‌తో సామాజిక తెలంగాణకోసం దండోరా ఉద్యమం కదులుతున్నది.అణగారిన వర్గాలుగా మూడు ప్రాంతాల్లో ఉన్న వారిని కూడగట్టి తెలంగాణ ఉద్యమానికి మద్ధతును కూడగట్టింది. చెరుకు సుధాకర్‌పై రాజ్యనిర్బంధం, విమలక్కపై కుట్ర కేసుల సందర్భంలోనూ దండోరా ఉద్యమం బాధితుల పక్షాన నిలిచి రాజ్యహింసను వ్యతిరేకించింది. సామాజిక ఉద్యమాలను ప్రజాస్వామిక పోరాటాలతో మమేకం చేస్తూ.. దండోరా ఉద్యమం దిక్సూచిగా నిలిచింది. ఇదే సందర్భంలో భవిష్యత్ తరాల నిజమైన విముక్తి కోసం సమస్త పీడక కులాల ప్రజలందరి విముక్తి లక్ష్యంతో ఫూలే, అంబేద్కర్ ఆశయాల వెలుగులో నూతన రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు మంద కృష్ణ సమాయత్తమవుతున్నారు. సమస్త పీడితుల విముక్తి కోసం మహాజనుల పార్టీ నిర్మాణం కాబోతున్నది. ఇదే దేశంలో సమస్త పీడితుల వెలుగుబాటగా మారబోతున్నది. బహుజనుల రాజ్యం రాబోతున్నది. దీనికి దండోరా సమరశంఖం పూరించి ముందుకు కదులుతున్నది.

-గోవిందు నరేష్ మాదిగ
ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
(మాదిగ దండోరా ఉద్యమానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా..)


Namasete Telangana Telugu News Paper Dated : 08/07/2013 

Tuesday, December 4, 2012

యాచకులకూ వర్గీకరణ లబ్ధి - గడ్డం దేవదాస్



ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మొదటిసారి ప్రారంభించిన ఉద్యమ సంస్థ అరుంధతీయ మహాసభ. ఈ సంస్థ వ్యవస్థాపకుడు కీర్తిశేషుడు మాదిగ గురుస్వామి 1920లోనే మాదిగ హక్కుల గురించి ప్రప్రథమంగా ఎలుగెత్తారు. ఈయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. ఎందుకనగా ఎస్సీలైన ఆది ఆంధ్రుల, ఆది ద్రావిడుల, (తెలంగాణ మాలల వలె) బలమైన ఆర్థిక పునాది ఆధిపత్యం ఉన్న ప్రాంతం ఆంధ్రగా చెప్పుకోవాలి. అట్టి ఆర్థిక పరిపుష్టి ఉన్న ఆది ఆంధ్ర, ఆది ద్రావిడులను, వీరు అనుభవించే ఉమ్మడి రిజర్వేషన్ ఫలాల వల్ల వెనుకబడిన, ఆర్థిక పరిపుష్టి లేని మాదిగల జీవన స్థితి నుంచి పుట్టిన ఉద్యమమే ఎస్సీ వర్గీకరణ ఉద్యమం. ఎస్సీలలోని అసమానతలను తొలగించి, సమాన స్థితికి మార్చి, ఎవరి వాటాను వారనుభవించే ప్రక్రియే వర్గీకరణ. ఇది సామాజిక న్యాయం, సామాజిక దృక్పథం సంకల్పమని అరుంధతీయ మహాసభ భావించింది.

1980లో కిషన్‌లాల్ ఏర్పాటు చేసిన ఆరుందతీయ బంధు సేవా మండలి. 1982లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘం. 1989లో డా. మంద జగన్నాథం, రిటైర్డ్ ఐ.పి.ఎస్ అధికారి వెంకటస్వామి నాయకత్వంలోని ఆది జాంబవ అరుంధతీయ సమాఖ్య తర్వాతే కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 1994 జూలై 6న 20 మందితో ఏర్పడిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వరకు ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈ పోరాటాల ఫలితంగా వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చిన రామచంద్రరాజు కమిషన్ ఆధారంగా నాటి తెలుగుదేశం ప్రభుత్వం 1997 జూన్‌లో ఎస్సీ రిజర్వేషన్లను ఎ, బి, సి, డిలుగా విభజిస్తూ జీవో 68, 69ని జారీచేసింది. అదే సంవత్సరంలో ఏర్పడిన మాల మహానాడు వర్గీకరణను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది. 1999 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రపతి అనుమతితో వర్గీకరణ అమలుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను హైకోర్టు ధర్మాసనం సమర్థించింది. మాల మహానాడు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 2004 నవంబర్‌లో అధికరణ 341 ప్రకారం ఎస్సీ కులాలను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, కావాల్సి వస్తే రాజ్యా ంగ సవరణ ద్వారా వర్గీకరించుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందే కానీ వర్గీకరణ వద్దని, తప్పని చెప్పలేదు.

మాదిగల కింద వీరిని యాచించే చిందులు, మాస్టిన్, డెక్కలి, బుడిగ జంగాలు తదితర కులాలున్నాయి. ఇవి నేటికీ మాదిగలను అడుక్కొని జీవిస్తాయి. ఈ కులాల ఎదుగుదలను మాలలు, మాదిగలు కలిసి అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో ఎదగకుండా అడ్డుకున్నారు, అణిచివేశారు. ఏనాడు ఈ మాలలు, మాదిగలు తమ కింది కులపోళ్ల ఎదుగుదల గురించి పల్లెత్తు మాట్లాడరు. చట్టసభల్లో వీరి ప్రస్తావన కానరాదు. 'సమాజంలో ఒక కులం వారు ఏ కారణం వలన పీడితులయ్యారో ఆ ప్రాతిపదిక మీదనే వాళ్ళను ప్రోత్సహించాలని' డా. బి.ఆర్. అంబేద్కర్ అంటారు. విద్య, ఉద్యోగ, రాజకీయ తదితర రంగాల్లో ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లను పూర్తిగానే అనుభవించని ఈ యాచక జాతుల వారికి ప్రత్యేక కేటగిరీ కింద గుర్తించి, వర్గీకరణలో 'ఎ' గ్రూపులో చేర్చి తగినంత రిజర్వేషన్ శాతాన్ని కల్పించాలి.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రెండు దఫాలుగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి చంద్రబాబు (తెలుగుదేశం) మరొకసారి వై.ఎస్. రాజశేఖరరెడ్డి (కాంగ్రెస్)కి మాదిగ జాతిని, దాని ఉప కులాలను వారికి అనుకూలంగా మలిచి ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీ ఆమోదం పొందేలా ఏకగ్రీవ తీర్మానం వరకు మందకృష్ణ మాదిగ పోరాట కృషి కొనసాగింది. తర్వాత కాలంలో మాలల కౌంటర్ ఉద్యమం ద్వారా వర్గీకరణ వివాదాస్పదమై సుప్రీంకోర్టు సూచనతో వర్గీకరణ బిల్లు పార్లమెంట్ ఆమోదానికి నిరీక్షిస్తూ, తుది పోరాటం చేస్తూనే ఉంది. రిజర్వేషన్ల ద్వారా కొంత పురోభివృద్ధిని సాధించిన మాల, మాదిగలు ఎదుగని కులాల పట్ల జాలి తో వ్యవహరించని తీరుకు విచారించాలి. ప్రజాస్వామ్యం సామాజిక దృక్పథాన్ని విడనాడి జాతి వైరాన్ని తీ వ్రం చేయడం అంబేద్కరిజం కాదు. ఎస్సీ వర్గీకరణలో సామాజిక దృక్పథాన్ని అలవర్చుకోండి. మాల, మాదిగలు ఒకే కమ్యూనిటీగా ఐక్యమవ్వండి. కుల వివక్షకు వ్యతిరేకంగా కుల నిర్మూలన రాజ్యాధికారంపై కలిసి పోరాడండి.

- గడ్డం దేవదాస్
అంబేద్కరిస్ట్, తెలంగాణ చిందు హక్కుల
పోరాట సమితి వ్యవస్థాపకులు

Andhra Jyothi Telugu News Paper Dated: 5/12/2012