Showing posts with label బి సి. Show all posts
Showing posts with label బి సి. Show all posts

Wednesday, February 1, 2012

బిసిలకు మళ్ళీ అన్యాయం - డాక్టర్ ఇ.వెంకటేశు

భారతదేశ చరిత్ర పొడవున విద్య, ఆస్తి, అధికారం అనే మూడు మానవహక్కుల ఉల్లంఘనకు గురైన అత్యధికులలో వెనుకబడిన కులాల వారు ఒకరు. భారత కుల సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రియు లు, వైశ్యుల తర్వాత స్థానంలో వుండే ఉత్పత్తి కులాలే వెనుకబడిన వర్గా లు. తరతరాలుగా కులవృత్తులను అట్టిపెట్టుకొని బతుకుతున్న వీరిని దేశంలోని సామాజిక వ్యవస్థ స్తబ్ధతకు గురిచేసింది. ఫలితంగా దేశంలో రావలసిన 'పారిశ్రామిక విప్లవం', బ్రిటన్‌లో వలే, మనదేశంలో రాలేదు.

వలస పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్, మహాత్మాగాంధీ నాయకత్వంలో జరుగుతున్న జాతీయోద్యమం, భూస్వామ్యం, జమిందారులకు వ్యతిరేకంగా జరుగుతున్న కమ్యూనిస్టు వుద్యమం, ఉన్నత కులాలకు వ్యతిరేకంగా జ్యోతిబాఫూలే, అంబేద్కర్, పెరియార్, శ్రీ నారాయణగురు నాయకత్వంలో జరుగుతున్న దళిత బహుజన వుద్యమంతో ప్రభావితమైన నాయకులు తెలుగు ప్రాంతాల్లో కూడా వెనుకబడిన కులాల వుద్యమాన్ని నిర్మించారు.

స్వాతంత్య్రానంతరం ప్రజాస్వామిక వ్యవస్థలో 'జన బలం' సంఖ్య ప్రాముఖ్యతను గ్రహించిన కుల సంఘాల నాయకులు 'వెనుకబడిన కులాల సమాఖ్య'ను ఏర్పాటు చేశారు. నాటి నుంచి రాజకీయ, ఆర్ధిక, సామాజిక, విద్య, ఉద్యోగాలలో తమకు వాటా కావాలని డిమాండ్ చేశారు. ఇటువంటి కులసంఘాల సమాఖ్యలు భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన పునాదిని ఇవ్వడమే కాకుండా పటిష్టం చేశాయరని రాజనీతి శాస్త్రవేత్త రజని కొఠారి 'భారతదేశ రాజకీయాలలో కులం' అనే పుస్తకంలో సూత్రీకరించారు.

ఒక పక్క వెనుకబడిన కులాల ఉద్యమం తమ జనాభా ప్రకారం 'అధికారం, అభివృద్ధి'లో తమ వాటా కావాలని అడుగుతుండగా, తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ఏమాత్రం పట్టించుకోలేదు. అంతేకాక ఆయన అనుసరించిన అభివృద్ధి విధానాలు వెనుకబడిన కులాల అభ్యున్నతికి అడ్డంకిగా తయారయ్యాయి.

కమ్యూనిస్టుల నాయకత్వంలో సోవియట్ యూనియన్‌లో విజయవంతమైన 'సామ్యవాద విప్లవం' అతి తక్కువ కాలంలో 'ప్రణాళిక యంత్రాంగం' ద్వారా సాధించిన విజయాలను చూసి నెహ్రూ, ఆ దేశం నుంచి 'ప్రణాళిక సంఘం' అనే ఆలోచనా విధానాన్ని అరువుగా తెచ్చి భారతదేశ ప్రజలపై బలవంతంగా రుద్దారు. దేశ ఆర్ధిక వ్యవస్థలో అత్యంత కీలకపాత్ర వహించే వెనుకబడిన కులాల ప్రయోజనాలను ప్రణాళిక సంఘం పట్టించుకోలేదు. అందువల్ల 8వ పంచవర్ష ప్రణాళిక వరకు ఎక్కడా కూడా అభివృద్ధి విధానాలలో అసలు వెనుకబడిన కులాలు అనే పదాన్నే ఉపయోగించలేదు.

మరో పక్క నెహ్రూ కాలంలోనే నియమించిన మొట్టమొదటి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఛైర్మన్ కాకా కాలేల్కర్ సమర్పించిన నివేదికపై పార్లమెంట్‌లో చర్చకూడా జరగలేదు. ఈ రకంగా కేంద్రంలో నూ, రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం కొనసాగినంత కా లం వెనుకబడిన కులాలను అధికారానికి, అభివృద్ధికి దూరమయ్యారు.

1970 నాటికి కాంగ్రెస్ పార్టీ తమను దూరం పెడుతుందన్న విషయాన్ని గ్రహించిన వెనుకబడిన కులాలు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు మొగ్గుచూపారు. ఇదే సమయంలో ఉత్తర భారతదేశంలో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా వంటి వారు కొనసాగిస్తున్న 'సంపూర్ణ క్రాంతి' వుద్యమంలో భాగస్వాములైన వెనుకబడిన కులాలు కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడి, జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టారు. ఇందిరాగాంధీ విధించిన 'అత్యవసర పరిస్థితి' అనంతరం కేంద్రంలో ఏర్పడిన జనతా ప్రభుత్వం రెండవ జాతీయ స్థాయి వెనుకబడిన తరగతుల కమిషన్‌ను బిందేశ్వర్ ప్రసాద్ మండల్ చైర్మన్‌గా నియమించింది.

ఈ కమిషన్ నివేదిక వెనుకబడిన తరగతుల ప్రయోజనాల కొరకు అనేక సిఫార్సులు చేయగా, జనతా పార్టీ తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని 'హైజాక్' చేసి ఉన్నత కులాల ప్రయోజనాల కోసం అమలు చేసింది. అందుకు బలమైన ఉదాహరణ జవహర్ నవోదయ పాఠశాలలు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండగా సుమారు పది సంవత్సరాల పాటు మండల్ నివేదికను తొక్కిపెట్టారు. తిరిగి విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ నాయకత్వంలో జనతాదళ్ కేంద్రంలో అధికార బాధ్యతలను చేపట్టినప్పుడు మండల్ కమిషన్ సిఫార్సు చేసిన 27 శాతం రిజర్వేషన్లను విద్య, ఉద్యోగాలలో అమలులోకి తెచ్చింది.

కేంద్ర ప్రభుత్వ సంస్థలలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలులోకి రాగానే అనేక ఇబ్బందులు సృష్టించడం ప్రారంభించారు. ఇందులో మొదటిది 'క్రిమీలేయర్' అని కొంతమంది అభివృద్ధి చెందిన బి.సి.లు అనే పేరుతో రిజర్వేషన్లకు దూరం చేశారు. రెండు, భారతీయ జనతాపార్టీ నాయకత్వంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా వున్నప్పుడు, ఏమాత్రం రిజర్వేషన్ల శాతాన్ని పెంచకుండా సుమారు వెయ్యి కులాలను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్పించింది. మూడు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ప్రవేశం కొరకు ఉన్న సీట్లలో 27 శాతం రిజర్వేషన్లు కాకుండా, బిసిల కొరకు ప్రత్యేకంగా 27 శాతం సీట్లు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు సమకూర్చి అమలు చేస్తున్నారు.

అయితే ఇందులో జనరల్ కేటగిరీలో సీటు సంపాదించుకున్న వెనుకబడిన తరగతుల విద్యార్థిని కూడా రిజర్వేషన్లో చూపిస్తున్నట్లు దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు వున్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల శాసనసభలకు జరుగుతున్న ఎన్నికలను దృ ష్టిలో వుంచుకొని 27 శాతం బి.సిల రిజర్వేషన్లలో మైనారిటీలకు 4.5 శా తం రిజర్వేషన్లు యిచ్చి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం మరొకసారి వెనుకబడిన కులాల ప్రయోజనాలను దెబ్బకొట్టింది.

నిజానికి కాంగ్రెస్ పార్టీకి మైనారిటీలపై శ్రద్ధ వుంటే వారి ప్రయోజనాల కోసం 'సచార్' కమిటీ నివేదిక చేసిన సిఫార్సులను అమలు చేయాలి. అయితే ఏ పార్టీ కేంద్రంలో అధికారంలో వుండగా చారిత్రక రామజన్మభూమి - బాబ్రీ మసీదును కూలగొట్టింది మైనారిటీలకు చాలా స్పష్టంగా తెలుసు. అదేవిధంగా మైనార్టీలు వెనుకబడిన కులాల వాటాలో భాగం అడగడం లేదు. మైనార్టీ గుర్తింపుపై జనాభా ప్రాతిపదికన వాటా కావాలని మైనార్టీల ఉద్యమం డిమాండ్ చేస్తుంది.

ఈ రకంగా వెనుకబడిన తరగతుల ప్రయోజనాలకు ఆటంకం కల్పిస్తున్న భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మూడు, నాలుగు స్థానాల కొరకు పోటీపడవలసి వుంటుందే కాని, ఒకటి, రెండవ స్థానాలు వచ్చే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

- డాక్టర్ ఇ.వెంకటేశు రాజనీతిశాస్త్ర విభాగం, కేంద్రీయ విశ్వవిద్యాలయం 
Andhra Jyothi News Paper Dated 1/2/2012 

Wednesday, November 16, 2011

దగాపడ్డది బీసీలే! - సంగిశెట్టి శ్రీనివాస్, ఏశాల శ్రీనివాస్

తమ స్వీయ ప్రయోజనాల కోసం, 'హిడెన్ ఎజెండా'తో కొంతమంది 'సామాజిక న్యాయం', 'బహుజన తెలంగాణ' పేరు తో అయోమయం సృష్టిస్తున్నారు. అంతిమంగా తెలంగాణ ఉద్యమ ఊపిరి తీయాలని చూస్తున్నారు. ఉద్యమం ఊపు మీద ఉన్నప్పుడు సాధ్యమైనంత మేరకు దానికి బ్రేకులు వెయ్యడం, అలసట తీర్చుకోవడం కోసం ఉద్యమకారులు ఆగిన వెంటనే వాళ్ల వెన్నుమీద పొడవడమే వీళ్ల నిత్యకృత్యం.

ఉద్యోగసంఘాల నాయకత్వ స్థానంలో ఉన్న ది బీసీలు కావడంతో వారిపై నేరుగా దాడికి దిగుతున్నారు. 'మా తోటి కలిసి రాకుంటే శత్రువుతో కుమ్మక్కయినట్లే'అని అమెరికా చేస్తు న్న ప్రచారాన్నే ఆయుధంగా వాడుతున్నారు. ఇటీవలి కాలంలో పత్రికల్లో వ్యాసాలు, టీవీ చర్చల్లో, రౌండ్ టేబుల్ సమావేశాల్లో, పత్రికా సమావేశాల్లో ఈ 'భావ వ్యాప్తి' జోరుగా సాగుతోంది.

'సామాజిక తెలంగాణ' పేరుతో చిరంజీవి తెలంగాణను నిండా ముంచిన తర్వాత ఆ పదం వాడాలంటేనే వెన్నులో బాకు దిగిన భయం కలుగుతోంది. ఇక దేవేందర్‌గౌడ్ 'నవ తెలంగాణ ప్రజాపార్టీ'ని స్థాపించి, తనను నమ్మినోళ్లని మూసీలో ముంచి, చిరంజీవితో కలిసి, చివరికి చంద్రబాబు దగ్గర తేలడంలో 'సామాజిక' పదం చాలా యూజ్, మిస్ యూజ్, అబ్యూజ్‌కు గురయింది. 'సామాజిక తెలంగాణ' తమ పేటెంట్‌గా భావిస్తున్న వాళ్లు ఒక్క రాజకీయ కోణం నుంచి మాత్రమే దాన్ని చూస్తున్నారు. ఆ పరిధి, దాంతో పాటు స్వీయ నిర్మిత పరిమితి నుంచి వాళ్లు బయటపడటం లేదు.

పత్రికల్లో వ్యాసాలై పరుచుకునే మేధావులు రాష్ట్రం విడిపోతే సామాజిక తెలంగాణగానే విడిపోవాలి లేదంటే అసలు విడిపోవాల్సిన అవసరమే లేదంటూ మొండి వాదనలు చేస్తున్నారు. ఈ విడిపోవద్దనే 'మేధావులు' పొరపాటున కూడా 'సామాజిక ఆంధ్రప్రదేశ్' కావాలని డిమాండ్ చేయడం లేదు. అంటే తెలంగాణను అడ్డుకోవడం కోసమే వీళ్లు తమ మేధావిత్వాన్ని ఉపయోగిస్తున్నారు.

రాజకీయరంగంలో 'సామాజిక న్యాయం' అనేది కొత్తగా పుట్టుకొచ్చిన పదం కాదు. గత వందేళ్లుగా తమిళనాట 'సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్' 'జస్టిస్ పార్టీ'ల రూపంలో అమలులో ఉన్నదే!. ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో బ్రాహ్మణులు, బ్రాహ్మణేతర వర్గాలకు మధ్య జరిగిన పోరులో 'జస్టిస్ పార్టీ' బ్రాహ్మణేతరుల పక్షాన పోరాడింది. 1944 తర్వాత పెరియార్ రామస్వామి నాయకర్ నేతృత్వంలో 'ఆత్మగౌరవ' ఉద్యమాలు జరిగాయి.

ఈ ఉద్యమాల నుంచే 'ద్రవిడ కజగమ్' లాంటి పార్టీలు ఆవిర్భవించాయి. బీసీలైన ఎం.జి.రామచంద్రన్, కరుణానిధిలు ముఖ్యమంత్రి పదవినదిష్టించారు. సరిగ్గా ఈ రోజు తెలంగాణలో సకలజనులు చేస్తున్నది 'ఆత్మగౌరవ'పోరాటమే. ఈ పోరాటం కొందరు తమ స్వీయ ప్రయో జనాల కోసం వక్రీకరిస్తున్నట్టుగా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదు. తెలంగాణ డిమాండ్ 'సామాజిక న్యాయం' అవిభాజ్యమైనవి. అందుకే దామాషా ప్రకారం 'అత్యంత అణచివేతకు గురయి న వారికి అందరికన్నా ముందు అవకాశం' అనే సూత్రంతో ప్రయోజనాలు చేకూర్చాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాము.

ఇది కేవలం జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభల్లో స్థానంతో ఆగిపోకూడదు. 'ప్రభుత్వం, కొంతమంది సంపన్న వర్గాల గుప్పిట్లో కేంద్రీకృతమైన సంపదను, వనరులను జనాభా దామాషా పద్ధతిలో పున:పంపిణీ చేయాలి'. భూమి, విద్య, వైద్యం, ఉపాధి, గౌరవ ప్రదమైన జీవనం అందరికీ హక్కుగా దక్కాలి. ఆ స్పృహతోనే నేడు యావత్ తెలంగాణ ఉద్యమిస్తోంది. నిజానికి రెడ్డి, వెలమ, మిగతా అగ్రవర్ణాలవారందరికన్నా 'బహుజన తెలంగాణ' 'బీసీ'లకే అత్యవసరం. ఎందుకంటే నేడు రాజకీయంగా ఎలాంటి రిజర్వేషన్లు లేకపోవడంతో తమకు న్యాయంగా దక్కాల్సిన వాటాకోసం కూడా 'బీసీ'లు నిత్యం కొట్లాడాల్సి వస్తుం ది.

మరోవైపు మీకు చేతనైత లేదు కాబట్టి మీ తరపున మేమే కొట్లాడుతామని బీసీయేతర లీడర్లు తయారవుతున్నారు. ఇందులో ముం దు వరుసలో ఉన్నది ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణ. ఒకవైపు అగ్రవర్ణాల వారిని బహుజనులకు దక్కాల్సిన అవకాశాల్ని కాజేశారని విమర్శిస్తూనే వారి స్థానాన్ని తాను క్రమంగా ఆక్రమిస్తున్నారు. అంటే బీసీలను అగ్రవర్ణ నాయకుల బందీ నుంచి విముక్తి పేరిట 'దళిత దొరల' 'ఖైదీ'లుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.

అగ్రవర్ణాల పట్ల భయమో, భక్తో కానీ, ఇప్పటికీ 80 శాతం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బీసీలమీదనే ఉన్నాయనే విషయాన్ని మరవొద్దు. మందకృష్ణ 'తెలంగాణ' ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తాడనే నమ్మకం లేదు. 'వర్గీకరణ'కోసం 'తెలంగాణ'ను బలిపెట్టబోడనే విశ్వాసమూ లేదు. బీసీల్లో సమర్ధులు లేనందునే తాను వారి తరపున వకాల్తా పుచ్చుకోవాల్సి వచ్చింది అనే వాదన ఆయన అహంభావ వైఖరికి నిదర్శనం. తన రాజకీయ ఎత్తుగడల్లో బీసీలను పావులుగా వాడుకోవాలని చూడడం మాకు సమ్మతం కాదు.

మంద కృష్ణ గతంలో చెప్పినట్లు 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టుల తరపున ఇద్దరే ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు- బొమ్మగాని ధర్మభిక్షం, పెండెం వాసుదేవరావు. ఇందులో పెండెం గజ్వేల్ నుండి మాడపా టిని ఓడించారంటే అవకాశం వస్తే బీసీలు తమ సత్తాని చూపిస్తార నడానికి ఇదే తార్కాణం. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఖమ్మం జిల్లా నుంచి బీసీల రిప్రజెంటేషన్ లేదు. మిగతా జిల్లాల్లో ఒకరిద్దరు అతి కష్టంమీద టిక్కెట్లు తెచ్చుకున్నారు. చచ్చీ చెడీ గెలిచారు. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం కొట్లాడుతున్న బీసీలకు మందకృష్ణలాంటి ఉద్యమకారులు మద్దతిచ్చి అండగా నిలిచినట్లయితే ఒకే వొరలో రెండు కత్తులు కాకుండా, ఒకే కత్తికి రెండు వైపులా పదునుగా మారుతుంది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇవ్వకుండా 'మాకు రాజకీయాల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి. మేము మీకోసమే కొట్లాడుతున్నాము' అని మెహర్బానీ ప్రదర్శిస్తున్నారు. ఈ మెహర్బానీలో 'మీకు రాదు కాబట్టే మేము నేర్పడానికి వచ్చా ము అనే సీమాంధ్ర అహంకారమే' కనిపిస్తున్నది. అందుకే మామీద స్వారీ చేయకుండా మాతో కలిసిరావాలని వారిని కోరుతున్నాము. తెలంగాణ ఉద్యమం ఊపు మీదున్న ప్రతిసారీ మందకృష్ణ ప్రతికూల శక్తిగా మారుతున్నారే తప్ప మేలు చేయడం లేదు. తనతో కలి సి రాకుంటే కెసిఆర్‌తో ఉన్నట్లే అనే భావనని వ్యాప్తిలో పెట్టారు.

ఆనాడు అంబేద్కర్‌ని కూడా ఇలానే అన్నారని 'అంబేద్కర్ తర్వాత నేనే' అంతటి వాడిని అనే 'సంకేతం' ఇస్తున్నారు. నిజానికి కెసిఆర్ మనవడికో, కోదండరామ్ కొడుక్కో తెలంగాణ వచ్చినా, రాకపోయి నా వాళ్ల బ్రతుకుదెరువుకు ఢోకాలేదు. కానీ తెలంగాణ రాకుంటే కోటి ఆశలతో, ఆకాంక్షలతో ఎదురుచూస్తున్న నాలుగు కోట్ల బహుజన ప్రజానీకం తల్లడమల్లడమవుతారు. మరింత బానిసత్వానికి బలవుతారు. అలాగే తెలంగాణ కోసం కొట్లాడుతున్న వారందరూ టిఆర్ఎస్ సభ్యులు కారు అనే విషయం గుర్తుంచుకోవాలి.

ఇక కంచ ఐలయ్య తన మేధస్సునంతా నిరుపయోగమైన నిందారోపణలకు వినియోగిస్తున్నారే తప్ప బీసీల ఎదుగుదలకు తోడ్పడడం లేదు. ఐలయ్య ఇంగ్లీషు మాధ్యమం ఉండి తీరాల్సిందే అని గట్టిగా నిలబడినందుకు సంతోషమైంది. అదే నోటి తోటి కేవలం దళితులకు మాత్రమే రిజర్వేషన్లు దక్కుతున్నా 'హైదరాబాద్ పబ్లిక్ స్కూల్' మాదిరి బడులు తెలంగాణలోని ప్రతి మండలంలో స్థాపిం చి అందులో బీసీలకు రిజర్వేషన్లు ఇప్పించాలని అడుగుతారని అనుకున్నాం. కాని అది ఆయన 'టార్గెట్' కాదు. ఉద్యమంలో ఉన్న అగ్రవర్ణ నాయకుల మీది అక్కసునంతా 'సబ్బండ వర్ణాలు' చేస్తున్న ప్రజా ఉద్యమం మీద వెళ్లగక్కారు. అసలు ఇంకో 20 ఏళ్ల దాకా ప్రత్యేక తెలంగాణ వద్దు అనడం ద్వారా ఉద్యమంతో మమేకమైన సమస్త బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించారు.

ఇక కొండా లక్ష్మణ్ చరిత్ర తెలుసుకోకుండా చెముకుల సుధాకర్ తదితరులు అవాకులు, చెవాకులు (అక్టోబర్ 22) రాశారు. 97 ఏళ్ల వయసులో బాపూజీకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని 'వయసు'రీత్యా కోరుకోవడం లేదు. బాపూజీని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించేవాళ్లు ఆయన భుజాన్ని ఆసరాగా తీసుకొని తమ రాజకీయ ప్రత్యర్థులపై దాడికి ఆయన్ని పావుగా వాడుకుంటున్నారు. ఇది ఒక బీసీని కూరలో కరివేపాకులా వాడుకునేందుకు వేసిన ఎత్తుగడగానే భావించాలి. సుధాకర్ ఆయన మిత్ర బృందం సీఎం పదవిని మందకృష్ణ, గద్దర్‌కు ఇవ్వాలని రాశారు.

వాళ్లు ఆ పదవికి అర్హులే కానీ ఆ పదవి ముందుగా బీసీలకు దక్కడమే న్యాయం. ఈ పంచాయితీ తెలంగాణ వచ్చాక తేల్చుకోవచ్చని ఇన్ని రోజులూ తెలంగాణ బీసీలుగా భావించాము. అయితే బీసీలకు నాయకత్వం లేదు, వారికి చేత కాదు అని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి జవాబివ్వక తప్పని పరిస్థితిని కల్పించారు. 97 ఏళ్ల పెద్దమనిషి నిరాహార దీక్షచేస్తానంటే వద్దు నీ బదులు మేం చేస్తాం అని చెప్పాల్సిన ఉద్యమకారులు బాపూజీ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఒకప్పుడు కెసిఆర్ బదులు తాను నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన మందకృష్ణ ఇవాళ కొండా బదులు తానెందుకు చేయలేదో జవాబివ్వాలి.

ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి పదవి బీసీలకు మాత్రమే దక్కాలి. అది కూడా వరుసగా మూడు టర్మ్‌లకు రిజర్వు (15 ఏళ్లకు) చెయ్యాలి. ఎందుకంటే సామాజిక న్యాయంలో పూర్తిగా అన్యాయానికి గురైంది బీసీలు. చరిత్రలో గాంధీ చరఖా పట్టుకొని బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి బ్రాహ్మణ వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టారు. అలాగే మా ముందు తరాలవారు అంబేద్కర్‌ని అనుసరించకపోవడం వల్ల చాలా నష్టపోయాం.

ఇవాళ ప్రపంచీకరణ వల్ల కూడా అత్యధికంగా నష్టపోయింది బీసీలే. వృత్తులు, ఉపాధి కోల్పోయి, నిత్యం ఆకలిచావులతో అల్లాడుతున్న బీసీలకు ప్రభుత్వం భూమిని పంచివ్వాలి. భూమితోనే బతుకు అని తేలిపోయింది. దోపిడీ, పీడనకు ఇక సెలవు. మేము ఆత్మగౌరవంతో బతుకుతాం అని బీసీలు నినదిస్తున్నారు. బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వారిపైనే ఖర్చయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. బీసీలకు రిజర్వుడు నియోజకవర్గాలు లేకపోవడం వల్ల 54 శాతం జనాభా ఉన్నా ఇప్పటి వరకు 10 శాతం ప్రాతినిధ్యం కూడా దక్కలేదు.

రాష్ట్రంలో మొత్తం 120 బీసీ కులాల్లో ఇంత వరకు 102 కులాల వాళ్లు చట్ట సభల్లో అడుగు పెట్టలేదు. 294 రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు న్యాయంగా 160 సీట్లు దక్కాలి. కానీ 59 మందే బీసీలున్నారు. జనాభాలో 50 శాతం పైగా ఉన్న సమాజానికి ఇంత వరకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. అయితే ఇంత వరకూ తెలంగాణ నుంచి ఒక్క బీసీ కూడా కేంద్రంలో క్యాబినెట్ మంత్రి కాలేక పోయారు. ఇప్పటి ఉపముఖ్యమంత్రితో పాటు దళితులు ఇప్పటిదాకా ఎన్ని పదవులు పొందారో బేరీజు వేసుకుంటే పరిస్థితి అర్థమవుతుంది.

కాబట్టి ముందుగా భౌగోళిక తెలంగాణ వచ్చి తీరాల్సిందే. భౌగోళిక తెలంగాణలో 'సామాజిక న్యాయం' కోసం అణచివేతకు, పీడనకు గురైన బీసీ, దళిత, మైనారిటీ వర్గాలు సమిష్టిగా కొట్లాడాల్సిందే. 'బహుజన తెలంగాణ'లో వనరులన్నీ జనాభా దామాషా ప్రకారం అట్టడుగున ఉన్నవారికి మొట్టమొదట పంపిణీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందే.

- సంగిశెట్టి శ్రీనివాస్, ఏశాల శ్రీనివాస్
ఫోరమ్ ఫర్ కన్సర్న్‌డ్ బీసీస్   Andhra Jyothi News Paper Dated 17/11/2011

Wednesday, November 2, 2011

రబ్బర్‌ స్టాంప్‌ బీసీ కమిషన్‌ ఎందుకు? By రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు R Krishnaiah Surya News Paper 02/11/2011


రబ్బర్‌ స్టాంప్‌ బీసీ కమిషన్‌ ఎందుకు?
బీసీల అభివృద్ధి, రక్షణ, సమగ్ర వికాసాన్ని ఆకాంక్షించిన ‘సుప్రీంకోర్టు’ 1993 లో మండల్‌ కేసుగా ప్రసిద్ధిపొందిన ‘ఇందిరాసాహ్ని వ్యాజ్యం’లో వెలువరించిన తీర్పులో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్లు ఏర్పాటుచేయాలని సూచించింది. ఆ మేరకు జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వాలు కమిషన్లు నెల కొల్పినప్పటికి వాటికి ఎలాంటి అధికా రాలను కల్పించక పోవడంతో అవి ‘రబ్బర్‌స్టాంప్‌’ ఆర్గనైజే షన్లుగా రూ పాంతరం చెందాయి తప్ప, ఈ సామాజిక వర్గాలకు ఏ మాత్రం ఆశించినరీతిలో ప్రయోజనాలు చేకూర్చడం లేదు. మన రాష్ట్ర బీసీ కమిషన్‌ కూడా ఈ కోవలోకే వస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల కాలపరిమితి ముగిసింది. కొత్తవారిని నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం.

అధికారాలు లేకుండా ‘ఆచరణ’ చూపడం సాధ్యం కాదు. బీసీలకు చేదోడు- వాదోడుగా ఉండేదుకు బీసీ కమిషన్‌ చట్టాన్ని ఆమోదయోగ్యమైన సవరణలతో తీర్చి దిద్దడం అసాధ్యం కాదు. బీసీల సర్వతోముఖాభివృద్ధికి తగు సిఫారసులతో ప్రభుత్వాలకు నిర్మాణాత్మకంగా, శాస్త్రీయ పద్ధతిలో రూపొందించిన నివేదికలను ఎప్పటికప్పుడు అందించాల్సిన బీసీ కమిషన్‌ క్రమంగా నిరూపయోగం కావడం ప్రజాస్వామ్యంలో సహేతుకం కానేరదు. ఇందుకు ప్రభుత్వ పరంగా బీసీల సంక్షే మంపట్ల చిత్తశుద్ధి లోపించడం ఒక కారణం. అంతే గాక ఈ వర్గాలకు అధికారాన్ని శాసించే స్థితికి రాక పోవడం మరో కారణం. ఉత్తర్‌ప్రదేశ్‌, సిక్కిం, కర్ణాటక, బీహర్‌ రాష్ట్రాలలో బీసీ కమిషన్‌లకు విశేష అధికారాలు కల్పిస్తూ చట్టాలను ఆయా ప్రభుత్వాలు సవరించాయి. అదే రీతిలో మన రాష్ట్ర బీసీ కమిషన్‌ ‘చట్టం- 20/ 1993’ను సవరించి బీసీ కమిషన్‌ను పటిష్ఠం చేయాల్సి ఉంది.

ఉత్తర ప్రదేశ్‌, సిక్కిం, కర్ణాటక, బీహర్‌ రాష్ట్ర ప్రభు త్వాలు అక్కడి బీసీ కమిషన్‌లకు ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను పర్యవేక్షించే విశేషాధికారాలను కల్పించాయి. సభ్యులుగా, ఛైర్మన్‌గా సామాజిక వేత్తలను, అలాగే ఆ వర్గాల హక్కుల కోసం పనిచేసే రాజకీయ వేత్తలను నియమించు కోవడానికి వీలుగా చట్టాల్ని సవరించుకున్నాయి. ప్రస్తుతం ఈ ఈ రాష్ట్రాల కమిషన్‌ల పనితీరు జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నది. మన రాష్ట్రంలో బీసీల సమగ్రాభివృద్ధికోసం ఏటా రూ. 2700 కోట్ల బడ్జెట్‌ ఖర్చు చేస్తూ దేశం మొత్తానికి సంక్షేమ కార్యక్రమాల అమలులో మొదటి స్థానంలో నిలుస్తున్నాం. ఇక్కడ ఫీజుల రియింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు, హస్టళ్ళు, పం చాయతీ రాజ్‌ సంస్థలలో రిజర్వేషన్లు, పలు ప్రతిష్ఠాత్మకమైన స్కీములను ప్రవేశ పెట్టించుకున్నాం. ఇక్కడి పథకాలు అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా బీసీలు దశలవారీగా సాధించుకున్నవి.

అయితే ఈ సంక్షేమ పథకాలకు అధికా రులు తూట్లు పొడిచే చర్యలకు పాల్పడుతున్నప్పుడు సమగ్రంగా విచారించి చర్య లు చేపట్టడానికి ప్రత్యేకమైన చట్టబద్ద సంస్థ అవసరం ఉంది. బీసీ సంక్షేమ పథకాల అమలులో అనేక అక్రమాలు, అవకతవకలు చోటు చేసు కుంటున్నాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటి కప్పుడు సమీక్షిం చడం, అమలు తీరు తెన్నులు పరిశీలించడం, ఉదాసీన వైఖరిని కట్టడి చేయడం, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడం, సమగ్రమైన అధ్యయనాలు నిర్వహించడం, సర్వేలు చేపట్టడం, ఈ సామాజిక వర్గాల వాస్తవ జీవన స్థితిగతులను నిశితంగా పరిశీలించడం, రిజర్వేషన్ల అమలులో లోపాలను సరిదిద్దడం, కొత్త పథకాలకు రూపకల్పన చేయడం, ఆర్థిక సంవత్సరంకోసం ఖర్చు చేయాల్సిన నిధులకుగాను ముందస్తు ‘బడ్జెట్‌’, ఇతర ప్రణాళికలు తయారు చేయడం, అవినీతికి తావులేని విధంగా బీసీ సంక్షేమ శాఖ అమలుచేసే అన్ని పథకాలు, కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో నిఘా విభాగంగా పనిచేసే ఒక ‘పర్యవేక్షక వ్యవస్థ’ అవసరం. ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో పరిష్కరించడం సాధ్యమయ్యే పనికాదు. అందుకు చట్టప్రకారం ఏర్పాటై ప్రత్యే కంగా ఉన్న ‘రాష్ట్ర బీసీ కమిషన్‌’ను ఉపయోగించుకోవాల్సిఉంది. ఈ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌కు అధికారాలు పెంచవలసిన అవసరం ఉంది.

ప్రస్తుతం మన రాష్ట్ర బీసీ కమిషన్‌కు బీసీ జాబితాలో కులాలను తొలగించడం, చేర్చడం మినహా వేెరే అధికారాలు లేవు. అలాగే ప్రభుత్వం కోరితే ఏదైనా అంశంపై నివేదికలు సమర్పిండం వంటి పరిమితాధికారాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుత చట్టం మేరకు కమిషన్‌ ఛైర్మన్‌- సభ్యులను బీసీల జీవన స్థితిగతులపై ఏమాత్రం పరిజ్ఞానం లేని వారిని నియమించడం వలన ‘కమిషన్‌’ పనితీరు ఆశాజనకంగా కొనసాగడంలేదు. ‘ఛైర్మన్‌’గా రిటైర్డ్‌ జడ్జీలను నియమిస్తుండం వలన వయో భారంతో వారు సరిగా పనిచేయలేక పోతున్నారు. వారికి బీసీల పట్ల అవగాహన ఉండటం కూడా అరుదు. వీరు ఆకళింపు చేసుకునేసరికే పుణ్యకాలం కాస్తా పూర్తయి. కొత్త పాలక మండలి నియామకమవుతోంది. దీంతో కొత్తపాలక మండ లి- గత పాలకమండలి నిర్ణయాలను పక్కన బెట్టి కొత్త కార్యక్రమాలు రూపొందించడం జరుగుతోంది. ఇదంతా కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడమే తప్ప మరే ప్రయోజనం ఉండటం లేదు. గతంలోని జస్టిస్‌ పుట్టస్వామి అధ్వర్యంలోని కమిషన్‌, ఇటీవలే పదవీకాలం ముగిసిన జస్టిస్‌ సుబ్రహ్మణ్యం కమిషన్‌లు చేసిన తంతు ఇదే. ప్రస్తుతం కొత్త పాలకమండలి నియమకాన్ని చేపట్టడానికి ప్రభుత్వం యోచిస్తున్నది. అందువల్ల ఇప్పుడే బీసీ కమిషన్‌కు విశేషాధికారాలు కల్పిస్తే ఆయా వర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది.

బీసీ వర్గాలకు చెందిన నాయకులు ప్రభుత్వాధినేతలుగా ఉన్న రాష్ట్రాలలో బీసీల సమగ్రాభివృద్ధిని కాంక్షించి ‘బీసీ కమిషన్ల’ చట్టాలను మౌలికంగా మార్పు చేశారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా కమిషన్లకు విశేషాధికారాలు కల్పించిన మన రాష్ట్ర ప్రభుత్వం- ఇంతవరకు బీసీ కమిషన్‌ అధికారాలను విస్తృత పరచాలని యోచించకపోవడం విచారకరం. బీసీ కమిషన్‌ అంటే 50 శాతం జనాభాకు ప్రాతినిథ్యం వహించే చట్టబద్ధమైన సంస్థగా గుర్తించకపోవడం సవతి తల్లి ప్రేమగాక మరేమవుతుంది?జాతీయ, రాష్ట్రాల పరిథుల్లో రాజ్యాంగబద్ధ హక్కులు కల్గిఉన్న ఎస్సీ, ఎస్టీ, మహిళా, మైనారిటీ కమిషన్ల సభ్యులు- ఛైర్మన్ల నియామ కా లలో ఆయా సామాజిక రంగాలలో కృషిచేస్తున్న ప్రముఖుల్ని, సామా జిక వేత్తల ను, రాజనీతిజ్ఞలను నియమించే సంప్రదాయాన్ని కేంద్ర, రాష్ట్రాల ప్రభు త్వాలు అమలు చేస్తున్నాయి. కనుక మన రాష్ట్రప్రభుత్వం కూడా ఆ పద్ధతి చేపట్టాలి.

సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం అక్కడి బీసీ కమిషన్‌ చట్టం- 8/1993 ను 2001 నవంబర్‌ 12న సవరించి చట్టం- 10/2001 వెలువరించింది. ఈ సవరణ ద్వా రా ఛైర్మన్‌గా సామాజికవేత్త లేదా ఈ వర్గాలకోసం ఉద్యమ జీవితం గడిపిన రాజకీయ వేత్తను నియామకం చేసుకునే అవకాశం కలిగింది. సిక్కిం బీసీ కమిషన్‌ ఛైర్మన్‌కు అక్కడి ‘రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ ఛైర్మన్‌తో సమాన హోదాను ప్రభుత్వం కల్పిస్తున్నది. కమిషన్‌ సభ్యులుగా కూడా సామాజిక కార్యకర్తలను, రాజనీతి కోవిదులను నలుగురిని నియామకం చేసుకునే వీలుకలిగింది.

ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం అక్కడి బీసీ కమిషన్‌ చట్టం- 1/1996 ను 2001, 2005, 2007 లలో మూడు సార్లు సవరించి విశేషాధికారాలను కల్పించింది. ఒక ఛైర్మన్‌, ఇద్దరు వైస్‌ ఛైర్మన్లను, 17 మంది సభ్యులను నియమించుకునేందుకు వీలుగా చట్టాన్ని సవరించింది. ఛైర్మన్‌కు ‘రాష్ట్ర మంత్రి’ హోదా, వైస్‌- ఛైర్మన్‌కు ‘డిప్యూటి మంత్రి’ హోదా కల్పించింది. ఛైర్మన్‌- సభ్యులుగా సామాజిక రంగాలలో నిష్ణాతులను, ప్రముఖులను నియమించే వీలు కల్పించుకుంది. అక్కడి కమిషన్‌ బీసీ ప్రజానీకం నుండి స్వీకరించిన ఫిర్యాదులపై తీర్పు వెలువరించిన సందర్భా లలో, ‘ప్రతివాది’ కమిషన్‌ నుండి నోటీస్‌ లేదా ఆదేశం అందుకున్న 10 రోజులలో స్పందించని పక్షంలో- ఐపిసి 174, 175, 176, 178, 179 180 ప్రకారం శిక్షార్హులు. అలాగే అక్కడి సంక్షేమశాఖ అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని పర్య వేక్షించే అధికారం కమిషన్‌కు ఉంది. అమలు చేయని అధికారులను శిక్షించే అధి కారం ఉంది. బడ్జెట్‌ ప్రణాళికలను రూపొందించి ముందస్తు అంచనా ప్రతిపా దనలను ప్రభుత్వానికి నివేదిస్తుంది. సామాజిక అంశాల్లో దశాబ్దాలుగా పనిచేసిన ప్రముఖులను ఛైర్మన్‌- సభ్యులుగా నియామకం చేస్తున్నది.

కర్ణాటక ప్రభుత్వం బీసీ కమిషన్‌ చట్టం- 28/1995 ని 1997లో సవరించి అధికారాలు విస్తృత పర్చింది. ఛైర్మన్‌తో సహా ఐదుగురు సభ్యులుగా సామాజిక వేత్తను లేదా హై-కోర్టు జడ్జిని నియామకం చేయడానికి సవరించింది. అలాగే 5 గురు సభ్యులను నియమించుకునే వీలు కల్పించుకుంది. ఈ కమిషన్‌కూడా రిజర్వేషన్లను ఇతర పథకాలనుసమీక్షిస్తుంది. సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు తెన్నులను పర్యవేక్షిస్తుంది. బీసీల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై ‘సర్వే’ నివేదికలు అందచేస్తుంది. ప్రధానంగా (బీసీ) కులాల వారి గణన ప్రక్రియను శాస్రీయ పద్ధతిలో మొదలుపెట్టిన ఘనత కర్ణాటక కమిషన్‌కే దక్కుతుంది.

krushnaya
బీహర్‌ ప్రభుత్వం అక్కడి బీసీ కమిషన్‌ చట్టం- 12/1993 ను 1998లో సవరించి ఛైర్మన్‌, సభ్యులకు హోదాలను అక్కడి ‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’తో సమానంగా వర్తింపచేస్తుంది. ఛైర్మన్‌గా ‘సామాజిక శాస్త్ర వేత్త’ లేదా బీసీల సమ స్యలపై అవగాహాన ఉన్న నాయకులను, సామాజిక దృక్పథం కలిగిన రాజకీయ ప్రముఖులను నియమించుకోవడానికి వీలుంది. సూచనలు: 1.రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా ఈ సామాజిక వర్గాలకు చెందిన సామాజిక వేత్తను (లేదా) సామాజిక హక్కుల కోసం విశేషంగా పనిచేసిన రాజ నీతిజ్ఞడిని నియామకం చేయడానికి కమిషన్‌ చట్టం- 20/ 1993 ను సవరించాలి. 2. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని బీసీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, రిజర్వేషన్ల అమలును పర్యవేక్షించి, సక్రమంగా అమలు కానట్లైతే బాధ్యులపై చర్యలు చేపట్టడానికి కమిషన్‌ అధికారాలను విస్తృత పర్చాలి. 3. రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల హోదాలను ఇక్కడి మన రాష్ట్ర ‘పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ తో సమానంగా వర్తింప చేయాలి. 4.రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యుల సంఖ్యను 3 నుండి 5 కి పెంచాలి. వీరిలో ఒక ‘మహిళాప్రతినిధి’ ఉండాలి. 5. రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల పదవీకాల పరిమితిని 3 నుండి 5 సంవత్సరాలకు పెంచాలి.


రచయిత రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

Monday, October 31, 2011

అక్కరకురాని బీసీ కమిషన్ By ఆర్. కృష్ణయ్య అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం Andhra Jyothi 1/11/2011


అక్కరకురాని బీసీ కమిషన్

ప్రస్తుతం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల కాలపరిమితి ముగిసింది. గత పాలకమండలిని పునర్నియామకం చేయడానికి ప్రభుత్వం సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. కొత్తగా చైర్మన్, సభ్యులను నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలోని బీసీ కమిషన్‌కు ఏ అధికారాలు లేవు. కేవలం నామ మాత్రంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలలో బీసీ కమిషన్‌కు విశేష అధికారాలు కల్పిస్తూ ఆయా ప్రభుత్వాలు చట్టాలను సవరించాయి. ఇదే రీతిలో మన రాష్ట్ర బీసీ కమిషన్ చట్టం 20/1993ను సవరించాలి. బీసీలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా అన్ని సమస్యలలో బాసటగా నిలిచే "అపద్భాందువు''గా బీసీ కమిషన్‌ను పటిష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఈ డిమాండ్ బీసీ వర్గాలనుండి బలంగా ముందుకు వస్తుంది. అధికారాలు లేకుండా "ఆచరణ'' చేయమంటే సాధ్యమయ్యే పనికాదు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్లు రాజకీయ లబ్ధికోసం "రాజ్యాంగాన్నే'' ఇప్పటికి 95 సార్లు సవరించుకున్న మనం బీసీలకు చేదోడు-వాదోడుగా ఉండేందుకు బీసీ కమిషన్ చట్టాన్ని పలు ఆమోదయోగ్యమైన సవరణలతో ముందుకు తీసుకువెళ్ళడం అసాధ్యం ఏమికాదు. బీసీల అభివృద్ధి, రక్షణ సమగ్ర వికాసాన్ని ఆకాంక్షించిన మనదేశ అత్యున్నత న్యాయస్థానం 1993లో మండల్ కేసుగా ప్రసిద్ధిపొందిన ఇందిరాసాహ్ని వ్యాజ్యంలో వెలువరించిన తీర్పులో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఆ మేరకు జాతీయ, రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వాలు కమిషన్లు నెలకొల్పినప్పటికి ఎలాంటి అధికారాలను కల్పించకపోవడంతో 'రబ్బర్‌స్టాంప్' ఆర్గనైజేషన్లుగా రూపాంతరం చెందాయి తప్ప, ఈ సామాజిక వర్గాలకు ఇన్నాళ్ళుగా ఏ మాత్రం ఆశించినరీతిలో ప్రయోజనాలు చేకూర్చ లేదు. ఇందుకు ప్రభుత్వపరంగా బీసీ సామాజిక వర్గాల సంక్షేమంపట్ల చిత్తశుద్ధి లోపించడం ఒక కారణం అయితే ఈ వర్గాలను ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం మరొక కారణం. అంతేగాక ఈ వర్గాలకు 'అధికారం' శాసించేస్థితికి రాకపోవడం మరో ప్రధాన కారణం.

బీసీ వర్గాలకు చెందిన నాయకులు ప్రభుత్వాధినేతలుగా ఉన్న రాష్ట్రాలలో "ఈ కమిషన్ల'' చట్టాలకు మౌలిక సవరణలు చేశారు. అందుకు ఉదాహరణగా ఉత్తరప్రదేశ్, సిక్కిం, కర్నాటక, బీహార్ రాష్ట్రాలలో కమిషన్లు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఎస్.సి, ఎస్.టి, మైనార్టీ, మహిళా కమిషన్లకు విశేషాధికారాలు కల్పించి బీసీ కమిషన్‌కు అధికారాలు లేకపోవడం సహించరాని విషయం. మన రాష్ట్రం విషయానికి వస్తే బీసీల సమగ్రాభివృద్ధి కోసం యేటా రూ.2700 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తూ దేశం మొత్తానికి సంక్షేమ కార్యక్రమాల అమలులో మొదటి స్థానంలో నిలుస్తున్నాం. ఇక్కడి పథకాలు ఒక్కరోజులో వచ్చినవికావు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యలో 35 యేళ్ళుగా అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా బీసీలు దశల వారీగా సాధించుకున్నవి. ఇక్కడ అమలులో ఉన్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలులో లేవు. అయితే కళ్ళముందే సంక్షేమ పథకాలకు అధికారులు తూట్లు పొడిచే చర్యలకు ప్పాలడుతున్నప్పుడు సమగ్రంగా విచారించి చర్యలు చేపట్టడానికి ప్రత్యేకమైన చట్టబద్ధ సంస్థ అవసరం వుంది.

బీసీలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో అభివృద్ధిలోకి రావాలని రాజకీయాలకు దూరంగా ఉద్యమించి దశలవారీగా సాధించుకున్న సంక్షేమ పథకాల అమలులో అనేక అక్రమాలు-అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించడం, అమలు తీరుతెన్నులు పరిశీలించడం, ఉదాసీన వైఖరిని కట్టడి చేయడం, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవడం, సమగ్రమైన అధ్యయనాలు నిర్వహించడం, సర్వేలు చేపట్టడం, ఈ సామాజిక వర్గాల వాస్తవ జీవన స్థితిగతులను నిశితంగా పరిశీలించడం, రిజర్వేషన్ల అమలులో లోపాలను సరిదిద్దడం, సమర్థంగా అమలయ్యేలా చర్యలు చేపట్టడం, కొత్త పథకాలకు రూపకల్పన చేయడం, ఆర్థిక సంవత్సరం కోసం ఖర్చుచేయాల్సిన నిధులకుగాను ముందస్తు 'బడ్జెట్' ఇతర ప్రణాళికలు తయారు చేయడం, అవినీతికి తావులేని విధంగా బీసీ సంక్షేమ శాఖ అమలుచేసే అన్ని పథకాలు, కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో నిఘావిభాగంగా పనిచేసే ఒక 'పర్యవేక్షణ వ్యవస్థ' అవసరం. ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి, మంత్రుల స్థాయిలో పరిష్కరించడం సాధ్యమయ్యే పనికాదు.

అందుకు చట్ట ప్రకారం ఏర్పాటై ప్రత్యేకంగా ఉన్న 'రాష్ట్ర బీసీ కమిషన్'ను ఉపయోగించుకోవాల్సి ఉంది. ఈ దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్‌కు అధికారాలు పెంచుతూ పటిష్టపరచవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం మన రాష్ట్ర బీసీ కమిషన్‌కు బీసీ జాబితాలో కులాలను తొలగించడం, చేర్చడం మినహా, వేరే అధికారాలు లేవు. అలాగే ప్రభుత్వం కోరితే ఏదైనా అంశంపై నివేదికలు సమర్పించడంలాంటి పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం మేరకు కమిషన్ చైర్మన్, సభ్యులను బీసీల వాస్తవ జీవన స్థితిగతులపై ఏమాత్రం పరిజ్ఞానం లేని వారిని నియమించడం వలన 'కమిషన్' పనితీరు ఆశాజనకంగా కొనసాగడం లేదు. ప్రధానంగా చైర్మన్‌గా రిటైర్డ్ జడ్జీలను నియమిస్తుండడం వలన వయోభారంతో వీరు సరిగా పనిచేయలేక పోతున్నారు. వీరికి బీసీల పట్ల అవగాహన ఉండటం కూడా అరుదు. వీరు ఆకళింపు చేసుకునేసరికే పుణ్యకాలం కాస్తా పూర్తయి కొత్త పాలకమండలి నియామకం కావడం సాధారణ అంశంగా మారింది.

జాతీయ, రాష్ట్రాల పరిధుల్లో రాజ్యాంగబద్ధ హక్కులు కలిగి ఉన్న ఎస్.సి, ఎస్.టి, మహిళా, మైనార్టీ కమిషన్ల సభ్యులు ప్రధానంగా చైర్మన్ల నియామకాలలో ఆయా సామాజిక రంగాలలో విశేషంగా కృషిచేస్తున్న ప్రముఖుల్ని, సామాజిక వేత్తలను, రాజనీతిజ్ఞులను నియమించుకునే సంప్రదాయాన్ని కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. అలాంటప్పుడు బీసీ కమిషన్లకు ఈ వర్గాలపై పరిజ్ఞానంలేని జడ్జీలను నియమించాలనే నిబంధన సమంజసం కాదు. ఇందులో ఎలాంటి హేతుబద్దత లేదు. సాధారణంగా రిటైర్డ్ జడ్జీలు మాత్రమే చైర్మన్లుగా పనిచేయడానికి సమ్మతిస్తారు. అయితే ఈ హోదా వారికి సమాజంలో గౌరవం లభించడానికి దోహదం చేస్తుంది. కాని బీసీలకు ఏమాత్రం ప్రయోజనం లేదనే వాస్తవాన్ని ప్రభుత్వాలు గమనించాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు వేసి బీసీల సమగ్రాభివృద్ధిని కాంక్షించిన ఉత్తరప్రదేశ్, సిక్కిం, కర్ణాటక, బీహార్ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి బీసీ కమిషన్ చట్టాలను సవరించి, కమిషన్‌లకు ఆ ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను పర్యవేక్షించే విశేషాధికారాలను కల్పించాయి. చైర్మన్, సభ్యులుగా సామాజిక వేత్తలను, ఈ వర్గాల హక్కుల కోసం పనిచేసే రాజకీయ వేత్తలను నియమించుకోవడానికి వీలుగా చట్టాల్ని సవరించుకున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్‌గా ఈ సామాజిక వర్గాలకు చెందిన సామాజిక వేత్తను లేదా సామాజిక హక్కుల కోసం విశేషంగా పనిచేసిన రాజనీతిజ్ఞుడిని నియామకం చేయడానికి కమిషన్ చట్టం 20/1993ను సవరించాలి. ఇందుకు సిక్కిం, కర్ణాటక, బీహార్, యుపి బీసీ కమిషన్ చట్టాలను ఆధారంగా తీసుకోవాలి.

బీసీ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, రిజర్వేషన్ల అమలును పూర్తిస్థాయిలో పర్యవేక్షించి బాధ్యులపై చర్యలు చేపట్టడానికి కమిషన్ అధికారాలను విస్తృతపర్చాలి. అందుకు ఉత్తరప్రదేశ్ బీసీ కమిషన్ చట్టాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులను ముగ్గురినుండి, ఐదుగురికి పెంచాలి. ఇందులో ఒకరు తప్పక ఈ సామాజిక వర్గాలకు చెందిన మహిళా ప్రతినిధికి అవకాశం కల్పించాలి. అందుకు ఉత్తరప్రదేశ్, కర్నాటక బీసీ కమిషన్ చట్టాలను పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల పదవీకాల పరిమితి 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచాలి.
- ఆర్. కృష్ణయ్య
అధ్యక్షులు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం

Thursday, October 13, 2011

బీసీల అభివృద్ధికి ‘చే’యూతనివ్వాలి! By R Krishnaiah Surya News Paper Dated 13/10/2011

బీసీల అభివృద్ధికి ‘చే’యూతనివ్వాలి!
ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి చేయూతనందించవలసిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అవకాశం వచ్చిన సందర్భాలలో బీసీల విద్య, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయాభివృద్ధిపై దృష్టి పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీల అభ్యున్నతికి తోడ్పడే చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు కారణంగా పంచాయతీ రాజ్‌ సంస్థలలో బీసీ రిజర్వేషన్లను ఇప్పటికే ఉన్న 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించే ప్రయత్నం జరిగింది. అయితే బీసీ సంక్షేమ సంఘం పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సన్నాహాలు చేయడంతో ఈ రిజర్వేషన్ల తగ్గింపు ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు.

వివిధ పార్టీలలో ఉన్న బీసీ నాయకులలో కొందరు మినహా, మెజారిటీ నాయకులు తమ పదవులు ఉంటే చాలు, తమ జాతి ఏమైపోతేనేమి అనే భావనతో బీసీ లను పట్టించుకోవడం లేదు. రాజకీయ కోణంలో చూ స్తున్నారే తప్ప, మెజారిటీ ప్రజలను విద్య, ఉద్యోగ, ఆర్థిక రాజకీయ, సామాజిక రంగాలలో అభివృద్ధి చేయాలనే దిశగా ఆలోచించడం లేదు. దీనిని అలుసుగా తీసుకొని అగ్ర కుల నాయకత్వం బీసీలను అన్ని రంగాలలో తొక్కి పెడుతున్నది. గత ఎన్నికలలో బీసీలు కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇచ్చా రు. కాని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ బీసీ కులాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందేందుకు తగిన చర్యలను తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నది. బీసీలు తెగించి పోరాడకపోతే వారి ఉనికే ప్రశ్నా ర్థకమవుతుంది.

1. బీసీలకు చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అందుకు పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశ పెట్టాలని 2008లో క్యాబినెట్‌లో, అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఐనా ఆ విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి అఖిల పక్షం గాని, ప్రభుత్వం గాని కనీస ఒత్తిడి తేవడం లేదు. బీసీ ఉద్యమాల ఒత్తిడికి లొంగి తీర్మానాలు చేశారే తప్ప, వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోవ డంలేదు. ఇది బీసీలను నిర్లక్ష్యం చేయడం కాదా! 2. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును సాకుగా తీసుకొని పంచాయతీరాజ్‌ సంస్థలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతంకు తగ్గించడానికి కుట్ర చేశారు. బీసీలు ప్రతిఘటించడంతో తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టారు.ఈ సమస్య పరిష్కారం కోసం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును పెట్టడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. కాని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అందుకు పూనుకో లేదు.

3. ఎంబీబిఎస్‌ కన్వీనర్‌ కోటా బి- కేటగిరి బీసీ విద్యార్థులకు 2009 కౌన్సిలింగ్‌లో ప్రభుత్వమే ఫీజులు వసూలు చేయలేదు. జి.ఓ.నెం. 18లో ఎస్సీ, ఎస్టీలతో సమానంగా - అని స్పష్టంగా ఉండ డంతో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ కన్వీనర్‌ కోటా బి-కేటరిగి విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయలేదు. వాటిని ప్రభుత్వమే భరిస్తున్నందున, ఆర్థిక స్థోమత లేని వందలాది మంది పేద బీసీ కులాల విద్యార్థులు ఆ కేటగిరి కింద అడ్మిషన్లు తీసుకున్నారు. కానీ, బీసీ సంక్షేమ శాఖ వారికి ఫీజులు- స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయలేదు. విద్యార్థులు హైకోర్టులో కేసువేశారు. ఈ విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు లు మంజూరు చేయవలసినదేనని హైకోర్టు తీర్పుచెప్పింది. కాని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్ళాలని నిర్ణయించింది. గత సంవత్సరం చేపట్టిన ఆమరణ దీక్షా డిమాండ్లలో ఇదికూడా ఉండగా, రోశయ్య ప్రభుత్వం ఈ తీర్పుపై బీసీలకు వ్యతిరేకంగా అప్పీలుకు వెళ్ళరాదని, ఈ విద్యార్థుల ఫీజులు చెల్లించాలని జీఓ నెం. 222/ 2010 జారీచేసింది. కానీ ఆ జీఓను అమలు చేయలేదు.

4. బీసీ కులాలకు చెందిన జూనియర్‌ అడ్వకేట్లకు స్టైఫండ్‌ పెంచకుండా మూడు సంవత్సరాలుగా ఆర్థికశాఖ ఆ ఫైలును తొక్కిపెట్టింది. కానీ ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్ల స్టైఫండును మూడు సంవత్సరాల క్రితం 2008 జూన్‌ నెలలో రూ. 500 నుంచి రూ. 1000 లకు పెంచింది. ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా? ఎస్సీ, ఎస్టీ లకు పెం చిన మాదిరిగా బీసీలకు కూడా పెంచితే సంవత్సరానికి రూ. 6 లక్షల బడ్జెట్‌ అవు తుంది. బీసీ జూనియర్‌ అడ్వకేట్లకు స్టైఫండ్‌గా నెలకు రూ. 500 అని 1984లో ఈ స్కీం పెట్టినప్పుడు నిర్ణయించారు. దానిని 25 సంవత్సరాలు గడిచినా పెంచలేదు. 5. 2010 జూన్‌లో మంజూరు చేసిన 300 బీసీ కాలేజి బాలుర హాస్టళ్ళను- రెండవ విద్యాసంవత్సరం గడుస్తున్నా ఒక్కటి కూడా ప్రారంభిం చలేదు. ఈ హాస్టళ్ళలో చేరదామని వచ్చిన విద్యార్థుల భవిష్యత్తు ఏంకావాలి? అలాగే 3 సంవత్సరాల క్రితం 2008లో మంజూరయిన 300 కాలేజి బాలికల హస్టళ్ళలో ఇంకా 64 హాస్టళ్ళు ప్రారంభం కాలేదు. ఇది బీసీ వ్యతిరేక చర్య కాదా?

6. 2007 లో మంజూరైన (1) శాలివాహన (2) విశ్వబ్రహ్మణ (3) వాల్మీకి (4) మేదర (5) సగర (6) దర్జీ (7) దూదేకుల (8) కృష్ణ బలిజ/ పూసల (9) భట్రాజు తదితర 9 కులవృత్తుల ఫెడరేషన్లకు ఇంతవరకు బడ్జెట్‌ లేదు. ఈ మూడేళ్ళ కాలంలో ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదు. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధా నాల ద్వారా ప్రైవేటు రంగంలో పరిశ్రమలు రావడంతో కులవృత్తులు-చేతివృత్తుల వారు ఉపాధి కోల్పోయి విలవిలలాడుతున్నారు. రూ. లక్షా 28 వేల కోట్ల రాష్ట్ర బడ్జె ట్‌లో ఒక్కొక్క ఫెడరేషన్‌కు రూ. 5 కోట్లు ఇస్తే - ఈ కులాల ఆనందానికి అవధులే ఉండవు.7. బీసీ కార్పొరేషన్‌కు బడ్జెటు కేటాయించకుండ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది.

ఇతర రాష్ట్రాలలో రూ. 100 కోట్ల నుండి రూ. 300 కోట్ల వరకు బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్లు కేటాయిస్తున్నాయి. మన రాష్ట్రం రూ.10 కోట్లు కేటాయిస్తే, అవి సిబ్బంది జీత, భత్యాలకే సరిపోతోంది తప్ప ప్రజలకు రుణాలు ఇవ్వడానికి ఏమాత్రం చాలదు. బీసీ కార్పొరేషన్‌కు ఏటా రూ. 500 కోట్లు కేటాయిస్తే రాష్ట్రంలోని 4 కోట్ల మంది బీసీలు ఆర్థికంగా ఎదిగే అవకాశం వస్తుంది. 8. రాష్ట్రంలోని 1450 ఎస్సీ, ఎస్టీ/ బీసీ కాలేజి హాస్టళ్ళు, 5 వేలపాఠశాల హాస్ట ళ్ళు, 617 రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదివే దా దాపు10 లక్షల మంది విద్యార్థులకు గత నాలుగు సంవత్సరాలుగా మెస్‌ చార్జీలు పెంచకపోవడంతో విద్యార్థులకు నాసిరకం అన్నం పెడుతున్నారు. ధరలు పెరుగడంతో హాస్టళ్ళలో ‘మెనూ’ పాటించడం లేదు. చాలామంది హాస్టళ్ళు వదిలి వెళ్ళిపో తున్నారు.

krushnaya9.ఫీజుల రియింబర్స్‌మెంటు ఎంతో గొప్ప స్కీము. పేదకులాల వారు కూడా ఇంజనీరింగ్‌, మెడిసిన్‌, ఫార్మసీ, పీజీ కోర్సులు చదువుకుంటే ఆ కులాలు శాశ్వతంగా అభివృద్ధి చెందుతాయి. అటువంటి స్కీముకు గండి పడుతున్నది. సుప్రీంకోర్టు ఆదేశించినా, విద్యార్థులు ఉద్యమిస్తున్నా, 6 గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ఈ స్కీముకు బడ్జెటు కేటాయించడం లేదు. అవక-తవకలకు ఆస్కారం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా మంజూరు చేసే ఈ స్కీముకు 9 మంది మంత్రుల ఉపసంఘం ఎందుకు? ఈ మంత్రివర్గ ఉపసంఘం సమా వేశం జరిగిన ప్రతిసారీ బీసీ వ్యతిరేక చర్యలు తీసుకుంటోంది. స్పాట్‌ అడ్మిషన్లకు ఫీజులు-స్కాలర్‌షిప్‌లు ఎత్తివేశారు. వయోపరిమితి నిబంధన విధించారు. పీజీ కోర్సులకు ఎత్తివేయాలనిచూస్తే, బీసీఉద్యమం తిప్పికొట్టింది. నామినేటెడ్‌ పోస్టుల లో, కలెక్టర్ల నియా మకాలలో బీసీలకు వాటా దక్కడం లేదు. ఇంత జరుగుతున్నా బీసీ మంత్రులు, నాయకులు, ప్రతి పక్ష పార్టీలు నోరుమెదపడంలేదు. బీసీల అభ్యున్నతి కోసం పార్టీలకు అతీతంగా బీసీ నేతలు పోరాటం చేయకతప్పదు.
రచయిత బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు

Wednesday, September 7, 2011

సమన్యాయం పాటించకపోతే సమరమే! ----ఆర్ కృష్ణయ్య Namasethe Telangana 08/09/2011


9/7/2011 11:32:37 PM
సమన్యాయం పాటించకపోతే సమరమే!
కేంద్ర ప్రభుత్వం బీసీల సమస్యలను 64 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్నది. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు- అవకాశాలు కల్పించాల ని రాజ్యాంగంలో స్పష్టంగా ఉన్నప్పటికీ ఈ కులాల అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా అణచివేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 2900 బీసీ కులాల్లో దాదాపు 1800 కులాలు గిరిజన సంస్కృతి గల అత్యం త వెనుకబడిన కులాలు ఈ జాబితాలో ఉనాయి. ఈ కులాల అభివృద్ధికి కేంద్ర ప్రభు త్వం ఇప్పటివరకు నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోలేదు. రాజ్యాంగంలో ని 340 ఆర్టికల్ ప్రకారం 1953లో కాక కలెల్కర్ కమిషన్, 1978లో మండల్ కమిషన్లను నియమించి ఈ కులాల విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, రాజకీయస్థితి గతులను అధ్యయనం చేశారు. ఈ కులాల అభివృద్ధి కి ఈ కమిషన్లు సిఫార్సులు చేశాయి.

కానీ ఈ సిఫార్సులను అమ లు చేయడంలేదు. మండల్ కమిషన్ 40 సిఫార్సులు చేస్తే కేవలం రెండు సిఫార్సులు మాత్రమే అమలు చేశారు. మిగతా 38 సిఫార్సులు అమలుకు నోచుకోలేదు. ప్రభుత్వాల చిత్తశుద్ధి లోపించడం కారణంగా బీసీ కులాల అభివృద్ధి ఆగిపోయింది. దేశం అభివృద్ధి చెందుతోంది అంటూ.. అభివృద్ధి ఫలాల్లో బీసీలకు వాటా దక్కకుండా చేస్తున్నా రు. దేశంలోని 65 కోట్ల బీసీ కులాలను అభివృద్ధి చేయకపోతే ఈ దేశం అగ్రగామిగా ఎలా రూపుదిద్దుకుంటుంది? ఇన్నావూ్లైనా..బీసీల అభివృద్ధికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖలేదు. బడ్జెట్ కేటాయింపులు లేవు. కనీసం ఐఐటి, ఐఐఎం, కోర్సులు చదివే వారికి స్కాలర్ షిప్‌లు , ఫీజులు రియంబర్స్‌మెంట్ స్కీము లేదు. కేంద్రస్థాయిలో బీసీల అభివృద్ధికి ఎలాంటి పథకాలు లేవు.

చట్ట సభలలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2008లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అలాగే 2010లో శాసనమండలిలో తీర్మానం చేశారు. చట్ట సభలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెట్టారు. కాని బీసీలకు పెట్టలేదు. బీసీలకు పంచాయితీ రాజ్ సంస్థలలో రిజర్వేషన్లు పెట్టా రు. కానీ అసెంబ్లీ, పార్లమెంటులలో రిజర్వేషన్లు లేకపోవడంతో బీసీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే, 18 రాష్ట్రాలనుంచి ఒక్క బీసీ కూడా పార్లమెంటు సభ్యులలో లేరు. 54 శాతం ఉన్న బీసీలకు చట్టసభలలో 15 శాతం ప్రాతినిధ్యం లేదు. 2900 బీసీ కులాల్లో 2850 బీసీ కులాలు ఇంతవరకు పార్లమెంటులో ప్రవేశించలేదు. ప్రజాస్వామ్యంలో అన్ని సామాజిక వర్గాలకు పాలనలో భాగస్వామ్యం కల్పించడం ప్రజాస్వామ్య మౌలిక లక్షణం.

పేద కులాలకు భాగస్వామ్యంలేని ఈ ప్రజాస్వామ్యం ఏ వర్గాలను ఉద్ధరిస్తుంది? బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంబద్ధమైన హక్కు. రిజర్వేషన్లు లేకపోవడం మానవహక్కుల ఉల్లంఘన అవుతుంది. ఇప్పటికైనా.. బీసీలకు చట్ట సభల లో రిజర్వేషన్లు కల్పించాలి.
ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్లు 50 శాతానికి దాటరాదని తీర్పు చెప్పింది. దీంతో అనేక రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించారు. ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం కూడా ఈ ప్రయ త్నం చేసింది. బీసీలు ప్రతిఘటించడంతో తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రాజ్యాంగ సవరణ మాత్రమే. గతంలో 73-74వ రాజ్యాంగ సవరణ సందర్భంగా కూడా బీసీ రిజర్వేషన్ల పట్ల స్పష్టమై న వైఖరి తీసుకోలేదు. ఇప్పటికైనా.. జనాభా నిష్పత్తి ప్రకారం చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలి.

2008లో కేంద్రవూపభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో పెట్టినప్పుడు ఈ బిల్లునుంచి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తొలంగించారు. ఉద్యోగ ప్రమోషన్ల విషయంలో బీసీలను రిజర్వేషన్ల చట్టం నుంచి తొలగించడానికి సహేతుకమైన కారణం లేదు. కేంద్రస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో అన్ని కేటగిరిలలో కలిసి 5.3 శాతం మాత్రమే ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలు తెలుపుతున్నాయి. 2010 లో కేంద్ర ప్రభుత్వం సేకరించిన డేటా ప్రకారం కేంద్రంలో 32 లక్షల ఉద్యోగాలలో బీసీలు కేవలం లక్షా 62 వేలు మాత్రమే ఉన్నట్లు తేలింది. రాజ్యాంగబద్ధమైన మండల్ కమిషన్ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. నాచియప్పన్ కమిటీ కూడా బీసీలకు ఉద్యోగ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది.

రాజ్యాంగంలోని 340 ఆర్టికల్, రాజ్యాంగంలోని 16(4)ఎ ప్రకారం జనాభా ప్రాకారం ప్రాతినిధ్యం, ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ 64 సంవత్సరాల స్వాతం త్య్ర భారతావనిలో రాజ్యాంగ స్ఫూర్తిని బీసీలకు అమలు చేయడం లేదు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించినప్పుడే తగు న్యాయం జరుగుతుంది. కేంద్రస్థాయిలో అనేక సామాజిక వర్గాలకు, మహిళలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలున్నాయి. అలాగే.. క్రీడలకు, సాంస్కృతిక కార్యక్షికమాలకు ప్రత్యేక శాఖలున్నాయి కానీ.. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. జనాభాలో 50 శాతంగాఉన్న జనాభాకు మంత్రిత్వ శాఖ లేకపోవడం దారుణం. ఈ పరిస్థితుల్లో బీసీ వర్గాల అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అలా గే.. కేంద్ర ప్రభుత్వం 1994లో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

కానీ దానికి రాజ్యాంగబద్ధమైన అధికారాలు, హోదా కల్పించలేదు. కేంద్ర స్థాయిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా జాతీయ కమిషన్లకు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించారు. కానీ.. బీసీ కమిషన్‌కు మాత్రం ఆ హోదా కల్పించకుండా వివక్ష పాటిస్తున్నారు. దీంతో బీసీ కమిషన్ కేవలం రబ్బర్ స్టాంపులా తయారైంది. కాబట్టి బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధమైన హోదా, అధికారాలు కల్పించాలి. అలాగే.. బీసీ విద్యార్థులకు కేంద్ర స్థాయిలో అన్ని విద్యా సంస్థలలో, ఐఐటీ, ఐఐఎం లాంటి ఉన్నత స్థాయి వృత్తి విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులకు స్కాలర్ షిప్పులు మంజూరు చేయాలి. పేద కులాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వం విధించిన ఫీజులను కట్టలేక ఎందరో చదువులను మధ్యలోనే ఆపేసిన సందర్భాలు చాలా ఉన్నా యి.

కాబట్టి కేంద్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులందరికీ.. ఫీజు రీయెంబర్స్ మెంట్ ఇవ్వాలి. అలాగే.. బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకొని, రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి. ప్రజాస్వామ్యం శాంతియుతంగా సాగాలం అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా నిష్పత్తి ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో వారి వాటా వారికివ్వాలి. ఇది ప్రజాస్వామ్య డిమాండ్. సమన్యాయం పాటించపోతే.. పీడిత కులాలు ఎదురు తిరుగుతున్న ప్రపంచ చరివూతను చూస్తున్నాము. బీసీలకు న్యాయం జరుగకపోతే.. ఇక్కడ కూడా అదే జరుగుతుంది.
-ఆర్ కృష్ణయ్య
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు