Monday, June 30, 2014

అభివృద్ధి పేరిట గ్రామీణ ఉపాధికి ఎస‌రు


పేదలకిచ్చే రాయితీల మీద అభివృద్ధి నిరోధక ప్రచారకులు దాడి చేయడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు, కూలీలకు రాయితీలివ్వడం వల్లే రైతుల అభివృద్ధి ఆగిపోయిందని నమ్మించగల్గుతున్నారు. సామాజిక సమానత్వం కోసం చేసే రిజర్వేషన్లు లాంటి వాటికే పరిమితం కాకుండా, వాలంటైన్స్‌ డే జరుపుకోవడం దగ్గర నుంచి పేదలకిచ్చే రాయితీల వరకు అన్నింటికీ వ్యతిరేకంగా అగ్రవర్ణాల యువకుల్లోనే గాదు - మధ్యతరగతి కులాల యువకుల్లో కూడా ద్వేషాన్ని బిజెపి నూరిపోసింది. ఇప్పటికే అగ్రవర్ణాలు, మధ్యతరగతి కులాలు ఒకవైపు - దళితులు, పేదలు మరోవైపు చేరేలా బిజెపి అగాధాన్ని ఏర్పరచింది. మధ్య తరగతిని బలపరచి వీరి మధ్య విభజన మరింత బలపడడానికి వీలుగా ప్రయత్నిస్తున్నది. అగ్ర వర్ణాలు, మధ్యతరగతి కులాలు తన వెంట గట్టిపడాలంటే - దళితులకు వ్యతిరేకంగా వీళ్ళను రెచ్చగొట్టాలి.
                             అభివృద్ధి పేరిట పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా మధ్య తరగతిని రెచ్చగొట్టి లబ్ధిపొందే ప్రయత్నం బిజెపి ఈ ఎన్నికల్లో చేసింది. అభివృద్ధి అనే తమ నినాదానికి మధ్యతరగతేగాదు పేదలు కూడా ఆకర్షితులయ్యారని బిజెపి వాదిస్తోంది. ఏదో చిన్నచిన్న వాటితో పేదలు సంతృప్తి పడకుండా ఇంకా కొన్ని కావాలని కోరుకోవడం మంచిదే. కానీ పేదలు - అందునా దళితులు బిజెపి వైపు ఈ ఎన్నికల్లో మొగ్గారనడంలో అసలు వాస్తవం లేదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఓట్ల వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. మాయావతి వెనకున్న అగ్రవర్ణాలు ఈ ఎన్నికల్లో ఆమెను వదిలేశాయి. ఆ కొరతను పూరించడానికి ముస్లింల నుంచి తగినంత మద్దతు రాలేదు. అందువల్లే బిఎస్‌పికి సీట్లు రాలేదు. కానీ బిఎస్‌పికి ఉత్తరప్రదేశ్‌లో 20 శాతం ఓట్లు వచ్చాయి. మాయావతికి 20 శాతం ఓట్లు వచ్చాయంటే అవి దళితుల ఓట్లేనన్నది వాస్తవం. దేశం మొత్తంలోనూ, ఉత్తర భారతదేశంలోనూ - అగ్రవర్ణాలు ప్రధానంగా, మధ్యతరగతి (కులాలు) బిజెపికి ఓటు వేశాయి. బిజెపి అభివృద్ధి నినాదం వైపు ఆకర్షితులైన ఈ తరగతులు తమ అభివృద్ధికి దళితులు, వ్యవసాయ కూలీలు ఆటంకంగా ఉన్నారని ఎన్నికల్లో ప్రచారం చేశాయి. ఉపాధి హామీ పథకం వల్ల కూలీలు పనికి రావడం లేదని, దీని వల్లే వ్యవసాయం పూర్తిగా దెబ్బతిని పోతోందని ప్రచారం చేశాయి. బిజెపి అభివృద్ధి నినాదం పట్టణ-మధ్యతరగతిని, గ్రామీణ ప్రాంతాల్లో మధ్యతరగతి కులాలను బాగా ఆకర్షించింది. ఈ ఎన్నికల్లో పేదలు బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో మతోన్మాద ప్రచారాన్ని బిజెపి వినియోగించినా, అభివృద్ధి నినాదం పట్టణ మధ్యతరగతిని, గ్రామీణ ప్రాంతాల్లోని ఉన్నతవర్గాలను బాగా ఆకర్షించింది. ఈ పునాది మీదే ఆధారపడి బిజెపి ఎన్నికల ప్రచారం సాగింది. అందువల్ల పేదలకు వ్యతిరేకంగా బిజెపి మధ్య తరగతి వర్గాలను బాగా నిలబెట్టింది.
అభివృద్ధి కలను మీడియా నమ్మేట్లు చేసింది
                             గ్లోబలైజేషన్‌లో ప్రపంచీకరణను అంగీకరించే ప్రతి పార్టీ దాని ఎజెండాకు లోబడి పని చేయాల్సిందే. దేశంలో ఏ పార్టీ అయినా పెట్టుబడి రాకపోకలను ఆటంకపర్చరాదు. ఒకవేళ ఆటంకపరిస్తే ద్రవ్య పెట్టుబడి ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెట్టి పారిపోతుంది. ఇక్కడ ఉన్న బిజెపి కార్పొరేట్‌ పెట్టుబడితో లింకయి ఉన్నది. ప్రపంచీకరణతో తెగతెంపులు చేసుకోలేదు. కాబట్టి బిజెపి ద్రవ్య పెట్టుబడి ఎజెండాను తప్పక అమలు చేయాల్సి ఉంది. ఈ పని కాంగ్రెస్‌ కంటే బిజెపియే బలంగా చేయగలదని కార్పొరేట్లు నమ్మాయి. అందరికీ అన్నీ ఇచ్చా అనే 'గుజరాత్‌ నమూనా అభివృద్ది' ఒక భ్రమే అయినా దాన్నెక్కువగా కార్పొరేట్లు ముందుకు తెచ్చాయి. గుజరాత్‌ నమూనా అభివృద్ధిలో మానవాభివృద్ధి సూచిక చాలా తక్కువ స్థాయిలో ఉన్నది. ప్రత్యేకంగా అభివృద్ధి రేటు కూడా పెద్దగా ఎక్కువగా లేదు. గుజరాత్‌ కంటే బీహార్‌, తమిళనాడు వృద్ధి రేటులో ముందున్నాయి. గుజరాత్‌ అభివృద్ధి రేటు కేరళకు సమానంగా ఉంటే, కేరళ మానవాభివృద్ధి సూచిక దేశంలోనే ముందు ఉన్నది. ఈ వాస్తవాలను మరుగుపర్చి గుజరాత్‌ నమూనా అభివృద్ధి అన్న నినాదాన్ని కార్పొరేట్లు ముందుకు తెచ్చారు. గుజరాత్‌ నమూనాను ఆకాశానికెత్తడం మీడియా చేసిన పని. దీన్ని అంగీకరించడానికి కూడా చాలా మంది సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే వామ పక్షాలు తప్ప అన్ని పార్టీల ఆర్థిక విధానాలు కూడా అవే కాబట్టి. ధరల పెరుగుదల, నిరు ద్యోగం, అవినీతి లాంటి వైఫ ల్యాలకు కారణం కాంగ్రెస్‌ చేతగానితనంగా ప్రచారం చేశారు. అంతేగాని విధా నాల్లోనే లోపం ఉందని చెప్పడానికి చాలా మంది ధైర్యం చేయలేదు. సమర్థవంతమైన పాలన ఎవరు ఇవ్వగలరో, ఎవరైతే ధైర్యంగా నిర్ణయాలు చేయగలరో అలాంటి వారు కావాలనుకున్నారు. మోడీయే అందుకు తగిన వాడని మీడియా చేసిన ప్రచారం మందికెక్కింది. ఎవరైనా గుజరాత్‌ నమూనా వట్టి బూటకమని చెప్పినా నమ్మే స్థితి లేదు. కారణం మీడియా చేసిన మితిమీరిన ప్రచారమే. కానీ ఇది ఎప్పటికీ నిలిచేదిగాదు. కారణం ఇది వాస్తవం కాదు, కల మాత్రమే. అయితే మోడీ చేయబోయేది పేదలకు ఇచ్చే రాయితీలను కుదించి కార్పొరేట్లకు దోచిపెట్టడమే. పేదలకు ఇచ్చే రాయితీలే నేటి వైఫల్యాలకు కారణమని కార్పొరేట్లు ఇంత కాలం ప్రచారం చేస్తూ వచ్చారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకమే వ్యవసాయ అభివృద్ధికి ఆటంకమని భూస్వాములు, ధనిక రైతులు ప్రచారం చేస్తూ వచ్చారు. ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అవినీతి ముద్ర వేసి మధ్య తరగతి మద్దతుతో గెలిచిన బిజెపి దాన్ని నీరు గార్చే ప్రయత్నం చేపట్టింది.
మీడియా
                             హిందూత్వ శక్తులు అధికారానికి రావడానికి మీడియా పాత్ర కూడా తక్కువేంకాదు. ప్రజల్లో ప్రభావం కల్గించడానికి మీడియా (ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్‌ మీడియా) పాత్ర ఈ ఎన్నికల ఫలితాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. భారతదేశం సాధించిన ప్రగతిని ప్రసార రంగంలో చూడవచ్చు. అంతేగాదు మీడియా మన ఆధునికత యొక్క లక్షణమేగాదు, ఫలితం కూడా. ఇప్పుడు అదే ఆధునికత మన దేశంలో సాధించిన ఆధునిక ప్రగతిని వెనక్కు తిప్పడానికి వినియోగిం చబడుతోంది.
పేదల మీద దాడి
                             అన్నా హజారే అందుకున్న అవినీతి వ్యతిరేక పోరాటం ఇప్పుడు పేదలకు వ్యతిరేకంగా తిరిగింది. పేదలకిచ్చే రాయితీల మీద అభివృద్ధి నిరోధక ప్రచారకులు దాడి చేయడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులకు, కూలీలకు రాయితీలివ్వడం వల్లే రైతుల అభివృద్ధి ఆగిపోయిందని నమ్మించగల్గు తున్నారు. సామాజిక సమానత్వం కోసం చేసే రిజర్వేషన్లు లాంటి వాటికే పరిమితం కాకుండా, వాలం టైన్స్‌ డే జరుపుకోవడం దగ్గర నుంచి పేదలకిచ్చే రాయితీల వరకు అన్నింటికీ వ్యతిరేకంగా అగ్రవర్ణాల యువకుల్లోనే గాదు - మధ్యతరగతి కులాల యువకుల్లో కూడా ద్వేషాన్ని బిజెపి నూరిపోసింది. ఇప్పటికే అగ్రవర్ణాలు, మధ్యతరగతి కులాలు ఒకవైపు - దళితులు, పేదలు మరోవైపు చేరేలా బిజెపి అగాధాన్ని ఏర్పరచింది. మధ్య తరగతిని బలపరచి వీరి మధ్య విభజన మరింత బలపడడానికి వీలుగా ప్రయత్నిస్తున్నది. అగ్ర వర్ణాలు, మధ్యతరగతి కులాలు తన వెంట గట్టిపడాలంటే - దళితులకు వ్యతిరేకంగా వీళ్ళను రెచ్చగొట్టాలి. అందుకోసమే ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చి, అగ్రవర్ణాలను-మధ్యతరగతి కులాలను సంతృప్తి పరిచే కార్యక్రమం మొదలయింది. ఇది మతోన్మాదాన్ని పెంచడంతోనే ఆగిపోదు. ఈ దేశంలో గత వందేళ్ళుగా సాధించిన సామాజిక విప్లవాన్ని వెనక్కుగొట్టే ప్రయత్నానికి దారితీస్తోంది. వలసాధిపత్యానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ద్వారాను, జ్యోతిరావ్‌ఫూలె, ఇవి రామస్వామి నాయకర్‌, అంబేద్కర్‌ లాంటి వారు సాధించిన సామాజిక ఫలితాలను వెనక్కుగొట్టే ప్రయత్నం ఇందులో ఇమిడి ఉన్నది. విప్లవ ప్రతీఘాతక ప్రయత్నాలకు అవకాశం ఉంది. సామాజిక అణచివేత, దళితులను తక్కువ చేసి చూసే నీతిభాహ్యమైన చర్యలు మళ్లీ తీవ్రమయ్యే ప్రమాదం కూడా ఉంది. హిందూ సమాజంలో ప్రధానమైంది కులం. అసమానతలతో కూడిన కులదొంతరలను కూడా ఇది ప్రోత్సహిస్తోంది. కాబట్టి ఇది సామాజిక ప్రతీఘాతక విప్లవ ప్రయత్నంగా భావించవచ్చు.
హక్కుల ఆధారిత విధానం
                             ఎన్నికల్లో పరాజయం పాలవడానికి కాంగ్రెస్‌ చేసే విశ్లేషణలు, వ్యాఖ్యానాలు బిజెపి అభివృద్ధి నిరోధకత్వంతో పోటీ పడేవిగా ఉన్నాయి. ఉదాహరణకు 'హక్కులు ఆధారంగా కాంగ్రెస్‌ తీసుకున్న చర్యలే' మన పరాజయానికి కారణమని కమలనాథన్‌ ప్రకటించారు. ఉపాధి హామీ పథకం, ఆహారభద్రత లాంటి వాటి వల్ల పరాజయం కల్గిందన్నారు. 'కాంగ్రెస్‌ ఈజ్‌ మోడిఫైడ్‌' అన్నారు కొందరు. ఉపాధి పొందడం ఒక హక్కు, ఆహార భద్రత పొందడం ఒక హక్కు. వీటిని హక్కుగా గుర్తించినప్పుడు - దానికి షరతులు విధించరాదు. 'హక్కుల ఆధారంగా విధానం' అంటే హక్కులకు పరిమితులు విధించడం గాదు. ముందు వాటిని సంస్థాగతం చేయాలి. టార్గెటెడ్‌గాకుండా అంటే ఎంపిక చేసిన వారికి పరిమితం కాకుండా సార్వజనీన (యూనివర్సల్‌) ఆహార భద్రత కావాలి. ఉపాధి హామీ పథకం కూడా 100 రోజుల పనికి పరిమితం కాకుండా - పని కోరేవారందరికీ అవకాశం కల్పించేదిగా ఉండాలి. పరిమితుల విధింపు వల్ల ప్రయోజనం పొందేవారికి వ్యతిరేకంగా పొందనివారిని రెచ్చగొట్టేదానికి అవకాశం ఇస్తోంది. నయా ఉదారవాదం కూడా ఇలాంటి పరిమితులతో కూడిన రాయితీలనే అనుమతిస్తుంది. ఇది వెనకబడ్డ ప్రజానీకానికి, బాగా వెనకబడ్డ ప్రజా నీకానికి మధ్య తంపులు పెట్టడానికి దారితీస్తోంది. కాబట్టి హక్కుల ఆధారిత విధానం అలా ఉండరాదు. హక్కుగా గుర్తించిన ప్రతి అంశాన్నీ పరిమితులు లేకుండా ఉండేదిగా ఉండాలి. 'ఆహారభద్రత కానివ్వండి, ఉపాధి హామీ కానివ్వండి, వృద్ధాప్య మరియు వికలాంగుల పింఛన్లు కానివ్వండి' పరిమి తులు లేకుండా ఇలాంటి వారందరికీ పెన్షన్లు అమల య్యేదిగా ఉండాలి. ఇవి బాధితులందరికీ అందేవిగా ఉండాలి. పరిమితులు లేని ఆరోగ్య హక్కు - పరిమితులు లేని విద్యాహక్కు ఉండాలి. అప్పుడే సరుకులుగా మారిన ఆరోగ్యం, విద్య ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
- పెనుమల్లి మధు 
(వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి)

Prajashakti Telugu News Paper Dated: 27:06.2014 

నెరవేరని దళిత ఆకాంక్షలు ....మునిగిపోతున్న ఆదివాసీలు


పార్లమెంట్‌ సమావేశాలు తొలిరోజున ఉభయ సభలనుద్దేశించి రాష్టప్రతి ప్రసంగించి సభ వాయిదాపడిన తరువాత తెలంగాణ రాష్ట్ర పార్టీ సభా పక్షనాయకుడు లోక్‌సభలో పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురవుతునƒ్ని తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాం ధ్రలో కలుపడానికి ఒప్పుకోమని, ఇప్పటికే వచ్చిన ఆర్డినెన్‌‌సను చట్టంగా తీసుకువచ్చే ప్రయ త్నాలను అడ్డుకుం టామని ప్రకటించడం చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది. ఆ పార్టీకే చెందిన మరొక యం.పి. ప్రాజెక్టును మేము వ్యతిరేకిం చడంలేదు డిజైను మార్చాలని మాత్రమే డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పడం కూడా విడ్డూరంగా ఉంది. ఇలాంటి ప్రకటనలు ఆది వాసీలు నిరాశ్రయులు కావడాన్ని ఏవిధంగా ఆపలేవు.

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష కమిటి సరిహద్దుల దిగ్భంధనంతో పిలుపునిచ్చి విజయవంతం చేశారు. సాధారణంగా స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఆ ప్రాంతాలన్నీ యాధాతధంగా ఉంచడం లేదా వేరే ప్రాంతంలో కలుపడమో చేయాలి. కానీ వీరి అభిప్రాయాలను పట్టించుకోకుండా రాష్టప్రతి ఆర్డినెన్‌‌సతో ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపడం ఇక్కడి ప్రజల్ని అవమానించడమే అవుతుంది. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఎవరికి అభ్యంతరంలేదు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలో బ్రిటిష్‌ కాలం నుండి ఉన్నవి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కొంతభాగం సీమాంధ్రలోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొంతభాగం ఈప్రాజెక్టు క్రింద ముంపుకు గురవుతుంది. తెలంగాణ సీమాంధ్ర రాష్ట్రాల్లోని ప్రాంతాలు ముంపుకు గురవుతున్నప్పటికి ఎక్కువ శాతం సీమాంధ్ర సాగు, తాగునీరు కోసం ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందనేది వాస్తవం. దీనికి తెలంగాణ ప్రజలు, ్ర„పభుత్వం అభ్యంతరం చెప్పాల్సిన అవసరంలేదు. ఎందు కంటే గోదావరి నదీజలాలు వినియోగించుకోవడంలో తెలంగాణ, సీమాంధ్రలు వెనుకబడిపోయాయి. గోదావరి జలాలు సముద్రంలోకి కలిసిపోతున్నాయి. సహజ వనరులను ఉపయోగించుకోవడానికి మనుషుల మధ్య తారతమ్యం చూపించడం మానవత్వం అనిపించుకోదు. ఈ కోణంలో ప్రాజెక్టు నిర్మాణంతో సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను ప్రజావసరాలకు వాడుకోవడాన్ని ఎవరైనా హర్షించాలి. అయితే ఈ ప్రాజెక్టు ్టవల్ల ముంపునకు గురయే్య ప్రాంతాల నిష్పత్తిలో ఆ జలాలనుకూడా అదే నిష్పత్తిలో వినియోగించు కోవ డానికి ఎందుకు రూపకల్పనలు చేయలేదో ఆలోచించాలి. ఈ ప్రాజెక్టు ఇపు డున్న సీమాంధ్ర తెలంగాణలో వేర్వేరుగా అంటే సీమాంధ్ర మద్రాసు ప్రావి న్‌‌సలో, తెలంగాణ నైజాం సర్కారులో ఉన్నపుడు ప్రతిపాదనలు రూపొందిస్తే ఈ రెండు ప్రాంతాలు 1956లో ఆంధ్ర ప్రదేశ్‌గా ఏర్పడి చివరికి ఈ రెండు ప్రాంతాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయానికి ఈ డిమాండ్‌ను చేయడం సమర్థనీయం కాదు.

మన ఇల్లు కూల గొట్టి పక్కవాడికి పందిరి వేయడాన్ని ఎవరైనా సమర్థిస్తారా? కానీ తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం సమర్థించాయని చెప్పుకోవచ్చు. ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపితే ఆర్డినెన్‌‌స వచ్చినందుకు నిరసనగా బంద్‌లు చేయడం సబబే కానీ ప్రాజెక్టు రూపకల్పన నుండి నిస్తేజంగా ఉండి తెలంగాణ రాష్ట్రం రాబోతున్న సమ యంలో పార్లమెంటులో ప్రాజెక్టుకు సంబంధించి ముంపుప్రాంతాలు, నిర్వాసితులగురించి చర్చించడానికి చాలా సమయం వెచ్చించబడింది. తెలంగాణలోని ఏ పార్టీ కూడా ఇంతవరకు పై విషయంపై చర్చించాయా పరిశీలించుకోవాలి. తెలంగాణ రాష్టస్రాధన కోసమే ప్రధానంగా దృష్టి పెట్టడంవల్ల ఈ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులయ్యే ఆదివాసీల పట్ల శ్రద్ధచూపిం చలేదు. ఏడు మండలాలలోని ప్రజలు సీమాంధ్రలో కలుపడానికి సుముఖంగా ఉంటే దీనిపై చర్చ అవసరం లేదు. కానీ వారు సంపూర్ణంగా తెలంగాణలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. అంటే వారి మనోభావాలకు వ్యతిరేకంగా అటు సీమాంధ్ర ఇటు తెలంగాణ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని చెప్పాలి. ప్రాజెక్టు పూర్తిచేసే క్రమంలో ఎదురయ్యే ప్రతిబంధకాలు ఈ ఏడు మండలాల ప్రజల నుండి వస్తాయని ఆ అవరోధాలను అధిగమించేందుకు సులువుగా ఉంటుందనే ముందుచూపుతోనే సీమాంధ్ర ప్రభుత్వం ఈ మండలాల విలీ నానికి ఆర్డినెన్‌‌సపై ఒత్తిడి తెచ్చిందని అందరూ భావిస్తున్నారు. ఆ ప్రభుత్వం జాగ్రత్తను నిందించాల్సిన పనిలేదు. తెలంగాణలోనే ఉండాలని కోరుకునే ఆదివాసీల ఆకాంక్షలను పట్టించు కోకుండా నిర్లక్ష్యం వహించిన తెలంగాణ ప్రభుత్వం ఏవిధంగా ఆదివాసీల జీవితాలను గురించి శ్రద్ధ చూపించిందనేది ఆలోచించాలి. ముంపునకు గురయ్యేవారు ఎక్కడ ఉంటే ఏమిటనే ఉదాసీన వైఖరితోనే తెలంగాణ ప్రభు త్వం వ్యవహరించిందని అర్థమవుతుంది. 

ఆది వాసీల జీవన మనుగడతో మమేకమైన అడవి, కొండలు, సెలయేరులు కƒను మరుగైన తర్వాత వారి జీవనశైలి పూర్తిగా కోల్పోవడం విచారకరమైంది. ఒక తెగ లేదా వర్గం సంస్కృతి సాంప్రదాయాల స్థానంలో కొత్తది రావడం వారి ఇష్టాఇష్టాలకు అనుగుణంగా జరిగితే అది అభివృద్ధి అవుతుంది. వారి అభీ ష్టానికి వ్యతిరేకంగా జరిగితే అది విధƒ్వంసం అవుతుంది. ఈ ఏడు మండలాల లోని ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాలు జరిపే విధƒ్వంసక క్రీడలో బలౌతున్నారు. 
రామాయణ, మహాభారత కాలం నుండి దళిత, ఆదివాసీలపై వివక్ష కొనసాగుతుంది. వాలి సుగ్రీవులిద్దరు అన్మదమ్ములు రాజ సింహాసనం కోసం వారిమధ్య జరుగుతున్న అంతర్గత పోరులో రాముడు ప్రవేశించి తనను ప్రశ్నించిన వాలిని సుగ్రీవునికి అండగా నిలిచి వధించిన చరిత్ర ఉంది. స్వాభిమానంపై, ఆత్మగౌరవంపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరిగినపుడు ఆ దాడులను ఎదిరించిన ప్రతి దళిత, ఆదివాసి యోధులు రాజధర్మం పేరిట హత్యచేయబడ్డారు. ఇది లోక రక్షణకోసం చరిత్ర వ్రాయ బడినందున దళిత ఆదివాసి ప్రజలు కూడా ఈ చరిత్రను నమ్ముతున్నారు. 

వ్యక్తిస్వామ్యం అనేది ఏ రూపంలో ఉన్నా అది ప్రజా స్వామ్యా నికి తీవ్రమైన చెడుచేస్తుందని బొంబై లెజిస్లేచర్‌ సభల్లో డా బి.ఆర్‌. అంబేద్కర్‌ స్పష్టం చేశారు. ఆ సమయంలో బ్రిటిష్‌ ఇండియా ఆర్మీలో దళితులకు ప్రవేశంపై నిషేధం ఉం డడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ బొంబై ప్రావిన్‌‌సలో ఆ నిషే దం తొలగి పోయేలాగా తీవ్రప్రయత్నం చేశారు. దాని ఫలితమే భారత సైన్యంలో మహర్‌ దళం ఎన్నో వీరోచిత ఘట్టాలను నమోదుచేసింది. వేలాది కులాలున్న ఈ భారత సమాజంలో కేవలం కొన్ని కులాలు ఆనాటికి సైన్యంలో ఉండడాన్ని దళితఆదివాసీలకు ప్రవేశం లేకపోవడం ఈ దేశప్రజలకు ఇక్కడి ఆచారాలు, విలువలే కారణమౌతున్నాయని వీటిని రూపుమాపాలంటే స్వాతం త్య్రానంతరం కొత్త రాజ్యాంగం తయారు చేసుకోవాలని చెప్పిన అంబేద్కర్‌ తాను రూపొందించిన రాజ్యాంగం ద్వారా ఈ దేశంలోని వివక్షతలపై అసమాన తలపై దృష్టిపెట్టారు. దళితులను, ఆదివాసీలను రాజ్యాంగపరమైన విద్య, ఉద్యోగƒ, రాజకీయ హక్కులు కల్పించబడ్డాయి. 

ఇవి ఆ వర్గాల వ్యక్తిగత అభి వృద్ధికోసం ఎక్కువగా ఉపయోగపడితే అంబేద్కర్‌ ఆశించిన సమగ్రాభివృద్ధికి మార్గమైన రాజకీయ నిర్మాణానికి ఉపయోగపడడంలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న క్రమంలో దళితుడిని ముఖ్య మంత్రిని చేస్తానన్న ప్రకటన ఎవరూ అడుగకుండానే ప్రకటించడం జరిగింది. తీరా రాష్ట్రం ఏర్ప డ్డాక ప్రకటించిన నాయకుడే ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. అయితే దీనిపై అభ్యంతరం ఏమీలేదు. కానీ ఇందులో జరిగే విమర్శ ప్రతివిమర్శలపై చర్చ జరగడంలేదు. 20 సంవత్సరాలుగా మాదిగ హక్కులే మానవ హక్కు లంటూ ఉద్యమం చేస్తూ వారి నాయకుడు ఆ వర్గాన్ని రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో భాగస్వామ్యం పెరిగేందుకు ఉపయోగపడ్డాడు. ఆ ఉద్యమ నాయ కుడు తెలంగాణ ప్రభుత్వంపై దళిత ముఖ్యమంత్రి విషయంపై నిరసన ప్రకటిం చడం సహజం. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కాకుండా ఆ ప్రభుత్వంలో భాగమైన దళిత మంత్రులే ప్రతి స్పందించడమనేది చర్చించాలి. దళితుడిని ఏ పరిస్థితుల్లో ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేక పోయామో తెలంగాణ ముఖ్య మంత్రి చెబితే ఏగొడవలేదు. కానీ తన ప్రభుత్వంలో పనిచేసే మంత్రులతో ప్రతివిమర్శలు చేయించడం వాలీసుగ్రీవుల అంతర్గత పోరు పెట్టించినట్లుగా ఉంది. ఈ మంత్రులు తమ నాయకుడు గొప్పవాడని సమర్థిస్తే ఫరవాలేదు. కానీ దళితులకంటే మా నాయకుడు సమర్థనీయుడంటూ వారి ఆత్మగౌరవాన్ని వారే దిగజార్చుకొంటున్నారు. 

దళిత మంత్రులు, విద్యార్థి నాయకులు మాదిగ ఉద్యమ నాయకుడు మంద కృష్ణపై ప్రతివిమర్షలు చేస్తున్నారు వారు చెప్పేది ఏమిటంటే మందక్రిష్ణ వరంగల్‌ జిల్లాలోని వర్ధన్నపేట రిజర్‌‌వడ్‌ నియోజక వర్గం నుండి పోటీచేసి ప్రజల తిరస్కరణతో ఓడిపోయాడు. అతను మా గురించి మాట్లాడే అర్హత లేదంటున్నారు. ఆ నియోజకవర్గంలో డెబ్బది వేల ఓట్లు మాదిగలవి అయితే మందక్రిష్ణకు 25వేల ఓట్లు ఎలా వస్తాయనేది ప్రతివిమర్శ. తెలంగాణ ప్రభుత్వంలోని దళిత మంత్రులు టి.ఆర్‌.ఎస్‌. పార్టీతో కాకుండా వారివారి నియోజకవర్గాల్లో పోటీచేస్తే డిపాజిట్‌లు గల్లంతవుతాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మల్కాజ్‌గిరి నుండి పోటీచేసిన లోక్‌సత్తా నాయకుడు జయ ప్రకాష్‌ నారాయణ్‌ కూడా ఓడిపోయారు. అయితే ఆయన ఏ రాజకీయ నాయకుని గురించి కానీ మిగతా రాజకీయాల గురించి కానీ మాట్లాడ కూడదా? అదే మల్కాజ్‌గిరి యం.పి. స్థానంలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కూడా పోటీచేసి ఓడిపోయారు. అయితే ఆయన ఏమీ మాటాడకుండా, ఎవరినీ విమర్శించకుండా ఉండాలా? ఇలాంటి ఎంతోమంది మేధావులు, ఉద్యమ కారులు ఎన్నికల్లో ఓడిపోతారు. ఓటమిని గుర్తుచేస్తూ వారిని అవమానిం చేలాగా ప్రతి విమర్శలు చేయడం ఎవరికి సబబుకాదు. దళిత ఆదివాసి ప్రజలకు వ్యతిరేకంగా జరిగే సామాజిక వివక్షతను ప్రశ్నించడానికి ఉద్యమ సంఘాల నాయకులతోపాటు ఆయా ప్రభుత్వాల్లో ఉంటున్న దళితఆదివాసి ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా ఉద్యమిస్తేనే ఈ వర్గాలకు విముక్తి లభిస్తుంది. 

న్యాయవాది, హుజురాబాద్‌, 
కరీంనగర్‌ జిల్లా, సెల్‌: 9966677149.

Surya Telugu News Paper Dated: 12.06.2014 

ఉపాధి హామీ : విమర్శలు, వాస్తవాలు - రవికుమార్వ్యవసాయంలో ఉన్న సంక్షోభానికి ఉపాధి హామీ కారణం కాదు. ఆ సంక్షోభ పరిష్కారం భారం మొత్తం ఉపాధి హామీ పథకం మీద వేయడం సరికాదు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఒక మెరుగైన జీవనోపాధిగా చేయడానికి ఉపాధి హామీ నిధులను, పథకాన్ని తప్పనిసరిగా గరిష్ఠంగా ఉపయోగించుకోవచ్చు. ఎవరి వ్యవసాయం, ఏ రైతులు, ఏ విధమైన అనుసంధానం అన్న ప్రశ్నల మీద స్పష్టత ఉండాలి.
గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమతో కూడిన పని చేయడానికి ముందుకొచ్చే ఏ వ్యక్తికైనా, వారి కుటుంబం మొత్తానికి కలిపి ఏడాదిలో 100 రోజుల వరకు పని పొందడానికి, పనికి తగ్గ వేతనం పొందడానికి 2005 నుంచి అమలులోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం హక్కు కల్పించింది. ఈ చట్టం ద్వారా కనీస వేతనాలు, మహిళలకు సమాన వేతనాలు, వ్యవసాయ పనుల్లేని కాలంలో ఉపాధి అవకాశాలు కల్పించడంతో శ్రామికులకు అదనపు ఆదాయం ఉపాధిపై భరోసా కలిగింది. భూములుండి శ్రమ చేసేవారికి భూమి అభివృద్ధికి మొక్కల పెంపకానికి ఒక అదనపు పెట్టుబడి సమకూరింది. తద్వారా భూములు సాగులోకొచ్చి వ్యవసాయం చేసుకోవడం ద్వారా ఇంతకు ముందు కూలీలుగా ఉన్నవారు రైతులుగా ఎదిగే అవకాశం కలిగింది. మొత్తంగా శ్రమచేసే వారి బేరమాడే శక్తి పెరిగి ఆ ప్రభావం వ్యవసాయం, ఇతర ఉపాధి రంగాల్లోని వేతనాల రేట్లపై పడి వారికి మరింత లబ్ధి చేకూరింది.
ఈ చట్టం అమలుద్వారా గ్రామీణ జనాభాలో ఎక్కువ శాతం ఉన్న శ్రమ మీద ఆధారపడే కుటుంబాలలో సగానికి పైగా కుటుంబాలు (ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కలిపి 60-70 లక్షలు) ప్రయోజనం పొందగా ఈ చట్టం వల్ల కొన్ని వర్గాలకు నష్టం జరిగిందనే విమర్శ కూడా ఉంది. అందులో ముఖ్యంగా రైతులుగా పిలవబడేవారు, వారికి ప్రాతినిధ్యం వహించే సంఘాలు, ఉపాధి హామీ పథకం వల్ల వ్యవసాయానికి కూలీలు దొరకడం లేదని, ఒకవేళ లభ్యమైనా కూలీరేట్లు విపరీతంగా పెరిగిపోయాయని, దాని ఫలితంగా వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని, మొత్తంగా ఈ పథకం వల్ల వ్యవసాయరంగం నష్టపోతుందనే వాదనను ముందుకు తెచ్చారు. అంతేకాకుండా పథకం అమలులో అవినీతి చోటుచేసుకుంటుందని, పథకంలో చేపట్టిన పనులలో నాణ్యత లోపించి ఎవరికీ పనికిరానివిగా ఉన్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. సమాజంలో ఈ వర్గాల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రసార మాధ్యమాలు, మధ్యతరగతి ప్రజలు, ఎక్కువ శాతం ప్రజాప్రతినిధులు అవే వాదనలను బలపరుస్తున్నారు.

(అ) విమర్శ/అపోహ: ఈ పథకం వల్ల 'రైతులకు', వ్యవసాయానికి నష్టం జరుగుతుంది. వాస్తవం/ భిన్న కోణం: ఈ విమర్శలో ఏ రైతులు, ఎవరి వ్యవసాయం అనే స్పష్టత లేదు. ఈ పదాలు వాడటం ద్వారా అన్ని ప్రాం తాల్లోని మొత్తం రైతులు, వ్యవసాయం నష్టపోతున్న భావన కల్పిస్తున్నారు. ముందుగా అర్థం చేసుకోవలసింది రైతులందరూ ఒక్క తీరుగా లేరనే విషయం. పెద్ద రైతులు, చిన్న, సన్నకారు, మధ్యతరగతి రైతులు, కుటుంబసభ్యులు స్వయంగా కష్టపడి పనిచేసే రైతులు, పూర్తిగా కూలీల మీద ఆధారపడే రైతులు, మహిళా రైతులు, ఇలా రకరకాలుగా ఉన్నారు. అలాగే వ్యవసాయం కూడా మెట్ట, పల్లం, వర్షాధారం, కాల్వల ద్వారా, బోర్లద్వారా సాగునీరు అందే వ్యవసాయం, తిండి పంటలు అందులో మళ్లీ ఎన్నోరకాలు, పత్తి లాంటి పంటలు, పండ్ల తోటలు పెంపకం, వివిధ వాతావరణ పరిస్థితులు, భూమి స్వభావం ఇలా వ్యవసాయం పలురకాలుగా ఉంది. అన్నింటినీ అందరినీ ఒకేగాటన కట్టి వ్యవసాయానికి నష్టం అనటం అవగాహనరాహిత్యం లేదా బుద్ధిపూర్వకంగా చేసే తప్పుడుప్రచారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంఖ్యాపరంగా, పనిరోజుల పరంగానూ ఉపాధి పథకాల్లో పాల్గొన్న వారి వివరాలు చూస్తే భూమిలేని కూలీలకన్నా భూమి ఉండి శ్రమ చేసే వ్యక్తులే ఎక్కువ పాల్గొన్నట్లు స్పష్టమవుతుంది. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో అధ్యయనం చేసిన దాదాపు 160 గ్రామాల్లోని వివరాల ద్వారా ఈ విషయం స్పష్టమయింది. ఏ జిల్లాలో అయితే భూమిలేని వ్యవసాయకూలీలు అధికంగా ఉన్నారో ఆ జిల్లాలో ఉపాధి హమీ పథకంలో తక్కువ మంది పాల్గొన్నారు. ఏ జిల్లాలో అయితే ఎక్కువ మందికి భూమి ఉండి భూమి లేని వ్యవసాయ కూలీల సంఖ్య కొంచెం తక్కువుందో ఆ జిల్లాలో ఉపాధిహామీలో ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.
(ఆ) విమర్శ/ అపోహ : ఈ పథకం వల్ల వ్యవసాయానికి కూలీలు దొరకటం లేదు, వ్యవసాయ పనులున్నప్పుడు ఉపాధి పనులు పెడుతున్నారు. వాస్తవం/ మరో కోణం : సన్న, చిన్న కారు రైతులు ఉపాధి హమీలో ఎక్కువగా పాల్గొంటున్నప్పుడు వారు తమ వ్యవసాయ పనులు చేసుకుని, అనువైన, మిగిలిన రోజుల్లోనే ఉపాధిలో పాల్గొంటున్నారు. అంటే ఉపాధిహామీ వారి వ్యవసాయానికి ఏమాత్రం అడ్డంకిగా లేక మరింత తోడ్పడినప్పుడు, వ్యవసాయం వల్ల ఉపాధి హామీ పనులకు కూలీలు దొరకటం లేదనడం, వ్యవసాయం జరుగుతున్నప్పుడు ఉపాధిహామీ పథకం అమలు చేస్తున్నారనడం వాస్తవం కాదు. క్షేత్రస్థాయి అధ్యయనాల్లో తేలిందేమిటంటే 70 శాతం ఉపాధి పనిరోజులు వ్యవసాయ పనులు లేనప్పుడే జరుగుతున్నాయి. అందులోనూ ఉపాధి హామీలో సగటు 55 రోజుల నుంచి ఏ సంవత్సరం కూడా పని కల్పించలేదు. సంవత్సరానికి వందరోజులు పనిచేసిన వారి సంఖ్య 10-15 శాతం మాత్రమే. వందరోజులు పని సాధించినా కూడా భూమిలేని వ్యవసాయ కూలీలకు తమ జీవనోసాధి సాగించాలంటే మరో 200 రోజులకు పైగా పని అవసరం ఉంటుంది. అయితే ఉపాధి హమీ పథకం వచ్చిన తరువాత సన్న, చిన్నకారు కమతాలు ఉన్న కుటుంబాలు తమ స్వంత వ్యవసాయం మెరుగుపరచుకుని ఇతరుల భూముల్లో కూలీకి వెళ్లటం తగ్గించుకున్నారు.
(ఇ) విమర్శ/ అపోహ : ఈ పథకం వల్ల వ్యవసాయంలో కూలీరేట్లు పెరిగాయి. కూలీలు శ్రమ చేయకుండా పనిచౌర్యానికి పాల్పడుతున్నారు. తేలికగా డబ్బులు పొందుతున్నారు. సోమరుల్లా తయారవుతున్నారు. వాస్తవం/మరోకోణం: ఉపాధి హామీ చట్టం అమల్లోకి రాకముందు దశాబ్దాల పాటు వ్యవసాయ కూలీలకు కనీస వేతనాలు చెల్లించకుండా రైతులు/భూ యజమానులు పనులు చేయించుకుని వారి శ్రమను దోపిడీ చేశారు. ఇప్పుడు ఈ చట్టం సహాయంతో వారు కనీస వేతనాలను సాధించుకున్నారు. అయితే కనీస వేతనాలకు అదనంగా రేట్లు పెరగడం అనేది కేవలం ఉపాధి హామీ చట్టం వల్ల కాదు. శ్రమ చేసే వ్యక్తులకు వివిధ రంగాలలో అవకాశాలు పెరగటం వల్ల, విద్యావకాశాలు పెరిగి కొత్త తరం వ్యవసాయ కూలీలుగా పనిచేయడానికి ఇష్టపడక, భూ యజమానులు/రైతుల కుటంబాలలో కూడా వ్యవసాయంలో పాల్గొనే సభ్యులు తగ్గడం వల్ల శ్రమచేసే వారికి డిమాండు పెరిగి రేట్లు పెరిగాయి. ఒకే ప్రాంతంలో ఒకే రకమైన పంటలు వేయడం వల్ల ఒకేసారి అందరికీ కూలీల అవసరం ఉండటంతో 'రైతుల' మధ్య పోటీ కూడా కూలీ రేట్లు పెరగడానికి దోహదం చేసింది. ఇంతా చేసి కూలీలకిచ్చే రేట్లు వారి కనీస అవసరాలు తీర్చుకోవడానికే సరిపోతున్నాయి కానీ ఆస్తులు కూడబెట్టేంత ఏమీకాదు.
(ఈ) విమర్శ/అపోహ : ఈ పథకంలో చేపట్టిన పనులు నాణ్యతగా లేవు. వ్యవసాయానికి ఉపయోగపడేవి కావు. వాస్తవం/ మరోకోణం : ఉపాధి హామీ పథకంలో ఎక్కువగా చేపట్టిన పనులు ఉమ్మడి వనరుల (ముఖ్యంగా నీటివనరుల) అభివృద్ధి, దళిత, ఆదివాసీ, ఇతర సన్న, చిన్నకారు రైతుల వ్యక్తిగత / అసైన్డ్ భూముల అభివృద్ధి, పండ్లతోటల పెంపకం, పథకంలో లోపాలు, నాణ్యత విషయంలో మెరుగుపరచుకోవాల్సిన అంశాలు ఉన్నప్పటికీ ఈ పనులు పూర్తిగా రావనడం, నిధులు వృథా అవడం సరికాదు. ఏ విధంగా అయితే ఈ వర్గాలను వ్యవసాయదారులుగా గుర్తించడానికి ఆధిపత్య సమాజం నిరాకరిస్తుందో అదేవిధంగా వారి భూముల్లో లేదా వారికి ఉపయోగపడే పనులను కూడా పనికిరానివిగానే చూస్తుంది.

సాధారణంగా ప్రభుత్వ పథకాల అమలులో ఉండే లోపాలు ఈ పథకం అమలులోనూ ఉన్నాయి. అయితే ఆ లోపాలను భూతద్దంలో చూపిస్తూ మొత్తం పథకాన్నే పనికిరానిదిగా, వృధా ఖర్చుగా పేర్కొంటూ ఈ పథకాన్ని నిలిపివేయాలనే వాదన సరైందికాదు. అమలు ప్రక్రియలను మరింత పటిష్ఠం చేయడం ద్వారా వాటన్నింటినీ చేయవచ్చు. అమలులో లోపాల కారణంగా పథకాలను, పట్టాలను రద్దు చేసుకుంటూ పోతే రాజ్యాంగాన్ని కూడా రద్దుచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో అతి తక్కువగా అమలుకు నోచుకున్న చట్టం అదే.
వ్యవసాయంలో ఉన్న సంక్షోభానికి ఉపాధి హామీ కారణం కాదు. ఆ సంక్షోభ పరిష్కారం భారం మొత్తం ఉపాధి హామీ పథకం మీద వేయడం కూడా సరికాదు. వ్యవసాయాన్ని లాభసాటిగా ఒక మెరుగైన జీవనోపాధిగా చేయడానికి ఉపాధి హామీ నిధులను, పథకాన్ని తప్పనిసరిగా గరిష్ఠంగా ఉపయోగించుకోవచ్చు. అయితే ఎవరి వ్యవసాయం, ఏ రైతులు, ఏ విధమైన అనుసంధానం అన్న ప్రశ్నల మీద స్పష్టత ఉండాలి. ప్రస్తుతం కొన్ని వర్గాలు సూచిస్తున్నట్లుగా వ్యవసాయంతో ఉపాధి పథకాన్ని అనుసంధానిస్తే అంటే సాధారణ వ్యవసాయ పనులకు ఉపాధి నిధులను ఖర్చుచేస్తే, ప్రభుత్వ ఖర్చుతో కొన్ని వర్గాలను బలవంతంగా ఇతర వర్గాల భూముల్లో కూలీ చేయించినట్లే. వారికి వచ్చే అదనపు ఆదాయాన్ని తగ్గించడంలో పాటు, వారి గౌరవాన్ని, కూలీ బతుకుల నుంచి బయటపడదామన్న ఆకాంక్షలను చిదిమేసినట్లే. ఎంతసేపూ కూలీలుగా మారి చక్కగా పనిచేసి ఎందుకు చూపించరో?

వ్యవసాయం సంక్షోభంలో ఉంది. వ్యవసాయం చేసే వారికి తగిన ఆదాయం, భద్రత లేదు అనే విషయాలలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఈ సమస్యలకు పరిష్కారం ఉపాధి హామీ పథకం లేదా చట్టంలో లేదు. వ్యవసాయం చేయని వర్గాల చేతుల్లో భూములు ఉండటం, వ్యవసాయ కుటుంబాలలో శ్రమ చేయతగిన వ్యక్తులు తగిన సంఖ్యలో లేకపోవడం, మన పరిస్థితులకు తగిన చిన్న తరహా యాంత్రీకరణ లేకపోవడం, రైతులు విత్తనం నుంచి మందుల దాకా అన్ని అంగడిలలో అధిక ధరలకు కొనుక్కోవలసి రావడం, గ్రామ, మండలస్థాయి పరపతి సంఘాలు నిజమైన సాగుదార్ల ప్రయోజనాలు కాపాడలేకపోవడం ఇత్యాది సమస్యల వల్లే వ్యవసాయం సంక్షోభంలో ఉంది. మరి ముందు ఈ సమస్యలన్నీ పరిష్కరించాక మొత్తం వ్యవస్థలో అట్టడుగున ఉన్న కూలీల దగ్గరకు వస్తే బాగుంటుంది. పై చర్యలన్నీ చేబడితే రైతులు శ్రమచేసే కార్మికులకు తగిన వేతనాలు చెల్లించే స్థితిలో ఉంటారు. అలాగే శ్రమ చేసే వారి చేతుల్లోనే ఎక్కువ భూమి ఉంటే ఈ కూలీల కొరత సమస్య కూడా తప్పుతుంది. ఉపాధి హామీ పథకంను సమీక్షించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని ప్రభుత్వాలు మెరుగుపరచాల్సిన కొన్ని అంశాలు : యూపీఏ ప్రభుత్వం ఐదు సంవత్సరాల అమలును సమీక్షించి కొత్త మార్గదర్శకాలను 2012లో విడుదల చేసింది. వాటికనుగుణంగా పథకం అమలు ఏమేరకు మెరుగుపడిందో సమీక్షించి పథకం పారదర్శకంగా, అవినీతి రహితంగా అమలు జరిగేట్లు చర్యలు తీసుకోవాలి; ఇప్పటి వరకు నమోదైన కార్మికులలో సగం మంది, సగటున కేవలం సగంరోజులు(50) మాత్రమే ఉపాధి పొందారు. నిజంగా అవసరమైన వారందరూ ఈ పథకాన్ని తగినంత మేర అందుకోగలుగుతున్నారా? లేకపోతే కారణాలేమిటి? పని అవసరం ఉన్నవారందరూ ఈ చట్టంలో భాగంగా తగినంతగా ఉపాధి పొందడానికి ఏమి మార్పులు తీసుకురావాలో ఆలోచించాలి; ఉపాధి చట్టంలో ఇప్పటికీ పూర్తిగా సాధించలేని అడిగిన 15రోజులలో పని కల్పన, పనిచేసిన 15రోజులలో వేతనాల చెల్లింపును సాధ్యంచేసే విధంగా చట్టం అమలులో మార్పులు తీసుకురావాలి; ఉపాధి హామీలో వివిధవర్గాలు (ఆదివాసీలు, పూర్తిగా భూమిలేని వారు, సన్నకారు రైతులు, మహిళలు..) ఎంతవరకు తమ హక్కులను సాధించుకున్నారు, అందులో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అడ్డంకులు, వారి అవసరాలను గుర్తించి అందుకు తగినట్లుగా వర్గాలవారీగా ఉపాధి హామీ అమలు వ్యూహాలను, కార్యాచరణను తయారుచేసి అమలు చేయాలి.
-రవికుమార్

Andhra Jyothi Telugu News Paper Dated: July .1. 2014 

Sunday, June 29, 2014

కుట్రలకు లోనుకావద్దు By చెట్టుపల్లి మల్లికార్జున్


పిడమర్తి రవి రాసిన 'కొత్త తరుణంలో మాదిగ దండోరా' వ్యాసం(జూన్ 20)లో నిర్దిష్టత లోపించింది. వాస్తవాలను మరిచి అనేక విషయాలను ఓవర్ సింప్లిఫై చేశారు. అందులో ఒకటి ఎస్సీ వర్గీకరణ సాధనలో కృష్ణ మాదిగ నాయకత్వంలో చిత్తశుద్ధి లోపించిందని రాశారు. అదే నిజమైతే ఇరవై ఏళ్ల క్రితం 'మాదిగ' అని కులం పేరు చెప్పుకోవడానికే సిగ్గుపడిన మాదిగలు నేడు గర్వంగా మాదిగ అని చెప్పుకొనే స్థితికి వచ్చారంటే అందుకు ప్రధాన కారణం కృష్ణ మాదిగ నాయకత్వమే. వందేళ్ల దళిత ఉద్యమ చరిత్రలో ఎస్సీ వర్గీకరణకై ఎమ్మార్పీఎస్ నడిపిన పోరాటం చారిత్రాత్మకమైంది. నిజంగా కృష్ణ మాదిగ నాయకత్వంలో లోపముంటే ఇరవై ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఇంత పటిష్టంగా ఉండేది కాదు. జాతుల అస్తిత్వ ఉద్యమాలలో ఎస్సీ వర్గీకరణ డిమాండ్ న్యాయమైన, ప్రజాస్వామ్య డిమాండ్‌గా ప్రజలు గుర్తించటంతో పాటు అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టింది. వీటన్నింటికి నాయకత్వం వహించింది కృష్ణ మాదిగనే. కనుక నాయకత్వంలో చిత్త శుద్ధి లోపించిందన్నది నిరాధారమైన ఆరోపణ.
రెండోది, ఎమ్మార్పీఎస్ నుంచి క్రియాశీల, ప్రతిభావంతులైన కార్యకర్తలను బలవంతంగా సంఘం నుండి కృష్ణ మాదిగ బయటకు పంపుతున్నారనే ఆరోపణ. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నుండి పరిశీలిస్తే అకారణంగా ఏ ఒక్కరినీ కృష్ణ మాదిగ బయటకు పంపిన దాఖలాలు లేవు. గతంలో దండోరా ఉద్యమాన్ని ఎమ్మార్పీఎస్‌ను బలహీనపర్చుటకు అగ్రకుల పాలకులు రకరకాల ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేశారు. ఈ కుట్రల ఫలితంగానే నాటి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు సంస్థకు దూరమయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనూ అధికార పార్టీ ఎమ్మార్పీఎస్, కృష్ణమాదిగను బలహీన పరిచేందుకు అనేక కుట్రలు పన్నుతున్నది. ఈ కుట్రలో పావులుగా మారిన ఎమ్మార్పీఎస్ దిగువ శ్రేణి రాష్ట్ర నాయకులు గత కొద్దిరోజులుగా కృష్ణ మాదిగపై అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.
మూడోది, కృష్ణ మాదిగ ఏర్పాటు చేసిన మహాజన సోషలిస్టు పార్టీ మతతత్వ, అగ్రకుల బీజేపీ, తెలుగుదేశంతో పొత్తుపెట్టుకోవడం వల్ల మాదిగల స్వీయ రాజకీయ అస్తిత్వం తాకట్టు పెట్టబడ్డదని ఆరోపించారు. ఎమ్.ఎస్.పి. ఒక రాజకీయ పార్టీ. ఎన్నికల్లో గెలుపుకోసం వర్ధన్నపేటలో బీజేపీ, తెలుగుదేశం పార్టీలతో పొత్తుపెట్టుకుంది. ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చూడాలి. అగ్రకుల పార్టీలు పన్నిన కుట్రలో కృష్ణ మాదిగ వర్ధన్న పేటలో పరాజయం పాలయ్యారు. దీనికి ఆయన నాయకత్వాన్ని నిందిస్తే అర్థం లేదు.

- చెట్టుపల్లి మల్లికార్జున్

పాలమూరు యూనివర్సిటీ

Andhra Jyothi Telugu News Paper Dated: 25/06/2014 

Saturday, June 28, 2014

కొత్త తరుణంలో మాదిగ దండోరా By పిడమర్తి రవి


Published at: 20-06-2014 14:30 PM


మాదిగ దండోరా పోరాటం స్వతంత్ర భారత దేశంలోనే ఒక విలక్షణమైన, అత్యంత మానవీయమైన ప్రజాస్వామిక ఉద్యమం. సమాజంలో అట్టడుగు దొంతరలో ఉన్న మాదిగలకు రాష్ట్ర జనాభాలో దామాషా ప్రకారం రిజర్వేషన్ల ఫలాలు అందాలనే నినాదంతో ప్రారంభమైన ఈ దండోరా ఉద్యమానికి ఎన్నో సామాజిక విప్లవోద్యమాలను సైతం కదిలించిన చరిత్ర ఉంది. లక్షలాది మాదిగలకు ఆత్మగౌరవ స్ఫూర్తిని అందించింది. దేశంలో ఒక విలక్షణమైన పోరాట ఒరవడిని దండోరా ఉద్యమం కలిగి ఉంది. అటు సాంప్రదాయ, ఇటు విప్లవ పార్టీలలో కుల సమస్య ఒక ప్రధాన ఎజెండాగా మార్చిన చరిత్ర కేవలం మాదిగ దండోరా ఉద్యమానికి ఉంది.
దండోరా ఉద్యమం ద్వారా లక్షలాది మాదిగలు తమ అంటరాని ఆక్రందన వినిపించారు. తరాలుగా మనువాద నిచ్చెన మెట్లలో అట్టడుగు భాగాన ఉండి అంటరానివారుగా కునారిల్లిన ఈ జాతి 'మాదిగ' అనే ఒక అస్తిత్వంతో తలెత్తుకొని నిలబడి గర్జించారు. వర్గీకరణ తమ తల రాతను మార్చుతుందని గడచిన రెండు దశాబ్దాల నుంచి లక్షలాదిగా కదిలారు. రెండు దశాబ్దాల క్రితం ప్రకాశం జిల్లాలో పురుడుపోసుకున్న వర్గీకరణ లక్ష్యం ఇంకా చేరుకోలేక పోవ డం మన దురదృష్టం. కృష్ణ మాదిగ పిలుపునిచ్చిన ప్రతిసారీ కాలే కడుపులతో మండే గుండెలతో అంతులేని ఆత్మస్థైర్యంతో నగరానికి వచ్చారు. తిండీ తిప్పలు లేకుండా కుళాయి నీళ్ళతో కడుపునింపుకొని కాలినడకన లాటీలు తూటాలకు వెరవకుండా, బాష్పవాయుగోళాలను ధిక్కరించి నగరాన్ని ఎన్నోసార్లు తమ ఆకలికేకలతో ముట్టడించారు. ధర్నాలు, దిష్టిబొమ్మలు, కురుక్షేత్రాలు, ర్యాలీలు, పాదయాత్రలు, ఆమరణ నిరాహారదీక్షలు, ఆత్మాహుతి దాడులు చేశారు. ఈ క్రమంలో కొందరు మాదిగ వీరులు అమరులయ్యారు. ఇలా పిలుపిచ్చిన ప్రతిసారీ జాతి విముక్తి కోసం కష్టాలకు వెరవకుండా త్యాగాలు చేసిన మాదిగ సమాజం అలిసి పోయింది. ఇంతకాలం వాళ్ళు చేసిన పోరాటం కేవలం ఒక ప్రజాస్వామికమైన వర్గీకరణకు మాత్రమే.
మాదిగ జాతి ఉద్యమం పాలకవర్గ రాజకీయాల ఎత్తులు జిత్తులతో ఢీకొని గెలిచిందా? ఓడిందా? ఒక సుదూరమైన లక్ష్యం కోసం బయలుదేరిన దండోరా ఉద్యమం సరైన లక్ష్య దృష్టితో నడుస్తోందా? అని అనుమానం రావడం సహజం. ఒక దశాబ్దం క్రితం ఏర్పాటు చేసుకున్న మహాజన సంఘర్షణ సమితి విశాల ప్రజారాసుల కలయికతో ఒక ప్రత్యామ్నాయ ఉద్యమ వేదికగా ప్రారంభమైన నాటికి రాజకీయంగా ఒక స్థిరమైన లక్ష్యాన్ని కలిగి ఉన్నది. మన జాతి పితలు మహాత్మా జ్యోతిరావు ఫూలే, పెరియార్ తాత్విక భూమికగా తక్షణ లక్ష్యమైన వర్గీకరణతో బాటు రాజ్యాధికార సాధన కూడా లక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాము. ఇటీవల ఏర్పడిన మహాజన సోషలిస్టు పార్టీ రాజ్యాధికార సాధన కోసమే అయినప్పటికీ పాలకవర్గ మతతత్వపార్టీలతో రాజకీయ పొత్తులు పెట్టుకోవడంతో మాదిగల స్వీయ రాజకీయ అస్తిత్వం తాకట్టుపెట్టబడినది. వర్ధన్న పేట నియోజక వర్గంలో దాదాపు డెబ్భైవేల మందికి పైగా మాదిగ వోటర్లు ఉన్నప్పటికీ కృష్ణ మాదిగకు డిపాజిట్ కూడా దక్కలేదు. అంటే విశాలమైన మాదిగ జాతి కేవలం వర్గీకరణకు మాత్రమే మద్దతు ఇచ్చింది. మాదిగ జాతి ఒక రాజకీయ శక్తిగా ఎదగడం అనివార్యమైనప్పటికీ, అంత రాజకీయ చైత న్యం తమ వోట్ల ద్వారా చూపలేక పోయింది. కృష్ణ మాదిగ రాజకీయ ఎత్తుగడల్ని అగ్రవర్ణ పాలకవర్గ పార్టీలు సొమ్ము చేసుకున్నాయనేది ఒక చారిత్రక వాస్తవం. దీనికి ప్రధాన కారణం రాజకీయంగా చైతన్యం పొందిన మాదిగలు పోటీలో ఉన్న దగ్గర వారికి సొంత జాతి నుంచి మద్దతు లభించకపోవడం. మాదిగలకు వ్యతిరేకంగా అంబర్‌పేటలో ఒక మాదిగ విద్యార్థి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే మాదిగ అభ్యర్థికి కాకుండా, అగ్రవర్ణ కిషన్ రెడ్డికి ఓట్లు వేయమని సంస్థ పిలుపునివ్వడమంటే మన వేలుతో మన కన్ను పొడుచుకున్నట్లు అయింది. అంతే కాకుండా రాష్ట్రంలో చుండూరు, కారంచేడు వంటి మారణహోమాలకు బాధ్యులైన సామాజిక వర్గాలకు మాదిగలు మద్దతు ఇవ్వడంతో మాదిగజాతి కుంగిపోయింది. ఇలాంటి ఎత్తుగడల ఫలితంగా తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు పాలకవర్గ పార్టీలతో పోటీ పడలేని ఒక దౌర్భాగ్య స్థితికి నెట్టబడినారు. రాజకీయంగా పొత్తుల పేరుతో జరిగిన నష్టం మూలంగా ఎంతోమంది మాదిగ ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు, మాదిగ మేధావి వర్గంతో పాటు పౌరసమాజం కూడా మాదిగ ఉద్యమానికి దూరం అయింది. లేదా సంస్థ నుంచి కొందరు క్రియాశీల, ప్రతిభావంతులైన కార్యకర్తలు బలవంతంగా బయటికి పంపబడింది. దీనికి కారణం నాయకత్వంలో చిత్తశుద్ధి లోపించడమే. వాళ్ళు ఇప్పుడు మోసం చేయని, జాతి ఆత్మగౌరవం కాపాడే, నిజాయితీగల ఆసరా కోసం, నాయకత్వం కోసం చూస్తున్నారు.
ఇన్నేళ ్లపాటు మాదిగలు ఏ ఆకాంక్షకోసం ఉద్యమించారో ఆ ఆకాంక్షకు తూట్లు పొడిచే ఎంత గొప్ప నాయకుణ్ణి అయినా చెత్తబుట్టలో వేసి, ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి మాదిగలు నేడు సిద్ధంగా ఉన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అత్యధిక జనాభా మాదిగలు. విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాలలో 12 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణలోని మాదిగ సంఘాలు అన్నీ మరో పోరాటానికి సిద్ధం కావాలి. అధికార మార్పిడి జరిగిన ఈ తరుణంలో తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలి. అందుకోసం తగిన కార్యాచరణ రూపొందించుకోవాలి. మాదిగ విద్యార్థి, ఉద్యోగ మేధావి వర్గాలు ముందుండి పోరాడాలి. మాదిగల చిరకాల లక్ష్యమైన వర్గీకరణతో బాటు రాజ్యాధికార సాధన దిశగా మాదిగ జాతి హక్కుల కోసం బోధించు, సమీకరించు, పోరాడు అనే మహనీయుల నినాదాల స్ఫూర్తితో అందరూ ఏక మై విస్తృత పోరాటాలకు సంసిద్ధం కావాల్సిన తరుణం ఆసన్నమైంది.
పిడమర్తి రవి
తెలంగాణ మాదిగ జేఏసీ

Andhra Jyothi Telugu News Paper Dated: 20th June 2014 

Thursday, June 19, 2014

కేజీ టు పీజీ ఇంగ్లీష్ విద్య - కంచ ఐలయ్య


Published at: 18-06-2014 05:37 AM
విద్యారంగాన్ని ఒక క్రియాశీల, శాస్త్రీయ రంగంగా రూపొందించాలంటే ప్రభుత్వరంగం పెరిగి ప్రయివేటు రంగం తరగాలి. పిల్లలు ఇంగ్లీషు, తెలుగు భాషలే కాక శ్రమ గౌరవ పాఠాల్ని అన్ని స్థాయిల్లో నేర్చుకోవలసిన అవసరముంది.... నాకు తెలిసి కాశ్మీర్ తరువాత తెలంగాణ రాష్ట్రమే ఇంగ్లీషు విద్యను ప్రోత్సహిస్తున్న రాష్ట్రం అవుతుంది. అందుకే దానికి మద్దతివ్వాలి. అందరం కలిసి మన పిల్లల భవిష్యత్తును మార్చాలి.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో కేజీ టు పీజీ వరకు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన ఉంటుందని గవర్నర్ ప్రసంగంలో తేల్చి చెప్పడం హర్షించదగ్గ నిర్ణయం. అన్నిరంగాల్లో కంటే తెలంగాణ ప్రాంతం విద్యారంగంలో వెనుకబడి ఉందన్న విషయం తెలిసిందే. అందులో ఈ ప్రాంతంలో ప్రజల భాష తెలుగు, పాలక భాష చాలాకాలం ఉర్దూ ఉండడం, ఇంగ్లీషు విద్యాప్రభావం చాలా తక్కువ ఉండడం వల్ల విద్యారంగంలో బాగా వెనుకబడి పోయింది. అందుకుతోడు ఇక్కడి ఫ్యూడల్ వ్యవస్థ విద్యారంగాన్ని ఎప్పుడూ వ్యతిరేకిస్తూ వచ్చింది.
ఈ ప్రాంతంలో వచ్చిన కమ్యూనిస్టు ఉద్యమాలు కూడా విద్యారంగాన్ని బూర్జువా విద్యారంగంగా పరిగణిస్తూ విద్యార్థులను ఉద్యమాల్లోకి దింపడానికే ప్రాధాన్యం ఇచ్చాయి కానీ, విద్య నేర్పడం కూడా ఒక ఉద్యమమేనని వాళ్ళెన్నడూ భావించలేదు. ఇక 1969 నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యమాలు, బైకాట్లు, బళ్ళు ఎగ్గొట్టడం సంగతి తెలిసిందే.
ఇప్పుడు మొదట సాధించాల్సింది, విద్యారంగంలో రెగ్యులారిటీ. టైమ్‌కు టీచర్లను, విద్యార్థులను క్లాసురూముల్లో ఉంచగలగడం. విద్యారంగంలో క్వాలిటీ, క్వాంటిటీ నుంచే వస్తుంది. క్లాసురూముల్లో చెప్పవలసినంత చదువు టీచర్లు చెప్పి నేర్చుకోవలసినంత చదువు పిల్లలందరూ నేర్చుకుంటే వీరి నుంచే క్వాలిటేటివ్ మెదళ్ళు పుట్టుకొస్తాయి. చాలా క్రియేటివ్ మెదళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచే వస్తాయనేది కూడా టైమ్ టెస్టెడ్ సత్యం. ఈ విద్యారంగాన్ని ఎల్‌కేజీ నుంచి ఇంగ్లీషు మీడియంలోకి మార్చి గ్రామానికి రెండు మూడు (జన సంఖ్యను బట్టి) కిండర్ గార్టెన్ పాఠశాలలను తెరవాలి. ప్రతి దళితవాడకు, లంబాడీ తండాకు తప్పక ఒక కిండర్ గార్టెన్ అవసరం. ఈ ప్రీ-స్కూళ్ళలో 3వ ఏడు నుంచి 6వ ఏడు వరకు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కంపోనెంట్ ప్లాన్ నుంచి వారికి మంచి బట్టలు, పాలు, పండ్లు, మంచి తిండి పెట్టే ఏర్పాట్లు చెయ్యాలి. ప్రతి స్కూలుకు ఇద్దరు ఆడ టీచర్లు, ఒక ఆయా ఆ పసిపిల్లల మెదళ్ళను, శరీరాన్ని పోషించాలి. ఆడిపించాలి. అప్పుడు వాళ్ళు పట్టణాల్లోని జీ స్కూళ్ళు, లేదా బచ్‌పన్ స్కూళ్ళ పిల్లల కంటే తెలివైన వారుగా ఎదుగుతారు. ఎందుకు? వారికి ఊరు కొన్ని విషయాలను అదనంగా నేర్పుతుంది.
ఒకటవ తరగతి నుంచి ఈ పిల్లలంతా ప్రభుత్వం చెప్పే ఎన్‌సీఆర్‌టీఈ సిలబస్ కలిగిన ఇంగ్లీషు మీడియం స్కూలుకు పోవాలి. రాష్ట్రానికి సంబంధించిన ఒక కోర్సు అదనంగా పెట్టుకోవచ్చు. 1 నుంచి 6 వరకు ఈ పిల్లలంతా తమ ఊళ్ళోనే చదవాలి. స్కూల్ టీచర్ల పిల్లలు కూడా అదే స్కూల్లో చదవడం చాలా అవసరం.

ప్రతి మండల కేంద్రంలో 7 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వం ప్రామిస్ చేసిన ఎన్‌సీఆర్‌టీఈ సిలబస్‌లో చదువుకున్నప్పుడు ఒక నూతన 'విజ్ఞాన పంట' 20 ఏళ్ల తరువాత బయటికొస్తుంది. ఈ కోర్సు మొత్తంగా ఎల్‌కేజీ నుంచి 12వ తరగతి వరకు తెలుగు ఒక సబ్జెక్టుగా ఉండాలి. మంచి జ్ఞానం ఉండి మౌలిక తెలుగు ఉంటే బ్రహ్మాండమైన రచయితలు, ఆ భాషలో కూడా పుట్టుకొస్తారు. రాష్ట్రం విడిపోవడం వల్ల జరిగిన ఒక మంచేమిటంటే ఆ ప్రాంతపు 'పంచెకట్టు పండిత వర్గం' తలనొప్పి పోయింది. చాంధసపు ఆంధ్ర భాషా పాండిత్యం ఈ రాష్ట్రానికి అసలు అవసరమే లేదు. వారితో పాటు నారాయణ, శ్రీచైతన్య బిచానాలను మొత్తం ఎత్తెయ్యాలి. ఇంటర్ మీడియట్ కాలేజీలన్నిటినీ మూసేసి ప్రతి పిల్ల/పిల్లవాడు 12వ తరగతి వరకు తప్పకుండా చదువుకునే విధానాన్ని రూపొందించాల్సి ఉంది.
అక్కడి నుంచి ఉన్నత విద్యలోకి పోయే పిల్లలు ధనవంతులు సొంత డబ్బులతో, బీదలు ప్రభుత్వ ఖర్చుతో చదువుకునే విధానం రూపొందించుకోవాలి. ఉన్నత విద్య ఇంగ్లీషులోనే ఉండాలనేది అనుమానం లేని విషయం. ఇప్పటికీ చాలావరకు ఈ విద్య ఇంగ్లీషులోనే ఉన్నది. కానీ మన యూనివర్సిటీ వ్యవస్థను బాగా మార్చాల్సి ఉంటుంది. ఈ దశలో కొంత కాలం బయటి నుంచి టాలెంట్‌ను తెచ్చుకోక తప్పకపోవచ్చు. ఇప్పుడున్న ఉన్నత విద్య చదువు విద్యగా కాక, మార్కుల విద్యగా మాత్రమే ఉన్నది. స్కూళ్ళ నుంచి స్టాండర్డ్స్ పెరిగితే తప్ప ఉన్నత విద్యలో స్టాండర్డ్స్ పెరుగవు. కానీ ఇక్కడ కూడా ఉన్నత విద్యా ప్రమాణాలను పాటించకుండా అవి మారవు.
వైస్ చాన్స్‌లర్ల అపాయింట్‌మెంట్, ప్రొఫెసర్ల రిక్రూట్‌మెంట్ విధానాన్ని పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు యూనివర్సిటీల్లో టీచింగ్, లెర్నింగ్ మొత్తంగా పడిపోయి ఉంది. దాన్ని గాడిన పెట్టడమే ఒక పెద్ద సమస్య.. డబ్బులకు వీసీ పోస్టులు అమ్మే విధానం ఉన్నంత వరకూ ఈ వ్యవస్థను మార్చడం అసలు సాధ్యం కాదు.
ఇప్పుడున్న స్థితిలో రిజర్వేషన్, జనరల్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ స్టాండర్డ్స్‌లో ఏమీ తేడా లేదు. అందులో కొంత మంది తెలివైన వాళ్ళు లేరా అంటే ఉన్నారు. కానీ ఓవరాల్‌గా చూసినప్పుడు అన్ని ఆ గంపలోని పండ్లే కనుక ఒక రిఫామ్ డ్రైవ్ అవసరమవుతుంది.

ఉద్యమ కాలానికి, స్వయం పాలనా కాలానికి వెంటనే గీత పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ పై నుంచి వచ్చే అపాయింట్ మెంటులలో మార్పు కనిపించాలి. ఇక్కడ పైసలు పదవి తేవు, చదువు మాత్రమే తెస్తుంది అనే ఒక మెసేజ్ పోవాలి కదా! గత చాలా కాలంగా పదవుల అమ్మకం జరిగిందని తెలిసిందే. విశ్వవిద్యాలయాల వీసీ పదవులను మెరిట్‌పైన, వారికి వ్యవస్థను నడిపే స్వేచ్ఛతో ఇస్తే తప్ప మార్పు సాధ్యం కాదు.
ఈ ఎకడమిక్ సంవత్సరం నుంచి అన్ని మార్పులు రావాలని ఎవరూ అనుకోరు. కానీ ఇప్పుడు అమలులో ఉన్న అంగడివాడి వ్యవస్థను మార్చి గ్రామాల్లో రెండు గదుల కిండర్ గార్టెన్ ప్రీ-స్కూళ్ళను నిర్మించి ఇప్పుడున్న అంగన్‌వాడీ టీచర్స్‌తో పాటు ప్రతి స్కూలుకు మరో టీచర్‌ను కలిపి సరైన పద్ధతుల్లో మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఆధునిక పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలి. ఇక్కడ పిల్లలకు నేర్పించే విద్యావిత్తనాలే జీవితాంతం పనిచేస్తాయి. ముఖ్యంగా ఈ దశలో పిల్లల శరీరం, మెదడు పెరగడానికి మంచి తిండి పెట్టాలి. కూలి నాలి జనం పిల్లల్ని చూసుకునే భారం నుంచి తప్పించాలి. ఈ విధంగా మూడవ ఏడు నుంచి 18వ ఏడు వరకు ఇంగ్లీషు, తెలుగు భాషల్ని ఒక పద్ధతి ప్రకారం నేర్పడం వల్ల పిల్లల అభివృద్ధిలో ముందు గణనీయమైన మార్పు వస్తుంది. ఈ విధంగా స్కూలు విద్యను ఒక గాడిలో పెట్టాక అన్ని రకాల ఎంట్రెన్సులను, ప్రయివేటు కోచింగ్ సెంటర్లను రద్దు చెయ్యాలి. శ్రీచైతన్య, నారాయణ, చుక్కా రామయ్య కోచింగ్ సెంటర్లలో చదివిన పిల్లలు దేశ ప్రయోజనానికి ఉపయోగపడే దాఖలాలు లేవు.
అందుకు భిన్న ఆట పాటలు సంస్థల్లో పిల్లల్ని చేర్చి వారిని బట్టీ మాస్టర్లుగా మార్చాక రెండు నష్టాలు వస్తున్నాయి. ఈ సంస్థల్లో చదివిన పిల్లల ఆరోగ్యాలు తరువాత దారుణంగా ఉంటున్నాయి. వాళ్ళు ఎటువంటి శారీరక వ్యాయామాల్ని నేర్చుకోవడం లేదు. కీలకమైన శరీర, మెదడు పెరిగే దశలో వారిని రాత్రింబవళ్ళు బందీఖానాల్లో పెట్టి కేవలం పాఠ్యపుస్తకాలు బట్టీ పట్టిస్తున్నారు. అటు తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. మొత్తం కోచింగ్ వ్యవస్థను రద్దుచేసి వారి సహజ మెరిట్‌పైనే అన్ని స్థాయిల అడ్మిషన్లు ఉండే విధంగా చూడాలి.
దేశంలో ఏ ఎంట్రెన్స్ లేకుండా అడ్మిషన్లు ఇచ్చే ఢిల్లీ యూనివర్సిటీలో స్టాండర్డ్స్ మిగతా యూనివర్సిటీల కన్నా బెటర్ అని తేలింది. విద్యార్థులు నిరంతరం బట్టీ యుద్ధం నుంచి బయటపడి సెలవుల్లోనైనా ఆట, పాట, పని చెయ్యగలిగే సమయం ఉండడం అవసరం. పూర్తిగా రెసిడెన్షియల్ కాలేజీల్లో చదివిన పిల్లలకు సమాజం, జీవన సంఘర్షణ అసలు అర్థంకాదు. విద్యార్థుల మెదడును రాకడం మంచిది కాదు. దాన్ని క్రియాశీలకంగా ఎదగనివ్వాలి.

కార్పొరేట్ విద్యావిధానాన్ని ఆంధ్ర పెట్టుబడిదారుల్లో ఒక వర్గం ప్రవేశపెట్టింది. ఈ విద్యా విధానం తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా వ్యాపించి ఉన్నది. అందులో తెలంగాణ వ్యాపారవేత్తలు కూడా చేరారు. ఈ వ్యాపార వేత్తలే యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్స్‌ను కంట్రోల్ చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఈ విద్యా వ్యాపారులను చంద్రబాబు నాయుడు కూడా బాగా ప్రమోట్ చేశారు. తరువాత అందరూ ఆ వ్యాపారుల మీద ఆధారపడ్డారు. ఇప్పుడు ఏకంగా విద్యా వ్యాపారి నారాయణను చంద్రబాబు నాయుడు మంత్రినే చేశారు. తెలంగాణలో మల్లారెడ్డిని ఎంపీని చేశారు. ఈ విద్యా వ్యాపారానికి ఎక్కడో ఒక చోట పుల్‌స్టాప్ పెట్టాల్సిన అవసరముంది. ఈ విద్యా వ్యాపారమే స్టాండర్డ్స్‌ని, విద్యా విలువల్ని సర్వనాశనం చేసింది. ఒకప్పుడు విదేశాల నుంచి వచ్చిన మిషనరీలు విద్యా, వైద్య సంస్థల్ని సేవా సంస్థలుగా ఉపయోగిస్తే ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో ఇక్కడి ధనవంతులు ఆ రెండు రంగాల్ని అవినీతిమయమైన వ్యాపారంగా మార్చారు. తెలంగాణ వంటి కొత్త రాష్ట్రం ప్రయివేటు విద్యారంగాన్ని బాగా మార్చాల్సి ఉంది. విద్యారంగాన్ని ఒక క్రియాశీల, శాస్త్రీయ రంగంగా రూపొందించాలంటే ప్రభుత్వరంగం పెరిగి ప్రయివేటు రంగం తరగాలి. పిల్లలు ఇంగ్లీషు, తెలుగు భాషలే కాక శ్రమ గౌరవ పాఠాల్ని అన్ని స్థాయిల్లో నేర్చుకోవలసిన అవసరముంది.
మనదేశంలో చదువు ప్రజల్ని పనికి దూరం చేస్తున్నది. ఇక్కడ కుల వ్యవస్థ శ్రమ అగౌరవాన్ని బాగా పెంచింది. నాగలి దున్నేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, పశువులు కాసేవాళ్ళు, విత్తనాలేసేవాళ్ళు, పంట కోసేవాళ్ళు అగౌరవానికి, అవమానానికి గురై, సోమరిపోతులు, తిండిబోతులు గౌరవించబడుతున్నారు. అందుకే పిల్లలు వరల్డ్ క్లాస్ విద్యతో పాటు ఉత్పత్తి శ్రమలో భాగస్వాములు కావాలి. గ్రామాల్లో తమ తల్లిదండ్రులు చేసే ఉత్పత్తి, పరిశుభ్ర పని పట్ల ఆ ఇంట్లోని పిల్లలు గౌరవంగా పాల్గొనాలి. దాన్ని అవమానపరిచిన వారిని ఎదుర్కోగలగాలి. ఇదొక పోరాట రూపం.
ఇప్పుడున్న ఎన్‌సీఆర్‌టీఈ సిలబస్‌లో కూడా శ్రమ గౌరవ పాఠాలు లేవు. రాష్ట్ర స్థాయిలో వాటిని చేర్చుకోవాలి. గ్రామీణ వ్యవస్థను ప్రతిబింబించే పదకోశాన్ని ఇంగ్లీషులో కూడా రూపొందించుకోవాలి. ఇది అంత కష్టమైన పనేమీ కాదు. నాకు తెలిసి కాశ్మీర్ తరువాత తెలంగాణ రాష్ట్రమే ఇంగ్లీషు విద్యను ప్రోత్సహిస్తున్న రాష్ట్రం అవుతుంది. అందుకే దానికి మద్దతివ్వాలి. అందరం కలిసి మన పిల్లల భవిష్యత్తును మార్చాలి.
- కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi Telugu News Paper Dated: 18/06/2014 

Friday, June 6, 2014

ఆత్మహత్యే ఆకాంక్షగా.. - కంచ ఐలయ్య


Published at: 05-06-2014 00:17 AM
ముందు, ముందు కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరక్కపోయినా, స్కూళ్ళు కాలేజీలు సరిగా నడువకపోయినా రాష్ట్ర ఉనికే వాస్తు ప్రకారం లేదంటే అందరూ నమ్మే పరిస్థితి ఉన్నది. ఈ మొత్తం ప్రక్రియ సమాజాన్ని క్రమంగా ఆత్మహత్య భావంలోకి నెడుతుంది. ఆత్మహత్యే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు, గుంపుల్ని, సంస్థల్ని హేతువు ద్వారా బాగుచెయ్యడం అంత సులభమైన పనికాదు.
గత కొంత కాలంగా దేశమంతటా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. సమైక్యాంధ్రప్రదేశ్‌లో అదే మోస్తరులో ఆత్మహత్యలు పెరిగాయి. తెలంగాణలో అవి మరీ పెరిగాయి. ఈ పరిణామక్రమంలో కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల్లోనూ, దేశమంతటా కాంగ్రెస్ ఆత్మహత్యే ఒక ఆకాంక్షగా పనిచేసింది. ఇవి దాదాపు ఆత్మహత్య రోజులేమో అనిపిస్తుంది.
ఒక వ్యక్తి గానీ, సంస్థ గానీ, పార్టీ గానీ ఆత్మహత్యను ఒక ఆకాంక్షగా మలుచుకున్నప్పుడు వారిని/వాటిని ఎవరూ కాపాడలేరు. మన దేశంలో కాకపోయినా ప్రపంచంలో చాలా గొప్ప తత్వవేత్తలు ముందు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకొని, వివిధ కారణాల వల్ల చేసుకోలేక బతికి బయటపడి ఆ ప్రయత్న అనుభవాల గురించి రాశారు. ఆత్మహత్యకు సిద్ధపడ్డవాళ్ళు నిరంతరం అదే తమ లక్ష్యంగా జీవిస్తారట. ఎలా ఆత్మహత్య చేసుకోవాలో ఆలోచిస్తుంటారట.. పద్ధతులపై ప్లాన్లు వేసుకుంటూ ఉంటారట.

ఆత్మహత్య ఒక పిరికి వ్యక్తి, సంస్థ లేదా సమాజం పని అయినప్పటికీ పిరికితనాన్నంతా కూడగట్టి అది ఆత్మహత్య చేసుకునే ధైర్యంగా మారాక తమను తాము అంతం చేసుకుంటారు. ఆత్మహత్య ఆకాంక్ష, అందరిలో అన్ని వేళల్లో ఉండే జీవన ప్రక్రియ కాదు. అది కొందరిలో, కొన్ని సందర్భాలలో కారణాలు ఉన్నా లేకున్నా ఒక ప్రక్రియగా రూపొందుతుంది. ఉదాహరణకు తెలంగాణలో గత నాలుగేళ్లలో వ్యక్తులు చేసుకున్న ఆత్మహత్యలు ఏ హేతుబద్దతకూ అందనటువంటివి. ఆత్మహత్యకు హేతువుకు సంబంధం ఉండదు. అదొక ప్రత్యేక ఆలోచనా ప్రక్రియ. ఈ విధమైన వ్యక్తుల ఆత్మహత్యలను అరికట్టడానికి ఏం చెయ్యాలనేది ఒక అంశం.
కానీ సంఘాలు, సంస్థలు, పార్టీలు ఆత్మహత్య ఒక ఆకాంక్షగా పనిచెయ్యడం మొదటిసారి కేంద్రంలోనూ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోనూ మనం చూశాం. ఈ ఎన్నికల్లో బీజేపీ దేశ స్థాయిలో కాంగ్రెస్‌ను హత్య చెయ్యలేదు. అది స్వయంగా ఆత్మహత్య ప్రక్రియలోకి దిగింది. అది మిగతా కారణాలతో పాటు రాష్ట్ర విభజన ప్రక్రియను ఒక ఆత్మహత్య పద్ధతిగా ఎన్నుకున్నది. 2009 డిసెంబర్‌లో విభజన ప్రకటనతో వ్యక్తుల ఆత్మహత్యలు మొదలై 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆత్మహత్యతో ఆ ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది.
ఒక రాష్ట్ర విభజన పాలసీ నిర్ణయం కాదు. ఆ నిర్ణయాన్ని ఒక ఎన్నికల అంశంగా దేశం ముందు పెట్టి ఎన్నికల ప్రక్రియను తన వైపునకు మలుపుకోగలిగే ప్రక్రియ కాదు. అయినా ప్రతిపక్ష బీజేపీ 2013 ఆగస్టు 11న హైదరాబాద్‌లో నరేంద్ర మోదీ మొదటి ప్రచార సభ నిర్వహించ తలపెడితే జూలై 30న కాంగ్రెసు తన విభజన విధానాన్ని ప్రకటించింది. అప్పటి నుంచి మార్చిలో ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీలను ప్రకటించేంత వరకు కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ బిల్లు పాస్ చేయించడం కోసం నానా కష్టాలు పడ్డది. తనకు స్వంత మెజార్టీ లేదని తెలిసి బీజేపీ ముందు మోకరిల్లి, వెంకయ్యనాయుడు ఇంటి చుట్టూ మంత్రులను తిప్పి పరువు పోగొట్టుకొని లోక్‌సభలో, రాజ్యసభలో బిల్లు పాస్ చేయించింది.
ఈ క్రమమంతా కూడా బీజేపీ నరేంద్ర మోదీ ఎన్నికల సభలు జరుపుతూనే పోయింది. కాంగ్రెస్ నాయకత్వం దేశంలో ఎన్నికల సభలు జరుపుకొని తమ ప్రచారం ప్రారంభించే బదులు టీఆర్ఎస్‌ను తమలో విలీనం చేసుకునే పనిలో తలమునకలై కాలాన్నంతా వృధా చేసుకున్నారు. ఎన్నికల ముందు రాష్ట్రం విడిపోయాక రాష్ట్ర సాధన కోసం పుట్టామని చెప్పే పార్టీకి లబ్ధి పొందే అవకాశం ఎక్కువ ఉంటుందని కనీసం ఆలోచన కూడా కాంగ్రెస్‌కు లేకపోయింది. ఈ ప్రక్రియతో సీమాంధ్రలో జీవితాంతం కోలుకోకుండా పోతే తెలంగాణలో చాలా కాలం వరకూ కోలుకోలేని స్థితిలో అది పడ్డది.
ఏ రాజకీయ పార్టీ గానీ 10 సంవత్సరాలు పరిపాలించాక, తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలకు ఇంకా ఏం మంచి చేయబోతున్నారో చెప్పడానికి కావలసిన కొత్త నినాదాలను రూపొందించుకోవాలి. కానీ కాంగ్రెస్ కనీసం తను పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన స్కీముల గురించి చెప్పుకోలేక పోయింది. కేంద్రంలో పదేళ్లు మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు తమ, తమ రాష్ట్రాల్లో నాయకులుగా చలామణి కాలేని పరిస్థితిలో పడ్డారు. ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి భయపడే పరిస్థితిలో పడ్డారు. తెలంగాణలోనే చూడండి. ఇక్కడి నుంచి కేంద్రంలో సీనియర్ మంత్రిగా ఉన్న జైపాల్‌రెడ్డి తన నియోజకవర్గం బయట ఒక్క మీటింగ్ పెట్టి తాము రాష్ట్రం ఎలా సాధించామో చెప్పిన దాఖలాలు లేవు. సామాజిక తెలంగాణ ఒక అంశంగా ఉన్న ప్రాంతం కనుక పార్టీ నాయకత్వంలో ఒక బీసీ, ఒక ఎస్సీ నాయకునికి ప్రధాన పదవులిచ్చారని రెడ్డి సామాజికవర్గం మొత్తం టీఆర్ఎస్ పక్షం చేరితే సమాజ మార్పు ఒక పరిణామక్రమమని జైపాల్‌రెడ్డి వంటి నాయకులుకూడా వారికి నచ్చచెప్పిన దాఖలాలు లేవు. తమ పార్టీని తాము చంపుకోవడానికి సిద్ధపడ్డారు గానీ కొత్త నాయకత్వాన్ని గౌరవిద్దామనే ఆలోచన ఎక్కడా కనబడలేదు. తెలంగాణలో ఇతర కులాల అభివృద్ధి చూడలేక ఇక్కడి రెడ్లు తమ రాజకీయ ఆత్మహత్యకు సిద్ధపడ్డారు.
బీజేపీలో బీసీ సమాజం నుంచి వచ్చిన నరేంద్ర మోదీ అక్కడి అగ్రకుల నాయకులను పక్కనపెట్టి ఎదుగుతున్నప్పుడు ఆయన ప్రధానమంత్రి కాకుండా చూడాలని ఆ పార్టీలోని నాయకులు చాలా మంది ప్రయత్నించారు. కుల రాజకీయాలకు అలవాటు పడ్డ యూపీ, బీహార్ రాష్ట్రాల్లో బీసీలు మోదీని గట్టెక్కించారు. ఇదొక యాక్సిడెంటల్ గెలుపు. భారతదేశంలో తమకు అలవాటు లేని తిండి తినే దానికంటే చావడం మేలు అనుకునే కుల విలువలు ఉన్నాయి. ఈ విలువలు ఎన్నో హత్యలకు, ఆత్మహత్యలకు కారణాలౌతున్నాయి.
కొత్తగా ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాజీవితం ఎలా ఉం టుందని ఇప్పుడే చెప్పలేం. ఇక్కడ మూడు అగ్రకులాలకు మూడు పార్టీలు ఉన్నాయి. కమ్మల నాయకత్వంలో తెలుగుదేశం, రెడ్ల నాయకత్వంలో వైఎస్ఆర్ సీపీ, వెలమల నాయకత్వంలో టీఆర్ఎస్. ఈ మూడు కులాలను పక్కకు పెట్టి వేరే కులాల నుంచి నాయకత్వం ఎదగడానికి అవకాశమిచ్చే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆత్మహత్య ఒక ఆకాంక్షగా జీవిస్తూ ఉన్నది. అది దానికి ఆనందంగా కూడా ఉన్నది.

సీమాంధ్రలో కాంగ్రెస్ ఇక చాలాకాలం పుంజుకోలేదు. అది తమిళనాడులోని పార్టీలాగా క్రమంగా కోమాలోకి పోతుంది. తెలంగాణలో బతికి బట్టకట్టే అవకాశం ఉన్నా, దాన్ని తిరిగి రెడ్ల చేతిలో పెట్టకపోతే అతి త్వరలోనే రెడ్లు తమ స్వంత పార్టీ కోసం ఆలోచిస్తారు. కింది కులాల్లో ఎన్నికల రంగాన్ని నడుపగలిగే డబ్బు గానీ, నాయకత్వ తెగింపు గానీ ఇంకా రాలేదు. దాన్ని ఎదగనిచ్చే పరిస్థితి కూడా లేదు. అలా ఎదుగడానికి చాలా కాలం పడుతుంది.
తెలంగాణ రాగానే 'సామాజిక తెలంగాణ' కాళ్ళకు గజ్జెలు కట్టుకొని నడిచి వస్తుందనుకున్న మేధావులకూ, కళాకారులకు ఇప్పుడైనా అర్థమైందో లేదో కానీ, అది అంత సులభం కాదని వాస్తవం చెబుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొంతకాలం అధికారం కమ్మ, రెడ్ల మధ్యనే ఉంటుంది. చిన్న రాష్ట్రాలను పెద్ద కులాలు (పెద్ద డబ్బు బలంలో) పరిపాలించడం సులభం. మునుముందు ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే అక్కడ బీఎస్పీ ఉనికిలో ఉండడం కూడా కష్టమే.

బీజేపీ ఒక పథకం ప్రకారమే చిన్న రాష్ట్రాల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా చీల్చి కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకొని బీజేపీకి అధికారాన్ని, ఆనందాన్ని కట్టబెట్టింది. దేశంలో కాంగ్రెస్ రానున్న పది సంవత్సరాల్లో కోలుకుంటుందనే నమ్మకం కనిపించడం లేదు. నరేంద్ర మోదీ ఒక పక్క 'చాయ్‌వాలా' పునాదిని, బీసీ సామాజిక చైతన్యాన్ని కాంగ్రెస్‌ను అతులాకుతలం చేసేట్లు వాడుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శక్తులు కూడా అదే అదునుగాపెద్ద ఎత్తున బీసీలను సమీకరిస్తున్నది. దళితులు, ఆదివాసులు హిందూ వ్యవస్థకు బయట ఉండి క్రమంగా క్రిస్టియానిటీ తమ మతంగా ఎన్నుకుంటున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి ఆయన ఎన్నికల్లో ఉపయోగించిన భాష బీసీల సమీకరణకు బాగా ఉపయోగ పడుతుంది. అయితే ఈ స్థితి బీసీలను ఎంత మారుస్తుందో చూడాలి.
కుల సమస్యను మేం గుర్తించమంటూ, వర్గం పేరుతో అగ్రకుల నాయకత్వాన్ని కాపాడుకోడానికి, పార్టీల పేర్లతో ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి కమ్యూనిస్టు పార్టీలు తమ రాజకీయ ఆత్మహత్యకు తామే పథకాలు వేసుకున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆ పార్టీల్లో కొత్తగా చేరడమంటూ జరిగితే ఆధునిక జీవితానికి బయట ఉండి అగ్రకుల సేవ చెయ్యదలుచుకున్న వాళ్లే అవుతారు. మునుముందు కమ్యూనిస్టులు అంటే అగ్రకులస్థులు అనే పరిస్థితి వస్తుంది.

అంటే ఆత్మహత్య ఒక ఆకాంక్షగా జీవించడం వ్యక్తులకే కాదు, సామాజిక గుంపులకు, రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని ఈ మధ్య కాంగ్రెస్‌ను, కమ్యూనిస్టు పార్టీలను చూస్తే మనకర్థమవుతుంది. దీనితో పాటు తెలంగాణ వంటి ఫ్యూడల్ ప్రాంతాల్లో విశాల ప్రజలు కూడా ఫ్యూడల్ ఆధిపత్యం బయట, ఆధునిక పెట్టుబడిదారీ విలువల్లో జీవించడానికి ఇష్టపడరని ఈ మధ్య పరిణామాలు, ఓటు విధానం స్పష్టంగా చెబుతున్నాయి. రోజూ దొరలతో తిట్లు తినేవారు ఒక వారం రోజులు దొర తిట్లు వినకపోతే జీవితంలో ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతారు. పొలిటికల్ సైకాలజీలో 'ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్' (స్వేచ్ఛ భయం) అని ఒక సిద్ధాంతం ఉంది. తరతరాలుగా బానిసత్వంలో బతికిన వారిని విముక్తి చేస్తే తమ జీవితంలోకి వచ్చే స్వేచ్ఛను వారు భరించలేరు. స్వేచ్ఛ భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. కుల బానిసత్వం ఈ 'ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్'ని ఇంకా పెద్ద స్థాయిలో పెంచి పోషిస్తుంది.
దయ్యాలను, భూతాలను నమ్మేవాళ్ళు మాంత్రికుడు నిమ్మకాయలు, వేపాకు కొమ్మలు పట్టుకొని పక్కన నిలబడితే కాస్త ధైర్యంగా జీవిస్తారు. రోడ్డు మీద పగులగొట్టి పడేసిన కొబ్బరికాయను చూసి భయపడి పడిపోయిన వాళ్ళూ ఉన్నారు. నేను ఆ ముక్కల్ని తీసుకొని తిన్నానని చెబితే ఐలయ్య కడుపు నిండా దయ్యాలున్నాయని నమ్మేవాళ్ళూ ఉన్నారు. భారతదేశపు ఫ్యూడలిజంలో మూఢనమ్మకం ఒక భాగం. ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు మూఢనమ్మకాల ప్రభుత్వాన్నే తెచ్చుకున్నారు.
కోస్తాంధ్ర ప్రాంతం కంటే తెలంగాణలో మూఢనమ్మకం చాలా ఎక్కువ. ఈ నమ్మకం పిల్లల చదువుల మీద తీవ్రమైన ప్రభావాన్ని పడేస్తుంది. పరీక్షల రోజున పుస్తకాలు చదువకుండా గంటల తరబడి గుళ్ళచుట్టూ ప్రదక్షిణలు చేసి పరీక్షలకొచ్చే విద్యార్థులు ఇక్కడ చాలా ఎక్కువ. ఈ సంస్కృతి ఫ్యూడల్ ఆధిపత్యాన్ని బాగా కాపాడుతుంది.
ఈ క్రమంలో అభివృద్ధిని విద్యతో ముడేసి చూసేబదులు వాస్తుతో ముడేసి చూస్తారు. ఇళ్లు, ఆఫీసులు, రైళ్లు, ఆఖరికి విమానాలు కూడా ముహూర్తం ప్రకారం నడవాలని అన్నిచోట్ల అయ్యగార్లను, పంచాంగాల్ని సమకూర్చుకునే రోజులు దూరం లేవు. ముందు, ముందు కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరక్కపోయినా, స్కూళ్ళు కాలేజీలు సరిగా నడువకపోయినా రాష్ట్ర ఉనికే వాస్తు ప్రకారం లేదంటే అందరూ నమ్మే పరిస్థితి ఉన్నది. ఈ మొత్తం ప్రక్రియ సమాజాన్ని క్రమంగా ఆత్మహత్య భావంలోకి నెడుతుంది. ఆత్మహత్యే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు, గుంపుల్ని, సంస్థల్ని హేతువు ద్వారా బాగుచెయ్యడం అంత సులభమైన పనికాదు.

2002లో ది హిందూ పత్రికలో 'ది రైజ్ ఆఫ్ మోదీ' అని నేనొక వ్యాసం రాస్తూ కమ్యూనిస్టులూ, సెక్యులరిస్టులు బీసీల రాజకీయ ఆకాంక్షను గుర్తించకపోతే నరేంద్ర మోదీ వారి ప్రతినిధిగా ప్రధాన మంత్రి అభ్యర్థి అయ్యే అవకాశముందని చెప్పినప్పుడు, అది చదివి కమ్యూనిస్ట్, సెక్యులర్ మేధావులు 'ఈయనొక పిచ్చివాడని' నవ్వుకున్నారు. ఇప్పుడు వారంతా ఆత్మహత్య ఆలోచనలో ఉన్నారు. మోదీ ప్రధానమంత్రి అయితే నేనీ దేశంలో ఉండనని ప్రకటించిన వారు ఉన్నారు. ఇప్పుడతను ప్రధాని అయ్యారు. ఆత్మహత్య గురించి కాదు ఆలోచించాల్సింది. కులవ్యవస్థ హత్య గురించి. మూఢనమ్మకాల హత్య గురించి.
కంచ ఐలయ్య
సుప్రసిద్ధ రచయిత, సామాజిక శాస్త్రవేత్త

Andhra Jyothi Telugu News Paper : 6/6/2014