Tuesday, November 29, 2011

రాజకీయ ఉచ్చు 'రెడ్ ప్లస్' By - కుంజం పండు దొర ఆదివాసీ ఐక్యవేదిక


ఆదివాసీ ప్రజలు తమను గౌరవించని ఒక కార్యక్రమానికి తమను తాము నిబద్ధులుగా చేసుకోకూడదు. రెడ్ ప్లస్ అనేది ఒక మార్కెట్ ఆధారిత ధోరణి. దీని ద్వారా బయటివారు ఆదివాసీ ప్రజలకు పవిత్రమైన వాటిని సరుకులుగా మార్చటానికి ప్రయత్నిస్తారు. పూర్వీకు ల సాంస్కృతిక వారసత్వం, భావితరాలవారి జీవితాలకు కల్పించే హామీ- ఇవన్నీ కేవలం ఆదివాసులకే కాక మొత్తం మానవ జాతి మనుగడకు కూడా అవసరం. 
ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు 17వ సదస్సు దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో సోమవారం నాడు ప్రారంభమైంది. డిసెంబర్ 9 వరకు ఈ సదస్సు జరగనున్నది. ప్రపంచ దేశాల ప్రభుత్వ, కార్పొరేషన్ల, వాతావరణ మార్పు విధానాలను, స్వేచ్ఛా విపణి విధానాలను ప్రతిపాదించే సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. భూగోళం వేడెక్కిపోకుండా ఎలా నివారించాలో వారు చర్చిస్తారు. కుప్పకూలిపోతున్న ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థను నిలబెట్టి ఆదుకోవాలి కాబట్టి ఈ ప్రతినిధులందరూ తమ సమాలోచనలతో ఒక కొత్త 'గ్రీన్ ఎకానమీ' (ప్రకృతి అనుకూల ఆర్థిక వ్యవస్థ) మాత్రమే భూగోళాన్ని రక్షించగలదని అందరినీ ఒప్పిస్తారు. 


ఈ గ్రీన్ ఎకానమీలో భాగంగా కర్బనా న్ని కొనడం, అమ్మడం ద్వారా లక్షల డాలర్ల లాభాలను సంపాదించే అవకాశం ఉంటుంది. ఆదివాసీ ప్రజలమైన మేము ఈ బూటకత్వా న్ని ఖండిస్తున్నాము. పెట్టుబడిదారుల దురాశ, ఆర్థిక పెరుగుదల కలిసి మానవ సంబంధాలను, ధరిత్రీమాతను నాశనం చేస్తున్నాయి. ఈ వినాశన దుష్ఫలితాలను మేము ప్రత్యక్షంగా అనుభవిస్తున్నా ము. భూ తల్లి ఒక వ్యాపార వస్తువుగా మారిపోయింది. ఆదివాసులకు భూ తల్లి పవిత్రమైనది. అందుకే మేము 'రెడ్ ప్లస్' కార్యక్రమా న్ని, కార్బన్ మార్కెట్‌ను బూటకమైనవని అంటున్నాము. ఇవి భూ గోళం వేడక్కటంపై ఎటువంటి ప్రభావాన్ని కలిగించవని భావిస్తున్నాము. మా దృష్టిలో ప్రతిదీ జీవితమే. జీవితాన్ని బేరమాడలేము; స్టాక్‌మార్కెట్‌లో అమ్మలేము. ఈ విధానం చాలా పెద్ద ప్రమాదంతో కూడుకున్నది. పర్యావరణ సంక్షోభాన్ని ఇది పరిష్కరించలేదు. కాన్‌కున్(మెక్సికో)లో గత ఏడాది జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు 16వ సదస్సు రెడ్, రెడ్ ప్లస్ అనే ఒప్పందాలను ఆమోదించింది. రెడ్/రెడ్ ప్లస్ అంటే 'రెడ్యూస్‌డ్ ఎమిషన్స్ ఫ్రమ్ డీ ఫారెస్ట్రేషన్ అండ్ డిగ్రేడేషన్' (అడవుల నరికివేత, అడవు ల వినాశనం వల్ల కలిగే ఉద్గారాల తగ్గింపు). తమ జీవన శైలి ద్వారా వెలువడుతున్న కర్బన ఉద్గారాలను, వర్ధమాన దేశాలలోని అడవులు, కొత్తగా పెంచే తోటలు పీల్చుకునేటట్లు చేసినందుకు, ఆ దేశాలకు డబ్బు చెల్లించి తమ నేరాన్ని మాఫీ చేసుకోవడానికి ఆ రెండు ఒప్పందాల ద్వారా అభివృద్ధి చెందిన దేశాలు ప్రయత్నిస్తున్నాయి. రెడ్ అనేది అడవుల నరికివేతను నివారించడానికి, రెడ్ ప్లస్ అనేది కర్బనాన్ని పీల్చుకునేందుకు కొత్త అడవుల లేదా తోటల పెంపకానికి వర్తిస్తాయి. 'గ్రీన్ ఇండియా మిషన్' అనేది భారతదేశపు వాతావరణ మార్పు జాతీయ కార్యాచరణ ప్రణాళికలోని అడవులకు సంబంధించిన భాగం. దీని మొత్తం ఖర్చు రూ.46,000 కోట్లు. ఆదివాసుల భూములపై బలవంతంగా రుద్దిన తోటల పెంపకం దుష్ఫలితాలను మేము ఇప్పటికే అనుభవిస్తున్నాము. మామిడి, కానుగ, జట్రోఫా, రబ్బర్, నీలగిరి ఇత్యాది చెట్ల పెంపకాన్ని నిరాకరిస్తే మా రేషన్ కార్డులను, ఉపాధి హామీ జాబ్ కార్డులను రద్దు చేస్తామని బెదిరించారు. బలవంతంగా ఆ మొక్కలను నాటిస్తున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసి ప్రజల ప్రతినిధులు ఐక్యరాజ్యసమితి సదస్సు జరుగుతున్న డర్బన్ నగరంలోనే సమావేశమయ్యారు. భారత్ తరఫున నేను కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాను. వాతావరణ మార్పు సమస్య పరిష్కారానికి ముందుకు తెస్తోన్న బూటకపు ప్రతిపాదనలను ఖండించడం, ప్రపంచ ఆదివాసీ ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి ప్రపంచస్థాయి ఏకాభిప్రాయాన్ని నిర్మించేందుకై సంబంధిత అంశాలపై చర్చలు, సమాలోచనలు జరపడం ఆదివాసీ ప్రతినిధుల సమావేశ లక్ష్యం. వాతావరణ మార్పు వల్ల నష్టపోయే విషయంలో ఆదివాసీలే అందరి కంటే ముందుపీఠీన ఉన్నారు. అయినా ఈ ఆదివాసీలనే, తమ జాతీయ, అంతర్జాతీయ రాజ్యాంగపరమైన రక్షణలను వదులుకోవాలని, ప్రపంచ నాయకులు కోరుతున్నారు! కార్బన్ విక్రయాలు భూగోళపు వేడిని తగ్గిస్తాయనే బూటకపు వాదనలను ప్రపంచానికి చెప్పటంలో భాగస్వాములు కావాలని ఆదివాసీలను అడుగుతున్నారు. ప్రజలలో ఒక ప్రత్యేక వర్గాన్ని మాత్రమే స్థానిక ప్రజలుగా పరిగణించడం కాక, ప్రజలందరినీ స్థానిక ప్రజలు (ఇండిజినస్ పీపుల్)గా గుర్తించాలని స్థానిక ప్రజల హక్కులపై 2007లో ఐక్యరాజ్యసమితి చేసిన ప్రకటనను భారత ప్రభుత్వం ఆమోదించింది. అయితే అంతర్జాతీయ వేదికలపై మన ప్రభుత్వం ఎన్నడూ ఆదివాసులను 'ఇండిజినస్ పీపుల్'గా పేర్కొనలేదు. కాని అడవులు-రెడ్ ప్లస్‌లో మమ్మల్ని భాగస్వాములను చేయటానికి సంబంధిత డాక్యుమెంట్లలో అకస్మాత్తుగా మా ఆదివాసులను 'ఇండిజినస్ పీపుల్' అనే పదాన్ని ఉపయోగించటం మొదలుపెట్టింది. మా భూములలో మైనింగ్ సాగించడానికి, మా నదులపై ఆనకట్టలు కట్టడానికి, మా అడవుల నుంచి మమ్మల్ని తరిమేయడానికి ప్రయత్నాలు చురుగ్గా జరుగుతున్నాయి. మా హక్కుల పరిరక్షణకు భారత రాజ్యాంగం ఇచ్చిన హమీలను, వాటి ప్రకారం చేసిన చట్టాలను భారత ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. ఒకవైపు మా ప్రాంతాలను, వనరులను దోచుకుంటూ ఇప్పుడు మా గాలితో వ్యాపారం చేయాలనుకుంటున్నది. అదే సమయంలో భారతదేశపు అడవులను, కర్బనాన్ని పీల్చుకునేందుకు వీలు కల్పించడం ద్వారా ఆదివాసీ ప్రజల హక్కులను పరిరక్షిస్తామని ప్రపంచానికి భారత ప్రభుత్వం చెబుతోంది. ఆదివాసీ ప్రాంతాల్లోకి ఆర్థిక ప్రయోజనాలు ప్రవహిస్తాయనే అబద్ధం చెబుతోంది. భారత ప్రభుత్వం అనుసరించే ఈ బూటకత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ బూటకపు కర్బన వ్యాపారంలో వాతావరణ మార్పులకు మార్కెట్ ఆధారిత పరిష్కారాలను సూచించడంలో నిజానికి తరతరాలుగా వస్తున్న మా పుట్టినిల్లైన అడవులే ప్రమాదంలో పడుతున్నాయి. దక్షిణ అమెరికాలోని ఈక్వడార్‌లో రెడ్‌ప్లస్‌ను ప్రారంభించిన తరువాత, అక్కడి స్థానిక ప్రజలు ఏ విధంగా తమ సొంత భూములలో బందీలుగా అయ్యారో, అడవిని ఉపయోగించుకోవడంలో వారికి ఉన్న సంప్రదాయ చట్టాలు ఎలా కాలరాయబడ్డాయో, జీవనోపాధులు ఎలా నాశనమయ్యాయో డర్బన్ సమావేశంలో దక్షిణ అమెరికాకు చెందిన మా ఆదివాసీ అన్నలు, చెల్లెళ్ళు చెప్పగా విన్నాము. ఈ రెడ్ ప్లస్ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా స్థానిక సమూహాలు, ఆదివాసిీ ప్రజల సార్వభౌమత్వాన్ని దెబ్బకొట్టింది. చర్చలు, సంభాషణల ద్వారా ఆదివాసీ ప్రజలమైన మేము 'స్థానిక ప్రజల బయో కల్చరల్ క్లైమేట్ ఛేంజ్ అసెస్ మెంట్' సభ్యులమైన మేము రెడ్ ప్లస్ కార్యక్రమంలోని అంతర్గత ప్రమాదాలను, ప్రతికూల ప్రభావాలను గుర్తించాము. ఈ క్రింద పేర్కొన్న అంశాల పట్ల ప్రపంచ ప్రజలను అప్రమత్తులను చేస్తున్నాము: (అ) రెడ్‌ప్లస్ అనేది ఒక నయా సరళీకరణ, మార్కెట్ ఆధారిత కార్యక్రమం. ఇది బ్రతుకును ఒక సరుకుగా మార్చివేసి సమగ్రమైన సమష్టి విలువలను, పరిపాలనా వ్యవస్థలను కాలరాయడానికి దారితీస్తుంది. స్వేచ్ఛా వాణిజ్యం, ప్రైవేటీకరణ వంటి ఆర్థిక కార్యక్రమాలు, ప్రపంచ బ్యాంకు వంటి కర్తలు శాసించే ఒక నయా సరళీకరణ ధోరణి ఈ రెడ్‌ప్లస్; (ఆ) రెడ్‌ప్లస్ విధానాలు, ప్రాజెక్టులు ప్రత్యక్షంగా ఆదివాసులను, వారి భూభాగాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఎందుకంటే అటవీ ప్రాంతాలన్నీ ఈ భూ భాగాలలోనే ఉన్నాయి కనుక. కార్పొరేషన్లు, అటవీ సంరక్షణ సంస్థలు శక్తిమంతమైన ప్రభుత్వ సంస్థలు అటవీ నివాసులైన స్థానిక ప్రజలతో అన్యాయమైన, వక్రీకరించని ఒప్పందాలను కుదుర్చుకొని అటవీభూములను ఆక్రమించుకొని, ఆర్థిక లాభాలను సొంతం చేసుకుంటాయి. రెడ్ ప్లస్ కార్యక్రమం అనేక తగవులను, అవినీతిని పెంచి ఆదివాసులను అడవుల నుంచి వెళ్ళగొట్టడం వంటి అనేక మానవ హక్కుల ఉల్లంఘనలకు దారితీస్తుంది; (ఇ) రెడ్ ప్లస్ విధానాలు, ప్రాజెక్టులు స్థానిక ప్రజల, ప్రత్యేకించి ఆదివాసీల సంప్రదాయక పరిపాలనా వ్యవస్థలను కాలదన్ని, ఉల్లంఘిస్తున్నాయి; (ఈ) రెడ్ ప్లస్ కార్యక్రమం స్థానిక ప్రజలు తమ అడవులను సంప్రదాయకంగా వినియోగించుకోవడాన్ని, అడవులలోకి ప్రవేశించడాన్ని ఆపివేసి, అడవులను వారికి అందుబాటులో లేకుండా చేస్తాయి. ఇది వారి సంప్రదాయ జ్ఞానం పైన, ఆహార సార్వభౌమత్వం, ఆహార భద్రత పైన, సంప్రదాయ ఆరోగ్య భద్రతా వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది; (ఉ) రెడ్ ప్లస్ విధానాలను ప్రోత్సహించే ప్రభుత్వాలే జీవ ఇంధనం, గనుల తవ్వకం, చమురు వెలికి తీయడం, ఆనకట్టల నిర్మాణం, పారిశ్రామిక పద్ధతిలో ఒకే రకమైన పంటలు, తోటలు పెంచటం వంటి ఆర్థికరంగాలను కూడా ప్రోత్సహిస్తున్నాయి. అడవుల ఆక్రమణకు వినాశనానికి ఇవే ప్రధాన కారణాలు; (ఊ) రెడ్ ప్లస్ విధానాలలో కర్బనంపై కేంద్రీకరించిన దృష్టి, ఒకే రకమైన తోటల (జన్యు మార్పిడి చెట్లతో సహా) పెంపకాన్ని ప్రోత్సహిస్తాయి. అడవుల సామాజిక, సాంస్కృతిక విలువలను పట్టించుకోవు; (ఎ) రెడ్ ప్లస్ ఉమ్మడి బాధ్యతా సూత్రాన్ని ఉల్లంఘిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలు, వాటి పరిశ్రమలకు కాలుష్యాన్ని పెంచే హక్కును మంజూరు చేస్తుంది. ఆ విధంగా అసమానతలను సృష్టిస్తుంది. రెడ్ ప్లస్‌లో భాగస్వాములైన వారందరూ ఆదివాసుల హక్కులను పూర్తిగా గౌరవించాలని మేము నొక్కిచెబుతున్నాము. అయితే ముందుగా సమాచారం అందించి, అనుమతి తీసుకునే సూత్రం అన్ని ప్రతికూల ప్రభావాలను పరిష్కరించడానికి మార్గం కాదు. రెడ్ ప్లస్‌ను సమర్థించుకోవడానికి ఈ సూత్రాన్ని ఉపయోగించుకోకూడదు. ఆదివాసి ప్రజల స్వయం నిర్ణయ హక్కును భూభాగాల వినాశానాన్ని సమర్థించటానికి ఉపయోగించకూడదు. ఆదివాసీ ప్రజలు తమను గౌరవించని ఒక కార్యక్రమానికి తమను తాము నిబద్ధులుగా చేసుకోకూడదు. రెడ్ ప్లస్ అనేది ఒక మార్కెట్ ఆధారిత ధోరణి. దీని ద్వారా బయటివారు ఆదివాసీ ప్రజలకు పవిత్రమైన వాటిని సరుకులుగా మార్చటానికి ప్రయత్నిస్తారు. మా పూర్వీకుల సాంస్కృతిక వారసత్వం, భావితరాలవారి జీవితాలకు కల్పించే హామీ, ఇవన్నీ కేవలం ఆదివాసులకే కాక మొత్తం మానవ జాతి మనుగడకు కూడా అవసరం. చాలా ఆదివాసి సమూహాలు, తెగలకు రెడ్ ప్లస్ కలిగించే ప్రమాదాలు, ప్రతికూల ప్రభావాల గురించి అవగాహన లేదు. రెడ్ ప్లస్ ఒక రాజకీయ ఉచ్చు; వాతావరణ మార్పును పెంచడానికే ఇది దారి తీస్తుంది. ఆదివాసీ సమూహాలన్నీ ఈ విషయంలో సమగ్రతను కాపాడుకోవాలని పిలుపునిస్తున్నాము. వాతావరణ న్యాయాన్ని కాపాడుకోవటానికి చిత్తశుద్ధితో ఉన్న ప్రజలందరు జీవిత విలువలకు కట్టుబడి ఉండాలని కర్బన ఉద్గారాలను తగ్గించే బాధ్యతను చేపట్టాలని, రెడ్ ప్లస్‌ను బూటకపు పరిష్కారంగా పరిగణించి, తిరస్కరించాలని పిలుపునిస్తున్నాము.
Andhra Jyothi Telugu News Paper Dated 30/11/2011

Monday, November 28, 2011

జగిత్యాల నుంచి లాల్‌గఢ్ దాకా - బి.ఎస్.రాములు


చాలా మంది కలలు కంటారు. కొందరే వాటిని సాకారం చేసుకుంటారు. ఆ కలలు విప్లవ కలలు కావచ్చు. జీవితంలో విజయం సాధించడం కావచ్చు. మరో ప్రపంచాన్ని సృష్టించడం కావచ్చు. దేనికైనా నిరంతర సాధన, లక్ష్యం పట్ల గురి, ఓటమిలోనూ గురితప్పని విశ్వాసం. దీర్ఘకాలిక ఉదాత్త లక్ష్యం ఉన్నప్పుడు తామనుకున్న ఏ రంగంలోనైనా విజయాలు సాధిస్తారు. అత్యున్నత శిఖరాలకు ఎదుగుతారు. మల్లోజుల కోటేశ్వరరావు తన సుదూర లక్ష్యం కోసం సుదీర్ఘ ప్రయాణం నూనుగు మీసాల తొలి యవ్వనంలోనే ప్రారంభించారు. సాహిత్యానికి జీవితానికి సంబంధం ఉందని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి ఉద్యమాలే అవసరమని సాహిత్య రంగం నుండి నేను సామాజిక ఉద్యమకారుడిగా మారే క్రమంలో మా ఇద్దరి లక్ష్యాలు ఒక్కటయ్యాయి. 

అలా విప్లవోద్యమంలో కలిసి పనిచేయడం జరిగింది. అయితే మల్లోజుల మౌలికంగా విప్లవకారుడుకాగా నేను మౌలికంగా సాహిత్య, సామాజిక ఉద్యమకారుడిగా మా ఇద్దరి జీవిత పరిణామాలు ప్రత్యేకంగా కనపడుతుంటాయి. ఒకే లక్ష్యం అయినకీటికీ అభిరుచులు, సామర్థ్యాలు, ప్రాముఖ్యతలు వేరైనపుడు భిన్నరంగాల్లో ఉంటూ పనిచేయడం సహజమైన విషయం. కాగా తాను సాహిత్యకారుడిగా ఎంతగా రాయాలని ఉన్నప్పటికీ విప్లవ కర్తవ్యానికే ప్రాధాన్యత ఇచ్చి మల్లోజుల కిషన్‌జీగా ఎదిగారు.

కిషన్‌జీ, ప్రహ్లాద్, కోటి, గోదావరి వంటి మారు పేర్లు కేవలం మారుపేర్లు మాత్రమే కాదు. కిషన్‌జీ అంటే కలిగే భావం వేరు. ప్రహ్లాద్ అన్నప్పుడు కలిగే భావం వేరు. ఇలా ఒకే జీవితంలో అనేక జీవితాలను జీవించిన వ్యక్తులు అరుదుగా వుంటారు. ఏ దశ వ్యక్తిత్వం ఆ దశకు ప్రత్యేకంగా ఎదిగిన క్రమం ఆయా మారుపేర్లలో నిక్షిప్తమై వున్నది. ఒక్కొక్క కలం పేరు ఒక్కొక్క ఉద్యమ దశను, దిశను, స్థల కాలాలను మనిషి సాధనను, బాధ్యతలను గుర్తుచేసే మైలురాయి.

అలా 'కోటి' ఒకనాటి యువ విద్యార్థి, క్లాస్‌మేట్స్‌కు, స్నేహితులకు బాల్య స్నేహితుడు. 'మల్లోజుల కోటేశ్వరరావు' ఉద్యమంలో ఉరుకులు, పరుగుల దశలో ఉద్యమించిన ఉదయించే సూర్యుడు. 'ప్రహ్లాద్' రాష్ట్ర విప్లవ ఉద్యమ క్రమంలో రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నెరవేరుస్తూ ఉత్తేజం కలిగించిన నాయకుడు.

'కిషన్‌జీ' ఉత్తర భారతం, బీహార్, బెంగాల్, ఒరిస్సా, అస్సాం, నేపాల్ తదితర ప్రాంతాల్లోకి విస్తరించిన జాతీయ స్థాయికి ఎదిగిన నాయకుడు. భారత విప్లవోద్యమాన్ని ముందుకు నడిపే కేంద్ర కమిటీ సభ్యుల్లో ఒకరు. ఇలా కోటేశ్వరరావు కలం పేర్లు చరిత్ర పరిణామాలను వివరించే మారుపేర్లు. ఆ పేర్ల వెనుక ఆయా కాలాల విప్లవోద్యమ చరిత్ర ఆనవాళ్లు దాగి వున్నాయి.

1964లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ చీలిపోయి సీపీఐ(ఎం) ఏర్పడింది. అందులో యువ నాయకత్వం కొత్తపార్టీ విప్లవోద్యమానికి ప్రతీక అవుతుందని భావించారు. తమ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఉద్యమించారు. అలా బెంగాల్‌లో చారు మజుందార్, సరోజ్ దత్తా, కానుసన్యాల్, నాగభూషణ్ పట్నాయక్, సత్యనారాయణ సింగ్, చండ్ర పుల్లారెడ్డి, పైలా వాసుదేవరావ్, కాశ్మీర్‌లో షరీఫ్, బీహార్‌లో కిషన్ ప్రసాద్, కేరళలో వేణు, ఆంధ్రప్రదేశ్‌లో దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆదిభట్ల కైలాసం, పాణిగ్రాహి, సత్యం, తేజేశ్వరరావు వంటి వారు ఎక్కడికక్కడ ప్రజలను సమీకరించారు. ప్రజల సమస్యలపై ఉద్యమించారు. అలా ఉద్యమించిన క్రమంలో బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని నక్సల్‌బరీలో అదే సంవత్సరం (1967) బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన సీపీఎం ప్రభుత్వం కాల్పులు జరిపి అణచివేసింది. అలా సిపిఎం తన పార్టీ యువనాయకత్వాన్ని తానే సంహరించింది.

రాష్ట్రంలో నక్సల్‌బరీ, శ్రీకాకుళం ఉద్యమాల ప్రేరణతో తెలంగాణలో ఉద్యమం ప్రారంభించాలని కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి భావించారు. 1940-50 మధ్య సాగిన తెలంగాణ రైతాంగ పోరాట ప్రాంతాల్లో కాకుండా ఆ పోరాటాలు తక్కువస్థాయిలో సాగిన ప్రాంతాల్లో కొత్తగా ఉద్యమం ప్రారంభించాలని సర్వేకు బయల్దేరారు. అలా కరీంనగర్ జిల్లా జగిత్యాల తాలూకాలోని రంగపేట గ్రామ సమీపంలోని గోదావరి నదిలో 1969లో పోలీసులు వారిని చూసి అరెస్ట్ చేసి జగిత్యాల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి మరుసటి రోజు వదిలేశారు. అప్పటికి ఉద్యమం పరిసరాల పరిశీలనకే పరిమితమైంది.

1967 నుండి మార్క్సిస్టు లెనినిస్టులు, నక్సలైట్లు, ఎం.సి.సి. తదితర గ్రూపులు దేశవ్యాప్తంగా వర్గ శతృ నిర్మూలన అనే పోరాట రూపంతో ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తించే భూస్వాములను, వర్తకులను ఖతం చేసే కార్యక్రమం తీసుకున్నారు. 1972 నుండి వర్గ శత్రు నిర్మూలనా పోరాట రూపంపై చర్చలు మొదలయ్యాయి. ప్రజలను వారి సమస్యల పట్ల కదిలించాలని ప్రజాసంఘాలను నిర్మించడం ద్వారా పార్టీ విస్తరించాలని ప్రజాసంఘాల్లో పనిచేసే కార్యకర్తలు విప్లవకారులుగా ఎదుగుతారని భావించి ప్రజాసంఘాల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. 1974 నాటికి ఈ నిర్ణయం జరిగిన తర్వాత విద్యార్థి సంఘాలను నిర్మాణం చేయడం జరుగుతూ వచ్చింది. అంతలో ఎమర్జెన్సీ రావడంతో నిర్బంధాలు పెరిగాయి. చాలామంది జైళ్లపాలయ్యారు. వరంగల్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధుల నుండి ఎదిగిన సూరపనేని జనార్ధన్ వంటి యువకులను మెదక్ జిల్లా గిరాయిపల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్ పేరిట కాల్చి చంపారు. ఎమర్జెన్సీలోనే భూమయ్య, కిష్టా గౌడ్‌లను ఉరితీశారు.

జగిత్యాల జైత్రయాత్ర ఇందుకు భిన్నమైనది. జగిత్యాల జైత్రయాత్ర విప్లవద్యోమంలో ఒక మలుపు. ప్రజలను కదలించడం ద్వారా ఉద్యమించడం అనేదానికి జగిత్యాల జైత్రయాత్ర ఒక కొండగుర్తు. ఎమర్జెన్సీ తర్వాత 1977 నుండి రాడికల్ విద్యార్థులు, పిడిఎస్‌యూ విద్యార్థులు గ్రామాలకు తరలండి కార్యక్రమంతో పల్లెల్లో ప్రచారం చేశారు. జననాట్య మండలి పాటలు నూతన ప్రజాస్వామిక విప్లవపు ఆవశ్యకత, ప్రజల సమస్యలు, అందుకు మూలకారణం. ఇది అర్ధవలస అర్ధభూస్వామ్య వ్యవస్థ కావడం అని అర్థం చేయిస్తూ వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా భూస్వాముల ఆధిపత్యానికి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచారు. శిక్షణ పొందిన విద్యార్థులు, గ్రామాలకు తరలి రైతు కూలీ సంఘాలు, రాడికల్ యువజన సంఘాలు స్థాపించుకోవడానికి ప్రేరణ ఇచ్చారు. భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు.

భూస్వాములను దారికి తీసుకురావడానికి సాంఘిక బహిష్కరణ విధించారు. ఈ ఊర్లో ఎవరూ కూడా ఆ భూస్వాముల పొలాలు దున్నేది లేదు. ఇంటి పని చేసేది లేదు. బట్టలు ఉతికేది లేదు. గడ్డం తీసేది లేదు. ఇలా అన్నీ బంద్ పెట్టారు. దాంతో భూస్వాములు ఊళ్ళల్లోంచి పారిపోయారు. ఆ తరువాత పోలీసులను పంపారు. దొరల స్థానంలో పోలీసు క్యాంపులు వచ్చాయి. ప్రజలను పశువుల్లాగా మందపెట్టి కొట్టారు. చిత్రహింసలు పెట్టారు. ఆ క్రమంలో దౌర్జన్యాలకు పాల్పడుతున్న భూస్వాములను ఖతం కార్యక్రమంలో హతం చేశారు. ఈ నిర్బంధాల నుండి తట్టుకుంటూ ఉద్యమాన్ని విస్తరించాలని 1970-80 మధ్య కరీంనగర్, ఆదిలాబాద్ పోరాటాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.

ఎమర్జెన్సీ తర్వాత సాగిన ఉద్యమాలలో నేను సాహిత్యకారుడిగా, పౌరహక్కుల కార్యకర్తగా, ఉద్యోగ సంఘాల నిర్మాతగా పనిచేస్తున్న క్రమంలో విప్లవోద్యమంలో ఎందరో విప్లవకారులతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. అలా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా మల్లోజుల, రాడికల్ యువజన సంఘ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నేను... ఉద్యమంలో కలిసి ముందుకు సాగాము. నాది బహిరంగ ప్రజాసంస్థల ఉద్యమమయితే మల్లోజుల అన్ని ప్రజా ఉద్యమాల సమీకరణ కార్యకర్తల నిర్మాణం, పార్టీ నిర్మాణం తన కర్తవ్యంగా ఉద్యమాన్ని కొండపల్లి సీతారామయ్య వంటి పెద్దల సూచనలతో నిర్మిస్తూ ముందుకు సాగారు.

గతంలో సాగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో పైస్థాయి నాయకత్వమంతా ఆంధ్రప్రాంతానిది, పోరాట నాయకత్వమంతా తెలంగాణది. దానివల్ల పోరాటాలతో సంబంధం లేని నాయకత్వం పోరాటాలపై ఆధిపత్యం చెలాయించడం జరిగింది. దానివల్ల ఎన్నో తప్పులు జరిగాయి. ఆ పొరపాట్లు జరగనీయకూడదు. ఎక్కడి నుండి ఉద్యమం వ్యాపిస్తున్నదో అక్కడి నుంచే నాయకత్వాన్ని రూపొందించాలి, ఎదిగించాలి అనుకున్నారు. అలా కరీంనగర్ జిల్లా పార్టీ కార్యదర్శిగా మల్లోజుల కోటేశ్వరరావు 1980లో ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా కార్యదర్శే, రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.

అలా మల్లోజుల కోటేశ్వరరావు కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన వెంటనే రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా మారిపోయారు. ఆ తర్వాత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు కరీంనగర్ జిల్లా కార్యదర్శి అయ్యారు. అలా వరంగల్ రీజనల్ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఉద్యమం ఉవ్వెత్తున ముందుకు సాగినప్పటికీ అనుభవరాహిత్యం వల్ల, అత్యుత్సాహం వల్ల జరిగిన పొరపాట్లకు బాధ్యత వహించి కోటేశ్వరరావు రాష్ట్ర కమిటీ కార్యదర్శి హోదా నుండి పార్టీ నిర్ణయానుసారం 1985-86లో సీవోగా కిందిస్థాయి కార్యకర్తగా పనిచేశారు.

ఆ సమయంలో రాష్ట్ర కార్యదర్శిగా నల్లా ఆదిరెడ్డి ఎన్నికయ్యారు. నల్లా ఆదిరెడ్డి అరెస్ట్ కావడం వల్ల ముప్పాళ్ళ లక్ష్మణ్‌రావు 1986లో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. కాలక్రమంలో దండకారణ్యం ఉద్యమ నిర్మాణంలో మల్లోజుల కీలక పాత్ర నిర్వహించారు. అలా మళ్లీ రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో సమర్థవంతమైన నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. ఇలా తెలంగాణ నాయకత్వం ఎదగడానికి కారకులైన కొండపల్లి సీతారామయ్య, కె.జి.సత్యమూర్తి, ఐ.వి.సాంబశివరావు వంటి సీనియర్ నాయకత్వం ముందుచూపుకు జేజేలు చెప్పక తప్పదు.

ఎక్కడికక్కడ పనిచేస్తున్న విప్లవకారుల మధ్య ఐక్యత, ఐక్యసంఘటన గురించి 1980 నుండి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎందుకోగానీ అవి దశాబ్దాల తరబడి కొనసాగుతూ వచ్చాయి. 1985లో నేను దేశవ్యాప్తంగా పర్యటించినప్పుడు అనేక విప్లవ పార్టీల నాయకులతో చర్చించినప్పుడు భిన్నాభిప్రాయాలు, విబేధాలు సులువుగా పరిష్కరించుకోవచ్చు అని అనిపించింది. కానీ పూర్తిస్థాయిలో ఏకం కావడానికి మరో ఇరవై సంవత్సరాలు తీసుకుంది. మొత్తానికి ఉత్తర, దక్షిణ భారత ప్రజానీకాన్ని ఒకే పార్టీ నేతృత్వంలో నడిపే ఉద్యమంగా మావోయిస్టుపార్టీ ఎదిగింది. ఇందుకు పరస్పర అవగాహన వివిధ ప్రాంతాల మధ్య ఒక సమీకృత శక్తిగా శక్తివంతమయ్యాయి.

ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ విస్తరిస్తున్న క్రమంలో అడవులను, ఈదేశ వనరులను జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు కైవసం చేసుకోవాలని డాలర్ల పంట పండించుకోవాలని అనేక పరిశ్రమల పేరిట ముందుకు వచ్చారు. అభివృద్ధి పేరిట ప్రజలను నిర్వాసితులను చేస్తూ తమ లాభాలను, పెట్టుబడులను పెంచుకోవాలనుకున్నారు. మావోయిస్టు పార్టీ దేశ్యాప్తంగా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆదివాసులకు అండగా నిలిచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాయకులు, పారిశ్రామికవేత్తలు బహుళజాతి సంస్థలు దీన్ని సహించలేకపోయాయి.

ఆపరేషన్ గ్రీన్‌హంట్, వగైరా పేర్లతో సి.ఆర్.పి.ఎఫ్, మిలటరీ బలగాలను ప్రజలకు వ్యతిరేకంగా తమ స్వార్థలక్ష్యాలకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. అలాంటి వారి చేతుల్లో ప్రజల పక్షాన మహానేత కిషన్‌జీ నేలకొరిగారు. అలా జగిత్యాల జైత్రయాత్ర బెంగాల్‌లోని లాల్‌గఢ్ పోరాటాల దాకా ఒక జిల్లా నుండి ఎదిగి 14 రాష్ట్రాలదాకా విస్తరించిన ప్రజా ఉద్యమ నాయకత్వానికి కిషన్‌జీ ఒక ప్రతీక, ప్రతినిధి. కిషన్‌జీ ఒక వ్యక్తికాదు, ఒక సామాజిక శక్తి. దోపిడీ, పీడనలేని, స్వేచ్ఛ సమానత్వం ఆత్మగౌరవం పరిఢవిల్లే మరో ప్రపంచాన్ని సృష్టించాలనే కలలు కనే యువతరానికి ప్రతినిధి. పీడిత వర్గాల ఆశాజ్యోతి.

- బి.ఎస్.రాములు
సామాజిక తత్వవేత్త
ఆంధ్ర జ్యోతి తెలుగు న్యూస్ పేపర్ తేది 29 / 11 /2011 

పోల'వరం' దియా, తెలంగాణ లియా - కంచ ఐలయ్యఇంగ్లీషులో ఒక సామెత- "one battle settles many battles' అనీ. మూడో దశ తెలంగాణ పోరాటాలు, త్యాగాలు ఒక్క దెబ్బతో సెటిల్ అయ్యాయి! 2009 నవంబర్ నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పై స్థాయిలో గాంధేయ పోరాటాలు, కింద గ్రామస్థాయిలో త్యాగధనుల ఆరాటాలు మొదలయ్యాయి. దేని కోసం? పై నుంచి ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంత కర్తలు చెప్పినట్లు ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని సకల జనులు నమ్మారు. 

పై రాజకీయ నాయకత్వం, దాని సామాజిక సృష్టిగా ముందుకొచ్చిన ఉద్యమం జేఏసీ, విచిత్రమైన గాంధేయ ఉద్యమాన్ని ఉర్రూతలూగించాయి. అందులో సింబాలిక్ ఆత్మహత్యల ఉద్యమాలు పై రాజకీయ శక్తులు చేస్తుంటాయి. కింద యువకులు, ప్రజలు నిజమైన ఆత్మహత్యలే చేసుకోవాలి. తెలంగాణ రాకముందే పై శక్తులు వనరులు సమకూర్చుకోవాలి. ప్రజలు మాత్రం రాష్ట్రం వచ్చే వరకు త్యాగాలు చేస్తూనే ఉండాలి. గాంధీ తన త్యాగ సిద్ధాంతాన్ని లియో టాల్‌స్టాయ్ అనే రష్యన్ రచయిత, తత్వవేత్త నుంచి నేర్చుకున్నారు. 

దనవంతులు, బీదల కోసం తమకున్నవన్నీ వదులుకోవాలని, సహాయనిరాకరణోద్యమాలు సైతం చేయాలని టాల్‌స్టాయ్ చెప్పారు. ఆయన ఎన్నో రచనలు చేశారు. తన ఆస్తినంతా త్యాగం చేశారు. ఆఖరికి బీదవాడిగా చావాలని ఇంటినుంచి వెళ్లిపోయి రైల్వేస్టేషన్‌లో చనిపోయాడు. గాంధీ ధనిక జీవితాన్ని వదులుకొని ఆశ్రమాల్లో జీవించాడు. ఉద్యమాల ద్వారా సొంత ఆస్తులు సంపాదించుకోలేదు.తెలంగాణ 'ఉద్యమం'లో గాంధేయవాదం విచిత్రంగా పని చేసింది. ఉద్యమానికి ఏకైక నినాదముండాలన్నారు. అది తెలంగాణ రాష్ట్ర సాధన. రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాం తంలో రకరకాల ఉద్యమాల్లో కొన్ని విలువలు ఉనికిలోకి వచ్చాయి. 

కమ్యూనిస్టు ఉద్యమాలు, మావోయిస్టు ఉద్యమాలు, పౌరహక్కుల ఉద్యమాలు ఎన్నో త్యాగాలు చేశాయి. కొన్ని ఫలితాలు సాధించాయి. ముఖ్యంగా పౌరహక్కుల ఉద్యమం కొన్ని సామాజిక, తాత్విక విలువల్ని సమాజం ముందు ఉంచింది. ఈ ఉద్యమంలో పనిచేసి, బతికి ఉన్న వ్యక్తినీ ఆఖరివరకు పరీక్షించవలసి ఉండగా, చనిపోయిన కన్నబీరన్, బాలగోపాల్ ఆ ఉద్యమాల్ని ఆస్తుల సంపాదనకెట్లా ఉపయోగించకూడదో నిరూపించారు. పోతే ఆ ఉద్యమంలో కొన్ని భూస్వామ్య శక్తులు చేరాయి. అవి ఆస్తుల రక్షణకు ఆ ఉద్యమాన్ని ఉపయోగించుకున్నాయి. దాని చుట్టూ పదవుల పైరవీశక్తులు కూడా ఉండేవి. అవి పౌరహక్కల ఉద్యమ పలుకుబడిని ఉపయోగించుకునేవి. 

ఈ రెండో తరం శక్తులు ఇప్పుడున్న కాంట్రాక్ట్ గాంధేయవాద తెలంగాణ ఉద్యమం చుట్టూ చేరాయి. తెలంగాణలో ఒక కాంగ్రెస్, బింద్రన్‌వాలే లాంటి రాజకీయ ఉద్యమ అగ్రకుల శక్తుల్ని సృష్టించింది. ఏ రాజకీయ ఉద్యమ వాతావరణాన్నైనా మూడు రకాలుగా వాడుకోవొచ్చు. (1): ప్రజల సమస్యలు తీర్చడానికి వారిని అభివృద్ధి పరచడానికి. ఈ రకం పని అగ్రకుల దోపిడీ కుటుంబాల నుంచి వచ్చినవారు చాలా తక్కువ మంది చేశారు. (2) తమ కుటుంబ, కుల అభివృద్ధి కోసం అన్ని రకాల సామాజిక రంగాలను ఉపయోగించుకోవడం. అందులో మంచి చెడులను జోడించడానికి ఆస్కారాన్ని కల్పించడం. ఇక్కడ పైకొక రూపం కనబడుతుంది. లోపల స్వప్రయోజనాల ప్రక్రియ సాగుతుంది. 

ఇందులో అవినీతి అవసరాన్ని బట్టి పెరుగుతుంది. (3) అరాచక బృందాలను ఆర్గనైజ్ చేసి, ప్రాంతాలనూ, రాష్ట్రాన్ని, దేశాన్ని దండుకోవడం. ఇక్కడ నీతి కవచం కూడా అక్కరలేదు. దండుకోవడం రాచబాటగా సాగుతుంది. మన రాష్ట్రంలో అధికారంలో ఉండి వై.ఎస్.ఆర్. కుటుంబం ఆ పని చేసింది. తెలంగాణ రాష్ట్రం సాధింపు పేరుతో కె.సి.ఆర్. కుటుంబం ఆ పని చాలా వరకు జంకుగొంకు లేకుండా చేస్తున్నది. ఈ రెండు కుటుంబాల చుట్టూ శేర్‌దార్లు ఉన్నారు. ఎవరికైనా ఉంటారు. వీరికి, వారి సంబంధాలు, లాయల్టీలను బట్టి వాటాలుంటాయి. విచిత్రమేమిటంటే ఈ రెండు కుటుంబాల్ని కాంగ్రెసే పెంచి పెద్ద చేసింది. ఈ విధంగా సంపాదించడానికి తెగబడ్డవారు చాలా ధైర్యశాలుల్లా, ప్రజాప్రయోజకుల్లా నీతులు బోధిస్తూనే సంపాదన పోగు చేస్తారు. 

కె.సి.ఆర్, లక్ష్మీరాజం రూ.5,700 కోట్ల పోలవరం కాంట్రాక్ట్‌ను సంపాదించింది ఈ డేర్ డెవిల్ రాజకీయ ప్రక్రియతోనే. పోలవరం కాంట్రాక్ట్‌లో పొలిటికల్ జేఏసీ పేరుతో పనిచేసే ప్రధానశక్తులకు వాటా లేదంటే పిచ్చివాళ్లు మాత్రమే నమ్మాలి. సకల జనుల సమ్మెతో కేంద్రం మెడలు వంచి, ఈ కాంట్రాక్ట్‌ను సంపాదించారు. ఇది తెలంగాణ జలయజ్ఞం. ఇందులో తెలంగాణ ప్రజలకు దక్కింది ఉద్యమ కష్టాలు, కూలీదినాలు కోల్పోవడం, పంటలు ఎండిపోవడం, యువకుల చావులు, వేలాది కుటుంబాలు కుప్పకూలడం, తెలంగాణలో బీద పిల్లల చదువులు సంపూర్ణంగా నాశనం చెయ్యడం, చిన్న ఉద్యోగ కుటుంబాలను రోడ్లమీద పడెయ్యడం. ఇవన్నీ కూడా అక్రమ సంపాదనకు, పేరు ప్రతిష్ఠలతో సహా పూనుకున్నవానికి సమస్యలనిపించవు. 

కాంగ్రెస్ జగన్ వంటి వ్యక్తి చేతిలో కూలిపోయే ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తెలంగాణలో ఒక దోపిడీ వ్యవస్థను పోషిస్తూ ఉంది. వీరి ఆదాయాల మీద ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్ నుంచి కాపాడినందుకు ఇక్కడి ప్రభుత్వం వీరికి రుణపడింది. ఆ రుణం తీర్పులో భాగమే పోలవరం, మెట్రోలైన్‌లో ఈ గుంపు బంధువులకు సబ్ కాంట్రాక్ట్‌లు, కొంత మందికి ఉచిత కొత్త కార్ల బహుమతులు దక్కాయి. 

అదే సందర్భంలో బీసీ, ఎస్సీల మీద ఎనలేని దాడులు, చెరుకు సుధాకర్ లాగా జైలు జీవితాలు తమ వృత్తి జీవితాలు చిన్నాభిన్నం మామూలయ్యాయి. పోతే వీరి చుట్టూ ఉండే బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా వారినే నమ్ముతున్నారు. కనుక ఎన్ని బాధలనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉంటారు. రాయలసీమలో దొరల రక్షణ పోరాటంలో ఉన్నవారికి జైలులో ఉన్న చెరుకు సుధాకర్‌కు తేడా లేదు. ఇప్పుడున్న ప్రక్రియలో ఎవరు తెలంగాణ ఇస్తున్నారు? ఎవరు తెస్తున్నారని నమ్మాడాయన. 

బీసీ, ఎస్సీ ప్రొఫెషనల్స్ తమ చుట్టూ నాలుగు పైసలు కనబడగానే రాజకీయ నాయకులు కావాలని ఏ పార్టీ చుట్టూ అంటే ఆ పార్టీ చుట్టూ తిరుగుతున్నారు. ఏ నాయకుని బడితే ఆ నాయకున్ని నమ్ముతున్నారు. అంబేద్కర్, పూలేల పోరాట ప్రక్రియలో భాగంగా గ్రామీణ విద్యావిధానాన్ని అభివృద్ధి చేసేందుకు భాగస్వాములు కారు. రిజర్వేషన్ పోరాటంలో అంతగా పాల్గొనరు. అగ్రకుల సంపాదకులను నమ్మినట్లు కింద కుల మేధావి, రాజకీయ శక్తులను నమ్మరు. 

పోలవరం కాంట్రాక్ట్ టీఆర్ఎస్ శక్తులకు ఇవ్వకుండా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 'తెలంగాణ ఇవ్వలేము' అని ప్రకటన చెయ్యగలిగేవారు కాదు. ప్రజల ప్రాణాలు తోడుతూ కాంట్రాక్ట్, అక్రమసంపాదన చేసిన వారు దేవాలయాల చుట్టూ తిరిగే మొక్కుబడులు చెల్లించాల్సిందే. అదే చేస్తున్నారు.

1969లో ఉద్యమాన్ని ఆనాటి నాయకుడు పదవులకు అమ్మితే, ఇప్పుడొక నాయకముఠా ఆస్తుల సంపాదన కోసం అమ్ముతున్నది. దేశంలో అవినీతిపై జరుగుతున్న చర్చ వీరికి కాలిగోటితే సమానం. ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఇప్పుడు రోజువారీ కార్యక్రమమైంది. ప్రతిరోజు పెద్ద గుంపు అబద్ధాలు చెబుతూంటే, మీడియా వారి పైసల పలుకుబడికి లొంగి ఆ అబద్దాలను ప్రచారం చేస్తుంటే ప్రజలు నమ్ముతారు. అదీ ఉద్యమం పేరుతో చెప్పే అబద్ధాలు బాగా అతుక్కుంటాయి. తెలంగాణ అమ్మకానికున్న ఓ ఆడబిడ్డ అయింది. 

ఇప్పుడు పోలవరం కాంట్రాక్టు ఉంటుందా ఉండదా అన్నది సమస్యకాదు. ప్రాంతమంతా మోసపోయిందనేది సమస్య. ఈ కరప్ట్ శక్తులకు కాంగ్రెస్ ఎందుకు అండగా ఉంటుంది? రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని కాపాడిందే ఈ శక్తులు కనుక. ఇప్పుడు మాయావతి ఎత్తుగడలో భాగంగా తెలంగాణ వస్తే (రెండో ఎస్సార్సీలోనైనా) పైసలు, పలుకుబడి, రాజకీయ అధికారం దక్కుతుందని చూస్తున్నాయి. కానీ అది గమనించిన ఆంధ్ర శక్తులు పోలవరమిచ్చాకా తెలంగాణ'వరం' అసలు ఏ దశలోనూ ఇవ్వకూడదని నిర్ణయానికి వచ్చాయి. అందుకే రెండో ఎస్సార్సీ వేసినా తెలంగాణ అందులో ఉండదు అంటున్నారు. అవును మరి వంద కోట్ల చందాలు, వేల కోట్ల పోలవరం ఇచ్చాకా తెలంగాణ ఎందుకిస్తారు? 

ఈ స్థితిలో తెలంగాణ ప్రజలు ఈ శక్తులకు 2014లో ఓటేసి ఎన్ని సీట్లు గెలిపిస్తే అన్ని వందలకోట్లకు వాటినమ్ముతారు. ఏ పార్టీ ధర ఎక్కువ పెడితే, ఆ పార్టీకి (కాంగ్రెస్ లేదా బి.జె.పి) అమ్ముతారు. శిబూసోరేన్ ఇలాగే అమ్ముకొని జైలుకు పోయిన సంగతి మనకు తెలుసు. ఇక్కడ రాష్ట్రం రాకముందే మధుకోడాలు, శిబూసోరే న్‌లు పుట్టి, పెరిగి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ బడుగు జీవులారా, బలహీనవర్గాల మేధావుల్లారా తస్మాత్ జాగ్రత్త. పెనం మీది తెలంగాణ వీరి చేతిలో పెట్టి పొయ్యిలో పడేయకండి. ఈ తెలంగాణలోనే ఏదో ఒక తల్లికడుపులో మంచి నాయకుడు పుడతాడు. అంతవరకు ఆగండి. 

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత
Andhra Jyothi Telugu News Paper Dated 29/11/2011

Sunday, November 27, 2011

కులాన్ని త్యజించిన కిషన్‌జీ - డాక్టర్ యం.ఎఫ్.గోపీనాథ్మిత్రులు మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాల్‌లకు జన్మనిచ్చిన మధురమ్మ, వెంకటయ్యలూ, మీకు పాదాభివందనం. కోటేశ్వరరావు, వేణుగోపాల్‌లు అపూర్వ సోదరులు. ఈ దేశ సంపదను, సార్వభౌమత్వాన్ని తమ ప్రాణాలొడ్డి కాపాడేందుకు ప్రయత్నించిన ఎస్.ఆర్.శంకరన్, ఐవి సాంబశివరావు (పీపుల్‌వార్ పార్టీ నిర్మాతల్లో ఒకరు), మల్లోజుల బ్రదర్స్, ఆర్‌కె, చెరుకూరి రాజకుమార్... వీళ్ళంతా అన్ని అవకాశాలున్న సామాజిక వర్గానికి చెందినవారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాల్ని అందిపుచ్చుకుని, చట్టాలను కాలరాస్తూ రమణ్ సింగ్, మహేంద్ర కర్మ లాంటి బడుగు వర్గాల నాయకులు ఎదిగివచ్చారు. ఇదే కుల, వర్గ రాజకీయాల్లో ఉన్న చిక్కు ప్రశ్న. 

అది 1978. హైదరాబాద్‌లోని ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో జగిత్యాల, సిరిసిల్ల పోరాటాలకు మద్దతుగా ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నాయిని నర్సింహారెడ్డి, కన్నభిరాన్ తదితర ప్రముఖులు ప్రసంగించారు. వారితో పాటు ఒక యువకుడు. జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల్లో జరుగుతున్న దొరల దౌర్జన్యాలు, ఆ దౌర్జన్యాలకు ప్రతిగా జరుగుతున్న ప్రజాపోరాటాల గురించి అద్భుతంగా, సవివరంగా, అనర్గళంగా మాట్లాడాడు. క్షేత్రస్థాయి కార్యకర్తగా, మేధోపరమైన విశ్లేషకుడిగా, ఒక ఆర్మీ కమాండర్‌లాగా ఉన్నాడు ఆ యువకుడు. 

ఆయనే మల్లోజుల కోటేశ్వరరావు అని ఆ తర్వాతే తెలిసింది. మల్లోజుల కోటేశ్వరరావుతో అప్పుడు ఏర్పడ్డ ఆ పరిచయం 1983 అక్టోబర్‌లో బస్తర్ అడవుల్లో అతి సన్నిహితంగా మారింది. అక్కడ అతిపెద్ద మిలిట్రీ క్యాంపు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీపుల్స్‌వార్ అగ్రశ్రేణి నాయకత్వమంతా ఆ క్యాంప్‌లో ఉంది. నేను ఆ క్యాంప్ మిలిట్రీ డాక్టర్‌ను. ఒకసారి మాంసం వండిన రోజు నేను అన్నం తినలేదు. ఆ సందర్భంగా ప్రహ్లాద్ ఎలియాస్ మల్లోజుల కోటేశ్వరరావు నాతో కొంతసేపు మాట్లాడారు. నా అభిప్రాయాలు, అభిరుచులను తెలుసుకున్నారు. 

ఆ సందర్భంలో తీవ్ర అస్వస్థతకు గురైన కటకం సుదర్శన్(ఆనంద్-ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజినల్ బ్యూరో సెక్రటరీ)కి నేను వైద్యం చేశాను. ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడడంతో కామ్రేడ్స్ అందరూ సంతోషించారు. ఆనంద్‌ని, ఎస్ఆర్ శంకరన్‌ని, కాన్షీరామ్‌ని కాపాడటం నా 35 ఏళ్ళ వైద్యవృత్తిలో నేను గర్వపడే సంఘటనలు. క్యాంపు పూర్తయి ఎవరి ప్రాంతాలకు వారు ప్రయాణమవుతూ కన్నీళ్ళ పర్యంతమవుతున్న క్షణాలు. 

క్యాంప్ నుంచి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఒకరోజు ప్రహ్లాద్ కొరియర్ నాకిష్టమైన కొరమేను చేపల కూరతో నా దగ్గరకొచ్చాడు. ఆ సంఘటన ఆయన మానవ సంబంధాలకు సాక్ష్యంగా నిలుస్తుంది. మల్లోజుల బ్రాహ్మణిజం లేని బ్రాహ్మణుడు. ఈ దేశంలో కులాన్ని త్యాగం చేస్తే, చేసిన వ్యక్తి ఏ త్యాగానికైనా సిద్దపడుతాడని అంటాను. అటువంటి త్యాగాన్ని మల్లోజుల బ్రదర్స్ చేశారు. అపురూపమైన అన్న మల్లోజుల కోటేశ్వరావును చిదంబరం, మమతలు పొట్టనపెట్టుకున్నారు. 

ప్రొఫెసర్ హరగోపాల్ అన్నట్లు ఈ దేశ సార్వభౌమత్వాన్ని, దేశ వారసత్వ సంపదల్ని కాపాడుతున్నది వాస్తవంలో ఆదివాసీలే. దేశాన్ని టోకుగా, చిల్లర చిల్లరగా అమ్ముతున్నది రాజకీయ నాయకులు, అవినీతి పరులైన ఉన్నతాధికారులే. దేశానికి చెడుచేస్తున్నవారే నిత్యం మనందరి గౌరవ మర్యాదలు పొందుతున్నారు! లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ ఘరానా మనుషులు స్వాయత్తం చేసుకొంటున్నారు. ఈ దేశ సందను విదేశీ పెట్టుబడిదారుల నుంచి కాపాడే ఆదివాసీలు, వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న ఆదిరెడ్డి, సంతోష్ రెడ్డి, అజాద్, కిషన్‌జీలు అత్యం త ప్రమాదకారులుగా ముద్రవేయబడి కిరాతకంగా చంపబడుతున్నారు. ఈ చట్టబద్ధ అవినీతిపరులకు అండగా నిలవబట్టే ప్రజాస్వామ్యం రాజకీయ రౌడీల స్వామ్యంగా వర్ధిల్లుతోంది. 

ఈ చట్టబద్ధ అవినీతిని ప్రశ్నించినందుకే డాక్టర్ బినాయక్ సేన్‌ని దేశద్రోహి అన్నారు. కాశ్మీర్‌లోని రాజ్య హింసను ప్రశ్నించబట్టే అరుంధతీరాయ్ మీద దేశ ద్రోహ నేరం పెట్టాలని కాశ్మీర్ పండిట్ సంఘం కోర్టులో 'పిల్' వేసింది. మావోయిస్టు పార్టీ ఆదివాసీ ప్రాంతాలలో నిర్మిస్తున్న నూతన ప్రజాస్వామిక 'జనతన సర్కార్' వివరాలను ఆమె లోకానికి చాటి చెప్పి పాలకుల ఆగ్రహానికి గురయ్యారు. దేశ సంపదను కాపాడే వాళ్ళకు మద్దతివ్వడం కూడా దేశద్రోహమే అయినపుడు, పార్లమెంట్‌లో, అసెంబ్లీలో రాజకీయ నాయకులు మాటలకు, వారి చేతలకు పొంతన లేకుండా పోవడమూ దేశద్రోహం కిందకే వస్తుంది. 

కిషన్‌జీని మేము చంపలేకపోయామే అని బుద్ధదేవ్ బాధపడి ఉండవచ్చు, ఆ పని తాను చేసినందుకు మమతా బెనర్జీ విర్ర వీగుతూ ఉండవచ్చు. కిషన్‌జీ దీర్ఘ నిద్రలోకి వెళ్ళగా, 16 రాష్ట్రాల్లోని ప్రజా కంటకులకు నిద్ర కరవయింది. మన్మోహన్, సోనియా, చిదంబరం, మమతా బెనర్జీలకు ఇప్పుడు నిద్రలేని రాత్రులెన్నో. దేశవ్యాప్తంగా రెడ్ ఎలర్ట్. పులి అంజన్న, ఆదిరెడ్డి, సంతోష్‌రెడ్డి, మాధవ్, పటేల్ సుధాకర్ రెడ్డి, అజాద్, కిషన్‌జీలు ఒక్కొక్కరు చనిపోయి కూడా బ్రతికున్న పాలకవర్గాల ముఠాలకి నిద్రలేకుండా చేస్తున్నారు. రాజ్యం ఉన్నంతవరకు అణచివేత ఉంటుంది. 

ప్రజారాజ్యం వస్తే అణచివేత తగ్గుతుంది. 1980ల్లో రాడికల్ ఉద్యమంలోకి ఎదిగి వచ్చిన నాయకత్వంలోని ఒక్కొక్కరు ఒరిగిపోతున్నారు. ఇది ఉద్యమాల గతితర్కం. దోపిడీ వర్గాల కొరకు ఆ దోపిడీ కులవర్గ సమాజం వాళ్ళ నాయకత్వాన్ని సృష్టించుకుంటూనే ఉంది. పది శాతం కూడా లేని నీతిమాలిన దోపిడీ వర్గాలు తమ నాయకుల్ని, మేధావుల్ని, బ్యూరోక్రాట్స్‌ని సృష్టించుకుంటే, శ్రామిక వర్గం తన నాయకుల్ని, మేధావుల్ని సృష్టించుకోలేదా? ఈ దేశ చరిత్రలో భగత్‌సింగ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, అంజన్న, శ్యాం, సంతోష్, అజాద్, కిషన్‌జీల వంటి శ్రామిక వర్గ పోరాట యోధులు రాబోయే కాలంలో నిత్య నూతనంగా ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటారు. 

1985 నుంచి 89 వరకు తెలుగుదేశం అవలంభించిన అణచివేత విధానాలకు వ్యతిరేకంగా 1989లో వరంగల్ రైతు కూలి సభలకు తరలి వచ్చిన సకలజనులు మర్రి చెన్నారెడ్డి, దొర, వ్యాస్‌ల గుండెలదిరిపోయేట్లు చేశారు. 2004లో రాజశేఖర్ రెడ్డి కుట్రతో మొదలు పెట్టిన చర్చలే అయినా ఆ నాలుగు రోజుల్లో మావోయిస్ట్ నాయకత్వం మీద అశేష ప్రజానీకం నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తటస్థ మేధావులు కూడా ఎంతో అభిమానం చూపారు. 2003లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతం నుంచి ఒక గవర్నమెంట్ హాస్పిటల్‌లో పనిచే సే ఉద్యోగి నా దగ్గర వైద్యం చేయించుకునేందుకు వచ్చారు. 

ఆ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారు కదా... మరి మీరు ఉద్యోగం ఎలా చేస్తున్నారని అడిగితే... వాళ్ళుండబట్టే ధైర్యంగా ఉద్యోగం చేయగలుగుతున్నామని ఆమె చెప్పారు. లేకుంటే ఈ రాజకీయ నాయకుల ఇళ్ళలో పనిచేయవలసి వచ్చేదని ఆమె వివరించారు. మరో ఉదాహరణ! 2010 లో ఒక రోజు నేను హైదరాబాద్ నుంచి తొర్రూరు మీదుగా ఖమ్మం వస్తున్న సమయంలో తెలంగాణ యువకులు రాస్తారోకో చేస్తున్నారు. నేను కారు దిగి సంఘీభావం తెలుపుతున్న సమయంలో, మాలాగే ఒక వ్యాపారస్తుడూ తన కారులోంచి దిగాడు. 

దొంగలు నాయకత్వం వహిస్తుంన్నందు వల్లనే తెలంగాణ రాష్ట్రం రావడం ఆలస్యమవుతోంది, 'అన్నలు' ఉన్నట్లయితే ప్రత్యేక రాష్ట్రం ఎప్పుడో వచ్చి ఉండేది అని అన్నాడు ఆ మార్వాడీ వ్యాపారస్తుడు. వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో దొర దగ్గర పనిచేస్తున్న దళిత జీతగాడు పీపుల్స్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత ఒకరోజు ఆ గ్రామ రచ్చబండ దగ్గరకు వచ్చినపుడు ఆ ఊరి దొర గతంలో తన దగ్గర పనిచేసిన దళిత జీతగాడ్ని 'నమస్తే అన్నా!' అని పిలుస్తూ దగ్గరికొచ్చాడు. పీపుల్స్‌వార్ విప్లవోద్యమం మూలాన తెలంగాణ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. అగ్రవర్ణ దొరల పెత్తనాన్ని దెబ్బతీయడమే తెలంగాణకు విప్లవోద్యమం చేసిన మేలు. 

ఇదీ ప్రజాబాహుళ్యంలో పీపుల్స్‌వార్, మావోయిస్టు పార్టీల్లోని నక్సలైట్స్ నాయకత్వం మీద ప్రజలకు ఉన్న నమ్మకం. ఇక్కడ ఒక ప్రశ్న వేసుకోకతప్పదు. 1970 కన్నా ముందు అధికారంలో ఉన్న మంత్రులకి, ఎమ్మెల్యేలకి పోలీస్ రక్షణ, జెడ్ క్యాటగిరీ రక్షణ యిప్పుడున్నంతగా ఉండేదా? వీళ్లకి పోలీసు రక్షణ లేకపోతే చంపేస్తారా? చివరికి వీళ్ళ పడగ్గది చుట్టూ కూడా రక్షణ కవచాలెందుకు ఏర్పరుచుకుంటున్నారు? ఒకసారి ఒక రౌడీ రాజకీయ నాయకుడికి గార్డ్‌గా ఉన్న పోలీసు ఆఫీసర్ తో 'ఏమనిపిస్తుందండీ ఇటువంటి నాయకునికి రక్షణ యిస్తుంటే' అని అడిగాను. 

'మా ఖర్మ సార్, మా ఖర్మ', ఇలాంటి రౌడీ వారికి కూడా కాపలాకాయాల్సి వస్తోంది. నక్సలైట్లు వచ్చి వీడినెత్తుకుపోతే బాగుణ్ణు అన్నాడు. బాగా చదువుకున్న వాళ్ళు నక్సలైట్లుగా వెళుతున్నారు. చదువుకున్న వాళ్ళు మేధావులూ పార్లమెంట్, అసెంబ్లీల్లోకి వెళ్ళాలి అని అప్పుడప్పుడు అమాయకంగా సమాజ శ్రేయోభిలాషులు ఉపన్యాసాలిస్తుంటారు. మన్మోహన్‌సింగ్, సోనియా గాంధీ, చిదంబరం, రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు... వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కాదా! చదువు, పుస్తకజ్ఞానం ఉంటే సరిపోదు సమాజ శ్రేయస్సుకి సంబంధించిన జ్ఞానం కావాలి. 

సమాజశ్రేయస్సు త్యాగాన్ని కోరుతుంది. మనిషికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాణత్యాగాన్ని కోరుతుంది. పేద ప్రజల కోసం తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించటం మహోన్నతమైన మానవులకే సాధ్యం. ఆ కోవలోని వారే ఆజాద్, కిషన్‌జీలు. వారి ఆశయాలు ఈ దేశ పీడిత ప్రజల్ని ఎప్పటికీ ముందుకే నడిపిస్తాయి. వారు అమరులు! వారికివే మా జోహార్లు. 

- డాక్టర్ యం.ఎఫ్.గోపీనాథ్
కార్డియాలజిస్ట్, పూలే-అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్
Andhra Jyothi Telugu News Paper Dated 27/11/2011 

భావనాశక్తిని మేలుకొల్పిన పోరాటం - అరుంధతీ రాయ్

ఐదు రోజుల క్రితం జుకొట్టి ఉద్యానవనంలో ఉన్న జనులందరినీ పోలీసులు తరిమివేశారు; ఆ జనులందరూ ఈ రోజు మళ్ళీ అదే ప్రదేశానికి తిరిగివచ్చారు. అసంఖ్యాక ప్రజలు నిర్వహిస్తోన్న ఈ నిరశన ఆ ప్రదేశం కోసం చేస్తున్న యుద్ధం కాదని పోలీసులు తెలుసుకోవాలి. ఇక్కడగాని, అక్కడ గాని, మరెక్కడైనా గానీ ఒక ఉద్యానవనాన్ని ఆక్రమించుకొనే హక్కు కోసం మనం పోరాడడం లేదు. న్యాయం కోసం మనం పోరాడుతున్నాం. న్యాయం, కేవలం అమెరికా ప్రజలకే కాదు, ప్రతి ఒక్కరికి సమకూరేందుకై మనం పోరాడుతున్నాం.

అమెరికాలో సెప్టెంబర్ 17న వాల్ స్ట్రీట్ ఆక్రమణ ఉద్యమం ప్రారంభమైననాటి నుంచీ మీరు సాధించింది సామ్రాజ్యం హృదయంలోకి ఒక కొత్త భావనా శక్తి (ఇమాజినేషన్)ని, ఒక నూతన రాజకీయ భాషను ప్రవేశపెట్టడం. ప్రతి ఒక్కరినీ కర్తవ్య మూఢుల్ని చేసిన, బుద్ధిహీన వినియోగదారీతత్వాన్ని ఆనందం, సాఫల్యాలతో సమం చేసేలా సమ్మోహనపరిచిన వ్యవస్థలోకి కలలుగనే హక్కును మీర పునఃప్రవేశపెట్టారు. ఒక రచయితగా మీకు ఒక విషయాన్ని చెప్పనివ్వండి - మీరు చాలా గొప్ప విజయం సాధించారు. ఇందుకు మీకు నా కృతజ్ఞతలను నేను పరిపూర్ణంగా వ్యక్తం చేయలేను.

మనం న్యాయం గురించి మాట్లాడుతున్నాం. నేడు మనం ఇక్కడ మాట్లాడుకొంటుండగా అమెరికా సాయుధ బలగాలు ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లో ఆక్రమణ యుద్ధాన్ని చేస్తున్నాయి. అమెరికా డ్రోన్స్ (మానవరహిత విమానాలు) పాకిస్థాన్‌లో పౌరులను హతమారుస్తున్నాయి. వేలాది అమెరికా సైనిక దళాలు, హంతక బృందాలు ఆఫ్రికాలోకి వెళుతున్నాయి. మీ లక్షల కోట్ల డాలర్లను ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లో ఆక్రమణల వ్యవహారాలను నిర్వహించడానికి వినియోగిస్తున్నారు. ఆ ఆక్రమణలు చాలలేదు కాబోలు, ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రారంభించడం గురించి మాట్లాడుతున్నారు.

(1930ల) మహా మాంద్యం నాటి నుంచి ఆయుధాలను ఉత్పత్తి చేయడం, యుద్ధాన్ని ఎగుమతి చేయడం అనేవి అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలిగిస్తున్న విధానాలలో కీలకమైనవిగా ఉన్నాయి. ఇటీవలే అధ్యక్షుడు బరాక్ ఒబామా నేతృత్వంలో అమెరికా సౌదీ అరేబియాతో 600 కోట్ల డాలర్ల ఆయుధ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. సౌదీ అరేబియన్లు ఉదారవాద ముస్లింలు, అవునా? యుఏఇకి వేలాది బంకర్ బస్టర్లను విక్రయించగలననే ఆశాభావంతో అమెరికా ఉన్నది.

సరే, మా దేశం-భారత్‌కు 500 కోట్ల డాలర్ల విలువైన సైనిక విమానాలను అమెరికా విక్రయించింది. ఆఫ్రికా ఖండంలోని మొత్తంపేద దేశాల జనాభా కంటే ఎక్కువ మంది పేదలు ఉన్న దేశం మా భారత్. ఈ యుద్ధాలు అన్నీ - హీరోషిమా, నాగసాకిలను అణుబాంబులతో నేలమట్టం చేయడం నుంచి వియత్నాం, కొరియా, లాటిన్ అమెరికాలో చేసిన యుద్ధాల దాకా- లక్షలాది మందిని బలిగొన్నాయి. వీరందరూ 'అమెరికన్ జీవన విధానం'ని సమకూర్చుకొనేందుకు పోరాడిన వారే.

మిగతా ప్రపంచమంతా అనుసరించడానికి ఆకాంక్షిస్తున్న, అందుకు నమూనాగా ఉన్న ఆ 'అమెరికన్ జీవన విధానం' ఫలితాలేమిటో మనకు తెలుసు. కేవలం నాలుగు వందల మంది వ్యక్తులు అమెరికా ప్రజల సంపదలో సగానికి యజమానులుగా ఉన్నారు. ఆ ' జీవన విధానం' ఫలితంగానే వేలాది కుటుంబాలు వీధుల పాలయ్యాయి. జీవనోపాధులను కోల్పోయాయి. మరి అమెరికా ప్రభుత్వం దివాళా తీసిన బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీలను వేల కోట్ల డాలర్లతో ఆదుకొంటోంది. ఒక్క అమెరికన్ ఇంటర్నేషనల్ గ్రూపుకే 18,200 కోట్ల డాలర్ల సహాయాన్ని అందించింది.

భారత ప్రభుత్వం అమెరికా ఆర్థిక విధానాన్ని ఆరాధిస్తోంది. అమెరికాను ఆదర్శంగా తీసుకొని ఇరవై సంవత్సరాలుగా అనుసరించిన స్వేచ్ఛా విపణి ఆర్థిక విధానాల ఫలితంగా నేడు భారతదేశపు సంపన్నులు కుబేరులయ్యారు. పేదలు నిరుపేదలయ్యారు. కుబేరుల జాబితాలో అగ్రగాములుగా ఉన్న 100 మంది భారత దేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో నాల్గవ వంతుకు సమానమైన విలువ కల ఆస్తులకు యజమానులు. మరి భారత జనాభాలో 80 శాతం మంది రోజుకు 50 సెంట్ల ఆదాయంపై బతుకుతున్నారు.

రెండున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రుణాల ఊబి నుంచి బయటపడలేకే వారీ విధంగా బతుకు నుంచి నిష్క్రమించారు. దీనిని మేము అభివృద్ధిగా పిలుచుకుంటున్నాము. అంతేకాదు ఇప్పుడు మాకు మేమే భారత్‌ను ఒక అగ్రరాజ్యంగా భావించుకొంటున్నాం. మీ మాదిరిగానే మేమూ అందుకు మంచి అర్హతలు ఉన్నవాళ్ళమే సుమా. ఏమంటే మాకూ అణ్వాయుధాలు ఉన్నాయి; అసహ్యకరమైన అసమానతలూ ఉన్నాయి.

శుభవార్త ఏమిటంటే- ప్రజలు ఈ అసమానతలను ఇంకెంత మాత్రం భరించడానికి సిద్ధంగా లేరు. వారు ఇప్పటికే వాటిని ఎంతగా చవిచూడవచ్చో అంతగా చవిచూశారు. ఆక్రమణ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా వేలాది ఇతర ప్రతిఘటనోద్యమాలతో ఏకమయింది. ఎల్లెడలా నిరుపేదలు అసమానతలకు వ్యతిరేకంగా లేచి నిలబడుతున్నారు; కార్పొరేట్ కంపెనీల దోపిడీని ప్రశ్నిస్తున్నారు. వాటి కార్యకలాపాలను అడ్డుకొంటున్నారు.

అమెరికా ప్రజలు మా పక్షానికి వస్తారని, సామ్రాజ్యం నడిబొడ్డునే ఇలా నిరసనకు పూనుకుంటారన్న విషయాన్ని మాలో చాలా తక్కువ మందిమి మాత్రమే కలగన్నాం. ఈ ఆక్రమణ ఉద్యమపు ప్రభావం, అది కల్గిస్తోన్న అపరిమిత చైతన్యం గురించి మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. వారు, ఒక శాతం మంది (సంపన్నులు), 'మనం డిమాండ్లు ఏమీ చేయడం లేదని' అంటున్నారు. బహుశా వారికి తెలియదేమో- తమను సంపూర్ణంగా నాశనం చేసేందుకు మన ఆగ్రహం మాత్రమే చాలునని. అయితే ఇక్కడ కొన్ని విషయాల- నాకు గల 'విప్లవ పూర్వపు ఆలోచనలు'- గురించి మనం కలిసికట్టుగా ఆలోచించాలి.

అసమానతలను ఉత్పత్తిచేస్తోన్న ఈ వ్యవస్థను మనం అదుపు చెయ్యాలి. వ్యక్తులూ, కార్పొరేట్ సంస్థలూ అంతులేకుండా ఆస్తులు, సంపదలూ సమకూర్చోవడాన్ని నిరోధించాలి. మరి మన డిమాండ్లు ఇవి: (అ) వ్యక్తులుగాని, కార్పొరేట్ కంపెనీలు కాని వేర్వేరు రంగాలలోని సంస్థలకు యజమానులుగా ఉండకూడదు. ఉదాహరణకు ఆయుధాల ఉత్పత్తిదారులు టీవీ స్టేషన్లకు సొంతదార్లు కాకూడదు; మైనింగ్ సంస్థలు వార్తా పత్రికలను నడపకూడదు; విశ్వవిద్యాలయాలకు వ్యాపార సంస్థలు నిధులు సమకూర్చకూడదు; ప్రజారోగ్యనిధులపై డ్రగ్ కంపెనీలకు ఏ విధమైన నియంత్రణ ఉండకూడదు.

(ఆ) సహజ వనరులను; నీటి సరఫరా, విద్యుత్తు, ఆరోగ్య భద్రత, విద్య మొదలైన మౌలిక సేవలను ప్రైవేటీకరణ చేయకూడదు.
(ఇ) ప్రతిఒక్కరికీ గృహ వసతి ఉండాలి; విద్య, ఆరోగ్య భద్రత సదుపాయాలు ఉండాలి. (ఈ) సంపన్నుల పిల్లలు, తమ తల్లితండ్రుల సంపదను వారసత్వంగా పొందడానికి వీలులేదు.
ఈ పోరాటం మన భావనాశక్తిని మళ్ళీ మేలుకొల్పింది. న్యాయ భావనను కేవలం 'మానవ హక్కుల'కు పెట్టుబడిదారీ విధానం కుదించివేసింది. సమానత్వాన్ని స్వప్నించడం దైవ దూషణ నేరంగా పరిణమించింది. సంపూర్ణంగా నిర్మూలించాల్సిన వ్యవస్థను సంస్కరణలతో బాగు చేసుకోవడానికి మనం పోరాడడం లేదు.
మీ పోరాటానికి నా ప్రణామాలు.
సలామ్, జిందాబాద్.

- అరుంధతీ రాయ్

(న్యూయార్క్ నగరంలోని పీపుల్స్ యూనివర్సిటీలో ఈ నెల 19న ప్రముఖ రచయిత్రి, అరుంధతీరాయ్ 'ఆక్యుపై వాల్ స్ట్రీట్' ఉద్యమానికి మద్దతుగా చేసిన ప్రసంగ పాఠం)
Andhra Jyothi News Paper Sampadakiyam Dated 27/11/2011

Friday, November 25, 2011

చరిత్ర నిర్మాత కిషన్ జీ By-బి.ఎస్.రాములుచరిత్ర నిర్మాతలు ప్రజలే. ఆ ప్రజలను ముందుకు నడిపే నాయకుడు చరిత్ర నిర్మాతగా నిలిచిపోతాడు. కిషన్‌జీ 40 ఏళ్ల భారతీయ సామాజిక ఉద్య మ నిర్మాణంలో ఒక చరిత్ర నిర్మాత. కోటేశ్వరరావుతో జ్ఞాపకాలు ఎన్నో. కలిసి పనిచేసిన క్రమంలో వ్యక్తిత్వం, స్వభావం, సిద్ధాంత గాఢత ఎదుగుతున్న తీరు గమనిం చే అవకాశం సహచరులకు, అనుచరులకే ఎక్కువ తెలుసు. తొలి నుంచీ ఉద్యమం లో పనిచేస్తున్న వారికి, ఉద్యమంలో ఎదిగివస్తున్న వారికి ఇంకాఎక్కువ తెలుసు. మిగతా ప్రపంచానికి కేవలం వారి ప్రాచుర్యం మాత్రమే తెలుసు. ఒక సత్తెన్న, చంద్రమౌళి, గణపతి, అల్లంనారాయణ, నారదాసు లక్ష్మణరావు, వరవరరావు, గద్దర్, డాక్టర్ గోపీనాథ్, జాప లకా్ష్మడ్డి వంటి వారికే కోటేశ్వరరావు ఎదిగివచ్చిన క్రమాలు వివరంగా తెలుసు. ఆయన తో కలిసి పనిచేసిన కాలంలో నేను గమనించిన అంశాలు అందులో కొన్ని మాత్రమే. జాప లకా్ష్మడ్డిని కరీంనగర్ ఉద్యమకారులందరూ ఆత్మీయంగా ‘బాపూ’ అని పిలిచేవారు. కిషన్‌జీకి పెద్దల పట్ల అపారమైన గౌరవం. నేను విస్తృత అధ్యయనం చేయడంలో కామ్రేడ్ ప్రహ్లాద్ పాత్ర మరువలేనిది. మేము కలిసి పనిచేసిన కాలంలో వయస్సులో నాకన్నా చిన్నవాడైనప్పటికీ అనుభవంలో, అవగాహనలో నాకు ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్‌గా స్ఫూర్తినిచ్చాడు. అతని కార్యదీక్ష, కమిట్‌మెంట్ నాలాగే ఎందరినో ఉత్తేజపరిచింది. 

కోటేశ్వరరావును మొదటిసారిగా 1977లో కరీంనగర్ పాత బస్‌స్టాండ్‌లోని ఒక హోటల్‌లో కలిశాను. ఆరోజు చాయ్ తాగుతూ యువకులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. అందులో నారదాసు లక్ష్మణ్‌రావు, జీవగడ్డ విజయ్‌కుమార్ తదితరులు గుర్తున్నారు. కోటేశ్వరరావు తన వాదాన్ని బలంగా వినిపించాడు. యువకుడు చాలా షార్ప్ అనుకున్నాను. నేను అప్పుడు ఎలగందులలో ఉద్యోగం చేస్తున్నాను. ఆ తర్వా త యేడాదికి జగిత్యాల జైత్రయావూతలో కోటేశ్వరరావు, సాయిని ప్రభాకర్, కల్లూరి నారాయణ తదితరులు క్రియాశీల పాత్ర నిర్వహించారు. జగిత్యాల జైత్రయాత్ర ఉద్యమ చరివూతలో ఒక మైలురాయి. 
కిషన్‌జీ లేకుండా మూడు దశాబ్దాల విప్లవోద్యమ చరివూతను ఊహించలేము. చరివూతలో కొందరు చిరస్థాయిగా నిలిచిపోతారు. అలా చరివూతలో అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్, చారుమజుందార్, సరోజ్‌దత్తా, లోహియా, కాన్షీరామ్‌లు చరివూతలో విడదీయలేని భాగం. వాస్తవాల మీద ఆధారపడి చరిత్ర పరిణామాలను, ఉద్యమాలను వాటి ప్రభావాలను విశ్లేషించాలనుకున్నప్పుడు కొండపల్లి సీతారామయ్య, కెజి సత్యమూర్తి, ఐవి సాంబశివరావు, బండయ్య మాస్టారు, డా. చిరంజీవి, పులి అంజయ్య, లింగమూర్తి, తరిమెల నాగిడ్డి, దేవులపల్లి వెంక చండ్ర పుల్లాడ్డి తదితరులు నిర్మించిన ఉద్యమాలను వాటి ప్రభావాలను పరిశీలించకుం డా చేసే సామాజిక విశ్లేషణ అసమక్షిగమైనది. 

సత్యాలను వక్రీకరించే వాల్లే నిజమైన చరిత్ర నిర్మాతలను వదిలేసి చరిత్ర పరిణామాలను రాస్తుంటారు. నక్సల్‌బరీ శ్రీకాకుళ భూస్వామ్య వ్యతిరేక గిరిజన రైతాంగ పోరాటాలు లేకుండా భూ సంస్కరణలు లేవు. కానీ చాలామంది ఈ వాస్తవాన్ని వదిలేసి చరివూతను, భూసంస్కరణలను గురించి రాస్తుంటారు. పీవీ నర్సింహారావు నక్సల్‌బరీ శ్రీకాకుళ ఉద్యమాల ప్రభావంతోనే భూసంస్కరణలు ప్రవేశపెట్టానని వ్యక్తిగతంగా చెప్పేవారు.1970లో ఆంధ్రవూపదేశ్‌లో సాగిన భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలకు ఓ ప్రత్యేక నేపథ్యం ఉన్నది. 1968లో ఉధృతంగా సాగిన శ్రీకాకుళ ఉద్యమం అణచివేయబడిన తర్వాత ఉద్యమాన్ని మరోచోట విస్తరించాలని ఉద్యమకారులు ఆలోచించారు. 1956లో ఏర్పడిన ఆంధ్రవూపదేశ్‌లో తెలంగాణ ప్రాంతం ఒక అంతర్భాగమైన తర్వా త తెలంగాణ అభివృద్ధి, ఉపాధి అవకాశాలను ప్రాంతేతరులు ఆక్రమించుకున్నారు. దానితో పెరిగిన అసంతృప్తి 1956 నుంచి అనేక రూపాలలో వ్యక్తీకరింపబడుతూ వచ్చింది. 1968లో ఆంధ్ర గోబ్యాక్ ఉద్యమం నేపథ్యం ఇదే. ఆ తర్వాత అది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా, జై తెలంగాణ ఉద్యమంగా విస్తరించింది. లక్షలాది విద్యార్థి యువజనులు ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమ చైతన్యం పొందారు. 

అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉంటే ఆ ఉద్యమకారులంతా అస్సాం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులవలె ప్రజా ప్రతినిధులుగా, శాసనసభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా, ఉన్నతాధికారులుగా అభివృద్ధి పరిణామం వేగంగా సాగి ఉండేది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడకుండా అడ్డుకున్న వాళ్లు తెలంగాణలో నక్సలైట్ల ఉద్యమం ప్రారంభం కావడానికి కారకులయ్యారు. ఈ నేపథ్యం విప్లవోద్యమం 14 రాష్ట్రాల్లో విస్తరించడానికి పునాది అయ్యింది. అందువల్లే తెలంగాణ ప్రాంతం నుంచి ఎదిగిన నాయకత్వమే ఈ దేశాన్ని నూతన ప్రజాస్వామిక విప్లవంతో సమగ్ర సామాజిక వికాసాన్ని సాధించాలని కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి,యువజన వర్గాలతో దళిత బహుజన మహిళా సామాజిక వర్గాలతో కలిసి ఉద్యమించాలని అన్ని రంగాలను సామాజిక న్యాయం కోసం విప్లవీకరించాలని కలలుకన్నది. ఆ స్వప్నం సాకారం కోసం జరుగుతున్న పోరాటాలతో..వేలాది లక్షలాది కోట్లాది ప్రజలు,రచయితలు, కళాకారులు ఉత్తేజం పొందారు. ఉద్యమాలు నిర్మించారు. ప్రాణాలు అర్పించారు. అది తమ కర్తవ్యంగా భావించారు. 

కామ్రేడ్ ప్రహ్లాద్‌గా, రాష్ట్రకమిటీ కార్యదర్శిగా ఒక మహోజ్వలమైన చారివూతక దశకు నాయకత్వం వహించిన కోటేశ్వరరావు భారత సామాజిక ఉద్యమ చరివూతలో ఒక చెరగని సంతకం. బెంగాల్, బీహార్, ఒరిస్సా, దండకారణ్యం, ఈశాన్య రాష్ట్రాలలో కిషన్‌జీ ఒక జాతీయ నాయకుడిగా మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్టుగా ఎన్నో మైలు రాళ్లను అధిగమించారు. గొప్ప నాయకుడు స్ఫూర్తినిస్తే ప్రజలు ఎంత గొప్పగా ఉద్యమిస్తారో చెప్పడానికి 40 ఏళ్లుగా కొడిగట్టి సాగుతున్న బెంగాల్ విప్లవోద్యమం కిషన్‌జీ నాయకత్వంలో లాల్‌గఢ్ వంటి పోరాటాలతో ప్రజలు ఎన్ని త్యాగాలకైనా ఎలా ముందుకొస్తారో, ఎలా చరిత్ర నిర్మిస్తారో రుజువవుతున్నది. కొందరు మైనపు బొమ్మల్లో జీవిస్తారు. కొందరు రాతి విగ్రహాల్లో జీవిస్తారు. కోటేశ్వరరావు లాంటి విప్లవకారులు ప్రజల హృదయాల్లో జ్యోతులై వెలుగుతారు. సామాజిక చరిత్ర నిర్మాణంలో చరిత్ర నిర్మాతలుగా మందు తరాలకు స్ఫూర్తి దాతలుగా కొనసాగుతుంటారు. 2009లో కిషన్‌జీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రానికి ఒక ఉత్తమమైన ముఖ్యమంవూతిగా ఎదిగే అవకాశాలున్నాయని ప్రశంసించినట్లు కలకత్తా నుంచి వెలువడే ‘ఆనంద్ బజార్’ పత్రిక పేర్కొంది. ఎవరు అవునన్నా, కాదన్నా మావోయిస్టు పార్టీ నాయకత్వంలో సాగిన ప్రజా ఉద్యమాలు వాటి చైతన్యం, వారి మద్దతు లేకుండా మమతా బెనర్జీ బెంగాల్‌లో అధికారం చేపట్టడం అసాధ్యమైన విషయం. కానీ విషాదకరమైన విషయమేమంటే మమతా బెనర్జీ ముఖ్యమంవూతిగా పదవిలోకి వచ్చిన వెంటనే కిషన్‌జీని పట్టుకొని హత్యచేయ డం జరిగింది. 

మమతా తాను ఎవరి మద్దతుతో అధికారంలోకి వచ్చిందో.. వారినే మట్టుపెట్టి తన వర్గ స్వభావాన్ని క్రూరత్వాన్ని తొందరగానే స్పష్టం చేసుకుంది. చరివూతలో ఇలాంటి విషాదాలు మొదలు కాదు. 1980లో ఇరాన్‌లో ఫ్యూడల్‌పాలనకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో కమ్యూనిస్టు విప్లవకారులు, అయతుల్లా ఖొమేనీ వంటి మతవాదులు కలిసి పనిచేశారు. ఉద్యమం విజయవంతమైన తర్వాత ఖొమే నీ అధికారం చేపట్టి 35 వేలమంది కమ్యూనిస్టు విప్లవకారులను చంపించాడు. అలాగే పంజాబ్ రాజకీయాల్లో అకాలీదళ్‌కు వ్యతిరేకంగా బింద్రన్‌వాలేను ప్రోత్సహించిన ఇందిరాగాంధీ, బింద్రన్‌వాలేను 1984లో సైన్యం సాయంతో మట్టుపెట్టింది. వేలాది మంది సిక్కుయువకులను ఊచకోత కోయించింది. 

ప్రజల చరివూతలో సామాజిక పరిణామాల చరివూతలో విప్లవకారుల చరిత్ర మహోన్నతమైనది. వారి చిత్తశుద్ధి మచ్చలేనిది. వారిని స్వార్థపూరిత అధికార కాంక్షతో అందలాలు ఎక్కి వేల కోట్లు మెక్కి, ప్రజాపోరాటాలను రక్తపుటేరుల్లో ముంచిన పార్లమెంటరీ రాజకీయ నాయకులతో పోల్చడం పొరపాటు. ఒకరు స్వార్థం కోసం పనిచేస్తే, మరొకరు నిస్వార్థంగా సమాజం కోసం పనిచేస్తారు. సైద్ధాంతికంగా ఎన్ని విభేదాలున్నప్పటికీ వారి చిత్తశుద్ధిని శంకించలేము. అలా శంకించే వారి చిత్తశుద్ధినే శంకించాల్సి ఉంటుంది. కిషన్‌జీ నాలుగు దశాబ్దాల భారతీయ చరివూతలో ఒక మహోన్నతమైన చరిత్ర నిర్మాతగా నలిచిపోతారు. ప్రజలనుంచి ఎదిగి ప్రజానాయుకుడిగా మహోన్నతమైన మేధావిగా ఎలా ఎదుగుతారో చెప్పడానికి కిషన్‌జీ ఒక గొప్ప ప్రతీక. నా జీవితంలో బలమైన ముద్రవేసిన వారిలో కిషన్‌జీ ఒకరు.
Namasete Telangana News Paper Dated 26/11/2011


మావోయిస్టులపై అంతటా అదే ‘మమత’ By పొఫెసర్ హరగోపాల్మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ ఎన్‌కౌంటర్‌కు స్పందిస్తూ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మహాశ్వేతాదేవి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాన్ని ఫాసిస్టు చర్యగా అభివర్ణించింది. మొన్న ఎన్నికల్లో గెలిచిన మమతా బెనర్జీ తన విజయసభలో మహాశ్వేతాదేవిని ఆహ్వానించి, అతి గౌరవంగా ఆమె పట్ల నటించిన నేత. ఒక ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మావోయిస్టుల మీద విరుచుకుపడడమే కాక, మావోయిస్టు సానుభూతిపరులను కూడా వదిలేది లేదు అని దాదాపు మహాశ్వేతాదేవిని ఉద్దేశించి ఆ మాటలు అన్నట్టు ధ్వనించింది. ఇంత తక్కు వ సమయంలో ఎంత మార్పు! తాను కేంద్ర క్యాబినెట్‌లో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు కూడా మావోయిస్టు రాజకీయాలను ఒకవైపు సమర్థిస్తూ, అది ఒక సామాజిక, ఆర్థిక సమస్య అంటూ, తాను గెలిస్తే ఆ పార్టీతో శాంతి చర్చలు జరిపి పశ్చిమబెంగాల్‌లోని గిరిజనుల, అట్టడుగు ప్రజల సమస్యలకు పరిష్కారం వెతుకుతామని వాగ్దానం చేశారు. ఆరు నెలలు దాటక ముందే వాళ్లని తన బద్ధ శత్రువులుగా పరిగణించడమే కాక, వాళ్ల రాజకీయాల గురించి మాట్లాడిన వాళ్లను ఒక కంట కనిపెడుతూనే ఉన్నామనడం ఎంత విచిత్రం! ఐదారు ఏళ్లుగా తాను ఇచ్చిన మద్దతు, తన మాటల గురించి ప్రజలు ఏమనాలి? రాజకీయ నాయకులు, పార్టీలు అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వస్తూనే ఒక నూతన అవలోకాన్ని ఎత్తడం గురించే కాక, మొత్తంగా మన దేశంలోని రాజకీయ సంస్కృతినే విశ్లేషించవలసిన అగత్యం ఏర్పడింది.

బెంగాల్‌లో మమతాబెనర్జీ చేసిన రాజకీయ ఫీట్ దేశంలోని అన్ని రాజకీ య పార్టీలు (ఒక్క బీజేపీ మినహా) చేశా యి. మన రాష్ట్రంలోనే 1983లో ఎన్టీఆర్ నక్సలైట్లు దేశభక్తులు అని పొగుడుతూ అధికారంలోకి వచ్చారు. ఆయన ముఖ్యమంవూతిగా ఉన్న ఐదేళ్లలో నక్సలైట్లనే కాక పౌరహక్కుల నాయకులనూ చంపించిన ‘ఘన కీర్తి’ దక్కించుకొని మరు ఎన్నికల్లోనే ఘోరంగా ఓడిపోయాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నక్సలైట్ల సమస్య సామాజిక, ఆర్థిక సమస్య అని పేర్కొంది. మంత్రి సుధాకరరావు అధ్యక్షతన వేసిన క్యాబినెట్ సబ్ కమిటీలో ఎన్. జనార్ధన్‌డ్డి ఒక సభ్యుడు. ఆయన ముఖ్యమంత్రి పదవిలోకి రాగానే పీపుల్స్‌వార్ పార్టీ మీద నిషేధం విధించి, విపరీతమైన అణచివేత అమలు చేశాడు. చంద్రబాబు కాలంలో ముగ్గురు అగ్ర నాయకుల తో సహా లెక్కలేనన్ని ఎన్‌కౌంటర్లు చేయడంతో ప్రజా గౌరవాన్ని, విశ్వసనీయతను కోల్పోయాడు. రాజశేఖర్‌డ్డి 2004 ఎన్నికల్లో శాంతి చర్చలు జరుపుతామని వాగ్దా నం చేసి, ఆ ప్రహసనాన్ని జరిపి, తిరిగి ఎన్‌కౌంటర్లు ప్రారంభించాడు. చర్చల పట్ల వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడూ సుముఖంగా లేకున్నా, జానాడ్డి చొరవ వల్ల కొంతైనా ఈ ప్రయోగం జరిగింది. 
ఛత్తీస్‌గఢ్‌లో ఒక ప్రజా ఉద్యమం ద్వారా ఏర్పడిన రాష్ట్రంలో ముఖ్యమంత్రే స్వయాన అవినీతి కేసులలో ఇరుక్కొని పదవిని కోల్పోవడంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మావోయిస్టుల అణచివేతలో బీజేపీ రాజకీయాలను తప్పుపట్టలేము. ఆ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అణచివేతలో సంపూర్ణ నమ్మకమున్న పార్టీ. అయితే ముఖ్యమంవూతిది బీజేపీ. 

ప్రతిపక్ష కాంగ్రెస్ నేత చట్టవ్యతిరేక సాయుధ ముఠా సల్వాజుడుంకు నాయకుడు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీ కి వ్యతిరేకంగా ఇరువురు సన్నిహితులై అణచివేతను అమలు చేస్తున్నారు. ఇక ఒరిస్సాకు వస్తే, నవీన్ పట్నాయక్ జాతీయ పార్టీలను కాదని ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన ‘జెంటిల్ మెన్’ అనే పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి. కలెక్టర్ ‘కిడ్నాప్’ సందర్భంలో మధ్యవర్తులు (ముఖ్యంగా ఆర్.ఎస్. రావు )ముఖ్యమంవూతిని కలిసినప్పుడు గిరిజనుల సమస్యలకు ప్రాధాన్యమివ్వాలని, అభివృద్ధి నమూనాను పునః పరిశీలించాలని పిల్లవాడికి చెప్పినట్టుగా చెప్పాడు. ఆయన ఒరిస్సాలో అణచివేతను అమలు చేస్తూనే ఉన్నాడు. ఇది మావోయిస్టు పార్టీ పట్ల 16 రాష్ట్రాలలో పరిస్థితి. ఇది మావోయిస్టు పార్టీ రాజకీయాల వల్లా లేక వాళ్లు ఉపయోగించే పద్ధతుల వల్లా అని ప్రశ్నిస్తే, నిజానికి ‘హింస’ ప్రధానమైన కారణం కాదని ముందు గమనించాలి. అది అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తున్నాయి. 2002లో గుజరాత్ హింసాకాండలో చనిపోయిన వారి సంఖ్య, మావోయిస్టుల చర్యల్లో నాలుగు దశాబ్దాలుగా చనిపోయిన సంఖ్య కంటే ఎక్కువ. గుజరాత్‌లో అంత ‘హింస’కు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇచ్చిన నరేంవూదమోడీ ప్రధాని రేసులో ఉండడం ఎంత విచిత్రం!

దేశ రాజకీయాలు ఆరు దశాబ్దాలుగా మారుతూనే, 1980వ దశాబ్దానికి ఒక కీలకమైన మార్పుకు గురయ్యాయి. సోషలిజమా? పేదరిక నిర్మూలనా? భూ సంస్కరణలా? లేక పెట్టుబడిదారీ విధానమా అనే తర్జనభర్జనకు గురై, చివరికి సామ్రాజ్యవాద ప్రేరేపిత ప్రపంచీకరణ దశకు చేరుకున్నాం. ఇది రెండు దశాబ్దాలుగా చేసిన విధ్వంసం, దాని పర్యవసానాన్ని మనం ఇంకా పూర్తిగా అనుభవించవలసి ఉంది. మనం 1960,70లలో లాటిన్ అమెరికా దేశాలలో -వికృత అభివృద్ధిని, దానితో వచ్చిన నియంతృత్వాలను, వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు కూలిపోవడాన్ని మొదలైనవన్నీ చూశాం. మన దేశం అటువైపే వెళుతున్నట్టు అగుపడుతూనే ఉన్నది.

ప్రపంచీకరణ దేశ సంపదను, జాతి స్థూల ఆదాయాన్ని పెంచిన మాట వాస్తవం. ఈ సంపద పెరగడానికి జరిగిన విధ్వంసాన్ని మనం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. వ్యవసాయ రంగం, దాని మీద ఆధారపడిన గ్రామీణ వృత్తులు మొత్తంగా విధ్వంసం అయ్యాయి. లక్షలాది మంది రైతులు, గ్రామీణ చేతివృత్తుల వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. లక్షలాది మంది నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్నారు. విద్య, వైద్యం ప్రైవేటు పరమయ్యాయి. వీటన్నింటికి మించి ఖనిజ సంపద ఎన్నడూ లేని రీతిలో దోచుకోబడుతున్నది. ఖనిజ సంపద గల ప్రాంతాల్లోని గిరిజనులను తరిమి వేస్తున్నారు. ఇంత విధ్వంసం జరిగితే ఆ విధ్వంసంలో నుంచి సంపద పుట్టుకువచ్చింది. వచ్చిన సంపద ఎవరికి చెందింది, చెందుతున్నది అన్న ప్రశ్న? ఈ సంపద బహుళజాతి కంపెనీల, బడా పెట్టుబడిదారుల, దళారీల, రాజకీయ నాయకుల దగ్గరికి చేరుకుంటున్నది. దాని ఫలితంగానే ప్రపంచంలో అతి సంపన్నులైన పది మంది లో మన దేశం నుంచి నలుగురున్నారు. అలాగే ప్రపంచంలో ఏ దేశంలో లేనంత సంఖ్యలో జనాభాలో 41 శాతం అతి పేదవారు, అంటే సబ్ సహరన్ ఆఫ్రికా కంటే మించి మన దేశంలో ఉన్నారు. ఈ అసమానతలు సహజంగానే భిన్న ఉద్యమాలకు దారి తీస్తాయి. వాటిలో మావోయిస్టు ఉద్యమం కూడా ఒకటి. విషాద మేమంటే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ ఆర్థిక నమూనాను సమర్థించడం. 

ఈ నమూనా అమలు అంత సులభం కాదు. ప్రజా వ్యతిరేకత దేశవ్యాప్తంగా, గాంధేయ మార్గం ద్వారా, ప్రజాస్వామికంగా వ్యక్తీకరింపబడుతున్నది. అన్ని రకాల ఉద్యమాలను అణచివేయడం తప్పించి, ప్రత్యామ్నాయాల గురించి ప్రజాస్వామిక చర్చ పార్లమెంటులో కాని లేదా రాజకీయ పార్టీల మద్య కాని, ఈ మధ్య తరచుగా ఉపయోగిస్తున్న పౌర సమాజంలో కాని జరగడం లేదు. ఇది పేద ప్రజల ‘దురదృష్టం’! మొత్తంగా మావోయిస్టు పార్టీ తాము నమ్ముకున్న పద్ధతిలో ఈ అభివృద్ధి నమూనాను ప్రశ్నిస్తున్నది. పేద ప్రజలను సమీకరిస్తున్నది లేదా వారు ఉద్యమిస్తున్న ప్రాంతాల్లో మద్దతుగా నిలుస్తున్నది. అందుకే ప్రతి రాజకీయ పార్టీ ఇది కేవలం శాంతిభవూదతల సమస్య కాదు, సామాజిక, ఆర్థిక సమస్య అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగీకరిస్తున్నది. అధికారంలోకి రాగానే అణచివేయ చూస్తున్నది. మమతా బెనర్జీ ఈ మొత్తం ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. 

ఈ మొత్తం నమూనాకి ఆద్యులు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారు. దేశం నిండా ఉద్యమాలు జరుగుతుంటే, నిన్నటికి నిన్న చిరు వ్యాపారంలో (రి ట్రేడ్) వీల్ మార్కెట్‌కు అనుమతినిస్తూ, విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. దీంతో కూరగాయలు, చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటున్నవారు, చిన్న దుకాణాలు అన్నీ దెబ్బతింటాయి. వీటి మీద జీవిస్తున్న లక్షలాది మంది రోడ్డు మీద పడతారు. వాళ్లకు ప్రత్యామ్నాయాలు ఏవీ అర్థిక వ్యవస్థలో అందుబాటులో లేవు. ఇంత చిన్న చిన్న వారి పొట్టగొట్టడం ఎందుకు? ఇలాం టి విధాన నిర్ణయాలు సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి. ఆ అలజడిని తట్టుకోవడానికి అణచివేత తప్ప రాజ్యం వేరే మార్గాల గురించి ఆలోచించడం లేదు. ఒక్కసారి రాజ్యం అణచివేత రుచి చూశాక, అది వెనక్కి వెళ్లదు. ఆ అణచివేత కిషన్ జీ ఎన్‌కౌంటర్‌తో ఆగదు. జంగల్ మహల్‌లోని అమాయక గిరిజనుల మీద జరుగుతుంది. ప్రజాస్వామ్య ఉద్యమాల మీద కూడా అదే అణచివేత అమలవుతుంది.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్నే తీసుకుందాం. ఇది శాంతియుత ఉద్యమం. లక్షలాది మంది పాల్గొంటున్న ఉద్యమం. ఈ ఉద్యమకారుల మీద, విద్యార్థుల మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టారు? ఉస్మానియాలో ఎన్ని బలగాలను దించారు. ఇంకా ముందుకుపోయి నక్సలైట్ రాజకీయాలతో సంబంధాలున్నాయన్న నెపం మీద డాక్టర్ చెరుకు సుధాకర్‌పై ఎక్కడో మారుమూలలో పడి ఉన్న జాతీయ భద్రతా చట్టా న్ని ప్రయోగించారు. ఆయన టీఆర్‌ఎస్‌లో సభ్యుడు. ఇంత పెద్ద ప్రజాస్వామ్య ఉద్య మం తన నాయకుడిని బయటకు తీసుకురాలేకపోతున్నది. ఇలాంటి ప్రక్రియే ఇంకా బెంగాల్ ప్రజలు చూడబోతున్నారు. రాజకీయ చైతన్యంలో దేశం మొత్తానికి ఒక అడుగు ముందున్న బెంగాలీలు ఫాసిస్టు పాలనను ఎదుర్కోక తప్పేట్టు లేదు. ఇంకా వెనకబడిన ఇతర ప్రజల మాటేమిటి? ఈ రోజు దేశ ప్రజలు తమ వ్యవస్థను మార్చుకునే క్రమంలో ‘ఫాసిజం’ నుంచి తప్పించుకోగలరా లేదా అన్నది ఏ మాత్రం ‘మమ త’ లేని బెనర్జీ మనందరికి విసిరిన సవాలు.
Namasete Telangana News Paper Dated 26/11/2012 


Thursday, November 24, 2011

ఇద్దరూ దోచింది తెలంగాణనే! Byపొఫెసర్ ఘంటా చక్రపాణినవంబర్ నెలకు తెలంగాణకు అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. తెలంగాణను ఆంధ్రవూపదేశ్‌లో కలిపింది నవంబర్ ఒకటి అయి తే, ఆంధ్రవూపదేశ్ నుంచి తెలంగాణ విముక్తికి స్ఫూర్తిగా నిలిచింది కూడా నవంబర్ నెలనే. ఇటువంటి శీతాకాలంలోనే కేసీఆర్ తెలంగాణ కోసం తన ఆఖరి అస్త్రమైన నిరాహారదీక్షను ఉపయోగించారు. తెలంగాణ ఉద్యోగుల న్యాయమైన డిమాండు ఢిల్లీ వీధుల్లో నగుబాటుకు గురైన పరిస్థితుల్లో ఇక తెలంగాణ కోసం అమీతుమీ తేల్చుకోక తప్పదని గుర్తించి ఆయన నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగారు. అప్పటికి దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం కలలు కంటున్నవాళ్ళు, తపిస్తున్నవాళ్ళు అనేకమందే ఉండివుండవ చ్చు. కానీ తెలంగాణను సకల జనుల స్వప్నంగా మలచింది మాత్రం నవంబర్ 2009. ఇప్పుడు ఈ నవంబర్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనూహ్యంగా తెలంగాణ డిమాండుకు ఉత్తరాది పార్టీల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. మాయావతి విసిరిన చిన్న రాష్ట్రాల వలలో చిక్కుకుని ఇప్పుడు పార్లమెంటులోని పెద్ద పార్టీలన్నీ విలవిలలాడుతున్నాయి. ఈ సారి పార్లమెంటు చర్చల్లో తెలంగాణ ఒక ప్రధానమైన అంశంగా మారిపోయింది. రెండేళ్ళ క్రితం కేసీఆర్ దీక్ష ప్రజలనే కాదు, రాష్ట్ర రాజకీయాల దశ దిశ పూర్తి గా మార్చివేసింది. రాజకీయ పార్టీలు మొదలు చట్టసభల మీద విశ్వాసంలే ని పార్టీలు, ఉద్యమాలు కూడా కేసీఆర్ నిర్దేశించిన ఎజెండాను ఎత్తుకున్నా యి. తెలంగాణలో మూడు దశాబ్దాల విముక్తి ఉద్యమాలకు, సామాజిక సాంస్కృతిక పోరాటాలకు సారథులుగా ఉన్న గద్దర్, విమలక్కతో పాటు రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఉన్న మందకృష్ణ వంటి వారు కూడా ఏదో ఒక దశలో కేసీఆర్‌ను బలపరిచిన వారే. ఇప్పుడు వారు ఆయన మార్గంతో విభేదించవచ్చు. 

కానీ అందరి గమ్యం ఒక్కటే అనడంలో సందేహాలు ఉండక్కర్లేదు. ఇవన్నీ కలిసే గడిచిన రెండేళ్లలో ఈ రాష్ట్రంలో తెలంగాణ తప్ప మరో వార్తలేని పరిస్థితి నెలకొంది. కానీ ఢిల్లీ పరిణామాలు ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం పరిస్థితి అంత ఆశావహంగాలేదు. ఉద్యమాల్లో పాల్గొ న్న చాలా మంది ఇప్పటి పరిస్థితుల పట్ల కలవరపడుతున్నారు. రాజకీయ క్రీనీడలో మరోసారి తెలంగాణ తెరమరుగౌతుందా అన్న ఆందోళన వ్యక్తమౌతోంది. తెలంగాణ వచ్చేదాకా తెగించి పోరాడుదాం అన్న రాజకీయ నాయకులు డమ్మీ రాజీనామాలతో సహా తమ అమ్ములపొదిలోని అన్ని అస్త్రాలు చక చకా వాడేసి ఇప్పుడు చేతుపూత్తి నిలబడ్డారు. ఇదే అదునుగా చంద్రబాబు రెండేళ్ళ విరామం తరువాత తెలంగాణలో కాలుమోపి పునీతుడైపోయాడు. రేపో మాపో జగన్ మానుకోట కాకపొతే మరోబాటగుండా తెలంగాణలో ప్రవేశించి ఓదార్పు పొందుతాడు. ఇంకోవైపు తెలంగాణ తెచ్చే దీ ఇచ్చేదీ మేమే అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్తకొత్త కార్లలో ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కాన్వాయ్‌గా కదులుతున్నారు. అధిష్ఠానాన్ని ఒప్పించి తెలంగాణ తెస్తామన్న మంత్రులు ముఖ్యమంత్రి గారికి రక్షణ కవచమై రచ్చబండలో రేషన్ కార్డులు ఇప్పిస్తున్నారు. సందట్లో సడేమియ్యలుగా కొందరు విశాలాంవూధవాదులు తెలంగాణ సంఘాల సహకారంతో జిల్లాలు తిరిగి సమైక్య స్వస్థత కూటములు నిర్వహించే సన్నాహాల్లో ఉన్నా రు. చారివూతాత్మకమైన సకల జనుల సమ్మె ముగిసిన వెను చోటుచేసుకున్న ఈ పరిణామాలన్నీ చాలా మందినే కలవర పెడుతున్నాయి. 

అంతకంటే కలవరపెట్టే వాస్తవాలను ఇప్పుడు సీబీఐ ఆవిష్కరిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుల ఆస్తుల వివరాలు సేకరిస్తోన్న సీబీఐ ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఎవంత దోచుకున్నది లెక్కగట్టబోతోంది. ఇది రెండు పిల్లుల కథను గుర్తుకు తెస్తోంది. రెండు పిల్లులు, ఒక ముసలమ్మ ఇంట్లో దూరి ఆ ముసలమ్మ చేసి పెట్టుకున్న రొట్టేముక్కను ఎత్తుకుపోతాయి. ఈ కథ, కథలోని నీతి అందరికీ తెలిసిందే.. ఆ కథ మొద ట్లో ఎవరు రాశారో ఎవరు చెప్పారో గానీ కొట్లాడుకోకుండా దోచుకున్న సొత్తును సమానంగా పంచుకోవాలన్నది ఆ కథలోని నీతి. ఆ నీతి సూత్రాన్ని అవినీతి పరులు చాలాకాలమే పాటిస్తూవచ్చారు. అదే న్యాయమని నమ్మించారు కూడా. తరతరాలుగా ఆ కథ చెపుతూ వస్తోన్న వాళ్ళు, వింటూ ఊ కొడుతున్న వాళ్ళు పాపం పిల్లులు అనుకున్నారు కానీ రొట్టె చేసుకున్న ముస ల్ది ఏమయిపోయిందో ఆలోచించలేదు. ఇవాళ మన తెలుగు మీడియా కూడా అదే ధర్మమని భావిస్తున్నట్టుంది. కొద్దికాలంగా మన మీడియాలో ఆస్తుల గొడవ నడుస్తోంది. ముఖ్యంగా జగన్ ఆస్తులమీద సీబీఐ విచారణ మొదలైనప్పటినుంచి మన ఛానళ్లు పత్రికలూ ఆయన ఆస్తుల చిట్టా సేకరించే పనిలో ఉన్నాయి. వై.ఎస్. రాజశేఖర రెడ్డి లాగా మిత్రలాభం గురించి ఆలోచించి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవేమో కానీ ఆయన కొంచెం ఆధునికుడు, ముల్లును ముల్లుతోనే తీయాలనుకుని ఇప్పుడు చంద్రబాబును కూడా సీబీఐ ఉచ్చులోకి దించాడు. సీబీఐ విచారణ సంగతేమో గానీ మీడియాకు మాత్రం ఇప్పుడు చేతినిండా పని దొరికింది. ఇరవై నాలుగు గంట లూ తెలుగు ఛానళ్లు విడతల వారీగా జగన్మోహనడ్డి, చంద్రబాబు నాయుడుల ఆస్తుల గురించి చర్చలు, వాదోపవాదాల చేస్తోన్నాయి. 


అసలు ఈ సొమ్మంతా ఎవరిది, ఇన్ని లక్షలు ఎక్కడినుంచి సృష్టించారు అన్న విషయాల మీదికి చర్చ వెళ్ళకుండా మీడియా ఇప్పుడు పిల్లుల గురిం చి, పిల్లులకు వాటాలిచ్చిన కోతుల గురించి కథలు కథలుగా కథనాలను ప్రసారం చేస్తున్నది. సీబీఐ, విచారణలు, కోర్టుల తీర్పులు ఎలా ఉన్నా ఈ రెండు కేసుల్లో ఇప్పటికే నష్టం జరిగింది మాత్రం తెలంగాణకు. వీళ్ళు అమ్ముకున్నారనో, పంచిపెట్టారనో లేదా కేటాయించారనో చెపుతున్న భూములన్నీ తెలంగాణ ప్రాంతంలోనివి. అందునా ఎక్కువ హైదరాబాద్ చుట్టూ ఉన్నవి. రాజశేఖర్‌డ్డి చంద్రబాబు వేరు వేరు వ్యక్తులు కావొచ్చు, వేరు వేరు పార్టీల్లో ఉండవచ్చు. వేరు వేరు జెండాలతో ఎన్నికల్లో పోటీ పడి ఉండవచ్చు. కానీ ఇద్దరి ఎజెండా ఒకటే అన్నది మాత్రం ఇప్పుడిప్పుడే సీబీఐ వెలికితీస్తున్న వివరాలను బట్టి తెలుస్తున్నది. ఇద్దరూ హైదరాబాద్‌ను, దాని చుట్టూ పక్కల ఉన్న భూములను ఆధారంగా చేసుకుని తమ తమ అభివృద్ధి ప్రణాలికలను అమలు చేశారు. రెండు పిల్లుల కథలో ఒక పిల్లి దోచుకొస్తే ఇంకొక పిల్లి కాప లా ఉంటుంది. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు వైఎస్ ప్రధాన కాపలాదారుగా ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు. ఆ తరువాత వైఎస్ అధికారంలోకి వచ్చాక ఐదేళ్లపాటు బాబు కాపలా దారు. యేవో క్షణికావేశంలో అప్పుడప్పుడు విమర్శించుకునే వారు తప్ప కోర్టులు కేసుల జోలికి వెళ్లలేదేప్పుడు. కేసులు వేసుకున్నా అవి విచారణ దాక వెళ్ళేలోపే రాద్ధాంతం లేకుం డా రాజీ పడిపోయారు. వైఎస్ హఠాన్మరణం తరువాత జగన్ అతని వారసునిగా అవతరించడం చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి ఊహించని అడ్డంకిగా మారింది. 

ఈ దశలో తెలుగుదేశం ఔత్సాహికులు కొందరు వైఎస్ అక్రమాలు, జగన్ ఆస్తుల మీద కేసు వేసి ఇరుకున పెట్టాలని భావించి ఉంటారు. అదే కోణం చూపిస్తూ ఎర్రన్నాయుడు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆకేసును సీబీఐకి అప్పగించడంతో అప్పటికే కాంగ్రెస్ ఎదురుదాడిలో గాయపడి ఉన్న జగన్‌కు పుండు మీద కారం చల్లినట్టయ్యిం ది. దీంతో అక్రమ ఆస్తుల కేసులో విచారణను ఎదుర్కొంటున్న జగన్ తల్లి విజయమ్మ చంద్రబాబు ఆస్తుల మీద విచారణకు కోర్టును ఆశ్రయించారు. ఆమె కేవలం పిటిషన్ మాత్రమే కాక దానితో పాటు వేలాది పేజీల ఆధారాల పత్రాలు కూడా కోర్టుకు సమర్పించారు. ఇట్లా కాలం నడిచినంతకాలం ఒకరికొకరుగా ఉన్న రెండు కుటుంబాలు ఇవాళ సీబీఐ విచారణలో ఉన్నారు.

రాజశేఖర్‌డ్డి, చంద్రబాబు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం ముందుగా అధికారంలోకి వచ్చారు. ప్రపంచంలో ఐటీకి ఆదరణ ఉన్న రోజుల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ రూపురేఖలను మార్చేసే పనికి పూనుకున్నాడు. ప్రపంచబ్యాంకు మద్దతుతో అభివృద్ధి నిర్వచనాన్ని మార్చేసి హైదరాబాద్ అభివృద్ధే ఆంధ్రవూపదేశ్ అభివృద్ధి అని, హైదరాబాద్‌ను ఐటీ రాజధాని చేస్తానని వేలాది ఎకరాలు ప్రభుత్వ భూములను, పేద రైతుల భూములను బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టారు. హైటెక్ సిటి నిర్మాణానికి దేశంలోని బడా కాంట్రాక్టర్లతో బేరసారాలు కుదిర్చారు. సత్యం రామలింగ రాజుతో స్నేహం చేశారు. ఆ స్నేహం తో అమెరికా అధినేతనే అతిథిగా పిలుచుకోగలిగారు. ఒక్క హైటెక్ సిటితో ఆగకుండా ఫార్మా సిటీలు మొదలు ఫిలింసిటీల దాకా వేలాది ఎకరాల తెలంగాణ భూములను ధారాదత్తం చేశారు. అంతేకాదు హైదరాబాద్ రంగాడ్డి జిల్లాల మధ్య కొత్తగా ఒక ఆర్థిక వ్యాపార వాణిజ్య జిల్లా పేరుతో వేలాది ఎకరాలు కంపెనీలకు కట్టబెట్టారు. దానికి ఆనుకునే ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు పునాదివేసి కోనేరు ప్రసాద్‌కు ఒక కొత్త సామ్రాజ్యాన్ని అప్పగించారు. పెద్ద పెద్ద చెరువులు పూడ్చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇచ్చేసి మళ్ళీ వర్షపు నీటికోసం ఇంకుడు గుంతలు తవ్వించారు. రోడ్లు వెడల్పు చేసి వాటిమీద పె్లై ఓవర్లు నిర్మించారు. ఈ అభివృద్ధిలో తన సామాజిక వర్గం వారిని భాగస్వాములను చేశారని వారిద్వారా కోట్లాది రూపాయలు కొల్లగొట్టారన్నది ఇవాళ కోర్టు ముందున్న వాదన. వారిలో కొందరు ఆ వెంటనే పార్లమెంటు సభ్యులైపోయారు. 

ఇంకొందరు పార్టీలో ముఖ్యనేతలుగా ఎదిగి తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్నారు. మరికొందరు బాబుగారి బినామీలుగా ఆయన సంపదను కాపాడుతున్నారన్నది వాదన. ఈ కేసును వైఎస్ సతీమణి విజయమ్మ వేశారు. వై.ఎస్. ప్రజా ప్రస్థానం కూడా అదే బాటలో సాగింది. వై.ఎస్. కూడా హైదరాబాద్ చుట్టుపక్కల భూములతోనే వివాదస్పదుడయ్యారు. జగన్‌కు పెట్టుబడులు పెట్టిన వారంతా ప్రత్యేక ఆర్థిక మండలాల పేరుతో వై ఎస్ దగ్గర తెలంగాణ జిల్లాల్లో భూములు, జలయజ్ఞం కాంట్రాక్టులు,మరికొందరు హైదరాబాద్‌లో ముస్లింల వక్ఫ్ భూములు, హుసింగ్ బోర్డ్ భూములు అక్రమంగా పొంది విల్లాలు, టవర్లు కట్టారని అభియోగం. 

ఇప్పటి పిల్లుల కథలో పిల్లులు, కోతులూ కలిసిపోయాయి. అభియోగాలను బట్టి ముసలమ్మ రొట్టెను కోతులకు కట్టబెట్టినట్టు తెలంగాణ భూములను తమ తమ బంధువులకు, వందిమాగధులకు, బినామీలకు, వాళ్ళు పెట్టిన కంపెనీలకు కట్టబెట్టారు. పాలన ఎవరిదైనా ప్రసాదంలా పంచుకున్న ది మాత్రం సీమాంధ్ర పెట్టుబడిదారులే. వారిలో మెజారిటీ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు పత్రికల్లో వస్తోన్న పేర్లు, అఫిడవిట్‌లో ప్రస్తావించిన పేర్లను పరిశీలిస్తే పదేళ్ళలో పంచిపెట్టిన వాళ్ళు మారారు తప్ప పంచుకున్నది ఒక్కరే అని అర్థమౌతుంది. పది, పదిహేనేళ్ళ కాలంలోహైదరాబాద్, నగరం చుట్టూ ఉన్న నాలుగైదు జిల్లాల్లో ఉన్న భూములమీద లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. కొందరు లక్షలకోట్లు సంపాదిస్తే, వందలాదిమంది కోటీశ్వరులైపోయారు. అలాగే అనామకులు ఏ వన్ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తారు. అక్కడితో ఆగకుండా ఆ సంపదను కాపాడుకోవడం కోసం రాజకీయా పార్టీల్లో చేరో, పార్టీలు పెట్టో దేశసేవకు పునరంకితం కావాలని కలలుగంటున్నారు. సరిగ్గా ఈ ఇద్దరి పాలనలో పెట్టుబడిదారులుగా ఎదిగిన వాళ్ళే తెలంగాణను అడ్డుకున్నారు. పార్లమెంటులో సమైక్యాంధ్ర ప్లకార్డ్ పట్టుకున్నది, రెండుకళ్ల సిద్ధాంతాలు పుట్టుకొచ్చింది ఈ పెట్టుబడిదారులను, వాళ్ళ పెట్టుబడిని కాపాడుకోవడం కోసమే. ఇప్పుడు హైదరాబాద్ భవిష్యత్తుకోసం హైరానా పడుతున్నవాళ్లంతా వాళ్ల ఎంగిలి కూటికి అలవా టు పడ్డవాళ్లే. వీళ్ళకు ఈ రెండు కేసుల మధ్య తెలంగాణ కోల్పోయిన లక్షలాది ఎకరాల భూములు, వేలాదిమంది రైతు కుటుంబాల వ్యధలు, శిథిలమైపోయిన ప్రజల బతుకులు కనిపించవు.

అలాగే తెలంగాణ ఉద్యమం ద్వారా ఓట్లు, సీట్లు అని ఆరాటపడే వాళ్ళు, ఇదే పెట్టుబడి పార్టీలతో ఎన్నిక లు, ఎత్తులు పొత్తులు అనుకునే వాళ్ళు ఈ విషయాలను పట్టించుకోరు. కనీ సం తెలంగాణ ఉద్యమకారులైనా ఈ విషయాన్ని తెరమీదికి తెచ్చి ఎవరి భూములు వారికి ఇప్పించే పోరాటం చేయవచ్చు. అలాంటి పోరాటం తెలంగాణను దోచుకుని ముద్దాయిలుగా నిలబడ్డవాళ్లను నిలదీయడానికి, అడ్డుపడుతున్న వాళ్ళ మెడలు వంచడానికి పనికొస్తుంది. అన్నిటికీమించి సొంతభూముల్లో కూలిలై కునారిల్లుతున్న తెలంగాణ రైతుల బతుకులు బాగుపడతాయి. 

 
రచయిత సమాజ శాస్త్ర ఆచార్యులు, రాజకీయ విశ్లేషకులు 
Namasete Telangana News Paper Dated 25/11/2011, ఈ మెయిల్ : ghantapatham@gmail.co

జీవితమే ఒక పండుగ కావాలమ్మా! - కిషన్ జీప్రియమైన అమ్మా, వందనాలు!
అమ్మా! ఎట్లా ఉన్నావే? చాలా కాలమైంది, నిన్ను పలకరించి. జనవరిలో మేం రాసిన ఉత్తరం 'ఆంధ్రజ్యోతి' పత్రికలో చూసే ఉంటావు. మరోసారి నిన్ను ఉత్తరం ద్వారా నైనా పలకరించాలని నీ ఆలోచనల్లో భాగం కావాలని ఈ సారి మళ్ళా రాస్తున్నా. పండుగ పబ్బాలలో నీ కన్నీళ్ళు తుడవాలని, నీవంటి కోట్లాది మంది తల్లుల కన్నీళ్ళు తుడవాలనీ, పండుగ-పబ్బాలు ఎవరి మత విశ్వాసాల ప్రకారం వారు శాంతియుతంగా జరుపుకోవాలనీ మా ఆకాంక్ష. మా ఆకాంక్ష పాలక వర్గాలు తీరనివ్వనందున ప్రజా ఉద్యమాలే మార్గం అని చెప్పడానికే మా ఈ లేఖ రాస్తున్నామమ్మా! 

అమ్మా! ఈ రోజు ఈద్ పండుగనే!
మన వాడకట్టుకంతా ముస్లింలే కదనే. ఇప్పుడు ఎవరు ఎట్లా ఉన్నారని అడగడానికి ధైర్యం చాలడం లేదు. ఎందుకంటావా? వీధిలో ఉన్నవారిలో ఆనాడే ఒకటి రెండు సంపన్న కుటుంబాలు తప్ప మిగిలిన వారంతా కడు పేదలు. బీడీలు చేసి లేదా రిక్షా తొక్కి ఒక పూట కడుపు నింపుకునే ప్రయత్నం చేసిన వారు. చంద్రుడు, రాజశేఖరుడు ప్రపంచ బ్యాంక్ 'అభివృద్ధి' పథకాలు అమలు జరిపిన చోట పేదల మాట ఎత్తుకోగలమా అమ్మా... 

ఈద్ రోజే పశ్చిమ బెంగాల్‌లో అడవీ ప్రాంత (జంగల్ మహర్) ప్రజలు ఆరంధన్ (అంటే ఉపవాసం ఉండడం. ఆ రోజు ఏ ఇంట్లో పొయిలో పిల్లి లేవదు. వంట- వార్పు ఉండదు. ఆనాదిగా ప్రజలు తమ నిరసనను పాలకులకు తెలిపే ఒక పోరాట రూపం ఇది) జరిపారు. చాలా రోజులుగా ప్రతి రోజు ప్రజలు ముఖ్యంగా స్త్రీలు ఊరేగింపు జరిపి కొన్ని గంటల పాటు పోలీసు క్యాంపులను ఘెరావ్ చేస్తున్నారు. 

ఈ ఊరేగింపులో పాల్గొనే స్త్రీలపై ప్రభుత్వం రాజద్రోహం నేరం మోపి జైళ్ళలోకి పంపుతున్నది. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా ఈద్ రోజు ( ఈద్ సందర్భంగా ముస్లిం మహిళలకు ఆందోళనకు పిలుపు ఇవ్వలేదు) ఏ ఇంట్లో వంట చేయలేదు. కనీసం 300పైగా గ్రామాల ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అందుకే మేం ప్రజలలో పండుగ పబ్బాలు శాంతియుతంగా జరుపుకోవడానికి పోరాటం తప్పనిసరి అని ప్రచారం చేస్తున్నామమ్మా. అమ్మా! ఈ రోజు మా పార్టీ జన్మదినం. 

దేశమంతా పోరాట ప్రాంతాలలో ప్రజలకు సభలు, సమావేశాలు జరపమని రాబోయే రాజ్య నిర్బంధాన్ని తిప్పికొట్టే అన్ని ప్రయత్నాలు చేయాలని కోరాం. అమెరికా సిద్ధం చేసిన అణచివేత పథకాన్ని చేతబూని చిదంబరం మాపై జరుపబోయే పెద్ద దాడిని ఎదుర్కొమ్మని ప్రజలకు పిలుపు ఇచ్చాం. ఈ రోజటి సంఘటన ఒకటి నీకు చెప్తానే అమ్మా. వామ పక్ష ఫ్రంట్ బెంగాల్‌లో 33 ఏళ్ళుగా అధికారంలో ఉన్నది. నేతిబీర కాయలో నెయ్యి ఎంతో వీళ్ళ అధికారంలో ప్రజాస్వామ్యం అంతే ఉంటుంది. వీరి మార్క్సిజం అంటే సామ్రాజ్యవాద ఊడిగవాదం. పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం పాలన ఎట్లా ఉందో, అక్కడ మాకూ వారికీ పోరాటం ఎందుకు జరుగుతున్నదో తెలుపడానికి కొన్ని ఉదంతాలు వివరిస్తాను. 

మదనపూర్ నగరానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇనాయిత్ పూర్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో కోటి రూపాయలతో ఆఫీసు కట్టారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి అక్కడ దాదాపు నాలుగు వందల మంది సాయుధ సిపిఎం సేనలు ఉన్నాయి. వీళ్ళంతా ఒక ఏడాది కిందట లాల్‌గఢ్ గ్రామాలలో ఉన్న హర్మర్ (బెంగాల్ సిపిఎం సేనకు ప్రజలు, పత్రికలు పెట్టిన పేరు) నాయకులు. ప్రజా ఆందోళన ఫలితంగా 12 సాయుధ సిపిఎం క్యాంపులలో వీరు ఉంటున్నారు. వీళ్ళంతా సాయుధులే. ఇందులో ఒకటి ఇనాయిత్‌పూర్ క్యాంపు. మధ్యాహ్నం పూజ కోసం సరుకులు కొనడానికి సోమేశ్వరి బిశ్రా, దులాలీ బిశ్రాలు బజారుకు వెళుతున్నారు. 

వీళ్ళు పొలాషిమా గ్రామ గృహిణులు. సిపిఎం సేన వీళ్ళపై కాల్పులు జరిపింది. వీళ్ళిప్పుడు కొన ఊపిరితో చికిత్స పొందుతున్నారు. ఈ వార్త విన్న చుట్టు పక్కల గ్రామాలలోని దాదాపు ఎనిమిది వేల మంది ప్రజలు సిపిఎం వారి ఇనాయిత్‌పూర్ ఆఫీసును ముట్టడించారు. దూరం నుంచే ప్రజల రాక గమనించిన సిపిఎం సాయుధ సేన కాల్పులు ప్రారంభించింది. దగ్గరలోనే ఉన్న మా పిజిఎల్ఎ బలగాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రజలను ముందు సురక్షిత స్థానాలలోకి పంపించాయి. 

అదనపుసేనలు రాకుండా అడ్డుకోవడానికి బారికేడ్లు నిర్మించేందుకు వేయిమందిని తరలించాయి. ప్రజా గెరిల్లా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఇటువంటి ఘర్షణలలో సిపిఎం ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ, తమ నష్టాన్ని తక్కువ చేసి చూపడం వారికి అలవాటు. ఈ ఘటనకు ముందు ఈ నెల 15వ తేదీన మరో కాల్పుల ఉదంతం కూడా జరిగింది. ఇనాయిత్‌పూర్ క్యాంపునకు దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో షావుగా అనే గ్రామంలో సిపిఎం వారిది మరో సాయుధ క్యాంపు ఉంది. ఈ క్యాంపు వారికి మా ప్రజా సైనికులకు మధ్య శలబనీ- మిడనపూర్ బ్లాకు సరిహద్దులో మూడు గంటలకు పైగా కాల్పులు జరిగాయి. 

అమ్మా! ఇక్కడ పిల్లలకు చదువుకోవడమూ కష్టమే!
ఇక్కడ నీకు మరో విషయం చెప్పాలి. బెంగాల్ గ్రామాలలో దాదాపుగా ప్రతి పాఠశాల ముఖ ద్వారం గోడలపై ఇలా రాసి ఉంటుంది. 'శిక్కా అనే చేతన్; చేతన్ అనే బిప్లన్, బిప్లవ్ అనే పరివర్తన్'. అంటే చదువు చైతన్యాన్ని తెస్తుంది. చైతన్యం విప్లవాన్ని తెస్తుంది; విప్లవం పరివర్తనను తెస్తుంది. అమ్మలారా! ఇది వాస్తవం అని ఎవరన్నా భావిస్తే పప్పులో కాలు వేసినట్టే. ఇక్కడ టీచర్లలో అనేకులు సిపిఎం సభ్యులు, నాయకులు. బడి-గుడి -బజారు-పోలీసు ఠాణా ఎక్కడైనా అంతా ఒకటే వారికి. 

ఇలాంటి వారు బడిలో ఏం చేస్తారో ఊహించండి. జూన్ 18వ తేదీన కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త అభియాన్ ప్రారంభానికి ముందే- ఐదవ తేదీ నాటికే, ఖరగ్‌పూర్ నుంచి బిన్‌పూర్ వరకు 30-40 పాఠశాలల హెడ్‌మాస్టర్‌లకు, విద్యా శాఖ అధికారులకు ప్రభుత్వం నోటీసులు పంపింది. పాఠశాలలను 15 రోజుల పాటు పోలీసులకు అప్పగించాలని ఈ నోటీసులలో ఉంది. సుమారు 30 పాఠశాలల్లో జూన్ 19 నుంచి ఇంకా పోలీసులే పాఠశాలల్లో మకాం వేశారు. హోం కార్యదర్శి అర్ధేందూ సేన్ ప్రతి నాలుగైదు రోజులకు ఒక సారి ప్రకటన ఇస్తూ - మరో వారం రోజుల్లో ఖాళీ చేస్తామంటారు. ఇప్పటికీ ఖాళీ చేయలేదు. 

జూలై 10వ తేదీన బిన్‌పూర్ అనే బ్లాక్ హెడ్ క్వార్టర్‌లో ఉన్న హైస్కూల్ పిల్లలంతా క్యాంపు (పాఠశాల)కు తాళం పెట్టాలని ఘోరావ్ చేశారు. మేం చదువు కోవాలి. మా స్కూల్ ఖాళీ చేయండి అని అడిగారు. పాఠశాల ఖాళీ చేయమని అడగడమే పిల్లలు చేసిన పాపం. అదనపు బలగాలు వచ్చాయి. లాఠీలు విరిగాయి. బాష్ప వాయువు గోళాలు పగిలాయి. ఇదీ బుద్ధబాబుల విప్లవ చైతన్యం. 

అమ్మా, ఈ పిల్లల గొంతుల్లో నుంచి వెలువడ్డ నినాదాలతో అడవి అంతా ప్రతి ధ్వనించిందే. మొత్తం జంగన్ మహల్ ఆందోళనే మరో రూపంలోకి మారిందే. ఈ పాఠశాలల్లోని పిల్లలు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు... 'బుద్ధ బాబూ- శిక్క అనే చేతనా.. చేతనా అనే బిప్లక్.. బిప్లక్ అనే పవరివర్తన్- అందుకే మేం చదువుకుంటే విప్లవకారులం.. అవుతామని జంగల్ మహల్ స్కూళ్లలో పోలీసులను దింపావా?' అని అడుగుతున్నారు. 'చిదంబరం బాబూ- మా సర్వశిక్కా అభియాన్ అంటే ఇదేనా? మీ పిల్లలకు డూన్ స్కూళ్లు. మేం చెట్టుకింద చదువుతామన్నా మా చేతులు విరగ్గొటించావ్... సంయుక్త సేనల పంపుతావా? ఇదేం నీతి?' అని పిల్లలు ప్రశ్నిస్తున్నారు. ఇదమ్మా... ఇక్కడి పరిస్థితి. దినమంతా వీళ్ళ ప్రశ్నలే మనుసులో మెదులుతున్నాయే. 

దసరా దగ్గరకు వచ్చిందే అమ్మా!
మునుపటి వేడుకలు గ్రామాల్లో లేకున్నా, ప్రజలకు వారి విశ్వాసాలు ఉంటాయి కదనే... మేం ఎప్పుడూ ప్రజల విశ్వాసాలను గౌరవిస్తామే. అయితే అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా చైతన్యం తెచ్చే కృషి నిరంతరం అమలు జరుపుతామే. దసరా వేడుకలు దేశమంతా ఉన్నా బెంగాలీల ప్రత్యేకత జగమెరిగినదే. ఆదివాసీ ప్రాంతాల్లోని గైర్ అదివాసులు ఈ వేడుకలను పెద్ద ఎత్తున జరుపుతారు. ఇప్పుడు పండుగకు ఇంటికి వచ్చే వాళ్లనంతా అరెస్టు చేయడం నిత్యకృత్యంగా మారింది. వామ పక్ష ఫ్రంట్, మమత నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, సోనియా సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయి సంయుక్త బలగాలను పేద ప్రజలపైకి పంపాయి. 

అమ్మా! మమతమ్మ గురించి ఒక్క మాట!
ఓ మాట మమతమ్మ రైల్వేమంత్రి గురించి చెప్పకుంటే ఈ లేఖ అసంపూర్ణమే అవుతుందే. సింగూర్-నందిగ్రామ్‌ల పోరాటం ఆమెకు సౌభాగ్యాన్ని తెచ్చాయే. కాని ఈ సౌభాగ్యాన్ని ఇచ్చిన ప్రజలు ముఖ్యంగా మహిళల నుదిటి బొట్టు చెరపడం అపుడే ప్రారంభమైపోయిందే అమ్మా... సింగూరు భూమి వెనక్కు రానేలేదు. నందిగ్రామ్‌లో కెమికల్ హబ్ తాత్కాలికంగా నిలిచినా పక్కన నమాచార్‌లో ఈ హబ్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాగితంపై అధికారికంగా చేయాల్సిందంతా చేశాయి. 

ఈ సమయంలో కలకత్తాలో రాజార్‌హట్ అనే ప్రాంతంలో పెద్ద ఉపమహానగ రం నిర్మాణం కోసం భూముల కుంభకోణం నడిచింది. సిపిఎం-తృణమూల్ కాంగ్రెస్-ప్రభుత్వ బ్యాంకులు కలిసికట్టుగా జరిపిన లావాదేవీలు, నిర్ధాక్షిణ్య హత్యలు ఇప్పుడు బెంగాల్ ప్రజలలో నిత్య చర్చగా మారాయి. ఈ వివాదంలో 60మంది రైతులు మరణించారు. 120 మందికి పైగా రైతులు అదృశ్యం అయ్యారు. 

రాజార్‌హట్ రణరంగంగా మారింది. సెజ్‌ల కోసం ఇప్పుడు వంద శాతం భూ స్వాధీన విధానం ముందుకు వచ్చింది. ఈ పాలసీనే రాజార్‌హట్‌లో అమలు జరిగింది. మేకల తినే వాడి చోట ఎనుగుల తినేవాడు వచ్చిన ఉదంతంగా మారింది పరిస్థితి. మమత రోజుకో రైలుకు పచ్చజెండా చూపుతున్నారు. నిన్న-నేడు ఇఫ్తార్ విందులు, రిజ్వాయన్ తల్లితో సమావేశాలు జరుపుతూ ఓట్ల గారడీ నడుపుతున్నారు. ఇప్పు డు కేంద్రంలో కాంగ్రెస్ కుడిచేత్తో మమత పార్టీని-ఎడం చేత్తో 'వామ'పక్షాలను పట్టుకుని ప్రజా వ్యతిరేక విధానాలు అమలు పరుస్తున్నది. 

అందుకే అమ్మా... పోరాటం ఒక్కటే ప్రజల జీవితాల్లో వెలుగులను అందిస్తుంది. పండుగలు పబ్బాలలోనే కాదు నిత్యజీవితంలోనూ తిండి-ఇల్లు-బట్ట-ప్రజాస్వామ్య హక్కులను అందిస్తుంది. ఈ హక్కుల సాధన కోసమే జనం పోరుబాటలో ఉన్నారు. అమ్మా... నీవంటి అమ్మలందరికీ ...కోటి... కోటి వందనాలే 

కోటీ...వేణులే కాదు కోట్లాది పిల్లల ఆకాంక్షలతో... ప్రేమతో...
- కిషన్ జీ 

(మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ తన తల్లి మధురమ్మను ఉద్దేశించి రాసిన ఈ లేఖను ఆంధ్రజ్యోతి (సెప్టెంబర్ 27, 2009) నాడు ప్రచురించింది. గురువారం నాడు కిషన్‌జీ ఎన్‌కౌంటర్ జరిగిన సందర్భంలో పాఠకుల కోసం మళ్ళీ ఒకసారి ఈ లేఖను ముద్రిస్తున్నాం) Andhra Jyothi News Paper Dated 25/11/2011

Wednesday, November 23, 2011

‘బహుళజాతి’కే పోల‘వరం’-అమర్


కనాడు సస్య విప్లవ లక్ష్యంతో ఆధునిక దేవాలయాలుగా అభివర్ణించబడ్డ భారీ నీటి ప్రాజెక్టులన్నీ రాను రాను కొరకరాని కొయ్యలని తేలిపోతున్నాయి. ఇవి భావి తరాలకు ఇంకా భారంగా పరిణమించే మాటెలా ఉన్నా, పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు మాత్రం బహుళజాతి సంస్థలకు బంగారు గుడ్లు పెట్టే బాతుగా నిర్దేశించబడింది. విశాఖ-విజయవాడల ప్రత్యేక ఆర్థిక మండలి కోస్టల్ కారిడార్‌లకు అపార జలరాశులను, చౌక విద్యుత్‌ను అందిస్తూ బహుళజాతి సంస్థలకు మౌళిక సదుపాయాలు కల్పించే కల్పతరువుగా మారనుంది. కరువు ప్రాంతాలను విస్మరించి, లక్షలాది ప్రజలను నిర్వాసితుల్ని చేసి; రెండు లక్షల ఎకరాల సాగుభూములను, అడవులను, పాపికొండల వైల్డ్ లైఫ్ సాంక్చువరి (పులుల అభయారణ్యాన్ని)ని, కడకు భద్రాదిని కూడా నీట ముంచనుంది.


ఈ ప్రాజెక్టు సరికొత్తగా సృష్టించే ఆయకట్టు కేవలం 15,000 ఎకరాలు మాత్రమేనని రిటైర్డ్ ఇంజనీర్స్ ధర్మారావు, ప్రభాకర్‌రావు లాంటి నిపుణులు లెక్కలతో సహా తేల్చిచెప్పారు. ఈ విధ్వంసాన్ని తగ్గించడానికి గోదావరినదిపై చిన్న చిన్న ఆనకట్టలు, చిన్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టడం ద్వారా ఏడాది పొడుగునా నీటిని భద్రపరిచి, నిర్వాసిత సమస్యేలే రాకుండా చేయవచ్చని అనేకమంది ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల డెల్టా ప్రాంతంలో భూగర్భ జల సామర్థ్యం పెరిగి గోదావరి, కృష్టా డెల్టాల స్థీరీకరణ జరిగి, దాదాపు మూడువందల టీఎంసీల నీటిని వినియోగంలోకి తేవచ్చని స్పష్టం చేస్తున్నారు. సీలేరు నది నుంచి మళ్లింపు ద్వారా ఆయకట్టు ప్రాంతానికి చేరకముందే 500 అడుగుల నీటి ప్రవాహం, 500 మెగావాట్ల విద్యుత్ సాధ్యమవుతుందని నిర్దిష్ట ప్రత్యామ్నాయాన్ని సూచిస్తున్నారు.తెలంగాణ ప్రాంత అసమానతల జోలికి వెళ్లకుండానే నష్ట నివారణకు చేసే ప్రత్యామ్నాయాలను, అంతర్ రాష్ట్రీయ న్యాయవివాదాలను పట్టించుకోకుండా అర్ధరాత్రి టెండర్లకు, హడావిడి ప్రయత్నాలకు ఆంతర్యమేమిటి? ప్రాంతీయ అసమానతల కోణం నుంచే కాకుండా, విధ్వంసకర ప్రపంచబ్యాంకు అభివృద్ధి నమూనా నుంచి పోలవరాన్ని పరిశీలించినప్పుడే ప్రత్యామ్నాయ ప్రజానీటి పారుదల వ్యవస్థకు దారి వేసుకోగలము.
బ్రిటీషు కాలం నుంచి పోలవరం పరిశీలనలో ఉన్నా ప్రజావ్యతిరేకత వల్ల దీన్ని నిర్మించడానికి వారు సాహసించలేదు. మొదటి యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి 1966-76 నాటి మొదటి హరిత విప్ల వం కొరతలు, వైఫల్యాలు అధిగమించడానికి, రెండో హరిత విప్లవం చేపట్టాలని పిలుపునిచ్చారు.వాస్తవంగా 1929 నాటి పెట్టుబడిదారీ ఉత్పత్తి సంక్షోభపు మహా ఆర్థిక మాంద్యాన్ని అధిగమించడానికి కీన్స్ ఆర్థిక సిద్ధాంతం ఆధారంగా రూపొందిన అమెరికన్ న్యూడీల్ భారీ ప్రాజెక్టుల పథకాన్ని, రష్యన్ ప్రణాళికబద్ధ సోషలిస్టు భారీ వ్యవసాయోత్పత్తులను యాంత్రికంగా అనుసరించడమే మొద టి సస్య విప్లవం లోపాలు అనే విమర్శలున్నాయి. గోదావరి నది పై నిర్మించి శ్రీరాంసాగర్ (పోచంపాడు) భారీ నీటి ప్రాజెక్టు రెండో దశ పూర్తికాకుండానే యాభై ఏళ్లలో అరవై శాతం ఇసుల మేటలతో నిండిపోయింది. వృథాగా పోతున్న వరద నీళ్ల కోసం మరో వరద కాలువ నిర్మించాల్సిన పరిస్థితి నేటి తరం కళ్ల ముందు సజీవ తార్కాణంగా ఉన్నది. తుంగభద్ర డ్యాంతో పాటు రాష్ట్రంలోని ఏ భారీ ప్రాజెక్టు ఇందుకు మినహాయింపు కాదు.కృష్ణా-గోదావరి డెల్టాలకు నీళ్లందిస్తున్న ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం ఆనకట్టలు ఇసుక మేటలు నివారించి, మూడో పంటను స్థిరీకరించడం కూడా పులిచింతల, పోలవరంల ఒకానొక లక్ష్యం కావడం గమనిస్తున్నదే. అందుకే కేంద్ర జలవనరుల సంఘం, గిరిజన కౌన్సిల్, అటవీ, పర్యావరణశాఖ, ప్రణాళిక సంఘం అనుమతి లేకుండానే పోలవరం పను లు ప్రారంభించారు. గ్రామసభల అభివూపాయాలను తోసిరాజని కాల్వల నిర్మాణ పనులకు అనేక ప్యాకేజీలు ప్రకటించి 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట నేతలు, కాంట్రాక్టర్లు జేబులు నింపుకున్నారు. ఇప్పటికే 3,500 కోట్ల ఖర్చుతో 80 మీటర్ల వెడల్పుతో కాల్వలు పూర్తి చేయడం వెనుక కాకినాడ-పాండిచ్చేరి కాలువ వ్యాపార అవసరాలు పూర్తి చేయడం ముఖ్య ఉద్దేశంగా కనబడుతున్నది.దీనిలో భాగంగానే కొన్నేళ్లుగా కొనసాగుతున్న విశాఖ స్పెషల్ ఎక్స్‌పోర్టు జోను ను, విశాఖ నుంచి విజయవాడ వరకు స్పెషల్ ఎకానమిక్ జోన్‌గా మార్చారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా విస్తరించి ఉన్న 960 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కోస్టల్ కారిడార్‌గా ప్రకటించారు. తీరం పొడుగునా 20కిపైగా వస్తున్న ఐదు నక్షవూతాల హోటళ్లు, ఎకో టూరిస్టు కేంద్రాలు, ఫార్మాసిటీ, మెగా కెమికల్ కాంప్లెక్స్, బ్రాండిక్స్ లాంటి ఎన్నో సిరామిక్ కంపెనీలు, షిప్ బ్రేకింగ్ యూనిట్లు, బయో డిజిల్ కంపెనీలు, గంగవరం లాంటి పోర్టులు ఎన్నో అనుమతి పొందాయి.ప్రత్యేక ఆర్థిక మండళ్లలో బహుళజాతి సంస్థల వాటా 97 శాతం వరకు ఉంది. ఈ విధంగా తెలంగాణ నుంచి వందల కిలోమీటర్లు ప్రవహిస్తూ పశ్చిమగోదావరి జిల్లా పోలవరం దాకా అందివస్తున్న గోదావరి జలాలన్నీ విదేశీ-స్వదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు వంటింట్లోకి వస్తున్న కుందేలులాగా సంతోషదాయకంగా ఉంది. పోలవరం కంటే ఎంతోముందు ప్రారంభించాలన్న ఇచ్చంపల్లి ప్రాజెక్టు ద్వారా 85 టీఎంసీల జలాలను పొందే అవకాశాన్ని, ముంపునకు గురయ్యే పొరుగు రాష్ట్రా ల అభ్యంతరాల పేరిట మూలకు పడేశారు. అదే అభ్యంతరాల ఆధారంగా 1977-78లో గోదావరి ట్రిబ్యునల్ వద్ద ఒప్పందం కుదిరి, ‘పొరుగు రాష్ట్రాల సమ్మతితోనే పోలవరం డిజైన్‌ను సిడబ్ల్యూసి అనుమతించాలని’ ఉన్న నిబంధనను మాత్రం బేఖాతరు చేస్తున్నారు. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా నదికి తరలించే 85 టీఎంసీల నీళ్ల వలన, తెలంగాణ ప్రాంతం కృష్ణానది ట్రిబ్యునల్ ద్వారా పొందిన 35 టీఎంసీల వాటాను కోల్పోతుంది. ఇవే కాకుండా హైదరాబాద్‌లో కూల్చబడిన చెరువులతోపాటు, తెలంగాణ భూములు తడపాల్సిన ఈసి, మూసి, మంజీర, కృష్ణా నదుల నీళ్లు నగరంలోని భాగ్యవంతులను ముంచెత్తుతున్నా యి. ఇవి చాలదన్నట్టు హైదరాబాద్ తాగునీరు మూడో స్కీముకు దాదాపు మూడువేల కోట్లతో గోదావరి నదీ జలాల ను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ని విధాలుగా తెలంగాణ ప్రజలు పంటలు నష్టపోతూ, అందిస్తున్న నీళ్లు తాగుతూ, తిరిగి హైదరాబాద్‌లో నూ మాకు వాటా కావాలంటూ మాట్లాడడం తిన్నింటి వాసాలు లెక్కబెట్టడమే కదా!ఆదివాసుల జీవనాన్ని, సంస్కృతిని జల సమా ధి చేసే కుట్ర సాగుతోంది. దీంతోపాటు 1980 అడ వి సంరక్షణ చట్టం, 1986 పర్యావరణ చట్టం, 1/70 రెగ్యులేషన్లను, జీవో 64 కింద మార్గదర్శకత్వాలన్నింటిని తుంగలో తొక్కారు. 1996 పంచాయితీ గిరిజన ప్రాంతాల విస్తరణ చట్టం (పెసా) ప్రకారం 73 రాజ్యాంగ సవరణతో సంక్రమించిన ఆదివాసుల స్వయం నిర్ణయాధికార గ్రామాలను జీవో 68తో నీట ముంచజూస్తున్నారు.అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 అనుసరించి గ్రామసభ అనుమతుల్లేకుండానే తప్పుడు సమాచారంతో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి 2010 జూలై 28న ఫారెస్ట్ క్లియన్స్ అనుమతులు తెచ్చా రు. దీనిని ఖండి స్తూ ఆదివాసీ గ్రామసభలు తీర్మా నం చేసి పంపుతున్నాయి. ఆందోళన బాట పడుతున్నాయి. 7 ఆగస్టు, 2010 రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ తీసిన ఉపక్షిగహ చాయాచిత్రం ఆధారంగా 28.50 లక్షల క్యూసెక్కుల వరదనీటిలోనే 369 గ్రామాలు మునిగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది. నిజంగా యాభై లక్షల క్యూసెక్కు ల కంటే ఎక్కువ వరద వస్తే చెప్పలేనంత విలయం సంభవించవచ్చు. ప్రాంతాల మధ్య మరింత అసమానతలు సృష్టిస్తుండడమే సామ్రాజ్యవాదులు ఘనంగా చాటుతున్న అభివృద్ధి నైజమని సులభంగా గ్రహించవచ్చు. దేశ వ్యాప్తంగా నిర్వాసితులైన కోటిమంది ఆదివాసులను చూస్తే ప్రజావ్యతిరేక భారీ ప్రాజెక్టులపై ప్రజలు పోరాడక తప్పదని చరిత్ర నిరూపిస్తున్నది. రాజ్యాంగం, చట్టం ప్రజాభివూపాయాల ను కాలరాస్తున్నప్పుడు ఇంతకం లేదు.కేరళలోని సైలెంట్ వ్యాలీ, గుజరాత్‌లోని హెరాన్ ప్రాజెక్టులను తీవ్రమైన ప్రజావూపతిఘటన తర్వాతనే పాలకులు రద్దు చేశారు. ప్రాంతీయ అసమానతల తొలగింపు, విధ్వంసకర అభివృద్ధి నమూనాలను అడ్డుకునే ఐక్య ఉద్యమాలను రెండు తెలుగు రాష్ట్రాల నిర్మాణానికి, జలవనరుల పంపిణీలో సమాన న్యాయాన్ని పాటిస్తూ పునర్‌నిర్మాణానికి సరికొత్త ప్రజాభివృద్ధికి ప్రాతిపదికను సృష్టిస్తాయి. ప్రపంచ జీవావరణ దశాబ్దం(2011-2021) ప్రారంభంలో ‘ప్రకృతి మనిషి అవసరాలను తీర్చగలదే గానీ, అత్యాశలను తీర్చలేదన్న’ గాంధీజీ హితోక్తి. పోలవరంతో లబ్ధి పొందాలనుకున్న బహుళజాతి సంస్థల కు అచ్చంగా సరిపోగలదు. 

Namasete Telangana News Paper Dated 24/11/2011