Showing posts with label పౌరహక్కులు. Show all posts
Showing posts with label పౌరహక్కులు. Show all posts

Tuesday, October 8, 2013

ప్రజాస్వామిక విలువగా రిజర్వేషన్లు By ‘రిజర్వేషన్లు ప్రజాస్వామిక దృక్పథం’ పుస్తకానికి వి.యస్. ప్రసాద్ రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు




బాలగోపాల్ ఆలోచనలు, రచనలు, ఆచరణ అన్నీ కూడా ప్రజా స్వామిక విలువల ఆధారమయినవి. 1980 నుంచి 2009లో చనిపో యే వరకు ఆయన చేసిన రచనలను, ఆచరణను పరిశీలించి నట్లయితే ఈ విషయం స్పష్టమవుతుంది. డి.డి.కోశాంబి రచనలతో ప్రేరేపితుడై మార్క్సిస్టు అవగాహనతో, ప్రజాస్వామిక దృక్పథంతో బాలగోపాల్ సమాజాన్ని విశ్లేషించాడు. అసమానతలు, అణచివేతలేని సమాజం కోసం నిరంతరం కృషి చేశాడు. ఏ దృష్టితో రచనలు చేశామనే దానిపైన అవి ఎవరికి ఉపయోగపడతాయనేది ఆధారపడి ఉంటుంది. బాల గోపాల్ రచనలన్నీ భారతీయ సమాజంలో మెజారిటీగా ఉన్న వెనుక బడినవర్గాల దృష్టినుంచి, అంటే వారి న్యాయమైన ప్రజాస్వామిక ఆకాంక్షల నుంచి చేయబడ్డవే. ఆయన మార్క్సిస్టు విశ్లేషణ సాధికార తను పరిశీలించినా; రాజ్యం-సంక్షేమం గురించి, దళితుల సమస్యల గురించి చేసినా, నక్సలైట్ ఉద్యమం గురించి ఆయన రాసిన రచనలను పరిశీలించినా; పౌరహక్కుల గురించి చేసిన విశ్లేషణలోనైనా; ప్రాంతీయ ఉద్యమాల గురించి చేసిన వాఖ్యల్లో అయినా; నీటి పంపిణీ సమస్యకు పరిష్కారాలు సూచించినా; జెండర్ సమస్యను పరిశీలించినా; దేశ అభివృద్ధి నమూనాలను ప్రశ్నించినా; సాహిత్య విమర్శ చేసినా- అన్నీ సామాన్య ప్రజల ప్రజాస్వామ్యయుత మైన ప్రయోజనాల ఆధారంగానే చేశాడు. అందుకే బాలగోపాల్ రచనలన్నీ భారతదేశంలో ప్రజాస్వా మ్యం కోసం నిరంతరంగా సాగుతున్న పోరాటాలకు ఉపయోగ పడ తాయని పర్‌స్పెక్టివ్స్ భావిస్తోంది. అందుకనే బాలగోపాల్ రచనలను సాధ్యమైన మేరకు ప్రచురిస్తున్నది.



భారతదేశంలో విద్యా, ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్లకు వంద సంవ త్సరాలకు పైనే చరిత్ర ఉంది. తీవ్రంగా సాగిన అనుకూల, వ్యతిరేక ఉద్యమాల అనుభవం ఉంది. స్వాతంత్య్రానికి పూర్వమే బ్రిటిష్ పాల నలోని కొన్ని ప్రాంతాలలో, కొన్ని స్వదేశీ సంస్థానాలలో రిజర్వేషన్లు ఉండేవి. అయితే భారత రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ రిజ ర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించడం కోసమే చేయబడిందనేది గమ నించదగ్గ విషయం. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి కూడా అసమాన సమాజంలో సమానత్వం కోసం తీసుకొనే చర్యలలో రిజర్వేషన్లను ఒక చర్యగా భావించడం జరిగింది. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే నూతన రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలకు (Art-15[1]) కుల ప్రాతిపదికపైన రిజర్వేషన్లు ఇవ్వడం వ్యతిరేకమని కొందరు కోర్టుకు వెళ్లారు. రిజర్వేషన్లు రాజ్యాంగంలోని సమానత్వ సూత్రాలకు (Art-15[1]) వ్యతిరేకమని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది. అప్పుడు పార్లమెంటు మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేపట్టి 1951 లో రాజ్యాంగంలో ఆర్టికల్15కు క్లాజు-4ను చేర్చింది. ప్రభుత్వం సామాజికంగానూ, విద్యపరంగాను వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చని ఆ క్లాజ్‌లో పేర్కొన్నారు. దీనితో రాజ్యాంగబద్ధత విషయంలో కొంత స్పష్టత వచ్చినప్పటికి, నాటి నుం చి నేటి వరకు రిజర్వేషన్లకు సంబంధించిన అనేక విషయాల గురించి న వివాదాలు, ఉద్యమాలు, శాసనాలు, న్యాయస్థానాల తీర్పులు కొన సాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఈ సమస్య జటిలతను, ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి.



‘కుల వ్యవస్థ పోవాలంటూ కులం పేరుమీద రిజర్వేషన్లు ఎంత వరకు సమంజసం’ అనే అగ్రవర్ణాల వాదనను బాలగోపాల్ తిప్పి కొట్టాడు. కులాధిక్యతను ఉపయోగించుకొని ఇంతవరకు ప్రయోజ నాలు పొందినవారికి, కుల వివక్షకు గురి అయినవారు కులం పేరుతో పొందే ప్రయోజనాలను ప్రశ్నించే నైతిక హక్కు లేదని చెప్పాడు. మండల్ కమిషన్ వ్యతిరేక ఆందోళనల్లో జడలు విప్పిన కులతత్వాన్ని ఎండగట్టాడు. ఆర్థిక ప్రాతిపదిక ఆచరణలో అగ్రవర్ణాల వారికే ప్రయో జనకరంగా ఉంటుందని బాలగోపాల్ వాదించాడు. రిజర్వేషన్ల వల్ల వెనుకబడిన వర్గాలలోని సంపన్నులకే ప్రయోజనాలు కలుగుతాయనే వాదన సమంజసం కాదంటాడు బాలగోపాల్. అభివృద్ధి క్రమంలో-ముఖ్యంగా పెట్టుబడిదారీ అభివృద్ధి క్రమంలో ఏ రంగంలోనయినా అప్పటికే అభివృద్ధి చెందినవారే మొట్టమొదట ప్రయోజనాలను పొం దుతారు. అదేవిధంగా రిజర్వేషన్ల విషయంలో కూడా వెనుకబడ్డ వర్గా లలో కొంత అభివృద్ధి చెందినవారే ముందుగా లాభపడవచ్చు. ఆ విధంగా లాభపడ్డవారికి తమ వర్గాలకు చెందిన ఇతరులకు సహాయం చేయడానికి, వారి రాజకీయ వ్యక్తీకరణకు రిజర్వేషన్లు ఒక అవకాశంగా చూడాలనేది బాలగోపాల్ అభిప్రాయం. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ గురించి వివరమైన చర్చ ఈ రచనల్లో ఉంది. ‘సంపద సామాజికం’ అనే ప్రాతిపదికపైన బాలగోపాల్ ఈ చర్చ చేశాడు. సొంతపెట్టుబడి కూర్చుకున్న పద్ధతుల గురించి అవగాహన ఉంటేనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల ఆవశ్యకతను అర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా విద్యారంగం ప్రైవేటీకరణ చెందుతున్న ఈ దశలో, ఈ రంగంలో రిజర్వేషన్లు ప్రాధాన్యతను సంతరించుకు న్నాయి. సామాజిక న్యాయానికి విరుద్ధమైన అనేక ధోరణులు ప్రైవేట్ రంగంలో చోటు చేసుకుంటున్నాయి. అన్ని రంగాలలో అందరికీ అవ కాశాలుంటాయనే భావన ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థల ఉనికికి ఆధారంగా ఉండాలి. అది లేకపోవడం మొత్తం సమాజ ఉనికికే ప్రమా దం. అందుకే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను బాలగోపాల్ గట్టిగా సమర్థించాడు.



రిజర్వేషన్ల ఆచరణను గురించి కూడా బాలగోపాల్ వివరమైన చర్చ చేశాడు. ఈ విషయంలో నాకు కూడా కొంత ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. నా వృత్తిరీత్యా విద్యా, ఉద్యోగరంగాలలో రిజర్వేషన్ల అమలును కొంత దగ్గరగా పరిశీలించే అవకాశం కలిగింది. నా అనుభవం నుంచి, పరిశీ లన నుంచి నేను గమనించిన కొన్ని సమస్యలను ప్రస్తావిస్తాను. మొద టగా ఉద్యోగాల విషయంలో చట్టంలో పేర్కొన్న శాతం రిజర్వేషన్లు ఆచరణలో నిజంగానే లేవు. ఉన్నత పదవుల్లో ఎస్,సి, ఎస్.టి ఉద్యో గుల శాతం చాలా తక్కువ. విశ్వవిద్యాలయాల్లో కూడా, ముఖ్యంగా పేరుగాంచిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎస్.సి, ఎస్.టి కేట గిరీలకు చెందిన అధ్యాపకుల శాతం ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంది. అందుకే బాలగోపాల్ ఈ విశ్వవిద్యాలయాలను ‘బ్రా హ్మణ అగ్రహారాలని’ పరిహసించాడు. ఈ పరిస్థితులకు అనేక కారణా లు చెబుతారు. సరిఅయిన అభ్యర్థులు దొరకటం లేదని చెబుతుం టారు. దాని అర్థం వెనుకబడిన వర్గాలకు విద్యావకాశాలు పూర్తిగా అందట్లేదనే కదా. రిజర్వేషన్లు ఇంకా ఎంతకాలం ఉండాలనే దానికి ఈ పరిస్థితి సమాధానం కాదా? రిజర్వేషన్ల ఉద్యోగాలు పూర్తిగా నింప కపోవడానికి ఇదొక్కటే కారణం కాదనే విషయాన్ని కూడా గుర్తించాలి. సాధారణంగా ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యతలలో అగ్రవర్ణాలకు చెం దినవారే ఎక్కువగా ఉంటారు. వారికి వెనుకబడిన వర్గాలను రిక్రూట్ చేసుకోవాలనే సంకల్పం చాలా తక్కువ. మన దేశంలో చట్టాలు ఒక మేరకు ప్రగతిశీలమైనవే. దానికి కొంతవరకు ప్రజా ఉద్యమాలు కార ణం. ప్రజలను భ్రమలలో ఉంచాలనే పాలకుల ప్రయత్నం కూడా ఈ ప్రగతిశీల చట్టాలకు కారణం. అయినా వాటి అమలులో పాలకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇబ్బందులు సృష్టిస్తున్నారు. రిజర్వేషన్ల చట్టాల విషయంలో కూడా ఇదే జరుగుతున్నది. అందుకే రిజర్వేషన్ల అమలు కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. పాలకుల దయతో కాకుండా, ఉద్యమాల వల్లనే తమకు రిజర్వేషను ప్రయోజనాలు కలిగాయనే విషయాన్ని ఆ ప్రయోజనాలు పొందు తున్నవారు గ్రహించాల్సిన అవసరం ఉంది.
-వి.యస్. ప్రసాద్
పర్‌స్పెక్టివ్స్
(‘రిజర్వేషన్లు ప్రజాస్వామిక దృక్పథం’ పుస్తకానికి
వి.యస్. ప్రసాద్ రాసిన ముందుమాట నుంచి కొన్ని భాగాలు)

Namasete Telangana News Paper Dated: 09/10/2013 

Wednesday, February 1, 2012

మానవ హక్కులు- పోలీసులు


‘మానవ హక్కులు’ అనే పదబంధం అతి పురాతనమైనది. రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో ఈ పదబంధం అత్యంత ప్రాచుర్యం పొందింది. కానీ ఇటీవలి కాలంలో దీనికి అత్యంత ప్రాధాన్యత లభించింది. ఐక్యరాజ్యసమితి (ఐరాస) చార్టర్‌ 1945లో మొట్టమొదటగా ఈ పదబంధాన్ని రాతపూర్వకంగా ఉపయోగించారు. అంతర్జాతీయంగా శాంతిని, రక్షణను ఏర్పాటు చేయడం ఐరాస ప్రధాన లక్ష్యం. అందుకని మానవహక్కుల ప్రాధాన్యతను ఐరాస గుర్తించింది. ఈ చార్టర్‌ను 1945లో శాన్‌ఫ్రాన్సికోలో ఆమోదించారు. ఈ చార్టర్‌ దేశాల మీద పాలనీయం కాదు కనుక ఆదర్శాలను ప్రకటించడమే తప్ప, అమలుకు అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది.

రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత ఏర్పడిన పరిస్థితిని చూసి మానవ హక్కులను గ్రంథస్థం చేయాలని ప్రపంచ దేశాలు భావించాయి. దాని ఫలితమే ‘విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన 1948’. ఈ ప్రకటనపై సభ్య దేశాలు 1948 డిసెంబర్‌ 10న సంతకాలు చేశాయి. ఇది కూడా ఆదర్శాల ప్రకటనే అయింది తప్ప సమితిలోని దేశాలమీద పాలనీయమైన పరిస్థితి లేదు. ఈ లోపాలను సరిదిద్దడానికి ఐరాస సాధారణ అసెంబ్లీ రెండు ఒప్పందాలను తీసుకువచ్చింది. అవి ‘సివిల్‌ రాజకీయ హక్కుల ఒప్పందం’, ‘ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక హక్కుల ఒప్పందం. ఈ ఒప్పందాలు వాటిపై సంతకాలు చేసిన దేశాలమీద పాలనీయమై ఉంటాయి. అయితే ఇవి శాసనాలు కావు. వీటికి అనుగుణంగా ఆయా దేశాలు తమ శాసనాలను రూపొందించవలసి ఉంటుంది. మన దేశం కూడా ఈ ఒప్పందాలపై సంతకం చేసింది. ప్రపంచ మానవాళికి స్వయంసిద్ధంగా ఉండే హక్కులే మానవ హక్కులు. కాని వీటి అమలు కంటె ఉల్లంఘనే ఎక్కువగా జరుగుతున్నది.

మన రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులన్నీ మాన వ హక్కులే. ఈ హక్కులను పరిరక్షించడానికి జాతీయ మానవ హక్కుల సంఘం, రాష్ట్రాలలో రాష్ట మానవ హక్కుల సంఘాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ‘మానవ హక్కుల పరిరక్షణ చట్టం- 1993’ ను తీసుకువచ్చింది. ఈ చట్టంలోని సె.2 (డి) ప్రకారం ‘భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో పొందుపరచి అభయమిచ్చిన వ్యక్తి జీవనం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, గౌరవం ఇంకా అంతర్జాతీయ ఒప్పందాలలో పొందుపరచి, భారత దేశ కోర్టులలో అమలు పరిచే అవకాశం ఉన్న హక్కులన్నీ మానవ హక్కులే.

మానవ హక్కుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా మనకు పోలీసులు గుర్తుకొస్తారు. సమాజంలో చాలా మంది మానవహక్కుల ఉల్లంఘన చేస్తున్నప్పటికీ, ఈ విషయంలో ప్రధానంగా ఆరోపణలు వస్తున్నది పోలీసులపైననే. ఇందుకు కారణం- శాసనాల ద్వారా విపరీతమైన అధికారాలు వచ్చింది పోలీసులకే. చట్టాన్ని సక్రమంగా అమలు పరచడానికి మానవహక్కులు అడ్డు వస్తాయని చాలా మంది చట్టాన్ని అమలు పరచవలసిన అధికారులు ఇప్పటికీ భావిస్తున్నారు. చట్టాన్ని అమలు చేయడాన్ని- మానవ హక్కుల పేరిట న్యాయవాదులు, ప్రభుత్వేతర సంస్థలకు చెందిన వ్యక్తులు ఆటంకపరుస్తున్నారని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ధోరణి ప్రమాదకరంగా పరిణమించి రహస్యంగా నిర్బంధించడం, నిందితుడిని ప్రశ్నించే పేరిట అరెస్టును చూపకుండా చాలా కాలం తమ ఆధీనంలో ఉంచుకోవడానికి, నిందితుడిని భౌతికంగా హింసించడానికి పాల్పడుతున్నారు.
వ్యక్తులను చిత్రహింసలకు గురిచేయడం అనాదిగా వస్తున్నది. నేటి ఆధునిక ప్రపంచంలోని చాలా దేశాలు చిత్రహింసలను ఆమోదించవు. ఆయా దేశాల్లో ఉన్న మానవ హక్కుల శాసనాలు, అంతర్జాతీయ ఒడంబడికలు ఇందుకు కారణం కావచ్చు.

చాలా దేశాలు చిత్రహింసలను ఆమోదించనప్పటికీ అవి ప్రపంచవ్యాప్తంగా సాగుతున్నాయన్నది వాస్తవం. కస్టడీలో చిత్రహింసలు, కస్టడీ మరణాలు, ఎన్‌కౌంటర్‌ మరణాలు ఈ విషయం గురించి చర్చించడానికి తరచు అవకాశం కల్పిస్తున్నాయి. వరంగల్‌లో యాకూబ్‌ రెడ్డిపైన చిత్రహింసల ఆరోపణలు, బెంగాల్‌లో కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌పై వచ్చిన ఆరోపణలు- పోలీసులు ఏ ప్రాంతంలోని వారైనా ఒకటేనని స్పష్టం చేస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం ఏ వ్యక్తిపై అమానవీయ చర్యలకు, చిత్రహింసలకు పాల్పడకూడదు. దర్యాప్తు, విచారణ వంటి ఎటువంటి దశల్లో సైతం ఈ చర్యలకు పూనుకోవడానికి వీల్లేదు. శాసనం చెప్పిన సందర్భాల్లోనే కాక మరే విధంగా కూడా వ్యక్తి స్వేచ్ఛని, జీవితాన్ని హరించినప్పుడు అందుకు బాధ్యుడైన వ్యక్తి, అదే విధంగా రాజ్యం కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది.

అమెరికా సుప్రీంకోర్టు మిరాండా వర్సెస్‌ ఆరీజోనా (1966 యుఎస్‌ 384) కేసులో చెప్పిన అభిప్రాయాల్ని మన సుప్రీంకోర్టు డి.కె. బసు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ వెస్ట్‌ బెంగాల్‌ కేసులో, ప్రీతి పాల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ (4 నవంబర్‌ 2011) కేసులో ఉటంకించింది. సుప్రీంకోర్టు డి.ె. బసు కేసులో ఈ విధంగా అభిప్రాయపడింది ‘రాజ్యం భద్రత గురించి వ్యక్తుల స్వేచ్ఛను బలి పెట్టడానికి వీల్లేదు. రాజ్యం భద్రత గురించి ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ ఉపయోగించవచ్చు. డిటెన్యూలను, దోషులను, అరెస్టయిన వ్యక్తులను దేశ ప్రయోజనాల కోసం ఇంటరాగేట్‌ చేయవచ్చు. ఈ ఇంటరాగేషన్‌కు వ్యక్తి స్వేచ్ఛకంటె ఎక్కువ ఆధిక్యత ఉంది. ప్రజల రక్షణ అనేది అత్యున్నత శాసనం. రాజ్యం రక్షణ అనేది అత్యున్నత శాసనం. ఇవి రెండూ ఒకదాని వెంట ఒకటి ఉండాలి. వ్యక్తి సంక్షేమం ద్వారా సమాజ సంక్షేమం ఉంటుంది. రాజ్యం చర్యలు సరైనవిగా, న్యాయబద్ధంగా, ఉచితమైనవిగా ఉండాలి. ఎలాంటి సమాచారం రాబట్టడానికైనా వ్యక్తులను చిత్రహింసలకు గురి చేయడం సరైనది కాదు... ఇది ఆర్టికల్‌ 21కి హాని కలిగించేది కాబట్టి ఆమోదయోగ్యం కాదు. దోషులను శాస్ర్తీయపద్ధతిలో ఇంటరాగేషన్‌ చేయాలి. అది కూడా శాసనం ధృవీకరించిన నిబంధనల ప్రకారం జరగాలి.

నేరం ఒప్పుదల గురించి, సహనేరస్థుల, ఆయుధాల ఆచూకీ తెలుసుకునేందుకు వ్యక్తులను చిత్రహింసల పాలు చేయడానికి వీలు లేదు... కొత్తరకమైన ఆలోచనలతో, దృక్పథాలతో టెర్రరిజం సవాలును ఎదుర్కోవాలి. టెర్రరిజంపై యుద్ధం చేయడానికి స్టేట్‌ టెర్రరిజం సమాధానం కాదు... టెర్రరిజంపై యుద్ధం చేయడానికి ఉన్న ఏజెన్సీలు శాసన ప్రకారం నడచుకునేట్టుగా రాజ్యం చూడాలి. అంతేకానీ వాళ్ళే శాసనం మీరడానికి వీల్లేదు. అమాయక పౌరుల మానవహక్కులను టెర్రరిస్టులు ఉల్లంఘించినప్పుడు వాళ్ళు శాసనం ప్రకారం శిక్షార్హులవుతారు కానీ వాళ్ళు మానవహక్కులను మరోరకంగా హరించడానికి వీల్లేదు’.

చిత్రహింసల గురించి ఎన్నో తీర్పులు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది డి.కె. బసు కేసు. అలాంటిదే మరో కేసు సుప్రీంకోర్టు ప్రీతిపాల్‌ సింగ్‌ మరి ఇతరులు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ (4 నవంబర్‌ 2011) కేసు. ఈ తీర్పులకు తగు ప్రచారం జరిగినా మానవ హక్కుల సంఘాలు ఎంతో కృషి చేసినా పోలీసుల్లో గుణాత్మకమైన మార్పు కనుపించడం లేదు. కారణం- పోలీసు చర్యల్లో పారదర్శకత లేకపోవడం, వారి చర్యలకు జవాబుదారీ లేకపోవడం. పోలీసు శాఖలో ఈ ధోరణిని అరికట్టడానికి అవసరమైన యంత్రాంగం లేదు. పంజాబ్‌లో ఖలిస్థాన్‌ గురించి గొడవలు జరిగినప్పుడు సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ అజిత్‌ సింగ్‌ సంధూ ఒక హీరో. కానీ అతను చేసిన అకృత్యాలకు అతను మూల్యం చెల్లించవలసి వచ్చింది. జశ్వంత్‌ సింగ్‌ ఖల్రా మానవహక్కుల ఉద్యమ కార్యకర్త. అమృతసర్‌ తదితర జిల్లాల్లో మిలిటెంట్లు అన్న పేరుతో అమాయకులను కాల్చి చంపివేశారన్న ఆరోపణలపై సాక్ష్యాలు సేకరించాడు. అది సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ అజిత్‌ సింగ్‌ సంధూకు ఆగ్రహం తెప్పించింది. పోలీసులు పథకం ప్రకారం జశ్వంత్‌సింగ్‌ను అపహరించి, చిత్రహింసలపాలు చేసి చంపేశారు. అతడి భార్య సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో నేరాభియోగాలు తయారుచేయకముందే సంధూ ఆత్మహత్య చేసుకున్నాడు. మిగతా 8 మందిలో ఒకరు చనిపోగా, ఒకరిపై నేరం రుజువు కాలేదు. మరో అధికారిని కోర్టు వదలిపెట్టింది. మిగతా ఐదుగురు అధికారులకు కోర్టు శిక్ష విధించింది. ఆ శిక్షలను హైకోర్టు ధృవీకరించింది. సుప్రీంకోర్టు కూడా అధికారుల అప్పీళ్ళను తిరస్కరించింది. ఇటువంటి సంఘటనలు కొంత భిన్నంగా కేరళలో కూడా జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరగవన్న హామీ లేదు. ఇది అందరూ గమనించవలసిన అంశం.
Surya News Paper Dated 

Sunday, January 29, 2012

నిలదీస్తేనే నిలువగలం...!



అనాది నుంచీ ఆదివాసుల జీవితాలు ‘పెనం మీదినుంచి పొయ్యిలో పడ్డ’ చందంగా తయారవుతున్నాయి. ఫలితంగా తరతరాలుగా పేదరికం లో మగ్గిపోతున్నారు. దీనికి పాలకులు, వారు అవలంబిస్తున్న విధానాలే కారణం. పాలకవర్గాలు ఆదివాసీ ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదను, అటవీ సంపదను, నీళ్లను, భూమిని టాటా, జిందాల్, వేదాంత, పోస్కో, మిట్టల్ తదితర బహుళజాతి కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. సంపన్న వర్గాలకు వనరులను ధారాదత్తం చేసి ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నాయి.ఉత్తర తెలంగాణలో ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న ప్రాం తంలో అటవీ, ఖనిజ సంపద పుష్కలంగా ఉంది. డోలమైట్, బాక్సైట్ తదితర ఖనిజాలు, భారీనీటి ప్రాజెక్టుల కోసం కావలసిన గోదావరి, మునేరు, ప్రాణహిత, కిన్నెరసాని లాంటి నదులున్నాయి.

వీటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళారీ పెట్టుబడిదారులకు, బహుళజాతి కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నాయి. వీటిని నమ్ముకొని తరతరాలు గా ఆదివాసులు, పీడిత ప్రజలు జీవనం సాగిస్తున్నా రు. పాలకుల విధానాలతో ఆదివాసులు నిర్వాసితులవుతున్నారు.ఆదివాసీ చట్టాల్లో ‘పెసా’ చట్టం, 1/70 చట్టం ప్రకారం గ్రామ సభలకే సర్వాధికారం ఉంది. స్వయం పాల న, రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూలు, రాజ్యాంగ అధికరణ 244 కింద ఉదహరించబడిన ఆదివాసుల పరిరక్షణ నియమాల వంటి చట్టాలు, ఆదివాసుల పరిరక్షణ కోసం చేసిన చట్టాలను ఉల్లంఘిస్తూ పాలకులు వారిని బలిచేస్తున్నారు. ఆదివాసులను వారి నివాస ప్రాంతాల నుంచి తరిమేసి, వారి సంస్కృతిని నాశనం చేసి వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. పాలకుల విధానాలను ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్న ఆదివాసులను రూపుమాపేందుకు ఏకంగా గ్రీన్‌హంట్ పేరిట ఆదివాసులపై యుద్ధం ప్రకటించారు. గిరిజనులను తుదముట్టిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల ఖమ్మం, ఉభయగోదావరి జిల్లాల్లో వందలాది గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. పోలవరం నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేకున్నా ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారు. ఆదివాసులను సమాధి చేసేందుకు టీడీపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయి. మరోవైపు జాతీయ అవసరాల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు నిక్షేపాలను వెలికి తీసే కార్యక్షికమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాయి. బొగ్గును వెలికి తీసే పనిని ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ.., ఓపెన్ కాస్ట్ విధానంతో విధ్వంసం సృష్టిస్తున్నారు. సింగరేణి గనుల్లో చేపడుతున్న ఓపెన్ కాస్ట్ విధానంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతో.. వ్యవసాయమంతా మూలనపడిపోయింది. పంట భూములు కానరాకుండాపోయాయి.

ఖమ్మం జిల్లాలోని మణుగూరు, ఇల్లెందు, గుండాల-1, సీతంపేట, ఆదిలాబాద్‌లో కైరిగూడెం, అబ్బాపూర్, ఎన్‌కేపూర్, కైరిమాదారంలో కొత్తగా ఓపెన్ కాస్ట్‌లు రానున్నాయి. కరీంనగర్ జిల్లాలో తాడిచర్ల, వరంగల్‌లో పెద్దాపూర్ తదితర ప్రాంతాల్లో ఓపెన్ కాస్టులు రాబోతున్నాయి. దీని ఫలితంగా వేలాది ఎకరాల పంట భూములు నాశనమై రైతులు బికారులు కాబోతున్నారు. కొత్తగూడెం-2 ఓపెన్‌కాస్టుతో ఆ ప్రాంతంలో రెండువేల ఎకరాల పంటభూములు నాశనం అవుతున్నాయి. ఇల్లెందు జెకె-3 ఓపెన్ కాస్టుతో ఇల్లెందు సికాయపల్లికి చెందిన వెయ్యి కుటుంబాలు జీవనోపాధిని కోల్పోతున్నాయి. మణుగూరు ఓపెన్ కాస్ట్ కింద 30 గ్రామాలు, మంగిలిగూడెంతోపాటు మరో మూడు గ్రామాల ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోతున్నారు.
వరంగల్ జిల్లా కొడిశెలకుంట, బుచ్చిడ్డిపల్లి, యెల్లంపల్లి, రంగయ్యపల్లి ప్రాం తాల్లో డోలమైట్, బాక్సైట్, ఇనుప ఖనిజాలు ఉండటంతో మైనింగ్ మాఫియా కన్నుపడింది.

దీంతో ఆ ప్రాంతంలో మూఢ నమ్మకాలను ప్రచారం చేసి అక్కడి ప్రజలు ఆ ప్రాంతంలోని భూములను వదిలివేసే విధంగా విష ప్రచారం చేస్తున్నా రుపజలను భయవూభాంతులను గురిచేసే ప్రచారం చేయడంతో కొందరు గ్రామాలను వదిలి వెళ్లిపోతున్నారు.గుట్ట నీడ (బొవూడాయి) ఈ గ్రామాలపై పడి మనుషులకు కీడు వస్తుందని ప్రచారం చేసి ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసే విధంగా మైనింగ్ మాఫియా ప్రచారం చేసింది. ప్రజలు ఊళ్లు విడిచివెళ్లిన తర్వాత ఆ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్నారు. అనేక రకాలుగా ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్న ప్రభుత్వం, ఆదిలాబాద్ జిల్లాలో అభయారణ్యం పేరుతో ఆదివాసులను నిర్వాసితులను చేయడానికి పూనుకున్నది. కవ్వాల్ అడవుల్లో, ఖమ్మం జిల్లా వీఆర్‌పురం, చింతూరు అడవులలో, వరంగల్ జిల్లాలో తాడ్వాయి, ఏటూరు నాగారం అడవులను ‘టైగర్ జోన్’లుగా ప్రభుత్వం ప్రకటించింది.ఆదివాసులను ఈ ప్రాంతాల నుంచి తరిమేసి యథేచ్ఛగా ఖనిజ సంపదను, అటవీ సంపదను కొల్లగొట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. టైగర్‌జోన్ కారణంగా 40 గ్రామాల ప్రజలు రోడ్డునపడుతున్నారు. చింతూర్, వీఆర్‌పురం అడవుల్లో టైగర్‌జోన్ వల్ల 100 గ్రామాల గిరిజనులు నిర్వాసితులు అవుతున్నారు.

వరంగల్ జిల్లా చెల్పూర్ దగ్గర ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. మరొకటి నిర్మాణంలో ఉన్నది. వీటిలో స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామన్నారు కానీ ఒక్క ఉద్యోగం కూడా స్థానికులకు ఇవ్వలేదు. ఈ విద్యుత్ ప్లాంటు వెదజల్లుతున్న బూడిద వల్ల వేలాది ఎకరాల పంట పొలాలు నాశనమవుతున్నాయి. గిరిజనులు వేసుకున్న పంటలన్నీ బూడిదపాలవుతున్నాయి. ఇలా ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు గిరిజన ప్రాంతాల్లో టైగర్‌జోన్‌లు, ప్రాజెక్టులు, ఖనిజ తవ్వకాల పేరు తో లక్షలాది మంది ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్నారు.

రకరకాల ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాలు, టైగర్‌జోన్‌ల పేరుతో రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా పాలకులు గిరిజనులపై కత్తిగట్టారు. ‘కాకులను కొట్టి గద్దలకేసినట్లు’ గా.. దేశమూలవాసులైన ఆదివాసులను కొట్టి బడా పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు దోచిపెడుతున్నారు. దీనిని దేశవ్యాప్తంగా ఆదివాసులు వ్యతిరేకిస్తున్నారు. తమకు తోచిన పద్ధతిలో నిరసిస్తున్నారు. సంఘటితంగా పోరాడుతున్నారు. సరిగ్గా ఇక్కడే మావోయిస్టు పార్టీ ఆదివాసులకు అండగా నిలిచి వారి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నది. ఆదివాసీ ప్రాంతాలపై జరుగుతున్న అన్ని రకాల దోపిడీని వ్యతిరేకిస్తున్నది.ఈక్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీలకు అండగా నిలిచి ఆదివాసులపై అణచివేతకు దిగుతున్నాయి. గిరిజనులపై ‘గ్రీన్‌హంట్’ పేరుతో యుద్ధా న్ని ప్రకటించాయి. మావోయిస్టులకు మద్దతునిస్తున్నారన్న నెపంతో ఆదివాసులపై పారా మిలిటరీ, పోలీసు బలగాలు దమనకాండను సాగిస్తున్నాయి.

ఊళ్లకు ఊళ్లను తగలబెడుతున్నాయి. ఆదివాసీ మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాయి. పండు ముసలి నుంచి పసి పిల్లల వరకు దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపుతున్నాయి. సాయుధ పోలీసు, భద్రతా బలగాలకు తోడుగా సల్వాజుడుం లాంటి ప్రైవేటు గూండా సైన్యాన్ని పెంచి పోషించి ఆదివాసులపై అమానుష దాడులకు పాల్పడుతున్నాయి. ఇదం తా మావోయిస్టుల ఏరివేత పేరుతో పాలకులు సాగిస్తున్న దమనకాండ. ఇంత కూ మావోయిస్టులు చేసిన, చేస్తున్న నేరం ఏమిటో దేశ ప్రజల ముందు పాలకులు వెల్లడించకుండానే ఇదంతా చేస్తున్నారు. ఈ దేశ సహజ వనరులపై కన్నేసిన బహుళ జాతి కంపెనీల దోపిడీని ఎదిరించడమే మావోయిస్టులు చేసిన నేర మా? అందరూ ఆలోచించాలి. ఈ మట్టిపై, ఈ ప్రజలపై ప్రేమ ఉన్న వారెవరై నా బహుళజాతి కంపెనీల దోపిడీని వ్యతిరేకించాలి. అభివృద్ధి పేరుతో దేశ వనరులను విదేశీ కంపెనీలకు, కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న పాలకులను నిలదీయాలి.దేశాన్ని తాకట్టు పెట్టే పాలకుల విధానాలను వ్యతిరేకించాలి.

దేశ సార్వభౌమాధికారం కోసం ప్రజలంతా దీర్ఘకాలిక మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమవ్వాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా సమస్త ప్రజల అభివృద్ధి కోసం, ఆదివాసీ ప్రజల విముక్తి కోసం పోరాడాలి. కొమురం భీం మార్గంలో జల్, జంగల్, జమీన్ కోసం పోరాడాలి. సామ్రాజ్యవాద, దళారీ, నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాడుతూ.., మూలవాసులపై తలపెట్టిన గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా పోరాడాలి. తద్వారానే దేశ సార్వభౌమాధికారాన్ని, స్వావలంబనను నిలుపుకోగలం. ఈ రాజీలేని పోరాటం ద్వారా నే సమసమాజ నవ భారతాన్ని నిర్మించుకోవాలి.
-జగన్
మావోయిస్టుపార్టీ ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి 
Namasete Telangana News Paper Dated 30/1/2012 

Wednesday, January 18, 2012

న్యాయం కావాలి - లతీఫ్ మహ్మద్ ఖాన్



ప్రభుత్వం ముస్లింల పట్ల కపట ప్రేమను ప్రదర్శిస్తుందనే ఆరోపణకు మరో రుజువు ఇది. ముస్లింల మీద పోలీసు యంత్రాంగం అకారణ ద్వేషం ప్రదర్శిస్తుందనీ, అది పూర్తిగా మెజార్టీ మతతత్వంతో వ్యవహరిస్తుందని ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు చేస్తున్న వాదనలకు సాక్ష్యం దొరికింది. మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో అమాయక ముస్లిం యువకులను చిత్రవధ చేసి హింసించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం ఇస్తూ జీ.వో ఆర్టీ నెం. 4268 విడుదల చేసింది. 

పదహారు మంది యువకులకు ఒక్కొక్కరికి మూడు లక్షలు, యాభై మందికి ఒక్కొక్కరికీ ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం గత శుక్రవారం నాడు ప్రభుత్వం అందజేసింది. మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో అక్రమంగా ఇరికించబడిన, హింసించబడిన ఆ యువకులకు నష్టపరిహారం ఒక్కటే సరిపోదు. వారి మీద జరిగిన దుర్మార్గమైన హింసకు అది పరిష్కారమూ కాదు. వివక్షకు బాధితులైన ఆ ముస్లిం యువకులకు న్యాయం లభించాలి. 

మక్కా మసీదు కేసుకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. 2007లో జరిగిన ఈ సంఘటన అనేక అంశాలను చర్చకు పెట్టింది. ఈ కేసును విచారించే బాధ్యతను సిబిఐకి అప్పగించడం వల్ల నిజమైన నేరస్తులెవరో వెల్లడైంది. దేశంలో ఎక్కడ బాంబు పేలుళ్లు జరిగినా ముస్లింలను అనుమానించే వైఖరిని పోలీసు యంత్రాంగం అనుసరిస్తోంది. ప్రభుత్వ సహకారంతో పోలీసులు ముస్లింలను నేరస్తులుగా, తీవ్రవాదులుగా చిత్రిస్తూ వచ్చారు. మాలేగావ్ బాంబు పేలుడు, అజ్మీర్ దర్గా కేసులను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఆధ్వర్యంలో విచారించారు. 

కర్కరే ఈ విచారణకు నాయకత్వం వహించారు. మాలేగావ్ కేసుతో పాటు దేశంలో ఇతర ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లకు హిందూత్వ తీవ్రవాద సంస్థలే కారణమనీ, మాజీ సైనికాధికారులు, ప్రజ్ఞా ఠాకూర్ వంటి హిందూత్వవాదులు చేసిన పేలుళ్లని గుర్తించి అరెస్టు చేసిన సందర్భంలోనే మక్కా మసీదులో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్లలో ఐదుగురు మరణించారు. పేలుళ్లు చోటుచేసుకున్న వెంటనే పోలీసులు 'ఆత్మరక్షణ' కోసం జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ముస్లింలు మరణించారు. ముస్లింలు పోలీసుల మీద దాడులు చేసేందుకు ప్రయత్నించారనీ, ఆత్మరక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని ఆనాటి ప్రభుత్వం బుకాయించింది. 

పేలుళ్లలో మరణించిన వారికంటే పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన వారు, గాయపడిన వారే ఎక్కువ. ఆ తర్వాత ఈ పేలుళ్లకు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలే కారణమని ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండానే పోలీసులు ప్రకటించారు. మక్కామసీదు పేలుళ్ల పట్ల సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిని కలిసింది. కానీ, ఆయన మా అభ్యర్థనను కనీసం పరిగణించలేదు. పోలీసులే అంతా చూసుకుంటారని అన్నారు. దీంతో పోలీసు అధికారులు ఈ కేసును తప్పుదోవ పట్టించారు. అమాయక ముస్లిం యువకులను పేలుళ్లకు బాధ్యులను చేశారు. హరీష్ కుమార్ గుప్త, కె. రామ్‌చంద్ర అనే పోలీసు అధికారుల నేతృత్వంలో ఈ కేసు విచారణ జరిగింది. ఈ అధికారులకు ప్రభుత్వం అవార్డులు, రివార్డులు ఇచ్చి పదోన్నతులు కూడా కల్పించింది. 

ఈ కేసును సిబిఐ విచారణకు స్వీకరించిన తర్వాతే నిజాలు వెలుగు చూడడం మొదలైంది. మాలేగావ్, అజ్మీర్ దర్గా పేలుళ్లకు ఉపయోగించిన పేలుడు పదార్థాలే మక్కా మసీదు విస్ఫోటనంలో ఉపయోగించారనే క్లూ ఆధారంగా విచారణ సాగింది. దీంతో హిందూత్వ తీవ్రవాద సంస్థలే ఆ పేలుళ్లకు పాల్పడ్డాయని తేలింది. అయితే సిబిఐ విచారణకు ముందు హరీష్ కుమార్ గుప్త, కె. రామ్‌చంద్రలు చేసిన విచారణ అనేక అనుమానాలకు తావిస్తుంది. ఉద్దేశపూర్వకంగా ఈ పోలీసు అధికారులు కేసు విచారణను తప్పుదోవ పట్టించారని తేలింది. 

వందలాది ముస్లిం యువకుల మీద తీవ్రవాదులనే ముద్ర వేశారు. దారుణమైన మానసిక, శారీరక హింసకు గురిచేశారు. మఫ్టీ పోలీసులు యువకులను అపహరిస్తుంటే, పోలీసు స్టేషన్‌కు వెళ్లి అడిగిన కారణానికి 28 మంది ముస్లిం మహిళలను అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపారు. ఎనిమిది రోజుల పాటు ఆ మహిళలకు రిమాండ్ విధిస్తే కనీసం వారికి బెయిల్ దొరకలేదు. ప్రజలే ఆరు లక్షలు జమానాతు కట్టి విడిపించుకున్నారు. ఇంత నిర్దయగా పోలీసులు వ్యవహరించడానికి కారణమేమిటి? హిందూత్వ తీవ్రవాద సంస్థలను కాపాడేందుకు ఈ అధికారులు ఎందుకు ప్రయత్నించారు? 

విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించి చట్ట ఉల్లంఘనకు పాల్పడిన అధికారులను సిబిఐ నేరస్తులుగా గుర్తించకపోవటం వెనుక వున్న కారణాలేమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ప్రభుత్వమే చెప్పాలి. అక్రమ నిర్బంధం, చట్ట వ్యతిరేక హింస ఈ కేసులో ఏవిధంగా జరిగిందో విచారించేందుకు స్టేట్ మైనార్టీ కమిషన్ ఒక విచారణ సంఘాన్ని నియమించింది. అడ్వకేట్ జనరల్ రవిచంద్ర నేతృత్వంలో ఆ విచారణ జరిగింది. జరిగిన అనేక సంఘటనలను విచారించి బాధితులను కలిసి ఈ కమిషన్ ఒక మధ్యంతర నివేదికను సమర్పించింది. జరిగిన ఘోరాలను కళ్లకు కట్టినట్టు ఆ నివేదికలో చిత్రించింది. 

కాని, అంతిమ నివేదికను కమిషన్ సమర్పించినప్పటికీ దాన్ని ప్రభుత్వం పౌరసమాజంలోనూ, చట్టసభలోనూ చర్చకు పెట్టడం లేదు. నివేదికను చర్చకు పెట్టకుండానే బాధితులకు క్షమాపణ చెప్పకుండానే, చట్ట ఉల్లంఘనకు పాల్పడిన పోలీసు అధికారుల మీద క్రిమినల్ చర్యలు చేపట్టకుండానే నామమాత్రపు నష్టపరిహారం ఇచ్చేందుకు సిద్ధపడింది. మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోలేదనే సంగతిని గమనించాలి. అనేక మంది మీద అక్రమంగా పెట్టిన కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక మందిని అబ్‌స్కాండింగ్ కింద ప్రభుత్వం చూపిస్తుంది. ఈ కేసుకు బాధ్యులైన హిందూత్వవాదులను ప్రభుత్వం నేటికీ అరెస్టు చేయలేదు. ఈ కేసును తప్పుదోవ పట్టించిన అధికారులను అరెస్టు చేయలేదు. కానీ, నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకోవాలని చూస్తుంది. 

మాలేగావ్ కేసు బాధితులు ప్రదర్శించిన చైతన్యం మక్కా మసీదు కేసు బాధితులు చూపించ లేదనే బాధ పీడిస్తుంది. మాలేగావ్ కేసులో హత్యకు గురైన రక్తసంబంధీకులు, హింసించబడిన బాధితులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చెక్కులను తిరస్కరించారు. వాటిని చించి పారేశారు. నీ భర్త మరణించినప్పుడు ఎంత తీసుకున్నావని సోనియాగాంధీని ప్రశ్నించారు. అలాంటి చైతన్యం రావడానికి అక్కడ పనిచేసిన ఉద్యమ సంస్థలు, ముస్లిం రాజకీయ ప్రతినిధులు కారణం. కానీ, హైదరాబాద్ ముస్లిం యువకులను, వారి కుటుంబాలను నష్టపరిహారం స్వీకరించేలా సంసిద్ధం చేసేందుకు కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కృషి చేశాయి. 

ఇది హైదరాబాద్ ముస్లింల ఆత్మగౌరవం మీద దాడి. అది నష్ట పరిహారం కాదు. బాధితులకు భిక్ష వేసి సర్దుకోమంటున్నారు. హైదరాబాదీలకు ఇది అవమానం. మక్కా మసీదు కేసులో బాధితులకు న్యాయం జరగాలి. తీవ్రవాదం అంతర్జాతీయ సమస్య కాబట్టి ఈ కేసును అతర్జాతీయ నేర చట్టాలు, న్యాయ సూత్రాల ప్రకారం విచారించాలి. ముస్లింల మీద చట్టబద్ధంగానూ, చట్ట వ్యతిరేకంగానూ జరుగుతున్న హింసను నివారించే చర్యలు చేపట్టకుండా బాధితులను మభ్యపెట్టే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తే రాజ్యాంగం హామీ ఇచ్చిన న్యాయం దక్కేనా?! 

- లతీఫ్ మహ్మద్ ఖాన్
ప్రధాన కార్యదర్శి, సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ, ఇండియా
Andhra Jyothi News Paper date:  11/1/2012

Thursday, December 15, 2011

మంటగలుస్తున్న మానవ హక్కులు


సెప్టెంబర్ 10న జమ్మూ కశ్మీర్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైనిక బలగాలు అరెస్టు చేసి తీసుకెళ్లిన వ్యక్తి అదృశ్యం కేసులో బాధితుడి కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీంతో.. జమ్మూ కశ్మీర్ తో సహా ఈశాన్య రాష్ట్రాల్లో సైనికబలగాలు సాగిస్తున్న హత్యాకాండ, అత్యాచారాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం ఊపందుకుంది. సైనికబలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) ఎత్తివేయాలని ఇరోమ్ షర్మిల గత పదేళ్లుగా సాగిస్తున్న దీక్షా ఉద్యమానికి మరింత నైతిక మద్దతు లభించింది. ఈ నేపథ్యంలోనే తాజా తీర్పుతో.. ‘కశ్మీర్‌లో సైనిక బలగాలకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఎత్తి వేయాల’ని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

జమ్మూ కశ్మీర్ హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో మరోసారి సైనికబలగాలు ఉగ్రవాదులు, మిలిటెంట్ల అణచివేత పేరిట సాగిస్తున్న అత్యాచారాలు చర్చనీయాంశం అవుతున్నాయి. కశ్మీర్‌లోని బెమినా పట్టణానికి చెందిన ముస్తాక్ అమ్జద్ దర్ అనే పేద ముస్లిం యువకుడు ఆటో రిక్షా నడుపుతూ జీవనం సాగించేవాడు. ఉన్నట్టుండి 1997 ఏప్రిల్ 13 మధ్యరాత్రి అమ్జద్ ఇంటిని చుట్టి ముట్టిన సైకులు అతన్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. నాటి నుంచి అతని తల్లి అజ్రా బేగం పోలీస్‌స్టేషన్లు, సైనికబలగాల క్యాంపుల చుట్టూ తన కొడుకు ఆచూకీ చెప్పమంటూ తిరుగుతూనే ఉంది. కానీ ఎవరూ అమ్జద్ జాడచెప్పలేదు. పోగా.. అమ్జద్‌ను తాము తీసుకెళ్లలేదని స్థానిక సైని క క్యాంపు అధికారులు చెప్పారు. దీంతో.. స్థానిక మానవహక్కుల కార్యకర్తల సాయంతో అమ్జద్ తల్లి తన కొడుకు జాడ తెలపాలని హైకోర్టును ఆశ్రయించింది. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది.

జమ్మూ కశ్మీర్ హైకోర్టు హెబియస్ కార్పస్ పిటిషన్ ఆధారంగా.. అమ్జద్ అదృశ్యంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి కైఫుల్లా 2003లో స్థానిక పోలీసులను ఆదేశించారు. కానీ.. స్థానిక పోలీసులు 2009 దాకా ‘ఎఫ్‌ఐఆర్’ కూడా నమోదు చేయలేదు. అనేకసార్లు అమ్జ ద్ అదృశ్యానికి సంబంధించి తగు సమాచారాన్ని, వివరణను అడిగినా సరియైన స్పందన లేని సైనిక బలగాల తీరును న్యాయమూర్తి తీవ్రంగా గర్హించారు. ‘ఏళ్లకేళ్లు గా బాధితుల సమయాన్ని వృథా చేస్తూ.., మనోవేదనకు కారణమైన సైనిక బలగాలు మనిషి జీవించే హక్కును హరిస్తున్నాయ’ని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి పదిలక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు.

అమ్జద్ అదృష్యం ఉదంతంతో.. జమ్మూ కశ్మీర్‌లో దశాబ్దాలుగా సైనిక బలగాలు చేస్తున్న దమనకాండ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అమ్జద్ ఉదంతానికి ముందు వందలాది ‘హెబియస్ కార్పస్’ పిటిషన్లు దాఖలైనా వేటికీ పోలీసు లు, సైనిక అధికారులు స్పందించలేదు. సరైన సమాధానం చెప్పలేదు. వీటిపై అనేక మార్లు ప్రజ లు, మానవహక్కుల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి కూడా విన్నవించుకున్నారు. విజ్ఞాపన పత్రా లు సమర్పించారు. కానీ.. వేటిపైనా కేంద్ర ప్రభు త్వం స్పందించిన పాపాన పోలేదు. కశ్మీర్‌లో టెర్రరిస్టుల అణచివేత పేరుతో.. సైనికుల అత్యాచారా లు పెచ్చరిల్లుతున్నాయని స్థానిక అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. 

మిలిటెంట్లు, పాక్ ప్రేరేపిత టెర్రరిస్టుల పేరు తో ఎంతో మంది అమాయక గ్రామీణ యువకులను అక్రమంగా నిర్బంధించడమే కాదు.. వేలాదిమందిని ఎదురు కాల్పుల పేరిట కాల్చి చంపారని స్థాని క మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతేగా చాలా సంఘటనల్లో.. అదుపులోకి తీసుకున్న యువకులు కనిపించకుండాపోయిన ఘటనలే ఎక్కువగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. గుర్తుతెలియన ఉగ్రవాదుల పేరుతో ఎంతో మందిని ఆర్మీ క్యాంపుల సమీపంలో పూడ్చిపెడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం చనిపోయిన వారిలో, కనిపించకుండాపోయిన తమవారు ఉన్నారేమో చూడనివ్వాలని కోరినా సైనిక అధికారులు అందుకు నిరాకరించి ఖననం చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.

అంతర్జాతీయ ప్రజా హక్కుల సంస్థ జమ్మూ కశ్మీర్‌లో మానవహక్కుల విషయంపై అధ్యయనం చేసి ‘పూడ్చివేయబడిన సాక్ష్యాధారాలు’ పేరిట ఓ రిపోర్టును వెలువరించింది. ఈ సంస్థ అధ్యయనం ప్రకారం ఉత్తర కశ్మీర్‌లో.. సైనిక బలగాలు మిలిటెంట్ల పేరిట అమానుషానికి పాల్పడ్డాయని తెలిపింది. దీనికి స్థానికంగా జరిగిన ఓ ఘోర ఉదంతాన్ని ఉదహరించింది. ఒకసారి సైనిక బలగాలు పాక్ ఉగ్రవాదుల పేరిట 50 మందిని కాల్చిచంపాయి. కోర్టు ఆదేశాల మేరకు స్థానిక ప్రజలు, మానవహక్కుల కార్యకర్తలు ఆ శవాలను పరిశీలిస్తే.. అందులో 46 మంది స్థానిక యువకుల శవాలేనని తేలింది. అందులో.. ఒక యువకుడు మాత్రమే మిలిటెంట్‌గా గుర్తించారు.

ఇలా ఏళ్లకేళ్లుగా పోలీసులు, సైనిక బలగాలు కశ్మీర్ యువకులపై హత్యాకండ జరుగుతోందని మానవహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జమ్మూ కశ్మీర్ ‘స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్’ కూడా చాలా సందర్భాలలో సైనిక బలగా లు అకృత్యాలకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. అనేక ఘటనలలో యువకులను నిర్బంధించి, చంపి గుర్తుతెలియని టెర్రరిస్టులుగా సైనిక క్యాంపుల ఆవరణలోనే పూడ్చి పెడుతున్నారని ఆరోపించారు. సరిహద్దు (లైన్ ఆఫ్ కంట్రోల్) సమీప ఆర్మీ క్యాంపుల దగ్గర ఇలాంటి శవాల గుట్టలు అనేకం బయట పడ్డాయి. 

సరిహద్దు సమీప సైనిక క్యాంపులు ఉన్న క్రాల్సాన్‌గిరి, చాస్మాసాహి, ఛాన్పొరా తదితర ప్రాంతాల్లో ఆర్మీ క్యాంపుల దగ్గర ఎన్నో మానవశరీరాల ఎముకల గూళ్లు బయటపడ్డాయి. బారముల్లా దగ్గరలోని ‘దెలినా’లో ఓ హాస్పిటల్ నిర్మాణానికి బుల్డోజర్‌తో పునాదులు తీస్తుండగా అనేక మానవ కళేబరాలు బయటపడ్డాయి. ఇవన్నీ.. సైనిక బలగాలు గుర్తుతెలియని టెర్రరిస్టుల పేరుతో హత్యచేసిన యువకుల శవాలేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే.. స్థానిక పోలీసులు, మిలిటరీ అధికారులు రివార్డులు, అవార్డులకు ఆశపడి అక్రమ నిర్బంధాలకు, ఎన్‌కౌంటర్లకు పాల్పడుతున్నారని మానవహక్కుల సంఘాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు. 2006 డిసెంబర్‌లో శ్రీనగర్‌లోని బాటమలూ బస్‌స్టాండ్ నుంచి 35 ఏళ్ల అబ్దుల్ రహమాన్ పాద్రూ అనే కార్పెంటర్‌ను పోలీసులు అరెస్టు చేసి తీసికెళ్లారు. తీసుకెళుతుండగా వందలాదిమంది స్థానికులు చూశారు. అయినా.. అతన్ని ఎన్‌కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. తరువాత అతన్ని పాకిస్థాన్‌కు చెందిన లష్కర్ ఎ తోయిబా టెర్రరిస్టు అబూ హఫీజ్ అని కథనం అల్లారు.

దీంతో.. కరుడు గట్టిన టెర్రరిస్టును కాల్చిచంపినందుకు ప్రభుత్వం వీరికి 1,20,000 రూపాయలు నజరానాగా.పకటించింది. ఇలాగే.. కశ్మీర్ వ్యాలీ అంతటా పోలీసులు, మిలిటరీ బలగాలు బూటకపు ఎదురు కాల్పులు, టెర్రరిస్టులపేరుతో.. ఎంతో మంది అమాయకులను కాల్చిచంపారు. కశ్మీర్ అంతటా కోకొల్లలుగా జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనల పట్ల చాలా తక్కు వ సందర్భాలలోనే కోర్టు స్పందించింది. కోర్టు విచారించిన దాదాపు అన్ని కేసులలో కూడా పోలీసు, మిలిటరీ బలగాలు హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డాయని తేల్చింది. ప్రభు త్వ బలగాలు చెప్పుతున్నదంతా అబద్ధ్దాలని ప్రకటించింది. 


ఈ AFSPA చట్టం ప్రకారం ఏ వ్యక్తినైనా.. మిలిటరీ బలగాలు టెర్రరిస్టుగా అనుమానిస్తే కాల్చిచంపేయవచ్చు. దేశ వ్యతిరేక, టెర్రరిస్టు వ్యతిరేక కార్యకలాపాల నిరోధానికి ఉద్దేశించిన ఈ చట్టాన్ని పోలీస్ మిలిటరీ బలగాలు దుర్వినియోగం చేస్తున్నాయని చాలా ఏళ్లుగా పౌర, మానవహక్కుల సంఘాలు అంటున్నాయి. కశ్మీ ర్ మొదలు ఈశాన్య భారత్‌లోని మణిపూర్, నాగాలాండ్, త్రిపుర, మిజోరం, అస్సాం తదితర రాష్ట్రాలలో సైనిక బలగాలు మిలిటెంట్ల ఏరివేత పేరుతో హక్కుల ఉల్లంఘన నిరాఘాటంగా సాగుతూనే ఉంది. ఈ చట్టం దుర్విని యోగమవుతున్న ఘటనలు అనేకం వెలుగు చూశాయి.

ఈ నేపథ్యంలోనే మణిపూర్‌లో సైనికబలగాలు చేస్తున్న అత్యాచారాలకు నిరసనగా సైనికబలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేయాలని ఇరోమ్ షర్మిల 11 ఏళ్ళుగా నిరసన పోరాటం చేస్తోంది. అయినా .. మన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆమె రోదన అరణ్యరోదనగానే మిగిలింది. నిరహారదీక్ష చేస్తున్న ఇరోమ్‌కు నిర్బంధంగా ద్రవ ఆహార పదార్థాలను ముక్కుద్వారా ఎక్కిస్తున్నారు. నిరహార దీక్ష చేస్తూ అచేతనంగా ఉన్న ఇరోమ్‌ను హాస్పిటల్‌నే జైలుగా మార్చింది ప్రభుత్వం. ఇరోమ్ కోరుతున్న డిమాండ్‌ను కనీసం పరిశీలిస్తామని కూడా ప్రభుత్వం చెప్పడం లేదు. మాట మాట కు గాంధీ, అహింస అంటూ.. జపం చేసే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరోమ్ దీక్ష పట్ల వ్యవహరిస్తున్న తీరు వాటి నైజాన్ని చెప్పకనే చెబుతున్నాయి. ప్రజల న్యాయమైన పోరాటాల్లు, సమస్యల పట్ల ప్రభుత్వ తీరు మారాలి. లేకుంటే.. మునుముం దు సమస్యలు తీవ్రమై.. ప్రజలు తిరుగుబాటు చేయక తప్పని పరిస్థితి వస్తుంది. 

-ఎస్. మల్లారెడ్డి
Namasete Telangna   News Paper Dated 16/12/2011 

Sunday, December 11, 2011

రైతుల గోస హక్కుల ఉల్లంఘనే(నేడు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం)



రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల ప్రాతిపదికన తెలుగుదేశం పార్టీ శాసనసభలో ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. రైతు ఆత్మహత్యల పరంపర గురించి ఏ స్పందనా లేకుండానే మాదే అసలైన రైతు ప్రభుత్వమని, తామే విజేతలమని ముఖ్యమం త్రి హర్షాతిరేకంతో ప్రకటించారు. సరే అంతా బాగానే ఉంది. మరి ఈ రైతు ప్రభుత్వ పాలనలో ప్రతిరోజూ రైతుల ఆత్మహత్యల రిపోర్టులు ఎందుకు వార్తాపవూతికల్లో చోటుచేసుకుంటున్నట్టు? మీడియా అంతా కలిసి ప్రభుత్వ సమర్థత ను సహించలేక ఈర్ష్యతో కక్షకట్టి అబద్ధపు వార్తలు ఇస్తున్నాయని అనుకుందా మా? లేదా రైతులే వారికున్న సవాలక్ష చిన్నాచితక కుటుంబ సమస్యలతో, వ్యవసనాలతో తమ ప్రాణాలను తామే సరదాగా తీసేసుకుంటున్నారనుకుందామా? ఏవో ఇలాంటివే కారణం అవుతాయి, కానీ, వ్యవసాయం వల్ల మాత్రం కాదని మనం అనుకోవాలి. అదే నిర్ధారణ చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు ఎఫ్‌ఐఆర్ సాక్షిగా సెలవిస్తారు. ఈ ఏడాది అక్టోబరు-నవంబర్ కాలంలో 95 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పత్రికలు, ప్రజాసంఘాలు ప్రకటించాయి. ప్రభుత్వం మాత్రం ఈ మొత్తం సంవత్సరంలోనే 71 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నారని ప్రకటించింది. పైగా రైతుల ఆత్మహత్యలు తగ్గించడంలో తమ ప్రభుత్వం గణనీయంగా కృషి చేసిందని సెలవిచ్చారు కూడా.

ఒకపక్క ‘వ్యవసాయం లాభసాటిగా లేదు కాబట్టి రైతులు మరో ఉపాధివైపు తప్పనిసరిగా మళ్లాల్సిందే’ అని ముఖ్యమంత్రి ప్రకటిస్తారు. ఇంకోవైపు ‘మాదే అసలైన రైతు ప్రభుత్వమని, రైతులను అన్ని విధాలా మేమే ఆదుకుంటున్నాం’ అని కూడా ప్రకటిస్తారు. పత్రికలు, ప్రజాసంఘాలు చెప్పిన ఆత్మహత్యల లెక్కల గురించి పక్కనపెడదాం. మీ ప్రభుత్వం అంగీకరించిన ఆత్మహత్యల సంగతేమి టి? అవి ఎందుకు జరిగినట్టు? ఆ కుటుంబాలకు ఇప్పటి వరకూ మీరందించిన సహాయం ఏమిటి? ఏ ఒక్క కుటుంబాన్నయినా ముఖ్యమంత్రి వెళ్లి పరామర్శించారా? ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను కనుక్కున్నారా? వైఎస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు జీవో 421 ద్వారా 2004 జూలై 1న ప్రకటించిన నష్టపరిహారం అందించారా? ఇతర పథకాలన్నిటిలోనూ ప్రాధాన్యం కల్పించారా? సామాన్య చిన్న రైతులు చనిపోతే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్లాలా? అని తిరిగి ప్రశ్నిస్తారేమో? మీకంటే ముందు పాలించిన వాళ్లు ఎలాంటి నష్టపరిహారం అందించలేదు కాబట్టి మీరు కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా?

రైతులు ప్రాణాలు తీసుకునేంత వ్యవసాయ సంక్షోభం కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే వచ్చిందా? ఒక సంవత్సరం పంట ఎండిపోవ డం వల్లే రైతుల ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమవుతోందా? అలా అనుకుంటే పొరపాటే. కొన్నేళ్లు గా వాతావరణ మార్పులతో పాటు రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులకు అవుతు న్న ఖర్చుల వల్ల వ్యవసాయానికి పెట్టుబడులు పెరిగి పోయాయి. ఇంకా వీటితో పాటు నకిలీ విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు కూడా రైతులను నిలువునా ముంచుతున్నాయి. పంట ల్లో వస్తున్న నష్టాలు,మద్దతు ధరలు లేకపో వడం, పెరుగుతున్న నిత్యావసర ధరలు, అనారోగ్యాలు, ఖరీదైపోయిన వైద్యం, విద్య ఇలా ఒకదానిమీద ఒకటి ఖర్చులు పెరిగిపోవడం వల్ల రైతు కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ప్రతి సంవత్సరం వేసిన పంటకు గిట్టుబాటు ధర వస్తే కుటుం బం బాగుపడుతుందనే నమ్మకంతో, పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆశతో మరింత అప్పులోకి వెళ్లడం జరుగుతోంది. దాదాపు ప్రతి ఒక్కరికి లక్ష నుంచి మూడు లక్షల రూపాయలపైనే అప్పు ఉంటున్నది. ఈ అప్పులేవీ ప్రభు త్వ సంస్థాగత రుణాలు కావు. బ్యాంకుల నుంచి వచ్చినవి కావు. అన్నీ కూడా అధిక వడ్డీలతో కూడుకున్న ప్రైవేట్ అప్పులు. గత ఏడాది ప్రభుత్వం ప్రకటించిన రుణ అర్హత కార్డుల స్కీమ్ ఎంతమంది కౌలురైతులకు అందిందో చెప్పగలరా? వ్యవసాయ పెట్టుబడులు, రసాయన ఎరువులు, విత్తనాల ధరలు, డీజీల్ ధరల సూచిని చూస్తే చిన్న, సన్న కారు రైతులు అందుకోలేనంత వేగంగా పెరుగుతున్నది వాస్తవం. 

పదిహేను సంవత్సరాల నుంచి ఆంధ్రవూపదేశ్‌లో చనిపోతున్న ఏ రైతు కుటుంబాన్ని కదిలించినా కళ్ల నుంచి కారేది కన్నీళ్లు కాదు, రక్తాక్షిశువులు. ఈ పదిహేను సంవత్సరాలలో మొత్తం దేశంలో బలవంతపు చావులకు గురైన రైతుల సంఖ్య దాదాపు రెండుల లక్షల యాభైవేలకు పైనే అని జాతీయ నేర పరిశోధనా గణాంకాలు చెప్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వాలు వేసుకోవలసిన ప్రశ్న.. అనేకమంది రైతులు ఈ విధంగా తమ ప్రాణాలను తీసుకోవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిం దని. పండించే పంట మీద భరోసా ఎందుకు లేకుండాపోతున్నది? ఈ పరిస్థితి కి కారణం ఎవరు? పరిస్థితి ఇంతవరకూ రాకుండా చేయడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయి? ఈ రైతుల మీద ఆధారపడ్డ కుటుంబాల పరిస్థితి ఏమవుతోంది? ఈ రెండు లక్షల యాభై వేలకు పైగా మరణాల్లో ఆంధ్రవూపదేశ్ మొదటి వరుసలో ఉన్నది. ఇది సగర్వంగా చాటుకుందామా? ఇదేనా ‘అన్నపూర్ణ’ అని చెప్పుకునే మన రాష్ట్ర గొప్పతనం.

ఇవి మా ప్రభుత్వ విధానాల వల్ల జరిగినవి కావు. వేరే పార్టీ అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాల ఫలితం అని చెప్పడం వల్ల మీకు సంతృప్తిగా ఉండవచ్చు. కానీ ఇవేవీ చనిపోయిన కుటుంబాలకు ఏ మాత్రం భరోసాను అందించలేవు. బహుశా మంచి పాలకులకు ఉండాల్సిన లక్షణం ఇది కాదేమో? ఇవన్నీ అంతర్జాతీయ మానవహక్కుల ఉల్లంఘనలు అనే మాట బహుశా మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు. కానీ ఇది వాస్తవం. ఇది ప్రభుత్వ పరిపాలనా వ్యవహారం. అధికారంలోకి వచ్చే ఏ పార్టీ అయినా సరే అంతర్జాతీయ మానవహక్కుల ఒడంబడికల అమలుకు కట్టుబడి ఉండాలి. మీరు కుర్చీలో ఉన్నంత వరకూ మీదే బాధ్యత.

అంతర్జాతీయంగా జరిగిన అనేక మానవహక్కుల ఒడంబడికల్లో భారతదేశం భాగస్వామిగా ఉండడంతో, వాటి అమలుకు సంబంధించి ఇక్కడ చట్టాలలో కూ డా మార్పులు తీసుకురావడం జరిగింది. ‘వ్యవసాయానికి మానవహక్కులకు సంబంధం ఏమిటి’ అని మీరు ప్రశ్నించవచ్చు. ‘ది ఇంటర్‌నేషనల్ కోవనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్’ (ఐసిసిపిఆర్), 1979; ప్రకారం (భారతదేశం దీని మీద సంతకం చేసింది) జీవించే హక్కు అనేది మనిషి ప్రాథమిక హక్కు. గౌరవవూపదంగా జీవించడానికి అవసరమయ్యే పరిస్థితులను కాపాడటం, ఉపాధి కల్పించడం, ఆహార భద్రతను కల్పించడం ఇవన్నీ దీనిలోకే వస్తాయి. ఈ హక్కులను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే.

ఇదొక్కటే కాకుండా ఇంకా అనేక ఒప్పందాల్లో భారతదేశం భాగస్వామి. అవి ‘ది ఇంటర్‌నేషనల్ కోవనెంట్ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్’ (ఐసిఇఎన్‌సిఆర్)1979; ‘ది కన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫామ్స్ ఆఫ్ డిస్‌క్షికిమినేషన్ ఎగైనెస్ట్ ఉమెన్’ (సిఇడిఎడబ్ల్యు) 1980; ‘ది కన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్ (సిఆర్‌సి), 1992; ‘ది ఇంటర్ నేషనల్ కన్ ఆన్ ది ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫామ్స్ ఆఫ్ రేషియెల్ డిస్‌క్షికిమినేషన్ (ఐసిఇఆర్‌డి) 1967; ఈ ఒప్పందాల్లో మన దేశం భాగస్వామిగా ఉండడమంటే ఏదో పేరుకి ఉండడం కాదు. వీటిని అమలు పరచచడంలో నిత్యం కృషి చేయాలి. అందుకు అనువైన చర్యలు తీసుకోవాలి. భారతదేశ అన్ని చట్ట సభలు, వ్యవస్థలు వీటి అమలుకు అనుగుణంగా ప్రవర్తించాలి. వీటి స్ఫూర్తికి భిన్నంగా ఏ రకమైన విధాన నిర్ణయాలు చేయకూడదు. కానీ వాస్తవంలో రైతుల జీవితాల్లో ఇవి ఎంత వరకు అమలవుతున్నాయో ప్రభుత్వమే చెప్పాలి.

దేశ ఆహారభవూదతకు ఆయువు పట్టయిన చిన్న, సన్న కారు రైతాంగానికి భరోసానిచ్చే ప్రణాళికలు తీసుకోకపోవడం వల్లే పరిస్థితి రోజురోజుకి ప్రమాదకరంగా మారుతున్నది. ఈ పరిస్థితులే రోజురోజుకు పెరుగుతున్న రైతు ల ఆత్మహత్యలకు కారణాలు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఆలోచించి చిన్న, సన్న కారు రైతులకు అనుకూలమైన వ్యవసాయ విధానాలు తీసుకునివుంటే, ఈ రోజు రైతు ఆత్మహత్య చేసుకునే వాడు కాదు. బాధిత కుటుంబాల్లోని స్త్రీలు, పిల్లలు ఒంటరిగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది కాదు. తమ భర్తల, తండ్రుల మరణాలు వ్యవసాయ సంబంధిత అప్పులతోనే జరిగాయని ‘నిజమైన రైతు ఆత్మహత్య’లుగా నిరూపించుకోవాల్సిన అవమానకరమైన పరిస్థితి ఎదుర్కొనేవారు కాదు. మరి ఇదేనా మీ అసలైన రైతు ప్రభుత్వం రైతులపై చూపిస్తున్న సానుభూతి? రైతు ప్రభుత్వంలో రైతు ఆత్మహత్య చేసుకుంటున్న తీరే ఈ ప్రభుత్వం ఎలాంటిదో చెప్పకనే చెబుతోంది. రైతు కన్నీరు పెట్టిన భూమి సుభిక్షంగా ఉండదంటారు. మరి రైతు కన్నీరు పెట్టని రోజు ఒక్కటైనా ఈ పాలనలో ఉన్నదా? 

-కె. సజయ
ఫీలాన్స్ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త)
(నేడు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం) Namasete Telangana Paper Dated 10/11/2011

Sunday, September 4, 2011

75 ఏళ్ళ పౌరహక్కుల ఉద్యమం-1 నెహ్రూ నేతృత్వంలో...- సి.భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి, ఓపీడీఆర్ Andhra Jyothi 24/08/2011


75 ఏళ్ళ పౌరహక్కుల ఉద్యమం-1
నెహ్రూ నేతృత్వంలో...
మనదేశ సంఘటిత పౌర, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమం ఆగస్టు 24, 2011 నాటికి 75 సంవత్సరాలు పూర్తిచేసుకొని 76వ పడిలో బలంగా అడుగువేయనుంది. రాజ్యం ఉన్నంతకాలం అణచివేత వుంటుంది (మార్క్స్ మాట) కనుక దాన్ని ప్రశ్నించే సంఘాలు వుండాలి, వుంటాయి. అధికారంలో లేనపుడు హక్కుల గురించి ఆందోళన చేసినవారంతా అధికార పీఠాన్ని అధిష్టించగానే ప్రజల హక్కులపై దాడిచేస్తున్నవారే.
దేశంలో తొలి పౌరహక్కుల సంఘం (ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్)కి ఆద్యులైన జవహర్‌లాల్ నెహ్రూ నుంచి నేటి వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాలు, 1964-66లో పెద్దఎత్తున పౌరహక్కుల ఉద్యమం సాగించడంలో ప్రముఖపాత్ర పోషించిన సీపీఐ(ఎం) ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో సాధారణ ప్రజలపైనా, వారి ఉద్యమాలపైనా నిరంకుశ చట్టాలు, లాఠీలు, తూటాలతో దాడులు చేసిన/చేస్తున్నవారే. ఇక బీజేపీ, టీడీపీ, డీఎంకే లాంటి పార్టీల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు.
ఈ దాడిని ప్రశ్నించే వారిపై దాడులు సాగుతాయని 75 సంవత్సరాల చరిత్ర చెబుతున్నది. ఈ క్రమంలో పడుతూ లేస్తూ 1965దాకా సాగిన పౌరస్వేచ్ఛల ఉద్యమం 1971 నాటికి ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమంగా ఎదిగి నాటి నుండి అవిచ్ఛిన్నంగా సాగుతోంది. ఈ స్వల్ప/సుదీర్ఘ కాలంలోని ప్రధాన ఘట్టాలను ఆవిష్కరించడమే ఈ వ్యాసం ఉద్దేశం. జాతీయ స్వాతంత్య్ర ఉద్యమాలన్నింటినీ రక్తపాతంలో ముంచెత్తిన బ్రిటీష్ వలస పాలకులు చివరకు గాంధీ నాయకత్వాన సాగిన అహింసాయుత ప్రజా ఉద్యమంపైనా అణిచివేత ధోరణి అవలంబించారు. దాని పరాకాష్టయే జలియన్‌వాలాబాగ్ దారుణ మారణకాండ. ఈ నేపథ్యంలో వలసపాలన కాలంలో పౌరస్వేచ్ఛల ఉద్యమానికి అంకురార్పణ జరిగింది.
1918 బొంబాయి కాంగ్రెస్ మహాసభ హక్కుల ప్రకటన అనే ఒక పౌర స్వేచ్ఛల డాక్యుమెంట్‌ను ఆమోదించి, దానిని మాంటింగ్ - చెమ్స్‌ఫర్డ్ రాజ్యాంగ బిల్లులో చేర్చాలని డిమాండ్ చేసింది. ఈ ప్రకటన వాక్ స్వాతంత్య్రం, సభా స్వాతంత్య్రం, సమావేశ స్వాతంత్య్రం, సంచార స్వాతంత్య్రం, సంఘస్థాపన స్వాతంత్య్రం, శాంతియుతంగా నిరసన తెలియజేసే స్వాతంత్య్రం వంటి ప్రాథమిక హక్కులను కోరింది. వీటన్నింటికన్నా ముఖ్యమైనది జాతివిచక్షణ రద్దు అని ఆ పత్రంలో పొందుపరిచారు. కానీ, తమ దేశ పౌరులకు వున్న ఈ స్వేచ్ఛలను వలస భారత ప్రజలకు ఇచ్చేందుకు బ్రిటీష్ పార్లమెంటు నిరాకరించింది.
1919 అమృత్‌సర్ కాంగ్రెస్ మహాసభలో మోతీలాల్ నెహ్రూ మాట్లాడుతూ, బొంబాయి మహాసభ ఆమోదించిన హక్కుల ప్రకటనను సమర్థిస్తూ చెప్పిన మాటలకు నేటికీ ఎంతో ప్రాధాన్యం వుంది. పంజాబ్‌లో ఇటీవల మన ప్రాథమిక హక్కులు అత్యంత పాశవికంగా ఉల్లంఘించబడ్డాయి. అలాంటి ఉల్లంఘనలకు అవకాశం ఇవ్వని ఏ రాజ్యాంగం కూడా మన అవసరాలను తీర్చలేదు. ఇలాసాగిన కృషి సంఘటిత రూపం దాల్చేందుకు చాలా కాలమే పట్టింది. 1936, అగస్టు 24న ఏర్పడిన ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ భారత ఉపఖండంలో మొదటి పౌరహక్కుల సంఘం. దీని మహాసభ బొంబాయిలో అదే రోజున జరిగింది.
ఈ సంఘం ఏర్పాటు కోసం జవహర్‌లాల్ నెహ్రూ 150 మందికి ఉత్తరాలు రాయగా ఇద్దరు మినహా అందరూ సానుకూలంగా స్పందించారని చరిత్ర చెబుతోంది. ఈ సంఘం ఏర్పాటుకు దాదాపు మూడు దశాబ్దాల ముందుకాలం నుంచీ భారతదేశ విముక్తి కోసం పోరాటాలు నిర్వహించిన గదర్ వీరులు, చిట్టగాంగ్ వీరులు, అనుశీలన సమితి, తిలక్ లాంటి కాంగ్రెస్ నాయకులు, అనేక మంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు, పెజెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ నాయకులు తదితరులపై బ్రిటీష్ వలస ప్రభుత్వం అనేక అక్రమ కేసులు బనాయించింది. 20 మంది గదర్ వీరులను ఉరితీసింది. భగత్‌సింగ్, రాజగురు, సుఖదేవ్‌లను ఉరితీసింది. ఒక్క మీరట్ కుట్రకేసులోనూ, అంతకుముందు తిలక్‌పై పెట్టిన కుట్రకేసులను మినహాయించి మరే కుట్రకేసుకూ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కానీ, నాయకులు కానీ ప్రకటన చేసిన దాఖలాలు లేవు.
అయినప్పటికీ 1936, ఆగస్టు 24న బొంబాయిలో జరిగిన సంఘం వ్యవస్థాపక మహాసభల్లో నెహ్రూ చెప్పిన కింది విషయం నేటికీ గమనంలో వుంచుకోవలసిన విషయమే. 'పౌరస్వేచ్ఛల అణచివేతకు వ్యతిరేకంగా సాగేపోరాటం భారత స్వాతంత్య్రోద్యమంలో భాగంగా పరిగణిస్తాను. ఒక ప్రయోజనం కోసం భిన్న రాజకీయ దృక్ప«థాలు కలిగివున్న వారంతా ఒక వేదికపై చేరి సాధ్యమైన ప్రతిచోటా కలిసి చేయడం అవసరం. భారతీయుల స్వేచ్ఛ కోసం కాంగ్రెస్ పోరాడుతోంది.
కాంగ్రెసు విధానాలతో ఏకీభవించని అనేకమంది కూడా పౌర స్వేచ్ఛల అణచివేతకు వ్యతిరేకంగా బలమైన దృష్టిని కలిగివున్నారు. అలాంటి వారంతా ఆ సమస్యపై సమష్టిగా పనిచేయాలి... ఒక వ్యక్తికి రాజకీయాల పట్ల ఆసక్తి లేకపోవచ్చు. కానీ, బానిస దేశంలో బతికే ఏ మనిషి అయినా తనను తాను రాజకీయేతర వ్యక్తిగా ఎలా భావిస్తాడో నాకు అర్థంకావడం లేదు... పౌర సహాయ నిరాకరణ ఉద్యమం ప్రాంరంభమైందనుకోండి. ఆ ఉద్యమంలో పాల్గొన్నవారు జైళ్లలో బంధించబడతారు. అప్పుడు పౌర స్వేచ్ఛల అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేయడం బయటవున్నవారి బాధ్యత అవుతుంది... ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హక్కును కాపాడడమే పౌర స్వేచ్ఛ అనేదాని భావన.
అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్, గ్రేట్ బ్రిటన్ జాతీయ సివిల్ లిబర్టీస్ యూనియన్ నమూనాలను ఆధారం చేసుకుని ఐసీఎల్‌యూ ప్రణాళిక, నిబంధనావళి రచించారు' అని నెహ్రూ ఆ సందర్భంగా చెప్పారు. రామ్‌మనోహర్ లోహియా స్ట్రగుల్ ఫర్ సివిల్ లబర్టీస్ అనే పుస్తకాన్ని నెహ్రూ రాసిన ముందుమాటతో ఆ సందర్భంగా ప్రచురించారు. ఆ పుస్తకంలో ఇండియాలో పౌర హక్కుల దృక్పథం వ్యాసంలో లోహియా వ్యక్తిగత ఆస్తి పౌర స్వేచ్ఛలకు మూలం అన్నారు. అందరికీ తగినంత వ్యక్తిగత ఆస్తి వుండే సమాజాన్ని ఒకదానిని ఊహించి సోషలిస్టు లోహియా ఈ మాటచెప్పి వుంటారని నాకు అనిపిస్తోంది.
ఐసీఎల్‌యూకి గౌరవాధ్యక్షులుగా రవీంద్రనాథ్ ఠాగూర్, క్రియాశీలక అధ్యక్షురాలిగా విజయలక్ష్మీ పండిట్, ప్రధాన కార్యదర్శిగా కేబీ మీనన్ ఎన్నుకోబడ్డారు. ఈ మొత్తం క్రమం రాజకీయ రంగంలో పెద్ద చైతన్యాన్ని తెచ్చింది. అందువల్లనే 1937లో దేశంలోని కొన్ని ప్రావిన్సిస్‌లో కాంగ్రెస్ పార్టీ పరిమిత అధికారాల ప్రభుత్వాలను ఏర్పరిచినపుడు, పౌర స్వేచ్ఛలను గుర్తించాలంటూ మంత్రిత్వ శాఖలకు ఒక సర్క్యులర్ పంపింది. ఆ ప్రభుత్వాలు పౌర స్వేచ్ఛలను ఏ మేర పాటిస్తున్నాయనే విషయాన్ని పరిశీలించి ప్రతి సంవత్సరమూ నివేదిక తయారు చేయాలని కూడా ఆ సర్క్యులర్‌లో పేర్కొంది. కానీ, ఆ సర్క్యులర్ ఒట్టి కాగితంగానే మిగిలిపోయిందని కొద్ది రోజులలోనే స్పష్టమైంది.
మద్రాసు జైలులోని కొంతమంది రాజకీయ ఖైదీలు తమను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని, పత్రికలు, రాత కాగితాలు, కలం లాంటి సౌకర్యాలను కల్పించాలని, సరైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించలేదు. నిరాహారదీక్ష, ఆందోళన ప్రారంభించారు. దానిపై కాంగ్రెస్‌కు చెందిన దర్శి చెంచయ్య తదితరులు మద్రాసు ప్రభుత్వ కాంగ్రెస్ హోం మంత్రి వద్దకు వెళ్లి ఖైదీల న్యాయమైన కోర్కెలను తీర్చాల్సిందిగా అడిగారు. ప్రభుత్వం వద్ద అందుకు అవసరమైన పైకం లేదని మంత్రి సమాధానం ఇవ్వగా... వారి స్వంత ఖర్చులపై ఆ సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడానికైనా అనుమతి మంజూరు చేయాలని కోరారు.
దానికి సమాధానంగా హోం మంత్రి ఆ ఖైదీలు మన పార్టీకి చెందినవారు కాదు కదా. ఈ విషయం ఇంతటితో వదిలివేయండి అని బృందంతో కరాఖండిగా చెప్పారు. (నేను-నా దేశం: దర్శి చెంచయ్య). ఖైదీలు ఆందోళన ఉధృతం చేశారు. ఖైదీలపై అమానుషంగా లాఠీచార్జి చేశారు. దీనిపై నిజ నిర్ధారణ కమిటీని వేయటానికి ఐసీఎల్‌యూ మద్రాసు శాఖకు సంఘం కేంద్ర నాయకత్వం అనుమతి నిరాకరించింది. ఈ సంఘటన దేశ స్వాతంత్య్రం నాటి నుంచి ఈ నాటి వరకూ ఉద్యమకారుల ఎడల కాంగ్రెస్ పాలకులు, తదుపరి ఇతర పార్టీల పాలకులు తీసుకునే పౌర హక్కుల ఉల్లంఘనకు నాందిగా మనం భావించవచ్చు.
- సి.భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి, ఓపీడీఆర్

75 ఏళ్ళ పౌరహక్కుల ఉద్యమం - 2 స్వాతంత్య్రానంతరం.. - సి.భాస్కరరావు Andhra Jyothi 26/08/2011


75 ఏళ్ళ పౌరహక్కుల ఉద్యమం - 2
స్వాతంత్య్రానంతరం..
- సి.భాస్కరరావు
దీనిని రెండు దశలుగా విభజించవచ్చు. 1947-66 తొలిదశ కాగా ఆ తరువాత కాలమంతా రెండో దశ. తమ మౌలిక ప్రయోజనాలకు తమ ప్రాపకంలో పెంపొందిన ఫ్యూడల్ భూస్వాముల, పెట్టుబడుదారుల ప్రయోజనాలకు గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ వల్ల పెద్ద ప్రమాదమేమీ వాటిల్లదనే నిర్ణయానికి బ్రిటీష్ పాలకులు వచ్చారు. ప్రజల తిరుగుబాట్లు పూర్తి విప్లవ స్థాయికి చేరకముందే అధికార పగ్గాలను కాంగ్రెస్ పార్టీకి అప్పగించి తెరవెనక్కి తప్పుకోదలిచారు. ఆ విధంగా బ్రిటీష్ పార్లమెంటు చేసిన అధికార బదలాయింపు చట్టం ద్వారా 1947 ఆగస్టు 15న భారతదేశం ఇండియా, పాకిస్థాన్ అనే రెండు దేశాలుగా విభజితమై స్వాతంత్య్రం పొందాయి.
ఫ్యూడలిజం, సామ్రాజ్యవాదం రద్దు ద్వారా భారతదేశ విముక్తి పోరాటాన్ని నడుపుతున్న సీపీఐ స్వతంత్ర భారత పాలకులకు పెద్ద శత్రువుగా కనపడింది. తెలంగాణ, కేరళలోని పునప్రా-వాయిలర్, మహారాష్ట్రలోని వర్లి, పశ్చిమ బెంగాల్ తెభాగా రైతాంగ ఉద్యమాలపై వలస ప్రభుత్వ తరహాలోనే స్వత్రంత్య రాజ్యం పాశవిక దమనకాండ సాగించింది. వలస పాలకుల రూల్ ఆఫ్ లా కూడా ఆ సందర్భంలో నిరంతరం ఉల్లంఘనకు గురైంది. ఈ నేపథ్యంలో తిరిగి పౌరహక్కుల ఉద్యమం పునరుజ్జీవం పొందింది. 1947లోనే పాత ఐసీఎల్‌యూ మద్రాసు శాఖ పునరుద్ధరించబడింది. 1949 జూలైలో దాని మహాసభ కూడా జరిగింది. బొంబాయి శాఖ మహాసభ 1949 జనవరిలో జరిగింది.
కలకత్తా కేంద్రంగా 1948 బెంగాల్‌లో ఒక కొత్త సివిల్ లిబర్టీస్ కమిటీ ఏర్పడింది. అలాగే హైదరాబాద్‌లో 1948లోనే ఒక లీగల్ డిఫెన్స్ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ కన్వీనర్ మహేంద్రనాథ్ సక్సేనా (ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు రాజ బహదూర్ గౌడ్ మేనల్లుడు). ఈ కమిటీలో గుంటూరు జిల్లాకు చెందిన నర్సయ్య, హైదరాబాద్ నివాసి లతీఫ్ తదితర లాయర్లు కూడా ఉన్నారు. ఈ కమిటీలన్నీ ఉద్యమ అణచివేతకు వ్యతిరేకంగా కోర్టుల్లోనూ, బెంగాల్‌లో అయితే ప్రజల్లోనూ ఉద్యమించారు. బెంగాల్ కమిటీ ముగ్గురు కార్యదర్శులు కమల్ బోస్, జె.భట్టాచార్య, ప్రమోద్‌సేన్ గుప్తాలను వెనువెంటనే అరెస్టు చేసింది.
కమిటీ అధ్యక్షుడుగా ఆచార్య కేపీ ఛటోపాధ్యాయ అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్ఛపై కలకత్తా పోలీసులు కమిషనర్ అనేక పరిమితులు విధించారు. వీటిని తట్టుకుంటూ పౌరహక్కుల ఉద్యమం 1950-51 వరకు నడిచింది. 1951లో కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులు జైలు నుంచి విడుదలై 1952లో జరిగిన మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ పాల్గొన్న తర్వాత ఆ పార్టీ హక్కుల ఉద్యమ ఆవశ్యకత తీరిందని భావించడంతో పౌర స్వేచ్ఛల దీపం మరోసారి కొండెక్కింది. ఒకే రాజకీయ పార్టీ నాయకత్వంలో హక్కుల ఉద్యమం సజావుగా సాగదని రెండోసారి స్పష్టమైంది.
1960 నాటికి కమ్యూనిస్టు పార్టీలో కార్మిక వర్గ అంతర్జాతీయ కర్తవ్యాల గురించి తీవ్ర అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. చైనా కమ్యూనిస్టు పార్టీకి, రష్యా కమ్యూనిస్టు పార్టీకి మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమం నిలువునా చీలిపొయింది. భారత కమ్యూనిస్టు పార్టీలో 1964లో జరిగిన చీలిక దీని ఫలితమే. 1962లో జరిగిన ఇండియా-చైనా యుద్ధం నేటికి పార్టీ లోపలి ఓ విభాగంలో భారత ప్రభుత్వందే తప్పుగా భావించిన పెద్ద సెక్షనే ఉంది. వారిలో కొంతమందిని ఇండియా ప్రభుత్వం డీఐఆర్ కింద అరెస్టు చేసింది. ఆహార సమస్య లాంటి ప్రజా సమస్యలపై ఆందోళన చేసిన సోషలిస్టు నాయకులను, రిపబ్లిక్ పార్టీ వారిని కూడా అరెస్టు చేసింది.
1964-65 ఇండియా-పాకిస్తాన్ యుద్ధం వచ్చింది. ఆనాటికి సీపీఐ(ఎం) పార్టీ ఏర్పడింది. ఆ పార్టీని చైనా పంచమాంగ దళం అని ముద్రవేసి 1000 మంది కార్యకర్తలను, నాయకులను 1964 డిసెంబర్‌లో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం జైళ్లలో బంధించింది. ఆ సందర్భంగా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అన్ని నిరసన చట్టాలను రద్దు చేయాలని మరొకసారి పౌర హక్కుల సంఘం ఉద్యమించింది.
బొంబాయి, కలకత్తా, మహానగరాల్లోను, విజయవాడలోను వేలాది మందితో ప్రదర్శనలు, సభలు జరిగాయి. 1948లో కలకత్తాలో ఏర్పడిన సివిల్ లిబర్టీస్ కమిటీకి లీగల్ విషయాల్లో అపార సహాయాన్ని అందించిన ఎన్.ఛటర్జీ ఈ ఉద్యమ అగ్రభాగాన నిలిచారు. ప్రజాస్వామ్యం, ప్రజాతంత్ర వ్యవస్థలపై ప్రభుత్వ దాడి, అరెస్టులను ఖండిస్తూ మహాసభలు తీర్మానించాయి. విచారణ లేకుండా నిర్బంధంలో వున్న వారినందరినీ విడుదల చేయాలని, విచారణ లేకుండా అరెస్టు చేయడానికి వీలు కల్పించే చట్టాలు, నిబంధనలు రద్దు చేయాలని ఈ సభలు డిమాండ్ చేశాయి.
విజయవాడ సభలో శ్రీశ్రీ అధ్యక్షతన ఉపన్యాసం ఇచ్చారు. ఈ సందర్భంగానే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం (ఏపీసీఎల్ఎ) ఏర్పడింది. దీనికి శ్రీశ్రీ అధ్యక్షుడు, కె.గోపాలరావు, ప్రధాన కార్యదర్శి, విజయవాడ ప్రముఖ లాయరు కేవీఎస్ఎన్ ప్రసాద్, ఉపాధ్యక్షుల్లో ఒకరు. ప్రపంచ వ్యాపితంగా ఈ అరెస్టులకు వ్యతిరేకంగా నిరసన వెల్లువెత్తింది. చివరకు 1965 చివరల్లోను, 1966 ప్రారంభంలోను జైళ్లలో డీఐఆర్ కింద వుంచబడ్డ వారినందరినీ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత డీఐఆర్ లాంటి నిరంకుశ చట్టాల రద్దు కోసం ఎలాంటి ఉద్యమం సాగకపోవడం గమనార్హం.
అసలు అప్పటివరకు ఏర్పడిన హక్కుల సంఘాలేవీ సాధారణ ప్రజలపైనా, అసంఘటిత ప్రజల ఆందోళనలపై సాగుతున్న రోజువారీ దాడుల గురించి, సాధారణ ఖైదీల అమానుష పరిస్థితులను గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. 1970 తర్వాత హక్కుల ఉద్యమం. ఇది సమకాలీన హక్కుల ఉద్యమం. దీనిలో రెండు ప్రధాన స్రవంతులు ఉన్నాయని అనిపిస్తుంది. 1. రాజ్యాంగం ఆధారంగా - ముఖ్యంగా రాజ్యాంగంలోని ప్రవేశిక (ప్రియాంబుల్), ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలను భూమికగా చేసుకుని కృషి సాగిస్తున్న సంస్థలు.
2. రాజ్యాంగంతో నిమిత్తం లేకుండా ప్రస్తుత రాజకీయ, ఆర్థిక వ్యవస్థ మౌలికంగా ప్రజా వ్యతిరేకమైందనే భూమికతో 'హక్కుల ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్న సంస్థలు. నక్సల్‌బరి, శ్రీకాకుళం రైతాంగ ఉద్యమాలు(1967-69)పై ప్రభుత్వాల క్రూర నిర్బంధ నేపథ్యంలోను, ఈశాన్య భారతంలోని జాతీయ ఉద్యమాలు, కాశ్మీరు స్వయం నిర్ణయాధికారం నేపథ్యంలోను ఏర్పడిన సంఘాలు- పశ్చిమ బెంగాల్‌లోని ఏపీడీఆర్, ఆంధ్రప్రదేశ్‌లోని ఓపీడీఆర్, ఏపీసీఎల్‌సీ, పంజాబ్‌లో ఏఎఫ్‌డీఆర్, మహారాష్ట్రలోని ఎల్‌హెచ్ఎస్, అస్సాంలోని ఎంఏఎస్ఎస్, మణిపూర్‌లోని ఎంహెచ్ఆర్ఓ లాంటి వాటిని రెండవ తరహాకు చెందిన సంస్థలు అని చెప్పవచ్చు. పీయూసీఎల్ (ఇది అఖిల భారత సంస్థ), పీయూడీఆర్ ఢిల్లీ, సీపీడీఆర్ బొంబాయి సంస్థలు మొదట తరహా సంస్థలుగా చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లోని మానవ హక్కుల వేదిక ఈ రెండు స్రవంతుల అనుభవాలను మేళవించుకుని ఏర్పడిన సంస్థా? వేచి చూడాలి. ఈ సంస్థలన్నీ 30 లేదా 40 సంవత్సరాల క్రితమే ఏర్పడి ఒక వైపు ప్రభుత్వాల దాడులను, మరొక వైపు సంక్షిప్త సామాజిక పరిస్థితుల ఒత్తిడులను మదుపు చేసుకుంటూ, కార్యక్రమాల్లో సమన్వయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ కార్యక్షేత్ర విస్తృతిని వ్యవస్థీకృత హింసను, అంటే స్త్రీలపై పురుష అహంకారపు దాడులు, మత మైనారిటీలపై సంఘ్ పరివార్ మతోన్మాద దాడులు, అభివృద్ధి పేరుతో ప్రజల సంప్రదాయక జీవన విధానంలోనే వుండిపోయిన ప్రజల జీవితాలపై జరుగుతున్న దాడులు, హిందూ సమాజంలోని నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ దళితులపై చేస్తున్న దాడులు, వీటన్నింటినీ ప్రశ్నించే, నిరసించే స్థాయికి ఎదిగాయి.
అదే సమయంలో ప్రత్యామ్నాయ రాజకీయ ఆర్థిక వ్యవస్థ కోసం నూతన ప్రజాస్వామిక వ్యవస్థ కోసం పోరాటాలు చేస్తున్న వారిని బూటకపు ఎన్‌కౌంటర్లతో చంపడానికి వ్యతిరేకంగా తమ గొంతులను సంఘాలన్నీ బలంగానే వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అలాగే అన్ని నిరంకుశ చట్టాలను రద్దు చేయాలి. ఉరి శిక్షలను పూర్తిగా రద్దు చేయాలి. అన్ని అంశాలపై దాదాపు అన్ని సంఘాలూ ఒకే అభిప్రాయంలో ఉన్నాయి. ఖైదీల పరిస్థితులను మానవీయం చేయాలన్న విషయంలో కూడా ఏకాభిప్రాయముంది. అయితే కొన్ని ముఖ్యమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.
రాజ్యహింసతోపాటు, ప్రత్యామ్నాయ వ్యవస్థల కోసం పోరాటాలు సాగిస్తున్న సంస్థలు కొన్ని సామూహిక హత్యాకాండలను సాగిస్తున్నాయి. మరికొన్ని ఉద్యమ సంస్థలు చిన్న రాజకీయ కార్యాచరణ గలవారిపైన, సామాన్య పౌరులపైన ముద్రలు వేసి హత్యచేయడంతో సహా వివిధ రకాల భౌతిక దాడులు చేస్తున్నాయి. వీటిని ఖండించాలా లేదా అనే విషయం ఓ రాజకీయ లక్ష్యాలతో పనిచేసినందు వల్ల అరెస్టు చేయబడిన వారిని ప్రత్యేక తరహా ఖైదీలుగా గుర్తించి, వారి విడుదలకై డిమాండ్ చేయాలి.
ఒకే రకం అభిప్రాయం గల సంఘాలన్నీ ఒకే అఖిల భారత నిర్మాణ్ కిందకు రావాలని గతంలో జరిగిన ఒక ప్రయోగం అఖిల భారత ప్రజాస్వామ్య హక్కుల సంఘం సమాఖ్య (ఏఐఎఫ్ఓఎఫ్‌డీఆర్) ఇందులో ఓపీడీఆర్, ఎల్‌హెచ్ఎస్ (మహారాష్ట్ర ఏఎఫ్‌డీఆర్(పంజాబ్), జేఎఎస్ఎస్(కేరళ) సభ్య సంఘాలు, ఆపరేషన్ బొంబాయి కేంద్రంగా పది సంవత్సరాలు విశిష్టమైన కృషి చేసి, బాహ్య కారణాలకు తలొగ్గి క్రమంగా బలహీనపడి 1999 తరువాత పూర్తిగా ఉనికిని కోల్పోయింది. అయినప్పటికీ సమాఖ్య పనిని నిర్దేశించే డిక్లరేషన్ ఓపీడీఆర్ నూతన ప్రణాళిక రూపంలో సజీవంగానే ఉంది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో హక్కుల సంఘాల వేదికలు రెండు వున్నాయి.
1. 1980లో ఏర్పడిన పీయూసీఎల్ 2. 2004లో ఏర్పడిన 22 హక్కుల సంఘాల సమన్వయ వేదిక, సీడీఆర్ఓ. సీడీఆర్ఓ ఒక కనీస సామాన్య కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకునే ప్రయత్నంలో వుంది. మొత్తం మీద భారతదేశంలో స్వాతంత్య్రానంతరం పౌర, ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమ గమనం పరిశీలిస్తే పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాల్లోని పౌర హక్కుల సంఘాలకున్న లక్షల సభ్యత్వ పునాది గానీ, అందువల్ల ప్రభుత్వ పౌర హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా గణనీయ బలమైన ఉద్యమాన్ని నిర్మించగల్గిన శక్తిని సంపాదించుకోవాల్సి ఉండడం ఒక విచిత్ర పరిస్థితిగా కనిపించవచ్చు.
అయితే కొంచెం లోతుగా పరిశీలిస్తే ఫ్యూడలిజం పూర్తిగా రద్దయిన దేశాల్లో మాత్రమే పౌర హక్కుల ఉద్యమం మధ్యతరగతిలో విస్తృత పునాదిని వేసుకోలేదన్న వాస్తవం గమనంలోకి తెచ్చుకుంటే ఇండియాలోని పౌర, ప్రజాస్వామ్య హక్కులు కార్యకర్తలు ఎలాంటి నిరుత్సాహానికీ లోనుకావాల్సిన అవసరం లేదు. ముగింపులో ఒక ముఖ్యమైన మాట. నూతన ప్రజాస్వామ రాజ్యం, సోషలిస్టు రాజ్యం, పౌర హక్కుల సంఘాల అవసరముందా, లేదా? అనేది హక్కుల సంఘాలన్నీ సమష్టిగా ఆలోచించాల్సిన విషయం. ప్రస్తుతానికి ఈ ప్రశ్నను వాయిదా వేసి ఇప్పుడు మన వ్యవస్థలో పౌర ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనపై దృష్టి కేంద్రీకరించి ఉద్యమాన్ని నిర్మించడానికి పీయూసీఎల్, సీడీఆర్ఓలు సిద్ధపడడం మంచి పరిణామం.
- సి.భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి, ఓపీడీఆర్
(ఈ వ్యాసం మొదటి భాగం ఈ నెల 24 వ తేదీన ప్రచురితమయింది)