Showing posts with label కొంగర మహేష్. Show all posts
Showing posts with label కొంగర మహేష్. Show all posts

Tuesday, May 27, 2014

మళ్ళీ పాత చరిత్రే! - కొంగర మహేష్, రుద్రవరం లింగస్వామి, మనిగిల్ల పురుషోత్తం


Published at: 27-05-2014 00:39 AM
మనమిప్పుడు ఆధునిక ప్రపంచంలో అవసరానికో అబద్ధం... పూటకో మాట నడుస్తోన్న ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం. అవసరానికి హామీలెన్నైనా ఇవ్వొచ్చు. అదే అవసరానికి నాలుకను ఎటైనా తిప్పే రాజకీయాల్లో కాలం గడుపుతున్నాం. ఈ రాజకీయ చదరంగంలో విజేతలు పాలకులు. పావులు బలహీనులు. టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బడితె ఎవరి చేతిలో ఉంటుందో బర్రె కూడా వాడిదే అనే సామెతను అక్షరాలా మరోసారి నిరూపిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి పార్లమెంటు తెలంగాణ బిల్లు ఆమోదించబోతుందనేంత వరకు తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి దళితుడే అని ఖరాఖండిగా చెప్పారు. ఈమాట చెబుతూనే కేసీఆర్ మాటంటే మాటే తలతెగినా మాట తప్పేది లేదన్నారు. ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించినా... పార్టీ అంతరంగిక మీటింగుల్లోనూ ఊదరగొట్టారు. దీనికితోడు ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవిని కూడా బోనస్‌గా ప్రకటించారు. దీనికి టీఆర్ఎస్ నాయకగణం వంతపాడారు. పదమూడేళ్లుగా పార్టీ పైస్థాయి నుంచి కార్యకర్త అన్న తేడా లేకుండా 'దళిత సీఎం' హామీని పాటైపాడారు. తాను (కేసీఆర్) తెలంగాణ రాష్ట్రంలో కాపలా కుక్క (వాచ్ డాగ్)గా కొనసాగుతూ స్టేట్ అడ్వయిజరీ కౌన్సిల్ చైర్మన్‌గా ఉంటానని చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఇవన్నీ జాతీయ, ప్రాంతీయ మీడియాలో పతాకస్థాయిలో ప్రచారం కూడా జరిగాయి.
కేసీఆర్ పలికిన దళిత సీఎం పలుకులు ఇప్పటికీ 'యూట్యూబ్', ఫేస్‌బుక్కుల్లో దర్శనమిస్తూనే ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు 'సీడబ్ల్యూసీ' జై అన్న తర్వాత ఆగస్టు 4, 2013న జరిగిన 'మీట్ ది ప్రెస్'లో కూడా దళిత సీఎం పదవికి కట్టుబడి ఉన్నానని కేసీఆర్ పునరుద్ఘాటించారు. కానీ ఉభయసభల్లో తెలంగాణ బిల్లుకు మోక్షం లభించిందో లేదో 'దళిత సీఎం' హామీని అమాంతంగా మింగేశారు. దశాబ్దకాలం నుంచి ఉపన్యాసాలు దంచిన అధినాయకత్వం, పార్టీ అనుచరగణం అంతా కేసీఆర్ వంతపాడినట్లుగానే ఒక్కసారిగా గప్‌చుప్ అయిపోయింది. 'ఇచ్చిన మాటకోసం తల నరుక్కుంటా'నన్న కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడేందుకు ముఖం చాటేశారు. తనకు తెలంగాణ ప్రజలే హైకమాండ్ అని చెప్పుకునే కేసీఆర్... పార్టీకి ఆయనే హైకమాండ్. దీంతో 'సీఎం హామీ'పై ప్రశ్నించడం కాదు కదా... కేసీఆర్ ఉన్నత పదవిలో కూర్చుంటేనే రాష్ట్రం త్వరితగతిన అభివృద్ధి జరుగుతుందంటూ, పోలింగు ముగిసి కేసీఆర్‌ను శాసనసభా నేతగా ఎన్నుకునేంత వరకు టీఆర్ఎస్‌లోని దళిత, బీసీ నాయకులతో ప్రకటనలు గుప్పించే పనిలో బిజీ అయిపోయిన పరిస్థితి.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీల;పై అనేక రకాలుగా వివక్ష చూపారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు దక్కించుకున్న టీఆర్ఎస్... బీసీ ఎమ్మెల్యేలుగా పార్టీ నుంచి గెలిచినప్పటికీ బీసీ సంక్షేమ శాఖను బ్రాహ్మణుడైన కెప్టెన్ లక్ష్మీకాంతారావుకు ఇవ్వడం... అప్పటికీ అసెంబ్లీలో సభ్యుడు కూడా కానీ తన అల్లుడు హరీష్‌రావును ఏకంగా మంత్రిని కూడా చేయడం పార్టీలోని అగ్రకుల ధోరణికి అద్దం పడుతోంది. తెలంగాణ జనాభాపరంగా సింహభాగంగా ఉన్న ముస్లింలనూ రాజకీయంగా ఎదగనీయలేదు. పార్టీ పదవుల పంపకాల్లోనూ ఈ వర్గాన్ని పూర్తిగా పక్కనబెట్టేశారు.
పద్నాలుగేళ్లపాటు తన ప్రాబల్యాన్ని అతిజాగ్రత్తగా నిర్మించుకున్నారు కదా! అంతా వీజీగా తెలంగాణపై పెత్తనాన్ని వదులుకుంటారా? సెంటిమెంటు ఫలితాలను తనకనుగుణంగా మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకపోవడం... పలు సర్వేల ద్వారా టీఆర్ఎస్‌కు 'ఫీల్ఢ్' అనుకూలంగా ఉండటం... ఇంతలో ఎన్నికలు, ఫలితాలు రావడం... టీఆర్ఎస్సే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితుల్లో ఉండటంతో కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పీఠం మీద మరింత మోజు పెరిగింది. ఏ వర్గానికి సీఎం పదవి ఇస్తానని హామీ ఇచ్చారో ఆ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల చేతే ప్రతిపాదింపజేసుకొని తన 'ఆకాంక్ష'ను తీర్చుకున్నారు. ఇప్పుడున్న స్థితిలో కేసీఆర్ మాట తప్పారని కనీసం నొసలు కూడా చిట్లించలేని పరిస్థితి ఆ పార్టీ దళిత ప్రజాప్రతినిధులది.
గత పాలకుల కంటే భిన్నంగా తెలంగాణలో పేదలు, అణగారిన వర్గాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతారని, ఆత్మగౌరవం కోసమే ఈ ఉద్యమం అన్న కేసీఆర్... దళితులను అగౌరవపరిచి ఆ వర్గానికి (ఎస్సీ, ఎస్టీ, బీసీలు) తొలి తెలంగాణలోనే రాంగ్ సిగ్నల్స్ పంపారు. ఇంత జరుగుతున్నా 'అవసరాల' కోసం టీఆర్ఎస్‌లో పనిచేసే బహుజనులు సైలెంటైపోయారు... అటు టీఆర్ఎస్ యేతర సమాజం కూడా మిన్నకుండటం ఆశ్చర్యకరం. 2009లో కేసీఆర్ దీక్ష విరమించినప్పుడు గర్జించిన విద్యార్థిలోకం, మేధోప్రపంచం మాట తప్పిన కేసీఆర్‌ను ఇప్పుడు ఎందుకు నిలదీయడం లేదు? పరిపాలన సౌలభ్యం, పీడిత జాతుల రాజ్యాధికారం చిన్న రాష్ట్రాలతోనే సాధ్యమని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం ముందు వరుసలో ఉన్న వారెవ్వరూ మాట్లాడకపోవడంలో ఆంతర్యమేమిటి?
మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో దళితుల్లో అత్యంత వెనుకబడిన కులానికి చెందిన జీతన్ రాం మంఝీని ఆ పదవిలో కూర్చొబెట్టారు. రాజకీయ ఎత్తుగడలో భాగమా? కాదా? అన్న విషయాన్ని పక్కనబెడితే దళితుణ్ణి ఉన్నత పదవిలో కూర్చొబెట్టి గౌరవించారు. ఫలితాల ప్రకటన వరకు దళితులకు సీఎం పదవి ఇస్తామని జేడీ(యూ) ఏనాడూ చెప్పలేదు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ తన తల నూరుముక్కలైనా దళితుడే సీఎం అన్నారు. అధికార వాంఛ కోసం తన పార్టీలోని దళితులను కూడా తలదించుకునేలా చేశారు. పైగా వారితోనే కాబోయే సీఎం కేసీఆర్ అంటూ ప్రతిపాదన చేయించుకోవడం కేసీఆర్ మార్కు పాలనకు నిదర్శనం. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేని కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ఉన్నది ఉన్నట్లుగా అమలు చేస్తానంటూ చెబితే ఎలా నమ్మాలి?
అయితే కొన్ని 'బద్నామ్'ల నుంచి బయటపడేందుకు మాత్రం పార్టీలోని దళితులు, బలహీన వర్గాలు, ముస్లిం, గిరిజనులను బుజ్జగించేందుకు తగిన ఏర్పాట్లు చేయవచ్చు. మరికొన్ని హామీలు నెరవేర్చవచ్చు. కానీ వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఏమాత్రం పాటుపడరు. అందుకే అగ్రకులానికి అధికార అహంకారాన్ని అలంకారంగా చేసుకొని రాజ్యమేలబోతున్న కేసీఆర్ అండ్ కో పట్ల అణగారిన సమాజమంతా అప్రమత్తంగా ఉండాలి. కలిసికట్టుగా వారి పాలనకు చరమగీతం పాడి సామాజిక తెలంగాణ సాధనకు నడుం బిగించాలి. అప్పుడే నవ తెలంగాణ సాధ్యం. లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి భౌగోళికంగా, ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తెలంగాణలో సామాజిక న్యాయం, రాజ్యాధికారం అణగారిన వర్గాల చేతికి రాదు. పెద్దగా మార్పేమీ ఉండదు.
- కొంగర మహేష్, రుద్రవరం లింగస్వామి, మనిగిల్ల పురుషోత్తం
ఓయూ రీసెర్చ్ స్కాలర్లు

Andhra Jyothi Telugu News Paper Dated: 27/05/2014 

Saturday, May 3, 2014

'నోటా' కూడా అణచివేత సాధనమే! - By కొంగర మహేష్ , రీసెర్చ్ స్కాలర్, ఓయూ

Published at: 04-05-2014 02:52 AM
భారత ఎన్నికల చరిత్రలో 'నోటా' (నన్ ఆఫ్ ది ఎబౌ) అవకాశం ప్రజాస్వామ్య పరిపుష్టికి అవసరమయ్యే మరో ఆయుధం. ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోయినా మీటనొక్కి దిమ్మతిరిగే తీర్పు నిచ్చే అరుదైన అవకాశం ఓటరుకు దక్కడమే ఈ 'నోటా' (నిలబడ్డవాళ్లెవరూ నాయకుడిగా పనికిరారన్నది) అసలు ఉద్దేశం. ఓటు అనే ఖడ్గానికి మరింత పదునుపెట్టి ఈ 'నోటా' మీట అసలు లక్ష్యం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణే. తమకు సుపరిపాలన అందించే సమర్థ నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటుకో బలమైన విలువ చేకూర్చడం దీని కర్తవ్యం. 'నోటా'ను గత ఏడాది సెప్టెంబర్ 17 తదుపరి ఎన్నికల నుంచి అమలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ నోటా సదుపాయాన్ని భారత్‌తో సహా మరో 11 దేశాలు తమ ఎన్నికల్లో వినియోగించుకుంటున్నాయి. అక్రమ సంపాదన, అవినీతి సొమ్ము, నల్లధనం.. ఇలా పేరేదైనా ప్రజాస్వామ్యాన్ని 'ధన'స్వామ్యంగా మార్చి చట్టాలను చుట్టాలుగా వినియోగించుకునే ఖద్దరు నేతలకు నోటా ఓ ఖబడ్దార్ వంటిది.
అంతటి బృహత్తర ఆశయంతో రూపుదిద్దుకున్న నోటా మీట నుంచి ఎస్సీ, ఎస్టీల అభ్యర్థులకు ఆదిలోనే గుదిబండగా మారుతోంది. అదీ కూడా కుల 'తంత్రం'తో ముడిపడి ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధుల ఎన్నికకు ప్రతిబంధకంగా మారడం ఆందోళనకరం. గత ఏడాది డిసెంబర్‌లో ఢిల్లీ, మిజోరాం, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా నోటా మీటను వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఓటర్లకు అవకాశం కల్పించింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటర్లు'నోటా' హక్కును ఎలా వినియోగించుకున్నారు? ఏయే సెగ్మెంట్లలో నిలబడిన అభ్యర్థుల పట్ల తమ అసంతృప్తిని వెలబుచ్చారన్న అంశాలపై జాతీయ మీడియా సంస్థ ఒకటి జరిపిన పరిశోధనలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పై రాష్ట్రాల్లో మొత్తం 630 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 400 జనరల్ స్థానాలుండగా మిగిలిన రిజర్వ్‌డ్ స్థానాల్లో దాదాపు 25 ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లోనే నోటా ఎక్కువ నమోదయింది. మళ్ళీ ఇందులోనూ 23 స్థానాలు ఎస్టీ (గిరిజన) రిజర్వ్‌డ్ స్థానాలు కావడం కులాధిపత్య సమాజ నూతన పోకడలకు నిలువుటద్దం. వీటిల్లో టాప్ ఐదు స్థానాల్లో నోటా నమోదును పరిశీలిస్తే.. తమకు రిజర్వ్‌డ్ అభ్యర్థులెవరూ నచ్చలేదని చత్తీస్‌ఘడ్ బీజాపూర్ - 7179 ఓట్లు (పది శాతం), చిత్రకోట్ 10848 (తొమ్మిది శాతం), దంతేవాడ -9677 (తొమ్మిది శాతం), మధ్యప్రదేశ్‌లోన జున్నార్ దేవ్ -94,12 (ఆరు శాతం), నారాయణ్‌పూర్ (చత్తీస్‌ఘడ్)-6731 (ఆరు శాతం) మంది ఓటర్లు నోటా వినియోగించారు. ఢిల్లీలోని 4 ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానాల్లోనూ 'నోటా' మీట ప్రబలంగానే వినియోగించుకున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని ఆ సంస్థ తెలిపింది.
కేవలం 5 రాష్ట్రాల్లోని 630 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో నోటా మీట నొక్కడం భయాందోళనకు గురి చేస్తే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న 543 లోక్ సభ స్థానాలు (84-ఎస్సీ, 47-ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు), 294 (తెలంగాణ, సీమాంధ్ర) అసెంబ్లీ నియోజకవర్గాల (ఎస్సీ-48, ఎస్టీ-19 రిజర్వుడ్ స్థానాలు) ఎన్నికలు కలవరం కలిగిస్తున్నాయి. ఎన్నికల వేళ కోటానుకోట్ల రూపాయల పంపిణీకి పేరుగాంచిన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఎప్పుడో కలుషితమై పోయాయి. కులం, ధనం, ప్రధాన ఇంధనాలుగా సాగుతున్న ఈ ఎన్నికల్లో నోటా మీట భారీగానే నమోదవుతుందని ఓఅంచనా. దేశంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో మనువాద నిచ్చెనమెట్ల రాజకీయపార్టీలన్నీ చట్టబద్ధ రిజర్వేషన్ల కారణంగా తప్పనిసరై తమకు నచ్చినవారిని, అనుచరులు, అతికొద్దిమంది విద్యావంతులు, కాస్తో కూస్తో ఆర్థికంగా స్థిరపడ్డ ఎస్సీ, ఎస్టీలనే బరిలోకి దింపాయి. వారే ఎంపీ, ఎమ్మెల్యేలుగా రిజర్వ్‌డ్ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు.
మన ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఒక పార్టీ రిజర్వ్‌డ్ స్థానాల్లో నిలబెట్టిన అభ్యర్థుల ఆర్థిక బలాబలాలు పరిశీలించిన మీదటనే టిక్కెట్లు కేటాయించినట్లు ఆరోపణలు బహిరంగంగానే గుప్పుమన్నాయి. రిజర్వ్‌డ్ స్థానాల్లో అగ్రకులాల జనాభా పరిమితంగా ఉన్నా ప్రాబల్యం బలంగానే ఉంటుంది. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే, ఎస్సీ, ఎస్టీ నియోజవర్గాల్లో ఓటింగ్ శాతం 60 శాతంలోపే. కారణం ఆయా వర్గాలు ఓటు హక్కు వినియోగించుకునే అధికార యంత్రాంగం చేపట్టే కార్యక్రమాలు నామమాత్రంగా ఒకటికాగా అక్కడి 'మరింత చైతన్యవంతులైన అగ్రకులాలకు ఓటు వేసేంత సమయం ఉండకపోవడం మరో కారణం. ఇక చివరికి తప్పక ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళేమో నోటా నొక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పై తెలిపిన 5 రాష్ట్రాల్లో జరిగిన ఓటు వినియోగాన్ని చూస్తే ఆశ్చర్యం, ఆందోళన కలుగకమానదు. మిగతా జనరల్ స్థానాల్లో కంటే ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో నోటా వినియోగం అధికంగా ఉందంటే అక్కడ సమర్థ నాయకుడు లేడని కాదు.
అసలు 'రిజర్వ్‌డ్' స్థానాలు ఉండకూడదని, అంతటా అగ్రకులాలే నిలబడాలని, రాజ్యమేలాలనేదే అసలు రహస్యం. ఒకవేళ అగ్రకులాలు, ఓబీసీల దృష్టిలో ఆ రిజర్వ్‌డ్ స్థానాల్లో నిలబడ్డ అందరూ అసమర్థ అభ్యర్థులే అనుకుంటే మిగతా 400 స్థానాల్లో నిలబడ్డ ఓబీసీ, జనరల్ కేటగిరిలకు చెందినవారంతా సమర్థులా? సమర్థత అనేది కులం ఆధారంగా కంటే వ్యక్తి తన వ్యక్తిత్వం, వనరుల, పార్టీ అధినాయకత్వం ఇచ్చే మద్దతుపై ఆధారపడి ఉంటుంది. కానీ కుల పునాదులపై రూపుదిద్దుకున్న భారత దేశంలో పుట్టుకతోనే ఆ వ్యక్తి బలం, బలహీనతలు నిర్ణయించబడుతున్నాయి. లోకజ్ఞానం, ఉన్నత చదువులు, ఆస్తులు, అంతస్థులు సంపాదించుకున్నా ఇక్కడ కులమే ప్రామాణికం. దాని పర్యవసానమే ఎ స్సీ, ఎస్టీల అభ్యర్థుల 'తిరస్కరణ' కారణం. నేటి ఆధునిక సమాజంలో రాజులు పో యినా, రాజ్యాలు కూలినా రోజురోజుకు కుల నిర్మాణం మరింత దృఢమవుతోంది. ఏ కులానికాకులం మరింత దగ్గరవుతూ హక్కులు, ఆత్మగౌరం అంటుంది. ఇప్పటిదాకా అగ్రకులాల జాబితాలో ఉన్నవి కూడా పేదరికం పేరుతో రిజర్వేషన్లు కావాలంటున్నాయి. కుర్చీని కాపాడుకునేందుకు అమాత్యులు ఆ రకంగానే అడుగులు వేస్తూ కుంపట్లకు ఆజ్యం పోస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లోనూ కులం ప్రాతిపదికగానే నాయకత్వ ఎంపిక జరుగుతుండటం సామాజిక తిరోగమనానికి నిదర్శనం.
ఒకనాడు నోరులేని జనానికి తానై గొంతుగా నిలిచి చట్టసభల్లో గొంతుకనిచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్‌నే ముపుప్పతిప్పలు పెట్టిన ఈ సమాజం.. ఆధునికతను అందిపుచ్చుకొని అందివచ్చిన అవకాశాలు, చట్టాలన్నిటినీ తనకనుగుణంగా మలుచుకుంటోంది. అప్పట్లో ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంలో అంబేద్కర్ పోటీ చేసినప్పటికీ ప్రశ్నించే నాయకుడు చట్టసభల్లో అడుగుపెడితే తమగొంతు మూగబోతుందని గ్రహించిన అగ్రకుల ఓటర్లే ఆయనకు ఓట్లు పడకుండా చేశారు. రిజర్వ్‌డ్ స్థానం నుంచి పోటీచేసే అభ్యర్థులు తమ చెప్పుచేతుల్లో ఉంటేనే తప్ప ఓటు వేస్తానంటుందే తప్ప సమర్థతకు విలువ నివ్వరు. ఈ నేపథ్యంలో కులం ఇప్పటికీ కొనసాగుతున్న 60 ఏళ్ళ గణతంత్ర భారతంలో నోటా మీట అగ్ర వర్ణాలకు ఉపకరిస్తుందా అన్న భయం అణగారిన ప్రజల్లో మొదలైంది. విచక్షణ కోల్పోయి వివక్షకు దారితీసే నోటాపై చర్చ జరగాలి. చట్టసభల్లో వినిపించే గొంతును 'చట్టబద్ధ'మైన పద్ధతిలోనే నొక్కేస్తే, లక్ష్యం పక్కదారిబట్టి, నోట్లో మట్టికొట్టే పథకమైతే దాన్ని ఎత్తివేయడమే మేలు. కేవలం ఎస్సీ, ఎస్టీలు పోటీ చేస్తున్న చోట నోటా దుర్వినియోగమైతే ఆ స్థానాల్లో దాని రద్దే శరణ్యం. ఏదేమైనా నోటాపై జరిగే చర్చలు, సమాలోచనలు చివరికి క్యాండిడేట్ 'రీకాల్'కు దారితీసినా ఆమ్ ఆద్మీకి ఆమోదయోగ్యమే. ఓటుకు నోటుఅంటూ వచ్చే నాయకులకు నోటా ఓటా అని ఎదురు ప్రశ్నించే రోజులు ప్రతి ఓటరుకు రావాలి.

కొంగర మహేష్

Andhra Jyothi Telugu News Paper Dated: 4/4/2014 

Thursday, April 3, 2014

శాసిస్తామన్నోళ్లే... యాచిస్తున్నారు!-కొంగర మహేష్


Published at: 03-04-2014 07:02 AM
'రాజకీయ నాయకులు పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. తమ స్వార్థం ఉద్యమాన్ని తాకట్టు పెట్టేందుకు కూడా వెనకాడటం లేదు. తామే ఉద్యమానికి నాయకత్వం వహించి యావత్ తెలంగాణ ప్రజల చిరకాల కాంక్ష ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తాం. అవసరమైతే అసోం తరహాలో (అస్సాం గణ పరిషత్ మాదిరి) రాజకీయ పార్టీ స్థాపించి ఉద్యమాన్ని నడిపిస్తాం. ఇక ఈ రాజకీయ నాయకులను చేరదీసేది లేదు. వారి దరికి చేరేది లేదు'. ఇవి నాలుగేళ్ల క్రితం 2009 చివర్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష విరమించినప్పుడు, డిసెంబర్ 9 ప్రకటనను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన (2010 జనవరి 23) నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ కేంద్రమైన ఓయూలో విద్యార్థి నేతలు చేసిన వ్యాఖ్యలు. పడిలేస్తున్న ఉద్యమాన్ని తమ భుజాల మీద మోస్తూ నిలబెట్టి... కదనరంగంలో కాలుదువ్విన యువ గర్జనలకు ప్రజానీకం గొంతు కలిపింది. అడుగులో అడుగేస్తూ ఓ యుద్ధానికే మొగ్గుచూపింది. విద్యార్థుల తెగువ, లాఠీలు, తూటాలకు వెరవని ధైర్యానికి పాలక, ప్రతిపక్షాల గొంతులు ఎండిపోయాయి. ఏం మాట్లాడినా తిరుగుబాటు తప్పదని గ్రహించిన పొలిటికల్ లీడర్లంతా ఇళ్లకే పరిమితమై ఓయూ, కేయూ వంటి వర్సిటీల తదుపరి కార్యాచరణపైనే దృష్టి కేంద్రీకరించిన సందర్భాలు లేకపోలేదు. దీంతో తెలంగాణకు దశ, దిశ ఇక విద్యార్థి యువకిశోరాలే అని ప్రజలంతా అనుకున్నారు. విద్యార్థులు జేఏసీగా ఏర్పడి చేసిన 'ఓయూ డిక్లరేషన్' అన్ని రాజకీయపక్షాల నేతలకు ముచ్చెమటలు పట్టించింది కూడా. పలు ప్రజాసంఘాల నాయకులు, పార్టీలకతీతంగా ఇక్కడి విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులు ఏదో చేస్తారని అంతా అనుకున్నారు. విద్యార్థులు ఏం చేయబోతున్నారని యావత్ దేశ ప్రజానీకమంతా ఆసక్తిగా ఓయూ వైపు చూసింది. విద్యార్థుల నాయకత్వంలో మలిదశ తెలంగాణ ఉద్యమం కొత్త రాజకీయాలకు పురుడుపోస్తుందని విశ్లేషణలు జరిగాయి.
ఓయూలో మొదలైన విద్యార్థి, యువత ఏకీకరణ కేయూ నుంచి మిగతా తెలంగాణ అంతటా సరికొత్త ఉద్యమం వ్యాపిస్తుందని అనుకుంటున్న సందర్భంలోనే వారి అడుగులకు బంధనాలు పడ్డాయి... ఉద్దండ రాజకీయనేతలు రంగప్రవేశం చేసి 'డైవర్షన్' వ్యూహాలతో యువరాజకీయ రణన్నినాదాన్ని ఆదిలోనే అంతం చేశారు. మొలకెత్తే విత్తనాన్ని వేరుతో సహా తుంచేస్తే మళ్లీ పుట్టేందుకు అవకాశమే ఉండదన్న దుగ్ధతో కొన్ని స్వార్థపూరిత శక్తులు చాలా జాగ్రత్తగా ఓయూపై కన్నేశాయి. 'విద్యార్థులు రాజకీయాలు చేస్తే తామేం కావాలంటూ' విస్మయం వ్యక్తం చేస్తూ 'మేం తెలంగాణ కోసం పోరాడుతాం. స్టూడెంట్స్‌కు స్టడీస్ ముఖ్యం.. మీరు చదువుకోండి' అని సలహా ఇచ్చారు. కొంతమంది లంచ్, డిన్నర్ల పేరుతో ఇంటికి పిలిపించుకొని బుజ్జగించి తమవైపు తిప్పుకున్న వారున్నారు. మాటవినని వారిని ఉద్యమ ద్రోహులుగా ముద్రవేసి... జేఏసీ చీలికకు ఆజ్యం పోశారు. ఇట్లా మొదలైన చీలిక... ఆరునెలలకే ఒక్క ఓయూలోనే ఒకటి, రెండు, మూడు ఇలా దాదాపు పది జేఏసీలు ఏర్పడ్డాయంటే ఎన్ని రాజకీయాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో రాజకీయ పార్టీకి చివరికి ఒక్కోకులానికి ఒక్కో జేఏసీ ఏర్పడింది. చిట్టచివరికి ఒక్కరూ, ఇద్దరున్నా జేఏసీలు ఏర్పాటు చేసుకొని తమ పంథా కొనసాగించారు. రాజకీయ పార్టీలకు సరిగ్గా కావాల్సింది కూడా ఇదే.
కనీసం ఓయూ ఉద్యమంలో 'నో ఎంట్రీ' ఎదుర్కొన్న టీడీపీ సైతం స్వతంత్ర జేఏసీ పేరుతో కొనసాగింది. ఇతర పార్టీలు కూడా భావసారూప్యతల పేరుతో విద్యార్థుల్లో సెపరేటు జట్టు కట్టించాయి. అతి కొద్దిమంది మాత్రమే ఏపార్టీతో సంబంధం లేకుండా జేఏసీగా ఏర్పడ్డారు. అప్పటిదాకా పార్టీల ఊసులేకుండా సాగుతున్న ఉద్యమంలో స్పష్టమైన చీలిక తప్పకపోవడంతో ఆరోజుకు ఉన్న జేఏసీని కాపాడుకుంటే చాలన్న విధంగా పరిస్థితి మారిపోయింది.
అయితే తెలంగాణ వస్తే అగ్రవర్ణ పాలన, ఆధిపత్యం తగ్గి దాదాపు 90 శాతంగా ఉన్న అణగారిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజకీయ ప్రాబల్యం పెరుగుతుందని అందరూ నమ్మారు. రాజ్యాధికారం వీరి చేతుల్లోకే వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. అలాగే ప్రచారం జరిగింది కూడా. ఈ అశతోనే ఆ వర్గాలకు చెందిన ప్రజానీకం ఉద్యమంలో నాయకత్వం తప్ప మిగతా అన్నింట్లో చివరికి ఆత్మహత్యలు చేసుకోవడంలో కూడా ముందున్నారు. ప్రపంచీకరణ నేపథ్యం, భౌగోళిక పరిస్థితులు, ఉద్యమాలు, జనాభా దృష్ట్యా ఎలైట్ వర్గాల పిల్లలు 90వ దశకం వచ్చేసరికి ఆర్ట్స్, సామాజిక శాస్త్రాల పట్ల అనాసక్తి కనబరచడం... విదేశీ విద్య, సాంకేతిక విద్యపై ఆసక్తి కనబర్చడంతో, ఓయూ, కేయూ వంటి తెలంగాణ వర్సిటీల్లో బహుజన వర్గాల పిల్లలే సింహభాగంలో ఉన్నారు. నాటి నుంచి నేటి దాకా ప్రపంచంలో ఎక్కడ ఏపోరాటం జరిగినా తర్కబద్ధంగా స్పందిస్తూ సామాజిక స్పృహతో ముందుకెళ్తున్నారు. తెలంగాణ వస్తే తమకు, భవిష్యత్ తరాలకు ఏదో మంచి జరుగుతుందనే తెగించిపోరాడారు. ఇలాంటి నేపథ్యమున్న అణగారిన వర్గాల విద్యార్థులు రాజకీయంగా బలపడితే... వారి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే ఏదో ఒకనాడు తమ కుర్చీ కిందికి నీరు తప్పదనే భయంతో జంకిన నేతలే విద్యార్థి నాయకత్వాన్ని నిలువునా చీల్చడంలో సఫలమయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే విద్యార్థి ఉద్యమం నిట్టనిలువునా చీలేంత వరకు నిద్రపోలేదనడంలో ఆశ్చర్యం లేదు.

ఒకవైపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చరిష్మా తగ్గిపోతుండటం 2014 ఎన్నికలు సమీపిస్తుండటంతో... హైకమాండ్‌కు 2009 డిసెంబర్ 9 హామీ గుర్తుకొచ్చి తెలంగాణ బిల్లును సాధారణ మెజార్టీ ఉన్నా 'ఎంతో శ్రమ'కోర్చి పార్లమెంటులో పాస్ చేయించింది. రాష్ట్రపతి ఆమోదంతో 60 ఏళ్ల కల సాకారమైంది. 1969 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఇన్నేళ్ల మహోద్యమ ఫలితానికి విద్యార్థులు, యువత, ప్రజానీకం సమష్టిపోరాటం, అమరుల త్యాగాలే సాక్ష్యాలు. రాజకీయ నేతల పాత్ర ప్రేక్షకపాత్ర. నామమాత్రమే అని చెప్పకతప్పదు. అయితే వచ్చిన రాష్ట్రంలో పునర్నిర్మాణం, సామాజిక తెలంగాణ, బంగారు తెలంగాణ వంటి లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. వీటిపై చర్చ ప్రారంభదశలో ఉండగానే రాష్ట్రపతి పాలన, 2014 సార్వత్రక ఎన్నికల ప్రకటన జమిలిగా వచ్చాయి.
రెండు రాష్ట్రాల్లో పాగాకోసం ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించారు. పొత్తులు, ఎత్తులతో క్షణం తీరికలేకుండా ఉన్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఏ పొలిటికల్ పార్టీ కూడా ఓయూ విద్యార్థుల పోరాట పటిమను పరిగణనలోకి ఏమాత్రం తీసుకోలేదు. తమ పోరాటాన్ని గుర్తించి ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇవ్వాలని ప్రధాన రాజకీయ పక్షాల నేతలను కలుస్తున్నా... కులం, వర్గం, నియోజకవర్గం వంటివాటితో ప్రసన్నం చేసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. వారి అనైక్యతను పసిగట్టిన పార్టీలు తమదగ్గరికి వచ్చినవారిని కూడా పట్టించుకున్న పాపాన పోలేదు (కేసీఆర్ మాత్రం ఒకే ఒక్క విద్యార్థి నాయకుడిని పిలిచి పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇస్తానని హామీ ఇచ్చారు). దీంతో చేసేదిలేక కొంతమంది ఎవరికి తోచినట్లు వారు కాంగ్రెస్, ఇతర పార్టీల్లో చేరుతున్నారు. కొంతమంది ఎంఐఎంను కూడా అప్రోచ్ అయ్యారు. కారణాలేమైనప్పటికీ ఆ పార్టీ నాయకత్వం ఒకరిద్దరికి టిక్కెట్లు కన్ఫర్మ్ చేసింది.
మరోవైపు ప్రధాన పార్టీల నుంచి ఒకరిద్దరికి తప్ప మిగతా ఎవరికి స్పష్టమైన హామీ రాకపోవడంతో... విద్యార్థి నేతల పరిస్థితి ఎక్కే గడప.. దిగే గడప అన్న చందంగా మారింది. ప్రతిరోజూ ఏదో పార్టీ దగ్గరకు వెళ్లడం తమ అభ్యర్థనలు వినిపించడం, కాదంటే మళ్లీ మరో పార్టీని ఆశ్రయించడం... ఆర్థించడం... వారం పదిరోజుల నుంచి ఇదే ఓయూ నేతల దినచర్యగా మారింది. కొంతమంది నేతలైతే 'మీ బలమెంత, ఆర్థిక బలాబలాలేంటి?' అంటూ సూటిగానే అడిగి లెక్కలు వేస్తున్నారు. కాస్త అవసరం అనిపించిన వారికి పార్టీ పదవులు ఇస్తూ, అవకాశం ఉంటే ఎన్నికల తర్వాత నామినేటెడ్ పదవులు కట్టబెడతామని చెబుతున్నారు. ఇలాంటి మాటలతో విసిగినవారు, సంతృప్తి చెందనివారు మాత్రం స్వతంత్రంగానైనా ఒక్కొక్కరు ఒక్కోరకంగా... ఐక్యంగా ఉన్నవాళ్లు ఎవరికి వారే విడిపోయి ఇలా టిక్కెట్ల కోసం నేతల దగ్గర యాచిస్తుండటం వారిని ప్రసన్నం చేసుకునేందుకు పడరానిపాట్లు పడుతుండటంతో ఢిల్లీ పెద్దల నుంచి గల్లీ నేతల దాకా విద్యార్థులంటే చులకనైపోయారు. వీరి ఆపసోపాలు గమనిస్తున్న ప్రజల్లోనూ పలుచనైపోయారు. పార్టీ పెట్టకపోయినా ఫ్రంట్‌గా కదిలినా విద్యార్థులను ప్రజలు, ప్రజాసంఘాలు ఆదరించేవారు. ఐక్యంగా ఉండి రాజ కీయ పార్టీ వలే 'లాబీయింగ్' చేసినా ఈ దుస్థితి దాపురించేంది కాదు. ఇప్పుడు కాకపోతే మరో పదేళ్లు, ఇరవయ్యేళ్లకైనా నవ తెలంగాణలో సరికొత్త రాజకీయాలకు నాంది అయ్యేది.
n కొంగర మహేష్
రీసెర్చ్ స్కాలర్, జర్నలిజం డిపార్ట్‌మెంట్, ఓయూ

Andhra Jyothi Telugu News Paper Dated: 3/4/2014