Showing posts with label బృందాకరత్‌. Show all posts
Showing posts with label బృందాకరత్‌. Show all posts

Tuesday, November 6, 2012

సోషలిస్టు వ్యవస్థ ద్వారానే స్త్రీలకు విముక్తి By బృందాకరత్‌


   Sun, 4 Nov 2012, IST  

'మహిళలు - సోషలిజం' అన్న గ్రంథాన్ని రచించిన ఆగస్ట్‌ బెబెల్‌ జర్మన్‌ సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ సంస్థాపకుల్లో ఒకరు. అత్యంత జనాదరణ కలిగిన నాయకుల్లోనూ, నలభైయేళ్ళ జర్మన్‌ సోషలిస్టు ఉద్యమ ప్రతినిధుల్లోనూ ఒకరిగా ఉన్న బెబెల్‌ అత్యుత్తమ సోషలిస్టు నాయకుడు, అంతర్జాతీయవాది, మార్కిస్టు సిద్ధాంతకర్త, పార్లమెంటేరియన్‌, వక్త, రచయిత, నిర్మాణదక్షుడు, కార్మిక సంఘనాయకుడు. మొదటగా ఈ పుస్తకం 1879లో ప్రచురితమైంది. పెట్టుబడిదారీ సమాజంలో స్త్రీల స్థితిగతులపై బెబెల్‌ చేసిన అధ్యయనము, విశ్లేషణా ఆయనకున్న ప్రగాఢమైన లోచూపును తెలియజేస్తాయి. శ్రామికునిగా ఆయనకున్న స్వీయానుభవంతోపాటు, రకరకాల దోపిడీలనూ, అణచివేతలనూ శ్రామికవర్గ స్త్రీలు ఎదుర్కొన వలసి రావడం ఈ లోచూపుకు కారణమై ఉండవచ్చు. మానవజాతి చరిత్ర ప్రారంభం నుంచీ స్త్రీల స్థానాన్ని సవివరంగా అధ్యయనం చేసేందుకూ, సోషలిస్టు సమాజంలో స్త్రీల భవితవ్యాన్ని గురించి తన ఊహలను ఆవిష్కరించేందుకు చారిత్రక భౌతికవాద దృక్పథాన్ని ఆయన స్వీకరించాడు. ఆయన జీవిత కాలంలోనే ఈ పుస్తకం జర్మను భాషలో 53 ముద్రణలు పొందింది. 20 భాషల్లోకి అనువాదమైంది. 15 లక్షల కాపీలు అమ్ముడైనట్లుగా సమాచారం.
విశ్లేషణాత్మక ప్రాతిపదిక వేసిన ఎంగెల్స్‌
బెబెల్‌ పలుమార్లు ఉదహరించిన ఎంగెల్స్‌ మహోత్కృష్ట గ్రంథం, 'కుటుంబము- స్వంత ఆస్తి-రాజ్యముల పుట్టుక' అన్నది ఈ పుస్తకానికి ఆయువుపట్టుగా ఉన్నదని చెప్పవచ్చు. వాస్తవానికి, ఎంగెల్స్‌ నిర్దేశించిన ప్రాతిపదికపైనే మహిళల అణచివేతకు దారితీసిన సామాజిక పరిస్థితుల గురించీ, కారణాల గురించీ బెబెల్‌ మరింతగా అన్వేషించాడు. 'మోర్గాన్‌ పరిశోధనలపై ఆధారపడి రాసిన తన అద్భుతమైన పుస్తకంలో ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌, అప్పటి వరకూ అహేతుకమైనవిగా, అసమగ్రమైనవిగా కనిపించిన అనేక విషయాలపైనా, మానవాభివృద్ధిలోని వివిధ దశలకు ప్రాతినిధ్యం వహించే ప్రజల చరిత్రపైనా వెలుగును ప్రసరింపచేశాడు. సాంఘిక నిర్మాణం క్రమక్రమంగా ఎలా ఏర్పడిందనే విషయంలో ప్రగాఢ దృష్టిని వాళ్ళు మనకు కలిగించారు. తత్ఫలితంగా వివాహం, కుటుంబం, రాజ్యం వంటి వాటి గురించి ఇంతకు పూర్వం మనకున్న భావనలన్నీ తప్పుడు ఆధారాలపై నిలబడినవని తెలుసుకోగలిగాం. వివాహం, కుటుంబం, రాజ్యం - ఈ విషయాల గురించి ఏదైతే నిరూపితమైందో అది స్త్రీల విషయంలోనూ సత్యమే. ఎన్నటికీ మారని 'శాశ్వత' స్థానం స్త్రీలదనే అభిప్రాయంతో మౌలికంగా విభేదించి వివిధ సాంఘిక దశలలో స్త్రీల స్థానం కూడా మారుతూ వచ్చిందని నిరూపించగలిగాం'. మార్క్సిస్టు దృక్పథాన్ని అనుసరించి, మహిళల అణచివేతకున్న చారిత్రక మూలాలు స్వంత ఆస్తిపై ఆధారపడిన వర్గ సమాజాభివృద్ధిలోనూ, స్త్రీలకు అనుకూలంకాని లైంగిక శ్రమ విభజనలోనూ కన్పిస్తాయి. స్త్రీలపై సాగిన కిరాతక అణచివేతను అది తెలియజేస్తుంది. కుటుంబ చరిత్రనూ, కుటుంబ సంబంధాలనూ, అలానే ఉత్పత్తి పద్ధతుల్లోనూ, ఉత్పత్తి సంబంధాల్లోనూ చోటుచేసుకున్న మార్పులతో దానికి గల సంబంధాలనూ అది తెలియజేస్తుంది. బెబెల్‌ ప్రకారం, 'గత మానవాభివృద్ధిలోని పురోగతిలో ఈ సంబంధాలు మారిన ఉత్పత్తి, పంపిణీ పద్ధతులను బట్టి మారాయని నిరూపించగలిగితే, ఇకముందు ఉత్పత్తి, పంపిణీలలో వచ్చే మార్పుల వల్ల స్త్రీపురుష సంబంధాలలో మళ్ళీ మార్పులు వస్తాయన్న విషయాన్ని నిరూపించవచ్చు. ప్రకృతిలోనూ, మానవ జీవితంలోనూ ఏదీ శాశ్వతం కాదు. మార్పు ఒక్కటే శాశ్వతమైనది'. ఆ కాలంలో ఇలాంటి అభిప్రాయాలు ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. బూర్జువా వివాహాల్లోని కపటంపై బెబెల్‌ చేసిన తీక్షణ విమర్శలూ, లైంగికంగా స్త్రీలను దోచుకుంటున్న తీరుపై ఆయన చేసిన దాడులు, విధిలేక వ్యభిచార కూపంలో దిగబడ్డ స్త్రీలపట్ల ఆయనకున్న సానుభూతి, చూపిన సంఘీభావం ప్రత్యేకించి ఆయన వ్యతిరేకులను రెచ్చగొట్టాయి. వివాహము, కుటుంబం గురించి బెబెల్‌ వ్యక్తపరచిన అభిప్రాయాలు మరీ ముఖ్యంగా మతాధిపతుల్లో ఆగ్రహావేశాలను రేకెత్తించాయి.
ఆదిమకాలం నుండి పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందేవరకు చోటుచేసుకున్న మార్పుల్ని ఈ పుస్తకం నమోదు చేసింది. విభిన్న సంస్కృతులపైనా, ప్రాంతాలపైనా శ్రమభరితమైన పరిశోధనలు చేయటం ద్వారా, వీటిల్లో ప్రతి ఒక్కటీ, స్త్రీలకు సమానత్వాన్ని మించిన స్థాయిని కలిగించిన సమాజాల నుండి (వీటినే ఆయన మాతృస్వామ్యం అని పిలిచాడు) స్త్రీలను ద్వితీయ పౌరులుగా పరిగణించే ప్రపంచంగా ఎలా పరిణమించిందీ బెబెల్‌ వివరిస్తాడు. చివరికాయన మనుస్మృతిని సైతం ఉదహరిస్తూ, కుటుంబ అభివృద్ధిలోని వివిధ దశలనూ, అదేవిధంగా భారతదేశంలోని వివక్షాపూరిత వ్యవస్ధనూ చిత్రించడానికై హిందూ పురాణాల నుండి ఉటంకింపులు ఇస్తాడు. బెబెల్‌ అధ్యయనం చేసిన పలు సమాజాలలో ఒక శతాబ్దానంతరం కూడా ఆస్తిగల సంపన్న వర్గాలలో వివాహ వ్యవస్థ బలంగా సజీవంగా ఉండటం, సంపదనీ, ఆస్తినీ, కార్పొరేటు కంపెనీ షేర్లనూ వారి సంతానానికి అందించే మార్గంగా వివాహ వ్యవస్థని ప్రయత్నపూర్వకంగా రక్షించడం ఈనాటికీ ఒక నిజం.
సామాజిక సంకుచిత వాదానికి వ్యతిరేకంగా
ఈ పుస్తకాన్ని చదువుతుంటే, దోపిడీతత్వం కలిగిన పెట్టుబడిదారీ సామాజిక వ్యవస్ధనూ, మానవుల మధ్య అది ఏర్పరిచే సంబంధాలనూ బెబెల్‌ వంటి నాయకులు ఎంత నిర్భయంగా విమర్శించిందీ కొట్టవచ్చినట్లు కనబడుతుంది. వర్గాధారిత సమాజాలపై విమర్శే ఈ పుస్తకానికి పునాదిగా ఉన్నది. పెట్టుబడిదారీ సమాజపు ద్వంద్వ విలువలనూ, కపటత్వాన్ని ఎండగట్టేటప్పుడు బెబెల్‌ శ్రామిక మహిళల స్థితిగతుల గురించేకాక మొత్తం మహిళా లోకం గురించే చాలా సునిశితంగా స్పందించాడు. ఇది వర్గేతరం అంటూ ఉద్యమంలో కొందరు చేసిన తప్పుడు విశ్లేషణను బెబెల్‌ తిప్పికొడుతూ సమాజంలో అన్ని తరగతుల మహిళలూ పెట్టుబడిదారీ వ్యవస్థ బాధితులేనన్నాడు.
సమూల మార్పుకు సోషలిజం అవసరం
పెట్టుబడిదారీ సమాజంలో సంస్కరణల కోసం ఉద్యమాలు చేయాలని బలంగా వాదించిన బెబెల్‌ పెట్టుబడిదారీ సమాజాన్ని నిర్మూలించి సోషలిస్టు వ్యవస్థను నెలకొల్పడం ద్వారా మాత్రమే స్త్రీల విముక్తి సాధ్యం కాగలదని నిస్సందేహంగా భావించాడు. భవిష్యత్‌ సోషలిస్టు సమాజంలోని విభిన్న అంశాల గురించి చర్చించడానికి ఆయన ఈ పుస్తకంలో 11 అధ్యాయాలను కేటాయించాడు. జనాభా సమస్య నుండి వ్యవసాయం, కళలు, వ్యక్తి స్వాతంత్య్రం తదితరాలను ఆయన చర్చకు పెట్టాడు. వాటిలో ప్రాథమికమైనవి ఏమంటే, ఇంటిబయట చేసే ఉత్పాదక శ్రమ ద్వారా స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రానికి సోషలిస్టు సమాజం హామీని కల్పించడం, శిశు సంరక్షణా బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించడం, అసమాన శ్రమ విభజనను అంతం చేయడానికి ప్రభుత్వమే భోజనశాలలు నడపడం ద్వారా ఇంటి చాకిరిని తొలగించి గృహ జీవనాన్ని మార్చివేయడం వంటివి. వివాహాలకు లేదా మానవ సంబంధాలకు స్వంత ఆస్తి పునాది తొలగిపోవడంతో స్త్రీపురుషుల మధ్య సంబంధాలు మార్పుకు లోనవుతాయి. అయితే సోషలిస్టు సమాజావిర్భావాన్ని చూడటానికి బెబెల్‌ జీవించి లేడు. ఉండివున్నట్లయితే తాను ఊహించిన సోషలిస్టు సమాజపు పలు వాగ్దానాలను యథార్థం చేసే దిశలో లెనిన్‌ నేతృత్వంలోని బోల్షివిక్‌ ప్రభుత్వం చేపట్టిన తొలి చర్యలను చూసి బెబెల్‌ ఉప్పొంగిపోయే వాడే.
బెబెల్‌ పుస్తకాన్ని, అది వెలువడిన చారిత్రక పూర్వరంగాన్ని దృష్టిలో ఉంచుకుని చదవాలి. అందులోని కొన్ని సూత్రీకరణలను విలువైనవిగా మనం భావించకపోవచ్చు. కాని ఈ పుస్తకం వివిధ వర్గ సమాజాలలో స్త్రీలపై సాగిన చరిత్రాత్మక అణచివేతను సవివరంగానూ కదిలించే విధంగానూ చిత్రించింది. ఒకవైపున సంస్కరణల అవసరాన్ని చెెబుతూనే మరోవైపు స్త్రీల అణచివేతను సమూలంగా రూపుమాపడానికి సోషలిస్టు విప్లవమే పునాది అన్న అంశాన్ని చర్చించిందీ పుస్తకం. ఆంధ్రప్రదేశ్‌ ఐద్వా కమిటీ ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురించాలని నిర్ణయించడం ముదావహం. స్త్రీల హక్కులు, ప్రజాస్వామ్యం, సామాజిక మార్పుల కోసం సాగే ఉద్యమంలో మన పాత్రను, విధులను సవ్యంగా అవగాహన చేసుకోవడానికి ఈ పుస్తకం సహాయపడగలదని నేను గట్టిగా నమ్ముతున్నాను.
(రేపు హైదరాబాద్‌లో 'మహిళలు-సోషలిజం' పుస్తకావిష్కరణ) 
-బృందాకరత్‌

Prajashakti News Paper Dated: 04/11/2012 

Thursday, May 17, 2012

గనులు, వనరులు, ఆదివాసీ హక్కులు--బృందా కరత్‌



గనులు, ఖనిజాల రంగంలో ప్రతిపాదించిన సంస్కరణలు భూమి, దానికి సంబంధించిన వనరుల యజమానుల హక్కులపై దాడి చేయ డానికి ఉద్దేశించినవే తప్ప మరొకటి కాదు. ప్రపంచ వ్యాప్తంగా గిరిజన, దేశీయ కమ్యూనిటీలు తమకు చెందిన భూముల్లో నిక్షిప్తమై ఉన్న ఖనిజ సంపదపై తమ హక్కులను చాటుకుంటున్నాయి. వారు ఆ భూములపై, ఆ భూముల్లో లభించే ఖనిజాలపై సంప్రదాయబద్ధమైన హక్కులు కలిగి ఉన్నారు. అయితే గిరిజనుల న్యాయపరమైన హక్కుల సంగతి అటుంచి ఆ సంపదలో కనీసం కొంత శాతంపై కూడా హక్కులు పొందలేకపోతున్నారు. ప్రస్తుత నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో దేశీయ కార్పొరేట్‌ సంస్థలు, బహుళ జాతి మైనింగ్‌ కంపెనీలు ఖనిజాలు, జాతీయ వనరులను దోచుకుంటున్నాయి. మరోవైపు దోపిడీకి గురవుతున్న కమ్యూనిటీల నుండి ప్రతిఘటన ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇది అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఐక్యరాజ్యసమితి ఒప్పందాల్లో ప్రతిబింబిస్తోంది. గిరిజనులు సంప్రదాయబద్ధంగా వ్యక్తిగతంగా కానీ, సమిష్టిగా గానీ అనుభవిస్తున్న లేదా వారి స్వాధీనంలో ఉన్న భూముల యాజమాన్య హక్కులు, నియంత్రణ, నిర్వహణలను ఇవి వివిధ రూపాల్లో గుర్తిస్తున్నాయి. తమ ప్రాంతాలను అభివృద్ధి అవసరాలకు ఉపయోగించుకునే విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో వారికి గల హక్కులను, తమ ప్రాంతాల్లో చేపట్టే ఎటువంటి ప్రాజెక్టులకు స్వేచ్ఛగా ఆమోదం తెలిపేందుకు, లేదా తిరస్కరించేందుకు వారికి గల హక్కులను ఇవి గుర్తించాయి. 


తమ హక్కుల పరిరక్షణ కోసం గిరిజనులు చేసే పోరాటాలు లేదా వారు చేసే త్యాగాల ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆ తీర్మానాలను చట్టబద్ధమైన హక్కులుగా మార్చడం అత్యంత ముఖ్యమైన విషయం. ఇది భారత్‌కు పూర్తిగా వర్తిస్తుంది. యుపిఎ ప్రభుత్వం 2011గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు (ఎంఎంఆర్‌డిఎ) ప్రవేశపెట్టింది. ఆ బిల్లు ప్రస్తుతం పార్లమెంటరీ స్థాయీ సంఘం పరిశీలనలో ఉంది.
ప్రయివేటీకరణకు ప్రోత్సాహం
భారతదేశంలో గనుల యాజమాన్యం ప్రభు త్వానికే చెందుతుంది. అయితే ఇనుప ఖనిజం, బాక్సైట్‌, రాగి, బొగ్గు మొదలైన ప్రధాన ఖనిజాలపై కేంద్ర ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుక, ఇటుకరాయి. గ్రానైట్‌ వంటి చిన్నపాటి ఖనిజాలపై నియంత్రణ కలిగి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్ద గనుల ప్రయివేటీ కరణను ప్రవేశపెట్టాయి. గనులను ప్రయివేటు కంపెనీలకు లీజుకు ఇవ్వడంతోపాటు ఇనుప ఖనిజం, బాక్సైట్‌, ఉక్కు, అల్యూమినియం వంటి క్యాప్టివ్‌ గనులను టాటాలు, బిర్లాలు వంటి కార్పొరేట్‌ సంస్థల చేతికి అప్పగిస్తున్నాయి. ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ ఇటీవల ఈ పరిశ్రమ కోసం రూపొందించిన నివేదిక ప్రకారం 23 రాష్ట్రాల్లో 2009 సంవత్సరాంతానికి 4.9 లక్షల హెక్టార్ల భూమిని మైనింగ్‌ లీజులకు అద్దెకు ఇచ్చారు. ప్రయివేటు కంపెనీలకు 70 శాతం భూములను కట్టబెట్టారు.
గనుల రంగంలో మరింతగా నియంత్రణ ఎత్తివేసి సరళీకరించేందుకు, హోడా కమిటీ సిఫార్సుల ప్రాతిపదికగా ప్రయివేటీకరణను ప్రోత్సహించేందుకు ఎంఎంఆర్‌డిఎ బిల్లు దోహదం చేస్తుంది. హై టెక్నాలజీ భూగర్భ పరిశోధన, ప్రాస్పెక్టింగ్‌, తవ్వకం విధానాన్ని ఇది ప్రవేశపెడుతుంది. తక్కువ ధరలకు మైనింగ్‌ పనులను లీజుకు ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది. గనుల రంగంలో ఎఫ్‌డిఐలు, విదేశీ కంపెనీలను ప్రోత్సహిస్తుంది. అటువంటి కంపెనీలపట్ల సాను కూలత చూపే కొంతమందికి గనులను లీజుకు ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంతకుముందు కేటాయించిన విస్తీర్ణం కంటే ఎక్కువ మొత్తంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు వాటిని అనుమ తిస్తుంది. ఇందువల్ల సమానత్వం, పర్యావరణం, వృద్ధిపై ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ అంశాలపై సమగ్ర విశ్లేషణ అవసరం. కాగా ఇక్కడ గిరిజనులకు హక్కులను కల్పించేందుకు ఉద్దేశించినవిగా చెబుతున్న అంశాల గురించి ప్రధానంగా దృష్టి కేంద్రీకరిద్దాం. కోల్‌ మైనింగ్‌ కంపెనీలు తమ లాభాల్లో 26 శాతం మొత్తాన్ని నిధులు ఇవ్వాలనే నిబంధన ఒకటి ఉంది. ఇతర ఖనిజాల విషయంలో రాయిల్టీతో సమానంగా చెల్లించాలి. కంపెనీలు తప్పనిసరిగా కొంతమొత్తం చెల్లించాలనే నిబంధన అవసరమే అయినప్పటికీ ఈ నిధులు గని యజమానులు, బ్యూరోక్రసీ ఆధిపత్యం చెలాయించే జిల్లా ఖనిజాల ఫౌండేషన్‌ నియంత్రణలో ఉంటాయి. ఈ ఫౌండేషన్‌లో స్థానిక కమ్యూనిటీలకు నామమాత్రపు ప్రాతినిధ్యం మాత్రమే ఉంటుంది. అమెరికాలో ఫెడరల్‌ ప్రభుత్వం కంపెనీలు చెల్లించే మొత్తాలతో నిధులను నిర్వహించేందుకు ట్రస్టులను ఏర్పాటు చేస్తుంది. స్థానిక భారతీయుల యాజమాన్యంలోని భూముల్లో రిజర్వ్‌లుపై చెల్లించే నిధులకు ప్రభుత్వం ఇటీవల ఇటీవల 41 మంది భారతీయులకు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. నిధులను దుర్వినియోగం చేసినందుకు గాను ఈ నష్టపరిహారం చెల్లించాల్సివచ్చింది. ఇటువంటి కేసు లోనే అమెరికా 3.4 బిలియన్‌ డాలర్ల మొత్తాన్ని చెల్లించాల్సి రావచ్చునని భావిస్తున్నారు. ఇటువంటి నిధుల నిర్వహణలో బాధిత వ్యక్తులకు ఎటువంటి నిర్ణాయక పాత్ర లేకపోతే ఎంఎంఆర్‌డిఎ బిల్లులో ప్రతిపాదిత జిల్లా ఖనిజాల ఫౌండేషన్‌లో మాదిరిగా నిధుల దుర్వినియోగం అనివార్యమవుతుంది. పైగా భారతదేశంలో రాయల్టీలు బాగా తక్కువగా ఉంటాయి. ఇటీవలి కాలం వరకు ఇనుప ఖనిజానికి కేంద్ర ప్రభుత్వం ఒడిశా రాష్ట్రానికి నిర్ణయించిన రాయల్లీ టన్నుకు రు26 మాత్రమే. ఇనుప ఖనిజం తవ్వకం ఖర్చు టన్నుకు రు. 250 నుండి రు. 300 కాగా, మార్కెట్‌లో ఉన్న అత్యధిక రేటు టన్నుకు ఏడు వేల రూపాయలు. దీంతో మైనింగ్‌ కంపెనీలు భారీ మొత్తంలో లాభాలు ఆర్జించాయి. రాయల్టీ రేట్లను ఇటీవలే పెంచినప్పటికీ కంపెనీలు గడిస్తున్న లాభాలతో పోలిస్తే చెల్లిస్తున్న రాయిల్టీలు స్వల్పం గానే ఉన్నాయి.
ప్యాట్రన్‌-క్లయింట్‌ సంబంధాలు
ఈ పథకంలో ముఖ్యమైన విషయం ప్యాట్రన్‌- క్లయింట్‌ మధ్య సంబంధాలు. గిరిజనులను భూములు, దానిలోని వనరుల యజమానులుగా బిచ్చగాళ్లుగా మారుస్తున్నాయి. ఈ బిల్లులోని నిబంధనలు గిరిజనులకు రాజ్యాంగం, ముఖ్యంగా ఐదవ షెడ్యూల్‌ కల్పించిన హక్కులపై దాడి చేసే విగా ఉన్నాయి. ఐదవ షెడ్యూల్‌ ప్రాంతాలను, గిరిజనుల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయ డాన్ని నిషేధిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ చేసిన 70/1 చట్టం, ఛత్తీస్‌గఢ్‌ చేసిన చోటానాగపూర్‌ కౌల్దారీ చట్టం, సంతల్‌ పరగణాస్‌ కౌల్దారీ చట్టం తరహాలో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. మైనింగ్‌ కంపెనీలు లీజుకు తీసుకున్న భూములేవీ ఆదివాసీ లకు చెందినవి కావు. ఇందువల్లనే సమతా కేసులో గిరిజనులకు చెందిన భూములను గిరిజనేతరులకు విక్రయించడం, బదిలీ చేయడం, లీజుకు ఇవ్వడం చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. గిరిజనుల సహకార సంఘాలకు చెందిన భూములను మైనింగ్‌కు కేటాయించరాదు. ఈ బిల్లు సమతా కేసును అతిక్రమించేదిగా ఉంది. ప్రధాన ఖనిజాల గనులను లీజ్‌కు తీసుకునే విషయంలో గిరిజన సహకార సంఘాలను అనర్హులుగా ఈ చట్టం ప్రకటించింది. సంబంధిత చట్టాల కింద నమోదైన కంపెనీలకు మాత్రమే లీజుకు తీసుకునే అధికారం కల్పించారు. ఐదవ, ఆరవ షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని స్వల్ప ఖనిజాలు, స్వల్ప మొత్తంలో డిపాజిట్లకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన సహకార సంఘాలను లీజ్‌ పొందడానికి అర్హతగల
సంస్థలుగా పరిశీలించవచ్చు. (పరిశీలించవచ్చు మాత్రమే, విధిగా పరిశీలించాలని కాదు).
మైనింగ్‌ కంపెనీల్లో గిరిజనులకు తప్పనిసరిగా కొంత వాటా ఇవ్వాలని 2010 ముసాయిదా బిల్లు నిర్దేశించింది.కంపెనీ గిరిజనులకు ప్రమోటార్‌ కోటా కింద 26 శాతం వాటాకు సమానంగా షేర్లు ఇవ్వాలని ఈ నిబంధన పేర్కొంది. దక్షిణాఫ్రికా బ్లాక్‌ ఎకానమీ ఎంపవర్‌మెంట్‌ యాక్ట్‌ కూడా మైనింగ్‌ కంపెనీల్లో చారిత్రాత్మకంగా సామాజికంగా నిరాదరణకు గురవుతున్న వర్గాలకు 26 శాతం షేర్లను ఇవ్వాలని నిర్దేశించింంది. అయితే భారత దేశంలో మైనింగ్‌ లాబీల ఒత్తిడికి లొంగిన ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ముసాయిదాలో చేర్చిన నిబంధన స్థానంలో నామమాత్రంగా బాధిత కుటుంబాల్లో ఒక్కొక్క సభ్యునికి ఒక్కొక్క షేర్‌ చొప్పున కేటాయించే పద్ధతిని ప్రవేశపెట్టింది.
జీవనోపాధి కోల్పోయినవారికి నష్టపరిహారం, పరిహారంగా ఉద్యోగాలు కల్పించడం వంటి అనేక ఇతర సమస్యలు కూడా ఉన్నాయి. ఈ బిల్లులో అందుకు సంబంధించిన నిబంధనలు సరిపోయే రీతిలో, అస్పష్టంగా ఉన్నాయి. మైనింగ్‌ రంగంలో పర్మినెంట్‌ ఉద్యోగాల్లో కోత విధించి కాంట్రాక్టు, క్యాజుయల్‌ కార్మికులను నియమించడం పెరిగి పోయిన నేపథ్యంలో భూమి కోల్పోయినవారికి ఉపాధి కల్పిస్తామనే హామీలను విశ్వసించలేము. భూ సేకరణ బిల్లు గిరిజనుల యాజమాన్య హక్కులకు పాతరవేయడంతోపాటు అంతర్జాతీయ, దేశీయ సంస్థలు ఐదవ షెడ్యూల్‌, గిరిజనులు అధికంగా నివసించే ఖనిజ వనరులతో పరిపుష్టమైన ప్రాంతాల్లో తేలికగా ప్రవేశించి ప్రకృతి వనరులను దోచుకునేందుకు అవకాశం కల్పించే విధంగా ఉంది. గిరిజనుల హక్కుల పరిరక్షణకు సంబంధించి అనేక అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకాలు చేసిన భారతదేశం ఈ ఒప్పందాలను ఉల్లంఘిస్తోంది. బిల్లును ఈ రూపంలో తేవడాన్ని గట్టిగా ప్రతిఘటించాలి. ఐదవ షెడ్యూల్‌, గిరిజన తండాల్లో భూముల్లో మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు గిరిజనులకు భూముల్లో యాజమాన్యాన్ని గుర్తించేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు పటిష్టమైన చట్టబద్ధమైన యంత్రాంగం కోసం ప్రత్యామ్నాయ నమూనా కోసం ఉద్యమాలు నిర్వహించాలి.
Prajashakti News Paper Dated : 18/05/2012 
-బృందా కరత్‌

Tuesday, May 1, 2012

వామపక్షాల ముందున్న కొన్ని సవాళ్లు----బృందా కరత్‌



కార్మికోద్యమం కార్మికులందరినీ సమీకరించగలిగినపుడే వర్గ సమైక్య నినాదం ఆశించిన ఫలితాలను సమకూరుస్తుంది. దళితుల అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మించాలి. అనేక వివక్షతలు ఎదుర్కొంటున్న ముస్లింలను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేయాలి. మహిళా కార్మికుల స్థితిగతులపై కూడా ప్రధానంగా దృష్టి సారించకపోతే నయా ఉదారవాద విధానాలపై పోరాటాలు ముందుకు సాగవు. దళితులు, ముస్లింలు, మహిళలు, గిరిజనులు కావడం వల్ల ఎదురయ్యే వివక్షతలు, అణచివేతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు కార్మికోద్యమంలో భాగస్వామ్యం కల్పించాలి.
కోజికోడ్‌లో జరిగిన 20వ సిపిఎం మహాసభ అనేక అంశాలతోపాటు అస్థిత్వ రాజకీయాలు, వామపక్ష ఉద్యమానికి దాని వల్ల ఎదురవుతున్న సవాళ్ల గురించి చర్చించింది. ఈ మహాసభలో ఆమోదించిన రాజకీయ, సైద్ధాంతిక తీర్మానాలు ఈ అంశం గురించి విస్తృతంగా చర్చించాయి. నయా ఉదారవాద విధానాల కింద కార్మికుల అస్థిత్వాన్ని దెబ్బతీసే ప్రక్రియ వామపక్షాల ముందు కొత్త సవాళ్లను ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా కులం, మతం, ప్రాంతం, భాషాపరమైన బహుళ రకాల విభేదాలు ఉన్న మన సమాజంలో ఈ సవాళ్లు మరింత తీవ్రంగా ఉంటాయి. గత రెండు దశాబ్దాల్లో, ఈ విభేదాలు ఒక తరహా రాజకీయాల వల్ల మరింత తీవ్రతరమవుతున్నాయి. కార్మికులను చీల్చేందుకు, రాజకీయ సమీకరణ కోసం ఓటు బ్యాంకులు సృష్టించుకునేందుకు కులం, కమ్యూనిటీని అవి సాధనాలుగా ఉపయోగించుకుంటున్నాయి. నయా ఉదారవాద విధానాలు సృష్టించిన భౌతిక పరిస్ధితుల్లోని మార్పులు ఈ ప్రక్రియకు దోహదం చేస్తున్నాయి. ఆ భౌతిక పరిస్థితుల్లోనే భారత్‌, ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ విధానాల వల్ల నిత్యం పెరిగే నిరుద్యోగసైన్యం, లేదా తమ అర్హతల కంటే తక్కువైన ఉద్యోగాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. స్థూలంగా చెప్పాలంటే, కార్మికుల అస్థిత్వాన్ని బలహీనపరిచేందుకు, వారిలో వర్గచైతన్యాన్ని దెబ్బతీసే నిర్దిష్ట లక్ష్యంతో ఒక ప్రక్రియ కొనసాగుతోంది.
కార్మికుల్లో పెరుగుతున్న అభద్రతాభావం
నయా ఉదారవాద వ్యవస్థ కింద, ఉత్పత్తి ప్రక్రియలో, కార్మిక కాంట్రాక్టుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. . ఈ మార్పులు కార్మికుల హక్కులను హరిస్తున్నాయి. ఒకవైపు పెట్టుబడిపై ఆధారపడుతూ ఉన్నత విద్యార్హతలు, నైపుణ్యాలు గల కార్మికులను నామమాత్రపు సంఖ్యలో మాత్రమే నియమించే బాగా అభివృద్ధి చెందిన ఉత్పత్తి యూనిట్లుండగా, మరోవైపు ఉత్పత్తి ప్రక్రియ వికేంద్రీకరణ, విభజన, ఉప విభాగాలుగా విభ జించడం వంటి ప్రక్రియలు లాభదాయకమని బావించే పెట్టుబడిదారులున్నారు. ప్రధాన కంపెనీ తాను నిర్వహించే వివిధ కార్యకలాపాలను అవుట్‌ సోర్సింగ్‌కు అప్పగించడం, అంతిమంగా పూర్తి అయిన పరికరాలను అసెంబుల్‌ చేయడం ద్వారా తమ సంస్థల్లో కార్యకలాపాలను కుదించు కుంటున్నాయి. కార్మికుల నియామకంలో తాజాగా వచ్చిన ప్రధానమైన మార్పు పెద్ద సంఖ్యలో క్యాజువల్‌, కాంట్రాక్టు కార్మికులను నియమించడం, కార్మికులు పనిచేసే పరిస్థితులు కూడా ఘోరంగా ఉంటున్నాయి. ఎటువంటి భద్రతా లేని కార్మికుల సంఖ్య బాగా పెరిగినట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ పేర్కొంది. 2010లో ప్రపంచ కార్మికుల్లో యాభై శాతానికి పైగా కార్మికులు, అంటే 150 కోట్ల మంది తీవ్ర అభద్రతాభావ వాతావరణంలో పనిచేస్తున్నారు.ఇందులో అనేక మంది మహిళలు కూడా ఉన్నారు.
భారతదేశంలో సంఘటిత రంగంలోని కార్మికుల సంఖ్య ఏడు కంటే తక్కువగానే ఉంది. వీరిలో ఎక్కువ భాగం ప్రబుత్వ రంగంలోనే పనిచేస్తున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం విస్తృతంగా అమలులోకి రావడం వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టారు. రిక్రూట్‌మెంట్‌ బాగా తక్కువగా ఉంటోంది. ఉపాధికల్పన అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. మరోవైపు ప్రయివేటు రంగంలో కార్మికుల్లో అభద్రతాభావం బాగా పెరిగిపోతోంది. పరిశ్రమల వార్షిక సర్వే ప్రకారం ఉత్పత్తి రంగంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 1999-2000లో 20 శాతం ఉండగా 2008-09 నాటికి 32 శాతానికి పెరిగింది. 2004-05 నుండి 2009-10 మధ్య క్యాజువల్‌ కార్మికుల సంఖ్య 2.1 కోట్లు పెరిగింది. మరోవైపు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే రెగ్యులర్‌ కార్మికుల సంఖ్య 58 లక్షలు మాత్రమే పెరిగింది.
కార్మికుల్లో అనేక మంది అనేక వృత్తులు చేపడుతున్నారు. దాంతో కార్మికులు అస్థిత్వం కోల్పోతున్నారు. ఉత్పత్తి ప్రక్రియలో వికేంద్రీకరణ చోటుచేసుకోవడంతో కాంట్రాక్టర్లు, సూపర్‌వైజర్లు, చిన్న ఏజెంట్లతో కూడిన వ్యవస్థ కార్మికుడు, యజమాని మధ్య ప్రత్యక్ష సంబంధాలను మరుగున పెడుతోంది. దాంతో కార్మికులు, యజమాని మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. చారిత్రికంగా పెద్ద సంఖ్యలో కార్మికులు ఒకే కప్పు కింద పని చేస్తూ, సన్నిహితంగా జీవిస్తుండటం సమిష్టి కార్యకలాపాల నిర్వహణ, సమిష్టి జీవనానికి అవకాశం కల్పించింది. భారతదేశంలో బొంబాయిలో ఢిల్లీలోని జౌళి పరిశ్రమల ప్రాంతాల్లో, బెంగాల్‌లోని జనపనార, ఇంజనీరింగ్‌ ప్యాక్టరీలు, పరిశ్రమలోని కార్మికులు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ ఉమ్మడి సంస్కృతి వర్గం ఆధారంగా కార్మిక సమైక్యత, అస్థిత్వానికి అవకాశం కల్పించింది. అంటే దీనర్థం కులతత్వం అంతరించిందని కాదు. కులపరమైన వివక్షత విభిన్న రూపాల్లో తమ ప్రభావం ప్రదర్శించింది. అయితే పాత తరం ఫ్యాక్టరీలు, మిల్లుల్లో సంఘటితమైన కార్మికవర్గం పారిశ్రామిక ప్రాంతాలకు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశిస్తూ కార్మికవర్గం సమిష్టితత్వానికి ప్రతీకగా నిలిచారు.వర్గ దోపిడీకి వ్యతిరేకంగా సమైక్యత ప్రాతిపదికగా కార్మికుల అస్థిత్వం రూపొందింది.
బలహీనపడ్డ సమైక్యత
గత రెండు దశాబ్దాలుగా ఉత్పత్తి ప్రక్రియలో అనేక మార్పులు చోటుచేసుకోవడంతో కార్మికుల్లో సమైక్యత దెబ్బతింది. ఉత్పత్తి ప్రక్రియలో కార్మికులు సమిష్టిగా పాల్గొనే వ్యవస్థ గణనీయంగా బలహీనపడింది. పాత కార్మికుల కాలనీలను కూల్చివేశారు. వాటి స్థానంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు దందా ప్రారంభమైంది. సంపన్నుల కోసం ఆకాశహర్మాల నిర్మాణం కొనసాగుతోంది. షాపింగ్‌ మాల్స్‌, షాపింగ్‌ కేంద్రాలు దర్శనమిస్తున్నాయి. పట్టణాల్లో కార్మికుల కాలనీలు అదృశ్యమవుతున్నాయి. కార్మికులు, లేబర్‌ చెల్లాచెదురయ్యారు. దీంతో వారి రాజకీయ సంకల్పబలం బలహీనపడింది. సమ్మెలు చేసే శక్తి సన్నగిల్లింది. ఆర్థిక వ్యవస్థలో, సంస్కృతిలో, సామాజిక జీవనంలో కార్మికుల పాత్ర సన్నగిల్లింది. మరోవైపు అవుట్‌సోర్సింగ్‌ వ్యవస్థ, వికేంద్రీకరణ ప్రక్రియ కారణంగా కార్మికులకు తమ ఇళ్లే తమ విధుల నిర్వహణ కేంద్రాలుగా మారాయి. ఆ విధంగా సంప్రదాయసిద్ధమైన కార్మికవర్గ రాజకీయాలు బలహీనపడ్డాయి. కార్మికుల సమీకరణ వ్యవస్థ దెబ్బతింది. ఈ ప్రక్రియ కార్మిక సంఘ ఉద్యమాన్ని మాత్రమే కాకుండా మన దేశ సామాజిక, రాజకీయ జీవనాలపై కూడా ప్రభావం చూపుతోంది. వామపక్ష ఉద్యమానికి ఇది పెద్ద సవాలుగా పరిణమించింది.
వామపక్షం ఈ పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొంటుంది? వివిధ రకాల అవుట్‌సోర్సింగ్‌ ప్రక్రియల్లో పాలుపంచుకుంటున్న అసంఘటిత రంగంలోని కార్మిక సైన్యానికి చేరువకావడం, వారిని సంఘటితపరచడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. విస్తరిస్తున్న అస్థిత్వ ఆధారిత ధోరణికి విరుద్ధంగా మొత్తం కార్మికుల సార్వత్రిక డిమండ్లపై ప్రధానంగా దృష్టి సారించే ప్రక్రియ కూడా ప్రధానమే. దోపిడీ వ్యవస్థను దీటుగా ఎదుర్కొనేందుకు కార్మికవర్గంలో సమైక్యతను పరిఢవిల్లజేయాలి. అయితే వర్తమాన పరిస్థితుల్లో ఇదొక్కటే సరిపోతుందా?ఒకే విధమైన పనిచేసే దళిత వర్గానికి చెందిన కార్మికునికి లభిస్తున్న వేతనంలో మూడవ వంతు కూడా దళిత వర్గానికి చెందిన కార్మికునికి లభించడం లేదు. కార్మికునికి లభించే వేతనంలో సగం మాత్రమే ఒక కార్మికురాలికి లభిస్తోంది. ముస్లింలు ఉద్యోగాల్లో, విద్యలో, నైపుణ్యం అందించే శిక్షణలో వివక్షతను ఎదుర్కొంటున్నట్లు సచార్‌ కమిటీ నివేదిక పేర్కొంది. ఫలితంగా, ముస్లింలు తక్కువ జీతం లభించే ఉద్యోగాల్లో మాత్రమే ఉపాధి పొందుతున్నారు
కార్మికోద్యమం కార్మికులందరినీ సమీకరించగలిగినపుడే వర్గ సమైక్య నినాదం ఆశించిన ఫలితాలను సమకూరుస్తుంది. దళితుల అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మించాలి. అనేక వివక్షతలు ఎదుర్కొంటున్న ముస్లింలను కూడా ఉద్యమంలో భాగస్వాములను చేయాలి. మహిళా కార్మికుల స్థితిగతులపై కూడా ప్రధానంగా దృష్టి సారించకపోతే నయా ఉదారవాద విధానాలపై పోరాటాలు ముందుకు సాగవు. దళితులు, ముస్లింలు, మహిళలు, గిరిజనులు కావడం వల్ల ఎదురయ్యే వివక్షతలు, అణచివేతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలకు కార్మికోద్యమంలో భాగస్వామ్యం కల్పించాలి. ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే అస్థిత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా వామపక్షాల వ్యూహాలు ఫలించవు. తమ సమస్యలకు తగిన ప్రాధాన్యత లభించకపోతే ఈ వర్గాలు వర్గ సమైక్యతా నినాదం వారికి పట్టదు. నయా ఉదారవాద విధానాల కారణంగా చోటుచేసుకుంటున్న వివక్షతను అర్థం చేసుకుని సమగ్ర పద్ధతిలో వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.
ఈ సామాజిక సమస్యలు వర్గ సమస్యలకు అనుబంధంగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దళితులు, గిరిజనులు చిన్న రైతాంగం, మహిళలు, మైనారిటీలకు చెందినవారుగా ఉంటారు. నయా ఉదారవాద విధానాలు సమాజంపై విస్తృత ప్రభావం చూపుతాయి. ఉత్పత్తి ప్రక్రియ, సామాజిక సంబంధాలను కూడా ప్రభావితం చేస్తాయి. వర్గ దోపిడీకి, సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలను సంఘటితం చేయడం వామపక్షాలు అనుసరించాల్సిన వ్యూహాత్మక పంథా. 
Prajashakti News Paper Dated : 01/05/2012
-బృందా కరత్‌

Thursday, February 2, 2012

ఆకలిపై సంస్కరణల పోటు


లక్షిత వర్గాలను ఉద్దేశించి ప్రవేశపెట్టే నగదు బదిలీ, ఆహార కూపన్లు, లేక ఇతర పథకాలు ఇందులో ఉన్నాయి. ఆహార ధాన్యాలకు బదులుగా వీటిని పంపిణీ చేస్తారు. బయోమెట్రిక్‌ సమాచారంతో విశిష్ట గుర్తింపు కార్డులు జారీ చేసి లబ్ధిదారుల సంఖ్యను వీలైనంతగా కుదించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా వివాదాస్పదమైన విధాన నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించేందుకు ఆహార భద్రతా బిల్లు ఉద్దేశింపబడింది. ఇది అత్యంత అభ్యంతరకరమైన విషయం. ఈ సంస్కరణలను నిర్బంధంగా అనుసరించేందుకు రాష్ట్రాలను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఈ బిల్లు దోహదం చేస్తుంది.

ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టి, స్థాయీ సంఘానికి నివేదించిన 2011 ఆహార భద్రతా బిల్లు ప్రస్తుత ఆకలి, పౌష్టికాహార లోపానికి దారితీసిన ప్రభుత్వ విధానాలకు చట్టబద్ధత కల్పించేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ బిల్లులోని ముఖ్యమైన అంశాలు ఈ విధంగా ఉన్నాయి. 1. లక్ష్యాలు చిన్నవిగా నిర్ణయించుకోవడం, వర్గీకరణ, నిర్వచనాలు కూడా అదే రీతిలో ఉండటం, 2. ఈ పథకం కింద లబ్ధిదారుల ఎంపికకు షరతులు 3. మితిమీరిన అధికార కేంద్రీకరణ, రాష్ట్రాల హక్కులను హరించడం, 4. ఖర్చులు, విలువలను పంచుకోవడం
లక్ష్యాల పెంపు
ఆహార భద్రతకు లక్ష్యాలను నిర్దేశించడం ప్రతికూల ఫలితాలను కలగజేస్తుందని గత అనుభవం తెలియజేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు మరి కొన్ని కొత్త అంశాలను జోడించింది. లక్ష్యాలు ఎంత అసాధ్యమైన స్థాయిలో నిర్ణయించవచ్చో ఈ బిల్లును చూస్తే తెలుస్తుంది. లక్ష్యాలను నిర్ణయించే యంత్రాంగం ఎంత నిర్దయగా వ్యవహరించగలదో కూడా ఇది తెలియజేస్తుంది.
ఇప్పటివరకు ప్రజాపంపిణీ వ్యవస్థలో ఆహార ధాన్యాలను మూడు వర్గాలకు సరఫరా చేస్తున్నారు. వారు పేదరిక రేఖకు ఎగువ ఉన్న వారు (ఎపిఎల్‌), పేదరిక రేఖకు దిగువ ఉన్నవారు (బిపిఎల్‌), అంత్యోదయ. ఇందులో చివరి వర్గాన్ని బిపిఎల్‌ జనాభా నుండి వేరు చేసి వారికి కిలో రెండు రూపాయల చొప్పున 35 కిలోల మొత్తాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన బిల్లు ఈ అంత్యోదయ పథకాన్ని రద్దు చేస్తోంది. ఇక నుండి అంత్యోదయ పథకం కింద లబ్ధి పొందుతున్న 2.5 కోట్ల కుటుంబాలు బిపిఎల్‌ వర్గం కిందకే వస్తాయి. వారు ఇక ముందు కిలోకు అదనంగా ఒక రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. కొత్త రేటు ప్రకారం బిపిఎల్‌ కుటుంబాలు కిలోకు మూడు రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇప్పటివరకు అంత్యోదయ పథకం కింద ఉన్నవారు నెలకు మరో 35 రూపాయలను అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
వర్గీకరణలో ఒంటెత్తు పోకడలు
బిల్లు పరిధిలోకి నాలుగు కేటగిరీలను ఈ బిల్లు తీసుకువచ్చింది. అవి ఇవా ఇలా ఉన్నాయి.
1.బిపిఎల్‌: మొదటి కేటగిరీలో బిపిఎల్‌కు 'ప్రాధాన్యతా వర్గాలు'గా పేరు మార్చారు. ఈ వర్గానికి కుటుంబంలోని వ్యక్తికి ఏడు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు సరఫరా చేస్తారు. అయితే కుటుంబంలోని పిల్లలు ఒక వ్యక్తిగా వస్తారా, రారా అన్న విషయాన్ని స్పష్టంగా నిర్వచించలేదు. బియ్యం అయితే కిలోకు మూడు రూపాయల చొప్పున, గోధుమ అయితే రెండు రూపాయల చొప్పున, చిరు, ముతక ధాన్యాలైతే కిలోకు రూపాయి చొప్పున చెల్లించాల్సి ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో 46 శాతం, పట్టణాల్లో 28 శాతం దేశంలో బిపిఎల్‌ కుటుంబాలున్నాయని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. రాష్ట్రాలవారీగా ఉన్న తేడాలను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అనేక రాష్ట్రాలు ప్రస్తుతం రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. ఈ కొత్త బిల్లు వల్ల ఆ పథకం కింద లబ్ధి పొందుతున్న వారు కూడా కిలోకు మూడు రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే వారు అదనంగా మరో రూపాయి చెల్లించాలి. ఈ విధంగా రాష్ట్రాలు ప్రవేశపెట్టిన రెండు రూపాయల బియ్యం పథకం రద్దవుతుంది.
2.ఎపిఎల్‌: రెండో కేటగిరీలో ఎపిఎల్‌ను 'సాధారణ వర్గాలు'గా పేరు మార్చారు. గ్రామీణ ప్రాంతాల్లో 29 శాతం, పట్టణాల్లో 22 శాతం ఈ వర్గం కింద వస్తారని బిల్లు పేర్కొంది. ఇది ఎపిఎల్‌ కార్డు కలిగి ఉన్న వారి సంఖ్య కంటే తక్కువే. ఇందువల్ల కొత్త బిల్లు అమలులోకి వస్తే ప్రస్తుతం ఎపిఎల్‌ కార్డు ఉన్న అనేక మందికి ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండవు. కార్డును కొనసాగించే అవకాశం ఉన్న కుటుంబాల్లో ఒక్కొక్కరికీ మూడు కిలోల చొప్పున మాత్రమే రేషన్‌ లభిస్తుంది. ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి గరిష్టంగా పదిహేను కిలోల రేషన్‌ మాత్రమే సరఫరా అవుతుంది. ఇది ప్రస్తుతం ఎపిఎల్‌ కార్డు గల వారు పొందుతున్న 35కిలోల కంటే బాగా తక్కువ. కనీస మద్దతు ధరలో సగం రేటు చొప్పున వారి వద్ద నుండి వసూలు చేస్తారు.పెట్టుబడి ఖర్చులు పెరగడంతో కనీస మద్దతు ధరను ప్రభుత్వం ప్రతి సంవత్సరం పెంచుతుంటుంది. ఇందువల్ల ఎపిఎల్‌ కుటుంబాలు ఒక కచ్చితమైన ధరకు రేషన్‌ పొందలేరు. ప్రతి సంవత్సరం వారు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రస్తుతం లభిస్తున్న ధర, పరిమాణంతో పోలిస్తే ఎపిఎల్‌ కుటుంబాలకు నష్టం వాటిల్లుతుంది. కొత్త బిల్లులో మరో అత్యంత అభ్యంతరకరమైన నిబంధన ఉంది. ఎపిఎల్‌ కుటుంబాలకు తగ్గిన సరఫరాలు కూడా సంస్కరణలతో ముడిపడి ఉంటాయి.
3. రేషన్‌ సదుపాయం కోల్పోయే తరగతులు: కొత్త బిల్లు రూపంలో యుపిఎ ప్రభుత్వం కొన్ని కేటగిరీలకు అసలు రేషన్‌ దక్కకుండా చేసింది. ఈ కేటగిరీని ప్రజాపంపిణీ వ్యవస్థలో కొత్తగా ప్రవేశపెట్టారు. గ్రామీణ భారతంలో 25 శాతం మంది, పట్టణాల్లో 50 శాతం మంది ఈ వర్గం కిందకు వస్తారు. ఈ బిల్లు వీరికి రేషన్‌ను పూర్తిగా నిలిపివేస్తుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తుంది. ఈ మినహాయింపుకు ఆహార భద్రతా బిల్లు చట్టబద్ధత కల్పిస్తుంది.
4.బిపిఎల్‌ జనగణన కింద మినహాయింపు పొందే కేటగిరీలు: ఈ మూడు వర్గాలు కాకుండా కొత్త బిల్లు మరో కేటగిరీనీ రూపొందించింది. బిపిఎల్‌ కులగణనలో రూపొందించిన ప్రశ్నావళి ఈ కొత్త కేటగిరీ ఆవిర్భావానికి అవకాశం కల్పించింది. ప్రజాపంపిణీ వ్యవస్థ నుండి రేషన్‌ పొందేందుకు అర్హత కోల్పోయే కొన్ని కేటగిరీలను ఈ కులగణన నిర్దేశించింది. ఈ ప్రశ్నావళిలోని కొన్ని ప్రశ్నలు అత్యంత సమస్యాత్మకంగా ఉన్నాయి. ఈ ప్రక్రియ ద్వారా రేషన్‌కు అర్హులైన వారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం, పట్టణాల్లో 50 శాతం స్థాయిని మించకపోతే అసలు భద్రతా చట్టం పరమార్థం ఏమిటి? ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని పూరించేందుకు ఈ నాల్గవ కేటగిరీ దోహదం చేస్తుంది. బిపిఎల్‌ జనగణన ప్రకారం లక్షిత వర్గాలకే రేషన్‌ అందుబాటులో ఉంటుంది.
ఈ ఒంటెత్తు పోకడకు సంబంధించి నైతిక అంశాలతోపాటు విస్తృత ఆహార భద్రతా హక్కును గుర్తించాల్సి ఉంది. ఆర్థిక, పరిపాలనాపరమైన అంశాల పరంగా చూసినా రేషన్‌ పొందే ప్రజలను బహుళ కేటగిరీలుగా విభజించడం అదనపు వ్యయానికి, రేషన్‌ దుర్వినియోగానికి, అవినీతికి దారితీస్తుంది.
నిర్వచనాల్లో అసంబద్ధత
ఈ బిల్లులోని నిర్వచనాల విభాగం లక్ష్యాల నిర్దేశం ఎంత లోపభూయిష్టంగా ఉందో విశదం చేస్తుంది. 'ప్రత్యేక కేటగిరీల' విభాగంలో కొన్ని కేటగిరీలకు తప్పనిసరిగా రేషన్‌ పొందే సదుపాయం కల్పించారు. అయితే వీరిని నిర్వచించడం ఎలా? ఆకలితో అలమటించేవారికి రోజూ రెండు ఫుల్‌మీల్స్‌ సదుపాయం కల్పించారు. వీరిని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాల్సి ఉంది. ఆకలితో అలమటించడాన్ని ఒకటవ అధ్యాయం 2(24) క్లాజు నిర్వచించింది. ఒక మనిషి ప్రాణానికే ముప్పుగా పరిణమించే రీతిలో దీర్ఘకాలం ఆహారం అందుబాటులో లేకపోవడాన్ని ఆకలితో అలమటించడంగా ఈ క్లాజు నిర్వచించింది. అయితే ఆహారం అందుబాటులో లేకపోవడం స్వచ్ఛంద చర్యల ఫలితం కాకూడదని ఈ క్లాజు నిర్దేశించింది. ప్రాణంతో బతికి ఉండటం కష్టమని ఎవరు నిర్ణయిస్తారు? నేడు ఒక వ్యక్తి ఆకలి చావుకు గురైనా ఆ వ్యక్తి ఇంకేదో కారణంతో మరణించినట్లు ప్రభుత్వ మీడియా ప్రచారం చేస్తుంది. ఆకలిచావు సంభవించినట్లు అత్యంత అరుదుగా మాత్రమే గుర్తిస్తారు. మరి అర్ధాకలితో ఉంటున్న వారి సంగతి ఏమిటి? ఈ బిల్లు కింద ప్రయోజనం పొందేందుకు వారు పూర్తిగా ఆకలితో అలమటించే స్థాయికి చేరుకోవాల్సిందేనా? అది అలా ఉంచితే అనాథల మాటేమిటి? మూడవ అధ్యాయం 8(ఎ) క్లాజులో అనాథ అయిన ఒక వ్యక్తి రోజుకు కనీసం ఒక సారి భోజనానికి అర్హుడని స్పష్టం చేస్తుంది. అంటే ఆకలితో అలమటించేవారికి, అనాథలకు మధ్య స్పష్టమైన తేడాను ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది. ఆకలితో అలమటించేవారు రెండు భోజనాలకు అర్హులు కాగా అనాథలు ఒక్క భోజనానికి మాత్రమే అర్హులు. ఒకటవ అధ్యాయంలోని 2(3) క్లాజు అనాథలను ఈ విధంగా నిర్వచించింది. 'జీవించడానికి అవసరమైన ఆహారం తీసుకోవడానికి ఎటువంటి వనరులు, సదుపాయాలు లేకుండా, జీవించలేని లేదా ఆకలిచావుకు గురికాలేని పరిస్థితిలో ఉన్నవారు''. సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా ఆహారం అందుబాటులో లేకపోవడంతో ఆకలితో అలమటించడానికి, ఆహారం అందుబాటులో లేకపోవడానికి మధ్య తేడా ఉంటుందని చెప్పగలరా?అయితే ప్రపంచబ్యాంక్‌ సుశిక్షితులైన వారు, అంతగా పరిజ్ఞానం లేని ఆర్ధికవేత్తలు వీరిలో తేడా గుర్తిస్తారు. సమానంగా ఆకలిగొన్న వ్యక్తుల్లో రెండు పూటల ఆహారానికి అర్హులు, ఒక పూట మాత్రమే పొందడానికి అర్హులను గుర్తించగలరు. ఇది నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు, లక్షిత విధానాల మౌలిక విధానం. ప్రజలు ఎలా ఆహారం తీసుకుంటారు, వారు ఆకలితో అలమటిస్తున్నారా లేక అనాథలా, లేక ఒక పూట మాత్రమే భోజనం తినేందుకు అర్హత ఉన్నప్పటికీ రెండు పూటలా తింటూ ఖజానాకు నష్టం తెస్తున్నారా అన్న విషయాన్ని నిగ్గుతేల్చేందుకు తనిఖీదారులు వస్తారు. 1930 దశకంలో పెట్టుబడిదారీ సంక్షోభం తలెత్తి మహా మాంద్యం ఏర్పడినపుడు అమెరికాలో ఉచిత సూప్‌ వంటశాలలను నిర్వహించారు. అయితే ఆకలిగొన్న వారని నిరూపించుకునేందుకు కార్డు చూపించాల్సిన అవసరం లేకుండానే వంటశాలల్లో వారికి ప్రవేశం కల్పించారు. అవసరమున్న వారు మాత్రమే ఆహారం కోసం క్యూలో నిలబడతారని ప్రభుత్వం భావించింది. సంక్షేమ పథకాల్లో, సబ్సిడీల్లో కోత పెట్టే సమయాల్లో ఆ సునిశితత్వం కూడా ప్రస్తుత నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అవలంభించేవారిలో కరువైంది. నయా ఉదారవాద ఆర్ధిక విధానాలే ప్రభుత్వాలను కట్టిపడవేసే మంత్రంగా తయారైంది.
ప్రపంచంలో పోషక పదార్థాలు అందుబాటులో లేని దేశాల్లో అగ్రగామిగా పేరుగాంచిన మన దేశంలో స్వల్ప సంఖ్యలో ప్రజలకు ఉచిత ఆహారం అందించడం కూడా పూర్తిగా సరిపోని చర్యే. అంతకంటే ఉదారంగా ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వారికి తక్కువ ధరకు ఆహారధాన్యాలు నిత్యావసర సరుకులను కూడా అందించడం వంటి మరి కొన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఆహార భద్రతా బిల్లు అందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంది.
హక్కులను సంస్కరణలతో ముడిపెట్టడం
ఇంతకుముందు ముసాయిదాలోని ఒక కొత్త అంశం ఆహార భద్రతా బిల్లులో చోటుచేసుకుంది. ఎపిఎల్‌ కేటగిరీకి ఆహార పదార్థాల కోటాను గణనీయంగా తగ్గించినప్పటికీ వాటిని కూడా సంస్కరణల ప్రక్రియతో ముడిపెట్టారు. సాధారణ కేటగిరీ కిందకు వచ్చే కుటుంబాల వారికి ప్రజాపంపిణీ వ్యవస్థ కింద సరఫరా చేసే రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్దేశించే సంస్కరణలకు ముడిపెట్టవచ్చని రెండవ అధ్యాయం 3(3) క్లాజు స్పష్టం చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థలో సంస్కరణలు అనే పేరుతో రూపొందించిన ఏడవ అధ్యాయం కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రకాల సంస్కరణలను నిర్దేశించింది. లక్షిత వర్గాలను ఉద్దేశించి ప్రవేశపెట్టే నగదు బదిలీ, ఆహార కూపన్లు, లేక ఇతర పథకాలు ఇందులో ఉన్నాయి. ఆహార ధాన్యాలకు బదులుగా వీటిని పంపిణీ చేస్తారు. బయోమెట్రిక్‌ సమాచారంతో విశిష్ట గుర్తింపు కార్డులు జారీ చేసి లబ్ధిదారుల సంఖ్యను వీలైనంతగా కుదించడం ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ప్రజాప్రయోజనాలకు విరుద్ధంగా వివాదాస్పదమైన విధాన నిర్ణయాలకు చట్టబద్ధత కల్పించేందుకు ఆహార భద్రతా బిల్లు ఉద్దేశింపబడింది. ఇది అత్యంత అభ్యంతరకరమైన విషయం. ఈ సంస్కరణలను నిర్బంధంగా అనుసరించేందుకు రాష్ట్రాలను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఈ బిల్లు దోహదం చేస్తుంది. 
-బృందాకరత్‌