Showing posts with label ముస్లిం. Show all posts
Showing posts with label ముస్లిం. Show all posts

Thursday, October 31, 2013

విభజనతోనే ముస్లింల వికాసం By -మహమ్మద్ అజ్గర్‌అలీ

ఆధునిక ఆంధ్రవూపదేశ్‌లో 1950 తరువాత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కొన్ని విచిత్ర అంశాలు కన్పిస్తాయి. 1953, 1969,1972 లలో విభజనను పూర్తిగా సమర్ధించిన వారు, 2013లో విభజన ప్రకటన వచ్చిన తరువాత సీమాంధ్ర ప్రాంత వాసులు సమైక్యతా వాదులుగా మారారు! నిజంగా ఇది వారి హృదయాలలోంచి వచ్చిందేనా? సీమాంవూధలోని అన్నీ వర్గాల ప్రజలు సమైక్య వాదాన్ని సమర్థిస్తున్నారా? అయితే ఇరుప్రాంతాల్లోని ముస్లింలు ఏం కోరుకుం టున్నారు? వారి చారిత్రక,జీవన పరిస్థితులేమిటి?

రాష్ట్ర జనాభాలో ముస్లింల జనాభా దాదాపు 13శాతం వరకు ఉంది. తెలంగాణ ప్రాంతంలో ముస్లింలు, కోస్తా ప్రాంతం కన్నా అధికంగానే ఉన్నారు. హైదరాబాద్‌లో 40శాతానికి పైగా ముస్లిం జనాభా ఉంది. పాతబస్తీలో 90శాతం వరకు ముస్లింలున్నారు. అన్ని తెలంగాణ జిల్లాల్లో కూడా ముస్లింలు గణనీయంగా ఉన్నా రు. కానీ తెలంగాణ ఉద్యమంలో వీరి పాత్ర స్వల్పంగానే కనిపిస్తుంది. ఎంఐఎం తెలంగాణ ఏర్పాటును వ్యతేరేకించింది. రాష్ట్రం విడిపోరాదని, విడిపోతే ‘రాయల తెలంగాణ’ ఏర్పాటు చేయాలని కోరింది. ఎట్టి పరిస్థితులలోనూ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ఒప్పుకోమన్నా రు. ఉద్యమానికి మూలస్తంభంగా పరిగణించే టీఆర్‌ఎస్‌లో కూడా ముస్లిం నాయకులు వేళ్లమీద లెక్కించే సంఖ్యలోనే ఉన్నా రు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ నిలబెట్టిన ముస్లిం అభ్యర్థి పరాజయం పొందాడు. తెలంగాణ ఏర్పడితే నక్సలిజం పెరుగుతుందని, బీజేపీ ప్రాబ ల్యం పెరుగుతుందనే ప్రచారం కూడా జరిగింది. బీజేపీ అగ్ర నాయకులు సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్, నరేంద్ర మోడి మొదలగు వారు తెలంగాణలో పర్యటించారు. తెలంగాణకు మద్దతు ప్రకటించారు. మొత్తం మీద పరిశీలిస్తే తెలంగాణ ఉద్యమంలో ముస్లింల పాత్ర స్వల్పంగానే ఉన్నదని చెప్పవచ్చు. ముస్లిం విద్యాధికులు తెలంగాణ ఏర్పాటును ఆమోదించినా, ముస్లిం సామాన్య ప్రజలలో తెలంగాణవాదం మిగతా వర్గాల ప్రజలతో పోలిస్తే అంతగా లేదు.
ddre21

ఇక సీమాంధ్ర ప్రాంతానికి వస్తే.. ముస్లింల జనాభా 5-6శాతం కన్నా ఎక్కువ లేదు. వీరిలో 95శాతం మంది చేతి వృత్తుల మీద ఆధారపడిన వారు. అక్షరాస్యత అధికంగా లేదు. రాయలసీమ ప్రాతం, దక్షిణ కోస్తాలో ముస్లింలు కొంత ఎక్కువగా కన్పిస్తారు. గోదావరి జిల్లాలలో, ఉత్తరాంధ్రలో అతి స్వల్పం. కానీ సమైక్య ఉద్య మంలో వీరి పాత్ర అధికంగా ఉంది. ముఖ్యంగా రాయలసీమలోని అన్నీ జిల్లాలలోనూ, గుంటూర్,కృష్ణ జిల్లా, విశాఖపట్నంలో జరిగే ఉద్యమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. మసీదులలో, ముస్లిం జమాత్‌లలో, రోడ్ల మీద నమాజులు చదువుతున్నారు. దువా చేస్తున్నారు. ముస్లిం మతపెద్దలు, శాసన సభ్యులు నిరసన ప్రదర్శనలలో పాల్గొంటున్నారు.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని కోరుతున్నారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి ‘ఓట్ బ్యాంక్’ గా పరిగణించబడే వీరు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు నిర్వహించే నిరసన ప్రదర్శనలలో అదికంగా కన్పిస్తున్నారు. ముస్లిం స్త్రీలు, పురుషులు, విద్యార్థులు, విద్యార్థినులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. కింది తరగతి, ఉన్నత తరగతి అనే తేడా లేకుండా, అన్నీ వర్గాలవారు, అన్నీ వృత్తులకు చెందిన ముస్లింలు పాల్గొంటున్నారు.

ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన వివిధ కమిటీల నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింల సామాజిక,ఆర్థిక, విద్యా, ఉద్యోగ స్థితిగతులు ఎస్సీ, ఎస్టీ, బీసీల కన్నా దారుణంగా ఉన్నాయి. ముస్లింలలో ఉన్నత విద్యావంతులు, వృత్తి నిపుణుల సంఖ్య అత్యంత స్వల్పంగా ఉంది, రాష్ట్ర సర్వీసులలోని ముస్లిం ఉద్యోగస్తుల సంఖ్య 1-3శాతం కన్నా తక్కువగా ఉంది. ముస్లింలకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించటానికి రాష్ట్రంలో అనేక అడ్డంకులను ఎదుర్కొనవలసి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కోర్టు స్టే పైనే రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ముస్లింలలో కూడా అందరికీ రిజర్వేషన్లు లేవు. కొన్ని వర్గాల వారికి మాత్రమే రిజర్వేషన్లు వర్తింప చేస్తున్నారు. పఠాన్, సయ్యద్‌లకు రిజర్వేషన్లు లేవు. షేక్‌లకు మాత్రమే ఉన్నాయి. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేష న్లు ఉన్నా, సచార్ కమిటీ, రంగనాథ మిశ్రా కమిటీ సూచనల మేరకు కేంద్ర సర్వీసులలో ఇంకా రేజర్వేషన్లు కల్పించబడలేదు. పోలీసు,పారామిలిటరీ, మిలిటరీ దళాలలో ముస్లింల సంఖ్య పెరగడంలేదు. పైగా ఇటీవల జరిపిన సర్వేలో రక్షణ దళాల లో వీరి సంఖ్య గత పదేళ్లలో తగ్గింది.

ఆంధ్ర ప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించటానికి జరిగిన ఉద్యమాలను, ఆందోళనలను పరిశీలిస్తే..,ఆ ఆందోళనలలో సీమాంవూధలోని ముస్లిం జనసమూహం నిర్వహించిన పాత్ర చాలా తక్కువ. కానీ ప్రస్తుత సమైక్యతా ఉద్యమంలో కాస్త ఎక్కువగానే పాల్గొంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, ఇతర నగరాలలోని ముస్లింలు రిజర్వేషన్ల కోసం ముఖ్యంగా అర్బన్ ప్రాంతాలలోని ముస్లిం విద్యాధికులు రిజర్వేషన్ల కోసం పోరాడారు. తమ జీవనం, అభివృద్ధి, చదువు, ఉద్యోగాలు, తమ భవిష్యత్తో ముడిపడిన రిజర్వేషన్ల కన్నా, సీమాంధ్ర ముస్లింలకు సమైక్య ఉద్యమంలో ఏం కనిపిస్తున్నదో అంతుపట్టడం లేదు.
విభజన జరిగితే రాయలసీమ ఎక్కువగా నష్టపోతుందని, నీటి కొరత ఏర్పడుతుందని,ఉద్యోగావకాశాలు తగ్గుతాయని భ్రమపడుతున్నారు. కానీ కోస్తా ముస్లిం లు ఏ కారణాలతో ఉద్యమిస్తున్నారో అర్థం కావటం లేదు. రాష్ట్రం విడిపోతే ముస్లిం లకు వచ్చే నష్టాలు ఏంటి అనేది ఒక ప్రశ్న?

విభజన జరిగినా కోస్తా ముస్లింలకు వచ్చే నష్టం లేదు. నీటి కొరత ఏర్పడదని, ఉన్న ప్రాజెక్టులకు నికర జలాల విషయంలో ఎటువంటి తేడా ఉండదని నీతిపారుదల నిపుణులు చెబుతున్నారు. సమస్యలు వస్తే తీర్చటానికి నిపుణుల కమిటీలు ఉన్నాయి కదా అంటున్నారు. ఉద్యోగాల విషయంలో హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభు త్య ఉద్యోగాలు చేయటానికి జోనల్ విధానం అడ్డు వస్తుంది. 610 జీవో కింద ఉన్నవారే వెనకకు వస్తున్నారు. కేంద్ర ఉద్యోగాలలో, విద్యాలయాలలో అందరికీ సమా న అవకాశాలు ఉంటాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగాల విషయానికి వస్తే.. ఆర్హతలు ఉంటే హైదరాబాద్‌లో మిగతా వారికన్నా ముస్లింలకే ఆధిక అవకాశాలున్నాయి. భాష, సంస్కృతి, ప్రయోజనాన్ని అధికంగా పొం దవచ్చు. ఇతరులకన్నా మిన్నగా ముస్లిం లు ఎటువంటి ఆందోళన పడవలసిన అవసరం లేదు. హైదరాబాద్‌లో ముస్లింలకు ప్రయోజనాలు లేవనుకున్నా నష్టాలు మాత్రం లేవు.

రాష్ట్ర విభజన జరిగి, రాజధాని కర్నూల్ వచ్చినా, విజయవాడ-గుంటూరు మధ్య వచ్చినా,ఒంగోలుకు వచ్చినా ముస్లింలకే ఆధిక ప్రయోజనం. ఆ ప్రాంతాలలో వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో 50కిలోమీటర్ల మేర ముస్లింల జన సంఖ్య అధికంగా ఉంటుంది.ఆ ప్రాంత జనసంఖ్యలో దాదాపు 15-20 శాతం ఉంది. రాష్ట్ర విభజనతో ముస్లింల భూములు, ఆస్తుల విలువలు పెరుగుతాయి. వ్యాపారాలు, చిన్న, చేతి వృత్తుల పరిక్షిశమలు, ఆటోనగర్, పౌండ్రీ లు అభివృద్ధి చెం దుతాయి. పిల్లలకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. శాసన సభలో కూడా ముస్లింల ప్రాతినిధ్యం పెరుగుతుంది. ముస్లింలచే స్థాపించబడి, నడపబడుతున్న ఉన్నత విద్యాలయాలు, వృత్తి విద్యా కళాశాల లు, మదరసాలు వృద్ధిచెందుతాయి. ప్రస్తుతమున్న సమైక్య ఆంధ్రప్రదేశ్ కన్నా.. రేపు విడిగా ఏర్పడే సీమాంధ్ర, తెలంగాణలో వీరి అభివృద్ధి నిజంగా తగ్గుతుందా, లేదా విభజన ద్వారా ఆధిక ప్రయోజనం కలుగుతుందా అనేది కాలమే సమాధానం చెబుతుంది.
ఈమధ్యనే ఒక మేధావి అన్నట్లు మతం ఒకటైనా, ఉర్దూ, తెలుగు-ఉర్దూ మాట్లా డే తెలంగాణ ముస్లింలకు, ఉర్దూ, తెలుగు-ఇంగ్లిష్ మాట్లాడే ఆంధ్ర ముస్లింలకు విభజన, సమైక్యతల మధ్య సరియైన అవగాహన రాలేదా? తమది కాని సమైక్య ఉద్యమంలో ఎందుకు పాల్గొంటున్నారో ఇప్పటికైనా ఆలోచిస్తే మంచిది. విభజన తోనే ముస్లింలు అభివృద్ధి చెందుతారని గుర్తెరగాలి.
Namasete Telangana Telugu News Paper Dated: 31/10/2013 

Monday, April 22, 2013

దళిత ముస్లింల దుస్థితి By షేక్ సత్తార్ సాహెబ్



తమ జీవనోపాధికి అపరిశుభ్రమైన వృత్తుల్లో ఉన్న సుమారు 60 ముస్లిం కులాలను ఆంధ్రప్రదేశ్‌లో దళిత ముస్లింలుగా గుర్తించి ఉన్నారు. ఉదాహరణకు, దూదేకుల (కాటన్ క్లీనర్స్), హజామ్ (బార్బర్ లేక మంగలి), ఫకీరు బుడిబుడిక్కి, పాములు ఆడించేవారు, ఎల్లుగొడ్లు ఆడించేవారు, గారడీ చేసేవారు, మెహతర్ (పాకీ పనిచేసేవారు),అత్తరు అమ్మేవారు, బండలుకొట్టేవా రు, బోరేవాలా తదితరులు. ఆనాటి రాష్ట్రపతి ఉత్తర్వులద్వారా ఈ ఎస్సీ రిజర్వేషన్‌ను హిందూమతంలో ఉన్న దళిత కులాలకు మాత్రమే పరిమితం చేసి హిందూ మతేతర దళిత ముస్లింలు, దళిత క్రిష్టియన్లు, దళిత సిక్కులు, దళిత బౌద్ధ కులాలను తొలగించారు. బ్రిటిష్ ప్రభుత్వకాలం నుంచి కొసాగుతున్న ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను స్వాత్రంత్యానంతరం రాష్ట్రపతి కలం పోటుతో తొలగించి హిందూమతేతర దళితుల వెన్ను విరిచేశారు.

1950 నుండి రిజర్వేషన్‌లకు దూరమై ఈ దళిత ముస్లిం కులస్థులు నేటికి ఎస్సీ, ఎస్టీలకన్న అత్యంత దుర్భర జీవితాన్ని గడుపుచున్నారు. జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ తన నివేదిక- అపరిశుభ్రమైన (అన్ క్లీన్ ఆక్యుపేషన్స్) వృత్తుల ద్వారా జీవనాన్ని గడుపుతున్న దూదేకుల, హజామ్, ఫకీరు బుడిబుడిక్కి మొదలగు దళిత ముస్లింలను ఎస్సీ రిజర్వేషన్‌ను తొలగించినందువల్ల వారు ఎస్సీ, ఎస్టీల కన్నా అన్ని రంగాలలో దారుణంగా వెనుకబాటుకు గురయివున్నారని నివేదించింది.సచార్ కమిటి నివేదిక ప్రకారం దళిత ముస్లిం అక్షరాస్యులలో సుమారు 70 శాతం మంది విద్యార్థులు10వ తరగలి వరకే పరిమితమవుతున్నారు. డ్రాప్ఔట్స్ 70 శాతంగా ఉన్నాయి. కొద్దిమంది మాత్రమే ఇంటర్ మీడియట్, డిగ్రీ, పిజి వరకు వెళ్ళగలుగుతున్నారు. ఇక ఉన్నత ఉద్యోగాల్లో- ఐఎఎస్, ఐపీఎస్‌లో 1950 నుంచి ఇప్పటివరకు ఒక్కరు కూడా లేరు. దళిత ముస్లింలలోని దూదేకుల లాంటి కులాలలో ఎక్కువశాతం చప్రాసీలుగా, అటెండర్‌లుగా, స్వీపర్లుగానే పనిచేస్తున్నారు. క్లర్క్‌స్థాయి ఉద్యోగులు అతికొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఆధునిక పరిశ్రమల వలన వారి వారి వృత్తులు కోల్పోయి రైతు కూలీలుగా, హమాలీలుగా, రోజువారి కూలీలుగా, శాశ్వతఉపాధి లేని కూలిపనులకే పరిమితమై ఉన్నారు. నేటికి ఈ కులాలలో నుంచి పారిశ్రామిక వేత్తగా ఎదిగిన వారు ఒక్కరూ లేరంటే, అది వీరి పట్ల అణచివేతకు నిదర్శనం. దళిత ముస్లింల అభివృద్ధి ఆమడ దూరంలోఉన్నా, అవమానాలు, అవహేళనలు మాత్రం అడుగడుగునా అన్ని రూపాల్లో వెంటాడుతూనే ఉన్నాయి. మన రాష్ట్రంలో ముస్లిం జనాభా సుమారుగా కోటిపై చిలుకే ఉన్నట్లు అంచనా. వీరిలో సుమారు 70 శాతం దళిత వర్గానికి చెందిన ముస్లింలే. వీరికి కాంగ్ర్‌స్ పార్టీగాని, తెలుగుదేశం పార్టీగాని, బీజేపి గానీ, వైఎస్సార్ సిపీ గాని, టీఆర్ఎస్ గానీ ఒక్కరికీ ఎమ్మెలే సీటు కేటాయించి గెలిపించిన దాఖలాలు లేవు. అసలు పట్టించుకొనే నాయకుడు గాని, పార్టీ గానీ లేదు.1950లో రాష్ట్రపతి ఉత్తర్వు లుఎస్సీ రిజర్వేషన్‌ను కేవలం హిందూ మతంలోని దళితులకు పరిమితం చేశాయి. కానీ 1956లో సిక్కు మతం స్వీకరించిన దళిత సిక్కులకు, 1990లో బౌద్ధ మతం స్వీకరించిన దళిత బౌద్ధులకు ఈ ఉత్తర్వును సవరించి కేంద్ర ప్రభుత్వం తిరిగి ఎస్సీ రిజర్వేషన్ కల్పించింది. సచార్ కమిటీ నివేదిక ఆధారంగా మరింత విస్తృతంగా అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన జస్టిస్ రంగనాథమిశ్రా కమిషన్ తన నివేదికలో దళిత సిక్కులకు, దళిత బౌద్ధులకు ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చిన విధంగా దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ రిజర్వేషన్‌ను తిరిగి కల్పించాలని సిఫారసు చేసింది, 2009లో నాటి ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖర రెడ్డి, దళిత క్రిష్టియన్లకు, దళిత ముస్లింలకు ఎస్సీ స్టేటస్ రిజర్వేషన్ ఇవ్వవలసినదిగా ఏకగ్రీవ తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదింపచేశారు.ఆయన మరణంతరువాత ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి పంపలేదు.

జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసుల ఆధారంగా కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ 180/2004కు జవాబు అఫిడవిట్ ద్వారా దాఖలు చేయాలి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో దళిత క్రిష్టియన్‌లకు, దళిత ముస్లింలకు యస్‌సిరిజర్వేషన్ ఇవ్వాలని 2009లో చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రప్రభుత్వానికి పంపాలి. రాజేందర్ సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా సిఫారసులు అమలు చేస్తూ నాటి రాష్ట్రపతి యస్. సి. ఉత్తర్వులోని పేరా 3ను తొలగించి, దళిత క్రిష్టియన్‌లకు దళిత ముస్లింలకు తొలగించిన యస్.సి. రిజర్వేషన్‌ను కల్పించాలి.దళిత సిక్కులకు, దళిత బౌద్ధులకు ఇచ్చిన విధంగా దళిత క్రిష్టియన్‌లకు, దళిత ముస్లింలకు యస్.సి. రిజర్వేషన్ కల్పించాలి. మతం మారినా కులం మారదు కనుక దళిత క్రిష్టియన్ల పై, దళిత ముస్లింలపై ఉన్న నిబంధనలను ఎత్తివేయాలి. ఎ.పి. నూర్‌బాష్/ దూదేకుల కు రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసి, ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి. నుర్‌బాష్/ దూదేకుల/ లద్దాఫ్/ పింజారి ముస్లింలకు జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో సీట్లు కేటాయించాలి, నామినేటెడ్ పదవుల్ని కేటాయించాలి. మైనారిటీ విద్యాసంస్థలలో వీరి విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. వీరికి అన్ని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమి, హజ్ కమిటి, వక్ఫ్‌బోర్డులో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. అన్ని కౌన్సిలింగ్‌లలో బి.సి.ఇ.లో మిగిలిపోతున్న మెడికల్/ ఇంజనీరింగ్ తదితర కోర్సులకు సీట్లు కేటాయించాలి. ఉద్యోగ ఖాళీలను అదే సామాజిక వర్గానికి చెందిన విసిఎ/ బిసిబికి చెందిన వారితో భర్తీ చేయాలి.



షేక్ సత్తార్ సాహెబ్
దళిత ముస్లిం యస్.సి రిజర్వేషన్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు


Surya Telugu News Paper Dated: 23/4/2013

Monday, December 17, 2012

స్వార్థ రాజకీయ క్రీడలు - కనీజ్ ఫాతిమా



కాంగ్రెసైనా, టీడీపీ, టీఆర్ఎస్, ఎంఐఎం అయినా అన్ని పార్టీలతో ముస్లింలు బాధలు పడి విసిగిపోయారు. నేతలు అధికారంలో బలపడ్డం తప్ప సామాన్య ముస్లింల జీవితంలో ఎలాంటి పురోగతి లేదు. అందుకే నేతల మురికి రాజకీయాలను అర్థం చేసుకోవాలి. ఈ నేతలు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మన జ్ఞాపక శక్తి కోల్పోకూడదు. వారి చర్యలను ప్రశ్నించాలి. మేము కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదనే సంగతి వాళ్లకు అర్థమయ్యేలా చేయాలి. 

హైదరాబాదు ప్రస్తుత పరిస్థితి గురించి ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ మహానగరంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితిలో హైదరాబాదులో ఏం జరుగుతుందో విమర్శనాత్మకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మతతత్వ వ్యాప్తి, మురికి రాజకీయాలు, అన్ని పార్టీలు ఆడుతున్న రాజకీయ ఆటల వల్ల ఈ పరిస్థితి దాపురించిందా లేదా మరేదైనా కారణం ఉందా? హైదరాబాదు సామాన్యులు, ముఖ్యంగా ముస్లింలు పడుతున్న బాధలతో పాటు గత రాజకీయ పరిస్థితులను పూర్వావలోకనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హైదరాబాదు ప్రతిబింబిస్తుందని చెప్పొచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో వస్తున్న కొన్ని ముఖ్యమైన పరిణామాలను ఈ పరిస్థితులు సంకేతిస్తున్నాయి. అన్ని పార్టీల అధినేతలు ఇతరుల నుంచి ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు రాజకీయ యాత్రలు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి సంబంధం లేని ఈ యాత్రలను సరిగ్గా అర్థం చేసుకోవాలి. 

వందలాది మంది అమాయక యువకులను అపహరించిందీ, చట్టవిరుద్ధంగా నిర్బంధించిందీ, అమానవీయంగా హింసించిందీ రాజశేఖర్ రెడ్డి కాలంలోనే అన్న సంగతిని ఎవరూ మరిచిపోవద్దు. ఆయన పాలనలో ముస్లింలను లక్ష్యంగా చేసుకొన్న దుర్మార్గం గురించి ఏ పార్టీ ప్రశ్నించలేదు. అంతేకాదు వటోలిలో ఒక ముస్లిం కుటుంబాన్ని హిందూత్వ శక్తులు సజీవ దహనం చేసిందీ వైఎస్ పాలనలోనే. నేటికీ ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. ఫార్మసీ విద్యార్థి అయేషామీరాను దారుణంగా హత్య చేసిందీ అదే పాలనలో. ఈ కుటుంబానికి కూడా నేటికీ న్యాయం అందలేదు. దేశం సంగతి వదిలేయండి, రాష్ట్రంలో లౌకికత్వం ఎక్కడుంది? తండ్రి మరణించిన తర్వాత జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. అధిష్టానం సీఎం పదవి ఇవ్వకపోవడంతో తన రాజకీయ బలం చూపించేందుకు 'ఓదార్పు' యాత్రను నిర్వహించాడు. తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నప్పటికీ తన కుటుంబ సభ్యులు ఓట్లు కొల్లగొట్టేందుకు పాదయాత్ర చేస్తున్నారు. వాళ్ల రాజకీయ లబ్ధి కోసం అమాయక ప్రజలను అవమానిస్తున్నారు.

తిరిగి అధికారంలోకి రావాలని చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' యాత్ర మొదలు పెట్టారు. హైదరాబాదులో హైటెక్ సిటీ మీద ఆయన శ్రద్ధ పెట్టిన కాలంలోనే రైతులు దుర్భరమైన కష్టాలను చవిచూశారు. పాతబస్తీలోని అనేక ప్రభుత్వ కార్యాలయాలను కొత్త బస్తీకి తరలించింది ఈయనే. గుజరాత్‌లో ముస్లిం నరమేధం సందర్భంలో ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిం చకపోవడంపై నేటికీ పశ్చాత్తాప పడడం లేదు. అధికారంలోకొస్తే ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తానని అంటున్నారు. కానీ ఆయన పార్టీలో ముస్లింలు నామమాత్రంగానే ఉన్నారు. ఈయన కాలంలోనే ఎన్‌కౌంటర్ల పేరుతో ముస్లింలను హత్య చేశారు. ముస్లిం సమాజం మీద నిఘా పెట్టేందుకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులతోనూ ముస్లిం వ్యతిరేకులైన అధికారులతోనూ ప్రత్యేక బృందాలను చంద్రబాబు ఎందుకు ఏర్పాటు చేశారు? హరేన్‌పాండ్యే హత్య కేసులో తప్పుడు ఆరోపణలతో అమాయక ముస్లిం యువకులను అరెస్టు చేసి గుజరాత్ పోలీసులకు అప్పగించారు?

2007లో జరిగిన మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసు విచారించే పేరుతో అమాయక ముస్లిం యువకులను చట్టవిరుద్ధంగా బంధించి అమానవీయంగా హింసిస్తే అసెంబ్లీలో గొంతు విప్పడానికి ఏ కారణం వల్ల నిరాకరించారు? అందుకు తన పార్టీ ముస్లిం నేతలే సాక్ష్యం. నగరంలో మత హింసను రేపుతున్న రాజా సింగ్, శ్రీనివాస రావులు తన పార్టీ వారే అయినా ఎందుకు వారి మీద చర్య తీసుకోవటం లేదు? అయేషా మీరా మీద దారుణ అత్యాచారం చేసి హత్య చేస్తే చంద్రబాబు ఎందుకు నోరు మూసుకున్నారు? ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి 2009 ఎన్నికల ప్రచారం కోసం వారిని ఉపయోగించుకున్నారు. చంద్రబాబును ఏ రకంగా లౌకికవాదివో చెప్పమని ముస్లింలు నిలదీయాలి.

ఇక కేసీఆర్ పెద్ద రాజకీయ జూదరి. తెలంగాణ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఆయనను ఎవరు ప్రశ్నించినా తెలంగాణ వ్యతిరేకులని ముద్రవేసే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తానని ప్రకటించినప్పటికీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. మహబూబ్‌నగర్‌లో ముస్లిం అభ్యర్థి ఓటమికి కేసీఆర్, రాజకీయ జేఏసీ బాధ్యులు. ముస్లిమనే కారణంతో టీఆర్ఎస్ సీనియర్ నేతను ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్, ఆయన పార్టీ సభ్యులే ఓడించారు. తెలంగాణ పేరుతో మతతత్వ పార్టీతో ఆయన జట్టుకట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలైన తర్వాతే మతతత్వ పార్టీ బలపడ్డది. అందుకు టీఆర్ఎస్‌దే బాధ్యత. ఈ మూడేళ్ల తెలంగాణ ఉద్యమ కాలంలోనే ముస్లింల మీద అనేక దాడులు జరిగాయి. లౌకికవాద ముసుగు తగిలించుకొన్న అనేక మంది నిజరూపం బహిర్గతమైంది కూడా తెలంగాణ ఉద్యమం వల్లే. తెలంగాణ సాధన పట్ల సీరియస్‌గా ఉన్నట్టు టీఆర్ఎస్ కనిపిస్తుంది కానీ అది నిజం కాదు. అందుకే వచ్చే ఎన్నికల్లో రాజకీయ బలం పెరక్కపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని కేసీఆర్ ప్రకటించారు. నిజానికి కేసీఆర్ ఉద్దేశాలు వేరు. ఒకవేళ టీఆర్ఎస్ బలం పెరిగినా పరిస్థితిలో ఎలా ంటి మార్పు ఉండదు. మళ్లీ మళ్లీ అమాయక జనులు మోసపోతూనే ఉంటారు, చనిపోతూనే ఉంటారు. కానీ తెలంగాణ పేరుతో రాజకీయ వ్యామోహితులు అధికారం పొందుతూనే ఉంటారు.

ఇక హైదరాబాదులోని పరిస్థితులను చూస్తే, ప్రతిఏటా జరిగే దీపావళి పండగ సందర్భంగా చార్మినార్‌ను అనుకొని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని విస్తరిస్తూ వస్తున్నారు. నిజానికి చార్మినార్ గోడలకు వాహనాలు తాకుతూ వెళ్లకుండా అక్కడ ఒక రాయి ఉండేది. క్రమంగా దాన్ని మైసమ్మ దేవతగా పూజించటం మొదలైంది. కానీ అక్కడ మార్వాడీలు ఉండటంతో వాళ్లు దాన్ని భాగ్యలక్ష్మి ఆలయంగా మార్చేశారు. నిజానికి అక్కడ ఎలాంటి గుడి లేదని వంద ఏళ్ల నుంచీ తీసిన ఫోటీలు సాక్ష్యం చెబుతున్నాయి. అయితే, చార్మినార్‌లోని మొదటి అంతస్తులో మజీదు, రెండో అంతస్తులో మదరసా ఉండేదని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత మొదటి, రెండు అంతస్తులను మూసేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అది మత సమస్య కాదు. చారిత్రక వారసత్వ నిర్మాణాలకు వంద మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని పురాతత్వ శాఖ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. 

రాష్ట్రం మీద మతాధిపత్యాన్ని రుద్దాలని అన్ని పార్టీలు ఈ సమస్యను సృష్టించాయి. అదే హిందూత్వ ఆధిపత్యమనొచ్చు. హైదరాబాదు రాజకీయ నాయకులకూ పాలకవర్గాలకూ ఈ సమస్య కొత్తది కాదు. ఆకస్మికంగా చార్మినార్ పరిరక్షణ గురించి మాట్లాడుతున్న వాళ్లంతా అనేక సంవత్సరాలుగా అక్కడ ఆలయ విస్తరణ జరుగుతున్నప్పుడు ఎక్కడున్నారు? అప్పుడెందుకు మాట్లాడలేదు? ఎలాగైనా సరే చార్మినార్‌ను రక్షించాలని ఇప్పుడు అనడం వెనక కారణం ఏమిటి? దీని రాజకీయ కోణం అర్థం చేసుకోవాలి. మతం పట్ల ప్రేమతోనో, చారిత్రక కట్టడాలపై అభిమానంతోనో ఈ ఆందోళన చేయటం లేదు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు. ఎవరు అధికారంలోకి రావాలనుకున్నా ఇక్కడ మతకలహాలు రేపుతారని హైదరాబాదు వాసులకు తెలుసు. చెన్నారెడ్డి కాలం అందుకు ఉదాహరణ.

ముస్లిం రాజకీయ పార్టీ ఎంఐఎం ఆకస్మికంగా తన నిరసన ప్రకటించింది. పి.వి. నరసింహారావునూ కిరణ్‌కుమార్ రెడ్డినీ మతతత్వవాదులుగా వ్యాఖ్యానించింది. చంద్రబాబు కాలంలో ముస్లింలపై దాడులు జరిగాయనీ ఆరోపణలు చేసింది. కానీ రాజశేఖర రెడ్డి కాలంలో జరిగిన దుర్మార్గమైన వేధింపులు, హత్యల గురించి ఎందుకు మాట్లాడలేదు? జగన్ రెడ్డితో పొత్తు గురించి అది మాట్లాడుతుంది. దీన్ని ముస్లింలు హర్షిస్తారా? నిజంగా ముస్లిం సమాజ సంక్షేమం గురించి అది నిజాయితీతో ఉంటే అవినీతిపరులతోనూ మతతత్వ ప్రచారం చేస్తున్న ఎలాంటి పార్టీతోనూ వ్యక్తులతోనూ ఎట్టి పరిస్థితిలో పొత్తులు పెట్టుకోరాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకోవటం ఒక పెద్ద నాటకం. బాబ్రీ మసీదు కూల్చిసినప్పుడు, అమాయక ముస్లిం యువకులను చట్టవిరుద్ధంగా హింసించినప్పుడూ, వటోలిలో కుటుంబాన్ని సజీవంగా దహనం చేసినప్పుడూ ఇదే నిర్ణయం ఎందుకు తీసుకోలేదు. 

అదేవిధంగా ముస్లిం ఫ్రంట్ నేతల నిర్ణయం కూడా సామాన్య ముస్లింలకు విభ్రాంతి కలిగించింది. అవినీతిలో కూరుకుపోయిన జగన్ రెడ్డితో ముస్లింలు ఎలాంటి స్థితిలోనైనా జతకడతారా? ముస్లింలకు ఎంత విషాదం దాపురించింది! ఇలాంటి రాజకీయ క్రీడలతో ముస్లింలు విసిగిపోయారు. మానవ, పౌర హక్కులు హరించి వేయటం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. ముస్లిం నేతలకు బాగా పట్టున్న హైదరాబాదులోనే అనేక వందల మంది యువకులను అపహరించి, అక్రమ కేసులతో జైల్లో పెట్టారు. ఇంకా చాలా మంది కనిపించకుండా పోయారు. అది కాంగ్రెసైనా, టీడీపీ, టీఆర్ఎస్, ఎంఐఎం అయినా అన్ని పార్టీలతో ముస్లింలు బాధలు పడి విసిగిపోయారు. నేతలు అధికారంలో బలపడ్డం తప్ప సామాన్య ముస్లింల జీవితంలో ఎలాంటి పురోగతి లేదు. అందుకే నేతల మురికి రాజకీయాలను అర్థం చేసుకోవాలి. ఈ నేతలు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మన జ్ఞాపక శక్తి కోల్పోకూడదు. వారి చర్యలను ప్రశ్నించాలి. మేము కేవలం ఓటు బ్యాంకు మాత్రమే కాదనే సంగతి వాళ్లకు అర్థమయ్యేలా చేయాలి.

- కనీజ్ ఫాతిమా
సహాయ కార్యదర్శి, సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ క

Andhra Jyothi Telugu News Paper Dated: 18/12/2012 

Friday, December 14, 2012

ఢోకాలేని ముస్లింల సంక్షేమం - కె. కొండల రావు



ముస్లింలకు సామాజిక న్యాయం అందటం లేదు అనే దాంట్లో నిజం లేదు. వారి ఓటింగ్ సరళిలో సంఘటితత్వం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను కీలక సందర్భాల్లో నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే శక్తి వారికి ఉంది. ఇతర అణగారిన వర్గాలైనవారెవ్వరికీ తీసిపోకుండా ముస్లింలు రాజ్యప్రోత్సాహం పొందుతున్నారు. ముస్లింల విషయంలో రాజ్యాంగం విఫలమయ్యిందనడం ఏవిధంగానూ సబబుకాదు. 

'ముస్లింల బాగు కోరే వారెవరు?' అని ఎస్.పి.గఫార్ (నవంబర్ 6, ఆంధ్రజ్యోతి) ప్రశ్నించారు. 'ఎవ్వరికీ పట్టని మైనారిటీలు' అంటూ ఎం.డి. ఉస్మాన్ ఖాన్ (నవంబర్ 11, ఆంధ్రజ్యోతి) వాపోయారు. వాస్తవమేమిటి? మన ప్రభుత్వాలు నిజంగానే, ముస్లిం సోదరులను ఇంతగా నిరాశానిస్పృహలకు లోను చేస్తున్నాయా? కేంద్ర ఉద్యోగరంగంలో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో, సరిగ్గా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు 4.5 శాతం మైనారిటీ సబ్ కోటాకు ఉత్తర్వులిచ్చింది. రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ఆధారంగా ముస్లింలకు ఈ కోటా కల్పించారు. ఈ విషయంలో జాతీయ బీసీ కమిషన్‌ను సంప్రదించలేదు. ఈ సబ్‌కోటా పట్ల దేశ వ్యాప్తంగా ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు.

తమకు అన్యాయం జరుగుతుంటే ఓబీసీలు ఎలా హర్షిస్తారు? రంగనాధ్ మిశ్రా కమిషన్ ఏర్పాటే రాజ్యాంగ విరుద్ధం; జాతీయ బీసీ కమిషన్‌ను సంప్రదించకపోవడం చట్ట విరుద్ధం; ఓబీసీల వర్గీకరణ అవసరమైతే అది 'వెనుకబాటుతనం' స్థాయిని బట్టి మాత్రమే జరగాలి; మైనారిటీ ఓబీసీ, నాన్ మైనారిటీ ఓబీసీలుగా విభజించడం మతపరమైన వర్గీకరణ అవుతుంది కాబట్టి చెల్లదు; 4.5 శాతం సబ్ కోటాను సమర్థించడానికి అవసరమైన సర్వే గణాంకాలు కూడా లేవు... ముస్లింల సబ్ కోటాకు వ్యతిరేకంగా నేను చేసిన ఈ వాదనలను హైకోర్టు ఆమోదించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. హిందూ ఓబీసీలకు ఆ మేరకు ఊరట లభించింది.

ప్రమోషన్లలో రిజర్వేషన్ల వ్యవహారాన్ని చూద్దాం. ఈ రిజర్వేషన్లు కూడదని 1992లో మండల్ కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ సదుపాయాన్ని 1955 నుంచి పొందుతున్న ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు విఘాతం కల్గింది. ఆ సామాజిక వర్గాల నాయకత్వాల తీవ్ర ఒత్తిడిమేరకు, తమ రాజకీయ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని, నాటి ప్రధానమంత్రులు పి.వి.నరసింహారావు, ఏ.బి.వాజపేయి 1995-2001 మధ్యకాలంలో నాలుగు రాజ్యాంగ సవరణలు తీసుకువచ్చారు; తద్వారా అర్హత ప్రమాణాలను సడలించి, కాన్సీక్వెన్షియల్ సీనియారిటీతో సహా వెనక తేదీ 1995 జూన్17 నుంచి అమలయ్యేలా చూశారు. ఆ సదుపాయం ఎస్సీ, ఎస్టీ వర్గాలకే పరిమితం చేశారు. ఆనాటికే ప్రభుత్వ ఉద్యోగరంగంలో బీసీల ప్రాతినిధ్యం ఎస్సీ, ఎస్టీల కంటే ఎంతో అధ్వాన్నంగా ఉన్నదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అయినా బీసీలను పక్కన పెట్టి ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను పునరుద్ధరించారు.

దరిమిలా సుప్రీంకోర్టు వెలువరించిన ఒక తీర్పు మేరకు ఈ సదుపాయాన్ని అమలుచేయడానికి ఇబ్బంది ఏర్పడింది. ఆ సందర్భంగా (గత సెప్టెంబర్‌లో) యూపీఏ ప్రభుత్వం మరొకసారి రాజ్యాంగ సవరణకు సిద్ధపడింది. ఎస్సీ, ఎస్టీలతో పోల్చినప్పుడు బీసీల ఉద్యోగ ప్రాతినిధ్య పరిస్థితి గతంలో కంటే ఎంతో అధ్వాన్నంగా ఉంది. అయినప్పటికీ బీసీలను మరలా పక్కన పెట్టారు. సహజంగా బీసీ వర్గాల నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 117వ రాజ్యాంగ సవరణ బిల్లు ఆగిపోయింది. చెప్పవచ్చిందేమిటంటే అసమానతలను సరిచేయడంలో కూడా ఆధిపత్య శక్తులు బీసీల విషయంలో వివక్ష ప్రదర్శిస్తున్నాయి. ఇది గర్హనీయం. తమ అభీష్టం మేరకు తమకు కావలసిన ఎటువంటి విద్యా సంస్థలనైనా స్థాపించి తామే నిర్వహించుకొనే హక్కు ముస్లింలకు ఉంది (ఎస్సీ, ఎస్టీలకు కూడా లేని ఈ ప్రత్యేక హక్కును అధికరణ 30 ద్వారా మైనారిటీలకు కల్పించారు).

ఈ హక్కును ఉపయోగించుకొనే దేశవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు ఎన్నో విద్యా సంస్థలను స్థాపించుకొని నిర్వహిస్తున్నారు. ఉన్నత విద్య, సాంకేతిక విద్య, వృత్తి విద్యకు సంబంధించిన విద్యా సంస్థలు వీటిలో ప్రముఖ మైనవి. దీనికి అదనంగా ఆయా రాష్ట్రాల్లో బీసీల్లో చేర్చబడిన ముస్లిం వర్గాలు రిజర్వేషన్ల ద్వారా ఆయా సంస్థల్లో సీట్లు సంపాదిస్తున్నారు. ఈ రెండు విధాల ప్రత్యేక సహకారాన్ని, ప్రోత్సాహాన్ని రాజ్యం అందిస్తున్నప్పటికీ ముస్లింలు విద్యాపరంగా వెనుకబడి ఉండడం నిజమే. అయితే అందుకు కారణాల్ని పూర్తిగా నిర్ధారించకుండా రాజ్యాన్ని మాత్రమే తప్పుపట్టడం సమంజసం కాదు. ముస్లింల పట్ల వివక్ష, వ్యతిరేకత, అణచివేత ధోరణి అంటే కుదరదు. పేద ముస్లింలకు వారి మైనారిటీ విద్యా సంస్థలు అందుబాటులో ఉండడం లేదని సచార్ కమిటీ నిర్ధారించింది. మరి ఈ పరిస్థితికి కారకులెవరు? పార్టీలా? ప్రభుత్వాలా? ముస్లింల మీద ఇతరుల వివక్షా, వ్యతిరేకతా? లేక ఆ వర్గానికే చెందిన కొందరి వ్యాపార ధోరణా?

ఉన్నత విద్య, ప్రభుత్వోద్యోగాల మీద కంటే ముస్లింలకు అధిక ఆదాయాలకు అవకాశాలున్న గృహ పరిశ్రమలు, ఉత్పత్తి, వ్యాపార, సేవల రంగాలపై మక్కువ ఎక్కువ అని 2001 జనాభా గణన ద్వారా అర్థమవుతుంది. జాతీయ సగటు కంటే గృహపరిశ్రమ రంగంలో ముస్లింలు 92.65 శాతం అధికంగా ఉన్నారు. ఉత్పత్తి, వ్యాపార, సేవారంగాల్లో వీరు జాతీయ సగటు కంటే 30.6 శాతం ఎక్కువ ఉన్నారు. ఈ రీత్యా ఉన్నత విద్య, ప్రభుద్వోద్యోగ రంగాల్లో తగినంతగా ముస్లింలు లేకపోవటానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం లేదనిపిస్తుంది. అయినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రయోజనాల్ని పణంగా పెట్టి మైనారిటీల ప్రయోజనాలకే రాజ్యం ప్రాధాన్యం ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. 93వ రాజ్యాంగ సవరణ దీనికి ఒక చక్కని ఉదాహరణ. ఉన్నత విద్య, వృత్తి విద్య, సాంకేతిక విద్యకు సంబంధించిన విద్యా సంస్థలు ప్రభుత్వ రంగంలో కంటే ప్రయివేటు రంగంలో వాసిలోనూ, రాసిలోనూ ఎక్కువగా పెరుగుతున్న సందర్భమిది. ప్రైవేటు విద్యా సంస్థలతో సహా అన్ని విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చట్టం ద్వారా రిజర్వేషన్ల కల్పనకు అవకాశమిచ్చిన ఈ 93వ రాజ్యాంగ సవరణ, మైనారిటీ విద్యా సంస్థలకు ఈ రిజర్వేషన్ల నుంచి మినహాయింపు నిచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగ ప్రయోజనాల్ని విస్మరించారు. దీన్ని ముస్లింల మీద వ్యతిరేకత అందామా? ప్రత్యేక శ్రద్ధ అందామా?

సైకిళ్ళకు పంక్చర్లు, బిందెలకు మాట్లు వెయ్యడం, గొడుగులను, తాళాలను బాగుచేయడం, రిక్షాలు లాగడం, హమాలీ పనిచేయడం కేవలం ముస్లింలకే పరిమితమైన పనులుకావు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఇదే స్థాయి, ఇంత కంటే అధమస్థాయి వ్యాపకాల్లో ఉంటున్నవారు ఇతర సామాజిక వర్గాల్లోనూ ఎందరో ఉంటున్నారు. ముస్లింలైనా, ముస్లిమేతరులైనా కేవలం పేదరికం కారణంగానే ఈ వృత్తుల్లో ఉంటున్నారు తప్ప పారంపర్య సంప్రదాయాలేమీ ఎవరినీ ఈ చిన్న వృత్తుల్లో బంధించడం లేదు. ఇటువంటి వృత్తుల్లో సామాజిక వెనకబాటుతనానికి గీటురాళ్ళు కాదని కోర్టు తీర్పుల సారాంశం.

'పాలక వర్గాలు గత నివేదికలకు లాగానే సచార్ నివేదికను బుట్ట దాఖలు చేశాయి. స్వాతంత్య్రం సిద్ధించి ఆరున్నర దశాబ్దాలైనా ముస్లింల స్థితిగతులు నాడు ఎలా ఉన్నాయో నేడూ అలానే ఉన్నాయి. వారి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సామెతను తలపోస్తుంది. పాలకులకు ముస్లింల సంక్షేమం పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు' అంటూ ఉస్మాన్ ఖాన్ రాళ్ళు వేస్తున్నారు. ఇక గఫార్ 'నెహ్రూ కాలం నుంచి నేటి వరకూ ముస్లింల కోసం ప్రభుత్వాలు కార్చింది మొసలికన్నీరే. గణాంక సాక్ష్యాధారాలతో సచార్ కమిషన్, మిశ్రా కమిషన్ దీన్ని స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బెల్లంకొట్టిన రాయిలాగా ఏమీపట్టనట్లు చేష్టలుడిగి చూస్తున్నాయం'టూ బండరాళ్ళు వేస్తున్నారు. కమిషన్ల నివేదికలను ప్రభుత్వాలు పట్టించుకోలేదు, బుట్టదాఖలు చేశాయనడం బాధ్యతారాహిత్యం.

పూర్తిగా అవాస్తవం. ప్రభుత్వాలుగానీ, పార్టీలుగానీ చేయవలసిన దానికి మించి, కొన్ని సందార్భలలో బీసీల్లాంటి వారి ప్రయోజనాల్ని కూడా పణంగా పెట్టి, ముస్లింల ప్రయోజనాల కోసం ఎంతోచేస్తున్నాయనడానికి పై విశ్లేషణ, సమాచారంతోపాటు ఎన్నో వాస్తవాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఆ విధంగా ఎవ్వరికీ పట్టని మైనారిటీలు అనడానికి గానీ, ముస్లింల బాగుకోరే వారెవరు అని అడగడానికి గానీ ఏమాత్రం ఆస్కారం లేదు. జస్టిస్ బిలాల్ నజ్కీ సూచించినట్టుగా సచార్ కమిటీ తన నివేదికలో వ్యాఖ్యానించినట్టు ముస్లింలు తమ అభివృద్ధి కోసం తమను తామే పట్టించుకొని 'రూట్ కరక్షన్' చేసుకోవలసిన అవసరముందని చెప్పడానికయితే ఆస్కారముంది.

కేవలం ముస్లిం సమాజపు సామాజిక, ఆర్థిక విద్యాపరమైన అభివృద్ధి స్థాయిని పెంచడానికి సచార్ కమిటీ చేసిన ప్రధాన సిఫార్సులన్నిటినీ అమలుచేయడానికి నిర్ణయించి 2007 నుంచే అనుక్రమ చర్యలు ప్రభుత్వం ప్రారంభించింది. అధికారిక సమాచారం ప్రకారమే, లక్ష కోట్ల ఖర్చుతో 25 రకాలుగా ఈ చర్యలు నడుస్తున్నాయి. సచార్ నివేదిక సిఫార్సులను ఇంచుమించు అన్నిటిని అనేక కార్యాచరణల ద్వారా ఎంతో వ్యయ ప్రయాసలతో నివేదిక అందిన క్షణం నుంచి నేటివరకు కేవలం మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింల బహుముఖ అభివృద్ధి కోసం కోట్లాది కుటుంబాలకు మేలు జరిగే కృషి నడుస్తుంటే గత నివేదికలు లాగానే సచార్ నివేదికనూ పాలకులు బుట్టదాఖలు చేసాయి అనడంలో ఉస్మాన్ ఖాన్, ఇంచు మించు ఇదే ధోరణితో నడిచిన గఫార్ అభాండాల ఆంతర్యం అనుమానాస్పదం కాదా? ముస్లింలకు సామాజిక న్యాయం అందటం లేదు అనే దాంట్లో నిజం లేదు.

వారి ఓటింగ్ సరళిలో సంఘటితత్వం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలను కీలక సందర్భాల్లో నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే శక్తి వారికి ఉంది. అయితే ఇది అన్నివేళల అన్ని సందర్భాల్లో ఒక స్థాయికి మించి ఉపయోగపడదు. ఇతర అణగారిన వర్గాలైనవారెవ్వరికీ తీసిపోకుండా ముస్లింలు రాజ్యప్రోత్సాహం పొందుతున్నారు. ముస్లింల విషయంలో రాజ్యాంగం విఫలమయ్యిందనడం ఏవిధంగానూ సబబుకాదు. దానికి ఎటువంటి ఆధారాలు లేవు. పనిగట్టుకుని ముస్లింలను వెనక్కు నెట్టేసే పరిస్థితి ఈ దేశంలో ఎవరికీ లేదు.

- కె. కొండల రావు
హైకోర్టు న్యాయవాది, కన్వీనర్ బీసీ మిత్రులు
Andhra Jyothi News Paper Dated: 15/12/2012

Tuesday, December 4, 2012


ముస్లింల బాగుకోరనిదెవరు?
- కె. కొండలరావు

కీలకమైన ఎన్నో వ్యవస్థల్లో ఆధిపత్య వర్గాల తరువాత ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. ఇతర అణగారిన వర్గాల వారెవరూ ముస్లింల స్థాయికి చేరుకోలేదు. నెహ్రూ 1954లో రాష్ట్ర ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నట్టుగా 'మన పబ్లిక్ సంస్థల్లో ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం లభించడంలేదనేది' నేడు వాస్తవం కాదు. 

'ముస్లింల బాగుకోరే వారెవరు?' అంటూ ఎస్.పి. గఫార్ (నవంబర్ 6, ఆంధ్రజ్యోతి) తన వ్యాసంలో సంబంధిత సమాచారాన్ని, వాస్తవాన్ని పరిశీలించకుండా బాధ్యతా రాహిత్య స్థాయిలో నిందలు వేస్తే, శీర్షికలోనూ సారంలోనూ పూర్తి సారూప్యంతో 'ఎవ్వరికీ పట్టని మైనార్టీలు' అంటూ ఎం.డి. ఉస్మాన్ ఖాన్ (నవంబర్ 11, ఆంధ్రజ్యోతి) నిష్ఠూరమాడారు. నిబద్ధతతో ముస్లింల అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రయత్నాలను కూడా పూర్తిగా విస్మరించి ఆయా రాజకీయ పార్టీలపైన, ప్రభుత్వాలపైన, మొత్తంగా సమాజంపైన తీవ్రస్థాయి వ్యతిరేక తీర్పునివ్వడం నిజాయితీగా జరుగుతున్న కృషిని అవమానించడమే అవుతుంది. ముస్లింల అభివృద్ధికి, వారి దామాషా భాగస్వామ్య సాధనకు ఇంతవరకు జరిగిన, జరుగుతోన్న కృషిని ఏమాత్రం స్పృశించకుండా, సాపేక్షంగా విశ్లేషించకుండా, కేవలం వారి స్థితిగతులను అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీ / కమిషన్ల నివేదికల ఆధారంగా, మైనారిటీల అభివృద్ధికి జాతిని సమాయత్తం చేసే లక్ష్యంతో ఆరు దశాబ్దాల క్రితం, ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులకు నెహ్రూ రాసిన లేఖల మీదే ఆధారపడి కేవలం ఊహాజనిత అంచనాలతో తీర్పునివ్వడం సరికాదు.

వెనుకబాటుతనం ఎక్కడున్నా దానికి కారణాల్ని గుర్తించి, ప్రత్యేక సదుపాయాల కల్పనద్వారా పరిష్కరించడం ప్రజాస్వామ్యంలో ప్రాథమికంగా రాజ్య ధర్మం. హక్కుల విషయంలో సమానత్వాన్ని కోరి నిలదీస్తున్న మనం వెనకబాటుతనం పరిష్కారంలో ఆయా వర్గాలు తమ తమ బాధ్యతలను కూడా సమానంగా స్వీకరించి సహకరించాలి. కారణాలు ఎటువంటివైనా ముస్లింలు మాత్రమే ఈ బాధ్యతల విషయంలో నిత్యం మినహాయింపుగా కొనసాగడం న్యాయం కాదు. ముస్లింల వెనుకబాటుతనాన్ని నిర్ధారించి అంచనా వెయ్యడానికి, కేవలం వారికే ప్రత్యేకమైన కొన్ని సూచికలను ఉపయోగించి నిర్ణయించడమే సమంజసమవుతుందని, 5 శాతం రిజర్వేషన్ చట్టాన్ని కొట్టేస్తూ 2006లో అర్చనా రెడ్డి కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో పాక్షికంగా విభేదించిన ఆనాటి యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ బిలాల్ నజ్కీ తన తీర్పులో ఉదహరించిన సూచికలు గమనార్హం.

(1) విడాకులివ్వడానికి వారి పురుషులకున్న, విశృంఖల అధికారాలు, ఆ అధికారాల ప్రభావం సామాజికపరమైన, విద్యాపరమైన ముస్లింల వెనుకబాటుతనానికి ఏ మేరకు కారణం; (2) ముస్లిం మహిళల విద్యాపరమైన వెనకబాటుతనానికి 'పరదా'సంప్రదాయం ఏమేరకు కారణం; (3) జాతీయ స్థాయికంటే అత్యధికంగా ఉన్న ముస్లింల జననాలు వారి వెనకబాటు తనానికి ఏమేరకు కారణం అనేవి ఆ వర్గ వెనకబాటుతనాన్ని మదించడానికి ప్రమాణాలు కావాలని ఆయన తన తీర్పులో అభిప్రాయపడ్డారు.

ఇంటిలో ఉండి పనిచేసే మహిళల శాతం జాతీయ స్థాయిలో 51 శాతం ఉండగా, ముస్లిం మహిళలు అత్యధికంగా 70 శాతం ఉండడం గమనించిన సచార్ కమిటీ, తన నివేదికలో 'సాంప్రదాయ గోడలు' మహిళల సాధికారతకు అడ్డంకులు అవుతున్నట్లు వ్యాఖ్యానించడం ఇదే తీరులో ఉండడం గమనార్హం. రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదిక ప్రకారం, 40-49 సంవత్సరాల వయస్సుగల హిందూ, ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు కలిగిన పిల్లల సంఖ్య జాతీయ స్థాయిలో వరుసగా 4.34, 5.72, 4.85, 4.74, 4.43. ఆ విధంగా అత్యధికంగా పిల్లలకు జన్మనిస్తుంది ముస్లిం మహిళలే.

హిందువుల కంటే ముస్లింల జననాలు 31.8 శాతం ఎక్కువ. ఇదే ప్రకారం హిందువుల కంటే ఎస్సీ ఎస్టీ, బీసీల జననాలు వరసగా 11.74, 9.22, 2.07 శాతం మాత్రమే ఎక్కువ. అదే విధంగా 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం 13.43 శాతం జనాభా కలిగిన ముస్లింల (0-6) వయస్సు పిల్లలు 15.81 శాతంతో దేశసరాసరి కంటే 17.72 శాతం అధికంగా ఉన్నారు. సచార్ కమిటీ నివేదిక ప్రకారం జాతీయ స్థాయిలో, 10 సంవత్సరాలలోపు పిల్లలు జనాభాలో 23 శాతం కాగా, ముస్లింల పిల్లలు 27 శాతంతో దేశ సరాసరి కంటే 17.4 శాతం ఎక్కువగా ఉన్నారు.

ఈ విధంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక వెనకబాటుతనానికి ముస్లింల సాంప్రదాయ పద్ధతులు, జీవన విధానానికి సంబంధించిన ఆలోచన, వ్యవహరింపు వైఖరులు ప్రముఖమైన కారణాలుగా ఉన్నట్లు అధికారిక సమాచారం, గణాంకాలు రుజువు చేస్తుంటే, విజ్ఞులైన వారి నాయకత్వం, మేధావివర్గం తమ సమాజాన్ని ఈ విషయాల్లో చైతన్యం చేయవలసిన బాధ్యతను అంగీకరిస్తాయా లేక అపోహలతో ఊహాజనిత అభద్రతా భావనలతో వ్యతిరేకత, వివక్ష, అణచివేత లాంటి రుజువుకాని, ఆధారాలు లేని ఆరోపణలపైనే తమ అభివృద్ధికి ఆధారపడతారా? ఏది సమంజసం? 'వివక్ష'ను నిరూపించడానికి ఎటువంటి అధ్యయనాలు లేవని సచార్ కమిటీ నివేదికే నిర్మొహమాటంగా చెబుతుంటే, ఇదే నివేదికను ఉటంకిస్తూ ఈ ఇద్దరు వ్యాసకర్తలు చేస్తున్న 'వివక్ష' ఆరోపణ అవాస్తవ ప్రచారం అవ్వదా? ఉత్పత్తి, వ్యాపార రంగాల్లో ఇతర సామాజిక వర్గాల కంటే ముస్లింల భాగస్వామ్యం అధికంగా ఉందని 2006లో సచార్ నివేదిక కూడా స్పష్టం చేస్తుంటే వ్యాపార రంగంలో వారు వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని 52 ఏళ్ళ క్రితం, 1954లో నెహ్రూ రాసిన లేఖను ఈనాడు తన ఆరోపణలకు అనుకూలంగా గఫార్ ఎలా ఉటంకిస్తారు?

అణగారిన వర్గాల్లో సంఖ్యాపరంగా అత్యధికులు బీసీలైతే, ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు అల్పసంఖ్యాకులు. నాడూ నేడూ వ్యవస్థల మీద గుత్తాధిపత్యాన్ని చలాయిస్తున్న అగ్రకులాలూ అల్పసంఖ్యాకులే. దోచిన సంపదను కాపాడుకోవడానికి, దోపిడీని కొనసాగించుకోవడానికి ఈ ఆధిపత్య శక్తులకు రాజ్యాధికారమే వజ్రాయుధం. రాజ్యాధికారం మీద ఆధిపత్యం మరో వర్గానికి పోకుండా దోపిడీ కొనసాగింపునకు అవసరమైనమేర, సామాజిక శాంతి భగ్నం కాకుండా జాగ్రత్తపడడం ఈ ఆధిపత్య శక్తులకు అవసరం. అల్పసంఖ్యాక, దళిత, మైనారిటీల అభివృద్ధి, సాధికారిత అగ్రకులాల ఆధిపత్యానికి అంతగా సవాలేకాదు. అధిక సంఖ్యాక బీసీల అభివృద్ధి, సాధికారత మాత్రం వీరి ఆధిపత్యానికి గొడ్డలి పెట్టే. అందుచేత, దళిత, మైనారిటీ వర్గాల ప్రజాస్వామ్య అవకాశాల కల్పనకు ఆధిపత్య శక్తులు ప్రదర్శిస్తున్న శ్రద్ధ, ఆసక్తి, దూకుడు, బీసీల అభివృద్ధి, అవకాశాల కల్పన విషయంలో కంటితుడుపు స్థాయికే పరిమితం చేస్తూ, వారిపై అణిచివేత కొనసాగించుకోవడానికి దళిత మైనారిటీలను అడ్డం పెట్టుకుంటున్నాయి. వారి సహకారంతో బీసీల్ని అణచివేస్తున్నారు.

కొన్ని కీలకమైన గణాంకాలను, చారిత్రక సమాచారాన్ని పరిశీలించడం ద్వారా, పై వాస్తవాలను నిర్ధారించవచ్చు. యాక్టింగ్ హోదాతో సహా ఇంతవరకు పనిచేసిన 15 మంది రాష్ట్రపతుల్లో నలుగురు ముస్లింలకు, ఒక ఎస్సీకి, మరొక మైనారిటీకి అవకాశం ఇచ్చారు. బీసీల నుంచి ఎవ్వరూ లేరు. 12 మంది ఉప రాష్ట్రపతుల్లో ముగ్గురు ముస్లింలు, ఒక ఎస్సీ ఉన్నారు తప్ప బీసీలెవ్వరూ లేరు. 2007 ఆగస్టులో జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వివిధ రాజకీయ పక్షాలు నిలిపిన ముగ్గురు అభ్యర్థులూ ముస్లిం వర్గం వారే కావడం ప్రత్యేక విశేషం. ఇంతకు ముందు పనిచేసిన 38 మంది, ఇప్పుడు పనిచేస్తున్న ఈ దేశ ప్రధాన న్యాయమూర్తితో కలిపి 39 మంది ప్రధాన న్యాయమూర్తుల్లో ముస్లింల నుంచి నలుగురు, ఎస్సీల నుంచి ఒకరు ఉండగా బీసీల నుంచి ఒక్కరూ లేరు. 2010 మే నెల 11వ తేదీ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు గండి పడింది, ఎస్సీ వర్గానికి చెందిన ఆనాటి ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి కె.జి. బాలకృష్ణన్ ఇచ్చిన తీర్పుద్వారానే.

ఇంతవరకు పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తున్న 200 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో 16 మంది ముస్లింలు, నలుగురు ఎస్సీలు ఉండగా బీసీల నుంచి ఇద్దరు, ముగ్గురికి మించి లేరు. 2012 సెప్టెంబర్ 28న అల్టమస్ కబీర్ ప్రధాన న్యాయమూర్తి పదవి స్వీకరించేనాటికి, మిగిలిన 25 న్యాయమూర్తుల్లో ఇద్దరు ముస్లింలు ఉన్నారు. ఇంతవరకు పనిచేసిన 17 మంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్లలో ఒక్క ముస్లింకే ఆ అవకాశం దక్కింది. 30 మంది కేబినెట్ సెక్రటరీలలో ఒక్క ముస్లింకే ఆ అవకాశం దక్కింది. 25 మంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల పదవుల్లో ముగ్గురు ముస్లింలున్నారు. ఎస్సీ, బీసీలు ఎవరూ లేరు. ఇంతవరకు 'భారతరత్న' గౌరవం దక్కిన 41 మందిలో, ఆరుగురు ముస్లింలకు ఒక ఎస్సీకి మాత్రమే ఈ గౌరవం దక్కింది. ఒక్క బీసీకి కూడా ఈ స్థాయి గౌరవం దక్కలేదు.

ప్రస్తుత 34 మంది కేంద్ర కేబినెట్ స్థాయి మంత్రుల్లో ముస్లింల నుంచి ముగ్గురున్నారు. బీసీల నుంచి ఇద్దరే కనబడుతున్నారు. 1947 నుంచి 1996 వరకు 50 సంవత్సరాల నిడివిలో పనిచేసిన 15 కేంద్ర కేబినెట్లలో మొత్తం 243 మంది కేబినెట్ స్థాయి మంత్రులు పనిచేయగా, వాటిలో 28 స్థానాలతో 11.5 శాతం ముస్లిం వర్గం దక్కించుకోగా కేవలం 11 స్థానాలతో బీసీలు 4.5శాతానికే పరిమితమయ్యారు. దళితులు 16 స్థానాలతో 6.5 శాతం అవకాశాలు పొందారు. ప్రస్తుoత లోక్‌సభకు ఎన్నికైన 543 మందిలో 24 మంది ముస్లింలు ఉన్నారు. ఇది 4.4 శాతం. దామాషా అవకాశాల్లో మూడవ వంతే. అయితే దీనికి పరిహారంగా అన్నట్లు 243 మంది రాజ్యసభ సభ్యుల్లో 30 మంది నామినేట్ చేయబడిన ముస్లింలు ఉన్నారు. ఇది 12.35 శాతం. దామాషాతో సరిపోలుతుంది. కీలకమైన ఎన్నో వ్యవస్థల్లో ఆధిపత్య వర్గాల తరువాత ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు.

ఇతర అణగారిన వర్గాల వారెవరూ ముస్లింల స్థాయికి చేరుకోలేదు. ఎవరు అధికారంలో ఉన్నా, ముస్లింలకు కీలక వ్యవస్థల్లో సముచిత స్థానం కల్పించడం ఒక విధంగా, సాంప్రదాయంగా కొనసాగుతున్నట్లు, రాజ్యం దానికి శ్రుతి చేయబడినట్లు అర్థమవుతుంది. నెహ్రూ 1954లో రాష్ట్ర ముఖ్యమంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నట్టు 'మన పబ్లిక్ సంస్థల్లో ముస్లింలకు సరైన ప్రాతినిధ్యం లభించడంలేదనేది' నేడు వాస్తవం కాదు. అందుచేత గఫార్ తన అభిప్రాయాలకు తేదీలు మార్చుకోవాలి.

- కె. కొండలరావు
హైకోర్టు న్యాయవాది, కన్వీనర్, బీసీ మిత్రులు

Andhra Jyothi Telugu News Paper Dated: 4/12/2012 

Tuesday, September 6, 2011

తెలంగాణలో ముస్లింల మాటేమిటి? - కనీజ్ ఫాతిమా Andhra Jyothi 07/09/2011


తెలంగాణలో ముస్లింల మాటేమిటి?

- కనీజ్ ఫాతిమా

తెలంగాణ డిమాండ్ ఎంత న్యాయమైనదో సామాజిక తెలంగాణ కూడా అంత కన్న ఎక్కువ న్యాయమైనది. కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తూ 2009లో ఆమరణ దీక్ష చేపట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం పునరుజ్జీవం పొందింది. అయితే, ఆ సమయంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉద్యమంలో పాల్గొనలేదు. 'ముస్లిం ఫోరం ఫర్ తెలంగాణ' 2007నుండి తెలంగాణ ఆవశ్యకత గురించి ముస్లిం సమాజంలో అవగాహన కల్పిస్తుంది. ఈ సంస్థ ఒక ప్రెజర్ గ్రూప్‌గా మాత్రమే పనిచేయటం లేదు.

అది ముస్లిం సమాజం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలన్నింటి పరిష్కారం కోసం కృషిచేస్తుంది. అనేక మంది ముస్లింలు క్రమంగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావటం వెనక ఈ ఫోరం కల్పించిన అవగాహన ఉంది. అనేక జేఏసీలు, వేదికలను ముస్లింలు ఏర్పాటు చేసుకున్నారు. పట్టణ ముస్లింల కన్న ఆయా జిల్లాల్లో నివసిస్తున్న ముస్లింలే ఎక్కువగా ఉద్యమంలో కనిపించారు. చివరికి నిజామాబాద్‌లో బిజెపి అభ్యర్థిని 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ముస్లింలే గెలిపించేంత స్థాయికి ముస్లింల భాగస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో పెరిగింది.

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనను వెనక్కి తీసుకోవటంతో మళ్లీ ఉద్యమం ఊపందుకుంది. ఈసారి హిందూత్వ శక్తులు, ఎక్కువగా బిజెపి ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ప్రారంభించింది. ఆ పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఇక్కడికి ఆహ్వానించి తెలంగాణ ఏర్పాటు హామీని విద్వేష ఉపన్యాసాలతో పాటు ఇప్పించారు. చిన్న రాష్ట్రాలను సమర్ధించే పేరుతో తెలంగాణ డిమాండ్‌ను బలపర్చారు. ముస్లింలను తిరిగి అధికారంలోకి రానివ్వమనే హామీని కూడా వారు ఇచ్చారు.

ఇదే సందర్భంలో 2010లో హైదరాబాదులో జరిగిన అల్లర్లు ఇక్కడ ప్రస్తావించటం తప్పేమీ కాదు. శాంతికాముకుల నగరంలో విద్వేష, భయాందోళనలు ప్రజ్వరిల్లచేసింది, ప్రజలను మతం పేరుతో రెచ్చగొట్టిందీ బిజెపి నాయకులే. 2010-11లలో హనుమాన్ జయంతి, శ్రీరామనవమి సందర్భంగా ముస్లిం వ్యతిరేక విద్వేష ఉపన్యాసాలను పెద్దస్థాయి లో ఇప్పించారు. తెలంగాణ ఉద్యమానికి నిజంగా ప్రమాదకరమైన బిజెపి తన రాజకీయ ఉనికి కోసం ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకుంటున్నది.

ఈ సంఘటనలతో ముస్లింలు పునరాలోచనలో పడ్డారు. అనేక సందేహాలు వాళ్ల మనస్సులో తలెత్తాయి. సరైన పద్ధతిలో మనం లక్ష్యం వైపు పయనిస్తున్నామా? ఈ ఉద్యమం సరైనదేనా? రాబోయే కొత్త రాష్ట్రం ప్రజాస్వామికమైనదేనా? కొత్త రాష్ట్రంలో ముస్లింలకు ఏదైనా రక్షణ ఉంటుందా? వారి వాటా వారు పొందగలరా? లేక సమైక్య రాష్ట్రంలో కన్నా హీనమైన రీతిలో చూడబడుతారా? వంటి అనుమానాలు తలెత్తాయి.

టిఆర్ఎస్ నేత నోటిమాటగా అన్న '12 శాతం రిజర్వేషన్, ఉపముఖ్యమం త్రి' హామీలు పనిచేయవని ముస్లింలు అర్ధం చేసుకున్నారు. ఆయనవి కేవలం మాటలు మాత్రమే. అవి ఎప్పుడూ చేతలుగా మారలేదు. ఆయన పార్టీలో ఇప్పటి వరకు ముస్లిం ప్రాతినిధ్యం (కనీసం ఒక్క ముస్లిం ఎమ్మెల్యే) లేకపోవటమే అందుకు నిదర్శనం. ఏడో నిజాం సమాధిని సందర్శించినంత మాత్రాన ముస్లింలను ఆయన సంతృప్తిపరచలేరు. వేదికల మీద ముస్లిం నేతలను తన పక్కన కూర్చోబెట్టుకున్నంత మాత్రానే అది వీలు కాదు.

సంపన్న ముస్లింలు సామాన్య ముస్లింలకు ప్రతినిధులు కారు. తెలంగాణ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అనేక మంది సామాన్యమైన ముస్లింలు ఉన్నారు. వాళ్లంతా ఎక్కడ విసిరేయబడ్డారు? ప్రధాన స్రవంతి నుండి వాళ్లనెందుకు దూరం పెట్టారు? అన్ని చోట్లా కేవలం సంపన్న ముస్లింలే ఎందుకు కనిపిస్తున్నారు? దీనికి తోడు తెలంగాణ జాక్ కన్వీనర్ బిజెపి నాయకత్వం మద్దతు అడుగుతాడు.

రాజకీయ ఆకాంక్షలెంత సంకుచితమయ్యాయో, నాయకత్వమెంత వివాదాస్పదమైపోయిందో ఇది చూపిస్తుంది. కుహనా నేతలు తప్ప మైనార్టీలు, స్త్రీలతో సహా మరొకరు ఉద్యమంలో కనిపించరు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నిజాయితీగా ఉండాల్సింది పోయి తమ ఉనికి కోసం పోటీ పడుతున్నారు. ఉద్యమం స్వార్థపూరితమూ అవినీతిమయమూ అయిందని చెప్పొచ్చు.

స్త్రీలు, ముస్లింలను దూరం పెట్టేందుకు శాయశక్తులా నేతలు కృషి చేస్తున్నారు. విద్యార్థులనే కాదు సామాన్య జనాల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. విద్యార్థుల మధ్య విజయవంతంగా చీలికలు తెచ్చారు. నాయకుల ప్రోత్సాహంవల్ల అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాళ్లను అమరులని కీర్తిస్తున్నారు. నేతలు నిజాయితీపరులైతే ఈ ఆత్మహత్యలు జరిగేవే కావు. ఆత్మహత్యలను ఎందుకు సమర్థిస్తున్నారు? మరిన్ని జరగాలని ఎందుకు కోరుకుంటున్నారు? తెలంగాణ పేరు మీద యువకులందర్నీ ఈ నేతలు బలివ్వాలని అనుకుంటున్నారా?

సామాజిక పునాదుల మీద ఆధారపడిన లౌకిక ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రాన్ని ఏ కారణం వల్ల ముస్లిం సమాజం కోరుతున్నది? ఈ ప్రశ్నే చాలా శక్తిమంతమైనది. ఇలా అడగటం వల్ల ముస్లింల పట్ల అకారణ వ్యతిరేకత పెల్లుబుకుతుందనేది నిజం. చరిత్రలో కూడా అదే జరిగింది. దేశానికి గాంధీజీ స్వతంత్రం తెస్తానంటే ముస్లింలే వద్దంటున్నారని ఆనాడు నిరాధారమైన ఆరోపణలు చేశారు. వాటినే నేటికీ మతతత్వ శక్తులు ప్రచారం చేస్తున్నాయి. స్వతంత్రం ప్రకటించిన తర్వాత 1892 నుండి 1947 వరకు ముస్లింలకు ఉన్న ప్రత్యేక నియోజకవర్గాలు, విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్య వ్యవస్థ ఉండి వుంటే ఇప్పుడు ఇంత దారుణమైన పరిస్థితిలో ముస్లింలు ఉండేవారు కాదు.

ఇక కొన్నేళ్ల క్రితం తెలంగాణలో స్థిరపడిన కొంతమంది సీమాం«ద్రులు రాష్ట్ర సాధన డిమాండ్‌ను సమర్ధిస్తున్నారు. ఈ మద్దతు నిజాయితీతో కూడినది కాదు. ఇందులో వారి స్వప్రయోజనాలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడితే అందరికన్నా ఎక్కువ లబ్ధి పొందేది వాళ్లే. అంతేకాదు, ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో వాళ్లే పాలిస్తారు.

హైదరాబాదులో నెలకొన్న అనేక స్వచ్ఛంద సంస్థలు అగ్రకుల సీమాంధ్ర సెటిలర్ల చేతిలో వున్నాయి. తెలంగాణకు మద్దతిస్తున్నట్టు నటిస్తున్న సీమాం«ద్రులు, వారి చేతిలో వున్న అన్ని విద్యాసంస్థలు, పరిశ్రమలు, స్వచ్చంద సంస్థలు భవిష్యత్తులో మనల్ని పాలించే సమయం వస్తుంది. నిజంగా సీమాం ధ్ర సెటిలర్లు తెలంగాణ కోరుకుంటే వారి వారి ప్రాంతాలకు వెళ్లిపోయి, అక్కడ ప్రచారం చేయాలి. అప్పుడే వారి నిజాయితీ నిరూపితమవుతుంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఒక్క సమూహం కూడా మోసగించబడకుం డా అణచివేయబడకుండా, వారి జనాభా ప్రకారం సమానమైన వాటా పొందే విధంగా తెలంగాణ ఎజెండాను రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీలకు అధికారం, విద్య, ఉద్యోగాల్లో వాటా పొందుతారనే దాంట్లో సందేహం లేదు. కాని ముస్లిం ల మాటేమిటి? తెలంగాణ ఏర్పడిన తర్వాత ముస్లింలు ఏం పొందబోతున్నారు? ఉపముఖ్యమంత్రి పదవా? లేక 12 శాతం రిజర్వేషనా? ఉపముఖ్యమంత్రి పదవి ముస్లింలను రంజింప చేస్తుందా? సమైక్య రాష్ట్రంలోనే ఇప్పుడు 4 శాతం రిజర్వేషన్ సమస్య పెండింగ్‌లో ఉంది. అలాంటిది మతతత్వ శక్తులు ప్రబలంగా వున్న భవిష్యత్ కాలంలో 12 శాతం ఏ రకంగా ఊహించగలం? విద్య, ఉద్యోగం, అధికారంలో వాటా మాట సాధ్యమయ్యేనా?

ఈ పరిస్థితుల నేపథ్యంలో లౌకిక, సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ డిమాండ్ అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుండి ఈ డిమాండ్‌ను ముస్లింలు, ఎస్సీ, ఎస్టీ, బిసిలు చేస్తూనే ఉన్నారు. అదిప్పుడు ఒక తీవ్రమైన చర్చగా మారింది. ప్రొ.కంచె ఐలయ్య, డా.జిలుకర శ్రీనివాస్ వంటి బహుజన మేధావులు, విశారదన్, మందకృష్ణ వంటి నాయకులు లౌకిక ప్రజాస్వామిక తెలంగాణను డిమాండ్ చేయటమే కాదు, దాన్ని నిర్మించేందుకు అవసరమైన సూచనలు ఇస్తూనే ఉన్నారు.

ఈ డిమాండ్‌ను సాకారం చేసేందుకు డా. జిలుకర శ్రీనివాస్ సూచించిన విధంగా ఎజెండా రూపొందించుకోవాలి. ఒక పెద్దమనుషుల ఒప్పందం రాజకీయ పార్టీలు, ఎస్సీ-ఎస్టీ-బిసి-మైనార్టీ సంస్థ ల మధ్య కుదరాలి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఒప్పందం చేసుకుందామంటే కుదరదు. అది రాష్ట్ర ఏర్పాటుకన్న ముందే జరగాలి. అలాంటి ఒప్పందానికి ముస్లింలు తప్పకుండా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారు. ఒకవేళ తెలంగాణ పెద్దమనుషుల ఒప్పందం జరుగకున్నా, ఆ ఒప్పందాన్ని తుంగ లో తొక్కినా కొత్త రాష్ట్రం అనతికాలంలోనే అంతర్యుద్ధాన్ని చవిచూస్తుంది.

- కనీజ్ ఫాతిమా
ముస్లిం ఫోరమ్ ఫర్ తెలంగాణ