Monday, July 29, 2013

My Father Balaiah Telugu Book Review By Gogu Shyamala, Fellow, Anveshi Women Research Center, HyderabadMy Father Balaiah Telugu Book Review By Gogu Shyamala, Fellow, Anveshi Women Research Center, Hyderabad 
Namasete Telangana Sunday Telugu News Paper Dated : 22/7/2013

Sunday, July 28, 2013

కచ్చీరు ఉమ్మడి వేదికకు దిక్సూచి - డాక్టర్ పసునూరి రవీందర్


July 29, 2013
'బహుజన కచ్చీరు' చర్చ పూర్తిగా పక్కదారి పట్టింది. విశాల ప్రయోజన దృష్టితో నిర్వహించిన కచ్చీరు కొందరి సంకుచిత ఆలోచనల నడుమ గమనం గతితప్పింది. 'వివిధ'లో వ్యక్తమైన కొన్ని అభిప్రాయాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అగ్రవర్ణాలు తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం బీసీలను, దళితులను పావులుగా వాడుకుంటున్నారు. అందుకే ఎక్కడ సంఘం పెట్టినా అందులో ఒకరిద్దరు దళితులకు, బీసీలకు అవకాశం కల్పించారు. పైగా అగ్రవర్ణ రాజకీయ నాయకుల కార్యక్రమాలకు మద్దతు కూడగట్టే వారిగానే వారిని మార్చివేశారు. ఈ మూసనుండి బయటపడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ (బహుజన) సాహిత్యకారులంతా కలిసి బహుజన ఉద్యమాన్ని నిర్మించాలని కొందరం భావించాం. ఇదే సందర్భంలో బహుజన కథల విషయానికి వచ్చేసరికి శిల్పపరమైన చర్చ అనివార్యంగా అగ్రవర్ణస్తులు ముందుకు తెస్తుండడం గమనించాం. ఇలాంటి చర్చ జరుగుతున్నప్పుడు దళితులు, బీసీలు చెప్పిన ఏ విషయాన్ని కూడా అగ్రవర్ణ సాహిత్యకారులు అంగీకరించడం లేదు. దీంతో అగ్రవర్ణాలతో కూడిన బహుజనోద్యమం సాధ్యం కాదనే విషయం స్పష్టమైంది. ఆధిపత్యవర్గాల దిశానిర్దేశాలు లేకుండా ముందుకెళ్లాలనే నిర్ణయం బలం గా ముందుకొచ్చింది. అందుకోసం బహుజనుల ఆధ్వర్యంలోనే బహుజన కథకుల కచ్చీరు జరగాలని నిర్ణయించుకొని సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబ, నేను కలిసి ఏర్పాటుచేశాం.

ఈ 'కచ్చీరు' ఏర్పాటు వెనుక దాగిన కీలకోద్దేశాన్ని అర్థం చేసుకోకుండానే ఆరంభంలోనే కొందరు మిత్రులు తొందరపడ్డారు. సమస్యను గుర్తించిన పగ డాల నాగేందర్ దాని పరిష్కారాన్ని ఆలోచించకుండా ఇది సాధ్యం కాదన్నట్టు ఆదిలోనే అందరినీ నిరుత్సాహపరిచాడు. బీసీలు అంబేద్కర్‌ను ఒప్పుకోరని, తన పర్సనల్ అభిప్రాయాన్ని జనరలైజ్ చేసే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి ఇవాళ కార్యక్షేత్రంలో బీసీలు, దళితులు కలిసి అనేక సామాజిక ఉద్యమాల్లో కలిసి పనిచేస్తున్నారు. ఊరూరా ఫూలే, అంబేద్కర్ విగ్రహాలను నెలకొల్పుకుంటున్నారు. అంబేద్కర్‌ను గౌరవించే స్థాయిలోనే ఫూలేను కూడా దళితులు గుండెలనిండా నిలుపుకుంటున్నారు. ఈ వాస్తవాన్ని మరిచి చీలికలు తీసుకురావడం బహుజనోద్యమానికి నష్టమే తప్ప ప్రయోజనం కాదు. అంబేద్కరిజమంటే బుద్ధుని నుంచి కాన్షీరాం వరకు అనేకమంది బహుజన మహాపురుషుల తాత్వికత అని చెబితే దాన్ని అంగీకరించలేకపోయారు. బహుజనవాదం అనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యతతోనే రూపుదిద్దుకుంటుంది. సమాజంలో మెజారిటీగా ఉన్న బహుజనులు తమ ఐక్యతను కాదనుకొని కులాలవారీగా విడిపోతే ఆ పయనం ఏ దరికీ చేరదు.

ప్రతీ కులానికి తమ అస్తిత్వం ముఖ్యమే. కానీ దళితులకు, బీసీలకు, గిరిజనులకు, మైనారిటీలకు అందరి మధ్య ఉన్న కామన్ పాయిం ట్ అగ్రవర్ణ పీడితమే. అలాంటప్పుడు వీళ్లంతా కలిస్తేనే బహుజన ఉద్యమంలో విప్లవాత్మకమైన మార్పు సాధ్యమవుతుంది. బ్రాహ్మణీయ భావజాలం బహుజనుల్ని కులాల పేరుతో విడదీస్తే ఇవాళ కొందరు మిత్రులు ఫూలేను బీసీలకు, అంబేద్కర్‌ను దళితులకు మాత్రమే పరిమితం చేయడం ఖచ్చితంగా బ్రాహ్మణీయ భావజాలమే. మనుషులను విడదీసీన మనువాదం లాంటిదే ఇది కూడా. దళితులతో కలిసి పనిచేస్తే తమ అస్తిత్వానికి నష్టం వాటిల్లుతుందనే సంకుచితమైన అభద్రతాభావం వారిలో ఎందుకు ముందుకొస్తున్నది? బహుజనులంతా మూలవాసులనే తాత్విక భావన ఎందుకు కొరవడుతున్నదో అందరం ఆలోచించాలి. ఈ రకమైన పయనం ఎవరికి మేలు చేస్తుందో అర్థం చేసుకోవాలి.

అగ్రవర్ణ ఆధిపత్యం ప్రతీ సందర్భంలో ఇక్కడి భూమి పుత్రులను భౌతికంగానో, అభౌతికంగానో గాయపరుస్తూనే ఉంది. ఈ కుట్రలను ఓ కంటకనిపెడు తూ పోరాడాల్సిన బాధ్యత బహుజన సమాజానిది. ఈ దేశంలో ఉన్న నూటికి ఎనభైఐదు శాతంమంది బహుజనులే! సంపద సృష్టికర్తలైన వీరికి కనీసఅవకాశా లు దక్కకుండా చేశారు అగ్రవర్ణ పాలకులు. ఈ దుర్మార్గాలను బయటికి కనపడకుండా అగ్రవర్ణ సాహిత్యకారులు ఎప్పటికప్పుడూ జాగ్రత్త పడుతూనే ఉన్నా రు. బహుజనుల మధ్య ఐక్యత సాధ్యపడకుండా బ్రాహ్మణీయవాదులు కుట్ర చేస్తూనే వస్తున్నారు. దీనిని గ్రహించకుండా బహుజనులు తమలో తాము కొట్లాడుకుంటున్నారు. ఈ వాస్తవాలను గ్రహించలేనంత అంధకారంలోకి కూరుకుపోయిన బహుజన జాతి జాగృతానికి బహుజన సాహిత్యోద్యమం చారిత్రక అవసరం.
గడచిన మూడు దశాబ్దాలుగా బహుజనులు చేసిన సాహిత్యకృషి అసామాన్యమైంది. అప్పటికే స్థిరపడిపోయిన సాహిత్య విలువల్ని తృణీకరించి రచనలు చేయడం మామూలు విషయం కాదు. మొదట దళిత ఉద్యమం పురుడుపోసుకొని అగ్రవర్ణ ఆధిపత్యాన్ని నిలదీసింది. బీసీ కవులు ఇందులో భాగమయ్యారు. ఆనాడే బహుజనవాద దృష్టితో ఉద్యమం నడిచి ఉంటే ఇవాళ తెలుగు సాహిత్య చిత్రపటం మరోలా ఉండేది. ఇవాళ ఎవరికి వారు పూర్తిగా విడివడి దూరం జరుగుతున్నారు. ఈ పరిణామం ప్రమాదకరం. ప్రొఫెసర్ కొమ్రన్న బతికి ఉన్నప్పుడు దళితుల పట్ల, బీసీల పట్ల, ముస్లింల పట్ల ఒకే రకమైన బాధ్యతతో నడుచుకున్నాడు. ప్రస్తుతం డా.కాలువ మల్లయ్య లాంటి వారి స్ఫూర్తి అందరిలో రావాలి. ఎవరు బాధితులు, మనం ఎటువైపున్నామో ఆలోచించుకోవాలి.

ఇవాళ కావాల్సింది బహుజన రచయితలందరూ కలిసి ఒక ప్రత్యామ్నాయం నెలకొల్పడం. బీసీల్లోని ఒక కులం మరొక కులాన్ని వీళ్లు మా బీసీలే అనే భావన పెంపొందించుకోవాలి. అలాగే దళితుల్లోని కులాల్లోనూ ఉన్న భేదాభిప్రాయాలను తొలగించుకోవాలి. ఈ అగాథాలను అగ్రవర్ణాలే ట్యూన్ చేసి పెట్టాయి. ఈ అగాథాల్ని పూడ్చవలసిన బాధ్యత సామాజిక ఉద్యమకారులతోపాటు, సాహిత్యకారుల మీద కూడా ఉంది. దళిత, బీసీ, గిరిజన, మైనారిటీలను కలుపుకుపోయి ఒక బలమైన ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసుకోవలసిన అవసరముంది. విశాల దృక్పథంతో బహుజన రచయితలందరి కోసం ఒక ఉమ్మడి వేదిక ఏర్పడాలి. అది బహుజన రచయితల సంఘంగానో, వేదికగానో ఉంటే బాగుంటుంది. కలిసిరాని, రాలేని వారిని వదిలేద్దాం. ఈ దేశమూలవాసులమనే ఎరుకతో, ఫూలే, అంబేద్కర్ ఆలోచనా విధానం ప్రాతిపదికగా ముందుకు వెళదాం.
- డాక్టర్ పసునూరి రవీందర్
drpasunuri@gmail.com
Andhra Jyothi News Paper Dated : 29/07/2013

Saturday, July 27, 2013

Exclusive Story on Dalit Maha Sabha Leader (Dr. Kathi Padma Rao ) ఎదిరించి ఎదగటం నేర్పింది


July 28, 2013
'మాది మాలపల్లే కావచ్చు. కానీ అది మామూలు పల్లె కాదు. సమాజంలో తేడాలు తెలిసిందక్కడే, ఆత్మవిశ్వాసం మారాకు తొడిగిందక్కడే' అంటున్నారు దళిత ఉద్యమకారుడు, అధ్యయనశీలి కత్తి పద్మారావు. సంస్కృత సాహిత్యాన్ని, ఆత్మగౌరవ పోరాటాన్నీ నేర్పింది తన ఊరు ఈతేరే అంటున్న ఆయన చెబుతున్న విశేషాలే ఈవారం 'మాఊరు'.
మా ఊరు ఈతేరు గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని పల్లెటూరు. ఎక్కడైనా ఊరు పెద్దగా వాడ చిన్నగా ఉంటుంది. కానీ మా ఊళ్లో మాది మూడొందల గడప మాల పల్లె. 40 కుటుంబాలు కమ్మవారు, రెండు మూడు కుటుంబాల వడ్డెరలు, బ్రాహ్మణులు ఓ ఐదు కుటుంబాలు ఉండేవి. నేను 1953 జులై 27న పుట్టాను. మా అమ్మ మాణిక్యమ్మ, మా నాన్న సుబ్బయ్య. ఇద్దరూ వ్యవసాయ కార్మికులే. నేను పుట్టేనాటికి వారికి సొంతంగా భూమి అంటూ ఏమీ లేదు. మా నాన్న కమ్మలు, బ్రాహ్మల దగ్గర జీతానికి ఉండేవాడు. విచిత్రమైన విషయం ఏమంటే మేం ఈతేరులో ఉండేది ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే. అదీ వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండే జూలై నుంచి డిసెంబరు వరకూ. మిగిలిన ఆర్నెల్లూ నా తల్లిదండ్రులు చీరాలలోని ఇండియన్ లీఫ్ టొబాకో డిపో (ఐఎల్‌టీడీ)లో కార్మికులుగా పనిచేసేవారు. అందువల్లే నా బాల్యమంతా ఇక్కడ ఆర్నెల్లు - అక్కడ ఆర్నెల్లుగా గడి చింది.

తేడాలు తెలిశాయి
ఇలాంటి జీవనశైలి వల్ల నాకు ఊహ తెలుస్తున్న కొద్దీ మా ఊరిని వేరే ఊళ్లతో పోల్చి చూసుకోగలిగే వెసులుబాటు దక్కింది. మొట్టమొదట నేను గమనించిన విషయం ఏమంటే - చీరాలలో మేం ఉండేది కూడా ఒక దళిత వాడలోనే. కానీ అది పద్దెనిమిది పేటల సముదాయం. అంతమందిలో ఉండటం వల్ల, పట్టణ పద్ధతుల వల్లా అక్కడ మాకు అంటరానితనమంటే ఏమిటో తెలియదు. అదే ఈతేరుకు వచ్చేసరికి అంటరానితనం ముల్లులా గుచ్చుకునేది. జనాభా ఎక్కువమంది మాలలే అయినప్పటికీ, ఊళ్లో 80శాతం భూమి అగ్రవర్ణాల అధీనంలోనే ఉండటంతో మాపై వారి ఆధిక్యం కొనసాగేది. అది నాకు కొట్టొచ్చినట్టు కనిపించిన మొట్టమొదటి తేడా. ఉదాహరణకు ఈతేరులో మా నాన్నను జీతానికి ఉంచుకున్నవారే కాకుండా, ఇతరులు కూడా ఏరా, రారా, పోరా అని సంబోధిస్తూ మాట్లాడేవారు. అదే చీరాలలో ఆయనను ఎవరూ అలా పిలిచేవారు కాదు. పేరుతోనో, ఏదైనా వరసతోనో పిలిచేవారు. ఇది నాకు విచిత్రంగా ఉండేది. 'అదేమిటి' అని నేను అడిగితే 'పెద్దవాళ్లు అలానే పిలుస్తారు' అనేవారే తప్ప, మా వాడవాళ్లెవరూ దాన్ని తప్పని కూడా అనుకునేవారు కాదు. కానీ మా అమ్మ మాత్రం ఈ తరహా సంబోధనలను సహించేది కాదు. ఎందుకంటే ఆమె పెద్ద మేస్త్రి బిడ్డగా పుట్టింది, పెరిగింది. చీరాల ఐఎల్‌టీడీలో మా తాత కట్టా రాఘవులంటే పెద్ద పేరు. 4000 మంది ఉద్యోగులకు ఆయన మేస్త్రి. ఇప్పటికీ నన్ను అక్కడ అందరూ కట్టా రాఘవులు మనవడిగానే గుర్తుపెట్టుకుంటారు. మొత్తానికి అందువల్ల మా అమ్మ ఈతేరులో తనను ఎవరైనా 'ఏమే, ఒసే, ఒయే' అని పిలిస్తే ఊరుకునేది కాదు. పేరుతోనే పిలవమని గట్టిగా చెప్పేది. నాలో ఆత్మగౌరవమనే విత్తనాలను నాటింది మా అమ్మే. నన్ను ఉద్యమకారుడిగా భావిస్తారు అందరూగానీ, నాకన్నా ఉద్యమకారిణి మా అమ్మ.

నీటి కోసం నడక
ఈతేరులో చెరువు, బావి అన్నీ ఉన్నా సరే, మాలపల్లెకు మంచినీళ్లు కావాలంటే రెండు కిలోమీటర్ల దూరం నడిచి గుడిపూడి గ్రామానికో, లేదంటే మరిపూడికో వెళ్లాల్సిందే. గుడిపూడిలో బ్రాహ్మలు, మరిపూడిలో క్షత్రియుల సంఖ్యాబలం ఎక్కువ. ఇంతదూరం బిందె పట్టుకుని నడిచివెళ్లినా సరే, అక్కడ బావిలోంచి నేరుగా నీటిని తోడుకోకూడదు మేం. వాళ్లెవరైనా తోడి పోసేవరకూ వేచి ఉండాల్సిందే. వాళ్లు మురికి చేతులతో పోసినా కిమ్మనకుండా తెచ్చుకోవాలి. ఆ రోజుల్లో మా వాడలోని ఆడవాళ్లందరికీ ఇదో పెద్ద పరీక్ష. ఊరి చెరువులో ముంచి తెచ్చుకోవాలంటే కూడా పద్ధతులున్నాయి. అగ్రవర్ణాల వారికి ఒక రేవు, మాకు వేరేగా ఒక రేవు. అయితే వాళ్ల పశువులను తీసుకొచ్చి మా రేవులో నీళ్లు తాగించేవాళ్లు. అదేమని అడగడానికి వీల్లేదు. చుండూరు మారణకాండకు దారి తీసిన అంశం సరిగ్గా ఇదే. అక్కడి దళితుల రేవులో ఒక కమ్మాయన పశువులకు నీళ్లు పట్టడమే కాకుండా, కుడితిని అందులో పారబోశాడు. అదేమని ప్రశ్నించిన పాపానికి దళితుల మీద హత్యాకాండ కొనసాగింది. అస్పృశ్యతను నేర్పించింది బ్రాహ్మలే అయినా, దాన్ని గట్టిగా ఆచరణలో పెట్టి అడ్వాంటేజ్ తీసుకున్నవారు కమ్మ, వెలమ, రెడ్డి వంటి కులాలవారే అని గట్టిగా చెప్పగలను.

ఆత్మవిశ్వాసానికి పుట్టినిల్లు
అయితే మా ఊళ్లో పరిస్థితి మరీ అంత ఘోరంగా ఉండేది కాదు. ఎందుకంటే 60ల నాటికే మా వాడలో అవగాహన ఎక్కువగా ఉండేది. నేను ఎనిమిదో తరగతికి వచ్చేసరికి మా నాన్న కూడబెట్టిన సొమ్ముతో ఈతేరులో నాలుగు ఎకరాలు భూమి కొన్నారు. దాన్ని ఊళ్లోని కమ్మోరు కుళ్లుకున్నారు, కళ్లలో నిప్పులు పోసుకున్నారు. ఎలాగైనా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఒకాయన మా పొలానికి నీళ్లు రాకుండా చేశాడు. దాంతో మా నాన్న పార పెట్టి నరికాడు. ఆయన ముక్కు తెగిపోయి ప్రాణాపాయంలో పడ్డాడు, మా నాన్న కేసుకు భయపడి తన మేనమావల ఊరికి పారిపోయాడు. కొన్నాళ్లకు మళ్లీ తిరిగొచ్చాడు. ఇలాంటి చెదురుమదురు సంఘటనలు కొన్ని జరుగుతూనే ఉండే వి. అందువల్ల మాలపల్లెలో దాదాపు అందరిళ్లలోనూ పదునుపెట్టిన పారలు, బల్లేలు, పలుగుల వంటివి తప్పనిసరిగా ఉండేవి. 67లోనే మేం డాబా ఇల్లు కట్టుకున్నాం. ఆ రోజుల్లో మా ఊళ్లో అగ్రకులాలకు సైతం డాబా ఇల్లు లేదంటే నమ్మండి! ఇంట్లో మాకు ఐదు పాడి గేదెలు ఉండేవి. అందువల్ల మేం దేనికీ ఇబ్బంది పడిన రోజులేవీ లేవు. 'మేం ఎవరికన్నా తక్కువ కాదు' అన్న ఆత్మవిశ్వాసాన్ని, ఎసర్షన్ (ఎదిరించి నిలబడ టం) నేర్పింది మా ఊరే.

సాంస్కృతిక ధనవంతులం
దళితులు డబ్బుకు పేదవారేమోగానీ, సంస్కృతి అనే ధనం వాళ్ల దగ్గర పుష్కలంగా ఉంటుంది. కళలు, సంస్కృతికి మా మాలపల్లె ఆటపట్టు అని చెప్పడానికి నేనేమీ సందేహించను. ఇక్కడి స్త్రీలు పని అంతా పాటతోనే చేసేవారు. 'కలహంస నడకల... కలహంస నడకల... కదలిరావే...' అంటూ ఏ నలుగుపాటనో మా అమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ వంటివాళ్లంతా కలిసి గొంతెత్తి పాడారంటే అది ఊరుఊరంతటికీ వినిపించేది. ఆ పాటల్లోంచే నేను శృతి నేర్చుకున్నా. ఆరున్నర శృతిలో గొంతెత్తి పాడగలనంటే, ఉపన్యాసాల్లో మాట్లాడగలనంటే దానికి పునాది ఆ వాడ వేసినదే. మా వాడలో ఎవరైనా పాలితాలికలు, అరిసెలు వంటి తినుబండారాలు చేసుకుంటే వాడలోని గర్భిణులకు పెట్టిగాని తాము తినేవారు కాదు. అదే అగ్రవర్ణాలవారు కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా స్త్రీలతో పని చేయిస్తారు. జాలి లేని కులాలేవంటే అగ్రకులాలే. వాళ్లు సంస్కృతిపరంగా బలహీనులని నాకు చిన్నప్పుడే అర్థమయింది. ఎందుకంటే వాళ్లలో ఎవరైనా చనిపోతే పట్టుమని పదిమంది రావడానికి వెనకాడతారు. అలాగే ఆడవాళ్లు వెంటరారు. అదే దళితుల్లో ఎవరు చనిపోయినా వందల్లో చుట్టపక్కాలు వస్తారు. స్త్రీలు సైతం శ్మశానానికి వస్తారు. పుట్టుక, పెళ్లి, చావు - ఈ మూడూ మనిషి ప్రయాణంలో మైలురాళ్లు. అక్కడ మనతో ఎంతమంది తోడున్నారో అనేదే మన సంస్కృతి కింద లెక్క.

మాదొక సువార్త దళం
ఈతేరులో మాకు విడిగా బడి ఉండేది. నేను ఇక్కడుండే ఆరునెల్లూ ఈ స్కూలుకే వెళ్లేవాణ్ని. స్కూల్లో డ్రిల్లు మాస్టారు మాకు మంచి తర్ఫీదునిచ్చేవారు. ఆరోజుల్లోనే మా ఊరి నుంచి జాతీయస్థాయి ఆటగాళ్లుండేవారు. మాతో బోలెడన్ని ఆటలు ఆడించి శారీరక సామర్థ్యం పెరిగేలా, స్పోర్టివ్ స్పిరిట్ అలవడేలా చేసింది మా డిల్లు మాస్టారే. స్కూలయిపోయిన తర్వాత మా పేటలోనే ఉండే చ ర్చికి పరుగులు తీసేవాళ్లం. ప్రతి ఆదివారం అక్కడ 'సండే స్కూల్' అని నడిపేవారు. పిల్లలంతా వె ళితే అక్కడ ఎన్నో విషయాలు నేర్పేవారు. శుచిశుభ్రత, మంచి నడవడిక, నైతిక విలువల గురించి చిన్న కథలు, పాటలుగా చెబుతూ ఆకట్టుకునేవారు. బైబిల్ చదవడం, ప్రార్థన గీతాలు నేర్పించారు. ఆ ప్రభావంతో నేను 'సువార్త దళం' అనే బృందాన్ని ఒకటి ఏర్పాటు చేసి చిన్నచిన్న సేవాకార్యక్రమాలను చేపట్టేవాణ్ని. పాటలు పాడటం, సంగీత వాయిద్యాలను పలికించడం అక్కడే నేర్పించారు. నేను ఐదారు వాయిద్యాలను పలికించేవాణ్ని. అందువల్లే పాటలకు సొంతంగా బాణీలు కట్టుకోవడం అలవాటయింది. బైబిల్ చదవడం వల్ల నాకు పదసంపద పెరిగింది. నేను మాట్లాడే మాటల్లో పాడే పాటల్లో ప్రాస వచ్చి చేరేది. బోలెడన్ని సంస్కృత పదాలు నా ఒంటబట్టాయి. మరోవైపు పొగతాగడం, మద్యం సేవించడం, పేకాట వంటివాటి జోలికి పోకూడదనే నా నియమం కూడా చర్చి బోధనల ప్రభావమే. క్రిస్మస్, ఈస్టర్ వస్తోందంటే చాలు - చర్చిని అలంకరించడం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యడం వీటలో తలమునకలయిపోయేవాళ్లం. కొత్తబట్టలు వేసుకోవడం అంటే గొప్ప సంబరంగా ఉండేది.

చీరాల ప్రభావం
చీరాలలో ఉన్నప్పుడు పేరాలలోని శ్రీదుగ్గిరాల గోపాలకృష్ణ హైస్కూలుకు వెళ్లేవాణ్ని. హైస్కూలు స్థాయిలోనే నేను వక్తగా మంచి పేరు తెచ్చుకున్నాను. రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ గె లిచాను. వక్తృత్వంతో పాటు కవిత్వం, నాటకం, బుర్రకథ - ఇలా అన్ని సాంస్కృతిక అంశాల్లోనూ చురుగ్గా పాల్గొనేవాణ్ని. నేనే స్వయంగా రాయడం, పాడటం, అభినయించడం వంటివన్నీ చేసేవాణ్ని. దీనికి తోడు ఎన్‌సీసీలో కమాండర్‌గా కూడా ఉండేవాణ్ని. దాంతో నాయకత్వ లక్షణాలు నాలో బలపడ్డాయి. ఒకసారి ఏమైందంటే చీరాల ఐఎల్‌టీడీ చుట్టుపక్కల ఉండే పేటలన్నీ ఒక్కసారిగా అగ్నిప్రమాదంలో దగ్థం అయిపోయాయి. దాదాపు 800 గుడిసెలు కాలిపోయాయి. అక్కడివాళ్లెవరికీ కట్టుబట్టలు తప్ప మరేమీ మిగల్లేదు. అది చూసి నా మనస్సు వికలం అయిపోయింది. అది నా మొదటి సామాజిక దుఃఖం. దాంతోనే 'వినరండయా చింత గానం... కనలేమయా ఇంత ఘోరం...' అన్న పాట రాశాను. మరికొందరు పిల్లలను పోగుచేసి ఆ పాట పాడుతూ జోలె పట్టి విరాళాలు పోగు చేసి బాధితులకు అందించాను. పదో తరగతిలోనే అంబేద్కర్ జీవిత చరిత్ర నన్ను బాగా ప్రభావితం చేసింది. రోజూ ఉదయాన్నే దినపత్రికలు చదవాలి - ప్రతిరోజూ అధ్యయనం చెయ్యాలి - ప్రతిరోజూ కొంతైనా రాయాలి - ఆలోచనలు, అనుభవాల గురించి మాట్లాడాలి - అన్యాయం ఎక్కడ జరిగినా ఎదిరించాలి - మాటల్లో చెబుతున్నదాన్నే ఆచరించాలి - ఈ లక్షణాలను నేను అంబేద్కర్ జీవిత చరిత్ర నుంచే అలవరచుకున్నాను. చీరాల పౌర గ్రంధాలయం, పొన్నూరు కాలేజీలోని లైబ్రరీ నా ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషించాయి. నేను గొప్ప వాళ్లందరి జీవిత చరిత్రలూ అక్కడే చదివాను.

ఐదేళ్ల కోర్సు ఐదు ఊళ్లు
తెలుగులో నా అభినివేశం అంతా బైబిల్ చదవడం నుంచి వచ్చిందేనని నిస్సందేహంగా చెప్పగలను. నా స్కూలు మాస్టార్లు జానకిరామయ్య, తిరువేంగళాచార్యులు, అవ్వారు సుబ్బారావు వంటి వారంతా కలిసొచ్చి పదో తరగతి తర్వాత నన్ను పొన్నూరులోని 'శ్రీభావనారాయణస్వామి సంస్కృత కళాశాల'లో చేర్పించారు. లక్ష్మీపార్వతి, ఐ. వెంకట్రావు, కె. కృష్ణకుమారి వీళ్లంతా పొన్నూరు కాలేజీలో 'భాషాప్రవీణ' కోర్సులో నా సహాధ్యాయులు. అక్కడ, ఆ కోర్సులో చేరిన మొదటి దళితుణ్ని నేనే. దాంతో వివక్ష తప్పదని అనుకున్నాను. నేను ఆగస్టు పదిన చేరితే, పదిహేనున స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉపన్యాసం ఇవ్వమన్నారు. ఆరోజు నేను మాట్లాడినదానికి కాలేజీలో అందరూ ముగ్థులయ్యారు. దాంతో వివక్ష విశ్వరూపం చూపించలేదు. కొండవీటి వెంకటకవిగారు అప్పటికి మా కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు. ఆయన వల్ల నాకు త్రిపురనేని రామస్వామి బోధనలు తెలిశాయి. అప్పటివరకూ నాలో పేరుకుపోయిన క్రైస్తవం కరిగిపోయి హేతువాదం రుచి తెలిసింది. కాలేజీలో వెంకటకవిగారు మాత్రమే నా భుజం మీద చెయ్యి వేసి నడిచేవారు. వివక్ష మూలంగా నేను జిల్లెళ్లమూడి కాలేజీకి మారాను. ఆ తర్వాత తాడికొండ, పత్తేపురంలో చదివి ఐదో ఏడు మళ్లీ పొన్నూరు కాలేజీకే వచ్చి చేరాను. అన్నిచోట్లా కులం వల్ల అవమానాలే. కొద్దిమంది లెక్చరర్లు, ప్రిన్సిపాళ్లు మాత్రం నాకు సహాయంగా ఉండేవారు. తెలుగు సంస్కృత వ్యాకరణాలు, కౌముది, కాదంబరి, దశకుమారచరిత్ర, అలంకారశాస్త్రం వంటివన్నీ నేను సొంతంగా చదువుకుని అర్థం చేసుకునేవాణ్ని. ఉదయం నాలుగ్గంటల వరకూ చదివేవాణ్ని. నాతోటి విద్యార్థులకు ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేసేవాణ్ని. నేను చదువుకున్న పొన్నూరు కాలేజీలో, మా గురువుగారు వెంకటకవి స్థానంలోకే లెక్చరర్‌గా వచ్చానంటే నేను సాగించిన కృషి ఎటువంటిదో అర్థమవుతుంది. ఒకరకంగా సంస్కృతం చదువుకోవడానికి యుద్ధం చేశానని చెప్పవచ్చు.

ఎప్పుడూ ఏదీ అడక్కు
మా నాన్న సుబ్బయ్యది ఏదైనా సొంతంగా కష్టపడి సాధించుకోవాలనే తత్వం. దానికి అత్యుత్తమ ఉదాహరణ ఏదంటే - ఈతేరులో మేం ఇల్లు కట్టుకోవడానికి అవసరమైన ఇటుకలను ఆయనే స్వయంగా తయారుచేసి ఇటుక ఆవం కాల్చి వాటినే ఉపయోగించాడు. కలపకు అవసరమైన దుంగలను మా అమ్మానాన్నలే స్వయంగా కొట్టుకున్నారు. నేను లెక్చరర్ అయ్యాక ఒకసారి తోటి ఉద్యోగిని ఒక పుస్తకం అడగడాన్ని గమనించాడు మా నాన్న. 'ఇవాళ్టి నుంచీ నీ జీతంలో సగమే ఇంటికివ్వు. మిగిలింది నువ్వు పుస్తకాలు కొనుక్కో. ఎప్పుడూ ఎవరినీ ఏదీ అడగకు' అని చెప్పాడు. ఆయన చెప్పిన ఆ మాటల వల్లే నా సొంతంగా ఇంత అత్యుత్తమ లైబ్రరీని ఏర్పరచుకోగలిగాను. అలాగే 'ఎప్పుడూ ఎవరి దగ్గర నుంచీ ఏమీ ఆశించకు' అన్న మాటలను పాటించడం వల్లనే నేను దళితుల కోసం 14కాలనీలు కట్టించినా ఎక్కడా ఒక్క ఇల్లయినా తీసుకోలేదు, ఎన్నో జాగాలను ఇప్పించినా ఎక్కడా సెంటు భూమయినా నా పేరున తీసుకోలేదు. ప్రస్తుతం ఈతేరుకు ప్రెసిడెంటు మా వదినే. ప్రస్తుతానికి ఈతేరులోని మా వాడనుంచి ముప్ఫై మంది ఇంజినీర్లు, పదిహేనుమంది డాక్టర్లు ఉన్నారు.

దుఃఖసముద్రం
బాల్యంలో ఏమాత్రం ఖాళీ దొరికినా చీరాల సముద్రపు ఒడ్డుకు పిక్నిక్కు వెళ్లేవాళ్లం. దాదాపు ప్రతి వారం వెళ్లేవాళ్లం. ఒకసారి అలా వెళ్లినప్పుడు మా స్నేహితుడు పులి నాగేశ్వర్రావు కొట్టుకుపోయాడు. అది నాకు చాలా దుఃఖాన్ని కలిగించిన సంఘటన. అందువల్లే నా కవిత్వంలో సముద్రం ఒక ప్రతీకగా చాలాసార్లు కనిపిస్తుంది.
ఎద్దునొదిలారు
ఈతేరు చెరువు గట్టున ఒక వీధి లైటు ఉండేది. దాని దగ్గరే కూర్చుని నేను బిగ్గరగా చదివేవాణ్ని. నా చదువు అగ్రకులాలకు కంటగింపుగా ఉందన్న సంగతి తెలిసి, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చన్న అనుమానంతో మా నాన్న నాకు సాయంగా కూర్చునేవాడు. ఊహించినట్టే ఒకసారి ఒకాయన నామీదకు ఎద్దును ఉసిగొలిపాడు. అది పరుగులు పెడుతూ నావైపే రావడం చూసిన మా నాన్న చేతిలో ఉన్న పెద్ద కర్రసాయంతో దాన్ని కొమ్ములు విరిగేలా కొట్టాడు!
- నవ్య డెస్క్
ఫోటోలు : బాషా, పొన్నూరు

Andhra Jyothi Telugu News Paper Dated : 28/07/2013

అగ్రకుల పార్టీలు బడుగులు స్వీయ నాయకత్వమే శరణ్యం By కదిరె కృష్ణ,


మోడీ అభ్యర్థిత్వంపై అగ్రకులాల అక్కసు!
బడుగుల ఓట్ల ఆకర్షణే బిజెపి లక్ష్యం
బంగారు లక్ష్మణ్‌ను తొక్కివేసిన బిజెపి 
జగ్జీవన్‌రామ్‌ను మోసం చేసిన కాంగ్రెస్‌ 
అవగాహనా లేమితో రాహుల్‌ గాంధీ 

అగ్రకుల పార్టీలు 2014 సాధారణ ఎన్నికల దృష్టితో ఒక నాటకం ప్రారంభించాయి. నరేంద్ర మోడీని బిజెపి, రాహుల్‌ గాంధీని కాంగ్రెస్‌- భావి ప్రధానులుగా, దేశ పరిరక్షణ శక్తులుగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఇందులోని కుటిల నీతిని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు పసిగట్టనట్లయితే మరొకసారి మోసానికి గురికాక తప్పదు. హిందుత్వాన్ని కాపాడుకోవడానికి బిజెపికి ఇప్పుడు నరేంద్రమోడీ అనివార్యమైపోయారు. భారత్‌ వెలిగిపోతోంది వంటి నినాదాలు ఈ పార్టీని మరింత చీకటిలోకి నెట్టాయి. సేనాని పాత్రలో అద్వానీని ప్రజలు నిరాకరించడంతో గత్యం తరంలేక మోడీని తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఇప్పుడు అభివృద్ధి, ఉగ్ర వాద శక్తుల పట్ల కఠినవైఖరి వంటివాటితో మోడీని మెరిపించాలన్నదే బిజెపి యత్నం. ఈ క్రమంలోనే మోడీని తమ ఎన్నికల కమిటీ సారథిగా బిజెపి ప్రకటించింది. బిజెపి నిండా అగ్రకుల బ్రాహ్మణులు తిష్ఠ వేసి ఉన్నారు. ప్రత్యక్షంగానే ఎస్సీ, ఎస్టీ, బిసి కులా ల అభివృద్ధి, రిజర్వేషన్ల పట్ల బిజెపి తన అక్కసు వెళ్ళబోసుకుంటోంది. 

ఈసారి బహుజనవర్గాల నాయకత్వాన్ని బిజెపిలోని అగ్రకుల నాయకులు తట్టుకోలేక పోయారు. శూద్రుడైన మోడీని నాయకుడిగా అంగీకరించడానికి మనస్కరించక అద్వానీ రూపంలో తమ స్వభావాన్ని మరోసారి వెళ్ళబుచ్చారు. అద్వానీ, మోడీ విషయంలో ప్రవర్తించిన తీరు అగ్రకుల స్వభావానికి అద్దంపట్టింది. అస్త్ర సన్యాసం చేసినట్టు ట్విట్టర్‌లో అద్వానీ నమోదు చేసుకొని కొంత వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన కొందరు నాయకులు మోడీ అవసరాన్ని చెప్పడం మూలంగా ఉక్కుమనిషి కొంత మెత్తబడ్డారు. ఇంతకీ మోడీద్వారా బిజెపి ఆశిస్తున్న ప్రయోజనమేమిటి? మోడీ ప్రధాని అభ్యర్థిత్వం ద్వారా బిజెపి పొందగలిగే లబ్ధి ఎంత? 
అభివృద్ధికి ప్రతీకగా మోడీని బిజెపి చూపిస్తున్నప్పటికీ వాస్తవంలో మాత్రం వెనుకబడిన కులాలను (బిసిలను) ఆకర్షించడానికేనని అర్థమవుతుంది. మోడీని సమర్థించడం ద్వారా బిసిలకే రాజ్యాధికారం వస్తుందనే భ్రమ కల్పించడానికి బిజెపి వేసిన ఒక ప్రమాదకర ఎత్తుగడ ఇది. అభివృద్ధి మంత్రమే నిజమైతే గుజరాత్‌- మానవాభివృద్ధి సూచికలో ఎంతో వెనుకబడి ఉంది.

అంటే మోడీ తరహా అభివృద్ధి వల్ల ప్రజల జీవన ప్రమాణాల్లో ఎంత మాత్రం మార్పు రాలేదన్నమాట! బడా పెట్టుబడిదారులు, గుత్తేదారుల అభివృద్ధి నిజమైన అభివృద్ధి కానేరదు. మోడీని అభివృద్ధికి ప్రతినిధిగా బిజెపి భావించడం లేదు సరికదా, ఆయనను నూటికి నూరుపాళ్లు బిసి కులాలను ఆకర్షించడానికే ఎంచుకున్నదనేది నిజం.బిసిలు మోడీని కేవలం బిజెపి నాయకుడిగానే గుర్తించినట్లు స్పష్టమవుతోంది. హిందుత్వ పార్టీలో ప్రధానమంత్రిగా మోడీ చేయగలిగేదేమీ ఉండదని, చివరికి మోడీని వాడుకొని అధికారంలోకి రాగానే అద్వాని వంటి వారిని రంగంలోకి దించే ఒక రహస్య అజెండా కూడా ఇందులో దాగిఉన్నది. ఎస్సీ, ఎస్టీ, బిసిల ఎదుగుదల ఎంతమాత్రం అంగీకరించలేని బిజెపి, ఆరెస్సెస్‌ వంటి హిందుత్వసంస్థలు, పార్టీలు మోడీవంటి శూద్రుణ్ణి ప్రధానిగా అంగీకరిస్తా యనుకోవడం అమాయకత్వమే. బంగారు లక్ష్మణ్‌ను ఎలా బలిపశువును చేశారో విదితమే. సమాజాన్ని హిందూ జాతీయవాద కోణంలో దర్శించే బిజెపిని బహుజనులు నమ్మడం లేదు. బ్రాహ్మణీయ శక్తుల కుట్రలను గ్రహించలేని కొందరు బిజెపి కుట్రకు బలయ్యే అవకాశమూ లేకపోలేదు. 

బాబూ జగ్జీవన్‌రామ్‌ (చమార్‌)కు ప్రధానిగా అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తే, బంగారు లక్ష్మణ్‌ కింది వర్గాలను ఆకర్షించి ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావచ్చనే కారణంతో ఇటు రాజకీయంగా, అటు సామాజికంగా కోలుకోలేకుండా తొక్కివేసింది బిజెపి. ఇటువంటి పార్టీల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలు కీలుబొమ్మలుగానో, అంబేడ్కర్‌ పరిభాషలో ‘బలమైనకుక్కలు(మజిల్‌డాగ్స్‌)’గానో, కాన్షీరాం మాటల్లో ఏ ‘చెంచాలు’గానో ఉంటారేతప్ప స్వతంత్ర నిర్ణాయక శక్తులుగా తమ జాతిని బానిసత్వంలోనుంచి విముక్తి చేస్తారనుకోవడం భ్రమ. మరో ప్రధానఇభ్యర్థి, కాంగ్రెస్‌పార్టీ 2014 ఐకాన్‌ రాహుల్‌ గాంధీ స్వభావరీత్యా అమాయకుడు. కాంగ్రెస్‌ పార్టీలోని బ్రాహ్మణ నారదబృందం ఇతనితో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శింపచేస్తోంది. తెరవెనుక రిహార్సల్స్‌ ఎంత పకడ్బందీగా జరిగినా పార్లమెంటులో పట్టు మని పదినిమిషాలు సొంత శైలి, సొంత దృక్పథాన్ని కనబరచడంలో విఫలమైన వీరుడు! సంపన్నుడిగా పుట్టి, సంపన్నదేశాలలో పెరగడం మూలంగా ఆయనకు భారతీయ జీవితం, పరిస్థితులు ఓపట్టాన అర్థం కావడం లేదు.

ఇదే పరిస్థితి రాజీవ్‌గాంధీకి దాపురించింది. అంచేత రాజీవ్‌ నిర్ణయాలన్నీ అసంబద్ధంగా, అవగాహనా రాహిత్యంతో ఉండేవి. బోఫోర్స్‌, తమిళఈలం వంటఇంశాల్లో ఆయన నిర్ణయాలు, పాత్ర వివాదాస్పదమయ్యాయి. రాహుల్‌గాంధీలో ఈ దోషాన్ని నివారించేందుకు దేశవ్యాప్తంగా పర్యటనలు చేయించారు. పాపం! రాహుల్‌ వాటిని విహార యాత్రల్లా భావించాడేమో కానీ, ఆయనలో ఈ దేశ స్థితిగతులపట్ల ఎంతమాత్రం అవగా హన పెరగలేదు. రాహుల్‌గాంధీ ప్రచారం చేసిన ప్రతి రాష్ర్టంలో కాంగ్రెస్‌పార్టీ ప్రతికూల ఫలితాలనే చవిచూడాల్సి వచ్చింది. రాహుల్‌ హిందుత్వ టెర్రరిజాన్ని తూర్పారబట్టి మైనారిటీ, లౌకికవాదులను ఆకర్షించా లనుకుంటారు. తదనంతరం ఎదురయ్యే ప్రతీఘాతాలను తట్టుకోవడానికి ఆయన రాజకీయ అవగాహనాస్థాయి సరిపోవడం లేదు. ఈదేశంలో ఎంతో వెనుకబాటుతనముంది, స్వాతంత్యం వచ్చి అర్థశతాబ్ది గడిచినా పేదరికం విపరీతంగా పెరిగిపోతోందని బాధపడతారు.

ఇలాంటి దేశంలో పుట్టినందుకు సిగ్గుగా కూడా ఉందని మరీ వాపోతాడు. కాని, స్వాతంత్య్రం వచ్చిన నాటినుండి నేటివరకు ఈ దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన వారు తన వంశీకులేనని, ఈ వెనుకబాటుతనానికి కారణం తన తాత ముత్తాతల ఘనతేనని విమర్శ రావడంతో నాలుక కరచుకుంటారు. బిజెపి బాహాటంగానే బ్రాహ్మణీయ అగ్రకుల శక్తులను సమర్థిస్తే కాంగ్రెస్‌ పార్టీ నిగూఢంగా అదేపనిని అంతకంటే ఎక్కువే చేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్‌ పార్టీ కూడా బ్రాహ్మణులతో నిండి కళకళ లాడుతుంటుంది. ప్రత్యేకంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసిల పట్ల కాంగ్రెస్‌ పార్టీకి ఉండే అభిప్రాయమే (అణచివేత) రాహుల్‌కు ఉంటుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్‌లో తలపండిన నాయకులవద్ద యువరాజుకు తర్ఫీదుజరిగింది. కాబట్టి గతంలో కాంగ్రెస్‌పార్టీ ఎస్‌సి,ఎస్‌టి, బిసిలను అణచివేసినట్లే ఈయన ఆలోచనాధోరణి ఉంటుంది. ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఓటు బ్యాంకును వాడుకొని బ్రాహ్మణీయశక్తుల స్వార్థప్రయోజనాలను నెరవేర్చడానికి రాహుల్‌గాంధీ ఉపయోగపడతాడు. బహుజన సమాజానికి ఉపయోగపడేదేమీ ఉండదు. 

మొత్తంగా రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్యవాదో, తల్లివాదో, తాతవాదో అర్థం కాకుండా ఒక నీడలోని మానవాకారాన్నిపోలి, ఒక గందరగోళ వ్యక్తిత్వంగా మిగిలిపోయి ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ‘ఇప్పుడు రాహుల్‌ ప్రధాని పదవికి అర్హుడు’ అంటూ ప్రకటించారు. ప్రధాని పదవికి అర్హతలు పొందడం అంటే- కాంగ్రెస్‌ పార్టీ ఎత్తులు, జిత్తులు, కుట్రలు, పన్నాగాలు నేర్చుకోవడమే. రాహుల్‌ గాంధీ బిసిలకు రిజర్వేషన్లను వ్యతిరేకించిన గాంధీ వారసుడు. దళితులను నాయకత్వ స్థానంలో చూడజాలని అగ్రకులతత్వ పార్టీ నేత అవుతాడే గానీ బహుజనుల ఆశాజ్యోతి ఎంత మాత్రం కాడు. నూటికి ఎనభైశాతం మంది ప్రజలు ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కాలేకపోతున్నారు. రోజుకు రూ. 33 సంపాదనను ఇక్కడ గొప్ప అభివృద్ధిగా చూపిస్తున్నారు. 

నూతన ఆర్ధిక విధానాలతో మేడిపండు చందంగా ఉన్న అభివృద్ధి, ఆహార లోపంతో బాల్యం, నిరుద్యోగ నిస్పృ హలో యువత! దీనికి తోడు రోజుకో కుంభకోణం, మహిళల అభద్రత వెరసి తీవ్ర నైరాశ్యంతో దేశప్రజలు విలవిల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆర్థిక సామాజిక వ్యవస్థ పట్ల అవగాహన, అంకితభావం ఉన్న నాయకత్వాన్ని అందించగల శక్తులు బహుజనులే. 
బహుజన శక్తుల ప్రతినిధిగా మరో ప్రధాని అభ్యర్థి బహుజనసమాజ్‌ పార్టీ నేత మాయావతి. ఆమె- కాన్షీరాం వారసురాలు. రాజ్యం ముఖం ఎరుగని ఎరుకల, మేథరి, చాకలి, కుమ్మరి వంటి అత్యంత వెనుకబడిన కులాల వాళ్లను అసెంబ్లీకి, పార్లమెంటుకు పంపించిన ఘనత కాన్షీరాంది. అలాంటి బహుజన తాత్వికుల ప్రతిరూపం మాయావతి. బహుజన కులాల అభివృద్ధి పట్ల నిబద్ధత ఉన్న నిజమైన ప్రతినిధి. బహుజన కులాల నేతృత్వంలో అక్కడ బ్రాహ్మణవర్గాలను నడిపించడం ఆమె రాజకీయ చతురత. బ్రాహ్మణీయ కులాల వాటానే వారికి రిజర్వేషన్లుగా ఇస్తున్నారు. 

సాంసృ్కతికంగా, రాజకీయంగా సంస్కరణలకు పునాదులువేస్తూ ఆర్థిక పటిష్ఠతను బహుజన కులాలు పొందగలిగినప్పుడే సామాజిక సమానత్వం సిద్ధిస్తుంది. బహుజనుల్లో సాంసృ్కతిక విప్లవం జనించడాన్ని కాంగ్రెస్‌, బిజెపి తదితర బ్రాహ్మణవాద పార్టీలు జీర్ణించుకోలేవు. బ్రాహ్మణవాదాన్ని మోస్తూ తమ అడుగులకు మడుగులొత్తే బహుజన కులాల నాయకత్వాన్ని పెంచి పోషించేందుకు బ్రాహ్మణ పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేస్తాయి. మహిళలను, ఆర్థిక రంగానికి వెలుపలఉన్న 70 శాతం ఎస్‌సి, ఎస్‌టి, బిసిలను ఆర్థికరంగంలో భాగస్వాములను చేయడం సాంసృ్కతిక విప్లవంలో ప్రధానభాగం. కాంగ్రెస్‌, బిజెపి పార్టీల మాదిరిగా బహుజనులు తమ నాయకులను, సిద్ధాంతాన్ని ప్రొజెక్టు చేయడంలో ముందుకు రావాలి. మోడీని, రాహుల్‌గాంధీని ప్రమోట్‌ చేసుకునేందుకు అగ్రకుల బ్రాహ్మణవర్గాలు చూపే ఉత్సుకత, ఆరాటం బహుజన కులాలనుంచి లోపించింది. ఒక స్వతంత్ర నాయకత్వాన్ని సాధించుకొని, సొంతం చేసుకునే తత్వాన్ని బహుజనులు అలవర్చుకోవాల్సి ఉన్నది.

రాజ్యంపై కాంక్షలేనిదే, రాజకీయ స్పృహ లేనిదే అధికారం కల్ల. రాజ్యాధికారం (స్వతంత్ర) లేనిదే కులబానిసత్వం, వెనుకబాటుతనం నిర్మూలన సాధ్యంకాదు. ఇవన్నీ సాధించేందుకు బహుజనుల్లో చైతన్యం రావడానికి ఉధృతంగా ఉద్యమాలు చేయవలసిన చారిత్రక సందర్భమిది. ఈ ఉద్యమాలకు త్యాగాలవసరమవుతాయి. ఆ త్యాగాలను రిజర్వేషన్ల ఫలితాలు అనుభవిస్తున్న ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, నాయకులే చేయాల్సి ఉంది. బహుజన పితామహుల స్ఫూర్తిని గ్రహించి 2014 ఎన్నికలకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీలు సమైక్యంగా పోరాడితే తప్ప బహుజన రాజ్యం సిద్ధించదు. బహుజన రాజ్యం రానిదే విముక్తి లేదు.

రచయిత మూలవాసీ బహుజన లిబరేషన్‌ మూవ్‌మెంట్‌ కన్వీనర్‌Surya Telugu News Paper Dated : 27/07/2013

Thursday, July 18, 2013

ముస్లిం కోణంలో '1948' By భంగ్యా భూక్యా ,ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ


July 19, 2013
హైదర్ చాలా చిత్తశుద్ధితో 1948 జనవరిలో హైందవ జాతీయవాదులు, రజాకార్ల పరస్పర దాడులను అరికట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం చేసినందుకు సైనిక చర్య అనంతరం హైదర్‌ను ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించి, అరెస్ట్ చేసి, ఆయన పనిచేసిన ఉస్మానాబాద్ జిల్లాలోనే మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆయనపై ఏడు కేసులు నమోదు చేశారు. హైదర్ పాకిస్థాన్‌కో, విదేశాలకో పారిపోకుండా ధైర్యంగా న్యాయపోరాటం చేసి తనపై మోపిన ఆరోపణల్ని నివృత్తి చేశారు. మొహమ్మద్ హైదర్ రచించిన 'అక్టోబర్ కూ' అనే పుస్తకాన్ని గత ఏడాది చివరలో ఢిల్లీ వెళ్లుతూ హైదరాబాద్ విమానాశ్రయంలో కొని ఆత్రుతగా రెండు రోజుల్లో తిరిగి హైదరాబాద్ వచ్చే లోపే చదివేశాను.

అప్పుడే ఈ పుస్తకాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేస్తే బాగుంటుందనిపించింది. గత ఏప్రిల్‌లో ఈ పుస్తకాన్ని గీతా రామస్వామి '1948: హైదరాబాద్ పతనం' గా తెలుగులో తీసుకురావడం చూసి చాలా సంతోషించాను. ఈ పుస్తకావిష్కరణ హైదరాబాద్ బుక్ ట్రస్ట్, అన్వేషి సంస్థల ఆధ్వర్యంలో 'ఆంధ్ర సారస్వత పరిషత్' హాలులో భారీ ఎత్తున జరిగింది. చరిత్ర అభిమానిగా , పరిశీలకుకుడిగా నేను కూడా ఆ సభకు వెళ్ళాను. పుస్తకావిష్కరణ సమయంలో ఇద్దరు ముస్లిం యువకులు చెరో ప్లకార్డు పట్టుకొని వేదిక ముందుకు వచ్చారు. ఒక ప్లకార్డులో 'గీతా రామస్వామి, ఉయ్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ యు', అనీ, మరో ప్లకార్డులో 'గీతా రామస్వామి, శాల్యూట్ యు' అనీ రాసి ఉంది.


అది చూసి హైరదాబాద్ చరిత్ర అంతా ఒక్కసారిగా కళ్ల ముందు తిరిగింది. ఆ అక్షరాల్లో ముస్లింల నిస్సహాయ దీనస్థితి కనిపించింది. 1948 సెప్టెంబర్ 17 సంఘటన తరువాత మొదటిసారిగా ఒక ముస్లిం తనకు అన్యాయం జరిగిందని గొంతు చించుకొని చెప్పుకున్న గాథే ఈ పుస్తకం. భారత సైన్యం దాడి అనంతరం జరిగిన మారణహోమం, తదనంతరం ఆంధ్ర పాలకులు సృష్టించిన మత ఘర్షణలు హైదరాబాద్ ముస్లింలను ఒక భయానక స్థితికి నెట్టేశాయి. గొంతు విప్పితే నిరంతర నిర్బంధాలు, చిత్రహింసలు. దాంతో ఏ ముస్లిం కూడా గొంతు విప్పి మాట్లాడే ధైర్యం చేయలేదు. హైదర్ పుస్తకం ఈ పరిస్థితిని ఛేదించిందనే చెప్పాలి.

ఈ పుస్తకం హైదర్ ఆత్మకథ అయినప్పటికీ హైదరాబాద్ రాజ్యం చివరి రోజుల గురించి అనేక ఆసక్తికరమైన విషయాల్ని తెలియజేసింది. ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో హైదర్ ఒక ఉన్నత పదవిలో ఉన్న అధికారి. 1937లో చిన్న వయస్సులోనే, ఉన్నత స్థాయి సివిల్ సర్వీస్‌కు ఎంపికైన ప్రతిభావంతుడు. ఆనాడు హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ఉదారవాద అధికారుల్లో హైదర్ ఒకరు. ఈ తరహా అధికారులు ప్రజల బాధలను చూసి చలించిపోవటం, ప్రజల సమస్యలను అర్థం చేసుకొని తక్షణమే పరిష్కరించటం చేస్తుండేవారు. బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్య్రం ప్రకటించిన అనంతరం హైదరాబాద్ పరిస్థితి విచిత్రంగా మారింది. స్వతంత్రంగా ఉన్న హైదరాబాద్‌ను తనలో కలుపుకోవటానికి భారత్ ముమ్మర ప్రయత్నాలు చేయసాగింది.


ఇందులో భాగంగా హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ ముసుగులో ఉన్న హైందవ జాతీయవాదులు, ఇండియా-మహారాష్ట్రలోని హైందవ జాతీయవాదులతో కలిసి హైదరాబాద్ మీద దాడులు చేయటం మొదలుపెట్టారు. ఆ దాడులు 1947 నవంబర్‌లో యథాతథ ఒడంబడిక (1947 నవంబర్) నాటి నుంచి సైనిక చర్య అనంతరం కూడా కొనసాగాయి. ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలోని రజాకార్లు ప్రతి దాడులు చేయడం మొదలుపెట్టారు. దీంతో సరిహద్దు జిల్లాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ దాడులను చూసి చలించిపోయిన హైదర్ తనను దాడులకు గురవుతున్న జిల్లాకు కలెక్టర్‌గా నియమించమని అప్పటి రెవెన్యూ మంత్రి దగ్గరికి వెళ్ళి కోరాడు. 1948 జనవరిలో హైదర్ చాలా చిత్తశుద్ధితో హైందవ జాతీయవాదులు, రజాకార్ల పరస్పర దాడులను అరికట్టే ప్రయత్నం చేశారు.

ఈ ప్రయత్నం చేసినందుకు సైనిక చర్య అనంతరం హైదర్‌ను ప్రభుత్వ సర్వీస్ నుంచి తొలగించి, అరెస్ట్ చేసి ఆయన పనిచేసిన ఉస్మానాబాద్ జిల్లాలోనే మూడేళ్లపాటు జైల్లో నిర్బంధించారు. ఆయనపై ఏడు కేసులు నమోదు చేశారు. వీటిలో రెండు బందిపోటు కేసులు, ఐదు హత్యకేసులు. హైదర్ ఈ కేసులతో భయపడి పాకిస్థాన్‌కో, విదేశాలకో పారిపోకుండా ధైర్యంగా న్యాయపోరాటం చేసి తనపై మోపిన ఆరోపణల్ని నివృత్తి చేశారు. గోల్కొండ పక్కనే నివాసముంటూ 1973లో చనిపోయారు. హైదర్ ఈ పుస్తకంలో సెప్టెంబర్ 17 సంఘటనకు ఒక కొత్త కోణాన్ని మన ముందు ఉంచారు. ఇప్పటి వరకు ఈ సంఘటన కాంగ్రెస్ జాతీయవాదులకు, హిందూ జాతీయవాదులకు, కమ్యూనిస్టులకు ఒక విజయోత్సాహం. కాంగ్రెస్ వాదులకు ఈ సంఘటనతో ఇండియా ఏకీకరణ పూర్తయింది. హిందూ జాతీయవాదులకు ఈ సంఘటన ముస్లిం పాలకులపై హిందువులు సాధించిన విజయం. కమ్యూనిస్టులకు ఈ సంఘటన రాచరిక వ్యవస్థపై ప్రజలు సాధించిన విజయం.

కానీ, హైదర్ చెప్పినట్లు ఈ సంఘటన లక్షలాది మంది ముస్లింలకు ఒక విషాద ఘటన. కొన్ని లక్షల కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. లక్షలాదిమంది నిరంతర నిర్బంధానికి, ఊచకోతకు గురయ్యారు. హైదర్ జీవితమే దీనికి ఒక పెద్ద ఉదాహరణ. ఒక ఉన్నత స్థాయి సివిల్ సర్వెంట్ ఇంతటి నిర్బంధానికి గురైతే సామాన్య ముస్లింల పరిస్థితి ఏ విధంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. తోటి ముస్లింలు కూడా హైదర్‌కు సాక్షులుగా ముందుకు రాలేదు . చివరకు నిజాం కూడా హైదర్‌ను అపరాధిగానే ముద్ర వేశాడంటే ముస్లింలలో ఎంత అభద్రతా భావం ఉందో అర్థమవుతుంది. ఈ పుస్తకం చాల బలంగా మన ముందు ఉంచిన మరో విషయం ఏమంటే, ఇంతవరకు మన చరిత్ర పుస్తకాలు మనకు రజాకార్లు, భారత సైన్యం చేసిన దుర్మార్గాలనే చెప్పాయి కానీ హిందూ మతోన్మాదులు దాదాపు ఒక సంవత్సరం పొడవునా జరిపిన మారణకాండ , దోపిడీలను గురించి ఎక్కడా చెప్పలేదు. మరో విషయం ఏమంటే, హైదరాబాద్ పతనానికి భారత సైన్యంతోపాటు హిందూ జాతీయవాదులు కూడా సమాన పాత్ర నిర్వహించారన్న విషయం ఈ పుస్తకం ద్వారానే తెలిసింది. హైదరాబాద్‌ను స్వతంత్రదేశంగా నిలబెట్టాలన్న రజాకార్ల ప్రయత్నం, స్వయం ప్రతిపత్తితో కూడిన హైదరాబాద్‌ను ఇండియాలో చూడాలన్న నిజాం రాజు ప్రయత్నాన్ని ఈ పుస్తకం చాలా విపులంగా వివరించింది. కాశిం రజ్వీ మతోన్మాది అయినప్పటికీ ఒక మంచి మాట అన్నాడు. అదేమంటే 'ఇండియా ఒక భౌగోళిక భావన, హైదరాబాద్ ఒక రాజకీయ వాస్తవం'. ఈ మాట నేటికీ అక్షరాలా సత్యం. ఇండియా అనేక జాతుల సమ్మేళనమే కానీ ఏ నాటికీ ఒక జాతి కాలేదు.


మొత్తంగా ఈ పుస్తకం ముస్లిం సోదరులకు అయిన గాయాల్ని కళ్ళకు కట్టిననట్టుగా వివరిస్తుంది. ఆ గాయం రాచపుండులా ముస్లింలనే కాదు, ప్రజలందర్నీ నేటికీ వేధిస్తూనే ఉంది. భారత్, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య, సెక్యులర్ దేశమని గొప్పలు చెప్పుకుంటున్న మన ప్రభుత్వం హైదరాబాద్‌లో సైన్య ం సృష్టించిన మారణ హోమం మీద సుందర్‌లాల్ కమిటీ రిపోర్టును బహిర్గతం చేయకపోవటం విచారకరం. జరిగిన ఈ ఘోరానికి భారత ప్రభుత్వం ముస్లిం సోదరులకు బహిరంగ క్షమాపణ చెప్పకుండా వారి హృదయాలను గెలుచుకోలేదు. ఈ దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తల ఎత్తుకుని బతికే హక్కును కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉంది.


- భంగ్యా భూక్యా
ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ

Andhra Jyothi Telugu News Paper Dated : 19/07/2013 

Wednesday, July 17, 2013

ప్రమోషన్లలో కోటా By కదిరె కృష్ణ మూలవాసీ బహుజన లిబరేషన్‌ మూవ్‌మెంట్‌ కన్వీనర్‌


సమానత్వం రాజ్యాంగ హక్కు 
రిజర్వేషన్లలో బిసిలకు అన్యాయం
వాటా అడ్డంకొట్టేందుకు అగ్రకుల కుట్రలు
ప్రాథమిక హక్కులకోసం పోరాటమే మార్గం 
ప్రమోషన్లలో కోటా అనివార్యం 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15, 16 ప్రాథమిక హక్కుల్లో భాగం. ఆర్టికల్‌ 14 సమానత్వాన్ని, ఆర్టికల్‌ 15 వెనుకబడిన, ఇతర వెనుక బడిన తరగతులకు విద్యారంగంలో రిజర్వేషన్లు, ఆర్టిక ల్‌ 16 ఉద్యోగరంగంలో పదోన్నతుల్లో రిజర్వేషన్లను ప్రసాదించాయి. ఈ రాజ్యాంగ ప్రకరణలు ప్రాథమిక హక్కులు అవటాన వీటిని కుదించే లేదా తొలగించే అధికారం ఇటు పార్లమెంటుకు గాని, అటు ఏకోర్టుకూ గానీ లేదని భారత రా జ్యాంగం నిర్దిష్ఠంగా పేర్కొన్నది. కోర్టులు- పార్లమెంటు ద్వారా చేసిన శాసనాలు రాజ్యాంగబద్దమైనవా, కావా అని నిర్ధారిస్తాయి. ప్రాథమిక హక్కుల విషయంలో జోక్యం చేసుకునే అధికారం వీటికి లేదని రాజ్యాంగం చెప్పినా అడపా దడపా ఈ ఆర్టికల్స్‌ కోర్టుల జోక్యానికి గురవు తున్నాయి. ఆర్టికల్‌ 14 సమానత్వాన్ని ప్రదిపాదిస్తే మరి రిజర్వేషన్లు ఏమిటి అని అగ్ర వర్ణాలు ఒక వాదనను వినిపిస్తున్నాయి. అందరు సమానమైనప్పుడు కొందరికే రిజర్వేషన్లు ఏమిటనే అవగాహనా రహితమైన వాదనను ముందుకు తెస్తున్నాయి. 

ఆర్టికల్‌ 14 ప్రకారం సమానత్వం అంటే అసమానత్వాన్ని రూపు మాపి ఏ వర్గాలు అసమానత్వానికి గురయ్యాయో ఆ వర్గాలను ప్రధాన స్రవంతితో సమం చేయడమే నని అదే ఆర్టికల్‌లో పొందుపరచిన విషయాన్ని ఈ వర్గాలు పక్కదారి పట్టిస్తున్నా యి. ఒక వ్యక్తికి యాభై కేలరీల శక్తి కావాల్సినప్పుడు అప్పటికే శక్తిమంతుడైనవానికి యాభై, శక్తిహీనుడికి 60 కేలరీలు ఇస్తే వారిద్దరు సమానమవుతారు. ఇది సమాన త్వం సూత్రంలో దాగి ఉన్న మర్మం. అందుకే సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన తరగతులకు, మరింత వెనుకబడిన తరగతు లకు రిజర్వేషన్ల కల్పన అనివార్యమయింది. దీన్నే రాజ్యాంగం ఆర్టికల్‌ 14 అంటేనే అసమానతల నిర్మూలన అనే నర్మగర్భమైన అర్థాన్ని వ్యాఖ్యానించింది. ఆర్టికల్‌ 15(4) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు విద్యారంగంలో రిజర్వేషన్లు అందాయి. దీన్ని వివాదాస్పదం చేయడానికి అగ్రకుల పాలకులు- ఈ రిజర్వేషన్లు పొందేవారు విద్యాపరం గానే కాక, సామాజికంగానూ వెనుబడి ఉండాలని మెలికపెట్టారు. 

ఈ కారణం చేతనే ఓబిసీలు 2008వరకు విద్యారంగంలో రిజర్వేషన్లకు నోచుకోలేదు. 2008లో ఓబిసీలకు విద్యారంగంలో రిజర్వేషన్లు కల్పించేక్రమంలో అగ్రవర్గాలు చేసిన రాద్ధాంతం బీసీ నాయకులెవ్వరికీ స్పర్శ కలిగించలేదు. ఇప్పటికే కేంద్రస్థాయి విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల సౌకర్యాన్ని తొలగించడం జరిగింది. నవరత్నాల వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో బీసీలకే కాదు ఎస్సీలకు కూడా దిక్కు లేదు. ఆర్టికల్‌ 16(4)ను పొందుపరచడంద్వారా వెనుకబడిన కులాలకు ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు లభించాయి.అంతేకాక ప్రమోషన్లలో రిజర్వేషన్లనుకూడా ఇదే ఆర్టికల్‌ అందిస్తుంది. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న వెనుకబడిన కులాలు ఎవరు అనే ప్రశ్న లేవనెత్తారు. ఎస్సీ,ఎస్టీలు వెనుకబడినారనే కారణంచేతనేకదా వాళ్లకు రిజర్వే షన్ల సౌకర్యం కల్పించింది, వారే వెనుకబడిన కులాలైనప్పుడు, ఇతర వెనుకబడిన కులాలు ఏమిటంటూ వితండవాదానికి దిగుతున్నారు.

డా బి.ఆర్‌.అంబేడ్కర్‌- ‘షెడ్యూల్డు కులాలు అంటే సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవని ప్రకటించడం (షెడ్యూలు)అని, షెడ్యూల్డు కులాలేకాక మరికొన్ని కులాలు (ఓబిసి) వెనుకబడి ఉన్నాయి’ అని నిర్వచించాడు. అర్థమయ్యేదేమంటే శూద్రకులాలను ఓబిసీలుగా, అతిశూద్ర కులాలను ఎస్సీలుగా పరిగణించాలనే భావనను డా అంబేడ్కర్‌ భారత రాజ్యాంగంలోనే పొందుపరిచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వచ్చినదే ఆర్టికల్‌ 340. ఈ ఆర్టికల్‌ద్వారా ఓబిసిలు ఏయే కులాలో నిర్వచించి, గుర్తించడానికి ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. మాన్యశ్రీ కాన్సీరాం 50 రోజుల నిరాహారదీక్ష చేసి ఆనాటి అగ్రకుల ప్రభుత్వాన్ని నిలదీసిన ఫలితంగా1979లో వచ్చిన మండల్‌ కమిషన్‌ ‘ఓబిసీలు అనగా ఎస్సీ, ఎస్టీలు కాక ఇంకా మిగిలి ఉన్న సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడిన కులాల ప్రజలు’ అంటూ నిర్వచించింది. 

ఈ స్పష్టత వచ్చి ఓబిసీలకు ఉద్యోగరంగంలో రిజర్వేషన్లు కల్పించడానికి 42 సంవత్సరాలు పట్టింది. ఇందులో భాగంగానే 1992-93లో ఓబిసీలకు ఉద్యోగరంగంలో కేంద్రస్థాయిలో 27 శాతం, రాష్ర్ట స్థాయిలో 34 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇది జీర్ణించుకోలేని అగ్రకులాలవారు ఆర్టికల్‌ 16ను సవాల్‌ చేస్తూ కోర్టుకెక్కారు. ఆర్టికల్‌ 16(4) ప్రకారమే 1955 నుండి ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు ఉద్యోగరంగంలో రిజర్వేషన్లు కల్పించడంతో ప్రమోషన్లలోకూడా రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తుందనే భయంతో ఈ కుట్ర చేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు- ఆర్టికల్‌ 16 ఉద్యోగ నియామక సందర్భంలోనే రిజర్వేషన్లను అనుమ తిస్తుందని, ప్రమోషన్ల విషయంలో వర్తించనేరదని- 1997లో తీర్పునిచ్చింది. ప్రాథమిక హక్కులను వ్యాఖ్యానించే లేదా జోక్యంచేసుకునే హక్కు తమకుందనికూడా సుప్రీంకోర్టు వెలువరించింది. 

1997లో ఓటుబ్యాంకు రాజకీయాల్లో భాగంగా వాజ్‌పేయ్‌ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 16వ ఆర్టికల్‌కు 4ఎ ను చేరుస్తూ ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను పరిమితంచేసింది.ఈ దరిమిలా ఓబిసిలు ప్రమోషన్లలో రిజర్వేషన్లను కోల్పోయేటట్లు చేయడంలో అగ్రకుల శక్తులు విజయవంతమయ్యాయి. అంబేడ్కర్‌ బిసి కమిషన్‌ కోసం రాజీనామా చేయడం, ప్రముఖ బిసి నాయకుడు ఆర్‌.ఎల్‌. చందాపురి నాయకత్వంలో ఉద్యమం చేపట్టడంతో అనివార్యమైన పరిస్థితుల్లో నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ బిసి కులాలను గుర్తించడం కోసం 1962లో కాకా కలేల్కర్‌ కమిషన్‌ను నియమించి బిసి కులాలకు రిజర్వేషన్ల ఆవశ్యకతను ఆ కమిషన్‌ నొక్కివక్కాణించడంతో తిరిగి కలేల్కర్‌ ద్వారానే ఆ నివేదికను నిర్వీర్యం చేశాడు. 

ఇది బిసి రిజర్వేషన్లపై మొదటి అధికారిక కుట్ర. మండల్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేస్తారేమోననే భయంతో పశ్చిమ భారతంలో మత కల్లోలాలు సృష్టించి మరోసారి ఈ సమస్యను మరగుపరచేలా చేశారు. అగ్రకులవర్గాలు తమ అక్కసును వెళ్లగక్కుతూ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించడం జగమెరిగిన సత్యమే. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు 22 శాతం రిజర్వేషన్లున్నాయి. ఒకవేళ ఓబిసిలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తే, సుమారు 34 శాతం మంది ప్రతినిధులు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రవేశిస్తారు. అప్పుడు 56 శాతం ప్రతినిధులు బహుజనవర్గాల నుండి ప్రాతినిధ్యం వహించడంద్వారా ఆ జాతి ప్రయోజనాలు నెరవేరి రాజ్యాధికారంలోకి వస్తారు. 

ఆధిపత్య అగ్రకులాలు చట్టాన్ని, కోర్టులను ఉపయోగించుకుంటూ బహుజనవర్గాల హక్కులను కాలరా స్తుంటాయి. కొందరు ఓబిసి మేధావులే- చట్టసభల్లోనే రిజర్వేషన్లు లేవంటే ప్రమోషన్లకు రిజర్వేషన్లు ఏమిటని వెటకారాలాడుతున్నారు. ఎస్సీ ఎస్టీలకైనా, బీసీలకైనా చట్టసభలలో రిజర్వేషన్లు పార్లమెంటు చట్టంద్వారా లభించవలసిందే కానీ, విద్య ఉద్యోగరంగాల్లో రిజర్వేషన్ల కల్పన ఎవరి దయాదాక్షిణ్యాల మీద రాలేదని, అది భారత రాజ్యాంగంద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కు అని గ్రహించాలి. ఈఅధునాత కంప్యూటర్‌ యుగంలో 54 శాతానికి పైగా ఉన్న మెజార్టీ జనాభాకు అన్యాయం జరుగుతుంటే కోర్టుల చెవికెక్కడం లేదు, ఇటు స్వజాతి నాయకులకు, మేధావులకు చీమకుట్టనట్లు కూడా లేకపోవడం దుఖఃకరం. అణగారినవర్గాలు తమకు రావాల్సిన హక్కుల కోసం కోర్టుకెక్కితే రాని స్పందన, వారి హక్కుల్ని కాలరాయడానికి మాత్రం చెప్పుకోదగ్గ రీతిలో వస్తుంది. కారణం, న్యాయరంగంలోనూ బ్రాహ్మణీయ వర్గాల ఆధిపత్యం తిరుగులేని విధంగా ఉండడమే. 

కాన్షీరాం ‘కోర్టులుకూడా బ్రాహ్మణ అగ్రహారాలుగా మారిపోయాయి’ అని అనడంలో అతిశయోక్తి లేదు. ఒక వైపు ఎంబిసీలు- సోదర కులాలద్వారా నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్నారు. రిజర్వేషన్లను వినియోగించుకోవడం ద్వారా అభివృద్ధి చెందిన ఎస్సీ బీసీ కులాలు స్వార్థ ప్రయోజనాలకులోనై రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బతీస్తూ మిక్కిలి అణగారిన కులాలను అణచివేసు ్తన్నాయి. అగ్రకులాల కంటే తమ సహకులాలతోనే ఎక్కువ నష్టపోతున్నామని ఎంబీసీ, ఎంఎస్‌సీ (మోస్ట్‌ షెడ్యూల్డుకులాలు, మాదిగలు) కులాలు తమ నిరసనస్వరాన్ని పెంచుతున్నాయి. మరోవైపు ఇన్ని సంవత్సరాల రిజర్వేషన్లలో పేరుకు 27 శాతం అయినా అమలు జరిగింది మాత్రం 6 శాతమే. ఈ 6 శాతం ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు లభించకుండా కుతంత్రం గత కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. ఆర్టికల్‌ 16(4) ప్రకారం ఓబిసిలు ఉద్యోగ కల్పనలోనూ, ప్రమోషన్లలోనూ రిజర్వేషన్లు పొందడమనేది ప్రాథమిక హక్కుగా సంక్రమించ వలసిఉంది.

ఓబిసిలు చట్టసభల్లో రిజర్వేషన్లు పొందకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అన్యాయం చేస్తే, ప్రమోషన్లలో రిజర్వేషన్లను పూర్తిగా నీరుగార్చిన ఘనత బిజెపి హిందుత్వ పాలకులకు దక్కింది. ఈ నేపథ్యంలో ఓబిసి వర్గాలనుండి ఆనాడే తీవ్ర ప్రతిఘటన వచ్చిఉంటే ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదు. ఓబిసి రాజకీయ ప్రతినిధులు అగ్రకుల పాలకపక్షాల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి ఈ దుస్థితిని ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటికే ఇంటికుంపటితో నలిగిపోతున్న ఓబిసిలకు పాలకపక్షాల నిర్ణయాలు మూలిగేనక్కమీద తాటిపండు పడ్డ చందంగా మారాయి. ప్రమోషన్లలో రిజర్వేషన్లు నిరాకరించడం మూలంగా 1,26,000 ఉద్యోగాలు కోల్పోతే, రూ. 1,10,000 కోట్ల ఆదాయాన్ని ఓబిసీలు కేంద్ర సర్వీసు ల్లో కోల్పోవలసి వచ్చింది. ఈ 1,26,000 ఉద్యోగాలు అగ్రకులాలు అప్పనంగా కాజేశాయి.

దీనికంతటికీ కారణం బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన 77వ రాజ్యాంగ సవరణ.ఇది క్లాస్‌ 1 ఉద్యోగులకు సంబంధించిన సమాచారం మాత్రమే. క్లాస్‌ 4,3,2 ఉద్యోగాల్లో ఓబిసిలకు జరిగిన అన్యాయం పూడ్చలేని విధం గా ఉన్నది. ఇక రాష్ర్ట ప్రభుత్వ సర్వీసుల్లో ఇంతకంటే ఘోరంగా నష్టపోవడం జరిగింది. ఇప్పటికీ క్లాస్‌ 3 ఉద్యోగులు లేని కులాలు కోకొల్లలుగా ఉన్నాయి. యూనివర్శిటీ గడపతొక్కని కులాలు ఇటు ఎస్సీల్లో, అటు బీసీల్లోనూ లెక్కలు మిక్కిలిగానున్నాయి. పరిస్థితిఇలా ఉంటే సుప్రీంకోర్టు గత 2012 ఏప్రిల్‌ 27న ఎస్సీఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వడాన్ని నిరాకరిస్తూ ఒక తీర్పు వెలువరించింది.
ఎస్సీ ఎస్టీలు ఈ తీర్పు ద్వారా కోల్పోయిన ప్రమోషన్లలో రిజర్వేషన్లను తిరిగి కల్పించడానికి ఇప్పుడున్న యుపిఏ ప్రభుత్వం 117వ రాజ్యాంగ సవరణ బిల్లును ఇటీవల రాజ్యసభలో ప్రవేశపెట్టింది.

ఈ బిల్లులో పూర్వమున్న ‘సరియైన ప్రాతినిధ్యం’ అనే క్లాజ్‌కు బదులుగా ‘రిజర్వేషన్ల శాతం ప్రకారం’ అనే క్లాజును చేర్చి సవరణ చేయడం ద్వారా ఆర్టికల్‌ 16ను సవరించనుంది. దీంతో ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు సిద్ధించే అవకాశం ఉంది. సమస్యల్లా ఓబీసీలదే. ఓబీసీలు బ్రాహ్మణీయ శక్తులను తమ భుజాలపై మోసినంతకాలం వారి హక్కుల్ని కాలరాస్తూనే ఉంటారు. ప్రత్యామ్నాయ శక్తులుగా ఎదగకుండా, రాజకీయ ప్రాతిని ధ్యాన్ని పెంచుకోకుండా వీరి సమస్యకు పరిష్కారం లభించదు. మహాత్మాగాంధీని నమ్ముకోవడంతో లండన్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో బీసీలు తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయారు. స్వాతంత్య్రం తరువాత రాజ్యాంగ పరిషత్తులో ఒక్క బిసి కులాల ప్రతినిధి కూడా లేకుండానే రాజ్యాంగనిర్మాణం జరిగింది. 

ఆ సందర్భంగా బీసిల రిజర్వేషన్లసమస్యను అంబేద్కర్‌ మాత్రమే చర్చకుతీసుకురా గలిగాడు. అయినా అగ్రకులాల ఆధిపత్యంలో గొంతులు నొక్కివేశారు. రాతియు గానికి ప్రతినిధులైన వడ్డెరలు, మట్టియుగానికి ప్రతినిధులైన కుమ్మరులు, రజకులు, లోహయుగానికి మూలకారకులైన మంగలివంటి వెనుకబడిన కులాల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రాజ్యాంగంద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులను తిరిగిపొందినప్పుడే సామాజికన్యాయం. బిసివర్గాలుఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా పొందవలసిన వసతులను పొందగలుగుతారు. 

Surya Telugu News Paper Dated : 17/06/2013 

Monday, July 15, 2013

ఎక్కడి ఎస్సీలు అక్కడే ---Bollimunta Hanmanth Rao


రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి గురించి చేశామంటూ చెప్పే మాటల డొల్లతనాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్‌) నిర్వహించిన సర్వే బట్టబయలు చేసింది. రాష్ట్రం మొత్తంలో 2,10,22,588 కుటుంబాలు ఉండగా, వాటిలో 38,71,634 (15 శాతం) ఎస్సీ, 15,60,035 (6.6 శాతం) ఎస్టీ కుటుంబాలు న్నాయి. సెర్స్‌ 22 జిల్లాల్లోని 619 మండలాల్లో, 5989 గ్రామాల్లో 9.8 లక్షల ఎస్సీ, ఎస్టీ ఇండ్లను పరిశీలించి నివేదిక తయారుచేసింది. ఈ నివేదికలో 4,45,954 (65శాతం) ఎస్సీ, 1,77,263(55శాతం) ఎస్టీ కుటుంబాలకు సెంటు భూమిలేదని పేర్కొంది. ప్రభుత్వ ప్రచారం ప్రకారం 50 లక్షల ఎకరాల పంపిణీ జరిగి ఉంటే, భూమిలేని ఎస్సీ, ఎస్టీలు ఇంత సంఖ్యలో ఉండేవారు కాదు. భూపంపకం ద్వారా పంచామని చెపకొంటున్న భూముల్లో 80శాతం పేదలు సాగుచేసుకొంటున్న భూములే. పేదలకు యిచ్చామని చెప్పుకొంటున్న 25 లక్షల అసైన్డ్‌ భూములు భూస్వాముల, సంపన్నవర్గాల చేతుల్లోకి వెళ్లాయని కోనేరు రంగారావు భూ కమిషన్‌ తెలియచేసింది. 


ఈ భూములపై భూస్వాములకు చట్టబద్ధహక్కు కల్పించేందుకు ప్రభుత్వం 9/77 అసైన్డ్‌ చట్టాన్ని చేసిందంటే, ప్రభుత్వం ఎవరి ప్రయోజనాలను కాపాడుతుందో అర్థమౌతుంది. కోనేరు రంగారావు భూకమిషన్‌ వివిధ రూపాల్లో పంపిణీయోగ్యమైన 60 లక్షల ఎకరాల భూములను దళితులకు, ఇతర పేదలకు పంపిణీ చేయాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వం అందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఎస్సీల్లో 1,35,978(21శాతం) ఎస్టీల్లో 91,247 (28.3శాతం) కుటుంబాలు గుడిసెల్లో నివసిస్తున్నాయని, ఇందిరమ్మ పథకంక్రింద అర్హతఉండికూడా ఎస్సీల్లో 2,98,774 (45శాతం) ఎస్టీల్లో 1,44,843 (45శాతం) కుటుంబాలకు ఇళ్ళు మంజూరు కాలేదని నివేదిక వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీల ఇండ్లనిర్మాణానికి రూ. 72 వేలు ప్రభుత్వం ప్రకటించింది. లబ్ధిదారులు పునాదులు నిర్మించినప్పుడే విడతల వారీగా బ్యాంక్‌నుండి డబ్బు, సిమెంట్‌ తీసుకోవాలి. స్లాబ్‌వేసిన ఇంటికే ఈ కేటాయింపు కాగా, రేకుల ఇళ్ళు వేసుకోవటానికి ఒప్పుకోరు. ఒక్కగది ఇంటికి స్లాబ్‌ పోయాలన్నా కనీసం రెండు లక్షలకు పైగా అవుతుంది. అందుకే లక్షలాది ఇళ్ళ నిర్మాణాలు సగంలో ఆగిపోతున్నాయి. అప్పులు మాత్రం వారికి మిగులుతున్నాయి. చివరికి అవి ఇతరుల పరమౌతున్నాయి. నివేదికలోని మరో ముఖ్యమైన అంశం గ్రామీణ ఉపాధి హామీ పథకం. వందరోజులు పని దొరికిన కుటుంబాలు వందల సంఖ్యలోనే ఉన్నాయి. సగటున 28 రోజులకు మించి ఉపాధి పనులను కల్పించలేక పోయారు. అర్హులైన లక్షలాదిమంది పేదలకు జాబ్‌ కార్డులే ఇవ్వలేదు. వారికి లభించే కూలి కూడా చాలా తక్కువగా వుంది. ఈ వాస్తవాన్ని ఈ నివేదిక కూడా పేర్కొంది. నివేదికలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రంలో 2,57,539 (39శాతం) ఎస్సీ, 1,23,993 (38శాతం) ఎస్టీ కుటుంబాల వారికి గ్రామీణ ఉపాధి హామీ పథకంక్రింద జాబ్‌ కార్డులు రాలేదు. దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న పేదలందరికీ రేషన్‌కార్డులు ఇచ్చి కిలో రూపాయికే బియ్యం, చౌకగా ఇతర వస్తువులు ఇస్తున్నామని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నది. ఇప్పటికీ అర్హులైన లక్షలాది మంది పేదలు రేషన్‌ కార్డులు లేక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ అంశాన్ని కూడా నివేదిక పొందుపరచింది. ఎస్సీల్లో 97,782 (15 శాతం), ఎస్టీల్లో 63,232 కుటుంబాలకు రాష్ట్రంలో రేషన్‌కార్డులు లభించలేదు. పల్లెల్లో పేదలు రోజుకి రూ. 17, పట్టణాల్లో రూ. 23 మాత్రమే ఖర్చుచేస్తున్నారని ఈ సర్వే తెలిపింది. ఎస్సీల్లో 3 శాతం, ఎస్టీల్లో 2 శాతం మంది మహిళలకు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరుగుతున్నాయని ప్రైవేటు ఆసుపత్రులలో ఈ సంఖ్య ఇంకా తక్కువని, సిజేరియన్‌ ఆపరేషన్లు 2 శాతంలోపే చేయించుకొంటున్నారని సర్వే నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో విద్యుత్‌ సౌకర్యంలేని ఎస్సీ కుటుంబాలు 49,562, ఎస్టీ కుటుంబాలు 23,191 ఉన్నాయని; 10శాతం ఎస్సీ, 18 శాతం ఎస్టీ కుటుంబాలు కిరోసిన్‌ దీపంతోనే రాష్ట్రంలో గడుపుతున్నాయని నివేదిక వెల్లడించింది. వీరి పిల్లలకు స్కాలర్‌షిప్‌లు అందటంలేదని, నాలుగు శాతం ఎస్సీలు, ఐదు శాతం ఎస్టీ కుటుంబాలకు చెందిన విద్యార్థులు మధ్యలోనే చదువు మానివేస్తున్నారని, బడికి వెళ్లని పిల్లల సంఖ్య కూడా ఎక్కువగా వుందని, ఎస్సీల్లో 20 శాతం, ఎస్టీల్లో 12శాతం కుటుంబాలే వంటగ్యాస్‌ని ఉపయోగిస్తున్నాయని 79 శాతం ఎస్సీలకు, 85శాతం ఎస్టీల కుటుంబాలకు మరుగు దొడ్ల సౌకర్యం లేదని నివేదిక వెల్లడించింది.
Surya  Telugu News Paper Dated : 16/07/2013 

చర్మకారులకు 'ఉపాధి హామీ' - జాన్‌సన్ చోరగుడి

July 16, 2013

మన ఇంట్లో ఎక్కణ్నించో దుర్వాసన వస్తుంది, విషయం అర్ధంకాదు. మర్నాడు తెలుస్తుంది, ఏదో మూలన ఎలుక చచ్చిందని. ఎలాగో తంటాలు పడి దాన్ని ఇంట్లో నుంచి తీసి బయట పడవేస్తాం. దొడ్లో గేదె చచ్చిపోయింది, ఏమిటి చేయడం ? మనవల్ల ఏమీకాదు కనుక 'మాదిగ' కు కబురు చేస్తే అతను వచ్చి దాన్ని తీస్తాడు. ఏమిటి అతని వృత్తి ? పాడి పరిశ్రమకు - చర్మ ఉత్పత్తుల తయారీ పరిశ్రమకు మధ్య పూర్తి నిర్లక్ష్యానికి గురైన కీలకమైన (లింకు) అంశం- 'మాదిగ' కులవృత్తి.

ఎందుకీమాట అనడం అంటే, దానికి కొంత వివరణ అవసరం. ఉదా: ప్రత్తి పంటకు ఫార్వర్డ్ లింకేజీ అనగానే - గిడ్డంగులు, నూలు మిల్లులు ,వస్త్ర తయారీ పరిశ్రమ, చేనేత రంగం, గార్మెంట్ డిజైనింగ్, రవాణా, ఎగుమతులు.. ఇలా ఉంటుంది జాబితా. అదే పశుగణాభివృద్థి రంగానికి - ఫార్వర్డ్ లింకేజీ అంటే-పాడి పరిశ్రమ, డైరీలు, శీతల గిడ్డంగులు, డైరీ ఉత్పత్తులు, కన్ఫెక్షనరీ,వెటర్నరీ కోర్సులు, ఆసుపత్రులు, బయోగ్యాస్, తోళ్ళ పరిశ్రమ, ట్యానరీలు,చర్మ ఉత్పత్తులు, ఫుట్‌వేర్ పరిశ్రమ, రవాణా, ఎగుమతులు.. ఇదీ ఈ జాబితా. ఈ 'లింక్' మెత్తంలో ఎక్కడా కానరానిది- 'మాదిగ'. నిజానికి ఈ ఫార్వర్డ్ లింకేజ్‌లో ఉన్న పలు దశల్లో మృత పశు వినియోగం చాలా స్వల్ప మైన అప్రధాన అంశం. కాని,అవసరం అయినప్పుడు సకాలంలో ఆ 'సర్వీస్' కనుక వెంటనే అందకపోతే అందువల్ల కలిగే అసౌకర్యం ప్రజాజీవనాన్ని సామూహికంగా ప్రభావితం చేస్తుంది. అలాంటప్పుడు అది 'అత్యవసర సర్వీసు' అవుతున్నది. మెత్తం మీద చనిపోయింది అయినా, చంపబడినది అయినా పశువు శరీర ఉత్పత్తుల్ని వినియోగంలోకి తీసుకురావడంలో ' మాదిగ 'ది కీలక పాత్ర అవుతున్నది.

మన రాష్ట్రంలో మెదటి నుంచీ కూడా చర్మ పరిశ్రమ రంగాన్ని ఒక నిర్లక్షిత కుల కోణంలో నుంచి చూసిన కారణంగా దీని ప్రయోజనాలను మన దగ్గర నుంచి మన పొరుగున ఉన్న తమిళనాడు తన్నుకు పోయింది. ఏడాదికి 482.20 లక్షల పశుగణం ఉంటున్న మన రాష్ట్రంలో ముడి తోళ్ళు శుభ్రం చేసే యూనిట్లు లేని కారణంగా కేవలం 5 శాతం తోళ్ళు మాత్రమే చర్మ ఉత్పత్తులకు పనికివచ్చే విధంగా ఇక్కడ ప్రాసెస్ చేయబడుతున్నాయి. కానీ 158.00 లక్షల పశుగణం మాత్రమే ఉన్న తమిళనాడులో 95 శాతం ముడితోళ్ళను పారిశ్రామిక ఉత్పత్తులకు పనికి వచ్చే విధంగా ప్రాసెస్ చేసుకోగలుగుతుంది. ఇందుకు కారణం తమిళనాడులో చిన్న మధ్యతరహా ట్యానరీ యూనిట్లు 9 వేలు, భారీ యూనిట్లు 70, కాంపోజిట్ యూనిట్లు 40 ఉన్నాయి. అయితే మనవద్ద ఉన్నది అన్నీ కలిపి కేవలం 30 మాత్రమే.


ఈ కారణంచేత మన దగ్గర నుంచి ఏటా 85 శాతం అంటే 321 మిలియన్ల లక్షల తోళ్ళను (పశువులు, గొర్రెలు, మేకలు కలిసి) ముడి ఉప్పుతో భద్రపర్చడం వంటి తాత్కాలిక చర్యల అనంతరం తమిళనాడు పంపుతున్నారు. వాటికి అదనపు విలువను జోడించి వారు ప్రయోజనం పొందుతున్నారు. భారత్ నుంచి ఏటా విదేశాలకు ఎగుమతి అవుతున్న 'ప్రాసెస్' చేయబడిన తోళ్ళలో 1.2 మిలియన్ చదరపు అడుగుల (దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తంలో 60 శాతం) తోళ్ళు తమిళనాడు నుంచి వెళుతున్నాయి. ఈ ఎగుమతులపై దేశానికి వస్తున్న మొత్తం ఆదాయంలో 45 శాతం ఆ రాష్ట్రం తీసుకుంటూ ఉంది. మొత్తం మీద ఏటా రూ.10 వేల కోట్ల టర్నోవర్ అక్కడ ఈ రంగంలో జరుగుతుంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ప్రస్తుతం 497 చర్మ ఉత్పత్తుల యూనిట్లు అక్కడ పనిచేస్తున్నాయి అంటే దేశ మార్కెట్లో వాటి వాటా ఎంతో అర్థమవుతుంది. పోనీ ఈ నిర్లక్ష్యం వల్ల మనం నష్టపోతున్నట్టు చెబుతున్న లెక్కలు ఉహాజనితం అనుకుందాం. మన రాష్ట్రానికి దక్షిణాన చిట్ట చివరి మండలం తడ వద్ద 2006 ప్రాంతంలో చైనాకు చెందిన 'అపాచే' కంపెనీ 'ఆడిడాస్' స్పోర్ట్స్ బూట్ల ఫ్యాక్టరీని స్థాపించింది.భూమి, కరెంటు ఇతర మౌలిక వసతులు మన ప్రభుత్వం వద్ద తీసుకొని, ముడి సరుకును ఆ కంపెనీ తీసుకుంటున్నది తమిళనాడు దగ్గర ! ఈ రంగంలో రానున్న రోజుల్లో కూడా మనం పోగోట్టుకుంటున్నది ఏమిటి అనే సృహ మాత్రం మనకు రాలేదు.

రాయలసీమ జిల్లాల్లో ఆనాడు పరిశ్రమలు రాకపోవడానికి జరిగిన జాప్యానికి కారణాలు ఇప్పటికే సవిస్తరంగా సామాజిక శాస్త్రవేత్తలు చర్చించడం, రికార్డు చేయడం జరిగింది. సరళీకరణ తర్వాత గడచిన 20 ఏళ్ళలో ఆ పరిస్థితుల్లో వచ్చిన మార్పును కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి ఇంతటి విస్తృత స్థాయిలో పాడి పరిశ్రమ కార్యకలాపాలు ఉన్న కోస్తా జిల్లాల్లో - పాడి పరిశ్రమకు అనుబంధ వాణిజ్య రంగమైన తోళ్ళ పరిశ్రమ నామ మాత్రంగా కూడా ఇక్కడా కాలూనకపోవడానికి కారణాలు ఏమైఉంటాయి ? ఈ ప్రశ్నకు సమాధానంగా ఇంచుమించుగా రాయలసీమ కారణాలనే ఇక్కడ కూడా అనువర్తింపచేయవలసి ఉంటుంది. భూమి ఇందుకు సమస్యకాదు, 950 కి.మీ. సముద్ర తీరం రాష్ట్రం పొడవునా విస్తరించి ఉంది. ఇదే పరిశ్రమ ఆభిృద్థి చెందిన తమిళనాడులో కాలుష్య నియంత్రణ మండలి కనుసన్నలలోనే పైన చెప్పుకున్న వృద్థి రికార్డు అయింది. మరి ఏ కారణం చేత ఆంధ్రప్రదేశ్ ఏటా రూ. 10 వేల కోట్ల టర్నోవర్ ఉన్న వాణిజ్య రంగాన్ని ప్రక్క రాష్ట్రానికి వదులుకుంది ?

సామాజిక అంశమే అందుకు కారణమైతే, తక్షణమే దానిని సరిచేసుకోవలసి ఉంది. గతాన్ని తవ్వుకోవడం ఇప్పుడు అప్రస్తుతం. తమిళనాడులో ఈ పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నది షెడ్యూల్డు కులాలకు చెందినవారు, ముస్లింలు. 150 ఏళ్ళ క్రితం ఈ పరిశ్రమ అక్కడ స్థిరపడింది. కనుక ఇందుకు సంబంధించిన తొలినాటి ఇక్కట్లన్నీ అక్కడి మొదటి రెండు మూడు తరాలు ఇప్పటికే భరించి ఉండి ఉండాలి. అయితే ప్రస్తుత పరిస్థితి వేరు. ప్రతి పరిశ్రమలోనూ జరిగిన ఆధునిక యాంత్రీకరణ అందులో పనిచేసే శ్రామికుల భౌతిక శ్రమను తగ్గించడమే కాకుండా, వారి సామాజిక గౌరవాన్ని కూడా పెంచింది. లెదర్ టెక్నాలజీ కూడా అందుకు వినహాయింపు కాదు.

ఈ నేపథ్యంలో పాటవ నిర్మాణం (కెపాసిటీ బిల్డింగ్) వైపు మనం దృష్టి సారించగలిగితే వివక్షకు గురైన ఈ రంగానికి ఒనగూరే ప్రయోజనాలు ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. మొదటిదిగా అస్సలు రాజ్యం ఈ పనిని శాస్త్రీయ ప్రతిపత్తితో కూడిన నిపుణతగా చూడ్డాన్ని అలవర్చుకొని దాన్ని ప్రోత్సహించాలి. ఉత్పత్తి కులాల స్థాయి 'మాదిగ' లకు కూడా కలిగే విధంగా ఒక సామాజిక ఆమోదం మందుగా తీసుకురాగలగాలి. చట్టానికి లోబడి పనిచేస్తున్న గ్రామ పంచాయతీ వ్యవస్థలో కూడా పలు సేవలు ఉత్పత్తి కులాల ద్వారానే ఇప్పటికీ అధికారికంగా జరగడం వాస్తవం. అటువంటి పరిస్థితుల్లో షెడ్యూల్డు కులాల జాబితాలో ఉన్న అన్ని కులాలను ఒకే మాసగా చూసే స్థూల దృష్టికి ముందుగా ప్రభుత్వ స్థాయిలో 'దృక్పథ బదిలీ ' (యూటిట్యూడ్ షిప్టు) జరగాల్సి ఉంది.

నిపుణులతో వీరికి అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి, ఆ తర్వాత యువతీయువకులతో వేర్వేరుగా స్వయం సహాయక బృందాలుగా వీరిని సంఘటిత పర్చాలి. వారికి ఇప్పటికే ఉన్న సాధారణ విద్యార్హతలు ప్రాతిపదికగా ఏ స్థాయి (డిగ్రీ/డిప్లమో /ఐటిఐ) శిక్షణా కోర్సుకు వీరు సరిపోతారో దానికి ప్రభుత్వ ఖర్చుతోనే వారిని పంపాలి. ఈ రంగంలో 35 శాతం ఉద్యోగ అవకాశాలు మహిళలకు ఉన్నాయి. ప్రభుత్వం ముందుగా తన వార్షిక లక్ష్యాలను ప్రకటించి, ఒక్కొక్క గ్రామం నుంచి 10 మంది యువతీ యువకుల్ని శిక్షణకు పంపడం ద్వారా ఈ పరిశ్రమ విస్తరణకు మానవ వనరులను సిద్ధం చేసే పని ప్రారంభించాలి. సమాంతరంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునిక ట్యానరీలను మొదటిదశలోనూ శుభ్రంచేసిన తోళ్ళతో చర్మ ఉపకరణాలను ఉత్పత్తిచేసే యూనిట్లను రెండవ దశలోనూ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇందుకు 'అస్సోఛోమ్', 'ఫిక్కి' సి.ఐ.ఐ' వంటి వాణిజ్య-పారిశ్రామిక వేదికలను భాగస్వాముల్ని చేయాలి.

ఇక్కడ ఒక సత్యాన్ని ఒప్పుకోక తప్పదు. పశ్చిమ దేశాల మాదిరిగా కాకుండా మానవశాస్త్ర అధ్యయనాన్ని (ఆంత్రోపోలాజికల్ స్టడీస్) మొదటి నుంచి మనం వెనక వరసలోనే కూర్చోబెడుతున్నాం. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాలు (వాటి రూపాలు అనేకం కావచ్చు), పారిశ్రామిక అలజడులు, పోలీస్ స్టేషన్లలో రిజిస్టర్ అవుతున్న శాంతిభద్రతల కేసులు, చిల్లర దొంగతనాలు, సెటిల్‌మెంట్లు దందాలు చేసే ఛోటా నాయకుల వద్ద పనిచేసే కిరాయి గుండాలు... ఈ తరహా కార్యకలాపాలు మొత్తంలో కన్పించే సామాజిక వర్గ స్వరూపం ఎటువంటిదో అధ్యయనం కనుక చేయగలిగితే ఆసక్తికరమైన ఆవిష్కరణలు అందులో నుంచి బయటికొస్తాయి. అంతేకాదు 150 ఏళ్ళ క్రితం తమిళనాడు తరలిపోయిన మన వాణిజ్య వనరు ఈ సుదీర్ఘకాలంలో మన సామాజిక ముఖ చిత్రం మీద మిగిల్చిన 'నల్లగుర్తులు' కూడా చూడగలిగితే స్పష్టంగా కన్పిస్తాయి. అంతా మన స్వయంకృతం కనుక ఇప్పటికైనా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ దృష్టి మన పరిశ్రమ -వాణిజ్య వర్గాలు కూడా అలవర్చుకోవడం అనివార్యం.
'లెదర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్' (లిడ్‌క్యాప్) ఇందు కోసం చేస్తున్న ప్రయత్నాలు, దాని స్థాయి ఈ రంగానికి ఉన్న డిమాండ్ ముందు ఎంత మాత్రం చాలదు. ఒక పెద్ద కుదుపుతో ఇప్పుడు ఇక్కడ ఇది మొదలవ్వాలి. ఆగస్టు 15న తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'జాతీయ ఉపాధి హామీ' పథకాన్ని వ్యవసాయరంగంతో పాటు చేనేత రంగానికీ విస్తరించాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద చేస్తానని ప్రకటించారు. అయితే వరసలో వాటి కంటే ముందు ఉండవల్సింది చర్మకార వృత్తి. మారుతున్న మన అవసరాల కొద్దీ వైద్య ఆరోగ్య శాఖను మూడు మంత్రిత్వ శాఖలుగా చేసినట్లు, పశు సంవర్ధక శాఖకు దాని అనుబంధ సర్వీసులతో మరొక శాఖను కనుక ఇందుకోసం ఏర్పాటు చేస్తే దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఆర్థిక సంస్కరణల అమలు రెండవ దశలో వున్న ఈ తరుణంలో ఇంకా ఈ రంగాన్ని ఒక 'సంక్షేమ శాఖ' గానేకాక వాణిజ్య వ్యవస్థ రంగంగా కూడా చూడాదానికి ఎంత మాత్రం జాప్యం చేయనవసరం లేదు.
-జాన్‌సన్ చోరగుడి

Andhra Jyothi Telugu News Paper Dated : 16/07/2013

Sunday, July 14, 2013

విప్లవవాదుల్లోనూ మనుధర్మం ! - డా. జిలుకర శ్రీనివాస్


July 15, 2013
'మార్క్సిస్టు జ్ఞాన సిద్ధాంతం పనికి రాదు' (ఏప్రిల్ 1) అనే నా వ్యాసంపై నెల్లుట్ల నర్సింహారావు, పి.వరలక్ష్మి, ఎస్వీ సత్యనారాయణ వారి అవగాహనను ప్రకటించారు. త్రిపురనేని, రాంభట్ల విశ్లేషణలను ప్రస్తావించాను. ఒక్కరూ వాళ్లను సమర్ధిస్తూ రాయలేదు. పాపం.. త్రిపురనేని, రాంభట్ల!
అంబేద్కర్‌వాదులు ఆచరణలో లేరని నర్సింహారావు ఆరోపణ. కానీ ఆచరణ లేకుండా అంబేద్కరిజం వుండదు. అంబేద్కర్ జీవితమంతా పోరాటమే! ఆచరణే! సరే, ఇప్పటి కాలమే తీసుకుందాం. కాంగ్రెస్, బిజెపీలను ఉత్తరప్రదేశ్‌లో కమ్యూనిస్టులు ఏమీ చేయలేకపోయారు. కానీ మహాపురుషుడు కాన్షీరాం ఆ రెండు పార్టీ ధ్వంసం చేశాడు. కాన్షీరాం ఆచరణను మించిన తార్కాణం ఏముంటుంది? ఆయన స్ఫూర్తితో ఇక్కడ జీవితాలను అంకితం చేసిన బహుజనుల ఆచరణను గుర్తించకపోవటం ఒక కుట్ర. పైగా దళితులను కమ్యూనిస్టులకు దూరం చేసే కుట్ర అని నా మీద ఫిర్యాదు. నిజమే! కమ్యూనిస్టులకు దూరం చేసి అంబేద్కర్‌కు, కాన్షీరాంకు దగ్గర చేయటమే మా లక్ష్యం. జేమ్స్ ఫ్రెడ్రిక్‌సన్ చెప్పినట్టు ప్రతి రచనా ఒక రాజకీయ కార్యాచరణే!
మార్క్సిజం అజేయమనీ, చలనశీలమైందనీ ఎస్వీ ఏవేవో విశేషణాలుపయోగించారు.

మార్క్సిజం చలనశీలమైంది అంటేమిటి? చలనం దేనిలోనైనా వుండొచ్చు. అది ఎటువైపైనా వుండొచ్చు. కానీ లక్ష్యం వైపే వుంటుందని చెప్పలేం. కాబట్టి చలనం అన్న ప్రాథమిక అంశం దగ్గరే మార్క్సిస్టులు ఆగిపోయారు. అంబేద్కర్ చలనం కన్న గమనం, గమ్యం ముఖ్యమని భావించాడు. 'ఈ సమాజంలో కులం వుంది. వర్గం వుంది' కాబట్టి ఈ రెంటికీ వ్యతిరేకంగా పోరాటం జరగాలని ఎస్వీ అంటున్నారు. ఇది కుల-వర్గ సమాజమని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యుదయ రచయితల సంఘం తీర్మానించిందా? ఆయన అభిప్రాయంతో సిపిఐ ఏకీభవిస్తుందా? కులం గురించి చర్చ జరిగిన ప్రతిసారీ ఈ అభ్యుదయ, విప్లవ సంస్థల నాయకులు 'కుల-వర్గ సమాజం' అనే వాదన ముందుకు తెస్తారు. కుల రహిత పెట్టుబడిదారీ సమాజాన్ని అంబేద్కర్‌వాదులు కోరుతున్నారని ఆయన నిందారోపణ చేశారు.

దేనిమీదైనా మాట్లాడేస్తామనే అహంకారం కమ్యూనిస్టులకు ఎక్కువ. అంబేద్కర్ రచనలేవీ చదవకుండానే ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కేవలం వీళ్లకే చెల్లింది. అంబేద్కరిజం పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి ఏమి చెప్తుందో ఎస్వీకి తెల్సినట్టు లేదు. 'స్టేట్స్ అండ్ మైనార్టీస్'లోనూ, ఇతర రచనల్లోనూ ఆయన ప్రతిపాదించిన 'స్టేట్ సోషలిజం' గురించి ఈయనకేమీ తెలీదు. వ్యక్తిగత ఆస్తిని విప్లవం ద్వారా రద్దు చేయగలవు కానీ కుల వ్యవస్థను నిర్మూలించలేవు. అంటే కమ్యూనిస్టులు వర్గం లేని కుల సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారా? అందుకే, అంబేద్కరిజమే కుల సంబంధాలను, ఆస్తి సంబంధాలనూ నిర్మూలించగలదు. ప్రపంచీకరణ బూచి చూపి బ్రాహ్మణిజాన్ని సమర్ధిస్తారా? ప్రపంచీకరణను నిలువరించే శక్తి కాన్షీరామ్ ఉద్యమానికి మాత్రమే ఉంది.
వ్యక్తికి జ్ఞానం ఎలా వస్తుంది? ఎక్కణ్నించి వస్తుంది? వ్యక్తి చైతన్యాన్ని నిర్ణయిస్తున్న జ్ఞానం ఎలాంటి స్వభావాన్ని కల్గి వుంది? సాహిత్యం సమాజానికి దర్పణం అయితే ఇక్కడి రచయితలు ఆ సమాజ వాస్తివికతను ఎందుకు చిత్రించలేదు.

లెనిన్ చెప్పిన పరావర్తన సిద్ధాంతం ప్రకారం రచయిత సమాజంలోని పరిస్థితులను చైతన్యంతో తిరిగి రచనల్లో ప్రతిఫలింప చేస్తాడు కదా! మరి ఇక్కడి రచయితలు ఈ సమాజంలో వున్న కుల వ్యవస్థను రచనల్లో ప్రతిఫలించలేదేమి? నిత్యం కులంలో జీవిస్తూ, దాని నియమాల ప్రకారం నడకను, నడతను కొనసాగించే బ్రాహ్మణవాద రచయితలు పూర్తి ఎరుకతో దాని గురించి రాయకపోవటంలో వున్న కుట్ర ఏమిటి? వీటి సమాహారమే నా వ్యాసం. జ్ఞాన సిద్ధాంతంలో సమాజ పరిణామ క్రమాన్ని పరిశీలించే పద్ధతి అంతర్భాగంగా వుంటుంది. అంటే మార్క్సిస్టు సిద్ధాంతం ప్రకారం చారిత్రక భౌతికవాదమనే పద్ధతిలో ఈ సమాజ పరిణామ క్రమాన్ని విశ్లేషిస్తారు. కానీ అది కులం పుట్టుక, పరిణామాన్ని విశ్లేషించలేకపోయింది. కుల వ్యవస్థ ఆవిర్భావాన్ని వివరించే ఆ పద్ధతి పూర్తిగా తప్పుడు ఫలితాలనిస్తుందని నేనేంటే పి.వరలక్ష్మీ అంగీకరించటం లేదు.


వరలక్ష్మిది ప్రత్యేక-పరిమితవాదం. సంఘ సంస్కర్తలకూ, భావ కవులకూ, ఆ మాటకొస్తే విప్లవ రచయితలకూ ప్రత్యేకతలున్నాయని ఆమె వాదన. వాళ్ల సామాజిక నేపథ్యం వల్ల వాళ్ల రచనలకు పరిమితులు తప్పక వుంటాయని ఆమె అంటున్నారు. ఆ పరిమితులను గమనించి వాళ్లను అర్థం చేసుకోవాలని సూచన. ఈ ప్రత్యేకవాదాన్ని ముందు పెట్టే చాలా కాలం అనేక సాహిత్య సమస్యలను చర్చకు రాకుండా చేశారు. సంస్కరణవాద చరిత్రతో పాటు కాల్పనికవాద చరిత్రను కూడా తీసిపారేయాలని నేను ఆరాటపడినట్టు ఆమె ఆరోపణ. గోపాల కృష్ణమశెట్టి, కందుకూరి, గురజాడ వంటి వాళ్లకు మార్క్సిజంతో సంబంధం లేదనీ, అలాంటి వాళ్లకు మార్క్సిస్టు జ్ఞానసిద్ధాంతంతో పనేమిటని ఆమె అంటున్నారు, నేనేదో వాళ్లంతా మార్క్సిస్టులు అన్నట్టు. నిజమే, వాళ్లు మార్క్సిస్టులు కాదు. టాల్‌స్టాయ్ కూడా మార్క్సిస్టు కాదు.

బోల్షివిక్కు కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు కూడా కాదు. కానీ ఆ పార్టీ సభ్యుడైన మాక్సిం గోర్కీ కన్న గొప్పగా, వాస్తవికంగా టాల్‌స్టాయ్ రచనలు చేశాడని లెనిన్ కొనియాడాడు కదా! అంటే వాస్తవికతను చిత్రించే నిజాయితీ వుండాలి. అలాంటి నిజాయితీని ఈ దేశంలోని బ్రాహ్మణవాద రచయితలు చూపలేదని లెనిన్ కన్న ముందే మహాత్మ జ్యోతిరావ్ ఫూలే విమర్శించారు. సంస్కరణవాద, కాల్పనికవాద సాహిత్యం ఎందుకొచ్చాయి? గోపాలకృష్ణమ శెట్టి, కందుకూరి, గురజాడ వంటి రచయితలు రచనలు చేస్తూన్న కాలం కన్న ముందునుంచే దేశవ్యాప్తంగా బ్రాహ్మణాధిక్యత నుంచి విముక్తి కోసం కింది కులాలు పోరాడుతున్నాయి. ముఖ్యంగా బెంగాల్‌లో హరిచంద్ ఠాకూర్, గిరిచంద్ ఠాకూర్‌ల నాయకత్వంలో మత్వా ఉద్యమం, మహాత్మ జ్యోతిరావ్ ఫూలే నాయకత్వంలో బ్రాహ్మణేతర సత్యశోధక ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి.

కులం, వర్ణం పుట్టుక, సామాజిక అసమానతలు, మూలవాసుల విముక్తి, బ్రిటీషు పాలకుల ద్వంద్వ వైఖరి మీద సైద్ధాంతిక చర్చలే కాదు, భౌతిక ఉద్యమాలు కూడా జరుగుతున్న రోజులవి. మరి, వాటి పట్ల ఈ రచయితలు స్పందించలేదేం? వీరి రచనల్లో అసలు కింది కుల జీవితం, పాత్రలు కన్పించక పోవటానికి కారణమేంటి? సరే, వాళ్లకు తెల్సిన బ్రాహ్మణ జీవితమే రాశారనుకుందాం. ఆ బ్రాహ్మణ వాస్తవికవాదాన్ని ఆ తర్వాతి తరం ఎందుకు కొనసాగించలేదో వరలక్ష్మి చెప్తే బాగుండేది. సంస్కరణవాదం మరింత వాస్తవికతను అందిపుచ్చుకొని నిర్దిష్టత వైపు పయనించాలి కదా! మరి భావకవిత్వం పేరుతో కాల్పనికవాదం తలెత్తిందేమిటి? మానవ కర్తృత్వం వల్లే విప్లవం వస్తుందని నమ్మే వరలక్ష్మి కాల్పనికవాదం కూడా ఒక కులం కర్తృత్వం వల్లే తలెత్తిందని ఒప్పుకోదేమి!


మూలవాసీ మహాపురుషులు ప్రారంభించిన కుల వ్యతిరేకోద్యమం 1910 తర్వాత విప్లవాత్మక రూపం తీసుకుంది. అది ఈ తెలుగు సాంస్కృతిక చరిత్రలో నమోదు కాకుండా, అక్షరాస్యులైన వారి మెదళ్లు ఆ ఉద్యమం వైపు వెళ్లకుండా కాల్పనికవాదం అవసరమైంది. భావకవిత్వం అందులో ఒక పాయని అందుకే అన్నాను. అంటే కుల వాస్తవికతను గుర్తించకుండా భావకవిత్వం వచ్చింది. భావ కవిత్వంలోని ప్రియుడు మనువాది, ప్రియురాలూ మనువాదే! నండూరి 'ఎంకి' ఏ కులజురాలో మార్క్సిస్టు సిద్ధాంతం చెప్పగలదా? ఇంకా, అభ్యుదయ, విప్లవవాద రచయితలు తక్కువ తిన్నారా? వాళ్లు కూడా కాల్పనికవాదులు చేసిన దాన్నే 'వర్గం' పేరుతో చేశారు. అలా చేయటంలో వాళ్ల లక్ష్యం అంబేద్కర్ ఉద్యమాన్ని దెబ్బతీయటం కాదా? 1930-32 మధ్యకాలంలో అంబేద్కర్ కింది కులాలకు చట్టసభల్లో ప్రవేశించే ఓటు హక్కు, ప్రత్యేక నియోజకవర్గాల గురించి పోరాడుతూంటే ప్రజలంతా ఆయన వెంట వున్నారు.

1932లో కమ్యూనల్ అవార్డునను శ్రీశ్రీ వ్యతిరేకించాడా? సమర్ధించాడా? ఈ దేశంలోని బహుజనులకు రాజకీయ, పౌరహక్కులు తిరస్కరించిన గాంధీ చనిపోతే ఎలిజీలు రాసిన శ్రీశ్రీ అంబేద్కర్ అమరుడైతే ఒక్క కవితా రాయలేదే!? 'యజ్ఞోపవీతాన్నీ వైప్లవ్య గీతాన్నీ' అని ఆయనే చెప్పుకున్నాడు. దానర్థం బ్రాహ్మణవాదినీ విప్లవవాదినీ అనే కదా! యజ్ఞోపవీతాన్ని కీర్తించినవాడు విప్లవవాదెలా అవుతాడు. వర్ణ ధర్మాన్ని సమర్ధిస్తూ రాసిన విశ్వనాథ సత్యనారాయణ మనువాదయితే, వర్గం పేరుతో కులం గురించి ఒక్క మాటా మాట్లాడక పోగా, అది ఉనికిలో లేనట్టు రచనలు చేసిన శ్రీశ్రీ కూడా మనువాదే. బ్రాహ్మణవాద రచయితలు కులం గురించి ఎందుకు రాస్తారు అంటున్నారు వరలక్ష్మి. విప్లవ రచయితలు కులవ్యవస్థకు వ్యతిరేకంగా రాయలేదేం? అంతేకాదు, వాళ్ల రచనల నిండా పర్చుకొన్న బ్రాహ్మణవాద ప్రతీకలు, కవి సమయాలు ఏ భావజాలానికి సంకేతాలు? విప్లవవాదుల చైతన్యాన్ని కూడా మనుధర్మమే నిర్ణయిస్తుంది.


జ్ఞాన సిద్ధాంతంలో పాదార్థిక విషయాలు (భౌతిక అంశాలు), భావజాల (ధర్మం) విషయాలు వుంటాయని ఆమె అంగీకరించారు. కానీ ఇక్కడ పాదార్థిక విషయాలు వ్యక్తి చైతన్యాన్ని రూపొందిస్తాయా? లేక భావజాలం రూపొందిస్తుందా? మనుధర్మం మనిషి స్థాయినీ, విలువనీ నిర్ణయిస్తుంది కాబట్టి కుల సమాజంలో వ్యక్తి విలువ కులాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల ఏ కులస్తుడితో ఎలా వ్యవహరించాలన్నది ఆ ధర్మమే నిర్దేశిస్తుంది. ఒక వ్యక్తికి ఆస్తి వుండాలా వద్దా అన్నది అతడు పుట్టిన కులం వల్ల నిర్ణయించబడుతుంది. ఎలా ఆలోచించాలో ఎలా జీవించాలో ఎలా ప్రవర్తించాలో కులమే నిర్ణయిస్తుంది. అంటే, ఒక వ్యక్తి జ్ఞానం పాదార్థిక విషయాల ఆధారంగా కాకుండా మనుధర్మం (భావజాలం) కారణంగా నిర్ణయం అవుతుంది. ఆ భావజాలాన్ని అతడి రచన ప్రతిఫలించాలి. దాన్ని నిజాయితీగా చిత్రించాలి. అలా చేయని రచయిత ఎంత గొప్పవాడైనా అతడు బ్రాహ్మణవాదే అవుతాడు. మార్క్సిస్టు సిద్ధాంత ప్రవచకులు ఎన్ని రకాలుగా వాదించినా ఇదే అంతిమ సత్యం.

- డా. జిలుకర శ్రీనివాస్
(చర్చ ముగిసింది)

Andhra Jyothi Telugu News Paper Dated : 15/07/2013 

Sunday, July 7, 2013

పీడితుల విముకి ్తబాట దండోరా ------గోవిందు నరేష్ మాదిగమాదిగ, మాదిగ ఉపకులాల ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపంగా అంబేద్కర్ సాధించిపెట్టిన ఎస్సీ రిజర్వేషన్లను జనాభా దామాషాకనుగుణంగా వర్గీకరించి సమాన పంపిణీ చేయాలనే సామాజిక న్యాయ సూత్రం తో మాదిగ దండోరా ఉద్యమం జూలై ఏడుతో 20 వసంతంలోకి అడుగుపెడుతుంది. ఈ రాష్ట్రంలో చెక్కు చెదరని నిర్మాణం,విశాల పోరాట దృక్పథం కలిగి నిరంతర పీడిత జనపక్షం వహిస్తూ రెండు దశాబ్దాలుగా పేద వర్గాల గొంతుకగా వర్ధిల్లుతున్నది మాదిగ దండోరా. 1994లో ప్రకాశం జిల్లా ఈదుముడి అనే చిన్న గ్రామంలో మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో 20మంది యువకులతో ప్రారంభమైన ఉద్యమం ఇరవై ఏళ్లుగా నిలువడం చారివూతాత్మకమైన క్రమం. ఉద్యమానికి ఎన్నో అవరోధాలు,అవమానాలు, నిందలు, నిర్బంధాలు,కష్టాలు, కన్నీళ్లు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ అధిగమించి ఇరవైఏళ్లుగా సజీవంగా ఉద్యమ ప్రయాణంలో ఉండడానికి దండోరాకు మందకృష్ణ నాయకత్వమే కారణం. గడిచిన రెండు దశాబ్దాలకాలంలో అనేక సామాజిక సమస్యలపై పోరాటాలను నిర్మిస్తూ వాటికి పరిష్కారాలు చూపుతూ ముందుకు సాగడమే కారణం. రాజకీ య పార్టీలకు ధీటైన ప్రత్యామ్నాయ రాజకీయేతర శక్తిగా ఎంఆర్‌పీఎస్‌ను మంద కృష్ణ తీర్చిదిద్దారు. చాలా మంది ఈ ఉద్యమ సంస్థను మాదిగలకు నీడనిచ్చే చెట్టుగానే భావించారుగానీ,అది యావత్ పేదవర్గాలకు నీడను పరిచే మహా వృ క్షంగాఎదుగుతుందని ఊహించలేకపోయారు.ఈ క్రమంలోనే మాదిగ, మాదిగ ఉపకులాల ప్రజల కోసం వర్గీకరణ కోసం, వికలాంగుల పెన్షన్ పెంపు కోసం రాజకీయ రిజర్వేషన్లు, వితంతువుల పెన్షన్ల కోసం ఎంఆర్‌పీఎస్ పోరాడింది. పేదవారికి కడుపునిండా అన్నం కోసం రేషన్ బియ్యం పెంపు కోసం పోరాటం కొనసాగిస్తున్నది. 

కులం పేరు చెప్పుకోవడానికి బాధపడిన మాదిగల్లో ఆత్మ గౌరవాన్ని నింపి ఐక్యతను తెచ్చి హక్కుల కోసం పోరాడే చైతన్యాన్ని తీసుకురావడంలో ఎంఆర్‌పీఎస్ గణనీయమైన కృషి చేసింది. చిన్నారుల ఆరోగ్యాల కోసం, గుండెజబ్బుల పిల్లల కోసం దండోరా పోరాడి సరికొత్త మానవీయ ఉద్యమానికి పురుడు పోసిం ది. ఇలా సమాజంలోని సమస్త వర్గాల హక్కులు, సమస్యల కోసం పోరాడి ఉన్నతమైన మానవీయ హక్కుల ఉద్యమంగా దండోరా ఎదిగింది. ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం మొదటిదశలో ఆరేళ్లు అలుపెరుగని పోరాటం చేసి 2000 సంవత్సరంలో ప్రభుత్వం మెడలు వంచి వర్గీకరణ సాధించడం జరిగింది. దీంతో ఎస్సీల్లోని అట్టడుగు ఉపకులాలు రిజర్వేషన్లు పొంది ఎన్నో ఫలాలను అనుభవించారు. కానీ ఇది గిట్టని కొన్ని స్వార్థపరశక్తులు సుప్రీంకోర్టుకు ఎక్కి సాంకేతిక కారణాల సాకుతో వర్గీకరణను రద్దు చేయించడం జరిగింది. దీంతో అనివార్యంగా రెండోదశ వర్గీకరణ పోరాటం చేయాల్సివస్తున్నది. వర్గీకరణ న్యాయమే అని జస్టిస్ ఉషామెహ్రా కమిషన్ కేంద్రానికి నివేదిక సమర్పించడంతోపాటు, రాష్ట్ర అసెంబ్లీ మూడుసార్లు వర్గీకరణ కోసం తీర్మానం చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ పార్లమెంటులో బిల్లు పెడితే మద్ధతిస్తామని ప్రకటించాయి. ప్రధానికి లేఖలు రాశాయి. ప్రస్తుతం వర్గీకరణ చట్టంగా కావడానికి సాంకేతిక ప్రక్రియలన్నీ ముగించుకున్నది. 

ఈక్రమంలోనే దండోరా నాయకత్వం యూపీఏ ప్రభుత్వ పెద్దలకు వర్గీకరణ చేయాలని లేఖలు కూడా రాయడం జరిగింది. ఇప్పుడు కొంతమంది మాల స్వార్థపర శక్తులు తప్ప వర్గీకరణను వ్యతిరేకించే శక్తలేవీ లేవు. ఈ నేపథ్యంలోనే వర్గీకరణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి, కాంగ్రెస్ పెద్దల నిద్దుర మత్తు వదిలించడానికి దండోరా ఉద్య మం సమాయత్తమవుతున్నది. ఇంత సుదీర్ఘ ఉద్యమంలో చేసి న త్యాగాలను చూసైనా మాల సోదరుల వర్గీకరణకు సహకరించాలని దండోరా కోరుతున్నది. ఇరవైఏళ్ల దండోరా ఉద్యమం లో మాల సోదరులను సోదర ఉద్యమ సహచరులుగానే చూ స్తుంది తప్ప శత్రువులుగా చూడటం లేదు. కాబట్టి సామాజిక పీడితులుగా సాటి పీడితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నది.దండోరా ఉద్యమం రాష్ట్ర రాజకీయ, ఉద్యమ ముఖ చిత్రం మీదనే కాదు, మొత్తంగా దేశ ఉద్యమాల ముఖ చిత్రం మీదనే ప్రత్యేక ముద్ర వేసింది. తమ జాతి సమూహాల సమస్యల పరిష్కారం కోసం మాత్రమేగాక, సమాజంలోని సకల పీడితుల సమస్యలను తమ భుజస్కంధాలపై వేసుకుని పోరాడటం ద్వారా దండోరా ఉద్యమం ఉద్యమాల చరివూతలో సరికొత్త అధ్యాయాన్ని రచించింది. వికలాంగులకు పెన్షన్ పెంచాలన్న డిమాండ్‌తోపాటు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని దండోరా డిమాండ్ చేస్తున్నది. తెల్ల రేషన్ కార్డుమీద బియ్యం కోటా పెంపు కోసం ఉద్యమం మరింత ఉధృతంగా దండోరా నిర్వహిస్తున్నది. పిల్లలు, వృద్ధులు, వితంతువులు ఇలా సకల వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం దండోరా ఉద్యమిస్తున్నది. 

భారత దేశ చరివూతలో దండోరా ఉద్యమం సరికొత్త పుటగా నిలిచింది. చెప్పులు కుట్టే చేతులతో చరిత్ర తిరగరాసిన ఉద్యమం దండోరా. కులం పేరు చెప్పుకోవడానికి ఆత్మన్యూనతకు గురైన జనాన్నే తలెత్తుకుని నేను మాదిగను అని సగౌరవంగా చెప్పుకునే స్థితికి దండోరా ఆత్మగౌరవ పోరాటం తెచ్చింది. ఈ నేపథ్యంలోనే సమాజంలోని అనేక నిమ్న, వెనుకబడిన బడుగు కులాలన్నీ దండోరా స్ఫూర్తితో కుల చైతన్యంతో ఉద్యమాల బాట పట్టినయ్. అదే క్రమంలో అన్ని అణచబడ్డ కులాల పోరాటాలకు మాదిగ దండోరా ఉద్యమం బాసటగా నిలిచి ప్రోత్సహించింది.ఆ ఉద్యమాల విజయానికి చేయూతనిచ్చింది. దండోరా ఉద్య మం కుల సంఘమే. అయినా అది కులతత్వంతో ఆలోచించకుండా సబ్బండ వర్గాలను సోదరత్వంతో చూసి వారిని అక్కున చేర్చుకున్నది. వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటునందించింది. మాల మాదిగల ఐక్యతను కోరుతూనే మాల ఐఏఎస్ అధికారి అర్జునరావుకు అన్యాయం జరిగినప్పుడు, గద్దర్‌పై కాల్పులు జరిపినప్పుడు, ఢిల్లీలో చందర్‌రావు అనే మాల ఉద్యోగిపై టీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు దాడిచేసినప్పుడు, మాజీ మంత్రి శంకర్‌రావుపై అగ్రకులాలు దాడిచేసినప్పుడు, గీతాడ్డిపై కోదండరాం అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, ఈ మధ్యకాలంలోనే శ్రీకాకుళంలో లక్షింపేటలో జరిగిన హత్యాకాండ ఘటనపై కూడా దండోరా ఉద్యమించింది. బాధితుల పక్షాన నిలిచి అన్యాయాన్ని ఎదిరించింది. ఇలా పోరాడడం ద్వారా మాదిగ దండోరా ఉద్యమం మాలలకు వ్యతిరేకం కాదని చాటాం.

అలాగే విప్లవోద్యమాలపై ప్రభుత్వాల దమ నకాండను నిరసిస్తూ ఉద్యమాల పక్షాన నిలిచి నిర్బంధకాండను ఖండించాము. ఉద్యమాలను అణచడానికి తీసుకురాదలచిన ‘పోటా’ చట్టా న్ని ఎంఆర్‌పీఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. విప్లవోద్యమనేతలు ఎన్‌కౌంటర్ల పేరుతో అమరులైనప్పుడు ఆ బూటకపు ఎన్‌కౌంటర్లను ఖం డించింది. ప్రజాస్వామిక, విప్లవోద్యమాల పట్ల రాజ్యహింసకు వ్యతిరేకంగా దండోరా ఉద్య మం గొంతు విప్పంది.అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఉద్యమానికి మద్ధతు నిచ్చిం ది. అనేక తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్నది.అలాగే తెలంగాణ జిల్లాల్లో మెజార్టీగా ఉన్న ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కాలనే డిమాండ్‌తో సామాజిక తెలంగాణకోసం దండోరా ఉద్యమం కదులుతున్నది.అణగారిన వర్గాలుగా మూడు ప్రాంతాల్లో ఉన్న వారిని కూడగట్టి తెలంగాణ ఉద్యమానికి మద్ధతును కూడగట్టింది. చెరుకు సుధాకర్‌పై రాజ్యనిర్బంధం, విమలక్కపై కుట్ర కేసుల సందర్భంలోనూ దండోరా ఉద్యమం బాధితుల పక్షాన నిలిచి రాజ్యహింసను వ్యతిరేకించింది. సామాజిక ఉద్యమాలను ప్రజాస్వామిక పోరాటాలతో మమేకం చేస్తూ.. దండోరా ఉద్యమం దిక్సూచిగా నిలిచింది. ఇదే సందర్భంలో భవిష్యత్ తరాల నిజమైన విముక్తి కోసం సమస్త పీడక కులాల ప్రజలందరి విముక్తి లక్ష్యంతో ఫూలే, అంబేద్కర్ ఆశయాల వెలుగులో నూతన రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు మంద కృష్ణ సమాయత్తమవుతున్నారు. సమస్త పీడితుల విముక్తి కోసం మహాజనుల పార్టీ నిర్మాణం కాబోతున్నది. ఇదే దేశంలో సమస్త పీడితుల వెలుగుబాటగా మారబోతున్నది. బహుజనుల రాజ్యం రాబోతున్నది. దీనికి దండోరా సమరశంఖం పూరించి ముందుకు కదులుతున్నది.

-గోవిందు నరేష్ మాదిగ
ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
(మాదిగ దండోరా ఉద్యమానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా..)


Namasete Telangana Telugu News Paper Dated : 08/07/2013 

Saturday, July 6, 2013

దళిత సాంస్కృతిక శిఖరం (చంద్రశ్రీ దళిత ఉమెన్ థియేటర్ వ్యవస్థాపకురాలు) ----కృపాకర్ మాదిగ


July 07, 2013
ఆమె గొంతెత్తి అంబేద్కర్ సుప్రభాతం ఎత్తుకుంటే నల్ల సూరీళ్ళు, ఎర్ర సూరీళ్ళు నిద్ర లేచే వారు. ఆమె గొంతులో పల్లె పదాల కువ కువలుండేవి. సెలయేళ్ళు సాగిపోయేవి. ఆమె పద్యమందుకుంటే పక్షులు ఆలకించేవి. ఆమె మరియమ్మ వేషం కడితే, క్రీస్తు దళిత బిడ్డడై ఆమె వొడిలో పురుడు పోసుకుని, బాల యేసుడై ఆడుకునేవాడు. ఆమె గుర్రం జాషువా తాత 'శ్మశాన వాటిక'పద్యాలలోని మహాకారుణ్యాన్ని మరణచింతలనూ శ్రోతల చెవుల ద్వారాల్లోంచి పురా లోకాల నిండా నింపేది. ఆమె గజ్జె కట్టి ఆలాపన అందుకుంటే ఇళ్ళూ, మరపూ సమరోత్సాహంతో ఊగిపోయేవి. కులం, జెండర్, వయసు, ప్రాంతం, మతం, భాష, చిన్నా, పెద్దా గోడలను కూల్చుకుంటూ కదిలిపోయేది.

కదిలించేంది. ఆమె అడుగులు తప్పెట దరువులై వేదికలపై చిందులాడేవి. ఆమె-చంద్రశ్రీ. ఆమె ఒక గుంపు శ్రీ. దళిత సాంస్కృతిక శిఖరశ్రీ. చంద్రశ్రీ దళిత ఉమెన్ థియేటర్ వ్యవస్థాపకురాలు. దళిత, విప్లవోద్యమాలలో అత్యద్భుత ప్రతిభ పాటవాలు సాగించిన అరుదైన కళాకారిణి. పాటలు పాడడంలో, చిందు ఆడడంలో నాటకం వెయ్యడంలో, స్క్రిప్టు రాయడంలో, దర్శకత్వం వహించడంలో, సంగీతం కూర్చడంలో, నటన, నిర్మాణంలో, బృంద నిర్వాహకురాలిగా, నాయకురాలిగా ప్రయోక్తగా తానే ఒక సైన్యంగా, ఆమెకు ఆమే సాటిగా చంద్రశ్రీ బ్రతికింది. దళిత సాంస్కృతిక కళారంగాల్లో చంద్రశ్రీ పెద్ద విదుషీమణి. కొండ గుర్తు వేగు చుక్క.

చంద్రశ్రీ జీవనరంగస్థలం నుంచి కనుమరుగయ్యే వరకు అంబేద్కరైట్ ఐడెంటిటీతో బతికింది. ఆమెది స్పష్టమైన దళిత దృష్టి కోణం. మహాకవులు గుర్రం జాషువా,బోయి భీమన్న, శివసాగర్, మాష్టార్జీ, కలేకూరి ప్రసాద్, గోరటి వెంకన్న వంటి ఎందరో ప్రజాకవుల పదాలు, పద్యాల నుంచి, స్వీయ గేయాల వరకూ ఆమె గొంతులో దళిత జీవన పోరాటాలే పల్లవించేది. బోయ భీమన్న గారి 'అంబేద్కర్ సుప్రభాతం'ని సొంతంగా సంగీతాన్ని సమకూర్చుకుని అద్భుతంగా పాడింది. రికార్డు చేసి భవిష్యత్తు తరాల కందించింది.

కుటుంబ రాజ్యం నుంచి బయటికొచ్చింది. కుటుంబ సంబంధాలు, స్త్రీ, పురుషసంబంధాలు ప్రజాస్వామ్యీకరించబడాలని కోరుకుంది. అందుకోసం పోరాడింది. స్త్రీపురుష సమానత్వం పాటించేతోడు కోసం వెతికింది తపించింది. పొందలేకపోయింది. జీవితాన్ని అణచివేతలపై తిరుగుబాటుగా మార్చుకుంది. ఎదురీదింది. హింసాత్మక సంప్రదాయాలను సమర్థంగా తోసిపుచ్చింది. అవమానాలను ప్రశ్నించే ధిక్కారంతో, స్వాభిమానంతోబతికింది.

దళిత సాంస్కృతిక వికాసానికి చంద్రశ్రీ 'దళిత ఉమెన్ థియేటర్' స్థాపించింది. నిరుపేద దళిత, ఆదివాసీ మహిళల్లో సాధికార చైతన్యం రగిలించడానికి సాంస్కృతిక శిక్షణలు ఇచ్చంది. అణగారిని సామాజిక వర్గాల మహిళలు, వారి అభివృద్ధికి వారే కారకులు కావడానికి చంద్రశ్రీ తనకున్న కళాసాంస్కృతిక నైపుణ్యాలను ఉపయోగించింది. డప్పు దరువులై పాడేది. తానున్న తావునల్లా దళిత సాధికార చైతన్యాన్ని పూయించేది, కాయించేది. కుల, లింగ వివక్షల నిప్పులపై మంచు వెన్నెలలు కురిపిస్తూ చంద్ర శ్రీ సాగిపోయింది.

దోపిడీ పీడనల వ్రణాలను చీల్చుకుంటూ చంద్రశ్రీ మిగిలిపోయింది. చంద్రశ్రీ గొప్ప స్నేహశీలి. మనిషిన మనిషే ప్రేమించాలనేది. దళిత మహిళలు సాహిత్య, సాంస్కృతిక, కళారంగాల్లో తమ ముద్రలు, అడుగులు బలంగా వేస్తున్నారు. ఈ దారిలో చంద్రశ్రీ పెద్ద స్ఫూర్తికారి . మైలురాయి. అదిగో చంద్రశ్రీ గొంతుక! అంబేద్కర్ సుప్రభాతమై దళిత పొద్దుల్ని నిద్దర లేపుతోంది. స్నేహితురాలు చంద్ర శ్రీ కి కన్నీటి దండాలు. ఆమెకివే నా నిండు నివాళులు.

రాజ్యాధికారం స్వాతంత్య్రం కోసమే! - కదిరె కృష్ణ


July 05, 2013
కుల విధానం గురించి ఫూలే' (ఆంధ్రజ్యోతి, జూన్ 6, 7) అన్న సుదీర్ఘ వ్యాసంలో రంగనాయకమ్మ పరిశోధించి మరీ కనుగొన్నది చాలా కాలంగా ఆమె పాడుతున్న పాత పాటే. 'వృత్తి నుంచి కులం వచ్చిందనీ, కులాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనీ, కులం వృత్తి ధాతువు నుంచి జనించినందువల్ల దాన్ని శ్రమ సంబంధాల కోణంలోనే అర్థం చేసుకొని, వర్గ దృక్పథంతో మార్క్స్ వారసులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు పోరాటం చేయాలనేది ఆ వ్యాస సారాంశం. ఈ వేదన రంగనాయకమ్మకు కొత్తేమీ కాదు. బుద్ధుడు, అంబేద్కర్ లాంటి భారతీయ మేధావులను ఆమె గత కొంత కాలంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే వంతు వచ్చినట్లుంది. ఈ చర్చ కొత్తగా రంగనాయకమ్మతో ప్రారంభం కాలేదు. గతంలో దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల్లో, పత్రికల్లో, రాజకీయ పార్టీల్లో పెద్దఎత్తున జరిగింది. ఈ కారణంగానే కొందరు మధ్యేవాదులు (మధ్యస్థ మార్గాలను అన్వేషించేవాళ్లు) 'వర్గకుల దృక్పథం' అనే మరో మార్గాన్ని కనిపెట్టి విఫలమైనారు.


'గులాంగిరి' (1873) పుస్తకానికి ఫూలే రాసుకున్న పీఠికను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఫూలే కుల విధానం సరైనది కాదని రంగనాయకమ్మ అన్నారు. 'ఆర్యులని విదేశీయులుగా భావిస్తూ, వారి దాడుల వల్లే ఈ దేశ మూలవాసులైన బహుజనులు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) శూద్ర (అంటరాని), అతిశూద్ర (మిక్కిలి అంటరాని) కులాలుగా వర్గీకరణ అయి బానిసత్వంలోకి నెట్టివేయబడ్డారని, ఆర్యుల దుర్రాకమణ దుర్నీతి, అసమాన నిచ్చెనమెట్ల కుల దొంతరల వ్యవస్థకు ప్రధాన కారణ'మని ఫూలే సూత్రీకరణ చేయడాన్ని ఆమె తప్పు పట్టారు. అంతేగాక ఆర్యుల దాడుల వంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయని, అది సర్వసాధారణమని ఆమె చెప్పారు. మరి అలాంటప్పుడు అగ్రరాజ్యాలైన అమెరికా వంటి దేశాలపై కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు దేశాలు ఎందుకు నిష్ఠూరంగా ఉండడం? దోపిడీ సహజమే అయినప్పుడు ఇంత రాద్ధాంతం దేనికి? బలవంతుడు, సాయుధుడు బలహీనుడిని, సామాన్యుడిని దోచుకోవడం, హింసించడం సహజమే అయినప్పుడు వర్గం (శ్రామిక-పేద/పెట్టుబడిదారుడు-ధనవంతుడు) ప్రాధాన్యం ఏమిటి? వర్గ పోరాటం ఎందుకు? అసలు మార్క్స్ ఎవరు? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. మరొక విషయం, ఈ దాడులు చాలా అనాది నుంచి జరుగుతూనే ఉన్నాయని రంగనాయకమ్మ అన్నారు. అలాగైతే పురుషులు స్త్రీలను హింసించడం, అనేక రకాలుగా దోపిడీ చేయడం ఈనాటిదా? అనాదిగా వస్తున్న ఈ పురుషాహంకారాన్ని ఇప్పుడు ప్రశ్నించడం ఎందుకు? రంగనాయకమ్మ ఫెమినిజం బేస్‌గా చేసిన రచనలన్నింటినీ ఇప్పుడు ఏమనాలి?


'విజేతలైనవాళ్లు ఎవరైనా దుర్లక్ష్యాలతోనే ఉంటారు. భారతీయులే ఇతర ప్రాంతాల మీద దాడులు చేసి విజేతలైవుంటే అప్పుడు వీళ్లూ అలాగే చేసి ఉండేవారు' అంటూ రంగనాయకమ్మ ఒక నూతన వ్యాఖ్యానం చెప్పారు. నిజమే! యజమానులు/పెట్టుబడిదారులు/సంపన్నులు గనుక విజేతలైతే అలాగే ప్రవర్తిస్తారు. బాధితుడు విజేత అయితే అలా జరగడానికి అవకాశం లేదు. అందుకే మార్క్సిస్టులు కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ అధికారానికి వచ్చి సంపన్నులై బహుజనుల త్యాగాలను పునాదులుగా చేసుకొని బలి పశువులను చేస్తున్నట్టుంది! ఇప్పుడున్న కమ్యూనిస్టులంతా భూస్వాములు, పెత్తందార్లు, పెట్టుబడిదారులే కదా! మూడు వేల సంవత్సరాలుగా జరిగిన, జరుగుతున్న విధ్వంసం రంగనాయకమ్మకు అంత మామూలుగా కనిపించడం వెనుక ఆంతర్యమేమై ఉంటుంది? ఫూలే కులాన్ని గురించిన అంశాన్ని లేవనెత్తిన రంగనాయకమ్మ, ఫూలే తనని బహుజనుల్లో ఒకడిగా గుర్తించుకొని 'ఇతర చిన్న కులాల గురించి...' అన్నారు. ఫూలే చిన్న కులాలుగా ఎవరినీ గుర్తించలేదు. రంగనాయకమ్మ సృష్టి ఈ చిన్న కులాలు. చిన్న కులాలు అంటే ఏ పరిమాణం (సైజు) ప్రకారం నిర్ణయించాలి? జనాభా పరంగానా? సామాజికంగానా? శ్రామికంగానా? ఎలా? వీటిలో దేన్ని తీసుకున్నా శూద్ర అతిశూద్ర కులాలు చిన్న కులాలేమీ కావు. అగ్రకులాలుగా చెబుతున్న ఆర్య బ్రాహ్మణ కులాలే నిజానికి చిన్న కులాలు.


భారతదేశంలో కుల వ్యవస్థకు విజేతలైన ఆర్యులే పేరు పెట్టారు అని ఫూలే చెప్పిన విషయాలను ఇంకొన్ని విషయాలను ఉదహరించి, ఇంతకంటే ఎలాంటి వివరాలను ఆయన ఏమీ ఇవ్వలేదని రంగనాయకమ్మ వాపోయారు. బహుశా రంగనాయకమ్మ 'గులాంగిరి' పీఠిక మాత్రమే చదివి ఉంటారు. కేవలం పీఠిక చదివి ఫూలేపై ఇలా ఒక వక్ర నిశ్చితాభిప్రాయానికి ఎలా వచ్చారు ఈవిడ? చదివినా మార్క్స్ అద్దాలతో చదివి ఉంటారు. ఆర్యుల రాక, దాడులు, దురాక్రమణ, స్థానిక జాతుల బానిసీకరణ క్రమాన్ని విశదంగా చర్చించారు ఫూలే. ఆయన మొత్తం సాహిత్యంలో ఈ దృక్పథమే ఎక్కువగా కనిపిస్తుంది. తరువాత వచ్చిన అనేకమంది చరిత్రకారులకు ఫూలే మార్గదర్శకుడయ్యారు. ఆర్యులు సృష్టించిన దశావతారాల గుట్టు మైథాలజీ రూపంలో ఉండగా, వాటిని పరిశోధించి దానిలోని చరిత్రను బట్టబయలు చేసినవాడు ఫూలే. ఆర్యులు భూదేవతలుగా తమను తాము ఎలా చేసుకోగలిగారో ఫూలే సహేతుక విమర్శ ద్వారా నిరూపించారు. భారతదేశ చరిత్రను ఇంత క్షుణ్ణంగా పరిశీలించి మూలవాసీ దృక్పథంతో చరిత్రను పునర్లిఖించి చరిత్ర రచనలో ఒక నూతన ఒరవడిని సృష్టించిన భారతీయుడు మరొకరు లేరు. రంగనాయకమ్మ ఇంకా ఏమంటారంటే 'ఫూలే విమర్శ పద్ధతి హిందూ మత గ్రంథాల్లోని రాతలను బట్టి ఊహించింది'.

ఈ పద్ధతి తప్పెలా అవుతుంది? ఆర్య బ్రాహ్మణులు చేసిన గందరగోళమంతా పురాణ, ఇతిహాస, స్మృతి, వేదాల రూపంలోనే ఉన్నది కదా? నిజానికి భారతీయ చరిత్ర పరిశోధనలో అవే కీలకం. పరిశోధనలో పటుత్వం, విషయ పరిశీలన, ప్రయోగం, వాస్తవాల వెలికితీతలో నిజాయితీ వుండడం ప్రధానం కానీ ఫలానా వాటిని ఆధారంగా చేసుకొని ఎలా నిర్ణయిస్తామనేది సరైంది కాదు. మార్క్సిస్టులు కట్టూ బొట్టూ కంకణం సంస్కృతిలో కొట్టుమిట్టాడుతూ బ్రాహ్మణవాదాన్ని మోస్తున్న విధానం గమనిస్తే ఫూలే తరహా విమర్శాదృక్పథం లోపించడమేనని స్పష్టమవుతుంది. కాలక్రమంలో శ్రమవిభజనే సామాజిక విభజన అయిందనేది వ్యాసకర్త అభిప్రాయం. అదే మార్క్సిస్టుల వాదన కూడా. రంగనాయకమ్మ ఊహే నిజమైతే మరి యాచక కులాల సంగతేమిటి?నాకు తెలిసి మార్క్సిస్టు సిద్ధాంతాల ప్రాతిపదికన కుల నిర్మూలన జరుగదు. కానీ, ఫూలే అంబేద్కరిజపు సిద్ధాంత వెలుగుధారలో కుల నిర్మూలన జరిగి తీరుతుంది. విద్యా చైతన్యం (బోధన), సమీకరణ (విడిపోయిన కులాల ఐక్యత), పోరాటం (కోల్పోయిన ఓటు కోసం), కులనిర్మూలనకు ఫూలే-అంబేద్కర్ ప్రతిపాదించిన సోపానాలు, విద్య కులాంతర వివాహాలు, రాజకీయ అధికారం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. బోధించడం ద్వారా చైతన్యం, ఫలితంగా సాంస్కతిక విప్లవం, తదనంతరం మూలవాసీ చైతన్యధారతో అణగారిన స్టేట్ సోషలిజం, సమ విద్య, సమపాలన మొత్తంగా సామాజిక న్యాయం.

సమస్త కులాల సమానత్వమే సోషలిజం. శూద్రుల్లో పాలకులు బయలుదేరినా కులం పోదనేది తప్పుడు అవగాహన. దీన్నిలా సవరించాలి 'శూద్రుల్లో పాలకులు కాదు శూద్రులు పాలకులు కావాలి'.శూద్రులు పాలకులైనా ఏ మార్పూ ఉండదని రంగనాయకమ్మ అంటారు. కానీ కాకతీయ సామ్రాజ్యం విచ్ఛిన్నం నుంచి భూపతులు, సామంతులు, దండనాయకులుగా ఉన్న రెడ్డి, వెలమ, కమ్మ కులాలు శూద్రత్వం నుంచి బయటపడి అగ్రకులాలుగా మారలేదా? డాక్టర్ బిఆర్ ఆంబేద్కర్ చెప్పినట్లు 'మన పోరాటం అధికారం కోసం కాదు. స్వాతంత్య్రం కోసం' అనే దిశగా నేటి బహుజనులు ఆలోచించాలి. ఫూలే-అంబేద్కర్ తాత్విక పునాదుల మీద ఉద్యమాలు ఉధృతం చేయడమే రంగనాయకమ్మలాంటి వారికి సరైన సమాధానం.

- కదిరె కృష్ణ
కన్వీనర్, మూలవాసీ బహుజన లిబరేషన్ మూవ్‌మెంట్

Andhra Jyothi Telugu News Paper Dated : 05/07/2013 

Friday, July 5, 2013

అక్షరానికి అరవయ్యేళ్ళు ( ఆచార్య కొలకలూరి ఇనాక్) రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి


July 01, 2013
భయం ప్రాతిపదిక మీద బతుకుతున్న
ఈ ఊరు, ఈ దేశం ఎంతకాలం జీవిస్తాయి?
ప్రేమ ప్రాతిపదిక మీద బతికే
సమాజం, వ్యవస్థ ఏ రోజు పుడతాయి?


(ఊరబావి: 1969)
వ్యక్తిగా డెబ్భై అయిదో పడిలో అడుగిడుతున్న (01.07.1939) ఆచార్య కొలకలూరి ఇనాక్ రచయితగా అరవయ్యవ ఏడాదిలోకి పరుగిడుతున్నారు (1954-2013). రెండవ ప్రపంచ యుద్ధం మొదలవుతుండగా పుట్టిన కొలకలూరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం విరమింపబడి ఎన్నికల రాజకీయాలు దేశ భవిష్యత్తును నిర్ణయించడం మొదలవుతున్న దశలో రచనను చేపట్టారు. 1954లో 'ఉత్తరం' కథ, సీసపద్యం వంటివి రాయడంతో ఆయన రచనా జీవితం మొదలైంది.


అతిచిన్న వయసులోనే రచనను ప్రారంభించి అరవయ్యేళ్ళుగా రచయితగానే జీవిస్తున్నారు కొలకలూరి. ఆయన స్వాతంత్య్రానంతర తొలితరం తెలుగు రచయిత. మధురాంతకం రాజారాం, కాళోజీ, గూడూ రి సీతారాం, సురమౌళి, నవీన్, ఇల్లిందల సరస్వతీదేవి, ముదిగంటి సుజాతారెడ్డి, రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, పెద్దిభొట్ల సుబ్బరామయ్య, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు, కేతు విశ్వనాథరెడ్డి, కె.సభా, ముంగర శంకరరాజు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య వంటివాళ్ళు కొలకలూరికి కొంచెం ముందు, కొంచెం వెనకలుగా సమకాలిక రచయితలు. ఇవాళ దళిత రచయితలుగా మనం కీర్తిస్తున్న గుర్రం జాషువా, కుసుమ ధర్మన్న, బోయి భీమన్నల తరువాత పేర్కొనదగిన ప్రసిద్ధ దళిత రచయిత కొలకలూరి. వాళ్లలోని అభ్యుదయాంశను తనదైన ఆధునిక మార్గంలో కొనసాగిస్తున్న రచయిత కొలకలూరి.


కొలకలూరి కవి, కథకులు, నవలా నాటక రచయిత, విమర్శకులు, పరిశోధకులు, సమీక్షకులు. తెలుగు సాహిత్య చరిత్రలో స్తబ్ధతా యుగమని కొందరు భావిస్తున్న యుగంలో కొలకలూరి రచనలు ప్రారంభించారు. కొలకలూరి రచనల పట్టిక కన్నా ఆయన రచనాతత్వాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. కొలకలూరి అభ్యుదయ సాహిత్యం మలి దశలో రచన ప్రారంభించి విప్లవ, స్త్రీ, దళిత బహుజన, మైనారిటీ, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల ద్వారా రచయితగా నడుచుకుంటూ వస్తున్నారు. ఆయనది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఏ సంస్థలోనూ చేరకుండా ఆ సంస్థల భావజాలాలలోని అనుకూలాంశాలను స్వీకరించి సమకాలీన సామాజిక వాస్తవికతను వస్తువుగా చేసుకొని రచనలు చేస్తున్నారు కొలకలూరి.
ఆచార్య కొలకలూరికి ఒక సామాజిక స్వప్నముంది.


పైసా లేనివాడు - పైగా హరిజనుడు
ప్రధానమంత్రి కాగలిగి - అయిదేళ్ళు పదవిలో ఉండి
ఆపైన పదవి వదిలి -పైసా లేకుండా
పాత మనిషిగా - బ్రతగ్గలిగిన్నాడు

భారతదేశం - బాగుపడ్డట్టు (అభ్యుదయం)
1970ల నాటికే స్వాతంత్య్రం మీద తెలుగు రచయితలకు నమ్మకం సన్నగిల్లింది. ఆ అపనమ్మకాన్ని వ్యక్తం చేయడానికి ఆరుద్ర, కాళోజీ, జాషువాల నుండి నేటిదాకా ప్రజా రచయితలు వెనకాడలేదు. కొలకలూరి ఆ కోవలోనివారే. దళితులకు రాజ్యాధికారం దక్కడం ఒక పార్శ్వమైతే, ఆ దళితులు అవినీతికి పాల్పడకుండా పాలించడం కొలకలూరి రాజకీయ స్వప్నంలో మరో అంశం. పళ్ళు రాలగొట్టుకోవడానికి ఏ రాయి అయితేనేమి అన్నట్లు తయారైన ప్రస్తుత సందర్భంలో కొలకలూరి 'అభ్యుదయం' కవితకు గొప్ప ప్రాముఖ్యముంది. గత నలభయ్యేళ్ల మన దేశ రాజకీయ పరిణామాలను చూసి, ఈ కవిత చదివి ఈ దేశం ఏమౌతుందోనన్న దిగులు కలగకమానదు.


మనిషిని నమ్మడం, మనిషిని ప్రేమించడం కన్నా వ్యక్తిత్వ వికాసమింకేముంటుంది. ఈ రెండూ లోపించడం వల్లనే మన దేశం అనేక అసమానతలలోకి, వివక్షలలోకి నెట్టివేయబడింది. కొలకలూరి గొప్ప మానవ ప్రేమికుడు. మన దేశంలోని సాంఘిక వివక్షల కారణంగా ఆయన వంశీకులు మతాలు మార్చుకున్నా కొలకలూరి అచ్చమైన మనిషి విశ్వాసిగా నిలిచారు.

లేకుంటే మనిషి నా గీత, నా బైబిల్ నా ఖురాన్..
మనిషి నా ఊపిరి, ప్రాణం, రక్తం
మనిషి నా చైతన్యం నా జీవితం నా వ్యక్తిత్వం
అని అనలేరు. భారతదేశ ప్రజలంతా కలిసి మనిషికి మాత్రమే విలువనిస్తే, మనిషిని మాత్రమే ప్రేమిస్తే ఎంత సామాజిక శాంతి చేకూరుతుంది! మన దేశం ఎంత నాగరికమౌతుంది!
దేశభక్తి అనే మాట ఇవాళ అర్థం కోల్పోయిన పదమైపోయింది- దేశభక్తి అంటే రొమ్ములు గుద్దుకోవడం, జబ్బలు చరుచుకోవడం, తొడలు గొట్టడంగా మారిపోయింది. అది దేశభక్తి కాదు. ఒక దేశంలోని ఒక వ్యవస్థలో బాగుపడ్డవాళ్ళు మా దేశం గొప్పది అంటారు. మా దేశాన్ని మేము ప్రేమిస్తున్నామంటారు. ఆ వ్యవస్థలో నష్టపోయిన వాళ్లు ఈ మాటలనలేరు. కొలకలూరి భారతదేశంలో అవమానాల పాలైన, అణచివేయబడ్డ వర్గాలకు చెందిన కవి. ఆయన ఎలాగో పైకి వచ్చి ఉండవచ్చు. కాని దళితులకు ఈ దేశంలో జరిగిన అవమానాలు, చూసి కూడా
భూషించినా దూషించినా
స్వాగతం పలికినా వీడ్కోలు చెప్పినా
సన్మానించినా అవమానించినా/నా యీ దేశాన్ని ప్రేమిస్తున్నాను
అని ప్రకటించారు. దేశం మీద నిజమైన గౌరవం ఉంటే తప్ప ఇలా అనడం సాధ్యం కాదు. ఈ దృష్టితో చూచినప్పుడు వ్యాపారులు సంపన్నులు ఆధిపత్యవాదులు ప్రదర్శించే దేశభక్తి కృతకమైందని, అణచివేతకు గురైనవారు ప్రదర్శించే దేశభక్తి సహజమైందని చెప్పవచ్చు.


నిన్న తలవంచిన వీళ్లు/నేడు ప్రతిఘటించారు
రేపు విజయులౌతారు....
ప్రతిఘటించే పంచముడు/పంచభూతాలకు ప్రాణదాత
జాషువ ఏ కావ్యం రాసినా అందులో దళిత స్పృహ, దళిత వేదన అంతస్సూత్రంగా కనిపిస్తూ ఉంటుంది. అది కొలకలూరి సాహిత్యంలోను ఉంది. ఆయన సాహిత్యంలోని కీలకాంశం ఇదే. సమత (దళిత విద్యార్థి జీవితం) అనాధ (దళిత స్త్రీ జీవితం) ఇరులలో విరులు (కుల ప్రసక్తి లేని మానవ సంబంధాలు) సర్కారు గడ్డి (కష్టకాలంలోను దళితులను పెద్దవాళ్లు దోచుకోవడం) దిక్కులేనోరు (అబద్ధపు నేరం మోపి దళితుని చంపడం) దర్శనం (ఆలయ ప్రవేశం) కూలి (దళితుల శ్రమఫలితం) ఊరబావి (నీళ్లకోసం దళిత స్త్రీ తిరుగుబాటు) పశ్చాద్భూమి (కక్కసు ఉద్యోగుల జీవనం) ఆకలి (తిండికోసం దళిత అమ్మాయి సాహసం) అస్పృశ్యగంగ (పట్టణంలోనూ అస్పృశ్యత) సూర్యుడు తలెత్తాడు (చదువుకొని పైకి వచ్చిన దళితుడు) కాకి (మాదిగల ఇండ్ల దగ్గర మాత్రమే అడుక్కునే దళితుడు) విఘ్ననాయకుడు (ప్యాపిలి సంఘటన) -ఇలా కొలకలూరి సర్వ ప్రక్రియలలోనూ దళిత జీవితం పరచుకొని కనిపిస్తుంది. 'ఊరబావి' కథానిక దళిత జీవిత ప్రతిఫలనంలో గత శతాబ్ది ఆధునిక సాహిత్యంలోనే ఒక ఇతిహాసం. 1913లో మంగిపూడి వెంకటశర్మ 'నిరుద్ధ భారతం' రాసి భారతదేశ చరిత్రలో దళితుల శ్రమను కీర్తించారు. 21వ శతాబ్దం ప్రారంభంలో కొలకలూరి 'ఆదిఆం«ద్రుడు' అనీ పద్యకావ్యంలో భుజంగరాయుడనే దళితసేనానిని ప్రదర్శించారు. 'నా కన్నీళ్ళే నా సాహిత్యం' అన్నారు కొలకలూరి ఒక సభలో. అవి పీడిత జనం కన్నీళ్లు. దళితులు బహుజనులు స్త్రీలు మైనారిటీలు- ఇదీ కొలకలూరి పక్షం.


భారతదేశాన్ని మోసే అర్ధాకలి బోయీలకు
భారతభవనం గోడలుగా స్థిరంగా నిలబడ్డ
దళితులకు గిరిజనులకు/ముస్లిములకు వెనుకబడినవారికి
అణగారిన వర్గాలకు నమస్కారం

కులం, మతం, ధనం- ఈ మూడు భారతీయ సమాజ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించాయని కొలకలూరికి తెలుసు. అవి అల్ప సంఖ్యాకులకు మేలు చేసి, అధిక సంఖ్యాకులకు చెడు చేశాయని కూడా ఆయనకు తెలుసు. ఆర్థిక సాంఘిక రుగ్మతలకు మూలాలైన ఈ మూడింటిని నిర్మూలించి, వీటి ప్రమేయం లేని భారతదేశం పుట్టాలని ఆయన ఆకాంక్ష. ఆయన సాహిత్య మంతా విస్తరించిన అంశం ఇది. భారతదేశం నాగరికమూ, శాస్త్రీయమూ కావాలని, స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలతో పరిమళించాలని కొలకలూరి తపన. భారతదేశం ఐక్యంగా ఉండాలన్నది కొలకలూరి కోరిక. అయితే అది వైరుధ్యాలను కప్పి పెట్టే వ్యాపారులు కోరుకునే ఐక్యత కాదు. వైరుధ్యాలు, వివక్షలు లేని ఐక్యత, మానవీయ ఐక్యత.


దేశం బాగుపడాలనీ, పాడు కారాదనీ
కులం బాధా, ధనం హింసా తొలగాలనీ
భూమి మిగతా భూతాల్లా అందరిదనీ
పీడన ఏ రూపంలోనూ ఉండరాదనీ....
వ్యవస్థ వ్యక్తిగా, సమిష్టి వ్యక్తిగా
లోకం నేనుగా రోదించింది
ఇదీ కొలకలూరి రోదన. ఇది ప్రజాపక్షం వహించే రచయితల ప్రజాస్వామిక ఆకాంక్ష. కొలకలూరి ఈ ప్రజాస్వామిక ఉద్యమంలో భాగస్వామి.
లోకమంతా ప్రేమై/హృదయమంతా దయై
ఉంటే తప్ప/ఈ జీవితాలకు మోక్షం లేదు
అన్నది కొలకలూరి తీర్పు.


సాహిత్య శిల్పిగా కొలకలూరి సరళవాది. ఆయన సాహిత్యంలో పాఠకులను దూరం చేసుకునే ప్రయోగాలు కనిపించవు. వస్తువులోను శిల్పంలోను కొలకలూరి ప్రజాపక్షమే. పాఠకులను బోల్తా కొట్టించే మలుపులు ఆయన కథలలోను, నవలలోనూ ఉండవు, కొన్నిచోట్ల కథలలో ముగింపు పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరచినట్లు కనిపిస్తుంది. ఆయన ఎవరి జీవితాన్ని గురించి రాస్తున్నారో, ఆ జీవితాన్ని అనుభవిస్తున్నవాళ్లు చదివి, విని, అందులో తమ ముఖాలు చూచుకోగలిగేట్టుగా ఉంటుంది కొలకలూరి సాహిత్య శిల్పం. ఆయన వచన కవిత్వం కుందుర్తి చెప్పినట్లు, తిలక్ చెప్పినట్లు పాఠకులకు చాలా దగ్గరగా ఉంటుంది. వ్యంగ్యం, అధిక్షేపం కొలకలూరి కవిత్వ శిల్పాయుధాలు. చిన్న చిన్న వాక్యాలు ఆయన రచనలకు పట్టాలు. అసలైన తెలుగు వాక్యాలు ఆయన సొంతం. జీవిత శకలాలలో నిండిన వస్తువు లోపల సుడులు తిరుగుతున్నా, శిల్పం ఉద్రేకపడదు. తిరుగుబాట్లు, ప్రతిఘటనలు ఉన్నా అవి తిట్లు బూతులు జుగుప్సలు కాకపోవడం కొలకలూరి విశిష్టత. కొలకలూరి సాహిత్యశిల్పంలో క్రమ పరిణామం.

పాఠకులకు దగ్గర కావడం కనిపిస్తాయి. రచన తనకోసం కాదు, పాఠకులకోసం అనే స్పృహ ఆయనకు మొదటినుంచీ ఉంది. కొలకలూరి పాపులర్ మార్గంకాదు, ప్రజా మార్గం. తన ప్రాంతం నుండి నలభయ్యేళ్ల క్రితం రాయలసీమకు వచ్చేసినా, ఆ భాష మాత్రం ఆయన సాహిత్యంలో ఇంకా స్వచ్ఛంగా నిలిచి ఉండడం ఆశ్చర్యం. ఏ భాషలో రాసినా, ఆయన రాయలసీమలో బతికినందుకు, ఆ ప్రాంతం జీవితాన్ని కూడా తన సాహిత్యంలో ప్రదర్శించారు. సాహిత్య విమర్శకుడుగా, పరిశోధకుడుగా కొలకలూరిది కొత్త చూపు. సాహిత్య వ్యాసాలు (1974) మొదలుకొని జానపదుల సాహిత్య విమర్శ (2009) దాకా విశ్వవిద్యాలయ పరిశోధకులు సాధారణంగా స్పృశించని 'తెలుగు వ్యాస పరిణామం' మీద పరిశోధించడమే ఆయన మౌలిక శ్రమకు నిదర్శనం. గత పదేళ్లలో కొలకలూరి మూడు పరిశోధనాత్మక విమర్శా గ్రంథాలను ప్రచురించారు.

అవి 1.ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం 2.శూద్రకవి శుభమూర్తి వసుచరిత్ర వైశిష్ట్యం 3.జానపదుల సాహిత్య విమర్శ. ఇవి మూడూ పునర్మూల్యాంకన విమర్శ గ్రంథాలు. అలాగే నరహరిగోపాలకృష్ణమశెట్టి నవల 'శ్రీరంగరాజచరిత్ర'ను దళిత సాహిత్యోద్యమ నేపథ్యంలో పునర్ముద్రిస్తూ, కొలకలూరి రాసిన పరిశోధనాత్మక ముందుమాట కూడా ఇందులో భాగం. విరసం ఏర్పడిన తర్వాత తెలుగు సాహిత్యంలో చర్చకు వచ్చిన నిబద్ధత, నిమగ్నతలకు కొలకలూరి నిబిడత (స్వీయానుభవంతో రాయడం) అనే మూడవ సూత్రాన్ని జోడించి ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ఈ మూడు సూత్రాలు ప్రాతిపదికగా విశ్లేషించారు. ఇది కొత్తచూపుతో కూడిన కృషి. రామరాజభూషణుడు శూద్ర కవి. ఆయన అసలు పేరు శుభమూర్తి. వసుచరిత్ర శూద్ర కావ్యమంటూ కొలకలూరి చేసిన పరిశోధన ఆ కావ్యం మీద అంతకు ముందు వచ్చిన విమర్శలన్నిటికీ భిన్నమైనది, విశిష్టమైనది. 'తెలుగు జానపదుల సాహిత్య విమర్శ వయస్సు వెయ్యేళ్ళు' అంటూ తెలుగు చాటువులలో, సంప్రదాయ సాహిత్య చరిత్రలలో గల కథనాలను కొలకలూరి జానపదుల సాహిత్య విమర్శగా గుర్తించడం విశేషం. దళిత స్వర్శ ఉన్న కారణంగా, ఎన్ని లోపాలున్నా శ్రీరంగరాజ చరిత్ర తొలి తెలుగు నవల అనే ప్రతిపాదనను అనేక ఉపపత్తులతో చేశారు కొలకలూరి.


ఆచార్య కొలకలూరి ఇనాక్ ఇప్పటిదాకా 70 రచనలు చేశారు. బైబిల్‌ను వ్యవహారిక భాషలోకి అనువదించారు. ధనికులు పేదలు ఉన్న సమాజంలో కొలకలూరి పేదల పక్షం. పై కులాలు, కింది కులాలు ఉన్న సమజంలో ఆయన కింది కులాల పక్షం. మెజారిటీ మైనారిటీలు ఉన్న సమాజంలో ఆయన మైనారిటీ పక్షం. పురుషులు, స్త్రీలు ఉన్న సమాజంలో ఆయన స్త్రీల పక్షం. ప్రేమ, ద్వేషం ఉన్న సమాజంలో కొలకలూరి ప్రేమ పక్షం. విభజిత సమాజంలో తానొక పక్షం వహించినా ఆయన కోరుకునేది సమష్టి సమాజాన్నే.


మనమంతా కలిసి ఆనందించిందాకా
నాకు సుఖం లేదు, శాంతి లేదు (కులం-ధనం)
డెబ్భై అయిదవ పడిలో అడుగిడుతూ, రచనా జీవితంలో షష్ట్యబ్దిలోకి పరుగిడుతున్న కొలకలూరి ఇనాక్ గారికి శుభాకాంక్షలు.
- రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి
94402 22117
(నేడు తిరుపతిలో ఆచార్య కొలకలూరి ఇనాక్ అమృతోత్సవం-
సాహితీ వజ్రోత్సవం జరుగుతున్న సందర్భంగా)
 
Andhra Jyothi Telugu News Paper Dated : 1/07/2013