Showing posts with label విభజన. Show all posts
Showing posts with label విభజన. Show all posts

Tuesday, January 15, 2013

ప్రాంతాలవారీ వర్గీకరణే పరిష్కారం!--Donta Badraiah



సామాజికన్యాయంతోనే రాజకీయ, ఆర్ధిక న్యాయం 
రాజ్యాంగ ఏర్పాట్లు ఉన్నా అందని న్యాయం 
మాల- మాదిగల మధ్యా అసమానతలు 
అనుబంధ కులాలపై ఆధిపత్యం 
తెలంగాణలో మాదిగవర్గం అధికం
ఆంధ్రలో మాల వర్గం మెజారిటీ 
జనాభా ప్రాతిపదికనే పంపకాలు 

clasification
సామాజికన్యాయం జరగనంతవరకు ఈదేశంలో రాజకీయ, ఆర్థిక న్యాయం జరిగే అవకా శంలేదని భారత రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్‌. అంబేద్కర్‌ స్పష్టం చేశాడు. సామాజిక న్యాయ పరమైన అవగాహన ఉండగానే సరిపోదు, దానిని ఆచరణలో సాధ్యం చేయాలనే చిత్తశుద్ధి ప్ర భుత్వాలకు ఉండాలి. సరిగ్గా ఈ విధంగానే రాష్రప్రభుత్వం ఎస్‌సి వర్గీకరణపట్ల వ్యవ హరిస్తున్నది. అనేకవేల కులాలుగా చీలిఉన్న భారత సమాజంలో బ్రాహ్మణులు, క్షత్రి యులు, వైశ్యులు, శూద్రులు- ఆతర్వాత కాలంలో ఎస్‌సి, ఎస్‌టిలు అతి శూద్రులుగా ఉన్నా, అంతర్గతంగా సామాజిక యాయంకోసం తమలోతాము ప్రాకులాడిన చరిత్ర గతంలోనూ ఉంది. అయితే అప్పుడు సామాజిక కట్టుబాట్లు, ఆచారాలు ఆ అంతర్గతమైన పోరాటాన్ని గుర్తించడానికి నిరాకరించాయి.

ఎందుకంటే అప్పుడు మత పరమైన గ్రంథాలు లేదా స్మ ృతులు పరిపాలనకు మార్గదర్శ కంగా ఉండేవి. కానీ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటినుండి వర్ణవ్యవస్థలో అంతరాలన్నింటినీ ప్రక్షాళనచేసే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వాలు ప్రజలందరినీ కులమత భేదాలు లేకుండా సమానంగా చూడాలని రాజ్యాంగం నిర్దేశించింది. అంతరాలను రూపుమాపాలంటే కొన్ని రక్షణలు ఉండాలని రాజ్యాంగకర్తలు సూచించారు. ఆ విధంగా విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అభివృద్ధి చెందేందుకు కొన్ని నిబంధనలను 15(4), 16 ప్రవేశపెట్టారు. వీటిని పరిపుష్ఠం చేసేందుకు అనేక చట్టాలు వచ్చాయి. అయినా వీటివల్ల సామాజిక న్యాయం అమలు జరగడంలేదు. 
సామాజిక న్యాయం ఒక సైద్ధాంతిక, రాజ్యాంగపరమైన భావన. ఈ భావన ప్రజల్లో లేదా రాజ్యాంగంలో ఉండగానే సరిపోదు. ప్రభుత్వాలు,పాలకులు ఆ భావనను కలిగి ఉండాలి. ఎందుకంటే చట్టాలు విధానాలు రూపొందించేది ప్రభుత్వాలు. 

సామాజిక న్యాయం అనేది వర్ణాలమధ్య ఉండే ఆధిపత్యాన్ని, కులాలమధ్య ఉండే అంతరాన్ని తగ్గించేందుకు తద్వారా వాటి సమానత్వాన్ని సాధించేందుకు తోడ్పడుతుంది. భారతరాజ్యాంగానికి సామాజిక న్యాయభావన భూమికగా ఉంది. సుమారు 15 సంవత్సరాలుగా రాష్ర్టంలో ఎస్‌సిల మధ్య రగులుకొన్న వర్గీకరణ సమస్యకూడా సామాజిక న్యాయం అంశం ఆధారంగానే కొనసాగుతోంది. ఎస్‌సిల్లో ఈ రాష్ర్టంలో 59 కులాలు ఉన్నాయి. వీటిలో మాల- దాని అనుబంధ కులాలు; మాదిగ- దాని అనుబంధ కులాలుగా విభజించినప్పుడు, రాష్ర్ట గెజిట్‌ ఆధారంగా మాల అనుబంధ కులాలు కొన్ని ఎక్కువగా ఉన్నాయి. ఈ ‘అనుబంధ కులాలు’ అనే బావన కూడా సరియైనదికాదు. ఎందుకంటే మాల అనుబంధ కులాలుగా చెప్పేవాటిలో వివాహ లేదా ఆచారవ్యవహారాల విషయంలో సారూప్యతలేదు. 

అలాగే మాదిగ అనుబంధ కులాలమధ్య కూడా ఏకరూపత లేదు. మాల అనుబంధ కులాలన్నిటికి తమదే అధీకృత నాయకత్వం అంటూ మాలవర్గం నాయకులు- మాదిగ అనుబంధ కులాలన్నింటికి తామే పేటెంట్‌ నాయకులమని మాదిగవర్గం నాయకులు సమీకృతమవుతున్నారు. మాల,మాదిగ వర్గాల ప్రజలు- తమను అగ్రకులాలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీ యంగా అణచివేస్తున్నాయని ఏవిధంగా ఉద్యమాలు చేస్తున్నాయో- అదేవిధమైన అణచివేత మాల, మాదిగలనుంచి వాటి అనుబంధ కులాపైన కూడా కొనసాగుతోంది. అటువంటప్పుడు మాల మాదిగ వర్గాలకు అగ్రకులాలను విమర్శించే నైతిక అర్హత ఉంటుందా అని ఎవరైనా ప్రశ్నిస్తారు. అయితే, సమాజంలో మాల- మాదిగ వర్గాలు కూడా దోపిడీ, అణిచివేతకు గురైనవే కాబట్టి ఆ భావజాలం వారిపై కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వర్గాల ప్రజల్లో ఇప్పటివరకు పై వర్గాల వారికి అధీనులమనే మానసిక స్థితిలోనే ఉన్నారు.

తమకు ఈ రాజ్యాంగం అనేకమైన రక్షణలను, హక్కులను ఇచ్చిందనే అవగాహన గానీ, అవి లభించప్పుడు ప్రభుత్వాలను సైతం ప్రశ్నించేఅవకాశం ఉందనే విషయంగానీ వారికి తెలియదు. కాబట్టి ఆ వర్గాలు, వాటికి అనుబంధంగా ఉన్న కులాలవారిని దోపిడీ చేయడం, అణిచివేయడం ఉద్దేశపూ ర్వక చర్యగా భావించడానికి వీలులేదు. ఈ విధమైన భావజాలం నుండి చూసినప్పుడు, మాల వర్గంప్రజలు - మాదిగవర్గం వారిని అణిచివేస్తున్నారనే అభిప్రాయంలోంచి- వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. అన్నిపార్టీలతో సహా- చివరికి మావోయిస్టులుకూడా వర్గీకణకు అనుకూలంగా ప్రకటన ఇచ్చిన విషయం తెలిసిందే.గత 15 ఏళ్ళుగా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు వర్గీకరణ సమస్యను ఎందుకు పరిష్కరించలేక పోతున్నాయి? ఇక్కడ, మాలవర్గం ప్రజలు మాదిగవర్గం ప్రజలను- ఆ వర్గం నాయకత్వం ఆరోపిస్తున్నట్లు- ఏ మేరకు దోపిడీ చేస్తు న్నాయి అనే శాతాలు అవసరం లేదు. ఎందుకంటే అగ్ర కులాలు మాల, మాదిగ ప్రజలను ఎంత శాతం దోపిడీ చేస్తున్నాయని వారిపై ఉద్యమాలు చేస్తున్నారని వెంటనే ప్రశ్న వస్తుంది. 

కాబట్టి, పైమెట్టుపై ఉన్న కులం క్రిందిమెట్టుపై ఉన్న కులంపై ఆ విధమైన భావజాలం ప్రదర్శిస్తుంది. ఈ విషయాన్నికూడా అదేవిధంగా చూడాలి. వర్గీకరణ అంశానికి- సామాజిక న్యాయ భావన సమర్థనీయం అనుకు న్నప్పుడు ఎందుకు ఆ సమస్య పరిష్కారం కావడంలేదు? ప్రభు త్వాలు లేదా పాలకులకు దాన్ని ఆచరణలో పెట్టడానికి చిత్తశుద్ధి లేకపోవడమే. ప్రభుత్వాలు- పరి పాలనలో సామాజికన్యాయ భావ నను ఆచరణలో పెడతాయనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలాగా వ్యవహరించవు. ఎందుకంటే, ప్రజ లకు ఆ అభిప్రాయం ఏర్పడితే ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థలో ఉన్న పాలకులకు ముప్పు ఏర్పడుతుంది. అందుకే ఏ పాలకులు తెలిసీ ఆ విధమైన ముప్పును కొని తెచ్చుకోలేరు. ఆ కోణంలో చూసినప్పుడు- కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా ఉండడంవల్లనే వారు ఇంకా పరిపాలనలో కొనసాగుతున్నారనుకునేందుకు అవకాశం ఉంది.

వర్గీకరణ సమస్య పరిష్కారమైతే, గత 65 సంవత్సరాలుగా ఆధిపత్యం వహిస్తున్న పాలకుల స్థానంలో దళితులు, ఆదివాసీలతో కూడిన ప్రభుత్వాలు ఏర్పడే వీలుండేది.ఈనాటి సామాజిక ఉద్యమాలు రాజాధికారం వైపే దృష్టి సారిస్తున్నాయి. ఆ కోణంలో చూసినప్పుడు, పాలకులు వెంటనే ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలకు అధికారాన్ని బదిలీ చేయాల్సి వస్తుంది. అటువంటి ఉపద్రవంగా పరిణమించే అధికార మార్పిడికి అగ్రకుల పాలకులు ఒప్పుకోరు. అందుకే సామాజికన్యాయం అంశం ఈ దేశ అగ్రకుల పాలకులకు వణకు పుట్టిస్తుంది. అందుకే సామాజిక న్యాయం పునాదిగావచ్చే ఏ ప్రజాడిమాండునైనా పట్టించు కోవడంలో లేదా అమలుచేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇక వర్గీకరణ సమస్యలో వాస్తవంగా ఎదురవుతున్న సాంకేతికపరమైన అంశాలున్నాయి. మొదటగా వర్గీకరణ సమస్య జాతీయస్థాయిలో చర్చకు వచ్చినప్పుడు- ప్రభుత్వం జాతీయ ఎస్‌సి కమిషన్‌ను సలహా కోరింది. 

అప్పటి మిషన్‌ చైర్మెన్‌ హనుమంతప్ప ఎస్‌సి వర్గీకరణ ఆచరణ సాధ్యంకాదని స్పష్టం చేశారు. ఎస్‌సి, ఎస్‌టి ప్రజలు ఒక రాష్ర్టంలో ఒకే రకంగా లేరని, సామాజిక ఆర్థిక విషయాల్లో తేడాలున్నాయని, ఒక రాష్ర్టంలో మెజారిటీగా ఉన్న కులం ప్రజలు మరొక రాష్ర్టంలో మైనారిటీగా ఉన్నారని, కాబట్టి జాతీయ స్థాయిలో ఇటువంటి అవకాశం దుస్సాధ్యమని చెప్పారు. ఆ తరువాత ప్రభుత్వం రాజ్యాంగ నిపుణులను సంప్రదించింది. రాజ్యాంగంలో ఆర్టికల్‌ 341 వర్గీకరణ అంశాన్ని కష్టసాధ్యంచేస్తుందని రాజ్యాంగనిపుణులు అభిప్రాయ పడ్డారు. రాజ్యాంగంలోకూడా ఎస్‌సిలను వర్గీకరించే అవకాశం లేకపోవడంతో- గతంలో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో తీర్మానంచేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. తద్వారా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లుపెట్టి, రాజ్యాంగ సవరణచేస్తే- ఆ తరువాత రాష్ర్ట ప్రభుత్వం తగు విధం గా వర్గీకరణ చేసుకొనే అవకాశం ఉం టుందని భావించారు. అయితే రాష్ర్ట అసెంబ్లీలో సులువుగా తీర్మానం జరిగినట్లు, పార్లమెంటులో రాజ్యాంగ సవ రణ జరిగే అవకాశం లేకపోయింది. 

ఎందుకంటే జాతీయ స్థాయిలో, ఆయా రాష్ట్రాల్లో రాజకీయ నాయకత్వంలోని మెజారిటీ నాయకులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే రాష్ర్టంలో ఉన్న మాదిగవర్గానికి సారూ ప్యంగా ఉండే చమార్‌ కుల ప్రజలు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మెజార్టీ సంఖ్యలో ఉన్నారు. ఆ విధంగా ఎస్‌సి లకుఉన్న 15 శాతం రిజర్వేషన్‌ సదుపాయాన్ని వారే ఎక్కువగా అనుభ విస్తున్నారు. కాబట్టి వర్గీకరణకు మద్దతుఇస్తే వారి రాష్ట్రాల్లోకూడా చమా ర్లు కానివారు తమకు అన్యాయంజరుగుతుందని, తమ జనాభా పరంగా వర్గీకరణ చేయాలని డిమాండుచేస్తే అక్కడ చమార్లు నష్టపోయే పరిస్థితి అధికంగా ఉంది.అయితే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ జరగకుండా వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించే అవకాశంలేదు. ఈ సాంకేతిక కారణంతో సమస్య ముడిపడుతోందని తెలిసికూడా వర్గీకరణ మద్దతుదారులు, ప్రభుత్వాలు ఎందుకు రాజ్యాంగ సవరణకోసం ప్రయత్నంచేయడం లేదు? మాల వర్గం ప్రజలు వర్గీకరణను ఎందుకు వ్యతిరేి స్తున్నారో కూడా గమనించాలి. 

మాదిగ నాయకత్వం వాదన ప్రకారం- ‘రాష్ర్టంలో మాదిగలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. కానీ విద్య, ఉద్యోగ అవకాశాలన్నీ మాలవర్గం అనుభవిస్తున్నది, మాదిగలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ జరగాలనే డిమాండు సామాజికన్యాయ కోణంలో సమంజసం’. ఇందుకు మాలవర్గం వాదన ప్రకారం- ‘రాష్ర్టంలో మాల మాదిగల వ్యత్యాసం సుమారు 0.9 లేదా 1 శాతం ఉన్నది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలుగా చూసినప్పుడు ఇది భిన్నంగా ఉంటుంది. తెలంగాణలో మాదిగ జనాభా అధికంగా ఉంటే మాల జనాభా తక్కువగా ఉంటుంది. ఆంధ్రలో మాల జనాభా అత్యధికంగా ఉంటే మాదిగ జనాభా తక్కువగా ఉంటుంది. రాయలసీమలో స్వల్పతేడాతో మాల- మాదిగలు ఉంటారు. వర్గీకరణ సమస్యకు మూలం- ఆంధ్ర మాల వర్గంలోఉన్న బ్యూరోక్రసీ అని చెప్పాలి. ఇందుకు వారిని కూడా తపపట్టాల్సిన అవసరంలేదు. తెలంగాణలో మాల మాదిగ వర్గాల్లో సామాజికంగా పెద్ద తేడాలు లేవు. అయినప్పటికీ వర్గీకరణను రాష్ర్టం యూనిట్‌గా జరగాలనే చేస్తున్న ప్రయత్నాలను మాల వర్గం వ్యతిరేకిస్తోంది. 

సామాజికన్యాయం కోణంలో స్వల్ప మెజారిటీతో ఉన్న మాదిగలు రాష్ర్టం యూనిట్‌గా వర్గీకరణ జరగాలని కోరడం ఎంతన్యాయమో- ఆంధ్రాలో అత్యధిక మెజారిటీతో ఉన్న మాల వర్గం వ్యతిరేకించడం కూడా అంతేన్యాయం! వర్గీకరణ జరిగితే తెలంగాణలో మాల వర్గం నష్టపోయేదేమీ లేదు. కానీ ఆంధ్రలోఉన్న మాలలు తీవ్రంగా నష్టపోతారు. తెలంగాణలో మాదిగ వర్గం ప్రజలు అధికంగా ఉన్నారు. తెలంగాణలో ఆ ప్రజలు అధికంగా ఉండగా ఆ జనాభాకంటే తక్కువ శాతం రిజర్వేషన్‌ కోరడంలో ఆంతర్యమేమిటో మాదిగ నాయకత్వంతో పాటు ప్రభుత్వాలు ఆలోచించాలి. తెలంగాణలో వర్గీకరణ జరిగితే వారికి 7 శాతం అమలవు తుంది. తెలంగా ణలో వారు మొత్తం 15 శాతంలో 7 శాతమే ఉన్నారనేది అంగీకరిస్తారా? మాల వర్గం జనాభాకు తెలంగాణలో వర్గీకరణ జరిగితే నష్టంలేదు, లాభంలేదు. వారు ఎంత జనాభా ఉన్నారో అంత రిజర్వేషన్‌ వర్గీకరణ జరిగినా జరగకపోయినా వారి జనాభాకు అనుగుణంగానే విద్య, ఉద్యోగ అవకాశాలు న్నాయి.ఏ విధంగా చూసినా ‘జనాభా ఎంతనో రిజర్వేషన్‌ అంత’ అనే కోణం లో చూసినప్పుడు ఆంధ్రాలో ఉన్న మాల వర్గం ప్రజలు వర్గీకరణను వ్యతిరేకించడంలో తప్పులేదు. అక్కడ ఆదిఆంధ్రా రెల్లి గ్రూపులు ఉన్నాయి. వాటి రెండు శాతం రిజర్వేషన్‌పోగా మిగిలిన 6 శాతం రిజర్వేషన్‌తో మాలవర్గం తీవ్రంగా నష్టపోతుంది.వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించాలంటే ఈవిషయాలన్నింటినీ పరిశీలించాలి.

bdri
గత 15 సంవత్సరాలకుగా ఈ విషయాలన్నీ ఇరు వర్గాలు క్షుణ్ణంగా విశ్లేషించుకోవడం జరిగింది. కానీ చిత్తశుద్ధితో పరిష్కారాన్ని వెదకడంలో తాత్సారం చేస్తున్నారు. ఇది అగ్రకుల పాలకులకు, వారు అధికారాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడుతుంది. కాని, మాదిగ, మాల నాయకత్వాల ఒంటెద్దు పోకడలవల్ల సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు. ఈ విషయంలో కొంతమంది మాదిగవర్గం ప్రతినిధులు ప్రాంతాలవారీగా వర్గీకరణ జరిగితే పరిష్కారం లభిస్తుందని ప్రతిపాదించారు. కానీ ఈ ప్రతిపాదన విస్తుృతంగా చర్చకు రాకుండా చేస్తున్నారు. కాబట్టి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి, రాష్ర్టంలో వర్గీకరణ చేసే క్రమానికంటే ముందు ప్రాంతాల వారీగా వర్గీకరణ గురించి ఆయా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిఉంది.

రచయిత న్యాయవా



Surya Telugu News Paper Dated:  16/1/2013

Monday, September 3, 2012

వర్గీక‘రణం’ ఇంకా ఎంతకాలం? ----అద్దంకి దయాకర్


షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించాలని చంద్రబాబు మళ్లీ తీర్మానించి మాదిగలకు సామాజిక న్యాయం చేస్తానని ముందుకు రావడం ఆశ్చర్యపడే అంశమేమీ కాదు.1994 నుంచి దండోరా ఉద్యమానికి మద్దతు అంటూ తెలుగుదేశం పార్టీ మాదిగల ఓట్లను తన ఖాతాలో వేసుకుంటూ ఉన్నది. 2004లో టీడీపీ అధికారం కోల్పోయాక మాదిగలు వర్గీకరణను మరిచిపోయారు. వర్గీకరణ చట్టం 1999 డిసెంబర్‌లో అసెంబ్లీలో ఆమోదం పొంది, 2000 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. దానికి ప్రధాన కారణం ‘దేశం’ ప్రభుత్వ కుతంత్రమే అనేది జగమెరిగిన సత్యం. అయితే రాష్ట్రాలకు రిజర్వేషన్లను విభజించే హక్కులేదని, కులాల వారీగా వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకమని, సూక్ష్మస్థాయిలో వర్గీకరణ చెల్లదని మాలలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆంధ్రవూపదేశ్ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం-2000ను చెల్లదని కొట్టివేసింది. తనకు ఉన్న అధికారంతో కేంద్రపరిధిలోని అంశంలో తలదూర్చి బాబు మొట్టికాయలు తిన్నాడు. అలాగే తాను రాష్ట్రంలో చేసిన చట్టానికి రాజ్యాంగబద్ధత కోసం కనీస ప్రయత్నం చేయలేదు. 2000లో చట్టం చేసి 2004 వరకు చేతులు ముడుచుకుని కూర్చున్నాడు. కేంద్రంలో చక్రం తిప్పిన బాబు తను చేసిన చట్టానికి పార్లమెంటు ఆమోదం కోసం ప్రయత్నించలేదు. ఎందుకంటే రిజర్వేషన్ల వర్గీకరణను కేంద్ర ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలు వ్యతిరేకిస్తాయని తెలుసు. ‘లా- బోర్డు’ సూచనలను పక్కనపెట్టి తన స్వార్థం కోసం మాదిగలను మోసం చేశాడు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతనైనా మాదిగల పక్షాన నిలబడి పోరాటం చేశాడా అంటే అదీలేదు! దీనికంతటికీ కారణం మాల, మాదిగలు కలిసి ఉంటే తమకు అధికారం దూరమవుతుందనే కుట్ర తప్ప మరొకటి కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 18 శాతంగా ఉన్న దళితులు ఐక్యంగా ఉంటే మిగతా వారికి అధికారం దక్కదనే కుట్రతోనే అన్ని అగ్రకుల పార్టీలు వర్గీకరణకు మద్దతునిస్తున్నాయి.

దళితులకు రాజ్యాధికారం అనే కల ఉత్తవూపదేశ్‌లో సాకారం కావడాన్ని గమనించిన పార్టీలు భయంతో పదేపదే వర్గీకరణ జపం చేశాయి. దాని కోసం మందకృష్ణను వాడుకున్నాయి. అయితే అసలు విషయం సుప్రీంకోర్టు రిజర్వేషన్ల వర్గీకరణన చెల్లదన్నది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తామన్నా సమస్య జటిలం కాకుండాపోయేది. లేకుంటే పార్లమెంటు చేత వర్గీకరణ చట్టం చేయించి రాజ్యాంగ బద్ధత కోసం ప్రయత్నించినా బాగుండేది. రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఉషా మెహ్రా కమిషన్‌ను వేయించింది. ఉషా మెహ్రా నేతృత్వం లోని కమిటీ రాష్ట్రంలో పర్యటించి చివరకు మాల, మాదిగలు కాకుండా మిగతా 58 కులాల అభివృద్ధి సంగతి గురించి చెప్పి కులాల వారీగా వర్గీకరణకు రాజ్యాంగ అనుమతి కష్టమని తేల్చింది. సుప్రీంకోర్టు కూడా రాష్ట్రంలో మాదిగలతో పాటు ఇంకా వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని, విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని, ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు పథకాలను ప్రవేశ పెట్టాలని సూచించింది. ఈ విషయాన్ని పెడచెవిన పెట్టిన వైఎస్ వర్గీకరణకు కట్టబడి ఉంటామని మళ్లీ సమస్యను మొదటికి తెచ్చాడు. సహజంగానే మాదిగలు మళ్లీ ఉద్యమబాటను ఎంచుకున్నారు. అయితే ఆ ఉద్యమం వర్గీకరణ చట్టాన్ని నిరుపయోగంగా తయారు చేసిన చంద్రబాబుపైనా కాదు. ఆ చట్టాన్ని కాపాడేందుకు ప్రయత్నించని వైఎస్‌పైనా కాదు. కేవలం మాలలను శత్రువులుగా చూపిస్తూ ఉద్యమం కొనసాగడం విచారకరం.

అంబేద్కర్ అంటరాని కులాలన్నింటిని ఒక షెడ్యూల్‌లో చేర్చడం ద్వారా వారు ఐకమత్యంగా ఉంటే రాజ్యాధికారం కోసం పోరాడుతారని ఆశించాడు. అది జరగకుండా నిరంతరం దాయాదుల మాదిరిగా కొట్లాడుకునేందుకు అందరూ ప్రయత్నించారు. ఏనాడూ ఇరువర్గాలతో కలిసి చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేయలేదు. మళ్లీ చంద్రబాబు మాదిగలకు వర్గీకరణ అవసరం అంటున్నాడు. మాదిగలకు బాబు మద్దతు ఇచ్చి అన్ని పార్టీల మద్దతు అడుగుతున్నాడు. అయితే పార్టీలు సహజంగానే గతంలో చేసుకున్న తీర్మానాలనే మళ్లీ ప్రవేశపెట్టుకుంటాయి. మాలలు వ్యతిరేకిస్తారు. కాబట్టి మళ్లీ సమస్యను, సమస్యగానే మిగిలించే ప్రయత్నంతో బాబు వర్గీకరణానికి తెరలేపాడు. వర్గీకరణ సమస్య వల్ల 18 ఏళ్లు నిట్టనిలువునా చీలిన షెడ్యూల్డ్ కులాలు, ఇంకా 18 ఏళ్ల దాకా కలిసే పరిస్థితి కనిపించడం లేదు. 18 శాతం ఉన్న దళితుల్లో 9 శాతం మాల ఉపకులాలు ఉంటే, 9 శాతం మాదిగ ఉప కులాలు ఉంటాయి. నేడు 60 కులా లు సామరస్యంగా చర్చించుకునే పరిస్థితులు లేవు. చంద్రబాబు పుణ్యాన ఆ పరిస్థితి కొనసాగుతున్నది. ఈ మధ్యనే ఇరు వర్గాలూ నష్టపోయినట్టగా భావిస్తున్నారు. కలిసి చర్చించుకొని సమస్యకు ఒక పరిష్కారం తేవాలనే ఉద్దేశంతో కొన్ని సమావేశాలు కూడా జరిగాయి. రాజ్యాధికారం సాధించుకునేందుకు మాల, మాదిగలు కలిసిపోవాలని, అందుకోసం సన్నద్దమవ్వాలని భావిస్తున్న తరుణంలో బాబు వర్గీకరణ పిడుగు పేల్చా డు. దీనితో బాబు ఏమీ సాధించలేకపోయినా దళితులను నిరంతరం విడగొట్టగలడు.

వర్గీకరణకు బాబు మద్దతునిస్తే కేంద్రంలో ఏమైనా జరుగుతుందా? అంటే గతంలో మందకృష్ణ జాతీయ పార్టీల మద్దతును లేఖల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశారు. మాయావతి లాంటి చమర్ (మాదిగ) జాతికి చెందిన నాయకురాలే తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే ఉత్తరభారతంలో ఎక్కువగా చమర్‌లే రాజకీయ, విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు ఉపయోగించుకుంటున్నారు. దీనిపై పార్లమెంటులో చర్చ జరిగి యావత్ దళితులు నిట్టనిలువునా చీలిపోతారని, అది అంబేద్కర్ ఆశయానికి తూట్లు పొడవడమేనని పార్లమెంటు వేదికగా చెప్పారు. ఎస్సీ వర్గీకరణపైన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇప్పుడది జాతీయ విధానం కావాలి. బాబు రెండుకండ్ల సిద్ధాంతంతో తెలంగాణలో, జగన్ ప్రభావంతో ఆంధ్రలో ప్రాభవం కోల్పోయి, నిస్పృహతో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజ్యాంగ పరంగా అన్ని కులాల పట్ల సమన్యాయం పాటించాలనేది పార్టీలకు ఎన్నికల కమిషన్ నియమావళి సూచిస్తున్నది.అధికారం కోసం బాబు అన్నీ వదులుకుంటారు. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు, ప్రజాసంఘాలకు వర్గీకరణ సమస్య పరిష్కారం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక పక్షాన్నే సమర్థించడం కాదు. ఇరు వర్గాల అభివూపాయాలను పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది. ఇప్పుడు బాబు రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ఎత్తుగడలను మిగతా పార్టీలు నమ్మవద్దని కోరుతున్నాం.

మాదిగలకు మాలలు వ్యతిరేకమనే ప్రచారం వాస్తవం కాదు. ఎన్నోసార్లు మా సంఘం కులాల వారీగా కాకుండా ఆర్థిక ప్రాతిపదికన వర్గీకరణ జరగాలని కోరాం. ఉమ్మడి ఆంధ్రవూపదేశ్‌లో కులాల వారి వర్గీకరణ జరిగితే తెలంగాణలో మాదిగలు, ఆంధ్రలో మాలలు నష్టపోతారనేది మా భావన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణలో వర్గీకరణ కోసం మళ్లీ మాదిగలు పోరా టం చేయాలి. అంటే వర్గీకరణ కాష్టం ఎప్పుడూ రగులుతూనే ఉండా లా? మాల మాదిగ ఉద్యమాల్లో పాల్గొనేది గ్రామీణ ప్రాంత ప్రజలు. లబ్ధి పొందేది పట్టణాల్లోని ధనిక ఎస్సీలు. చదువు, ఉద్యోగం, రాజకీయంతో పనిలేని మాల, మాదిగలకు వర్గీకరణ ద్వారా ఏం లాభం జరుగుతుందని ఇరు వర్గాల నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. పార్టీలు చేసే రాజకీయ ఉద్యమాలకు మాల, మాదిగలను బలి చేయడం, దానికి సామాజిక న్యాయం అని పేరు పెట్టడం ఎంత వరకు సబబు?

ఈ మధ్యనే మందకృష్ణ, కంచెఐలయ్య, గద్దర్ లాంటి ముఖ్యులతో ఈ సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలని కోరాము. నిజంగా దళితుల పట్ల నిబద్ధత ఉన్న నాయకుపూవరూ బాధ్యతారహితంగా వ్యవహరించరు. చంద్రబాబు వర్గీకరణను చూసి నట్టుగా కాకుండా ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉన్నది. ఇరు వర్గాలు పట్టింపులకు పోకుండా రాజీకి వస్తే దళిత జాతికి మేలు చేసినవాళ్లం అవుతాం. లేకుంటే చరిత్ర హీనులం కాక తప్పదు.
-అద్దంకి దయాకర్,తెలంగాణ మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు
Namasete Telangana News Paper Dated : 04/09/2012 

Saturday, October 1, 2011

పంపకాల అంకంలోకి ప్రవేశిస్తున్నామా? - కె. శ్రీనివాస్ Andhra Jyothi Sampadakiyam 2/10/2011


సందర్భం


పంపకాల అంకంలోకి ప్రవేశిస్తున్నామా?
- కె. శ్రీనివాస్

ఉన్నదున్నట్టు ఉండడం సాధ్యంకాదు, ఏదో ఒకటి చేయవలసిందే. శ్రీకృష్ణకమిటీ నివేదిక సిఫార్సుల మతలబు ఎట్లా ఉన్నా, దానిలోని సారాంశం మాత్రం అదే. కాకపోతే, ఆ చేయదగిన వాటిలో మొట్టమొదటిదిగా సమైక్యరాష్ట్రంలో ప్రాంతీయ కమిటీ ఏర్పాటును సూచించింది. ఇప్పుడున్న రాష్ట్రాన్ని ఏ చికిత్సలూ లేకుండా కొనసాగించడం సాధ్యంకాదన్నదే ఆ కమిటీ నిర్ధారణ. ఇప్పుడు ఆజాద్ కూడా అదే మాట చెబుతున్నట్టున్నారు. ఎంతో రహస్యంగా రూపొందించి, రహస్యంగా చర్చిస్తున్న నివేదిక 'లోగుట్టు' ఏమిటో తెలియదు కానీ, రాష్ట్రంలోని రెండు ప్రాంతాలూ కలసి ఉండడం సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని బలంగా చెప్పినట్టు తెలుస్తోంది.

విభజన ఖాయమే అనిపిస్తోంది. కాకపోతే, అటువంటి సూచన ఏదో అధికార స్వరాలలో పలకకపోతే, రాష్ట్రంలో ఇప్పుడు సాగుతున్న సకలజనుల సమ్మె ఉపశమించేటట్టు లేదు. సమస్యను సాగదీసినవారే ఈ పరిస్థితిని చక్కదిద్దాలి కానీ, ఇప్పటికీ అలక్ష్యం ధ్వనించే వాయిదా మాటలే మాట్లాడుతున్న ఢిల్లీ పెద్దలకు ఆ విజ్ఞత కలుగుతుందో లేదో తెలియదు. దసరా తరువాత ఆశకు ఆస్కారం కలిగే ఏదో ఒక మాట వినిపిస్తే, సమ్మె ముగుస్తుంది కానీ, సమస్య అక్కడితో ముగిసిపోదు.

ఎందుకంటే, విభజన తప్పదన్న తెలివిడికి ఎంత ప్రయాస అవసరమయిందో, విభజన ప్రాతిపదికలపై అంగీకారానికి రావడానికి అంతటి యాతనా తప్పదు. మొదట బయటపడేది కాంగ్రెస్ అభిమతం, ఆ తరువాత తక్కిన పక్షాలలో కసరత్తు, అందరిమధ్యా సంప్రదింపులు, చర్చలు, వాదోపవాదాలు, అంగీకారం లేని అంశాలపై ఆందోళనలు- తప్పనిసరి ప్రక్రియ ఇది. రాష్ట్రం కలసి ఉండడం కానీ, రెండుగా విడిపోవడం కానీ కేవలం భావోద్వేగాలకు సంబంధించిన అంశాలు కావు. విభజనతో కానీ, సమైక్యంతో కానీ ముడిపడిన అనేక సామాజికార్థిక రాజకీయ ప్రయోజనాలు సెంటిమెంటులో అంతర్లీనంగా ధ్వనిస్తున్నాయి.

కలసి ఉండడంలో ప్రయోజనాలున్నవారు సమైక్యాన్ని కోరితే, విడిపోవడంలో ప్రయోజనాలు చూస్తున్నవారు విభజన కోరుతున్నారు. సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన ప్రాబల్యవర్గాల, రాజకీయవాదుల ప్రయోజనాలు ఎటూ సమైక్యంలో ఉన్నాయి. వారితో నిమిత్తం లేకుండా కూడా సామాన్య, మధ్యతరగతి ప్రయోజనాలూ కొన్ని సమైక్యంతో ముడిపడి ఉన్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రాబల్యవర్గాల, రాజకీయుల ప్రయోజనాలు విభజనలో ఉన్నాయి.

విశాల ప్రజానీకం కూడా తమ సొంత ప్రయోజనాలను, ఆకాంక్షలను ప్రత్యేక రాష్ట్రంలో చూస్తున్నారు. రెండు ప్రాంతాలలో రెండు రకాల వర్గాల ప్రయోజనాలు ఒకే నిష్పత్తిలో ఉన్నాయని కాదు. కానీ, ఇందులో సామాన్యుల ప్రయోజనాలూ ఉన్నాయన్నదే గమనించవలసిన అంశం. రాష్ట్రవిభజన నిర్ణయం తీసుకునేముందు, లేదా విభజన ప్రాతిపదికలను నిర్ణయించేముందు సాధారణ ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవలసిందే.

అయితే, ఈ ప్రయోజనాలు కేవలం హైదరాబాద్ నగరంతోనే ముడిపడి ఉన్నాయా? అదొక్కటే మొత్తం సమస్యకు కేంద్రమా? హైదరాబాద్‌లో సీమాంధ్రప్రజల ప్రయోజనాలు ఉన్నాయన్నది వాస్తవం. రాష్ట్రఅవతరణ జరిగినప్పటినుంచి ఉద్యోగులుగా వచ్చి ఇక్కడ స్థిరపడినవారు, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తున్నవారు, ఉత్తరాంధ్రనుంచి, సీమాంధ్రలోని మెట్ట ప్రాంతాల నుంచి శ్రామికులుగా, వృత్తిపనివారిగా వచ్చి స్థిరపడినవారు పెద్ద సంఖ్యలోనే హైదరాబాద్‌లో ఉన్నారు. అలాగే, వ్యాపారులుగా, పారిశ్రామికులుగా స్థిరపడిన వారూ ఉన్నారు.

హైదరాబాద్‌లో కేవలం ఆస్తులను మాత్రమే కూడగట్టుకున్నవారూ ఉన్నారు. వీరంతా హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కావడం వల్ల మాత్రమే వచ్చారనుకోలేము. ప్రభుత్వోద్యోగులు, రాజకీయవాదుల కుటుంబాలు అందువల్లనే వచ్చారనడంలో సందేహంలేదు. తక్కినవారు, ఆర్థికాభివృద్ధికి, ఉపాధికి అపరిమిత అవకాశాలున్న మహానగరానికి వచ్చారనే భావించాలి. రాష్ట్రావతరణ జరిగి ఐదున్నర దశాబ్దాలు గడుస్తున్నా, శాస్త్రీయంగా పట్టణప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రయత్నించింది లేదు.

ఒకటో రెండో మహానగరాల కంటె, వికేంద్రీకరించిన పట్టణీకరణ సమాజానికి అధికంగా దోహదం చేస్తుంది. అటు శ్రీకాకుళం నుంచి, ఇటు చిత్తూరు దాకా- వ్యవసాయసంక్షోభం వల్లనో, ఇతర కారణాల వల్లనో గ్రామాలు వదిలి వచ్చేవారిని స్వీకరించి ఆదరించగలిగే పట్టణాలులేవు. అందుకే, హైదరాబాద్‌లో పక్కనే ఉన్న మహబూబ్‌నగర్‌కు చెందినవారూ, దూరాన ఉన్న ఉత్తరాంధ్రకు చెందినవారూ భవన నిర్మాణ కార్మికులుగా కనిపిస్తారు.

వీరందరికీ రాజకీయప్రతిపత్తితో సంబంధం లేకుండా హైదరాబాద్ ఆశ్రయాన్నీ, ఉపాధినీ కల్పిస్తూ పోవలసి ఉంటుంది. హైదరాబాద్ నగరం విస్తరించడానికి, 'అభివృద్ధి' చెందడానికి ఉన్న కారణాలను శాస్త్రీయంగా, చారిత్రకంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉన్నది. అసలు ఆ అభివృద్ధి ఎంత వరకు ప్రజానుకూలమైనది? కేవలం ఉన్నతాదాయవర్గాల వారికి అవసరమైన జీవనప్రమాణాలను సిద్ధం చేసుకోవడమే అభివృద్ధా? అన్నవి చర్చించవలసిన ప్రశ్నలు.

రాష్ట్రవిభజన కారణంగా హైదరాబాద్‌లో ఉన్న ఇతర ప్రాంతీయులలో అభద్రత ఏర్పడే అవకాశం ఉండవచ్చు, దాన్ని అర్థం చేసుకోగలము. విభజన ప్రాతిపదికలలో అవసరమైన రక్షణలు కల్పించడమే ఆ సమస్యకు పరిష్కారం. సామాన్యులే కాక, సంపన్నులు, వ్యాపారులు కూడా ఆకస్మిక పరిణామం కారణంగా, రాజకీయ నాయకత్వం మార్పిడి కారణం దెబ్బతినకుండా, వెసులుబాటు కల్పించవలసిన అవసరం ఉన్నది. తాత్కాలికంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడమా, మరో పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకోవడమా- ఏ పరిష్కారం సమ్మతమో దానికి మార్గం సుగమం కావాలి.

అయితే, సమస్య హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులది మాత్రమేనా? ఆదిలాబాద్‌లో, నిజామాబాద్‌లో, వరంగల్, ఖ మ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌జిల్లాల్లో స్థిరపడిన సీమాంధ్రుల ప్రయోజనాల సంగతేమిటి? వారు తెలంగాణ రాష్ట్రంలో ధీమాగా ఉండగలుగుతారా? వారు ఉండగలిగితే హైదరాబాద్ వాసులు ఎందుకు ఉండలేరు? - ఇవీ ప్రశ్నలే. హైదరాబాద్‌తో సహా తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల భద్రత, భవితవ్యం మాత్రమే చర్చనీయాంశా లా? సీమాంధ్ర ప్రాంతాలలోని ప్రజలకు విభజనతో సమస్యలేమీ లేవా?

సీమాంధ్రలో చదువుకుంటున్న విద్యార్థులందరికీ హైదరాబాద్ ఒక తప్పనిసరి గమ్యం. ఉద్యోగాలు అక్కడే దొరుకుతాయి మరి. కొత్త రాజధాని ఏర్పాటైనా అది ఆ అవసరాన్ని తీరుస్తుందని చెప్పలేము. ఎందుకంటే, ఏదైనా ఒక పట్టణం రాజధాని కావడం వల్ల కాక, దానికున్న మౌలికసదుపాయాల వ్యవస్థ, భూముల అందుబాటు, నైసర్గిక అనుకూలతల కారణంగా విస్తరిస్తుంది.

సీమాంధ్రలో ఏర్పడే కొత్త ప్రభుత్వం దూరదృష్టితో, వివేకంతో వ్యవహరించి ఉపాధిఅవకాశాల విస్తరణ దిశగా చర్యలు తీసుకుంటుందనుకుందాం, అయితే దానికి సమయం పడుతుంది. అప్పటిదాకా హైదరాబాద్ వారికి అందుబాటులో ఉండాలి. మరి ఇన్ని అవకాశాలను కల్పిస్తూ పోతే, తెలంగాణ యువకుల సంగతేమిటి? అన్న ప్రశ్న అనివార్యంగా వస్తుంది. చిన్నవో చితకవో సీమాంధ్ర లో అనేక పట్టణాలున్నాయి. తెలంగాణ పరిస్థితి అది కాదు. వారికి హైదరాబాద్ లేకపోతే, ఉపాధి అవకాశాలు మృగ్యం. అంటే, హైదరాబాద్ ఆదాయాన్ని పంచుకున్నట్టే, ఇతర అవకాశాలను కూడా కొంతకాలం పాటు ఉభయులూ ఏదో ఒక నిష్పత్తిలో పంచుకోవాలి.

ఉద్యోగాలు, చదువులూ పక్కనపెడితే, సాగునీటి సమస్య చాలా కీలకమయినది, సంక్లిష్టమయినది. కృష్ణాగోదావరినదులు సుదీర్ఘంగా ప్రవహిస్తూ ఉన్నా తెలంగాణ నేలకు సాగునీటి లభ్యత లేదన్నది తెలంగాణ ఉద్యమం పుట్టడానికి ఒక ముఖ్యమైన కారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, సాగునీటి కోసం జరిగే కొత్త ప్రయత్నాలు కానీ, తెలంగాణ ప్రభుత్వ వైఖరి వల్ల కానీ- దిగువ ప్రాంతమైన కోస్తాంధ్రకు నీరు అందదేమోనన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. పోలవరం, పులిచింతల ప్రాజెక్టుల మీద ఉభయప్రాంతాల ప్రయోజనాలు, వైఖరులు భిన్నంగా ఉన్నాయి. నీటిపంపకం పెద్ద సమస్యే కానున్నది.

నిజానికి హైదరాబాద్ కంటె అదే పెద్ద సమస్య. మహానగరంలో అమిత ప్రయోజనాలున్నవారు ఆ ఒక్కదానికే ప్రాధాన్యం ఇస్తూ, తక్కినవాటిమీద దృష్టి సారించకుండా జాగ్రత్త పడ్డారు. విభజన అసాధ్యమనే అభిప్రాయాన్ని పదే పదే కల్పించడం ద్వారా, సీమాంధ్ర ప్రాంత రైతాంగంలో తమ ప్రయోజనాల సాధన కోసం ముందే మేల్కొనే అవకాశం లేకుండా చేశారు. అంటే సీమాంధ్ర రైతాంగం తెలంగాణతో ఘర్షణ వైఖరి ద్వారా రక్షణలు పొందాలని, పొందగలరని కాదు. సాగునీటికి అధిక లబ్ధిదారులు గా కనిపిస్తున్న సీమాంధ్ర ఆయకట్టురైతాంగం, తమ ప్రస్తుత స్థితిని కాపాడుకోవడం అవసరం.

అందుకు, ఉభయప్రాంతాల మధ్య సంప్రదింపులు, సదవగాహన అవసరం. వాస్తవికత, సమాన న్యాయం ప్రాతిపదికలుగా కృష్ణా జలాల పునఃపంపిణీ అవసరం. ఆ పంపిణీలో రాయలసీమకు కూడా న్యాయం చేయవలసి ఉంటుంది. హైదరాబాద్‌తో ఉన్న ప్ర యోజనాల కంటె, అధికంగా కృష్ణాజలాలే రాయలసీమ రైతాంగానికి, అక్కడి రాజకీయ నాయకత్వానికి కూడా ముఖ్యం.

పరీవాహకప్రాంత హక్కులు లేని రాయలసీమకు తుంగభద్ర, పెన్న తప్ప పెద్దనదులు లేవు. తెలుగుగంగ పుణ్యమా అని కొన్ని నీళ్లు, రాజశేఖరరెడ్డి హయాం కారణంగా పోతిరెడ్డిపాడు నుంచి కొన్ని వివాదాస్పద జలాలు మాత్రమే సీమకు లభిస్తున్నాయి. ఎంతో కొంత జలవాగ్దానం జరగకపోతే, విభజన వల్ల రాయలసీమ అధికంగా నష్టపోతుంది. జీవనదులు ప్రవహిస్తున్నా సాగునీటికి గతిలేకుండా ఉన్న తెలంగాణ, రేపు కోస్తాకు, సీమకు నీటిని వాగ్దానం చేయవలసి రావడమే విచిత్రం.

ఇందరికి ఇన్ని సర్దుబాట్లు చేసిన తరువాత తెలంగాణకు ఏమి మిగులుతుంది? దాన్ని అభివృద్ధిబాటలో పాలకులు ఎట్లా నడిపిస్తారు?- అన్నవి ఆందోళనకరమైన ప్రశ్నలే. కానీ, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెదకవలసిన సమయం వచ్చింది. విభజన ఖాయం అని తెలిసిన తరువాత, పంపకాల మీదనే చర్చ ప్రారంభం కావలసి ఉన్నది. వివక్ష వల్ల బాధితులైనవారు, ఇతరుల విషయంలో ఆ వివక్ష చూపించరు, ఉదారంగా కూడా ఉంటారు. ఉండాలి. కానీ, విభజన ప్రాతిపదికలను నిర్ణయించేటప్పుడు, విభజన ఉద్యమం ఎందుకు జరిగిందో, ఆ విలువలను ఆకాంక్షలను విస్మరించకుండా ఉండాలి. భౌతిక ప్రయోజనాలు శూన్యమై కేవలం భావోద్వేగాలు సంతృప్తి చెందితే కూడా ఉపయోగం లేదు.

- కె. శ్రీనివాస్

Monday, September 26, 2011

విభజన సీమాంధ్రకే మేలు -కారుమంచి కృష్ణ చైతన్య Andhra Jyothi 27/09/2011


విభజన సీమాంధ్రకే మేలు

-కారుమంచి కృష్ణ చైతన్య

'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్' అన్న గురజాడ మాటలను మనం సరిగ్గా అర్థం చేసుకున్నామా? రాష్ట్ర విభజన అంటే మట్టి విభజనే కానీ మనుషుల విభజన కాదు కదా. ఇన్ని సంవత్సరాలుగా కలసివున్నా సఖ్యత కుదరలేదు. అందువల్ల సమైక్యతా లేదు. సఖ్యత లేని సమైక్యత ఆధిపత్యమే అవుతుంది కాని నిజమైన సమైక్యత కాదు.

పెట్టుబడిదారులకు లాభాపేక్ష తప్ప ఆత్మ గౌరవం ముఖ్యం కాదు. వారు సమైక్య మన్నా జాతీయ జెండా భుజాన వేసుకుని జాతీయ వాదమన్నా దాంట్లో వారి లాభాపేక్ష దాగి ఉంటుంది. కావున వారు విభజనను తమ స్వభావరీత్యా వ్యతిరేకిస్తారు . అయితే గత కొన్నేళ్లుగా 'జాగో-భాగో', 'మొత్తం సీమాంధ్రులు అంతా వలసవాద దోపిడీదారులు' అని, 'అడ్డమొస్తే నరుకుతామని, తరుముతామని'.. ఇలా పలురకాలుగా తెలంగాణ వాసులు తమ అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్రులను బాహాటంగా చీదరించుకొంటున్నారు.

ఇలా సీమాంధ్రుల ఆత్మగౌరవానికి సవాళ్లు విసురుతూ ఉంటే , ఏమైనా ఫరవా లేదు, మీరు తిట్టినా, కొట్టినా నిస్సిగ్గుగా ఇంకా కలిసే ఉండాల అని మనం (సామాన్య సీమాం ధ్రులు) వాదిస్తే మనకంటూ ఒక ఆత్మగౌరవం ఉన్నట్టా? లేనట్టా? ఈ సందేహం సహజంగానే కలుగుతుంది. తెలంగాణ వాళ్ళు అన్నట్టు మనమందరం ఆత్మగౌరవం లేని వాళ్ళుగా అంటే పెట్టుబడిదారులు, దోపిడీదారులు, వలసవాదులుగా మిగిలిపోవాల్సినదేనా? ఇంతకీ విభజన జరిగితే మనకొచ్చే నష్టం ఏమిటి? మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? జాగ్రత్తగా ఆలోచించి, ఖచ్చితమైన ప్రతిపాదనలు ముందుంచి అది విభజనకు అంగీకరిస్తే సీమాంధ్రకు లాభమే కాని నష్టం వాటిల్లదు.

విభజన జరిగితే నదీజలాల సమస్య తలెత్త గలదని సీమాంధ్రలో అనుమానాలు ఉన్న మాట వాస్తవం. అయితే తెలంగాణ విడిపోతే సీమాంధ్రకు అసలు నీళ్ళు రావని అనడం రాజకీయం కాని వాస్తవం కాదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నదీ జలాలను పంచుకొంటున్నాయి. ఉదాహరణకు నైలు నదీ జలాలను పదకొండు దేశాలు వాడుకొంటున్నాయి.

మన దేశంలో గంగ, గోదావరి, నర్మద, కృష్ణ , కావేరీ నదీ జలాలను పలు రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. నదీ జలాల పంపకాలపై అంతర్జాతీయ, జాతీయ చట్టాలు ఉన్నాయి. ఆ ప్రకారంగానే రేపు, కృష్ణా, గోదావరి నదీజలాలను తెలంగాణ, సీమాం ధ్రు ల మధ్య పంపకం చేయవచ్చు. అయితే ఇక్కడ సమస్యలేమీ ఉండవని అర్థం కాదు. సమస్యలు ఉంటాయి. కానీ వాటి పరిష్కారానికి మెరుగైన మార్గాలను ఎంచుకోవడంలో చాకచక్యత చూపించాలి.

ఉదాహరణకు ప్రస్తుతమున్న ట్రిబ్యునల్ వ్యవస్థ లోని లోపాలను సరిదిద్దే ఆలోచనలు చేయాలి. నదీజలాల సమస్య జాతీయ సమస్యకాబట్టి ఒక రాజ్యాంగ/ చట్ట బద్ధ జాతీయ నదీజలాల అథారిటీని పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేయాలి; దానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చి దేశంలోని నదుల నీటిని పంచే బాధ్యతను అప్పగించాలి. ఈ పంపకంలో రాష్ట్రాల ప్రమేయం లేకుండా చేస్తే నదీజలాల సమస్యలు తీరే అవకాశం ఉండవచ్చు. కావున వీటికి సంబంధించిన నిర్దిష్టమైన ప్రతిపాదనలు పెట్టాలి.

హైదరాబాద్ నగరం నేడు సీమాంధ్ర విద్యావంతులకు ప్రధాన మజిలీగా మారింది. ఇందులో సందేహం లేదు. విభజన జరిగితే ఈ సౌలభ్యం చేజారుతుంది అనుకోవడం ఒక అపోహ మాత్రమే. చదువుకున్న, నైపుణ్యత కలిగిన యువతకు నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో మజిలీలు దేశ విదేశాలలో చాలా ఉన్నాయి. అంత మాత్రాన వాటిపై రాజకీయ ఆధిపత్యం కోరుకోవడం లేదే!

మరి ఒక్క హైదరాబాదు పైనే ఎందుకు? హైదరాబాదును మనమే (సీమాంధ్రులు) అభివృద్ధి చేసినాము అనడం కూడా రాజకీయమే కాని చారిత్రక వాస్తవం కాదు. హైదరాబాద్‌లో వివిధ రాష్ట్రాల, దేశాల వారు పెట్టుబడులు పెట్టి వారి వ్యాపారాలు వారు చేసుకున్నారు. అలాగే సీమాంధ్ర పెట్టుబడిదారులు వ్యాపారులు కూడా. విభజన జరిగితే హైదరాబాదుపై సీమాంధ్రుల రాజకీయ పెత్తనం మాత్రమే పోవచ్చు కాని వ్యాపార నష్టం జరగదు. ఎందుకంటే సీమ్రాంధ్రుల పెట్టుబడి వ్యాపారాలు కేవలం హైదరాబాదుకు పరిమితం కాలేదు.

పలు రాష్ట్రాలలో, దేశాలలో (ఒక్క సీమాంధ్రలోనే అంతగా లేవు!) నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. వాస్తవంగా ఆలోచిస్తే నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్‌కు ఎప్పుడూ కూడా నైపుణ్యత కలిగిన సీమాంధ్ర, ఇతర రాష్ట్రాల యువతకు కూడా మజిలీగా కొనసాగే లక్షణాలు ఉన్నాయి. అవి కనుమరుగయ్యే అవకాశాలే లేవు. పోగా కొత్త సీమాంధ్ర రాష్ట్రం ఏర్పడితే కొంగొత్త అవకాశాలు (తెలంగాణకు సాధ్యం కాని) సీమ్రాంధ్ర యువతకు మెండుగా వస్తాయి.

రాష్ట్ర విభజన జరిగితే ప్రస్తుతం హైదరాబాదు ఇతర తెలంగాణ ప్రాంతాలలో ప్రభుత్వ రంగంలో (ప్రైవేట్ రంగంలోని వారిని, కేంద్ర ప్రభుత్వరంగం వారిని, ఇతర స్వచ్ఛంద రంగాలవారిని ముట్టుకోవ డం కుదరదు) పనిచేస్తున్న సీమాంధ్ర వారినందరినీ వారి వారి ప్రాం తాలకు తరలిస్తారు అనడం ఆచరణ సాధ్యం కాదు. ఇప్పటికే అమలులో ఉన్న చట్టాల ప్రకారం వీరంతా స్థానికులు అయినారు. సీమాంధ్ర రాష్ట్ర నూతన రాజధానిని ప్రసుత్తమున్న ఏ సీమాంధ్ర నగరంలో ఏర్పాటు చేయరాదు.

ఇరు ప్రాంతాలకు అనుకూలంగా ఉండే ప్రాంతంలో నూతన రాజధాని నిర్మించాలి. తద్వారా కొత్త ప్రాంతంలో నిర్మాణ రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఉత్పన్న మవుతాయి. ఇవన్నీ సీమాంధ్రులకే దక్కుతాయి. కొత్త రాజధానిలో కొత్త సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు అవడం వల్ల మరల తెలంగాణ వారికి లేని కొంగొత్త ఉద్యోగ అవకాశాలు సీమాంధ్ర యువతకే లభ్యం కాగలవు. కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి.

విభజన జరిగి కొత్త రాజధాని వస్తే దానిలో, సీమాంధ్రలోని ఇదివరకే అభివృద్ధి చెందిన నగరాలలో కొత్త పెట్టుబడులు వ్యాపారాలు మొదలయ్యే అవకాశాలు కూడా చాలా ఉండవచ్చు. అక్కడ ఏర్పడే కొత్త ప్రభుత్వ చొరవ, సంకల్పం, పనితనం, సామర్థ్యాలపై ( నిజానికి ఇవి సీమాంధ్రులు తలచుకుంటే అసాధ్యమైనవి కావు) ఇవి ఆధారపడే ఉంటాయి.

ఇవే కాకుండా తెలంగాణకు లేని ప్రకృతి వనరులతో కూడిన పొడవైనతీర ప్రాంతం సీమ్రాంధ్రకు ఉంది. ప్రపంచ అభివృద్ధి చరిత్రలో తీరప్రాంతాలు అభివృద్ధిచెందినంతగా భూపరివేష్టిత ప్రాంతాలు అభివృద్ధిచెందలేదు. ఇంతవరకు సీమాంధ్ర తీరప్రాంతం అభివృద్ధికి నోచుకోక పోవడానికి ఇక్కడి పాలకుల, పెట్టుబడిదారుల సంకల్ప లోపమే కారణం. కొత్త సీమాంధ్ర రాష్ట్ర ఏర్పాటు వీటిని అధిగమించే అవకాశాలను ఇస్తుంది.

రాయలసీమ అభివృద్ధి అంశానికి సంబంధించి ఈ ప్రాంతం ప్రస్తుత రాష్ట్ర ఇతర ప్రాంతాల కంటే వెనుక బడినది. రాజకీయంగా చూస్తే నీలం సంజీవరెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్‌రెడ్డి దాకా రాష్ట్రానికి అత్యధిక ముఖ్య మంత్రులను అందించిన ప్రాంతం రాయలసీమే. ఇంతమంది దిగ్గజాలు ఉన్నా ఆ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండడానికి కారణం నాయకుల స్వప్రయోజనాలే. వాస్తవాలను పరిశీలిస్తే వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుకబడవేయబడ్డ ప్రాంతంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ వున్న ఖనిజ సంపద ఇతర ప్రాంతాలలో లేదు. ఇక్కడ అపారమైన ఖనిజ వనరు లు, ఇనుము, యురేనియం, బంగారం, స్టెయటైటు, క్వార్జు, టన్గుస్ట ను, గ్రనేటు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ప్రకృతి ప్రసాదించిన వనరులే.

అయినప్పటికీ వీటిలో ఇక్కడి ప్రజల భాగస్వామ్యం, హక్కులు కోల్పోయి కేవలం ప్రయివేటు ప్రయోజనాలకే కొల్లగొట్టబడుతున్నాయి. అందువల్లనే ఇక్కడి రాజకీయ నాయకు లు అత్యంత ధనవంతులు కాగలుగుతున్నారు. ప్రజలు మాత్రం వారి భూస్వామ్య, ఫాక్షను రాజకీయాలకు బలి పశువులు అవుతున్నారు. కావున ఈ ప్రాంతం, ఇక్కడి ప్రజలు అభివృద్ధికి ఇక్కడి రాజకీయనాయకులు వారి సంకుచిత, స్వార్ధ రాజకీయాలే కారణం. ఇక్కడి ప్రజల రాజకీయ చైతన్య స్థాయి పెరిగి ఇక్కడి రాజకీయ నాయకులను, రాజకీయాలను ఎదుర్కొన్న నాడే ఈ ప్రాంతం బాగుపడగలదు.

సీమ్రాంధ్రలో సాధ్యం కాగల పైన తెలిపిన అవకాశాల గురించి ఆలోచించకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ చతురతో కూడిన ప్రతిపాదనలను ముందుంచకుండా, వాటిపైన చర్చించకుండా, కేవలం ఎప్పటికీ సఖ్యత ఒనగూరని సమైక్యరాగాలాపన చేయడం సీమాంధ్ర సామాన్యప్రజలకు (రాజకీయ నాయకులకు, పెట్టుబడిదారులకు కాదు) ఒక వృధా ప్రేలాపనే అవుతుంది.

రాష్ట్రంలోని రెండు ముఖ్య పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం వారి వారి ఓట్ల రాజకీయాలకు, పెట్టుబడి వ్యాపారాలకే ప్రాధాన్యమిస్తున్నాయి.కాని ప్రజల చిరకాల సమస్యలకు కాదు. చివరికి 'ప్రజలే ప్రభువులు', 'అధికార వికేంద్రీకరణ', 'సుపరిపాలన' అని గంభీర ఉద్ఘాటనలు చేసే లోక్‌సత్తా కూడా సముచిత నిర్ణయం తీసుకోక పోవడం ద్వారా తన పరస్పర విరుద్ధ భావ దారిద్య్రాన్నే చాటుకున్నది.

సమస్యను తెగే దాకా లాగి ఇప్పటికే పెరిగిన ద్వేషాలను మరింతగా పెంచి పోషించడం వలన ఏ ప్రాంతానికీ ప్రయోజనాలు ఉండవు. మట్టిగా విడిపోయి మనుషులుగా ఉండాలనుకుంటే రాష్ట్ర విభజన జరగాలి. దీనితోనే ఇరు ప్రాంతాల ఆత్మగౌరవం నిలబడగలదు. అభివృద్ధి చెందగలదు. శాంతి నెలకొనగలదు అన్న సత్యాన్ని గ్రహించాలి. కావున సీమాంధ్ర ప్రజలు శాస్త్రీయంగా ఆలోచించి రాజకీయ పార్టీలకు అతీతంగా అడుగులు ముందుకు వేయాల్సిన కాలం ఆసన్న మైనది.

-కారుమంచి కృష్ణ చైతన్య (గుంటూరు)
అయ్యంగారి రాఘవశర్మ (చిత్తూరు)
(న్యూఢిల్లీలోని జెఎన్‌యు, ఢిల్లీ వర్సిటీలో పరిశోధక విద్యార్థులు)