Saturday, June 30, 2012

దళితులపై దాడులు ఆగేదెన్నడు? ----యెపూరమల్ల రాములు, రాష్ట్ర అధ్యక్షుడు మాలమహానాడు -కె. కాశీవిశ్వనాథం,
CM00 talangana patrika telangana culture telangana politics telangana cinema


శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్షింపేట దళితులపై ఓ వర్గం వారు దాడి చేసి ఐదుగురిని హత్యచేశారు. 30 మందిని తీవ్రంగా గాయపర్చారు. లక్షింపేట కుల వివక్షకు కేంద్రంగా ఉన్నది. గ్రామ సర్పంచ్ చిత్తి రి సింహలమ్మను గ్రామ పంచాయితీ సమావేశంలో ఏనాడూ కుర్చీలో కూర్చోనివ్వలేదు. గ్రామ సచివాలయంలో మొత్తం ఒక వర్గం వారే కావడంతో వారు చెప్పిందే వేదంగా చెలామణి అయ్యింది. వారు ఆడిందే ఆటగా, పాడిందే పాట గా ఉన్నది.ఈ నేపథ్యంలో దళితులపై దాడికి ఆ గ్రామంలో జరుగుతున్న పరిణామాలకు చాలా చరివూతనే ఉన్నది. వంగర సమీపంలో మడ్డువలస జలాశయం నిర్మాణం కోసం చుట్టుపక్కల గ్రామాల రైతుల భూములును ప్రభుత్వం కొనుగోలు చేసింది. అలాగే లక్షింపేట గ్రామంలో కాపులు, మాలల ఇళ్లు, కాపు రైతు ల పంటభూములు, మడ్డువలస డ్యామ్ నిర్మాణం కోసం సేకరించారు. కొత్త కాలనీకి తరలింపునకు మొదట కాపు కులస్తులు నిరాకరించగా,మాలలు తమ నివాసాలు విడిచిపెట్టి, కొత్త లక్షింపేట కాలనీలోని స్థలంలో గృహాలు నిర్మించుకున్నారు. తరువాత కాపు కులస్తులు కూడా సదరు కాలనీకి తరలి ప్రభు త్వం రైతుల భూములకు పరిహారం చెల్లించి ఉపాధి కోసం కుటుంబానికి ఒక్కరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. కానీ మాల కులస్తులకు ఎటువంటి ఉపాధి చూపించలేదు. కాలనీ తరలించుటలో జలాశయంలో ముంపునకు గురికాకుండా ఉన్న భూమిలో మాలలు పంటలు పండించుకోవడానికి అధికారులు హామీ ఇచ్చారు. అదే ప్రభుత్వం మాలలకు చూపిన ఉపాధి హామీ. మడ్డువలస డ్యామ్ నిర్మాణం పూర్తయ్యి, నీటితో జలాశయం నిండినా, లక్షింపేట గ్రామం భూములు ముంపునకు గురికాకుండా ఉన్నందున వాటిని దళితులకు ఇచ్చారు. కానీ అదే కాపు కులస్తులు మాత్రం సుమారు 195 ఎకరాలను ఒక్కొక్కరు 5నుంచి 10 ఎకరాలు సాగుచేసుకుంటున్నారు. దేవకివాడ గ్రామం నుంచి సేకరించిన 60 ఎకరాల భూమిని 75 దళిత కుటుంబాల వారు సాగు చేసుకొని బతుకుతున్నారు. ఈ భూములు లక్షింపేట గ్రామానికి ఒక కిలోమీట రు దూరంలోనే ఉన్నాయి. అలాగే డ్యామ్ చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న గ్రామస్తులు కూడా ముంపునకు గురి కాకుండా ఉన్న ప్రాంతాన్ని సాగుచేసుకొంటున్నారు. నేడు సీతారాంపురం, మద్దివలస సరిహద్దులో ఉన్న డ్యామ్ భూములు కూడా దుక్కులు దున్నుతున్నారు. డ్యామ్ భూములను లక్షింపేట మాలలు సాగు చేసుకోవడాన్ని అక్కడి కాపులు సహించలేకపోయారు. దీని ఫలితమే లక్షింపేట దళితులపై దాడి.
ఇది తక్షణ కారణంగా కనిపించినా.. లక్షింపేటలో కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలు దీనికి ఆజ్యంపోశాయి. లక్షింపేటలో కాపులు, మాలలు కలిసి ఎస్సీ రిజర్వుడు పంచాయితీకి ఏకగ్రీవంగా చిత్తిరి సింహాలమ్మను కాంగ్రెస్ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. కాపులకు ముఖ్య నాయకుడుగా ఉన్న వంగర మండలానికి చెందిన బొత్స వాసుదేవరావు నాయుడుదే ఆధిపత్యం.ఏ పని జరగాలన్నా ఆయన మాటే చెల్లుబాటు అవుతుంది. ఈయన గారే లక్షింపేట దాడికి సూత్రధారి అని దళితులు అంటున్నారు. అలాగే.. ఏకక్షిగీవంగా ఎన్నికైన సింహాలమ్మను ఏనాడూ గ్రామ పంచాయితీ సమావేశాలలో కుర్చీపై కూర్చోనివ్వలేదు. కానీ పంచాయితీ సభ్యులు మాత్రం కుర్చీల్లో కూర్చుంటారు. కాపులు చెప్పిందే, సూచించిందే చేయాలి. గ్రామంలోని పాల కేంద్రాన్ని దళితుడైన గణపతి నిర్వహిస్తున్నాడు. దీనికి అందరూ పాలు పోసేవారు. తరువాత ఏమైందో ఏమో.. కాపులు మరో పాలకేంవూదాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గణపతి పాలకేంవూదానికి కాపులు పాలు ఇవ్వడం మానేశారు. కాపులతో సమానంగా దళితులు ముంపునకు గురికాని భూములను సాగు చేసుకోవడాన్ని సహించలేక రగిలిపోతున్నారు. దళితులు సాగుచేసుకుంటున్న భూముల నుంచి దళితులను ఎలాగై నా తరిమేయాలని పథకం పన్నారు. గ్రామం నుంచి వెళ్లిపోయిన వారిని గ్రామానికి పిలిపించి, దళితులు భూములు దున్నరాదని వివాదం సృషించారు.దీంతో దళితులు తాము దున్నుకుంటున్న భూములను తమకే అప్పగించాలని శ్రీకాకు ళం జిల్లాకపూక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు, డ్యామ్ అధికారులు, రాజకీయ నేతలు, మంత్రి కొండ్రు మురళి సమక్షంలో ఇరు పక్షాలు వివాద పరిష్కారానికి ప్రయత్నించారు. మాలలకు భూమి ఇవ్వడానికి కాపులు అంగీకరించలేదు. పీసీసీ అధ్యక్షడు, మంత్రి బొత్స ముఖ్య అనుచరుడైన బొత్స వాసుదేవరావు నాయుడు మాలలపై కక్షగట్టి దళితులపై దాడికి పథక రచన చేశాడు. ‘మిమ్మల్ని నలుగురినో, ఐదుగురినో చంపితే గానీ భూములు వదలర’ని హెచ్చరించాడు. ఈవిధంగా లక్షింపేటలో కాపులు, దళితుల మధ్య రోజురోజుకూ ఘర్షణ వాతావరణం పెరిగిపోతున్నా శాంతిభవూదతలు కాపాడవలసిన వంగర పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారు. గ్రామంలోని ఉద్రిక్తతల నేపథ్యంలో 18 మార్చి నుంచి నేటి వరకు లక్షింపేట గ్రామస్తులపై సీఆర్‌పీసీ 107 సెక్షన్ అమలులో ఉన్నది. కాపు లు 54 మంది, మాలలు 53 మందిపై బైండోవరు కేసులు పోలీసులు పెట్టారు.ఆ తరువాత గ్రామంలో 144 సెక్షన్ కూడా నెలరోజుల పాటు కొనసాగింది. శాంతి కమిటీని ఏర్పాటుచేశారు. భూ వివాదానికి సంబంధించి సీఆర్‌పీసీ 145 ఆర్డర్ కూడా లక్షింపేట గ్రామస్తులపై విధించారు. నేటికీ ఆ గ్రామంలో 107 సెక్షన్ అమలులో ఉన్నది. లక్షింపేట సర్పంచ్ సింహాలమ్మ బంధువు పంటచేనును పక్క గ్రామానికి చెందిన వ్యక్తి పశువులు పాడు చేశాయి. దీనిని అతను ప్రశ్నించాడు. దీంతో.. కాపులు ముందుకు వచ్చి తిరుపతిరావు నాయకత్వంలో దళిత రైతు అప్పడును కులం పేరుతో దూషించి కొట్టారు. దీంతో చేసేది లేక దళితులు కులం పేరుతో దూషిం చి కొట్టినందుకు వంగర పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. దీనిపై విచారించిన డీఎస్పీ కాపు కులస్తులైన ముద్దాయిలను అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన కాపులు తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టినందుకు మాల కులస్తులను బెదిరించసాగారు. బెదిరించినట్లుగానే 12-06-2012నాటి దాడిలో అప్ప డును బల్లెంతో పొడిచి దారుణంగా చంపారు.అట్రాసిటీస్ కేసు నమోదైన నాటినుంచీ లక్షింపేటలోపోలీస్ పికెట్ పెట్టారు. కానీ ఇంతలో ఎన్నికలు రావడంతో పికెట్‌లోని పోలీసులను ఎన్నికల నిర్వహణకు పంపారు. పోలీస్ పికెట్‌లేని సమయాన్ని అదనుగా భావించిన కాపులు దళితులపై దాడికి పన్నాగం పన్నారు.జూన్ 11న బొత్స వాసుదేవరావు నాయు డు ఇంట్లో 20మంది కాపులు సమావేశమయ్యారు. హత్యాకాండకు పథక రచన చేశారు.12న ఉదయం ఏడు గంటలకు కాలనీ రహదారి పక్కన ఆవు తిరుపతిరావు ఇంటి దగ్గర కాపులు సమావేశమయ్యారు. దాడి కుట్ర తెలియని దళితులంతా తమ పనుల్లో మునిగిఉన్నారు. ఏడున్నర గంటల ప్రాంతంలో దళితవాడలో బాంబులు వేసి భయవూబాంతులు సృష్టించారు. కాపు స్త్రీలు కారం చల్లుతూ మాలలపై దాడికి దిగారు. దొరికిన వారిని దొరికినట్లు కత్తులు, బల్లాలతో పొడిచారు. కర్రలు, బండరాళ్లతో బాది నలుగురిని చంపారు. ఇంటి తలుపులు పగుల కొట్టి ఇళ్లలోని వారిని బయటకులాగి దారుణంగా నరికి చంపారు. 30 మందిని తీవ్రంగా గాయపరిచారు. దాడితో దళితులు హాహాకారాలు చేస్తుం కాపులు వికటాట్టహాసం చేస్తూ.. హత్యాకాండ కొనసాగించారు. ఆ సమయంలో మంచినీళ్లు తెచ్చుకుంటున్న కలమటి సంఘమ్మను కట్టెలతో తీవ్రంగా కొట్టి చేతులు, కాళ్లు విరగ్గొట్టారు. ఆమె హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది. ఈ హత్యాకాండ వెనుక కాపుల దౌర్జన్యకాండ ఎంత ఉన్నదో, దీనికి పరోక్షంగా సహకరించిన పోలీసుల పాత్ర కూడా అంతే ఉన్నదని చెప్పకతప్పదు. కాపులు జూన్ 12 ఉదయం సమావేశమవుతున్నారని పోలీసులకు సమాచారమందించినా సకాలంలో స్పందించలేదు. సుమారు పది గంటల ప్రాంతంలో ఓ కానిస్టేబుల్ వచ్చి జరుగుతున్న దౌర్జన్యాన్ని చూసి వెంటనే వెళ్లిపోయాడు. తిరిగి పదకొండున్నరకు వచ్చి హంతకులు పారిపోయేందుకు వీలుగా విజిల్స్ వేస్తూ ఊళ్లోకి వచ్చారు. పారిపోతున్న కాపులను పట్టుకొనేందుకు ప్రయత్నించలేదు. అప్పటికే శ్రీనివర్తి వెంకట్, బూరాడ సుందరరావు చనిపోయారు. కొన ఊపిరితో ఉన్న శ్రీనివర్తి సంఘమేషు, చిత్తరి అప్పడు దారిలో చనిపోయారు. జూన్ 20న మరో క్షతగావూతుడు పాపయ్య చనిపోయాడు. గ్రామంలోని ఘర్షణ వాతావరణం, కాపుల బెదిరింపులు ప్రత్యక్షంగా కనిపిస్తున్నా..పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే లక్షింపేట హత్యాకాండ జరిగింది. నెలల తరబడి పోలీస్ పికెట్ పెట్టి, ఎన్నికల నెపంతో పోలీసులను ఉపసంహరించిన ఉన్నతాధికారులు పరోక్షంగా దళితులపై దాడికి కారణమయ్యారు. ఆ తర్వాత నిందితులను అరెస్టు చేయడంలోనూ పోలీసులు చూపిస్తున్న నిర్లక్ష్యం చూస్తూనే ఉన్నాం. అసలు దోషులను విడిచి పెట్టి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ దాడిలో బొత్స సత్యనారాయణకు దగ్గరి బంధువులున్నారన్న విషయం దాచేస్తే దాగని సత్యం. వీరిని కాపాడేందుకు ఉన్నత స్థాయిలో పైరవీలు సాగుతున్నాయి. లక్షింపేట దాడిని, పోలీసులు, పాలకులు వ్యవహరిస్తున్న తీరును రాష్ట్రంలోని ప్రజాసంఘాలు, హక్కుల సంఘా లు, మేధావులు తీవ్రంగా ఖండించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దళితులపై దాడి వెనుక ఉన్న కుట్ర బయటకి రావాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలి. చనిపోయిన వారికి పది లక్షలు, గాయపడిన వారికి రెండు లక్షలు పరిహారం చెల్లించి బాధిత కుటుంబాలకు రక్షణ, ఉపాధి కల్పించాలి. దళితల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. దళితుల ఆత్మరక్షణకు దళితుల తోకూడిన గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేయాలి. 

-యెపూరమల్ల రాములు, రాష్ట్ర అధ్యక్షుడు మాలమహానాడు
-కె. కాశీవిశ్వనాథం, రాష్ట్ర అధ్యక్షుడు ఏపీ దళిత కూలీ రైతు సం

Namasete Telangana News Paper Dated 1/7/2012

సారాంశం, సామాజిక సంక్షోభమే! - కె. శ్రీనివాస్ఇరవయ్యేడేళ్ల కిందట కారంచేడు జరిగినప్పుడు అదొక సంచలనం. షాక్. పత్రికా కార్యాలయాల్లో పెద్ద సంరంభం. 'పంట పొలాల్లో పులిచంపిన లేడి నెత్తురు' అన్న శీర్షికలో దళితుల మారణకాండను మానవీయంగా కథనం చేసిన సందర్భం. మరణాల సంఖ్య పెద్దగా లేకపోవచ్చును. కానీ, ఆ సంఘటన రాష్ట్రాన్ని దేశాన్ని కల్లోలితం చేసింది. దళిత కారంచేడు ఖాళీ అయిపోయి చీరాలలో విడిది చేసింది. ఒకనాటి దాడే కావచ్చు, కానీ అది రాష్ట్రంలో దళిత ఉద్యమానికి నాంది పలికింది. సామాజికోద్యమాల చరిత్రలో కొత్త అధ్యాయాన్ని తెరచింది. 

మరో ఆరేళ్లకు చుండూరు సంఘటన. మరింత దారుణంగా, భీకరంగా, దుర్మార్గంగా దళితులను వేటాడి నరికారు. ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. అనేక అంతర్గత విభేదాల మధ్యనే అయినా దళితుల ఐక్యత ప్రస్ఫుటమైంది. దళితుల్లో ఆత్మగౌరవభావన మరింత బలపడింది. మరి మొన్న జూన్ 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా లక్షింపేటలో జరిగిన మారణకాండ, ఉత్తరాంధ్ర భూసామాజిక సంబంధాల్లోని వైరుధ్యాలను బహిర్గతం చేసింది. కారంచేడు, చుండూరు సంఘటనలనుంచి రూపొందిన దళిత నాయకత్వం లక్షింపేట వెళ్లి నిజనిర్ధారణలు చేసింది. మానవహక్కుల కమిషన్లకు, ప్రభుత్వాలకు నివేదికలు పంపింది. 

విప్లవ, వామపక్ష ప్రజాసంఘాలు, వివిధ ప్రధాన స్రవంతి రాజకీయనాయకులు బాధితులను పరామర్శించారు. కానీ, ఎందువల్లనో, గతంలోని ఆక్రోశం, ఆవేదన, ఆవేశం కనిపించడం లేదు. ఉప ఎన్నికల రాజకీయ సంరంభం వల్ల ఈ సంఘటన మరుగున పడిందని అనిపించినా, అందులో పూర్తి వాస్తవం లేదని అర్థమవుతూనే ఉన్నది. ఎక్కడో ఏదో లోపించింది. నిప్పు భగ్గున మండకుండా, గోరువెచ్చగానే మిగిలిపోయింది. ఏమిటి కారణం? గత రెండు దశాబ్దాల కాలంలో దళిత ఉద్యమం చీలిపోవడం వల్ల కలిగిన పరిణామమా ఇది? బాధితుల ఉపకులానికి సంబంధించిన సంఘాలు సైతం సమరశీలంగా కనిపించకపోవడానికి- కాలం తీసుకువచ్చిన మార్పు కారణమా? వారిలో అధికులు వ్యవస్థలో క్రమంగా సంలీనం అవుతున్నారా? 

పై ప్రశ్నలకు వచ్చే సమాధానాలు కూడా నేటి పరిస్థితికి కొంతమేరకు కారణం కావచ్చు. అయితే, సంఘటన జరిగిన ప్రాంతం స్థితిగతులు కూడా ముఖ్యమైన కారణమనిపిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతం తక్కిన రాష్ట్రం నుంచి విడిగా, దూరంగా ఉంటున్నదా? యావత్ రాష్ట్ర సమాజంలో అది అంతర్లీనం కాలేదా? అక్కడి పరిణామాలను తక్కిన రాష్ట్రం తమవిగా స్వీకరించడం లేదా? కారంచేడు, చుండూరు సంఘటనలు జరిగినప్పుడు, నిందితుల సామాజిక వర్గాలు రాష్ట్రంలో అప్పుడు అధికారంలో ఉన్న రాజకీయపార్టీల నేపథ్యవర్గాలు. పైగా, అవి రాష్ట్ర సామాజిక, రాజకీయ చిత్రపటాన్ని దీర్ఘకాలంగా శాసిస్తున్న కులాలు. 

వాటి ఉనికి, వ్యాప్తి రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను ఆవరించినవి. లక్షింపేట సంఘటనలో నిందితులుగా ఉన్నవారి సామాజిక వర్గం ఉత్తరాంధ్ర ప్రాంతానికే పరిమితమైనది. ఇతర ప్రాంతాలలో కాపు కులస్తులతో వారికి స్థూలమైన సమీకరణం ఏర్పడుతున్నది కానీ, సాంస్క­ృతికంగా ఐక్యత ఇంకా ఏర్పడలేదు. ఉత్తరాంధ్రలోని తూర్పు కాపులు రాష్ట్ర రాజకీయరంగంలో ప్రాబల్యం పొందుతున్న మాట నిజమే కానీ, దాని ప్రభావం రాష్ట్రవ్యాప్తమైనది కాదు. 

దళితులమీద దాడిచేయడానికి కావలసిన అహంకారాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది కొత్తగా సమకూరుతున్న ప్రాబల్యమే అయినప్పటికీ, దానికి కూడా పరిమితులున్నాయి. కారంచేడు, చుండూరు సంఘటనల నిందితులకు సమాజంలోని వివిధ శ్రేణులలో ప్రాతినిధ్యం ఉండడంతో, వారిని వెనకేసుకువచ్చినవారు కూడా గణనీయంగా కనిపిస్తారు. కానీ, లక్షింపేట నిందితుల వర్గానికి అంతటి హంగు ఇంకా ఏర్పడలేదు. అయితే, ఇంకా అధికారపు సానువులకు సమీపానికి వచ్చీ రాగానే సాంప్రదాయిక ప్రాబల్యశక్తుల మాదిరిగా దళితులపై కత్తిఝళిపించడం ప్రమాద సంకేతం. 

రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితి కారణంగా ఒక సామాజిక దౌర్జన్యం జనం దృష్టిలో పడలేకపోయిందనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే, ఆ రాజకీయపరిస్థితే ఒక సామాజిక సంక్షోభంలో కూరుకుపోయి ఉంది. ఈ మధ్య రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల వెనుక ఒక పెద్ద సామాజిక సమీకరణం ఉన్నది. ఆ సమీకరణంలో లక్షింపేట బాధితుల కులం కూడా ఒక భాగస్వామే. రాజకీయంగా తమ ప్రాధాన్యాన్ని ప్రకటించడానికి వారు ఒక వర్గంగా ఏ మాత్రం వెనుకాడలేదు. కానీ, సమరశీల పోరాటానికి మాత్రం వారు సంసిద్ధంగా కనిపించడంలేదు. 

ఉప ఎన్నికల ఫలితాల అనంతరం తిరిగి చర్చలోకి వచ్చిన రాష్ట్రవిభజన అంశం కూడా సామాజికంగా తీవ్రమైన పర్యవసానాలున్న అంశం. విభజనను వ్యతిరేకిస్తున్న వారు కానీ, తెలంగాణవాదులు కోరుతున్న సరిహద్దులకు మార్పులు చేయాలని ప్రయత్నిస్తున్నవారు కానీ సామాజికమైన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నవారే. తమ మతవర్గానికి చెందినవారు అధికంగా ఉన్న మరోప్రాంతాన్ని కూడా తెలంగాణలో కలిపితే ప్రత్యేక రాష్ట్రానికి అభ్యంతరం లేదని మజ్లిస్ భావిస్తున్నది. 

రాయలసీమలోని రెండు జిల్లాలను కలిపితే, తెలంగాణలో తమ ప్రాబల్యానికి గ్యారంటీ ఉంటుందని రెండు ప్రాంతాలలోను బలంగా ఉన్న రెడ్డి కులస్థులు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే, సామాజికమైన సమీకరణాల కారణంగా, జగన్‌మోహన్‌రెడ్డి ప్రాబల్యాన్ని పరిమితం చేయవచ్చునని, పనిలో పనిగా చంద్రబాబును బలహీనపరచవచ్చునని కాంగ్రెస్ భావిస్తున్నది. తెలంగాణ వస్తే, ఇంతకాలం పెత్తనం చేసిన భూస్వామ్య ప్రాబల్యవర్గాలు బలహీనపడి, బిసిల ప్రాతినిధ్యం పెరుగుతుందని ఉద్యమకారులు ఆశపడుతున్నారు. ఆంధ్రప్రాంతం విడిపోతే, తమను అణచివేస్తున్న స్థానిక ప్రాబల్యకులస్థులు బలహీనపడతారని, అంకగణితాలు మారిపోయి తమ పలుకుబడి పెరుగుతుందని అక్కడి దళితులు ఆశిస్తున్నారు. 

అందరి ఆశలూ నెరవేరే అవకాశమైతే లేదు కానీ, రాష్ట్ర విభజన మాత్రం ఊహించిన మార్పులనే కాక, అనూహ్యమైన మార్పులను కూడా సామాజిక రంగంలో తీసుకువచ్చే అవకాశం ఉన్నది. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, కాపు- రాష్ట్రంలో అధికారపీఠాలు సంక్రమిస్తున్న ఈ క్రమం బిసిలకు, దళితులకు చేరువ కావడానికి ఇంకా చాలా సమయం ఉన్నది. ఈ లోపున లక్షింపేట వంటి సంఘటనలు అనేకం జరిగి, మన వాస్తవికతను గుర్తుచేస్తుంటాయి. 

పదేళ్ల కిందటే, మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకోల్‌లో నామాల బాలస్వామి అనే దళితుడి హత్య తెలంగాణ సమాజానికి ఒక హెచ్చరిక పంపింది. ఉద్యమక్రమంలో ఆశ్చర్యకరమైన రాజకీయ పరిణతిని, అవగాహనను సంతరించుకున్న తెలంగాణవాదులు సామాజికమైన ప్రహేళికను పరిష్కరించుకున్నప్పుడే వాస్తవమైన విజయం సాధించగలరు. లక్షింపేట బాధితులకు సంఘీభావం తెలపడానికి ఉస్మానియా విద్యార్థులు తరలివెళ్లారనే వార్త అటువంటి ఆశను కలిగిస్తోంది. 

కారంచేడు నుంచి ప్రారంభమైన ఆత్మగౌరవ అస్తిత్వాల ప్రస్థానం, తమను తాము చాటిచెప్పుకునే క్రమంలో సాంప్రదాయిక ప్రగతిశిబిరాలను ప్రశ్నించాయి, నిలదీశాయి. దూరంగా నడిచాయి. సొంత అస్తిత్వాల నుంచే ప్రారంభమయ్యే ప్రశ్నలు, ఆ అస్తిత్వాలను కూడా విభజించాయి. వివక్ష, అసమానత్వం ఎక్కడ ఉన్నా వేరుమాటలు మాట్లాడాయి. ఇప్పుడు, అనేక సంఘాలు, అనేక సంస్థలు, అనేక అస్తిత్వాలు. తాము విస్మరించిన కోణాలను, పార్శ్వాలను వామపక్ష ప్రగతిశీల శక్తులు సరిదిద్దుకోలేక తప్పలేదు. 

స్థైర్యంతో తాము నమ్మిన మార్గంలో నడవడమూ విరమించలేదు. ఇప్పుడు అనేక శక్తులు ఇంకా అనేకంగా ఉండడమే పెద్ద సమస్య. ఒకరి ఉనికిని మరొకరు మింగేసే విలీనాలు అక్కరలేదు కానీ, ఒకరి చేతులను ఒకరు పెనవేసుకునే ఐక్యత కావాలి. బాధిత కులాలు, ఉపకులాలు, మతాలు, జెండర్, ప్రాంతాలూ, ప్రజాస్వామిక సంస్థలూ ఉద్యమాలూ- అవసరమైనప్పుడు ఒకటిగా నిలబడాలి. వాస్తవమైన అర్థంలో ఆ ఐక్యత ఇప్పుడే ఉండి ఉంటే, లక్షింపేట ఉదంతం త్వరగా మసకబారే ప్రమాదం ఉండేది కాదు. 

మనకు స్పష్టంగా తెలియకపోవచ్చును కానీ, ఈ నేల మీద పెద్ద సామాజిక సుడిగుండమే చెలరేగుతున్నది. రకరకాల మారువేషాల్లో వాటి సంకేతాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న అధికార రాజకీయ క్రీడ వెనుక పెద్ద సామాజిక సంక్షోభం ఉన్నది. తెలంగాణ ఏర్పాటు సాధ్యాసాధ్యాల వెనుక సామాజిక కోణమే ప్రభావం వేస్తున్నది. సీమాంధ్ర ప్రాంతంలో ఏర్పడే కొత్త అధికార సమీకరణలను, చేజిక్కనున్న కొత్త అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఎదుగుతున్న కులాలు జబ్బ చరుస్తున్నాయి. లక్షింపేట అందుకు సంకేతం. ఇంత పెద్ద రంగస్థలాన్ని సామాజికోద్యమాలు ఎట్లా వినియోగించుకుంటాయన్నది సమస్య. 

- కె. శ్రీనివాస్
Andhra Jyothi News Paper Dated : 1/7/2012

Friday, June 29, 2012

Four Dalits done to death in Srikakulam village

Karamchedu in Laxmipeta By Katti Padma Rao


Kathi Padma Rao
(This is a translation of his recent article 'Lakshimpetalo 'Karamchedu'')
The oppression of the Dalits continues unabated in the state. Whichever dominant castes are in power, people belonging to those castes continue to conduct violent attacks on the Dalits. When NTR was in power, six Dalits were brutally killed in Karamchedu, his samdhi's village. When Nedurumalli Janardhan Reddy was in power, they chopped off the heads of eight Dalits in Chunduru of Guntur district, and dumped them in the Tungabhadra. Now when Botsa Satyanarayana, who calls himself a BC, is the Pradesh Congress President, Botsa Vasudeva Naidu and his horde of Toorpu Kapus, armed with swords and axes, have tortured and killed the Dalits of Lakshimpeta in Srikakulam district.
lakshim_pamphlet


What really happened? The landowning Toorpu Kapus of Lakshimpeta village in Vangara mandal of Srikakulam district surrounded the Dalitwada of the village at seven in the morning. Groups of around twenty people each, armed with deadly weapons, laid siege to every house. They dragged the people from their homes and showered inhuman abuse and insults on them. 'You Mala ba#$%^s, you think you've grown big enough to be cultivators?' they ranted in their caste arrogance. Shouting 'You think you can till fields alongside us?' they launched a brutal attack on Nivirti Venkati (60), his son Nivirti Sangamesu (35), Burada Sundar Rao (35) and Chittari Appadu (25).
According to Chintapalli Guruprasad, Andhra Pradesh Dalit Mahasabha President, and his associates P. Benjamin, Nuthalapati Chandrasekhar, Bokara Narayana Rao who had visited the scene, each body bore around 40-50 knife or spear wounds. This attack was caused by a grudge. Planning, strategy, hatred – all of them are behind this attack. The victims died almost immediately after they received the injuries. They have become martyrs in the struggle for land. Offerings to the fire of caste hatred. Bodduri Papaiah, another victim who was injured during the attack on these four Dalits, died in King George Hospital, Visakhapatnam, on Wednesday. Which means five people have died in the Lakshimpeta massacre until now.
Since the formation of the state, landowning castes in the various regions – be it Kammas or Reddies or Kapus or Kalingas or Velamas or Kshatriyas – have been unable to bear the sight of Dalits tilling land on their own, developed grudges against them claiming that the Dalits have no right to land, conducted violent attacks on them or expelled them from villages. There is a strong bond between state power and caste hatred of this kind. This attack has the support of the powerful. In this brutal, inhuman incident which all Telugus should feel ashamed about, around 20 people have been seriously injured, apart from the five who died.
They are undergoing treatment in RIMS Hospital in Srikakulam now. Kalamata Ganapati (35), Kalamata Prakash (50), Kalamati Simhachalam, Kalamati Gangulu, Gonela Ravi (25), Nivirti Gangaiah (50), Kalamata Gaddiah (Lachchaiah's son), Kalamati Gaddaiah (Chinna Mutyalu's son), Nivirti Simhachala, Nivirti Narsaiah, Nivirti Rama Rao, Bodduri Bhogesu, Gongada Shivudu, Nivirti Darappadu, Nivirti Gangaiah, Kalamati Sangamma, Chittari Yellaiah, Kalamati Gangulu, Bodduri Gowraiah are fighting for their lives in the hospital.
Lakshimpeta is the biggest massacre by the upper castes after Karamchedu and Chunduru. These caste villains surrounded the Dalits, chased and hunted them for two and half hours with deadly weapons and derived perverse pleasure from attacking even dead bodies with swords and axes. The Toorpu Kapu landlords here, even though BCs in name, are great believers in caste supremacy. The Kalingas, Koppula Velamas and Toorpu Kapus in Srikakulam district perform the role undertaken by the Kammas, Reddies and Kshatriyas in Coastal Andhra.
The Kapus of neighbouring villages, following the bonds of blood and caste, also participated in the attack headed by the Kapus of Lakshimpeta. 26 year old Chittari Sridevi, Borada Kasalu, Nivirti Ramudamma, Nivirti Venkatamma were widowed and rendered helpless by this gruesome attack. Most of them are between the ages of 30-40, all mothers. Women who had husbands at 5 in the morning lost them by 7.30. What was their crime?
Was it because 80 Dalit families chose to cultivate 60 acres of government land? Joint Collector Satyanarayana had allocated this land to the Dalits in 2002 and they had divided it among themselves, every family getting 45 cents of land, and started tilling the land. Is it a crime for Dalits to cultivate land in this country? Should that cause burning rage among others? The Chief Minister Kiran Kumar Reddy's visit to the village, even before the dead were laid to rest, and announcement of nominal compensation, was an attempt to pre-empt any demand for a CBI probe and an indicator of his upper caste feudal loyalties. Why are these powerful people who order a CBI probe into every trivial issue not ordering one into this great tragedy? Is it because they are scared of big people being caught?
These are the facts disclosed by Lakshimpeta victims Chittari Gangaiah, Gongoda Gangaiah, Nivirti Simhachalam, Nivirti Tirupati Raju and Bodisingu Ramu: The lands they are cultivating now were acquired from various castes ten years ago when the Madduvalasa reservoir was being built. The government had paid full compensation to the landowners when the land was acquired. Now it is assigned land and the government has every right to allot it to anyone. Why did not the Chief Minister announce that he was allotting this 250 acre land to the Dalits even after so much blood has sunk into it now? Here, the Chief Minister has taken an anti-Dalit stand. This is Dalit Minister Kondru Murali's constituency.
It is shameless that Dalit Ministers have neither demanded a CBI inquiry, nor have they urged the government to allot the 250 acres of land to the Dalits but have remained faithful courtiers to the ruling classes and have clung to their seats in their power lust even when fellow Dalits were being cut down with swords. They have forgotten how they became ministers through the reservations Ambedkar had won for them. Today Dalit organizations and left affiliated Dalit, people's organizations are fighting together. This is the historic moment when all pro-people forces have to come together to bend upper caste state power and lead the self-respect movement of the Dalits towards victory.
The unity of Dalit movements determines the form of this resistance. The blood of the Dalits which has sunk into the earth shall not go to waste. History has to answer this question soaked in blood. The martyrs have sounded the great drum of self-respect. The Dalit camp is raising the slogan of self-defense in Lakshimpeta. The Dalits have not lost courage even after losing five people. This battle will not stop until the Dalits win rights over the 250 acres of land. All the forces, under the red and blue banners, which have come together for this movement, should not rest until these demands are met.
Andhra Pradesh Dalita Mahasabha shall work together with the victims and other organizations. This Dalit self-respect movement should challenge caste, feudal and political hegemony in these times of historic resistance. Dalits Bahujans Minorities! Put aside your party affiliations and respond to the resounding cries emanating from the blood drenched land. Prepare as Dalit warriors for battle. History belongs to the oppressed, not the oppressors. Revolt is the way to victory.
We have taken up a 'Chalo Hyderabad' programme on July 17th to take forward this movement. We request all to participate.
Update: 
Program to take forward the Movement
~ A Representation is being given to State Human Rights Commission on June 27th
~ Protest rally to be organized as 'Chalo Srikakulam' on July 2nd
~ Chalo Hyderabad on July 17th
Demands
• CBI enquiry must be ordered to thoroughly investigate the circumstances that led to the brutal massacre.
• The state government should support every victims' family with Rs.10 lakhs. One person from each victim family should be accommodated with a government job. All the dalit children in the village should be admitted in AP Residential Schools.
• 250 acres of assigned land should be handed over to dalits.
• Action should be taken against all the culprits responsible for this attack under the provisions of the SC/ST (Prevention of Atrocities) Act, 1989.
• Botsa Vasudeva Rao Naidu should be booked as A1 and all the accused should be arrested within ten days. The main abettors Botsa Satyanarayana and others should not be spared. 
• Special court should be established in Lakshimpeta village and ensure that justice is delivered within six months.
[Translated from Telugu by Kuffir]


Laxmipeta Garjana : Duddu Prabhakar Speech

Laxmipeta Garjana : Oosa Speech

Laxmipeta Garjana: Bojja Tarakam Speech

Laxmipeta Garjana : Manda Krishna Madiga Speech

Sunday, June 24, 2012

ప్రభుత్వ అండతోనే లక్షింపేట దళితు హత్యాకాండ--జాన్‌ వెస్లి


పథకం అమలుకు సరైన సమయంగా ఉపఎన్నికలను ఉపయోగించుకున్నారు. ఎన్నికల బందోబస్తు పేరుతో వాసునాయుడు రెండవసారి పికెట్‌ ఎత్తివేయించాడు. కాపులు, దళితులు సమానమైన బలం అయినందున గతంలో హక్కుదారులైన కాపు రైతుల గుంపును రహస్యంగా అదే రోజు గ్రామానికి రప్పించుకున్నాడు. ఉదయాన్నే 7.30 గంటలకు పెత్తందార్లు మూకుమ్మడిగా బాంబులు, గొడ్డళ్ళు, కత్తులు, బరిసెలు, కర్రలతో అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. రెండున్నర గంటల సేపు దళితులతో రక్తకేళి ఆడుకున్నారు. దళితులు తేరుకునే లోగా అక్కడ రక్తం ఏరులై పారింది.
ఉదయాన్నే లేచి కూలీ పనికి వెళ్ళేందుకు చద్దన్నం తింటున్న సుందర్‌రావును ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకొచ్చి బరువైన బండరాయిని ఎత్తి గుండెల మీద వేసి చంపేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు పక్క వీధిలోకి పరుగిడుతున్న నివర్తి సంగమేశును తోడేళ్ళలా వెంటాడి బరిసెలతో పొడిచి, గోడ్డళ్ళతో నరికేశారు. వీధిగుండా వెళ్తున్న వెంకటిపై నాటుబాంబులతో దాడి చేసి, బరిసెలతో పొడిచి, గాయాల మీద కారం చల్లి కాలువలో పడేశారు. ఇంట్లో ఉన్న చిత్రి అప్పాడును భార్య, పిల్లల కళ్ల ముందే బండరాళ్ళతో తలను పగులకొట్టి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. పాపయ్యను కళ్లల్లో కత్తులతో, ఒంటినిండా బరిసెలతో 30 పోట్లు పొడిచారు. ఆ నెత్తుటి మడుగులో కొట్టుకున్న పాపయ్య కాసేపటికే ప్రాణాలు విడిచాడు. కొందరికి రెండు కాళ్ళూ విరిగాయి. మరికొందరికి కాళ్ళూ, చేతులూ విరిగాయి. ఇంకొందరికి ఒక కాలు, ఒక చేయి విరిగి, తలలు పగిలాయి. ఒకరికి చెవి తెగింది. మరికొందరికి వేళ్ళు విరిగాయి. దళితవాడలోని ప్రతి ఇంటిపై దాడి జరిగింది. మహిళలు, వృద్ధులను సైతం కర్రలతో గొడ్లను బాదినట్లు బాదారు. ప్రతి మనిషికీ కందిపోయిన గాయాలయ్యాయి. ప్రతి ఇంటి గోడకూ దళితుల రక్తపు మరకలే. 200 మంది తూర్పు కాపు పెత్తందార్లు, పిల్లలు, మహిళలు బరిసెలు, గొడ్డళ్ళు, కత్తులు, కర్రలు, కారంపొడి, రాళ్ళతో రెండు గంటలకు పైగా దళితవాడపై సైర్వవిహారం చేశారు. మగవారు కొట్టి, కొట్టి అలసిపోయి కూర్చుంటే మహిళలు వారికి విసనకర్రలతో విసిరి, వాటర్‌ బాటిల్స్‌తో నీరందించి ప్రోత్సహించారు. స్వయంగా మహిళలు కూడా కర్రలతో దాడి చేశారు.
కులం తక్కువ వాళ్లు దేవాలయాలకు రాకూడదు, హోటల్లో రెండు గ్లాసుల విధానం, క్షౌరం, కటింగ్‌ చేయనివ్వరు. నల్లా నీళ్లు తీసుకోనివ్వరు. దళిత మహిళ సర్పంచ్‌, ఆమె భర్త గ్రామ పంచాయతీలో కింద కూర్చోవాలి. మాల నాకొడుకులకు, కూలీనాకొడుకులకు భూములు కావాలా? సర్పంచులౌతారా? మాకే ఎదురు తిరుగుతారా? అని నానా దుర్భాషలాడుతూ హత్యాకాండకు తెగబడ్డారు. కులం తక్కువ వాళ్లు కూలీలుగా ఉండాలి, భూములు అడగ కూడదు. భూములు ఆక్రమించుకున్నా ఊరకుండాలి. తమకు నచ్చిన పార్టీలోనే ఉండాలి. తమకు అణిగిమణిగి మాత్రమే ఉండాలి. అగ్రకుల పెత్తందార్లకు ఎదురు తిరగ కూడదు. ప్రశ్నిస్తే దాడులు చేస్తాం. కాళ్ళూ, చేతులూ విరగ్గొడతాం. హత్యలు చేస్తామన్నది వారి వైఖరి.
శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని 12 గ్రామాల్లోని ప్రభుత్వ, రైతుల భూములు 7,779 ఎకరాలు మడ్డువలస ప్రాజెక్టు కోసం ప్రభుత్వం సేకరించింది. అందులో భాగంగా లక్షింపేట గ్రామమంతా నిర్వాసిత గ్రామమైంది. గ్రామంలో 75 దళిత, 75 తూర్పుకాపుల, 11 ఇతర బిసి కులాల కుటుంబాలున్నాయి. ఇంటి స్థోమతను బట్టి పెత్తందార్ల ఇంటికి లక్ష రూపాయల చొప్పున, దళితులవి పూరి గుడిసెలే కాబట్టి రూ.3 వేల నుంచి రూ.12 వేల లోపు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి గ్రామాన్ని ఖాళీ చేయించింది. పై భాగాన ఉన్న ముత్యాలమ్మ చెరువు దగ్గర ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఎస్సీలు, కాపులకు పక్క పక్కనే పునరావాసం కల్పించింది. భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. దళితులు భూములే లేని కూలీలైనందున వీరికి ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వలేదు.
ప్రస్తుతం ఉన్న లక్షింపేట గ్రామానికి పరిసరాల్లోనే ముంపుకు గురికాని 250 ఎకరాలు ఇరిగేషన్‌ పరిధిలో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమితో లక్షింపేట రైతులకు ఎలాంటి సంబంధం లేదు. అది ఇతర గ్రామాలకు చెందిన రైతులది. వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది. వారంతా వేరే గ్రామాల్లో ఉంటున్నారు. ఈ మొత్తం భూమిని గతంలో హక్కుదారులైన రైతుల నుంచి కౌలుకు తీసుకుని లక్షింపేట తూర్పుకాపులు సాగు చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత అవి ప్రభుత్వ భూములైనందున కౌలు ఇవ్వకుండానే సాగు చేసుకుంటున్నారు. అందులో 60 ఎకరాల భూమికి గతంలో హక్కుదారులైన రైతులు సాగు చేసుకోమని దళితులకు కౌలుకిచ్చారు. ఇది సహించలేని గ్రామ పెత్తందార్లు ఆ భూమి కూడా తమకే కావాలని, మాల కొడుకులు, కూలీనాకొడుకులు మీకు కూడా భూములు కావాలా అని అడ్డుకోగా ఆ భూమి బీడు పడింది.
కులవివక్ష, దళితుల సమస్యలపై వంగర మండలమంతా కెవిపిఎస్‌ సర్వేలు, సభలు నిర్వహించి పలు గ్రామాల్లో కులవివక్ష రూపాలపై ప్రతిఘటనోద్యమాలు నిర్వహించింది. లక్షింపేట గ్రామ దళితులంతా సంఘటితమై కెవిపిఎస్‌ అండతో మళ్ళీ ఆ 60 ఎకరాల భూమిని దున్ని సాగు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అడ్డుపడ్డ పెత్తందార్లను దళితులు సంఘటితంగా ప్రతిఘటించారు. కెవిపిఎస్‌ మండల కార్యదర్శి గణపతితో సహా ఇరువర్గాలపై 55+54 మందిపై 2011లో బైండోవర్‌ కేసు పెట్టారు. పోలీసు పికెట్‌ కూడా ఆరు నెలలు కొనసాగింది. ఆర్డీవో జోక్యం చేసుకుని 60 ఎకరాలు దళితులు సాగు చేసుకునేందుకు అనధికారికంగా నిర్ణయించారు. దళితులు భూమి సాగు చేసుకోవడం సహించలేక ఆ భూమిని కూడా కబ్జా చేయాలని వంగరలోని కాపు నాయకుడు, బొత్స సత్యనారాయణ అనుచరుడు, భూస్వామి, అక్రమంగా కోట్లు సంపాందించిన మాజీ జడ్‌పిటిసి, కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకుడు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారే బొత్స వాసునాయుడును సంప్రదించారు. ఆ నియోజకవర్గానికి కొండ్రు మురళి ఎమ్మెల్యే, మంత్రి అయినా ఆ మండలంలో బొత్స వాసునాయుడిదే పెత్తనం. గ్రామాల్లో పోలీసు స్టేషన్లు, తహశీల్దారు కార్యాలయాల్లో ఆయన చెప్పిందే వేదం.
లక్షింపేట గ్రామంలో దళితులు భూములు సాగుచేసుకుంటే మిగతా 12 గ్రామాల్లోని దళితులు, పేదలు కూడా ఇలాగే ఉద్యమించే అవకాశముందని, మొగ్గలోనే తుంచేయాలని భావించిన బొత్స వాసునాయుడు ఆరు నెలల క్రితం గ్రామంలోని పోలీస్‌ పికెట్‌ ఎత్తి వేయించాడు. ఆ మరునాడే కాపు పెత్తందార్లతో దళితులపై దాడి చేయించాడు. ఆ దాడిలో చిత్రి అప్పడు కాళ్లు విరిగాయి. కామేష్‌కు తలపగిలింది. కెవిపిఎస్‌ నిర్వహించిన ఆందోళన ఫలితంగా నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించి అరెస్టు చేయించినా మూడు రోజుల్లోనే బెయిల్‌ ఇచ్చి కోర్డు కూడా అగ్రకుల పెత్తందార్లకు అండగా నిలిచింది. ఈ దాడి తర్వాత రెండవ సారి పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. అధికారులు జోక్యం చేసుకుని ఈ భూమి ఎవరూ సాగు చేయరాదని ఆదేశించారు. ఈ నిర్ణయం ఘర్షణను మరింత తీవ్రతరం చేయడానికి ఉపయోగ పడింది. దళితులు మంత్రి కొండ్రు మురళిని కలిసి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా చెవిటివాని ముందు శంఖం ఊదిన చందమే అయింది. బొత్స వాసునాయుడు దళితులను పిలిపించి భూములు వదులు కోవాలని హెచ్చరించాడు. దళితులు భూమి కావాలన్నందుకు ఇద్దరు, ముగ్గురు చస్తే గానీ మీరు భూమి వదలరని భయపెట్టాడు. వీరికి అండగా ఉన్న కెవిపిఎస్‌ స్థానిక నాయకుణ్ణి కూడా భయపెట్టే ప్రయత్నం చేశాడు.
దీనికి తోడు ఇటీవల రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల ప్రభావం కూడా ఉంది. ఆ మండలంలో కాంగ్రెస్‌ పార్టీలోని దళితులు, కాపులు ఎక్కువ మంది వైఎస్‌ఆర్‌ పార్టీ వైపు వెళ్లారు. లక్షింపేటలోనూ అదే జరిగింది. దీంతో ఆ మండలంలోని బొత్స వాసునాయుడు రాజకీయ ఆధిపత్యానికి గండి పడింది. కాపుల్లో తన పట్టు నిలుపుకునేందుకు లక్షింపేట కాపులను, దళితులు సాగు చేసే 60 ఎకరాలకు గతంలో హక్కుదారులైన ఇతర గ్రామాల కాపు రైతులను ఐక్యం చేశాడు. హత్యాకాండకు పథకం రూపొందించాడు. దీనికి కావలసిన నిధులను ముందే పోగు చేశాడు. దళితులను భూమి నుంచి ఖాళీ చేయించిన తర్వాత ఎకరాకు రూ.80 వేల చొప్పున గత హక్కుదారులైన కాపులకు లక్షింపేట కాపులు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకనుగుణంగానే పోలీసులతో రాయబారాలు నడిపారు.
పథకం అమలుకు సరైన సమయంగా ఉపఎన్నికలను ఉపయోగించుకున్నారు. ఎన్నికల బందోబస్తు పేరుతో వాసునాయుడు రెండవసారి పికెట్‌ ఎత్తివేయించాడు. కాపులు, దళితులు సమానమైన బలం అయినందున గతంలో హక్కుదారులైన కాపు రైతుల గుంపును రహస్యంగా అదే రోజు గ్రామానికి రప్పించుకున్నాడు. ఉదయాన్నే 7.30 గంటలకు పెత్తందార్లు మూకుమ్మడిగా బాంబులు, గొడ్డళ్ళు, కత్తులు, బరిసెలు, కర్రలతో అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. రెండున్నర గంటల సేపు దళితులతో రక్తకేళి ఆడుకున్నారు. దళితులు తేరుకునే లోగా అక్కడ రక్తం ఏరులై పారింది. భార్యలు చూస్తుండగానే భర్తలు రక్తపు మడుగులో శవాలయ్యారు. 5 కిమీ దూరంలో ఉన్న పోలీసు స్టేషనుకు రక్షణ కల్పించమని ఫోన్లు చేయగా రెండు గంటల తర్వాత ఒక కానిస్టేబుల్‌ వచ్చి అక్కడ కొనసాగుతున్న మారణకాండను చూసి వెనక్కు పరుగులు పెట్టాడు. ఘటన జరిగిన మూడు గంటల తర్వాత నిందితులంతా ప్రశాంతంగా తప్పించుకున్నాక పోలీసుల సైరన్‌ మోతలు వినిపించాయి. ముగ్గురు దళితులు అక్కడిక్కడే మరణించారు. ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయారు. మరొకరు హాస్పిటల్‌లో ప్రాణాలొదిలాడు. 18 మంది నేటికీ గాయాలతో హాస్పిటల్‌లోనే ఉన్నారు.
వాస్తవాలు ఇలా ఉండగా కొందరు నాయకులు, కొన్ని పత్రికలు, మీడియా దీనిని ఇరువర్గాల మధ్య ఘర్షణగా చిత్రించే ప్రయత్నం చేశారు. ఇది ఏక పక్ష దాడని దళితులు, దళిత సంఘాల నాయకులు మొత్తుకున్నా వారి చెవిన పడలేదు. కెవిపిఎస్‌, అన్ని దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శవాలను తీసుకెళ్లకుండా అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. ముఖ్యమంత్రి వచ్చి సవరించిన జీవో ప్రకారం హత్యకు గురైన వారికి రూ.5 లక్షలు సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వెళ్లిపోయారు. సిపియం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ఘటన జరిగిన గ్రామాన్ని, బాధితులను పరామర్శించి రాజాంలో జాయింట్‌ కలెక్టర్‌, ఎఎస్పీలతో చర్చించారు. దళితులపై ఇది ఏకపక్ష దాడి తప్ప ఘర్షణ కాదని, కొందరిపై జరిగిన దాడి కాదని, మొత్తం దళితవాడపై జరిగిన దాడి అని స్పష్టం చేశారు. ఏ భూమి కోసమైతే దళితులు హత్యలకు గురయ్యారో ఆ భూమి దళితులకు ఇవ్వాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. ఈ మేరకు వెంటనే జీవో జారీ చేయాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు. బొత్స వాసునాయుడుతోపాటు నిందితులందరినీ అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బాధితులకు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలో ఉన్న సౌకర్యాలన్నీ వెంటనే కల్పించాలన్నారు. దళితులపై దాడి జరిగే అవకాశం ఉందని తెలిసినా పోలీసు పికెట్‌ ఎత్తివేశారు. రెండు సంవత్సరాల నుంచి ఈ సమస్య రగులుతున్నా దీనిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎలాంటి చొరవా చూపనందున ఈ హత్యాకాండకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఈ డిమాండ్లపైనే దళిత, ప్రజా సంఘాలు వివిధ రూపాల్లో చేసిన ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం నీటి ముంపునకు గురికాని మొత్తం భూమి దాదాపు 200 ఎకరాలు దళితులే సాగు చేసుకునేందుకు ఇస్తామని, ప్రతి దళిత కుటుంబానికీ ఒక ఎకరానికి తగ్గకుండా పట్టాభూమి ఇస్తామని, హత్యకు గురైన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి ఆర్థిక సహాయం, ఇతర అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని కలెక్టర్‌, ఎస్పీలు హామీ ఇచ్చారు. వీటిలో కొన్ని అమలు చేశారు. కానీ ప్రధానమైన నిందితులు ఎనిమిది మందిని నేటికీ అరెస్టు చేయలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అధికార పార్టీ ఎస్సీ ఎమ్మెల్యే, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అదే పార్టీకి చెందిన పెత్తందార్లు అదే పార్టీకి చెందిన దళితులను ఊచకోత కోశారు. అదే పార్టీకి చెందిన రాజకీయ నాయకులే హంతకులను కాపాడుతున్నారు. దళితులను అన్యాయంగా హత్య చేసిన నేరస్థులు కాంగ్రెస్‌ పార్టీలో ఉండొచ్చా? లేకుంటే వారిపై పార్టీ పరంగా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అలాంటప్పుడు దళితులు ఎందుకు ఆ పార్టీలో ఉండాలి? దళితుల హక్కుల పట్ల చిత్తశుద్ధి లేని ఏ పార్టీ ఇక మనుగడ సాగించలేదు. కారంచేడులో నీళ్ళ కోసం, చుండూరులో ఆత్మగౌరవం కోసం, లక్షింపేటలో భూమి కోసం దళితులు రక్త తర్పణ చేశారు. ఆత్మగౌరవం, భూమి, సమానత్వం, హక్కులన్నీ అమలు చేసుకోవాలంటే అన్ని పార్టీల్లో ఉన్న దళితులు, సంఘాలు ఐక్యం కావాలి. కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులు, అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులతో ఐక్య సంఘటనగా ఉద్యమిస్తే అంతిమ విజయం సాధిస్తాం.
రచయిత కెవిపిఎస్‌
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కెవిపిఎస్‌)
Prajashakti News Paper Dated : 23/06/2012 

Thursday, June 21, 2012

దళితులు భూమి అడిగితే.. -బొజ్జా తారకం'పాలేరుతనం చేసే వాడికి భూమెందుకురా! పాలేరు పనో కూలిపనో చెయ్యాలిగాని... అంతే ' - గత ఏడాదిన్నర నుంచి లక్షింపేట కాపులు అదే పేటకు చెందిన మాలలకు చేస్తున్న హెచ్చరిక అది. దానిని వినకుండా ప్రభుత్వ భూమిని సాగుచేసుకుంటామని ముం దుకు వచ్చిన మాలపేటను కాపులు మసిచేసేశారు. జంతువుల్ని వేటాడినట్టు ముందు బాం బులు వేసి భయపెట్టి, బరిశెలు, గొడ్డళ్లు, దుడ్డు కర్రలు తీసుకొని మాలపేటపై దాడిచేసి, ఇళ్లలో జొరబడి, తలుపులు పగలగొట్టి, దొరికిన వారిని దొరికినట్టు కొట్టి, తప్పించుకు పోతున్న వారిని తరిమికొట్టి కాళ్లు చేతులు విరగ్గొట్టి, ఇళ్లలో మనుషులు దొరకకపోతే ఉన్న సామాను పగలగొట్టి, నానా బీభత్సం చేసి ఐదుగుర్ని చంపేశారు. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆస్పత్రికి మోసుకు వెళ్తుంటే మరో ఇద్దరు చనిపోయారు. అయిదో వ్యక్తి విశాఖపట్నం కెజిహెచ్‌లో చావు బ్రతుకుల మధ్య కొట్టుకుంటూ ఎనిమిదో రోజున ప్రాణాలు వదిలాడు. 


దళితులపై దాడి చేయటానికి 'అగ్ర' కులమే అక్కర లేదు. మాల, మాదిగ, రెల్లి లాంటి ఎస్ సి కులం కాని ఇతరులు ఎవరైనా చేస్తారు. లక్షింపేట దాడిచేసిన వారిది రికార్డులో బిసి కులమే! కాని వాళ్లు 'కాపులు'! మాదీ అగ్రకులమే అనుకుంటారు. అంటరానితనం వలన జరిగిన ఘోరం కాదిది. 'కాపుల మాదిరి మాలలు కూడా భూమి దున్ను కుంటారా?' అనే అహంకారమే ఈ దురాగతానికి దారితీసింది. లక్షింపేట మాలలు కాపు భూమిని గుంజుకోవాలను కోవటం లేదు. వారి భూమిని ఆక్రమించుకోనూ లేదు. ప్రభుత్వ భూమిని దున్నుకుంటామన్నారు. అంతే? శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలో మడ్డువలస ప్రాజెక్టు కోసం ప్రభుత్వం భూమినిసేకరించింది. ఆభూసేకరణలో పాతలక్షింపేట మునిగిపోయింది. కాపుల భూములు సేకరించారు. నష్టపరిహారంచెల్లించారు.దానికితోడు నలభైఉద్యోగాలు ఇచ్చారు. వారు వేరే చోట భూమిని కొనుక్కున్నారు. లక్షింపేటలో ఉన్న మాలలకు గుడిసెలు తప్ప భూమి లేదు. మునిగి పోయిన గుడిసెలకు ముష్టి మూడు వేలనష్టపరిహారం దొరికింది.అంతే.లక్షింపేటగ్రామస్థులకు ప్రస్తుతం లక్షింపేట ఉన్నచోటప్రభుత్వం పునరావాసం సంకల్పించింది. కాపులు స్వంత డబ్బుతో ఇళ్లు కట్టుకున్నారు. ఇద్దరూ పక్కపక్కనే ఉంటున్నారు. చిన్న రోడ్డే అడ్డు. మడ్డు వలస ప్రాజెక్టు కోసం సేకరించిన మొత్తం భూమిలో సుమారు 250 ఎకరాల భూమి ఏ అవసరానికీ రాకుండా మిగిలిపోయింది. రిజర్వాయర్ పూర్తినీటిమట్టం దాటిఈభూమి ఉండి పోతున్నది. అంటే ఇది మునగదు. ఇది ఖాళీగా ఉండటం వల్ల లక్షింపేట కాపులు 190 ఎకరాలు సాగుచేసుకొంటున్నారు. మిగిలిన 60 ఎకరాలు ఇంకా అలానేఉన్నది. అందులో 40 ఎకరాలు పక్క గ్రామమైన దేవకవాడ వాళ్లది. వాళ్లు భూమిని ఇచ్చేసి, నష్ట పరిహారం తీసుకొని సాలూరు వెళ్లి స్థిరపడిపోయారు. ఇటుకేసి తిరిగి చూడనే లేదు. మిగిలిన 20 ఎకరాలు లక్షింపేట కాపులవే. అయితే ఆ కుటుంబాలవారు ఇక్కడ లేరు. ఎక్కడో స్థిరపడ్డారు. ఈ 60 ఎకరాలూ ఖాళీగా ఉండటంతో లక్షింపేట మాలలు దీనిని సాగుచేయటం మొదలుపెట్టారు. వాస్తవానికి ఈ 250 ఎకరాల మీదా లక్షింపేట, దేవకవాడ కాపులకు ఏ సంబంధమూ లేదు. నష్ట పరిహారం తీసుకున్నారు. అయిపోయింది. ఇది ప్రభుత్వ భూమి. కానీ లక్షింపేట కాపులు ఇది మా దగ్గరే తీసుకున్నారు కదా, మేమే దున్నుకుంటాం అని మొదలుపెట్టారు. అయితే లక్షింపేట మాలలకు స్వంత భూమి, పట్టా భూమి ఎక్కడిది? కాని '60 ఎకరాలు ఖాళీగా ఉన్నది, మేము భూమి లేని వాళ్లం, ఇది ప్రభుత్వానికి చెందిన భూమి కాబట్టి దున్నుకుంటాం' అని వీరూ దిగారు. గత 12 సంవత్సరాలుగా దున్నుకుంటున్నారు. ప్రభుత్వ భూమే అయినప్పటికీ ఈ 60 ఎకరాలు దున్నుకుంటున్న మాలలు ప్రతి ఏడూ శిస్తు చెల్లిస్తున్నారు. ఈ 250 ఎకరాలూ ఒకే చోట ఉన్నాయి. కాపులు చేసుకుంటున్న 190 ఎకరాలు, మాలలు చేసుకుంటున్న 60 ఎకరాలూ అన్నీ కలిసే ఉన్నాయి. 'మా పక్కన మాల వాళ్లు భూమి సాగు చేయటమా, సహించటానికి వీల్లేదని' కాపులు నిర్ణయించుకున్నారు. గత రెండేళ్లుగా మాలల్ని బెదిరిస్తున్నారు. కొడుతున్నారు. ఆడవాళ్లనూ కొట్టారు. కేసుల్లేవు. దెబ్బలకు ఒకామె చనిపోయింది.కూడా. 'కొట్టినా, చంపినా కేసుల్లేవు. వద్దని చెప్పినా వీళ్లు వినటంలేదు. ఇద్దర్నో ముగ్గుర్నో చంపేస్తే గాని ఈ భూమిని వీళ్లు వదలరు' అనే నిర్ణయానికి కాపులు వచ్చారు. ఈ గ్రామం వంగర మండలంలో ఉంటుంది. మండలాధ్యక్షుడిగా బొత్స వాసుదేవరావు నాయుడు ఉన్నాడు. ఆయనా కాపు కులానికి చెందిన వాడే. లోక్‌సభ సభ్యురాలు బొత్సఝాన్సీ దీ అదే కులం. మంత్రిగా బొత్స సత్యనారారాయణపిసిసిఅధ్యక్షుడు అయ్యారు. ఆయనదీ అదే కులం. అర్థబలం, అంగబలం, రాజకీయ బలం మూడూ కలిసి వచ్చాయి. ఈ మూడూ ఉంటే అధికార యంత్రాంగం వారికే దాసోహమంటుంది. ఉండటానికి లక్షింపేట సర్పంచ్‌గా చిత్తిరి సింహాలమ్మ ఉన్నది. ఆమె మాల కులస్తురాలు. అయితే ఏం లాభం? ఆమెను అయిదేళ్ల పదవీకాలంలో ఒక్క రోజు కూడా సర్పంచ్ కుర్చీ మీద కూర్చోనివ్వలేదు. పంచాయత్ సమావేశాల్లో పంచాయత్ సభ్యులందరూ కుర్చీల్లో కూర్చుని ఉంటే ఈమె గోడవార నిలబడి ఉండాలి. అది కాపుల ఆజ్ఞ! పాపం! ఆమె ఏం చేయగలుగుతుంది? ఆ గ్రామం రాజాం నియోజక వర్గంలోకి వస్తుంది. అది రిజర్వుడు స్థానం. అక్కడి శాసన సభ్యుడు కొండ్రు మురళీమోహన్ . ఆయన రాష్ట్ర మంత్రి కూడా అయ్యాడు, రిజర్వుడు కోటాలోనించే ! ఆయనదీ మాల కులమే ! అయితే ఏం లాభం? ఆయన కాపుల్ని కాదని ఎమ్మెల్యే అవగలడా? మంత్రి కాగలడా? అయినా మనగలడా? ఆయన దగ్గరకు లక్షింపేట మాలలు ఈ సమస్యను తీసుకు వెళ్లినప్రతిసారీ 'ఆ భూమిలోకి వెళ్లకండి, కాపులతో మీకు తగాదా ఎందుకు?' అంటూ నిరుత్సాహపరుస్తుండే వాడు. కాపుల రాజకీయ బలం అలా ఉంటే ఎస్‌సిల రాజకీయ బలం ఇలా ఉన్నది. గత రెండేళ్లుగా మాలలపై దాడులు ఎక్కువయ్యాయి. పోలీసు శాఖ కాపుల పక్షాన్నే ఉన్నది. ఎస్ సిలపై జరిగిన అత్యాచారానికి ఎస్‌సి, ఎస్‌టి (అత్యాచారాల నిరోధక) చట్టం వర్తింప చెయ్యటం లేదు. ఏదో ఐపిసి నేరం క్రింద అరెస్టు చెయ్యటం రెండు రోజుల్లో విడిచి పెట్టటం జరుగుతున్నది. పైగా, దాడిచేసింది కాపులయితే రెండు వర్గాల పైన సిఆర్ పిసి సెక్షన్ 107 కింద ఇద్దరినీ బైండోవర్ కేసులో ఇరికించారు. మరో సారి మాలల పై దాడి జరిగే ప్రమాదం ఉన్నదని లక్షింపేట పోలీస్‌ని కాపలా ఉంచారు. జూన్ 12న శ్రీకాకుళం జిల్లాలో నర్సన్న పేట నియోజక వర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది. దీనికీ లక్షింపేటకూ ఏ సంబంధమూ లేదు. ఎక్కడో జరిగే ఉప ఎన్నికకు పోలీసు బలగం కావాలని లక్షింపేటలో కాపలా ఉన్న పోలీసుల్ని అక్కడ నుంచి పిలిపించుకున్నారు. అంతే, మంచి సమయం దొరికింది, సరైన సిగ్నల్ అందింది. జూన్ 11 రాత్రి లక్షింపేటలో పథకం తయారయింది. కావలసినది సేకరించుకున్నారు. పోలీసులా లేరు, ఇంక అడ్డు ఏమిటి అని ఉదయం అందరూ ఒక ఇంటి దగ్గర గుమిగూడారు. అది చూసి సర్పంచ్ భర్త ఉదయం 7 గంటలకు వంగర ఎస్ఐకి ఫోన్ చేశాడు. పోలీసులు రాలేదు. రారని ముందే తెలుసుకున్న కాపులు దాడికి దిగారు. ఆడవాళ్లు కారం పట్టుకొని కూడా వచ్చారు. ముందు బాంబులు పేల్చారు. ఉదయం పనుల్లో ఉన్నారందరూ. ఏమయిందని బయటకు వచ్చిన వారిని అక్కడికక్కడే కొట్టి పడేశారు. ఇళ్లల్లో జొర బడ్డారు. బరిశెలతో, బళ్లాలతో గొడ్డళ్లతో బాదారు. కొట్టవద్దని చేతులెత్తిన వారి చేతులు విరగ్గొట్టారు. పరిగెత్తుకు పోతున్న వారి కాళ్లు విరగ్గొట్టారు. నెత్తి పగలగొట్టారు. కొన ప్రాణంతో ఉన్న కొడుకుకి నీళ్లు తెచ్చి పోస్తున్న ఒక తల్లి చెయ్యి విరగ్గొట్టారు. సర్పంచ్ భర్త కోసం చూశారు. అతను దొరకకపోతే అతని తమ్ముణ్ణి చంపారు. ఆ పేటలో కొంచెం ఎక్కువ చదువుకున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతను పాటలు పాడతాడు. ఊళ్లో ఏ అవసరం వచ్చినా దరఖాస్తు వ్రాసి ఇస్తాడు. అతన్ని గురి చేశారు. బళ్లాలతో దాడిచేస్తే అక్కడికక్కడే చనిపోయాడు. ఏభైమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయాలు బాగా తగిలినా ఆస్పత్రికి వెళ్లలేక కట్టుకట్టుకొని ఇంటి దగ్గరే ఉండిపోయిన వాళ్లు చాలమంది ఉన్నారు. ఎక్కువ తక్కువ కులాలు అనుకుంటున్న వ్యవస్థ మనది. ఎంత తక్కువ అయినా తక్కువే, ఎంత ఎక్కువ అయినా ఎక్కువే. తక్కువ కులాల వాళ్లు అణిగి మణిగి ఉండాలి. లేకపోతే అగ్రకులాలు దాడి చేస్తాయి. తక్కువ కులాల వాళ్లు తగ్గి ఉండాలి, ఎక్కువ కులాల వాళ్లతో సమానంగా ఎదగటానికి సాహసించకూడదు. పాలేరు, పాలేరుగానే ఉండాలి. అతను భూమి అడగకూడదు. అతని దగ్గర భూమి ఉంటే ఇద్దరూ సమానమై పోతారు. అది కుదరదు. అందుకే లక్షింపేటలో ఇంత కిరాతకం, ఇంత ఆటవికం! ప్రభుత్వ భూమిని ఆక్రమించి అగ్రకులాలు అనుభవించవచ్చు. అదే పని దళితులు చెయ్యకూడదు, చేస్తే అగ్రకులాలు సహించవు. ప్రభుత్వం దగ్గర మొరపెట్టుకుంటే ఇంకోచోట ఎక్కడైనా ఇస్తాములే అంటారు. పరామర్శించటానికి వెళ్లిన ముఖ్యమంత్రి మీకు వేరే చోట కొని ఇస్తాము అని అన్నాడంటే, 'ఈ భూమి గురించి మా ప్రాణాలు నాలుగు పోయాయి, ఇంకోచోటకి మేమెందుకు వెళ్తాం'అంటున్నది ఒక మహిళ. ఆమె కుమారుడిని ఈ దాడిలో చంపేశారు. ఇంతవరకూ ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అత్యాచారాలకూ దీనికీ ఒక ప్రధానమైన తేడా ఉన్నది. ఎక్కవచోట్ల ఆత్మగౌరవం గురించి అడుగుతున్నారని దాడులు చేస్తే ఇక్కడ భూమి కావాలంటున్నారనిదాడి చేశారు. అత్యాచారాలన్నీ ఆత్మగౌరవం, భూమి చుట్టూనే తిరుగుతుంటాయి. లక్షింపేటలో అయిదు ప్రాణాలు పోయినా అక్కడి మాలలలో ఆత్మస్థైర్యం పోలేదు. మేము సాగు చేసుకుంటున్న అరవై ఎకరాలు కాదు, మొత్తం 250 ఎకరాలు మాకే ఇవ్వాలి అంటున్నారు. ఇంతకు ముందే మండలాధ్యక్షుడు లక్షింపేట మాలలకు 'పనికి ఆహార పథకం' మాన్పించాడు. వృద్ధాప్య పింఛన్‌లు ఆపించాడు. మంచి నీళ్లకు మూడు నాలుగు కిలో మీటర్లు నడిచివెళ్లే పరిస్థితి కల్పించాడు. ఎక్కడైనా ఏదైనా పనిచేసుకు బ్రతుకుదామనుకుంటే కాళ్లు చేతులు విరగ్గొట్టించాడు. అక్కడ చదువుకున్న వాళ్లు లేరు. వారికి ఉన్న ఆస్తి కాళ్లూచేతులే. అవీ విరగిపోయాయిపుడు. కారంచేడు, చుండూరులో కమ్మ, రెడ్లు దాడులు చేస్తే లక్షింపేటలో కాపులు చేశారు. అవును, ఇప్పుడు కాపులు కొత్తగా ఎదుగుతున్న రాజకీయ శక్తి . భారతదేశంలో కులాన్ని, భూమిని కలిపి చూడకుండా ఈ రెండింటికీ పరిష్కారం చూపలేము. లక్షింపేట మాలలపైన తగిలింది ఈ జమిలి దెబ్బ. దీనికి ఎదురు దెబ్బ వేయాలంటే మళ్లీ అదే జమిలి దెబ్బ తగిలించాలి. లక్షింపేట మాలలకు, ప్రాజెక్టుతో గుడిశెలు కోల్పోయి పొరుగు గ్రామమైన కొడిశ లో ఉంటున్న మాల మాదిగలకు కలిపి ఈ 250 ఎకరాలను కేటాయిస్తే దళితులకు భూమిదొరుకుతుంది, ఆ పైన ఆత్మ గౌరవం వస్తుంది. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆ పని జరగటం లేదు కాబట్టే కారంచేడు అయినా, చుండూరు అయినా , బెల్చీ అయినా కీలవేన్మణి అయినా, ఖైర్లాంజి అయినా, లక్ష్మణ్‌పూర్ -బాతే అయినా, కంబాలహళ్లి అయినా, బతాని తోలా అయినా, దీయో సాధుపూర్ అయినా లక్షింపేట అయినా!

Andhra Jyothi News Paper Dated 22/06/2012 

లక్షింపేటలో 'కారంచేడు' --డాక్టర్ కత్తి పద్మారావురాష్ట్రంలో దళితుల మీద అగ్రకులాల దమనకాండ నిరంతరం సాగుతూనే ఉంది. రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తుంటే ఆ కులాల వాళ్ళు దళితులపై దాడులు నిర్వహిస్తున్నారు. ఎన్‌టి రామారావు అధికారంలో ఉన్నప్పుడు ఆయన వియ్యంకుడి ఊరు కారంచేడులో ఆరుగురు దళితుల్ని ఊచకోత కోశారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుంటూరు జిల్లా చుండూరులో ఎనిమిది మంది దళితుల్ని తలలు నరికి తుంగభద్రలో తొక్కారు. ఇప్పుడు బీసీగా చెప్పుకుంటున్న బొత్స పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు బొత్స వాసుదేవరావునాయుడు తూర్పు కాపుల గుంపు కత్తులతో గండ్రగొడ్డళ్లతో శ్రీకాకుళం జిల్లా లక్షిం పేటలో దళితుల్ని చిత్ర వధ చేసి చంపడం జరిగింది. 


అసలేం జరిగింది? శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్షింపేటలో భూస్వామ్య తూర్పుకాపులు ఉదయం ఏడు గంటల ప్రాంతంలో దళితపల్లెని చుట్టుముట్టారు. బరిసెలు, గండ్రగొడ్డళ్లు, బాంబులు, కత్తులతో ఒక్కొక్కింటికి 20 మంది చొప్పున చుట్టు ముట్టారు. ఇంట్లో ఉన్నవారిని బయటికి లాగారు. అమానుషంగా, దారుణంగా బూతులు తిట్టారు. కుల అహంకారంతో 'మీరు కూడా పొలాలు చేసే అంతటి వాళ్ళు అయ్యార్రా మాల నా కొడుకుల్లారా!' అని దూషించా రు. 'మా పక్కన పొలాలు దున్నేంతటి వాళ్ళా!' అని నివర్తి వెంకటి (60), ఆయన కుమారుడు నివర్తి సంగమేష్ (35)ను, బూరాడ సుం దరరావు (35), చిత్తిరి అప్పడు (25) -ఈ నలుగురి పైన అమానుషంగా దాడి చేశారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చింతపల్లి గురుప్రసాద్, కార్యవర్గ సభ్యులు పి.బెంజిమన్, నూతలపాటి చంద్రశేఖర్, బోకర నారాయణరావు స్వయంగా చూసిందాని ప్రకారం ఒక్కొక్కరి దేహంపై 40, 50 కత్తి, బల్లెం పోట్లు ఉన్నాయి. ఈ దాడి కక్షతో జరిగింది. దీని వెనుక పథకమూ, వ్యూహమూ, ద్వేషమూ ఉన్నాయి. ఈ పోట్లు పడిన వెంటనే వెంటనే అక్కడికక్కడే మరణించారు. వీరు భూమి పోరులో అమరులయ్యారు. కుల ద్వేషానికి ఆహుతయ్యారు. ఈ నలుగురిపై దాడి సంఘటనలో తీవ్రంగా గాయపడిన మరొక వ్యక్తి బొద్దూరి పాపయ్య (60) బుధవారం విశాఖపట్నంలోని కింగ్‌జార్జి ఆస్పత్రిలో మరణించారు. అంటే లక్షింపేట ఊచకోతలో మొత్తం ఐదుగురు బలయ్యారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆయా ప్రాంతాల్లో ఉన్న భూమి కలిగిన కులాల వాళ్ళు కమ్మ అయినా, రెడ్డి అయినా, కాపు అయినా, కాళింగులు అయినా, వెలమ అయినా, క్షత్రియులు అయినా దళితులు భూమి దున్నుతుంటే కళ్లలో కారం చల్లుకోవడం, సహించలేకపోవడం, దళితులకు భూమి మీద హక్కులేదు అని కక్ష కట్టడం, వారి మీద దాడులు చేయడం, పల్లెల నుంచి వెళ్లగొట్టడం జరుగుతోంది. ఈ కుల ద్వేషానికి రాజ్యాధికారానికి అవినాభావ సంబంధం ఉంది. పెద్దల అండ వల్లే ఈ దారుణం జరిగింది. ఆంధ్రులు ఎంతో సిగ్గు పడాల్సిన ఈ దారుణ, అమానుష సంఘటనలో హతులతో పాటు మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరు శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కలమట గణపతి (35), కలమట ప్రకాశ్ (50), కలమటి సింహాచలం, కలమటి గంగులు, గోనెల రవి (25), నివర్తి గంగయ్య (50), కలమట గడ్డియ్య (లచ్చయ్య కుమారుడు), కలమటి గడ్డయ్య (చిన ముత్యాలు కుమారుడు), నివర్తి సింహాచలం, నివర్తి నర్సయ్య, నివర్తి రామారావు, బొద్దూరి బోగేషు, గొంగాడ శివుడు, నివర్తి దారప్పడు, నివర్తి గంగయ్య, కలమటి సంగమ్మ, చిత్తిరి ఎల్ల య్య, కలమటి గంగులు, బొద్దూరి గౌరయ్య ఆస్పత్రి లో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు. లక్షింపేట ఘటన కారంచేడు, చుండూరు తరువాత అతిపెద్ద అగ్రకులాల దమన కాండ. ఈ కుల ముష్కరులు రెండున్నర గంటలు మారణాయుధాలతో దళితులను చుట్టు ముట్టి వెంటాడి, వేటాడి మృత దేహాలపై కూడా వికటాట్టహాసాలతో కత్తులతో పాశవికంగా దాడిచేశారు. ఇక్కడ తూర్పుకాపు భూస్వాములు పేరుకి బీసీలైనా కుల అహంకారం ఉన్న వారు. శ్రీకాకుళం జిల్లాలో కాళింగులు, కొప్పుల వెలమలు, తూర్పు కాపులు, కోస్తాంధ్రలో కమ్మ, రెడ్డి, క్షత్రియులు నిర్వహించే పాత్రని నిర్వహిస్తున్నారు. భూస్వామ్య కాపులు చేసిన ఈ దాడిలో పక్క గ్రామా ల్లో ఉన్న తూర్పుకాపులు కూడా కులం, బంధుత్వంతో పాల్గొన్నారు. ఈ దారుణమైన దాడి వలన 26 సంవత్సరాల చిత్రి శ్రీదేవి, బోరాడ కాసాలు, నివర్తి రాముడమ్మ, నివర్తి వెంకటమ్మ భర్తల్ని కోల్పోయిన అనాథలుగా మిగిలిపోయారు. వీరందరు 30-40 ఏళ్ళ మధ్య వయస్సు వాళ్ళు. వీళ్ళందరూ మాతృమూర్తులే. ఉదయం ఐదు గంటలకు భర్తలు కలిగివున్నవారు 7.30 గంటలకు భర్తల్ని కోల్పోయారు. వాళ్ళు చేసిన తప్పేంటి? 80 దళిత కుటుంబాలు 60 ఎకరాల గవర్నమెంటు భూమిని దున్నుకోవటమా? అది 2002లో జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ స్వయంగా భూమిని కేటాయించి మీరు దున్నుకోండి అంటే ఒక్కొక్కరూ 45 సెంట్లు పంచుకుని దున్నుకుంటున్నారు. ఈ దేశంలో దళితులు భూమి దున్నుకోవడం తప్పా? దానికి కళ్ళలో నిప్పులు పోసుకోవాలా? ఈ ఘటన మీద సిబిఐ విచారణ చేయించకుండా మాఫీ చేయడం కోసం శవాల్ని పూడ్చి పెట్టక ముందే వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి కేవలం మొక్కుబడిగా ఎక్స్‌గ్రేషియా ప్రకటించి రావడం ఆయన అగ్రకుల భూస్వామ్య తత్వానికి నిదర్శనం. ప్రతి చిన్నదానికి సిబిఐ ఎంక్వైరీ వేసే ఈ పెద్ద మనుషులు ఇంత మారణ హోమం జరిగితే ఎందుకు వేయటం లేదు? పెద్దలు ఇరుక్కుంటారనే కాదా? లక్షింపేట బాధితులు చిత్రి గంగయ్య, గొంగోడ గంగయ్య, నివర్తి సింహాచలం, నివర్తి తిరపతిరాజు, బోడిసింగు రాము చెప్పిన వివరాలివి: తాము సాగుచేసుకొంటున్న భూమి పది సంవత్సరాల క్రితం మద్దుకూరు రిజర్వాయరు కోసం వివిధ కులాల వారి నుంచి సేకరించినది. వారందరికీ ప్రభుత్వం అప్పుడే ఎక్స్‌గ్రేషియా ఇచ్చివేసింది. ఇప్పుడు ఇది అసైన్డ్ ల్యాండ్. ప్రభుత్వానికి ఎవరికైనా ఇచ్చే అధికారం ఉంది. ఈ 250 ఎకరాల భూమిని దళితులకు ఇస్తున్నట్టు ఇంత రక్తం నేలలో ఇంకిన తరువాత కూడా ముఖ్యమంత్రి ఎందుకు ప్రకటించలేదు? ఇక్కడ ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకిగా వ్యవహరించారు. ఇది ముఖ్యంగా దళిత మంత్రి కొండ్రు మురళి నియోజక వర్గం. దళిత మంత్రులు సిబిఐ విచారణని కోరక పోవడం, 250 ఎకరాల భూమిని కోరకపోవడం అధికార వర్గానికి భజనపరులుగా ఉండి, దళితులపై కత్తులతో దాడులు జరిగినా పదవీ వ్యామోహంతో వ్యవహరించడం సిగ్గుచేటైన విషయం. వీళ్ళు ఏ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల ద్వారా మంత్రులయ్యారో ఆ విషయాన్ని విస్మరించారు. ఈనాడు దళిత ప్రజా సంఘాలు, లెఫ్ట్ పార్టీల అనుబంధ దళిత ప్రజాసంఘాలు ఐక్యంగా పోరాడుతున్నాయి. ఈ డిమాండ్లు నెరవేరే వరకు అన్ని ప్రజాశక్తులు మూకుమ్మడిగా అగ్రకుల రాజ్యాధికారం మెడలు వంచి దళితుల ఆత్మగౌరవ పోరాటాన్ని విజయవంతం చేయాల్సిన చారిత్రక సందర్భం ఇది. దళిత ఉద్యమాల ఐక్యతే ఈనాటి పోరాటరూపం. నేలలో ఇంకిన దళితుల నెత్తురు వృధా పోదు. ఈ నెత్తుటి ప్రశ్నకు చరిత్ర సమాధానం చెప్పాల్సిందే. అమరవీరులైన వారి ఆత్మగౌరవ భేరి మోగుతుంది. దళిత శిబిరం లక్షింపేటలో ఆత్మరక్షణ నినాదం చేస్తుంది. ఐదుగురు చనిపోయినా బాధితులు నిస్సారంగా లేరు. 250 ఎకరాలు దళితుల సొంతం అయ్యేవరకు ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటంలో భాగస్వాములవుతున్న ఎర్ర, నీలి ఉద్యమాలన్నీ ఈ డిమాండ్లు నెరవేరేవరకు ఐక్యంగా పోరాడాలి. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మిగిలిన సంఘాలతో కలిసి, బాధితులతో కలిసి పనిచేస్తుంది. ఈనాటి ఈ దళిత ఆత్మగౌరవ ఉద్యమం కులాధిపత్యాన్ని, భూస్వామ్య ఆధిపత్యాన్ని, రాజ్యాధిపత్యాన్ని నిలదీయాల్సిన చారిత్రక సమర దినాలివి. దళిత బహుజన మైనారిటీల్లారా! పార్టీల్ని పక్కన పెట్టి నెత్తురు ఇంకిన నేల నుంచి వస్తున్న పెను కేకలకు స్పందించండి. దళిత సమరయోధులుగా పోరుకు సిద్ధంకండి. చరిత్ర పీడితులదికాదు పీడించబడేవారిదే. తిరుగుబాటే విజయానికి బాట. (ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో జూలై 17న 'చలో హైదరాబాద్' కార్యక్రమం తీసుకుంటున్నాం. అందరూ కలిసి రావాలని పిలుపునిస్తున్నాం.)-డాక్టర్ కత్తి పద్మారావు

Andhra Jyothi News Paper Dated : 21/06/2012