Showing posts with label దళితులు. Show all posts
Showing posts with label దళితులు. Show all posts

Monday, June 30, 2014

నెరవేరని దళిత ఆకాంక్షలు ....మునిగిపోతున్న ఆదివాసీలు


పార్లమెంట్‌ సమావేశాలు తొలిరోజున ఉభయ సభలనుద్దేశించి రాష్టప్రతి ప్రసంగించి సభ వాయిదాపడిన తరువాత తెలంగాణ రాష్ట్ర పార్టీ సభా పక్షనాయకుడు లోక్‌సభలో పోలవరం ప్రాజెక్టు క్రింద ముంపుకు గురవుతునƒ్ని తెలంగాణ ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాం ధ్రలో కలుపడానికి ఒప్పుకోమని, ఇప్పటికే వచ్చిన ఆర్డినెన్‌‌సను చట్టంగా తీసుకువచ్చే ప్రయ త్నాలను అడ్డుకుం టామని ప్రకటించడం చేతులుకాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉంది. ఆ పార్టీకే చెందిన మరొక యం.పి. ప్రాజెక్టును మేము వ్యతిరేకిం చడంలేదు డిజైను మార్చాలని మాత్రమే డిమాండ్‌ చేస్తున్నట్లు చెప్పడం కూడా విడ్డూరంగా ఉంది. ఇలాంటి ప్రకటనలు ఆది వాసీలు నిరాశ్రయులు కావడాన్ని ఏవిధంగా ఆపలేవు.

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష కమిటి సరిహద్దుల దిగ్భంధనంతో పిలుపునిచ్చి విజయవంతం చేశారు. సాధారణంగా స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఆ ప్రాంతాలన్నీ యాధాతధంగా ఉంచడం లేదా వేరే ప్రాంతంలో కలుపడమో చేయాలి. కానీ వీరి అభిప్రాయాలను పట్టించుకోకుండా రాష్టప్రతి ఆర్డినెన్‌‌సతో ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపడం ఇక్కడి ప్రజల్ని అవమానించడమే అవుతుంది. 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఎవరికి అభ్యంతరంలేదు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలో బ్రిటిష్‌ కాలం నుండి ఉన్నవి. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కొంతభాగం సీమాంధ్రలోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లోని కొంతభాగం ఈప్రాజెక్టు క్రింద ముంపుకు గురవుతుంది. తెలంగాణ సీమాంధ్ర రాష్ట్రాల్లోని ప్రాంతాలు ముంపుకు గురవుతున్నప్పటికి ఎక్కువ శాతం సీమాంధ్ర సాగు, తాగునీరు కోసం ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుందనేది వాస్తవం. దీనికి తెలంగాణ ప్రజలు, ్ర„పభుత్వం అభ్యంతరం చెప్పాల్సిన అవసరంలేదు. ఎందు కంటే గోదావరి నదీజలాలు వినియోగించుకోవడంలో తెలంగాణ, సీమాంధ్రలు వెనుకబడిపోయాయి. గోదావరి జలాలు సముద్రంలోకి కలిసిపోతున్నాయి. సహజ వనరులను ఉపయోగించుకోవడానికి మనుషుల మధ్య తారతమ్యం చూపించడం మానవత్వం అనిపించుకోదు. ఈ కోణంలో ప్రాజెక్టు నిర్మాణంతో సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను ప్రజావసరాలకు వాడుకోవడాన్ని ఎవరైనా హర్షించాలి. అయితే ఈ ప్రాజెక్టు ్టవల్ల ముంపునకు గురయే్య ప్రాంతాల నిష్పత్తిలో ఆ జలాలనుకూడా అదే నిష్పత్తిలో వినియోగించు కోవ డానికి ఎందుకు రూపకల్పనలు చేయలేదో ఆలోచించాలి. ఈ ప్రాజెక్టు ఇపు డున్న సీమాంధ్ర తెలంగాణలో వేర్వేరుగా అంటే సీమాంధ్ర మద్రాసు ప్రావి న్‌‌సలో, తెలంగాణ నైజాం సర్కారులో ఉన్నపుడు ప్రతిపాదనలు రూపొందిస్తే ఈ రెండు ప్రాంతాలు 1956లో ఆంధ్ర ప్రదేశ్‌గా ఏర్పడి చివరికి ఈ రెండు ప్రాంతాలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయానికి ఈ డిమాండ్‌ను చేయడం సమర్థనీయం కాదు.

మన ఇల్లు కూల గొట్టి పక్కవాడికి పందిరి వేయడాన్ని ఎవరైనా సమర్థిస్తారా? కానీ తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం సమర్థించాయని చెప్పుకోవచ్చు. ఏడు మండలాలను సీమాంధ్రలో కలిపితే ఆర్డినెన్‌‌స వచ్చినందుకు నిరసనగా బంద్‌లు చేయడం సబబే కానీ ప్రాజెక్టు రూపకల్పన నుండి నిస్తేజంగా ఉండి తెలంగాణ రాష్ట్రం రాబోతున్న సమ యంలో పార్లమెంటులో ప్రాజెక్టుకు సంబంధించి ముంపుప్రాంతాలు, నిర్వాసితులగురించి చర్చించడానికి చాలా సమయం వెచ్చించబడింది. తెలంగాణలోని ఏ పార్టీ కూడా ఇంతవరకు పై విషయంపై చర్చించాయా పరిశీలించుకోవాలి. తెలంగాణ రాష్టస్రాధన కోసమే ప్రధానంగా దృష్టి పెట్టడంవల్ల ఈ ప్రాజెక్టు వల్ల నిరాశ్రయులయ్యే ఆదివాసీల పట్ల శ్రద్ధచూపిం చలేదు. ఏడు మండలాలలోని ప్రజలు సీమాంధ్రలో కలుపడానికి సుముఖంగా ఉంటే దీనిపై చర్చ అవసరం లేదు. కానీ వారు సంపూర్ణంగా తెలంగాణలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు. అంటే వారి మనోభావాలకు వ్యతిరేకంగా అటు సీమాంధ్ర ఇటు తెలంగాణ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని చెప్పాలి. ప్రాజెక్టు పూర్తిచేసే క్రమంలో ఎదురయ్యే ప్రతిబంధకాలు ఈ ఏడు మండలాల ప్రజల నుండి వస్తాయని ఆ అవరోధాలను అధిగమించేందుకు సులువుగా ఉంటుందనే ముందుచూపుతోనే సీమాంధ్ర ప్రభుత్వం ఈ మండలాల విలీ నానికి ఆర్డినెన్‌‌సపై ఒత్తిడి తెచ్చిందని అందరూ భావిస్తున్నారు. ఆ ప్రభుత్వం జాగ్రత్తను నిందించాల్సిన పనిలేదు. తెలంగాణలోనే ఉండాలని కోరుకునే ఆదివాసీల ఆకాంక్షలను పట్టించు కోకుండా నిర్లక్ష్యం వహించిన తెలంగాణ ప్రభుత్వం ఏవిధంగా ఆదివాసీల జీవితాలను గురించి శ్రద్ధ చూపించిందనేది ఆలోచించాలి. ముంపునకు గురయ్యేవారు ఎక్కడ ఉంటే ఏమిటనే ఉదాసీన వైఖరితోనే తెలంగాణ ప్రభు త్వం వ్యవహరించిందని అర్థమవుతుంది. 

ఆది వాసీల జీవన మనుగడతో మమేకమైన అడవి, కొండలు, సెలయేరులు కƒను మరుగైన తర్వాత వారి జీవనశైలి పూర్తిగా కోల్పోవడం విచారకరమైంది. ఒక తెగ లేదా వర్గం సంస్కృతి సాంప్రదాయాల స్థానంలో కొత్తది రావడం వారి ఇష్టాఇష్టాలకు అనుగుణంగా జరిగితే అది అభివృద్ధి అవుతుంది. వారి అభీ ష్టానికి వ్యతిరేకంగా జరిగితే అది విధƒ్వంసం అవుతుంది. ఈ ఏడు మండలాల లోని ప్రజలు ఇప్పుడు ప్రభుత్వాలు జరిపే విధƒ్వంసక క్రీడలో బలౌతున్నారు. 
రామాయణ, మహాభారత కాలం నుండి దళిత, ఆదివాసీలపై వివక్ష కొనసాగుతుంది. వాలి సుగ్రీవులిద్దరు అన్మదమ్ములు రాజ సింహాసనం కోసం వారిమధ్య జరుగుతున్న అంతర్గత పోరులో రాముడు ప్రవేశించి తనను ప్రశ్నించిన వాలిని సుగ్రీవునికి అండగా నిలిచి వధించిన చరిత్ర ఉంది. స్వాభిమానంపై, ఆత్మగౌరవంపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరిగినపుడు ఆ దాడులను ఎదిరించిన ప్రతి దళిత, ఆదివాసి యోధులు రాజధర్మం పేరిట హత్యచేయబడ్డారు. ఇది లోక రక్షణకోసం చరిత్ర వ్రాయ బడినందున దళిత ఆదివాసి ప్రజలు కూడా ఈ చరిత్రను నమ్ముతున్నారు. 

వ్యక్తిస్వామ్యం అనేది ఏ రూపంలో ఉన్నా అది ప్రజా స్వామ్యా నికి తీవ్రమైన చెడుచేస్తుందని బొంబై లెజిస్లేచర్‌ సభల్లో డా బి.ఆర్‌. అంబేద్కర్‌ స్పష్టం చేశారు. ఆ సమయంలో బ్రిటిష్‌ ఇండియా ఆర్మీలో దళితులకు ప్రవేశంపై నిషేధం ఉం డడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ బొంబై ప్రావిన్‌‌సలో ఆ నిషే దం తొలగి పోయేలాగా తీవ్రప్రయత్నం చేశారు. దాని ఫలితమే భారత సైన్యంలో మహర్‌ దళం ఎన్నో వీరోచిత ఘట్టాలను నమోదుచేసింది. వేలాది కులాలున్న ఈ భారత సమాజంలో కేవలం కొన్ని కులాలు ఆనాటికి సైన్యంలో ఉండడాన్ని దళితఆదివాసీలకు ప్రవేశం లేకపోవడం ఈ దేశప్రజలకు ఇక్కడి ఆచారాలు, విలువలే కారణమౌతున్నాయని వీటిని రూపుమాపాలంటే స్వాతం త్య్రానంతరం కొత్త రాజ్యాంగం తయారు చేసుకోవాలని చెప్పిన అంబేద్కర్‌ తాను రూపొందించిన రాజ్యాంగం ద్వారా ఈ దేశంలోని వివక్షతలపై అసమాన తలపై దృష్టిపెట్టారు. దళితులను, ఆదివాసీలను రాజ్యాంగపరమైన విద్య, ఉద్యోగƒ, రాజకీయ హక్కులు కల్పించబడ్డాయి. 

ఇవి ఆ వర్గాల వ్యక్తిగత అభి వృద్ధికోసం ఎక్కువగా ఉపయోగపడితే అంబేద్కర్‌ ఆశించిన సమగ్రాభివృద్ధికి మార్గమైన రాజకీయ నిర్మాణానికి ఉపయోగపడడంలేదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న క్రమంలో దళితుడిని ముఖ్య మంత్రిని చేస్తానన్న ప్రకటన ఎవరూ అడుగకుండానే ప్రకటించడం జరిగింది. తీరా రాష్ట్రం ఏర్ప డ్డాక ప్రకటించిన నాయకుడే ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు. అయితే దీనిపై అభ్యంతరం ఏమీలేదు. కానీ ఇందులో జరిగే విమర్శ ప్రతివిమర్శలపై చర్చ జరగడంలేదు. 20 సంవత్సరాలుగా మాదిగ హక్కులే మానవ హక్కు లంటూ ఉద్యమం చేస్తూ వారి నాయకుడు ఆ వర్గాన్ని రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో భాగస్వామ్యం పెరిగేందుకు ఉపయోగపడ్డాడు. ఆ ఉద్యమ నాయ కుడు తెలంగాణ ప్రభుత్వంపై దళిత ముఖ్యమంత్రి విషయంపై నిరసన ప్రకటిం చడం సహజం. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి కాకుండా ఆ ప్రభుత్వంలో భాగమైన దళిత మంత్రులే ప్రతి స్పందించడమనేది చర్చించాలి. దళితుడిని ఏ పరిస్థితుల్లో ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేక పోయామో తెలంగాణ ముఖ్య మంత్రి చెబితే ఏగొడవలేదు. కానీ తన ప్రభుత్వంలో పనిచేసే మంత్రులతో ప్రతివిమర్శలు చేయించడం వాలీసుగ్రీవుల అంతర్గత పోరు పెట్టించినట్లుగా ఉంది. ఈ మంత్రులు తమ నాయకుడు గొప్పవాడని సమర్థిస్తే ఫరవాలేదు. కానీ దళితులకంటే మా నాయకుడు సమర్థనీయుడంటూ వారి ఆత్మగౌరవాన్ని వారే దిగజార్చుకొంటున్నారు. 

దళిత మంత్రులు, విద్యార్థి నాయకులు మాదిగ ఉద్యమ నాయకుడు మంద కృష్ణపై ప్రతివిమర్షలు చేస్తున్నారు వారు చెప్పేది ఏమిటంటే మందక్రిష్ణ వరంగల్‌ జిల్లాలోని వర్ధన్నపేట రిజర్‌‌వడ్‌ నియోజక వర్గం నుండి పోటీచేసి ప్రజల తిరస్కరణతో ఓడిపోయాడు. అతను మా గురించి మాట్లాడే అర్హత లేదంటున్నారు. ఆ నియోజకవర్గంలో డెబ్బది వేల ఓట్లు మాదిగలవి అయితే మందక్రిష్ణకు 25వేల ఓట్లు ఎలా వస్తాయనేది ప్రతివిమర్శ. తెలంగాణ ప్రభుత్వంలోని దళిత మంత్రులు టి.ఆర్‌.ఎస్‌. పార్టీతో కాకుండా వారివారి నియోజకవర్గాల్లో పోటీచేస్తే డిపాజిట్‌లు గల్లంతవుతాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మల్కాజ్‌గిరి నుండి పోటీచేసిన లోక్‌సత్తా నాయకుడు జయ ప్రకాష్‌ నారాయణ్‌ కూడా ఓడిపోయారు. అయితే ఆయన ఏ రాజకీయ నాయకుని గురించి కానీ మిగతా రాజకీయాల గురించి కానీ మాట్లాడ కూడదా? అదే మల్కాజ్‌గిరి యం.పి. స్థానంలో ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ కూడా పోటీచేసి ఓడిపోయారు. అయితే ఆయన ఏమీ మాటాడకుండా, ఎవరినీ విమర్శించకుండా ఉండాలా? ఇలాంటి ఎంతోమంది మేధావులు, ఉద్యమ కారులు ఎన్నికల్లో ఓడిపోతారు. ఓటమిని గుర్తుచేస్తూ వారిని అవమానిం చేలాగా ప్రతి విమర్శలు చేయడం ఎవరికి సబబుకాదు. దళిత ఆదివాసి ప్రజలకు వ్యతిరేకంగా జరిగే సామాజిక వివక్షతను ప్రశ్నించడానికి ఉద్యమ సంఘాల నాయకులతోపాటు ఆయా ప్రభుత్వాల్లో ఉంటున్న దళితఆదివాసి ప్రజాప్రతినిధులు కలిసి సమిష్టిగా ఉద్యమిస్తేనే ఈ వర్గాలకు విముక్తి లభిస్తుంది. 

న్యాయవాది, హుజురాబాద్‌, 
కరీంనగర్‌ జిల్లా, సెల్‌: 9966677149.

Surya Telugu News Paper Dated: 12.06.2014 

Friday, December 6, 2013

అంబేద్కర్ ఆలోచనలు అనుసరణీయం By దామెర రాజేందర్‌



  డిసెంబర్‌ 6న డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 57వ వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా అంబేద్కర్‌ ఆశయాలు, సిద్ధాంతం, ఆలోచనా విధానం అని మాట్లాడే ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించాల్సిన అవసరముంది. అంబేద్కర్‌ వర్ధంతులు, జయంతుల సందర్భంగా సభలు, సమావేశాలు జరిపి, పూల దండలు వేసి, కొబ్బరికాయలు కొట్టడం, పసందైన ఉపన్యాసాలు చెప్పటం వరకే పరిమితమవుతున్నామా ? అంబేద్కర్‌ను రోల్‌మోడల్‌గా స్వీకరించి ఏ మేరకు ఆచరణాత్మకంగా ఉన్నాం? అని తప్పని సరిగా ఆలోచించాలి. ముఖ్యంగా అంబేద్కర్‌ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడే వారు ఈ ఆలోచన చేయడం అవసరం.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన స్థాపించిన 'పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ' అనే మాట లేకుండా ఏ ఒక్క విద్యార్థీ విద్యావంతుడు కాలేదు. అందుకు అంబేద్కర్‌ చేసిన కృషి అమోఘమైనది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. విద్యకు దూరమవుతున్న అణగారిన వర్గాల ప్రజలకు చదువును అందుబాటులోకి తేవాలని అంబేద్కర్‌ తపనపడ్డాడు. అలాగే విద్యను నిర్ణయిస్తున్న రాజకీయాలేమిటి ? ఎవరు అధికారంలో ఉన్నారు ? వారు ఎవరి ప్రయోజనాల కోసం విద్యా విధానాన్ని, విద్యా వ్యవస్థను నిర్ణయిస్తున్నారు ? అనే విషయాలను కూడా అంబేద్కర్‌ పట్టించుకున్నాడు. అందుకోసం అంబేద్కర్‌ను 'రోల్‌ మోడల్‌'గా స్వీకరించాల్సిన అవసరం ఉంది.
కానీ దురదృష్టకరం ఏంటంటే అంబేద్కర్‌ చెప్పిన దానికి, చేసిన దానికి విరుద్ధమైన పద్ధతులు నేడు కొనసాగుతున్నాయి. జయంతులు, వర్ధంతుల సందర్భంగా కొబ్బరి కాయలు, పూల దండలు, అందమైన మాటలు, వాగ్దానాలు, ప్రతిజ్ఞలతో సరిపెట్టుకునే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.
విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, అంబేద్కరిస్టులు విద్యావ్యవస్థలో వస్తున్న మార్పుల గురించి, విద్యా వ్యవస్థను శాసిస్తున్న రాజకీయాల గురించి ఆలోచించడం లేదు. ఆలోచిస్తున్నట్లు, విద్యావ్యవస్థ బాగు కోసం ఘర్షణ పడుతున్నట్లు ఊహల్లో ఉంటున్నారే తప్ప సరైన విధంగా ఆచరణ లేదు. ఇది చాలా దురదృష్టకరం. విద్యా వ్యవస్థను శాసిస్తున్నదెవరు ? ఆ రాజకీయలేమిటి ? అని తప్పనిసరిగా ఆలోచించాలి. ఎందుకంటే కాలేజీలు, యూనివర్సిటీలను రాజకీయాలే పాలిస్తున్నాయి. ఈ రాజకీయాలను పట్టించుకోకుండా విద్యార్థులుగా బ్రతకలేరు. మనుగడ సాగించలేరు. ఈ సత్యాన్ని గ్రహించకపోవడం నష్టదాయకం. అందువల్ల విద్యార్థులుగా రాజకీయాలను పట్టించుకోవాలి. లేకుంటే చదువుకోవడం, బ్రతకడం కూడా కష్టమేనని గ్రహించాల్సిన అవసరం ఉంది. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో ఉన్నట్లు యావత్తు తలరాతలు మార్చే 'కీ' రాజకీయల్లోనే ఉందని గుర్తెరగాలి. ఈ మధ్యకాలంలో కాకతీయ యూనివర్సిటీలో 'మెస్‌' ప్రైవేటీకరణ జరిగితే వ్యతిరేకించే వారు కొందరైతే మాకెందుకులే అని పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర వహించిన వారు కొందరు. ప్రైవేటీకరణ విద్యార్థులకు నష్టం అని అందరికీ తెలుసు. అయినా రాజకీయ ముసుగులో జరిగిన మెస్‌ ప్రైవేటీకరణను అడ్డుకునే రాజకీయ చైతన్యం విద్యార్థుల్లో, విద్యార్థి సంఘాల్లో కొరవడటం నిజంగా దురదృష్టకరం. విద్యార్థి సంఘాలుగా కొంత ఆందోళన ప్రయత్నం చేసినా కాకతీయ యూనివర్సిటీ పరిపాలన కేంద్ర రాజకీయాలను 'ఢ' కొట్టగలిగే రాజకీయ శక్తి విద్యార్థుల్లో లేకపోయింది. అందుకోసమే విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా ప్రస్తుతం చేస్తున్న రాజకీయాలే రాజకీయాలనుకునే భ్రమల్లోంచి బయటపడాలి. ప్రత్యక్ష రాజకీయాలను ఆలోచించాలి. అందుకోసం అంబేద్కర్‌ పుస్తకాలను, అంబేద్కర్‌ సిద్ధాంతాన్ని పట్టాలి.
'భారతీయ గ్రామాల్లో అందరూ ఒక్కటి కాదు. అవి అగ్రకులాలు, అంటరాని వారు అనే రెండు భాగాలుగా విభజించబడి ఉన్నాయి. అగ్రకులాల వారు పాలకులవుతారు. అంటరాని వారు కేవలం వారికి సేవలు చేసే బానిసలుగా మిగులుతున్నారు' అని అంబేద్కర్‌ అన్నారు. ఇది నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వ్యవస్థ పోవాలి. అందుకు ఎవరు కృషి చేయాలి ? ఎవరు ఏం చేస్తున్నారు ? ఈ వ్యవస్థ ఇలాగే ఉండాలని కోరుకునే అగ్రవర్ణాలు, ఈ హిందూ సమాజాన్ని నిలకడగా ఉంచే అధికార పాలకవర్గాలు ఈ అసమానతలను పోగెట్టేందుకు ఎలాగూ పూనుకోవు. ఎందుకంటే వారి దోపిడీ కొనసాగడం కోసం ఈ వ్యవస్థ ఇలాగే ఉండాలని కోరుకుంటారు కాబట్టి. కానీ అంబేద్కర్‌ వారసులమనుకునే వారు, కుల సంఘాలు, అంబేద్కర్‌ సంఘాలు, కుల నిర్మూలన కోసం ఏర్పడ్డ సంఘాలు, అంబేద్కర్‌ అవార్డు గ్రహీతలు, దళిత మేధావులు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు, కుల నిర్మూలన గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు, దళితుల, అణగారిన వర్గాల రాజ్యాధికారం కోసం ఏర్పడ్డ సంఘాలు, పార్టీలు, ఈ వ్యవస్థ మార్పు కోసం ఆచరణాత్మకంగా చేస్తున్న కృషి ఏమిటి ? అంబేద్కర్‌ మార్గాన్ని ఎంత మేరకు ఆచరిస్తున్నారు ? అని చూసినపుడు అవి అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలను మార్చగలిగే విధంగా లేవు. అంబేద్కర్‌ చెప్పిన స్థితి ఇంకా కొనసాగుతూ ఉండటమే దీనికి కారణం.
'అస్పృశ్యతను పాటించడమంటే మండే బొగ్గును తమ నాలుకల మీద పెట్టుకునేంత అత్యంత ప్రమాదకరమైందని హిందూ సవర్ణులు తెలుసుకునేలా తీవ్రంగా మనం స్పందించాలి' అంటాడు అంబేద్కర్‌'. ఇలాంటి స్పందన నేడు కొరవడింది. ఇలాంటి స్పందన నిజంగానే ఉంటే పరిస్థితులు మరోలా ఉంటాయి. ఒక సిద్ధాంతాన్ని కాని, ఒక ఆలోచనను కాని అది ఎలాంటిదైనప్పటికీ నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్టంగా అన్వయించినప్పుడు వచ్చే ఫలితాలు వేరు. అన్వయిస్తున్నట్లు నటించనప్పుడు వచ్చే ఫలితాలు వేరు. ఆచరణలో పెట్టినప్పుడు వచ్చే ఫలితాలు వేరు. మాటలకే పరిమితమైనప్పుడు వచ్చే ఫలితాలు వేరు. ఇది గ్రహించనంత కాలం ఫలితాలు ఫెయిల్యూర్‌ గానే ఉంటాయి. ముఖ్యంగా ఈ వ్యవస్థ మారాలనుకునే వారు ఆచరణాత్మక కృషి చేసినప్పుడే సరైన ఫలితాలు వస్తాయి.
డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం సాక్షిగా ప్రతిజ్ఞ చేద్దాం. హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం. ప్రజానీకాన్ని నిలువునా ముంచుతున్న ప్రైవేటీకరణ, సరళీకరణ విధానాలపై పోరాడుదాం. సామాజిక అసమానతలపై తిరుగుబాటు చేద్దాం. చట్టాల అమలుకు పోరాడుదాం. 'అడుక్కుంటే వచ్చేది భిక్ష, పోరాడితే వచ్చేది హక్కు'. అందుకోసం 'హక్కులకోసం బిచ్చమెత్తకండి పోరాడి సాధించండి' అన్న ఆయన మాటలను నిజం చేద్దాం. 'మేకల్ని బలి ఇస్తారు కానీ సింహాలను ఇవ్వరు. కాబట్టి సింహాల్లా గర్జించండి' అని ఆయన ఉద్బోధించారు. బోధించు, సమీకరించు, పోరాడు అనే ఆయన నినాదాలను, ఆలోచనా విధానాన్ని ఆచరణలో రుజువు చేస్తూ సామాజిక, వర్గ రహిత సమాజం కోసం ముందుకు సాగినప్పుడే ఆయనకు నిజమైన వారసులమవుతాం. అదే ఆయనకు నిజమైన నివాళి.
(వ్యాసకర్త ఎపి బిల్డింగ్‌ అండ్‌ అదర్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి) 
దామెర రాజేందర్‌

Prajashakti Telugu News Paper Dated: 06/12/2013 

Monday, August 5, 2013

తెలుగు,హిందీ సాహిత్యాలలో బహుజనుల గుండే డప్పు By Surya Special


విశ్వశ్రేయః కావ్యం’ అని సంస్కత నానుడి. మధ్యయుగపు సాహిత్యం రాజుల పోషణలో పెరిగి పెద్దదయింది. అయితే ఆ సాహిత్యం రాజులను, వారి నాయికలను కీర్తించడమే పనిగా సాగింది. కాలక్రమంలో అనేక వాద వివాదాల అనంతరం ‘కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం’ అనే నినాదం ఊపందుకుంది. ప్రజల పక్షం వహించేదే నిజమైన సాహిత్యం. మానవ సంబంధాలు, మానవ విలువలు, వారి అంతులేని కోరికల్ని వ్యక్తపరిచే సాహిత్యమే నేటి వరకు సృష్టి అయ్యింది. కానీ, భారతదేశంలో కులం ప్రభావం పడని సిద్ధాంతం కానీ, ఉద్యమం కానీ నేటి వరకు లేదు. ఈ క్రమంలో స్వాతంత్య్రంకన్నా పూర్వమే వెలువడిన అభ్యుదయ సాహిత్యంలో వర్గదృష్టి కోణంతో అభ్యుదయ కవులు సమాజంలోని అసమానతల్ని రూపుమాపి నవసమాజాన్ని నిర్మించే ఒక కల కన్నారు. దళిత, పీడిత, బాధిత ప్రజల పక్షం వహించి దోపిడీ పూరితమైన వ్యవస్థని వ్యతిరేకించే పనిని వీళ్ళు కొనసాగించారు. కానీ ఈ ఉద్యమానికి కొన్ని పరిమితులున్నాయి.

అన్ని సమస్యలకి ఒకే పరిష్కారాన్ని సూచించే క్రమంలో అభ్యుదయ కవిత్వం ప్రయాణించింది. కనుక భారతీయ పెట్టుబడిదారీ వ్యవస్థలో దళితులపై కుల పరంగా జరుగుతున్న అంతులేని అమానవీయ అత్యాచారాలకి, దోపిడీకి గల మూలకారణాల్ని కనుక్కోవడంలో ఈ కవులు విఫలమయ్యారు. నేటికీ రాజ్యాన్ని, దాని వెనుకనున్న కులవ్యవస్థని వ్యతిరేకించే బలమైన గొంతులు వినిపిస్తున్నాయంటే- అవి ఖచ్చితంగా దళిత బహుజనులవే! ఎవరైతే అసమానతల నిచ్చెన మెట్ల కులవ్యవస్థను నిర్మించారో వారే దానిపోషణకి దర్శనాలు, శాస్త్రాలు, పురాణాలు, చరిత్రలలో సృష్టించారు.స్వాతంత్య్రానంతర తెలుగు- హిందీ కవిత్వంలో దళితుల మూలాలు, అస్తిత్వాన్ని వెదుక్కొనే కవిత్వం వెలువడింది. ఈ కవిత్వం సామాజిక జీవితంలోని ఘోరమైన అమానవీయతని అక్షరబద్ధం చేసింది. ఈ కవిత్వం ‘మానవ విముక్తి’ కవిత్వం. ఈ కవిత్వం అకస్మాత్తుగా ఊడిపడింది కాదు.

అవసరంలోంచి, అనుభవంలోంచి వచ్చింది. దీనిలోని ప్రతి అక్షరం దళితుల రక్తం, చెమటతో తడిసి అభివ్యక్తికి ఒక సార్ధకతని, బలాన్ని, వ్యవహారికతని ప్రసాదించింది. భారతీయ సాహిత్యంలో మొదటిసారిగా దళితసాహిత్యానికి స్థానం కల్పించింది మరాఠీ దళిత రచయితలు.
తెలుగు దళిత సాహిత్యంతెలుగులో దళిత కవిత్వానికి ఆద్యుడు జాషువా. ఆయన రాసిన ‘గబ్బిలం’ తొలి తెలుగు దళిత కావ్యం. తరువాత జాలా రంగకవి, కుసుమ ధర్మన్న, బోయి భీమన్న, జ్ఞానానంద కవి దళిత కవిత్వం వ్రాశారు. తెలుగులో దళిత సాహిత్యోద్యమం కొత్త దళిత కవులను, పాఠకులను అందించింది. 1980ల తర్వాత తెలుగు సాహిత్యంలో దళిత స్పహ బలంగా వేళ్ళూనుకొని నేడు తెలుగు సాహిత్యంలో ప్రధాన స్రవంతి అయింది. సంకలనాల కెక్కని వందలాదిమంది దళిత కవులు, దళిత కవిత్వాన్ని ఒక చారిత్రక అవసరంగా రాస్తున్నారు. దళిత కవిత్వంలో విశేషాంశం- చరిత్రను అధ్యయనంచేసి అందులోని లోటును ఎత్తిచూపుతూ కవిత్వం రాయడం. హిందూమతం అతి పవిత్రంగా చూసుకునే మనుధర్మం, వేదాలు- అవి నిర్మించిన వృత్తి కులాల నుండి వర్ణవ్యవస్థ ఆవిర్భావం- వీటన్నింటిలో ఉన్న చారిత్రక కుట్రని దళిత కవి బట్టబయలు చేస్తున్నాడు.

నిశాని, బహువచనం, చిక్కనవుతున్న పాట, పదునెక్కిన పాట, గుండెడప్పు, మాదిగ చైతన్యం, జిహాద్‌, మేమే చిత్తరువు, దండోరా వంటి కవితా సంకలనాలు, బొజ్జాతారకం - నది పుట్టిన గొంతుక; శిఖామణి- కిర్రు చెప్పుల భాష; ఎండ్లూరి సుధాకర్‌- వర్తమానం, వర్గీకరణీయం; సతీష్‌చందర్‌- పంచమ వేదం, ఆదిపర్వం; జూలూరి గౌరీశంకర్‌- పాదముద్ర, పొలికట్టె, మాలకాకి; చిన్ని- వొళ్ళు కడుక్కొందాం రండి; మద్దూరి నగేష్‌బాబు- వెలివాడ, రచ్చబండ; కత్తిపద్మారావు- నల్లకలువ, కట్టెలమోపు, భూమిభాష; సుంకర రమేష్‌ - తల్లికోడి హెచ్చరిక; ఖాదర్‌ మొహియుద్దీన్‌- పట్టుమచ్చ; నాగప్పగారి సుందరరాజు- చంఢాల చాటింపు; పైడి తెరేష్‌బాబు- అల్పపీడనం, హిందూమహాసముద్రం, నేనూ నా వింతలమారి ప్రపంచం; జి.వి. రత్నాకర్‌- మట్టిపలక, అట్లేటి అల; చల్లపల్లి స్వరూపరాణి- మంకెనపూవు; గూటం స్వామి- ఏకీకరణీయం, నల్లతుమ్మ కవితా సంపుటాలు వచ్చాయి. గుండెడప్పు కనకయ్య- కడుపుమీద కొట్టకుండ్రి, దార్ల వెంకటేశ్వరరావు- దళిత తాత్త్వికుడు; కోయి కోటేశ్వరరావు, వినోదిని, గోగు శ్యామల, జల్లి ఇందిర, జూపాక సుభద్ర, జిలకర శ్రీనివాస్‌- వంటి అనేకమంది దళిత కవిత్వం వ్రాశారు.
హిందీ దళిత కవిత్వం

హిందీ దళితకవులు- ఓం ప్రకాష్‌ వాల్మీకి, ఓం ప్రకాష్‌ మెహరా, వీరాపరమార్‌, రమణికాగుప్త, హేమంత్‌ ప్రసాద్‌ దీక్షిత్‌ రామ్‌లఖన్‌ పాల్‌, డా యన్‌. సింగ్‌, దయానంద్‌ బటోహి, కంవల్‌ భారతి, జయప్రకాష్‌ కర్దమ్‌, సూరజ్‌పాల్‌, డా ప్రేమ్‌ శంకర్‌, సూరజ్‌పాల్‌ చౌహాన్‌, ఠాకూర్‌ వాస్‌ సిద్ద్‌, కుసుమ్‌ మేఘవాల్‌, భగీరధ మేఘవాల్‌, ఎన్‌.ఆర్‌. సాగర్‌, సి.వి. భారతి, రామ్‌భరత్‌ పాసీ, నిశాంత్‌ శరద్‌ కోకాస్‌, రవీంద్రభారతి, మోహన్‌దాస్‌ నైమిశ్‌రాయ్‌, లాల్‌చందరాహే- దళిత కవిత్వాన్ని సష్టించారు. ఓంప్రకాష్‌ వాల్మీకి- నదియోంకా సంతాప్‌, బస్స్‌ బహుత్‌ హో చుకా, జయప్రకాష్‌- కర్దమ్‌- మైం గూంగా నహీథా, సుశీలాటాక్‌ భౌరే- హమారే హిస్సేకా సూరజ్‌ పేర్కొనదగిన కవితా సంపుటాలు. యుద్ధరత్‌ ఆమ్‌ ఆద్మీకా దళిత్‌ చేతన పేరుతో రమణికాగుప్త ప్రచురించిన కవితా సంకలనం అమూల్యమైనది.అంబేడ్కర్‌ ‘పులుల్లాగా బ్రతకండి. మేకల్లా బ్రతికారంటే పులులు మిమ్మల్నే తినేస్తాయి’ అని అంటారు. 

‘తరతరాలుగా ఎవరైతే అంటరానితనానికి, అవమానాలకి గురై బ్రతుకుతున్నారో వాళ్ళే దళితులు’ అని సిద్ధాంతీకరించారు. దళిత అంటే- అణచివేతకు గురైన, అణగదొక్కిన, చీల్చిన అని అర్థం. దళిత సాహిత్యం ‘దళితుల విముక్తికోసం దళిత రచయితలద్వారా దళితుల గురించి రాసిన సాహిత్యం’ అని ప్రసిద్ధ హిందీ సిద్ధాంతకారుడు గజానన్‌ చాహ్వాన్‌ తెలియపరచారు.
దళిత సాహిత్యం శక్తి ‘కళ కాదు సత్యం’, దళిత సాహిత్యం దళితుల కోసమే కాదు సమాజం మొత్తం కోసం. దళిత, దళితేతర విప్లవవాద కవుల లక్ష్యం ఒకటే- దళిత కవులు కులవ్యవస్థని అంతం చేయాలనుకుంటారు, విప్లవవాద కవులు వర్గాన్ని అంతం చేయాలనుకుంటారు.
తెలుగు, హిందీ కవిత్వ ప్రస్థానం

కుల నిర్మూలన, అంటరానితనాన్ని తొలగించడం, పీడితుల్లోని కులభేదాల నివారణ, సామాజిక విప్లవంకోసం పీడిత వర్గాలమధ్య ఉన్న అంతరాల్ని తొలగించడం, దళితులకు నాగరిత, పౌరహక్కులు సాధించడం మొదలైనవి దళిత ఉద్యమ కర్తవ్యాలుగా ఆంధ్రప్రాంతంలో దళిత మహాసభ మొదలైంది. ఇదేవిధంగా భారతదేశంలో జ్యోతిబా ఫూలే, అంబేడ్కర్‌ జీవనపోరాటాల ఫలితంగా దళిత, బహుజన చైతన్యం ఆవిర్భవించింది. వీరి ఆత్మాభిమాన పోరాటం రాజ్యాధికారం వైపు సాగుతోంది. స్వయంగా తాము అనుభవిస్తున్న బాధల్ని దుఃఖాన్ని అభివ్యక్తీకరించేందుకు ఆరాటప డుతుతోంది. తెలుగు దళిత కవి కలేకూరి ప్రసాద్‌ ‘పిడికెడు ఆత్మగౌరవం’ కవితలో- ‘తరతరాలుగా/ స్వతంత్ర దేశంలో/ అస్వతంత్రుణ్ణి/ అవమానాలకూ/ అత్యాచారాలకు/ మానభంగాలకూ/ చిత్రహింసలకు గురై/ పిడికెడు ఆత్మగౌరవం కోసం/ తలెత్తిన వాణ్ణి’ (చిక్కనవుతున్న పాట).మార్క్‌‌స, అంబేడ్కర్‌ ఆలోచనా విధానంలో తేడాలు మనకి కనిపిస్తాయి.

కులవృత్తులను బట్టే కులాలు వచ్చాయి అని మార్క్సిజం చెప్తుంటే, అసలు కులవ్యవస్థపైనే శ్రమ విభజన జరిగింది అని అంబేడ్కరిజం చెప్తుంది. ప్రముఖ హిందీ దళిత కవి ఓం ప్రకాష్‌ మెహరా ‘ఆకాశం’ కవితలో- ‘నీ అంత ఎత్తు ఎదుగుతానని అనలేదు/ నువ్వు నాకు కావాలి అని అనలేదు/ ఓమూల తల దాచుకునేందుకు ఇంటికప్పును అడిగాను/ నీ గొప్పదనాన్ని అడగలేదు గుండె ధైర్యాన్ని అడగలేదు/ విశాలమైన నీ వల్లకాటిని అడగలేదు/ నన్ను పాతుకొనేందుకు రెండు గజాల నేలని అడిగాను’. ‘ఓ ఆకశమా! ఓ నేలా! ఓ గాలీ! ఓ పైరూ/ ఓ సీతాకోకచిలుకా/ మిమ్మల్ని నిలేసి అడుగుతున్నాను/ నా అవసరాలకి తగినట్లు నేల/ ఊపిరి నిలుపుకొనే గాలి, తాగేందుకు నీళ్ళు/ కొంచెం రంగు నా బతుకులో ఎందుకు కోరుకోకూడదు’ (యుద్ధ్‌ రత్‌ ఆమ్‌ ఆద్మీకా దళిత్‌ చేతన).

‘ఇనుప పాళీలు మొలుచుకొస్తున్నాయి’ కవితలో శిఖామణి ఇలా అంటున్నారు-‘ నేర్పని విద్యకు గురుదక్షిణ కోరిన/ మా బొటనవేళ్ళ స్ధానంలో ఇనుప పాళీలు మొలుచుకొస్తున్నాయి/ అవి చరిత్రను తప్పక తిరగ రాస్తాయి’ (పదునెక్కిన పాట). దళిత చైతన్యంలో భాగంగా దళితులు ప్రశ్నించడం మొదలైంది. తెలుగు దళితకవి జి.వి. రత్నాకర్‌ ‘మాలో పుట్టాల్సిందే’ కవితలో...‘నీవెంత ఉదార సంద్రానివైనా/ నేను చచ్చి బతికే మురికి కాలవనే/ నీ అరికాళ్ళ దుమ్ము ముఖాన/ పూసుకునే మంగలి కత్తిని/ మట్టిని తడిసిన నా చెమటే/ నీవు తాగే కొత్త కుండన ఒడుస్తుంది/ ఈ దేశపు జండాపై నీవు కార్చిన/ చీము నెత్తుటి మరకల్ని తొలగించి/ ఎర్రదానికి నిండు దనాన్నిచ్చే/ నల్లటి చాకలి బండని/ మా కసి, కోత మీ కర్థం/ కావాలంటే మాలో పుట్టాల్సిందే’ (మట్టిపలక). అదేవిధంగా దళిత చైతన్యంలో భాగంగా ‘నా రోడ్డుమీద కవిత’లో గుండె డప్పు కనకయ్య అగ్రవర్ణ హైందవ భావజాలాన్ని నిలేసి ప్రశ్నిస్తూ -‘ చీకటంట భయపడే మీరు/ అస్తమానం అంధకారంలో జీవించే నాపై/ సిద్ధాంతాల వెలుగులు విరజిమ్మాలని చూస్తారు...... అందుకే నేనింక రోడ్డు వెయ్యదల్చుకోలేదు/ రోడ్డుని బ్లాస్ట్‌ చెయ్యదల్చుకున్నాను’ (గుండెడప్పు) అంటున్నాడు.


హిందీ దళితకవి ఎన్‌.ఆర్‌. సాగర్‌ మనువాద సంస్కతిని తన ‘నీకప్పుడేమనిపిస్తోంది’ కవితలో ఇలా ప్రశ్నిస్తున్నాడు- ‘ఒళ్ళు కాలే ఎండలో/ కుండపోత వానలో/ పిక్కలు వణికే చలిలో/ ఏ ఆధారం లేని అభయం పొందమంటే/ నీ కప్పుడేమనిపిస్తోంది/ నీ కుట్రకు నిలయమైన/ గుళ్ళు గోపురాలను దుమ్ము ధూళిలో నింపేసి/ నీ ధర్మ గ్రంథాలను కాల్చేస్తే/ నీకప్పుడే మనిపిస్తోంది/ ఊరికి వాడకి దూరంగా/ చెత్తకుప్పల దగ్గర స్మశానాల దగ్గరగా/ నిన్ను కట్టేస్తే నీకేమనిపిస్తుంది’ (యుద్ధరత్‌ ఆమ్‌ఆద్మీ కా దళిత్‌చేతన). పీడిత కులాలని మనుషులుగా గుర్తించ నిరాకరించింది మనువాదం. చివరికి పిడికెడు మెతుకులు నోచుకోడానికి కూడా నిరాకరిస్తుంది కులవ్యవస్థ. సాంఘిక గౌరవాన్ని నిరాకరించడమే కాకుండా, దళితులు సంపాదించుకునే మార్గాలను కూడా త్రొక్కి పెడుతుంది హిందూ వ్యవస్థ.తెలుగు దళిత కవి కోయి కోటేశ్వరరావు తన ‘నర్తనశాల’ కవితలో ఇలా అంటున్నారు- ‘అందుకే ఇక నేను చావదలుచుకోలేదు.../ పెద్దపులులతోనైనా పెనుగులాడి బతుకుతాను .../ కకావికలమైన నా మాంసపు ముద్దల మీద/ మారణాయుధాల్ని పూయించి/ కామ కీచకుల మగతనాన్ని తెగ నరకటానికి/ ఇప్పుడు నేనే నర్తనశాలకు నడిచివెళతాను...’ (సెంట్రల్‌ యూనివర్శిటీ కవిత). 

చల్లపల్లి స్వరూపరాణి ‘మంకెన పువ్వు’ కవితలో ఇలా అంటున్నారు- ‘ఇంట్లో పురుషాహంకారం/ ఒక చెంప చెళ్ళుమనిపిస్తే/ వీధిలో కులాధిపత్యం/ రెండో చెంప పగలగొడ్తుంది’ (గుండెడప్పు). దీనికి పునాదిగా బుద్ధుని ‘అత్తదీపోభవ’ అనే భావన ‘సత్యాన్ని సత్యంగా తెలుసుకో’ అనే సందేశం ఉంది. ఫూలే చెప్పినట్లుగా ‘బూడిదకి మాత్రమే కాలినప్పటి అనుభవం తెలుస్తుంది’ అనే భావన ‘ఎవరైతే అనుభవిస్తారో వారికే పూర్తి సత్యం తెలుస్తుంది’. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లే సత్యాన్ని చెప్పగలుగుతారు. అంబేడ్కర్‌ బోధించిన, బోధించు! పోరాడు!! సమీకరించు!!! అనే చైతన్యం దళిత కవిత్వంలో ఉన్నాయి.ఆర్థికేతర, వర్గేతర అంశాల్ని విప్లవ కవిత్వం పట్టించుకోనట్లే కులమతేతర అంశాల్ని దళిత కవులు పట్టించుకోవడం లేదు.
-తిొొ .ు. టభీశైభథట్గ


Surya Telugu News Paper Dated : 05/08/2013 

Sunday, May 12, 2013

దళిత సమస్యల్లో కార్యాచరణకే ప్రాధాన్యత ---తమ్మినేని వీరభద్రం


  Sun, 12 May 2013, IST  

దళితుల విషయంలో ఈ చట్టంగానీ, రిజర్వేషన్లుగానీ కొన్ని సౌకర్యాలో, కొద్ది సంపదలో ఇవ్వచ్చేమోగానీ మూల సమస్య మాత్రం పరిష్కారం కాదు. సాటి పౌరులందరితో సమానత్వం సాధించటం, ఆత్మగౌరవంతో జీవించటం అనేది అతిముఖ్య విషయం. ఇందుకు కులవివక్షను, కులాన్ని నిర్మూలించే ఉద్యమాలూ, కార్యక్రమాలూ, కృషీ ఎంత ఎక్కువగా సాగించగలిగితే అంత వేగంగా లక్ష్యానికి దగ్గరవుతాము. మన రాష్ట్రంలో ఆ ఉద్యమాలు ఇంకా జరగాల్సినంత విస్తృతంగా, ఉధృతంగా జరగటం లేదు.
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టంలో ఇంకా కొన్ని లొసుగులూ, లోపాలూ ఉన్నా మొత్తంగా చూస్తే ఇది అందరూ హర్షించాల్సిన, ఆహ్వానించాల్సిన శాసనం. ఎన్నో ఏళ్ళుగా ఈ చట్టం కోసం రాష్ట్రంలో జరిగిన కృషీ, పోరాటాలూ ఈ విధంగా ఫలించాయని చెప్పవచ్చు.
అయితే ముఖ్యమంత్రి ఈ చట్టం తానే తెచ్చానని (కనీసం కాంగ్రెస్‌ పార్టీ కూడా కాదట), ప్రతిపక్షాలన్నీ దీన్ని వ్యతిరేకించాయని 'నోటి గద్దరితనం' ప్రదర్శిస్తున్నారు. ఇటీవల రాజమండ్రి సభలో 'దళిత బంధు' అనే బిరుదు కూడా ఇప్పించుకున్నారు. మన ముఖ్యమంత్రికి దళితులపై అంత ప్రేమ నిజంగానే ఉంటే ఇతర సమస్యలన్నీ అలా ఉంచినా, కనీసం రాష్ట్రంలో ఎస్‌సి కమిషన్‌కు ఏళ్ళ తరబడి ఛైర్మన్‌ లేకుండా ఉంటాడా? దళితుల సమస్యల పరిష్కారానికి కొంతైనా ఉపకరించే అలాంటి ముఖ్యమైన పదవికి ఇన్నేళ్లూ ఎవరినీ ఎందుకని నియమించలేదు? ఈ కమిషన్‌కు మొదటి ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ పున్నయ్య తరువాత ఒక కాంగ్రెస్‌వాదిని ఛైర్మన్‌గా నియమించారు. ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేయటంతో ఏర్పడిన ఖాళీని ఇక ఇంతవరకూ పూరించనే లేదు. పోనీ కావాలనుకుంటే మరో కాంగ్రెస్‌ మనిషినే మళ్లీ నియమించుకోవచ్చు కదా? ఆ మాత్రం సరుకున్న మనిషి కాంగ్రెస్‌లో లేడని ముఖ్యమంత్రి అభిప్రాయమా? తెనాలిలో దళిత మహిళపై అఘాయిత్యం జరిగితే, లక్ష్మింపేటలో దళితులను ఊచకోత కోస్తే, ఎక్కడి నుంచో జాతీయ కమిషన్‌ వాళ్లు రావాల్సి వచ్చింది కదా? అదే మన కమిషన్‌కు ఛైర్మన్‌ ఉంటే ఇలాంటి ఘటనలపై స్పందించే అవకాశం ఉండేది కాదా? ఈ మాత్రం ఇంగితం లేని మన ప్రభుత్వమూ, ముఖ్యమంత్రి 'దళిత బంధు' లవుతారా? లేక అలాంటి హక్కులు దళితులకు దక్కటం సహించలేని అగ్రకుల మద్దతుదార్లవుతారా?
ముఖ్యమంత్రి వాచాలత్వం ఎలా ఉన్నా 'మా కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఈ చట్టం తెచ్చిందనటం వాస్తవమే కదా?' అని ఈ మధ్య ఓ కాంగ్రెస్‌ మిత్రుడు నన్ను ప్రశ్నించారు. ఇలాంటిదే ఒక సందర్భం నేను శాసనసభ్యుడిగా ఉన్నపుడు సభలోనే నాకు ఎదురైంది. ఆరోజు మన రాష్ట్రంలో వచ్చిన వివిధ భూ చట్టాల గురించి నేను సభలో ఉపన్యసిస్తూ.. 'ఈ చట్టాలన్నీ ప్రజా పోరాటాల వల్లే వచ్చాయని' నేనన్న మాటకు కాంగ్రెస్‌ సభ్యులు ఒక్కుమ్మడిగా అడ్డు తగిలారు. 'కాదు, కాదు.. ఈ చట్టాలన్నీ మా కాంగ్రెస్‌ ప్రభుత్వాలే తెచ్చాయి' అన్నారు. అపుడు నేనడిగాను ... మరి మన దేశానికి స్వాతంత్య్రం తెచ్చిందెవరు? .. అని. కాంగ్రెస్‌ బల్లల వైపు నుంచి 'మా కాంగ్రెస్సే కదా' అని సమాధానం వచ్చింది. అపుడు నేనేమన్నానంటే .. 'అదెలా కుదురుతుంది? కాంగ్రెస్సో, కమ్యూనిస్టులో.. గాంధీయో, ఒక సుందరయ్యో, అల్లూరి సీతారామరాజో, భగత్‌ సింగో వీళ్లంతా స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్లు తప్ప ఇచ్చిన వాళ్లు కాదు గదా? స్వాతంత్య్రం ఇచ్చిన వాళ్లంటే .. మరి మీ లెక్క ప్రకారం బ్రిటిష్‌వాళ్లు అవుతారు గదా? అలా కాదంటే 'స్వాతంత్య్రం రావటానికి పోరాడిన వాళ్లే కారణంగా ఎలా అయితే చెబుతామో, అలాగే భూ చట్టాల కోసం జరిగిన పోరాటాలే ఆ చట్టాలు రావటానికి కారణం అని చెప్పటం సరైంది కాదా?' అని ప్రశ్నించే సరికి కాంగ్రెస్‌ పెద్దలందరికీ నోళ్లుమూతబడిపోయాయి. ఎక్కడివాళ్లు అక్కడ కూర్చుండిపోయారు. అందువల్ల ఎవరు ఎన్ని వాదాలు చేసినా, వాక్చాతుర్యాలు ప్రదర్శించినా ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ చట్టం కోసం అనేక సంవత్సరాలుగా సిపియం, ఇతర వామపక్షాలు, దళిత సంఘాలు, ఇతర ప్రజాస్వామికవాదులు సాగించిన కృషి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ విషయంలో ప్రత్యేక చొరవ ప్రదర్శించిన వాడిగా సిపియం కార్యదర్శి రాఘవులును అనేక మంది ప్రముఖులు ప్రశంసిస్తుంటారు కూడా. ఈ పోరాటాలకు విశాలమైన మద్దతు కూడా లభించిన మాట కూడా నిజం. మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా వివిధ సందర్భాలలో తమ సంఘీభావం (ఇలాంటి చట్టం వారికి ఇష్టమున్నా, లేకపోయినా) ప్రకటించాయి. అలాగే చివరి రోజులలో కాంగ్రెస్‌లోనే ఉన్న దళిత మంత్రులంతా - ఉప ముఖ్యమంత్రి రాజనర్సింహ ప్రభృతులు కూడా ఈ ఉద్యమ డిమాండ్‌ పట్ల సానుకూలత ప్రదర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఈ ఒత్తిడి అంతా పనిచేసిన మాట వాస్తవం. ఆ విధంగా ఈ చట్ట సాధనలో అనేక మంది తమ, తమ పాత్రలు పోషించారనే చెప్పాలి.
అలాగే ఈ చట్టానికి పాత చరిత్ర కూడా జోడించాల్సి ఉంటుంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఉండగా కుల వివక్ష రాష్ట్రంలో ఏ మోతాదులో ఉందో కెవిపియస్‌ రాష్ట్రమంతా సర్వే చేసింది. ఎన్నెన్ని వికృత రూపాలలో ఇంకా వివక్ష సాగుతోందో సోదాహరణంగా నిరూపించింది. మరింత లోతైన అధ్యయనం కోసం కమిషన్‌ వేయాలని ప్రభుత్వంపై అనేక రూపాల్లో ఒత్తిడి చేసిన ఫలితంగా 'పున్నయ్య కమిషన్‌' ఏర్పడింది. ఆయన అపార కృషితో వివక్ష విరాట్‌ స్వరూపం వెలుగులోకొచ్చింది. ఆ తర్వాత మరిన్ని పోరాటాలతో కమిషన్‌ ఏర్పడి ఆ పున్నయ్యగారే ఛైర్మన్‌గా నియమించబడ్డారు. ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌లో నిధులు ఎస్‌సి, ఎస్‌టిలకు కేటాయింపు జరపాలనే నిబంధనను అమలు జరపకపోవటంపై ఉద్యమం కేంద్రీకరించబడింది. ఆ నిధులు రకరకాలుగా ఎలా దుర్వినియోగం జరిగాయో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిబంధనలకు బదులుగా ఆ నిధుల ఖర్చు అనివార్యం చేసే విధంగా చట్టం కావాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. ఈ చట్ట సాధనకు అన్ని జిల్లాలలోనూ, రాష్ట్ర రాజధానిలోనూ ఎన్నో పోరాటాలు కెవిపియస్‌, సిపియం, వామపక్షాల ఆధ్వర్యంలో దళిత సంఘాల సహకారంతో జరిగాయి. అన్ని సంఘాల ఐక్య కార్యాచరణకు కాకి మాధవరావు లాంటి ప్రముఖుడు నాయకత్వం వహించారు. ఈ పోరాటంలో భాగంగానే ఖమ్మం జిల్లాలో 76 రోజుల 'దళితవాడల సైకిల్‌ యాత్ర' జరిపాము. ఆ యాత్రను మాధవరావుగారే సైకిలు తొక్కి ప్రారంభించారు. నేడు ఈ చరిత్రంతా చెరిపేసి పుణ్యం అంతా తమ ఖాతాలోనే వేసుకోవాలని ఎవరు అనుకున్నా అది వృథా ప్రయాసే అవుతుంది. అందువల్ల ఈ చట్టానికి తల్లెవరు? తండ్రెవరు? అనే పంచాయితీ కంటే దాని ఆలనా, పాలనా చూడటానికి ప్రభుత్వ పెద్దలు శ్రద్ధ చూపితే బావుంటుంది. అంటే ఆ చట్టం అమలులో తమ చిత్తశుద్ధిని చూపిస్తే బావుంటుంది.
ఇక 'ఇల్లు అలకగానే పండుగ కాద'న్నట్లు ఈ చట్టం రాగానే బడ్జెట్లలో కేటాయింపులన్నీ సక్రమంగానే జరిగిపోతాయని, ఆ నిధుల ఖర్చుతో ఇక దళిత పేటలు వెలిగిపోతాయనీ ఎవరైనా అనుకుంటే అది అత్యాశే అవుతుంది. ఎందుకంటే అంటరానితనం నేరం అనే చట్టం వచ్చి చాలా ఏళ్లయింది. అయినా ఇప్పటికీ ఆ దురాచారం విస్తృత ప్రాంతంలో కొనసాగుతూనే ఉంది. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం, వరకట్న నిషేధం లాంటి చట్టాలున్నప్పటికీ వాటి అమలు ఎలా ఉందో కూడా మనందరికీ తెలుసు. ఇలాంటివే ఇంకెన్నో చట్టాలు అమలుకు నోచుకోవటం లేదు. అందువల్ల పాలక వర్గాలు తమ ఇష్టపూర్తిగా, తమ లాభాల కోసం తెచ్చే చట్టాలను అమలు జరిపినంత వేగంగా, నమ్మకంగా ఇలాంటి చట్టాలను (ప్రజల ఒత్తిడి వల్ల తప్పనిసరై తెచ్చినవి) అమలు జరపవనేది మనకు చరిత్ర చెబుతున్న సత్యం. అందువల్ల సబ్‌ప్లాన్‌ చట్టం సాధించటానికి పోరాడిన శక్తులన్నీ దాని అమలు కోసం కూడా నిరంతరం శ్రమించాల్సి ఉంటుందనటంలో ఎలాంటి సందేహానికీ ఆస్కారం లేదు.
అలాగే ఈ చట్టంగానీ, రిజర్వేషన్లుగానీ దళితుల విషయంలో కొన్ని సౌకర్యాలో, కొద్ది సంపదలో ఇవ్వచ్చేమోగానీ మూల సమస్య మాత్రం పరిష్కారం కాదు. సాటి పౌరులందరితో సమానత్వం సాధించటం, ఆత్మగౌరవంతో జీవించటం అనేది అతిముఖ్య విషయం. ఇందుకు కులవివక్షను, కులాన్ని నిర్మూలించే ఉద్యమాలూ, కార్యక్రమాలూ, కృషీ ఎంత ఎక్కువగా సాగించగలిగితే అంత వేగంగా లక్ష్యానికి దగ్గరవుతాము. మన రాష్ట్రంలో ఆ ఉద్యమాలు ఇంకా జరగాల్సినంత విస్తృతంగా, ఉధృతంగా జరగటం లేదు. అందుకు బహుశా మూడు కారణాలున్నాయనిపిస్తోంది.
మొదటిదేమంటే అంటరానితనమూ, కులవివక్షా కేవలం దళితులు బాధపడే సమస్యగానూ, దాని పరిష్కారం అంటే వారిని ఉద్ధరించటం కోసం మాత్రమే అన్నట్లుగా చూడబడుతోంది. అలా చూడటం ఈ సమస్యలో ఒక పరిమిత కోణం మాత్రమే అవుతుంది. అంటరానితనం, కులవివక్ష పోవాలనటం దళితుల కోసం మాత్రమే కాదు. వారిపై జాలితోనో, మానవత్వంతోనో మాత్రమే కాదు. ఈ సమస్యను అలా పరిమితం చేయటం సరైంది కూడా కాదు. ఈ సమస్య మన దేశ నాగరికతకు, ఆధునికతకు సంబంధించిన విషయంగా కూడా చూడాలి. మనం నాగరిక దేశంగా ప్రపంచం ముందు నిలవాలంటే, అంతకంటే మించి మన ఉత్పత్తిలో అగ్రదేశాల సరసకు చేరాలంటే మన పౌరులందరూ సమాన గౌరవం పొందగలగాలి. ముఖ్యంగా 'శ్రమ' గౌరవించబడాలి. ఉత్పత్తిదారులైన శ్రామికులు ఆ స్థితి నుంచి స్ఫూర్తిని పొందాలి. మన దేశ శ్రామికులలో అత్యధికులైన దళితులను అంటరాని వారుగా, తక్కువ కులం వారుగా హీనంగా చూసినంత కాలం, శ్రమ అంటే బ్రతుకు తెరువు కోసం చేసే నీచమైన పనిగా భావించినంత కాలం మన దేశం ఆ స్థానాన్ని పొందటం అసాధ్యమే కాదు, అసంభవం కూడా. అందువల్ల ఈ సమస్య దళితుల సమస్య మాత్రమే కానే కాదు. కొందరు దళిత నాయకులు భావిస్తున్నట్లుగా దళితుల సమస్యలపై దళితులే పోరాడాలి అనుకోవటం కూడా ఎలా తప్పో ఈ అవగాహనలోంచి మనం చూడాలి. అందువల్ల ఈ సమస్య దేశాభివృద్ధికి సంబంధించిన ముఖ్య సమస్యగా మనం గ్రహించాల్సి ఉంటుంది.
రెండవదేమంటే ఈ సమస్య ప్రాధాన్యత గుర్తించిన వారు కూడా 'పండిత' చర్చలకు పరిమితం కావటం, ఆచరణకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం ఒక ముఖ్య ఆటంకంగా మారింది. అలా కాకుండా 'ఆచరణ'కు ప్రాధాన్యత ఇవ్వటం నేటి అవసరంగా ఉంది. అంటరానితనం, కులవివక్ష, కుల నిర్మూలన సమస్య వచ్చేప్పటికి కులం ముఖ్యమైందా? వర్గం ముఖ్యమైందా? దేనిపై ముందు పోరాడాలి? కులం మూలం ఎక్కడుంది? మతంలో ఉందా లేక ఇంకెక్కడైనా ఉందా? మతం పోకుండా కులం పోతుందా? ఏది మూలం? ఈ సమస్యలపై ఎవరేం చెప్పారు? కులం పోకుండా వివక్షత పోతుందా? ఇలాంటి ప్రశ్నలన్నింటిపైనా ఏళ్ళ తరబడి చర్చలు, వాదవివాదాలు సాగుతూ వస్తున్నాయి. ఈ చర్చ సాగించటంలో తప్పేమీ లేదు. పైగా ఇలాంటి చర్చ కూడా సమస్యలపై సరైన అవగాహన కోసం తప్పకుండా అవసరమే. అయితే చర్చోపచర్చలకే పరిమితం కావటం, ఆచరణకు తగు ప్రాధాన్యత ఇవ్వకపోవటం ప్రధాన లోపంగా ఉంది. ఏది ముందైనా, వెనకైనా ఆ చర్చల మంచిచెడుల సంగతెలా ఉన్నా, అంటరానితనం, కులవివక్ష యొక్క వివిధ దుష్ట రూపాలు తక్షణం ఎదిరించి పోరాడాల్సిన ఆచరణాత్మక సమస్యలుగా ఉన్నాయనే దాంట్లో ఎవరికీ సందేహం ఉండనక్కర్లేదు. అయినపుడు ఆ సమస్యలపైనే ఉమ్మడిగా కార్యక్రమాలు, కార్యాచరణలు, పోరాటాలు సాగించటానికి ఇబ్బందేమి ఉంటుంది? ఇది ఈ ఉద్యమ శ్రేయోభిలాషులందరూ తప్పకుండా తక్షణమే దృష్టి పెట్టాల్సిన అంశం కాదా?
ఇక మూడో విషయమేమంటే ఈ సమస్యలపై అంతో, ఇంతో ఆచరణ సాగిస్తున్న దళిత సంఘాలూ, కమ్యూనిస్టులూ పరస్పరం అనుమానంతో చూసుకోవటం, విమర్శించుకోవటం జరుగుతోంది. కమ్యూనిస్టులు కొన్ని కార్యక్రమాలు చేస్తే కూడా 'వీరికి ఇపుడు గుర్తొచ్చాయా? ఇప్పటిదాకా ఏం చేశారు. ఇపుడైనా దేనికోసం చేస్తున్నారు? లాంటి విమర్శలు కూడా కొన్ని ముందుకు రావటం మనం చూస్తున్నాం. దళితులను అస్తమానం వేధించే శక్తుల గురించి పల్లెత్తు మాట అనకుండా కమ్యూనిస్టులు ఇంకా సరిగా ఎందుకు చేయలేదు? అనే లాంటి విమర్శలు ఎవరికి మేలు చేస్తాయో మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల దళితులు, గిరిజనుల కోసం మరింత చురుకైన కార్యాచరణ కార్యరూపం దాల్చాలంటే ఈ సంఘాల మధ్య, కమ్యూనిస్టు పార్టీల మధ్య మరింత సయోధ్య అవసరం. రాజకీయ విషయాల్లో, ఇంకా ఇతర కొన్ని సమస్యలు, డిమాండ్ల విషయాలలో వీరి మధ్య సఖ్యత అప్పుడే సాధ్యమైనా, కాకపోయినా అంగీకరించిన సమస్యల్లోనయినా ముఖ్యంగా దళితుల ఆత్మగౌరవ సమస్యగానూ, మన దేశ అభ్యున్నతికి ఆటంకంగా తయారైన పరమ జాఢ్యంగానూ పరిణమించిన కుల సమస్యపై, వివక్షతా సమస్యలపై ఐక్యంగా ఉద్యమించటానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన పనిలేదు. ఈ ఐక్యత సాధించగలిగితే వివిధ సమస్యలపై పాలకుల మెడలు వంచగలిగే శక్తి పెరుగుతుంది. ఇందువల్ల రాష్ట్రంలో శ్రామికుల ఉద్యమంలో ముఖ్యమైన మలుపు సంభవిస్తుంది. అణగారిన బతుకుల్లో కాంతిరేఖ కనిపిస్తుంది. రాష్ట్రంలో ఇందుకు సత్వరమే చొరవ చూపబడుతుందని ఆశిద్దాం. 
-తమ్మినేని వీరభద్రం
  

Prajashakti Telugu News Paper Dated : 12/5/2013

Friday, April 26, 2013

చిరస్మరణీయ 'చర్మకారుడు' (శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ)--డాక్టర్ కె. నారాయణ





ప్రజల శాస్త్రవేత్త డాక్టర్ నాయుడమ్మ చరిత్ర చదివితే ఒళ్ళు పులకరిస్తుంది. అదే సందర్భంలో ముగింపులో కన్నీళ్ళు తెప్పిస్తుంది. జీవిత చరిత్ర చదివాక జ్ఞాపకాలు మిగిలే ఉంటాయి. ఈ పుస్తకం విడుదల కాక ముందే పరుచూరి నరేంద్ర నాకిచ్చారు. అప్పుడే దీన్ని పూర్తిగా చదివినా నా అభిప్రాయాలను రాయడంలో నాకు తీరిక లేకపోయింది. నాయుడమ్మ సామాన్య రైతుకుటుంబం నుంచి వచ్చినవారే. బెనారస్ హిందూ యూనివర్సిటీకి వెళ్ళి కెమిస్ట్రీ డిగ్రీ పూర్తి చేశారు. ఈ సందర్భంలో నేను గమనించింది ఆయన అక్కడ కమ్యూనిస్టులతో పరిచయం పెంచుకున్నారు. ఆనాడు బెనారస్ యూ నివర్సిటీలో చదువుతూ అనేక మంది, కమ్యూనిస్టుల ప్రభావానికి ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యం నుంచి నాయుడమ్మ జీవితం పరిశీలిస్తే వారు ఎంపిక చేసుకున్న రంగం, దానికి అంకితమైన తీరు అర్థమవుతు ంది. డిగ్రీ పూర్తిచేసినా ఆ చదువుకు అనుకూల ఉద్యోగాలు లేనందున మద్రాస్‌లో 'లా' చేయడానికి తం డ్రి ప్రోద్బలంతో వెళ్లినా వారికా చదువు ఇష్టం లేదు.

మద్రాసులో ప్రొఫెసర్ కాట్రగడ్డ శేషాచలం చౌదరితో నాయుడమ్మకు పరిచయం కలిగింది. శేషాచలం చౌదరి అప్పటికే లెదర్ టెక్నాలజీ డైరెక్టర్. వారి పోత్స్రాహంతో నాయుడమ్మ 17 రూపాయల నెల జీతానికి కెమిస్ట్రీ డిమాన్‌స్ట్రేటర్‌గా చేరారు. 'మీరెందుకు ఈ రంగంలో పనిచేయదలుచుకున్నారనే' ప్రశ్న నాయుడమ్మకు ఎదురైంది. దానికి ఆయన సమాధానం వారి అంకిత భావానికి అద్దం పడుతుంది. 'పేదవాళ్ళ కన్నా మరింత పేదవాళ్ళు, అందులోనూ దళితులు సైతం వెలివేసిన 'మాదిగ' వర్గం చర్మకారులుగా దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. వారి జీవనోపాధితో పాటు సాంకేతికంగా అభివృద్ధి కావడానికి ఈ రంగం ఉపయోగపడుతుంది' అని సమాధానం. గ్రామాల్లో, పట్టణాల్లో చర్మకారుల బాధలు వర్ణనాతీతం. 

ఆ రంగంలో మమేకమై పనిచేయడం వలన తమిళనాడు గవర్నర్ లాంటి వారే ఒక రోజు ఫోన్‌చేసి 'మీదే కులం?' అని అడిగారు. దానికి నాయుడమ్మ సమాధానం 'నేను ఏ రంగంలో పనిచేస్తున్నానో అదే మా కులం' అని సమాధానం చెప్పారు. మూడురోజుల తర్వాత గవర్నర్ మరలా నాయుడమ్మకు ఫోన్‌చేసి కులం అడిగినందుకు క్షమించమని కోరారు. నాయుడమ్మ దృఢ దీక్ష ఆయన మనస్సాక్షికి అద్దం. వారిని ప్రశ్న అడిగిన వారు ఉన్నత స్థాయిలో ఉన్నవారు. అయినా తొణకకుండా నిర్భయంగా సమాధానమిచ్చారు. వారణాసిలో చదివేటప్పుడు కమ్యూనిస్టుల కార్యక్రమాల్లో పాల్గొని ప్రభావితమైన నేపథ్యమే సమాజంలో అత్యంత క్రింది స్థాయిలో ఉన్న వర్గానికి ఆధునిక సాంకేతిక నిపుణత్వాన్ని తీసుకు వెళ్ళాలని నాయుడమ్మ దృఢంగా నిర్ణయించుకునేందుకు దారితీసింది.

నాయుడమ్మ, క్రమశిక్షణకు అద్దంలా నిలబడ్డారు. డ్యూటీలో ఉన్నప్పుడు, డ్యూటీలో లేనప్పుడు వారి ప్రవర్తనకు ఎంతో తేడా ఉంది. అంటే ఒక మూసలో గాకుండా సంపూర్ణత్వంతో వారి జీవితం గడిచింది. ఆ క్రమశిక్షణే వారి సేవలను పైకి తీసుకొచ్చింది. వారి జీవన విధానం ఎల్లలు దాటి మిత్రులను, అభిమానులను సంపాదించింది. చివరికి కెనడాలో జరిగిన ఐఆర్‌డీసీ బోర్డు మీటింగ్‌కు హాజరై తిరుగు ప్రయాణంలో విమాన ప్రమాదంలో మరణించినా ఆయన చివరి సమావేశంలో పాల్గొన్న హాలును 'నాయుడమ్మ హాల్'గా నామకరణంచేసి వారి జ్ఞాపకాలను శాశ్వతం చేశారు. (ఐఆర్‌డీసీ, 14వ అంతస్తు, 250 ఆల్బ్‌ర్ట్ స్ట్రీట్, ఒట్టానా) నాయుడమ్మ సేవలు జాతీయస్థాయిలో గుర్తించబడ్డాయి.

ఫలితంగా ఇందిరాగాంధీ కూడా ఢిల్లీకి వచ్చి బాధ్యతలు తీసుకొమ్మని కబురు పంపింది. కబురందగానే ఎగిరిగంతేయలేదు. 'నా కండిషన్లు ఆమోదిస్తే వస్తానని' షరతులు విధించిన ఆత్మాభిమాని నాయుడమ్మ. సి. సుబ్రమణ్యం గారిని ఇందిరాగాంధీ అడిగారట 'ఈయన నాకే షరతులు విధిస్తున్నారేంటి?' అని. వారికా అర్హత ఉందని సుబ్రమణ్యం సమాధానం చెప్పారు. ప్రతిష్ఠాత్మకమైన జేఎన్‌యూకు వైస్ ఛాన్సలర్‌గా నియమితులయినా 16 నెలలకే నాయుడమ్మ ఆ పదవి నుంచి వైదొలిగారు. కారణం వారనుకున్న సంస్కరణలు తేలేకపోయారు. నాటుకుపోయిన బ్యూరోక్రసీ ముందు రాజీపడలేక ఆత్మవంచనతో విధి నిర్వహించలేక మద్రాసుకు తిరుగు ప్రయాణం సాగించారు. నాయుడమ్మ చొరవతోనే అన్ని పాలిటెక్నిక్ కళాశాలలో లెదర్ టెక్నాలజీ కోర్సులు ప్రారంభించారు. అనేక ఆధునిక పరిశ్రమలు వెలసి చివరికి ఫ్యాషన్ షోలు కూడా నిర్వహించే స్థాయికి చేర్చారు.

'నోటి వాక్కు ఫలించిందని' పెద్దల సామెత. అది అక్షరాల నాయుడమ్మకు వర్తిస్తుంది. వచ్చిన ఆదాయం ఖర్చు పెట్టేస్తున్నావు చివరికి నీ శవ దహనానికి కూడా నేనే చూసుకోవాలని వారి మిత్రుడు ఆప్యాయంగా హెచ్చరించిన సందర్భంలో యాదృచ్ఛికంగానే 'ఆ అవకాశం మీకివ్వనులే' అని సమాధానం చెప్పారు. యాదృచ్ఛిక సమాధానమే నిజమని తెలిసి హృదయం ద్రవించింది. చివరికి వారి మృత దేహం దహన సంస్కారానికి కూడా దొరకలేదు. ఏమయితేనేమి వారి పార్థివ దేహం ప్రతి అణువు జల జంతువులకు ఆహారంగా ఉపయోగపడటమంటే అంతకంటే మించిన జన్మ సార్థకత ఇంకేముంటుంది? నాయుడమ్మ ధన్య జీవి. వారి కృషిని మనముందు కండ్లకు కట్టినట్టు పుస్తకరూపంలో రూపొందించిన శిల్పి చంద్రహాస్‌కు ధన్యవాదాలు.

- డాక్టర్ కె. నారాయణ
కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర సమితి

Andhra Jyothi Telugu News Paper Dated : 27/4/2013

Monday, April 8, 2013

సమాజ రక్షకులు ‘మాల’లే ----అఖిల మాల విద్యార్థి సంఘం (ఏఎంఎస్‌ఏ)



వేల సంవత్సరాల పూర్వం భారత సమాజ నిర్మాణమే కులాల పునాదిగా ఏర్పడింది. ఇప్పటికీ అది చెక్కు చెదరని నిచ్చెనమెట్ల వ్యవస్థగానే ఉన్నది. వర్ణ/కుల (అ)ధర్మము ప్రకారం త్రివర్ణాలు-వూబాహ్మణ, క్షత్రియ, వైశ్యులు చేయడానికి నిరాకరించిన పనులన్నింటిని, ప్రధానంగా ప్రకృతితో నిరంతరం సంఘర్షణపడే పనులను శూద్ర (ఉత్పత్తి కులాలు), అతి శూద్రులు(అంటరాని కులాల) వారు చేసిపె చేశారు. వీటిని ధిక్కరించడానికి వీలు లేదు.అది చట్టం.శూద్ర,అంటరాని కులాల నైతిక విధి అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చేవకు ఈ దుస్థితి రాజ్యసమ్మతంగానే కొనసాగుతుండేది. అయితే ఆ కుల కట్టుబాట్లు, నమ్మకాలు ఇప్పటికీ గ్రామీణ సమాజంలో బలంగానే ఉన్నాయి.

దేశం మొత్తం మీద దళితులు చేసే పనులను అపవివూతమైనవిగా, అంటరానివిగా, బ్రాహ్మణీయ సమాజం చెప్పి, ఆ అభివూపాయాలకు స్థిరత్వాన్ని కల్పించింది. దీనికి అసమాన మానవ విలువలకు పుట్టినిల్లు అయిన బ్రాహ్మణత్వం తోడైంది. మరోమాటలో చెప్పాలంటే బ్రాహ్మణత్వం నిరాకరించిన అన్ని పను లు దళితులకు అంటగట్టి, అగ్ర కులతత్వంతో వాటి ని అంటరానివిగా చూస్తున్నది. మలాన్ని ఎత్తిపోయ డం, భూమిని ప్రేమించడం, దాన్నుంచి బువ్వను తీయడం, జంతువులు, మనుషులు చనిపోతే ఖన నం చేసేదాకా అంతటా అంటరాని కులాలే శ్ర మించాలి. చచ్చిన జంతువుల చర్మం తొలచి మనిషికి మెత్తని తోలు చెప్పులను, ఊరిలో దరువు వేయడానికి డప్పును, వ్యవసాయ ఉపయోగకరమైన అనేక తోలు వస్తువులను మాదిగ, దళిత కులాలు చేస్తున్నాయి. అలాగే మిగతా అగ్రకులాలు, బహుజన కులాలు సైతం చేయడానికి నిరాకరించిన అన్ని పనులను మన రాష్ట్రంలో మాలలు వారి ఉప కులాలు, కుల వ్యవస్థ పుట్టినప్పటి నుంచి చేస్తున్నాయి. 

ఈ సమాజ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాకుండా.. పూర్వం సంపద రక్షణకోసం, దోపిడీలను నివారించడానికి మాలలు గ్రామ రక్షకులుగా గ్రామాల్లో గస్తీ కాచేవారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి గ్రామాలను సుభిక్షంగా ఉంచేవారు. అది తర్వాత కాలంలో పాలనారంగంలో భాగమై నేటి గ్రామ సేవకులు, సుంకరులుగా రూపాంతరం చెందారు. చరివూతలో నేటి రక్షణ వ్యవస్థకు బీజాలు వేసింది మాలలే.

ఇప్పటికి గ్రామం అంటే.. బొడ్రాయిని ఊరి నడిబొడ్డునా పొందించడంతో మొదలవుతుంది. ఆ బొడ్రాయి పొందిక మొదలుకొని గ్రామ దళిత, బహుజన దేవతైలన ముత్యాలమ్మ, మైసమ్మ, పోచమ్మ, నల్లపోచమ్మ, పెద్ద దేవర, గంగమ్మ, కట్ట మైసమ్మ వంటి దేవతలను గ్రామాల్లో నిలబెట్టి ప్రతియేడు జాతరలను, పండుగలను చేయడంలో ముందుండి నడిపేది మాల పంబాల/ బైండ్ల వాళ్లే. ఇందులో ఊళ్లోని సబ్బండ జాతులు పాల్గొంటాయి. ఇక్కడ మాల పంబాల/బైండ్లలు సాటి మనిషికి అర్థమయ్యే తాత్తికతనే ఆడుతూ పాటల రూపంలో గానం చేస్తారు. అన్ని కులాల వారిని సమానంగా చూస్తారు. దేవత పూజలలో అంటుముట్టుకు అసలు చోటే లేదు. ఇది బ్రాహ్మ పూజారి తత్తానికి భిన్నమైనది. ఈ విధంగా భూమి పుత్రులుగా, గ్రామ రక్షకులుగా పంటనిచ్చే నీరటి గాళ్లుగా, బేగరి పర్యావరణవేత్తలుగా, బట్టనేసిన ఆధునికులుగా, గ్రామ వైద్యులుగా ప్రజల ఆధ్యాత్మిక గురువులుగా బహువిధాలైన సేవలను అనేక వేల సంవత్సరాలుగా చేస్తూ, ఆర్థిక, సామాజికాభివృద్ధిలో గొప్ప పాత్రను పోషిస్తున్న ది అంటరాని మాల కులాలే. ఇన్ని సేవలు చేసిన వారికి సైతం వందేళ్ల కిందటి వరకు అక్షరం అంటరానిదైంది. ఫూలే, సావివూతిబాయి ఫూలే, అంబేద్కర్ వంటివారి పోరాటల ఫలితంగా అక్షరాలు నేర్చుకొని విద్య, ఉద్యోగ రంగాలలో కొంతమేరకైనా చోటు సంపాదించగలిగారు.

ఆధునిక కాంలో కుల సంస్కృతిని, అగ్రకుల ఆధిపత్య అధికార భావజాలాన్ని, దాడులను చరిత్ర పొడవునా ఎదురుతిరిగి పోరాడడంలో అంటరాని మాలలే ముందున్నారు. చరివూతలో ఆది ఆంధ్రసమాజ నిర్మాణం, అది హిందూ మహాసభ, దళిత మహాసభ, అంబేద్కర్ యువజన సంఘాల నిర్మాణం మొదలుకొని కంచికర్ల, కారంచేడు, చుండూరు, పదిరికుప్ప,ం నీరుకొండ మొదలు నేటి లక్షింపేట దళిత హత్యాకాండలు జరిగినప్పుడు బాధిత దళితులకు అండగా నిలబడి అగ్రకుల సమాజంతో, రాజ్యంతో కొట్లాడింది ప్రధానంగా మాలలే. చరివూతలో భాగ్యడ్డి వర్మ, అరిగె రామస్వామి, పి.ఆర్. వెంకటస్వామి, బి.ఎస్. వెంకవూటావు, శ్యాం సుందర్, కుసుమ ధర్మన్న, బొజ్జా అప్పలస్వామి, జాలా రంగస్వామి, జాలా మంగమ్మ, బోయి భీమన్న, ఈశ్వరీబాయి వంటి వారికి వారసులుగా ఇప్పటికి ఎందరో ఉద్యమకారులు అనేక ప్రజాస్వామ్య ఉద్యమాల్లో భాగస్వాములై ఉద్యమిస్తున్నారు.కుల రహిత సమాజంకోసం పోరాడు తున్నారు. 

1990 దశకంలో పాలక కులాలు ఆర్థిక సంస్కరణలను తెరమీదికి తీసుకొచ్చి ప్రజాసంక్షేమ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకున్నాయి. విద్య, ఉద్యోగ, మౌలిక రంగాలన్నీ ప్రైవేట్ వక్తుల/ సంస్థల గుత్తాదిపత్యంలోనే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సర్కారు బడులున్నీ దళిత, బడుగు, బలహీనకులాల్లోని పిల్లలకే పరిమితమవుతున్నాయి. అక్కడ మేధోరంగంలో పోటీపడే ఇంగ్లిష్ మీడియం చదువులు లేవు. డ్రాప్ అవుట్ సమస్య విపరీతంగా ఉన్నది. ఉన్నత విద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ రంగ విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతున్నది. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలోని యువత బతుకు ఛిద్రమౌతున్నది. ఆర్థిక సమ స్యలతో అగ్రకులాల రాజకీయాలకు అంగడి సరుకుగా మారుతున్నారు. ఈ తరుణం లో దళిత, బహుజన సామాజికవర్గాల చదువుకున్న బిడ్డలుగా మనముందు తరాల భవిష్యత్ కోసం సామాజిక ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉన్నది.

దళిత ఉద్యమాల్లో అగ్రస్థానంలో ఉండే మాలలు అస్తిత్వ కేంద్రంగా ఆత్మగౌరవ పోరాటాల పునాదిగా అన్ని అంటరాని కులాల అభివృద్ధి, రాజ్యాధికారంలో సమాన వాటా కోసం ఐక్యపోరాటాలను నిర్మించాలనే ఆశయంతో ఈ అఖిల మాల విద్యార్థి సంఘం (ఏఎంఎస్‌ఏ)ను ఏర్పాటు చేస్తున్నాం. కావు నా మాల కులంనుంచి ఎదిగిన బుద్ధిజీవులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు తమ కుల అస్తిత్వాన్ని, వివిధ సామాజిక, రాజకీయ ప్రజాఉద్యమా ల్లో నిర్వహించిన పాత్రను అంచనావేసి తమ ముందుతరాలకు అందించాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే వారు ఆత్మగౌరవంతో తమ,ఇతర అణగారిన కులాల హ క్కుల కోసం ఈ కులాధిక్య సమాజంతో, రాజ్యంతో పోరాడుతారు. ఈ సందర్భంగా దళితేర మేధావులు, ఉద్యమకారులు, ప్రజాస్వామికవాదులు మా సంస్థను ముందుకు తీసుకపోవడంలో సహకరిస్తూ, అండగా ఉంటారని ఆశిస్తున్నాం.

ఈ సందర్భంగా దళిత బహుజనుల అభ్యు న్నతి కోసం- కేజీ నుంచి పీజీ వరకు అన్ని సమాజిక వర్గాలకు ఒకే విద్యావిధానం అంటే ఒకే మీడియం, ఒకే సిలబస్, ఒకే పరీక్షా విధానం ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెరిగిన ధరలకు అనుగుణంగా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయంబర్స్‌మెంట్స్ సకాలంలో చెల్లించాలి. ప్రజాధనంతో నిర్మాణమైన అన్ని ప్రైవేట్ రంగాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు హక్కుగా గుర్తించాలి. ఉద్యోగాలు కల్పించాలి. ప్రభుత్వాలు గ్రామసేవకులుగా (విలేజ్ అసిస్టెంట్స్) మాల కులస్తులనే నియమించాలి. మంత్రాల నెపంతో పంబాల, బైండ్ల వంటి దళిత కులాల వారిని హింసించడం, భౌతిక దాడులతో హత్యచేయడం వంటి వాటిని తీవ్ర నేరాలుగా పరిగణించాలి.వారి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నిందితులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం శిక్షించాలి. స్త్రీ దేవాలయాలలో వీరిని పూజారులుగా నియమించాలి. మాల ‘నేతకాని కార్మికుల’ను ప్రత్యేక నేతకార్మికులుగా గుర్తించి వారి అభివృద్ధి కోసం మాల ‘నేతకాని ఫెడరేషన్’ను ఏర్పాటు చేయాలి. 

వ్యవసాయ, నీటి పారుదల రంగాల ఉద్యోగ భర్తీల్లో నీరటి మాలలకు ప్రత్యేక అవకాశాలు కల్పించి, ఉద్యోగ కల్పనలో వారికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. శవదహనాలను చేసే మాల బేగరులను ప్రాచీన పర్యావరణ సంరక్షకులుగా గుర్తించాలి. వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు రూపొందించాలి.


Namasete Telangana Telugu News Paper Dated: 9/4/2013


Wednesday, March 20, 2013

ఆత్మహత్యలు కావు.. హత్యలే! - అంబాల దేవేందర్



ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ విద్యార్థుల పట్ల క్రూరంగా వివక్షాపూరితంగా వ్యవహరించే విద్యాసంస్థలకు ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయకూడదు. ఇప్పటివరకు చోటుచేసుకున్న ఆత్మహత్యలను హత్యలుగా పరిగణించి యూనివర్సిటీ అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి సీబీఐ విచారణ జరిపించాలి. 

భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నిలబడాలంటే కుల వ్యవస్థ ధ్వంసం కావాలి. ఇందుకు విద్యను కింది కులాలకు అందించాలని డాక్టర్ అంబేద్కర్ సూచించారు. మహాత్మా గాంధీతో పోరాడి, కిందికులాల వారికి విద్యాహక్కును కమ్యూనల్ అవార్డు ద్వారా అంబేద్కర్ సాధించారు. ఆ తర్వాత విద్యను ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో ఆయన పొందుపరిచారు. రాజ్యాంగ హక్కులను తొలగించే అధికారం పార్లమెంటుకు కూడా లేదని ఆర్టికల్ 13 చెబుతుంది. అందుకే, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను యూనివర్సిటీల్లో అగ్ర కులాలవారు కాలరాస్తున్నారు. అలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ విద్యార్థుల రాజ్యాంగ హక్కులను దూరం చేసే క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నిస్సహాయ స్థితిలో బహుజన విద్యార్థులు ఊపిరి తీసుకుంటున్నారు. వీటిని యూనివర్సిటీ యాజమాన్యాలు ఆత్మహత్యలంటున్నాయి. కానీ అవి మనువాదులు చేస్తున్న హత్యలు.

ఇటీవల 'ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజస్ యూనిర్సిటీ' (ఇఫ్లూ)లో ముదస్సిర్ కమ్రాన్ మల్లా హాస్టల్ గదిలో ఉరేసుకుని చనిపోయాడు. ముదస్సిర్ కమ్రాన్ మల్లా కాశ్మీరీ ముస్లిం. పీహెచ్‌డీ పరిశోధన కోసం ఇఫ్లూలో చేరాడు. ఈ నెల 19న హైదరాబాదు విశ్వవిద్యాలయంలో పుల్యాల రాజు అనే విద్యార్థి సాయంత్రం వేళ తన హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పుల్యాల రాజు నిరుపేద మాదిగ కుటుంబం నుంచి వచ్చాడు. ఓపెన్ క్యాస్టింగ్ వల్ల బొందలగడ్డగా మారిన భూపాలపల్లి నుంచి, ఉన్నత చదువుల కోసం ఆ కుటుంబం నుంచి వచ్చిన తొలి వ్యక్తి కూడా పుల్యాలరాజే కావడం విషాదం. ఈ ఇద్దరూ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ క్రూరత్వానికి బలైపోయారు. ఈ రెండు సంఘటనల కన్నా ముందు ఇఫ్లూ, హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఎంతో మంది చనిపోయారు. హైదరాబాదు వర్సిటీలో తమిళనాడుకు చెందిన ఎరుకల కులస్తుడు సెంథిల్ కుమార్ ఇదేరకంగా హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. 

కెమిస్ట్రీ శాఖలో పీహెచ్‌డీ కోసం సెంథిల్ మెరిట్ ప్రాతిపదికన చేరాడు. మూడు వేల సంవత్సరాల్లో సెంథిల్ కుమార్ పూర్వీకులెవ్వరూ చదువుకోలేదు. ఆ కుటుంబం నుంచి ఉన్నత చదువుల కోసం వచ్చిన తొలి వ్యక్తి అతడే. పీహెచ్‌డీలో చేరిన మూడేళ్ల తరువాత కూడా తనకు రీసెర్చ్ సూపర్ వైజర్‌ను కేటాయించలేదు. పైగా ఆ మూడు సంవత్సరాలు క్రాష్ కోర్సు పేరుతో పీజీ విద్యార్థులతో పాటు సమానంగా క్లాసుల్లో కూర్చోబెట్టారు. వరుసగా మూడేళ్లు సెంథిల్‌ను ఫెయిల్ చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కెమెస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో పట్టించుకున్న వాళ్లు లేరు. సైన్స్ డిపార్ట్ మెంట్‌లన్నీ ఒకేచోట ఉండే సైన్స్ కాంప్లెక్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం విద్యార్థులకు మృత్యుకూపం. ఎన్నో సైన్సు డిపార్ట్‌మెంట్లలో ఎస్సీ, ఎస్టీ టీచింగ్ పోస్టులు నేటికీ భర్తీచేయలేదు. 

తగిన అభ్యర్థులు లేరనే సాకుతో వాటిని ఖాళీగా ఉంచడమో లేదా ఐదుసార్లు నోటిఫై చేసి ఆరోసారి నోటిఫికేషన్‌లో జనరల్ క్యాటగిరీ కిందికి మార్చటమో చేస్తున్నారు. అన్ని శాఖల్లోని ప్రొఫెసర్లలో ఒకే ఒక్క అగ్రకులానిదే ఆధిక్యం. నైతికస్థైర్యాన్నిచ్చే వాళ్లు కూడా లేకపోవడంతో సెంథిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సెంథిల్ చనిపోయిన ఏడాదికే గొల్ల కుర్మ కులస్తుడు బాలరాజు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అత్యంత వెనుకబడిన రంగారెడ్డి జిల్లాకు చెందిన బాలరాజు హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖలో పీహెచ్‌డీ కోసం చేరాడు. విభాగం పెద్దల వేధింపులకు తాళలేక తనకు తాను చంపుకున్నాడు. వేల సంవత్సరాల బాలరాజు కుటుంబ చరిత్రలో అతనొక్కడే విద్యావంతుడు. ఇక ముదస్సిర్ కమ్రాన్ మల్లా స్నేహితుడితో గొడవ పడ్డాడనే నెపంతో ఉస్మానియా పోలీసులకు ఇఫ్లూ ప్రొక్టార్ విజ్రా అప్పగించాడు. పోలీసులు ముదస్సిర్ కమ్రాన్‌ను రోజంతా స్టేషన్‌లో ఉంచుకున్నారు. గౌరవప్రదమైన, మర్యాదకరమైన పద్ధతుల్లో విద్యార్థులతో వ్యవహరించాల్సిన ప్రోక్టార్ ముదస్సిర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడని, పోలీసు కౌన్సిలింగ్ పేరుతో అవమానించాడని, అందుకే ముదస్సిర్ ఆత్మహత్య చేసుకున్నాడని బహుజన్ ఇంటలెక్చవల్స్ కలెక్టివ్ నిజనిర్థారణలోనూ తేలింది.

పుల్యాల రాజు హైదరాబాదు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ ఎం.ఏ.లో భాషాశాస్త్రం చదువుతున్న ఫైనలియర్ విద్యార్థి. ఓ అగ్రవర్ణం వారు మాత్రమే అధ్యాపకులుగా ఉండే ఈ శాఖలో పుల్యాలరాజు అనేక మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు. కొన్ని సెమిస్టర్లలో అతన్ని ఫెయిల్ కూడా చేశారు. సప్లిమెంటరీ ఫలితాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకొని లాస్ట్ డేట్‌కు ఒక్కరోజు ముందు వాటిని తెలియజేస్తుంది. సెమిస్టర్ రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు తగినంత సమయం కూడా ఇవ్వకపోవటంతో పుల్యాల రాజు తీవ్ర నిరాశకు లోనయ్యాడు. ఫేస్‌బుక్‌లో తన చివరి సందేశం రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

సెంట్రల్ యూనివర్సిటీల్లో ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం విద్యార్థులు మాత్రమే ఎందుకు మరణిస్తున్నారు? అగ్రకుల విద్యార్థులెందుకు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు? బహుజన విద్యార్థులు మాత్రమే డిప్రెషన్‌లోకి వెళ్లి మతిస్థిమితం కోల్పోవటం వెనుక ఉన్న రాజకీయ కారణాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిందే. 2004లో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఐఐఎం, ఏయిమ్స్ వంటి విశ్వవిద్యాలయాల్లో కేంద్ర ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 27.5 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లు ప్రవేశపెట్టింది. మనువాద సంస్థలతో పాటు ఓ అగ్రవర్ణం అధ్యాపకులు బీసీ రిజర్వేషన్‌ను వ్యతిరేకించారు. యూత్ ఫర్ ఈక్వాలిటీ పేరు ఉద్యమం నడిపారు. ఆ సందర్భంగా ఒక విచిత్రమైన వాదనను లేవనెత్తారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదనేది ఆ వాదన. ఐఐటీ, ఐఐఎం, ఏయిమ్స్‌ల్లో ఎస్సీ, ఎస్టీ సీట్లలో సగం మాత్రమే భర్తీ అవుతున్నాయనీ మిగతా సగం ఖాళీగా ఉంటున్నాయని అన్నారు. రకరకాల కోర్సుల్లో చేరిన ఎస్సీ, ఎస్టీల్లో సగం మంది కోర్సులు చదివే శక్తి లేక మధ్యలోనే వదిలేస్తున్నారనీ, అలా వదిలేయని వాళ్లలో సగం మంది ఫెయిల్ అవుతున్నారనీ, పాస్ అవుతున్న వాళ్లు అత్తెసరు మార్కులతో బయటపడుతున్నారని అన్నారు. ఇలా ప్రమాణాలు పడిపోవటమే కాకుండా నిరుపయోగంగా మారిన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తీసేయమని అడుగుతుంటే కొత్తగా బీసీ రిజర్వేషన్ అంటారేంటని అగ్రకులాల వాదన.

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో బహుజన విద్యార్థులను రక్షించాలంటే జాతీయ విధానం రూపొందించాలి. ముందుగా పార్లమెంటులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ విద్యార్థుల బలవన్మరణాల గురించి నిజాయితీతో కూడిన చర్చ జరగాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చకు పెట్టాలి. అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీ, ఐఐఎం, ఏయిమ్స్ వంటి అత్యున్నత విద్యాసంస్థలను ప్రజాస్వామీకరించాలి. కేవలం ఒకటి, రెండు కులాలు మాత్రమే అధ్యాపక రంగాన్ని నియంత్రించటం అప్రజాస్వామికం. ఓబీసీ, ముస్లిం, మైనార్టీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించి వ్యవస్థను ప్రజాస్వామీకరించాలి.

అమ్మాయిల మీద లైంగిక వేధింపులను నివారించే కమిటీలు ఏర్పాటు చేసినట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీలకు విడివిడిగా గ్రీవెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలి. అవి అడ్మినిస్ట్రేషన్ కబంధ హస్తాల్లో బందీ కాకుండా ఉండాలి. స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలుగా వాటిని ఏర్పాటు చేయాలి. విచారించే, శిక్షలు విధించే అధికారం ఉండాలి. వేధింపులకు పాల్పడ్డ అధ్యాపకుడు, అధికారి మీద క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపాలి. శాశ్వతంగా ఉద్యోగానికి అనర్హుడిగా ప్రకటించాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ విద్యార్థుల పట్ల క్రూరంగా వివక్షాపూరితంగా వ్యవహరించే విద్యాసంస్థలకు ప్రభుత్వం ఎలాంటి నిధులు విడుదల చేయకూడదు. ఇప్పటివరకు చోటుచేసుకున్న ఆత్మహత్యలను హత్యలుగా పరిగణించి యూనివర్సిటీ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అత్యున్నత సీబీఐ అధికారులతో విచారణ జరిపించాలి. విద్యార్థి సంఘాలను రకరకాల పద్ధతుల్లో నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈ విద్యాసంస్థల్లో కనిపిస్తుంది. విద్యార్థి సంఘాలకు స్వేచ్ఛ ఉండాలి. అంబేద్కర్ భావజాలం పునాదులుగా వాటిని నిర్మించాలి. అప్పుడే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ విద్యార్థులకు సరైన ప్రాతినిధ్యం, ప్రాధాన్యం దొరుకుతుంది.

- అంబాల దేవేందర్
బహుజన ఇంటలెక్చువల్స్ కలెక్టివ్

Andhra Jyothi Telugu News Paper Dated : 21/3/2013

Thursday, January 10, 2013

బహుజనులారా.. వివేకంతో వ్యవహరిద్దాం! ---ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు



ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రజలందరికీ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలుగా ఒక విన్నపం చేస్తున్నాము. దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తున్న సందర్భంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యల్ని కేంద్రంగా చేసుకొని కొన్ని అగ్రవర్ణ రాజకీయ పార్టీలు హిందూ ముస్లిం విభజనని మరోసారి ముందుకు తీసుకొస్తున్నాయి. ఈ హిందూ ముస్లిం విభజన వల్ల అగ్రకులాలే లాభపడతాయి. అంతే తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎలాంటి ఉపయోగం లేదు. బ్రాహ్మణవాదం (హిందూ మతం) గురించి దాని అహేతుకత గురించి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, పెరియార్ వంటి మహానుభావులు అనేకమంది విమర్శనాత్మక గ్రంథాలు రాశారు. దేశవిదేశాల్లో అనేక పరిశోధనలు జరిగాయి. అందువల్ల మతం పేరు మీద జరుగుతున్న ఈ రాజకీయ వ్యవహారమంతా అగ్రవర్ణాలు అధికారంలో రావడానికి చేస్తున్న కుట్రే.

మరోవైపు హిందుత్వవాదులు చేస్తున్న ఈ కుట్ర తెలంగాణ ఉద్యమానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసికట్టుగా మతతత్వాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే వ్యాపింప చేస్తున్నాయి. ఈ కుట్రను తెలంగాణవాదులు సరిగా అర్థం చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు ఈ కుట్రలను తిప్పికొట్టాలి. హిందువులు అనే పేరు మీద తెలంగాణవాదులు మాట్లాడడం కూడా సరైంది కాదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలు హిందువులు కారని 1918 నుంచి చెబుతూనే వచ్చారు. అలాగే 1932లో ఎస్సీలకు ‘కమ్యునల్ అవార్డు’ను ఇందుకోసమే ఇచ్చారని గమనించాలి. 

అక్బర్ విషయంలో బీజేపీ కుట్రపూరితంగా ఎడిట్ చేసి విడుదల చేసిన సీడీలను మాత్రమే మనం నమ్మడానికి వీల్లేదు. బీజేపీ తన మతతత్వ ఎజెండాలో భాగంగా అనేక జిమ్మిక్కులను ప్రయోగిస్తుందని గుర్తించాలి. అందుకని అక్బరుద్దీన్ పూర్తి ప్రసంగపాఠాన్ని విన్న తర్వాత అది సరైందా లేదా అని నిర్ణయించుకోవాలని కోరుతున్నాము. అట్లాగే ఒకవేళ నిజంగానే విద్వేషపూరితంగా ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా నేరమేనని మేము భావిస్తున్నాము. తొగాడియా లాంటివాళ్లు ప్రతీసారి చేస్తున్న ఉద్రేకపూరిత, విద్వేషకరమైన ఉపన్యాసాల సంగతేమిటి? బీజేపీ అనుబంధ లేదా మాతృసంస్థలు ప్రతీనెలలో కనీసం రెండు మూడుసార్లు హైదరాబాద్‌లో ఏదో ఒకచోట రెచ్చగొట్టే ప్రసంగాలు, పనులు చేస్తూనే ఉన్నాయి. ఇందుకు సంబంధించిన రికార్డు వీడియోలు ఇంటలిజెన్స్ డిపార్ట్‌మెంట్ వద్ద ఉన్నాయి. గత రెండు సంవత్సరాలుగా తొగాడియాతో పాటు హిందూత్వ ఉగ్రవాదుల మీద ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు కనీసం దరఖాస్తులు స్వీకరించలేదు. అద్వానీ విద్వేషపూరితంగా తీసిన రథయాత్ర దేశంలో ఐదు వేలమంది చావుకు కారణమైంది. శ్రీకృష్ణ కమిషన్ అద్వానీతో పాటు అనేకమంది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులను దోషులుగా ప్రకటించింది. అయినా వారిని అరెస్ట్ చేయలేదు. అట్లాగే గుజరాత్‌లో నరేంవూదమోడీ రెండువేల మంది ముస్లింలను ఊచకోత కోయిస్తే మూడవసారి సీఎంను చేశారు. అంతేకాకుండా నరోడా పాటియాల్‌లో ముస్లింలపై జరిగిన సామూహిక హత్యాకాండ వ్యవహారంలో బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ ప్రమేయముందని సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది. ఇట్లా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా జరిగిన అనేక మత అల్లర్లకు, బాంబు పేలుళ్ళకు బీజేపీ దాని మాతృసంస్థలే బాధ్యులని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. అందుచేత ఎంఐఎంను నిషేధించాల్సి వస్తే బీజేపీతోపాటు హిందూత్వ మతసంస్థలన్నింటినీ నిషేధించాల్సిందే. రాజ్యాంగం పట్ల గౌరవంలేని హిందూ ఉగ్రవాద సంస్థలు దేశభక్తి, దేశభవూదతల గురించి మాట్లాడడం హాస్యాస్పదం.

అక్బరుద్దీన్ వ్యాఖ్యల నేపథ్యంలో జరిగిన పరిణామాలన్నీ అధికార రాజకీయాలలో భాగమే. ముఖ్యమైన విషయమేమం మనోభావాలు గాయపడ్డాయనే మోసపూరిత చర్చను బీజేపీ తెరమీదకు తెస్తున్నది. మనోభావాలు గాయపడడం అనేది మత విషయంలోనే జరగడం లేదు. కుల వ్యవస్థ ఉండాలని, దానిమీద మాత్రమే సమాజం మనగలుగుతుందని కొంతమంది మత పీఠాధిపతులు టీవీల్లో, సభలు సమావేశాల్లో మాట్లాడుతున్నారు. ఇదంతా కులం పోవాలని కోరుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీల మనోభావాలను దెబ్బతీయడం కాదా?! ముస్లింలు నివసించే ప్రాంతాలను ‘ఉక్షిగవాద తండాలు’ అని కొందరు మతాధిపతులు చేస్తున్న వ్యాఖ్యల వల్ల ముస్లింల మనోభావాలు గాయపడుతున్నాయి. అందువల్ల మతం పేరుతో విద్వేషం రెచ్చగొట్టే హిందూ మఠాధిపతులపై చర్యలు తీసుకోవాలి.

కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఎంఐఎంను ఒక సాకుగా చూపెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ ముస్లింలను అణచివేయాలని చూస్తున్నాయి. అందుకని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు సంయమనం పాటిస్తూ, వివేకంతో వ్యవహరించాలని కోరుతున్నాము. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువల ద్వారా, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన దృష్టికోణం నుంచి ఈ పరిణామాలను అర్థం చేసుకోవాలని పిలుపునిస్తున్నాం.

-బహుజన రచయితల సంఘం, బహుజన కెరటాలు, 
బహుజన ఎకడమిక్ అండ్ రీసెర్చ్ సెంటర్,అంబేద్కర్ విద్యార్ధి సమాఖ్య, తెలంగాణ మూలవాసీ జేఏసీ, భారత నాస్తిక సమాజం సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్స్ అసోసియేషన్, బహుజన స్టూడెంట్స్ ఫ్రంట్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్ స్టూడెంట్స్ ఫోరమ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మూలవాసీబహుజన లిబరేషన్ మూవ్‌మెంట్
‘మట్టిపూలు’ ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీ రచయివూతుల వేదిక
‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం, 
దళిత్ కెమెరా,టిఎస్‌ఎ, ఇఫ్లూ

Namasete Telangana Telugu News Paper Dated : 11/1/2013

దళితుల సామాజిక బహిస్కరణ ---పి.జితేందర్‌



  • అంతిమ సంస్కారానికి సహకరించలేదని...
  • ధిక్కరిస్తే జరిమానా, చెప్పుదెబ్బలు
  • పసి పిల్లలకు సైతం పాలు పోయొద్దని తీర్మానం
సామాజికంగా కలిసి ఉండాల్సిన మనుషులు కుల వివక్ష చూపుతూ సాటి మనిషిని దూరంగా ఉచండం సిగ్గు చేటు. నవ నాగరిక సమాజంగా చెప్పుకుంటున్నాం. ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చిన ఈ కంప్యూటర్‌ యుగంలో కూడా అంటరానితనం వెంటాడుతోంది. కుల వివక్షను రూపుమాపడానికి ఎన్ని చట్టాలు చేసినా.. అమలుకు నోచుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలో తరుచూ ఎస్సీ,ఎస్టీలు అవమా నాలకు గురవుతున్నారు. పెత్తందారులు దాడులు, దౌర్జన్యాలు , సామాజిక బహిస్కరణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామంలో అగ్రకులస్తులు మరణిస్తే అంతిమ సంస్కారాలకు దళితులు రాలేదని సామాజిక బహిష్కరణ చేశారు. గ్రామంలో వారికి సహకరించిన వారికి రూ. 5 వేలు జరిమానా విధిస్తామని, 25 చెప్పుదెబ్బలు కొడతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ వారం ప్రజాశక్తి ప్రత్యేక కథనం....


అసలేం జరిగిందంటే........
లింగంపల్లి గ్రామంలో 2012 డిసెంబర్‌ 23న ఒకరు సహజంగా మరణించారు. లింగంపల్లి శివారు గ్రామంలో మరోవ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. డప్పులు కొట్టడానికి అగ్ర కులాల వారు దళితులకు సమాచారం అందించారు. కాని డప్పులు కొట్టే వారు తక్కువగా ఉండడం వలన రెండు చావులకు డప్పులు కొట్టలేమని చెప్పారు. మీ పిల్లలున్నారుగా వారితో కొట్టించాలని పెత్తందారులు చెప్పారు. వారు చదువుకుంటున్నారు. డప్పులు కొట్టడం రాదని వివరించారు. మీ కులం వాళ్లే డప్పులు కొట్టాలి. గోతి తవ్వాలి.మరే కులం వాళ్లు ఈ పనులు చేయరు మీకు తప్పదని ఆగ్రహంతో ఊగిపోయారు అగ్ర కుల పెత్తందార్లు. మీరు డప్పులు కొట్టకపోతే, చావు బొందలు తీయకపోతే, కాష్టం కట్టెలు పేర్చకపోతే బాగుండదంటూ హెచ్చరించారు. వారా పని చేయక పోతే ఎవరు కూడా దళితులకు సహరించవద్దని తీర్మానం చివరకు సామాజిక బహిష్కరణ విధించారు.
చిన్నపిల్లలకు వైద్యం చేయలేదు: జంగం యాదమ్మ
లింగంపల్లి గ్రామంలో 9 నెలల చిన్నారి నామనుమరాలు సిరికి జ్వరం వచ్చింది. స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపి వైద్యుడు మహేష్‌ వైద్యం చేయడానికి నిరాకరించాడు. ఆటో ఎక్కి పక్కగ్రామానికి వెళ్దామంటే ఆటోలలో ఎక్కనివ్వలేదు. ఈ దుస్తితిలో తమ కులం ఉండడం ఏంటి. గ్రామంలో కొందరి కుల పెత్తనం జరుగుతుందని, ఎవరైనా.. ఎదురు తిరిగితే వాళ్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వివరించారు. రోజు కూలీ నాలి చేసుకునే వాళ్లం సారు.. మా చిన్నప్పుడే మేము అనేక ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మా మనుమలు, మనుమరాళ్లు కూడా ఈ ఇబ్బంది పడొద్దని కోరుకుంటున్నామన్నారు. మా కులం ఏమైనా.. డప్పులు కొట్టాలని, కాష్టం పేర్చాలని, బొంద తోడాలని ఎక్కడనైనా రాసుందా..? సారు అంటూ రోధించారు. మా వయస్సులో ఉన్న వాళ్లం డప్పులు కొడుతాం. ఎందుకంటే మాకు వచ్చిన పని చేయడం తప్పు కాదు కదా . ఒకే రోజు రెండు చావులు జరిగితే డప్పులు కొట్టేవాళ్లం తక్కువగా ఉన్నాం. విషయం చెప్పినా వినకుండా మా పిల్లలను డప్పులు కొట్టమన్నారు. వారు ఇప్పటి వరకు చదువుకున్నారు. వాళ్లకు డప్పులు కొట్టడం రాదు అని చెప్పినా వినకుండా పెత్తందార్లు గ్రామంలో మా కులం వాళ్లకు ఎవరు సహకరించకుండా చేశారు. ఎవరు సాయం చేసినా..జరిమానా వేస్తామని, చెప్పు దెబ్బలు కొడతామని చెప్పడంతో సాయం చేసే వాళ్లు కూడా భయపడి సాయం చేయలేదు. మా గ్రామంలో ఉన్న కుల వివక్ష ఏ గ్రామంలో ఉండకూదన్నారు.
కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు
స్థానికుడు జంగా పోషయ్యతో పాటు మరో 20 మంది కలిసి గ్రామంలోని 16 మంది అగ్రకుల పెత్తందార్లపై కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన పోలీసులు గ్రామంలో కుల వివక్ష చూపిన పెత్తందార్లపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసు నమోదు చేస్తామని చెప్పారు. గ్రామంలో జరుగుతున్న పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఫికెటింగ్‌ నిర్వహించారు. కెవిపిఎస్‌ ఆధ్వర్యంలో జనగామ నుంచి వెళ్లి గ్రామంలో కుల వివక్ష చూపిన వారిపై చర్య తీసుకోవాలని ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు.
కెవిపిఎస్‌ విచారణలో వెల్లడయినా వివక్ష
సంఘటన వెలుగులోకి వచ్చిన నాలుగైదు రోజుల తరువాత గ్రామంలోని అన్ని కులాల వారు కలిసిమెలిసి ఉండేలా తీసుకోవాల్సిన చర్యలలో భాగంగా జనగామ ఆర్‌డిఓ హరిత గ్రామంలో సహపంక్తి భోజనం ఏర్పాటు చేయాలని స్థానిక తహసీల్దార్‌ను ఆదేశించారు. సహపంక్తి భోజనం ఏర్పాటు చేశారు. అయినా.. ఒకరిద్దరు తప్ప స్థానిక గ్రామ ప్రజలు సహపంక్తి భోజనం చేయలేదు. కెవిపిఎస్‌ జనగామ డివిజన్‌ గౌరవాధ్యక్షులు బొట్ల చిన్న శ్రీనివాస్‌ మిద్దెపాక సుధాకర్‌, అంబేద్కర్‌ సంఘం నాయకులు కన్నారపు పరశురాములును వెంట తీసుకుని వెళ్లి జరిగిన సంఘటన నిజమేనా..? కాదా..? అని ఆరా తీశారు. మంచి నీళ్లు ఇవ్వమని కొందరిని అడుగ్గా మీరు ఏ కులం వాళ్లు అని ఎదురు ప్రశ్నించారని తెలిపారు. మేం మాదిగ కులానికి చెందిన వాళ్లం అని చెప్పడంతో వేరే ఊరి నుండి వచ్చిన ఏ కులం వాళ్లకైనా సహకరిస్తాం కాని మా ఊరి మాదిగోళ్లకు మాత్రం నీళ్లు కాదు కదా ఎలాంటి సహకారం అందివ్వబోమని గ్రామంలో తీర్మానం చేసినట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న కెవిపిఎస్‌ జనగామ డివిజన్‌ కమిటి కార్యదర్శి సుంచు విజేందర్‌, నాయకులు తమ ఆధ్వర్యంలో కుల వివక్షను తొలగించి సామరస్యంతో ప్రజలు కలిసేలా మాట్లాడి సమస్యను కొలిక్కి తెచ్చారు.
కాని సామాజికంగా వారికి జరిగిన అన్యాయం ఎవరు భర్తీ చేస్తారు. పాలకులా..? పోలీసులా..? పెత్తందార్లా...? సమాజం సిగ్గుపడేలా జరిగిన ఈ సంఘటన భవిష్యత్‌లో మరే గ్రామంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి కేసులు నీరుగారకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు టి.స్కైలాబ్‌బాబు, జనగామ డివిజన్‌ గౌరవాధ్యక్షులు బొట్ల చిన్న శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తాత్కాలికంగా ఈ సంఘటన సద్దుమణిగినా.. కుంపటి కింద నిప్పులా.. ఉన్న ఈ కుల వివక్షను భవిష్యత్‌ తరాల ప్రజలకు అంటకుండా చూడాల్సిన బాధ్యత పాలకులదేనన్నారు. కుల వివక్షను చూపే కుల పెత్తందార్ల ఆగడాలను అరికట్టి, సంఘటనకు బాధ్యులైన వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను, ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 


వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామంలో సుమారు రెండు వేల జనాభా, 1400 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో సుమారు 50 దళిత కుటుంబాలు ఉంటాయి. ఆరుగురు దళితులు కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు. దళితులలో ఎనిమిది మంది మాత్రమే డప్పులు కొట్టగలిగినవారు ఉన్నారు. మిగతా వారికి డప్పులు కొట్టడం రాదు. దళిత యువకులు ఎక్కువగా చదువుకునే వారున్నారు. పెత్తందార్ల చావుకు డప్పు కొట్టాలని, ఖననం చేయడానికి గోతి తవ్వాలనీ, కాష్టం పేర్చడం వంటి పనులు ఎస్సీలే చేయాలని గ్రామంలో పూర్వం నుంచి వస్తున్నది. కాని కాల క్రమంలో చదువుకున్న యువకులు ఆపనులు చేయడానికి నిరాకరిస్తున్నారు. కాని పెత్తందారులు దానిని జీర్జించుకోలేక పోతున్నారు. అంటూ గ్రామంలోని దళితులకు ట్యాంకుల ద్వారా తాగు నీరు దగ్గర నుండి నిత్యావసర వస్తువులను కూడా దుకాణాలలో ఇవ్వకుండా గ్రామంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని ఎవరైనా దిక్కరిస్తే వారికి 5 వేల రూపాయల జరిమానా 25 చెప్పుదెబ్బలు, దళితులకు పాలు పోయవద్దనీ, వారి వద్ద నుండి పాలు కొనుగోలు చేయవద్దనీ, చివరకు న్యూస్‌ పేపర్లను కూడా ఇవ్వకుండా హెచ్చరికలు జారీ చేశారు.
Prajashakti News Paper Dated : 07/1/2013

దళితులపై కపట ప్రేమ --Sampadakiyam


రాష్ట్రంలో దళితుల స్థితిగతులు అత్యంత దయనీయమని సాక్షాత్తు జాతీయ ఎస్సీ కమిషనే అభిశంసించింది. ఎస్సీల అభివృద్ధిపై కాంగ్రెస్‌ది వాగాడంబరమేనని తేల్చిపారేసింది. దారిద్య్రం, అక్షరాస్యత, అత్యాచారాలు ఇలా చాలా చాలా విషయాల్లో జాతీయ స్థాయి కంటే ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితి ఘోరమని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఎస్సీ అత్యాచార నిరోధక చట్టం అమలుపై ప్రతి ఆర్నెల్లకోసారి తప్పనిసరిగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం నిర్వహించాల్సి ఉన్నా భేటీ జరిగి మూడేళ్లు దాటిందని కమిషన్‌ తప్పుబట్టింది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధతపై ఇటీవల ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభలో సిఎం కిరణ్‌ కుమార్‌ను అంబేద్కర్‌, పూలేలతో పోల్చి మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కీర్తించారు. ఎస్సీ, ఎస్టీల ఉద్ధరణకే పుట్టారని భజన చేశారు. అట్రాసిటీ చట్టం అమలు సమీక్షకు మూడేళ్లయినా సమావేశం పెట్టడానికి సిఎం తీరిక చేసుకోలేక పోయారన్న ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ పునియా ప్రకటనపై ముఖ్యమంత్రి, ఆయన వందిమాగదులు సిగ్గు పడాలి. దళితులు, గిరిజనుల విషయంలో కాంగ్రెస్‌కు మొదటి నుంచీ రాజకీయంగా సొమ్ము చేసుకునే యావే. హామీలతో ఆకర్షించాలన్న రంధి తప్ప ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఏకోశానా లేదు. సబ్‌ప్లాన్‌పై అసెంబ్లీలో చర్చ చూసినా అంతే. ఎస్సీ, ఎస్టీలు, సంఘాలు, మేధావులు కలిసికట్టుగా ఉద్యమించగా, ఆ పోరాటాలను బొత్తిగా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి, ఆయన సన్నిహితులు తమకు తాముగా చట్టబద్ధతకు ముందుకొచ్చాం, ఎవరి ఒత్తిడీ లేదని ఆత్మవంచనకు పాల్పడ్డారు.
ఎపిలో దళితుల పరిస్థితి అధ్వానంగా ఉందని పునియా మాత్రమే కాదు, నిరుడు రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి ముకుల్‌ వాస్నిక్‌ సైతం కుండబద్దలు కొట్టారు. దళితులపై అత్యాచారాల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలో మూడో స్థానంలో ఉందని వాస్తవాలను కళ్లకు కట్టారు. తాజాగా ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ దళితులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తూర్పార పట్టారు. ఆయన సమీక్ష ప్రకారం ఎపి దళితుల్లో 80 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువనున్నారు. జాతీయ స్థాయిలో పేదరికంపై జరిపిన సర్వేలో 68 శాతం మంది పేదలుండగా, ఇక్కడి దళితుల్లో 80 శాతం మంది పేదలున్నారు. దళితుల జనాభా 16.2 శాతం కాగా ఏనాడూ నిధుల కేటాయింపు తొమ్మిది శాతానికి మించలేదు. ఉద్యోగ నియామకాల్లోనూ సరిగ్గా రిజర్వేషన్లు పాటించిన దాఖలాలు లేవు. పేదరికాన్ని బట్టి అక్షరాస్యత, అక్షరాస్యతను బట్టి సామాజిక చైతన్యం ఉంటుందనేది తాత్విక భావన. ఇక్కడి దళితుల్లో అక్షరాస్యత జాతీయ సగటు కంటే తక్కువుండటానికి కారణం పేదరికమేనని వేరే చెప్పనవసరం లేదు. మదోన్నత్త నేరస్తులకు చట్టాలు చుట్టాలవు తున్నందున దళితులపై అత్యాచారాలు పెచ్చుమీరుతున్నాయి. అట్రాసిటీ కేసులను నెల రోజుల్లో విచారించాల్సి ఉండగా, ఏళ్ల తరబడి సాగదీస్తుండటంతో నేరస్తులు అవలీలగా తప్పించుకుంటున్నారు. నమోదైన కేసుల్లో దర్యాప్తులు పూర్తయి, కోర్టు విచారణ వరకూ వెళ్లేవి చాలా తక్కువ. ఆ రకంగా వెళ్లిన వాటిలో కూడా ఏడు శాతం లోపు కేసుల్లోనే నిందితులకు అరకొర శిక్షలు పడుతున్నాయి. పోలీస్‌స్టేషన్ల దాకా వెళ్లనివి, ఒక వేళ వెళ్లినా నయానో భయానో బాధితులను లోబరుచుకొని మాఫీ చేయించుకుంటున్నవీ కోకొల్లలు. దళితులకు అన్యాయం జరుగుతున్న ఈ వ్యవహారాలలో ఆర్నెల్లకోసారి పర్యవేక్షించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సిన ముఖ్యమంత్రి ఏళ్ల తరబడి సమావేశం నిర్వహించలేని స్థితిలో ఉన్నారంటే దళితులను రక్షిస్తున్నారో, భక్షిస్తున్నారో అర్థమవుతుంది. 'ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా' అని ముఖ్యమంత్రి బాటలోనే కింది స్థాయి అధికారులు ఇంకా నిర్లిప్తంగా ఉన్నారు.
టిడిపి ప్రభుత్వ హయాంలో కుల వివక్ష వ్యతరేక సమరశీల పోరాటాల ఫలితంగా జస్టిస్‌ కొత్తపల్లి పున్నయ్య కమిషన్‌ ఏర్పడింది. అయితే ఆ కమిషన్‌ సిఫారసుల్లో చాలా వరకూ అటకెక్కాయి. కుల వివక్ష రూపుమాపడానికి నెలకోసారి రెవెన్యూ, పోలీస్‌, సంక్షేమ అధికారులు గ్రామాల్లో పర్యటించాలన్న సూచనను పట్టించుకున్న నాథుడు లేడు. ఆ సిఫారసు అమలు జరిగితే బాణామతి, చేతబడి, చిల్లంగి పేర హత్యలు జరిగేవి కావు. రెండు గ్లాసుల పద్ధతి, దేవాలయాల్లోకి నిషేధం వంటివి ఇంకా చాలా ఉండేవి కావు. ఎస్సీలు తమ గోడు చెప్పుకునేటట్లు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఉండాలని పున్నయ్య చెప్పారు. కానీ కమిషన్‌కు ఛైర్మనే లేక నాలుగేళ్లయింది. ఛైర్మన్‌ను ఎందుకు నియమించలేదని పునియా నిలదీసినా సర్కారులో చలనం లేదు. ప్రభుత్వ వాలకం తెలుసు కనుకనే సబ్‌ప్లాన్‌ చట్టబద్ధతపై ప్రభుత్వం ఎంతగా స్వంత డబ్బా కొట్టుకున్నా అమలుపై దళితుల్లో అనుమానాలు వెంటాడుతున్నాయి. అసెంబ్లీలో సబ్‌ప్లాన్‌ చట్టబద్ధత బిల్లు ఆమోదమైన కొద్ది రోజుల్లోనే ఎవిఎంల భద్రత కోసం సబ్‌ప్లాన్‌ నిధులను దారి మళ్లించడంలోనే సర్కారు చిత్తశుద్ధి తేలిపోయింది. ఆ జీవో రద్దు చేయాలని దళితులు నెత్తీనోరు కొట్టుకున్నా చీమ కుట్టినట్టయినా లేదు. భూ పంపిణీ ప్రచారార్భాటం తప్ప వాస్తవంగా ఎస్సీలకు ఒనగూరిందేమీ లేదు. యాంత్రీకరణ వల్ల వ్యవసాయ కార్మికులుగా ఉన్న దళితులు ఉపాధి కోల్పోతున్నారు. కౌలు రైతుల్లో అత్యధికంగా ఉన్న ఎస్సీలను ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో దగా చేస్తోంది. నిధుల్లేక ఎస్సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వట్టి పోయింది. ప్రచారార్భాటం, కల్లబొల్లి కబుర్లు కాకుండా దళితుల అభివృద్ధికి సర్కారుకు చిత్తశుద్ధి కావాలి. లేకపోతే ఆ వర్గాలపై వలకబోసేది కపట ప్రేమేనని అనుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ కమిషన్‌ అభిశంసనతోనైనా సర్కారు కళ్లు తెరుస్తుందా? 
Prajashakti Dated : 09/1/2013

Thursday, January 3, 2013

దళితులకు భూమి ఏది? -- పి.యస్‌. అజయ్‌ కుమార్‌



Sivakami-speach
తెలుగు మహాసభలకు ముస్తాబవుతున్న తరుణంలో తిరుపతి పట్టణానికి ఒక విశిష్టఅతిథి వచ్చారు. ఆమె పేరు శివగామి. తమిళనాడుకు చెందిన సీని యరు ఐ.ఎ.ఎస్‌.అధికారిణి. ఇప్పుడామె ఆ పదవిలో లేరు. స్వచ్ఛంద పదవీ వి రమణ తీసుకొని తమిళనాడులో దళిత భూమి హక్కులకోసం ఆమె పోరాడు తున్నారు. ఈ నెల (డిసెంబరు) 17, 18 తేదీలలో తిరుపతి పట్టణంలో భూసంస్క రణల కార్యాచరణ ఉద్యమం నిర్వహించిన ‘ప్రజా కోర్టు’లో ఆమె జ్యూరి సభ్యురా లుగా పాల్గొన్నారు. దళితులు, ఆదివాసీలు, పేదల భూ సమస్యలపై రెండు రోజులు జరిగిన ఈ ప్రజా న్యాయస్థానంగాని, దళిత కులంలో పుట్టి ఐ.ఎ. ఎస్‌.సాధించి ఒక ఆదర్శంకోసం దాన్ని పరిత్యజించి పల్లెల్లో పోరాడుతున్న శివగామి రాకగాని మీడి యాకు ఎలాంటి ఆశక్తిని కల్గించలేక పోయింది. 

అందులో ఆశ్చర్యం ఏమీలేదు. తన ఎదురుగా ఉన్న దళిత, అణగారిన వర్గాల భూ బాధితులను ఉద్దేశించి 18వ తేది మధ్యాహ్నం ఎస్‌.వి. యూనివర్శిటీ సెనేట్‌హాలులో ఆమె చేసిన లోతైన సుదీర్ఘ ప్రసంగం అనేక అంశాలను స్పృజించి, పలు ప్రశ్నలను ఆంధ్రప్రదేశ్‌ పౌర సమాజం ముందు ఉంచింది.
80 శాతం మంది దళితులు జీవిస్తున్నది గ్రామాలలో. వారు జీవిక కోసం ఆధార పడింది భూమి, వ్యవసాయం పైన. తొలినాళ్లలో శూద్ర వ్యవసాయదారులుగా ఉన్న వారు ఇప్పుడు అగ్ర కులాలుగా మారి ఇతర వ్యాపారాలు, వ్యవహారాలకు మళ్ళిపో యినా భూమిని అంటిపెట్టుకొని ఉన్నది దళితులు, ఆదివాసీలు, శూద్ర కులాల క్రింది పొర అయిన వెనుకబడిన కులాల ప్రజలే. 

భూమి తమ ప్రధాన జీవనాధారం కాకపోయినా అగ్రకులాలు భూమిని వదలడం లేదు. కొడుకులు, కూతుళ్లు, అల్లు ళ్లూ అమెరికాలోనే ఉన్నా, తమ మకాం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, విజయ వాడ, విశాఖపట్నంవంటి నగరాలకు మారిపోయినా వారు భూమిహక్కు పత్రాలను చేతిలో పట్టుకొని సాగుదార్ల కష్టాన్ని పరాన్న భుక్కుల్లా మెక్కుతున్నారు. దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో జమిందారిరద్దు చట్టం వంటి మొదటితరం భూ సంస్కరణల వలన లబ్ధి పొందింది అప్పటి శూద్రకుల రైతు వర్గాలే. మధ్య దళారీలు పోతే వ్యవసాయం అభివృద్ధి చెందుతుందని తద్వారా ‘ట్రికిల్‌ డవున్‌’ సూత్రంలో క్రిందనున్న వ్యవసా యకూలీలకు ఆ ఫలితాలు చేరుతాయని భావించారు.

వ్యవసాయంలో అభివృద్ధి శూద్ర కులాలను అగ్రకులాలుగా మార్చింది. కాని ఈ అభివృద్ధిలో దళితులకు భాగ స్వామ్యంలేదు. దేశ వ్యవసాయరంగంలో గరిష్ఠఅభివృద్ధి సాధించాయన్న పంజాబు, హర్యానా రాష్ట్రాల వ్యవసాయ కూలీలలో దళితులు 79, 55 శాతంగా ఉన్నారు. 1961 లో మొదటిసారి, 1973లో రెండవసారి తెచ్చిన భూ గరిష్ఠ పరిమితి చట్టాలలో ఒక కుటుంబా నికి నిర్ధారించిన ‘గరిష్ఠ పరిమితి’కి ఆధారం ఏమిటని శివగామి ప్రశ్నించారు. 

కేంబ్రిడ్జి భారతీయచరిత్ర ప్రకారం ఆనాటి బ్రిటిష్‌ ప్రభు త్వం ఒక కుటుంబానికి కావలసిన ఆర్ధిక కమతం 2.50 ఎకరాలు మాగాణి (తరి), లేదా 5 ఎకరాలు మెట్ట (కుష్కి) అని నిర్ధారించిందని ఆమెఅన్నారు. ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉంది. 150 సంవత్సరాల కిందట మద్రాసు రెవిన్యూ బోర్డు రూపొందించిన ప్రభుత్వ భూముల నియమాలలో ఒక కుటుంబానికి 2.50 మాగాణి, లేదా 5 ఎకరాలు మెట్ట భూమి వరకు (10 శాతం తేడాతో) మంజూరు చేయవచ్చని చెపుతుంది. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సుల వరకు ప్రభుత్వ భూముల మంజూరుకు మన రాష్ట్రంలో ఇదే ప్రమాణం కొనసాగింది.

పేదలకు భూమి మంజూరు చేసే సందర్భంలో 2.50 ఎకరాల పల్లం (మాగాణి, తరి)ను ఒక ఎకరాకు, 5 ఎకరాల మెట్ట (కుష్కి/చేను)ను రెండు ఎకరాలకు తగ్గించమని కోనేరు కమిటీ తన 1.3 సిఫార్సులో చెప్పింది. అప్పటి ‘మహానేత’ ప్రభుత్వం దీనిని అంగీకరించింది. అదే కమిటీ సీలింగు మిగులు భూముల ‘గరిష్ఠ పరిమితి’ని తగ్గించమని మాత్రం చెప్పలేకపోయింది. విడతల వారి భూపంపిణీలో ప్రభుత్వం ఎకరాలను సెంట్ల(కుంట)కు దిగజార్చింది. 1961 భూ సంస్కరణల చట్టంలో ఒక కుటుంబ సభ్యుడ్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఒక కుటుంబానికి మాగాణి 180 నుండి 360 ఎకరాలు, మెట్ట 1080 నుండి 2160 ఎకరాలు ఉంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. 

ఈచట్టంద్వారా 30 లక్షల ఎకరాలు వస్తాయ న్నారు. చివరికి స్వాధీనంచేసుకున్నది 2384ఎకరాలు. అందుకు ప్రభుత్వం చేసిన ఖర్చు 14 లక్షలు. ఇక రెండవ భూ సంస్కరణల చట్టం 1973 ద్వారా బయటకు వచ్చిన సీలింగు మిగులు భూమి 5 లక్షల 25 వేల ఎకరాలను- 5 లక్షల 82 వేల మందికి పంపిణీచేశారు. ఇందులో 2 లక్షల 24 వేలమంది దళితులకు లభించింది 2 లక్షల 26 ఎకరాలు (2005 మార్చి 31 నాటికి). ఒక కుటుంబానికి సుమారు 1 ఎకరా వచ్చింది. పేదల ఆర్ధిక కమతం 2.50 ఎకరాలు తరికాగా ఇదే సీలింగు చట్టంలో ఈ పరిమితి 15 నుండి 27 ఎకరాలుగాఉంది. అదే మెట్టభూమి తీసుకుం టే పేదల ఆర్ధిక కమతం 5 ఎకరాలైతే పెద్దలది 37 నుండి 54 ఎకరాలుగా ఉంది. అదిచాలదని చట్టానికి సవరణతెచ్చి ‘మేజర్ల’కు అదనపు విస్తీర్ణం చేర్చారు. తెల్లకాగి తాలపై జరిగిన అమ్మకాలు చెల్లుతాయన్నది హైకోర్టు.

‘ఆర్ధిక కమతం’ నిర్ధారణలో అసలు కుట్ర ఉంది. గ్రామీణ పేదరికం పెరుగు తుంటే దానితోబాటు వారి ఆర్ధిక కమతం తగ్గిపోయింది. 1973లో నిర్ధారించిన గరిష్ఠ పరిమితి మాత్రం నేటికీ అలాగే కొనసాగుతోంది. కేంద్రప్రభుత్వం నియమించిన బందోపాధ్యాయ కమిటీ (మన రాష్ట్రం నుండి బాలగోపాల్‌ ఇందులో సభ్యులు) ఈ విషయాన్నిగుర్తించి గరిష్ఠ పరిమితిని కనిష్ఠపరిమితిగా మార్చమంది. సహజంగానే మన ప్రధాన మంత్రి ఆ నివేదికను చెత్తబుట్ట సమర్పయామి చేశారు.
రెండవ భూ సంస్కరణల చట్టం (1973) అనుసరించి 10 ఎకరాల పైబడి ఉన్న వారందరూ భూ సంస్కరణల ట్రిబ్యునల్‌ ముందు ‘డిక్లరేషన్‌’ (రూఢిప్రకటన) దాఖలు చేయాలి.

ఈ ప్రకటనలు ‘పబ్లిక్‌ డాక్యుమెంట్లు’. నిజానికి ప్రతి డిక్లరేషన్‌ ఒక వర్గ పోరాట సాధనం. భూమి లేని కూలీలను సమీకరించి ట్రిబ్యునళ్ళను వర్గ పోరాటకేంద్రాలుగా మార్చేయడానికి అవకాశంఉన్నా కామ్రేడ్లు వాటి జోలికిపోలే దు. భూస్వాముల నుండి భూములు సేకరించే పనిని ప్రభుత్వానికి, ట్రిబ్యునల్స్‌కు వదిలేశారు. 1976-77 కమతాల లెక్కలను, ట్రిబ్యునళ్ళ ముందు దాఖలైన రూఢి ప్రకటనలను పరిశీలిస్తే కోస్తా ఆంధ్రాలో 41శాతం, రాయలసీమలో 63శాతం, తెలంగాణలో 57శాతం కమతదార్లు అసలు డిక్లరేషన్‌లేఇవ్వలేదు. ఇది చట్ట ప్రకా రం నేరం. ప్రకటన ఇవ్వకుండా భూములు అమ్మడానికి లేదు. అయినా ఏం జరిగిందో చూశాం. 

శూద్ర రైతు కులాలకు భూమి హక్కులు కల్పించే జమిందారీ వ్యతిరేకపోరాటం, దళిత పేదలకు భూములను అందించే భూసంస్కరణల పోరా టంలో కామ్రేడ్ల పాత్రను తులనాత్మకంగా పరిశీలించవలసి ఉంది. అయితే ఇందు కు రెండు మినహాయింపులున్నాయి. అవి తెలంగాణ సాయుధపోరాటం, జగిత్యాల నాగేటిచాళ్ళ పోరాటం, అవి రెండూ తెలంగాణలో జరిగాయి.2005 వరకు ఉన్న లెక్కల్ని తీసుకొని చూస్తే, మన రాష్ట్రంలో పంపిణీ అయిన ప్రభుత్వ భూమి 42 లక్షల ఎకరాలు. 23 జిల్లాలలో ఆయా సామాజిక వర్గాలకు పంపిణీ అయిన భూవిస్తీర్ణం అన్ని జిల్లాలలో, ఆ జిల్లాలో దళిత జనాభాతో సంబం ధం లేకుండా 22శాతంకు మించలేదు. 

రాష్ట్ర జనాభాలో దళితులు 18.45 శాతం (2001) ఉండగా, గ్రామీణ పేదలలో వారు 35 శాతం ఉన్నారు. పంపిణీ అయిన భూమిలో 40 శాతం పేదల నుండి పెద్దలకు అన్యాక్రాంతం అయ్యిందని అంచనా. దీనిని నివారించేందుకు 1977లో తెచ్చిన అన్యాక్రాంత నిషేథ చట్టాన్ని ప్రభుత్వం అమలుపరచనూ లేదు, అందుకు ఉద్యమాలు రానూలేదు. పేదలు ముఖ్యంగా దళిత ఎసైనీదార్లకు రక్షణకల్పించే ఈ చట్టాన్ని 2007 అప్పటి ‘మహానేత’ ప్రభుత్వం సవరణ తెచ్చి నీరుగార్చింది. ఈ సవరణ ఆధారం చేసుకొని కడప జిల్లా మొత్తాన్ని చట్టం పరిధి నుండి మినహాయించారు. ఎక్కడ ఎసైన్‌మెంటు భూములు ఎక్కువగా ఉంటే అక్కడ సవరణ చట్టాన్ని వాడుకొని పేదల నుండి భూములు లాక్కున్నారు. భూముల విషయంలో దళితులకు ఇంత పబ్లిక్‌గా జరిగిన మోసం, దగా బహుశా ఈ ఐదు దశాబ్దాలలో మరొకటి లేదు.

దళితులకు భూమి ఉండవలసిన అవసరాన్ని శివగామి నొక్కి చెబుతున్నారు. తాను ఎంత పేదరికంలోఉన్నా ఐ.ఎ.ఎస్‌. వరకు వెళ్ళడానికి కారణం తన తల్లిదండ్రులకు ఉన్న కొద్దిపాటి భూమేనని ఆమె అన్నారు. అంతేకాదు దేశంలో దళిత వర్గాల నుండి ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌. అయినవారు, ఇతర ఉన్నత స్థానాలలోకి వెళ్లగలిగిన వారి నేపథ్యం పరిశీలిస్తే ‘భూమి’ పోషించిన పాత్ర కనిపిస్తుందని చెప్పారు. భూమిలో వ్యవసాయం చేయకపోయినా ఫర్వాలేదు, అది దళితులకు భరోసాను, భద్రతను, ఆత్మగౌరవాన్ని పరపతిని ఇస్తుందని, కనుక ఎవరికంటే కూడా దళితులకు భూమి అవసరం ఉంటుందనీ అన్నారామె. 

శివగామి వంటి ఐ.ఎ.ఎస్‌.లకు ఆదర్శంగా నిలచిన ఎస్‌.ఆర్‌. శంకరన్‌ దళిత గ్రామీణ పేదల అభివృద్ధిలో ‘భూమి’ ప్రాధాన్యతను గూర్చి ఇలాఅన్నారు- ‘భూమికి సంబంధించిన అన్నిసంబంధాలు లేదా భూమికి సంబంధించిన ఉత్పత్తి సంబంధా లను, భూమిలేని పేదలకు అనుకూలంగా పునర్నిర్మించడమే భూ సంస్కరణలు. భూ బదలాయిపు ద్వారా ఉన్నవారి నుండి లేని వారికి అధికారం, ఆస్తి, హోదా అన్నీ ఒక బృందం నుండి మరో బృందానికి మారుతాయి.

కొంత భూమి తమ స్వంతం అని పేదవారు అనిపించుకున్నపడు స్వతహాగా ఆత్మాభిమానం, ఆత్మస్థైర్యం, ఇతరు లతో తాము సమానం అనే భావనలు వారిలో కలుగుతాయి. దారిద్య్రానికి, పరాన్న భుక్కులకి, దోపిడీ అసమానత సంబంధాలకు మూలకారణంగా భూసమస్య కనిపి స్తుంది. పేదవారికి భూ పంపిణీ చేయడంద్వారా వారు దోపిడీ నుండి విముక్తి పొందగలరు. తద్వారా మార్కెట్‌లో కార్మిక శక్తి, రుణ లావాదేవీలు బలపడతాయి. లబ్దిదారులకు బ్రతికేందుకు ఒక బలమైన ఆధారం దొరుకుతుంది. అంతేగాకుండా వారి సాంఘిక, ఆర్ధిక హోదాలు మెరుగుపడతాయి’.

సాలుకు లక్ష రూపాయలు వ్యవసాయేత ఆదాయం ఉన్నవారికి భూమి ఉండన వసరం లేదన్నది శివగామి భావన. వ్యవసాయేతర రంగాలలో ఆదాయాలు పొందు తున్నవారు, పన్ను ఎగవేత కోసం వ్యవసాయ భూములను కొనసాగిస్తున్నారు. విదేశాలలో స్థిరపడి ‘గ్రీన్‌ కార్డు’లు పొందిన వారికి వ్యవసాయం భూమితో ఏమి పనని శివగామి సూటిగాప్రశ్నిస్తున్నారు. భూమిపై జీవనోపాధి పొందుతున్న వారికి, వ్యవసాయంపై జీవిస్తూ భూమిపై హక్కులేని వారికి ఇచ్చేందుకు దేశంలో కావలసి నంత భూమి ఉందని ఆమె అంటారు. 

వామపక్ష పార్టీలను మినహాయిస్తే రాష్ట్రంలోని ప్రధాన స్రవంతి రాజకీయ పార్టీ లు, వాటి నాయకులు పల్లెబాటలు, కాలిబాటలు, సురాజ్యాలు ఇలా రకరకాల పేర్ల తో యాత్రలు చేస్తున్నారు. ప్రజలకు వరాల జల్లులు కురిపిస్తున్నారు. దళిత, పేద ప్రజలారా జాగ్రత్తగా చెవి ఒగ్గి వినండి. అందులో ‘భూమి’, ‘పంపకం’ అనే మాటలు మీకు వినిపించవు, కనిపించవు. కలెక్టరుగా తాను ఆదేశాలు ఇవ్వగలను గాని అవి తమ దళితులకు చేరాలంటే ముందువారు సంఘటితం కావాలని శివగామి గుర్తించారు. అదే జరిగి తే కలెక్టరుగా తాను లేకపోయినా పనులు జరుగుతాయని భావించారు. తమిళనా డు దళితభూఉద్యమానికి,పంచమిభూముల సాధనకు ప్రజలను సమీకరి స్తున్నారు ఆమె. గొప్ప చరిత్రకలిగిన దళితఉద్యమం- దారి ఎక్కడతప్పిందో గ్రహిస్తుందా!?


పి.యస్‌. అజయ్‌ కుమార్‌

Surya News Paper Dated : 30/12/2012