Showing posts with label మహిళలు. Show all posts
Showing posts with label మహిళలు. Show all posts

Sunday, April 21, 2013

బహుజన మహిళలూ.. బహుపరాక్ ! - జ్వలిత



'బహుజనం లోపించిన స్త్రీవాదం' అవసరమైన చర్చ. సునీత స్త్రీవాదాన్ని విస్తృతార్థంలో చూద్దాం' అని రాసినా, విమల 'ప్రాంతీయ దృక్పథాల్లోంచి చూద్దాం' అన్నా అందులో సూడో ఐక్యత కొంత, షాడో ఆధిపత్యం మరింత తొంగిచూస్తూనే ఉంది. పేర్లే తేడా. బహుజన మహిళల కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్నాం అని చెప్పుకుంటున్న సంస్థలు బి.సి మహిళల కోసం ఏమి చేశారు? ఒకరిద్దరు దళిత మహిళల రచనలు ప్రచురించి చేతులు దులుపుకున్నారు.

అన్ని రంగాలతోపాటు సాహిత్యపరంగా కూడా ఎదిగింది ఆధిపత్య వర్గపు మహిళలే. వారసత్వంగాగాని, మరొకరకంగాగాని వారే నిలబడగలిగారు. నిలబెట్టబడ్డారు, ఆ వర్గాల పురుషుల వల్లనే. విశ్వవిద్యాలయాల్లో, పీఠాలు, ప్రభుత్వ శాఖల్లో ఆ మహిళల ఆధిపత్యాన్ని బహుజన మహిళలపై ప్రయోగింపజేశారు. ఆ విధంగా ఆ మహిళలు సాధికారతను సాధించినట్లుగా, సమాన హక్కులు సాధించినట్లుగా చెప్పుకున్నారు. ఆ అవకాశం బహుజన మహిళలకు లేదు. బానిసలకు బానిసలైన వారికి అది సాధ్యపడదు.

అయినా ఆధిపత్య వర్గాలు బహుజన మహిళల కోసం ఏదో చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. విమల తన వ్యాసంలో 'తెలంగాణ మహిళా డిక్లరేషన్ ప్రకటన' వివిధ దృక్కోణాల్లో బలంగా చెప్పింది అన్నారు. అంతకు ముందునుంచే తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన బహుజన మహిళా గళాలున్నాయి. అవన్నీ 'గాయాలే గేయాలై' కవితా సంపుటిలో రికార్డయినాయి. వాటిని గుర్తించడానికి వీరి ఆధిపత్య భావజాలం అడ్డుపడుతుంది. ఈ మధ్య హైదరాబాద్‌లో జరిగిన 'తెలంగాణ మహిళా ప్రభంజనం'ను ఒక రాజకీయ మహిళావర్గం హైజాక్ చేసిన ఉదాహరణ ఉండనే ఉంది. బహుజన మహిళలను ఒక్కరిద్దరిని కలుపుకొని వారికి కూడా ద్వితీయ ప్రాధాన్యతనిచ్చి ఏదో ఉద్దరిస్తున్నామంటే ఎలా?

ఆదివాసీ మహిళల గురించి ప్రాజెక్టుల పేరున, రీసెర్చ్‌ల పేరున ఆధిపత్య మహిళలే స్టడీ చేస్తారు. వారి కోణంలో రాసినవే రికార్డవుతాయి. ఆదివాసీ మహిళల భాగస్వామ్యం ఉండదు. విమల రాసినట్లు, అమెరికా మహిళ పిలుపునందుకొని ఎన్‌జివో లు చేసే హంగామా, బహుజన మహిళల పట్ల చూపితే లాభ మేముంటుంది! విదేశీ గుర్తింపులు, అవార్డులు, రివార్డులు, విదేశీ, స్వదేశీ ఆర్థిక వసతులు లభించవు కదా! మరో కొత్త అంశం గమనించాలి: ఇప్పుడే ఎదుగుతున్న దళిత మహిళలను బీసీ, మైనారిటీ మహిళలపైకి పురిగొల్పుతున్నారు. ఈ కుట్ర ఇలాగే కొనసాగితే బహుజన ఐక్యత ఆవిరైపోతుంది. అది ఆధిపత్య మహిళలకు మరో విజయమే అవుతుంది.

విస్మరణ అంటు జాడ్యమై బహుజన మహిళలను అణిచివేయకుండా ఉండాలంటే ఎవరి కుట్రలకో మనం పరికరాలుగా మారకుండా జాగ్రత్త పడవలసిన అవసరం బహుజన మహిళలకున్నది.
- జ్వలిత
99891 98943 

Andhra Jyothi Telugu News Paper Dated: 22/4/2013

Thursday, March 28, 2013

వయోలెన్స్‌... సైలెన్స్‌ By G Vijayalaxmi



కఠిన చట్టాలకోసం, క్రూరమైన శిక్షలకోసం నగర రహదారులు ర్యాలీల రిబ్బన్లవుతున్నాయి. కొత్త చట్టాలు భద్రమైన సమాజాన్ని సృష్టిస్తాయని మధ్యతరగతి కలలు కంటున్నది. యాదృచ్ఛికంగా పెల్లుబికే ఆవేశాల అణచివేతకు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో కేంద్రప్రభుత్వం దారుణ శిక్షల చట్టాల చిట్టాను వెలుపలికి తీసింది.
స్త్రీ ఆదిశక్తి, భరతమాత, జగన్మాత, మహాకాళి, మాతృ దేవత- ఇది ఒక కోణంలో. మరో కోణంలో స్త్రీ బానిసకొక బానిస. ఈ బానిసత్వం ఒకనాటితో వచ్చింది కాదు. ఆదిమ సమాజంలో మానవుడు తండాలుగా వేటమీద ఆధారపడి జీవించే దశలో, నీది నాది అనే స్వంత ఆస్తి భావన లేని రోజుల్లో పురుషులు వేటకి వెడితే స్త్రీలు పోడు, సమాన శ్రమ విభజన ఉన్న వ్యవసాయం, పిల్లల సంరక్షణ చేస్తూ ఉండే వారు. ఈ దశలో స్త్రీ, పురుష సంబంధాల మధ్య ఎలాంటి ఆంక్షలూ లేవు. ఆస్తి లేదు. కాబట్టి ఆడ, మగ మధ్య సంపూర్ణమైన సమానత్వం ఉండేది. అంతేకాదు, ఈ మాతృస్వామ్య దశలో మానవజాతి సృష్టికి కారకురాలుగా ఆమె అత్యున్నతంగా గౌరవం పొందింది. ఆహార సేకరణ దశ, ఆహారోత్పత్తి దశకి చేరిన తర్వాత వ్యక్తిగతఆస్తి ఏర్పడి క్రమంగా నీదీ, నాదీ అనుకునే దశలో స్త్రీని ఇంటిపనికి కుదించి పురుషుడు వ్యవసాయాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఏకభర్తృత్వం ద్వారా వ్యక్తిగత ఆస్తి పుట్టుకకు ముందే పితృస్వామిక సమాజం ఆవిర్భవించడంతో స్త్రీపై మొదటి అణచివేత ప్రారంభమైంది. ఆ తర్వాత మిగులు ఉత్పత్తికి, ఆస్తికి పురుషుడు హక్కుదారుడయ్యాడు. వ్యక్తిగత ఆస్తి ఏర్పాటు కారణంగా తండా పద్ధతి నశిస్తూ కుటుంబ వ్యవస్థ గట్టిపడటం ప్రారంభమైంది. మాతృస్వామిక వ్యవస్థ స్థానంలో పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. స్వంత ఆస్తి పుట్టుక స్త్రీని పురుషుడికి శాశ్వతంగా బానిసగా చేసింది. 

స్త్రీని దశలవారీగా తండ్రి, భర్త, కుమారుల ఆధీనంలో నిర్బంధించి, సాంఘిక కట్టుబాట్లు ఏర్పరిచి గృహ కృత్యాలకు కట్టిపడేసి స్త్రీని ఈనాటి నికృష్ట జీవితానికి గురిచేసింది. దోపిడీకి గురయ్యే పీడితుల అణచివేతను సైతం సహజమైనదిగా, దైవ సమ్మతమైనదిగా భ్రమింప చేయడంలో మతం కీలకపాత్ర వహించింది. అందులో భాగంగానే స్త్రీలపై పురుషాధిక్యత దైవసృష్టి అని ప్రచారం చేసి చిన్నప్పటినుంచే స్త్రీల మెదళ్ళలో పాతివ్రత్యాన్ని నూరిపోసి ఇలా నడవకూడదు, అలా నవ్వకూడదు అని ఆంక్షలు విధించారు. బాల్యంనుంచే స్త్రీని బలహీను రాలిననే ఆత్మన్యూనతా భావానికి గురిచేసి అబల అన్నారు. ఏ మతమైనా స్త్రీని అణచి వేయడంలో ప్రధానపాత్రే వహించింది. 
లైంగిక అత్యాచారాలు, తిట్లు, తన్నులు, ఆంక్షలు, సూటిపోటి మాటలు, లైంగికత్వంపై దాడి- ఇవన్నీ స్త్రీలు ప్రతిరోజూ ఎదుర్కొంటున్న సంఘటనలు. ఇవి కనిపించేవైతే గుట్టుచపడు కాకుండా జరిగేవి కొన్ని ఉన్నాయి. ఇంటిచాకిరీ, పిల్లల పెంపకం లాంటి ఆదాయం లేని పనులు వాళ్ళకి అప్పగించి, వాళ్ళ శ్రమకి విలువ లేకుండా చేసి వాళ్ళకి ప్రత్యేకమైన వ్యక్తిత్వం లేకుండా చేశారు. అసలు కుటుంబమే ఇప్పుడున్న రూపంలో హింస. దానిని నిలబెడుతున్న పితృస్వామ్య వ్యవస్థ ఈ హింస అంతటికీ మూలకారణం. రాజకీయ వ్యవస్థలకంటే బలమైనది కావడం వల్లనే ఇది మారకుండా అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. స్త్రీలకు హక్కులివ్వడం, వాళ్ళకోసం చట్టాలు చెయ్యడం, కేవలం కాలానుగుణంగా చేసే మేకప్‌ మాత్రమే. 

మహిళలపై హింసను నిరోధించటానికి పదహారు అంశాల కార్యాచరణను ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించింది. చట్టాలు అమలు చేసి రూపొందించటమే కాదు, జాతీయ స్థాయిలోనూ, స్థానికంగానూ పటిష్ఠ కార్యాచరణ వ్యూహాల్ని చెపుతోంది. మహిళా హక్కుల్ని తొక్కిపట్టే కాలం చెల్లిన చట్టాలు ఇంకా రాజ్యాంగంలో అనేకం ఉన్నాయని జాతీయ మహిళా సంఘం ఏనాడో ప్రస్తావించింది. ఇటీవల తెచ్చిన పని ప్రదేశాల్లో వేధింపుల నిరోధక చట్టం వంటివి, కొన్నేళ్ళ క్రితం నాటి గృహహింస చట్టం వంటివి మాత్రమే స్త్రీలకు రక్షణ కవచాలు కాలేవు. అత్యాచార కేసుల్లో నేరం రుజువైతే శిక్షలు పడుతున్నవి కేవలం 24 శాతమే. సమస్య మూలం ఎక్కడున్నది అనూహ్యం కాదు. ఇండియాలో 2010 కంటే 7.1 శాతం అధికంగా 2011లో మహిళలపై 2,28,650 నేరాలు జరిగినట్లు జాతీయ నేర నమోదు సంస్థ లెక్కతేల్చింది. అభాగ్య స్త్రీలను వ్యభిచారంలోకి నెట్టడంలో ప్రపంచంలో ఇండియా రెండోస్థానంలో ఉంది.

టాటా వ్యూహాత్మక నిర్వహణ బృందం తాజాగా బహుళ అధ్యయనాలను విశ్లేషించి (వెల్‌బీయింగ్‌ ఇండెక్స్‌) మహిళా రక్షణ సూచీలను వెలువరించింది. వీటిప్రకారం హర్యానా, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌లు అట్టడుగు స్థానాల్లో ఉంటున్నాయి. స్త్రీలపై సాధారణంగా జరిగే లైంగిక అత్యాచారాలకు అంతేలేదు. ఆరేళ్ళ పసివారినుండి అరవై ఏళ్ళ వృద్ధురాలి వరకూ అత్యాచారాలకు గురవుతున్నారు. ఇంటినుండి బయటికి వెళ్ళిన మహిళ క్షేమంగా ఇల్లు చేరుతుందో లేదో తెలియదు. అసలు తన ఇంట్లో తానే భద్రంగా ఉండగలదా అనేది మరో ప్రశ్న. 

మహిళలు వంటింటి కుందేళ్ళు మాత్రమే అనే దృక్పధాన్ని రాణి రుద్రమ నుంచి మదర్‌ ధెరిస్సా వరకు తప్పని ఏనాడో నిరూపించాం. నేటి ఆధునిక మహిళ అన్ని రంగాల్లో తన ఉన్నతిని చాటుతుంది. కొన్ని రంగాల్లో పురుషులను అధిగమించి దూసుకుపోతోంది. ఆర్థిక, సాంఘిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అగ్రభాగాన నిలచి విజయపతాక ఎగురవేస్తున్నది. మహిళలను గత చరిత్ర నీడలు భయపెట్టినా వర్తమాన, భవిష్యత్‌ చిత్రపటంలో తన హక్కులు నిలబెట్టుకోవడానికి నిరంతరం పోరాటాలు చేస్తూనేఉంది. ఆకాశంలో సగం కాకుండా అనంతమంతా నేను అంటుంది. 

నాణానికి రెండోవైపు చూస్తేచ అదే సమయంలో ఎంత విద్యావంతురాలైనా ఎన్ని ఉన్నత పదవులు నిర్వహించినా ఏదో హింసకు ప్రతి నిత్యం గురవుతోంది. వయోపరిమితి, వరస వావి లేకుండా ఇంటా బయటా అనేక హింసలను ఎదుర్కొంటోంది. ప్రతిరోజు మన సమాజంలో ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు ఏదో ఒక హింసకు బలవుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ప్రతి 26 నిముషాలకు ఒక మహిళ వేధింపులకు గురౌతోంది. ప్రతి 34 నిముషాలకు ఒక మహిళపై అత్యాచారం జరుగుతోంది. ప్రతి 42 నిముషాలకు ఒక మహిళపై లైంగిక వేధింపులు, అలాగే వరకట్నం కోసం ప్రతి 99 నిముషాలకు ఒక వధువు బలి అవుతోంది.

వివాహమైన మహిళలకు కొందరి జీవితంలో పెళ్ళంటే నూరేళ్ళపంట అనేకంటే బ్రతుకంతా మంట అనవలసి వస్తుంది. కన్యాశుల్కం నాటి నుండి వరకట్నం దాకా ఇది కొనసాగుతూనే ఉంది. ఎవరైనా చైతన్యవంతురాలైన మహిళ, సాటి మహిళలకు సలహా ఇవ్వబోతే భర్తే ప్రత్యక్ష దైవం అంటూ తమను ఎంత హింసించినా సతీసావిత్రి సతీఅరుంధతి వంటి పతివ్రతలను తలుచుకొని ‘నా మొగుడు గాక నన్ను ఇంకెవరు కొడతారు, తిడతారు’ అనే వారు ఉన్నారు. మహిళ అయితే చాలు చిన్నారి అయినా, పిచ్చిదైనా, వికలాంగురాలైనా, అఖరికి వృద్ధురాళ్ళని కూడా అత్యాచారాలకు గురిచేస్తున్నారు. పెట్టుబడిదారులు తమ వ్యాపార ప్రకటనల్లో, సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో మహిళల్ని కేవలం వ్యాపార అభివృద్ధి వస్తువుగా చూపిస్తున్నారు. సెక్స్‌ సింబల్‌గా, జుగుప్సాకరంగా, విలన్లుగా చూపిస్తున్నారు. చదివిన దానికంటే కూడా చూసిన దృశ్యమే సమాజంపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఆ విధంగా చెడు ప్రభావానికి గురై లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు, హత్యలకు, నేర ప్రవృత్తికి దారితీస్తోంది.
అత్తగార్ని కోడలు తల్లిలా ఎలా గౌరవించాలి, కోడల్ని అత్తగారు కూతురులా ఎలా అభిమానిం చాలి, చిన్నపిల్లల్ని ఎలా ప్రేమగా చూసుకొని ప్రేమతత్వాన్ని నేర్పాలి, వృద్ధుల మనోభావాలు దెబ్బ తినకుండా ఏ విధమైన పద్ధతులు ప్రవేశపెట్టాలి, ఏ వయసు వారికి ఆ వయసుకు తగిన వ్యక్తిత్వం ఎలా ఉండాలి- ఇలాంటి విషయాలపట్ల కనీస అవగాహన కల్పించే సామాజిక స్పృహ, బాధ్యతలు ఈ పెట్టుబడిదారులకుగానీ, ప్రభుత్వానికి గానీ, రాజకీయ నాయకులకు గానీ లేవు. కేవలం తమ తమ లాభనష్టాలు, స్వార్థ ప్రయోజనాలు మాత్రమే వారికి ముఖ్యం.

స్త్రీలను మార్కెట్‌ సరుకుగా, సెక్స్‌ సింబల్‌గా చూపిస్తున్న అన్ని వాణిజ్య ప్రకటనల్ని రద్దుచేయాలి. స్త్రీలు కేవలం లైంగిక సుఖాన్ని ఇచ్చే యంత్రాలుగా చూసే భావజాలం మారాలి. స్త్రీనా పురుషుడా అని కాకుండా మనుషుల్ని ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవారిగా గౌరవించే సంస్కృతి రావాలి. అప్పుడు మాత్రమే అత్యాచారాల్ని హత్యల్ని ఆపగలుగుతాం. మహిళలపై జరుగుతున్న అన్ని దాడులకు ప్రభుత్వమే కారణం కాబట్టి మహిళలపై జరుగుతున్న హింసకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మహిళలపై అత్యాచారాలకు, హత్యలకు, యాసిడ్‌ దాడులకు పాల్పడిన నేరస్థులను ఎన్‌కౌంటర్లు చేయడం, సామాజిక అత్యాచారాలు జరిగినప్పుడు మరణ శిక్షలు విధించడం సమస్యకు పరిష్కారం కాదు. ప్రజాస్వామ్య విలువలకై పోరాడుతూ, రేపటి తరం యువతను సామ్రాజ్యవాద విషసంస్కృతినుండి రక్షించుకోవడం మనందరి బాధ్యత. వ్యవస్థే నేరమయ మైనపుడు వ్యక్తులు మాత్రమే ఎలా నేరస్థులవుతారు? ఈ వ్యవస్థను తయారు చేస్తున్న ప్రభుత్వాలు, రాజకీయపార్టీలే అసలు సిసలు నేరస్థులు. మహిళల వ్యక్తిత్వాల్ని దెబ్బతీస్తూ వారిని అంగడి సరుకుగా మారుస్తున్న మీడియా, పెట్టుబడిదారులు, ప్రభుత్వమే మహిళలపై జరిగే హింసకు కారణం.

ఫ్యాక్టరీల్లో యజమానుల లైంగిక వేధింపులు, కూలికెళ్తే కామందుల కామానికి బలి కావడాలు, మైనర్‌ బాలికల్ని పనుల్లో పెట్టుకొని- తండ్రి వయసున్న యజమానులు వారిపై అత్యాచారాలు చేయడం, కులంపేరుతో కింది కుల మహిళలపై అగ్రకుల పురుషులు గ్యాంగ్‌ రేప్‌లు, హత్యలు చేయడం, గురువుల కామాగ్నికి బలయ్యే విద్యార్థినులు, ప్రేమను కాదన్నందుకు యాసిడ్‌ దాడులు, హత్యలు, కట్నంకోసం కిరోసిన్‌ బాత్‌లు, భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, మాతంగులు, ఆడపిల్లల అమ్మకాలు, బలవంతంగా వ్యభిచారంలో దించడం, కులాంతర వివాహాలు చేసుకున్నందుకు వారిని కన్నవారే కసాయిలుగా నరకడం- ఈ జాబితాకు అంతే లేదు. ఇక పోలీసుల చేతుల్లో బలైన చిత్తాయి, సిలకమ్మలు ఎంతోమంది ఉన్నారు. దేశంలో రోజురోజుకీ స్త్రీలలో చైతన్యం అభివృద్ధి చెందుతోంది. స్త్రీలు తమ చరిత్రని తాము నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్రలో, సమాజంలో, రాజకీయాలలో కుటుంబంలో తమ స్థానంకోసం పోరాటం చేస్తున్నారు.నిరంతరం మగపెత్తనానికి, పితృస్వామిక హింసకు గురవుతున్న భారత స్త్రీలకు తమపై అమలవుతున్న హింసను, ఆధిపత్యాన్ని వ్యక్తిగత స్థాయిలో, సమాజ స్థాయిలో ప్రతిఘటించ డంతో పాటు కరుడుగట్టిన పురుష దృక్పథంతో రూపుది ద్దుకున్న భారత న్యాయచట్టాల్లో స్త్రీలకు అనుకూలంగా మార్పులు తీసుకు రావడానికి భారత స్త్రీలు పోరాడాలి. స్త్రీలపై జరుగుతున్న హింసాకాండను, మగపెత్తనాన్ని, పితృస్వామిక భావజాలాన్ని రూపుమాపేందుకు మహిళలు పిడికిలి బిగించాలి. 

స్త్రీమూర్తుల్ని సమర్థ మానవ వనరులుగా తీర్చిదిద్దకుండా సమానత్వం, సాధికారత రావు.వాణిజ్య ప్రకటనల్ని, అందాల పోటీల్ని, మద్యపానాన్ని నిషేధించాలి. మానవ సృష్టికి మూలమైన, సమాజంలో, సహజీవనంలో సగమైన స్త్రీవ్యక్తిత్వాన్ని కాపాడేలా ప్రభుత్వాలు పనిచేయాలి. మగపిల్లలకు చిన్ననాటినుండే ఎదుటి స్త్రీని గౌరవించే సంస్కారాన్ని తల్లిదండ్రులు నేర్పించాలి. స్త్రీల సమస్యలపై అవగాహన కల్పించాలి. అవసరం వచ్చినపుడు మాత్రమే కాకుండా ప్రాథమికవిద్యనుంచే ఆడపిల్లలకు మార్షల్‌ఆర్ట్‌‌స నేర్పించాలి. కార్యాలయాల్లో కంప్లెయింట్‌ బాక్సులు, కళాశాలల్లో అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయాలి. చట్టాల్లో మార్పు కన్నా సమాజంలో మార్పు, భావజాలంలో మార్పు కోసం ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచి నైతిక విద్యాబోధన జరగాలి. దుశ్శాసన సంతతిపై కఠిన శిక్షల కొరడా పడాలి. అశ్లీలతకు అడ్డుకట్ట వేయాలి. 

వీటన్నింటికోసం సమాజంలో ప్రతి ఒక్కరిలో చైతన్యం పురివిప్పాలి. దాదర్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి ఢిల్లీ బస్సులో నిర్భయ ఉదంతం వరకూ అత్యాచారాల చిట్టా పెరుగుతూనే ఉంది. నిర్భయ ఉదంతం జాతి గుండెలను కలచివేసినా పరమ జుగుప్సా కరంగా అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయన్నది మరవకూడదు. జస్టిస్‌ జెఎస్‌ వర్మ సూచనల్ని కొన్నింటిని తోసిపుచ్చి అత్యవసర ఆదేశాన్ని జారీచేసిన కేంద్ర ప్రభుత్వం సామాజిక విలువలు పెంచటంలో తన వంతు ప్రయత్నం ఏం చేసిందో- ఇంకా ఏం చేస్తుందో వేచి చూడాలి.


జి. విజయలక్ష్మి
Surya  News Paper Dated: 28/3/2013
Email | Print |

Friday, March 8, 2013

బహుముఖ సవాళ్ల మధ్య మహిళా ఉద్యమాలు -- కె స్వరూపరాణి


 Thu, 7 Mar 2013, IST  

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ దినోత్సవాన్ని భిన్న దృక్పథాలతో జరుపుకుంటారు. కానీ ఈ రోజు యొక్క విశిష్టత, రాజకీయ ప్రాధాన్యతను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
19వ శతాబ్దపు మధ్య కాలంలో జరిగిన పారిశ్రామిక విప్లవం స్త్రీలను ఇళ్ళ నుంచి బయటికి తెచ్చింది. ఆర్థిక అవసరాలు వారిని సామాజిక ఉత్పత్తిలోకి అనివార్యంగా తెచ్చాయి. ఒకవైపు ఇంటి చాకిరీ, మరోవైపు కర్మాగారాలల్లో అంతులేని శ్రమదోపిడీతో రోజుకు 14 నుంచి 16 గంటలు పనిచేసేవారు. దుమ్ము, ధూళి నిండిన చీకటి గుయ్యారాల్లాంటి కర్మాగారాల్లో అమానవీయ పరిస్థితులు ఉండేవి. అసమాన వేతనాలతో సరైన తిండి లేక చిన్నతనంలోనే వృద్ధాప్య ఛాయలు పొడచూపేవి. ఆనాటి శ్రామిక మహిళల ఆయుఃప్రమాణం 36 ఏళ్ళకు దిగజారింది.
అమెరికా కర్మాగారాల్లో పనిచేస్తున్న శ్రామిక స్త్రీలు ఒకరికొకరు తోడయ్యారు. ఒకరి కష్టాలు ఒకరు అర్థం చేసుకున్నారు. ఈ ఐక్యతే పోరాటాలకు నాంది పలికింది. 1845లో పనిగంటలను 16 నుంచి 10కి తగ్గించాలని కోరుతూ మొదటిసారి భారీ ర్యాలీ జరిగింది. ఈ ఉద్యమాన్ని యాజమాన్యం అణచివేయాలని ప్రయత్నించింది. 'ఆకలితో చస్తూ బ్రతికే కన్నా పోరాటంలో చావటం మేలు' అంటూ 1857లో న్యూయార్క్‌ నగరంలో వేతనాలు పెంచాలని, పనిగంటలు తగ్గించాలని, అమానవీయ చర్యలకు వ్యతిరేకంగానూ, ఓటుహక్కు కోసం బట్టల మిల్లుల్లో పనిచేసే వేలాది మంది మహిళలు సమ్మె చేశారు. ఇది సహించలేని యాజమాన్యం మహిళా కార్మికుల్ని నిర్బంధించి నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపింది. 146 మంది తుపాకీ తూటాలకు బలయ్యారు. అయినా మొక్కవోని ధైర్యంతో సమ్మెను కొనసాగించటంతో యాజమాన్యం దిగిరాక తప్పలేదు. అమెరికాలో జరిగిన పోరాట స్ఫూర్తితో అనేక దేశాలలో కార్మికుల సంఘటిత పోరాటాలు ఊపందుకున్నాయి. 1868లో మొదటి అంతర్జాతీయ సదస్సులో మార్క్స్‌ స్వయంగా మహిళల హక్కులు, సమస్యలను ప్రస్తావించారు. పరిశ్రమలలో పని చేసేందుకు అధిక సంఖ్యలో స్త్రీలు ముందుకు రావాలని, మహిళా కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే సరైన చట్టాలను చేయాలని, ట్రేడ్‌ యూనియన్లలో మహిళలకు సమాన హక్కులుండాలని స్పష్టం చేశారు. ఆ ప్రోద్బలంతో అనేక దేశాలలో మహిళా కార్మికులు శ్రామిక వర్గ ఉద్యమాలలో అగ్రభాగాన నిలిచారు.
1971 నాటి చారిత్రిక పారిస్‌ కమ్యూన్‌లో అనేక రంగాలలో పనిచేస్తున్న మహిళా కార్మికులు, ఉద్యోగులు, రోజువారి కూలీలు, మేధావులు విప్లవోద్యమంలో పాల్గొన్నారు. వారిలో అనేక మంది ఆ పోరాటంలో ప్రాణత్యాగం చేశారు. 1893లో ఫ్రాన్స్‌ మహిళల హక్కుల ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు 'మహిలకు ఉరికంబాలెక్కే హక్కు ఉన్నప్పుడు పార్లమెంటులో ప్రవేశించే హక్కు ఎందుకుండదు' అని మహిళలు రాజకీయ హక్కుల కొరకు ప్రశ్నించారు. ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమాలతో పాటు శ్రామిక మహిళల ప్రత్యేక డిమాండ్లకై ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. ఈ కాలంలోనే ప్రముఖ జర్మనీ కమ్యూనిస్టు నాయకురాలు క్లారా జట్కిన్‌, లారా లఫార్గ్‌ (మార్క్స్‌ కుమార్తె)తో కలిసి శ్రామిక మహిళల ఉద్యమానికి సహకరించారు. ఎంగెల్స్‌ రచించిన కుటుంబం, వ్యక్తిగత ఆస్తి, రాజ్యాంగాల పుట్టుక, ఆగస్టు బెబెల్‌ 1857లో రచించిన మహిళలు-సోషలిజం రచనలను మహిళా కార్మికులు విస్తృతంగా అధ్యయనం చేశారు. వర్గ చైతన్యం, శాస్తీయ సోషలిజం భావనలు శ్రామిక మహిళల్లో ఉత్తేజాన్ని నింపాయి.
1889లో పారిస్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌లో స్త్రీపురుషులకు సమాన హక్కుల సమస్య అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించబడింది. మహిళల పత్రిక 'శ్రామిక మహిళ'ను 'సమానత్వం'గా మార్చారు. క్లారా జెట్కిన్‌ ఆ పత్రిక మొదటి సంపాదకురాలుగా 25 సంవత్సరాలు పనిచేశారు. ఈ పత్రిక శ్రామిక మహిళల్ని నిర్మాణంలోకి తేవడంలో ప్రముఖ పాత్ర వహించింది. 1907లో అంతర్జాతీయ సోషలిస్టు మహిళా సదస్సు జర్మనీలోని స్టట్‌గార్టులో జరిగింది. రెండవ అంతర్జాతీయ మహిళా సదస్సు డెన్మార్క్‌లోని కోపెన్‌హెగెన్‌లో నిర్వహించారు. ఆ సదస్సులో అంతర్జాతీయ శ్రామిక మహిళా దినంగా మార్చి 8ని ఎంపిక చేశారు. మార్చి 8 మహిళల సమాన హక్కులకు, విముక్తికి సంకేతంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన శ్రామిక మహిళా పోరాటాలతో పని గంటల తగ్గింపు, వేతనాల పెంపు, ఓటుహక్కును సాధించుకున్నారు.
18, 19 శతాబ్దాల్లో ప్రపంచంలో స్త్రీల అభివృద్ధికై జరిగిన జాగృతి భారతదేశ మహిళలపై ప్రభావాన్ని చూపింది. 1975లో ఐక్యరాజ్యసమితి మెక్సికోలో అంతర్జాతీయ మహిళా సదస్సు జరిపింది. మహిళా సమస్యల పరిష్కారానికి దశాబ్ది కాలం (1975-1985) పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరపాలని ఐరాస సర్వసభ్య సమావేశంలో పెట్టిన తీర్మానానికి భారత్‌తో సహా 150 దేశాలు అంగీకరించాయి. 1975 నుంచి అసమానత, దోపిడీ, పీడన, అణచివేతకు వ్యతిరేకంగా మార్చి 8ని మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అయితే పాలకవర్గాలు అనుసరిస్తున్న విధానాలు అసంఖ్యాక మహిళలను సమస్యల వలయంలోకి నెడుతున్నాయి. మహిళా శ్రామికులు పోరాడి సాధించుకున్న చట్టాలు కనుమరుగవుతున్నాయి. 1948లో వచ్చిన ఫ్యాక్టరీ చట్టం స్త్రీలు రాత్రి షిప్టుల్లో పనిచేయడాన్ని నిషేధించింది. ప్రస్తుతం నిషేధాన్ని ఎత్తివేసిన ప్రభుత్వం మహిళల భద్రత అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడంలేదు. ప్రభుత్వ రంగాన్ని కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెడుతోంది. ప్రైవేటు రంగంలో 8 నుంచి 12 గంటల పనితో శ్రమ దోపిడీకి గురవుతున్నారు. దేశంలో ఉపాధి పొందుతున్న మహిళల్లో 6 శాతం మంది మాత్రమే సంస్థాగతమైన ఉద్యోగాలు పొందుతున్నారు. 94 శాతం మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో 48 శాతం మహిళలు స్వయం ఉపాధి పొందుతున్నారు. 42 శాతం రెగ్యులర్‌ కార్మికులుగా ఉన్నారు. మహిళలు ఉపాధి పొందుతున్న మరో రంగం ప్రభుత్వం ఏజెన్సీలు (అంగన్‌వాడి, ఆశా, మధ్యాహ్న భోజనం, ఐకెపి). వీరికి ఎలాంటి రక్షణాత్మక శాసనాలు, ఉద్యోగ భద్రత లేవు. సంపద సృష్టిలో పురుషులతో సమానంగా కష్టపడుతున్నా, హక్కులలో మాత్రం వెనకబడే ఉన్నాం.
మహిళా సాధికారతకై 1995 బీజింగ్‌ సదస్సు డిక్లరేషన్‌పై భారత ప్రభుత్వం సంతకం చేసి 18 ఏళ్ళు పూర్తయింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎండమావిగానే ఉంది. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు లోక్‌సభలో ప్రవేశానికి నోచుకోలేదు. వామపక్షాలు మినహాయించి మిగతా రాజకీయ పార్టీల కుటిల నీతి వల్ల బిల్లు ఆమోదం పొందకుండా గాలిలో వేలాడుతున్నది. పురషాధిక్య భావజాలమే మహిళలకు విధాన నిర్ణయాధికారాన్నిచ్చే పదవుల్ని నిరాకరిస్తోంది. 545 మంది ఉన్న లోక్‌సభలో 60 మంది, 244 మంది రాజ్యసభ సభ్యుల్లో 26 మంది మాత్రమే మహిళలున్నారు. మహిళా సాధికారత కాగితాలకే పరిమితమైంది. జనాభాలో సగమైనా అవకాశాల్లో అత్తెసరే. మహిళలు తమకున్న పరిమిత అవకాశాలతో విద్య, ఉద్యోగ, క్రీడారంగాలలో ప్రతిభను చాటుతున్నారు. సమాచార, సాంకేతిక రంగాల్లో నేడు మహిళల హవా దూసుకుపోతోంది. క్షిపణి ప్రయోగంలో థెస్సీ ధామస్‌, అంతరిక్షంలో అడుగుపెట్టి పరిశోధనలు చేసిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ వంటి వారు సాధించిన విజయాలు భారత్‌ను తలెత్తుకునేలా చేస్తున్నాయి.
మరోవైపు స్త్రీలపై నిరాటంకంగా సాగుతున్న అత్యాచారాలు, వరకట్న హత్యలు, కిడ్నాపులు, ఆడపిల్లల అక్రమ అమ్మకాలు, లైంగిక వేధింపులు దేశాన్ని అంతర్జాతీయంగా తలవంచుకునేలా చేస్తున్నాయి. స్త్రీలు గడపదాటితే ఇంటికి సురక్షితంగా చేరతారని నమ్మకంలేని దారుణ పరిస్థితులున్న దేశం మనది. 2012 డిసెంబర్‌ 16న ఢిల్లీలో జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఘటన స్త్రీల భద్రత అంశాన్ని ముందుకు తెచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం ప్రతి 22 నిమిషాలకు ఒక మహిళ, 76 నిమిషాలకు ఒక బాలిక అత్యాచారానికి, ప్రతి గంటకు 18 మంది మహిళలు హింసాత్మక వేధింపులకు గురవుతున్నారు. సరళీకరణ విధానాలు అమలౌతున్న గత మూడు దశాబ్దాలలో మహిళలపై నేరాలు 825 శాతం పెరిగాయి(నేషనల్‌ క్రైమ్‌ రిపోర్ట్‌). 14 సంవత్సరాల లోపు బాలికలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. మార్కెటీకరణ పెరిగే కొద్దీ మహిళలపై హింస పెరుగుతోంది. అందాల పోటీలు, బ్యూటీపార్లర్లు, సినిమాలు, టీవీలు, ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌ ఒకటేమిటి ప్రతిదీ అమ్మాయిల చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రపంచీకరణ విధానాలు ప్రజల మనసులు, ఆలోచనలు, ప్రవర్తనను సైతం లొంగదీసుకునేందుకు పూనుకుంటున్నాయి. దీనికి ప్రతిగా మితవాద శక్తులు సంప్రదాయం పేరిట చూపించే ప్రత్యామ్నాయం కూడా స్త్రీలను పరాధీనత వైపుకు నెట్టేవిగా ఉంటున్నాయి. పురుషుల రక్షణలో స్త్రీ అణిగిమణిగి ఉంటే సమస్యలేవీ రావని ప్రవచిస్తున్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, ఆధ్యాత్మిక గురువులు మొదలైన వారు ఢిల్లీ గాంగ్‌రేప్‌ తర్వాత బాధితురాలినే లక్ష్యం చేస్తూ ప్రకటనలు చేశారు. ఇటువంటి తిరోగామి శక్తుల భావాలను వ్యతిరేకించాలి. స్త్రీలు ఏ విధమైన దుస్తులు ధరించాలి, ఎలా ప్రవర్తించాలంటూ నియమాలను విధించటం మొదలు పెడితే అది చివరకు వారిని పరాధీనతకు గురిచేస్తుంది. రెచ్చగొట్టే దుస్తులు వేసుకున్నందు వల్లనే యువకులు వెంట పడుతున్నారంటూ మహిళల్ని తప్పు పట్టే సామాజిక ధోరణి పురుషాధిక్య దృక్పథం నుంచే వస్తోంది. ఈ అసమాన వ్యవస్థలో మార్పు రావాలంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలలో మార్పులు అనివార్యం. ఇందుకోసం చట్టాల్లో, నేర శిక్షాస్మృతిలో, పాలన, న్యాయ వ్యవస్థలో మహిళా పక్షపాత నిబంధనలు అమలు జరగాలి. స్త్రీలను అంగడి సరుకుగా చిత్రీకరిస్తున్న ధోరణులను రూపుమాపాలి. స్త్రీపురుష నిష్పత్తిలో వ్యత్యాసాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ముఖ్యంగా బాలబాలికల నిష్పత్తిలో ప్రమాద సూచికలు కనపడుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న సరళీకరణ విధానాలు అన్ని తరగతుల ప్రజలపై భారాలు మోపుతున్నాయి. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, ఎరువులు, ఆహార సబ్సిడీలు కుదించబడుతున్నాయి. నగదు బదిలీ పథకంతో ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై పెను భారాన్ని మోపింది. మంచినీరు, మరుగుదొడ్లు లేని గ్రామాలున్నాయి గానీ మద్యం దుకాణం లేని గ్రామం లేదు. మహిళల ఉసురుతో ప్రభుత్వం ఖజానా నింపుకుంటోంది. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా కుటుంబాలను మహిళలే నిర్వహిస్తున్నారు. పెరిగిన జీవన వ్యయంతో వ్యభిచార గృహాలకు అమ్ముడుపోతున్న ఆడపడుచులు, బతుకుబండి నడపడానికి మాతృత్వాన్ని అద్దెకిచ్చే అద్దె తల్లులు ప్రభుత్వాలకు కానరావడంలేదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మొత్తంగా మహిళా లోకం ఉద్యమాల్లోకి రావాల్సిన అవసరాన్ని ఇవి నొక్కి చెబుతున్నాయి.
సమాచార వ్యవస్థ అభివృద్ధి కాని రోజుల్లో 1957లోనే మహిళలు చైతన్యంతో హక్కులకై పోరాటాన్ని ఎక్కుపెట్టారు. నిర్బంధాలను సైతం ఎదుర్కొని సాధించుకున్న హక్కులపై విశృంఖల దాడి జరుగుతోంది. మార్చి 8 సందర్భంగా ఆకలి, పేదరికం, హింసకు వ్యతిరేకంగా, సమాన హక్కులు, మహిళ రిజర్వేషన్‌ బిల్లు సాధనకై ఉద్యమిద్దాం.
(వ్యాసకర్త ఐద్వా రాష్ట్ర కార్యదర్శి) 
-కె స్వరూపరాణి

Prajashakti Telugu News Paper Dated : 8/3/2013

సంపాదకీయం జెండర్ న్యాయం



ఆకాశంలో సగం మాటేమో కానీ అవకాశాల్లో చిరుభాగం కోసం కూడా పోరాడవలసిన స్థితిలోనే స్త్రీలు ఇంకా కొనసాగుతున్నారు. అంతరిక్షయాత్రికుల్లో, పర్వతారోహకుల్లో, దేశాధినేతల్లో, శాస్త్రవేత్తల్లో, కళాకారుల్లో, యుద్ధరంగంలో, కార్పొరేట్ బోర్డ్‌రూముల్లో- ఆడవాళ్లు కనిపిస్తూనే ఉన్నారు. కానీ, వాళ్లను సంకేతాలు గానో, స్ఫూర్తిదాతలుగానో చెప్పుకున్నంతగా, సర్వత్రా స్త్రీల ప్రాతినిధ్యానికి ప్రతీకలుగా పరిగణించలేము. ఎవరో కొందరు అక్కడక్కడా, అవరోధాలను అధిగమించి, కొద్దిగా సడలిన రెక్కలను విశాలంగా విప్పార్చి, సంకెళ్లింకా తెగీతెగకుండానే సుదూరాలను లంఘిస్తూ, పురుషప్రపంచపు పీఠాలను, స్థలాలను అధిరోహిస్తున్నారు.

ఈ సంవత్సరపు అంతర్జాతీయ మహిళాదినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉన్నది. మహిళా ఉత్సవాలు గురించిన ప్రయత్నాలు 1900 సంవత్సరం నుంచి జరుగుతున్నప్పటికీ, మార్చి8న అంతర్జాతీయ మహిళాదినోత్సవంగా పాటించాలని నిర్ణయం తీసుకున్నది మాత్రం 1913లో. ఈ నూటా ఒకటో మహిళాదినోత్సవం, స్త్రీల సాధికారతా ప్రస్థానాన్ని సమీక్షించుకోవడానికి ఒక సందర్భం. ఈ ప్రపంచం ఎంతగా స్త్రీపురుష వివక్షను అధిగమించిందో, ఇంకా ఎంతటి అంధకారం మిగిలి ఉన్నదో లెక్కవేసుకోవడానికి ఇది ఒక అవకాశం. బహుశా వివిధ మహిళా ప్రజా ఉద్యమాలు అటువంటి సమీక్షలు చేసుకుంటాయి. 

సుదీర్ఘ పోరాటాల పరోక్ష దోహదంతో అవకాశాలను పొంది, విజయాలు సాధించిన వ్యక్తులు - చారిత్రక నేపథ్యాన్ని గుర్తించో, గుర్తించకుండానో విజయోత్సవాలు జరుపుకుంటారు. అనేక బహుళజాతి కార్పొరేట్ సంస్థలు శుక్రవారం నాడు తమ తమ మహిళా ఉన్నతోద్యోగులను ప్రదర్శించి, తామెంతగా స్త్రీపురుష సమత్వాన్ని పాటిస్తున్నాయో చెప్పుకోబోతున్నాయి. 1975లో అంతర్జాతీయ మహిళా సంవత్సరం ప్రకటించేదాకా పెద్దగా ప్రచారంలో లేని మహిళాదినోత్సవం- ఇప్పుడు అనేక దేశాల్లో సెలవుదినంగా కూడా మారింది. 

క్యూబా, కంబోడియా, లావోస్, వియత్నాం వంటి దేశాలతో పాటు, ఆప్ఘనిస్థాన్, అజర్‌బైజాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజకిస్థాన్, తుర్కమినిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో కూడా మార్చి 8 ఒక పబ్లిక్ హాలిడే. చైనా, నేపాల్‌లలో ఈ రోజు స్త్రీలకు మాత్రమే సెలవుదినం. స్త్రీల సాధికారతా ప్రస్థానాన్ని సంబరంగా జరుపుకునే ఆనవాయితీ ప్రారంభమైన తరువాత కూడా మార్చి 8 సెలవు కోసం మన దేశంలో ఇప్పటివరకు డిమాండ్ వినిపించలేదు.

ఈ ఏడు మహిళాదినోత్సవానికి మనదేశంలో కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. ఇటీవలి ఢిల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం సంఘటన దరిమిలా, స్త్రీల భద్రత గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఆందోళన జరిగింది. ప్రభుత్వం ఒక కమిటీని నియమించి, దాని సిఫార్సుల ఆధారంగా ఒక కొత్త చట్టాన్ని కూడా రూపొందించింది. స్త్రీల భద్రతను ఒక ప్రత్యేక అంశంగా పరిగణించి, బడ్జెట్‌లో కేటాయింపులు కూడా చేశారు. రైల్వే రక్షకదళంలో పదిశాతం ఉద్యోగాలను స్త్రీలకు ఇస్తామని చెప్పారు. 

ఇదంతా ఆహ్వానించదగినదే కానీ, 'నిర్భయ' ఆందోళన సందర్భంగా, మహిళా ఉద్యమ విలువలకు విరుద్ధమయిన ఆకాంక్షలెన్నో వ్యక్తం కావడం, ప్రభుత్వం సైతం వాటి ప్రభావంలో పడిపోవడం జరిగింది. అన్నిటి కంటె ఆశ్చర్యకరమైన అంశం, దశాబ్దాలుగా నిర్మించిన వివిధ మహిళా ఉద్యమాలు, వాటి సంస్థలు, నేతలు అందరూ అప్రధానమై, గాఢమైన అవగాహన, దూరదృష్టి లేని ఫేస్‌బుక్ తరం ఉద్యమాన్ని చేతుల్లోకి తీసుకోవడం. ప్రధానంగా పట్టణ మధ్యతరగతి ఉద్యమమే అయినప్పటికీ, మనదేశంలోని పౌరసమాజం ముఖచిత్రంలో వస్తున్న మార్పులను అది సూచించింది. 

పాలపొంగులా ఆ ఉద్యమం ఉబికివచ్చి, ప్రభావం వేయగలిగినప్పుడు, మహిళా రాజకీయ రిజర్వేషన్ల కోసం కొంతకాలం కిందట ఉధృతంగా జరిగిన ఉద్యమం ఎందుకు వెనుకపట్టు పట్టిందన్న ప్రశ్న ఈ సందర్భంగా రావడంలో ఆశ్చర్యం లేదు. మహిళా సాధికారత చర్యలను సామాజిక న్యాయవాదులు అడ్డుకుంటున్నారన్న అభిప్రాయం కానీ, మహిళల పేరుతో అగ్రవర్ణాలు అధిక స్థానాలను సంపాదించాలని ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం కానీ - మంచివి కావు.

ఈ వైరుధ్యాన్ని పరిష్కరించవలసిన బాధ్యత మహిళా ఉద్యమాలకు, వాటికి మార్గదర్శనం చేస్తున్న రాజకీయపార్టీలకు ఉన్నది. పనిలో పనిగా బీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్ల ప్రతిపాదన చేసి, అన్ని సామాజిక, మహిళా రిజర్వేషన్లను అనుసంధానం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అదొక సుదీర్ఘ ప్రక్రియ అనుకుంటే, వివిధ పార్టీలు సుముఖంగా ఉన్న పదిశాతం రిజర్వేషన్ల ప్రతిపాదనను అయినా ముందుకు తీసుకువెడితే తాత్కాలికంగా అయినా ప్రయోజనమే.

మహిళా ఉద్యమం తన సాంప్రదాయికమైన ఆందోళనాంశాలతో పాటు, కొత్తగా ముందుకు వస్తున్న సమస్యలను కూడా స్వీకరించాలి. ప్రపంచీకరణ పేరుతో జరుగుతున్న వనరుల దోపిడి, పర్యావరణ విధ్వంసం, భూనిర్వాసితత్వం, అదపులేని పారిశ్రామికీకరణ- వీటివల్ల అధికంగా బాధితులవుతున్నది స్త్రీలే. పెట్టుబడితో పాటు నిర్నిరోధంగా ప్రవహిస్తున్న సాంస్కృతిక కాలుష్యం కూడా గురిపెడుతున్నది స్త్రీలనే. అక్షరాస్యతలోకి, విద్యలోకి వేగంగా ప్రవేశిస్తున్న స్త్రీలు, కొందరు ఉన్నత స్థానాలకు వెడుతున్నప్పటికీ, అత్యధికులు, సాంప్రదాయికంగా స్త్రీలకు స్థానంలేని అనేక కొత్త ఉద్యోగరంగాలలోకి వెళ్లవలసి వస్తున్నది. 

కుటుంబాలకు కుటుంబాలు వలస వెళ్లడం, పురుషులు మాత్రమే వలసవెళ్లి స్త్రీలు కుటుంబబాధ్యతలు మొత్తాన్ని నిర్వహించవలసి రావడం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం ఇతర చోట్ల నివసించవలసి రావడం- మహిళలు కొత్త సవాళ్లు ఎదుర్కొనవలసి రావడానికి కొన్ని కారణాలు. కొత్త సవాళ్లతో పాటు, పాత సమస్యలు కూడా యథాతథంగా కొనసాగుతూ ఉండడం మన దేశంలో మరో విషాదం. భ్రూణహత్యలు, పరువుహత్యలు, అర్థరాత్రి అత్యాచారాలు, పోలీసు దాష్టీకాలు, వరకట్నం హత్యలు, ఆసిడ్ దాడులు.. ఎక్కడా ఆగుతున్నట్టు కనిపించడం లేదు.

చదువులు, సంపాదనలు, వివిధ స్థాయిల్లో సాధికారత- ఇవి తెచ్చే ధైర్యమూ ధీమా మాత్రమే స్త్రీల పురోగతికి సరిపోవు. సర్వరంగాల్లో ఆధిపత్యాన్ని తొలగించి, స్త్రీపురుష సమత్వాన్ని స్థాపించడానికి, మనుషుల ఆలోచనల్లోను, వ్యవస్థల ధోరణుల్లోను, ప్రజా వినోదసమాచార సాధనాల వైఖరుల్లోను పరివర్తన తేవడానికి దృక్పథ స్పష్టత కలిగిన మహిళా ఉద్యమాలు బలపడాలి. ప్రాతినిధ్యాన్ని విస్తరించడం, చైతన్యాన్ని వ్యాపింపజేయడం- ఈ రెండూ మహిళా స్వాతంత్య్రానికి కీలకాలు


Andhra Jyothi Telugu News Paper Dated: 8/3/2013 Sampadakiyam 

సమస్యల వలయంలో వనితలు ---మాసపత్రి ఉషాకిరణ్



womens
మహిళా సాధికారత.. ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యంలోకి వచ్చిన పదమిది. మారుతున్న కాలంతో పాటుగా మహిళల జీవితాల్లో కూడా అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ ఈ మార్పులు ఆమెను అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నట్లు కనబడుతూనే మరోవైపు సమస్యల సుడిగుండంలోకి నెడుతున్నాయి. 

ఆధునిక కాలంలో స్త్రీకి అడుగడుగునా సమస్యలే. కొన్ని సందర్భాల్లో స్త్రీ తన సమస్యల్ని తానే గుర్తించలేని, చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఎదుర్కొంటున్నది. నాటికీ నేటికీ స్త్రీల సమస్యలు తమ స్వరూపాన్ని మార్చుకున్నాయేగాని పూర్తిగా సమసిపోలేదు. ఉద్యోగాలు చేసే స్త్రీల సంఖ్య రానురాను పెరుగుతున్న నేపథ్యంలో వారు ఎదుర్కొనే సమస్యల స్వరూపం కూడా మారుతూ వస్తున్నది. 
పురుషుడు చేసే ప్రతి పనికీ విలువ పెరుగుతూ, స్త్రీ చేసే ప్రతి పని కీ విలువ తరుగుతున్నది. దీంతో ఆర్థిక వ్యవస్థలో మహిళకు ప్రత్యక్ష సంబంధం ఉండకపోవడం వల్ల ఇంటి పని అనుత్పాదక శ్రమగానే ఉండిపోయింది. దీంతో ఇంట్లో ఆధిపత్యం పురుషులదే అయ్యింది. కానీ నిజంగా ఇంట్లో శ్రమపడే మహిళలకు గుర్తింపు లేకుండాపో తున్నది. మాతృత్వం పేరుతో పిల్లల్ని కని పెంచాల్సిన బాధ్యతను స్త్రీ స్వీకరించింది. కానీ ప్రయోజకులైన పిల్లలు మాత్రం పురుషుడి వారసులే అయ్యారు. వీటన్నింటికీ మించి లైంగిక వివక్షకు గురైంది. కుటుంబ హింస ఎక్కువవుతున్నది. ఆత్మాభిమా నం కోల్పోతున్నది. సమాజంలో స్త్రీ పరి స్థితి రెండవ శ్రేణిగా దిగజారింది. ఈ పరిస్థితి మారనంత వరకు వివక్ష మాత్రమే కాదు. దోపిడీ కూడా నిరాటంకంగా సాగిపోతున్నది.

నాగరికత పెరిగిన కొలదీ పనులు, ధ్యాసలూ, ఆశలూ ఎక్కువై కుటుంబంలో మహిళలను మనుషులుగా గుర్తించడం తగ్గిపోతున్నది. ఈ క్రమంలో కుటుంబంలో స్త్రీల పనులకు, త్యాగాలకు విలువులేకుండా పోతున్నది. ఆమె ఆ ఇంట్లో వెట్టిచాకిరి చేసే శ్రమజీవి, బానిసగా మిగిలిపోతున్నది. ఆమె తినే తిండి కూడా లెక్కలు కట్టే దుస్థితి కొన్ని కుటుంబాల్లో కనిపిస్తున్నది. దీంతో పోషకాహారం కరువై ఎనీమియా బారిన పడుతున్న మహిళపూందరో..ఇలా కనిపించని హింస వల్ల మగువలు మానసికంగా కుంగిపోయి రోగాల బారిన పడుతున్నారు. అనారోగ్యం బారిన పడిన భార్య కి చేయూతనివ్వాల్సిన భర్త రెండవ పెళ్లికి సిద్ధపడుతుండడం ఈ మధ్య పరిపాట య్యింది. స్త్రీలు ప్రేమరాహిత్యాన్ని అనుభవిస్తూ జీవితాల్ని వెళ్లదీస్తున్నారో తెలపడానికి ఇదో ఉదాహరణ. సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందినా మహిళల జీవితాల్లో మాత్రం మార్పులు రావడం లేదు. పిల్లలు కలగకపోవడం అనేది ఇప్పటికీ స్త్రీలలో ఉన్న లోపంగానే చాలామంది పరిగణిస్తున్నారు. ఆడపిల్లల్ని కనడం కూడా మహిళలకు శాపమైంది. లింగ నిర్ధారణ పరీక్షల వల్ల ఎందరో తల్లులు తమ జాతి శిశువుల్ని ఏడుస్తూ చంపుకుంటున్నారు.

పిత్రుస్వామిక భావజాలంతో మహిళలు కూడా పీడకులుగా మారిన ఓ వికృత పరిస్థితి నేడు నెలకొన్నది. దీంతో స్త్రీ తన స్వేచ్ఛను కోల్పోతున్నది. చాలామంది స్త్రీలు అస్వతంవూతతోలోనే ఆనందం ఉందని విశ్వసించారు. పంజరంలో పక్షి తలుపులు తీసినా ఎగరడానికి ఇష్టపడని స్థితి అన్నమాట. స్త్రీల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే క్రమంలో ప్రభుత్వం, స్వచ్ఛందసంస్థలు, ప్రజాస్వామిక వాదులు వారికి అండగా నిలిచి పురుషులతో పాటుగా స్వేచ్ఛ, స్వాతంత్య్ర సమానత్వాల కోసం పోరాడారు. ఆస్తిహక్కును, ఉద్యోగావకాశాలను, ప్రత్యేకమైన చట్టాలను సాధించుకున్నారు.

పోరాటాల ద్వారా హక్కులు సాధించవచ్చు. కానీ ఆ హక్కులు పొందడం వల్ల మాత్రమే సమస్యలు సమసిపోవు. నేటి స్త్రీ పరిస్థితీ దీనికి తీసిపోదు. స్వేచ్ఛా స్వాతంవూత్యాలు స్త్రీలకు ఎండమావులే అవుతున్నాయి. వారి జీవితాలను పిండి చేస్తున్నాయి. ‘పబ్లిక్‌లైఫ్’ పురుషుడి హక్కు అన్నట్టు. కానీ స్త్రీ స్వభావానికి అది విరుద్ధం అన్నట్టు సమాజం కట్టుబాట్లు విధిస్తున్నది. అందుకే స్వేచ్ఛా,స్వాతంవూత్యాలున్న నేటి ఆధునిక మహిళ ఇంటాబయటా పలు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సమాజం స్త్రీల సమస్యలను కేవలం స్త్రీ జాతికే సంబంధించిన సమస్యలుగా కాక సామాజిక సమస్యలుగా పరిగణించి వాటి పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా పోరాడాలి. స్త్రీలు రాజకీయంగా పురోగమించడం వల్ల ఈ పరిస్థితిలో కొంత మార్పు రావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అత్యంతావశ్యకం.
అత్యాచారం, హత్య, గృహహింస లాంటి అనేక కేసుల్లో ముద్దాయికి సరైన సమయంలో సరైన శిక్షలు అమలు కావడం లేదు. ఢిల్లీలో జరిగిన అమానత్ అత్యాచార కేసులో బాధితులకు న్యాయం జరగలేదు. ప్రభుత్వాల అలసత్వం వల్ల నేరస్థుల వికృత చేష్టలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం స్త్రీల పట్ల అమానుషంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే స్త్రీలకు భద్రత, ఉపాధి అవకాశాలు కల్పించాలి.

మన చుట్టూ ఎన్ని అమానుషాలు జరిగినా చూసి చూడనట్లు ఉదాసీనతతో మెలగడం కూడా ఇలాంటి సమస్యలు పునరావృతం కావడానికి ఒక కారణ మే. దేశ పౌరులుగా సమాజంలో ఒక బాధ్యతగల వ్యక్తులుగా అన్యాయాన్ని ప్రశ్నించడానికి, దౌర్జన్యాన్ని ఎదిరించడానికి ముందుకు రావాలి. ప్రతివ్యక్తీ ముందుగా తనను తాను సంస్కరించుకున్నపుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. సమాజంలో మార్పుని ఆశించినప్పుడు దానికనుగుణంగా మహిళలల్లో చైతన్యం రావాలి. ఆ చైతన్యాన్నే ఆయుధాలుగా మల్చుకొని అంతరాలు చేధించుకొని అంతరంగాలను ఆవిష్కరించుకోవాలి. విముక్తి బాటలో పయనించాలి. తమలో ఉన్న భయాలను, అభవూదతా భావాలను విడనాడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగినపుడే స్త్రీలు తమ జీవితాల్లో సమూలమైన మార్పులని చూడగల్గుతారు.

-మాసపత్రి ఉషాకిరణ్, ఆదిలాబా

Namasete Telangana News Paper Dated : 8/3/2013

పోరాటాలతోనే విముక్తి ----దేవేంద్ర



womens
‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి’ అనే నినాదంతో శ్రమ విముక్తి కోసం నినదిస్తున్న రోజులవి. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వ హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్న యుగం అది. ఈ పోరాటాల్లో మహిళలు మేము సైతం అంటూ కదిలివచ్చారు. పోరాటాలన్నింటిలో బట్టల మిల్లు ఫ్యాక్టరీ కార్మిక మహిళల పాత్ర అమోఘమని చెప్పాలి. అమెరికాలో మొదటగా ఈ పోరాటాలు పురుషుల కేంద్రంగానే జరిగేవి. 1820లో మహిళలే స్వయంగా, ప్రత్యేకంగా సమ్మెలు చేయడం ప్రారంభించారు. పురుషులకంటే మేమేమి తీసిపోమంటు న్యూయార్క్ నగరంలో అనేక కవాతులు, సమ్మెలు నిర్వహించారు. 1857 మార్చి 8న న్యూయార్క్ నగరంలో 16 గంటల పనిదినం నుంచి 10 గంటలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కవాతు నిర్వహించారు. ఈ కవాతుపై పోలీసులు దాడి చేసి చెల్లాచెదురు చేశారు. 1859 మార్చిలో వీరు ప్రత్యేకంగా మహిళా లేబర్ యూనియన్ స్థాపించుకొని కార్మిక హక్కుల కోసం పోరాడారు.

1908 మార్చి 8న కుట్టుపని కర్మాగారాల్లోని 15,000 మంది మహిళలు 1857 మార్చి 8 స్ఫూర్తితో న్యూయార్క్ నగరంలో పెద్ద ప్రదర్శన నిర్వహించి వారి డిమాండ్లను సాధించుకున్నారు. 1908 నుంచి మహిళలకు ఓటు హక్కు కోసం పోరాటం ప్రారంభమయ్యింది. 1910లో కోపెన్ హెగెన్‌లో మహిళా కాన్ఫన్స్ జరిగింది. ఈ కాన్ఫన్సులో క్లారా జెట్కిన్ మహిళాహక్కుల గురించి మాట్లాడుతూ మార్చి 8ని అంతర్జాతీయ శ్రామిక మహిళల పోరాటంగా జరపాలని పిలుపునిచ్చారు.

అప్పటి నుంచి ప్రతి ఏటా మార్చి 8న మహిళా దినోత్సవంగా జరపడం ప్రారంభమైంది. 1911లో న్యూయార్క్‌లోని ట్రయాంగిల్ కంపెనీలో విధులు బహిష్కరించడాన్ని ఆపడానికి ద్వారాలు మూయడంతో లోపల ప్రమాదం జరిగి 146 మంది మహిళ లు చనిపోయారు. అందుకే ప్రతి సంవత్సరం మార్చి 8న ఈ మహిళా అమరుల్ని స్మరించడం, వారి స్ఫూర్తితో మహిళా కార్మికుల పోరాటాల ఉధృతి పెరిగింది. ఈ పోరాటాలల్లో ఎంతోమంది మహిళలు జైళ్ల పాలయ్యారు. ప్రాణ త్యాగాలు చేశారు. మార్చి 8ని స్మరించడం అంటే వారి త్యాగాల బాటల్లో నడవడమే.

ఈ క్రమంలో మహిళలు మేము మనుషులమే కదా! మాకు మనసుంది! మాకు పురుషులతో సమానంగా హక్కులను పొందే అధికారం ఉంది కదా! ఈ సమాజం లో స్త్రీ, పురుషులకు మధ్య అంతరం ఎందుకు? దీనికి మూలం పితృస్వామిక సమాజం. కాబట్టి ఈ వివక్షను గమనించి మహిళలు చైతన్యవంతులై సమాజాన్ని మార్చడానికి కృషి చేశారు. ఇది ప్రపంచంలోని మహిళల్ని ఆలోచింపజేసింది. ప్రతిచోట జరుగుతున్న విముక్తి పోరాటాల్లో పాల్గొంటూ శ్రమ విముక్తి జరగకుండా స్త్రీ విముక్తి జరగదని నినదిస్తున్నారు. 

మన దేశంలో స్త్రీ,పురుష సమానత్వం కోసం, వారి హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. మహిళలపై సాంఘిక దురాచారాలు, జరుగుతున్న హింసను నిర్మూలించేందుకు సంస్కరణోద్యమాలు జరిగాయి. ఈ సంస్కరణోద్యమంలో పురుషులు, స్త్రీలు కలిసి నడిపించారు. తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చాక జరుగుతున్న ఎన్నో సామాజిక ఉద్యమాల్లో మహిళల పాత్ర రోజురోజుకు పెరుగుతున్నది. వరకట్నానికి, కుటుంబ హింసకు వ్యతిరేకంగా పోరాటాల నిర్మాణం జరిగింది. మహిళల కోసం ప్రత్యేక చట్టాలను, చట్టాల్లో మార్పులను సాధించింది. 1984లో అత్యాచారాల నిరోధక చట్టంలో సవరణ, జ్యోతిసింగ్ పాండే సంఘటన నేపథ్యంలో జరిగిన పోరాటాల ఫలితంగా కొన్ని మార్పుల్ని సాధించింది. 2005లో గృహ హింస నిరోధక చట్టం మహిళా ఉద్యమాల కృషి ఫలితమే. 2013 మార్చి 3న పనిస్థలాల్లో మహిళలపై లైంగిక దాడుల నిరోధక చట్టం మహిళా ఉద్యమాల విజయంగా భావించాలి. సారా వ్యతిరేక పోరాటం, అశ్లీల చిత్రాలకు వ్యతిరేకంగా, అందాల పోటీలకు వ్యతిరేకంగా, ప్రేమ పేరుతో జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలు మహిళల చైతన్య పటిమని చాటి చెప్పాయి. 

మహిళా ఉద్యమాలు మార్చి 8 అంతర్జాతీయ శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తి తో ముందుకు నడుస్తున్నాయి. ఇంతవరకు వివిధ మహిళా ఉద్యమా ల్లో, సామాజిక ఉద్యమాల్లో ప్రాణ త్యాగం చేసి అమరులైన మహిళా అమరుల స్ఫూర్తి మహిళా ఉద్యమానికి ఊతమిస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మార్చి 8ని ఒక ఉత్సవంగా అంటే పండుగలాగా జరుపుతున్నాయి. ఈ రోజున ప్రభుత్వ ఆఫీసులల్లో, వేడుకలల్లో అందాల పోటీలు, డాన్స్‌ల పోటీలు, ముగ్గుల, వంటలు పోటీలు నిర్వహిస్తున్నాయి.

మార్చి 8 స్ఫూర్తి మహిళను వ్యక్తిత్వమున్న మనిషిగా, సమస్యలతో తలపడే వ్యక్తిగా నిలబెడుతుం ది. కానీ ప్రభుత్వాలు మహిళలు ‘వంటింటికి, ఇంటికి చాకిరి చేసే బానిసగా’ అందాలు వలకబోసే భోగ వస్తువుగా దిగజారుస్తున్నాయి. మార్చి 8 స్ఫూర్తితో స్త్రీలను చైతన్యవంతుల్ని చేయాల్సిన ప్రభుత్వాలు ఈ విధంగా ఎందుకు చేస్తున్నాయి? ప్రభుత్వాలు మహిళా అభివృద్ధికి పాటుపడుతాం కల్ల బొల్లి మాటలు చెబుతున్నాయి. మహిళా ఉన్నతి ఉద్యమాల ద్వారానే జరిగింది, కానీ ప్రభుత్వాల వల్లకాదనేది వాస్తవం. నిజంగా మహిళా ఉన్నతి కోరే ప్రభుత్వాలైతే మార్చి 8ని స్ఫూర్తిదాయకంగా నిర్వహించేవి కదా! అందుకే మహిళలుగా మనం పితృస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతూ, మన సమస్యల పరిష్కా రం కోసం ప్రభుత్వాల మెడలు వంచితేనే మన లక్ష్యాన్ని సాధించగలం. ఇదే మార్చి 8 స్ఫూర్తి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దేశంలోని ప్రతి మహిళ అర్థం చేసుకునే విధంగా ప్రచారం జరగాలి. ఇలా జరగాలంటే ప్రభుత్వం నిర్వహించే వేడుకల విధానంలో మార్పు రావాలి. మార్చి 8ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించా లి. సావివూతీబాయి ఫూలే, చాకలి ఐలమ్మ, బెల్లి లలిత, పంచాది నిర్మల లాంటి మహిళా అమరుల జీవిత చరివూతలను, వారి త్యాగాన్ని ప్రచారం చేసి,వారి స్ఫూర్తిని ప్రజలకు తెలియజెయ్యాలి.

-దేవేంద్ర, చైతన్య మహిళా సం

Namasete Telangana  News Paper Dated : 8/3/2013

Tuesday, February 12, 2013

జోగినీల జీవితం దుర్భరం బందెల రాజశేఖర్‌


 - ఆదిలాబాద్‌    Sun, 10 Feb 2013, IST  

  • దరిచేరని సంక్షేమ పథకాలు
  • అమలుకు నోచని ప్రత్యేక చట్టాలు
  • అధికారుల నిర్లక్ష్యం, పట్టని పాలకులు
జోగినీలంటేనే అదో రకమైన చిన్న చూపు. వారితో అన్ని రకాల పనులూ చేయించుకుంటారు. ఇంటి పని మొదలు తమ కోరికలను సైతం తీర్చుకుంటారు. కానీ వారు వివక్షకు, నిర్లక్ష్యానికి గురవుతున్నా పట్టించుకోరు. ఓ పక్క శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందామని పాలకులు గొప్పలు చెప్పుకుంటున్నారు. మరో పక్క మూఢాచారాలు, సామాజిక రుగ్మతలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సమాజర ఎంత అభివృద్ధి చెందినా జోగినీలు మాత్రం అట్టడుగు స్థాయిలోనే బతుకులు వెల్లదీస్తున్నారు. జోగినీలను ఇప్పటికీ అంటరానివారుగా చిన్నచూపు చూస్తున్నారు. ప్రభుత్వమూ వారి పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జోగినీల కోసం ఎన్నో ప్రత్యేక చట్టాలు ప్రవేశపెట్టినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా వారు నేటికీ వివక్షకు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో జోగినీల జీవన స్థితిగతులపై ఈ వారం 'ప్రజాశక్తి' ప్రత్యేక కథనం....
జిల్లాలో జోగినీల పరిస్థితి..
రాష్ట్రంలోనే వెనుకబడిన జిల్లాగా పేరున్న ఆదిలాబాద్‌లో జోగినీ వ్యవస్థ కొనసాగుతోంది. దేవదాసీలు, జోగినులు, మాతంగులుగా చెప్పుకునే వీరంతా ఎక్కువగా దళితులు ఉన్నారు. గతంలో వారు తమకు అధికంగా సంతానం కలగడం వల్ల అందరూ బాగుంటే ఆడపిల్లలను మాతంగిని చేస్తామని దేవుళ్లకు మొక్కుకునేవారు. అనుకున్నట్లుగానే తమ సంతానం నుంచి ఒకరిని గ్రామదేవత పేరుతో జోగినిగా వదిలేస్తారు. ఈ విధంగా జిల్లాలో అనాదిగా ఈ వ్యవస్థ కొనసాగుతూ వస్తోంది. ఇలా వదిలేసిన వారిని గ్రామ పెత్తందార్లు, దొరలు వారితో వెట్టిచాకిరీ చేయించుకునేవారు. వారితో అన్ని రకాల పనులు, చేయించుకునేవారు. గ్రామాల్లో కొందరు కామాందులు వారి కోరకలు తీర్చుకునేవారు. మరికొందరు దీర్ఘకాలికంగా వివాహేతర సంబంధాలు కొనసాగించేవారు. ఫలితంగా జోగినులకు సంతానం కలిగేది. సాధారణంగా అధికారుల రికార్డుల్లో పుట్టిన బిడ్డ పేరు పక్కన తండ్రి పేరు కచ్చితంగా ఉంటుంది. కానీ జోగినులు, దేవదాసీల పిల్లల పేర్ల పక్కన వారి తల్లిపేర్లే ఉంటాయి. దీంతో దేవదాసీలకు, జోగినీలకు ఇళ్లుగానీ, జానెడు స్థలంకానీ లేకుండా పోయింది. జోగినీలు గ్రామాల్లోని దేవాలయాల్లో సేవలు చేస్తూ, యాచిస్తూ సంతానాన్ని పోషించుకునేవారు. ఈ విధంగా నేటికీ జోగినీలు దుర్భరమైన బతుకులు వెల్లదీస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో సుమారు రెండు వేల మంది వరకు జోగినీ కుటుంబాలు ఉన్నట్లు అధికారుల అంచనా. రికార్డుల్లో మాత్రం వీరి జనాభా ఎంతుందో తెలియదు. జిల్లాలో ఎక్కువగా నిర్మల్‌ డివిజన్‌లోని నిర్మల్‌, సారంగాపూర్‌, ముథోల్‌, లోకేశ్వరం, లక్ష్మణచాంద, మామడ, భైంసా మండలాల్లో జోగినుల కుటుంబాలు ఉన్నాయి. నిర్మల్‌ పట్టణం బుధవార్‌ పేటలో 32 కుటుంబాలు, కుర్రన్నపేట్‌లో 24, గొల్లపేట్‌లో మూడు, విశ్వనాథ్‌పేట్‌లో మూడు కుటుంబాలు నాయుడివాడ, బంగల్‌పేట్‌, రాంనగర్‌, గాజులపేట్‌లో రెండు కుటుంబాలు ఉన్నాయి. సారంగాపూర్‌ మండలం ప్యారమూరల్‌లో ఏడు, బీరవెల్లిలో 11, కౌట్ల(బి)లో ఒకటి, ఆలూర్‌లో నాలుగు, పంచర్‌లో మూడు, మలక్‌చించోలిలో ఒకటి చొప్పున ఉన్నాయి. ఈ కుటుంబాల్లో ఎవరూ చదువుకున్న వారు లేరు. జోగినీలెవరికీ భూమి లేదు. వీరంతా బీడీలు చుడుతూ, వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు. వారి పిల్లలను కూడా వారితోపాటే కూలికి తీసుకెళ్తారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వారి దరిచేరడం లేదు. ప్రభుత్వాధి కారులు సైతం వారిని చిన్నచూపు చూస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసి సమాజరలో గౌరవంగా బతికేటట్లు చూడాలని వారు కోరుతున్నారు.
తెలంగాణలోని ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో జోగినీలు అధికంగా ఉన్నట్లు 1984లో వెల్లడైంది. తొలిసారిగా జోగినీ వ్యవస్థ నిజామాబాద్‌ జిల్లా బినోలా గ్రామంలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. అప్పటి జిల్లా కలెక్టర్‌ ఆశామూర్తి ఆ గ్రామాన్ని సందర్శించారు. గ్రామ సమీపంలో సుమారు 70 మంది మహిళలు ఆమె చుట్టూ చేరారు. తమ పిల్లలను చూపించి తమకు కూడు, గూడు వంటి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ను వేడుకున్నారు. తాము జోగినీలమని, అనాదిగా గ్రామంలో ఈ వ్యవస్థ కొనసాగుతుందని, తమను కాపాడాలని మొర పెట్టుకున్నారు. వారి పరిస్థితిని చూసిన కలెక్టర్‌ జోగినీ వ్యవస్థపై అధికారులతో పూర్తి సమాచారం సేకరించారు. ఈ వ్యవస్థపై ఒక సమగ్ర నివేదిక తయారు చేసి 1984లోనే అధికారికంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి వరకు ఈ వ్యవస్థ ఉన్నట్లు ప్రభుత్వ రికార్డుల్లోనే లేదు. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించ లేదు. ఈ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం యాక్ట్‌ సంవత్సరం 10/1998 చట్టాన్ని చేసింది. వి.రాఘునాథరావు అధ్యక్షతన ఏక సభ్య కమిషన్‌ నియమించింది. జోగినీ వ్యవస్థపై క్షేత్రస్థాయిలో అధ్యయనం కోసం 2011 జనవరిలో గుంటూర్‌ జిల్లా బాపట్ల కేంద్రంగా 12 రోజులపాటు ఈ కమిటీ పర్యటించింది. 18 జిల్లాలో ఈ వ్యవస్థ ఉన్నట్లు గుర్తించింది. ఈ వ్యవస్థను నిర్మూలిం చేందుకు, జోగినీలకు పునరావాసం కల్పించేందుకు 1998లో ప్రత్యేక చట్టాన్ని తెచ్చింది. ఈ చట్టం ప్రకారం జిల్లాలో అమలు కాకపోవడం, జోగినీ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయకపోవడం వల్ల వారు నేటికీ దుర్భర జీవితాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.
చట్టం ఏం చెబుతోంది
జిల్లాలో జోగినీలు సామాజికంగా అనేక ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టంచుకోవడం లేదు. వారి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దరిచేరడం లేదు. జోగినీలకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చి బోరుబావులు తవ్వించి విద్యుత్‌ సౌకర్యం, మోటార్లు పైప్‌లైన్‌ కల్పించాలి. ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టళ్లలో నాలుగో తరగతి ఉద్యోగులుగా అవకాశం కల్పించాలి. వారి పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్‌, ఉద్యోగ నియామకాలను చేయడానికి ఇఓలను విడుదల చేయాలి. అంత్యోదయ, అన్నయోజన పథకం కింద రేషన్‌ కార్డులు మంజూరు చేయాలి. ఎస్‌సి కార్పొరేషన్‌ ద్వారా రూ.లక్ష రుణం మంజూరు చేయాలని చట్టంలో పొందుపరిచారు. కాని జిల్లాలో జోగినీల పిల్లలకు చదువు చెప్పించకుండానే వారితోబాటు కూలికి తీసుకెళ్తు న్నారు. వారిలో ఎవరు చదవకపోవడం వల్ల ఉద్యోగానికి అర్హులు కాలేకపోయారు. వారి చట్టాలే వారికి తెలయకపోవడంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు ఉపయోగించు కోలేకపోతున్నారు. రెండేళ్ల క్రితం జిల్లాలో ప్రభుత్వం జోగినీలకు పునరావాస చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ముందుగా 60 మందికి పక్కాఇళ్లు నిర్మించి ఇచ్చింది. కొందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. కానీ మౌలిక సౌకర్యాలు కల్పిండం మరిచిపోయింది. స్వయం ఉపాధి కోసం రుణాలు, కుట్టుమిషన్లు ఇచ్చింది. దానికి సంబంధించిన శిక్షణ మాత్రం ఇవ్వడం లేదు. దీంతో పునరావాసంపై అవగాహనలేక అటకెక్కింది.ల


మా బతుకులను ప్రభుత్వమే మార్చాలి -తోడేళ్ల భూలక్ష్మి, లోకేశ్వరం
మాకు సెంటు భూమి లేదు. బీడీలు చుట్టుకొని బతుకు తు న్నాం. నాకు ఇద్దరు కూతుళ్లు. వారిని చదివించలేక మాతోపాటు ఓ కూతురు బీడీలు చూడుతోంది. మరో కూతురు కూలీకి వెళ్తుతోంది. నాకు వయసు మీద పడింది. ప్రభుత్వం నుండి రూ.200 పింఛన్‌ వస్తోంది. కాని దాంతో బతకడం కష్టంగా ఉంది. మాకు నెలసరి పింఛన్‌ రూ.1500 ఇవ్వాలి. నెలకు నాలుగు కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నారు. అవి సరిపోక బయట కొని తింటు న్నాం. మమ్మల్ని ఆదుకుని మా బతుకులను ప్రభుత్వమే మార్చాలి.


మా పిల్లకైనా ఉద్యోగం ఇవ్వాలి : ఆస్తం ముత్తవ్వ, లోకేశ్వరం
నాకు ఒక కూతురు. నేను కూలీ నాలీ చేసి నా కూతుర్ని చదవిస్తున్నాను. మాకు ప్రభుత్వం నుంచి నెలకు 200 పింఛన్‌ తప్ప ఏమీ అందడం లేదు. మాకు గుడిసె తప్ప సెంటు భూమి లేదు. మా పిల్లకైనా ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను.


మా తరం పోయింది.. పిల్లలనైనా ఆదుకోండి: సౌడల్ల నాగవ్వ : లోకేశ్వరం
జోగినులుగా ఎన్నో కష్టాలు భరించాం. నేను ఇప్పటికీ దొర గారింట్లో వంట పనులు చేసుకుంటూ బుతుకుతున్నా. ఇక మాతరం ముగి సింది. మా పిల్లల భవిష్య త్తన్నా బాగుం డాలి. వారిని ప్రభుత్వం ఆదుకుని ఏదైనా ఉద్యోగం కల్పించి గౌరవంగా బతికేట్లు చూడాలి.
జోగినీల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం - పోతురాజుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మహిపాల్‌ ప్రభుదాస్‌
అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జోగినీలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. దీనివల్లే జోగినీ వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది. వారి కోసం ప్రత్యేక చట్టం ప్రవేశపెట్టినా అమలులో అధికారులు విఫలం చెందారు. తెలియని వారికి అవగాహన కల్పించడం లేదు. దీంతో సంక్షేమ పథకాలు దరి చేరడం లేదు. జోగినీ వ్యవస్థను రూపుమాపేందుకు పోరాటం చేస్తున్నాం. జోగినీల కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పించడమే అంతిమ లక్ష్యంగా పోరాడుతాం

Prajashakti Telugu News Paper Dated : 10/2/2013

సాహిత్యంలో దళిత స్త్రీలు ---ఆరికొండ ప్రతాప్‌ కుమార్‌



'దైవ ప్రసాదిత కుంతి సంతతిలో
ఒక్క ఆడజీవి ఉన్నా మీకు బోధపడేది
కుంతి కాదు ఏ ఇంతి కనబడ్డా
గర్భదానపు దేవుళ్లు పైనుంచి దిగుతారు
తేడా అల్లా -
సహజ కవచ కుండలాలతో 'కర్ణుడు' పుట్టినట్లు
సహజ గర్భసంచితో ఒక 'కర్ణిక' పుట్టకపోవడమే!
(పుల్లింగ న్యాయ ధిక్కారం)
దళిత కులాల్లోని సంప్రదాయాలకు, పూజలకు పునాది స్త్రీలే! అయితే దళిత స్త్రీల సాహిత్యం అంటే మౌఖిక సాహిత్యమేనన్న భావన ఉంది. దళిత స్త్రీల చరిత్రని, తాత్విక చింతనని, జీవన సరళిని, ఆలోచనా ఒరవడిని, మనోభావాలను చూడాలంటే జానపద రూపంలో ఉన్న సాహిత్యంలోకి తొంగి చూడాల్సిందే! స్త్రీవాద దృక్పథంతో రాసిన రచనలకు స్త్రీవాద సంకలనాల్లో, దళిత దృక్పథంతో రాసిన రచనలకు దళిత సంకలనాల్లో స్థానం లభించింది. కుల, పితృస్వామ్య, వర్గ, ప్రాంతీయ అణచివేతలతో కూడిన బహుముఖ సమస్యలను ఏకకాలంలో ఎదుర్కొంటున్న దళిత స్త్రీల అనుభవ వ్యక్తీకరణకు సాహిత్య శిబిరాలతో స్థానం తక్కువగానే ఉంది.
దళిత స్త్రీ సాహిత్య పరిణామం
ఆది ఆంధ్ర ఉద్యమ కాలం నుంచి నేటి ఆత్మగౌరవ పోరాటాల వరకూ దళిత స్త్రీలు రచనలు చేస్తున్నారు. 1940కి ముందు దళిత స్త్రీలకు చదువు అందనంత దూరంలో ఉంది. నిరక్షరాస్య జనాభాలో దళిత స్త్రీలే అధిక శాతం ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చిలకరించినట్లుగా ఉన్న దళిత మహిళా విద్యావంతుల్లో కవులు, మేధావులు, కళాకారులు, పండితులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, పోలీసాఫీసర్లు, క్రీడాకారులు, రాజకీయవేత్తలు, విశ్లేషకులు, పరిశీలకులు, విమర్శకులు, సంపాదకులు, కాలమిస్టులు ఉన్నారు. వీరు అనేక సాహితీ ప్రక్రియల్లో రచనలు చేశారు, చేస్తున్నారు. కొన్ని ఆధునిక ప్రక్రియలను తెలుగు సాహిత్యానికి మొదటిసారిగా పరిచయం చేసిన రచయిత్రులు కూడా ఉన్నారు. 'హైకూలు' రాసిన తొలి దళిత రచయిత్రి స్వరూపరాణి. వీరిలో ఎక్కువమంది పిల్లలు, స్త్రీల విషయాలను సాహిత్య వస్తువుగా తీసుకోవడం కన్పిస్తుంది.
దళిత పురుషులతోనూ, అగ్రకుల స్త్రీలతోనూ పోల్చినప్పుడు అత్యధిక పీడనకు గురవుతున్నది దళిత స్త్రీలే! దళితవాదం ఒక స్పృహగా 20వ శతాబ్దం మొదటి నుంచీ తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్నా, ఒక చైతన్య రూపంగా జాషువా నుంచి వికసిస్తున్నా, ఒక ప్రతిఘటన రూపంగా హేతువాద, నాస్తికవాద, సామ్యవాద ఉద్యమాల్లో పెంపొందుతున్నా, 1980ల నుంచే పోరాట స్పృహ రగులుతూ వచ్చింది. 1990ల నుంచి స్పష్టంగా ఒక సమగ్ర వికాసాన్ని సాధిస్తోంది. సాహిత్యంలో దళితవాదం నేపథ్యం పరిశీలిస్తే - భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో సాహిత్య వాదాల పరిణామం భిన్న రీతుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 1930ల నుంచీ సాహిత్యంలో మార్క్సిస్టు దృక్పథం ప్రధాన స్రవంతిగా ఉంది. అది అనేక రూపాల్లో సాహిత్య సృజనలో ప్రతిఫలించింది. సాహిత్యంలో సంఘర్షణ ఒక వాదంగా ముందుకు రావడానికి పునాదితోనే బయలుదేరిన అసంతృప్తి ఎంతోకాలంగా రగలి రగిలి అనుకూలమైన ఒక సామాజిక బిందువు దగ్గర విస్ఫోటనం చెందుతుంది. దళిత సాహిత్యానికి ఈ విస్ఫోటన దశ 1990 నుంచి ప్రారంభమై, సాహిత్య ప్రక్రియలన్నింటినీ వేగంగా ప్రభావితం చేసింది.
భారత వ్యవసాయోత్పత్తిలో 90 శాతం మంది దళిత, దళితేతర కులాల స్త్రీలు పాల్గొంటున్నారు. ఇందులో లింగ ప్రాతిపదికతోపాటు కుల ప్రాతిపదికన కూడా శ్రమ విభజన జరిగింది, జరుగుతోంది. వీరి శ్రమకు విలువ లేనితనాన్ని రుద్దడంలో ఈ వ్యవస్థ తొలినుంచీ బలంగానే పనిచేస్తోంది. దళిత, వెనుకబడిన కులాల, ముస్లిం, గిరిజన స్త్రీలను హిందూ ఆధిపత్య కుల పితృస్వామ్యం అదుపులో ఉంచి క్రూరంగా అణచివేస్తోంది. ఈ వాస్తవికతని స్త్రీల ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు గుర్తించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. స్త్రీలకు, దళితులకు వర్ణ వ్యవస్థలోనే సంక్షేమాన్ని కోరిన గాంధీ కొటేషన్లు ప్రజాస్వామ్య ఉద్యమాలకు, స్త్రీవాదానికి ఆదర్శం కాలేదు.
సమాజంలోని శ్రమ, పెళ్లి, పుట్టుక, మాట్లాడే పద్ధతి, చావు, తిండి, సంప్రదాయాలు, అలంకరణ మొదలైనవి గమనించదగినవి. సమాజంలో కించపరచబడే పనిముట్లు, శ్రమ దళిత కులాల్లో గౌరవింపబడుతూ జీవనాధారంగా స్వీకరింపబడతాయి. ఉదాహరణకు : పొలాల్లో పంటను కోసిన తరువాత కుప్పలు నూర్చి కల్లంలో తయారైన రాశులను సంచులకు ఎత్తుతారు. భూస్వామి ఇంటికి ధాన్యం తరలించిన తరువాత దళిత స్త్రీలు చాట, కొయ్యలు, కుంచి బట్ట తీసుకొని ఆ కల్లంలోకి వెళతారు. మట్టిలో కలిసిన ధాన్యపు గింజలను మట్టి, తాలు, వడిపిలి, గడ్డిగింజల నుంచి దఫాదఫాలుగా వేరు చేస్తారు. దీనినే 'లేకి కల్లం' అని, ఇందులో ఉపయోగించే చాటనే 'లేకి చాట' అని అంటారు. లేకి అనే మాట చేర్చటం ద్వారా ఇక్కడ శ్రమను హీనపర్చటం మనం గమనిస్తాము. దళిత కులాల్లోని సంప్రదాయాలకు, పూజలకు పునాది స్త్రీలే! ఇక్కడ శ్రమకూ, శ్రమలో స్త్రీల పాత్రకూ ప్రాధాన్యం కనిపిస్తుంది. దళితుల పండగల వ్యవహారంలో పురుష దేవుళ్లు కనబడరు. అందరూ స్త్రీ దేవతలే! వారిని గ్రామ దేవతలుగా కూడా చూస్తారు. దీన్నిబట్టి వీరికీ, హిందూ దేవుళ్లకూ గల తేడా గమనించవచ్చు. హిందూ దేవతలు పురుష దేవుడి పక్కన, పువ్వులు, చెంబులు, దీపాలు పట్టుకొని లేదా భర్త కాళ్లు పడుతూనో కనిపిస్తారు. దళితలు పూజించే దేవతలు వేప కొమ్మలు, మొంట్య (చిన్నచాట), లక్క కోలలు (కర్రతో చేసిన బొమ్మలు) పట్టుకొని వివిధ స్థలాల్లో, చెట్టు కింద సాదా సీదాగా చిన్న గుడిలోనో లేదా బహిరంగ ప్రదేశాల్లోనే ఉంటారు. వీరి దరిదాపుల్లో పురుష దేవుళ్లు కన్పించరు.
దళిత ఉద్యమాలు - స్త్రీలు
దళిత పురుష కవులు కులవృత్తిని, పనిముట్లని సాహిత్యంలో పొందుపరిచారు. తమదైన భాష, సంస్కృతి, సంప్రదాయాలుగా, ఆత్మగౌరవంతో చాటి చెప్పారు. దళిత స్త్రీల పట్ల మాత్రం పితృస్వామ్య ధోరణులే కనబరిచారు. 'మానం పోతే కడుక్కోగలం.. రవిక పోతే కొనుక్కోలేము' అనే వ్యాఖ్యానాలు దీనికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. రవిక పోతే కొనుక్కోలేకపోవడం పేదరికానికి ప్రతీక. దానిలో ప్రశ్నించాల్సింది ఏమీ లేదు. అంతమాత్రాన దళిత స్త్రీ ఆత్మగౌరవం పోగొట్టుకోవడమనేది ఎన్నటికీ తక్కువ కాదు కదా! కుల వ్యవస్థ రాజ్యమేలే నిచ్చెన మెట్ల సమాజంలో పెత్తందారులకు దళితులంటే చులకన - దళిత స్త్రీలంటే మరింత చులకన. దళిత పురుషులు శ్రమ దోపిడీకి గురైతే, దళిత స్త్రీలు - శ్రమ దోపిడీతోపాటు లైంగిక దోపిడీకి కూడా గురవుతున్నారు. దళిత స్త్రీ తన పైకులాల పురుషుల నుంచే కాక, తన సొంత మగవాళ్ల నుంచి కూడా పీడనను భరిస్తోంది. దీనిని ప్రత్యేక దృష్టితో అర్థం చేసుకోవాలి. స్త్రీల మనోగతాన్ని వ్యక్తీకరించటంలో పురుషాధిపత్యం, దానిని ప్రభావిత పదజాలం పెచ్చరిల్లటం మంచిది కాదు.
దళిత స్త్రీలపై జరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా నడచిన పోరాటాల్లో నష్టపరిహారం, ఆత్మగౌరవం అనే రెండు అంశాలూ సమభాగం కావాల్సి ఉంది. దళిత స్త్రీలు ఎదుర్కొంటున్న కుటుంబ హింస, గర్భధారణ, ప్రసూతి బాధలు, చావులను అంచనా వేయలేకపోవడం మొదలైనవి. నేడు దళితేతర స్త్రీలు, దళిత స్త్రీలు, గిరిజన స్త్రీలు, హిందూయేతర మతాల స్త్రీలు వారి హక్కుల కోసం పోరాడుతున్న పరిస్థితి నెలకొంది. దళిత పురుషులు కూడా దళిత స్త్రీని ఒక బాధితురాలిగానో, తమ నీడన నిలబడే వారిగానో గుర్తిస్తున్నారేగానీ, హక్కులు కలిగిన వ్యక్తిగా, పోరాడే శక్తిగా గుర్తించడంలో వెనుకబడ్డారనే చెప్పాలి. సాంఘిక, లైంగిక అంశాలతో దళిత స్త్రీలకు ప్రత్యేక సమస్యలు, పోరాటాలు, హక్కులు, సంఘీభావం అవసరమనే విషయాన్ని గుర్తించాల్సి ఉంది. ఇప్పటివరకూ జరిగిన దళిత ఉద్యమాల్లో కూడా స్త్రీల ప్రశ్నలు పితృస్వామ్య భావజాలం చాటున సరిగ్గా చర్చకు రాకపోవడం, ఉద్యమం వారిని ఉపయోగించుకొని, తర్వాత పక్కకి తోసేయడం జరుగుతూనే ఉందనే విషయాన్ని అనేకమంది దళిత స్త్రీల అనుభవాలు చెబుతూనే ఉన్నాయి. 1978 తరువాత వచ్చిన తిమ్మ సముద్రం, కారంచేడు, చుండూరు ఉద్యమాల్లో దళిత స్త్రీలు నాయకులు గానూ, రచయితలుగానూ, ఆత్మగౌరవ దళిత ఉద్యమాన్ని నిర్మించడంలో బలమైన పాత్రని పోషించారు. ఈ కోణంలో దళిత మహిళల సమస్యలపై రచయిత్రులు వెలువరిస్తున్న కథలూ, కవిత్వం, ఇతర రచనలూ ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
- ఆరికొండ ప్రతాప్‌ కుమార్‌ 
Prajashakti Telugu News Paper Dated : 10/2/2013

Sunday, February 10, 2013

స్త్రీవాదాన్ని విస్తృతార్థంలో చూద్దాం! - ఎ. సునీత



 స్త్రీల ఉద్యమాలకూ, స్త్రీవాదులకూ, దళిత బహుజన, మైనారిటీ స్త్రీలూ, వారి సమస్యల పట్ల వున్న అవగాహన, నిబద్ధత పట్ల ఆయా సమూహాలకు చెందిన మేధావులు సందేహాలు వ్యక్తం చేయటం ఇరవై ఏళ్ల నుండి జరుగుతోంది. ఢిల్లీ సంఘటన నేపథ్యంలో ఈ విషయం మరింత చర్చనీయాంశం అయింది. 'వివిధ' (21.1.13)లో సుభద్ర వ్యాసం ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీవాదాన్ని విశ్లేషించే ప్రయత్నం చేసి మంచి చర్చకు తెరతీసింది.

సుభద్ర తను పరిశీలించిన పుస్తకాలలో ఎక్కువశాతం అగ్రకుల రచయితలే ఉన్నారన్న పరిశీలన సరైనదే. స్త్రీవాదం అందరి స్త్రీల కోసం పనిచేయాలంటే, స్త్రీవాద ఉద్యమాలూ, స్త్రీవాదము దళిత, బహుజన, మైనారిటీ స్త్రీల జీవితాల గురించీ, దృక్పథాల గురించీ చాలా నేర్చుకోవాలని జూపాక సుభద్ర చెప్పకుండా చేసిన సూచనతో విభేదించడమూ కష్టం. అయితే, ఆయా స్త్రీవాద ప్రచురణలను అంచనా వేయడానికీ, దానిపై ఆధారపడి ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీవాదాన్ని గురించి ఒక అంచనాకు రావటానికి, సుభద్ర అనుసరించిన ప్రచురణల పరిమిత పరిశీలన సరిపోతుందా? 1970లలో స్త్రీవాద ఉద్యమం మొదలయినప్పటి నుండీ 2013 వరకూ, వివిధ చారిత్రక సందర్భాల్లో వచ్చిన రచనలను ఇటువంటి విశ్లేషణా చట్రంలో పరిశీలించటం సాధ్యమేనా? ఈ ముప్ఫై ఏళ్లల్లో స్త్రీవాదంలో ఏ మార్పులూ రాలేదా? ఈ మార్పుల్లో సుభద్ర వంటి దళిత బహుజన మేధావుల పాత్ర ఎలాంటిది? అసలు స్త్రీవాదాన్ని ఆయా సంస్థలకు, గ్రూపులకు కుదించటం సాధ్యమేనా?

స్త్రీవాదంతో గత మూడు దశాబ్దాలుగా ప్రయాణిస్తున్న 'అన్వేషి' సభ్యురాలిగా నేను సుభద్ర మొదలుపెట్టిన చర్చను ముందుకు తీసుకువెళ్లాలంటే, స్త్రీవాదాన్ని అంచనా వేయడానికి తాననుసరించిన పరిమిత పరిశీలనా చట్రం కాక, మరింత విస్తృతమైన విశ్లేషణా చట్రం అవసరం. దానికోసం, స్త్రీవాదం వచ్చిన చారిత్రక సందర్భాన్ని, గత ముప్ఫై ఏళ్లల్లో దళిత ఉద్యమాల నుండీ, దళిత స్త్రీల నుండి వచ్చిన సవాళ్లను గుర్తుచేసుకోవాలి. 1970లలో వచ్చిన స్త్రీవాదులు ప్రధానంగా అగ్రకులాలకి చెందినవారే. అప్పటి స్త్రీవాదులకి, వామపక్ష వాదం నుంచి విడివడి, స్త్రీల సమస్యలు ప్రత్యేకమని, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రత్యేక పోరాటం అవసరమనీ వాదించటం చారిత్రకంగా ప్రధానమయింది. 1980ల వరకూ స్త్రీల వ్యతిరేక చట్టాలను మార్చటం, హింసకు వ్యతిరేకంగా కొత్త చట్టాల కోసం పోరాటాలు జరిగాయి. మథుర, రమీజ బీ వంటి ఆదివాసీ, ముస్లిం స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిపినా, వారి ఆదివాసీ, ముస్లిం అస్తిత్వాలు, వాటితో ముడిపడి ఉన్న సమస్యలు పెద్దగా ముందుకు రాలేదు. అందరు స్త్రీలకూ పిత్రుస్వామ్యమే ప్రధాన శత్రువనే అవగాహనా ఆ రోజుల్లో ఉండింది. ఆ సమయంలోనే 'మనకు తెలియని మన చరిత్ర' పుస్తకం వచ్చింది.

ఈ అవగాహన, 1990-92లలో మారవలసి వచ్చింది. మండల్ కమిషన్ నివేదిక విడుదల, చుండూరు ఊచకోతల సందర్భంలో దళిత ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలూ, బాబ్రి మసీదు కూల్చివేత తరువాత లౌకికవాదంపై ముస్లింలు లేవనెత్తిన సందేహాలూ స్త్రీవాదుల్ని కుదిపేశాయి. స్త్రీలంతా ఒకటి కాదనీ, దళిత, ముస్లిం స్త్రీల జీవితాలను కుల వ్యవస్థా, హిందూ జాతీయవాదం శాసిస్తున్నాయనే అవగాహన స్త్రీవాదులకు నెమ్మదిగా రావటం మొదలయింది. రిజర్వేషన్లను సమర్ధిస్తూ ఏర్పడిన సమతా సంఘటనలో హైదరాబాదులోని స్త్రీవాదులు భాగం కావటం, చుండూరు ఘటన గురించి రాయటం, కులం, జెండర్ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం 1990-2000 మధ్య జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఉద్యమం కూడా కుల సమస్యని పట్టించుకోవటం ఈ దశాబ్దంలో వచ్చిన ముఖ్య మార్పు. స్త్రీల ఉద్యమాల, దళిత ఉద్యమాల మధ్యలో దళిత స్త్రీలు ఎక్కడనే ప్రశ్నని చల్లపల్లి స్వరూపరాణి 1990ల మధ్యలో లేవనెత్తే వరకూ, దళిత స్త్రీల ప్రశ్న ఆంధ్రప్రదేశ్‌లో స్పష్టంగా రాలేదు.

దళిత స్త్రీలు బాధితులు కారనీ, వారికీ ప్రత్యేక దృక్కోణం ఉందనే విషయాన్ని ఆమె చెప్పారు. విషయాలని అర్ధం చేసుకోవటానికి, అప్పటికున్న పితృస్వామ్యాన్ని కేంద్రంగా చేసుకున్న స్త్రీవాద చట్రాన్ని ప్రశ్నించటం ఆంధ్రప్రదేశ్ స్త్రీవాదులలో అప్పుడే మొదలయింది. సూసి తారు, కల్పనా కన్నబిరాన్ ఇటువంటి సందర్భంలోనే తమ తమ సందేహాలను సిద్ధాంతీకరించారు. 2000 నుండి దళిత, ముస్లిం, బహుజన స్త్రీలు స్త్రీవాదాన్ని కుదిపి వేసి, దాన్ని పునర్నిర్వచిస్తున్నారు. సుభద్రతో సహా, చల్లపల్లి స్వరూపరాణి, వినోదిని, షాజహానా, జాజుల గౌరీ, గోగు శ్యామల, సూరేపల్లి సుజాత వంటి అనేక సాహితీ-సిద్ధాంతవేత్తలు తమ తమ రచనల్లో- కుటుంబం, భూమి, ఇల్లు, కమ్యూనిటీ, హింస, హక్కులు, ప్రాంతం, రాజకీయాలు, పంచాయితీలు, మతము- వంటి అనేక విషయాలని తమదైన స్త్రీవాద దృక్పథంలో విశ్లేషించి వాటిని చూడవలసిన దృక్పథాలని పునరాలోచించేలా చేస్తున్నారు. అప్పటికే, 1990లలో కుల సమస్య గురించి ఆలోచించటం మొదలుపెట్టిన అన్వేషి సంస్థ నుండి గోగు శ్యామల 'నల్లపొద్దు' సంకలనాన్ని తీసుకొచ్చారు.

2000 తరువాత, 'మట్టిపూలు' వంటి దళిత, బహుజన, మైనారిటీ స్త్రీల రచయిత్రుల వేదికలొస్తే, ఇంకో పక్క దళిత స్త్రీశక్తి వంటి దళిత స్త్రీల హక్కుల సంఘాలు కూడా వచ్చాయి. గోగు శ్యామల, దళిత రాజకీయవేత్త సదాలక్ష్మి జీవిత చరిత్ర 'నేనే బలాన్ని' అనే పుస్తకం రాసారు. దళిత స్త్రీలు స్త్రీవాదాన్ని విస్తృతం చెయ్యటమే కాక, బలంగా, లోతుగా విశ్లేషిస్తున్నారు. 'అన్వేషి' వంటి స్త్రీవాద పరిశోధన కేంద్రాలు, దళిత, మైనారిటీ సమస్యల పరిశోధనకై ప్రత్యేక విభాగాలు ప్రారంభించి, అనేక రకాల పరిశోధనలు జరగడంలో తోడ్పడుతున్నాయి. ఈ రకమైన విస్తృత విశ్లేషణా చట్రంలో చూసినప్పుడు, స్త్రీవాదానికి, దళిత బహుజన స్త్రీల దృక్పథాలకీ మధ్య ఉన్న సంబంధం ఎప్పుడూ ఒకే రకంగా లేదనీ, దృక్పథాలు మారుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీవాదం రకరకాలుగా స్పందిస్తూ వచ్చిందనీ అర్ధమవుతుంది. అప్పుడు, అంటే 1990ల ముందు వచ్చిన రచనలనీ, తరువాత వచ్చిన రచనలనీ, సంఘాల, గ్రూపుల కార్యాచరణని కూడా వేరుగా చూడాలి. 

అగ్రకుల స్త్రీలు రాసినవయినా సరే, వాటిలో దళిత, మైనారిటీ, ఆదివాసీ స్త్రీల ప్రత్యేక చరిత్రలనూ, జీవితాలనూ, దృక్పథాలనూ పరిగణనలోకి తీసుకున్నాయా, ఎంతమేరకు తీసుకున్నాయనే ప్రశ్న వేసుకోవాలి. స్త్రీవాదాన్ని నిర్వచించే విశ్లేషణ చట్రంలో, ఆయా సంఘాల, గ్రూపుల కార్యాచరణలో, దళిత, ఆదివాసీ, మైనారిటీ స్త్రీల సిద్ధాంతాలకూ, రచనలకూ ఎటువంటి పాత్ర ఉందనే ప్రశ్న కూడా అడగాలి. ఈ దృక్పథంలో అన్వేషి పుస్తకం స్త్రీవాద రాజకీయాలూ-వర్తమాన చర్చలు సంకలనంలో, సుభద్ర అంచనా ప్రకారం, గోగు శ్యామల రాసిన ఒక్క వ్యాసం తప్ప మిగిలినవన్నీ అగ్రకుల స్త్రీల జీవితాల చుట్టూ, వారి సమస్యల గురించి మాత్రమే ఉన్నాయి. 1990ల తరువాత స్త్రీవాద సిద్ధాంతాలలో వచ్చిన కొత్త చర్చలని కొన్ని ఇంగ్లిష్‌లో వచ్చినవి తెలుగులోకి అనువదించి, కొన్ని తెలుగులో రాసిన పరిశోధనా వ్యాసాలు కలిపి ఈ పుస్తకాన్ని అన్వేషి వేసింది. దీని కూర్పు 1990లలో మొదలయ్యి, పూర్తి కావటానికి పదేళ్లు పట్టడంతో సుభద్ర విమర్శ కొంత సరైనదే అనిపిస్తుంది.

అయితే, విషయ పరిశీలనకు వచ్చినప్పుడు, ఆ విమర్శకున్న పరిమితులు కూడా అర్థమవుతాయి. సజయ వ్యాసం భూమి కోసం బహుజన స్త్రీలు, దళిత స్త్రీలు, ఆదివాసి స్త్రీలు చేస్తున్న పోరాటాల గురించి, వారి గొంతుల ద్వారా చర్చించి, ఆ పోరాటాల ఫలితాలు అగ్రకుల పితృస్వామ్యం వల్ల ఏ విధంగా వారి కందకుండా పోతున్నాయనే విషయాన్ని చర్చిస్తుంది. లలిత వ్యాసం ప్రపంచీకరణ నేపథ్యంలో పేద స్త్రీల కోసమంటూ నడిపిస్తున్న పొదుపు కార్యక్రమాలు, ఏ రకంగాను వారి స్వశక్తిని పెంపొందించడం లేదనీ, జిల్లా యంత్రాంగానికి వీరిమీద ఇంకా నియంత్రణ కల్పించేటట్లు ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయని, పోరాడే సత్తా వున్న దళిత స్త్రీలను వీటిల్లోకి రానివ్వకుండా చేస్తున్నారని చెప్పారు. ఇక తెలుగేతర స్త్రీవాద వ్యాసకర్తల దగ్గరికి వస్తే, వందన సోనల్కర్ వ్యాసంలో అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెడుతూ చేసిన వాదనల నేపథ్యంలో స్త్రీవాదులు రిజర్వేషన్లను, ఉమ్మడి పౌర చట్టం వంటి పౌరసత్వ హక్కులను చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఈ విషయాల పట్ల మహారాష్ట్రలోని దళిత స్త్రీల సంఘాల వాదనలు, వాటిలో కూడా వస్తున్న మార్పులను కూడా చర్చించారు. స్త్రీవాదులంటే ఎవరు, ఏ ఏ సామాజిక నేపథ్యాల నుంచి వచ్చారు, వారి దృక్పథాలు ఏర్పడటంలో దాని పాత్ర ఆవిడ చర్చిస్తారు. ఫ్లావియా అగ్నెస్, బాబ్రీ మస్జిద్ తరువాత చెలరేగిపోయిన హిందుత్వవాద నేపథ్యంలో స్త్రీల ఉద్యమం తన ఎజెండా పునర్‌నిర్వచించుకోవాలని వాదిస్తారు. ముస్లిం స్త్రీల, ముస్లిం కమ్యూనిటీకున్న ప్రత్యేక పరిస్థితులని అర్థం చేసుకోలేని నేపథ్యంలో అది హిందూ స్త్రీల ఉద్యమంగా మిగిలిపోతుందని అంటారు. ముస్లిం స్త్రీల హక్కుల గురించి పనిచేయడమే కాక, క్రైస్తవ వివాహ చట్టంలో మార్పుల కోసం అపారమైన కృషి చేసిన వారు ఫ్లావియా. భారతదేశంలో స్త్రీవాదాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే, అంబేద్కర్ కులం, జెండర్ కలిపి విశ్లేషించిన విధానాన్ని అలవర్చుకోవాలి, అనే వందనా సోనల్కర్ వాదన, ముస్లిం స్త్రీల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ఇస్లాం మతం గురించి కాక 1990ల తరువాత హిందూత్వవాద భావజాలాన్ని, ఉమ్మడి పౌరసత్వ రాజకీయాలనీ అర్ధం చేసుకోవాలనే ఫ్లావియా వాదనా ఈ సంకలనంలో విలువైనవి. శ్యామల వ్యాసంపై పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం వుంది.

అయితే ఇటువంటి విషయ పరిశీలన జరగటానికి, ఇంతకు ముందు చెప్పినట్లు విశ్లేషణ చట్రాన్ని విస్తృతం చేసుకోవటం చాల అవసరం. ముప్ఫయ్యేళ్లలో దళిత ఉద్యమ ఫలితంగా, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఉద్యమాలతోపాటు, స్త్రీవాద ఉద్యమం కూడా కుల సమస్యను అనివార్యంగా సీరియస్‌గా తీసుకోవటం మొదలైంది. అలా గుర్తించిన స్త్రీవాదం గురించిన ప్రశ్నలను మార్చటం కూడా అవసరం. ఇంకా లోతుగా, నిశితంగా అడగటం మరీ అవసరం. స్త్రీవాదం కొన్ని వర్గాల, కులాల స్త్రీలకూ, కొన్ని సంస్థలకూ, గ్రూపులకూ పరిమితం కాకుండా ఉండాలని, రాజకీయంగా జీవించి ఉండాలని ఆశించే వారికి, అగ్రకులంలో పుట్టినవారికైనా, దళితులుగా నిర్వచించుకున్నవారైనా- అందరికీ ఇది ముఖ్యం, అవసరం. ఈ చర్చకు తెరతీసిన సుభద్రకు అభినందనలు.

- ఎ. సునీత
సీనియర్ ఫెలో, అన్వేషి

Andhra Jyothi Telugu News Paper Dated : 11/2/2013

Thursday, December 27, 2012

అంతటా స్ర్తీది ఒకే దుస్థిత ---Kommineni Srinivasa Rao



- దేశాన్ని కుదిపివేసిన అత్యాచారం
- ఉద్యమరూపం దాల్చిన ఆందోళనలు
- ప్రపంచమంతటా స్త్రీ వివక్ష 
- చట్టాలు పుష్కలం, ఆచరణే శూన్యం 
- ప్రాణాంతకమైన దురాచారాలు 
- అంతులేని వరకట్న హత్యలు 
- ప్రజాప్రతినిధులపైనా అత్యాచారం కేసులు 

JM
దేశ రాజధానిలో జరిగిన దారుణ మానభంగం ఘటన దేశవ్యా ప్తంగా ప్రజలలో ఒక కదలిక వచ్చేలా చేసింది. ఇదేమి దారుణం, ఈ ప్రభు త్వాలు ఏమి చేస్తున్నట్లు? ఈ రాజకీయ పార్టీలు ఏమి చేస్తున్నట్లు? ఇంత అరాచ కానికి పాల్పడిన తీరుపై ఢిల్లీలో వెల్లువెత్తిన తీరు కూడా అందరిలో చైత న్యం పెంచింది. కొంతకాలం క్రితం అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం చేపట్టి నప్పుడు ప్రజలలో ఎలా ఒక్కసారిగా ఆవేశం ఉప్పొంగిందో, ఇప్పుడు ఈ ఘటన కూడా అలాగే అందరిని ఆలోచింప చేసింది. మానవ రూపంలో ఉన్న మృగాలు చేసిన ఘాతుకాన్ని ఖండించడానికి మాటలు ఉండవనే చెప్పాలి. 

నిజానికి ప్రపంచవ్యాప్తంగా మహిళలు అత్యాచారాలకు గురి అవుతున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకపక్క శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్నా, మరో వైపు మూఢ నమ్మకాలు, నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మానభంగం కేసులు కాని, మహిళలపై గృహ హింస కేసులు కాని లేని దేశం దాదాపుగా లేదనే చెప్పాలి. కమ్యూనిజం ద్వారా సమానత్వం సాధించడానికి ప్రయత్నించే చైనాలో కూడా ముప్పై శాతం మంది మహిళలు గృహహింసను ఎదుర్కుంటున్నట్లుగా ఒక సమాచారం వెల్లడిస్తోంది. ఉక్రేనియా దేశంలో పది నుంచి పదిహేను శాతం మంది మహిళలు మానభంగాలకు గురి అయ్యే పరిస్థితి ఉందని, రెండువేల మూడులో వచ్చిన ఒక నివేదిక వెల్లడించింది. పారిశ్రామికంగా ఎదిగిన దేశాలలోకన్నా, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగాఉండే దేశాలలో ఈ సమస్య మరీ అధికంగా ఉంది. అనేక దేశాలలో దీనికి సంబంధించిన చట్టాలుఉన్నా అమలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 

ప్రపంచంలో యుద్ధాలు జరిగే సమయాలలో మహిళలపై జరిగే అత్యాచారాలు ఇన్నీ అన్నీ కావు. పురుషాధిక్య సమాజం ప్రపంచం అంతటా ఏదో రూపంలో కొనసాగుతున్న తరుణంలో మహిళను మనిషిగా కాక, ఆస్తిగా చూడడం కూడా దీనికి ఒక కారణంగా కనిపిస్తుంది. బోస్నియాలో యుద్ధం జరిగినప్పుడు సెర్బ్‌లు ఇరవైవేల మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారన్న సమాచారం వినడానికే దారుణంగా ఉంటుంది. సూడాన్‌లో అంతర్యుద్ధంలో వేలాది మంది మహిళలు కూడా ఇదే పరిస్థితికి గురి అయ్యారు. రవాండా దేశంలో 1990 దశకంలో మూడు లక్షల మంది టుట్సీ జాతి మహిళలు అత్యాచారాలకు గురి అయ్యారు. ఇక కొన్ని మూఢ నమ్మకాలకు కూడా స్ర్తీలు బలి అవుతున్నారు. 

స్ర్తీల జననాంగాలకు సున్తీ చేసే సంప్రదాయం కొన్ని దేశాలలో ఉన్న తీరు చాలా ఘోరంగా ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కొన్ని భాగాలను తొలగించే వైనం హృదయ విదారకంగా ఉంటుంది. అమెరికా వంటి దేశాలలో దీనిపై నిషేధం విధించినా అనేక ఆఫ్రికా దేశాలలో ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. ఇరవై ఎనిమిది ఆఫ్రికా దేశాలలో, మద్యప్రాచ్య దేశాలలో, యూరప్‌, అమెరికా, కెనడాలలోని సంచార జాతులలో ఈ దుష్ట సంప్రదాయం మహిళలకు ప్రాణాంతకంగా మారుతోంది. కొన్ని దేశాలలో ఈ సమస్య నుంచి తప్పించు కోవడానికి మహిళలు ఇతర దేశాలకు పారిపోయి ఆశ్రయం కోరుతున్న ఘటనలు కూడా ఉంటున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల మంది వనితలకు ఈ సమస్య ఎదురవుతోంది. మాలి దేశంలో, సూడన్‌ దేశంలో తొంభై మూడు శాతం మంది ఈ తరహా ఇబ్బంది (జెనిటికల్‌ మ్యుటిలేషన్‌) కి గురవుతున్నారంటే ఎంత విషాదమో ఆలోచించండి. 

ఇక కొన్ని ముస్లిం దేశాలలో మానభంగం జరిగినా ఫిర్యాదు చేసే పరిస్థితి తక్కువగా ఉంటుంది. సమాజ కట్టుబాట్లకు తోడు, మానభంగం కేసును రుజువు చేయడానికి నలుగురు సాక్షులు ఉండాలన్న నిబంధన ఉండడం దారుణంగా చెప్పవచ్చు. ఇక భారత దేశంలో, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాలలో కట్నం హత్యలు ఎక్కువగా ఉంటున్నాయి. రెండువేల రెండులో లెక్కల ప్రకారం ఇండియాలో ఆరువేల మంది మహిళలు కట్న హత్యలకు గురి అయ్యారు. పాకిస్థాన్‌, అఫ్ఘానిస్థాన్‌ వంటి దేశాలలో మహిళల పట్ల తాలిబన్లు ఎంత పాశవికంగా అనుసరిస్తున్నది ఇటీవలి చరిత్రే. ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్న నలుగురు మహిళలను తాలిబన్లు పాక్‌లో కాల్చి చంపారు. 

Vijay-Chowk
మలాలా అనే చిన్నారి, బాలికల విద్యా హక్కు గురించి గొంతెత్తినందుకు ఆమెను హతమార్చడానికి తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆ ఘటనపై ప్రపంచం అంతా తీవ్రంగా స్పందించింది. ప్రత్యేకంగా ఒక విమానం ద్వారా లండన్‌ పంపి ఆమెకు వైద్యం చేస్తున్నారు. కిర్జిస్థాన్‌ దేశంలో పెళ్లికాని యువతులను కిడ్నాప్‌ చేసి బలవంతంగా రేప్‌చేసి పెళ్లిచేసుకోవడం ఒక సంప్రదాయంగా ఉంది. మహిళలకు ఇష్టం లేకపోయినా ఒకసారి కిడ్నాప్‌కు గురి అయ్యాక తప్పనిసరిగా పెళ్లి చేసుకోవలసి వస్తోంది. పన్నెండువేల కేసులు ఈ తరహావి నమోదు అయి, అక్కడ పార్లమెంటు దీనిపై చట్టం తీసుకు రావడానికి ప్రయత్నిస్తే, కొందరు రాజకీయ నేతలు ఇది సంప్రదాయం అంటూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మన దేశంలో మానభంగం కేసులు ప్రతి అరగంటకు ఒకటి జరుగుతుంటే, అమెరికాలో ప్రతి రెండు నిమిషాలకు ఒకటి జరుగుతోందని ఒక వ్యాసకర్త పేర్కొన్నారు. అయితే వీటిలో అత్యధికం పోలీసు స్టేషన్‌లలో నమోదు కావు. అందుకు అనేక కారణాలు ఉండవచ్చు. అమెరికా, ప్రాన్స్‌, స్వీడన్‌ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఈ తరహా కేసులు నమోదవుతున్నాయంటే మానవ సమాజం ఎంత అనారిగకంగా ఉన్నది అర్ధం అవుతుంది. కొన్ని దేశాలలో వావివరసలతో సంబంధం లేకుండా దారుణమైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ మధ్యనే ప్రపంచబ్యాంక్‌ ఛైర్మన్‌గా పనిచేసిన స్ట్రటస్‌ ఖన్‌ అనే వ్యక్తి పై అత్యాచారం అభియోగం నమోదైంది. చివరికి ఆయన వ్యక్తిగతంగా పరిహారం చెల్లించి బయటపడ్డారు. ఇటలీ మాజీ ప్రదాని బెర్లుస్కొని సెక్స్‌ పార్టీలలో పాల్గొన్నారన్న అభియోగం వచ్చింది. 

మన దేశంలో కూడా రాజకీయ నాయకులపై అత్యాచార కేసులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలలో 369 మందిపై అత్యాచారం, ఇతర కేసులు ఉన్నాయి. వీరిలో వివిధ పార్టీలకు చెందినవారు ఉన్నారు. ఈ విషయంలో ఉత్తర్రపదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ ముందంజలో ఉన్నాయి. ఈ కేసులు ఉన్నప్పటికీ ఎన్నికలలో ఆయా పార్టీల టిక్కెట్లు పొందిన వారిలో కాంగ్రెస్‌ నుంచి ఇరవై ఆరు మంది, బిజెపి నుంచి ఇరవై నాలుగు మంది శాసనసభ్యులు ఉండడం విశేషం. అత్యాచారం కేసులు ఉన్నా, ఇండిపెండెంటుగా పోటీచేసి గెలుపొందినవారు కూడా డెబె్భై ఆరు మంది ఉండడం విశేషం. 

కొందరు రాజకీయ నేతలు కొంతకాలం ఈ కేసులలో అరెస్టు అయినా, ఆ తర్వాత ఎలాగో తప్పించుకోగలుగుతున్నారు. రాజస్థాన్‌లో బన్వరీదేవి కేసులో ఒక మంత్రిపై అభియోగాలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎయిర్‌ హోస్టెస్‌ ఆత్మహత్య కేసులో హర్యానా మంత్రి అరెస్టు అయ్యారు. జమ్ము- కాశ్మీర్‌లో రెండు వేల ఐదులో నమోదైన సంచలనాత్మక మానభంగం కేసులో ఒక ప్రిన్సిపల్‌ సెక్రటరి, ఎమ్మెల్యేతో సహా పలువురు రాజకీయ నేతలపై కేసును చండీఘడ్‌ సిబిఐ కోర్టు కొట్టివేసింది. 

భారత్‌లో 1971లో రోజుకు ఏడు మహిళల అత్యాచారాలు, కిడ్నాప్‌ తదితర కేసులు నమోదైతే, రెండు వేల ఆరు నాటికి రోజుకు ఏభై మూడు కేసులు నమోదు అవుతున్నట్లుగా జాతీయ క్రైమ్‌రికార్డు వెల్లడిస్తోంది. అత్యాచార కేసులలో నిందితులుగా ఉన్న నేతలు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనఉన్నప్పట్టికీ, అందువల్ల రాజకీయ కక్షలతో ఇలాంటి కేసులు నమోదైతే ఏమి చేయాలన్న చర్చ వస్తోంది. జాతీయ రికార్డుల నివేదిక ప్రకారం పది లక్షల మించి జనాభా ఉన్న నగరాలలో ఈ అత్యాచారాల కేసులలో డిల్లీ మొదటి స్థానంలో ఉంటే హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉన్నట్లు తేలింది. 

రెండు వేల ఆరు లెక్కల ప్రకారం డిల్లీలో 4134 కేసులు నమోదైతే, హైదరాబాద్‌ లో 1755 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు, దేశం అంతటిలో మహిళలపై అత్యాచారాలతో సహా వివిధ రకాల కేసులలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉండడం కూడా సిగ్గుచేటే. మన రాష్ట్రంలో 21484 కేసులు నమోదైతే, ఆ తర్వాత స్థానాల్ని ఉత్తర్రపదేశ్‌, మధ్యప్రదేశ్‌లు ఆక్రమించాయి. మన డిజిపి దినేష్‌ రెడ్డి ఈ ఏడాది అత్యాచారం కేసులు తగ్గాయని చెబుతున్న తరుణంలో హైదరాబాద్‌ లోని మాదాపూర్‌ వద్ద ఒక చిన్నారి ఘాతుకానికి గురి అయినట్లు వార్తలు వచ్చాయి. సమాజం పురోగతి సాధించే కొద్దీ ఇలాంటి అత్యాచారాలు తగ్గవలసి ఉండగా, ఇవి పెరుగుతుండడం బాధాకరమే. మణిపూర్‌లో తాజాగా ఒక నటిపై నాగా మిలిటెంట్‌ ఒకరు అసభ్యంగా వ్యవహరిస్తే అతనిపై చర్య తీసుకోవాలంటూ రాష్ట్రం అంతా అట్టుడికింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పులలో ఒక జర్నలిస్టు మరణించడం కూడా బాధాకరం. 

మొత్తం మీద ఈ అత్యాచారాలకు మూల కారణాలపై అన్వేషణ సాగాల్సిన సమయం ఆసన్నమైంది. సామూహిక అత్యాచారాలను కాని, ఏ అత్యాచారాన్ని అయినా చేసే నీచ సంస్కృతిని అరికట్టకపోతే ఏ జాతికి నిష్కృతి ఉండదు. అందులో సనాతన సంప్రదాయాలతో, మహిళకు అత్యధిక గౌరవం ఇచ్చే మతంగా పేరున్న హిందువులు అత్యధికంగా నివసించే మన దేశంలో ఇలాంటి కేసులు పెరగడం కచ్చితంగా సామాజిక రుగ్మతే. ఇక్కడ శీలం పోవడంకాదు, దానిని ఒక మహిళపై దాడిగా తీసుకోవాలి. శీలం అంటే గుణం అని అర్ధం అని ఒక కవి తన పాటలో పేర్కొన్నారు. ‘నువ్వేమి చేశావు నేరం’ అంటూ మానభంగానికి గురైన ఒక మహిళను ఆదరించే విధంగా ఆ కవి రాసిన పాట అద్భుతంగా ఉంటుంది. 

ప్రతి ఒక్కరిలో సమాజం పట్ల అవగాహన, పురుషుడు- స్ర్తీ కి మధ్య ఉండవలసిన సంబంధం, అనుబంధం మొదలైనవాటిపై చిన్నప్పటినుంచే పిల్లలకు బోధన జరగాలి. అంతేకాదు సినిమాలలో కాని, ఇతర్రతా కాని మానభంగాలు, అత్యాచార నేరాలు వంటివి ప్రోత్సహించే విధంగా సన్నివేశాలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అక్కడ సిగరెట్‌పైన, మద్యపానంపైన చట్టబద్ధ హెచ్చరిక చేస్తున్నట్లు- ‘ఇది సినిమా మాత్రమే, ఇలాంటివి చేయరాదు’ అన్న సూచనలు స్పష్టంగా చేయాలి. లేకుంటే మన సమాజం ఆటవిక సమాజంగా మారిపోయే ప్రమాదం ఉంది. 

srini
ఢిల్లీలో కాని, దేశంలోని వివిధ ప్రాంతాలలో గాని మానభంగం ఘటనపై స్పందించిన తీరు మంచిదే కాని కొందరు హింసకు పాల్పడడం ఏ మాత్రం పద్ధతి అనిపించదు. ఇందులో రాజకీయాలు చొప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇది మంచి పరిణామం కాదు. ఏది ఏమైనా ప్రపంచంలో అన్ని దేశాలలో మహిళల పరిస్థితి కొంచెం తర తమ తేడాలతో దాదాపు ఒకే రకంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మహిళా హక్కుల సంఘాలు ఎంత కృషి చేస్తున్నా, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా ఈ దుస్థితి మారడం లేదు. ఇది అంతర్జాతీయ సమస్య కనుక, ప్రపంచ దేశాలన్నీ ఈ సమస్యపై ఒక అవగాహనకు వచ్చి ఎక్కడ ఇలాంటి నేరాలు జరిగినా ఒకే తరహా శిక్ష వేసే విధంగా, అలాగే ప్రజలలో మహిళల పట్ల గౌరవం పెరిగేలా చైతన్యం తెచ్చే కార్యక్రమాలు రూపొందించడం అవసరం.

Surya News Paper Dated : 27/12/2012