Showing posts with label వరవరరావు. Show all posts
Showing posts with label వరవరరావు. Show all posts

Saturday, October 13, 2012

'మా తొలి ప్రేరణ తెలంగాణ' - వరవరరావు



'ప్రజలున్న చోట, ప్రజా పోరాటాలు ఉన్న చోట నేనుంటాను. నా హృదయ స్పందనలతో ఉంటాను' అని మహాశ్వేతాదేవి పిడికిలి ఎత్తి అన్నారు.... 'తెలంగాణ ప్రజలు ఎప్పుడూ పోరాట ప్రజలే. ఎప్పుడూ ఉద్యమకారులే. అందుకే నాకు తెలంగాణ అంటే ప్రేమ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి చాలా చదివాను. చాలా తెలుసుకున్నాను. నక్సల్బరీ కన్నా ముందు మాకు అదే కదా తొలి ప్రేరణ'. 

మన మహా సాగరహారం 'చలో హైదరాబాద్' అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊళ్ళోనే ఉన్నారు. ఆ రోజు మహాశ్వేతాదేవిని మన మధ్యకు తెచ్చుకొని ఉంటే, బేగంపేట విమానాశ్రయమే ఉండి ఆమె ఆ రోజు అక్కడ కలకత్తా నుంచి వచ్చి దిగి ఉంటే బయటికి వస్తూనే చీమల దండులా వస్తున్న జనాన్ని చూసి ఆ మహా రచయిత్రి ఇటు వచ్చి ఉండేవారు. ఇప్పుడంతా బైపాస్‌లు కదా. జిఎంఆర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగితే గచ్చిబౌలీ మీదుగా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి హైదరాబాద్ తాకకుండా అంతా సైబరాబాద్ ప్రయాణమే.

ఈ సైబరాబాద్ అల్లావుద్దీన్ అద్భుత దీపం సృష్టికర్త ఇప్పుడు, ఇన్నాళ్లకు, తొమ్మిదేళ్లకు పల్లెలను పలవరిస్తూ పల్లెబాట పట్టాడు. పల్లేరు కాయలు, పరిగ తప్ప పంటలు లేని పల్లె బాట. తానూ, తదనంతరం వారూ దక్కన్ పీఠభూమి మీంచి విధ్వంస పూర్వకంగా తుడిచివేసిన పల్లె బాట. ఎనభై గ్రామాలు, రైతుల జీవితాలు దురాక్రమించి నిర్మాణమైన ఈ సుందర విమానాశ్రయంలో ఇప్పుడేనట ఆమె దిగడం. 'ఎట్లా ఉంది ప్రయాణం?' అని అడిగాను. 'హంస తూలికా తల్పం' వలె ఉంది అన్నారు. పక్షులీకలన్నీ పీకి కుషన్ చేసి ఆ సోఫాల్లో కూర్చొని 'ఇక్కడే మీ దగ్గర జీవ వైవిధ్య సదస్సు చేస్తున్నారట కదా. నూటా తొంభై మూడు దేశాల జీవ విధ్వంసకారుల సభ'అన్నది.

'బేగంపేట విమానాశ్రయంలో దిగగానే అక్కడ మట్టి తీసుకొని నా నుదిటిలో పెట్టుకుంటాను' అన్నది చాలాకాలం క్రితం కలకత్తాలో కలిసినప్పుడు. అప్పటికింకా ఆమె జాదవ్ పూర్‌లో ప్రభుత్వ మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ క్వార్టర్స్‌లో కిరాయికి ఉంటున్నారు. అప్పటికే ఆమెకు జ్ఞానపీఠ్‌లు, మ్యాగ్సేసే అవార్డులు వగైరా వచ్చి ఉన్నాయి. సీగల్ వాళ్లూ ఆమె రచనలన్నీ ఇంగ్లీష్‌లోకి తెచ్చారు. ఆ రోజుల్లో ఆమెకు నోబెల్ సాహిత్య బహుమానం కూడా వస్తుందనుకున్నారు. నేనూ, నా సహచరి హేమలత ఆమె దగ్గరికి వెళ్లగానే కావలించుకొని 'నీ కోసమే నిరీక్షిస్తున్నాను. కూర్చో'మని లోపలికి వెళ్లి వచ్చి నెల్సన్ మండేలా సంతకం ఉన్న జిరాక్స్ కాపీ నా చేతికిచ్చింది. 'ఇదిగో ఈ సంతకం కోసం, ఈ మనిషి కరచాలనం కోసమే మ్యాగ్సేసే అవార్డు తీసుకున్నాను' అని మహాశ్వేతాదేవి చెప్తుంటే ఆమె బలహీనమైన సంజాయిషీకి నాకు జాలేసింది. 'ఇప్పుడు మండేలా మాత్రం ఎక్కడ మండుతున్నాడు? నేనూ, శివసాగరూ, ఇంకా చాలా మంది తెలుగు కవులం గతంలో ఇట్లా మనిషంటే మండేలా లా ఉండాలని పులకించిపోయిన వాళ్లమే' అన్నాను.

అక్టోబర్ 1 సాయంత్రం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం గెస్ట్‌హౌజ్‌లో 'మలుపు' ప్రచురణలు కె.బాల్‌రెడ్డితో పాటు, నేను నా సహచరి హేమలత వెళ్లి ఆమెను కలిసాం. బయట భోరున వర్షం కురుస్తున్నది. తెలంగాణ ప్రజల మీద కురిసిన బాష్పవాయు గోళాల దుర్మార్గానికి సెప్టెంబర్ 30 సాయంత్రం నుంచే ఆకాశం ఎడతెగకుండా దుఃఖిస్తున్నట్లున్నది. ఈ జీవ వైవిధ్య విధ్వంసం కాలంలో ఆ ఆకాశం కళ్లెవ్వరు తుడవాలి?! మహాశ్వేతాదేవి వెంట కలకత్తా నుంచే ఒక అటెండర్ వచ్చాడు. కలకత్తాలో ఆమె కొత్తగా కట్టుకున్న ఇంట్లో ఆమెను కనిపెట్టుకొని ఉంటున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. మహాశ్వేతాదేవి సంతాల్ ఆదివాసుల కోసం దశాబ్దాలుగా నడుపుతున్న 'వృత్తికా' (వార్త, సమాచారం) అనే పత్రికా నిర్వహణలో కూడా సహకరిస్తున్న వ్యక్తి. విశ్వవిద్యాలయం వాళ్లు కూడా హెల్త్ సెంటర్ నుంచి ఒక మెడికల్ అసిస్టెంట్‌ను నియోగించారు.

ఆ ఇద్దరూ ఆమెను ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారు. కాళ్లు వాపులు తగ్గలేదు. ఏమైనా తినే ముందు ఇన్సులిన్ తీసుకోవాలి. అయినా కలకత్తాలో చూసినప్పటి కన్నా కొంచెం ఆరోగ్యంగానే కనిపించింది. 2013 జనవరి 14 మకర సంక్రాంతి రోజు ఆమె ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ప్రవేశిస్తుంది. సహస్ర చంద్ర దర్శనం ఎప్పుడో అయిపోయింది. బహుశా సహస్ర సూర్యదర్శనాలు కూడా అయిపోయాయేమో. 'ఎనభై ఏడేళ్లు పెద్ద వయస్సు కాదు రచయితకు' అన్నదామె. 'నిజమే, ప్రజానాట్యమండలి స్థాపన నుంచి విరసం, అరుణోదయల దాకా, ఇప్పటిదాకా మా తెలుగుసాహిత్య సాంస్కృతిక రంగంలో పనిచేస్తున్న కానూరి వెంకటేశ్వరరావుకు ఇప్పుడు 97 ఏండ్లు. తెలంగాణ వైతాళికులలో ఒకరు, ఆఖరి శ్వాసదాకా తెలంగాణ న్యాయం కోసం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ తన 97వ ఏట కన్నుమూశాడని' చెప్పాను.

'తిరగడం లేదు. హైదరాబాద్‌కు చాన్నాళ్లకు వచ్చాను. తెలంగాణ పోరాటాల గడ్డ మీద ఇక్కడి అమరుల రక్తసిక్త దేహాలతో, పాదాలతో తడిసిన మట్టి తీసి పాపిటలో సింధూరంలా పెట్టుకుందామంటే మీ కొత్త విమానాశ్రయంలో మట్టే కనిపించలేదు. మనం మట్టి మనుషులం కదా. మనకు మనుషులు కావాలి. మట్టి కావాలి. మట్టి మనుషులు కావాలి' అంది.

'తిరగడం లేదు గానీ పెద్ద ఇల్లు కట్టాను. రోజూ బెంగాల్ నాలుగు చెరుగుల నుంచి నా నుంచి ఏదో సహాయం కోరుతూ ఎవరో ప్రజలు వస్తూనే ఉంటారు. జంగల్ మహల్ నుంచి బాధితులు వస్తూంటారు. ఫోన్లు వస్తుంటాయి. అక్కడ వాళ్లకు తాగడానికి నీళ్లు లేవు. విద్యుత్తు లేదు. ప్రాథమిక చికిత్సకు ఆస్పత్రులు లేవు. మమతకు చెప్తే అక్కడామెకు అందరూ మావోయిస్టుల వలె కనిపిస్తారు. వాక్యానికి వాచ్యార్థం, వ్యంగ్యార్థం అని రెండు కర్తవ్యాలు ఉంటాయమ్మ అని ఆమెకు చెప్తే అర్థం కాదు. కార్టూన్ అంటే అర్థం కాని మనిషికి వ్యంగ్య ప్రయోజనం ఎక్కడ అర్థమవుతుంది?

ఎంఎ బెంగాలీ చదివిందట కాని ఆమె నా సంతాలీ ప్రజలంతటి విద్యావంతురాలు కాదు' అన్నది. 'బుద్ధదేవ్ బాగా పుస్తకాలన్నా చదివేవాడు. ఈమెకు భావాలంటే భయం' అన్నది.

'నిన్న సాయంత్రమే వస్తే మా మార్చ్‌కు తీసుకుపోయేవాళ్లం. మూడు లక్షల మందికి పైగా వచ్చారు' అన్నాను. 'విన్నాను' అంటుంటే మధుమేహ వ్యాధి వల్ల, వృద్ధాప్యం వల్ల తెల్లగా పాలిపోతూ, నీళ్లూరుతున్న ఆమె కళ్లు క్షణం సేపు మిలమిలా మెరిసాయి. 'ప్రజలున్న చోట, ప్రజా పోరాటాలు ఉన్న చోట నేనుంటాను. నా హృదయ స్పందనలతో ఉంటాను' అని పిడికిలి ఎత్తి అన్నది. మహాశ్వేతాదేవి రాకకు, ఆమె కేంద్రీయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ గౌరవ సత్కారం చేయడానికి కృషి చేసిన ఆదివాసి, దళిత అధ్యయన కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ కృష్ణ, సుప్రసిద్ధ హిందీ రచయిత జయప్రకాశ్ కదం, అడకమిక్ స్టాఫ్ కాలేజీలో ఉన్న హిందీ ప్రొఫెసర్ రాజు మొదలైన వారు కూడా అక్కడ ఉన్నారు. 'ఎట్లా ఉంది? తెలంగాణ రాష్ట్ర ఉద్యమం' అని అడిగింది. 'తెలంగాణ ప్రజలు ఎప్పుడూ పోరాట ప్రజలే.

ఎప్పుడూ ఉద్యమకారులే. అందుకే నాకు తెలంగాణ అంటే ప్రేమ. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి చాలా చదివాను. చాలా తెలుసుకున్నాను. నక్సల్బరీ కన్నా ముందు మాకు అదే కదా తొలి ప్రేరణ. ఇప్పుడు రాష్ట్ర సాధన పోరాట సాహిత్యం నాకు కావాలి. ఇంగ్లీష్‌లో ఉంటే పంపించండి' అన్నది. 'మలుపు' ప్రచురణలు తెలుగు చేయించి వేసిన ఆమె తొలి చారిత్రక నవల 'ఝాన్సీ కీ రాణి' ప్రతిని ప్రచురణకర్త కె. బాల్‌రెడ్డి ఆమెకు అందిస్తుంటే స్వీకరిస్తూ ఆమె ఝాన్సీలో ఇప్పటికీ జనపదాల్లో ప్రచారంలో ఉన్న ఒక జానపద గీతం పాడింది. 'నేను ఆ జానదప గీతాల నుంచి చరిత్రను, కథను అల్లాను. స్త్రీలు ఎప్పుడూ పోరాటకారులే. ఎందుకంటే వాళ్లు కష్టజీవులు. అణచివేతకు నిరంతరం గురవుతుంటారు. అందుకని వాళ్లకెప్పుడూ ధర్మాగ్రహం ఉంటుంది' అన్నది.

'ఆత్మకథ' రాస్తున్నారా అని అడిగాను. అందుకోసమే ఆమె ఇల్లు కట్టుకుని, అందరికీ తెలిసిన ఇంటి నుంచి మారిందని, అందుకే సాధారణంగా ఎక్కడికీ వెళ్లడం లేదని విన్నాను. అదే మాట అడిగితే 'ఈ ఇల్లు కూడా అందరికీ తెలిసిపోయింది కదా. పైగా నందిగ్రాం నుంచి వరుసగా సింగూరు, లాల్‌ఘడ్ ఇట్లా ప్రజా పోరాటాలు పెల్లుబికి తన పని పెరిగిందని, బాధితులకు మందులు సేకరించడం, వైద్య సహాయాన్ని పంపించడం - ఇదే పని పెరిగింద'ని చెప్పింది. రాజకీయ ఖైదీల విడుదల మొదలు, ఉద్యోగాలు కోల్పోయిన రైల్వే కార్మికుల సమస్యల వరకు ఎప్పుడూ ఏదో పని గురించి ప్రజలకు తెలియజేయడం, ప్రభుత్వాన్ని హెచ్చరించడం, రెగ్యులర్ బెంగాలీ పత్రికకు రాసే కాలమ్స్‌లో రాయడం - వృత్తికా పత్రిక పనులు - దాని కోసం ఆదివాసులను ఇంటర్వ్యూలు చేసి వాళ్ల భాషలోనే అచ్చెయ్యడం పనులే సరిపోతాయన్నది.

'ఇదే జీవితం కథ. నిత్య పోరాటాల కథ. ఇంకేం స్వీయ జీవితం' అన్నది. 'ఫ్రాంటియర్'లో 'నా బసాయిటుడు మరణించడు' (My Basai Tudu will not die) అని రాసిన చిన్న లేఖ వంటి రచన చదివాను - కేరళలో సిపిఎం పార్టీలో ఇద్దరు నాయకుల మధ్య వచ్చిన తగాదాలో ఒక కార్యకర్తను చంపడం గురించి రాసారు కదా అన్నాను. 'అతడు ఆదివాసి కార్యకర్త - సిపిఎంలో ఒక పక్షం అయినందుకు కాదు. కేరళలో తక్కువగా ఉన్న ఆదివాసి జనాభాలో ఎవ్వరూ వాళ్ల గురించి పట్టించుకోనపుడు ఒక మారుమూల పల్లెలో ఆయన వాళ్ల మధ్యలో పనిచేస్తున్నాడు. ఆయనను తమ స్వార్థ రాజకీయాల కోసం చంపేసారు. నా బసాయి టుడుకు నమూనా అయిన వ్యక్తికూడా బెంగాల్‌లో ఇటీవలనే తన తొంభై ఆరవ ఏట మరణించాడు' అని చెప్పింది. దాని మీంచి కాసేపు చర్చ వలసపాలన కాలం నుంచి ఆదివాసులను నేరస్థులుగా చూసే రాజ్య వ్యవస్థ మీదికి మళ్లింది.

ఆదివాసి సమస్యలపై ఆదివాసి దళిత అధ్యయన కేంద్రం, కేంద్రీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన సదస్సులో కూడా ఆమె పాల్గొన్నది. అక్కడ అనుకోకుండా గద్దర్ కలిసాడని, ఆయన ఉత్సాహంగా పాటలు పాడి, తనతో కూడా బలవంతంగా పాట పాడించాడని చెప్పింది. 'సభ్య సమాజం అనాగరికులుగా భావించుకునే ఆదివాసులంత నాగరికులు మరెవరూ కాదన్నది. వాళ్లు మన కోసం అడవులు, నదులు, పర్వతాలు కాపాడుతున్నారు. దానర్థం - అవి మానవ వనర్లని కాదు - అవి మానవ జీవితానికి పెనవేసుకున్న ప్రకృతి సంపద అని. మన కోసం అంటే మన భావితరాల కోసం కూడా అనాదిగా కాపాడుతున్నది వాళ్లే' అన్నది.

అంతే తప్ప ఖనిజాలుగా, నీళ్లుగా, రియల్ ఎస్టేట్‌గా, సరుకుగా మార్చి బడా కంపెనీలకు, విదేశాలకు అమ్ముకోవడానికి కాదు. పరస్పరం ఆధారాధేయాలుగా జీవించడానికి. వాళ్ల సామాజిక నిర్మాణం చూడండి - ఎంత ఆదర్శప్రాయంగా ఉంటుంది. ఎవరూ ఎవరికన్నా ఎక్కువ కాదు. ఎవరూ ఎవరికన్నా తక్కువ కాదు. వరకట్నాలు, లైంగిక అత్యాచారాలు అక్కడ లేవు. భారతదేశంలో ఇంకేమైనా పర్యావరణ సమతుల్యత మిగిలిందంటే అది ఆదివాసుల వల్లనే. బ్రిటిష్ వాళ్లు అడవి కోసం చట్టాలు రచించి, వందలాది ఆదివాసి తెగలను 'నేరస్వభావం' గల జాతులుగా నమోదు చేసిన శిక్షా స్మృతి ఇంకా కొనసాగుతున్నదని అన్నది.

ప్రైవేట్ ఆస్తిని కాపాడుకోవడానికి ఆదివాసులను నేరస్థులుగా చిత్రిస్తున్న ఆధిపత్య నేర వ్యవస్థను ప్రశ్నిస్తూ, ప్రతిఘటిస్తూ ఆమె ఆరు దశాబ్దాలుగా పోరాడుతున్నది. దేశంలో వివిధ ప్రాం తాల్లో ఆమె నాయకత్వంలో అటువంటి పోరాటాల ఫలితంగానే నేరస్థ జాబితాల నుంచి ఆదివాసి జాతుల Newsకు విముక్తి లభించింది. ఆంధ్రప్రదేశ్‌లో స్టువర్ట్‌పురం వంటి చోట ఈ చట్టాలు, సభ్య సమాజం అట్లా చూసే దృష్టి మనకు తెలుసు. ఎరుకల, డక్కలి, చెంచు వంటి జాతులను చట్టంలోనే కాదు, సభ్య సమాజం అనుమానంగా చూడడం, నేరారోపణలకు లక్ష్యంగా చూడడం ఇప్పటికీ మన అనుభవంలో ఉన్న విషయాలే.

విడిపోయే ముందు మళ్లీ మళ్లీ దగ్గరికి తీసుకుంటూ, మళ్లీ కలుస్తామో లేదోనన్నట్లు వీడ్కోలు చెప్తున్నప్పుడు 'రచయితలం, సామాజిక కార్యకర్తలం కదా. మనది 'క్రిమినల్ ట్రైబ్' (నేరస్తుల జాతి) మనమెక్కడున్నా రాజ్యం మనను నేరారోపణలతో కలుపుతూనే ఉంటుంది' అంటూ అందరినీ ఒకరొక్కరిని కావలించుకొని నుదిటిపై ముద్దు పెట్టుకున్నది.

చక్రాల బండి (వీల్ చెయిర్)పై అట్లా ఆమె జీవన సంధ్యలోకి, ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్న కాంతిపుంజం వలె అనిపించింది.

- వరవరరావు
Andhra Jyothi Telugu News Paper Dated : 14/10/2012 

Thursday, August 30, 2012

పోలీసు కట్టుకథల శిల్పం - వరవరరావు



ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటున్న వాళ్లను ముద్దాయిలుగా చూపడం, పరారీలో ఉన్నట్లు చూపడం పోలీసులకే చెల్లింది. ఇటువంటి కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టినందుకే ఏపీసీఎల్‌సీ కార్యకర్తలు తమ ఉద్యోగాలు కూడా కోల్పోయారు. వీటిలో కొన్ని యూఏపీఏ కింద పెట్టిన కేసులైతే, మరికొన్ని ప్రజాభద్రతా చట్టం కింద పెట్టినవి. 

నూతన ఆర్థిక విధానం అభివృద్ధి నమూనా అనే మాటలు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ దాడికి ఆమోదం కలిగించే రూపాలు. ఈ దాడి ఆరంభమైన తొంభైలలోనే దీన్ని ఎదుర్కొనే క్రమంలో వైవిధ్యం గల రూపాన్ని ఎంచుకునే ప్రయత్నంలో తెలుగు కథ రూపవాదానికి గురై వస్తువును త్యాగం చేసేదాకా పోయింది. మొదటి నుంచి ఒకే వస్తుగత స్వభావాన్ని వివిధ రూపాలతో కథలతో చెప్పగలిగే నైపుణ్యం సంపాదించిన పోలీసులు మాత్రం తొంభై నుంచి మరింత వైచిత్రితో కూడిన కథలు రాస్తున్నారు. ఎన్‌కౌంటర్ కథల విషయంలోగానీ, అక్రమ కేసుల కథనాలను వ్రాసే విషయంలోగానీ ఒక తర్కబద్ధమైన క్రమాన్ని పాటిస్తున్నారు.

అటువంటి ఒక అక్రమ కేసు గురించినదే ఈ కథనం. ఇందులో పంచతంత్ర కథ కూడా ఉన్నది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన తంగిరాల అనిల్‌కుమార్ అనే 38 ఏళ్ళ వ్యక్తిని ఆగస్టు మొదటి వారంలో పోలీసులు పొన్నూరులో అరెస్ట్ చేశారు. ఆ గ్రామానికి తన కూతురు పెళ్లి కార్డులు పంచడానికి పోయాడు. మరి అయితే పెళ్లి అయిపోగానే వస్తావా? అని పోలీసులు అడగలేదు కానీ కూతురు పెళ్లి కనుక మానవీయంగా వదిలివేసినట్టు వదిలేశారు.

వదిలేస్తామని హామీ పడి ఈ లోపల ఏ ఆందోళనకు పూనుకోవద్దని కూడా వేడుకున్నారు. హైకోర్టులో రిట్ వేస్తే కేసు పెట్టాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. లేగదూడకు పాలు ఇవ్వడానికి వెళ్లిన ఆవును వదిలినట్లే వదిలారు. ఆవు అంతటి సత్యసంథతతో ఆయన తిరిగి రానక్కర లేకుండానే (బహిరంగంగా తిరుగుతున్న వాడు కాబట్టి పిల్లలు కలవాడు కాబట్టి) ఆగస్టు 19న ఆయనను అరెస్టు చేసినట్టు చూపారు. ఇక ఇక్కడ కథ మొదలవుతోంది. 

దానికి వేలూరు రోడ్డులో డైరీమెన్ కాలనీలో డొంక సమీపంలో నిర్మాణంలో ఉన్న వాటర్‌ట్యాంకు దగ్గర జరిగిన సంఘటనలు అని పేరు పెట్టారు. గస్తీ తిరుగుతున్న పోలీసులకు వేలూరు వైపు నుంచి చిలకలూరిపేటకు వెళుతూ కనిపించిన మధ్య వయస్కుడు పారిపోయేందుకు ప్రయత్నించగా అతడు పట్టదగిన నేరం చేసినవాడని వాళ్లకు అనిపించింది. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మొదట తబ్బిబ్బు పడ్డాడు కానీ తరచి అడగగా అతడు కూడా ఒక కథ చెప్పాడు.

మొదటిసారి అరెస్టు అయినపుడు కేవలం తంగిరాల అనిల్‌కుమార్ అన్న వ్యక్తికి అకస్మాత్తుగా మూడు అలియాస్‌లు వచ్చాయి శ్యాం, శ్రీరాం, శ్రీను అని. కారంచేడు సంఘటన, జేఎన్ఎం, దళిత మహాసభ ప్రజాసంఘాలు ఇటువంటి ప్రభావాల నుంచి - సెంట్రింగ్ పోస్టు పని, కూలి పని, వ్యవసాయ పని చేసుకునే తల్లిదండ్రులు లేని పిల్లవాడు రవి అనే పీపుల్స్‌వార్ మనిషి పరిచయంతో విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షింపబడ్డాడు. ఇక క్రమంగా పున్నారావు మొదలైన వారి పరిచయాలతో పార్టీ పరిచయాలకు వచ్చాడు. నవీన్, ఆర్‌సీ (రాంచందర్) మస్తాన్‌రావు, శాఖమూరి అప్పారావు మొదలుకొని సాంబశివుడు మొదలుకొని ఎందరో పార్టీ ప్రముఖుల పరిచయాలలోకి వెళ్లిపోయాడు. ఇందులో ఇతడు చెప్పినట్లుగా కథనాన్ని పట్టి చూస్తే ఇవన్నీ ఎప్పుడో మాంధాతల కాలంలో జరిగిన సంఘటనలుగా ఉంటాయి.

ఇందులో రామకృష్ణ (ఆర్.కె) తప్ప ఒక్కరూ జీవించిలేరు. అంతే కాదు అందరూ ఏ రెండు మూడేళ్ల క్రితమో ఎన్‌కౌంటర్లలో హతులైనవాళ్లు. అప్పుడు ప్రజాసంఘాల్లో పనిచేస్తున్న వాళ్లు కూడా పున్నారావు, మన్నెం ప్రసాద్ వంటి వాళ్లు అనారోగ్యంతో మరణించిన వాళ్లో, హతులో. మరెందుకు ఇప్పుడు ఇతనిపై వీళ్లందరినీ కలుపుతూ కేసు పెట్టినట్లు? నేరారోపణలు ఏమిటి? సాంబశివుడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు గిద్దలూరు నుంచి వేరే గ్రామానికి తీసుకుపోవడమనే ఒక నేరారోపణ, ఒకరు ఇచ్చిన డబ్బు మరొకరికి ఇవ్వడమనేది మరో నేరారోపణ.

ఈ సంబంధాలు, ఈ నేరారోపణలు నేరపూరిత కుట్ర యుద్ధానికి పూనుకోవడం (ఠ్చీజజీnజ ఠ్చీట) రాజద్రోహం అనే తీవ్రమైన సెక్షన్లతో పాటు 1997 ప్రజాభద్రతా చట్టాన్ని 1967 నాటి చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టాన్ని (యూఏపీఏ) ఆకర్షించేంత తీవ్రమైనవి. ఇందులో అనిల్‌కుమార్‌తో పాటు 15 మందిని ముద్దాయిలుగా చూపారు. వారిలో రవి, నవీన్, సంజీవ్, రాంచందర్, ఆర్.కె, మస్తాన్‌రావు, శాఖమూరి అప్పారావు, సాంబశివుడు వీళ్లంతా పార్టీ వాళ్ళు.

ఆర్.కె. తప్ప అందరూ అమరులు. మరి అయితే ఎందుకు కేసు పెట్టినట్టు? ఆర్.కె, అనిల్‌ల కోసమేనా? అక్కడే ఈ కేసు మలుపు ఉన్నది. ఒక అరడజను ప్రజాసంఘాలలో బహిరంగంగా పనిచేస్తున్న వాళ్లను పెట్టడానికే ఈ కట్టుకథల నేరారోపణ. ప్రథమ సమాచార నివేదిక వాళ్లు అనిల్‌తో పాటు పీడీఎం శ్రీను, దుడ్డు ప్రభాకర్, క్యాటరింగ్ రాజు, శ్యామల, నిర్మల. వీరిలో పీడీఎం శ్రీను విస్థాపన కమిటీ సభ్యుడు కూడా. కోస్టల్ కారిడార్ నిర్వాసితత్వానికి వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా మొదలుకొని విశాఖపట్నం వరకు సెజ్‌లకు వ్యతిరేకంగా ముఖ్యంగా మత్స్యకారుల, ఆదివాసుల నిర్వాసితత్వాన్ని వ్యతిరేకిస్తూ పనిచేస్తున్నవాడు. దుడ్డు ప్రభాకర్ కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు, దళితుల ఆత్మగౌరవ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నవాడు.

లక్షింపేట మాలల మారణకాండకు బాధ్యుడైన మంత్రినైనా సరే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఒక విశాల ఐక్య సంఘటనకు కన్వీనర్‌గా ఉన్న హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం నాయకత్వంలో పనిచేస్తున్నవాడు. క్యాటరింగ్ రాజు రైల్వే క్యాటరింగ్ ఉద్యోగం కూడా కోల్పోయి ప్రగతిశీల కార్మిక సంఘంలో పనిచేస్తున్నవాడు. సాంబశివుడి భార్య శ్యామల ఆయన అజ్ఞాతంలో ఉండగానే బయటకి వచ్చి అమరుల బంధుమిత్రుల సంఘంలో పనిచేస్తున్నది. 

అనిల్‌కుమార్ భార్య చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నది. అనిల్‌కుమార్ గతంలో ఏపీసీఎల్‌సీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడుగా పనిచేశాడు. మన్నెం ప్రసాద్ హత్య తరువాత భయపడి రాజీనామా కూడా చేశాడు. ఇక్కడి నుంచి ఆయన పార్టీలో చేరినట్లు జిల్లా కమిటీ సభ్యుడుగా కూడా ప్రమోట్ అయినట్లు కథ అల్లారు. పైన పేర్కొన్న ఐదుగురు ప్రజాసంఘాల కార్యకర్తలు, నాయకులు బహిరంగంగా, చట్టబద్ధంగా పనిచేస్తూ ప్రజల మధ్య మసలుకుంటున్న వాళ్లు. కొందరు నిత్యం మీడియాలో కూడా కనిపిస్తున్న వారు. వీళ్లందరినీ ఈ కేసులో నిందితులుగా చూపడానికే పోలీసులు ఈ కథ అల్లారు. వీరందరికీ మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉండిన, ఉన్న నాయకులతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపించారు. 

అంతమాత్రమే కాదు వీళ్లందరూ కనిపించటం లేదని, పరారీలో ఉన్నారని వారిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా రాశారు. వివిధ ప్రజాసంఘాల్లో క్రియాశీలంగా, బహిరంగంగా చట్టబద్ధంగా పనిచేస్తున్న వాళ్లను అక్రమ కేసుల్లో ఇరికించి పారిపోయినట్లుగా చూపడమనేది పోలీసు సంప్రదాయమే. తిరిగి ఏప్రిల్ 22 ఆర్‌డీఎఫ్ మహాసభకు ఛత్తీస్‌గఢ్ నుంచి వస్తున్న 35 మంది ఆదివాసులను, చేతన నాట్యమంచ్‌ను, సత్యం అనే వ్యక్తిని అరెస్టు చేసి అతనిపై (్ఖఅ్కఅ) చట్టం కింద కేసు నమోదు చేశారు.

ప్రథమ సమాచార నివేదికలో అన్ని ప్రజాసంఘాల బాధ్యులను ఇరికించి ఇప్పటికే అరెస్టు అయి జైల్లో ఉన్న తెలంగాణ ప్రజాఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణపై ఈ కేసులో పీటీ వారంటును జారీ చేశారు. ఆ తర్వాత మే 9న కామ్రేడ్ ఆజాద్ సహచరి పద్మ, ఆమె వెంట ఉన్న వాళ్లను ఖానాపురంలో అరెస్ట్ చేసి, హన్మకొండలో ఉన్న అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, వరంగల్ జిల్లాలో తెలంగాణ ప్రజాఫ్రంట్‌లో క్రియాశీలంగా పనిచేస్తున్న భారతిని కూడా ముద్దాయిగా చూపి అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

వీళ్లను అడవికి పంపుతున్నారన్న ఆరోపణతో అమరుల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంటి ప్రసాదం, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య, నడుస్తున్న తెలంగాణ సంపాదకుడు సి.కాశీంలను ముద్దాయిలుగానే కాదు పరారీలో ఉన్నట్లు చూపారు. అమరుల బంధుమిత్రుల సంఘం మహాసభకు వచ్చిన ఆదివాసీ ప్రజలు చేతన నాట్యమంచ్‌కు చెందిన వాళ్లు స్త్రీలు, పిల్లలతో సహా 18 మందిని ఇమ్లిబన్ బస్‌స్టేషన్‌లో అరెస్టు చేసి వాళ్లను తీసుకుపోవడానికి వచ్చిన ఏపీసీఎల్‌సీ కార్యకర్తలు నారాయణరావు, హన్మంతరావులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

ఇందులోనూ గంటి ప్రసాదం, పద్మకుమారి, విరసం వరవరరావు, ఏపీసీఎల్‌సీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, హైకోర్టు అడ్వకేట్ వి. రఘునాథ్‌లను కూడా ముద్దాయిలుగా చూపి పరారీలో ఉన్నట్లు చూపారు. ఈ మూడు కేసులు 1972 ప్రజా భద్రత చట్టం కింద చూపినవే. భద్రాచలంలో అరెస్టు అయిన బండి కిరణ్‌తో పాటు మళ్లీ గంటి ప్రసాదం, పద్మకుమారి, వరవరరావు, రఘునాథ్, నారాయణరావు, హన్మంతరావు, కాశీంలను కూడా ముద్దాయిలుగా చూపి పరారీలో ఉన్నట్లుగా చూపారు. చట్టబద్ధమైన బహిరంగ సభలు, ప్రజాహిత కార్యక్రమాలే కాకుండా తమ ఉద్యోగాలు, వృత్తులు చేసుకుంటున్న వాళ్లు, న్యాయవాదులు కావచ్చు, లెక్చరర్లు కావచ్చు, ఆసుపత్రుల్లో, ఆర్టీసీల్లో పనిచేస్తున్న వాళ్లు కావచ్చు, వాళ్లను ముద్దాయిలుగా చూపడం, పరారీలో ఉన్నట్లు చూపడం పోలీసులకే చెల్లింది.

ఇటువంటి కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టినందుకే ఏపీసీఎల్‌సీ కార్యకర్తలు తమ ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు అనిల్‌కుమార్ అరెస్ట్ సందర్భంగా పెట్టిన కేసు ఒక తాజా చేర్పు. అయితే వీటిలో కొన్ని యూఏపీఏ కింద పెట్టిన కేసులైతే, మరికొన్ని ప్రజాభద్రతా చట్టం కింద పెట్టినవి. కానీ అనిల్‌కుమార్ కేసు మాత్రం నేర శిక్షాస్మృతిలోని చటబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని సాయుధంగా కూల్చే కుట్ర, యుద్ధ ప్రకటన, రాజద్రోహంతో పాటు ప్రజాభద్రతా చట్టం, యూఏపీఏను జోడించి పకడ్బందీగా పెట్టారు. దానికి కొసమెరుపు నిత్యం ప్రజాజీవితంలో కనిపించే ఐదుగురు ప్రజాసంఘాల కార్యకర్తలను పరారీలో చూపడం. ఇంత క్రమబద్ధంగా రచించగల అక్రమ కట్టుకథలను పోలీసులు తప్ప ఇంకెవరైనా అల్లగలరా?
- వరవరరావు

andhra jyothi news dated 31/08/2012

Friday, July 27, 2012

విప్లవ దార్శనికుడు ( చారుమజుందార్)----వరవరరావు


man
‘చాటండి గళమెత్తి విప్లవదార్శనికుడు చారుమజుందార్ చచ్చిపోలేదని- కామ్రేడ్ చారుమజుందార్ చంపబడ్డాడని’ అంటూ చెరబండరాజు తన కవితా సంకలనం ‘గమ్యం’ అంకితమిస్తూ చారుమజుందార్‌పై ఈ చరణాలు రాశాడు. చారుమజుందార్ అమరుడై నిండా నలభైఏళ్లు. ఆయన నక్సల్‌బరీ నిర్మాతగా పీడిత ప్రజల ప్రియతమ నాయకుడయ్యారు. నక్సల్‌బరీలో 1967 మే 23-25 తేదీలలోవూపజావూపతిఘటన వెల్లువ తర్వాత 22 ఏప్రిల్ 1969న సీపీఐ మార్క్సిస్ట్-పూనినిస్ట్ ఏర్పడి ఆయన దానికి కార్యదర్శిగా ఎన్నికైనట్లుగా కలకత్తాలో షహీద్ మినార్ మైదానంలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్న బహిరంగసభలో ఎర్రజెండాల మధ్యన కానుసన్యాల్ ప్రకటించాడు. నక్సల్‌బరీ నాటి నుంచి అజ్ఞాతంలో గడుపుతూ పార్టీ ఏర్పాటు తర్వాత పూర్తి అజ్ఞాత నిర్మాణంలోని రాజకీయ విశ్వాసంతో 1972 జూలై 20న అరెస్టు అయ్యేదాక కూడా చారుమజుందార్ అజ్ఞాత జీవితంలోనే ఉన్నాడు. ఆయనది చాలా బలహీనమైన ఆరోగ్యం. మధుమేహం, రక్తపో టు, ఆస్తమా వ్యాధులతో బాధపడుతూ.. తన బక్క పలుచటి శరీరాన్ని విప్లవ సంకల్పం కోసమే అజ్ఞాత జీవితమంతా మందులతో కాపాడుకున్నాడు. ఆయనకు ఆశ్రయం ఇచ్చినవాళ్లు, శ్రేణులు, ప్రజలు ఆయనను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. చారుమజుందార్ స్వభావ రీత్యా ఎంత భావావేశపరుడో అంత విప్లవ స్వాప్నికుడు కూడా అని, ఆయన రచనలు చదివిన ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. 1972 జూలై 20న ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అతన్ని కలకత్తా నగరంలోనే అరెస్టు చేసి చిత్రహింసలకు ప్రఖ్యాతి గాంచిన లాల్‌బజార్ పోలీస్ స్టేషన్‌లో గోప్యంగా నిర్బంధించారు. భౌతిక చిత్రహింసల కన్నా ఆయన పలురకాల వ్యాధులకు తీసుకుంటున్న మందులన్నీ స్వాధీనం చేసుకుని, వాటిని వాడకుండా చేసి ఆ వారం రోజులు ఆయనను చికిత్స లేకుండా మరణించేలా చేశారు. చిలీ అధ్యక్షుడు అలెండి హత్య తరువాత అమెరికన్ సామ్రాజ్యవాదం మిలాకత్‌తో పినోచెట్ నియంతృత్వం క్యాన్సర్‌తో బాధపడుతున్న పాబ్లో నెరుడాను ఎట్లా చనిపోయేలా చేసిందో, సరిగ్గా అట్లాగే చారుమజుందార్ విషయంలోనూ మన పాలకులు చేశారు. మనుషులు, డాక్టర్లు కలవకుండా చికిత్స అందకుండా చేసి చారుమజుందార్‌ను చంపారు.
కానీ.. నలభై ఏళ్లుగా చారుమజుందార్ విప్లవ, పీడిత ప్రజల హృదయాల్లో ఒక నిప్పు రవ్వ. ‘జానకి తాడు’కు అంటిన మంటలా దేశమంతటా విస్తరిస్తూనే ఉన్నాడు. ఇవ్వాళ.. దండకారణ్యంలో ప్రజాయుద్ధమై ప్రజలపై ప్రభుత్వయుద్ధాన్ని ప్రతిఘటిస్తున్నాడు. అయన తెరాయి దస్తావేజుల్లో(1965నుంచి 67 వరకు రాసిన 8 వ్యాసాలను తెరాయి దస్తావేజులు, ‘ఎనిమిది డాక్యుమెంట్లు’ అనే పేరు తో పిలుస్తారు.) ప్రతిపాదించిన అన్ని అధికారాలు ప్రజల కే (ALL POWER TO PEOPLE) ఇవ్వాళ దండకారణ్యంలో ముఖ్యంగా బస్తర్‌లో క్రాంతికారీ జనతన సర్కార్‌లో ప్రయోగంగా ఆచరణకు వచ్చింది. ఆయన ప్రతిపాదించిన గెరిల్లా యుద్ధం ఇవాళ దండకారణ్యంలో చలనయుద్ధం స్థాయికి చేరుకున్నది. చారుమజుందార్ ప్రతిపాదించిన దున్నేవానికి భూమి దండకారణ్యంలో ప్రతి ఆదివాసీ అనుభవంలోకి వచ్చింది. తమ శ్రమతో, సహకారంతో భూమిని స్వాధీనంచేసుకొని, చదును చేసుకుని, గ్రీన్‌హంట్ పేరిట భారత ప్రభుత్వం ప్రకటించిన యుద్ధ సమయంలోనూ వాళ్లు ఉత్పత్తిలో పాల్గొంటున్నారు. భూస్వామ్య పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద దళారీ నిరంకుశ పాలకులకు నక్సల్‌బరీలో చారుమజుందార్ వేసిన దారి అత్యంత ప్రమాదరకరమైన అంతర్గత శత్రువుగా భయపెడుతున్నది. ఒకప్పుడు యూరప్‌ను వెంటాడి భయపెడుతుందని మార్క్స్ కమ్యూనిస్టు మేనిఫెస్టోలో చెప్పిన కమ్యూనిస్టు భూతం, ఇవ్వాళ బుంకాల్ మిలిషియా రూపంలో అదేవిధంగా భారత పాలకులను భయపెడుతున్నది. ఎందుకంటే.. ఇది భూత, వర్తమానాల్లో స్పష్టంగా ఆవిష్కరించపడుతున్న భవిష్యత్తు. అందుకే చారుమజుందార్ 40 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడు ఆజానుబావుడై అజరామరంగా మన మధ్య నిత్య సమరశీలిగా మసలుకుంటున్నాడు.

1967 నక్సల్‌బరీ నాటికి చారుమజుందార్ సీపీఎం డార్జిలింగ్ జిల్లా సిలిగురి డివిజన్ కార్యదర్శి. 1967లో సీపీఐ చీలి సీపీఎం ఏర్పడ్డప్పుడు పార్టీలోనూ, ప్రజల్లోనూ చాలామంది ఆశించినట్లుగానే ఆయన కూడా సీపీఎం వర్గపోరాట పంథా తీసుకుంటుందని భావించాడు. అందుకే 65నుంచి ‘తెరాయి దస్తావేజు లు’ రాయడం ప్రారంభించాడు. తెరాయి ఇండియా-టిబెట్ చైనాకు మధ్యన ఉన్న ఒక కీలకమైన భూభాగం. సంతాల్ తెగలు ఉండే ఆదివాసీ ప్రాంతం. ‘దస్తావేజులు’ రచిస్తున్న కాలంలోనే.. 1956-65 దాకా కృశ్చెవ్ సిద్ధాంతంపై (శాంతియుత పరివర్తన, శాంతియుత పోటీ, శాంతియుత సహజీవనం) మావో నాయకత్వంలో గ్రేట్ డిబేట్ ముగిసి చైనాలో శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం ప్రారంభమైంది. బోల్షివిక్ విప్లవం, చైనా విప్లవం తరువాత చారుమజుందార్ ఇది మూడో విప్లవం అన్నాడు. తెరాయి దస్తావేజుల్లో ఆయన ప్రజల ముందు కార్మిక వర్గపార్టీ నాయకత్వంలో ఆచరించాల్సిన మూడు కర్తవ్యాలను ఉంచాడు. అవి-భూమిలేని నిరుపేదలు భూమిని స్వాధీనం చేసుకోవడమనే ఆర్థిక పోరాటం. భూస్వాముల చేతుల్లో ఉన్న మిగులు భూములు, భూస్వాముల ఆక్రమణలో ఉన్నవి కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు. అది సాఫిగా సాగే పనికాదు కాబ ట్టి అవి స్వాధీనం చేసుకోవడానికి, నిలుపుకోవడానికి గెరిల్లా పోరాటమనే సైనిక పోరాట ప్రతిపాదన చేశాడు. ఇది మొదట భూ ఆక్రమణదారుల గూండాల నుంచి, మాఫియాల నుంచి, ఆ తరువాత వాళ్లకు అండగా ఉండే పోలీసు, ప్రభుత్వాల నుంచి ప్రజలను రక్షించడానికి ప్రజలకు అండగా ఉంటుంది. ఈ క్రమమంతా గెరిల్లా పోరాటం ద్వారా శత్రువు బలహీనంగా ఉండే గ్రామాలను విము క్తం చేయడంగా ఉండాలి. ఒకసారి విముక్తం అయిన గ్రామం ఎల్లకాలం విముక్తం అయి ఉంటుందని గ్యారంటీ లేదు. ఒకసారి గెలుచుకున్న కోట ఎప్పుడూ మన వశంలోనే ఉంటుందనీ లేదు. ఇది సరళ రేఖగా సాగే పోరాటం కాదు. అందుకే ప్రజలకు రాజ్యాధికారం ఇచ్చే రాజకీయ పోరాటంగా రాజకీయ లక్ష్యంగా కొనసాగాలి. అన్ని అధికారాలు ప్రజలకు అన్నప్పుడు అందులో ఇమిడి ఉన్నది రాజకీయ లక్ష్యమే. అదే ఇప్పటి దండకారణ్యంలోని క్రాంతికారీ జనతన సర్కార్. ‘తెరాయి దస్తావేజు’ల రచన చేసే నాటికే దేశంలో (1967) సాధారణ ఎన్నిక లు వచ్చాయి. నెహ్రూ, ఇందిర కుటుంబ పాలనతో ప్రజలు విసిగి పోవడంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కాంగ్రేసేతర ప్రభుత్వాలుగా బూర్జువాపార్టీలు అధికారంలోకి వచ్చాయి. బెంగాల్‌లో కాంగ్రెస్ నుంచి బయటకి వచ్చిన అజయ్‌ముఖర్జీ బంగ్లా కాంగ్రెస్ పెట్టాడు. సీపీఎం నాయకత్వంలో లెఫ్ట్ ఫ్రంట్ ఆయనకు ఎన్ని స్థానాలు వచ్చినా ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇస్తామనే ఒప్పందంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నది. రాష్ట్రంలో ఉన్న మిగులు భూములను ప్రజలకు పంచుతామని లెఫ్ట్ ఫ్రంట్ వాగ్దానం చేసింది. బెంగాల్‌లో ఆరు లక్షల హెక్టార్ల భూమి జోతేదారుల (భూస్వాముల) ఆక్రమణలో ఉందని, తాము అధికారంలోకి రాగానే ఆ భూమిని భూమిలేని నిరుపేదలకు పంపిణీ చేస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు.

ఎన్నికల్లో ఈ పొత్తు విజయం సాధించి బంగ్లా కాంగ్రె స్‌కు 5 సీట్లు, లెఫ్ట్ ఫ్రంట్‌కు 80 సీట్లు వచ్చాయి. జ్యోతిబసు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా అయ్యారు. కనుక సీపీఎం సిలిగురి డివిజన్ కార్యదర్శిగా చారుమజుందార్ చేసిందల్లా ఈ వాగ్దానాన్ని ఆచరణలో పెట్టడమే. కాకపోతే బూర్జువాపార్టీలు వాగ్దానాలు చేస్తాయి. కార్మికవర్గ పార్టీలు ప్రాణాలకు తెగించి వాటిని ఆచరణలోకి తెస్తాయి. వాగ్దాన భంగాలను ప్రజలకు బట్టబయలు చేస్తాయి. అయితే దున్నేవానికే భూమి భూస్వామ్య వ్యతిరేక ఆర్థిక పోరాటమే. చారుమజుందార్ దృష్టిలో చాలా స్పష్టంగా నూతన ప్రజాస్వామిక విప్లవం ఉన్నది. వ్యవసాయ విప్ల వం ఇరుసుగా సాగేది దీర్ఘకాలిక సాయుధ పోరాటం. నక్సల్‌బరీ గ్రామస్తుడే అయిన కానుసన్యాల్, బంగత్ సంతాల్ నాయకత్వంలో మే 23వ తేదీ నుంచి 25 వరకు 10వేల మందికి పైగా సంతాల్ ఆదివాసీలు నక్సల్‌బరీ, కేలిబరీ గ్రామాల్లో విశాలంగా పరుచుకొని ఉన్న నేల మీద నిలబడి ఇది మా భూమి అని ప్రకటించారు. వాళ్లం తా విల్లంబులు, గొడ్డళ్లవంటి సంప్రదాయక ఆయుధాలతో ప్రతిఘటనకు సిద్ధమై వచ్చారు. వారిపై మే 25న భూమి వాగ్దానం చేసిన లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం నక్సల్‌బరీ రైల్వేస్టేషన్ నుంచి బుల్లెట్ల వర్షం కురిపించింది. కేవలం లెఫ్ట్ ఫ్రంట్ పోలీసులే కాదు, ఇందిరాగాంధీ సీఆర్‌పీఎఫ్ బలగాలు కూడా తోడయ్యాయి. ఆ కాల్పుల్లో ఏడుగురు స్త్రీలు, నలుగురు పిల్లలు అక్కడికక్కడే అమరులయ్యారు. రేపటి చరిత్ర ఆధునిక స్త్రీ రచిస్తుందని గురజాడ అప్పారావు చెప్పినట్లుగా ఈ నక్సల్‌బరీ మహిళలు నలభై ఏళ్లుగా చరివూతను తిరగరాస్తున్నారు. ఈ చరిత్ర నిర్మాణా న్ని, రచనను శ్రీకాకుళం, వైనాడు మొదలు ఇవ్వాళ.. జంగల్‌మహల్, దండకారణ్యం, నారాయణపట్నం దాకా ప్రజలకు అందించారు. ఈ చరిత్ర నిర్మాణాన్ని, ప్రజలు రచించే ఈ చరివూతను కలగన్న విప్లవ దార్శనికుడు చార్‌మజుందార్. అందుకే ‘ఆయనకు మరణం లేదు. అప్పుడే అతడు ఒళ్లు విరుచుకొని సమాధి నుంచి లేచి, ఆయుధం చేతబట్టి తిరిగి రణరంగంలో చేరినాడు.’ అని శివసాగర్ ‘అమ్మా’ అనే కవితలో జూలై 1972లో రాశాడు. రణరంగానికి కేంద్ర బిందువు, ఇవ్వాళ దండకారణ్యపు పోరాటంగా చారుమజుందారే కాదు (ఆయన పోరాటంలో ఒరిగిన మొదటివాడు, చివరివాడూ కాదు.) ఈ జూలైలో దక్షిణ బస్తర్‌లో అమరుడైన విప్లవోద్యమ నాయకుడు విజయ్ మడ్కం కూడా లేచి ఆయుధం చేతబట్టి తిరిగి రణరంగంలో చేరినాడు. మనం కళ్లు తుడుచుకొని ఆ పోరాటానికి బాసటగా నిలుద్దాం. అడుగుల్లో అడుగులేద్దాం. ప్రజలు తమ స్వప్నంగా ఆవిష్కరించుకుంటున్న జనతన సర్కార్‌కు అండగా నిలుద్దాం. ప్రజల ఆశలను చిదిమేస్తున్న భూస్వామ్య, దళారీ భారత ప్రభుత్వ దాడిని వ్యతిరేకిద్దాం. భారత విప్లవోద్యమ నిర్మాత చారుమజుందార్ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుద్దాం.
-వరవరరావు
(నేడు నక్సల్‌బరీ ఉద్యమ నిర్మాత చారుమజుందార్ 40 వ వర్ధంతి
Namasete Telangana News Paper Dated : 28/07/2012 

Saturday, July 7, 2012

ఆదివాసులకు న్యాయం దక్కేనా?---వరవరరావు



చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా, కాంకేర్ జిల్లాల్లో జూన్ 28,29 తేదీల్లో పోలీసులు మూడుచోట్ల అమాయకులైన 23మంది ఆదివాసీలను చంపారు. జూన్ 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బాసగూడెంలో ఎన్‌కౌంటర్‌గా ప్రకటించిన దాంట్లో సీఆర్‌పీఎఫ్ కాల్పుల్లో 20 మంది ఆదివాసులు చనిపోయారు. ఇందులో మహిళలు, పసి పిల్లలు ఉన్నారు. 29వ తేదీ ఉదయం సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో పశువులను, విత్తనాలను తీసుకొని పొలం దగ్గరికి వెళ్తున్న మడ్కం మత్తాలు, మడ్కం లచ్చాలు అనే ఆదివాసీ రైతులను పట్టుకొని కాల్చి చంపి, ఆ శవాలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాంకేర్ జిల్లా జొన్నగూడెంలో చుట్టపు చూపుగా వచ్చిన సోడుం దూలాను మావోయిస్టు అనే అనుమానంతో పట్టుకుని కాల్చి చంపారు. ఈ మూడింటిలో ‘బాసగూడెం ఎన్‌కౌంటర్’ గురించే ఎక్కువగా చర్చ జరుగుతున్నది. బాసగూడెంలో చనిపోయిన 20 మంది పేర్ల ను అక్కడ జూన్ 28వ తేదీ రాత్రి పదకొండు గంటలకు సమావేశమైన కర్కగూడెం, కొత్తగూడెం, రాజుపెంట గ్రామాలకు చెందిన 150 మంది గ్రామస్తులు ఇప్పటికే చాలామందికి చెప్పారు. అక్కడికి స్వయం గా వెళ్లిన రిపోర్టర్ అమన్ సేథీ అక్కడి శవాలపై బుల్లెట్ గాయాలు, కత్తులతో కోసిన, గొడ్డళ్లతో నరికిన గుర్తులు కూడా చూశానని తెలిపాడు. పత్రికలు కూడా ఫొటోలతో సహా వార్తలను ప్రచురించాయి. ఆ గ్రామా ల ప్రజలతో, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడానని, చనిపోయిన వారెవరూ మావోయిస్టులు కారని వాళ్లు చెప్పారని గాంధేయవాది హిమాంశు కుమార్ ఫేస్‌బుక్‌లో పెట్టాడు.


విత్తనాల పండుగ జరుపుకొని భూమి పూజ చేస్తుండగా పోలీసులు వచ్చి, ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపారని గ్రామస్తులు చెప్పినట్టు ఆయన ఫేస్‌బుక్‌లో రాశాడు. స్వామి అగ్నివేశ్, రాజేంద్ర సచార్, వందనా శివ, సక్సేనాలు కూడా ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని చెప్పారు. పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని, 20 మంది అమాయక ఆదివాసీలను చంపారని ప్రకటించారు. రామచంద్ర గుహ, ఎస్.ఆర్. శర్మ, నందినీ సుందర్ కూడా ఖండించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అక్కడి పీసీసీ కార్యదర్శి అధ్యక్షతన ఘటనా స్థలానికి వెళ్లి గ్రామాలన్నీ తిరిగి, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, హతులందరూ ఆదివాసీ అమాయకులేనని అన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి డాక్ట ర్ చరణ్‌దాస్ మహంతి కూడా ఈ వాదనను బలపరిచాడు. కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇది నిజమైన ఎన్‌కౌంటరే అని అన్నాడు కదా, చనిపోయి న వారందరూ మావోయిస్టులే అని అంటున్నారు కదా! అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, ఇంటలిజెన్స్ వారు ఆయనకు సరైన సమాచారం ఇవ్వకపోవచ్చునని అన్నారు. ఈ సంఘటన జరిగీ జరగగానే కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇది నిజమైన ఎన్‌కౌంటరే అని చెప్పడమే కాకుండా, సీఆర్‌పీఎఫ్ బలగాలు చాలా చొరవతో మావోయిస్టులను ఎదురుకాల్పుల్లో కాల్చి చంపాయని ప్రశంసించారు. అందులో ఏడుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు గాయపడడమే ఇది నిజమైన ఎన్‌కౌంటర్ అనడానికి తిరుగులేని నిదర్శనమన్నాడు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ విజయ్‌కుమార్ కూడా ఇదే వైఖరి తీసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, కేంద్ర మంత్రి వర్గంలో గిరిజన శాఖా మంత్రిగా ఉన్న కిశోర్ చంద్రదేవ్ ఈ మొత్తం సంఘటనపై ధ్వజమెత్తిన తీరు ఒక ఎత్తు. ఆయన ‘ఇది బూటకపు ఎన్‌కౌంటర్, హతులందరూ ఆదివాసీలు అంటూనే, ఒకవేళ వాళ్లలో ఎవరైనా మావోయిస్టులు ఉన్నా, అందరికి అందరూ మావోయిస్టులైనా ఆదివాసీలు మావోయిస్టులు కావడానికి గల కారణా లు ఏమిటో ఆలోచించాలి’ అన్నారు.

ఒకవేళ పిల్లలు కూడా మావోయి జం వైపు ఆకర్షింపబడుతుంటే అందు కు ప్రభుత్వ విధానాలే కారణ మా? స్వీయ విమర్శ చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ప్రయోజనం కోసం సీఆర్‌పీఎఫ్ బలగాలను కేంద్రం నుంచి కోరిందో చెప్పాలన్నారు. ఇవన్నీ అంటూ.. ‘మౌలికంగా మన ప్రభుత్వాల మైనింగ్ పాలసీనే పునఃపరిశీలించాల’ని అన్నారు. ఇది ప్రభుత్వ వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. దీంతో చివరకు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించింది. కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇంకా తన వాదనలన్నింటికి కట్టుబడి ఉంటూనే ‘హతుల్లో మావోయిస్టులుకాని ఆదివాసులు ఉంటే అందుకు క్షమాపణ చెప్తున్నా’నని అన్నారు. దీంతో అనేక విషయాలు చర్చనీయాంశాలయ్యాయి. 
1) ఆదివాసీలు మావోయిస్టులైనా, ఆదివాసుల్లో మావోయిస్టులు న్నా వాళ్లను కాల్చి చంపవచ్చునని అంటున్నారన్నమాట. (జనంలో మావోయిస్టులు ఉన్నప్పుడు జనం కొందరు చావక తప్పదని ఇప్పటికే చిదంబరం, విజయ్‌కుమార్ వంటి వారితో పాటు ఒకరిద్దరు మీడియా లో తేల్చేశారు!)
2)ఆదివాసులు మావోయిస్టులైతే చంపవచ్చునా?
3) మావోయిస్టులైతే ఎన్‌కౌంటర్ పేరుతో చంపవచ్చుననేది చిదంబరం, రమణ్‌సింగ్ లాంటి వాళ్లు ఎప్పుడో తేల్చుకున్న న్యాయం. కనుక ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేసేది.. చనిపోయిన ఆదివాసుల్లో మావోయిస్టులు ఉన్నారా? లేక ఆదివాసీలే మావోయిస్టులా? అనేది తేల్చడానికి మాత్రమే. ఇది నిజమైన ఎన్‌కౌంటరా? బూటకపు ఎన్‌కౌంటరా? అనేది తేల్చడానికి కాదు. గులాం రసూల్ ఎన్‌కౌంటర్ విషయం లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ టీఎల్‌ఎన్ రెడ్డి కమిషన్ విచారణ వేసినప్పుడు ఆయన అది ఎన్‌కౌంటరా కాదా అన్న అంశం కాకుండా, ఆ జర్నలిస్టు నక్సలైటే అని తేల్చేశారు. డాక్టర్ బినాయక్‌సేన్ యావజ్జీవ శిక్ష ,‘వరల్డ్ టూ విన్’ సంపాదకుడు ఆసిత్ సేన్ గుప్తాకు ఎనిమిదేళ్ల శిక్ష, అసెంబ్లీలో కరపవూతాలు పంచారన్న నెపంతో మావోయిస్టు సానుభూతిపరులు మాలతీ మొదలైన వారికి పదేండ్ల శిక్ష వేసిన ఛత్తీస్‌గఢ్ న్యాయవ్యవస్థ నుంచి మనం ఏమి ఆశించగలం!ఎన్‌కౌంటర్లు అన్నీ నిజమా? బూటకమా! అన్న విచికిత్స లేకుండా హత్యా నేరంగా నమోదు చేసి విచారించాలని ఆంధ్రవూపదేశ్ హైకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకక్షిగీవం గా ఇచ్చిన తీర్పు అమలైనప్పుడు మాత్రమే ఎన్‌కౌంటర్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నది. కనీసం బూటకపు ఎన్‌కౌంటర్లు చేయడానికి పోలీసు లు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. చిదంబరం వంటి వారికి ఎన్‌కౌంటర్ల న్నీ నిజమైనవేనని అనడానికీ, మావోయిస్టులైతే కాల్చిచంపేయవచ్చునని అనడానికీ ఆంధ్రవూపదేశ్ హైకోర్టు తీర్పు మార్గదర్శకాలు గుర్తుండే విధంగా చేస్తే కొంత రక్తపాతం తగ్గుతుంది. అలాగే... ప్రభుత్వ విధాన నిర్ణేతలకు అదొక బాధ్యత అని గుర్తుచేస్తుంది. నాగలితో దున్నితో భూమాతకు బాధ కలుగుతుందేమోనని సున్నితంగా కొయ్యముక్కలతో పోడు వ్యవసాయం చేసుకునే ఆదివాసుల గుండెల్లో గుండ్లు దించి, బయోనెట్లతో గుచ్చి హత్యచేసిన పాలకులకు ఆదివాసులు మావోయిస్టులుగా, హింసావాదులుగా కనిపించడం నేటి పాలకుల నీతి. ఇప్పటి చారివూతక విషాదం. ఈ హింసాత్మ దుష్టనీతిలో అమాయక ఆదివాసుల కు న్యాయం జరుగుతుందా? 

-వరవరరావు

    Namasete Telangana News Paper Dated : 07/07/2012

Friday, April 13, 2012

జార్జ్ అడుగు జాడల్లో..-----వరవరరావు



నేను జార్జిని చూసిన జ్ఞాపకం లేదు. కాని 1972 ఏప్రిల్ 14 సాయంకాలం నుంచి ప్రతి సాయం సంధ్యలోనూ ప్రతి ఉదయసంధ్యలోనూ ఆకాశంలోనే కాదు, నేలమీద కూడా ఆయన అడుగుజాడల్లో నడిచిన, నడుస్తున్న అసంఖ్యాకమైన విద్యార్థి యువజనులను, విప్లవకారులను, సామ్రాజ్యవాద భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లోనూ, అన్ని రకాల ఆధిపత్య వ్యతిరేక పోరాటాల్లోనూ ప్రాణాలర్పించిన, అర్పిస్తున్న ఎందరినో చూస్తున్నాను. ఆ దారి రక్తసిక్తమైన దారి. ముళ్లదారి. కాని ఆ దారి చివరన సమతాసుందర స్వప్నాలు పుష్పించిన ఉద్యానవనాలుంటాయని స్వప్నించిన వాళ్లు వాళ్లందరు. వాళ్లందరూ చనిపోయారు. కాని వాళ్ల స్వప్నా లు చనిపోవు.

1972 జూలై14 సాయంత్రం ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీ మెట్లపై ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్ గూండాలు, వాళ్లు తోడు తెచ్చుకున్న మాఫియా జార్జిని కత్తిపోట్లతో చంపేసిన తర్వాత, ఆ వార్త మాకు వరంగల్‌లో ఆ రాత్రికే చేరి కలవరపెట్టిందో, ఆ రాత్రి కలత నిద్రలో మాకు పేగు కదిలిందో, మర్నాడు ఉదయమే తెల్సిందో ఇపుడు జ్ఞాపకం లేదు. ఇప్పటి వలే హైటెక్ సమాచార సాధనాలు నాడు లేవు. కానీ, నిస్సంకోచంగా ప్రత్యామ్నాయ విప్లవ సమాచార సాధనాలున్నాయి. బహుశా ఆ ఇంజనీరింగ్ కాలేజీ మెట్లమీంచి ఆ నవయవ్వన కవోష్ణ రక్తమే అప్పటికే విప్లవ విద్యార్థి ఉద్యమంతో వెల్లివిరిసిన వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీ , మెడికల్ కాలేజీ, ఆర్ట్స్‌అండ్ సైన్స్ కాలేజీ, సికెయం, ఎల్‌బి కాలేజీలకు ప్రవహించి మాకు అమరసందేశాన్ని ఇచ్చిందే మో.15 ఉదయం విద్యాసంస్థలు తెరిచే సమయానికి కాలేజీలు, స్కూళ్లు బహిష్కరించి ఆజంజాహి మిల్లు, కాశీబుగ్గ, పోచమ్మ మైదానాల మీదుగా కలెక్టరాఫీసు దాకా కూడా ఒక జానకితాడు ముట్టించిన వంటి ఒక పెద్ద ఊరేగింపు. అందులో ఆజంజాహి మిల్లు కార్మికులు, కాశీబుగ్గ చేనేత కార్మికులు, సికెయం కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులు మొదలుకొని ఆర్‌టి సి కార్మికు లు, రైల్వే కార్మికులు పెద్దమ్మగడ్డ నుంచి విప్లవాభిమానులైన దళితులు, విప్ల వ రచయితలు ‘పిడిఎస్’ పేరుతో విప్లవవిద్యార్థులు అప్పటికే శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవకాలం నుంచి అంటే ఉక్కు ఉద్యమం కాలం నుంచి విప్లవ ప్రచారాచరణలో ఉన్న విద్యార్థులున్నారు. జీవనపోరాటంలోని వివిధ వృత్తు ల, వ్యావృత్తుల వాళ్లున్నారు. వాళ్లందరి ప్రవృత్తి మాత్రం విప్లవం.

ఈ ఊరేగింపును బహుశా ఆర్గనెజ్ చేసినవాళ్లు మాత్రం స్వరాజ్యం, ఎస్.సత్యనారాయణరావు (పిడిఎస్‌యు ఏర్పడినాక మొదటి కార్యదర్శి,మా సికెయం కాలేజీ విద్యార్థి), విరసంసభ్యుడు, బట్టలు కుట్టి బతుకుతున్న జ్ఞానేశ్వర్ కీర్తి. 1968 నుంచే ‘హమారాబరి తుమారా బరి- సబ్‌కా బరి నక్సల్‌బరి’, ‘హమారా నామ్ తుమారా నామ్- సబ్‌కానామ్ వియత్నామ్’ అనే నినాదాలు, ‘ఇన్‌క్విలాబ్ జిందాబాద్’ అనే నినాదం నిత్యపారాయణమైన మాకు ఆ ఊరేగింపు మాకు కొన్ని కొత్త నినాదాలందించింది. అంటే కొన్ని కొత్త పోరాట అస్త్రాలందించింది. ప్రదీప్ రాసినట్లు అవి జార్జి రచించినవే (కాయి న్ చేసినవే) కాకపోవచ్చు. రంగ్‌దే బసంతి, ఇన్‌క్విలాబ్ జిందాబాద్ భగత్‌సింగ్ పర్యాయపదాపూనట్టు జీనా హైతో మర్‌నాసీకో, కదమ్ కదమ్ పర్ లడ్‌నా సీకో, జోర్ జులుమ్ కే టక్కర్‌మే సంఘర్ష్‌హమారా నారా హై, జో హమ్‌సే ఠక్‌రాయేగా, ఓ మిట్టీమే మిల్‌జాయేగా నినాదాలు జార్జ్ వారసులనుంచే ఇవ్వాలటికీ ఎక్కువగా వింటున్నాం.(ఉర్దూనో,ఖడీబోలీనో, హిం దీనో, హిందూస్థానీయో భాషలో ఉండే ఈ నినాదాలు ఎందుకు ఈ రోజు ల్లో ఎక్కువగా వినరావడం లేదో ఒక్కసారి స్వీయపరిశీలన చేసుకుందా మా?) ఈ నినాదాలు ఒక నవయవ్వన ఆదర్శ ఆకాంక్షలను ప్రతిధ్వనించేవి.

ఆ మర్నాడో, ఒకటి రెండ్రోజుల్లోనో హైదరాబాద్, సారస్వత పరిషత్ బయటి ఆవరణలో జార్జ్ సంస్మరణ సభ జరిగింది. ఆ సభలో నన్నూ మాట్లాడమని అడిగారు. అప్పటికింకా విరసం వక్తగా నాకు అలివిడి కాలేదు. ఒక తెనాలి విరసం సభలోనో, ఒక వరంగల్ తెలంగాణ ఉద్యమ సభలోనో మాట్లాడి ఉండవచ్చు. ఆ సభకు కె.శ్రీనాథడ్డి అధ్యక్షత వహించాడు. ఆ విప్లవ ఉత్తేజకరమైన సభను ముగిస్తూ ఆయన ఒకే వాక్యంతో ముక్తాయింపు చేశాడు. ‘సభ ముగిసింది, ఇంక చరిత్ర మొదలవుతుంది’.(ది మీటింగ్ ఈజ్ ఓవర్, నవ్ ద హిస్టరీ బిగిన్స్). అక్షరాలా జార్జ్, జార్జ్ విప్లవ సంప్రదాయానికి, జార్జ్ అమరత్వం మరుక్షణం నుంచి చరిత్ర మొదలయింది.

చరిత్ర అప్పుడే మొదలయినట్లు కాదు, చరివూతలో నక్సల్బరీతో ప్రారంభమైన నూతన ప్రజాస్వామిక విప్లవ నిర్మాణ చరిత్ర 1966 శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవ ప్రభావంతో మొదలయిందని చెప్పవచ్చు. 67 నక్సల్బరీతో ప్రారంభమైందని చెప్పవచ్చు. కాని ఆ పోరాట త్యాగ చరివూతలో నక్సల్బరీ, శ్రీకాకుళం సెట్‌బ్యాక్‌లకు ముందు క్యాంపస్‌లలో, ముఖ్యంగా తెలుగు నేలమీద పంచాది కృష్ణమూర్తి, చాగంటి భాస్కరరావు, మల్లికార్జున్, దుష్యంత్‌ల తర్వాత ఒక పోరాట త్యాగచరివూతకు ఉస్మానియా క్యాంపస్ నుంచి జార్జ్ ఒరవడి పెట్టాడు. ఇంక ఆ జాబితాలో ఇవ్వాటిదాకా ఎందందరో. 

ఆచరణ, ఆచరణేయ జ్ఞానం, జ్ఞానమే పోరాటం, పోరాటమే త్యాగంగా బతికినవాడు జార్జ్. జ్ఞాన సంపన్నత్వం, ప్రజాసేవ ఆచరణగా, ప్రజాసేవ ఆచరణలో నిజాయితీ, విలువలు, అసాధారణమైన సాధారణత్వం, సాహ సం, నిత్యపోరాట శీలం సహజంగానే ఈ అన్నింటి సమాహారం త్యాగంలోనే పర్యవసించడం ఇదీ జార్జ్ పెట్టిపోయిన ఒరవడి. ఈ ఒరవడి కమ్యూనిస్టు సంప్రదాయం నుంచి వచ్చింది. విప్లవోద్యమ సంప్రదాయం నుంచి వచ్చింది. మార్క్స్ నుంచి శాస్త్రీయంగా ఆచరణలోకి వచ్చింది. కానీ మనకు స్పార్టకస్ నాటినుంచి ఉన్నదే. కాని జార్జ్ తర్వాత క్యాంపస్‌లలో అది చైనా లో మే 4 విద్యార్థి ఉద్యమం, శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం వలె మళ్లీ మన క్యాంపస్‌లలో ఒక పోరాటాల, త్యాగాల ఒరవడిని నెలకొల్పింది. విద్యావంతుల్లో అది సరోజ్‌దత్తాతో ప్రారంభమైందో, కలకత్తా జాదవ్‌పూర్ యూనివర్సిటీల్లో గోల్డ్‌మెడల్స్ పొందిన విద్యార్థులు నక్సల్బరీ ఆదివాసీ రైతాంగంతో పాటు ప్రాణాలర్పించిన ఉదంతాలు చరివూతలో విని పులకించిపోయాం. మన కళ్ల ముందు ఒక జార్జ్‌ను చూశాం. కాకతీయ క్యాంపస్‌నుంచి వచ్చి 2002లో రాష్ట్ర విప్లవోద్యమ నాయకుడిగా కృష్ణానదిలో పుట్టి మునిగి చనిపోయిన లింగమూర్తిని చూశాం. ఇద్దరూ గోల్డ్‌మెడలిస్టులు. ఒకాయన ఫిజిక్స్‌లో, మరొకాయన తెలుగులో. ఇవ్వాళ తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రజాస్వామిక ఆకాంక్ష కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థులకు ఒకసారి ఆ జాబితా వివరించాలని ఉన్నది. సూరపనేని జనార్దన్, మురళీమోహన్, ఆనంద్‌రావు, జంపాలప్రసాద్, శ్రీహరి, చాంద్‌పాషా, పులి అంజయ్య, గోపగాని ఐలయ్య, నాగేశ్వరరావు, రామకృష్ణ,యాకయ్య, శ్యాంప్రసాద్, మారోజు వీరన్న, రంగవల్లి, వీరన్న (వీరాడ్డి), ప్రసాద్, వెంకటయ్య (వీళ్లంతా తెలంగాణ విశ్వవిద్యాలయాలకు చెందిన వాళ్లు), నాగరాజు, చలపతి, నర్సింహాడ్డి (ఎస్‌వి యూనివర్సిటీ), భుజంగడ్డి (ఉస్మానియా,ఎస్‌కె రెండు యూనివర్సిటీలు), వీరాస్వామి (హైదరాబాద్ యూనివర్సిటీ).

వీరిలో మళ్లీ మేధావులుగాను, విప్లవాచరణలోను, బయటి సమాజంలో కూడ ఎంతో గుర్తింపు పొందినవాళ్లుగా ఇటు శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక రంగంలోను, అటు సమాజశాస్త్ర, చరిత్ర, రాజనీతి రంగాల్లోను ఎకడమిక్ స్థాయిలో కూడా అరుదెన గుర్తింపు పొందిన సంప్రదాయానికి కూడా బహుశా పంచా ది కృష్ణమూర్తి తర్వాత జార్జే ఒక సంప్రదాయం నెలకొల్పాడు. సూరపనేని జనార్దన్, జంపాలప్రసాద్, మధుసూదన్‌రాజ్, ఎర్రండ్డి సంతోష్‌డ్డి, రంగవల్లి, మారోజు వీరన్న, వీరాస్వామి, నవీన్‌బాబు (జెఎన్‌యు), సాకేత్‌రాజన్ (కర్నాటక), అనూరాధాగాంధీ ఈ కోవలోకొస్తారు.

ఈ తెలివిడి జార్జ్ చంపబడిన్నాటి నుంచే మన మధ్య బతికి ఉన్నాడనడానికి ఒక అపూర్వమైన ఉదాహరణ. నాటినుంచీ బహుశా ఆయన అమరత్వా న్ని మనమొక విషాదజ్ఞాపకంగా కాకుండా ఒక పోరాట ఉత్తేజంగా తలుచుకుంటున్నామనుకుంటాను. ఆనాటి ఆయన హత్య, ఆయన రక్తబంధువులకు, స్నేహితులకు, ఆయనతోపాటు ఆచరణలో ఉన్నవాళ్లకు ఎటువంటి దుఖం, ఉద్వేగాన్ని కలిగించినవో కాని, అది ప్రత్యేకించి క్యాంపస్‌లలో అది ఓ విప్లవ పునర్నిర్మాణానికి దోహదం చేసింది. ఆయన చనిపోయినపుడు నేను జిందాబాద్ అని రాశాను.

చావు కూడా బతుకుకన్నా విలువైన త్యాగంగా
చచ్చినవానికోసం ఏడుపు రాదు
తన తరమంతా సుఖంగా బతకడానికి/ఒకడొకరోజు ముందు చస్తాడు
జ్ఞానమంటే అన్యాయాన్ని అంతకన్నా 
తీవ్రంగా ఎదుర్కోవడమని తెల్సిన
జార్జిరెడ్డిని మాత్రమే శాస్త్రవేత్తగా గుర్తిస్తుంది జనం
సకల శాస్త్రాలు చదువుతున్న విద్యార్థులు, చదువుకున్న ప్రకృతీ సామాజి క శాస్త్రవేత్తలు ముఖ్యంగా ఇవ్వాళ సామ్రాజ్యవాద యుద్ధసమయంలో ప్రజలతరఫున నిలబడవలసిన తరుణమిది. జ్ఞానమొక్కటే మననిప్పుడు ప్రజలవైపు నిలబెట్టదు. ప్రజాస్వామిక చెతన్యం, దేశభక్తి, ప్రజలపై ప్రేమ, సేవాభావం, ప్రజల సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలనే ఒక స్వతంత్ర ఆకాంక్ష, ప్రజలే చరిత్ర నిర్మాతలనే విశ్వాసం మాత్రమే మననివ్వాళ ఒక జార్జ్జిడ్డి వంటి జీవితాచరణకు పురికొల్పుతుంది. అప్పుడు మరణాన్ని ఒక వ్యక్తిగతమైన అంశంగా, జ్ఞాపకాన్ని ఒక నాస్టాల్జియాగా కాకుండా ఆ మరణంలో రణన్నినాదమైన ఆశయాన్ని మన కర్తవ్యంగా ముందుంచుతుంది.

జార్జ్ నెత్తుటి తడి ఆరకముందే జరిగిన ఆ మొదటి సంస్మరణసభ సాయంకాలం ఏం జరిగిందో ఇందుకో ఉదాహరణగా చెప్తాను. సభ అయిపోగానే సభ నిర్వహించిన పిడిఎస్ విద్యార్థుల్లో ఎవరో ఒకరు నన్ను ఉస్మానియా క్యాంపస్ ఇ-హాస్టల్‌కు మోటార్‌సైకిల్‌పై తీసుకుపోయారు. వాళ్లు కనీ సం 16, 20 మందుంటారు. వాళ్లలో అప్పటికి మా వరంగల్ వాడైన జావేద్‌మీర్జా ఒక్కడే బాగా తెలుసు. నన్ను తీసుక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి కూర రాజన్న అని తర్వాత తెలిసింది. ఆయన నాయకత్వంలో వీళ్లంతా నా మీద సంధించిన ప్రశ్నలు ‘మార్క్సిస్టు, లెనినిస్టులుగా మనం తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా బలపరుస్తాము’ అని. ఎందుకంటే అప్పటికే 1969లోనే నేను లెనిన్ శతజయంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రజా పసిగట్టినవాడు లెనిన్ అని రాసి ఉన్నాను. అట్లూరి రంగారావు మొదలైనవాళ్లు నన్ను ప్రేరేపించి 1972లో వరంగల్‌లో జీవన్‌లాల్ గ్రౌండ్స్‌లో 25వేల మందితో జరిగిన తెలంగాణ సదస్సును ప్రారంభించమని పురికొల్పి ఉన్నారు. ఇది వీళ్లకాశ్చర్యంగా ఉన్నది. కాని వరంగల్‌లో అప్పటికే 1969, 72 రెండు సందర్భాల్లోను తెలంగాణ ఉద్యమంలో పాల్గొ న్న విప్లవ విద్యార్థులందరూ ఆ తర్వాత కాలంలో రాడికల్ విద్యార్థులుగా మారారు.1978 ఆర్‌ఎస్‌యు రెండవ మహాసభల తర్వాత ‘గ్రామాలకు తరలండి’ క్యాంపెయిన్ తీసుకున్నారు. ఆ తర్వాతదంతా చరిత్ర అన్నట్లు ఇవ్వా ళ వాళ్లంతా దేశవ్యాప్త విప్లవోద్యమంలో అమరులయిన, కొనసాగుతున్న నాయకులుగా, శ్రేణులుగా ఉన్నారు. శ్యాం, మహేశ్, మురళి మొదలుకొని కిషన్‌జీ వరకు ప్రజాస్వామిక తెలంగాణ ఆచరణ చిత్రపటాన్ని గీసినవారే.
జార్జ్ అమరత్వం తర్వాత 72 జూలైలో సృజన ఆయన ముఖచివూతంతో వెలువడింది. అందులోనే నేను ‘జిందాబాద్’ అని ఆయనపై కవిత రాశాను. మళ్లీ 74 ఏప్రిల్ జార్జ్ మూడో వర్ధంతి సందర్భంగా సృజనలో ‘కదమ్ కదమ్ పర్ లడ్‌నా సీఖో’ శీర్షికతో ఎన్‌కె, ‘జార్జ్‌డ్డీ మేమూ నీ మార్గమే’ అనే పేరు తో జ్ఞానేశ్వర్‌కీర్తి కవితలు రాశారు.‘జార్జ్ ! నీవందించిన కొరడా కొస నుండి పిడి వరకు చేరుకున్నాం’ అని జ్ఞానేశ్వర్ సంఘటితమై నిర్మాణమైన విప్లవ విద్యార్థి ఉద్యమాలను పరోక్షంగా ప్రస్తావించాడు. అయితే జార్జ్ నుంచి నేర్చుకోవల్సింది మరొకటున్నది. ఆయన అంతిమయావూతలో అప్పటి ఉస్మానియా వైస్‌చాన్సలర్ నూకల నరోత్తమ్‌డ్డి మొదలు, ఉస్మానియా ఫిజిక్స్ ప్రొఫెసర్స్ మొదలు ఎందరో మేధావులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. ప్రొఫెసర్ వెంకవూటామయ్య వంటివాళ్లు ఆయన పేరుమీద ఫిజిక్స్‌లో అత్యంత ప్రతిభాశాలి అయిన విద్యార్థికి గోల్డ్‌మెడల్ ప్రకటించారు. ఇటువంటి గుర్తింపు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక్క సూరపనేని జనార్దన్‌కే దక్కిం ది. అంతేకాదు, 74లో పోలమికల్ చర్చలతో విడిపోయిన పిడిఎస్‌యు, ‘ఆర్‌ఎస్‌యు’ లు బహుశా అంతకన్నా ముందున్న డిఎస్‌ఓ కూడా తమది ఆయన వారసత్వమని, తమకు ఆయన వారధి అని చెప్పుకుంటున్నాయి. బహుశా అది వరంగల్ హైదరాబాద్‌లో అప్పటికింకా నిర్మాణరూపం పొందని పిడిఎస్ సంప్రదాయం కావచ్చు. ఈ రెండూ విప్లవ మెలకువలూ, నెపుణ్యాలూ, ఆమోదయోగ్యతా మనం జార్జ్ నుంచి గ్రహించాలి.

సంఘపరివార్ శక్తులు 70లలో ఒక జార్జ్‌నో, ఒక చాంద్‌పాషానో ఎందు కు చంపారు? 0లలో జగిత్యాలలో ఒక గోపి రాజన్నను, నల్లగొండలో ఒక శేషన్నను ఎందుకు చంపారు? నలగొండలో శేషుసారుపై ఎందుకు హత్యావూపయత్నం చేశారు? మళ్లీ ఇటీవలి కాలంలో కాశీంపై ఎందుకు చేశా రు? 68 నుంచి ఎమ్జన్సీ కాలం దాకా మళ్లీ 80లలో ఒకసారి భూస్వా మ్య, వ్యాపార, అగ్రవర్ణ సెక్షన్ల నుంచి వచ్చిన విద్యార్థులకు వ్యవసాయ కూ లీలు, దళితులు, ముస్లింలు, పేదవర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు కరపవూతాల రూపంలోను, విద్యార్థిసంఘ ఎన్నికల్లోను, క్యాంపస్‌లలో భౌతిక ఘర్షణల రూపంలోను జరిగిన ఒక వర్గపోరాటాన్ని గుర్తుచేసుకుందాం. 

తెలంగాణ సాధన విషయంలో నిర్విచక్షగా ఇటువంటి హిందుత్వశక్తులతో మనం ప్రయాణం చేస్తున్న సందర్భంలో (వాస్తవానికి నేను ప్రస్తావించిన సందర్భా ల్లో బాబ్రీమసీదు విధ్వంసంలేదు, గుజరాత్ మారణకాండ లేదు, మక్కామసీదు పేలుడు లేదు, మహబూబ్‌నగర్ ఉపఎన్నికలు, ఉప ఎన్నికల అనంతరపు సంగాడ్డి ఘర్షణలు లేవు. సైదాబాద్, మాదన్నపేటల్లో కొనసాగుతు న్న కర్ఫ్యూ లేదు. జార్జ్‌డ్డిని స్మరించుకుంటున్నాం గనుక తెలంగాణ మీద అత్యంత ప్రేమతో ఈ జాగ్రత్త తీసుకుందాం.


(నేడు జార్జిరెడ్డి 40వ వర్ధం)

Namasete Telangana News Paper Dated : 14/04/2012 

Tuesday, December 20, 2011

జీవించే హక్కును పునర్నిర్వచించాలి


అదివాసులకు జల్, జంగిల్, జమీన్‌లపై భారత రాజ్యంగమూ, కేంద్ర చట్టాలు ఇచ్చిన అధికారాన్ని డిమాండు చేస్తున్న సాంస్కృతిక కార్యకర్తల ప్రాణాలను చట్టపరంగా హరించే కళంకం నుంచి (జీతన్ మరాండీ తదితరుల మరణ శిక్ష రద్దు ద్వారా) భారత రిపబ్లిక్ ప్రస్తుతానికి బయటపడింది. ఇది జ్ఞానోదయానికి తలుపులు కాకున్నా కిటికీలు తెరిచే వైపుగానైనా ఇంక మరణ శిక్ష రద్దుకొరకు ప్రజా ఉద్యమాల నిర్మాణం విస్తృత, విశాల ఐక్య ప్రాతిపదికపై జరగాల్సి ఉంది. ఇంతవరకు భారత రిపబ్లిక్‌లో ఎందరు దళితులు, బడుగు వర్గాల వాళ్లు, నిరుపేదలు, మహిళలు, ముస్లింలు, మైనారిటీలు, రాజకీయ ప్రత్యర్థులు ఉరికంబాలెక్కారో లెక్కలు తేలాల్సి ఉన్నది. 

జార్ఖండ్ అభేన్ కళాకారుల బృందం జీతన్ మరాండీ, అనిల్‌రామ్, ఛత్రపతి మండల్, మనోజ్ రాజ్వర్‌లకు గిర్దీ జిల్లా సెషన్స్ కోర్టు విధించిన మరణ శిక్షను రాంచీ హైకోర్టు ఈనెల 15న కొట్టివేసింది. జీతన్ తదితరుల పైన వేరే ఏ కేసులూ విచారణలో లేనట్లయితే వాళ్లను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. గత నాలుగేళ్ళుగా హజారీబాగ్, రాంచీ జైళ్ళలో విస్థాపన ఉద్యమంలో రాజద్రోహ నేరారోపణ వం టివి ఎదుర్కొంటూ బెయిల్ రాకుండా ఉన్న జీతన్ మరాండీ తప్ప మిగ తా ముగ్గురూ వెంటనే విడుదలవుతారు. వీరిలో అనిల్ రామ్ తప్ప మిగ తా ముగ్గురూ సంతాలీ ఆదివాసులు. అనిల్‌రామ్ దళితుడు. 'సంశయ లబ్ధి' (బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద ఈ నలుగురి మరణ శిక్షను రాంచీ హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ వారిని నిర్దోషులుగా ప్రకటించింది. 

తొంభైతొమ్మిది మంది నేరస్తులయినా తప్పించుకోవచ్చు గానీ, ఒక్క నిర్దోషికి శిక్షపడకూడదన్న న్యాయతత్వ సూత్రానికి అనుగుణంగా రాంచీ హైకోర్టు డివిజన్ బెంచ్ (జస్టిస్ మరాఠియా, జస్టిస్ ఉపాధ్యాయ) 'సంశయ లబ్ధి' అవకాశం క్రింద నిర్దోషుల విడుదలకు ఆదేశించింది. న్యాయవ్యవస్థ నూటికి నూరుపాళ్లు కంపెనీల, ప్రభుత్వాల ఒత్తిళ్లకు ఇంకా లోనుకాలేదని, అక్కడక్కడా ఒయాసిసులు మిగిలాయని ఈ తీర్పు కొంత ఓదార్పును కలిగించింది. 

విచారణ జరిగినన్ని రోజులు తన రెండున్నర సంవత్సరాల కుమారుడు అలోక్‌చంద్రతో పాటు అపర్ణ (జీతన్ సహచరి) హైకోర్టులో వాద ప్రతివాదాలు వినడానికి వెళ్ళారు. విచారణ పూర్తయిన ఆఖరిరోజు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మరాఠియా చిన్నారి అలోక్‌కు పుస్తకాల కిట్ పంపించారు. 'కుమారుడు విద్యావంతుడు కావాలనుకుంటున్న న్యాయమూర్తి తండ్రిని ఉరికంబానికి పంపడని అప్పుడే అనిపించింది' అని న్యాయవాది ఎస్.కె.రజన్ వ్యాఖ్యానించారు. 

తెలుగు నేల మీద మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేసే ఒక ప్రజాస్వామిక సంస్కృతి నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల కాలం నుంచే కాదు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటకాలం నుంచి కూడ ఉన్నది. ఆ కాలంలో ఉరిశిక్ష పడిన 11 మంది కమ్యూనిస్టు విప్లవకారుల ఉరిశిక్షల రద్దు కొరకు డాక్టర్ జయసూర్య నాయకత్వంలో న్యాయస్థానం లోపల, బయట ఉద్యమం నడిచింది. ఇంగ్లాండు నుంచి బారిస్టర్ ప్రిట్‌ను, సుప్రీం కోర్టు నుంచి డానియల్ లతీఫ్‌ను తీసుకువచ్చి వాదింపచేశారు. 

నల్లా నర్సింహులు ఉరిశిక్ష రద్దు కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ వాదించారు (జైలు నుంచి తప్పించుకున్న నర్సింహులును షోలాపూర్ పంపించడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సాహస సహకారం గురించి కూడా చెప్పుకోవాలి). కోర్టులో ఈ వాదన బలమే కాకుం డా మరణ శిక్షల అమలుపై ఖురాన్ పై భక్తి విశ్వాసాల వల్ల ఉస్మాన్ అలీఖాన్ సంతకాలు చేయకపోవడం వల్ల కూడ ఆ మరణ శిక్షలు ఆగిపోయాయి. 

ఆ తర్వాత సైనికచర్యల వల్ల హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమయింది. అయితే భారత్ ఒక రిపబ్లిక్‌గా ఏర్పడక పూర్వం నెహ్రూ ప్రభుత్వం (కేరళకు చెందిన కయ్యూరు కామ్రేడ్స్ ఉదంతం ఆధారంగా నిరంజన రాసిన 'చిరస్మరణ' నవల చదవండి), ఏర్పడినాక నెహ్రూ, ఇందిరలు మొదలు ఇప్పటిదాకా మన గణతంత్ర రాజ్యం మరణ శిక్షలు అమలు చేస్తూనే ఉంది. భారత రాజ్యాం గం, పార్లమెంటు చట్టాలు, దేశంలోని మిగతా రాష్ట్రాల వలే వాటికవిగా వర్తించని, 370 క్లాజు కింద ప్రత్యేక ప్రతిపత్తి గల జమ్మూ-కాశ్మీర్‌లో కూడా మఖ్బూల్ భట్ వంటివారిపై మరణ శిక్షలు అమలయ్యాయి. 

శ్రీకాకుళ ఉద్యమ ప్రభావంతో తాళ్లపాలెం హత్యకేసులో నెల్లూరు జిల్లాకు చెందిన ఇంతా రమణారెడ్డి, శంకరరెడ్డి, రామకృష్ణలకు 1972లో సెషన్స్ కోర్టు మరణ శిక్ష విధించింది. అప్పటికి శ్రీకాకుళ పంథా ననుసరిస్తున్న విప్లవకారులు కోర్టులను బహిష్కరించే వైఖరి తీసుకున్నారు. అయినా జస్టిస్ చిన్నప్ప రెడ్డి 'మనకు రాజ్యాంగం మీద, కోర్టుల మీద విశ్వాసం ఉన్నది కదా, ఇది మన విశ్వాసాలకు పరీక్ష' అని ఎమికస్ క్యూరీ (కోర్టు తరఫున న్యాయవాద నిపుణుడు) నియమించారు. 

'రాజకీయ విశ్వాసంలో భాగంగా ఈ హత్య జరిగింది గాని కక్ష, ద్వేషాలతో కాదు, ఆ విశ్వాసాలతో మాకు ఏకీభావం ఉన్నా, లేకున్నా ఇక్కడ వ్యక్తిగత ఉద్దేశం (ఇంటెన్షన్) లేదు గనుక కొట్టివేస్తున్నానని' ఆయన అన్నారు. (సుప్రీంకోర్టు నిర్వచించి అరుదయిన నేరాల్లో అరుదయిన వాటికే మరణ శిక్షను విధించాలన్న అవగాహనను జస్టిస్ చిన్నప్ప రెడ్డి అట్లా గౌరవించారు) ఆ తర్వాత కాలంలో 1975 మే 11న భూమయ్య, కిష్టా గౌడ్‌ల ఉరిశిక్షలను కూడ రెండవసారి జస్టిస్ చిన్నప్పరెడ్డి, జస్టిస్ గంగాధరరావుల వేసవి కాలపు బెంచీయే నిలిపివేసింది. 

నాగభూషణ్ పట్నాయక్‌కు విధించిన మరణశిక్ష రద్దునకు దేశావ్యాప్త ఉద్యమం జరిగింది. ముఖ్యంగా ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి నవకృష్ణ చౌదరి, మాలతీ చౌదరి, వెన్నెలకంటి రాఘవయ్యల కృషితో 1972లో భారత స్వాతంత్య్ర రజతోత్సవాల సందర్భంగా ఆయన ఉరిశిక్ష రద్దయింది. 

భూమయ్య, కిష్టా గౌడ్‌ల ఉరిశిక్ష రద్దు కొరకు 1974 నుంచి దేశవ్యాప్త ఉద్యమం నిర్వహించబడింది. ఆ ఏడాది నవంబర్‌లో ఒకసారి, 1975 మే 11న ఒకసారి ఆగిన ఉరిశిక్ష ఎమర్జెన్సీలో డిసెంబర్ 1న (దేశంలోనే ప్రజాస్వామిక హక్కులన్నీ రద్దయిన కాలంలో) అమలయింది. ఈ ఉద్యమానికి పత్తిపాటి వెంకటేశ్వర్లు, కె.జి.కన్నబిరాన్ మొదలు జార్జి ఫెర్నాండెజ్, జయప్రకాశ్ నారాయణ్, వాజపేయి, ఎస్.జైపాల్ రెడ్డి వరకు దేశంలో నాయకత్వం వహించారు. అండగా నిలిచారు. 

చండ్ర రాజేశ్వరరావు, భూపేశ్ గుప్తాల నాయకత్వంలో సిపిఐ ఉద్యమించింది. కె.ఎ.అబ్బాస్ మొదలు ('మృగయా' సినిమా భూమయ్య, కిష్టాగౌడ్‌ల స్మృతిలోనే నిర్మాణమైంది), ఆనంద్ పట్వర్థన్ (ప్రిజనర్స్ ఆఫ్ కాన్షస్) వంటి సినిమా, డాక్యుమెంటరీ దర్శకులు ఉద్యమించారు. ఫ్రాన్స్‌లో జీన్‌పాల్ సార్త్ర్, సైమన్ డిబావ్రా, తరీఖ్ అలీ, అమెరికాలో ఛామ్‌స్కీ ప్రదర్శనలు, విజ్ఞప్తులు చేశారు. శ్రీశ్రీ సంగతి సరేసరి. కాలికి బలపం కట్టుకుని తెలుగునేలంతా తిరిగాడు. 'భూమయ్య, కిష్టాగౌడ్‌లను ఉరితీసి ఇందిరాగాంధీ, డాస్టోవస్కీని ఆఖరి క్షణాన వదిలేసిన జార్ చక్రవర్తి కన్నా, పదకొండు మంది విప్లవకారులకు మరణశిక్ష అమలు ఆదేశంపై సంతకం చేయని ఉస్మాన్ అలీఖాన్ కన్నా నియంత అనిపించుకోకూడదని ఆశిస్తున్నానని' విజ్ఞప్తి చేశారు. 

ఇవి రాజకీయ విశ్వాసాలు, కలహానికి సంబంధించినవైతే చలపతి, విజయవర్ధనరావుల మరణశిక్ష రద్దు కావాలని తెలుగునేల మీద ప్రత్యేకించి, దేశ వ్యాప్తంగా మొత్తంగా సాగిన ఉద్యమం సామాజిక శక్తుల చైతన్యానికి, విజయానికి ఉదాహరణ. ఆ ఇద్దరూ దళిత యువకులు. నేరం వాళ్లు చేయలేదు. ఆకలి చేసింది. దేశవ్యాప్తంగా నేరారోపణలపై జైళ్ళలో మగ్గుతున్న వారు, ఉరికంబాలు ఎక్కుతున్న వారు దళితులు, బడుగు వర్గాలవారేనన్నది ఈ ఉద్యమ సందర్భంగాను, బీహార్‌లో ఉరిశిక్ష పడిన ఏడుగురు రైతాంగ కార్యకర్తల సందర్భంగానూ స్పష్టంగా ముందుకు వచ్చింది. ఎపిసిఎల్‌సి, దళిత సంఘాలు ఈ ఇద్దరి ఉరిశిక్షల రద్దుకై దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించాయి. కె.ఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా ఈ మరణశిక్ష నైతే రద్దుచేశారు గానీ, పద్దెనెమిదేళ్లుగా ఈ పశ్చాత్తాప యువకులు జైలుచీకటి కొట్లో మగ్గుతున్నారు. 

అంటే తెలుగు నేల మీద ప్రజా ఉద్యమాల ప్రభావంతో, బయట కోర్టులోనూ ప్రచారంలోను, వాదనలోను ప్రజాస్వామ్య భావజాల చైతన్యంతో మరణ శిక్షలు ఆగిపోయిన అరవై ఏళ్ల చరిత్ర ఉన్నది. ప్రభుత్వాలైనా, కోర్టులైనా ఉద్యమాలకు తలవొగ్గినవి (ప్రాథమిక హక్కులు రద్దయిన ఎమర్జెన్సీ కాలం ఒక్కటే మినహాయింపు). 

బెంగాల్‌లో మొలీనాధక్‌కు పడిన మరణ శిక్ష కూడ రద్దయి ఆ తర్వాతకాలంలో ఆమె విడుదలయింది. బీహార్‌లో కొందరు రైతాంగ కార్యకర్తల మరణశిక్షలు రద్దయ్యాయి. ఇంకా కొందరి విషయంలో రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్ష విజ్ఞప్తులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో అఫ్జల్ గురు, మురుగన్, సంతన్, పెరువారన్ మరణ శిక్షల రద్దు గురించి అటు కాశ్మీర్ మొదలు, ఇటు తమిళనాడు వరకు ఉద్యమాలను నిర్వహిస్తున్నారు. 

మురుగన్, సంతన్, పెరువారన్‌ల మరణ శిక్ష రద్దు కొరకు తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించి, మరణశిక్ష అమలయ్యే తేదీ కూడ నిర్ణయింపబడినాక మద్రాసు హైకోర్టు స్టే ఇచ్చి విచారణ చేపట్టింది. అఫ్జల్ గురు క్షమాభిక్షను తిరస్కరించవలసిందిగా రాష్ట్రపతికి కేంద్ర హోంమంతిత్వ్ర శాఖ సిఫార్సు చేసింది. కాంగ్రెస్, బిజెపిలు ప్రత్యేకించి అఫ్జల్ గురు ప్రాణాలతో చెలగాట మాడుతున్నాయి. పంజాబ్‌లో ఐదుగురు కేంద్ర బలగాలను మందుపాతరతో చంపిన ఆరోపణపై మరణశిక్ష పడిన ధీరజ్ బుల్లార్ కేసు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు కొన్ని కొత్త కోణాలు చర్చకు వచ్చాయి. 

జీవించే హక్కుకు రాజ్యాంగం హామీపడుతుంది గనుక రాజ్యాంగ ధర్మాసనం తప్ప డివిజన్ బెంచీకి కూడ మరణ శిక్ష విధించే అధికారం లేదు. ముగ్గురితో కూడిన బెంచీలో మెజారిటీ అభిప్రాయంతో మరణ శిక్షలు పడిన ఉదంతాలు కూడ ఉన్నాయి. కనుక రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు తప్ప జీవించే హక్కును ఎవరూ తొలగించలేరు అనేది ఒకటి. చట్టం తెలియని పౌరులకు, చట్టంలో విశ్వాసం లేని వాళ్లకు కాదు, చట్టాలను గౌరవించి భారతశిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి ప్రకారం నడచుకోవాల్సిన పోలీసులకు మాత్రమే హత్యా నేరం కింద మరణ శిక్ష విధించాలని ఇటీవల సుప్రీంకోర్టు ద్విసభ్య బెంచీ 'అరుదైన నేరాల్లో అరుదైన' నేరంగా 'ఎన్ కౌంటర్' హత్యలను నిర్వచించింది. 

ఈ వెలుగులో ఇప్పుడు మరణ శిక్షలపై చర్చ జరగాలి. 96 దేశాలు మరణ శిక్షను రద్దు చేశాయి. 34 దేశాలు అమలుచేయడం లేదు. ఒక వ్యక్తిని లేదా వ్యక్తులను నేరారోపణలపై, నేరం రుజువయినప్పటికి ఒక సభ్య సమాజం, అది ఎన్నుకున్న ప్రభుత్వం, దాని న్యాయస్థానాలు చర్చించి ప్రాణాలు తీయాలని నిర్ణయించడం ఎంత అనాగరికమైన విషయం! ఆవేశంలో హత్యలు జరగవచ్చు, రాజకీయ విశ్వాసాల వల్ల జరగవచ్చు, నేర ప్రవృత్తి వల్ల జరగవచ్చు. 

ఈ అన్నింటికన్నా రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక పీడన, అణచివేత, అసమానతల వల్ల జరగవచ్చు. కాని ఒక నాగరిక సమాజం, ప్రజాస్వామ్యం అని చెప్పుకునే ప్రభుత్వం, న్యాయాన్ని ఒక తత్వ శాస్త్రంగా అధ్యయనం చేసి అమలు చేయ వలసిన న్యాయవ్యవస్థ ఒక వ్యక్తిని, వ్యక్తులను నేరారోపణపై జైల్లో పెట్టి సుదీర్ఘ వాదోపవాదాలు చేయించి చంపదగినవారు అని నిర్ణయించడం అమానుషం. 

భారత రిపబ్లిక్ ప్రస్తుతానికి, స్వయంగా రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూళ్ళలో మొదలు పెసా వంటి కేంద్ర చట్టాల ద్వారా ఆదివాసులకు జల్, జంగిల్, జమీన్‌లపై ఇచ్చిన అధికారాన్ని డిమాండు చేస్తున్న సాంస్కృతిక కార్యకర్తల ప్రాణాలను చట్ట పరంగా హరించే కళంకం నుంచి బయటపడింది. ఇది జ్ఞానోదయానికి తలుపులు కాకున్నా కిటికీలు తెరిచే వైపుగానైనా ఇంక మరణ శిక్ష రద్దుకొరకు ప్రజా ఉద్యమాల నిర్మాణం విస్తృత, విశాల ఐక్య ప్రాతిపదికపై జరగాల్సి ఉంది. ఇంతవరకు భారత రిపబ్లిక్‌లో ఎందరు దళితులు, బడుగు వర్గాల వాళ్లు, నిరుపేదలు, మహిళలు, ముస్లింలు, మైనారిటీలు, రాజకీయ ప్రత్యర్థులు ఉరికంబాలెక్కారో లెక్కలు తేలాల్సి ఉన్నది. 

జీతన్ మరాండీ కళాకారుల బృందం ఉరిక్ష రద్దు కోసం దేశవ్యాప్త కమిటీని ఏర్పాటు చేయడానికి 'కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్' (సిఆర్‌పిపి) ఢిల్లీలో ఈ నెల 20న తలపెట్టిన అఖిల భారత స్థాయి సదస్సు ఈ తీర్పు దృష్ట్యా ఇపుడింక విజయోత్సవ సభ అవుతుంది. కావచ్చు గానీ భారత శిక్షా స్మృతి నుంచి మరణ శిక్ష తొలగించడానికి ఇది ఒక దృఢమైన సంకల్పానికి తొలి అడుగు కావాలి. ఒక ప్రజాస్వామిక విశ్వాసంగా శిక్షా స్మృతిలో మరణ శిక్ష ఉండకూడదు అని భావించే ప్రతి ఒక్కరినీ ఈ ఉద్యమంలో భాగం చేయాలి. మిగతా ఎన్ని తేడాలు, విభేదాలయినా ఉండవచ్చు గానీ మరణ శిక్షలు ఉండకూడదన్న ఒకే ఒక్క ఆకాంక్ష, భావన, విశ్వాసం మనలందరినీ ఒకే వేదిక మీదికి తెచ్చే సంద ర్భం కావాలి. ప్రజాస్వామ్య శక్తులు అందుకు పూనుకుంటాయనే ఆశతో, విశ్వాసంతో ...
- వరవరరావు
( నేడు న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో మరణశిక్షల రద్దు విషయమై సిఆర్‌పిపి సదస్సు సందర్భంగా)  ఆంధ్ర జ్యోతి తెలుగు న్యూస్ పేపర్ తేది 20 /12 /2011 

Thursday, November 10, 2011

పిడికిలికి ‘పీడీ’ సంకెళ్లు By వరవరరావు



ముప్ఫై ఏళ్లుగా విద్యార్థి, సాహిత్య ఉద్యమాల్లో పాల్గొంటూ, ఇరవై ఏళ్లుగా గ్రామీణ నల్లగొండ జిల్లాలో వైద్యవృత్తిలో ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్‌ను ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద ప్రభుత్వం అరెస్టు చేసింది. ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులపై జిల్లాల్లో కలెక్టర్లు, నగరాల్లో పోలీసు కమిషనర్లు సంతకం చేస్తారు. కనుక ‘ఫస్ట్‌క్లాస్ మెజివూస్టేట్’ చేస్తాడని అర్థం. ఇది నేరుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమన్న మాట. ‘పీడీ’ చట్టం కింద అరెస్టు చేస్తే బెయిలు ఉండదు. గ్రౌండ్స్ ఆఫ్ డిటెన్షన్ యిచ్చాక హైకోర్టులోనైనా సవాల్ చేయాలి లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఎడ్వయిజరీ బోరు ్డముందుకు వెళ్లాలి. నెలరోజులైనా నిర్బంధించి కక్ష తీర్చుకోవడానికి ఈచట్టం ప్రయోగిస్తారు. తెలంగాణ ఉద్యమంలో ఇది మొట్టమొదటి ప్రివెంటివ్ అరెస్టు. 

పదిహేనేళ్లుగా తెలంగాణ ఉద్యమం ఎంత ఉధృతంగా నడిచిన కాలంలో కూడా ఇటువంటి ముందస్తు నిర్బంధం లేదు. బంద్ పిలుపు, మిలియన్‌మార్చ్, ముట్టడి, రైల్‌రోకో వంటి పిలుపులు ఇచ్చినపుడు గృహనిర్బంధాలు, ఒకటి రెండురోజుల కోసం ముందుగా అరెస్టు చేయడం ఉండవచ్చు. గానీ బ్రిటిష్ కాలపు రౌలట్ చట్టం వంటి ప్రివెంటివ్ డిటెన్షన్‌ను ప్రయోగించడం మాత్రం తెలంగాణ ఉద్యమంలో ఇదే మొదటిసారి. శ్రీకృష్ణ కమిషన్ ఎనిమిదవ రహ స్య అధ్యాయం అమలు పొరలు పొరలుగా విచ్చుకుని ఏయే రూపాల్లో అణచివేత రూపాలు పొందనుందో ఇది ఒక తాజా దాఖలా. సుధాకర్ ప్రివెంటివ్ డిటెన్షన్ ‘నజర్‌బంద్’ నిర్బంధమన్న మాట.

తరచు నేరాలు చేసేవాళ్ల మీద, ఎన్నిసార్లు కేసులు పెట్టి, అరెస్టులు చేసినా నేరస్వభావం మార్చుకోనివాళ్ల మీద, నేరనిరోధం కోసం చేసే అరెస్టుగా ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని నిర్వచిస్తున్నారు. ఇది రౌడీషీటర్ల మీద, నేరస్తులుగా ముద్రపడిన వాళ్ల మీద ప్రయోగించే చట్టంగా చెప్పడమే తప్ప బ్రిటిష్ కాలం నుంచీ పేర్లు ఎట్లా మారుతూ వచ్చినా ఇది రాజకీయ ప్రత్యర్థుల మీదనే ప్రయోగిస్తున్నారు. మన రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ హంతకులకు, ఫాక్షన్ హంతకులకు, రియల్ ఎస్టేట్ హంతకులకు రాజకీయ అధికారమార్పిడి కోసం హత్యలు చేసేవారికి, ఇటీవల కాలంలో దళారీ హంతకులకు కొదువలేదు. వాళ్లమీద నామమావూతంగా నవెూదయిన కేసులు కూడ తక్కువేమీ కాదు. వాళ్లనెవరినీ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద నిర్బంధించలేదు. కొందరిమీద నైతే కేసులే నడపలేదు. 

కేసులు కోర్టుల్లో విచారింపబడినా కొందరు ఎన్నడూ జైలుకుకూడా వెళ్లలేదు. తాజాగా సత్యం రామలింగరాజు, గాలి జనార్దన్‌డ్డి, కోనేరు ప్రసాద్‌లను కూడ ప్రివెంటివ్ డిటెన్షన్ కింద జైల్లో పెట్టలేదు. ఇప్పుడు తిహార్ జైల్లో, రాంచీ జైల్లో (మాజీ ముఖ్యమంత్రి), బెంగాల్ జైల్లో ణొఫ్ట్‌వూఫంట్‌లో మంత్రి)ఉన్న ప్రముఖులు ఎవరూ వాళ్లమీద ఎంత తీవ్రమైన ఆరోపణలు ఉన్నా ముందస్తుగా అరెస్టయినవాళ్లు కాదు. వీళ్లెవరూ అధికారంలో ఉన్న వాళ్లకు ఆ ప్రత్యేక పరిస్థితుల్లో ఇబ్బంది కలిగించి జైలుకు వెళ్లిన వాళ్లే గానీ ప్రత్యర్థులు కారు. వీళ్లంతా పాలకవర్గంలోని వాళ్లే. బ్రిటిష్‌కాలం నుంచి కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కేవలం ప్రత్యర్థుల మీద ప్రయోగించిందే తప్ప నేరస్తులమీద ప్రయోగించ లేదు.

భారత రిపబ్లిక్‌లో మొట్టమొదటిసారి ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాన్ని సుప్రసిద్ధ కమ్యూనిస్టుపార్టీ నాయకుడు ఎకె గోపాలన్ మీద ప్రయోగించారు. బ్రిటిష్‌వాళ్లు రౌలట్ చట్టం పెట్టినపుడు తీవ్రంగా వ్యతిరేకించిన జవహర్‌లాల్ నెహ్రూయే అధికారంలోకి వచ్చి, గణతంత్ర రాజ్యాంగం రచించిన ఏడాదికే ఈ చట్టాన్ని ఒక రాజకీయ ప్రత్యర్థిపై ప్రయోగించాడు. ఈచట్టాన్ని రాజకీయ విశ్వాసాలను నిషేధించడానికే తప్ప చర్యల గురించి ప్రయోగించడం లేదు. ఇది నైసర్గిక ప్రాథమిక హక్కులయిన భావవూపకటన, సంఘ నిర్మాణం, విశ్వాసాలు కలిగి ఉండడమనే వాటిపై గొడ్డలిపెట్టు అని స్వయంగా ఎకె గోపాలన్ వాదించాడు. అయినా మళ్లా 1965లో దేశవ్యాప్తంగా మార్క్సిస్టుపార్టీ నాయకులపై అభూతకల్పనల వంటి ఆరోపణలతో ప్రయోగించారు. చైనాయుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చడానికి వీరు కుట్ర చేసారని సుందరయ్య మొదలుకొని ప్రముఖ నాయకులందరినీ 85మందిని జైల్లో పెట్టారు. ఈ నిర్బంధాన్ని ప్రశ్నించడానికే మొదటిసారిగా 1965లో అఖిలభారత స్థాయిలో ఎన్‌సి ఛటర్జీ నాయకత్వంలోను, ఆంధ్రవూపదేశ్‌లో శ్రీశ్రీ నాయకత్వంలోను ‘ఆంధ్రవూపదేశ్ పౌరహక్కులసంస్థ’ ఏర్పడింది.

ప్రివెంటివ్ డిటెన్షన్, ‘పిడి యాక్ట్’ పేరుతో రాష్ట్రంలో, ‘మీసా’ పేరుతో దేశంలో అమలయింది.(మెయిన్టేనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెూక్యూరిటీ యాక్ట్-మీసా), రాష్ట్రానికి చెందిన పిడి చట్టం కిందనే. 71 ఆగస్టులో దిగంబరకవులయిన విప్లవ రచయితలు జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చెరబండరాజులను అరెస్టు చేసారు. అప్పటి పిడి చట్టం కింద ప్రభు త్వం చేసిన ఆరోపణల్లో ఒక్కటి నిజమైనా ‘నిర్బంధం’ చెల్లుతుంది. న్యాయశాస్త్ర తాత్విక దృక్పథం ప్రకారం ‘ఒక నేరారోపణపై ఎందరు నేరస్తులయినా తప్పించుకోవచ్చు, కానీ ఒక్క అమాయకుడు కూడా నిర్బంధించబడకూడదు’. అట్లాగే ‘ఒక్క ఆరోపణ అబద్ధమైనా నిందితుని పక్షం న్యాయసూత్రం మొగ్గుచూపాలి’. ఈ తాత్విక దృక్పథంతోనే జస్టిస్ చిన్నపడ్డి 71 సెప్టెంబర్‌లో రాష్ట్ర పిడి చట్టాన్ని కొట్టివేసి ‘విశ్వాసాల కోసం ఎవరినీ నిర్బంధించడానికి వీలులేదు’ అని చరివూతాత్మకమైన తీర్పు యిచ్చి వీళ్లను విడుదల చేసాడు. 1973 అక్టోబరులో ప్రభుత్వం మళ్లా మీసా కింద చెరబండరాజు, ఎంటి ఖాన్, వరవరరావులను అరెస్టు చేసింది. 

‘తక్షణ ప్రమాదం ఉందని భావిస్తే తప్ప రచనలు, ప్రసంగాలు, విశ్వాసాల గురించే ముందస్తు నిర్బంధం తగద’ని జస్టిస్ ఆవుల సాంబశివరావు వీరిని విడుదల చేసాడు. అందుకే విశ్వాసాలకు, చర్యలకు సంబంధాన్ని ముడిపెట్టే సికిందరాబాదు కుట్రకేసు పెట్టి మళ్లా 1974 మేలో ఆరుగురు విప్లవ రచయితలను (పై ముగ్గురితో పాటు కెవి రమణాడ్డి, త్రిపురనేని మధుసూధనరావు, ఎం.రంగనాథంలను కూడా చేర్చి) సికిందరాబాదు కుట్రకేసు పెట్టారు. ఇపుడెట్లాగయితే చెరుకు సుధాకర్‌ను జనశక్తి, మావోయిస్టు పార్టీలతో అనుబంధాన్ని ఆరోపిస్తున్నారో.. అపుడట్లా ఆరుగురు రచయితలపై కొండపల్లి సీతారామయ్య, కెజి సత్యమూర్తిల నాయకత్వంలో ఉన్న ఎంఎల్ పార్టీ చర్యలతో సంబంధాన్ని అంటకట్టి కలిపి నేరారోపణలు చేసారు.

ఎమ్జన్సీలో దేశవ్యాప్తంగా ‘మీసా’కింద లక్షా యాభై వేలమందిని వివిధ జైళ్లలో పెట్టారు. వీరిలో ఆర్‌ఎస్‌ఎస్ మొదలుకొని ఎంఎల్ పార్టీల వరకున్నారు. చివరకు కాంగ్రెస్‌పార్టీలో ఉండి ఎమ్జన్సీని వ్యతిరేకించినవాళ్లూ ఉన్నారు. జలగం వెంగళరా వు కాలంలో బ్లాక్‌మ్కాట్ చేసేవాళ్లను, ఎన్టీఆర్ కాలంలో గూండాయాక్ట్ కింద ప్రివెంటివ్ డిటెన్షన్ పెట్టిన సందర్భాలు లేకపోలేదు. కాని వెంగళరావు కాలంలో కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇస్తే విడుదలయ్యేవాళ్లు. ఎన్టీఆర్ హయాంలో గూండాయాక్ట్ కింద అరెస్టయినవాళ్లు ఎవరూ నెల, రెండునెలల కన్నా ఎక్కువగా జైళ్లలో లేరు. ఇదే కాలంలో కె.బాలగోపాల్‌ను, ఎస్‌ఎ రవూఫ్‌ను మీసా కింద అరెస్టు చేసారు. బాలగోపాల్‌నయితే మీసా (టాడా) కింద అరెసు ్టచేసారు. కానీ ఆయన తల్లి నాగరత్నమ్మ హైకోర్టులో సవా ల్ చేస్తే విడుదల చేసారు.. ఎస్‌ఎ రవూఫ్ రెండేళ్ల కన్నా ఎక్కువే జైల్లో ఉన్నారు. ఈ కాలంలోనే ఇంకెందరో ట్రేడ్‌యూనియన్ నాయకులు కూడా ఇట్లా ముందు నేరారోపణలు లేకుండా జైళ్లలో మగ్గారు. 

అరవైఏళ్ల చరివూతలో ‘ప్రివెంటివ్ డిటెన్షన్’ రౌడీషీటర్ల పై, తరచు నేరాలు చేసేవాళ్లపై కాదు, రాజకీయ విశ్వాసాలు కల వాళ్లపై, రాజకీయ ఉద్య మాల్లో పాల్గొంటున్న వాళ్లపై, అధికారాన్ని ప్రశ్నిస్తున్న వాళ్లపై మాత్రమే ప్రయోగి స్తున్నారనేది స్పష్టమే. అట్లని వాళ్లనయినా ప్రివెంటివ్ డిటెన్షన్ కింద పెట్టాలని కాదు. స్పష్టమైన, నిర్దిష్టమైన నేరారోపణ లేకుండా ఎవరినీ నిర్బంధించడానికి వీలులేదని, ఎమ్జన్సీలో ఒక రిట్ పిటిషన్ వేసి స్వయంగా వాదించుకోవడానికి హైకోర్టుకు వెళ్లినపుడు పత్తిపాటి వెంక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆవుల సాంబశివరావు అడిగారు ‘మీతోపాటు జైళ్లలో ఉన్న బ్లాక్‌మ్కాటీర్లను కూడ మీవపూనే చూడాలంటా రా?’ అని. ‘అసలు ఎవరినీ ప్రివెంటివ్‌గా అరెసు ్టచేయవద్దన్నదే ఎపిసిఎల్‌సి సూత్రబద్ధమైన అవగాహన’ అని జవాబు చెప్పాడు. చెప్పడానికే ఈ చరిత్ర అంతా కాని ప్రభు త్వాలు పిడిలు, నిషేధాలు, టాడా, పోటా, ఎస్మా, యుఎపిఎ వంటి చట్టాలన్నిటినీ హింసాత్మక చర్యలు అరికట్టడానికి కాదు, అధికారంలో ఉన్నవాళ్ల ప్రయోజనాలకు భిన్నమైన విశ్వాసాలు కలిగి ఉన్నవారిపైనే ప్రయోగిస్తున్నారు. జైళ్లలో పెడుతున్నారు, వేధిస్తున్నారు.

చెరుకు సుధాకర్ విషయమే తీసుకుందాం. ఆయన చిరకాలం విర సం సభ్యునిగా ఉన్నాడు. విద్యార్థిగా ఉన్నప్పుడు పిడిఎస్‌యులో ఉన్నాడు. ఆయనమీద ఎస్పీ ఎన్నో ఆరోపణలు చేస్తున్న సందర్భంలో ఆయన గతం లో మావోయిస్టు, జనశక్తి రాజకీయాలతో ఉన్నాడని కూడా చెబుతున్నారు. గతంలో ఏమైనా ఇపుడాయన తెరాస పొలిట్‌బ్యూరో సభ్యుడు. అంటే ఆయనకు కొన్ని రాజకీయ విశ్వాసాలున్నాయి. ఈ సమాజం సమూలంగా మారాలన్న విశ్వాసం ఉన్నది. అందుకోసం ప్రజలు ఏ పోరాట రూపాన్నయినా చేపట్టవచ్చునన్న విశ్వాసం ఉన్నది. సామాజిక తెలంగాణ ఏర్పడాలన్న విశ్వాసం ఉన్నది. ఈ విశ్వాసాలకు అనుగుణంగా ఆయన తెరాస గానీ, రాజకీయ జెఎసి గానీ యిచ్చిన పిలుపులకు స్పందించి నల్లగొండజిల్లాలో, ముఖ్యంగా నకిరేకల్‌లో ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నాడు. ఆ నిర్దిష్టమైన కేసు గురించి ఆయన జైలుకుపోయాడు. అది విచారణ జరుగుతున్నది. ఆయనకు నకిరేకల్‌లో ఆసుపత్రి ఉన్నది. ఆయన బహిరంగ రాజకీయ, సామాజిక జీవితంలో నిత్యం ఎందరికో అందుబాటులో ఉన్నాడు. ఎక్కడికీ పారిపోయేవాడు కాదు.

మావోయిస్టులైనా, జనశక్తి వాళ్లయినా తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలని మాత్రమే డిమాండు చేస్తున్నారు. వాళ్లు సూచిస్తున్న పోరాటమార్గాల్లో రాష్ట్ర సాధన కోసం సాయుధ పోరాటం చేయాలని ఏమీ చెప్పడం లేదు. రాస్తారోకో లు, రైల్‌రోకోలు, సహాయనిరాకరణలు, శాసనోల్లంఘనలు, ఆమరణ నిరాహారదీక్షలు, బంద్‌లు, సమ్మెలు, వీటిమీద ఎవరైనా ఏ వ్యాఖ్యానాలయినా చేయవచ్చు గానీ ఇవి ప్రజాస్వామ్య పోరాట రూపాలు కాదని ఏ ప్రజాస్వామ్యవాదీ అనలేడు. మీడియా, ప్రభుత్వం, కొన్ని రాజకీయ పార్టీల నాయకులు అనడంలేదని కాదు, అవి తమకు అనుకూలం కాని సందర్భాల్లో మాత్రమే అంటున్నాయి. ప్రపంచబ్యాంకు భావజాలం గలవారు తప్ప మనుషుల మీద గాక అన్యాయార్జిత ఆస్తుల మీద ప్రేమ ఉన్న వాళ్లు తప్ప తెలంగాణ ఉద్యమంలోని పోరాట రూపాలను మావోయిస్టు, జనశక్తి బూచి చూపి ఎవరూ తప్పుపట్టలేరు. చెరుకు సుధాకర్ ప్రివెంటివ్ డిటెన్షన్ మళ్లా ఒకమారు ప్రభు త్వాలు చర్యలకన్నా విశ్వాసాలను నిరోధించి నిషేధించడానికి తమ రాజ్యాంగయంత్రాన్ని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తాయని మనను హెచ్చరిస్తున్నది..

-వరవరరావు     Namasete Telangana News Paper Dated 11/11/2011

Saturday, November 5, 2011

విద్యుల్లత-విరసం సిటీ యూనిట్-గోపు By వరవరరావు,



పన్నెండు చేతులతో పనిచేసే గోపు లింగాడ్డి నిష్క్రియాపరుడై పోయి రెండున్నరేళ్లు గడిచిపోయినవి. 2009 ఫిబ్రవరిలో హఠాత్తుగా కోమాలోకి వెళ్లిపోయి, నిరంతరం మృత్యువుతో పోరాడుతూ మళ్లీ మాట, కాళ్లు, చేతులు కూడదీసుకుంటుండగా గుండె ఆగి చనిపోయాడు. అన్ని పనులకు సెలవు ఇచ్చి విశ్రాంత జీవితంలోకి, కాదు జీవన వ్యాపకాల నుంచే శాశ్వత శాంతిలోకి వెళ్లిపోయాడు. విద్యుల్లతతో, విరసంతో, తెలంగాణ రా ష్ట్ర ఉద్యమంతో మా అనుబంధం కళ్ల ముందు కదలాడింది. ఇద్దరమూ తెలుగు అధ్యాపకులుగా కాకతీయ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల్లో పనిచేసాం కానీ, నా కన్నా పదేళ్లు చిన్నవాడు. 

నేను సికెఎం కాలేజీలో చేరిన కొత్తలోనే ‘త్రీ మస్కటీర్స్’గా మేము తర్వాత నామకరణం చేసిన బి.విజయకుమార్, గోపులింగాడ్డి, ఉమ్మెంతల వెంకటడ్డితో పరిచయమై అది ఎమ్జన్సీ విధించే దాకా గాఢానుబంధంగా కొనసాగింది. ఈముగ్గురు అప్పుడు జమ్మికుంట ఆదర్శ కళాశాల విద్యార్థులు. అంటే కథలు, నాటికలు, బతుకు, జీవన సమ రం నవలలు రాసిన సుప్రసిద్ధ రచయిత ఎం.వి. తిరుపతయ్య ప్రత్యక్ష శిష్యులు. తిరుపతయ్య అంటే వరంగల్ ‘మిత్ర మండలి’ కన్వీనర్‌గా, సృజన సాహితీ మిత్రునిగా ప్రారంభమై జమ్మికుంట ఆదర్శ కళాశాలలో తన సుతిమెత్తని, అనితర సాధ్యమెన పాఠాలతో, అంతవూస్సవంతి వంటి సాహిత్య సాంస్కృతిక ఆచరణతో ఆ కళాశాలలో నల్లా ఆదిడ్డి, శనిగరం వెంక (సాహు), మాసాని రవీందర్, తిరుపతి, నేలకొండ రజిత వంటి ఎందరో విప్లవ విద్యార్థులను ఓపికగా మలచిన వాడు. చిరునవ్వుతో, చేతిలో సిగిట్‌తో జమ్మికుంట కళాశాలను అక్షరాలా ‘విద్యుల్లత’గా విప్లవాకాశంలోకి విస్తరింప చేసినవాడు. ఆయన కనుసన్నల్లో ఆయన గైడెన్స్‌తో 1969లో అటు శ్రీకాకుళం పోరాటం, ఇటు కె.కె. డబ్ల్యు (ఖమ్మం,కరీంనగర్,వరంగల్) ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రెక్కలు విప్పుతున్న కాలంలో ఈ ‘త్రీ మస్కటీర్స్’విద్యుల్లత’ను ప్రారంభించారు. బి.విజయకుమార్ సంపాదకుడు. ఆయన తండ్రికి కరీంనగర్ మంకమ్మతోటలో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. విరసం ఏర్పడే నాటికే ఈ బృందం చాలా సాహసాలు చేసింది. తెలంగాణ ఉద్యమానికి ఫ్రెంచి విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రేరణ ఇవ్వడానికి ‘రెక్క విప్పిన రెవల్యూషన్’ శ్రీశ్రీ అనువాదాన్ని ప్రచురించడం, ‘ప్రజ ను సాయుధం చేస్తున్న రెవల్యూషనరీ నేడు కవి’ అని విరసం ఆవిర్భావాన్ని నిర్వచిస్తూ 1970 జూలె 4న, ‘మార్చ్’ కవితా సంకలనాన్ని వెలువరించడం మాత్రమే కాదు, వరంగల్, కరీంనగర్‌ల నుంచి కరపవూతాలు వేసుకొని వచ్చిన విప్లవ సాంస్కృతి క కార్యకర్తల్లో ఈ ముగ్గురూ ఉన్నారు. అట్లా ఈ ముగ్గురూ విర సం సంస్థాపక సభ్యులయ్యారు. ఖమ్మం సుబ్బారావు పాణిక్షిగా హి నగర్‌లో జరిగిన విరసం ప్రథమ మహాసభల్లో బి.విజయకుమార్ ‘విద్యుల్లత’ సంపాదకుడుగా విరసం కార్యవర్గ సభ్యు డై, వరంగల్‌లో రెండవసారి జరిగిన సాహిత్య పాఠశాల (1979) దాకా కొనసాగాడు. 

‘మార్చ్’ కవితా సంకలనం పెండ్యాల కిషన్‌రావు సంపాదకత్వంలో వరంగల్‌లో రూపొందినా అచ్చయింది మాత్రం కరీంనగర్‌లో బి. విజయకుమార్ ఆధ్వర్యంలోనే. అందుకోసమూ, ఆ తర్వాత వెలువడిన తాడిగిరి పోతరాజు గారి ‘ఎపూరబుట్ట’ కథ కోసం నిషేధింపబడిన ‘బద్ లా’ కథా సంకలనం కోసమూ, ఎమ్జన్సీ దాకా అన్ని రకాల విప్లవానుబంధ ప్రజాకార్యకలాపాల కోసమూ ఎమ్జన్సీలో తీవ్ర నిర్బంధానికి గురైన వాళ్లు బి. విజయకుమార్, నారదాసు లక్ష్మణరావులు. చిన లక్ష్మణరావుగా పిలుచుకునే నారదాసు లక్ష్మణరావు వీపుపై ఎమ్జన్సీలో పోలీసులు పెట్రోలు పోసి తగులబెట్టారు. (ఇప్పటికీ ఆ వీపు మీద ఆ గాయపు కాయ ఉంటుంది. ఇపుడు పోలీసు అఘాయిత్యాల గురించి మాట్లాడుతున్న తెలంగాణ వాదులు భూస్వా మ్య, సామ్రాజ్యవాద దళారీ ప్రభుత్వ స్వభావాలను ఇటువంటి అనుభవాలతో అర్థం చేసుకోగలిగితే ఈ పోరాటం శత్రువును పోల్చుకొని ముందుకుసాగే పాఠాలనిస్తుందని గుర్తు చేయడానికే ఈ విషయం రాస్తున్నాను.) ఓపికగా లెక్కపెడుతూ బి. విజయకుమార్ తలపై ఉన్న వెంట్రుకలన్నీ ఒక్కక్కటే పీకుతూ ఆయనది బోడితల చేసిగానీ పోలీసులు తమ కసితీర్చుకోలేదు. ఉమ్మెంతల వెంకటడ్డిని తాడిగిరి పోతరాజు, శనిగరం వెంక పాటు బంగ్లాదేశ్ యుద్ధం (1971) రోజుల్లో ‘పిడి’ చట్టం కింద అరెస్టు చేశారు. అట్లే గోపు లింగాడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాడు. 

బీఎస్సీ పూర్తి చేసి ఓయూ ఆర్ట్ కాలేజీలో ఎం.ఎ. తెలుగులో చేరిన దగ్గర్నించీ 1974 దాకా విరసం సిటీ యూనిట్‌కు గోపు లింగాడ్డి కన్వీనర్‌గా వ్యవహరించాడు. ఆర్టిస్టు చంద్ర ఇంట్లో నూ, కథా, నాటక రచయిత సి.ఎస్. రావు ఇంట్లోనూ తరచుగా విరసం సిటీ యూనిట్ సమావేశాలు జరుగుతుండేవి. అప్పుడు విరసంలో జ్వాల, నిఖిల్, చెర, ఎం.టి.ఖాన్, శ్రీపతి, చంద్ర, సి.ఎస్. రావు మొదపూన వాళ్లంతా సిటీ యూనిట్ సభ్యులేనని గుర్తు చేసుకున్నపుడు కన్వీనర్‌గా గోపు లింగాడ్డిది ఎంత కత్తి మీద సామో అర్థమవుతుంది. విరసంలో 1985 దాకా అన్నీ ఘర్షణలూ పొలిమికలే. అంటే మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఉద్యమంలో పంథా గురించి గాక ఎత్తుగడల గురించిన చర్చలే. 

సాయుధ పోరాటాలే ఏకైక మార్గం అంటే చారు మజుందార్ లైన్ అనీ, వ్యవసాయ విప్లవం అంటే చండ్ర పుల్లాడ్డి లైన్ అనీ, భూ పోరాటాలే అంటే నాగిడ్డి లైన్ అనీ, అట్లా ఆ ముగ్గురూ చెప్పినా చెప్పకపోయినా, స్వయంగా కె.ఎస్. ఆ విభజన యాం త్రికమెందని అన్నా అట్లా అనుకున్న యవ్వనోవూదేక కాలమది. 1971 ఆగస్ట్‌లో పిడి చట్టం కింద అరెస్టయి, విడుదలయ్యాక జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌లు అప్పుడు టి.ఎన్. లైన్‌గా, ఇప్పుడు డి.వి. లైన్‌గా పేర్కొంటున్న విప్లవ పంథా వెపు మొగ్గారు. అంతే తీవ్రంగా చెరబండరాజు చారుమజుందార్ లైన్ మొగ్గి ‘ఊరు మేలుకున్నది’ వంటి దీర్ఘ కవిత, మరికొన్ని పొలిమికల్ కవితలు కూడా రాసాడు. విరసం సిటీ యూనిట్ ఇటువంటి సిద్ధాంత విభేదాల యుద్ధ భూమిగా ఉండేది. యూనిట్ స మావేశం ముగియగానే ముగ్గురు పూర్వాక్షిశమ దిగంబర కవులు చెట్టపట్టాలేసుకొని సైకిళ్లపై వెళ్లిపోయే పాత స్నేహితు లే. 1974 జనవరిలో కర్నూలులో విరసం మహాసభలు జరిగే నాటికి వేరు కుంపట్లు పెట్టుకునే వాతావరణం ఏర్పడింది. సభా ప్రవేశం ముందు మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్ బొమ్మలు కర్నూలు విరసం యూనిట్ పెడితే, సిటీ యూనిట్ మరొక చారు మజుందార్ బొమ్మ పెట్టింది. అంతేకాదు ‘ఉన్నదొక్కటే దారి చారు మజుందారి’ అని కూడా రాసింది.‘చారుమజుందారి’ అనే పదబంధం తయారు చేసినవాడు శ్రీశ్రీ. ఆయ న శబ్దలౌల్యం మనకు తెలిసిందే. ఆ తర్వాత ‘చారుమజుందారి’ పేరుతో బి. నర్సింగరావు సంపాదకత్వంలో కవితా సంకలనమే వెలువడింది.ఇంక కర్నూ లు సభల్లో భోజనాల సమయంలో ‘చారు’కావాలన్న దగ్గర్నించి ఊరేగింపులో ‘ఉన్నదొక్క దారి చారు మజుందారి’ నినాదాల దాకా ఆ వీరావేశం ఆ అభినివేశం అందులో గోపు లింగాడ్డి, కొల్లూరి చిరంజీవి, నల్ల మల్లాడ్డి, ప్రభంజన్ వంటి వాళ్లను ఇప్పుడు ఊహించుకుంటే ఎంత చిత్తశుద్ధితో కూడిన సెక్టేరియనిజం ఉన్న రోజులవి అని అబ్బురమనిపిస్తుంది.

అయితే కర్నూలు సభల తర్వాత కె.ఎస్. ఈ అన్ని విషయాలను సమీక్షిస్తూ సుతిమెత్తగా, చురకలు పెట్టాడు. (ఇటువంటి యువకోవూదేకానికంతా విరసంలో నాయకత్వం ఇచ్చిన బాధ్యత చెరబండరాజు, నేను తీసుకోవాల్సిందే కదా.) ‘చారు మజుందా రి అయితే మావో ఆలోచనా విధానం సంగతి ఏమిటి మరి’ అన్నాడు కె.ఎస్. ‘కవిత్వంలో పదబంధమెంది రాజకీయాల్లో పంథా అనుకుంటే ఎట్లా? ఈ కాలపు మార్క్సిజం లెనినిజమైన మావో ఆలోచనా విధానాన్ని భారత విప్లవానికి నక్సల్బరీ పం థా ద్వారా అన్వయించ ప్రయత్నం చేసినవాడే.. ఈ దేశ పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు అవుతాడు చారుమజుందార్’ అన్నాడు కె.ఎస్. ‘ఊరేగింపులో ఆనినాదం ప్రజల నుంచి వస్తే వేరు గానీ విరసం వంటి సంస్థలో బాధ్యులుగా ఉన్నవాళ్లే ఇచ్చి ఉండాల్సింది కాద’న్నాడు.

ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో కొండపల్లి సీతారామయ్య సహచరుడు, ఆ తర్వాత కాలంలో సిద్దిపేటలో హిందీ పండిట్‌గా పనిచేసిన వెంక కుమార్తె అరుణతో లింగాడ్డి వివాహం కూడా ఒక విప్లవ సాంస్కృతిక కార్యక్షికమమే. అప్పటికే అక్కడ సుప్రసిద్ధ న్యాయవాదిగా ఉన్న చల్లా నరసింహాడ్డి ఆధ్వర్యం లో ఆ సభ జరిగింది. అపుడప్పుడే సిద్దిపేటలో సూరపనేని జనార్దన్ నాయకత్వంలో అజ్ఞాత విప్లవోద్య మం ప్రవేశిస్తున్నది. (చల్లా నరసింహాడ్డిఎమ్జన్సీలో జైలు పాలయ్యారు కూడ.) తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరిన తర్వాత గోపు లింగాడ్డి జానపద సాహిత్యంలో కృషికి అంకితమయ్యాడు. బిరుదురాజు రామరాజు, నాయని కృష్ణ కుమారిల మెప్పు పొందాడు. శ్రామిక గేయాల మీద పరిశోధన చేసాడు. ఇంక కరీంనగర్‌లో ఆయన బహుముఖ కార్యకలాపాల్లో ఒకటైన సాహిత్య క్షేత్రం గురించి నాకంటే చెప్పగలిగిన సన్నిహితులు చెప్తూనే ఉన్నారు.

తెలంగాణ విద్యావంతుల వేదికకు ఆయన కరీంనగర్ జిల్లా కన్వీనర్‌గా చాల క్రియాశీలంగా పనిచేసాడు. రెగ్యులర్‌గా ‘ప్రజాతంవూత’లో రాస్తుండేవాడు. చొరవ ఉన్న మనిషి. శ్రామిక గేయా లు పరిశోధనా గ్రంథం పునర్మువూదణ జరిగినపుడు నాతో ముందుమాట రాయించాడు. ఆ పుస్తకావిష్కరణకు కూడా పిలిచాడు. ఆయన కుటుంబంలో వచ్చిన సమస్యల వల్ల కూడా మళ్లా ఆయన నాకు సన్నిహితుడయ్యాడు. నేను సహాయమూ చేయలేకపోయాను గానీ తరచూ మాట్లాడుకుంటుండేవాళ్లం.

‘జగిత్యాల జెత్రయాత్ర’ ముప్పై ఏళ్ల తర్వాత తెలంగాణ విద్యావంతుల వేదిక జగిత్యాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తెలంగాణ సదస్సులో పాల్గొనడానికి కోదండరామ్, పిట్టల రవీందర్‌లతో పాటు వెళ్తూ కరీంనగర్‌లో లింగాడ్డిని ఆయన ఇంట్లో ఆఖరిసారి చూశాను. పరస్పరం చూసుకొని, మాట్లాడుకోవడం కాదు. కేవలం ఆ స్థితిలో చూడడమే. అందుకే అప్పటికీ ఇప్పటి కీ నాకు విరసం సిటీ యూనిట్ వేడి వేడి సమావేశాలు, కర్నూలు విరసం మహాసభలు వాటిలో గోపు లింగాడ్డి యవ్వనోవూదేక విశ్వాస ప్రకటనలు, నినాదాలే గుర్తుకొస్తున్నాయి. మనుషుల్ని అట్లా సజీవ చెతన్యంతో గుర్తుపెట్టుకోవడమే బతికున్న వాళ్ల ఆరోగ్యానికి మంచిదనుకుంటాను.

-వరవరరావు
Namasete Telangana News  Paper Dated  06/11/2011

Thursday, October 20, 2011

ఎన్.ఎచ్.సెవెన్-జోడేఘాట్ బాట By -వరవరరావు Namasethe telangana Dated 21/10/2011

ఎన్.ఎచ్.సెవెన్-జోడేఘాట్ బాట
ఎన్.ఎచ్.సెవెన్-నోరు తిరిగిన వాళ్లు ఇట్లాగే పిలుస్తారు. తిరగని వాళ్లు సామాన్య గోండు ప్రజానీకం ఈ ‘జాతీయ రహదారి’ని చూసి కూడా ఉండరు గనుక వాళ్లు జోడేఘాట్ బాట గురించి, అడవి దారుల గురిం చి తప్ప దాని గురించి ఏమీ చెప్పలేకపోవచ్చు. చెప్పినా ఈ రాజమార్గం నిర్మా ణ సందర్భంగా తమ నిర్వాసిత హృదయవిదారక గాథలే చెప్పవచ్చు.
కాని మన బోటి వాళ్లకు ఈ ఫోర్‌లేన్ రోడ్డు మీద ప్రయాణం ఎంత హాయి గా ఉంటుందని..హంసతూలికా తల్పం మీద తేలిపోతున్నట్లు. హంసలంటూ ఉంటే ఆ తూలికాతల్పం కోసమే ఎన్ని పీకలు తెగి హంసలు హింసకు బలి అయిపోవాలో-ఆ శయ్య మీద ఉన్నపుడు మనకెట్లా తెలుస్తుంది. బైపాస్ రోడ్లు-ఎక్కడా అందమైన పల్లెటూర్ల బోర్డులే తప్ప (అందమైనవి పల్లెటూర్లు గాదు సైన్‌బోర్డులు) ఏ ఒక్క ఊరు తగలదు. కవులమైతే ఎన్. గోపీ వలె కలవరపడతాం.

ఇదివరకు పల్లెల గుండెల్లోంచి వెళ్లేవాళ్లం
గతుకుల రోడ్లయినా అవి మట్టి స్పందనల్లా ఉండేవి
పొలిమేరలు దగ్గరవగానే
గాలి..మనుష్యుల ఊపిరిలా పరిమళించేది
చాయ్ తాగిన గుడిసె హోటళ్లూ
ఒక్క ఆవలింతలో..అలసటను ఊదేసి
ఊరినంతా పీల్చుకునేవాళ్లం/ఇంత గొప్ప అనుభవం
ఒక్క బైపాస్ రోడ్డుతోదూరమైంది
రక్త ప్రసారానికి/అడ్డొస్తే గదా బైపాస్!
కాని ఇది రక్త బంధాలను తప్పుకపోయే స్పీడ్ రేస్..
ఎక్కడికి? ఢిల్లీకి. పల్లెల్నించి కాదు. పల్లెల్ని మినహాయించి.
కలపాల్సిన రోడ్లు/ఇప్పుడు చీలిన పాశాలవుతున్నాయి
మనుష్యుల్ని వదిలేసి/ఇంత వేగంగా ఎక్కడికి?
కేంద్రీకరించిన అధికారం దగ్గరికి. అక్కడి నుంచి ఒక దురూహ దాహంతో శ్రీనగర్ దాకా సైన్యం వెళ్లి దురాక్షికమించనూవచ్చు. అయినా అక్కడి దాకా పోయే అధికారం ఆకాశంలోనే ఎగురుతున్నది. పార్లమెంట్‌లో బిల్లు పెట్టాల్సిన ప్రజా ప్రతినిధులకు ఈ జాతీయ రహదారి కూడా నామోషియే. అంతర్జాతీయ విమానాక్షిశయాలు తప్ప నిరాక్షిశయుల సంగతి పట్టదు.ఆర్మూరు దాటిన దగ్గర్నించీ ఆదిలాబాద్ మార్గం మరీ ఆశ్చర్యమేసింది. నిర్మల్ ఘాట్‌రోడ్ ఏది? కొండలను తవ్వేసి బండలను పిండేసి, ఆదివాసుల నెత్తుర్లే కంకరగా ఈ రోడ్డు వేశారా! పొచ్చెర్ల జలపా తం సైన్ బోర్డు దగ్గరి నుంచి స్పష్టంగా చూశాను. వృక్షాల మొదళ్లు మిగిలి ఉన్నాయి. పొచ్చెలు, బొబ్బెలు నరికేసిన గోండుల మొండి దేహాల వలె.మన సుఖం మనుషులకెంత కష్టం. అయితే మనమెవరం? మన ప్రయాణమెక్కడికి? జోడేఘాట్‌కు. కొము రం భీం నుంచి స్ఫూర్తి పొందడానికి. ఆదిలాబాద్ కలెక్ట ర్ చౌరస్తా పజల చౌరస్తా కాదది-జిల్లా అధికారిది) లో ఈ నెలలోనే కొమురం భీం విగ్రహం పెట్టారు. కొమురం అంటే సొగసయినవాడు అని అర్థం. భీం అంటే చెప్పనక్కర్లేదు కదా. ఆయన చేతిలో తుపాకి కూడ ఉంది. కొమురం భీం ‘బస్ట్’ మాత్రమే అయితే ఆయన అంతిమంగా ఎంచుకున్న పోరాట మార్గం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుతంగా పోరాడుతున్న వాళ్లకు సరియైన స్ఫూర్తినిస్తుందో లేదోనని అనుకున్నట్టున్నారు. ఆయన నిలు సాయుధ విగ్రహం పెట్టారు. కొమురం భీం స్ఫూర్తి ఏమిటి? ‘మా ఊళ్లో మా రాజ్యం’.

అడవిలో తాము పోడు చేసుకున్న భూముల్ని జాగీర్దార్లు ఆక్రమించుకున్న దగ్గర్నించి- విన్నపాలు, మహజర్లు, న్యాయస్థానాలు, జంగ్లాతు వాళ్ల నుంచి అవ్వల్ తాలూకాదార్ దాకా నైజాం దాకా కాళ్లరిగేలా తిరిగే ప్రయత్నాలు - అన్నీ అయిపోయి మళ్లీ నేల మీదికే వచ్చి ఆత్మరక్షణ కోసం దాడినెదుర్కొని కేసయి జైలుపాలు కాకుండా తప్పించుకొని పారిపోయి అస్సాం తేయాకు తోటల్లో తోటి కార్మికుల కష్టాలను, సంఘటిత చెతన్యం చూసి అడవిపుత్రులలో పీడనకు, దోపిడీకి, ప్రతిఘటనకు పోరాటానికి ఎల్లలు లేవని తెలుసుకొని తిరిగివచ్చి పన్నెం గూళ్లల్లో తన ప్రజల్ని కూడగట్టి నైజాంతో,ఆయనకు అండగా నిలిచిన బ్రిటిష్ వాళ్లతో సాయుధంగా పోరాడిన యోధుడు. ఆయన ఏ ఒక్క పోరాట రూపాన్నీ వదిలిపెట్టలేదు. తమ పోడు భూముల్ని ఆక్రమించుకున్న వాళ్లతో మొదలుకొన్ని అన్ని స్థాయిల్లో నైజాం దాకా చర్చలు జరిపాడు. సహాయం చేసిన వకీలును, పత్రికా సంపాదకుణ్ని నిరంతరం సంప్రదించాడు. ప్రతి సందర్భంలోనూ తన ప్రజల్ని సమీకరించి సమావేశపరిచి తాను జరిపిన చర్చలన్నీ వివరించాడు. 2010 జనవరి 5 వలె, 2011 అక్టోబర్ మొదటివారం వలె ప్రభుత్వంతో, కాంగ్రెస్ పెద్దలతో ఏం మంతనాలు జరిగాయో చెప్పకుం డా దాచలేదు. తన ప్రజలకు సంబంధించినంత వరకు చర్చలూ పారదర్శకంగానే చేశాడు. వాళ్ల అమోదంతోనూ, అండతోనూ పోరాటం చేశాడు. ఈ క్రమమంతా ఆయన గ్రహించిందల్లా, తనతో ఉన్న పీడిత, పోరాట ప్రజల అవగాహనకు తెచ్చిందల్లా భూమి మీద అధికారం రావాలంటే రాజ్యం మీద అధికారం రావాలి అని.


పన్నెండూళ్లే కావచ్చు కాని ఆ ఊళ్లపై అక్కడి ప్రజల కు అధికారం కావాలి. భీం కుటుంబ సభ్యులందరికీ వాళ్లు దున్నుకునే భూమి పట్టా చేస్తానని ఆశ చూపింది ప్రభుత్వం. ప్రజలందరి తరఫున మాట్లాడవద్దన్నది మంత్రి పదవులు, తాయిలాలు తీసుకుని న్యాయమెన తెలంగాణ ప్రజల పోరాటానికి ద్రోహం చేస్తున్న రాజకీయ నాయకుల వలె ఆయన రాజీ పడలేదు. ఆఖరి శ్వాస దాకా పోరాడి అమరుడయ్యాడు. ఓడిపోయాడు. కాని లొంగిపోలేదు. కాని మన భూమి, మన నీళ్లు, మన వనర్లు, మన పాలన మనకు అంటే ఏమిటో డ్బై ఏళ్ల క్రితమే స్పష్టమెన దార్శనికత ఇచ్చిపోయాడు. పోరాటం ఎందుకో చెప్పాడు. ఎట్టా చేయాలో చెప్పాడు. ఎక్కడ చేయాలో చెప్పాడు. శత్రు పసిగట్టాడు. మిత్రులందర్నీ కూడగట్టాడు. ప్రజల మీద ఆధారపడ్డాడు. ప్రజల మధ్య నిలిచి, ప్రజల్ని సాయుధుల్ని చేసి పోరాడాడు.
ఉట్నూరూ, జైనూరు, బాచేఝరి, హట్టి, జోడేఘాట్ -1940 సెప్టెంబర్ 1న నేలకొరిగాడు. అక్కడ ఒక రాయి. ఒక కర్ర పాతి గోండులు, కోలాము లు, ఏరధానులు, ఏరమేశులు పీడిత, పోరాట ప్రజలందరూ తలుచుకుంటున్నారు. ఈ గడచిన పున్నమి అక్టోబర్ 11న ఆయన వర్ధంతి. ఆయన సంస్మరణ. భీం స్ఫూర్తి ఏమిటి? స్వపరిపాలన, రాజీలేని పోరాటం, పోరాట కొనసాగింపు. పాలకుర్తి ఐలమ్మ పొలంమడిలోని పంట ఆమె ఒడిలోకి చేర డం. బందగీ భూమి కోసం చేసిన న్యాయపోరాటం, దొడ్డి కొమురయ్య దొర ల అణచివేతకు వ్యతిరేకంగా చేసిన రైతుకూలీ పోరాటం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, మూడువేల గ్రామాల్లో పది లక్షల ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని ప్రజలు అనుభవించిన బీజ ప్రాయమెన అధికారం .అదీ కొమురం భీం స్ఫూర్తి అంటే నాయకత్వం చేసిన ద్రోహం కాదు.
నక్సల్బరీలో సంతాల్ ఆదివాసులు అందుకున్న కొమురం భీం స్ఫూర్తి మన భూమి మనకు దక్కాలంటే మనకు రాజ్యాధికారం దక్కాలన్న దార్శనికతను ఇచ్చింది. కొమురం భీం పోరాటం వలెనే అది శ్రీకాకుళంలో సెట్‌బ్యాక్‌కు గురయినా జగిత్యాల, సిరిసిల్లాల నుంచి అది జైత్రయావూతయే.

మళ్లీ ఒకసారి ప్రజలు ‘ఊరు మనది, వాడ మనది, దొర ఏందిరో, దొర పెత్తనమేందిరో’-అని బండెడ్లు ఒకటై ఎగబడిన స్ఫూర్తి. కొమురం భీం డ్బై ఏళ్లు పయనించి, నక్సల్బరీ నుంచి, వైనాడు దాకా పయనించి, తెలంగాణ అడవు ల నుంచి మళ్లా తెలంగాణ మైదానాలకు పయనించి 1981లో మళ్లా తన ఇంద్ర చేరుకున్నాడు. ఎంతో నెత్తురు ధారపోశాడు. తోట రాముని తొడ కు కాటా తగిలిందని పరధాను, పరమేసు పసరు పోసి కట్టుకట్టారు. ఇంద్ర శ్యాం, సాహు, గజ్జెల గంగారాం, జంగు దాదా కావడానికన్నా ముందే కొమురం భీం పెద్ది శంకర్ అయి పేరొంది అడవుల్లో ప్రవేశించాడు. అంతే.. తిరిగి వెనక్కు చూడలేదు. ముప్ఫై ఏళ్లుగా దేశానికి స్వపరిపాలన అంటే ఏమి టో, ప్రజల అభివృద్ధి నమూనా అంటే ఏమిటో, జల్, జంగల్, జమీన్ మీద ప్రజల సాధికారత అంటే ఏమిటో జనతన సర్కార్ ద్వారా ఇవ్వాళ దండకారణ్యలో ఆచరించి చూపుతున్నాడు. నూట ఏభై ఏళ్ల కిందటి కానూసిద్ధూల నాయకత్వంలోని సంతాల్ పోరాటం ఇవ్వాళ కానూ సిద్ధూల మిలీషియా నాయకత్వంలో జంగల్ మహల్ పోరాటమైంది. బిర్సా ముండా పోరాటం, రాంచీ బిర్సా ముండా జెల్లో ఉరికంబం మీద నిలిచిన జీతన్ మరాండీ కళా స్పందన సాంస్కృతిక ఆచరణలో ప్రతిఫలిస్తున్నది. అల్లూరి సీతారామరాజు, ద్వారబంధాల చంద్రయ్య మొదలు వెంపటాపు సత్యం వరకు మన్నెం, శ్రీకాకుళాల్లో సాగిన పోరాటం సోంపేట నుంచి నారాయణపట్నం వరకు కంపెనీ చట్టాల్ని, అడవి చట్టాల్ని ధిక్కరించి తమ భూముల్ని, హక్కుల్ని కాపాడుకున్న పోరాటాలుగా సాగుతున్నది.
వందేళ్ల క్రితం గూండాదర్ భూంకాల్ ఇవ్వాళ దండకారణ్యంలో భూకంపాన్ని సృష్టిస్తున్నది. గ్రీన్‌హంట్ ఆపరేషన్ పేరుతో ప్రజల మీద రాజ్యం ప్రకటించిన యుద్ధాన్ని నిలువరిస్తున్నది. ఇదంతా జిందాల్, ఎస్సార్, టాటా, పోస్కో, వేదాంత ఏ బడా కంపెనీ అయినా కావచ్చు, ఏ బహుళజాతి కంపె నీ అయినా కావచ్చు అడవిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న పోరాటం. అర్ధసైనిక బలగాలను, సైన్యాన్ని ప్రాణాలొడ్డి మట్టికరిపిస్తున్న పోరాటం. గ్రామరాజ్యాల నాయకత్వంలో గ్రామాభివృద్ధి సాధించుకుంటున్న పోరాటం. ఆకాశంలోనేకాదు, అడవిలోనూ సగమైన మహిళలు పాల్గొంటున్న పోరా టం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్రాన్ని ధిక్కరిస్తున్న పోరాటం. అంటే జల్ జంగిల్ జమీన్ కోసం ప్రభుత్వాలకు, కంపెనీలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం. దాని పాలకులయిన భూస్వామ్య, పెట్టుబడిదారీ పెత్తందారీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం. ఇది సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం. ఢిల్లీ రాజమార్గాన్ని పల్లెల కాలిబాటలు ప్రశ్నిస్తున్న పోరాటం.

మనం తెలంగాణలో కొమురం భీం స్ఫూర్తితో ఏం కోరుకుంటున్నాం. మన తెలంగాణలో మనం మన భూములు, మన వనర్లు, మన చదువులు, మన కొలువులు, మన భాష, మన సంస్కృతి, మన ఆత్మగౌరవం మనకు దక్కే స్వపరిపాలన కోరుకుంటున్నాం. అందుకోసం మనం సమ్మక్క సారలక్కలు మొదలు బందగీ, ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, మొండ్రాయి, మొగ్దుం మొహియుద్దీన్, నల్లా నర్సింహులు, గొల్ల ఎలమంద, సూర్యపేట రాములమ్మలలో జాక్‌లు రాళ్లు, బైరాన్‌పెల్లి ప్రజలు పోరాడిన స్ఫూర్తినే గ్రహిస్తున్నా మా? ఇంద్ర గోండులు ఏమడిగారు. అప్పటికింకా తమ చంద్రవంశపు గోండ్వానా రాజ్యాన్ని రాంజీ గోండు పాలించి, ఇంగ్లిష్ వారితో పోరాడి ఉరికంభమెక్కిన రాంజీ గోండుల రాజ్యాన్ని మళ్లా సాధించుకుంటామని ప్రకటించలేదు. ఇంద్ర మారణకాండలో చిందిన రక్తంతో మాత్రం మళ్లీ రగల్ జెండాను ఎత్తుకున్నారు. ఇంద్ర సంఘటన నాటికి గోండులు, కోలాము లు, తాము పోడు చేసుకున్న భూములపై తమకు పట్టాలివ్వాలన్నారు. తాము పండించే పత్తి, పోగాకు, మిర్చిలకు గిట్టుబాటు ధరలు కావాలన్నా రు. వలసవచ్చే ఆదివాసేతరులు, తప్పుడు తూకాలతో, మోసపు కొలతలతో తమ అడవి సంపదలు కొని మోసం చేయొద్దన్నారు. గిరిజన రైతు కూలీ సంఘాలు పెట్టుకొని 1981 ఏప్రిల్ 20న సభ తలపెట్టారు. ప్రభుత్వం సహించలేకపోయింది.
ముప్ఫై ఏళ్లలో అడవి ఎంత పలచబడిపోయింది! కాలిబాటలు తారు రోడ్లయినవి. ఇరవై శాతం ఆదివాసేతరులు వలసవచ్చి తిష్ఠ వేశారు. దళారీలు కోటీశ్వరులయ్యారు. అన్ని పార్టీల ఎం.ఎల్.ఎ.లు, ఎం.పి.లు రిజర్వ్ స్థానా ల్లో గెలిచిన వాళ్లతో సహా అగ్రవర్ణ, అగ్రవర్గ పెత్తందార్లతోపాటు అడవి సంపదను దోచుకునే, అదివాసులకు వచ్చే రాజ్యాంగ, చట్టపరమెన హక్కుల్ని హరించే వారయ్యారు. చివరకు డిటిఎఫ్ నుంచి ఎదిగి ఆదివాసీ నాయకుడైన ఎం.ఎల్.ఎ. కూడ తొండ ముదిరి ఊసర కొమురం భీం ఆశయ సాధన మళ్లా ముందుకొచ్చింది.

ఆదివాసుల్లో కూడా వర్గీకరణ జరగాలనే ప్రజాస్వామిక డిమాండ్ ముందుకు వచ్చింది. తెలంగాణలో స్వపరిపాలన అంటే ఆదిలాబాద్ జిల్లా లో గోండుల, కోలాముల నాయకత్వంలో జరగాల్సిన ప్రజాస్వామిక పోరాటమేనని కొమురం భీం గుర్తు చేసుకున్నాడు.ఉట్నూరు, జైనూరు, బాచేఝరీ, హట్టెల మీదుగా జోడేఘాట్ బాట రోడ్డు కాని రోడ్డు. అది రాజమార్గం కాదు. అందుకే అక్కడ కొమురం భీం నేలకొరిగిన చోట కొము రం భీంను స్మరించుకుంటామంటే మావోయిస్టులు మందుపాతరలు పెట్టారు వెళ్లొద్దని కలెక్టర్‌ను, ఎం.ఎల్.ఎ.ల ను, అధికారులను, రాజకీయ నాయకులను పోలీసులు వారించారు. అధికారం హట్టెలోనే లాంఛనం పూర్తి చేసుకున్నది. ఆదివాసులు జోడేఘాట్‌లో కొమురం భీంను స్మరించుకున్నారు.
మరి మందుపాతర ఎక్కడున్నట్లు? జైనూరు మార్చనాయి వెపు పోతే పెదవాగు ఉన్నది. పెదవాగు మీద మూడు వందల కోట్ల రూపాయలతో కొమురం భీం ప్రాజెక్టు కట్టారు. అదీ ప్రభుత్వం పెట్టిన మందుపాతర. కాంట్రాక్టర్లు పెట్టిన మందుపాతర. ఇరవై ముప్ఫై గోండు గ్రామాలు మునిగిపోయాయి. వేలాది మంది నిర్వాసితులయ్యారు. మరి ఆ నీళ్లు ఎక్కడికి పోయాయో, పోతున్నాయో ఆసిఫాబాద్ వెళ్లి అధికారాన్ని అడగాల్సిందే.

కుంతాల జలపాతం శకుంతల కుంతలాలు ఆరబోసుకున్న జలపాతమని చెప్తారు. మూడు వైపులా దట్టమెన అభయారణ్యాలు. అంత లోతుకు జలపాతం దూకుతున్న సుడిగుండాల దగ్గరికి వెళ్లి చూస్తే రాళ్లమీద ప్రభుత్వ సర్వే చిహ్నాలు. జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం, ఇనుప రజం తవ్వకాల కోసం, గ్రానైటు రాయి తవ్వకాల కోసం ప్రయత్నాలు. ఆ కోండల్లో ఒక సొరంగం ఉంది. వర్షాలు పుష్కలంగా కురిసిన ఈ సమయంలో ఆ సొరంగంలో ఒక శివలింగం ఉందని, శివరాత్రి రోజు ఆ సొరంగంలోకి వెళ్లి పది మంది పూజలు చేసేంత స్థలం ఉందని ఎవరైనా చెప్తే నమ్మలేం. నిర్మల్ చిత్రాలకు ఉపయోగించే కర్ర, రంగులు అక్కడి చెట్లల్లో దొరుకుతాయి. అది ఆదివాసీ సంస్కృతికి, కళలకు, సౌందర్యారాధనకు కాణాచిగా ఉన్న ప్రాంతం. అది రేపు హై సెక్యూరిటీ హైడెల్ ప్రాజెక్టు కానున్నది. ఎవరికోసం? ఏ గోండు గూడాల్లో చీకట్లను పారదోలడం కోసం.
నిర్మల్‌లో ప్రజలు కొమురం భీం స్ఫూర్తి చాలదన్నట్లు, గోండులతో పాటు, బడుగు వర్గాలను కూడా కూడగట్టడానికి సర్వాయి పాపని పోరాట స్ఫూర్తికి కూడా రూపమిచ్చారు. ఇవ్వాళ ట్యాంకుబండు మీద కూడా కొమురం భీం విగ్రహం పెట్టాలని తెలంగాణ ముక్తకం అడుగుతున్నది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీదనే ఎన్.ఎచ్. సెవెన్ మొదలవుతుంది. జోడేఘాట్‌లో నేలకొరిగిన చోటు నుంచి పునరుత్థానం చెంది, ఒళ్లు విరుచుకొని, గుండెలుప్పొంగించి జిల్లా కేంద్రం అదిలాబాద్‌కు వచ్చి తుపాకి అందుకొన్న కొమురం భీం నిలు విగ్రహం ట్యాంక్‌బండ్ దాకా వీరవిహారం చేస్తూ వస్తుందో, జోడేఘాట్ బాట ఢిల్లీ రాజమార్గాన్ని జయిస్తుందో? ఇదంతా విగ్రహరాధనేనా? పోరాట స్ఫూర్తియా? అన్నదే నాలుగు కోట్ల ప్రజల ప్రశ్న. నాయకులకు అర్థమయ్యే భాషలో అడగాలంటే మిలియన్ డాలర్ల ప్రశ్న.
-వరవరరావు