Showing posts with label సుజాత సూరేపల్లి. Show all posts
Showing posts with label సుజాత సూరేపల్లి. Show all posts

Friday, August 8, 2014

‘మా పాలన, మా అడవులు మాకే’ - సుజాత సూరేపల్లి


Published at: 09-08-2014 00:51 AM
అసలు ఈ దేశ చరిత్రలో ఆదివాసీలను మనం కాపాడింది ఎప్పుడు? ఎక్కడ? పొద్దున లేస్తే సింగపూర్‌, మలేసియా గురించి మాట్లాడే ప్రభుత్వాలు ఏటా వచ్చే మలేరియా, డయేరియాల నుంచి ఆదివాసీలను కాపాడలేకపోతున్నాయి. ఇది సిగ్గుచేటు... ఆదివాసీలను కాపాడడం              అంటే ప్రపంచ పర్యావరణాన్ని కాపాడడమే. మనం వారికి చేసే మేలు కంటే వారు  ప్రపంచానికి చేసే మేలు వేల రెట్లు అధికం.
ఒక దేశం భిన్న సంస్కృతులు, భాషలు ఆ దేశ ఆదివాసీల జనాభాని బట్టి, వారి స్థితిగతులని బట్టి ఆయా ప్రభుత్వాల పనితీరును, ప్రజాస్వామ్య పాలనను అంచనా వేయవచ్చు. గత రెండు దశాబ్దాలుగా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీల ఐక్యత, హక్కులు, ప్రతిఘటన, గౌరవం వంటి అంశాల మీద ఐక్యరాజ్యసమితి జరుపుతూ వస్తోంది. 2005-2014 దశాబ్దాన్ని ‘ఆక్షన్‌ అండ్‌ డిగ్నిటీ’ కాలంగా ప్రకటించారు. ఆదివాసీ హక్కుల అమలులో ఉన్న అడ్డంకులు అధిగమించడం అనే అంశంపై ఆదివాసీల పోరాట దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఎన్నో ఉద్యమాల అనంతరం ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక విశిస్టతలను కాపాడుకోవడానికి ఆదివాసీలు అడవిపై హక్కులు సంపాదించుకున్నారు. అయినా కూడా ప్రమాదకర స్థాయిలో రోజురోజుకూ వారి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రపంచ గణాంకాలు చూస్తే దాదాపుగా 70 దేశాలలో 300 నుంచి 350 మిలియన్ల జనాభా ఆదివాసీలు, 5000 జాతులు, 4000కు పైగా భాషా, సంస్కృతులని కలిగి ఉన్నారని యునెస్కో ప్రకటించింది. ఇందులో 70 శాతం మంది ఆసియా ఖండంలోనే ఉన్నారు. ప్రపంచ జనాభాలో ఆదివాసీలు 5 శాతం ఉండి  పేదరికంలో మాత్రం 15శాతంగా కూడా ఉన్నట్టు అంచనా. చాలా మంది అనుకుంటున్నట్టుగా ఆదివాసీలు అన్ని దేశాలలో మైనారిటీలు కాదు. బొలీవియా, గ్వాటెమాల వంటి దేశాలలో సగానికంటే ఎక్కవ జనాభాని కలిగి ఉన్నారు. ఇక నిర్వాసితత్వానికొస్తే దాదాపుగా పాల్పెనెసియన్‌ యుద్ధ కాలం (క్రీ.పూ. 431 - 404) నుంచి భూమిపై అధికారం, హక్కులు సంపాదించే క్రమంలో ఆదివాసీల భూములు ఆక్రమణకి గురి అవుతున్నాయని, అప్పటినుంచే వారి నిర్వాసితత్వం మొదలైందని పరిశోధకుల అభిప్రాయం. దీని ద్వారా పేదరికం పెరిగిపోయి, అడవి బయట ప్రపంచానికి అలవాటు పడలేక తమ ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకున్నారు. హక్కుల కోసం ఉద్యమాలు మొదలు పెట్టింది కూడా ఆదివాసీలే అని చరిత్ర చెబుతుంది. ఒక్క ఆస్ర్టేలియాలోనే 1788లో 5 లక్షలు ఉన్న ఆదివాసీ జనాభా 1920 వచ్చే సరికే 60,000కి పడిపోయింది. జీవనోపాధులు కోల్పోయి థాయిలాండ్‌ వంటి దేశాలలో 40 శాతం మంది మహిళలు సెక్స్‌ ట్రేడ్‌లో ఉన్నారు. మొత్తంగా ఈశాన్య ఆసియా సరిహద్దుల నుంచి అత్యధికంగా ట్రాఫికింగ్‌కి గురి అవుతున్నది కూడా థాయ్‌ మహిళలే. ఇదే పరిస్థితి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగడం మనం చూస్తున్నాము. భారతదేశం, అందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల ఆదివాసీల పరిస్థితిని వేరుచేసి చూడలేము.

మన దేశంలో 67.7 మిలియన్ల ఆదివాసీలు 5,653 తెగలతో ఉండి అధికారికంగా 653 ట్రైబ్స్‌గా గుర్తించబడ్డారు. ట్రైబ్‌ అనేది పరిపాలనకు సంబంధించిన పదం. అందులో 40 శాతం మంది నివాసాలని కోల్పోయి వివిధ ప్రాంతాలకి విస్తరించబడి ఉన్నారని ప్రభుత్వ లెక్కలు తెలియజేస్తున్నాయి. 1990 నుంచి విస్తృతంగా పరుగుపెడుతున్న ప్రపంచీకరణలో భాగంగా ఆధిపత్య దేశాలన్నీ అభివృద్ధి చెందుతున్న దేశాలపై కన్ను వేశాయి. ఎక్కడ ఖనిజాలు కనిపిస్తే అక్కడ స్థానిక ప్రభుత్వాలను గుప్పిట్లో పెట్టుకుని కార్పొరేట్‌ శక్తుల ద్వారా తమ పంజా విసురుతున్నాయి. అయితే ఈ వేటలో ముఖ్యంగా బలి అవుతున్నది ఆదివాసీలే. ఆదివాసీలు నివసించే ప్రాంతాలు ఎక్కువగా విలువైన ఖనిజాలు గల అడవి ప్రాంతాలే. కాబట్టి అతి విలువైన ఖనిజ సంపద ఉన్న ప్రాంతాలని గుర్తించి అక్కడ తవ్వకాలు జరపడానికి బడా కంపెనీలు అనుమతులు పొందుతున్నాయి.
ఇవికాక అనేక పెద్ద పరిశ్రమలకి నీరు అధికంగా అవసరం ఉండడం వల్ల పెద్ద పెద్ద డ్యామ్‌లను నిర్మించాల్సి వస్తోంది. ఈ డ్యామ్‌లు బహుళార్థక ప్రాజెక్టులని, నిర్మించక తప్పదని ప్రభుత్వాలు వాదిస్తూ మరింత భూమిని ఆక్రమిస్తున్నాయి. ఇక్కడ కూడా అధిక సంఖ్యలో బలి అవుతున్నది ఆదివాసీలే. అడవి లేనిదే తమ సంస్కృతి లేదని, సంస్కృతి లేని రోజు తాము తమ అస్తిత్వాన్ని కోల్పోతామని అంతర్జాతీయంగా ఆదివాసీలు ప్రకటిస్తున్నారు. అడవిపై సంపూర్ణ అధికారాలు కావాలని ఉద్యమాలు తీవ్రతరం చేస్తున్నారు.
ఇవాళ ‘పోలవరం’ ప్రాజెక్టు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్ర, తెలంగాణ జిల్లాలో, కొండ రెడ్ల జాతుల జీవితాలని అల్లకల్లోలం చేయబోతున్నది. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలు, ఒక్క ఖమ్మంలోనే 193 రెవెన్యూ మండలాలు ఆంధ్రలో కలపడం దగ్గర నుంచి, రేపు పోలవరం కడితే మా బ్రతుకులు ఎట్లా అని ఆందోళన చెందుతున్నాయి ఆదివాసీ సంఘాలు. ముంచుకొస్తున్న ఈ ముప్పును నివారించడానికి ప్రజాస్వామిక వాదులు ఉద్యమబాట పట్టి గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలను సమయాత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పీపుల్‌ ఎగైనెస్ట్‌ పోలవరం ప్రాజెక్టు (పీఏపీపీ) తెలంగాణ ప్రజాఫ్రంట్‌, విద్యార్థి సంఘాలు వివిధ కార్యక్రమాలు చేస్తున్నాయి. పీఏపీపీ ఒడిశా నుంచి భద్రాచలం వరకు మే 1 నుంచి జూన్‌ 15 వరకు పాదయాత్ర జరిపి, భద్రాచలంలో పెద్ద సభ నిర్వహించింది. అనేక ప్రజాస్వామిక సంఘాలు, వ్యక్తులు ఈ సభలో పాల్గొన్నారు. గమనించదగ్గ విషయం అటు పక్కన ఉన్న రెండు రాష్ర్టాలూ, ఇటు తెలంగాణ ఆదివాసీలకి మద్దతుగా పోలవరాన్ని వ్యతిరేకిస్తున్నాయి కానీ ఆంధ్ర ప్రాంతం నుంచి మాత్రం ఎటువంటి స్పందనా లేదు.
పోలవరం ప్రాజెక్టులో ఉన్న ముఖ్య లోపం దీనిని కేవలం ఒక ప్రాంత అభివృద్ధికై, నీటికి సంబంధించిన అంశంగా చూడడం చాలా బాధగా ఉంది. దాదాపుగా మూడు లక్షల మంది ఆదివాసీల జనాభా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా నిర్వాసితులు కాలేదు. కనీసం సరైన లెక్కలు ఇప్పటి వరకు తీయలేదు. 1990లో కొన్ని ఎన్జీవోలు, ఒకటి రెండు సంస్థలు చేపట్టిన లెక్కలు తప్పితే గత దశాబ్దకాలంలో ఒక్క లెక్క  కూడా తీయలేదు. అసలు దళితులకు 3 ఎకరాలు పంచడానికే భూమి లేక తలలు పట్టుకుంటున్న ప్రభుత్వాలు ఇన్ని లక్షల మందికి ఎక్కడ ఉపాధి, నివాసం చూపిస్తాయి? ఇప్పటి వరకు 2000 కోట్లకు పైగా డబ్బులు చెల్లించాము అని చెబుతున్నారు. కానీ విషాదకర విషయం ఏమిటంటే అది కూడా ఆదివాసేతరులకి పోవడం, అతి కొద్ది శాతం ఆదివాసీలకు చేరింది.
పోలవరం పాపంలో అందరూ దోషులే. ఇది ఆదివాసీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని సూచిస్తుంది. అసలు ఈ దేశ చరిత్రలో ఆదివాసీలను మనం కాపాడింది ఎప్పుడు? ఎక్కడ? పొద్దున లేస్తే సింగపూర్‌, మలేసియా గురించి మాట్లాడే ప్రభుత్వాలు ఏటా వచ్చే మలేరియా, డయేరియాల నుంచి ఆదివాసీలను కాపాడలేకపోతున్నాయి. ఇది అత్యంత సిగ్గుచేటు. చరిత్ర, సంస్కృతి అంటే చారిత్రక ప్రదేశాలలో జెండాలు ఎగరవేయడం కాదు. భిన్న సంస్కృతి గల ప్రజలను కాపాడడం. వారి ప్రాంతాలను రక్షించడం, వారి హక్కులని అమలు పరచడం. అయినా ఆదివాసీలను కాపాడడం అంటే ప్రపంచ పర్యావరణాన్ని కాపాడడమే. మనం వారికి చేసే మేలు కంటే వారు ప్రపంచానికి చేసే మేలు వేల రెట్లు అధికం.
అందుకే ఆదివాసీలు ఈరోజున అస్తిత్వ ప్రకటన చేస్తున్నారు. మా పాలన, మా అడవులు మాకేనని గొంతెత్తి నినదిస్తున్నారు. అందులో భాగంగానే ఇవ్వాళ ప్రపంచవ్యాప్తంగా హక్కుల అమలుకై ఏకమవుతున్నారు. దీనిలో భాగంగానే పీఏపీపీ సంస్థ తరపున ఇవ్వాళ హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఉదయం 10 గంటల నుంచి సుందరయ్య పార్కు నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ, తరువాత మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారు. తుడుం దెబ్బ లాంటి సంస్థలు, సంఘాలు అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
సుజాత సూరేపల్లి
శాతవాహన విశ్వవిద్యాలయం
(నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం)

Andhra Jyothi Telugu News Paper Dated: 09/08/2014


Thursday, May 8, 2014

దళిత ఉద్యమాల వర్తమాన వాస్తవాలు - సూరేపల్లి సుజాత


Published at: 09-05-2014 08:47 AM


కారంచేడు, చుండూరు సంఘటనలప్పుడు నడిచిన దళిత ఉద్యమాలు ఇపుడు నడిచే పరిస్థితి లేదు. విస్తృతకోణంలో పరిశీలించకుండా, ప్రపంచ పోకడల్ని పట్టించుకోకుండా, కేవలం దళితుల సమస్యలపై మాత్రమే ఆలోచించినా, పథకాలు వేసినా పెద్దగా మార్పు ఉండబోదు. మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఉద్యమ దశ, దిశలను మార్చకుండా పోతున్నాం కూడా.
అక్షరాస్యత పెరిగి, పేదరికం తరిగి అన్ని వర్గాల, కులాల వారందరూ ముందుకు పోతున్నారు అని అకాడెమిక్ పరిశోధనలు వస్తున్న నేపథ్యంలో మన ముందు కనిపిస్తున్న మరికొన్ని నిజాల గురించి మాట్లాడుకోవాల్సి ఉంది. రోజూ దళితులపై ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో హింస జరుగుతూనే ఉంది. హత్యలు, అత్యాచారాలు, ఆక్రమణలు, దురాక్రమణలు ఇందు లేదు అన్న విధంగా నేరాలు పెరుగుతున్నాయి. కాని ప్రజలలో, దళిత నేతలు, సంఘాలలో కూడా ఒక నిర్లిప్తత చోటుచేసుకొందో ఏమో ఇప్పుడు అవి ఒక సాధారణ వార్తలుగా మారిపోయాయి. అపుడపుడు అక్కడో ఇక్కడో కాస్త హడావిడి కనిపించినా మొత్తానికి పరిస్థితిలో పెద్దగా మార్పు ఏమీ లేదనే చెప్పుకోవాలి.
ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు దళిత ఉద్యమాలకు ఒక పెద్ద సవాల్ విసిరింది. 1991 చుండూరు దళితుల ఊచకోతపై వెలువడిన తీర్పు అసలు ఈ దేశంలో దళితులకు ప్రభుత్వాలు, మీడియా, న్యాయప్రక్రియల వల్ల ఏమన్నా న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్నని కూడా ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఏడేళ్ల క్రితం చుండూరు కేసులో ప్రత్యేక న్యాయస్థానం 21 మందికి జీవిత ఖైదు, 35 మందికి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించి సంచలనాత్మక, చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందని సంతోషించిన వారందరూ ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. సాక్ష్యాలు లేవు- లాంటి కారణాలే దేశంలోని ఇతర ప్రాంతాలలో జరిగిన హత్యాకాండలకి కూడా ఆపాదిస్తున్నారు. నేరం జరిగిన ఎన్నో ఏళ్లకి గాని తీర్పు వచ్చే పరిస్థితి వుంటే ఇక ప్రజలు న్యాయస్థానాలకి పోవడం పట్ల ఆసక్తి చూపుతారా?

ఇక లక్ష్మిపేట భూమి పోరాటంలో దళితులపై జరిగిన అమానవీయ దాడిలో ఇంకా న్యాయం పూర్తిగా జరగలేదు. అదే విధంగా హర్యానాలో భగన గ్రామంలో ఒక 100 గజాల ప్రభుత్వ భూమిని దళితుల ఇండ్ల జాగాకి అడిగినందుకు అక్కడి జాట్, ఆధిపత్య కులస్తులు దళితులని గ్రామ బహిష్కరణ చేశారు. అప్పటి నుంచి అక్కడ దళితులూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆ తరువాత పోయిన సంవత్సరం నుంచి హర్యానాలో వరుసగా దళిత మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎందుకో కాని నిర్భయకి వచ్చినంత గుర్తింపుకు ఈ దళిత మహిళలు నోచుకోలేదు. సమాజం భగ్గున మండలేదు. ఈ చర్చ ముగియకముందే హర్యానాలో అదే ఊర్లో (భగన గ్రామం, హిసార్ జిల్లాలో) నలుగురు దళిత మైనర్ అమ్మాయిలపై జాట్‌ల అత్యాచారం జరిగింది. ఈ సంఘటనకి మద్దతుగా హర్యానా గ్రామ దళితులూ, ప్రజాసంఘాలు, ఎన్జీవోలు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఇపుడు కూడా ఆందోళన చేస్తూనే ఉన్నారు. వివరాల్లోకి వెళితే, ఈ ఏడాది మార్చి 23 రాత్రి 8 గంటలకు నలుగురు మైనర్ అమ్మాయిలు నీళ్లకోసం తమ పొలాల వద్దకి పోయినప్పుడు ఐదుగురు మగవాళ్లు కారులో వచ్చి వాళ్లని కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి, రేప్ చేశారు. 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న భటిండా రైల్వేస్టేషన్‌లో పడేసి పోయారు. ఈ విషయం తెలియని ఆ నలుగురు అమ్మాయిల తండ్రులు మార్చ్ 24న ఆ వూరి పెద్ద రాకేశ్‌కి ఫిర్యాదు చేసి, మిస్సింగ్ కేసు నమోదు చేయమంటే ఆయన నిరాకరించారు.
ఆ తరువాత వారు ఒత్తిడి చేయడంతో ఆ అమ్మాయిలు ఎక్కడ ఉన్నారో తనకి తెలుసని చెప్పి భటిండా రైల్వే స్టేషన్‌కి తీసుకుపోయాడు. అతనితో పాటు వీరేంద్ర అనే ఆయన బంధువు కూడా ఉన్నాడు. స్టేషన్‌లో అచేతనంగా పడి ఉన్న అమ్మాయిలను తీసుకుని వస్తుండగా రాకేశ్, ఆ అమ్మాయిలని ఈ విషయం బయట ఎక్కడా చెప్పొద్దని, పోలీసులకు కూడా చెప్పొద్దని బెదిరించాడు. ఎంత బెదిరించినా అమ్మాయిల తల్లిదండ్రులు వినకుండా మార్చి 25న హిసార్ ప్రభుత్వ హాస్పిటల్‌లో అమ్మాయిలకు వైద్య పరీక్షలు నిమిత్తం తీసుకుపోతూ ముందు హిసార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాస్పిటల్‌లో రాత్రి 11 గంటల వరకు వారిని పట్టించుకోకుండా అక్కడి వైద్య సిబ్బంది ఆలస్యం చేసి రాత్రి కేవలం ఒక్క అమ్మాయికి పరీక్ష చేసి, మిగిలిన వారికి మరుసటి రోజు అంటే 26న మధ్యాహ్నం 1.30 వరకు చేసినారు. బాధితుల కథనం ప్రకారం పోలీసు వారు సహాయం చేయకపోవడం సరి కదా ఇంకా ఆలస్యం చేసారని ఆరోపించారు. వైద్య పరీక్షల అనంతరం, పోలీస్ ఆఫీసర్ అమ్మాయిలను తీసుకుని మెజిస్ట్రేట్ ఇంటి వద్ద వారి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసి అక్కడనే కుండపోత వర్షంలో వదిలేసిపోయారు. ఆ తరువాత పోలీసులు లలిత్ పంగల్, సుమీ పంగల్, ధర్మవీర్ పంగల్, సందీప్ పంగల్‌లను అరెస్ట్ చేశారు. దీని వెనుక వూరి పెద్ద రాకేశ్, వీరేంద్ర ఉన్నారని అమ్మాయిలూ, తల్లిదండ్రులు చెప్పినా కూడా వారిని నేరస్థులుగా నమోదు చేయలేదు. జాట్ కులానికి చెందిన వారు కాబట్టి వారిని అరెస్ట్ చేయలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇక ఇక్కడి నుంచి కథ మామూలే. న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం మొదలైంది.
కారంచేడు, చుండూరు సంఘటనలప్పుడు నడిచిన దళిత ఉద్యమాలు ఇపుడు నడిచే పరిస్థితి లేదు. పూర్తిగా మధ్యతరగతి భావనలు విస్తరించి ఉన్న సమాజం బయట, లోపట ఒకవైపు అయితే, ప్రపంచీకరణ పలు విధాలుగా దళిత సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అన్నది కూడా వాస్తవమే. దళిత ఉద్యమాలు అని అనడం కంటే ప్రోగ్రాములు, పథకాలు అనడం సరిపోతుంది. ఇపుడు దళితుల పరిస్థితి చాలావరకు ఎన్జీవోల చేతిలో ఉంది. వారు అత్యద్భుతంగా బాధితులని వివిధ వేదికల మీద ఏడిపించి, లీటర్లకొద్దీ కన్నీరు కార్పించి, మార్కెట్ వస్తువులని చేసి, అందమైన ప్రాజెక్టులని తయారు చేసి దేశ విదేశాలలో బాగానే సరుకును అమ్మగలుగుతున్నారు. కాని దానివల్ల దళిత, బడుగు బలహీన వర్గాలలో మార్పు ఏమో కాని సంస్థల అధిపతులు, పరిశోధనకారులకి, రచయితలకి విపరీతమైన పేరు, అంతో ఇంతో ఆర్థికంగా వెసులుబాటు మాత్రం జరుగుతుంది అని ఒక పెద్ద మనిషి అనడం సత్యదూరం కాదేమో. ఇక దళితోద్ధారణకి బయటి దేశాల నుంచి అత్యధికంగా నిధులు వస్తున్నట్టు లెక్కలు చెపుతున్నాయి. మరి వాటి వల్ల ఏమి మార్పు జరిగింది అని ఒక యువ ఎన్జీవోని అడిగితె, 'ఏమి లేదు మేడం! ఇవి జీవనోపాధికి మాత్రమే, ఇంకా వంద సంవత్సరాలు ఈ విధంగా జరిగినా మార్పు మాత్రం సాధ్యపడదు' అన్నాడు. అంటే ఎన్జీవోల వల్ల డాక్యుమెంటేషన్ మాత్రం జరుగుతుంది.
కొన్నిచోట్ల కొద్ది మార్పులు లేకపోలేదు కాని అవి దళితుల మౌలిక సమస్యలని మార్చడం కాని, బయటి సమాజాన్ని ప్రభావితం చేయడంలోగాని పూర్తిగా విఫలమైనాయని అధికశాతం ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంబేద్కర్, యువజన సంఘాలు విగ్రహ ప్రతిష్టాపనలు, పార్టీకొక సంఘంగా విడిపోయినాయని ఒక జర్నలిస్ట్ అభిప్రాయం. ఇంకా జిల్లా ఎస్టీ ఎస్సీ కమిటీలు అన్నీ కూడా అగ్రకుల పైరవీల ద్వారా వచ్చినవే, సెటిల్మెంట్ సంఘం అని కూడా అంటారంట. ఇంకా మేధావులు నరకాసుర జయంతి, గొడ్డుమాంసం, పుస్తక చర్చలలో తలమునకలై ఉన్నారు. అది ఒక సాంస్కృతిక రూపమే అనుకున్నా 90 శాతం దళిత జీవితాలకు సంబంధించిన రోజువారీ బతుకు సమస్య మాత్రం కాదని చెప్పగలం. రాజకీయ వ్యవస్థ పూర్తిగా దళితులని లబ్ధిదారులుగా మాత్రమే చూసి వారికి రెండు గొర్రెలు, బర్రెలు, ఇందిరమ్మ ఇల్లు, బోర్లు, అంబేద్కర్ జయంతి, బాబు జగ్జీవన్‌రామ్ జయంతి జరిపితే చాలా ఎక్కువని భావిస్తున్నాయి. అంతో ఇంతో కొంతమంది పెద్దమనుషులు కలిసి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్‌ని తీసుకువచ్చారు. దాని సంగతి ఏందో, ఎన్ని డబ్బులు వచ్చాయో ఎవరికీ తెలిసే అవకాశం లేదు.
విస్తృతకోణంలో పరిశీలించకుండా, ప్రపంచ పోకడల్ని పట్టించుకోకుండా, కేవలం దళితుల సమస్యలపై మాత్రమే ఆలోచించినా, పథకాలు వేసినా పెద్దగా మార్పు ఉండబోదు. ఇంకొకవైపు కంటికి కనపడకుండా, విద్య, వైద్యం ఉపాధి పూర్తిగా ప్రైవేట్ పరం అవుతున్న సంగతి ఉద్యమాలు పెద్దగా పట్టించుకోవట్లేదు కాని దీని వల్ల నష్టపోయేది 90 శాతం దళితులూ, ఆదివాసీలే. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా మూతపడే పరిస్థితి కనపడుతున్నా ప్రైవేట్ విద్యకు పాకులాడుతున్నాం కాని నాణ్యత గల ఉచిత, ప్రభుత్వ విద్య మన హక్కు అని మరిచిపోతున్నాం. ఇదే బలహీనతని ఆధారంగా తీసుకుని రీఎంబర్స్‌మెంట్ వచ్చి విద్యా విధానాన్ని మరింత అధ్వాన్నం చేసింది. స్టేట్ యూనివర్సిటీలలో 90 శాతం ఎస్సీ బీసీలు ఉన్న దగ్గర ఎటువంటి సదుపాయాలూ లేవు, మేధోపరంగా ఎదిగే అవకాశాలు అసలు కనపడట్లేదు.
దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్న వ్యక్తులు, శక్తులు అక్కడో, ఇక్కడో ఉన్నా కూడా ఇపుడున్న పరిస్థితుల్లో ఐక్య సంఘటనల పట్ల అనుమానాలు వ్యక్తపరుస్తూ, ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించడంలో విఫలమౌతున్నారు. ఒకవేళ ఉద్యమాలు చేద్దామన్నా కూడా దళిత దళారులను అగ్రకులాలు తమ గుప్పిట్లో పెట్టుకుని, పదవులు, డబ్బు ఆశ చూపించి అణచివేస్తున్న వైనం నిజంగా కలవరపెడుతున్న వాస్తవం. మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా ఉద్యమ దశ, దిశలను మార్చకుండా పోతున్నాం కూడా.
పోలీసు రికార్డ్‌లలో దళితులపై నేరాలకు అనేక కారణాలు చూపించినా ఫీల్డ్ అనుభవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అత్యాచారాలు, హింసలు, బహిష్కరణ, చేతబడి హత్యల పేరుతో జరుగుతున్న నేరాల వెనుక భూమి అనే అంశం బలంగా ఉంది అన్న విషయం కూడా మనం విస్మరిస్తున్నాం లేదా చూడడానికి నిరాకరిస్తున్నాం. అక్కడో ఇక్కడో వనరులు, భూమి మీద హక్కు గురించి మాట్లాడితే అది లెఫ్ట్, మావోయిస్ట్‌కి సబంధించిన అంశంగా సమస్యను పక్క దారి పట్టిస్తూ, మూలన పెడుతున్నారు. నిజానికి భూమి ఈ రోజుకి కూడా గ్రామాలలో గౌరవ చిహ్నమే. అధికారం, హక్కులు కూడా భూములు ఉన్న దగ్గరే భరోసాగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం కూడా ఎక్కువే. అసలే 80 శాతం ప్రజలకి భూమి లేదు అంటే ఆ ఉన్న భూమిని కూడా ప్రాజెక్టుల పేరుతోని, అభివృద్ధి పథకాలతోని, సెజ్జులు, ఇండస్ట్రియల్ పార్కుల పేరుమీద ఉన్న ఆ కాస్త భూములని అధికారికంగానే ప్రభుత్వాలు గుంజుకుని వీధిన పడేస్తున్నాయి. హిందూ రాజ్యాలు, ప్రభుత్వాలు భూమి విషయం పక్కన పెట్టడంలో కూడా ఉన్న కుట్రలను మనం అంచనా వేయగలగాలి. ఎక్కడో అత్యాచారం, హత్యలు జరిగితే తప్ప దళిత ఉద్యమ నాయకులు మాట్లాడే పరిస్థితి లేదు.
డా.అంబేద్కర్ స్పష్టంగా దళితులూ బానిసత్వం నుండి బయటకి రావాలంటే ముఖ్యంగా హిందూ మతంలోంచి బయటపడాలి అని, ఒక్క హిందూ మతమే మనుషులని వర్గాలుగా విభజిస్తుంది అని, హిందూ మతంలో ఉన్నంత కాలం అంటరానితనం సమసిపోదని పిలుపునిచ్చిన విషయం ఎప్పుడో మరిచినట్టున్నాం. అంతే కాకుండా ఆ విషయం పక్కకు పెట్టి మోడీ కాళ్ల దగ్గర అధికారం కోసం అర్రులు చాస్తున్నారు. మోడీ దగ్గరకి పోవడం అంటే మన సమాధులు మనం తవ్వుకోవడం అన్న విషయాన్ని కప్పిపెడుతున్నారు. అంతేకాకుండా అంబేద్కర్ చెప్పిన మూడు బలాలు 1. మాన్ పవర్ 2. మనీ 3. మేధో సంపత్తి. వీటన్నింటికి ఇపుడు ఉన్న రాజకీయ వ్యవస్థకి సంబంధం ఉన్నదని గ్రహించాలి. ఇవన్నీ మనం కూడగట్టుకోవాలంటే మన శక్తి సరిపోదు కాబట్టి మనం తప్పకుండా బయట నుండి సపోర్ట్ తీసుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. కాని ఇపుడు కొంతమంది మేధావులు బహుజన భజరంగ్‌దళ్ లాగా కులాన్ని వ్యతిరేకిస్తున్నాం అన్న పేరుతోని మరింత కులవాదులుగా మారుతున్నారు.
మతం మార్పిడి, వర్గ నిర్మూలన, భూమి, వనరులపై అధికారం, విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్న ముఖ్య అంశాలని పక్కన పెట్టి, ప్రభుత్వ పథకాల కోసం అర్రులు చాస్తే ఇంకా కనుచూపు మేరలో ఈ పరిస్థితి మారదు. రిఫార్మ్ కాదు రివల్యూషన్ అన్న అంబేద్కర్ మాటలను మళ్లీ ఒక్కసారి చూసుకొని బోధించు, సమీకరించు, పోరాడు అన్న సిద్ధాంతాన్ని మళ్లొకసారి ఉద్యమ శక్తులతో కలిసి నిర్వచించి, నైపుణ్యంతో, కుల, వర్గ దృక్పథాలతో కలిసి వచ్చే వారందరితో విశాల ప్రాతిపదికన ఉద్యమాలు నిర్మించగలిగితే కొంత మార్పు సాధ్యమేమో చూడాలి.
సూరేపల్లి సుజాత
అధ్యాపకులు, శాతవాహన యూనివర్సిటీ

Andhra Jyothi Telugu News Paper Dated: 09/05/2014 

Wednesday, October 9, 2013

బహుజనులే భావి విధాతలు - సుజాత సూరేపల్లి

ప్రపంచీకరణ వెర్రితలలు వేస్తున్నట్టే కొన్ని సందర్భాలలో, ప్రాంతాలలో ఇప్పుడు జరిగే ఉద్యమాల అర్థాలు మారుతున్నాయి. నలుగురు పెద్ద మనుషులు తమకు తోచింది చెబితే అవే వేదాలై కూర్చుంటున్నాయి. నియమాలై నియంత్రిస్తున్నాయి. దానిని అమాయక ప్రజలు పొరపాటునో, గ్రహపాటునో అందిపుచ్చుకుని పోరాటాలు జరిపిస్తున్నారు. సీమ, ఆంధ్ర ప్రాంతంలో నేడు జరుగుతున్న సమైక్య పోరు చూస్తుంటే నిజంగా బాధ అనిపిస్తుంది. అక్కడి ప్రజల అవగాహనా రాహిత్యమో, అర్థం లేని భయాలో కానీ వాళ్ళ ప్రయాణం ఎటో అర్థం కాకుండా ఉంది. ఎవరీ ప్రజలు నష్టపోయేది? ప్రజలు అంటే వెనుకబడిన వారు, ప్రాంతం అంటే వెనుకబడిన లేదా పడవేయబడిన ప్రాంతం అన్న కొద్ది అవగాహన మనకందరికీ ఉందనే అనుకుందాం. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వారెవరు? బహుజనులే. ఎస్సీ, ఎస్టీ, శ్రామిక కులాల, మైనారిటీ ప్రజలు. మరి ఇప్పుడు ఉద్యమాలకు దిక్సూచిలు అయింది ఎవరు? వాళ్ళే? కోపం పట్టలేక ఒకడి మీద ఒకడు దుమ్మెత్తి పోసుకోవడానికి బాలి చేసేది ఎవడిని. ఈ బడుగు జీవినే. ప్రభుత్వ స్కూళ్ళు, ఆస్పత్రులు, బస్సులు, పథకాలు అన్నీ ఆపేస్తే కూడా బలైయ్యేది ఈ మామూలు ప్రజలే. సీమాంధ్రలో తెలంగాణపై కేబినెట్ నోట్ తరువాత ఇప్పుడు జరుగుతున్న దాడులు రాజకీయ నాయకుల ఇళ్ల మీద, ఆస్తుల మీదనే. ఎవరైతే కృత్రిమ ఉద్యమమంట రగిలించారో వారి కొమ్మలే అంటుకుంటున్నాయి ఇవాళ.
ఇటు తెలంగాణ ఉద్యమానికి 60 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. అటు సీమ, ఆంధ్ర ఉద్యమానికి 65 రోజుల చరిత్ర ఉన్నది. ఇంకా ఉండొచ్చు. తెలంగాణలో దశల వారీగా ఉద్యమాలు జరిగినట్టు చరిత్రనే చెబుతుంది. 1996 నుంచి ఉద్యమం రాజకీయాలను మారుస్తూ వచ్చింది. దీంట్లో మారోజు వీరన్న వేసిన బీజాలు బహుజన తెలంగాణ కోణం నుంచి, విప్లవ పార్టీల అజెండా ప్రజాస్వామిక తెలంగాణ అయింది. ఆ తరువాత ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ భౌగోళిక తెలంగాణ ప్రత్యేక తెలంగాణగా ముందుకొచ్చింది. ఈ మూడు దశలలోనూ ప్రాణ త్యాగాల నుంచి, వీధిలో నిరసనల దాకా, ఢిల్లీ నుంచి గల్లీ దాకా జరిగిన అన్ని పోరాటాల రూపాలలో బహుజనుల పాత్రనే కీలకమైంది. నెత్తుటి సాల్లు పారిన ఈ నేల గురించి, రక్తాన్ని మరిగించి పోరాట బాట పట్టే విధంగా కలం, గళం పట్టిన రచయితలూ, కళాకారులు కూడా అధికశాతం బహుజనులే.
ఇంత చేసినా బహుజనుల పాత్ర కార్యకర్తల వరకే పరిమితం కావడం ఇక్కడ ఉన్న కుల, వర్గ రాజకీయాలకి అద్దం పడుతుంది. ఇది కేవలం తెలంగాణకే ప్రత్యేకం కాదు. భారతదేశమంతా ఇదే తంతు. తెలంగాణ ఉద్యమానికున్న ప్రత్యేకత అన్ని కులాల్ని ఉద్యమంలోకి తీసుకురావడం. అగ్రకులాల స్వార్థ చింతన ఎట్లా ఉన్నా ఉద్యమంలో వారి పాత్రని కూడా తీసివేయడం కష్టం. అనేక సందర్భాలలో ఒకరికొకరు సహాయం చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి కూడా. వేల సంవత్సరాల నుంచి వస్తున్నా కుల వివక్షత రాష్ట్రాల విభజనతో పోతుంది అనుకోవడం మూర్ఖత్వమే అయితే తప్పకుండా సమన్యాయం కోసం పోరాడడం అనివార్యం.
ఉద్యమాలకి ఊపిరిలూదిన విశ్వవిద్యాలయాల్లో ఉన్నది 90 శాతం బహుజనులే. జై ఆంధ్ర, జై సామాజిక ఆంధ్ర ఉద్యమ కారులు, వీరు బహుజనులు. మేము మా తీర ప్రాంతాన్ని ఉపయోగించుకొని మలేషియా కన్నా గొప్ప ప్రాంతంగా అభివృద్ధి చేసుకుంటాం అని దళిత నేత కత్తి పద్మారావు అంటే పట్టించుకోరెందుకు? సామాజిక తెలంగాణ, సామాజిక ఆంధ్ర పేరుతో ఊసా లాంటి నాయకులు నిరంతరం సీమ, ఆంధ్ర ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని విస్మరించాలని చూసినా ఇది వాస్తవం. ఆధిపత్యంతో కూడిన అధికారాన్ని మేము బహిష్కరిస్తున్నాము అన్నది మనకు కనపడకున్నా అది బహుజన వాయిస్ మాత్రమే. అలాగే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనకపోతే వారిని పట్టించుకోకుండా బెదిరిస్తూ ఉద్యమం నడుపుతున్నారు. ఇది న్యాయమేనా? సమ్మెలో ఉన్న పిల్లలు బహుజనులు చదివే ప్రభుత్వ స్కూల్‌లో చదువుకుంటారా? ఆర్‌టీసీ బస్సుల్లో వెళతారా? సమైక్య ఉద్యమంలో ప్రైవేట్ సర్వీసులు ఎవరివి? ఏ కులాల వారివి? ఆసుపత్రులు ఎవరికున్నై? అయినా మాకు రెండు రాష్ట్రాలు కావాలి అంటున్న ఆ గొంతులు సమాన అవకాశాలను ఆశిస్తున్నారు. వారికి హైదరాబద్‌లో పెట్టుబడులు లేవు. వ్యాపారాలు లేవు. సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు లేవు, ఉన్నా వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు, పట్టించుకోరు. అందుకే రెండు రాష్ట్రాల ద్వారా వాళ్ళ జీవితాలు బాగుపడతాయని అనుకుంటున్నారు. ఇదే సమానత్వానికి పునాది. ఇది కేవలం బహుజనుల గొంతులోంచే వినబడుతుంది ఈ కష్ట కాలంలో కూడా. అవును వేరొక కోణంలోంచి చూస్తే అగ్ర కుల రాజకీయ నాయకుల స్వార్థాలకి బలైపోయేది కూడా వీళ్ళే.
సమైక్యపోరులో పచ్చి అబద్ధాలు చెప్పి సీమ, ఆంధ్ర ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు నాయకులు, మేధావులు. నీళ్ళు రావని, హైదరాబాద్‌లో ఉన్న వారికి భద్రత లేదని, ఇక్కడనే అన్ని వసతులు ఉన్నాయన్నది బలమైన వాదన. సమన్యాయం చెప్పే వారు లేనే లేరా? నిజంగా నీళ్ళ గురించి మాట్లాడడానికి నిపుణులు, కమిటీలు ఉంటాయి కదా? ఆసుపత్రులు, కాలేజీలు ఏర్పాటు చేసుకోవడం అంత కష్టమా? రేపు ఇక్కడ చదువుకునే వారిని నిజంగా వెళ్లగొట్టే హక్కు ఎవరికైనా ఉంటుందా? తెలంగాణకు ఆ చరిత్ర ఉందా అసలు? అన్ని పార్టీల నాయకులు తెలంగాణ ఇస్తే మాకు అభ్యంతరం లేదని రాసి ఇచ్చి, ఇప్పుడు ఆస్తుల రక్షణ కోసం ఉద్యమం చేపిస్తే అమాయకులను రెచ్చగొట్టడం కాదా? ఈ రాష్ట్రంలో ఉన్న అత్యధిక జనాభా కలిగిన బహుజనులు రెండు రాష్ట్రాలు కోరుకుంటున్నారు. చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సులభంగా ఉంటాయని, అధికార వికేంద్రీకరణకి అనువుగా, కింది కులాల వారికి చేరువలో ఉంటాయని చెప్పిన అంబేద్కర్ సూత్రాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు. ఇటు తెలంగాణలో ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్ర, దిక్సూచిలా నిలబడ్డ వైనం ఎట్లా అయితే బహుజనుల వల్ల వచ్చిందో అలాగే సీమ, ఆంధ్ర ప్రాంతానికి కూడా అధికారం, స్వయం పాలన రావాలని అక్కడి బహుజనులు కోరుకుంటున్నారు. వారికున్న భయాలను పోగొట్టే బాధ్యత ఇరు ప్రాంతాల వారు తీసుకోవాలి. రెండు రాష్ట్రాల పునర్నిర్మాణ కార్యక్రమంలో మరుగున పడ్డ హక్కులను పైకి తీయాలి. స్త్రీలను గౌరవిస్తూ వారికి సముచిత స్థానం కల్పించాలి. మైనారిటీల ఆందోళనలను పోగొట్టాలి. ముఖ్యంగా సహజ వనరులను రక్షించుకుని భావి తరాల వారికి అందించాలి.
రెండు రాష్ట్రాల అభివృద్ధి కోరుకునే వారు ఇప్పుడు అడ్డం పడాలనుకోవడం మూర్ఖత్వం. తెలంగాణలో కూడా బహుజనులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. సీమ, ఆంధ్ర ప్రాంతంలో మాత్రం మరొక యుద్ధమే చేయాలేమో. సాంస్కృతిక విప్లవానికి మళ్లీ నడుం బిగించాలి. రెండు, మూడు కులాలు మాత్రమే రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. వారు మాత్రమే ఇప్పుడు అన్ని పాత్రలు పోషిస్తున్నారు. బహుజనులు అప్రమత్తంగా ఉండి తమ హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ రెండు రాష్ట్రాలు సాధించిన ఫలితం దక్కుతుంది.
- సుజాత సూరేపల్లి
తెరవే, రాష్ట్ర కార్యదర్శి



Andhra Jyothi Telugu News Paper Dated: 10/10/2013 

Wednesday, March 6, 2013

గర్భాశయం నుంచి గోరీ వరకు.. - సుజాత సూరేపల్లి



కులం లేనిదెక్కడ? ప్రతిచోటా ఉంది. సాహిత్యం, విద్యా సంస్థలు, మీడియా, విధాన నిర్ణయాలు, వాటి అమలు, శాసన నిర్మాణం, ప్రభుత్వ యంత్రాంగం... బహుశా భారతీయాకాశంలోను, భారత భూమి అట్టడుగు పొరలలోను కులం ఉంది; ఆదివాసీలపై వివక్ష ఉంది. మేము గర్భాశయం నుంచి గోరీ వరకు వివక్షకు లోనవుతూనే ఉన్నామని చెప్పక తప్పదు. 

మేము ప్రకృతిలో జీవిస్తాం! ప్రకృతిలోనే మేము చనిపోతాం! అదీ మా జీవితం. మీరు మా భూమిని ఆక్రమిస్తే మేము ఎక్కడకు వెళ్ళాలి? ఎలా జీవించాలి? ఈ భూమి ఎవరిది? - దయామణి బర్లా తీవ్ర స్వరంతో వేసిన ఈ ప్రశ్నలు ఆ హాలులో ప్రతిధ్వనించాయి. ముంబై లోని 'టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్'లో గత నెల15, 16 తేదీల్లో జరిగిన దళిత, ఆదివాసీ మహిళల సదస్సులో ఆమె ప్రసంగించారు. దేశంలో దళిత-ఆదివాసీ మహిళల సదస్సు జరగడం ఇదే మొదటిసారి. జార్ఖండ్ ఆదివాసీ ఉద్యమకారిణి అయిన దయామణి ఇంకా ఇలా అన్నారు: 'గనుల తవ్వకం పేరిట ఆదివాసీల జీవన విధానాన్ని అంతమొందించడానికి 108 మైనింగ్ కంపెనీలు సంసిద్ధంగా ఉన్నాయి. మొదట వారు బొగ్గుకోసం వచ్చారు. ఆ తరువాత విద్యుత్కేంద్రాలు అన్నారు. మమ్ములను మా భూముల నుంచి ఇంకా ఇంకా వెళ్ళగొడుతున్నారు. మా భూములు మాకు లేకుండా పోతే మేము ఎలా జీవించాలి?' జార్ఖండ్‌లో మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఆదివాసీలను, ఇతర ప్రజలను ఏకం చేయడానికి కృషి చేస్తోన్న ఆ ఉద్యమకారిణి ప్రసంగంలోని బాధ, ఆవేదనలను హాలులోని ప్రతి ఒక్కరూ తమలో సంవేదించుకున్నారు. దయామణి బర్లా తన ప్రసంగాన్ని ఇలా ముగించారు: 'హమ్ కో జీనే దో! మా బతుకును మమ్ములను బతకనివ్వండి'.

ఆదివాసీలు తమ మనుగడ కోసం చేస్తోన్న పోరాటాలు, ముఖ్యంగా అడవుల విషయంలో ప్రభుత్వ విధానాలతో వారి ఘర్షణ గురించిన ప్రసంగాలతో ఈ సదస్సు ప్రారంభమైంది. ఆ తరువాత వివిధ రంగాలకు చెందిన మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి సవివరంగా ప్రసంగించారు. ఒక మైనారిటీ మతంలో మైనారిటీ వర్గానికి చెందిన రజియా పటేల్ తన సహ మతస్థులు సత్యాన్ని మాట్లాడడానికి, వినడానికి, చూడడానికి భయపడిపోతున్నారని పేర్కొన్నారు. ముస్లింలలో కూడా కుల పరమైన అంతరాలు ఉన్నాయనేది ఒక దిగ్భ్రాంతికరమైన వాస్తవమని, వీటివల్ల కొంతమంది వివక్షకు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన అస్తిత్వానికి సంబంధించిన అంశాలను తాను అర్థంచేసుకోలేక పోతున్నానని సమతా మానె వాపోయారు. తమది సంచార జాతి లేదా విముక్త తెగ (డీ నోటిఫైడ్ ట్రైబ్)గా పేర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. రాజ్య వ్యవస్థ తమపై రుద్దిన ఈ గుర్తింపుతో తాము మమేకం కాలేకపోతున్నామని పేర్కొంటూ ఆమె ఇలా ప్రశ్నించారు: 'ఈ సమాజంలో మా స్థానం ఏమిటి? ఏ గుర్తింపును మీరు మాకు ఇస్తున్నారు? ఎస్సీ, ఎస్టీ లేదా నేరస్థ తెగా? మాకు రేషన్ కార్డులూ లేవు, ఓటరు కార్డులూ లేవు. ఈ దేశంలో ఏ ప్రాంతానికి, ఏ సామాజికవర్గానికి చెందిన వాళ్లం మేము?'

స్వీయ విషాద గాథలూ, విఫల పోరాటాల అనుభవాలనూ పలువురు వక్తలు ఈ సదస్సులో వివరించారు. భావజాలపరమైన ప్రశ్నలను కూడా వారు లేవనెత్తారు. రాజ్య వ్యవస్థ కుల స్వభావాన్ని వారు ఎత్తి చూపారు. బతుకు తెరువుకు పాకీ పనిచేస్తున్న వారి పట్ల దళితులే వివక్ష చూపుతున్నారన్న వాస్తవాన్ని కొంతమంది ఎత్తి చూపారు. జోగినీల, మాతంగీల, దేవదాసీల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో కొందరు ప్రస్తావించారు. ఈ వృత్తుల్లో ఉన్న మహిళలు ఎటువంటి అమానుషాలకు గురవుతున్నారో వారు పేర్కొన్నారు. ఈ బాధాకరమైన వాస్తవాలను వింటున్నప్పుడు ఎన్నో ఆలోచనలు మనస్సును కుదిపివేశాయి. మనమేమిచేయగలం? ఈ వాస్తవాలను వివరించిన వారిలో చాలా మంది జీవితంలో తమకు జరుగుతున్న అన్యాయాలపై తిరగబడి పోరాడుతున్న వారే.అయితే వారికి ఎటువంటి గుర్తింపు లేదు. వారి పోరాటాల గురించి మీడియాలో ఎటువంటి వార్తలు రావు.

నిజానికి మన సంక్షుభిత, అయితే ఉద్యమాల కాలానికి వారే నిజమైన మార్గదర్శకులు. అటువంటివారు ఇంకా ఎంతో మంది ఉంటారు. అయితే వారిని గుర్తించేది ఎవరు? విశాల దేశానికి తెలియజేసేదెవరు? ఎన్నో అన్యాయాలు, అణచివేతలకు వ్యతిరేకంగా వారు పోరాడుతున్నారు. తమ తమ సామాజిక సంప్రదాయాలను, జీవన శైలులను కాపాడుకోవడానికి వారు ఉద్యమిస్తున్నారు. ఆ సదస్సులో పలువురు వక్తలు లేవనెత్తిన ప్రశ్నలన్నీ మన సమాజంలోని అణగారిన వర్గాల వారు దళితేతరులు, ఆదివాసేతరులపై ఎక్కుపెట్టిన ఆయుధాలే సుమా! విప్లవమూర్తులు ఫూలే, అంబేద్కర్, సావిత్రీ బాయి ఎప్పటికీ వారికి స్ఫూర్తి.

వివక్ష, అసమానతలకు గురవుతోన్న అణగారిన వర్గాల వారందరినీ ఒక సమైక్య వేదిక మీదకు తీసుకురావడానికి ముంబై సదస్సు ప్రయత్నించింది. చాలామంది అధ్యాపకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న కుల, వర్గ, జెండర్ పరమైన వివక్షలను ఎటువంటి సంకోచాలు లేకుండా వివరించడానికి ఈ సదస్సు ఒక వేదిక అయింది. ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్రమనంతరం కూడా మేమిలా ఎందుకు వివక్షకు గురవుతున్నామని వారు ప్రశ్నించారు. కొంతమందైతే అమాయకంగా 'భారతదేశంలో కులం ఉందా?' అని ప్రశ్నించారు. కుల వివక్ష, ఆదివాసీలకు అన్యాయాలు కట్టు కథలు అని ఎవరైనా భావిస్తే ఈ సదస్సులో పలువురు వెల్లడించిన వ్యక్తిగత గాథలు, వాస్తవ జీవితానుభవాలను తప్పక వినాలి, చదవాలి. కులం లేనిదెక్కడ? ప్రతిచోటా ఉంది. సాహిత్యం, విద్యాసంస్థలు, మీడియా, విధాన నిర్ణయాలు, వాటి అమలు, శాసన నిర్మా ణం, ప్రభుత్వ యంత్రాంగం... బహుశా భారతీయాకాశంలోను, భారత భూమి అట్టడుగు పొరలలోను కులం ఉంది; ఆదివాసీలపై వివక్ష ఉంది. ఈ దురాగతాలకు అధికంగా బలవుతున్నది మహిళలే. సదస్సులో ప్రసంగాలను వింటున్న ఒక వ్యక్తి ఇలా ప్రశ్ని ంచాడు: దళిత్, ఆదివాసీ మహిళలు ఏమి ఆశిస్తున్నారు? ఈ ప్రశ్నను ఎలా అర్థం చేసుకోవాలి? 'నేటి భారత్‌లో ఇంకా కుల వ్యవస్థ ఉన్నదా?' అన్న ప్రశ్నను ఇది మళ్ళీ గుర్తుకు తెచ్చింది.

ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి మనమెక్కడ మొదలవ్వాలి? మేము గర్భాశయం నుంచి గోరీ వరకు (జటౌఝ ఠీౌఝఛ ్టౌ ్టౌఝఛ) వివక్షకు లోనవుతూనే ఉన్నామని చెబుదామా? దళిత్, ఆదివాసీ మహిళలు తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నారు; ప్రకృతిని కాపాడడానికి ఆరాటపడుతున్నారు. మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి జరుగుతున్న ఉద్యమాలకు వారు నాయకత్వం వహించడం లేదా? వారు భూమి కోసం పోరాడుతున్నారంటే అది వారి సొంతం కోసం కాదు, విశ్వ లయలను వికృతపరచని పచ్చని ధరిత్రి కోసమే కాదూ? దళిత్-ఆదివాసీ మహిళా ఉద్యమకారులు జీవ వైవిధ్య ఆచార్యులు, ప్రకృతి పరిరక్షకులు. భావి తరాల శ్రేయస్సుకోసం వారు పాటుపడుతున్నారు. సంపన్నుల సంపదలో వారు వాటా అడగడం లేదు. వారు అడుగుతున్నదల్లా తమ మౌలిక అవసరాలను తీర్చమనే కదా. ఆరున్నర దశాబ్దాల స్వాతంత్య్రం అనంతరం కూడా వారికి విద్యా వైద్యాలు, ప్రాథమిక సామాజిక భద్రతను సమకూర్చడంలో ఈ దేశ పాలకులు విఫలమవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ఈ దేశాన్ని పాలించాలని అనుకుంటున్నవారు దేశ జనాభాలోని అత్యధికులు ఎదుర్కొంటున్న వివక్షను గమనించారా? ఎందుకు పాలించాలనుకొంటున్నారు? ఎవరిని పాలించాలనుకొంటున్నారు? ఎవరి ఓట్లతో తాము అధికారానికి వస్తుందీ వారు గుర్తించారా? చాలా దేశాల్లో ఆదివాసీలకు ప్రత్యేక న్యాయస్థానాలున్నాయి. వారి ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఉంది. మన దేశ జనాభాలో ఆదివాసీల సంఖ్య తక్కువేమీకాదు. మరి మన పాలకులు వారి హక్కులను గౌరవిస్తున్నారా? వారికి న్యాయబద్ధమైన ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారా? ఏ సమాజానికైనా శ్రామికవర్గమే వెన్నెముక. ఈ దేశ జనాభాలో 70 శాతం మంది శ్రామికులే. సంపదలు సృష్టిస్తుంది వారే. మరి వారికి న్యాయం జరుగుతుందా? ఈ అంశాలన్నిటినీ ముంబైలో జరిగిన దళిత్-ఆదివాసీ మహిళల సదస్సు చర్చించింది. దళితులు, ఆదివాసీలను చైతన్యపరచడానికి, ఆ వర్గాల విద్యార్థినీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ప్రతి విశ్వవిద్యాలయంలోనూ ఇటువంటి సదస్సును నిర్వహించవల్సిన అవసరమున్నది. అవినీతితో కునారిల్లుతున్న ఈ వ్యవస్థపై మన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించాలి. ప్రస్తుతానికిదే ప్రత్యామ్నాయం. మనం పోరాడడానికే పుట్టాము. చివరకంటా పోరాడాలి!

- సుజాత సూరేపల్లి
సామాజిక శాస్త్ర అధ్యాపకులు, శాతవాహన యూనివర్సిటీ

Andhra Jyothi Telugu News Paper Dated : 6/3/2013

Wednesday, January 23, 2013

స్పందనల్లో సమానత్వమేది! - సూరేపల్లి సుజాత



నిర్భయ, దామిని, అమానత్ అన్న పేదు అనేక పట్టణ ప్రాంతాలతో పెనవేసుకుపోయింది. ఈ దేశంలోని ఎంతోమంది చదువుకున్నోళ్లకు ఆమె పేగు బంధమైన చెల్లి, అక్క, ఒక బిడ్డ. ఇక్కడ స్త్రీలపై అత్యాచారాలు అతి మామూలు విషయం. అధికారిక లెక్కల ప్రకారం ప్రతి పద్నాలుగు నిముషాలకి ఒక అత్యాచారం జరుగుతోంది. కుల, మైనారిటీలపై ఒకరకంగా జరిగితే, భూములు, అడవులు, ఆదివాసీల జీవితాలపై మరొక రకంగా అత్యాచారం జరుగుతుంటుంది. ఏది ఏమైనా నిర్భయ ఒక శిక్షకి పేరు అయింది. 

వివక్షకి వ్యతిరేకంగా జరిగే ఉద్యమానికి చిరునామా అయింది. యువత ఆగ్రహానికి ప్రతిరూపం అయింది. మధ్య రాత్రి మహిళలతో మార్చ్ చేయించింది. మారుమూల పట్టణాలలో మానవహారాలు తయారు చేసింది. ఆమె బ్రతుకు దేశానికి ఒక జీవన్మరణ సమస్య అయింది. నిర్భయ పేరు జ్యోతి సింగ్ పాండే అని ఈ మధ్యనే తెలిసింది. ఢిల్లీ వంటి పెద్ద పట్టణంలో స్నేహితునితో సినిమా చూసి వస్తుండగా, ఎవరూ లేనిచోట, నిశీధి రాత్రి మగ మృగాల అమానుష దాడికి బలైపోయింది చెల్లి. 

అవును ఏ కులం అయితే ఏంది? గత ఇరవై రోజుల్లో ఎన్నో బలవన్మరణాలు జరిగాయి, అత్యాచారం చేసి అమానుషంగా చంపిన నేరాలు వెలుగుచూసేది కొన్ని మాత్రమే. ఇంకా న్యాయం జరిగేది ఎప్పుడో, ఎన్నడో. ఇవన్నీ షరామామూలే కదా? మీడియా ఎప్పుడూ పెద్దగా పట్టించుకోదు, ప్రతిపక్ష పార్టీలు అన్ని పట్టించుకుంటాయి వాళ్ళ ఉనికి కోసం. ఎందుకో ఒక్కసారి పాత జ్ఞాపకాలు చుట్టముట్టాయి. కులాలు, మతాలూ అందులోని వైరుధ్యాలపై అంతర్మథనం మొదలైంది. ఒక స్త్రీగా ఆవేదన చెందుతూనే దళిత స్త్రీలకూ, కొన్ని వర్ణాలకు, వర్గాలకు, జాతులకు ఈ దేశంలో జరుగుతున్న అవమానం, వివక్షతపై జరిగిన అన్యాయం పీడిస్తూనే ఉంది. 

మహారాష్ట్రలోని ఖైర్లాంజి సంఘటన కళ్ల ముందు కదులుతుంది. కుంబి కులస్తులు ఒక చిన్న ప్రాణి, ప్రియాంక బోత్మాంగె, యవ్వనంలోకి అప్పుడే కోటి కలలతో అడుగు పెడుతున్న చెల్లి బట్టలూడదీసి ఊరంతా నగ్నంగా ఊరేగించి, తోడబుట్టిన వాళ్లతో అత్యాచారం జరిపించమని బలవంతపెట్టింది. వక్షోజాలు నరికివేసి... అంగాంగం ఛిద్రం చేసి చంపేసింది. ఇది పట్టపగలు జరిగింది. ఆడా, మగా సమక్షంలో, ఊరు ఊరంతా సాక్ష్యం. భూమి హక్కు కోసం పాకులాడిన ఆ దళిత రైతు పిల్లల్ని అతి నిర్దాక్షిణ్యంగా, కిరాతకంగా ఊరివాళ్ళందరి ముందు అత్యాచారం చేసి చంపారు. మూడు నాలుగు రోజులు దాకా ఎక్కడా మీడియాలో వార్త రాలేదు. వచ్చినా అది పెద్ద స్పందన కాలేదు. 

ఆ తరువాత కొన్ని దళిత సంఘాలు, కొద్దిమంది ఇతరులు మీద వేసుకుని పోరాటం చేశారు. ఇక ఇదే కోవలో కారంచేడు, చుండూరు, వేంపెంట, పాదిరి కుప్పం, మొన్నటి లక్షింపేట కూడా చూడొచ్చు. ఈ అసభ్య సమాజం ఎందుకో స్పందించదు. అది దళితుల సమస్య, వాళ్ళు పుట్టిందే చంపబడడానికి, సేవలు చేయడానికి, బానిసలుగా బతకడానికి. లక్షింపేట మీడియాలో కూడా బాగానే వచ్చింది కానీ ఎందుకో దళితులు కానివాళ్ళని పెద్దగా కదలించలేకపోయింది. 

అవును అది దళితుల సమస్య. నిర్భయ విషయంలో గొంతెత్తిన యువతకి ఈ అంశం పెద్దగా పట్టి ఉండే అవసరం లేదు, వారిని కూడగట్టే సంఘాలు, వ్యక్తులకు కూడా పెద్దగా రుచించకపోయి ఉండవచ్చు. అవును, అమ్మాయి కదా, స్త్రీ కదా ఏ కులం అయితే ఏంది అనే సమాజం ఇక్కడ ఎందుకో స్పందించలేదు. అవును వీళ్ళూ మనుషులే కదా, వాళ్ళు చేసింది బ్రతుకు పోరాటమే కదా అని అనుకోలేదు. వేలకొద్దీ యువత బారికేడ్లను ఛేదించుకుని, న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టమని అడగలేదు. 

ఎవరిది ఈ సమాజం? ఎవరు స్పందిస్తున్నారు? ఎవరికి స్పందిస్తున్నారు? తొలుస్తున్న సమస్య... న్యాయం అన్యాయాల మధ్య నిరంతరం ఘర్షణకి తెరతీస్తున్న సమస్య. ఇప్పుడు దళిత స్త్రీల వార్తలు, వాకపల్లిల ఆదివాసీ స్త్రీల అత్యాచారాలు పట్టిపీడిస్తున్న సమస్యలు. గుజరాత్‌లో నిండు గర్భిణీ గర్భాన్ని నిలువునా చీల్చివేస్తే, మతం మత్తులో మునిగి స్పందించని దేశం మనది. ఇవన్నీ రాత్రి ఎక్కడో జరిగిన నేరాలు కావు, తాగి మత్తు మైకంలో జరిగిన తప్పులు కావు. సభ్య సమాజం అన్ని పోరాటాలను అదే దృష్టితో చూడగలదా? సినీ నటి ప్రత్యూష కేసు ఏమైంది? అని ఆ తల్లి ఇంకా మొత్తుకుంటూనే ఉంది. 

అయేషా కేసులో ఒక అమాయకమైన సత్యాన్ని పట్టుకొని మన ముందు దోషిగా నిలబడితే కూడా చూస్తూనే ఉన్నాం మౌనంగా. అవును, ముందే చెప్పినట్టుగా అత్యాచారాలు రకరకాలు. కొన్ని మంచివి కొన్ని చెడువి, కొన్ని న్యాయమైనవి, కొన్ని అన్యాయమైని. కొన్నింటికి స్పందిస్తాము, కొన్నింటికి అంతగా స్పందించం. ఈ తేడాలు మాట్లాడితే మనం మరొక అన్యాయం చేసిన వారం అవుతాం. కులవాదులం, మతవాదులం, మితవాదులం అవుతాము. కానీ నిజాలు, నిగూఢంగా దాగి ఉన్న అర్థాలను మాట్లాడుకొని మనల్ని మనం చూసుకొనే సందర్భం ఇది. 

నిజాలెప్పుడూ పచ్చిగా, చేదుగానే ఉంటాయి. కులం, మతం సందర్భం ఎప్పుడూ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టుగానే ఉంటుంది. స్త్రీల సమస్య ఎప్పుడూ, అందులో అంటరాని స్త్రీల సమస్య మాట్లాడుకోలేనంత నిశ్శబ్దాన్ని ఆవరించి ఉంటుంది. అది దళిత సంఘాలకైనా, బయటివారికైనా... స్త్రీలంటేనే అంటరాని వారు అందులో అంటరాని స్త్రీలు అధమాధమం. స్త్రీల సమస్యలు, పేద, దళిత, ఆదివాసీ, మైనారిటీల సమస్యల పట్ల మీడియా దృక్పథం ఏమిటి? కార్పొరేట్ వ్యవస్థలుగా ఉన్న వాటికి మార్కెట్ తప్ప మానవత్వం ఉంటుందా? 

నిర్భయ చావుబతుకుల మధ్య దేశం కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఇదే సమయంలో మహిళలపై అనేక అత్యాచారాలు జరిగాయి. కరీంనగర్ కోహెడలో గీత అనే మరొక చెల్లి నిర్బంధించబడి క్రూరాతిక్రూరంగా, అమానుషంగా చంపబడి పత్తి చేలల్లో విసిరివేయబడ్డది. పేద అమాయకులైన గౌడ కులానికి చెందిన తల్లిదండ్రులు, సభ్య సమాజంలో పెద్దగా స్పందన లేదు. 

అక్కడో, ఇక్కడో చిన్నాచితక సంఘాలు రోజూ న్యాయం చేయండి అని కీచు గొంతుతో అరుస్తున్నాయి. ఎప్పుడూ పెద్ద పేపర్లో మొదటి పేజీలో రాలేదు. ఇది ఢిల్లీ సంఘటన కంటే అమానుషం. అక్కడ రాజకీయ పార్టీలు కుల సంఘాలు మాట్లాడవు, జై తెలంగాణ వినిపించదు, రైట్, లెఫ్ట్ పనిచేయదు, కనీసం అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు పలకరించడానికి కూడా రారు. 

ఇక్కడ ప్రస్తావించదలచుకున్నది రెండు విషయాలు. ఒకటి స్త్రీలు అన్నా, వెనుకబడ్డ, అంటరాని కులాల వారన్నా ఇంత కసి, ద్వేషం ఎందుకు? అమానుషంగా, హింసించి, కొరికి, నరికి, ముక్కలు చేసి, శరీరాన్ని ఛిద్రం చేయాలన్న ఆలోచనలకి బీజాలు ఎక్కడ పడ్డాయ్? ఒకడు బట్టలు సరిగా వేసుకోలేదు అంటాడు, మరొకడు స్త్రీ ఉన్నదే భర్తకి సేవ చేయడానికి అంటాడు, ఇంకొకడు అర్థరాత్రి బయట తిరిగితే అంతే అని తీర్పు చెబుతాడు. ఆడపిల్ల రెచ్చగొడితే మగవాడు రెచ్చిపోతాడు అంటాడు, మరొకడు పనికిమాలినది మంచిగా బ్రతిమిలాడి ఉంటే, అన్నా అని నోరారా పిలిచి ఉంటే వదిలిపెట్టే వారు కదా అని జోస్యం చెబుతాడు. 

చివరాఖరికి అంతా ఆడవారి తప్పే, వారు నిమిత్తమాత్రులు, మగ మహారాజులు, అమాయక చక్రవర్తులు, స్త్రీలకూ ఒకలాగా పురుషులకి ఒకలాగా స్పందిస్తాం. దళిత స్త్రీలు, పురుషులను చేతబడి నెపంతో బహిరంగంగా చెట్టుకి కట్టేసి, నిట్టనిలువునా కాల్చేస్తే, పళ్ళు పీకేసి, నాలుక కోసేసి, కండ్లు పీకేస్తే చలించం కదా? దళితులు హక్కులు అడిగిన నేరానికి శిక్షగా నరికి పోగులు పెట్టి బస్తాల్లో కట్టి పడేస్తారు, న్యాయమే కదా, ఆ కులం వారు అనుభవించాల్సిందే. 

ఇదెక్కడి న్యాయం? ఒక హింసను సమర్థిస్తూ మరొక హింసకు గొంతెత్తే వారంతా సూడో ఉద్యమకారులే అని అనాల్సి వస్తుంది. ఒకే నేరానికి ఇద్దరికీ ఒకే శిక్ష పడనంతకాలం, ఒకే నేరానికి ఒకే స్పందన ఉండనంత కాలం ఈ అంతరాల దొంతరలు కలవరపెడుతూనే ఉంటాయి. మహాత్మాజ్యోతి బాఫూలే స్త్రీ, శూద్ర, అతిశూద్ర ముగ్గురూ పీడనకి గురికాబడుతున్నారు, వారిని విముక్తి చేయాలి, పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని జీవితాంతం కులాలకి, మతాలకి అతీతంగా సావిత్రిభాయి ఫూలేతో కలిసి పనిచేసి సమానత్వ విలువలను భావితరానికి అందించారు. 

ఆ తరువాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ అందరి స్త్రీల హక్కుల గురించి రాసి, దానిని అదే అగ్రకుల స్త్రీవాదులు, వారికి వంతపలికే వారే వ్యతిరేకిస్తే తన పదవికి రాజీనామా కూడా చేశారు. ఆ నాయకులు అన్నవాళ్ళు మానవత్వం, సమానత్వ పునాదుల మీద మార్గనిర్దేశం చేస్తే ఇప్పుడు మార్గాలు 'మా' కులాలు, మతాలు అన్న నిర్వచనాలతో నడుస్తున్నాయి. ఉద్యమాలు మీ ఉద్యమాలు, మా ఉద్యమాలుగా చీలిపో 

తున్నాయి. మానవత్వం మరుగున పడుతుంది. మనుషులలో, సమాజంలో మరింత వ్యత్యాసం పెరుగుతుంది. ఇది భిన్న కులాలు, మతాలు, సంస్కృతులు, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే భారతదేశానికి అంత మంచిది కాదు. రేపటి తరానికి ఈ వైపరీత్యాలు అర్థం కాకపోతే ఎవరికి వారుగానే మిగిలిపోవాల్సి వస్తుంది. 

పిల్లల మెదళ్ల నిండా కులం, మతం, మదం చొప్పిస్తూ ఇలాంటి సంఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తే అవి తాత్కాలికమే. క్షణికావేశా ఉద్యమాలు ఎక్కువ నిలబడవు. ఉగ్గుపాలతో కులాన్ని, మతాన్ని, స్త్రీలపై హింసని పట్టిస్తున్న కుటుంబాలని, సమాజాలని మార్చేదాకా ఈ నీచ సంస్కృతి ఆగదు. అందులో ముఖ్యంగా పోలీసు వ్యవస్థలని సమూలంగా మార్చేదాకా ఈ నేరాలు ఆగవు. మనం కోరుకున్న శిక్షలన్నీ కూడా మళ్ళీ అమాయకులను బలిపెట్టడానికే. 

- సూరేపల్లి సుజాత
ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రచయితల వేదిక

Andhra Jyothi Telugu News Paper Dated: 23/1/2013 

Sunday, December 23, 2012

మేధావులూ మౌనమేల..? - సుజాత సూరేపల్లి



తెలంగాణ ఉద్యమాన్ని ఒక రాజకీయ పార్టీకి, ఒక నాయకునికి పరిమితం చేసి, ఇది ఒక రాజకీయ నిర్ణయం ద్వారానే సాధ్యం అన్న ధోరణిపై అందరూ పునరాలోచించుకోవలసిన తరుణమిది. తెలంగాణ అంశాన్ని రాజకీయ పార్టీలకు వదిలేసి చోద్యం చూస్తున్న ఆంధ్ర ప్రాంత పెద్దమనుషులు, మేధావి వర్గాలు అదే సమయంలో ఎక్కడో మెల్లిగా, చాటుగా తెలంగాణకి మద్దతు తెలుపుతున్న ప్రజాస్వామికవాదులు ఆత్మావలోకనం చేసుకోవలసిన సందర్భం ఇది... నిజానికి ఏమాత్రం చరిత్ర తెలిసినా, అన్యాయం, అసమానతలపై ఏ కొద్ది అవగాహన ఉన్నా, పోరాటాలకు, ఉద్యమాలకు విలువలపై నమ్మకం ఉంటే తెలంగాణ ఈ రోజు ఆత్మహత్యలకి కేంద్రంగా నిలిచి ఉండేది కాదు. 

శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలను చూసుకున్నా తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క రంగంలో అన్యాయం జరిగిందని కళ్లకు కట్టినట్టు సాక్ష్యాధారాలతో సహా ప్రజల ముందు ఉన్నాయి. ఈ దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచి, బలవంతంగా హైదరాబాద్ సంస్థానంపై సర్దార్ వల్లభాయి పటేల్ (1948-56), ఉక్కు మనిషి ఆధ్వర్యంలో సైన్యాలతో, బలగాలతో, గూండాలతో వేలాదిమందిని ఉక్కు పాదంతో నిర్దాక్షిణ్యంగా అణచివేసి ఈ ప్రాంతాన్ని ఈ పవిత్ర భారతదేశంలో విలీనం చేయక ముందు నుంచి తెలంగాణ రాష్ట్రం తన ప్రత్యేకతను కాపాడుకోవడానికి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. 

ఇది దక్కనీ ప్రాంతం. ఇక్కడ నిజాం రాజుల పాలన, ఉర్దూ భాష, హిందూ ముస్లింల కలయికతో కూడిన సంస్కృతి, వ్యవసాయ ఆధారిత జీవన విధానం ఒక ప్రత్యేకత. ఇదే ఆంధ్ర ప్రాంతం నుంచి వేరుగా ఉండడానికి కారణం కూడా. ఒక భాష ఒక రాష్ట్రం అనే సాకుతో మద్రాసు నుంచి వేరుపడిన తరువాత సంపన్న ప్రాంతంగా పేరుగాంచిన హైదరాబాద్‌ను ఆక్రమించుకోవడానికి చూపిన అతి అందమైన అన్యాయం. 

1918లోనే హైదరాబాద్ సంస్థానం ముల్కీ ఫర్మానాను జారీచేసింది. 1954-56 ఉద్యమం ఉధృతంగా నడిచింది. అంతకంటే ముందుగానే 'ఇడ్లీ సాంబార్ గోబ్యాక్' నుంచి వ్యతిరేకతను వివిధ రూపాల్లో ప్రకటిస్తూనే ఉంది. ఇవికాక పెద్దమనుషుల ఒప్పందం, ప్రాంతీయ ప్రత్యేక మండళ్లు, గిర్‌గ్లానీ కమిషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చారిత్రక ఘట్టాలు తెలంగాణ ప్రత్యేక ఉద్యమానికి ఉన్న నేపథ్యాన్ని, అనుభవాన్ని చెబుతాయి. ఇదే పరాకాష్ఠకి చేరి 1969 విద్యార్థులపై కాల్పులకి దారితీసి 369 ప్రాణాలు నేలరాలాయి. నెత్తురోడిన హైదరాబాద్ నగరం సాక్షిగా ఇది చరిత్ర చెబుతున్న వాస్తవం. 

2009 నుంచి జరుగుతున్న ఉద్యమంలో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. చనిపోయిన వాళ్ళు పిరికివాళ్ళే కావొచ్చు, అవగాహన లోపం ఉండొచ్చు కానీ వారి చావులను అవమానపరిచి ఉద్యమంలో వారిగురించి మాట్లాడకుండా ఉండడం అమానవీయమే అవుతుంది. ఒక ప్రాంత ఆకాంక్షను, ఉద్యమాన్ని చిన్నచూపు చూడడంతో నిరాశా, నిస్పృహలకి గురై ప్రాణాలు పోగొట్టుకున్న వారి చావుకు ఎవరు కారణం అనేది విశ్లేషించాలి. ఐదు సంవత్సరాల ఎన్నికల పండుగకు ప్రజల క్షేమాన్ని కుదించి, డబ్బు, కుల, స్వార్థ రాజకీయ నాయకులకు జీవితాలను అంకితం చేస్తున్న పరిస్థితులను చూసి మౌనంగా ఉన్న మేధావులు, ప్రజాసంఘాలను ఎలా అర్థం చేసుకోవాలి. 

ఉద్యమ నేపథ్యం చూస్తే తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ జనసభ, మహాసభ తర్వాత వచ్చినదే తెలంగాణ రాష్ట్ర సమితి (2001). కేవలం రాజకీయ నిర్ణయం ద్వారానే తెలంగాణ సాధ్యం అని గత దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమం రాజకీయ రంగు పులుముకుంది. ఈ మలుపులు అన్నీ తెలంగాణ ఉద్యమంలో అనేక పార్శ్వాలను అంటే కులం, వర్గం, రాజకీయ అవగాహనను బయటపెట్టాయి. జై తెలంగాణ అన్నప్పుడల్లా జై ఆంధ్ర ఉద్యమం రావడం 1972 నుంచి మొదలైంది. అప్పుడు ముల్కీ విధానం రద్దు కావాలని జై ఆంధ్ర ఉద్యమం నడిచింది. 

ఇప్పుడు మళ్ళీ ఒక రాష్ట్రం, ఒక తల్లి పిల్లలం అని మరొక నినాదంతో కొంతమంది రాజకీయ నాయకుల కనుసన్నలలో, తప్పుడు తడకల ఆధిపత్య భావజాలంతో సీమాం ధ్ర ప్రజలను మోసం చేస్తూ సమైక్యాంధ్ర ప్రోగ్రాం నడుస్తుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అంతా కేసీఆర్, అటు లగడపాటి, కావూరి లాంటి వాళ్ళు నడిపిస్తున్నారని చాలా మంది సీమాంధ్ర ప్రాంత ప్రజల అభిప్రాయంగా తెలుస్తుంది. మీడియా కూడా ఈ భావననే పెంచి పోషిస్తుంది. 1969 నుంచి ఉధృతంగా ఉద్యమం భావవ్యాప్తి దిశగా నడిచింది. 

ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించాక రాజకీయ పార్టీల ద్వారా పరిష్కారమౌతుందని అనేక ప్రయత్నాలు 2001, 2004, 2009 ఎన్నికలలో నడిచాయి. ఏ పార్టీ కూడా తెలంగాణ అజెండా ఎన్నికల మ్యానిఫెస్టోలో లేకుండా పోటీ చేయలేదు. గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో తిరిగిన ప్రతి పార్టీ కూడా మేము తెలంగాణకి వ్యతిరేకం కాదు అని చెప్పే స్థితికి ఉద్యమం తీసుకొచ్చింది అన్న సత్యం మనముందున్నది. ఈ విషయం చెప్పడానికి కూడా మనకి పరకాల ప్రభాకర్, లగడపాటి, కావూరి, కేసీఆర్‌లు కావాలా? విధిలేని పరిస్థితిలో కేసీఆర్ నిరాహార దీక్షకు కూర్చోవడం, ఉద్యమం ఒక్కసారిగా పైకి లేవడం అందరికీ తెలిసిందే. 

డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన తిరిగి తెలంగాణ ప్రాంతానికి ఒక కొత్త ఊపిరిలూదింది కానీ ఆ ఆశలు నిలువక ముందే మళ్ళీ కపట రాజకీయ పార్టీలు బరిలోకి దిగి ప్రకటన వెనుకకుపడేట్టు చేశాయి. రాజీనామాలు, ఎన్నికలు, మిలియన్ మార్చ్‌లు, సకలజనుల సమ్మె, బం ద్‌లు, ఆత్మహత్యలు నిత్యకృత్యం అయ్యాయి. దీనికి బాధ్యత గల ప్రజాసంఘాలు, మేధావుల నిశ్శబ్దం కాలానికి ఒక మాయని మచ్చ గా మిగిలిపోనున్నది. ఈ మధ్యలో లవణం గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు, కొద్దిమంది రచయితల 'కావడి కుండలు' వంటి రచన లు, బహుజన కెరటాలు, కుల నిర్మూలన వంటి కొద్ది విశిష్ట పత్రికలూ తప్పితే ఎక్కువ బాహాటంగా మద్దతు ఇచ్చిన వారు చాలా తక్కువ. 

ఒక ప్రాంతం అల్లకల్లోలమవుతుంటే, ఉద్యమాలనే ఊపిరిగా మలుచుకొని బతుకుతుంటే ఒక పరిష్కార మార్గాన్ని చూడడంలో, చూపడంలో సమైక్యాంధ్రలో బుద్ధిజీవులు కరువయ్యారు అని తెలంగాణ ప్రాంతం భావించదా? రాజకీయ పార్టీలంటేనే స్వార్థం, వాటి మనుగడ కోసం ఏమైనా చేస్తాయి అన్న విషయం తెలంగాణ ఉద్యమంలో ప్రజలు కళ్లారా చూసారు. దీనికి తెలంగాణ రాజకీయ నాయకులు మినహాయింపు కాదు. 

సీమాంధ్ర పెద్దమనుషులు రెండు ప్రాంతాలకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ ఇక్కడ వివరిస్తాను. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో ఉన్న సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అనే ప్రముఖ పరిశోధన సంస్థ ఢిల్లీలో ఇరు ప్రాంతాల నేతలను, పరిశోధన కారులను పిలిచి తెలంగాణ అంశంపై ఒక సానుకూల పరిష్కార మార్గం చూసే నేపథ్యంలో ఒక ప్రయత్నం చేసింది. దానికి 'డైలాగ్ ఆన్ తెలంగాణ' అని పేరు పెట్టి, రాజకీయాలతో సంబంధం లేని వారిని దాదాపుగా 50 మందిని ఎంపిక చేసి ఆహ్వానించారు. 

తెలంగాణ ప్రాంతం నుంచి ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్, జాహెద్ అలీ ఖాన్ (ఎడిటర్, సియాసత్), భిక్షం గుజ్జా, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బూర్గుల విజయ్, పాండు రంగారెడ్డి, డాక్టర్ సూరేపల్లి సుజాత, ఆంధ్ర ప్రాంతం నుంచి సి.వి. రాఘవులు, కె.ఎస్. చలం, డాక్టర్ చిన్నయ సూరి, కె.వి. రమణా రెడి, వీరితో పాటు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులని, పరిశోధనకారులని, కొద్దిమంది మీడియా మిత్రులని, శ్రీకృష్ణ కమిటీ వారిని కూడా పిలిచారు. 

తెలంగాణ రాష్ట్రంపై కనీసం మేధావులు అన్నా నోరు విప్పుతారని, నిజానిజాలు కోపాలు, ఉద్రేకాలు, ఆవేశకావేశాలకు లోనుకాకుండా మాట్లాడుకోవచ్చని ఎంతో ఆశపడ్డ మాకు చాలా నిరాశ ఎదురైంది. అంతే కాకుండా ఇంకా బాధ కలిగించిన అంశం యునైటెడ్ ఆంధ్రా జాక్ రెసిడెంట్ వై. నరసింహారావు, కన్వీనర్ వి.అంజిరెడ్డి నుంచి నిర్వాహకులకు అందిన లేఖ. దాని సారాంశం 'మీరుపంపిన ఆహ్వానంలో తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్ నోట్ తెలంగాణకు మద్దతు పలికేదిగా ఉందని, అందుకని మేము ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని ఉంది. 

నిజానికి ఆ విధమైన అభిప్రాయముంటే అక్కడికొచ్చి నివృత్తి చేసుకోవచ్చు ఈ మేధావులు. కానీ ఆ విధంగా జరగకుండా చూసి ఏమి నిరూపించుకున్నారు? అక్కడ కనీసం 'చర్చ' అని కూడా అనలేదు కేవలం 'డైలాగ్' అని మాత్రమే అన్నారు. ఆ సమావేశానికి శ్రీకృష్ణ స్వామి అయ్యర్ వంటి నీటి నిపుణులు, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు దుగ్గల్, సంజయ్ బారు వంటి ప్రముఖులు హాజరయి వారి అభిప్రాయాలను తెలిపారు. ఒక చర్చకి, డైలాగ్‌కి సిద్ధంగా లేని పెద్ద మనుషులు రెండు రాష్ట్రాల మధ్య సుముఖంగా, సవ్యంగా ఒక పరిష్కారానికి వస్తారని అశలు లేవు. 

తెలంగాణపై వోట్లు, సీట్లు, నోట్లు అన్న సూత్రాలతో రాజకీయాలు నడుస్తున్నాయి. తెలంగాణ విషయం పట్టించుకోవడానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన సామాన్య ప్రజలు ముందుకు రావడం లేదు. రానివ్వట్లేదు అంటే బాగుంటుందేమో. ఒక ప్రాంతం అతలాకుతలమవుతుంటే ఇంకొక ప్రాంత ప్రజలు, ప్రజా సంఘాలు, మేధావులు ప్రేక్షకులుగా చూస్తూ ఊరుకోవడమేనా? గత 60 ఏళ్లుగా తమ వ్యాపారాల కోసం హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి సొంత ప్రాం తాలని, వాటి అభివృద్ధిని మరిచిపోయిన సీమాంధ్ర నాయకులని అడిగే కనీస ప్రయత్నం చేయకుండా ప్రజలను మభ్యపెట్టడం కాదా? 

నిజానికి అభివృద్ధికి నోచుకోని ఉత్తరాంధ్రకి, శ్రీకాకుళం వంటి జిల్లాలకి రాజధాని హైదారాబాద్ అంటే ఎంత దూరమో, అభివృద్ధిలో అంతే దూరంగా ఉంది. వారికి రేపు విజయవాడో, విశాఖపట్నమో రాజధాని అయితే లాభం చేకూరుతుంది అని ఆలోచించే సమయం ఇది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కొద్దిమంది అగ్రకుల పెట్టుబడిదారుల చేతిలో నలిగిపోతున్న సమైక్యాంధ్ర ప్రాంతంలో వెనుకబడిన కులాల, వర్గాల వారికి న్యాయం చేకూరుతుంది అన్న వాస్తవాన్ని ప్రజల ముందుంచాలి. శ్రీకృష్ణ కమిటీలో కూడా స్పష్టంగా గ్రామీణులు, కిందిస్థాయి వారు రెండు ప్రాంతాలను కోరుకుంటున్నారని తెలియజేశారు. వెనుకబడ్డ రాయలసీమ ప్రాంతం రాష్ట్రాల విభజనతో అభివృద్ధికి నోచుకోదా? 

ఇప్పటివరకు ఏర్పడ్డ ఛత్తీస్్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ మానవాభివృద్ధి సూచికలు జాతీయస్థాయి కంటే మెరుగ్గా ఉన్నాయన్న విషయం ఎంత మందికి తెలుసు? ఇష్టం లేకపోతే ఎప్పుడైనా విడిపోవచ్చని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1956, మార్చ్ 5 బహిరంగ సభలో చెప్పారు. 'విశాలాంధ్ర' అనే భావనే సామ్రాజ్యవాద విస్తరణకు తోడ్పడేదిగా ఉందని 1953, అక్టోబర్ 17లో చెప్పారు. ఆయన అపోహలు, ఫజల్ అలీ ఖాన్ భయాలు నిజమయ్యాయి అని వేరే చెప్పక్కర్లేదు. 

తెలంగాణ అనగానే ఆంధ్ర వాళ్ళని వెళ్ళగొడతారని, నీళ్ళు ఇవ్వరని, హైదరాబాద్ పోవాలంటే వీసా కావాలని, ముస్లింలకు చేటని, మావోయిస్టుల సమస్య వస్తుందని పుకార్లు, వదంతులు పుట్టిస్తున్న వారి వార్తలను నమ్మి మోసపోతున్నది సామాన్య ప్రజలే. చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోపానాలు అని అమెరికా వంటి దేశాలు నిరూపిస్తున్నాయి. ఈ రాష్ట్రాల ద్వారా భాష, సంస్కృతి, వనరుల వినియోగం, నిధుల పంపకం సక్రమంగా అన్ని ప్రాంతాలకు అందుతాయని చరిత్ర చెబుతుంది. 

ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, హక్కుల సంఘాలు, మేధావులు, విద్యార్థులు అ అవగాహనను ప్రచారం చేయవలసిన బాధ్యత భుజాన వేసుకోవాలి. స్వేచ్ఛ, స్వతంత్ర సమానత్వ పునాదుల మీద న్యాయాన్యాయాల నిర్ణయం జరగాలి. లేకపోతే ఈ ప్రజాస్వామ్యం నిరంకుశ రాచరిక పాలన వైపు, పెట్టుబడిదారుల కబంధ హస్తాల చేతిలో చిక్కుకుని ప్రజలను బిచ్చగాళ్ళుగా మార్చే వైపుకు తీసుకుపోతాయి. ఇవే పెట్టుబడిదారీ శక్తులు నేడు ప్రభుత్వాలను శాసిస్తున్నాయి, ఉద్యమాల నోర్లు మూయిస్తున్నాయి అన్న విషయం తెలుసుకొని కూడా మౌనంగా ఉండడం సమాజానికి చేసే ద్రోహమే. 

- సుజాత సూరేపల్లి
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రచయితల వేది

Andhra Jyothi News Paper Dated: 23/12/2012

Monday, November 19, 2012

దళితన్నా నువ్వెటు?-----సుజాత సూరేపల్లి




గీతారెడ్డికి కోపం వచ్చింది. గీతాడ్డి అంటే ఆనాడు అసెంబ్లీలో ఎవరికీ తలవంచకుండా, తెలంగాణ కోసం నిర్భయంగా మాట్లాడి , పోట్లాడిన ఈశ్వరీబాయి, తెలంగాణ అమరవీరుల స్తూపం కోసం కృషి చేసిన తెలంగాణ ముద్దు బిడ్డ, రచయిత కూతురు ‘గీత’ కాదు. ఒక నాన్ తెలంగాణ రెడ్డిని చేసుకుని పేరుని కూడా మార్చుకుని ‘గీతాడ్డి’గా రూపాంతరం చెందిన దళితడ్డి మహిళా మినిస్టర్ ‘గీతాడ్డి’. ప్రొఫెసర్ కోదండరాం గీతాడ్డిని జహీరాబాద్, విద్యార్థిజేఏసీ పదిరోజుల పాదయాత్ర ముగింపు సభలో, ‘కర్రు కాల్చి వాత పెడితే తెలంగాణ వస్తుంది, ఆ తల్లికి ఎట్లా పుట్టిందో’ అని అనడం ఇక్కడ పెద్ద వివాదాస్పదమైంది. ఒక టీవీ చానల్, దానికి సంబంధించిన పేపర్ రాసిందే రాసి, వేసిందే వేసి, గీతా‘డ్డి’ గారిని అడిగిందే అడిగి పండుగ చేసుకున్నది. నిజానికి మహిళలని, దళితులని ఇంకా కింది కులాలని ఎవరు ఏ విధంగా కించ పరిచినా క్షమాపణ చెప్పాల్సిందే. కోదండరాం చెప్పడం జరిగింది. ఇక్కడ రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి-ఇంకా ఇతర రెడ్డిమినిస్టర్ మహిళలు ఉండగా ఎందుకు గీతాడ్డిని మాత్రమే అనవలసి వచ్చింది? రెండు- మహిళ అయి ఉండి, దళితురాలు అయిన గీతాడ్డిని అనడం సబబేనా? ఈ రెంటికి సమాధానం చెప్పాల్సిన సందర్భం, సమయం ఇది.
ఒక మినిస్టర్ గీతాడ్డిని ఒకటి రెండు మాటలు అనడం ఇవాళ దళిత సంఘాలకు కోపం వచ్చింది. ఎన్నడూ లేనిది గీతాడ్డి నోట్లోంచి మాదిగ పేరు వినపడింది, నిజానికి ఆమె మాల మినిస్టర్‌గా మాత్రమే చాలామంది మాదిగలకి ఇతర కులాలకి తెలుసు.


ఇప్పుడు పదవిలో ఉన్న మాదిగలను ఎంత టార్గెట్ చేస్తుందో, ఎన్ని కుట్రలు, కుతంవూతాలు పన్ని వారిని దింపే ప్రయత్నాలు చేస్తుందో బయటికి చెప్పుకునే పరిస్థితిలో మాదిగలు లేరు. మాల కంటే ఎక్కువ రెడ్డి మినిస్టర్‌గా ఆ నియోజకవర్గంలో ఉన్న దళిత సంఘాలకి అందరికి తెలుసు, బయట ఉన్న ఇతర కులాలకి తెలుసు. ఆమె పోలేపల్లి పోరాటంలో దళితులందరూ భూములు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకుంటుంటే పరిక్షిశమల మినిస్టర్‌గా ఉండి దళితులకు ఏమాత్రం అండగా నిలబడిందో కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆవిడ నియోజక వర్గంలో ఉన్న నాలుగు మండల ఇన్‌చార్జ్‌లలో ఉన్న మాదిగలను తీసేసి రెడ్డిలను పెట్టడం, యూత్ కాంగ్రెస్ మాదిగని మార్చేసి రెడ్డిని పెట్టడం కూడా ఆమె నమ్మిన దళిత సిద్ధాంతానికి నిదర్శనం. ఈ మాటలు చెప్పింది జహీరాబాద్ సభ నిర్వహించిన ఆశప్ప. అదికూడా గీతారెడ్డి గారు చానల్ నిర్వహించిన కార్యక్షికమంలోనే. అక్కడ పదిరోజులు పాదయాత్ర చేసింది అంతా దళితులే అని, కనీసం ఒక్క రోజు కూడా వచ్చి మాకు సంఘీభావం తెలుపలేదని, గీతాడ్డి గారు పోలీసు వాళ్లకి చెప్పి ఎక్కడ షెల్టర్ కూడా దొరక నీయకుండా చేసిందని వాపోయాడు. దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడడం కానీ, రాయడం కానీ ఆ పత్రిక, చానల్ చేయవు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మసాల లేదు.




కోదండరాం కానీ, నాకు తెలిసి ఏ నాయకుడు అయినా మాట్లాడే వారు ఏ మీటింగ్‌కు పోయినా, అక్కడి ప్రాంత పరిస్థితుల్ని, సభ నిర్వహించిన వారి కోరిక మేరకు మాట్లాడుతారు. అక్కడ గీతాడ్డి గురించి మాట్లాడారంటే సభ నిర్వాహకులు చెప్పిన విషయాలని బట్టే మాట్లాడారు. అందులో మినిస్టర్‌లను టార్గెట్ అనుకున్నారు కాబట్టి అక్కడ దళిత మినిస్టర్‌లను తిట్టకూడదని ఏ రిజర్వేషన్ సౌకర్యం తెలంగాణ ప్రజలు అమలు పరచలేదు. అయితే అక్కడ కోదండరాం ఉండబట్టే అంత కథ. ఇంకా వేరే దళితుడు ఉంటే? ఇక్కడ ఎవరిని అనాలని సమర్థించడం కాదు. ప్రభుత్వం తొడుగు తొడుక్కున్నాక, దళితుల పక్షాన ఎన్నడూ నిలబడని వారు మాట్లాడే మాటలు కాదు అని చెప్పడమే. కులంతోని దళితత్వం రాదు. మనం ఆచరించిన విధానాలతోని వస్తుంది. మనం నమ్మిన సిద్ధాంతాలతోని వస్తుంది. నిజానికి దళితులంతా ఈ అగ్రకుల బానిసలు, మనువాదులు కాకుండా ఉంటే ఈ రోజుకి ఇన్ని అత్యాచారాలు, ఇంత వెనుక బాటుతనం ఉండేది కాదు. తెలంగాణ విషయంలో మంత్రులంతా బాధ్యత వహించాలి అన్నది ఇక్కడ డిమాండ్. కానీ దళిత మినిస్టర్లు, మహిళలు మాత్రమే అని ఎక్కడ లేదు. తెలంగాణ ప్రజలంతా ఈ దళిత, ఆదివాసీ బడుగు వర్గా ల రాజకీయ నాయకులని కొంతకాలంగా చూస్తూనే ఉన్నారు. అటు చూస్తే కాంగ్రె స్ సోనియమ్మ భక్తులు, ఇటు చూస్తే చంద్రబాబు గులాములు.



వీరిని కాదని తెలంగాణ కోసం స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఉద్యమంలో పాల్గొన్న దళితులు కానీ, అగ్ర కులాల వాళ్ళు కానీ చాలా తక్కువ. వచ్చినా వెంటనే మరొక అగ్రకుల పార్టీలోనే, ఇండిపెండెంట్ గానో మిగిలిపోయారు. నిన్న కాక మొన్న ఉస్మానియా యూనివర్సిటీ లో ఉరి వేసుకున్న సంతోష్ దళితుడే. ఈ ఆంధ్రా పాలనలో మాలాంటి వాళ్ళు ఎన్ని చదువులు చదువుకున్నా ఉద్యోగం రాదు, ప్రభుత్వాలు, పాలకులు మారినా ఏమీ పరిస్థితులు మారలేదు’ అని సూసైడ్ నోట్ రాశాడు. ఏ ఒక్క దళిత మినిస్టర్‌కి గానీ, ఇతర నాయకులకి, సంఘాలకి చీమ కుట్టినట్టైనా లేదు. పది తరువాత పదకొండు చావులు అని సరి పుచ్చుకున్నాయి. లెక్కలు పెట్టుకోవడానికి కూడా బద్ధకమే కదా! ఇక్కడ వ్యవస్థ ని, ప్రభుత్వాలని గురించి మాట్లాడినపుడు అందరూ భాగస్వాములే. అయినా వారి జీవితంలో ఎప్పుడైనా దళితులకి, ఇతర అణగారిన కులాలకి ఏమైనా చేస్తే అది ప్రజలే చెపుతారు కదా. ఏ చానల్ కానీ, పేపర్లు కానీ నెత్తిమీదికెత్తుకోనక్కర్లేదు. గీతాడ్డి గారే స్వయంగా చెప్పినది, వారి నాయకుడు జానా‘డ్డి’ మాట జవదాట లేమని, వారికి కొన్ని పరిమితులు ఉంటాయని. దీనర్థం మా దళిత పిలగాం డ్లు ఎంత మంది చచ్చినా కూడా నేను రెడ్డి వారి మాటనే వింటాను అని చెప్పినట్టు అర్థం చేసుకోవచ్చా మేడం మినిస్టర్? ఈశ్వరీబాయి నిజమైన ప్రజాస్వామిక నేత. ఆ కాలంలోనే అన్ని పరిమితులను దాటి సభలలో, రాతలలో నిర్భయంగా తన అభివూపాయాన్ని బల్లగుద్ది చెప్పారు. ఈశ్వరీబాయికి, గీతారెడ్డికి పోలిక ఎక్కడ? అన్నది సందర్భం.



కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని, కాంగ్రెస్ వారి ఉప్పు, కారం తినుకుంటూ, దళిత ‘గీత’ ని రెడ్డి కులంగా మార్పు చెందినపుడు మీరు ఎటువైపు ఉన్నారన్నది ప్రజలు మీకు ఇవ్వాల్సిన కితాబు. నాలుగు సంఘాలు కావు, ఇన్ని ఏండ్లు ఎన్నిసార్లు మీ దళితుల కు మరిచిపోలేని కార్యక్షికమాలు చేశారో గుర్తుకు తెచ్చుకోండి. ఎంతమందిని అభివృద్ధి పథంలోకి తెచ్చారు, ఎన్నిసార్లు తెలంగాణ ఆకాంక్షని బయటపెట్టారు? మీ కులంలో కనుక రెడ్డి లేకపోతే మీకు ఇన్ని పదవులు వచ్చి ఉండేవా! అన్నది కూడా ఒక్కసారి మీరు పరిశీలించాలి. సత్యసాయి బాబా గారికి సంబంధించిన ఆస్తి పాస్తుల విషయంలో మీరు అతి సన్నిహిత మనిషి అని తెలిసినపుడే అర్థం అయింది మీరు ఎంత పెద్ద వారో. మీలో ఏ మూలనో దాగి ఉన్న దళితత్వం ఇపుడు ఇంతగా బయటికి వచ్చిందంటే, అందునా మీరు మాదిగలకి నాయకత్వం ఇవ్వాలని మాట్లాడినారంటే మాదిగ దళిత యువతకి ముందుగా అభినందనలు చెప్పాలి. కనీసం ఇట్లాంటి సంద ర్భం లోనైనా మనం నిజాలు మాట్లాడుకుంటాం.



మీ దాకా వచ్చిందంటే ఇంత బాధ పడుతున్నరే మరి, దళిత బిడ్డలు నాయకులు ఎక్కువగా పాల్గొన్న తెలంగాణ ఉద్య మం కంటే మీ పదవి ఎక్కువైందా? నేను ఒక్కదాన్ని రాజీనామా చేస్తే వస్తుందా అన్న మాటలు వింటుంటే సిగ్గుగా ఉంది. నా ఒక్క చావుతోని వస్తుం దా అని ఎనిమిది వందల మంది చనిపోయిన వారు ఎవరూ అనుకోలేదు. ప్రతి మీటింగ్‌లో పాల్గొని, ప్రతిసారి దెబ్బలు తిన్న, తింటున్న, కేసులు మీదేసుకున్న ఉద్యమకారులు ఎవరూ అనుకోలేదు. నాలుగు నెలలు రాజీనామా చేశానని ఇరవైసార్లు చెప్పుకున్నారు. మరి ప్రాణాలు పోగొట్టుకున్న బిడ్డలు, వాళ్ళ తల్లిదంవూడులు ఎన్ని తరాలు చెప్పుకోవాలి? ప్రాణం విలువ కట్టగలరా? ఒకసారి ప్రాణం తీసుకుంటే మళ్లీ ప్రాణాలు వస్తాయా? మీ డాక్టర్ భాషలో చెప్పండి మేడం? మా ప్రాణాల కంటే ఎక్కువా మీ పదవులు? ఒక్కసారి రాజీనామా చేస్తే పూవుల్లో పెట్టి మళ్లీ గెలిపిస్తాం అన్నా కూడా, గెలిపించినా కూడా నమ్మకం లేదా? మీరు చేసిన పనులకి మళ్లీ మీరు జీవితంలో గెలవరని మీకు అంత నమ్మకమా? అందుకే పదవులు పట్టుకొని వేలాడుతున్నారా? అసలు తెలంగాణ రాక పోవడానికి కాంగ్రెస్, తెలుగుదేశం కారణమైనప్పుడు, మీరు అందు లో భాగమే కదా? మీరు తెలంగాణకు ప్రత్యేకించి ఇన్ని ఏండ్లుగా చేసింది ఏమైనా ఉందా? మహిళగా ఉండి మహిళలకి చేసింది ఏమిటి? దళితులుగా ఉండి దళితుల కి, సారీ మీ మాలలకి ఏమి చేశారు? మినిస్టర్‌గా అది కూడా రెడ్డిగా ఉన్న మీరు ఆ కులం గొప్పదనే కాదా ఆ తోక తగిలించుకున్నారు? ఈశ్వరీబాయి ఉంటే ప్రాణం పోయినా ఆ పని చేసేదా? ఆ మహాతల్లి చేసిన సేవలో ఒకటో వంతు సేవ చేసినట్టు మాకైతే తెలియదు. ఏమైనా చేసి ఉంటే మాకు చెప్పండి.



మరి కోదండరాం ఆ రెడ్డి తోకని తీసేసుకున్నట్టు మాకు తెలుసు. హక్కుల కార్యకర్తగా, మేధావిగా, గత మూడేళ్లు గా ఉద్యమ రథసారథిగా ముందు పడి, ఉద్యోగానికి సెలవు పెట్టి అహర్నిశలు ఎదో ఒక గ్రామంలోనో, మీటింగ్‌లోనో తిరుగుతున్నారు. మీరు తెలంగాణ ఉద్యమంలో బయటికి వచ్చి మాట్లాడిన సందర్భాలు ఎన్ని? నిజంగా మీకు దళిత స్పృహ ఉంటే, దళితుల చావుకైనా స్పందించి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొని ఉంటే తమరే ఉద్యమ రథసారథి అయ్యే వారేమో! ఎప్పుడైనా ఆలోచించారా? అపుడు ఈశ్వరీబాయి కడుపున పుట్టిన బిడ్డ కాబట్టే ఇట్లా ఉంది అని తెలంగాణ జేజేలు చెప్పే వారు కదా!
కోదండరాం బాధ్యత గల ప్రొఫెసర్ కాబట్టి ఆయన అట్లా మాట్లాడకూడదు. నాలుగున్నరకోట్ల మంది ప్రజల ఆకాంక్ష ఒక బాధ్యత. వారికి ఎటువంటి పదవులు లేవు అని తెలిసినా ప్రజలు ముందు పడి అన్ని చేస్తున్నారు. అసలు బాధ్యత అంటే రాజకీయనాయకులకి తెలుసా? ఒక సారి ఎన్నుకున్న ప్రజలకు దించే హక్కు కూడా ఉంటుందని? అయినా రాజకీయ నాయకులు, ప్రొఫెసర్లు ఒకరు ఎట్లా అయితరు? ప్రొఫెసర్లు విద్యార్హతలతోని ఒక పద్ధతి ప్రకారం అనేక పరీక్షల అనంతరం వస్తారు. మరి మీరు? ఓట్లు వేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి? ఎన్ని తీరని వాగ్దానాలు తేవా లి? యూనివర్సిటీలు అంటే సమాజంలో ఉన్న అనిశ్చితి పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతలు తీసుకుంటాయి, అయి నా డాక్టర్ అయినా, యాక్టర్ అయినా , ప్రొఫెసర్ అయి నా కూడా ముందుగా మానవత్వం ఉన్న మనుషులు. ప్రభుత్వ ఉద్యోగం చేసే వారు ప్రజల సొమ్ముని జీతాలుగా తీసుకుంటారు. 



ప్రజలకు బాధ్యత వహించాల్సింది వారే. రాజకీయ నాయకుల లాగా కొండలని పిండి చేసి, అడవులని, ఇసుకని, బొగ్గుని, రేషన్ సరకులని, దళిత నిధుల ని, ప్రజల కోసం వచ్చిన డబ్బుని సొమ్ము చేసుకోరు. ఎవ రు ఏ ఉద్యోగం చేసినా అన్యాయం గురించి మాట్లాడొ చ్చు, పోట్లాడొచ్చు. మీరు లగడపాటి లాగా మాట్లాడకం డి. యూనివర్సిటీ టీచర్లు ప్రజల జీవితాలకి దశ దిశా నిర్దేశం చేస్తారు, పరిశోధనలు చేస్తారు. రాబోయే మార్పులను ముందుగా పసిగడతరు, బోధిస్తరు, పుస్తకంలో ఉన్న విషయాలను బట్టి కొట్టడం కాదు. మరోసారి కోదండరాంను రాజీనామా చేయాలని మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ప్రొఫెసర్ల కంటే మినిస్టర్‌ల కంటే ముందు మనం మనుషులం అన్న ముచ్చట మరిచిపోవద్దు. ఇంకా మీరు ఎక్కువ గొడవ చేస్తే మీ వెనుక ఉన్న శక్తులు అందరూ బయటికి వస్తారు, అది పేపర్ వాళ్ళు కావొచ్చు, ఇతర పార్టీ నాయకులు కావొచ్చు లేదా స్వార్థ పూరిత శక్తులు కూడా ఉండొచ్చు. అవన్నీ మీ మాటలలో అర్థం అవుతూనే ఉన్నాయి, ప్రజలు అనుకుంటే ఏదైనా చేస్తా రు ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇప్పటికైనా దళిత కార్డు, స్త్రీల కార్డులు అడ్డం పెట్టుకొని ఉద్యమాలను నడపకండ్రి. ముందుగా మీరు ఫూలే, అంబేద్కర్ ఆలోచనా విధానంతోని బతకడం నేర్చుకుంటే అదే పది వేలు. ప్రజలు తెలంగాణలో ఉన్న ప్రజాస్వామిక వాదులు, రైట్ సంఘాలు, లెఫ్ట్ సంఘాలు అందరూ తెలంగాణ సమస్య పట్ల స్పందించండి. మీకున్న భయాలని అయినా చెప్పండి. కులం నీడలో అన్యాయం చేస్తామంటే ఊరుకొనేది లేదు. 

-సుజాత సూరేపల్లి
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యద

Namasete Telangana Telugu News Paper Dated: 20/11/2012

Wednesday, November 7, 2012

ఈ హత్యలకు బాధ్యులు ఎవరు? ---సుజాత సూరేపల్లి



మేడం, ఆ సంఘాలను రానియవద్దు వాళ్ళు ప్రజలను అమ్ముకుంటా రు. వాళ్ళుఉద్యమాలను ఫోటోలు, వీడియోలు తీసుకొని సొమ్ము చేసుకుంటారు, పోలేపల్లి సెజ్ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నపుడు వచ్చిన దాదాపు నూటానలభై సంఘాల గురించి ఆరా తీసి, అనుక్ష ణం కళ్ళల్లో వత్తులేసుకొని పోలేపల్లివాసులను కాపాడే వెంక లేడు అన్న చేదు నిజాన్ని నమ్మడంకష్టంగానే ఉంది. పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఉద్యమం లో దాదాపు రెండేళ్లు వెంక కలిసి పనిచేసిన అనేక సంఘటనలు మెదడులో సుళ్ళు తిరుగుతున్నాయి. నిజానికి పోలేపల్లి ఉద్యమంలో ప్రజల దగ్గర, వెంక లాంటి కార్యకర్తల దగ్గర పనిచేయడమే ఈ రోజు రాజ్యాన్ని నాలుగు దిక్కుల నుంచి, కపట రాజకీయ నాయకులను, దళారులను, కొన్ని సంఘాలను నలభై దిక్కుల నుంచి చూసే చూపుని నేర్పింది. వెంక ఈ మధ్యలో కూడా పోలేపల్లి భూముల కోసం మళ్లీ ప్రజల దగ్గరకి వెళ్తున్నడని విన్నప్పుడు చాలా సంతోషపడిన. పోలేపల్లిలో ఇపుడు మనుషులులేరు, అస్థిపంజరాలున్నై, పెద్దపెద్ద బిల్డింగులు,నల్లనల్లని రోడ్లు, లైట్‌లు ఏపీఐఐసీ అనే బోర్డ్‌తో ఒక అందమైన జైలు నిర్మించబడింది. ఆప్రదేశంలో ఒకప్పుడు పచ్చగా ఉన్న పోలేపల్లి ఇపుడు సెజ్ కంపెనీల్లో మాడిమసై పోయింది. భూమి కోసం తన్లాడి వారు రెండు నెలలకు, మూడు నెలలకు ఒక్కొక్కరు రాలిపోన్నారు.పాలమూరులో ప్రతీ కార్యక్షికమంలో చురుకుగా పాల్గొన్న వెంక ఇవ్వాళ లేడు. అటు భూములు పోయి గుండె పగిలి చచ్చిన జనా లు ఒకవైపు, చావబోయే జనాల కోసం పనిచేసే కార్యకర్తల హత్యలు మరో వైపు. ఇంక తెలంగాణ అంతా బొందలగడ్డ కావలసిందేనా? 

భూముల కోసం, తరతరాల చెమట,రక్తంతో తడిపిన జాగ కోసం, నాలు గు మెతుకులు తిందామనే సరికి గద్దప్లూక్క వచ్చి తన్నుకుపోతున్నారు. తమ భూమిని ఏ కంపెనీ వారో గుంజుకుంటుంటే వారిని అడ్డుకుంటే నిమిషాల్లో పోలీసోల్లు దిగుతారు. ఇపుడు వెంక చనిపోయి ఇన్ని రోజులైనా కలెక్ట ర్, ఎస్పీలకు స్వయంగా కలిసి చెప్పినా ఆ జాడను కనుక్కోలేకపోతున్నారు. తన తండ్రి పోలీసు నౌకరి చేసి ఇంత గుడిసె గూడ సంపాదించుకోలేని స్థితిలో ఉన్న వెంక కుటుంబం ఎట్లాంటిదో తెలుసుకోవడానికి ఢిల్లీ నుంచి గూఢచారశాఖను రప్పించాలా? దేనికి అమ్ముడు పోనీ కార్యకర్తను కనీసం ఎవరు ఎత్తుక పో యి చంపిన్రు అన్న సమాచారం కూడా ఇస్తలేరు. ఈదేశంలో అత్యంత శక్తివంతమై న వ్యవస్థ, అడవులను మింగి, ఖనిజ సంపదలను విదేశాలకు అమ్ముకొని, కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్న వారిని ఏమి అనలేరు. మారు మూల గ్రామాల్లో ఉంటూ, కాకులు దూరని కారడవుల్లో అమాయకులైన పేద ప్రజలు, వారి ప్రాణాల కోసం, పర్యావరణం కోసం, రేపటి తరం కోసం కొట్లాడుతుంటే వెంటనే కొరడా ఝుళిపించే పోలీసు వారు ఒక్క మనిషి, ఒకే ఒక్క మని షి చావుకు కారణాలు కనుక్కోలేరా? అని ఆశ పడుతుంటారు. భస్మాసుర ‘హస్తా’లను అభయహస్తాలని నమ్ముతున్న ఈజనాలను మార్చే ప్రయత్నం ఎవరు చేసినా ఈ రాజ్యం బలి తీసుకోకుండా ఉంటుందా? 

తెలంగాణలో తెగువ, ధైర్యం, తెలివితేట లు ఉన్నవాళ్లందరూ మావోయిస్టులనే ముద్రవేసి చంపివేయపడుతున్నారు. ఎవ్వనికి అమ్ముడుపోనివాడు అంటే మావోయిస్టని, రాజ్యానికి దోపిడీ దారులకు,దళారులకు కండ్లల్ల నలుసు లెక్క ఉంటరు అని ఒక ప్రొఫెసర్ ఆవేదనతోని చెప్పాడు ఒక ప్రజాసంఘానికి బాధ్యత వహిస్తున్నా డు. తెలంగాణ వాళ్ళంటే, తెలంగాణ కోసం ఏర్పడ్డ ప్రజాసంఘాలంటే వాటికి ఒక కలర్ వేయాలి ఆ వంకతో చంపేయాలి. కేసులు పెట్టాలి, జైలు పాలు చేయాలి. ఈ ఫార్ములా బాగానే పనికొస్తున్నది. నిజమే ఒక నీతి, నిజాయితీ గల కార్యకర్త తయారు కావాలంటే కనీసం వంద సంవత్సరాలు పడుతుంది అన్న మాటలు వాస్తవమే! అవినీతి, అన్యాయం అన్ని పాదాల విల య తాండవం చేస్తున్నప్పుడు నీతి, నిజాయితీలని చరిత్ర పుస్తకాలలో వెతుక్కొనే పరిస్థితి వస్తుంది మరి. ఇపుడున్న ఈ మరమనుషుల యుగంలో మనుసులున్న మనుషులను, మానవత్వం, హక్కులను గురించి మాట్లాడే వాళ్ళని ఊహించడం ఇంకా కష్టం.

తెలంగాణ ఇవ్వాలంటే ఇవ్వొచ్చు, లేదనుకుంటే ఇవ్వకపోవచ్చు. కానీ ఒక వింతైన రిపోర్ట్ ఇచ్చిన కృష్ణ కమిటీలోని ఎనిమిదవ చాప్టర్‌ను ఇక్కడి పాలకులు మాత్రం పక్కాగా అమలు చేస్తున్నారు..సచ్చేటోడు సస్తనే ఉంటే మంత్రి పదవుల కోసం పోటీలు పడతనే ఉన్నరు కొంతమంది. రాజిరెడ్డి లు, వెంక ఏదో ఒక రూపంలో బలవుతూనే ఉంటరు. కవులు, జర్నలిస్ట్‌లు ఉద్యమ కవాతులు చేస్తూనే ఉంటారు. టీచర్లు, ప్రజాసంఘాలు నల్ల దినాలు చేసుకుంటారు. వెంక జాడ లేకుండాపోయి అమరుల జాబితాలలోకి పోతారు. పరిస్థితి రోజురోజుకు దిగజారుతుంటే పట్టించుకోని రాజకీయ నాయకులను మనం ఏమి చేయాలి? తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి పైసా ఆశించకుండా పనిచేసే వెంక కాపాడుకోకుంటే ఎవడు కాపాడుతాడు ఈదేశాన్ని? అడ్డంవచ్చిన వాడినల్ల సంపుకుంట పోతుంటే చూసే వాళ్ళ నిశ్శబ్దాన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలి?

నాలుగుసార్లు జై తెలంగాణ అంటే, తెలంగాణకు మద్దతు పలకకుండా, ఇక్కడి ప్రజలకి ఇష్టం లేకుండా ఈప్రాంతంలోకి అడుగు పెట్టనీయమని అడ్డుకుంటే, రాజ్యం చేస్తున్న నేరాలను ఎత్తిచూపితే ఏదో ఒక పేరు మీద చంపేస్తరు అని విశ్లేషకుల అభివూపాయం. ప్రజలు నమ్మి ఒట్లు వేసి, గెలిపించినోళ్ళు ప్రజలకు వ్యతిరేకులైతే దాన్ని ప్రశ్నిస్తే చంపేస్తరా అంటున్రు అయన తో పని చేసినోళ్ళు. కార్యకర్తల ప్రాణాలతో ఆడుకొనే ఈ వ్యవస్థను నమ్ముకొని ముందుకు అడుగు వేయగలమా? 

ఈదేశంలో అంబేడ్కరిజం విప్లవీకరించాలి అని బడుగు బలహీన వర్గాల ను ఉద్ధరిస్తామనే వారు బడుగులు చస్తుంటే పట్టించుకోరేం? ఏ సిద్ధాంతం అయితే ఏమిటి, ప్రజలతోని, ప్రజల కోసం పనిచేయొద్దని ఏ ‘ఇజం’ చెపుతుంది? పోలేపల్లిలో, పర్లపల్లి లో బలవుతున్న బడుగు బలహీన వర్గాలు సిద్ధాంత చర్చలతోని కడుపునింపుకోలేరు. వాళ్లకు కావలసింది వారితో ఉండి వాళ్ళ జీవితాలని కాపాడే ‘యిజం’. ఈ దేశంలో కులం ఉంది, వర్గం ఉంది అని చెప్పిన అంబేద్కర్‌ను ఒక్క కులానికే పరిమితం చేసి, అయన సిద్ధాంతాలను చర్చలకు మాత్రమే కుదించి, తెల్లకాగితాల మీదికి ఎక్కిస్తే అసలు చదువేలేని 80శాతం మంది ప్రజలకు ఈ ఇజాలు ఎప్పుడు అం దాలి? అప్పటిదాకా ఎంతమందిని మనం పోగొట్టుకోవాలి? రైట్, లెఫ్ట్‌లు కలిసి మాట్లాడే సందర్భం ఇది, అంబేద్కర్, మావో కలిసి కొత్త ‘ఇజా’లని ప్రజలకు అందివ్వకపొతే నష్టపోయేది అన్ని వైపులా పేదలు, దళిత, వెనుకబడ్డ ఆదివాసీ లు. ‘ఇజాల’ కొట్లాటలన్నీ ఒక్క కాడికి తెచ్చే పని అయినా ఎవరో ఒకరు మొదలుపెట్టాలి. లేకపోతే ఎవరి గొప్పలువారు చెప్పుకోవడానికే సమ యం సరిపోదు. సిద్ధాంత చర్చలతో ని నిరంతరం ప్రజల మధ్యలో ఉండి, ప్రజలతోని పని చేసేవే రెండు సిద్ధాంతాలు, కేవలం పుస్తకాలకు, చర్చలకు ఎప్పుడు మిగిలిపోలే దు. బతకడానికి కావలసిన కనీస అవసరాల లైన హక్కులను కాలరాస్తూ ఉన్న రాజకీయాలని చూస్తూ ఎప్పుడూ మౌనంగా ఉండలేదు. 
చివరికి, ఇక్కడ పోలీసులు, నాయకులు, ఇంకా సంఘాలు లేవనుకుంటే నష్టం ఏమి లేదు. ఇపుడు వెంక హత్య మీద కప్పబడిన నిజాన్ని ఛేదించేవారే లేకపోతే ఇంకా ఇక్కడ ప్రజాస్వామ్యం, నాలుగు కుర్చీల వం టి పాఠాలు చెప్పడం మనం మానుకోవాలి. మరొక్కమారు ప్రజల దిక్కున, ప్రజల కొర కు, ప్రజల చేత మాట్లాడే ప్రత్యామ్నాయ వ్య వస్థలకు, కొత్త స్వతంత్ర భావాలకి కనీసం వెంక రాజిరెడ్డిల ప్రాణాలు నూతన ప్రజాస్వామిక విత్తనాలై మొలకెత్తాలి. ఈ నరమేధాలు ఇంకా కొనసాగనివ్వడం అనాగరిక సామాజిక లక్షణం.

అంతర్జాతీయ మార్కెట్లను ఆహ్వానిస్తున్నాం అని ఉత్సాహపడే వారికందరికీ, తమకు తెలియకుండానే తమ విలువైన హక్కులన్నింటిని ఫారిన్ కరెన్సీకి తాకట్టుపెడుతున్నాం అన్న సంగతి తెలియదు. ఇటు ప్రభుత్వమే సారా దుకాణాలను నడుపుతూ పేద మధ్య తరగతిని మత్తులో ముంచుతూ, అటు పబ్బు, క్లబ్బు సంస్కృతిని కాస్తా చదువుకున్న యువత నర నరాన పాకిస్తూ, డ్రగ్స్ కంటే ఘోరంగా విషాన్ని జీవితాల్లో నింపుతున్న ఈ అతి భయంకర ప్రపంచీకరణను అదుపు చేయాలి. లేకపోతే రేపటి ప్రపంచ పటంలో మనం ఉండే అవకాశం లేదు. ఇంకా ప్రజా ఉద్యమాలు ఊసేత్తే ప్రసక్తే లేదు. అన్ని ఇజాలను పక్కన పెట్టి నిస్వార్థంగా పని చేసే కార్యకర్తలని కాపాడుకోవడమే ఇప్పుడున్న అవసరం. 

-సుజాత సూరేపల్లి 
(తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యద

Namasete Telangana News Paper Dated: 08/11/2012

Friday, October 26, 2012

కూడంకుళం: శేష ప్రశ్నలు--సుజాత సూరేపల్లి



దేశంలో ప్రజలు ఇవాళ ఉద్యమాల బాట పడుతున్నారు. వనరుల దోపిడీ, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించిన వారిని ఎదో ఒక పేరు పెట్టి నిర్బంధానికి గురి చేయడం జరుగుతున్నది. అది కూడంకుళం లాంటి పెద్ద అణు రియాక్టర్ పరిక్షిశమలు కావొచ్చు, ప్రత్యేక ఆర్థిక మండలాలు(సెజ్ ),బొగ్గు, గ్రానైట్, ఇనుము, బాక్సైట్,యురేనియం లాంటి ఖనిజ తవ్వకాలు కావచ్చు. పోర్టులు, ప్రాజెక్టులు, రోడ్లు, ఎఫ్‌డిఐ లాంటి పథకాల పేరుతో సాగుతున్న విధ్వంసాన్ని ప్రశ్ని స్తూ ఉద్యమిస్తే,చాలు వారిని జైలుకి పంపడం పరిపాటి అయిపోయింది. నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వేధించడం నిత్యకృత్యమైంది. 
తమిళనాడులోని అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉద్యమకారుల మీద, వేలాది మంది ప్రజలమీద అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టా రు. మార్చి 2011లో జపాన్‌లోని ఫుకుషిమ అణువిద్యుత్ విస్ఫోటనం వల్ల జపాన్ విల విలలాడింది. ఇప్ప ట్లో ఆ దుష్ర్పభావం నుంచి బయటపడేటట్టు లేదు. ప్రపంచ చరిత్రలోనే ఇది అత్యంత ప్రమాద కరమైన సంఘటనగా సాంకేతిక నిపుణులు గుర్తించినరు. జపాన్ ప్రభుత్వం ఇది హిరోషిమా కంటే 168 రెట్లు ప్రమాదకరమైనదని అధికారికంగా ప్రకటించి, జపాన్‌లోఉన్న 54 రియాక్టర్లను మూసేశారు. ఈ ఘటన తరువాత లక్షా యాభై వేలమంది దూర ప్రాంతాలకు పారిపోయి తలదాచుకున్నారు. బహుశా కొన్ని దశాబ్దాలు దీని ప్రభావం ఉండొచ్చు. 

టెక్నాలజీలో ఎంతో ముందున్న జపాన్ ఇప్పడు తమ శక్తిని మరోసారి అంచనా వేసుకుంటున్నది .ఇతరదేశాలు కూడా వీటికి దూరంగా ఉంటున్నా యి. ఫుకుషిమ ప్రమాదంతో ప్రకృతి విధ్వంసం, గాలి నీరు కలుషితం, ఆహార ధాన్యాలపై పడ్డ ప్రభావంపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచానికి అణు రియాక్టర్ల వల్ల కలిగే నష్టాలు, లాభాల గురించి ప్రపంచ దేశాలు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. ఇలాంటి పెద్ద ప్రమాదాల గురించి దూరదృష్టితో ఆలోచించి వీటిని అడ్డుకుంటున్నారు. 
కూడంకుళం 1988లో దివంగత రాజీవ్‌గాంధీ, మైకేల్ గోర్బచేవ్ మధ్యన జరిగిన ఒప్పందంతో కూడంకుళం అణు రియాక్టర్ నిర్మాణం ప్రారం భమైంది. కొద్ది రోజులు రష్యా రాజకీయ అనిశ్చితి కారణంగా, అటు తరువాత అమెరికా పెట్టిన అడ్డంకుల వల్ల ఆగి 2001 సెప్టెంబర్‌లో మొదలైంది.అప్పటి నుంచే దీనిని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అనేక రూపాలలో నిరసనను తెలుపుతూ ఉద్యమం చేపట్టారు. 

మత్స్యకారులు, పేద ప్రజలు దీన్ని రేడియేషన్ ద్వారా జరిగే నష్టాలను తెలుసుకుని మరింత పట్టుదలతో ముందుకుపోతున్నారు. కోర్టులో కేసు కూడా వేశారు. కోర్టులో వేసిన పిల్ ప్రజలకు అనుకూలంగా వచ్చినా పట్టించుకొనే నాథుడు లేడు. ఉదయకుమార్ న్యూక్లియర్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమ కమిటీ నాయకుడిని అరెస్ట్ చేసి, వాళ్ళ సంస్థకు విదేశీ నిధులు వస్తున్నాయని, కొన్ని ఎన్‌జీవోలు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిస్తున్నాయని అనుమానం తో కేసులు పెట్టి, భయవూబాంతులకు గురిచేస్తున్నారు. 
ఈ నెల 11న కూడంకుళం అణు రియాక్టర్ పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్ళిన నిజ నిర్ధారణ కమిటీ సభ్యులైన విరసం, పౌర హక్కుల సంఘం, విద్యార్థి సంఘాలు మొదలగువారిని అరెస్ట్‌చేసి నాంగనేరి పోలీస్‌స్టేషన్‌లో విరసం కార్యదర్శి పి.వరలక్ష్మితోపాటు ఎనిమిది మందిపై అర డజన్‌కు పైగా కేసులు పెట్టా రు. ఈ కమిటీ సభ్యులు తమిళనాడులో మావోయిస్ట్ ప్రచారానికి వచ్చారని, ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి, వారి వద్దకు వచ్చే లాయర్లను కలువనీయకుండా, కార్యదర్శి వరలక్ష్మి ఫోటోను ఫేస్‌బుక్‌లో నుంచి తీసి మావోయిస్ట్‌ను వివాహమాడినట్టు ఓ కట్టు కథ అల్లారు. 

ఇలాంటి కట్టుకథలు అల్లే పోలీసు ఘనులు దేశం నిండా ఉన్నారు. అరెస్ట్ అయినవారిలో హమీద్-ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం, దస్తగిరి-రాయల్ సీమ విద్యార్థి వేదిక, ప్రతిమ దాస్- ఒడిషా హైకోర్ట్ లాయర్, అరవింద్ అవినాష్, దామోదర్-పి.యు.సి.ఎల్ జార్ఖండ్, ప్రియదర్శిని-పరిశోధక విద్యార్థి, జేఎన్‌యు ఢిల్లీ తదితరులను తమిళనాడు ప్రభుత్వం బస్సులో పోతుండగా అరెస్ట్ చేసింది. లెఫ్ట్ భావజాలం ఉంటే మావోయిస్టులెనా? 40 ఏళ్లుగా పనిచేస్తున్న విప్లవ రచయితల సంఘం ఇప్పుడు కొత్తగా కనపడుతుందా? మావోయిస్టు సానుభూతిపరులుగా ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోదా? 

నిజంగా మావోయిస్టులు దేశ విద్రోహులా? రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఏ రాజకీయలతోనైనా ఉండొచ్చు అన్నప్పుడు ఎందుకు ప్రతిసారి కొద్దిమందిని, కొన్ని సంఘాలకు ఆ ముద్ర వేసి ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూస్తున్నారు? పోలవరం, కూడంకుళం, కోస్టల్ కారిడార్, సెజ్‌లలో జరిగింది ఇదే. ఉద్యమకారు లు ఎప్పుడూ హిట్ లిస్టులోనే ఉంటారు. సమాచార హక్కు కార్యకర్తల హత్యలు, జర్నలిస్ట్‌ల హత్యలు, ప్రజాస్వామికవాదుల జైలు జీవితాలు అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మావోయిస్టులు అంటే అసాంఘిక శక్తులని ముద్ర వేయడం సమంజసమేనా? ఇప్పటి వరకు పోలీసుల చేతిలో మరణించిన వాళ్ళు ఎంతమంది? ప్రజల నిర్వాసిత్వానికి కారణమైన వాళ్ళు, వేల సంఖ్యలో రైతులు, విద్యార్థులు, నేత కార్మికుల ఆత్మహత్యలకు కారకులు ఎవరు? భూములు, వృత్తులు కోల్పోయి మతి స్థిమితం తప్పిన వాళ్ళ లెక్కలు తీస్తే ప్రభుత్వాలు అధికారికంగా చేస్తున్న హింసని అర్థం చేసుకోవచ్చు. ఈవిధానాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక బస్సు తగుల బెట్టడమే హింస అయితే, వేలాది మంది ఆదివాసీల గూడాలను తగులబెట్టి, జైలులో నిర్బంధించడం హింస కాదా? దీన్ని ఏమనాలి? ప్రజలను నిర్దాక్షిణ్యంగా అణచివేసే విధానాలు అవలంబిస్తూ నిత్యం అమాయక ప్రజలను భయాందోళనలకు ఎవరు గురి చేస్తున్నారో కమిటీ వేసి పరిశోధిస్తే విచారిస్తే బాగుంటుంది. ప్రజ ల కోసం పనిచేస్తున్న వారిని మావోయిస్టులు అంటున్నారు. మరి ప్రజలను హింసి స్తున్న రాజ్యాన్ని ఏమనాలి? ఎవరు ఈదేశాన్ని రక్షించాలి ? హింస అని ఎవరు నిర్వచిస్తున్నారు? ఎట్లా నిర్వచిస్తారు? అతి పెద్ద ప్రజాస్వామ్యం, కోట్లకొద్దీ డబ్బు తో నడిపిస్తున్న రక్షణ వ్యవస్థ ఉన్నా కూడా తప్పుడు కేసులు, ఆరోపణలు చేయడంలో.. వారి వ్యవస్థలు ఏవీ సరిగ్గా పని చేయ అర్థం చేసుకోవాల్నా? 

ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో భయంకర నిశ్శబ్దం రాజ్యమేలుతున్నదిపపంచీకరణలో భాగంగా వ్యక్తివాదం, స్వలాభం కావొ చ్చు లేదా ఈ రాజ్యం విధానాల వల్ల భయం కూడా కావొ చ్చు కానీ ఈ నిశ్శబ్దం ద్వారా రేపు మనమూ నష్టపోయే పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పటి సామాజిక ఆర్థిక , రాజకీయ పరిస్థితులను అంచనా వేయకుండా మౌనంగా ఉంటే మన సమాధిని మనం అందంగా తవ్వుకున్నట్లే. ప్రజల పోరాటాలు వారివి మాత్రమే కాదు, మనందరివి. అందరం గొంతెత్తి ఈ అన్యాయాలను అడ్డుకోకపోతే ఒకరో ఇద్దరో చరివూతలోకి ఎక్కి అసాంఘిక శక్తుల లాగానో, హక్కుల కార్యకర్తల లాగానో మిగిలి పోతారు. కాని సమాజాన్ని మొత్తంగా మార్చడంలో విఫలమౌతారు. ప్రజాకార్యకర్తలు నిస్వార్థంగా తమ జీవితాలను ఫణంగా పెట్టి చేసిన త్యాగాలకు ఫలితం దక్కాలంటే మన మందరం గొంతెత్తి అన్యాయాన్ని, అవినీతిని ఎదిరించాలి. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నించాలి, దళిత, బహుజన, ఆదివాసి, మైనారిటీ, స్త్రీల జీవితాలకు అండగా నిలవాలి.

నేటి సందర్భం, సమయం మధ్య తరగతి ప్రజల అవగాహనపై ఆధార పడి ఉన్నది. కింది కులాల పోరాటాలకు, వనరుల పై హక్కుల పోరాటాలకు మద్దతు తెలపాలి. బడుగుల జీవితాలను నాశనం చేస్తూ, వారి సమాధుల మీద అభివృద్ధి పునాదులు వేసే విధానాలను వ్యతిరేకించాలి. 

-సుజాత సూరేపల్లి
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యద

Namasete Telangana News Paper Dated : 26/10/2012 

Sunday, October 14, 2012

దళిత మహిళ బతుకు చిత్రం---సుజాత సూరేపల్లి




అది మహబూబ్ నగర్ పోలేపల్లి సెజ్ కావొచ్చు, కరీంనగర్ అన్నారం గ్రానైట్ గుట్టలే కావొచ్చు లేదా కాలుష్యం వెదజల్లే ఇథనాల్ కం పెనీ వ్యతిరేక ఉద్యమమే కావొచ్చు. మహిళలు ముందుండి పోరాటం చేస్తున్నరు.అందులో దళిత మహిళలు, ఇంకాస్త ముందుకు పోయి మాదిగ మహిళలు అని కూడా చెప్పాలి. వారు ఎక్కువ చదువుకొని ఉండక పోవచ్చు, కానీ పచ్చని పంటపొలాలు పొతే, నీళ్ళు, గాలి కలుషితం ఐతే బతు కు ఆగం అయితది అనే ఒకేఒక్క కారణంతో మహిళలు పోరాడు తున్నరు. అగ్రకులాల గుప్పి ట్లో ఉన్న రాజ్యాన్ని, రాజ్యానికి కొమ్ము కాస్తున్న పోలీసు వ్యవస్థ ను అడుగడుగునా ఎదిరిస్తున్న రు. పోలేపల్లి చుక్కమ్మ భూమిని కోల్పోయింది. భర్తని పోగొట్టుకొంది. ఆఊర్ల చాలమంది భర్తలను పోగొట్టుకున్నవాళ్ళు ఉన్నరు. ఇప్పటికీ రాత్రనక పగలనక ‘మాభూములు మాకు కావాలని గొంతెత్తి అరిచింది. ప్రపంచాన్ని కదిలించింది. ధర్నాలు, ఊరేగింపులు,రాస్తారోకోలు చే సింది. ఆమెతో చాలామంది దళి త మహిళలు ముందుండి పోరా టం చేశారు.కానీ చుక్కమ్మ చైత న్యం, తెలివి తేటలు తట్టుకోలేని ఊరి పెద్దలు, అధికారులు, దళిత ఎమ్మెల్యేలు ఆమె నోరు మూసిన్దాక కుట్ర పన్నినరు. అక్కడి ఎమ్మార్వో బూతులు తిడితే, కాగితాలు చింపి మొఖాన కొడితే, పోలేసువాళ్ళు కేసుపెట్టడానికి పెద్ద ఉద్యమమే చేయాల్సి వచ్చింది. కాని ఆ కేసు కొట్టివేసేదాకా చిత్రహింసలు, ఇంట్ల , బయట అనుభవించింది. ఇదే విధంగా అటుఇటుగా కరీంనగర్ అన్నారం గుట్టల పోరాటంలో మహిళా అధికారి మీద కేసు పెడితే పట్టించుకొనే నాథుడు లేడు. కులస్తులంత బహిష్కరించి కేసు వెనక్కితీసుకొనే దాకా వెంట పడ్డరు. విచివూతంగా అక్కడ కూడా దళిత ఎమ్మెల్యేనే ఉన్నాడు. ముందుండి రాయబారం నడిపిస్తాడు. అగ్ర కులాల దగ్గర బానిస బతుకులు బతుకుతూ, నీ బాంచన్ దొరా! అనే వాడు నాయకుడు ఎట్లా అయితడు ? కులంపేరు చెప్పుకోగానే మనవాడు అని మోసపోతే ఏమి జరుగుతుందో మనం ప్రత్యక్షంగా చూ స్తున్నం. ఇప్పటి నుంచి కాదు, కులం పుట్టినప్పటినుంచీ ఇదేకథ. పోరాటం పేరు చెపితే మమ్మల్ని వదిలేయండి అని మొకం చాటేస్తరు. 

పర్లపల్లి ప్రజలు చేస్తున్న హరిత బయో ప్రోడక్ట్ కంపెని వ్యతిరేక పోరాటం చరివూతాత్మకమైనది. చుట్టూ పచ్చని పంట పొలాలు, బావులు,గుట్టలు. నట్టనడుమ పుట్టుకొచ్చింది హరిత బయో ప్రోడక్ట్ కంపెనీ. విత్తనాల కంపెనీ అని మభ్యపెట్టి నరకం అంటే ఎట్లా ఉంటదో చూపించినరు.డ్డి దొరలూ, ఎన్నారైలు దాదాపు అరవై కోట్లతో కంపెనీ పెట్టారు. రోజురోజుకు జీవితం దుర్భరమైతుంటే మహిళలంత కలిసి ఆ కంపెనీ మూసివేయాలని అనేక రకాలైన పోరాట రూపాలను చేపట్టినరు. కలెక్టర్‌కు విన్నవించుకున్నరు, కనపడ్డ సంఘాలని సాయం అడిగినరు, తెలంగాణ జాక్‌లు, డాక్టర్లు, వివిధ ప్రజా సంఘాలు అన్నీ ఆ కంపెనీ అక్కడ ఉండడం కుదరదని చెప్పినై. ఢిల్లీలోని, హైదరాబాద్‌లోని మానవహక్కుల కమిషన్‌లకు ఫిర్యాదు చేసినై. ఈనెల నాల్గవ తేదీన ఆ కంపెనీ పోల్యుషన్ కంట్రోల్ బోర్డ్ చెప్పిన సమాధానం మూసివేసినం అని. కానీ గత నెలనే అనుమతులు ఇచ్చినం అని కంపెనీ వారు, వారి తరఫున మాట్లాడిన ఆర్‌డీవో చెప్పినరు. ఈ లోపున పర్లపల్లి గ్రామ మహిళా సంఘాల కార్యకర్తలకు విధులు సక్రమంగా నిర్వర్తిస్తలేరని వారి కార్యాలయాల నుంచి మెమోలు అందినై.

మొదటి నుంచి ముందుండి నడిపిస్తున్న కవ్వంపల్లి రేణుక అనే మాదిగ మహిళ పై అందరి కన్నుపడ్డది. అంజలి, పద్మ, శోభ అనే మహిళలపై కూడా విపరీతమైన ఒత్తిడి చేశారు. బెదిరించి నోరునొక్కే ప్రయత్నాలు చేశారు. దళితులంటే పోలీసులకు, ఊరి వాళ్లకు, అధికారులకు చిన్న చూపు. బూతులు లేనిదే మాటలు రావు. పోలీసు వారి సమక్షంలో, ఆర్‌డీవో సాక్షిగా రేణుకపై బండి రాజు అనే అతడు చున్ని మెడకు వేసి చుట్టి, కొట్టితే దిక్కులేదు. కంటితుడుపుగా పోలీసులు తీసుకొని పోయినారు కాని ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టలేదు. విచారణ జరపడానికి వచ్చిన ఆర్‌డీవో కంపెనీ తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతుంటే మహిళలు అభ్యంతరం చెప్పినరు. పోలీసులు, ప్రభుత్వ ప్రతినిధులు మహిళలపై దాడులు చేస్తూ, కేసులుపెట్టి వేధింపులకు పాల్పడుతున్నరు.ఇథనాల్ కంపెనీలతో జరుగుతున్న నష్టాలను డబ్బుకు అమ్ముడుపోయే ప్రభుత్వాలు, సంస్థ లు పట్టించుకోవడంలేదు. లంబాడ తండాలో, ఆదివాసీ ప్రాంతాల్లో పొట్టకూటికి బట్టీలు పెట్టి సారా అమ్మితే మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, కొట్టి చిత్రహింసలు పెడుతున్నరు. 
కరీంనగర్ పట్టణానికి ఒకే ఒకదిక్కు మానేర్ డ్యాం.అందులోంచి దాదాపు రోజుకు పదిహేను లక్షల లీటర్ల నీటిని తీసుకోవడానికి అనుమతి ఎట్లా ఇస్తారు? ఇప్పటికే కాలుష్యం కోరల్లో చిక్కుకున్న తెలంగాణకు ఇటువంటి ఫ్యాక్టరీలు అవసరమా? బొగ్గు, ఇసుక, గ్రానైట్, కంకర తవ్వకాలతో అతలాకుతలం అయితున్న కరీంనగర్‌ను రక్షించే వారు లేరా? దీనిని చూస్తూ ఊరుకున్న ప్రజా ప్రతినిధులా రేపు తెలంగాణ తెస్తాం అని కొట్లాడేది? ప్రజల నోరునొక్కి డబ్బులకు ఆశపడి పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రభుత్వాలు జీవ వైవిధ్య సదస్సును ఏ మొఖం పెట్టుకుని నిర్వహిస్తున్నాయి? 

దళితుల పరిస్థితి, అందులో మహిళల దుస్థితి చూడాలంటే ప్రజా పోరాటాలను ప్రత్యక్షంగా చూడాల్సిందే. ప్రజల విన్నపాలను పట్టించుకోకపొతే అవి హింస వైపు దారి తీయవచ్చు. నేడు గ్రామాల్లో ఏ పోరాటం చేసినా అది దళిత మహిళలే. కొద్దో గొప్పో బీసి కులాల మహిళలు చేస్తున్నారు. ఇక ముందు లక్షింపేటలు జరగకూడదనుకుంటే దొంగ రాజకీయ నాయకులు ఏ కులం ముసుగులో ఉన్నా ముందే పసిగట్టి దళిత జాతిని రక్షించుకోవాల్సిన బాద్యత అందరిమీదా ఉన్నది. ఎవరికీ భయపడకుండా, ఎన్ని అవమానాలకు అయి నా ఓర్చి ముందుకు సాగుతున్న పేద, దళిత , బీసి, ఆదివాసి, మైనారిటీ మహిళలందరికీ ఉద్యమాభివందనాలు. ఈ దేశంలో కింది కులాల మహిళలకు మర్యాద ఇచ్చి, వారి చేసే పోరాటాలకు మద్దతునిచ్చి, వారు భుజాన మోస్తున్న పర్యావరణం, వనరులను కాపాడడం అనే బాధ్యతని అందరూ పంచుకోవాలి. కరీంనగర్ పర్యావరణాన్ని, ఇక్కడి భిన్న కులాల హక్కులను కాపాడాలి. రాబోయే తెలంగాణలో అందరికి సమాన హక్కులు ఉంటాయని ఇప్పటినుంచే మనం ప్రజలను చైతన్య పరచాలి. 

-సుజాత సూరేప
Namasete Telangana News Paper Dated : 15/10/2012