Showing posts with label రంగనాయకమ్మ. Show all posts
Showing posts with label రంగనాయకమ్మ. Show all posts

Wednesday, July 11, 2012

మార్పులకు ఒక క్రమం - రంగనాయకమ్మ

అంబేద్కర్ ప్రకారం జరిగే విప్లవంగా, వెంకటేశ్వర్లు, తర్వాత జరిగేది కూడా చెపుతున్నారు. ఆ చివరి దశ ఏమిటంటే : 'భూమిలో అగ్ర కులాల ఆధిపత్యాన్ని తొలిగించి, భూమిని జాతీయం చేయడం. ఉద్యోగాల్లో, ఇతర అవకాశాల్లో, అగ్ర కులాలకు రిజర్వేషన్లు కల్పించడం.' అగ్ర కులాలకు రిజర్వేషన్లు! ఇంత విప్లవాన్ని అంబేద్కర్ కూడా కలగనలేదు! అగ్రకులాలకు రిజర్వేషన్లు ఎప్పుడు? భూముల్ని జాతీయం చేశాకా, చెయ్యక ముందా? చెయ్యక ముందైతే, అగ్రకులాల భూములూ, వాళ్ళ మేధా శ్రమలూ, వాళ్ళకు చెక్కు చెదరకుండానే వుంటాయి. ఆ దశలో, వాళ్ళకి రిజర్వేషన్లేమిటి? లేదా, భూమిని జాతీయం చేసిన తర్వాత అయితే, అప్పుడు సమాజంలో అందరికీ సమాన పరిస్థితులే ఏర్పడాలి.

అందరికీ చదువులూ, ఉద్యోగాలూ, జీతాలూ! అప్పుడు అగ్ర కులాలకు, రిజర్వేషన్లు అవసరమయ్యే బికారి స్థితే వస్తుందా? అంబేద్కర్ విప్లవం జరిగాక కూడా కొంత జనాభాకి అలాంటి స్థితి ఏర్పడితే, అది విప్లవం అవుతుందా? సరే, రిజర్వేషన్లు ఎక్కడ వున్నా అవి తాత్కాలికమే కదా? ఆ తాత్కాలిక పరిస్థితిని తీసివేసి, అందరినీ సమానం చేసే చివరి విప్లవ దశ ఏమిటి? దాన్ని వెంకటేశ్వర్లు చెప్పలేదు! భూముల జాతీయాల తర్వాత కూడా అగ్ర కులాలన్నీ రిజర్వేషన్ల కులాలు గానూ, నిమ్న కులాలన్నీ అవి లేని కులాలు గాను మారితే, ఇక కుల నిర్మూలన కలలెందుకూ?

ఇక్కడ అసలు వాదం, స్పష్టంగా వుంది. 'మాకు కుల నిర్మూలన అంతిమ లక్ష్యం' అన్నారు. దాని తర్వాత కూడా ఒక చివరి దశ వుంది. అది, 'అగ్ర కులాల ఆధిపత్యాన్ని తొలగించి, భూముల్ని జాతీయం చేయడం.' అంటే, దోపిడీదారుల ఆధీనంలో వున్న ఆస్తుల్ని తీసివెయ్యడం కన్నా ముందే, అగ్ర కులాల ఆధిపత్యాన్ని తొలగించడం కన్నా ము ందే, అంటే కులాల నిర్మూలన చేసేస్తారు. అది మొదటి లక్ష్యం! అంటే, అగ్ర కులాలు, వా ళ్ళ కులాలతో వాళ్ళు, వాళ్ళ ఆధిపత్యాలతో వాళ్ళు, ఎప్పటిలా వుండగానే, కులాల్ని తీసేస్తారు! కులాలు వుండగానే కులాల్ని తీసేస్తారు! అది ఎలా చేస్తారో తప్పకుండా చూడాలి!

కులాలనే వర్గాలుగా భావిస్తే, కులాల నిర్మూలనే మొదట జరుగుతుందనీ, ఆ నిర్మూలనే దోపిడీ నిర్మూలన కూడా అవుతుందనీ, అర్ధం వస్తుంది. ఈ వాదాన్ని వ్యతిరేకిస్తూ, డాక్టర్ విద్య చాలా మంచి వాదన చేసింది. కులాలే వర్గాలైతే, అందులో అగ్రకులాలే దోపిడీ వర్గాలైతే, కుల నిర్మూలన జరిగిపోతే, దోపిడీ నిర్మూలన జరిగిపోయినట్టు కాదా? మళ్ళీ ఆ దశ తర్వాత ఇంకో దశ ఏమిటి? - అని ఆమె వాదం. కుల నిర్మూలన తర్వాత కూడా భూముల జాతీయం కోసం ఇంకో పోరాటం అంటే, కుల నిర్మూలనతో దోపిడీ నిర్మూలన జరగదనీ, జరగలేదనీ అర్ధం. కుల నిర్మూలన తర్వాత కూడా వర్గాలూ, వాటి భేదాలూ, దోపిడీ, ఎప్పట్లాగే వున్నాయనీ, అందుకే ఇంకో దశ అనీ, అర్ధం రాదూ? కులాలు తొందరగా పోవాలని ఆశించడం తప్పు కాదు; కానీ, అది ఒక ఆశ! ఒక ఊహ! కులాలే వర్గాలు కావు కాబట్టీ, అవి లంకెలు పడి వున్న శ్రమ సంబంధాలు కాబట్టీ, శ్రమ సంబంధాల దృష్టి లేకపోతే, వర్గాలూ, కులాలూ, దోపిడీ ఆస్తి హక్కులూ, కలిమి లేములూ, ఏవీ చలించవు.

మనువాద వ్యతిరేక కార్యక్రమాలు కమ్యూనిస్టు పార్టీల్లో లేవు - అని చెప్పి, వెంకటేశ్వర్లు ఆ తర్వాత అడిగిన ప్రశ్న: "ఇలాంటి విప్లవాలేనా బహుజన శ్రామిక వర్గానికి కావలసింది?'' అంబేద్కరు, దళిత కులాల రిజర్వేషన్ల కోసం తప్ప, ఇతర వెనకబాటు కులాల (బీసీల) రిజర్వేషన్ల కోసం ప్రయత్నించలేదనీ; రాజ్యాంగం రాసిన ఆయన ప్రయత్నాలు, మొత్తం దళితుల హక్కులకే పరిమితమయ్యాయి తప్ప బహుజనులందరి హక్కుల కోసం పోరాడిన చరిత్ర ఆయనకు లేదనీ, బీసీల వాదం సమాజంలో వుంది.

దళితులూ, బీసీలూ, బహుజనులుగా, 'కులాల' వాదంతో కలుస్తారా, 'శ్రామిక వర్గ' వాదంతో కలుస్తారా? కులాలుగా అయితే, ఏ రెండు కులాలూ కలవడం లేదు. వారికి పెళ్ళిళ్ళ సంబంధాలు వుండడం లేదు. కాకపోతే, 'అగ్ర కులాలకు వ్యతిరేకంగా చిన్న కులాలు' అనే వాదంతో అయితే, కలవగలరు. కానీ అప్పుడు చిన్న కులాల్లో పిడికెడు మంది, బూర్జువా రాజ్యాంగంలోకీ, పదవుల్లోకీ, చేరగలరే గానీ, ఆ కలయికలతో దోపిడీ మీద పోరాటం చెయ్యలేరు. ఆ చిన్న కులాల్లో కోట్లాదిగా వుండే నిరుపేదల పరిస్థితి గురించి ఆలోచించడానికి, 'అది ఇప్పుడు వద్దు' అనడం, దాటవేత!

'దళితులు, ఎవరి సిద్ధాంతాల కోసమూ అడుక్కోవలసిన స్థితిలో, లేదా భావ దారిద్య్రంలో లేరని గ్రహించడం రంగనాయకమ్మకు మంచిది.'- దళితులు మార్క్సు సిద్ధాంతాన్ని అడుక్కోవలసిన స్థితిలో లేరనీ, వారికి అంబేద్కర్ చూపించిన రిజర్వేషన్ల మార్గమే భావ ఔన్నత్యాన్ని ఇచ్చిందనీ, వెంకటేశ్వర్లు తేల్చి చెప్పేశారు! మార్క్సిజాన్ని తిరస్కరిస్తే, మార్క్సుకేమీ నష్టం లేదుగానీ, దళిత బూర్జువాలకూ, వాళ్ళ బంట్లకూ, చాలా లాభం! ఇక దళిత బహుజన మేధావుల వాదాల వల్ల, ఆ కులాలలోని శ్రామిక జనాలకు జరిగేదంతా ద్రోహమే. ఆ జనాభా చరిత్ర ఎలా ఉండబోతోందంటే: వారిలో లక్షకి ఒకరు పెట్టుబడిదారుడు కావచ్చు. మిగతా లక్షలూ, కోట్లుగా మిగిలే జనం, ఇప్పటిలాగే వేతన కూలీలూ, పార్ట్ టైమ్ కూలీలూ, అవీ లేని నిరుద్యోగులూ, బిచ్చగాళ్ళూ, నేరస్తులూ! కులాంతర వివాహాల మాటా, కుల నిర్మూలనల మాటా, కట్టి పెడదాం మరి!

'దళితులు భూమి అడిగితే...' అంటూ బొజ్జా తారకం గారు రాసిన (ఆంధ్రజ్యోతి, జూన్ 22) వ్యాసం, నా 'సంస్కర్తల' వ్యాసానికి స్పందనగా రాసినది కాకపోయినా, 'కుల నిర్మూలన' చర్చలో చూడవలసిన అంశాలు ఇందులో కొన్ని వున్నాయి. లక్ష్మింపేటలో జరిగిన దురంతం పరమ నీచమైనదని ఆ దుష్టులకు తప్ప అందరికీ తెలుస్తుంది. అయితే, ఆ దురంతంలో, భూమి సమస్య చాలా స్పష్టంగా బైటపడింది. బహుజనులలో ఒక భాగంగా వుండే ఒక కులం వాళ్ళు, అక్కడ అగ్ర కులం వాళ్ళుగా ఎలా అయ్యారు? - భూమి ఆస్తి వల్లే. కూలీలుగా, పాలేళ్ళుగా, గత కాలం నించీ శ్రమలు చేస్తూ జీవించే దళితులు, భూమి దొరికితే, కూలీల జీవితాలు వదిలేసి, స్వతంత్ర రైతులుగా మారి, పొరుగున వున్న అగ్ర కులాల రైతులతో సమానులుగా మారితే, అది దేనివల్ల జరిగినట్టు? - 'భూమి' అనే ఉత్పత్తి సాధనం దొరికి పాత శ్రమ విభజన మారడం వల్ల జరిగినట్టే! దళితులు, తమతో సమానులవడం అగ్ర కులాలకు ఇష్టం లేదని - తారకం గారు అంటున్నారు.

ఇక్కడ స్పష్టంగా వున్న విషయాలేమిటి? దళితులు, కూలీలుగానే, ఆ రకం శ్రమలు చేసే వాళ్ళుగానే వుండాలని, అగ్ర కులాల వాళ్ళు కోరుతున్నారు. - ఇది ఒక నిజం. ఉత్పత్తి సాధనాలు లేని వాళ్ళకి, అవి దొరకడం వల్లే వాళ్ళు, అగ్ర కులాల వాళ్ళతో సమానులవుతారు - ఇది ఇంకో నిజం. ఈ సమానత్వ మార్గం ప్రారంభం కావాలంటే, మొదట జరగాల్సింది ఏమిటి?- ఉత్పత్తి సాధనాల మీద దోపిడీ యాజమాన్యాలు వున్న వాళ్ళకీ, జీవనాధారాలు కూడా లేని వాళ్ళకీ మధ్య పోరాటమే. అది ఎలా జరిగినా, ఫ్రభుత్వానికి విజ్ఞప్తులు చేసుకోవడం ద్వారా జరిగినా (ఈ పద్ధతిలో, మొత్తం శ్రామికులందరికీ జరగదు), భూమి విషయంలో జరిగేది, రెండు వర్గాల పోరాటమే. రెండు వేపులా వేరు వేరు కులాలు వున్నా, అది కుల పోరాటం కాదు. కులాలు లేని దేశాల్లో కూడా జరగవలసింది ఈ వర్గ పోరాటమే.

ఇక్కడ స్పష్టమైన ప్రశ్నలకు, స్పష్టమైన జవాబులు కావాలి. దళితులకు భూమి అంది, వారు స్వతంత్ర రైతులుగా మారడం గానీ, అలాగే నిరుపేద వేతన శ్రామికులకు విద్యలూ ఉద్యోగాలూ అందడం గానీ జరుగుతూ, పాత పరిస్థితుల సమానత్వం వేపు మారడం ముందు జరుగుతుందా; కుల భేదాలు పోవడం ముందు జరుగుతుందా? లేదా, దళితులకు భూమి రావడమూ, కులాలు పోవడమూ, కలిసి జరుగుతాయా? పేదలకు భూములు అందడం ఒక రోజున జరిగితే, కులాలు పోవడం ఆ రోజునే జరుగుతుందా?

ఏది ముందు, ఏది వెనక? ఒక క్రమం ఉందా? ఆ క్రమం ఎందుకు? కులాలే వర్గాలు కావు కాబట్టే వాటికి ముందు వెనుకల క్రమం వుంటుంది. వర్గ, కుల నిర్మూలనల కోసం ఎన్ని ఉద్యమాలైన కలిసి జరగవచ్చు. అది సాధ్యమే. కానీ, వర్గాలు అంతరించే సమానత్వ పరిస్థితులు ఏర్పడుతూ వున్నప్పుడు గానీ కులాల పద్ధతి మారదు. సమస్యల్ని మన ఆశల ప్రకారం, మన ఊహల ప్రకారం, మన ఇష్టాయిష్ఠాల ప్రకారం, చూడడం గాక, వైరుధ్యాలు అడ్డుపడని తర్కం ప్రకారం చూడగలిగితే, ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలం. సమస్యల వెంట పరిష్కారాలూ ఉంటాయి.

'రంగనాయకమ్మ కుల నిర్మూలన గురించి, ఏనాడైనా, ఏదైనా చెప్పిందా?' అట! 'దళిత సమస్య...' నాటి నించీ, అనేక వ్యాసాల్లో చెప్పిందంతా ఏమిటి మరి?

- రంగనాయకమ్మ
(అయిపోయింది) 
Andhra Jyothi News Paper Dated : 12/07/2012 

Tuesday, July 10, 2012

కులాలే వర్గాలు కావు - రంగనాయకమ్మ

'విప్లవకారులెవరు మరి?' అని వెంకటేశ్వర్లు అడగడంలో అర్ధం, 'చిన్న కులాల శ్రామికులే విప్లవకారులు కదా?' అని! ఇది చాలా పొరపాటు. శ్రామికులు అన్ని కులాల్లోనూ వున్నారు. శ్రామికుడిగా వున్నందుకే ఎవరూ విప్లవకారులు కాలేరు. బట్టలు ఉతికే చాకలి మనిషిని తీసుకుంటే, ఆ వృత్తి వల్లే అతను విప్లవకారుడు కాలేడు. పాకీ దొడ్లు కడిగే మనిషి అయినా, ఆ వృత్తితోనే విప్లవకారుడు కాలేడు. మేధా శ్రమలు చేసే టీచర్లు గానీ, డాక్టర్లు గానీ, సైంటిస్టులు గానీ, వేతన శ్రామికులుగా ఉన్నా, ఆ వృత్తుల వల్లే విప్లవకారులు కాలేరు. వృత్తుల వల్లే విప్లవకారులయిపోతే శ్రామికులందరూ విప్లవకారులయిపోయినట్టే. వర్గ పోరాట చైతన్యం గల విప్లవకారులవడానికి, వర్గాల జ్ఞానం కావాలి.

ఆ వర్గ జ్ఞానం, ఒక శాస్త్రం ద్వారా కలగాలి. పార్టీ నాయకత్వాల సంగతి చూస్తే, దానికి రిజర్వేషన్లు వర్తించవు. రిజర్వేషన్ల పాత్ర, స్కూలు సీట్లలోనూ, ఉద్యోగాల్లోనూ వున్నట్టు, వర్గ పోరాట సంఘాల్లో వుండకూడదు. పార్టీలో వున్న ఏ సభ్యుడికైనా నాయకత్వ పాత్ర దొరకడం గానీ, దొరకక పోవడం గానీ, ఆ సభ్యుడి శక్తి సామర్ధ్యాల్ని బట్టి జరగాలి గానీ, వారి కులాల్ని బట్టి కాదు. శాస్త్రీ, రెడ్డీ, చౌదరీలు, శక్తి సామర్ధ్యాలు కలవారని చెప్పినట్టు దీనికి అర్ధాలు తీస్తే, అది కలహం అవుతుంది గానీ, చర్చ అవదు.

నాయకత్వ స్థానాల్లో ఎక్కువ కాలం ఒకే వ్యక్తో, ఒకే బృందమో ఉంటే, అది రాజుల పద్ధతే అవుతుంది. శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్న వారికి కూడా అవకాశాలు లేకపోతే, ఆ శక్తులు పెరిగే మార్గమే ఉండదు. ఎంత శక్తివంతుడైన నాయకుడైనా, మెజారిటీ సభ్యుల ప్రకారం నడవవలసిందే గానీ, రాజులాగా ప్రవర్తించలేడు. 'పదవి' అనేది, ఒక కార్య నిర్వహణ బాధ్యత. 'నాయకత్వం' అనేది, సిద్ధాంత, ఆచరణల జ్ఞానం. ఆ నాయకత్వానికి కాల పరిమితి వుండదు. నాయకుడి కృషి, పదవి వున్నప్పుడూ లేనప్పుడూ కూడా ఒక్కలాగే వుంటుంది.

ఊ 'దోపిడీ కులాల చేతుల్లో బందీగా వున్న రాజ్యాన్ని ఆక్రమించుకోమని అంబేద్కర్ చెప్పాడు కదా? రంగనాయకమ్మ ఈ విషయం చదవలేదా?' ఏ అగ్ర కులాన్నయినా, 'దోపిడీ కులం' అనడం, మొదటి తప్పు! ఒక కులాన్ని, 'దోపిడీ కులం' అనే మాట ఎవరు చెప్పినా అది కుల జ్ఞానమూ కాదు, వర్గ జ్ఞానమూ కాదు. ఏ అగ్ర కులాన్ని తీసుకున్నా, అందులో అధిక సంఖ్య - పేదలే. కొంత సంఖ్య మేధా శ్రమలు చేసే వేతన శ్రామికులు. అగ్ర కులంలో, భూస్వాములుగా, రక రకాల పెట్టుబడిదారులుగా వుండే వాళ్ళ సంఖ్య, అదే కులంలో వుండే పేదల సంఖ్య కన్నా తక్కువ. ఒక వ్యక్తి పూర్తిగా దోపిడీదారుడు అయినట్టు, ఒక కులం అంతా, 'దోపిడీ కులం' అవదు. ఒక వ్యక్తి, పూర్తిగా శ్రామికుడైనట్టు, ఒక కులం పూర్తిగా 'శ్రామిక కులం' అవదు. ఏ కులాన్ని తీసుకున్నా, ఆ కులంలో, వేరు వేరు వర్గాలూ, ఆ వర్గాల్లో వేరు వేరు సెక్షన్లూ, ఉంటాయి.

ఒక వర్గాన్ని తీసుకుంటే, ఆ వర్గంలో, ఒకే కులం మనుషులంతా వుండరు. వేరు వేరు కులాల మనుషులు వుంటారు. దీన్ని క్లుప్తంగా చెప్పుకుంటే, మొత్తం అన్ని కులాల్లోనూ ఉన్న శ్రామికులందరి సంఖ్యా కలిసినది - శ్రామికవర్గం. అలాగే, అన్ని కులాల్లోనూ వున్న దోపిడీదారులందరి సంఖ్యా కలిసినది - దోపిడీవర్గం. ఒక కులం అంతా, ఒక వర్గం కాదు, ఒక వర్గం అంతా, ఒకే కులంతో నిండదు. ఒక అగ్రకులంలో ధనికులు, అదే కులంలో ఉన్న పేదల్ని ఎంత నిర్లక్ష్యంగా చూస్తారో, చిన్న కులంలో కూడా ధనికులు, అదే కులంలో వున్న పేదల్ని అంత నిర్లక్ష్యంగానే చూస్తారు. ఏ కులాన్ని తీసుకున్నా, అందులో జనాభాలో వుండే స్పృహ ప్రధానంగా ధనిక-పేద తేడాల స్పృహే.

ఊ 'శ్రమ విభజనే కాదు, శ్రామికుల విభజన వుంది' అంటూ, దాన్ని పెద్ద తర్కంగా చెపుతున్నారు ఏనాటి నించో! 'శ్రామికుల విభజన' అనడంలో అర్ధం, 'శ్రామికుల్లో ఎక్కువ తక్కువ కుల భేదాలు వున్నాయి కదా; వాళ్ళు, వర్గ పోరాటంలో ఎలా కలుస్తారు?' అని! కానీ, శ్రామికులు పోరాడవలసింది, తోటి శ్రామికులతో కాదు; ఆ పని స్థలంలో, శ్రామికులందరి మీదా పెత్తందారుగా వుండే యజమానితో! అది, శ్రామికులకూ, యజమానికీ జరిగే వర్గ పోరాటం! జీతాలు పెరగాలనో, పని కాలం తగ్గాలనో, ఒక కొత్త చట్టం కావాలనో, యజమాని మీదా, ప్రభుత్వం మీదా, పోరాడితే జరిగే మెరుగుదలలు, అన్ని కులాల శ్రామికులకూ కావాలి.

ఒక బ్రాహ్మణ కార్మికుడికీ, ఒక మాల కార్మికుడికీ, భోజనాల సంబంధం ఉండకపోవచ్చు; పెళ్ళిళ్ళ సంబంధం ఉండకపోవచ్చు. కానీ ఒక ఆర్ధిక మెరుగుదల ఇద్దరికీ సంబంధించిందే కాబట్టి, యజమాని మీద పోరాటంలో ఇద్దరూ ఒకే మాట మీద ఉంటారు; ఉండక తప్పదు. కులాల భేదాలు అలాగే వుండాలని చెప్పడం కాదు ఇది. కానీ, "కులాల విభజనే, యజమానితో పోరాటాన్ని ఆపదు'' - అని చెప్పడం ఇది.

అసలు వర్గ పోరాటాలే జరగకపోతే, దానికి కారణం, కులాల విభజన వుండడం కాదు; వర్గాల గురించి నేర్పడం జరగకపోవడం! 'కుల నిర్మూలనా పోరాటం చేపట్టకుండా, ప్రపంచ కార్మికులారా, ఏకం కండి - అని పిలుపు ఇస్తే, భారత కార్మికులు ఎలా ఏకం అవుతారు?' అని అదే రకం విమర్శ! సమాజంలో వున్న రకరకాల సమస్యల గురించి, పోరాటాలు చేపట్టనక్కరలేదనీ, ఉద్యమాలు లేకుండానే సమస్యలు పరిష్కారం అవుతాయనీ, ఏ విప్లవ మార్క్సిస్టూ అనడు. కుల భేదాల సమస్యలో, ఉద్యమాల వల్ల, రెండు గ్లాసుల పద్ధతి పోవడం, దేవాలయ ప్రవేశాలూ, అస్పృశ్యతా నివారణా - వంటివి తప్పకుండా జరుగుతాయి.

కానీ, అసమాన శ్రమ విభజన మారకపోతే, 'కులాల నిర్మూలన' జరగదు. కులాలు లేని దేశాల్లో కూడా, దోపిడీ శ్రమ విభజన మారకపోతే, అట్టడుగు శ్రమలు చేసే బృందాల పరిస్థితి ఎప్పటికీ మారదు. ఆ మార్పులు కమ్యూనిస్టులు కూడా సాధించలేరు. కాబట్టే, వర్గ పోరాటాన్నే ప్రధమ నినాదంగా చెప్పుకోవలసి వుంటుంది. 'ఫ్యూడల్ కుల వృత్తులు మారితే, కులాంతర వివాహాలు జరుగుతాయి - అంటారు, కొందరు. అది తప్పు' - అని ఒక వాదం. అది తప్పో ఒప్పో తెలియాలంటే, కులాంతరాల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. ఒక మాల కులం యువకుడు, డాక్టర్ అవడం వల్ల, అతణ్ణి రెడ్డి కులం యువతి పెళ్ళికి ఇష్టపడింది.

ఒక క్షవరాల కులం యువకుడు ఆ వృత్తిలో గాక, మేధా శ్రమల వృత్తి వల్ల, అతణ్ణి బ్రాహ్మణ యువతి ఇష్టపడింది. ఒక మాదిగ కులం యువకుడు, ధనికుడూ - రాజకీయ నాయకుడు, మంత్రీ అయిన తండ్రికి పుత్రుడైన కారణంగా, అతనిని ఒక అగ్రకులం స్త్రీ పెళ్లాడింది. అంబేద్కర్ విషయంలో జరిగింది కూడా ఇదే. ప్రేమ పెళ్ళిళ్ళ విషయాల్లోనే గాక, అగ్రకులాల్లో సంస్కర్తలైన తల్లిదండ్రులు కుదిర్చే కులాంతరాల్లో కూడా, విద్యాస్థాయీ, ఆర్థికస్థాయీ కుదిరిన చోట్లే ఆ పెళ్ళిళ్ళు చేస్తారు. ఇంకా ఏ కులాంతర వివాహాన్నయినా చూడండి! ఆ సంబంధాలు ఎలా ఏర్పడుతున్నాయో తెలుస్తుంది. ఆ నిమ్న కులాల యువకులకు కుల వృత్తులు మారకపోతే, అగ్ర కులాల యువతులతో పెళ్ళిళ్ళు జరిగేవి కావు. అయితే, ఆ 'క్షవరాలు చేసే' శ్రమల వంటివి ఆగిపోతాయని కాదు. ఆ శ్రమలు సమాజానికి ఎప్పటికీ అవసరమే. ఆ శ్రమలు ఎలా జరగాలి - అనే ప్రశ్నకి జవాబు కోసం, సమానత్వ శ్రమ విభజన దగ్గరికి వెళ్ళాలి.

ఊ చైనా కమ్యూనిస్టు పార్టీ, సమాజాన్ని 27 ఏళ్ళలోనే మార్చిందనీ, భారత పార్టీలు 60 ఏళ్ళు దాటినా అలా చెయ్యలేకపోవడానికి కారణం మొదట కుల నిర్మూలన చెయ్యకపోవడం అనీ - ఒక వాదం. చైనా పార్టీ, తన సమాజంలో ఆ నాడు వున్న వర్గాన్ని, బడా బూర్జువా - పెటీ బూర్జువా - జాతీయ బూర్జువా - అంటూ, ఆ వర్గాల్నీ, వాటి సెక్షన్లనీ పరిశీలించి, తన కార్యక్రమాలూ, ఎత్తుగడలూ నిర్ణయించుకుందంటే, అదంతా వర్గ దృష్టి! ఏ దేశ కమ్యూనిస్టు పార్టీలైనా చెయ్యవలసింది వర్గ దృష్టితోనే.

శ్రామిక ప్రజలకు వర్గ దృష్టిని నేర్పడం చేస్తూ, ఆ క్రమంలోనే కుల నిర్మూలన దృష్టీ, స్త్రీ-పురుష సమానత్వ దృష్టీ - వంటి నూతన భావాలన్నీ నేర్పే కార్యక్రమాలు పెట్టుకోవాలి. కానీ కుల నిర్మూలననే మొదట పూర్తి చెయ్యాలంటే, అది మొదట పూర్తి అయ్యే విషయం కాదు. 'మాకు కుల నిర్మూలనే అంతిమ లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో, మొదటి దశ పోరాటం, 'బూర్జువా ప్రజాస్వామిక విప్లవం'. ఈ దశలో బ్రాహ్మణీయ హైరార్కీని బద్దలు చేయటం.' - వెంకటేశ్వర్లు. 'బూర్జువా ప్రజాస్వామ్యాన్ని' దళితులు కొత్తగా తీసుకురానక్కరలేదు. ఇప్పుడు వున్నది అదే. అందులో వున్నది 'బ్రాహ్మణీయ హైరార్కీ' కాదు. దోపిడీ ప్రైవేటు ఆస్తుల హైరార్కీ.

ఈ పాలనలో, దళితులే, ముఖ్యమంత్రులూ, ప్రధాన మంత్రులూ, ప్రెసిడెంట్లూ, ఎంపీలూ, స్పీకర్లూ, అలా ఎన్ని స్థానాల్లోకి వెళ్ళినా, మాయావతి పాలన కన్నా కొత్త పాలనేదీ రాదు. అది, ఆ కుర్చీల మీద కూర్చునే దళితులకు తప్ప, అది కూడా ఆ 5 సంవత్సరాలే తప్ప, నేల మీద తిరిగే దళితులకెవ్వరికీ విప్లవం అవదు. అగ్ర కులాల పెద్దల రాజ్యాధికారంలో, ఆ అగ్ర కులాల నిండా పేదలు ఎప్పటిలా వున్నట్టే, దళిత కులాల పెద్దల రాజ్యాధికారంలో కూడా ఆ దళిత కులాల పేదలు ఎప్పటిలాగే వుంటారు! బూర్జువా ప్రజాస్వామ్యం ద్వారా దళిత నాయకులు సాధించేది - తమ లాభం! అంతే! నాయకుల లాభం సరే, అదే కులాల్లో పేదల విముక్తి సంగతేమిటనేది ప్రశ్న!

- రంగనాయకమ్మ
(ముగింపు రేపు) 
Andhra Jytohi News Paper Dated ; 11/07/2012 

Monday, July 9, 2012

సమానత్వ శ్రమ విభజనే మార్గం - రంగనాయకమ్మ

నేను రాసిన 'అస్తవ్యస్త సంస్కర్తలు' (ఆంధ్రజ్యోతి, మే 15) వ్యాసానికి స్పందనగా వచ్చిన వ్యాసాలన్నీ చూశాను. ఆ వ్యాసాల్లో వున్న చాలా అంశాలు, నా 'దళిత సమస్య...' పుస్తకంలో ప్రస్తావించినవే. అవే చర్చలు అనంతంగా సాగనక్కరలేదు కాబట్టి, అలాంటి వాటిని కొన్నిటిని వదిలేసి, మిగిలిన వాటికే పరిమితమవుతాను. 'రంగనాయకమ్మకి పిచ్చి' అని తేల్చి ఆనందించేవాళ్ళకి, వాళ్ళ ఆనందం వాళ్ళకి ఉండనిస్తాను. 'రంగనాయకమ్మ, మార్క్సిజం తనకే తెలుసనుకుంటుంది' అని ఒకరూ; 'ఆమె, తన నిజమైన వర్గంలోకీ, నిజమైన కులంలోకీ, వెళ్ళిపోయింది' అని ఇంకొకరూ; అటువంటి కడుపుమంట వ్యాఖ్యానాలు ఎన్ని కురిసినా, అవి కుల సమస్య మీద చర్చలు కాలేవు. ప్రతీ వంకర వాదానికీ, తిన్నని జవాబులు ఉంటాయి.

కానీ దినపత్రిక పరిధిలో అదంతా అనవసరం. నా '... సంస్కర్తల' వ్యాసంలో వున్న ప్రధానమైన అంశం, 'కుల నిర్మూలన' సమస్యలో, అంబేద్కర్ మార్గానికీ, మార్క్సు మార్గానికీ, తేడా!

'ఈ దేశంలో, వర్గాలే కాదు, కులాలూ ఉన్నాయి' అని ఒక వాదం. కులాలు లేవని ఎవరన్నారు? కులాల సంగతి అందరికీ తెలిసిందే. ఉన్న 'వర్గాలకు' పరిష్కారం ఏమిటీ, ఉన్న 'కులాలకు' పరిష్కారం ఏమిటీ - ఇదే ఇక్కడి సమస్య! 'ఈ దేశంలో, కులమే వర్గం; వర్గమే కులం' అని ఇంకో వాదం! అంటే, 'వర్గమూ, కులమూ, ఒకటే' అనడం ఇది! 'వర్గం' అంటే ఏమిటో, 'కులం' అంటే ఏమిటో, వాటి సంబంధాలు ఏమిటో, స్పష్టత లేని వ్యాఖ్యలు ఇవి!

ఈ చర్చలో, అసలు ప్రశ్నలు రెండే. 1) రిజర్వేషన్లతో అవసరం లేకుండా, అందరూ సమానులుగా జీవించడానికి, ఎలాంటి పరిస్థితులు ఉండాలి? 2) కులాంతర వివాహాలు విరివిగా జరుగుతూ, కుల భేదాలు అంతరించడానికి, ఎలాంటి పరిస్థితులు ఏర్పడాలి? ఈ 2 ప్రశ్నల సారాంశమూ ఒకటే. చర్చ, ఈ అంశాల మీదే జరగాలి. ఎదుటి వాళ్ళకి పెట్టే శాపనార్ధాల్ని ఎంచుకోవడం మీద కాదు.

*"కుల నిర్మూలన' కోసం, హిందూ మత గ్రంధాల్ని నిషేధించడం అంబేద్కర్ మార్గం'' అంటారు ఒకరు. హిందూ మత గ్రంధాల నిషేధమే జరగాల్సిన మార్గం అయితే, దళిత ప్రజలే రాజ్యాధికారంలోకి వచ్చి, దళిత నియంతృత్వం తెచ్చి, ఆ నిషేధం పెట్టవచ్చు. అయితే దానితో, కుల భేదాలు అంతరించవు.

* మతం కావలసిన వాళ్ళకి, మూర్ఖ నమ్మకాల్ని నేర్పే ఏ మతం కన్నా, హేతువాదాన్ని చెప్పే బుద్ధుడి మతం మంచిదే. కానీ బుద్ధుడు చెప్పినవి ఎన్ని ఉత్తమ సూక్తులైనా, వాటిని సాధించే మార్గం - అష్టాంగ మార్గమే. ఆ మార్గం, ఆ సూక్తుల్ని సాధించలేదు. ఆనాటికి అంత కన్నా మార్గం లేదు. అది బుద్ధుడి పరిమితి.

* 'కమ్యూనిస్టులు ఆర్ధికమే మూలం - అంటారు, అది కుత్రిమం' అని, ఒక విమర్శ. ఆర్ధికం - అనే అంశంలో ఉత్పత్తి సంబంధాలూ, ఆస్తి హక్కులూ, యజమానీ శ్రామిక సంబంధాలూ, శ్రమ దోపిడీ, దాని శ్ర మ విభజనా - ఇన్ని లక్షణాలు ఉన్నాయి. అన్నిటికీ కలిపి క్లుప్తమైన పే రు-ఆర్ధికం. మానవ సంబంధాలకు, గుణమూ రూపమూ ఇచ్చేది అదే. అది అసమానత్వాలలో వుంది కాబట్టి, దాన్ని సమానత్వం చేసుకోవాలి.

* 'బ్రాహ్మణులే, కుల విధానాన్ని పుట్టించారు' అనేది అంబేద్కర్ సిద్ధాంతంగా, దాన్ని సమర్ధిస్తూ చెపుతోంది ఒక వ్యాసం. బ్రాహ్మణులే కులాల్ని పుట్టించడం అంటే, ముందు బ్రాహ్మణులు వుండి (ఫలానా ఒక వృత్తి గల వారు ఉండి), వారు మత గ్రంధాలు రాసి, ఆ గ్రంధాల్లో చెప్పిన నియమాలతో, కులాల్ని, లేదా 4 వర్ణాల్ని, పుట్టించారు - అనుకుంటే, దాన్ని చర్చించవలసిందే. కులాలు ఇంకా పుట్టక ముందే, బ్రాహ్మణులూ (ఒక వృత్తి వారూ), ఇతర వృత్తుల వారూ ఉన్నారంటే, కులాల కన్నా ముందే వేరు వేరు శ్రమలూ, వృత్తులూ, జరుగుతూ వున్నాయనీ, ఆస్తి సంబంధాలు ఏర్పడి ఉన్నాయనీ, అర్ధమే.

ఒక ఫలానా వృత్తి వారే కులాల్ని పుట్టించారంటే, అలా చెయ్యడానికి వారికి ఆధారంగా వున్నదీ, ఇతర వృత్తుల వారికి ఆధారంగా లేనిదీ, ఏదో ఒక విషయం వుందని అర్ధమే. ఒక వృత్తి మనుషులు, 'మేం బ్రాహ్మలంగా ఉంటాం' అన్నంత మాత్రానే, మిగతా వాళ్ళు చాకళ్ళుగా, మంగళ్ళుగా, కుమ్మర్లుగా ఉండడానికి ఒప్పుకోరు. కానీ, ఒకరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కులాల విధానం పుట్టుకొచ్చిందంటే, అది ఒకరి ఇష్టాయిష్ఠాలతో జరిగింది కాదనీ, ఆనాటి శ్రమ సంబంధాల వైరుధ్యాల పరిస్థితి అలా వుందనీ, అర్ధమే.

* ఆ రకమైన అనేక చర్చనీయాంశాల్లో, 'విప్లవకారులెవరు మరి?' అని వెంకటేశ్వర్లు గారు అడిగిన ప్రశ్నకి (మే 23) నేను తప్పకుండా జవాబు చెప్పాలి. విప్లవకారులు ఎవరా? - విప్లవం చేసే వాళ్ళే. విప్లవం చెయ్యని వాళ్ళు, విప్లవకారులు అవరు కదా? 'విప్లవం' అంటే, దానికి అంబేద్కర్ చెప్పే విప్లవంగా వెంకటేశ్వర్లు చూపించే అర్ధమూ వుంది; మార్క్సు చెప్పే అర్ధమూ వుంది. మార్క్సు ప్రకారం అయితే, ఈనాడు అమలులో వున్న పెట్టుబడిదారీ దోపిడీ ఆస్తి హక్కుల్ని రద్దు చేసి, ఆ ఆస్తుల్ని సమాజపరం చేసి, ప్రతి మనిషీ శ్రమ చెయ్యాలనే మార్గంలో, మానవుల మధ్య సమాన శ్రమ సంబంధాలు ఏర్పరచడమే, విప్లవం!

దోపిడీని వ్యతిరేకించని చర్చ ఏదీ, మార్క్సు చెప్పే విప్లవం అవదు. ఆ విప్లవ చర్యల్లో, ప్రతీ మనిషీ శ్రమ చెయ్యాలనేది, మొదటి మార్పు అయితే, ఆ శ్రమ చెయ్యడంలో కూడా కొన్ని మేధా శ్రమలూ, కొన్ని శారీరక శ్రమలూ కూడా డ్యూటీల ప్రకారమే చెయ్యాలనేది, మరో మార్పు! ఒక మనిషి ఎప్పుడూ మేధా శ్రమే, ఇంకో మనిషి ఎప్పుడూ శారీరక శ్రమే చేసే దోపిడీ సమాజాల శ్రమ విభజన, 'సమానత్వ శ్రమ విభజన'గా మారకపోతే, మనుషులందరూ ఏదో ఒక శ్రమ చేసే వారే అయినా, వారి శ్రమల విలువల్లో ఎక్కువ తక్కువలూ, వారి జీవన పరిస్థితుల్లో తారతమ్యాలూ, పాత రకంగానే వుండిపోతాయి. శారీరక శ్రమల సెక్షన్లకు విముక్తి అనేది, అప్పుడూ కూడా అబద్దమే అవుతుంది. అంటే, మార్క్సిజం చెప్పే 'ఆర్ధికం' అనేది, కేవలం పేదలకు భూములు పంచడమో, లేదా భూముల్ని జాతీయం చేయడమో మాత్రమే చేసే సిద్ధాంతం కాదు. అన్ని రకాల అసమానతల్నీ, శతృ వైరుధ్యాల్నీ, పరిష్కరించగల మార్గం అది.

* 'ఇప్పుడు వున్న కమ్యూనిస్టు పార్టీలు దళితులకు నచ్చకపోతే, వారే ఒక పార్టీ పెట్టుకుని, దాన్ని విప్లవకరంగా నడుపుకోవాలి' అని నేను అన్నదానికి, వెంకటేశ్వర్లు, 'ఇంత వరకూ మన సమాజాన్ని విప్లవ పరిస్థితులవైపు తీసుకువెళ్ళే ప్రయత్నాలు జరగలేదని ఆమె భావిస్తున్నారా?' అన్నారు. అది నా భావనగా చెప్పింది కాదు. దళిత నాయకులు అలా భావిస్తున్నారు కాబట్టి, వారు అప్పుడేం చెయ్యవలసి వుంటుందో చెప్పాను. నచ్చితేనే కలిసి పనిచెయ్యాలి. ఎంత ప్రయత్నించినా ఐక్యత సాధ్యం కాకపోతే విడిపోవాలి. అదే చెప్పాను.

* 'పార్టీ వారు సత్యమూర్తిని బైటికి పంపారు' లాంటి వాదనలు ఇక్కడ బొత్తిగా అనవసరం. వాళ్ళు పంపారో, ఆయనే వెళ్ళారో, అది ఇక్కడ వాదించి నిర్ణయించే విషయం కాదు. నేను కమ్యూనిస్టు పార్టీల చరిత్రల గురించీ, చర్యల గురించీ, నా వ్యాసంలో ఎక్కడా మాట్లాడలే దు. నా కోణం-మార్క్సిజం. చర్చ జరిగితే, ఆ సిద్ధాంతం మీదే జరగాలి.

* 'ఇండియాలో దోపిడీ వర్గం అంటే ఎవరు?' అని, ఒక ప్రశ్న. ఇండియాలో అయినా, ఇంకెక్కడైనా, భూమి కౌళ్ళూ, వడ్డీ లాభాలూ తినేదే - దోపిడీ వర్గం. ఆ దోపిడీ చట్టాల ద్వారా పాలించేది, దోపిడీ ప్రభుత్వం. అదనపు శ్రమని గానీ, అదనపు విలువని గానీ, పోగొట్టుకునేది, శ్రామిక వర్గం. ఏ దేశంలో అయినా, శతృ వర్గ లక్షణాలు అవే. సమాజానికి అదే మౌలిక శతృ వైరుధ్యం. దానితో పాటు, ప్రత్యేక సమస్యలు కూడా వుంటాయి. ఇండియాలో కుల విధానం, శ్రమ సంబంధాలతో లంకెలు పడి వున్న విధానం. ఈనాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, విభజనలతో వున్న కులాలలో అత్యధిక సంఖ్య, ఉత్పత్తి సాధనాలు లేని వారు. అట్టడుగు శారీరక శ్రమలకు బందీలైన వారు. వారి ఆర్ధిక, సాంఘిక దుస్థితికి కారణం, శ్రమ సంబంధాలలో వారు ఆ రకపు పాత్రలో వుండడం! అవే కులాలలో దోపిడీదారులు కూడా వుంటారు.

అది తక్కువ సంఖ్యే అయినా, ఆ కులాల్లో కూడా దోపిడీ వర్గం వుంటుంది. అగ్ర కులాల్ని తీసుకుంటే, అక్కడ కూడా అందరూ దోపిడీదారులు కారు. అక్కడ కూడా వేతన శ్రామికులూ, నిరుద్యోగులూ, నిరుపేదలూ, వుంటారు. కానీ అక్కడ కొంత అధిక సంఖ్య, మేధా శ్రమల్లో వుంటారు. కొంత సంఖ్య, కొన్ని రకాల శారీరక శ్రమల్లో వున్నా, అట్టడుగు శారీరక శ్రమల్లో మాత్రం వుండరు. ఈ శ్రమ సంబంధాలూ, దానిలో వున్న శ్రమ విభజన పరిస్థితులూ, రకరకాల కులాల రూపంలో, కులాల పేర్లతో కనపడుతోన్నా, అందులో అసలు విషయం, మనుషుల్ని ఉత్పత్తి సాధనాలు వున్నవారి గానూ - అవి లేని వారి గానూ; మేధా శ్రమల వారి గానూ - శారీరక శ్రమల వారి గానూ, విభజించి వుంచేవి, వర్గ పరిస్థితులే. ఇవే వర్గ పరిస్థితులు అన్ని దేశాల్లోనూ వుంటాయి. వాటి ప్రభావాలు వేరు వేరు రూపాల్లో వుంటాయి. కులాలు లేని దేశాల్లో కూడా, అట్టడుగు శారీరక శ్రమలకే అంకితమైన సెక్షన్లు వుంటాయి. అది, కుల విధానం వల్ల వచ్చిన సమస్య కాదు. అక్కడ ఆ సమస్య పరిష్కారానికి ఏది మార్గమో, కులాల పేరుతో వున్న అట్టడుగు శారీరక శ్రమల మానవుల విముక్తికి కూడా అదే మార్గం. విప్లవ శ్రమ విభజనే ఆ మార్గం. మౌలిక సమస్యల పరిష్కారాల మార్గంలోనే ప్రత్యేక సమస్యల పరిష్కారాలు కూడా సాధ్యమవుతాయి. కొన్ని సమస్యలకు, దోపిడీ పరిస్థితుల్లో కూడా సంస్కరణల ద్వారా కొంత పరిష్కారం సాధ్యమవుతుంది.

'పురుషాధిక్యతా - స్త్రీల బానిసత్వం' అనేవి, వర్గ సంబంధాలతోనూ, అందులో 'ఇంటి పనీ - బైటి పనీ' శ్రమ విభజనతోనూ, ముడిపడి సాగే విషయమే. అయినా, స్త్రీల సమస్యల్లో, వారి విద్యలూ, బాల్య వివాహాలూ, వితంతు వివాహాలూ వంటి కొన్నిటిని, సంస్కరణల ద్వారా, కొంత వరకైనా పరిష్కరించడం సాధ్యమే. కానీ, 'వ్యభిచారం' వంటి సమస్యని పరిష్కరించడం గానీ, స్త్రీ-పురుష అసమానతల్ని పూర్తిగా పరిష్కరించడం గానీ, శ్రామిక వర్గ విముక్తి కన్నా ముందు సాధ్యం కాదు. అలాగే, కులాల సమస్యని తీసుకుంటే, సంస్కరణల ద్వారా, 'అస్పృశ్యత' వంటి సమస్యని పరిష్కరించవచ్చు; కులాంతర వివాహాల్ని కూడా నూటికో కోటికో ఒక్కొక్క దాన్ని సాధించవచ్చు. కానీ, మొత్తం కుల విధానాన్నే మార్చివేసేటంతగా కులాంతర వివాహాలు జరిగే పరిస్థితుల్ని, శ్రామిక వర్గ విముక్తి కన్నా ముందు సాధించడం సాధ్యం కాదు.

ఒక అగ్ర కులంలో అయినా, ధనికులకూ - పేదలకూ మధ్య పెళ్ళి జరగదు. వేరు వేరు అగ్ర కులాల మధ్య కూడా, రెండూ అగ్ర కులాలే అయినా, ధనికులకూ - పేదలకూ మధ్య పెళ్ళి జరగదు. పెళ్ళిళ్ళ విషయంలో అదే జనరల్ సూత్రం. కులాలు లేని మతాల్లోనూ, జాతుల్లోనూ, దేశాల్లోనూ కూడా, ఎక్కడైనా చూడండి! అట్టడుగు శారీరక శ్రమల వ్యక్తులకూ, మేధా శ్రమల వ్యక్తులకూ, వివాహ, కుటుంబ సంబంధాలు ఏర్పడవు. అంటే, అడుగు కులాల బీద పరిస్థితులూ, వారు అడుగు శారీరక శ్రమలకు మాత్రమే బందీలై వుండే పరిస్థితులూ, మారకపోతే, కులాంతర వివాహాలూ జరగవు; కులాల విధానం రద్దూ జరగదు.

* 'శ్రామిక వర్గ పార్టీకి, శ్రామిక వర్గ కులాల వారు నాయకులుగా వుండాల్సిన అవసరం లేదా? ఇదేనా మార్క్సిస్టు వర్గ పోరాటం? ఇటు వైపుకేనా రంగనాయకమ్మ దృష్టి పెట్టమంటున్నారు?'-వెంకటేశ్వర్లు ప్రశ్న. దృష్టి పెట్టమని నేను చెప్పేది, 'మార్క్సిజం' మీద! 'శ్రామిక వర్గ పార్టీకి నాయకత్వం' అనేది, శ్రామిక వర్గ చైతన్యమూ, ఆ సిద్ధాంతావగాహనా, ఆ కృషీ, వంటి అంశాల్ని బట్టి వుండాలి. ఆ లక్షణాలు ఎవరికి ఎక్కువగా వుంటే, వాళ్ళే నాయకత్వ స్థానంలోకి సహజంగా వెళ్ళాలి.

ఆ లక్షణాలు, అడుగు కులాల వారికో, పై కులాల వారికో, తప్పనిసరిగా వుంటాయనడానికి లేదు. ఏ కులంలో అయినా, శ్రమ చేసే మనుషుల్లో వున్న సుగుణం - శ్రమ చెయ్యడం ఒక్కటే. అది తప్ప, మిగతా అన్ని అంశాల్లోనూ, శ్రామికులంతా, భూస్వామ్య, బూర్జువా సమాజాల్లో పుట్టి పెరుగుతూ, అవే భావాలతో కిక్కిరిసి వున్నవారే. శ్రమ చేసే మనిషికి, శ్రమ దోపిడీకి గురి అవుతున్నానని తెలిసే వరకూ, ఆ హృదయంలో ఏ విప్లవ భావ బీజమూ మొలకెత్తదు. అంటే, అడుగు కులాల వారు, ఆ కులాల్లో పుట్టినందుకే, తమ పుటకతోనే, విప్లవకారులుగా వుంటారనేది పెద్ద భ్రమ!

- రంగనాయకమ్మ
(ఇంకా వుంది) 
Andhra Jyothi News Paper Dated : 10/07/2012

Saturday, June 2, 2012

అస్తవ్యస్త సంస్కర్తలు! - రంగనాయకమ్మ


'మార్క్స్ గతి తార్కిక భౌతిక వాదం, అంబేద్కర్ కుల నిర్మూలన ఉద్యమం, జమిలిగా భారతదేశ విప్లవానికి రహదారులు వేయాలని (కేజీ సత్యమూర్తి) తపన పడ్డాడు. రంగనాయకమ్మకు సమాధానంగా రాసిన 'అంబేద్కర్ సూర్యుడు' అనే తాత్విక విశ్లేషణతో కూడిన పుస్తకంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాడు' (వివిధ, ఏప్రిల్ 30). 


'అంబేద్కర్ సూర్యుడు' పుస్తకం, నా పుస్తకానికి సమాధానం అని, నేను ఆనాడూ అనుకోలేదు; ఈనాడూ అనుకోవడం లేదు. అయితే మార్క్సునీ-అంబేద్కర్‌నీ కలపడం, గొప్ప 'తాత్విక విశ్లేషణ'గా ఆ వ్యాసం వర్ణించింది కాబట్టి ఆ అంశం మీదే నేను చెప్పదల్చుకున్నాను. మార్క్సిజాన్ని ఎవరి కిష్టమైనట్టు వాళ్ళు మార్చేసి, దాన్ని దేశీయ మార్క్సిజంగానో, జాతీయ మార్క్సిజంగానో చెయ్యాలని ప్రయత్నించే అస్తవ్యస్త సంస్కర్తల్లో, కేజీ సత్యమూర్తి కూడా ఒకరు. మార్క్సు చెప్పిన మార్క్సిజం అయితే, దోపిడీవర్గ సంబంధాల్నీ, దోపిడీ శ్రమ విభజననీ, యజమాని వర్గంపై శ్రామిక వర్గం చేసే పోరాటం ద్వారానే తీసివెయ్యాలంటుంది. 



ఆ సిద్ధాంతం ప్రకారం అయితే, శతృ వర్గాలు గల ఏ దేశంలో అయినా, శ్రామిక వర్గ విముక్తికి, ఆ వర్గ పోరాటమే ప్రధాన సూత్రం. దేశాల్లో వుండే ఏ ప్రత్యేక సమస్య పరిష్కారం అయినా, ఆ ప్రధాన సూత్రానికి లోబడి, మౌలిక పరిస్థితులు మారి, జరగవలసిందే. శ్రామిక వర్గ పోరాటం వల్ల, దోపిడీ వర్గం కూడా స్వంత శ్రమలతో జీవించే ఉత్పత్తిదారులవుతారు. యజమానీ శ్రామిక సంబంధాలు అంతరిస్తాయి. ఇలా చెప్పే మార్క్సు సిద్ధాంతాన్ని, దోపిడీ వర్గం తిరస్కరిస్తుందంటే, ఏమీ ఆశ్చర్యం వుండదు. కానీ, భారతదేశపు శ్రామిక వర్గంలో ప్రధాన భాగం అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, తదితర బృందాలన్నీ కూడా 'శ్రమ దోపిడీ నించి బైట పడ' మని ప్రేమతో చెప్పే సిద్ధాంతం వేపు మొహాలు తిప్పకపోవడమే అసలైన ఆశ్చర్యం! 



ఆ బృందాలు అలా వుండడానికి కారణం, వాటి నాయకులు వాటికి నేర్పిందీ, నేర్పుతున్నదీ అదే! ఆ నాయకుల లక్ష్యం, బూర్జువీకరణే! దోచుకుంటూ బతికే మార్గంలోకి ఎదగాలనేదే! అది కాకపోతే, మార్క్సిజం పట్ల వ్యతిరేకతకి వేరే అర్థం ఏదీ వుండదు. ఆ బృందాల నాయకులకు, అమలులో వున్న కమ్యూనిస్టు పార్టీల ప్రవర్తనలు నచ్చకపోతే ఆ నాయకులే మార్క్సిజాన్ని అధ్యయనం చేసి, వారే ఆ సంఘాలు పెట్టుకుని, వారే తమ విప్లవ లక్ష్యం ద్వారా, తమ బృందాలకు నేర్పుకోవచ్చు! మార్క్సిజం అనేది ఉనికిలో ఉన్న పార్టీల సొత్తే కాదు. 



అంబేద్కర్ లాంటి నాయకుణ్ణి తీసుకుంటే, ఆయన దగ్గిర విరుద్ధ సిద్ధాంతాలు లేవు. ఉన్నది ఒకే ఒక్క సిద్ధాంతం. అది, మార్క్సిజం పనికిరాదు, దానికి పోవద్దు! సత్యమూర్తి వంటి నాయకుణ్ణి తీసుకుంటే ఆయనది ఒకే ఒక్క సిద్ధాంతం కాదు; విరుద్ధ సిద్ధాంతాలు! ఒక పక్క - అంబేద్కర్ బోధించిన మార్క్సిజం వ్యతిరేకతా, ఇంకోపక్క - మార్క్సిజం వల్ల దొరికే ఆకర్షణని వదులుకోలేని బలహీనతా! ఇటువంటి నాయకులు, అంబేద్కర్ లాగ మార్క్సిజాన్ని పూర్తిగా పోగొట్టుకోలేరు. అప్పుడేం చేస్తారంటే, ఒక తెలివైన మార్గం ఏదో కనిపెడతారు. ఈ దేశంలో అయితే, అంబేద్కర్‌నీ, మార్క్సునీ, కలిపే మార్గం! లేదా, ఎవరికైనా కావాలంటే, అందులోకి గాంధీని కూడా కలపవచ్చు! రెండో మూడో పేర్లు కలిపి రాసెయ్యడం మనం చేద్దాం; చెయ్యగలం. 



అయితే అవి కలుస్తాయా? కలపగలమా? మార్క్సు సిద్ధాంతం ఏమిటి? -దోపిడీ శ్రమ సంబంధాల రద్దు! శ్రామిక వర్గ పోరాటం, హింస కాదు. అది, యజమాని వర్గం శ్రమ దోపిడీ కోసం చేసే హింసని ఆపే మార్గం! అది, శ్రామిక వర్గానికి ఆత్మరక్షణ! వర్గ సంబంధాలలో ఏర్పడే ఏ ప్రత్యేక సమస్యా, శ్రామికవర్గ పోరాటం ద్వారా తప్ప, వైరుధ్య పరిస్థితులు మారితే తప్ప, అంతం కాదు. దీనికి మతాలు లేవు. ఇది భౌతిక వాదం. 



అంబేద్కర్ సిద్ధాంతం ఏమిటి? - వర్గ పోరాటాలూ అవీ వద్దు! సంస్కరణలు వున్నాయి. కులాలు వద్దు! మతం అవసరమే. దాన్ని మార్చుదాం! మొదట కులాలు రద్దయ్యాకే వర్గాల వేపు చూద్దాం! గాంధీ సిద్ధాంతం ఏమిటి? -పారిశ్రామికవేత్తల జోలికి పోవద్దు! ఆస్తులన్నిటికీ వారే ధర్మ కర్తలు! (ట్రస్టీలు!) శ్రామికుల్ని దయగా చూసే ట్రస్టీ షిప్పు చాలు! ఇక కులాల సంగతా? అస్పృశ్యత ఒక్కటీ వద్దులే గానీ కులాలకే ం, అవి అలాగే వుంటాయి. కుల వృత్తులన్నీ ఎప్పట్లాగే. చాకలి మనిషి చాకలి పనీ, పాకీ మనిషి పాకీ పనీ, బ్రాహ్మణ మనిషి బ్రాహ్మణ పనీ! అది ఎంత మంచిది! హిందూ మతానికేం, అద్భుతం! కాకపోతే, రాముణ్ణీ అల్లానీ కలిపి పాడదాం! పోరాటాలా? వద్దు! అవి హింస. ప్రభుత్వానికైతే పోలీసులూ, సైనికులూ, చాలా అవసరం. 



అది హింసకాదు. వర్గ పోరాటాలా? అది ఘోర హింస! ఇప్పుడు, ఈ 3 సిద్ధాంతాల్నీ, పోనీ రెంటినైనా, కలిపెయ్యాలి. కలిపేద్దాం! కలుస్తాయా? అంబేద్కర్ సిద్ధాంతం, గాంధీకి వ్యతిరేకం; మార్క్సుకి వ్యతిరేకం. గాంధీ, అంబేద్కర్‌కి వ్యతిరేకం! మార్క్స్‌కి వ్యతిరేకం. మార్క్సు, ఆ ఇద్దరికీ వ్యతిరేకం. వర్గసామరస్యాలూ, సంస్కరణలూ చెప్పే వాళ్ళందరికీ వ్యతిరేకం! బుద్ధుణ్ణి కూడా తీసుకుంటే -అది, 'అష్టాంగ మార్గం'. అది అన్నిటికీ నిరుపయోగం. 



ఆ సిద్ధాంతాల్లో వైరుధ్యాలేమిటో తెలిసిన వాళ్ళకి వాటిలో ఏ రెంటినీ కలపడం సాధ్యం కాదని తెలుస్తుంది. అప్పుడేం చెయ్యాలి ఆ తెలిసిన వాళ్ళు? గాంధీని తీసి పారెయ్యొచ్చు. అది శుద్ధ దండగ! అంబేద్కర్ నుంచి 'కులాల రద్దు' అంశాన్ని తీసుకోవాల్సిందే. కానీ, ఆ రద్దు, శ్రమ సంబంధాల్లో మార్పు కోసం జరిగే వర్గపోరాటం ద్వారానే సాధ్యం. అడుగు కులాల వారందరి ఆర్థిక పరిస్థితులు మారక ముందే వాటి రద్దు జరగదు. 



విషయాల్లో ఒక తర్కం ఉంటుంది. ఆ తర్కం ప్రకారమే ఐక్యతలూ, అనైక్యతలూ ఏర్పడతాయి. 'శ్రామిక వర్గ పోరాటాల ద్వారానే ప్రత్యేక సమస్యల విముక్తి' అనే సూత్రంతో, 'మొదట కులాల రద్దు జరిగాకే వర్గాల విషయం చూడాలి' అనే సూత్రం కలవడం ఎలా సాధ్యం? కానీ, సత్యమూర్తి వంటి మేధావులకు ఏదైనా సాధ్యమే. తర్కాలూ, గిర్కాలూ అక్కరలేదు. ఆయన ప్రకారం అంబేద్కర్‌నీ, మార్క్సునీ, కలిపెయ్యవచ్చు. ఆ రెంటినీ ఒకే సిద్ధాంతం చెయ్యవచ్చు. అప్పుడు మార్క్సిజం మారితే మారుతుంది. పోరాటాలు పోతే పోయి, సామరస్యాలు విస్తరిస్తే విస్తరిస్తాయి. మార్క్సిజాన్ని, 'దేశీయ మార్క్సిజం'గా మార్చవలసిందే. అది మన దేశ అవసరం. 



అంటే, మార్క్సిజం అనేది, జర్మనీలో జర్మనీ వాళ్ళ మార్క్సిజం, ఇంగ్లండులో ఇంగ్లండు వాళ్ళ మార్క్సిజం, ఫ్రాన్సులో ఫ్రాన్సు వాళ్ళ మార్క్సిజం, అలాగే ఇక్కడ భారత వాళ్ళ మార్క్సిజం! దేశాల్ని బట్టీ, ప్రాంతాల్ని బట్టీ మార్క్సిజం, వర్గ పోరాటాన్ని వదిలేస్తుంది. అంబేద్కరూ, బుద్ధుడూ, మార్క్సూ కలిసింది మన దేశీయ మార్క్సిజం అవ్వాలి! గాంధీ భక్తులైతే 'గాంధీని కూడా కలపాలి' అంటారు! సాయిబాబా భక్తులైతే, 'బాబాని కూడా!' ఎంత తెలివైన ఐక్యతలు ఇవి! వీటిని విదేశాల్లో ఎప్పుడో చేసేశారు! ఇక్కడే సత్యమూర్తి ఆలస్యంగా, తెలివిగా, మార్క్సిజాన్ని దేశీయ మార్క్సిజం చేశాడు. 



కానీ ఆయన, ఆ తెలివిని, తెలివి తక్కువగా ప్రదర్శించాడు. బుద్ధుణ్ణీ, అంబేద్కర్‌నీ, మార్క్సునీ-సరిసమానుల్ని చేసి, 'దోపిడీ పీడనల్లేని సమాజాన్ని కాంక్షించిన స్వాప్నికులు, తత్వ చింతనా పరులు, ఈ త్రిమూర్తులు' అని వర్ణించి, అంబేద్కర్‌ని ఒక్కడినే 'సూర్యుణ్ణి' చేశాడు! ('అంబేద్కర్ సూర్యుడు'లో. ఆ 3 ఫోటోల పేజీకి, పేజీ నంబరు లేదు). 'బుద్ధుడూ, అంబేద్కరూ కాంక్షించింది, దోపిడీ పీడనల్లేని సమాజాలనా?' అనే ప్రశ్నని వదిలేస్తాను. దాని జోలికి పోను. కానీ, ఆ ముగ్గురూ ఒకే రకం చింతనాపరులైతే, సరిసమాన త్రిమూర్తులైతే, అంబేద్కర్ ఒక్కడే 'సూర్యుడు' ఎలా అవుతాడు? సత్యమూర్తి ప్రకారం, బుద్ధుడు ఏమవ్వాలి? -రెండో సూర్యుడు కావద్దూ? మార్క్సు ఏమవ్వాలి? మూడో సూర్యుడు కావద్దూ? ముగ్గుర్నీ సమానంగా త్రిమూర్తుల్ని చేసి అంబేద్కర్‌ని ఒక్కణ్ణే 'సూర్యుడు' అంటే ఈ ప్రశ్నలన్నీ రావూ? 



పోనీ, 'ముగ్గురూ సూర్యుళ్ళే' అంటే, 'భూమికి ముగ్గురు సూర్యుళ్ళా? పోనీ ఇద్దరు సూర్యుళ్ళా?' అనే ప్రశ్నలు రావూ? తప్పో ఒప్పో, 'ముగ్గురూ సూర్యుళ్ళే' అని ఎందుకు అనలేదు? కాన్షీరామ్ లాంటి, మాయావతి లాంటి, దళిత నాయకులైతే, వారి దృష్టిలో అంబేద్కర్ తప్ప మార్క్సు వుండడు కాబట్టి, అంబేద్కర్‌ని సూర్యుడు అనడం, వాళ్ళ ప్రకారం సరిపోతుంది. కానీ, సత్యమూర్తి చెప్పుకున్న ప్రకారం సత్యమూర్తి ఒకే పక్ష మేధావి కాడు. త్రిపక్షాల మేధావి! 



సూర్యుడైన అంబేద్కర్‌ని, సూర్యుడుకాని బుద్ధుడి తోటీ, సూర్యుడు కాని మార్క్సు తోటీ, ఎలా సమానం చెయ్యగలడు? కాబట్టి, సత్యమూర్తి ఏం చేసి వుండవలసిందంటే, అంబేద్కర్‌ని, మిగతా ఇద్దరి కన్నా పైన పెడితేనే, అతడు సూర్యుడు కావచ్చు! సమాజాన్నంతా వెలుగుతో నింపే సూర్యుడు అంబేద్కరే! ఆయనికి ఈ పక్కా, ఆ పక్కా నించోడానికి బుద్ధుడూ, మార్క్సూ పనికివస్తే రావచ్చు! అలా చెప్తే అంబేద్కరు ఒక్కడే సూర్యుడు కావచ్చు! 



సత్యమూర్తి, ఒక కమ్యూనిస్టు పార్టీని వదిలేస్తే వదిలెయ్యవచ్చు. కానీ కమ్యూనిస్టు అవగాహన కన్నా అస్త్తిత్వ అవగాహననే ప్రధాన లక్ష్యం చేసుకున్నాడు. అస్తిత్వ బృందాలన్నీ వేరు వేరు సెక్ట్‌లు. ఎవరి సమస్య వారిది. ప్రత్యేక సమస్యల మీద ప్రత్యేక ఉద్యమాలు అవసరమే, న్యాయమే. అయితే, ఏ అస్తిత్వ బృందం అయినా, తన సమస్యకు కోరే పరిష్కారం ఏమిటి? -బూర్జువీకరణే! మార్క్సిజం నించీ వర్గ స్పృహని తీసివేసేది బూర్జువీకరణ. బూర్జువాలం అవ్వాలి! బూర్జువా పాలకులం అవ్వాలి! అలా అయ్యే దళిత మేధావికి, అది మంచిదే. కానీ, ఒక దళితుడు పెట్టుబడిదారుడిగా ఎదిగితే, వెయ్యి మంది దళితుల్ని తన కార్మికులుగా నిలబెట్టి, వాళ్ళని దోచుకుంటూ బతకడం ఆ గొప్ప దళితుడికి ఆనందమే. సెక్ట్ ఉద్యమాలు కోరేదంతా, ఆ ఎదిగే దళితుడి లక్ష్యమే. 



అస్తిత్వ సెక్ట్ ఉద్యమకారులు, మొత్తం సమాజంలో తమ పాత్ర ఏమిటో, తమ స్థానం ఎక్కడో, పట్టించుకోరు. తమ అస్తిత్వ బృందం కూడా అసమాన శ్రమ సంబంధాల్లో బందీయై వున్నట్టు గ్రహించరు. తమ బృందం స్వతంత్ర బృందం అయినట్టూ, తమ సమస్య విడి సమస్య అయినట్టూ, తమకు పరిష్కారం విడిగా దొరుకుతుంది అన్నట్టూ, కలలు కంటారు. భూమి, తనచుట్టూ తను తిరుగుతూనే, సూర్యుడి చుట్టూ తిరుగుతూ వుంటుంది. అది ప్రకృతి సూత్రం. అలాంటి సూత్రం, ప్రతి అస్తిత్వ బృందానికీ వుంది. ప్రతి బృందం, తన సమస్యల చుట్టూ తను తిరుగుతూనే, అదే కాలంలో తన వర్గ స్పృహ చుట్టూ కూడా తను తిరగాలి. 



లేకపోతే ఏ అస్త్తిత్వ బృందాన్నీ ఏ అస్తిత్వ సూర్యుడూ రక్షించలేడు. అంబేద్కర్ సూర్యుడు దళిత కులాలకు కల్పించిన రిజర్వేషన్ల వెలుగు ఎంత కాలం? శాశ్వితంగానా? అయితే, అడుగు కులాలు కూడా శాశ్వితంగా ఉండవలసిందే కదా? కులాలు వుంటేనే కదా, రిజర్వేషన్లు వుండేది? కానీ రిజర్వేషన్లు కూడా ఒక వివక్ష. అది, ఆత్మ గౌరవ రాహిత్యం. వాటిని తాత్కాలిక ఉపశమనంగా మాత్రమే భావించి, అవి లేకుండానే దొరకవలసిన శాశ్వితమైన మార్పుని కోరవద్దా? లేకపోతే రిజర్వేషన్లనే శాశ్వితంగానూ, వాటి కోసం అడుగు కులాలనే శాశ్వితంగానూ నిలుపుకోవాలనా? 



రిజర్వేషన్లు తాత్కాలిక ఉపశమనమే అయితే, కుల విధానంలో, ఆ తర్వాత జరగవలసిన శాశ్విత పరిష్కారం ఏమిటి? - పరిష్కారం కులాంతర వివాహాలే అని అందరికీ తెలుస్తుంది. అయితే, ఆ కులాంతర వివాహాలు జరిగే మార్గం ఏమిటి? - ఆ మార్గం తెలియాలంటే, ఇప్పటికే జరిగిన కనీసం ఒక 100 కులాంతర వివాహాల్ని పరిశీలించి (అంబేద్కర్ చేసుకున్న కులాంతర వివాహంతో సహా) అవి ఏ కారణాల వల్ల జరిగాయో ఆ కారణాలని పట్టుకోవాలి. కులాంతర వివాహాలు నిరభ్యంతరంగా జరగడానికి ఏ పరిస్థితులు అవసరమో, ఆ పరిస్థితుల్ని సమాజం నిండా ఏర్పరిచే మార్గమే కులాల రద్దుకి శాశ్వత పరిష్కార మార్గం అవదూ? 



మార్క్సిజాన్ని దేశీయ మార్క్సిజంగా మార్చే మేధావులు ఒకరో ఇద్దరో కాదు, కమ్యూనిస్టు పార్టీల నిండా కూడా వున్నారు! ఆ మధ్య, పుచ్చలపల్లి సుందరయ్యగార్ని 'మార్క్సిస్టు గాంధీ'గా చేసిన వ్యాసం ఒకటి చదివాను. మార్క్సిస్టుకీ, గాంధీకీ ఏమిటి పొంతన? సుందరయ్య గారు ఫలానా రకపు నిరాడంబరుడైతే, గాంధీ అటువంటి నిరాడంబరుడా? 'గాంధీని నిరాడంబరంగా వుంచడానికి చాలా ఖర్చవుతూ ఉంటుంది' అని సరోజినీ నాయుడు అన్న మాటలు ఆ వ్యాసకర్త చదవలేదా? 



భగత్ సింగ్ ఉరిశిక్షకి, గాంధీయే ముఖ్యకారణం అని తెలీదా? మహాత్మా గాంధీ, ఆడ పిల్లల్ని నగ్నంగా తన పక్కలో పడుకో బెట్టుకుని, 'నా బ్రహ్మచర్యానికి పరీక్ష చేసుకుంటున్నాను' అనే నీతి సూత్రాలు చెప్పాడని ఆ వ్యాసకర్త చదవలేదా? ఏ రకంగా, ఏ కోణంలో, గాంధీ ఆదర్శనీయుడు? సుందరయ్యని గాంధీగా మార్చడం, సుందరయ్యకి ఏ రకంగా సన్మానం? కమ్యూనిస్టు పార్టీల వాళ్ళు నిజంగా సిగ్గులు వదిలేశారు. 'నవ్వి పోదురు గాక మాకేటి సిగ్గు?' అని మొండికెత్తి పోయారు. 



తమ ప్రారంభోత్సవాల్లోకీ, మీటింగుల్లోకీ, బూర్జువా మంత్రు ల్ని సాదరంగా, గౌరవంగా, పిలుస్తారు. ఏం లేదు, ఇవన్నీ మార్క్సిజాన్ని, బూర్జువా మార్క్సిజంగా మార్చిన లక్షణాలే! కార్మిక జనం, బూర్జువా కమ్యూనిస్టుల్ని సహిస్తూ వుంటే, శ్రామిక వర్గానికి దొరికేది, దేశీయ మార్క్సిజమే, జాతీయ మార్క్సిజమే. అంటే ఏం లేదు, బూర్జువా పాలకులు దయగా అనుమతించే చట్టబద్ధ మార్క్సిజమే. దానితో ఎప్పటికీ ఎక్కడి వాళ్ళం అక్కడే వుంటాం. అస్తిత్వ బృందాలన్నీ అడుగు శ్రమల్లోనే, ఆడ వాళ్ళంతా వంటిళ్ళలోనే! 



ఏ సూర్యుడూ, ఎవర్నీ రక్షించలేడు! చూద్దాం, మార్క్సిజాన్ని బూర్జువాగా మార్చాక, సూర్యుడు ఏం చేస్తాడో! 



- రంగనాయకమ్మ
Andhra Jyothi News Paper Dated : 15/05/2012