Showing posts with label జూపాక సుభద్ర. Show all posts
Showing posts with label జూపాక సుభద్ర. Show all posts

Sunday, August 10, 2014

మట్టి మహిళ ఆత్మగౌరవ జెండా - జూపాక సుభద్ర, కృపాకర్‌ మాదిగ

Published at: 10-08-2014 00:26 AM
భారత సమాజంలో అసహాయులైన ఆడవారి మీద మగవారి దురహంకార లైంగిక, హంతక దాడుల యుద్ధం కొనసాగుతోంది. ఆధిపత్య, జెండర్‌, మతం, కుల దురహంకార దాడుల సంస్కృతిలో ప్రజాస్వామిక విలువలు, మానవీయ విలువలు నలిగిపోతున్నాయి. ఆడవాళ్ళు, చిన్న పిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేని లైంగిక, హంతక దాడులు పెరిగిపోయాయి. లైంగిక నేర ప్రవృత్తికి అగ్రకుల క్రూరత్వం తోడైన చోట దళిత, ఆదివాసీ, బలహీన వర్గాల మహిళల పరిస్థితులు మరీ దయనీయంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని నిరసిస్తూ మహిళలు, మహిళా సంఘాలు, తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు ప్రజాస్వామిక వాదులు సంఘటితమై గొంతెత్తుతున్నారు. సామాజిక, జెండర్‌ వక్రగతులను దిద్దుబాటు చేసుకోలేనంతగా మన సమాజం రోగగ్రస్తమయిందా? మహిళలపై జరుగుతున్న అరాచకాలను అరికట్టడంలో సమాజమూ, చట్టాలూ, ప్రభుత్వాలూ విఫలమవుతున్నాయా? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధిత మహిళలే తమని తాము రక్షించుకునే ఆత్మరక్షణా చర్యలకు సిద్ధపడక తప్పదా?   ‘నేను ఫూలన్‌ దేవిని’ అనే పుస్తకంలో వివరించిన ఫూలన్‌ దేవి కాలం నాటి అణచివేత పరిస్థితులు నేడు తప్పక కనిపిస్తాయి.
ఉత్తరప్రదేశ్‌లో యమునా నది తీరాన, ఒక మారుమూల గ్రామమైన ‘గోర్ఖాకా పూర్వా’లో 1963 ఆగస్టు 10న ఫూలన్‌ దేవి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు, నదిపై పడవలు నడిపే సాంప్రదాయక వృత్తిగల అత్యంత వెనకబడిన సామాజిక వర్గమైన మల్లా కులస్తులు. చిన్నప్పటి నుంచి ఫూలన్‌ దేవి పశువులు కాచింది. యమునా నదిలో ఈదింది. పడవలు నడిపింది. పాముల్నికొట్టింది. బరువులు మోసింది. పొలం పనులు చేసింది. భూమి, సంపద, అధికారం కలిగి అగ్రకుల ఠాకూర్ల దర్పాలనూ, దాష్టీకాలనూ చూసింది. చమార్‌, జాతవ్‌, మల్లా మొదలగు అణగారిన కులాల దైన్యాన్నీ, అశక్తతలనూ అర్థం చేసుకుంది. పదకొండేళ్ళ వయసులోనే బాల్య వివాహానికి గురై ముఫ్పై అయిదేళ్ళ వయసున్న భర్త లైంగిక హింసలనూ ఎదుర్కొంది. తండ్రి కున్న కొద్దిపాటి ఆస్తినీ కాజేసిన దగ్గరి బంధువుల మోసాన్ని చిన్న నాడే ప్రశ్నించి దెబ్బలు తిన్నది. అవహేళనలకు పోలీసుల తప్పుడు కేసులు, దెబ్బలు, సామూహిక అత్యాచారాలను, బందిపోట్ల కిడ్నాపులకు, లైంగిక దాడులకు గురయింది. అడవుల్లో చంబల్‌ లోయల్లో ఒంటరిగా నడిచింది. జంతువులతో సహజీవనం చేసింది. పేరుకు బందిపోటుగా మారినా బాధిత స్ర్తీలు, పేదలకు ఆర్థిక సాయం చేసి, ధైర్యాన్నిచ్చి, కర్కోటకులైన అగ్రకుల ఠాకూర్లపై ప్రతీకారం నెరవేర్చుకునే తిరుగుబాటుదారుగా ఫూలన్‌దేవి మారింది.
మగ, కుల దురహంకార ఠాకూర్లకేగాక, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికీ ఫూలన్‌ దేవి పెద్ద సవాలుగా మారింది. అప్పటి ఇందిరాగాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వమూ, అర్జున్‌ సింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వమూ ఫూలన్‌దేవితో చర్చలకు పూనుకున్నాయి. ఫూలన్‌దేవి 1983లో షరతులు విధించి తన సహాచరులతో సహా ప్రభుత్వానికి లొంగిపోయారు. ఎనిమిదేళ్ళకే విడుదల చేస్తామని ఇచ్చన మాట తప్పిన ప్రభుత్వాలు, ఫూలన్‌ దేవిని గ్వాలియర్‌, తీహార్‌ జైళ్ళలో పదకొండేళ్ళు ఖైదు చేశాయి. తర్వాత ఫూలన్‌ దేవి 34వ ఏట 1998లో ఉత్తప్రదేశ్‌ సమాజ్‌వాది పార్టీ నుంచి పార్లమెంటు సభ్యరాలిగా ఎన్నికయ్యారు. తన 37వ ఏట 2001 జూలై 25న పార్లమెంటు మధ్యాహ్న భోజన విరామంలో ఫూలన్‌దేవి ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లింది. అక్కడ ఇంటి బయట గుర్తు తెలియని ముసుగు మనుషుల తుపాకీ కాల్పుల్లో ఫూలన్‌దేవి హత్యకు గురయ్యారు. 1981లో బెహ్మాయ్‌ గ్రామంలో 22 మంది ఠాకూర్లను ప్రతీకార దాడి చేసి చంపినందుకుగాను ఫూలన్‌ దేవి హత్య జరిగి ఉండవచ్చని చాలామంది భావించారు. అదే నిజం కావచ్చు. పాత శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండి ఉంటే, శత్రు కులం ఠా కూర్‌ని పెళ్ళి చేసుకోకపోతే ఆమె సీనియర్‌ పార్లమెంటేరియన్‌గా, బాధితుల ప్రపంచ నాయకురాలిగా కొనసాగుతూ ఉండేవారేమో?
కొన్ని సందర్భాల్లో తన అనుభవాల నుంచి ఫూలన్‌ దేవి మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకుందాం.. ‘శారీరకంగా చితికిపోయి ఉన్నాను. నాకిపుడు పద్దెనిమిది సంవత్సరాలు. నా ఒంటి నిండా మగవాళ్ళు పెట్టిన గుర్తులున్నాయి. వాళ్ళు మగవాళ్ళు కాదు. పశువులు. కుక్కలు. పోలీసు లాకప్పులో నా ముంజేతులు విరిగిపోయాయి. ఇప్పటివరకూ కోలుకోలేదు. షాట్‌గన్‌ పట్టుకుని గురి చూడటమే కష్టంగా ఉంది. రెండు చేతులతో పట్టుకోవలసి వస్తోంది... పోలీసుల దృష్టిలోనేను బందిపోటు రాణిని. అంటరాని ఫూలన్‌ దేవిని. .. ఆ రాత్రి... శపథం చేసాను, ఇక నాకు పోయేదమీ లేదు. నేను శక్తిమంతురాలిని. మనుగడ, ప్రతీకారం నన్ను ముందుకు నడిపించాయి...
‘చిన్నప్పటినుంచి నేను మొండిదాన్నే.. జాతి, కుల, వర్ణ, లింగ బేధాలు లేకుండా మనందరికీ ఆత్మగౌరవం ఉంటుందని రుజువు చెయ్యాలనుకున్నాను. ‘ఫూలన్‌ దేవి ఒక మనిషి’ అని అందరూ నన్ను అనాలని నా కోరిక. అప్పుడే మిగతావాళ్ళ గురించి కూడా ఆ మాట అనగలుగుతారు... ఎన్నోసార్లు చేతులు చాచి సహాయం అర్థించాను. కానీ, ఎవ్వరూ ఆదుకోలేదు. హీనురాలిననీ, నేరస్థురాలిననీ అన్నారు. నేనేదో ఉత్తమురాలినని ఎన్నడూ అనుకోలేదు. కానీ, అలా అని నేరస్థురాలిని కూడా కాదు. నన్ను హింసించిన మగవాళ్ళని మాత్రం నేను హింసించాను అంతే.. లాఠీనే న్యాయంగా చెలామణీ అవుతున్న మా ప్రాంతంలో మల్లాలు, ఠాకూర్లకు బానిసలు అవుతున్న మా ప్రాంతంలో, నేను ప్రజలకు న్యాయం పంచాను. నేరం చేసిన వాళ్ళని నా న్యాయస్థానం ఎదుటికి తీసుకువచ్చే వారు. వాడు ఇతరులను ఎలా హింసించేవాడో వాణ్ని అదే పద్ధతిలో హింసించేదాన్ని... ఉన్నవాళ్ల దగ్గర డబ్బులు తీసుకొని లేనివాళ్ళకి ఇచ్చాను. కట్నం డబ్బులిచ్చి అమ్మాయిలకు సహాయం చేశాను. అత్యాచారం చేసిన వాళ్ళనీ, భూమి లాక్కున్న వాళ్ళనీ, ఇన్ఫార్మర్లనీ శిక్షించాను తల పైకెత్తగలిగేది నేనే... నిలబడి యుద్ధం చేసింది... నేను.. పోలీసులను నేనే వేధించాను.... నా పేరు ఫూలన్‌ దేవి అనీ, మరచిపోవద్దు అనీ చెప్పేదాన్ని’.
అగ్రవర ్ణ రాజకీయ వ్యవస్థ, దాని మీడియా ప్రచారం చేసిన విధంగా ఫూలన్‌ దేవి కేవలం బందిపోటు కాదు. ఫూలన్‌ దేవి అంటే అమాయకురాళ్ళు, అశక్తులైన ఆడవారిపై, బాలికలపై లైంగిక, హంతక దాడులకు పాల్పడిన పురుషాంగాలను నిర్వీర్యం చేసే మహాశక్తి... పేదరికమూ, కులం తక్కువతనమూ తెచ్చే ఆకలి, అవమానాలు, అత్యాచారాలు, మగ, కుల హింసలపై తిరుగుబాటుదారు ఫూలన్‌ దేవి. ఆమె ఒక సైన్యంగా జెండర్‌, కుల అణచివేతలపై ఫూలన్‌దేవి యుద్ధం చేసింది. .. ఫూలన్‌ దేవి అంటే బాల్య వివాహాలను, లైంగిక అత్యాచారాలను, సాంఘిక దురాచారాలను ప్రశ్నించే తుపాకీ. ఫూలన్‌ దేవి అంటే మగ, కుల సర్పాలపై పడిన కత్తెర. మట్టి మహిళ ఆత్మగౌరవ జెండా. ఆదర్శవంతమైన నాయకురాలు, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు మరో పేరు. ఫూలన్‌ అంటే జెండర్‌, కులం వివక్షా రూపాలన్నింటిపై తనను తాను రక్షించుకునే ఆత్మరక్షణా యుద్ధం.

వ్యవస్థీకృత సామాజిక రోగాలు, నేరాలు, దురాచారాలపై తిరుగుబాటు చేసిన పూలన్‌ దేవి జయంతి, వర్ధంతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలి. ఫూలన్‌దేవి జీవితం, తిరుగుబాటు, సేవలు, సాధించిన విజయాలను దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు హైస్కూలు విద్యార్థినీ, విద్యార్థులకు పాఠ్యాంశాలుగా పొందుపరచాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలకు, అవి చేపట్టే మహిళా సాధికార విధానాలకు ఫూలన్‌ దేవి పేరు పెట్టాలి. పార్లమెంట్‌లో ఫూలన్‌దేవి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఉత్తరప్రదేశ్‌లో ఫూలన్‌దేవి పుట్టిన జిల్లాకు ఫూలన్‌ దేవి జిల్లాగా నామకరణం చేయాలి. పెప్పర్‌ స్ర్పేలు, కరాటే శిక్షణ, ఆత్మరక్షణా శిక్షణ, పరికరాలు, ఆయుధాలు అవసరమని భావించే నేటి ప్రతి యువతీ, మహిళా ఫూలన్‌ దేవి జీవిత కథనాన్ని ఒకసారి చదువుకొని, ఆమె ధైర్యం నుంచి కొంచెమైనా స్ఫూర్తిని తమలో నిలుపుకుంటే చాలు. లైంగిక, హంతక దాడులకు పాల్పడే మగ తోడేళ్ళను సునాయాసంగా ఎదుర్కోవచ్చు. ఫూలన్‌దేవికి మా ప్రేమపూర్వక నివాళులు.
- జూపాక సుభద్ర, కృపాకర్‌ మాదిగ

(నేడు ఫూలన్‌దేవి 51వ జయంతి)

Andhra Jyothi Telugu News Paper Dated: 10/08/2014 

Tuesday, July 8, 2014

బోనాల్లో జోగినీ వ్యవస్థ సమంజసమా? By తెలంగాణ మహిళా ఉద్యోగ సంఘం


అరవై ఏండ్ల ఆకాంక్షగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిగా ఉన్న బోనాల పండుగను రాష్ట్ర అధికార పండుగగా ప్రకటించడం, ఉత్సవాలు జరపడం ఆనందమే! కాని, ఆ బోనాల పేరుతో బోనాల పండుగ చుట్టూతా నెలకొని ఉన్న సామాజిక దురాచారమైన జోగినీ, మాతమ్మ, శివసత్తి వ్యవస్థ కొనసాగింపు పట్లనే మా భిన్నాభిప్రాయము తెలియపరుస్తున్నాము. జోగినీ లంటే దేవరకు ఎస్సీ, బీసీ ఆడపిల్లల్ని ముఖ్యంగా మాదిగ అనుబంధ కులాల ఆడపిల్లలను అంకితం చేస్తారు. తర్వాత ఆ ఆడపిల్లను- జోగినిగా ఎవరినీ పెండ్లి చేసుకోకుండా దేవుడి భార్య పేరుతో ఊరంతటికీ లైంగిక ఆస్తిగా పరిగణిస్తారు. ఇది తెలంగాణలో దురాచారంగా కొనసాగుతున్నది. గతంలో జోగినీ వ్యవస్థ నిర్మూలన కోసం చట్టాలు వచ్చినా, కమిషన్లు వేసినా ఆశించిన ఫలితాలు రాలేదని చెప్పాలి.

బోనాల పండుగ సందర్భంగా వేలాదిగా జోగమ్మలు, మాతమ్మలు, శివసత్తులను వినియోగించడం జరుగుతుంది. బోనాల ఉత్సవాల్లో రంగమెక్కి భవిష్య వాణి చెప్పేదంతా జోగినీలే. ఈ జోగినీలంతా సామాజికంగా అంటరాని మహిళలే. ఈ మధ్య బల్కంపేట ఉత్సవాలకు లక్ష మంది శివసత్తులు హాజరైనారంటే ఈ దురాచారం ఎంత విస్తృతంగా ఉందో అర్ధం చేసుకోవాలి. ఒక్క జంట నగరాల్లోనే దాదాపు రెండున్నర వేల గుళ్ళల్లో వాటిని ఆశ్రయించిన జోగినీ వ్యవస్థ ఉంది. తెలంగాణ రాషా్టన్రికే సంస్కృతిగా ఉన్న బోనాల పండుగ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడంలో నిర్వహించిన పాత్ర గణనీయమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బోనాల ఉత్సవాల్ని జరుపుతున్న ఈ తరుణంలో జోగినీలు, మాతమ్మలు, శివసత్తులు, మాతంగుల పాత్ర లేకుండా అంగరంగ వైభవంగా బోనాల పండుగను జరపాలని, తెలంగాణ ప్రాంత వైభవం ప్రపంచానికి తెలియపరచాలని జోగినీ నిషేధ చట్టాల్ని అమలు జరపాలని మనవి చేస్తున్నాము. అరవై ఏండ్ల ఆశలు ఫలించి కొత్త రాష్ట్రంగా తెలంగాణను పునర్నిర్మాణం చేసుకుంటున్న ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలంతా ఎలాంటి వివక్షలు లేని, సంస్కరణాభిలాషలతో కూడిన మానవతా విలువల వ్యవస్థలు కోరుకుంటున్న ఈ తరుణాన ఆడవాళ్ళను అవమానపరిచే దుర్మార్గమైన ఈ జోగిని, మాత…మ్మ, మాతంగి, శివసత్తి దురాచారాలను రద్దు చేయాలని కోరుతున్నాము.


- తెలంగాణ మహిళా ఉద్యోగ సంఘం 
జూపాక సుభద్ర, మల్లీశ్వరి,
డా సత్యలక్షి, వాణి, డా సంధ్య, 
అరుణశ్రీ, డా అనితా రెడ్డి
Surya Telugu News Paper Dated: 09/07/2014 

Saturday, April 19, 2014

నవ తెలంగాణ-మట్టి మహిళలు By -జూపాక సుభద్ర


తెలంగాణ ఉద్యమం కోటి కలలను ఆరబోసుకున్నది. భౌగోళిక తెలంగాణ బహుజన తెలంగాణ కావాలని ఆశిస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయాలకు సంబంధించిన ఒప్పందాలు జరగలేదు. బహుజన తెలంగాణ సాకారమైనప్పుడే.. అది నవతెలంగాణగా రూపొందుతుంది. పాలక కులాలు అంటున్నట్లు ఇది పునర్నిర్మాణంగా జరిగితే ఇది ఆధిపత్య కులాలకు ప్రయోజనకారిగా ఉంటుంది. పునర్నిర్మాణమంటే ఆ నిర్మాణాలే తిరిగి తీసుకొచ్చే ప్రయత్నమా!

సీమాంధ్ర రాజకీయాల వల్ల తెలంగాణ పల్లెల్లో చెరువులు ఎండిపోయి మైనర్ ఇరిగేషన్ దెబ్బతిని, భూములన్నీ పెస్టిసైడ్ విషాలతో చౌడు నేలలయ్యాయి. దీంతో రైతుకూలి, కైకిలి చేసుకునే మట్టి మహిళలు పట్టణాలకు వలసపోయారు. ఇండ్లల్లో పాసి పని చేస్తున్నారు. విద్య, ఉపాధులు లేవు. శ్రమ, మానవ గౌరవాలు, మానవహక్కులు లేకుండా తెలంగాణ మట్టి మహిళలు బతుకులీడుస్తున్నారు. దళిత ఆడవాళ్లు సపాయి చీపర్లవుతున్నారు. లంబాడీ తల్లులు తిండిలేక పిల్లల్ని అమ్ముకుంటున్నారు. బీడీ కార్మికులు శ్రమలు కాలిపోతున్న బీడీలవుతున్నారు. చేనేత కార్మిక మహిళలు కూలిగిట్టక శవాలవుతున్నారు. తాగడానికి నీళ్లు లేక ఫ్లోరోసిస్ బారి న పడుతున్నారు. తెలంగాణ దళిత మహిళలు జోగిని, పాకి పనుల లాంటి కుల దురాచార హింసకు, అత్యాచారాలకు గురవుతున్నారు. ఆదివాసీ భూముల్ని పెట్టుబడిదారులు కంపెనీలకు వనరులుగా ఎంచుకొని ఆదివాసులను వెళ్లగొడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ పాలక కులాల మహిళల్ని పాలిత కులాలైన, అణగారిన మహిళల్ని వారి అస్తిత్వాన్ని గుర్తించక తప్పనట్లుంది. అందుకే బిల్లులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఆర్థిక సహకారం అందించాలంటున్నది. ఇది మంచి పరిణామం. జాతీయ మహిళా కమిషన్ ఇంకో గొప్ప సాహసం చేసింది. మామూలుగా ప్రభు త్వం తమ సంస్థల్ని తమకు వెన్నుదన్నుగా ఏర్పాటు చేసుకుంటాయి. కానీ జాతీయ మహిళా కమిషన్ ప్రభుత్వ సంస్థగా ఉండి, సైనిక దళానికి ప్రత్యేక అధికార చట్టాన్ని ఉపసంహరించాలని చాలా బలంగా సిఫార్సు చేసింది. ఇది మహిళా కమిషన్ చరిత్రలో గొప్ప సంగతి.

సైనిక దళాల ప్రత్యేక అధికార చట్టం వల్ల కశ్మీర్, ఈశాన్య రాష్ర్టాల ప్రజలు,నక్సలైట్ ఉద్యమప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్ (సల్వాజుడుం) ముఖ్యం గా, ఆదివాసీ మహిళలు నిత్యం సైనిక, పోలీసుదళాల లైంగిక దాడులు, హింసలు ఎదుర్కొంటూ పోరాడుతున్నారు. ఆ మహిళల గోసలు, గొంతు లు, ఈ (అ)నాగరిక లోకానికి వినబడ్తలేవు. ఆదివాసీ మహిళల మాన ప్రాణాలకు భద్రత లేకుండాపోయింది. పోలీసులు, సైనిక దళాలు చేసే లైంగిక దాడుల్ని, అఘాయిత్యాల్ని ప్రభుత్వాలు, చట్టాలు, న్యాయస్థానాలు వారినెట్లా రక్షిస్తాయో వాకపల్లి ఘటన నిదర్శనం. ఇక కల్లోల కశ్మీర్, ఈశాన్య రాష్ర్టాల్లో సైనిక దుశ్చర్యలు ఎంత ఘోరంగా, క్రూరంగా ఉంటాయో అక్కడి మహిళా పోరాటాలు చెబుతున్నాయి. ఇరోం షర్మిల పధ్నాలుగేండ్ల దీక్ష ఉండనేఉన్నది. ఈ యూనిఫాం నేరస్తుల నుంచి రక్షణ కోసం చేసిన సిఫార్సులను అమలు చేసే దిశగా మహిళలు ఉద్యమాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.


Namasete Telangana Telugu News Paper Dated: 20/4/2014 

Thursday, November 7, 2013

అణగారిన అస్తిత్వాల్ని అణగదొక్కడమే మార్క్సిజమా? By - జూపాక సుభద్ర

November 23, 2011 at 3:50am


రంగనాయకమ్మ వేసుకున్న ప్రశ్నలు చెప్పుకున్న జవాబుల గురించి మాట్లాడే ముందు 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' నేపథ్యం వివరించాల్సిన అవసరముంది. జనవరి 2009లో విశాఖలో నిర్వహించిన సభలో దళిత బీసి మైనారిటీ అస్తిత్వాల రచయిత్రులు కొన్ని ప్రతిపాదనలు, చర్చలు లేవదీయడం జరిగింది. లక్ష్యాలు కూడా రూపొందించడం జరిగింది.
పురాణాల నుంచి ఆధునిక స్త్రీవాద సాహిత్యం దాకా అణగారిన జాతుల (దళిత బహుజన మైనారిటీ ఆదివాసీ) స్త్రీలను మరుగుపర్చడం జరిగింది. ఈ సాహిత్యాలేవీ వీరి స్థితిగతుల్ని సమస్యల్ని కుల, శ్రమ దోపిడీని, సంస్కృతిని పట్టించుకోలేదు. చర్చించలేదు. సమాజానికి ఉత్పత్తి శ్రమనందించే అణగారిన స్త్రీలను సాహిత్యంలో భాగం చేయలేదు. వీరిని వూరిలో అంటరానోల్లని చేసినట్లే సాహిత్యంలోనూ దూరముంచారనే అవగాహనని సభ ముందుంచాము.
సమాజంలో స్త్రీలు కూడా కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా దొరసానులుగా, కూలీలుగా వున్నారు. వారి జెండర్ సమస్యలు ఒకే మూసగా లేవు. అణగారిన జాతుల స్త్రీల సమస్యలు, గడపదాటని దొరసాండ్ల సమస్యలు ఒక్కటి కావు. ఇలాంటప్పుడు స్త్రీలంతా ఒక్కటే అని చెప్పడంద్వారా అణగారిన జాతుల స్త్రీల సమస్యల్ని చర్చించే అవకాశం లేకుండాపోతుంది.
పురుషాధిక్యత నుండి విముక్తే స్త్రీలందరి విముక్తిగా ఆధిపత్య కులాల మహిళలు చెప్పడం యితర స్త్రీల చుట్టూత వున్న రాజకీయ ఆర్థిక సాంఘిక శ్రమ కుల సమస్యల్ని మగ పెత్తనాల సమస్యల్ని వెలుగులోకి రానివ్వకుండా అణచివేయడమేనన్న విషయాల్ని సభ అంగీకరించింది.
స్త్రీవాద సాహిత్యం ప్రధానంగా కోస్తాంధ్ర ఆధిపత్య కులాల స్త్రీల నుంచే వచ్చింది. ఈ సాహిత్య ఉధృతి, ఉత్పత్తి పెరిగినా, తరిగినా మెజారిటీ స్త్రీలైన దళిత బహుజన మైనారిటీ ఆదివాసీ స్త్రీలకు ఒరిదింది, తగ్గింది ఏమీలేదు. ఈ అస్తిత్వాల స్త్రీలకు కులం ప్రాంతం మతం మగాధిపత్యం, ఆసామి అజమాయిషి, దొర్సాని పెత్తనాలు అంటరానితనం అణచివేతలున్నాయి.
ఈ అణచివేతల నుండి వీళ్లు విముక్తి కావలసివుంది. 'స్త్రీవాదం' అనే పదం యిన్నాల్లు కోస్తాంధ్ర ఆధిపత్య కులాల స్త్రీల సమస్యలకే పరిమితమైవుంది. ఉమ్మడి వేదికకి ఈ పదం యిమడదని అనగా విస్తృత అస్తిత్వాలుగా వున్న అణగారిన స్త్రీలకు సరిపోదు అనే అభిప్రాయాన్ని సభ ఆమోదించింది.
అయితే మా ఈ చర్చల్ని, ప్రతిపాదనల్ని, ఆమోదాల్ని, దానికి సంబంధించిన రిపోర్టును పక్కనబెట్టి సభలో వీగిపోయిన శ్రమ సంబంధాల స్త్రీల సాహిత్య, శ్రమ తప్ప వేరే అస్తిత్వాలు లేవనే వాదన రిపోర్టు పత్రికల్లో రావడం జరిగింది. సభా నిర్వాహకులు ప్రత్యక్షంగా వ్యతిరేకించకపోగా పరోక్షంగా అనుకూలతను వెలిబుచ్చడం జరిగింది. సభా చర్చలు ఆమోదాలు ఎక్కడా వెలుగు చూడలేదు. యిలాంటి అణగదొక్కే అనుభవాల అవమానాల్తో వీరి ద్వంద్వ నీతికి వ్యతిరేకంగా అణగారిన అస్తిత్వాల రచయిత్రులు 'మట్టిపూలు'గా సంఘటితమయ్యారు.
ఒకవైపు దళిత బహుజన మైనారిటీ రచయిత్రుల అభిప్రాయాల్ని అతి దారుణంగా అణచివేసి యిప్పుడు 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' అని పెట్టుకున్న ఆధిపత్య కులాల రచయిత్రులు మరోవైపు తమ అనుకూలురైన అణగారిన కులాల రచయిత్రుల్ని వేదికలో పెద్దపీటలేసి తమ ఆధిపత్య జెండర్ ప్రయోజనాల్ని కొనసాగించే పనిలో పడ్డారు. తద్వారా అణగారిన జాతుల స్త్రీలను అణచివేసే కార్యక్రమం పెట్టుకున్నారు. విశాఖ సభలో ఓడిపోయిన, కాలం చెల్లిన వాదనలు అణగారిన స్త్రీల భిన్న అస్తిత్వాల పుటంలో బూడిదైన వాదాన్ని రంగనాయకమ్మ మార్క్సిస్టు పుటంలో పెట్టి వూదుకుంటున్నారు.
నిజానికి ఈ చర్చా పాఠం సందర్భం స్త్రీల భిన్న అస్తిత్వాల మీద జరగాల్సినది. స్త్రీల భిన్న అస్తిత్వాల చుట్టూ అల్లుకుపోయిన దోపిడీ కుల రాజకీయాల గురించి జరగాల్సిన చర్చ. కాని రంగనాయకమ్మ చాలా పకడ్బందీగా ఆ ప్రస్థావనే లేకుండా, లేవదీయకుండా జాగ్రత్త పడింది. అస్తిత్వమంటే ఏమిటి? అని ప్రశ్న వేసుకొని జాతుల్లో కులాల్లో మతాల్లో తేడాలున్నాయని జవాబు చెప్పుకుని స్త్రీలల్లో వున్న ఎక్కువ తక్కువల వూసుగాని, ప్రస్థావన గాని చేయకపోవడం ద్వారా ఆధిపత్య కుల దొర్సానితనాన్నే ప్రదర్శించింది. అణగారిన స్త్రీల అస్తిత్వాల్ని తొక్కేసింది.
కులమనేది శ్రమవిభజనే కాదు శ్రామికుల మధ్య విభజన కూడా సృష్టించిందని అంబేద్కర్ చెప్పాడు. నేడు సమాజంలో వున్న భిన్న అస్తిత్వాల మీద చర్చ నడుస్తున్నది. కాని భిన్న అస్తిత్వాలతో వున్న మహిళలకు సంబంధించిన అస్తిత్వాల చర్చకు మాత్రం అవకాశం యివ్వడం ఆధిపత్య కుల స్త్రీలకు యిష్టంలేదు. మా సమస్యలు వేదిక లెక్కడం లేదు. వెలుగు చూడ్డంలేదు.
సాహిత్యంలోనూ అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నాం. మా సమస్యల్ని ఆధిపత్య కుల మార్క్సిస్టు రచయిత్రి అర్థం చేసుకోగలదా? అస్తిత్వాలు అర్థం కావాలంటే కులవ్యవస్థను అర్థం చేసుకోవాలి. కుల సమాజంలో పుట్టి ఉత్పత్తి శక్తుల్ని, ఉత్పత్తి సంబంధాల్ని మానవ సంబంధాల్ని నియంత్రించేది, నిర్దేశించేది కులం కాదు అని ఎట్లా చెప్పగలము.
ఆమె ఏకరువు పెట్టిన కార్మికులు, పెట్టిబడిదారులు కూడా కుల వ్యవస్థ పునాదుల్లోనే వున్నారని తెలవదా! ఇక్కడ సమాజిక సాంస్కృతిక రూపం నిర్ణాయక మౌళిక అస్తిత్వం కులమే అని అనుభవంలోకి రావాలంటే అణగారిన కులాల్లో స్త్రీగా పుడితేనే తెలుస్తుంది. అణగారిన కులాలవాళ్లే శ్రమ చేసేవాళ్లుగా, ఆధిపత్యకులాలవాళ్లే శ్రమని దోచేవాళ్లుగా వ్యవస్థీకృతంగా ఎందుకు కొనసాగుతున్నారో చర్చ చేయండి. ఆ చర్చకోసం ప్రశ్నలు వేసుకోండి.. యింకా అస్తిత్వాలు బాగా అర్థం అవుతాయి.
రోడ్లూడ్చే, పాకీ, పారిశుధ్య శ్రమలో ఆధిపత్య కులాలవాళ్లు ఎందుకు లేరు? దళిత కులాలవాళ్లే ఎందుకున్నారు? యిది శ్రమ విభజనా? కుల విభజనా? కులం సృష్టించే మానవ, ఉత్పత్తి సంబంధాల్ని, సంస్కృతుల్ని వివక్షల్ని మార్క్సిజం వంటి సిద్ధాంతాలు ప్రశ్నించలేవు, పరిష్కరించలేవు. ఈ విషయాలు లేవనెత్తిన కులాల్ని బహుజన ప్రయోజనాల్ని దెబ్బతీసే వాదాల్తో అణచివేస్తున్నాయి. మార్క్సిజంని వ్యక్తిగత ఆస్తిగా చూసే రంగనాయకమ్మ కూడా తన చర్చా ప్రశ్నల్లో మూసేసింది. ఆధిపత్య దోపిడీ గురించి మాట్లాడే యీ రచయిత్రి అణగారిన స్త్రీలపై వుండే ఆధిపత్యాలపట్ల మౌనం వహించి మరుగున పడేసింది.
సామాజిక అసమానతల్నుంచే అస్తిత్వాలేర్పడ్డాయని, అసమానతలు పోయిన్నాడే అస్తిత్వాలు పోతాయని యీ రచయిత్రికి తెలవ దా? అస్తిత్వాలంటే హక్కులు సాధించుకునేందుకు సాధనాలుగా వున్నాయని అస్తిత్వాల్ని చులకన చేసి అవమానించడం ఆధిపత్య కుల అహంకారానికి నిదర్శనం. అస్తిత్వ పోరాటాలు అస్తిత్వాల్ని మోయడానిక్కాదు, నిర్మూలించడానికే.
హక్కులు, అవకాశాలు, స్వేచ్ఛ ఉన్న కులాలకు అవి సాధించుకోవాల్సిన అవసరం లేదు. అవి సాధించుకోడానికి అస్తిత్వాలుగా కదులుతున్నారంటేనే వాళ్లెంతగా హక్కులు కోల్పోయారో, ఎంతగా హక్కులు కొల్లగొట్టబడినారో అర్థం చేసుకోవచ్చు. కులం వల్ల అన్నీ అమరిన వాళ్లకేం అర్థమవుతాయి హక్కుల్లేని అస్తిత్వాలు! మొత్తానికి ఆధిపత్య కుల మార్క్సిస్టు రచయిత్రి మేమెదుర్కొంటున్న ఎన్నోరకాల అణచివేతలకు సంబం ధించిన అణగారిన స్త్రీ అస్తిత్వాల్ని చర్చ చేయకుండా తొక్కేసింది.
పురుషాధిపత్యం పోవాల ని కోరుకుంటున్న ఆధిపత్య కులాల స్త్రీలు అణగారిన స్త్రీల అస్తిత్వాల్ని అణగదొక్కడం, పూడ్చేయడం ప్రజాస్వామికం కాదు, ఆధిపత్య కుల మార్క్సిజమే.
  1. అణగారిన కులాల స్త్రీలపై ఆధిపత్య కులాలు చేసే అన్ని రకాల అణచివేత రాజకీయాల్ని ఎదించడానికి దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ రచయిత్రులంతా సంఘటితం కావాలి.
- జూపాక సుభద్ర
(Andhra Jyothy vividha 5-7-2010)

Wednesday, February 27, 2013

Joopaka Shubadra talks about Rape, Caste, Feminism, Dalit movement etc By


Published on Feb 27, 2013


The interview was taken many months before. In this video Joopaka Shubadra speaks about mainstream feminism. As usual we have not edited the video, just to present whatever she spoke. Shubadra is an activist, writer, poet, and very powerful writer in Telugu. One of the important point she says that if people say only because of tight dress women are getting raped, then why rape on dalit/adivasi women are more, why? its only because caste?  Where is our culture? we celebrate Naragashura's murder, Durga pooja, these were never out cultural politics. Bharat Mata, Telengana Thalli, Witch Hunt, dappu


Source : Dalit Camera Published Dated: 27/2/2013





Monday, January 21, 2013

బహుజనం లోపించిన స్త్రీవాదం - జూపాక సుభద్ర



అగ్రకుల కమ్యూనిస్టులుగానీ, ఫెమినిస్టులు గానీ కుల పురాణాల్లోని సామాజిక పోరాట భావజాలాన్ని, వస్తువుని, యితివృత్తాల్ని స్ఫూర్తిగా తీసుకోకపోడాన్ని ఆధిపత్య కుల అణచివేతలుగానే అర్థం చేసుకోవాలి... శ్రీశ్రీ 'మహాప్రస్థానం'నుంచి ఓల్గా 'మృణ్మయనాదం' దాకా పరిశీలిస్తే ఆధిపత్య పురాణాల్లోని ఆధిపత్య ప్రతీకల్ని పాత్రల్ని (సీత, ఊర్మిళ, అహల్య) స్వీకరించారే తప్ప అణగారిన ప్రతీకల్ని పాత్రల్ని (తాటకి, శూర్పణఖ) అంటుకోలేకపోయారు. 

పాశ్చాత్య దేశాల్నించి భారతదేశానికి వచ్చిన అనేక యిజాల్లో ఫెమినిజం ఒకటి. యిది పాశ్చాత్య దేశాల్లోని ధనిక తెల్లజాతి స్త్రీల యిజమ్. 1970 దశకంలో పాశ్చాత్య దేశాల్లో పితృస్వామ్య వ్యవస్థపై స్త్రీల పోరాటాలతో, వారి సాహిత్యాలైన 'ది ఫెమినైన్' 'సెక్సువల్ పాలిటిక్స్' లాంటి సాహిత్యాలతో భారతదేశ ధనిక చదువుకున్న అగ్రకులాల స్త్రీలు ప్రభావితులయ్యారు. పితృస్వామిక అణచివేతల్ని పెత్తనాల్ని కుటుంబ లైంగిక హింసల్ని నిరసించిన చైతన్యం స్త్రీవాదంగా భారతదేశంలో ఉద్భవించింది. ఆంధ్రప్రదేశ్‌లో వామపక్ష ఉద్యమాల్లోని అగ్రకుల పురుషుల్తో సమానంగా విద్యాధికులైన ధనిక, మధ్యతరగతి సీమాంధ్ర అగ్రకులాల స్త్రీలు స్త్రీవాదాన్ని అందుకొని తమని ఫెమినిస్టులుగా ప్రకటించుకున్నారు. సాంఘికంగా తమ కులాల పురుషుల్తో విద్య ఉద్యోగం వంటి కొన్ని రంగాల్లో సమానంగా వున్న యీ స్త్రీలు సమాజంలోని రాజకీయ ఆర్థిక సామాజిక రంగాల్లో జెండర్ స్పృహ ను పెంచగలిగారు. పీవోడబ్ల్యూ, స్త్రీశక్తి సంఘటన, ఫెమినిస్టు స్టడీ సర్కిల్, మహిళా విద్యార్థి వేదిక వంటి సంఘాలేర్పాటు చేసి స్త్రీల (అగ్రకులాల) శరీరాల చుట్టూ అల్లబడిన మిత్, కుటుంబాల్లో వుండే అప్రజాస్వామిక విలువలు, జరిగే హింసల్ని, పితృస్వామిక అణచివేతల్ని ప్రశ్నించారు.

స్త్రీవాద సాహిత్యం ప్రధానంగా సీమాంధ్ర, ధనిక, మధ్యతరగతి, అగ్రకులాల స్త్రీల నుంచి వచ్చింది. వీరు వివిధ ప్రాంతాల, కులాల, మతాల అస్తిత్వాల వైవిధ్యాల్ని వైరుధ్యాల్ని పక్కకు నెట్టి స్త్రీలంతా ఒక్కటే, భిన్నత్వాలు లేవు అనే అప్రజాస్వామికాల్ని సమాజంలో, సాహిత్యంలో ప్రచారం చేయడం జరిగింది. జరుగుతున్నది.

పాశ్చాత్య దేశాల్లోని తెల్లజాతి స్త్రీలు ఫెమినిజాన్ని ఆక్రమించుకొన్నట్లు ఇక్కడ అగ్రకులాల స్త్రీలు స్త్రీవాదాన్ని తమ పరిధిలోనికి తెచ్చుకున్నరు. నల్లజాతి మహిళల అస్తిత్వాలు భ్నిమైనవి అని తెలిసి కూడా తెల్లజాతి ధనిక స్త్రీలు తమ వర్ణ దురహంకారాన్ని ప్రదర్శించినట్లే ఇక్కడి అగ్రకుల 'స్త్రీవాదం' ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల సమస్యల్ని ఎజెండా కాకుండా కప్పేసిందని బహుజన కులాల మహిళలు ప్రశ్నిస్తున్నారు. కులం అగ్రవర్ణం కావడం, జాతీయోద్యమ ఫలితాలను అందుకోవడం వల్ల ఆధిపత్య కులాల స్త్రీలకు నిమ్నకులాల మహిళల కంటే మెరుగైన జీవితం, చదువులు, సంపదలు ఒనగూరినయి. ఆధిపత్య కుల మగ ప్రపంచం వారి స్త్రీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్ని కొంత వరకైనా అందుబాటులో వుంచింది. దురాచారాల్ని సంస్కరించింది. చదువు నేర్పింది. తమ కనుసన్నల్లో నుంచి కనుమరుగు కాకుండా, కంట్రోలు తప్పకుండా ఉద్యమాలు చేయించింది. ఉద్యోగాలు చేయించింది, చట్టసభలకు పంపింది. యీ వెసులుబాటుతో ఆధిపత్య కులాల స్త్రీలకు తమ మగవాళ్ల చేతిలో వున్న ప్రచురణ సంస్థలు, అకాడమీలు, మీడియా వంటి సంస్థల వల్ల తమ సాహిత్య విస్తృతిని పెంచుకునే అవకాశాన్నిచ్చింది. కవిత్వం, కథ, నవల, సిద్ధాంత వ్యాసాలు, వారి సమస్యల్ని వస్తువుగా చేసుకొన్న సాహిత్యం తెలుగులో కోకొల్లలుగా వచ్చింది- ఫెమినిస్టు సాహిత్యంగా. మిగతా రంగాల్లోకి కూడా వీరు విస్తరించగలిగారు. పత్రికల్లో ప్రత్యేక స్త్రీలపేజీలు, మహిళా కాలమ్స్, మహిళా పత్రికలు, చానల్లు ఏర్పాటు చేసుకోగలిగారు.

స్త్రీలంతా ఒక్కటే, వారి సమస్యలన్ని, బాధలన్ని వొక్కటే, 'మాకు గోడలు లేవ'ని నినదిస్తున్న స్త్రీవాద సాహిత్యం తమకన్నా హీనంగా దోపిడీ చేయబడుతూ అవమానంగా అనేక హింసల్తో జీవిస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల సమస్యల్ని, తమ సాహిత్యంలో ఏ మేరకు భాగస్వామ్యం కల్పించగలిగారు? అట్లా తమ సామాజిక బాధ్యతలను ఎంతవరకు ప్రకటించుకున్నారు? అనేది చర్చించడం యీ వ్యాసం ప్రధాన ఉద్దేశం.

ఈ ఫెమినిస్టులు వేసిన మొదటి పుస్తకం 'మనకు తెలియని మన చరిత్ర' (1986). ఏడుగురు సంపాదకుల్లో ఒక్క దళిత మహిళ కనిపించదు. ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న స్త్రీల సజీవ చరిత్రగా వేస్తున్నామని చెప్పి ఆధిపత్య కులాల స్త్రీల (ముగ్గురు, నలుగురు బీసీ మహిళలు మినహా) సజీవ చరిత్రల్నే చరిత్రీకరించడం జరిగింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న అంటరాని, ఆదివాసి మహిళల సజీవ చరిత్రల్ని చీకటి చేయడం జరిగింది. వీరు వేసిన మొదటి అడుగే అంటరాని మహిళల్ని, ఆదివాసి మహిళల్ని విస్మరించడంగా మొదలు కావడం దురదృష్టకరం. 1953లో ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ 'ఆంధ్ర కవయిత్రుల చరిత్ర'లో కనబరిచిన కుల జెండర్ వివక్షలకు భిన్నమైన చైతన్యాలేవీ యీ వామపక్ష భావాలు కలిగిన అగ్రకుల స్త్రీలు అందించలేకపోయారు. యిప్పటికీ స్త్రీవాద సాహిత్యంలో యివే ధోరణులు కొనసాగుతున్నయి.

1989లో ఫెమినిస్టు స్టడీ సర్కిల్ పేరుతో ప్రచురించిన 'మాకు గోడలు లేవు' ఫెమినిజం పరిచయంగా వ్యాస సంకలనం వచ్చింది. వ్యాస అంశాలు (1) ఫెమినిజం అంటే ఏమిటి? (2) అంతర్జాతీయ స్త్రీ విముక్తి ఉద్యమ చరిత్ర (3) మూడవ ప్రపంచ దేశాల పోరాటాల్లో స్త్రీల పాత్ర (4) ఫెమినిస్టు అవగాహన. యీ అంశాల్లో స్థానికంగా వున్న నిమ్నకులాల మహిళల అనేక వీరోచిత పోరాటాలు వీరికి కనబడలేదు. గ్రామాల్లో దొరల అరాచకాలకు వ్యతిరేకంగా బహుజన కులాల మహిళల పోరాటాలు, సింగరేణి కాలరీస్‌లో బాయిదొరల యిండ్లల్ల అకృత్యాలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కాల్పులకు గురైన అంటరాని మహిళల ఉద్యమాలు, తునికాకు పోరాటాలు, మహిళలు చేసిన మద్దూరులాంటి భూపోరాటాలు, బీడీ కార్మిక ఉద్యమాలు, కూలి పోరాటాలు ఫెమినిస్టులకు అప్రస్తుతాలైనవి. అంతర్జాతీయ స్త్రీ విముక్తులు, వారి ఉద్యమ చరిత్రలను ప్రముఖంగా ప్రచురించారు. 'మాకు గోడలు లేవు, గోడల్ని పగలగొట్టడమే మా పని' అని శ్రీశ్రీ నినాదాన్ని అందిపుచ్చుకున్న ఫెమినిస్టులు కులగోడలు, శ్రమగోడలు, దొర దొర్సాని గోడలు, మత గోడలు, జోగినీ దురాచారాలలో బందీలై బాంచలకు బాంచలైన మహిళల ప్రత్యేక గోడల్ని అంటుకోలేదు.

1993లో 'నీలి మేఘాలు' స్త్రీవాద కవితా సంకలనం (ఓల్గా, వసంత కన్నాభిరాన్ సంపాదకులు)లోని కవయిత్రులంతా దాదాపు సీమాంధ్ర అగ్రకులాల కవయిత్రులు. కవితా వస్తువులు కూడా తమ అగ్రకుల స్త్రీల చుట్టు పరిమితమైన అంశాలే. (ఇందులో ఒక తెలంగాణ ఆధిపత్య కులం, సీమాంధ్ర ముస్లిం, దళిత కవయిత్రులే కనబడ్తారు.) సంపాదకుల్లో ఒకరు 'స్త్రీగా రాయడమంటే..' అని రాస్తూ ఏ స్త్రీగా రాయడమో విశ్లేషించలేదు. స్త్రీ అంటే చదువుకున్న కోస్తాంధ్ర అగ్రకుల స్త్రీ అనే ఒక్క అస్తిత్వమేనా? ఈ స్త్రీ చుట్టూతా అల్లబడిన కుటుంబ హింస, లైంగిక హింస, మగాధిపత్యం, బాడీ పాలిటిక్స్ గురించిన రాజకీయ అవగాహనలే ఈ సంకలనంలోని వస్తువులు. ఇట్ల నిమ్నకులాల జెండర్ అస్తిత్వాలు, వాటి రాజకీయాలు చర్చలోకి, వెలుగులోకి రాకుండా స్త్రీవాద సాహిత్యం కృషి చేసింది.

1990లో 'కఠోర షడ్జమాలు' ఫెమినిస్టు వ్యాసాలు వసంత కన్నాభిరాన్ వెలువరించారు. యీ వ్యాసాల్లో 'న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి' అనే హిందూ మనువాదాన్నిగానీ, మనిషిని మనిషిగా చూడని కుల వ్యతిరేకతలుగానీ కనిపించవు. 1995లో 'సరిహద్దులు లేని సంధ్యలు' కల్పనా కన్నాభిరాన్, ఓల్గా, వసంత కన్నాభిరాన్ సంపాదకత్వంలో వచ్చింది. ఇది స్త్రీల సంఘాల పరిచయ వ్యాసాల సంకలనం. ఫెమినిస్టు రాజకీయాలు, కార్యాచరణ, ప్రశ్నలతో ఫెమినిస్టు సిద్ధాంత వ్యాస సంకలనంగా వచ్చింది. ఇందులోనూ పూర్తిగా అగ్రవర్ణ స్త్రీల కుటుంబాలు, లైంగిక అణచివేత, పితృస్వామ్య పెత్తనాల చుట్టూ చర్చ సాగింది.

'తొలి వెలుగులు' 2003లో స్త్రీవాద సిద్ధాంత వికాసంగా ఫెమినిస్టు థియరీగా ఓల్గా వేశారు. అమెరికా, యూరప్ దేశాల శ్వేతజాతి స్త్రీలైన ఎబిగిల్ ఆడమ్స్, జుడిత్, మేరి ఉల్ స్టోన్ ఫ్రాన్సిన్‌రైట్, జాన్ స్టువర్ట్‌మిల్ వంటివారు రూపొందించిన స్త్రీవాదాల్ని వారి దృక్పథాల్ని చర్చల్ని యథాతథంగా దిగుమతి చేసిన సిద్ధాంతంగా ఈ వ్యాస సంపుటి వుంది. మత చర్చ కూడా బైబిల్ చుట్టు ఉన్న మిత్ చర్చ గూర్చిన అంశమేగానీ హిందూ మతం గూర్చిన చర్చ లేదు. 'స్త్రీలు-ఆర్థిక ప్రపంచం' వ్యాసంలో 'స్త్రీలు చేసే యింటి చాకిరికి వున్న ఆర్థిక విలువ ఎంతైనప్పటికి వాళ్లు దానిని పొందలేరు' అనేది యింటి చాకిరి చేసే అగ్రకులాల మధ్యతరగతి స్త్రీల ఆర్థికంగా చెప్పారు. మరి యింటి చాకిరీ, బైటి చాకిరి చేసే అణగారిన మహిళల చాకిరికి వున్న ఆర్థిక విలువల మాటేంటి? 'యింటి చాకిరికి జీతం లేని'తనాలే ఎజెండా అయింది కాని యింటి చాకిరితో పాటు బైటి చాకిరీకి కూడా జీతం లేని కుల అణచివేతల్ని గూర్చిన అంశాల మాటేంది? 'మాతృత్వం వల్ల పనిచేయలేనివారిగా ముద్రవేసి స్వాతంత్య్రాన్ని నిరాకరిస్తున్నారు' సరే, కాని బహుజన కులాల మహిళలు యింకో నిమిషానికి ప్రసవిస్తారనేదాకా సామాజిక ఉత్పత్తిలో పాల్గొంటున్న విషయం విస్మరించారు.

2009లో 'స్త్రీవాద రాజకీయాలు-వర్తమాన చర్చలు' (రమా మెల్కోటె, కె.సజయ సంపాదకులు) అన్వేషి-రీసెర్చి సెంటర్ ఫర్ వుమెన్ స్టడీస్ వేసింది. వర్తమాన చర్చలు-లో బహుజన మహిళల ప్రశ్నలు, అస్తిత్వాలు చర్చకు రాకపోవడమే వుంది. అంశాలన్నీ ఆధిపత్య స్త్రీల చుట్టున్న రాజకీయ విశ్లేషణలే. కేవలం ఒక అంటబడని మహిళకు తన జెండర్ పాలిటిక్స్‌ను చర్చించే అవకాశం కల్పించడడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ వ్యాసాల్లో ఎక్కువగా ఇండియన్ ఫెమినిస్టులు- వీణామజుందార్, ఇందు అగ్నిహోత్రి, పార్దా చటర్జి, ఊర్వశి బుటాలియ, వందనా సోనాల్కర్, ప్లేవియా ఆగ్నేస్, బీనా అగర్వాల్ వంటి తెలుగేతర ఇండియా ఫెమినిస్టులు వర్తమానంలో స్త్రీవాద ఉద్యమ చర్చలు చేశారు. అవన్నీ అగ్రకుల స్త్రీల దృష్టికోణాల నుంచే ఉన్నాయి. స్త్రీవాద కథలు, నవలలు కూడా తెలుగులో విస్తృతంగానే వచ్చినయి. అవన్నీ కూడా ఆధిపత్య కుల జెండర్ దృష్టికోణాలే.

దీన్నంతా స్త్రీలందరి వాదంగా ప్రచారం చేసుకోవడం జరిగింది. అణగారిన కులాల జెండర్ సమస్యల్ని అప్రస్తుతం చేశారు. అవాచ్యం చేశారు. కులసమాజంలో పురుషులంతా ఒక్కటి కానట్లే స్త్రీలు కూడా ఒకటిగా లేరు. పురుషాధిక్యత కూడా అణగారిన కుల మహిళల మీద ఆధిపత్య కులాల స్త్రీల మీద ఒకే తీరుగా లేదు. యిది ఒప్పుకోడానికి, తద్వారా కార్యచరణకి స్త్రీవాదులు సిద్ధంగా వున్నట్లు కనిపించరు. ఉత్పత్తి కులాల స్త్రీల భాషని బూతనీ, రోతనీ, తెలంగాణమనీ, అర్థం కావట్లేదని, రాసేవాల్లే లేరనీ వారి రచనల్ని ఆధిపత్య కుల రచయితలు చీకటిలోకి నెట్టినారు. ఆ దారిలోనే స్త్రీవాదులు తమ సంకలనాల అగ్రహారాలకి బహుజనుల రచనల్ని అంటనివ్వలేదు. యివి ఎంత అబద్ధాలో దళిత మహిళల సాహిత్య సంకలనం 'నల్లపొద్దు' నిరూపించింది.

భారతదేశ కులపురాణాలన్నీ సామాజిక సాంస్కృతిక అణచివేతల్నించి వచ్చినవే. మెజారిటీ ప్రజల్లో కుల పురాణాలు సాహిత్య ప్రక్రియగా, సాంస్కృతిక కళారూపాలుగా కొనసాగుతున్నప్పటికీ యిప్పటిదాకా అగ్రకుల కమ్యూనిస్టులుగానీ, ఫెమినిస్టులుగానీ కుల పురాణాల్లోని సామాజిక పోరాట భావజాలాన్ని, వస్తువుని, యితివృత్తాల్ని స్ఫూర్తిగా తీసుకోకపోడాన్ని ఆధిపత్య కుల అణచివేతలుగానే అర్థం చేసుకోవాలి.

కమ్యూనిస్టు సాహిత్యంలోనూ, ఫెమినిస్టు సాహిత్యంలోనూ శ్రీశ్రీ 'మహాప్రస్థానం'నుంచి ఓల్గా 'మృణ్మయనాదం' దాకా పరిశీలిస్తే ఆధిపత్య పురాణాల్లోని ఆధిపత్య ప్రతీకల్ని పాత్రల్ని (సీత, ఊర్మిళ, అహల్య) స్వీకరించారే తప్ప అణగారిన ప్రతీకల్ని పాత్రల్ని (తాటకి, శూర్పణఖ) అంటుకోలేకపోయారు. స్త్రీవాదులు కుల, హిందూమత అణచివేతల గురించి ఎక్కడా చర్చించలేదు. యీ చర్చ చేస్తే తమ కులాల పురుషుల్తో పాటు తాము కూడా బహుజన మహిళల్ని అణచివేస్తున్న తీరు బహిర్గతమవుతుంది. అందుకే పాశ్చాత్య ధోరణిలోనే ఫెమినిస్టులు చర్చిస్తారు.

1934లోనే 'కుల నిర్మూలన' గ్రంథంలో అంబేద్కర్ 'కుల వ్యవస్థ శ్రమ విభజననే కాదు శ్రామికుల మధ్య విభజనను కూడా సృష్టించింద'ని విశ్లేషించాడు. దీన్నంతా పక్కకు పెట్టి కమ్యూనిస్టు అగ్రవర్ణ పురుష నాయకత్వం భారతదేశ కుల వ్యవస్థకు యిమడని వర్గ వ్యవస్థను దిగుమతి చేసుకొని కులాలుగా వున్న శ్రామిక సమూహాల నన్నింటిని 'కార్మికవర్గం'గా కట్టగట్టి వారిమీద తమ సామాజికాధిపత్యాల్ని కొనసాగిస్తూ కింది కులాల నాయకత్వాల్ని కిందనే అణచిపెట్టారు. వారి అడుగుజాడల్లోనే స్త్రీవాదులు దేశీయ బహుజన మహిళా విముక్తికి సరిపోని పాశ్చాత్య శ్వేతజాతి స్త్రీల సిద్ధాంతాన్ని ఫెమినిజంగా దిగుమతి చేసుకొన్నారు. అందుకే aవారి సిద్ధాంతాల్లో, రచనల్లో బహుజనులు కనిపించరు. స్త్రీవాదులది సామాజిక ఉత్పత్తికి దూరమైన ప్రపంచం. బహుజన స్త్రీలది సామాజిక ఉత్పత్తిలో వున్న ప్రపంచం. వారి ప్రపంచం చిన్నది. వీరి ప్రపంచం విస్తృతమైంది.

అట్లనే ఫెమినిస్టు సైద్ధాంతిక ఆచరణ బహుజన స్త్రీల మీద నాయకత్వ పెత్తనాల్ని, అణచివేతల్ని చలాయిస్తూ 'భారత ఫెమినిజం'గా చలామణీ అవుతున్నది. దొర్సానుల ఫెమినిజం ప్రజాస్వామీకరించబడాలంటే మెజారిటీగా (85%) వున్న బహుజన వర్గాల మహిళావరణాలను, చరిత్రలు, సంస్కృతులు, కళలు, సాహిత్యాలను గుర్తించి వెలికితీయాల్సిన అవసరముంది.

- జూపాక సుభద్ర
98499 05687
('తెలుగు సాహిత్యం: వర్తమాన రాజకీయాలు-సామాజిక ఆర్థిక ఉద్యమాలు' అనే అంశంపై హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి సదస్సులో సమర్పించిన పత్రంలోని కొన్ని భాగాలు)

Andhra Jyothi News Paper Dated: 21/1/2013

Thursday, January 17, 2013

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో జెండర్‌ కోటాలేవి? ---జూపాక సుభద్ర



ఆచరణకు నోచని మహిళా సాధికారత
చట్టంలో లోపించిన మహిళా కోణం 
సంక్షేమ ప్రాధాన్యతకు తొలి అర్హులు 
ఇంకా దోపిడీ, పీడన, అణచివేతలే! 
అన్ని కార్పొరేషన్లలో మగవాళ్ళే లబ్ధిదారులు 

యునైటెడ్‌ నేషన్స్‌నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దాకా మహిళా సాధికారత గురించి, జెండర్‌ బడ్డెట్‌ గురించి మాట్లాడుతున్నాయి. అలాగే రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలు, ఎన్‌జిఒలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇవన్నీ వింటూ ఉంటే చాలా మంచి ఆలోచన అని సంబర పడతాము. కానీ ప్రభుత్వాలు చేతల్లో జెండర్‌ బడ్జెటింగుకు, అందులో అణగారిన సమూహాల జెండర్‌ సాధికారతకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అమలు చేయడానికి ప్రయత్నాలు చేయకపోవడం, ప్రత్యేక రూపకల్పనలకు పూనుకోక పోవడం వంటివాటికి నిలువెత్తు నిదర్శనం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం. ఈ చట్టాన్ని దళిత కులాలు, ఆదివాసీ కులాలు ఎంతో పోరాడి సాధించుకున్నాయి. దీనిని స్వాగతించాల్సిందే. ఇది ఈ మధ్యనే రాష్ట్ర శాసన సభ, శాసన మండలిలో ఆమోదం పొంది చట్టంగా రూపు దిద్దుకుంది. 

కాని ఈ చట్టంలో దళిత, ఆదివాసీ మహిళల కోసం నిర్దిష్ఠ వాటా కేటాయింపులు చేయడంలో నిర్లక్ష్యం జరిగిందనీ, అందువల్ల ఈ మహిళలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అంచునే ఉండే పరిస్థితులే ఉంటాయనేది దళిత, ఆదివాసీ మహిళల ఆందోళన.రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు మొత్తం (61+35) కలిపి 96 కులాలు, జాతులు ఉన్నాయి. వీరి జనాభా మొత్తం సుమారు 2 కోట్ల 20 లక్షలదాకా ఉంది. కుల సమాజ జనాభాలోనే అత్యంత దోపిడీ, పీడనలకు గురవుతూ అవకాశాల చట్రంనుంచి నిరంతరం మినహాయింపు పొందుతూ అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ సమూహాల్లోని ఆడవాళ్ళు ఇంకా నిర్లక్ష్య సమూహాలే! సంక్షేమ రాజ్యంగా, సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సంక్షేమ ప్రాధాన్యతలు ఈ కులాల, తెగల ఆడవారికే ఇవ్వాల్సి ఉంటుంది. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసమే ఖర్చు చేయవలసి ఉంది. 

కాని అలా కాక వారి నిధుల్ని దారి మళ్ళించి పైలాపచ్చీసు చేసింది ప్రభుత్వం. రింగు రోడ్లకు, హుసేన్‌ సాగర్‌ ప్రక్షాళనకు, పర్యావరణ పరిరక్షణకు, మంత్రుల కార్ల కొనుగోళ్ళకు, కార్యాలయాల సింగారాలకు, విలాసాలకు ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని తాకట్టు పెట్టింది. గత 30 ఏళ్ళనుంచి దాదాపు రూ. 30 వేల కోట్లకు పైగా ఎస్సీ, ఎస్టీ నిధుల్ని ప్రభుత్వాలు పక్కదారి పట్టించి వారిని ఎదగనీయకుండా పేదరికంలోనే ఉంచాయని దళిత ఉద్యమకారులు తేల్చారు. 1970 ఆ ప్రాంతంలో, స్వాతంత్య్రం వచ్చిన మూడు దశాబ్దాల కాలంలో దళిత, ఆదివాసీ సమూహాల అభివృద్ధి మీద ఒక సమీక్ష జరగడం రాజకీయ అవసరం అయింది. గుండుగుత్తగా ఈ సమూహాల్ని ఓటు బ్యాంకుగా డిపాజిట్‌ చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను రూపొందించారు. వీరికి కేవలం రిజర్వేషన్లు మాత్రమే కాక ఇంకా అదనపు సంక్షేమాలు రూపొందిస్తున్నామని ఈ ప్లాన్‌ తీసుకు వచ్చాయి పాలక వర్గాలు. కాని అమలు చేయడంలో విఫలమయ్యాయి. ఎనభైనాడు రూపొందించిన ఈ ప్లాన్‌లో కూడా జెండర్‌ భాగస్వామ్య కేటాయింపులు జరగలేదు. అదే నేటి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టంలో కూడా కొనసాగింది. 

రాష్ట్రంలో కోటి మందికి పైగా దళిత, ఆదివాసీ మహిళా జనాభా ఉంది. కాని ఈ ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టంలో వీరికి ఎలాంటి ప్రాతినిధ్యాలు, రూపకల్పనలు జరగలేదు. ఈ మహిళల్లో చెప్పులు కుట్టే వాళ్ళు, చర్మాలు వలిచేవాళ్ళు, రోడ్లు ఊడిచేవారు, వృత్తికళాకారులు, సంచార జీవనం చేసేవారు, బహిరంగ మరుగుదొడ్లు శుభ్రం చేసేవారు, పాకీ పని చేసేవాళ్ళు, జోగినిలు, కొండ కోనల్లో నివసించేవాళ్ళు, అడవుల్లో ఉండేవాళ్ళు, వెట్టిచాకిరీలో ఉన్నవాళ్ళు, అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నవాళ్ళు, వికలాంగ మహిళలు వివిధ శ్రమల్లో నలిగిపోతున్న, అశక్తతకు గురవుతున్న ప్రత్యేక సెక్షన్లుగా ఉన్న ఈ ఎస్సీ, ఎస్టీ స్ర్తీలకు ఈ చట్టంలో ఎటువంటి ప్రాధాన్యత కల్పించకపోవడం, సంక్షేమ, సంరక్షణ చర్యలు రూపొందించకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఈ చట్టం ఈ మహిళలను గుర్తించి వారికి హామీ కల్పిస్తే మహిళా సాధికారతకు తోడ్పడినట్టయ్యేది. ఇప్పుడు మనం చూస్తున్న ఎస్సీ కార్పొరేషన్‌ లబ్ధిదారుల్లో కనీసం ఒక శాతం కూడా ఎస్సీ మహిళలు ఉండరు.

అలాగే ఎస్టీ కార్పొరేషన్‌లో గిరిజన మగవాళ్ళే లబ్ధిదారులు. బీసీ కార్పొరేషన్‌లో బీసీ మగవాళ్ళే లబ్ధిదారులు. స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో లబ్ధిదారులంతా అగ్రకులాల మగవాళ్ళే ఉంటారు. నిజానికి ఈ కార్పొరేష్‌ అందరిదీ. మగ, ఆడ, అగ్రకుల ఆడవాళ్ళు కూడా ఈ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లో లబ్ధిదారులైన దాఖలాలు చూడబోము. అలాగే మహిళా కార్పొరేషన్‌. పేరుకు ఇది అందరు మహిళలకు సంబంధించిన కార్పొరేషన్‌. కాని దీనిద్వారా రుణాలు, ప్రయోజనాలు పొందే లబ్ధిదారులందరూ అగ్రవర్ణ మహిళలే. ఒకటి అర బీసీల ఆడవాళ్ళు కనిపించినా ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మహిళలు కానరారు. కార్పొరేషన్లు ఇలా కుల, జెండర్‌ పేరుతో ఆధిపత్యాలు, ఆక్రమించుకున్న విధానాలు ఉన్నాయి. అటు కులం పేరు మీద జరిగే సంక్షేమాలను మగవాళ్ళు పొందుతున్నారు. ఇటు జెండర్‌ పేరు మీద జరిగే సంక్షేమాలను అగ్రకుల ఆడవాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. 

మరి దళిత, ఆదివాసీ మహిళల పరిస్థితి ఏమిటి? మహిళా కార్పొరేషన్‌ మహిళా సాధికారత కోసం, సంక్షేమం కోసం, స్వయం ఉపాధి పథకాల కోసం, వ్యవసాయ రుణాల కోసం ఏర్పాటైంది. కాని ఈ కార్పొరేషన్‌లో రుణాలు తీసుకుని లబ్ధి పొందుతున్నదంతా అగ్రకుల ఆడవాళ్ళు. అవి గూడెం, తండా ఆడవాళ్ళ దాకా రావు. అసలు ఈ కార్పొరేషన్‌ ఉందనే సంగతి కూడా ఎస్సీ, ఎస్టీ మగవాళ్ళకు, ఆడవాళ్ళకు తెలియనీయకుండా ఉంచారంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఇదీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ మహిళల పరిస్థితి. ఈ పరిస్థితుల కారణంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు గంపగుత్తలు, గుండగుత్తలు కాకుండా ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టంలో ప్రత్యేక జెండర్‌ బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని దళిత సంఘాలు, మేధావులు ప్రభుత్వాల్ని, రాజకీయ పార్టీలను కోరుతున్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టంలో చేయాల్సిన సవరణలు: 1. జిల్లాల్లోని ఎస్సీ, ఎస్టీ మహిళా జనాభాను ఒక యూనిట్‌గా గుర్తించాలి. 

jupa
2. ఎస్సీ, ఎస్టీ మహిళలకు స్వయం ఉపాధి పథకాలు, ఇళ్ళ స్థలాలు, పేదరిక నిర్మూలన పథకాలు, వ్యవసాయ భూములు, రుణాలు, ఇతర సంక్షేమ పథకాలను అందించాలి. 3. జోగిని, మాన్యువల్‌ స్కావెంజర్స్‌, పారిశుద్ధ్య కార్మికులు, వికలాంగ ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. 4. కులం- జెండర్‌ ప్రాతిపదికగా నిధుల కేటాయింపు జరగాలి. 5. ఉప ప్రణాళిక నిధుల్లో 50 శాతం మహిళలకు అందించాలి. 6. నిధుల్ని ఖర్చుచేయకుండా దారి మళ్ళించిన అధికారులను శిక్షించే ఏర్పాటు ఈ చట్టంలో చేయాలి. దళిత, ఆదివాసీ మహిళలకు ఈ చట్టంలో కేటాయింపులు నిర్దిష్ఠంగా జరగకపోతే, పైన పేర్కొన్న కార్పొరేషన్లలో జరుగుతున్న విధంగానే దళిత, ఆదివాసీ మహిళలకు నష్టం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టంలో మహిళలకు జెండర్‌ కేటాయింపులు జరగకపోతే వారు అభివృద్ధికి ఆమడ దూరంలోనే మిగిలిపోతారు.

Surya Telugu News Paper Dated : 18/1/2013

Tuesday, October 16, 2012

నెత్తురింకని లక్షింపేట గాయాలు - జూపాక సుభద్ర, జ్వలిత, సులోచన



గురజాడ 150వ జయంతి ఉత్సవాలకై ఆయన పునాదులున్న విజయనగరం చూడటానికి ఉత్సాహంగా కదిలిన కవులు, రచయితలు, రచయిత్రులు గురజాడ మానవీయతని సంస్కరణ భావాల్ని, స్ఫూర్తిని నింపుకోలేకపోవడం విచారకరం. దాదాపు 150 ఏళ్ల నాడే గురజాడ అసిరిగాన్ని తన అక్షరాల్లో పొదువుకున్నాడు. ఈ కవులకు, హత్యలకు గురైన అసిరిగాళ్లు, వేటాడిన అసిరిగాళ్లు, గాయపడిన అసిరిగాళ్లు నెత్తుటి దు:ఖాల దళిత మహిళలు కంటికి కనబడలేదు. గురజాడ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గురజాడ ఎలుగెత్తి చాటిన మానవత సామాజిక బాధ్యతను కరబర్చకపోవడం విషాదమే. 

చరిత్రలు దళిత ఆడవాళ్ల గొంతుల్ని, స్పందనల్ని, అనుభవాల్ని, శోకాల్ని, పోరాటాల్ని నిశ్శబ్దంలోకి నెట్టివేశాయి. లక్షింపేట మాల ఆడవాళ్ల నెత్తుటి దు:ఖాల్ని పంచుకోవడానికి 'మట్టిపూలు' రచయిత్రులం సెప్టెంబర్ 19, 2012న లక్షింపేటకు వెళ్లాము. వాళ్లు చెప్పిన విషయాలు ఈ సమాజం పట్టించుకోని, కప్పివుంచిన పచ్చి నిజాలు.

దళితుల్ని ఊచకోత కోసి వందరోజులైనా తమ కళ్ల ముందే తండ్రులు, భర్తలు, అన్నలు, తమ్ముళ్లు, కొడుకులు.. చంపబడుతూంటే అడ్డంవెళ్లి కాళ్లు చేతులు, నడుములు విరగ్గొట్టుకున్న ఆడవాళ్లు, అసహాయంగా కొట్టుకులాడిన పిల్లలు, తల్లులు గూడెమంతా భయంగా, ఆందోళనగా ఉలిక్కిపడుతూ ఆదుర్దాగా మంచంబట్టి ఉన్నారు. లక్షింపేట మారణకాండలో చంపబడ్డవాళ్లు నివర్తి వెంకటి, బూరాడ సుందర్రావ్, నివర్తి సంగమేశు, చిత్తిరి అప్పడు, బొద్దూరి పాపయ్యలు మాత్రమే బయటి సమాజానికి తెలిసింది, గుర్తించింది. 

కానీ అంతకంటే ముందే ఇదే భూమి కోసమే ముందుబడిన మాల మహిళలైన బవిరి రాముడమ్మ (గ్రామ సంఘం అధ్యక్షురాలు), కలమటి చిన్నమ్మి, దండాసు లతమ్మలను కాపు భూస్వాములు ఆడవాళ్లని కూడా చూడకుండా 'మీకెందుకే భూమి' అని చెప్పరాని బూతులు తిడుతూ కర్రలతో కడుపులో పోట్లు పొడిసి చావబాదితే ఆ దెబ్బలకు ఆ గాయాలకు ఆస్పత్రి పాలయ్యారు. బవిరి రాముడమ్మ ఆస్పత్రిలో నెలరోజులు కొట్టుమిట్టాడుతూ చనిపోయింది. మిగతా ఆడవాళ్లు దెబ్బల గాయాలు గెర్లుతుంటే చస్తూ బతుకుతున్నారు.

'మా ఆడవాళ్లను చావుదెబ్బలు కొట్టారు. మా గ్రామ సంఘం అధ్యక్షురాలు బవిరి రాముడమ్మను చంపేశారు అని దళితులు కేసుపెడితే పోలీస్‌స్టేషన్లో కేసే తీసుకోలేదు. రెండేళ్లలో మూడు నాలుగు సార్లు కొట్టారు. కేసులు పెట్టలేదు. ఇప్పుడేమో బవిరి రాముడమ్మతో కలిపి ఆరుగురిని చీరుకొని చంపారు. ఇరవై మందికి కాళ్లూ చేతులు, నడుములు విరిగాయి, పళ్లూడిపోయాయి, తలకాయలు పగిలిపోయాయి. పనిపాట చేసుకొని బతికేటోళ్లము. తనువులన్నీ కూలిన కుప్పలయ్యాయి. ఎట్లా బతికేది యేటి చేసేది' అని బూరాడ లక్ష్మమ్మ (బూరాడ సుందర్రావు తల్లి) చెప్పింది. ఇది ఈ దేశంలో దళిత మహిళల బతుకు చిత్రం.

ఈ కుల సమాజంలో అంటబడని దళిత మగ బానిసల ప్రాణాలకే రక్షణ లేనప్పుడు ఇక ఆ బానిసలకు బానిసలుగా ఉన్న దళిత మహిళల ప్రాణాలకు రక్షణ ఉంటుందని చెప్పగలమా! ఆ కుల, మగ అలుసుతోనే కాపు మగవాళ్లు మాల ఆడవాళ్లను కొట్టినా, చంపినా, ఫిర్యాదుకాలే, అసలు కేసే రాయలేదు. అదే పని దళిత మగవాళ్లు కాపు ఆడవాళ్ల మీద చేస్తే మిన్ను విరిగి మీద బడేది, భూమి బద్దలయ్యేది.

ఈ మారణకాండలో కత్తులు, బరిసెలు, బల్లేలతో చంపింది కేవలం కాపు మగవాళ్లే కాదు వాళ్ల పిల్లలు, ఆడవాళ్లు కూడా ఉన్నారని లక్షింపేట బాధితులు చెబుతున్నారు. కాపు మగవాళ్లు బరిసెలతో, బల్లేలతో ఎడాపెడా పొడుచుకుంటూ నీరుక్కుంటూ పోతుంటే వాళ్ల ఆడవాళ్లు ప్రాణం ఉందా లేదా అని కాళ్లతో తన్నుకుంటూ చూసి ప్రాణంపోయేదాకా కర్రల్తో, రాళ్లతో చంపారని బాధితులు మూకుమ్మడిగా రోదించారు. దళిత సంఘాలు ఢిల్లీ దాకా వెళ్లి లొల్లిజేసినా అసెంబ్లీలో పార్లమెంట్‌లో చర్చ జరగలేదు.

'మహిళా సంఘం నాయకురాలు మా అమ్మ బవిరి రాముడమ్మ మా అందరికి తెలివి గుండమని సుద్దులు సెప్పేది. మాల నాయకురాలా నీకు భూమెందుకే నువ్వొక నాయకురాలివే అని కర్రలతో కొట్టి పొడిచి గాయాలు చేశారు. నెల రోజులు అవస్థ పడి చచ్చిపోయింది. ఇప్పుడు మా నాయిన నివర్తి వెంకటిని చంపారు. అంతుకు మునుపు మా ఆయన్ను పొలంలో కొట్టి చచ్చాడనుకొని వదిలేసి ఇప్పుడు చంపేశారు. నా భర్తని, తల్లిని, తండ్రిని చంపేశారు. వాళ్లు వాళ్ల భార్యలు బైటికి రావొద్దు. జైళ్లోనే కుళ్ళి కుళ్ళి చావాలి' అని చిత్ర శ్రీదేవి తెలిపింది.

'మేము ఊడుపులు - గాబులకు వేరే ఊర్లకు వెళ్లి పనులు చేసుకుంటున్నాము. మద్రాసు, హైదర్రాబాద్ దేశాలు బోయి బిల్డింగ్ పనుల్లో ఎమ్ములు దుమ్ములు చేసుకొని బతికాం' అని నివర్తి రాముడమ్మ (నివర్తి సంగమేశు భార్య) తెలిపింది.

'గొడ్డు మాంసం తిన్న మదాలు మీయి ఉల్లిగడ్డ మిరపకాయ తిన్న రోషాలు మావి అని మా మీద గొడ్లు బడ్డట్టే పడ్డారు. వాళ్లు మనుషులు కాదు మృగాలు. మా రాముడమ్మతో కలిసి ఆరు మందిని చంపారు. అవే గుర్తుకొస్తున్నాయి. భోజనం కూడా తినేది లేదు, ఏమి సేత్తం' అని దండు సెల్లెమ్మ తెలిపింది.

'తెల్లారి ఏడుగంటల నుంచి పదకొండు కొట్టేదాకా సాగింది. ఒక్కో ఇంటికి ఇరవైమంది వాకిలిముందు పదుగురు ఎనక వాకిలికాడ పదుగురు మంచాలపైన పడుకున్నోళ్లను గుంజి కొట్టారు, గంజి తాగేటోళ్లను కంచాల దగ్గర నుంచి గుంజి కొట్టారు, కుళ్లపొడిచారు. నడుం మీద కాళ్లమీద ఏటని సెప్పను ఒళ్లంతా కుళ్లబొడిచారు. ప్రాణం పోయిందని వదిలేసి వెళ్లారు' అని బొద్దూరి బోగేసు తెలిపాడు.

'మా కులం పోలీసులే, వాళ్లు చిన్న చిన్న దాడులు చేసినపుడు, కొట్టినపుడు పట్టించుకోలేదు. వాళ్ల మీద కేసులు పెట్టకపోగా కలిసుండాలని, ఒకసారి మమ్మల్నే తిట్టి కాయితాలు చింపేసారు. వాళ్ల డబ్బు తీసుకొని మాకు అన్యాయం చేశారు. నన్ను కూడా చంపేద్దురు, తప్పించుకొని పారిపోయాను' అని హతుని కొడుకు తెలిపారు. 'వాళ్లకు రెండు మాకు రెండు బోర్లు వేశారు. మా వైపు బోరొకదాన్ని పోలీసులు పీకేశారు. ఇదిక్కడుంటే గొడవలవుతాయన్నారు. మాకు నీళ్లకు కష్టమవుతుంది. వాళ్లను రావద్దని చెప్పలేక బోరు పీకేశారు' అని నివర్తి స్వాతి (హతుని కుమార్తె) తెలిపింది.

'ప్రాజెక్టు కింద మునిగిన ఊరు మాది వాళ్లది (కాపు) ఒక్కటే. వాళ్లు ఊరు పోగొట్టుకున్నరు మేం పోగొట్టుకున్నం. వాళ్లకు లక్షల పైసలొచ్చాయి, పెద్ద ఇళ్లు వాకిళ్లొచ్చాయి, కొలువులొచ్చాయి మళ్లీ భూములొచ్చాయి. మాకు ఇవేమీ రాలేదు. ఇవేమీ రాకున్నా గవర్నమెంట్ భూమిని సెంట్లు సెంట్లు దున్నితే మమ్ములను చంపారు. ఇదేమి న్యాయం, ఎవరికి చెప్పేది! పోలీసులు కూడా వాళ్ల తట్టే ఉన్నారు' అని దాడిలో గాయపడిన నివర్తి నర్సయ్య తెలిపాడు. 'కడుపు మంటలు సల్లారడానికి అంత భూమిసెక్కదున్నితే నెత్తురు పారిస్తారు. వాళ్లకైతే మాలాటోళ్లని చంపేబలం కోసమే వేల ఎకరాలు కావాలి.

ఆడోళ్లు, మగాళ్లు అని లేదూ అందరూ కొట్టారు. ఎవ్వరూ లెగవడం లేదు. నా కాలు విరిగిపోతే రాడ్డేశారు, నా చేయి లెగవనివ్వడం లేదు' అని కాళ్లకు, చేతులకు కుట్లుపడి మంచంలో ఉండి చూపించింది కలమటి సంగమ్మ. వీళ్లంతా కోరేదేమంటే... మా మీద దాడిచేసి కొట్టిన, చంపిన ఆడవాళ్లను మగాళ్లను విడిచిపెట్టొద్దు, మళ్లీ ఇంటి మొహం చూడకుండా శిక్షలు పడాలి. మళ్లీ ఇటువంటివి జరక్కుండా రక్షణ కల్పించాలి. వాళ్లు మళ్లీ ఊళ్లోకి రావొద్దు. వాళ్ల మొహాలు చూడొద్దు. ప్రాజెక్టు కిందున్న గవర్నమెంట్ భూమి మాకే ఇవ్వాలి. మా ఊళ్లో, మా గూడెంలోనే కోర్టు పెట్టాలి. నిర్వాసిత కుటుంబాలకు, బాధిత కుటుంబాలకు పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలి, ఉద్యోగాలివ్వాలి. దాడిలో గాయపడిన వాళ్లకు ప్రత్యేక ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి, ఉద్యోగాలివ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు.

గురజాడ 150వ జయంతి ఉత్సవాలకై ఆయన పునాదులున్న విజయనగరం చూడటానికి ఉత్సాహంగా కదిలిన కవులు, రచయితలు, రచయిత్రులు గురజాడ మానవీయతని సంస్కరణ భావాల్ని, స్ఫూర్తిని నింపుకోలేకపోవడం విచారకరం. దాదాపు 150 ఏళ్ల నాడే గురజాడ అసిరిగాన్ని తన అక్షరాల్లో పొదువుకున్నాడు. కానీ ఈ కవులకు, హత్యలకు గురైన అసిరిగాళ్లు, వేటాడిన అసిరిగాళ్లు, గాయపడిన అసిరిగాళ్లు నెత్తుటి దు:ఖాల దళిత మహిళలు (విజయనగరానికి దరిదాపుల్లో ఉన్న లక్షింపేట) కంటికి కనబడలేదు. కలాలకు వినపడలేదు. గురజాడ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గురజాడ ఎలుగెత్తి చాటిన మానవత సామాజిక బాధ్యతను కరబర్చకపోవడం విషాదమే.

- జూపాక సుభద్ర, జ్వలిత, సులోచన
'మట్టిపూలు' రచయిత్రులు

Andhra Jyothi News Paper Dated : 17/10/2012

Saturday, April 14, 2012

మహిళలకు అండ అంబేద్కర్--జూపాక సుభద్ర



Ambedkar talangana patrika telangana culture telangana politics telangana cinema
డాక్టర్ అంబేద్కర్ ఈ దేశంలో అస్పృశ్యులుగా చూడబడుతున్న కులా ల కోసం ఎన్నో పోరాటాలు నిర్మించారు. ఉపన్యాసాలు, చర్చ లు పెటి,్ట రచనలు చేసి చట్టసభల్లో పెట్టారు. వివక్ష ఎదుర్కొంటూ మనుషులుగా గుర్తింపులేని స్త్రీల కోసం, అస్పృశ్యత ఎదుర్కొంటున్న స్త్రీలకోసం సమాజంలో చర్చబెట్టారు.
ఎట్టి బతుకులు యీడుస్తూ అటు కుల పీడన ఇటు మానవ హక్కులు నోచుకోకుండా, పేదలుగా, శ్రామికులుగా ఉన్న దళిత బహుజన కులాల మహిళను మొట్టమొదటిసారిగా పట్టించుకున్నవారు అంబేద్కర్.భారతదేశంలో స్త్రీ కార్మిక భద్రతకు పాటుపడిన స్త్రీజనాభ్యుదయవాది అంబేద్కర్. ఆయన కృషిని, ఆలోచనల్ని కమ్యూనిస్టు మహిళా సంఘాలు, మహిళా కార్మిక సంఘాలు పట్టించుకున్నట్టు చర్చపెట్టినట్టు ఎక్కడా కనిపించదు. స్త్రీ సమస్యల మీద,హక్కులు, చట్టాల మీద చర్చ జరుగుతున్నప్పుడు కూడా అంబేద్కర్ ప్రస్తావన లేని ప్రాక్టీసే చూస్తున్నం.

దళిత బహుజన కార్మిక స్త్రీలు బానిసలకు బానిసలు. స్త్రీని ఒక మనిషిగా కాక స్వంత ఆస్తిగా, పిల్లలను కనే యంత్రంగా సేవలుచేసే బాంచగా చూ స్తున్న సమాజంలో గర్భిణీ స్త్రీల కోసం సెలవుతోపాటు వేతనం కల్పించే ప్రసూ తి ప్రయోజన బిల్లును పార్లమెంటులో పెట్టి సాధించారు. పునరుత్పత్తి విషయంలో స్త్రీలు శ్రమ,విశ్రాంతి ఆరోగ్యంపట్ల ప్రభుత్వాలు, సమాజంశ్రద్ధ, బాధ్య త వహించాలని స్త్రీల తరఫున పోరాడి సమాజాన్ని ఆలోచింపజేశారు. సమాన పనికి సమాన వేతనం అనేది ఇప్పటికీ అసంఘటిత రంగాల్లో అమలు పర్చ డం లేదు. కానీ కార్మిక మహిళల కోసం అంబేద్కర్ ఆనాడే సమాన పనికి సమానవేతనం ఉండాలని ఆర్టికల్ 39(బి) పొందుపరిచారు. దళిత బహుజన కింది కులాలే ఎక్కువగా ఉన్న అసంఘటిత రంగంలో ఈ చట్టాన్ని ఆధిపత్యకుల ప్రభుత్వాలు అమలు పర్చడం లేదు.

స్త్రీల ఓటు హక్కు కోసం, సారా నిషేధం కోసం ప్రభుత్వాలతో పోరాడుతూ న్యాయమైన ఈ అంశాలకు మద్దతునిస్తూ అంబేద్కర్ రాజ్యాంగ రచన సాగింది. మనుషులుగా మనుగడ సాగించేందుకు ఆస్తిహక్కు, వారసత్వ హక్కు, వివాహం, విడాకులు, దత్తత వంటి హక్కుల్ని కూర్చిన వారు అంబేద్కర్. ఈ నేపథ్యంలో హిందూ కోడ్ బిల్లు రూపొందించిన క్రమంలో ఎదురైన దూషణలు సామాన్యమైనవి కావు. స్త్రీల సమస్యల పట్ల అంబేద్కర్ చేసిన న్యాయపోరాటాలకు అప్పటి మనువాద నాయకులు, ఇప్పటికీ చరివూతలో గొప్ప మేధావులుగా చెలామణి అవుతున్న నెహ్రూ, వల్లభాయ్ పటేల్, రాజేంవూదవూపసాద్ లాంటి వాళ్లు ఎవ్వరూ హిందూ లా కోడ్ బిల్లును ఆమోదించలేదు. పార్లమెంట్‌లో 194లో ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లుకు మనువాద నాయకులు చేసిన దాడికి నిరసనగా మనస్తా పం చెంది, తన మంత్రి పదవికే రాజీనామా చేసిన స్త్రీ పక్షపాతి అంబేద్కర్.

మానవ హక్కులను హరించిన మనువాద అణచివేత విధానాలను ధ్వంసం చేయాలని స్త్రీలకు పిలుపివ్వడం చైతన్య మివ్వడంతో స్త్రీలకు అంబేద్కర్ వెలుగు దివ్వెగా కనిపించాడు.మహిళా ఉద్యమాలతో ఏర్పడిన బీఎన్ రావు కమిటీ చేసిన సిఫారసుల ఆధారాలతో హిందూ లా కోడ్ బిల్లు పట్టుదలతో పగడ్బందిగా పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. దీనిలో స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలి. వారసత్వంగా పురుషులకెట్లా అయితే వస్తుందో అట్లనే స్త్రీలకు కూడా ఆస్తి హక్కు కావాలి. పెళ్లి స్త్రీల ఇష్ట ప్రకారం జరగాలి. ఇష్టం లేకుంటే విడాకులు తీసుకునే హక్కు, పిల్లలు లేని స్త్రీలు దత్తత తీసుకునే హక్కు, విడాకులు పొందిన స్త్రీలకు మనోవర్తి పొందే హక్కులను రాజ్యాంగంలో చట్టబద్ధతను కల్పించడానికి హిం దూ లా కోడ్ బిల్లును అంబేద్కర్ రూపొందించారు.
ఈ బిల్లును రకరకాలుగా విడగొట్టి క్లాజుల వారీగా చర్చలు జరిపి, కిందేసి, మీదేసి తీవ్ర వ్యతిరేకతలను పోగుచేసి, మద్దతు తెలిపే గొంతుల్ని నొక్కేసి నీరుకార్చిండ్రు. ఈ హిందూ కోడ్ బిల్లు వీగిపోవడం వల్ల నష్టపోయింది ఆకాశంలో సగమైనా హక్కుల్లో సగం కాలేకపోయిన స్త్రీలే. కానీ అంబేద్కర్ జరిపిన చర్చ లు, పోరాటాలు కలిగించిన చైతన్యం వృథాకాదు.

అంబేద్కర్ కుల పీడనలను తద్వారా వ్యవస్థీతమైన దోపిడీని పుటంబెట్టిన గొప్ప సామాజిక తత్వవేత్త. పీడితుల సామాజిక న్యాయాన్ని అర్థం చేసుకున్నందు వల్లనే అనునిత్యం పోరాడారు. ఇంత కృషిచేసినా అగ్రకులనాయకత్వంలో విరాజిల్లుతున్న కమ్యూనిస్టు పార్టీలుగానీ, స్త్రీ వాదులుగానీ, స్త్రీ సంఘాలుగానీఅంబేద్కర్ ఆలో చనా విధానాన్ని ఆమోదంలోకి తీసుకోవడం లేదు. దీంతో ఆ సంఘాల్లో పార్టీల్లో శ్రామిక పీడిత కులాలే నష్టపోయాయి. 

కులాలవారీగా, స్త్రీలకు సమస్యలుంటాయని గుర్తించిన అంబేద్కర్ వాటి ప్రాతిపదికన చట్టాలను రూపొందించారు.ఈ సమాజాన్ని కూకటి వేళ్లతో కూలుస్తామంటున్న రాజకీయ పార్టీలు, జెండర్, కులం లాంటివన్నీ రాజకీయ సమస్యలంటున్న స్త్రీ వాదులు ఇప్పటికి పట్టించుకోవడం లేదు. ఇప్పడిప్పుడే గుర్తించే వైపుగా అడుగులు మొదలు కావడం అంబేద్కరిజం తప్ప గత్యంతరం లేని పరిస్థితులే. 
అంబేద్కర్ ,సామాజిక బహుజన తత్వవేత్తలు, మేధావుల ఆలోచనల కులవూపాతిపదికలే ఈ దేశంలోని పీడిత కులాలను వర్గాలను విముక్తి చేస్తాయి. జనం లో సగభాగమైన స్త్రీల కోసం ఉద్యమిస్తున్న శక్తులు చారివూతక గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్నిరంగాల్లో అభివృద్ధి చెందామని చెప్పుకుంటున్న ఈ కాలంలోనే, ఫెమినిస్టు ఉద్యమాలున్న ఈ సందర్భాన కూడా 199 నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లును రానివ్వకుండా అడ్డుపడుతున్నారంటే.., 50 ఏళ్ల కింద అంబేద్కర్ స్త్రీల చట్టాల కోసం చేసిన హిందూ కోడ్ బిల్లుకు ఎంతగా అడ్డుపడ్డారో ఉహించొచ్చు. ఆడవాళ్ల హక్కుల కోసం అంబేద్కర్ తన పదవికే త్యాగం చేసిన సంఘసేవను సామాజిక బాధ్యతల్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి. 

-జూపాక సుభ
Namasete Telangana News Paper Dated : 15/04/2012 

Friday, March 9, 2012

ఉద్యమ ఉపాధ్యాయిని---జూపాక సుభద్ర



కుల వ్యవస్థలో మానవహక్కులు కోల్పోయి శూద్ర, దళిత కులాలకు, స్త్రీలకు 14లోనే ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి, వారికి చదువు చెప్పిన మొదటి ఉపాధ్యాయిని సావివూతిబాయి పూలే. బతికినంత కాలం స్త్రీ విద్యకోసం శ్రమించింది. బ్రహ్మణాధిక్య హిందూ సమాజంపై తిరుగుబాటు చేశారు ఆమె. జ్యోతిరావు పూలే తో కలిసి సత్యశోధక సమాజాన్ని స్థాపించి సామాజిక న్యాయంకోసం కృషిచేసిన సంఘ సంస్కర్త సావివూతిబాయి పూలే. ఆమె మంచి టీచరని, గొప్ప సామాజిక సేవకురాల ని బ్రిటిష్ ప్రభుత్వం గౌరవించింది. కానీ ఆమె సేవను గుర్తించడానికి బ్రాహ్మణాధిపత్య దేశానికి శతాబ్దంన్నర కాలం బట్టింది. ఆమె పేరుమీద ఒక స్టాంపు వేసి చేతులు దులుపుకున్నది. కులసంఘాల రాజకీయ చైతన్యాల ఒత్తిడి తో ఆంధ్రవూపదేశ్ ప్రభుత్వం ఇటీవలనే పూలే జయంతి, వర్ధంతి ఉత్సవాల్ని జరపడానికి నిర్ణయించింది.కాని సావివూతిబాయి పూలే జయంతి, వర్ధంతి ఉత్సవాలను మరిచింది. 

ఆధునిక భారతదేశానికి మొదటి టీచర్, సంఘసంస్కర్త సావివూతిబాయి పూలే ‘మాలి’ అనే బీసీ కులస్తురాలు. ఆమె 1931 జనవరి 3న మహారాష్ట్ర సతారా జిల్లాలోని ఖండా లా ప్రాంతంలోగల నాయగావ్‌లో పుట్టింది. తల్లి లక్ష్మిబాయి, తండ్రి ఖండోజి. సావివూతిబాయి వంటకో, ఇంటికో పరిమితమైన కులంనుంచి రాలేదు. పనిపాటల శ్రమజీవనంలో బతికే కులం నుంచి వచ్చింది. సావివూతిబాయి జ్యోతి బా పూలే ఇంటికి తొమ్మిదేళ్లకే అతని భార్యగా అడుగుపెట్టింది. అప్పట్నించి జీవితాంతం సామాజిక ఉద్య మ కార్యకర్తగా కొనసాగింది. జోతిబాపూలే మరణానంతరం కూడా సత్యశోధక సమాజాన్ని ముందుకు నడిపిన ఉద్యమకారిణి. జోతిబాపూలే చేసిన అన్ని సామాజిక ఉద్యమాల్లో సావివూతిబాయి ప్రధాన భాగస్వామి.పూలే తాను చదివిన చదువును, చైతన్యాన్ని, చదివిన ప్రతి పుస్తకాన్ని సావివూతిబాయికి పంచేవాడు. అట్లా పంచుకున్న వాటిలో.. థామస్ పైన్ రాసిన రైట్స్ ఆఫ్ మాన్ అనే పుస్తకం ప్రధానమైనదిగా చెప్పవచ్చు. ఈ పుస్తకమే ఆమెను మనిషి హక్కులు, స్వేచ్ఛా స్వాతంవూత్యాలవైపు నడిపించిం ది. అలుకునీళ్లు మీద పోసినా అవమానాలన్నింటిని భరించి మహిళలకు, నిమ్న జాతులకు చదువు చెప్పింది సావివూతిబాయి. దళిత కులాల మహిళలమీద జరుగుతున్న అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా సావివూతిబాయి పోరాడింది. సతి, వితంతు, వైధవ్యం వంటి అగ్రవర్ణాల మహిళల సమస్యల పట్ల కూడా సావివూతిబాయి వ్యతిరేకం గా పోరాడింది. సావివూతిబాయి పూలే సంస్కరణోద్యమాలు తన జాతి వరకే పరిమితం కాకుండా సమాజంలోని బాధితులందరి పట్ల సేవాదృక్పథం కనబరిచింది. ఆమె ఈ విశాల దృక్పథానికి చరిత్ర ఏ గుర్తింపునివ్వలేదు. బ్రాహ్మణాధిపత్య భారత జాతి కావాలనే సావివూతిబాయి చరివూతను మరుగు పరిచింది. 

శూద్ర, అతిశూద్ర కులాల గురించి పట్టించుకున్న జ్యోతి బా పూలే, సావివూతిబాయి గురించి బ్రాహ్మణాధిక్య సమా జం మరుగున పడేయడమే కాదు, మేధావులు, కమ్యూనిస్టులతో సహా ఫెమినిస్టులుగా చెప్పుకుంటున్న వారు కూడా సావివూతిబాయి చరివూతను వెలుగులోకి తీసుకురాలేదు. నిజానికి ఈ ముసుగులో నాయకత్వం చెలాయిస్తున్న వారం తా బ్రాహ్మణ ఆధిపత్య కులాల వారే. కాబట్టి తమ జాతి వెలుగు దీపాలైన జ్యోతిబాయి పూలే లాంటి వారి చరివూతల ను దళితులే వెలుగులోకి తెచ్చారు.
సావివూతిబాయి సామాజిక ఉద్యమ నాయకురాలే కాదు, ఆమె గొప్ప రచయిత్రి. సావిత్రి బాయి గొప్ప ఆచరణవాది. సమాజ ఆమోదంలేని సంతుని దత్తత తీసుకుని సమాలించింది. 190లో తన భర్త జ్యోతిబా పూలే మరణిస్తే సమాజరీతికి భిన్నంగా, నియమాలన్నింటిని ధిక్కరించి తనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తన పేరట్లో బావిని తవ్వించి అంటరాని వాళ్లకు నీటి కొరత తీర్చింది. ఇలా నిరంతరం సమాజ సేవలో మునిగి ఉంటూ.., ప్లేగు వ్యాధి గ్రస్తులకు సేవలు అందిస్తూ.. తాను కూడా ప్లేగు వ్యాధి బారిన పడి197 మార్చి 10న మరణించారు. దేశంలో సర్వజనుల హక్కుల కోసం, ముఖ్యంగా దళిత స్త్రీల హక్కు ల కోసం పోరాడిన, మొదటి మహిళా టీచర్‌గా ప్రభుత్వం గుర్తించాలి. సావివూతిబాయి పూలే జన్మదినం జనవరి 3ను భారత జాతీయ మహిళాదినంగా ప్రకటించాలి. కొత్తగా ఏర్పాటు చేసే యూనివర్సిటీలకు సావివూతిబాయి పూలే పేరు పెట్టాలి. స్ఫూర్తివూపదమైన ఆమె జీవిత చరివూతను పాఠ్యాంశంగా చేర్చాలి.

-జూపాక సుభద్ర 
(నేడు సావివూతిబాయి పూలే 115వ వర్ధంతి)

Namasete Telangana News Paper Dated : 10/03/2012 

Saturday, February 25, 2012

అస్సోయిదూలాతో ఆడే నా రోజెన్నడో--- జూపాక సుభద్ర

అస్సోయిదూలాతో ఆడే నా రోజెన్నడో

ఓ పెద్దమనిషన్నట్లు
నేను 'కోటి రతనాల వీణ' నేమోగాని
కోటి గాయాల గడ్డను అనేది నిజం
యింకా సబ్బండ సమ్మక్క సారక్కలకు అడ్డానని
పోరాటాల సాల్లు బోసిన
పోషమ్మ మైసమ్మ వుప్పలమ్మ వూరడమ్మల
బిడ్డనని మాత్రమే తెలుసు
నా ఆడిబిడ్డెలు ఎండ కన్నెరగనోల్లు గాదు
ఏడు ముట్టెల్ల కాలం పిల్లాదిమారకాంచి
పోరుల పొర్లాడుతున్నోల్లు
గానాడెన్నడో సాయుధ పోరాటంల
తుపాకులు బట్టి తూటాలు తొడుక్కొని
గడీలల్ల బరిబాతల బత్కమ్మ లాడిచ్చిన
దొరల కోరల్ని వొలిచినోల్లు
మిలట్రీ మిడతల దండు కండ్లల్ల కారం ఫిరంగులు జల్లి
వూరావలికి వురికిచ్చినోల్లు
గియ్యాల పొట్ట తట్టల వెట్టుకొని పట్నం బోతుండ్రు
రోడ్లకు కంకెరై బవంతులకు సిమిటై యిటికై
యిండ్లల్ల పాసి పనై
బిడ్డలకు బుక్కెడు బువ్వ బెట్టలేక
అడ్డాల్నాడే అమ్ముకుంటుండ్రు
అడ్డాల మీద కుప్పబోసిన కూలి సరుకైతుండ్రు
బతుకే సావైన కాడ అక్షరాల మెతుకులకు యాడికి బోదును
యెన్నెలై పారిన నా యేటి యెదలు సీకటి డొక్కలైనయి
సింగిడై పొంగిన నా గొలుసుకట్టు కలలు
సెద పురుగులు దిన్నయి
నా పల్లె సెట్టుకు ఆకు అంటుతలేదు
సిన్నబొయి కూకుండనీకి సిరిమల్లె పందిర్లు పాడైనయి
అదేందో నా పుట్కే మంచిది గాదు! బేకార్ పుట్క
నన్నెవరు బుట్టించిండ్రో ఏమో గాని
ఏనాడు కడుపు నిండ దిని కండ్లార కునుకు దీయలే
నా గడ్డ మీదికొచ్చినోడు సచ్చినా బోడెందుకో
యేడ లేని బెల్లంగడ్డలు నా తాన్నే వున్నయా
అగెపాయె బత్కనియ్యంటే
నన్నే అంగట్ల అమ్ముతుండ్రు తక్కెట్ల జోకుతుండ్రు
నా రూపురేకల్ని నామ రూపాలు లేకుంట నమిలిమింగుతుండ్రు
నా మట్టిల బతికి బట్టగట్టి కోట్లకు కోటలు గడుతుండ్రు
నా జాగ నాగ్గావాలంటె
'ఛత్' నీ యయ్య 'విడదీస్తున్నరు' అని
సమైక్య రాగాలు రాజేస్తుండ్రు
గీల్లందర్ని మోసి మోసి మాడంత కాయగాసిందిరా బిడ్డా!
నా కడుపు నిండ నీళ్లున్నయి,
నా గుండె నిండ గనుల గరిశెలున్నయి
నా నెత్తి నిండ పోరాటాల పొక్కిల్ల తొక్కిడున్నది
అయినా నా వూర్లన్ని వుపాసాలై వుంటన్నయి
గా పెద్ద మనుసులు సావ వాల్ల నెత్క కట్క పోను
బలిమీటికి బాసింగం గట్టి అడివిల ఆగం జేసిండ్రు
'కలిసుంటే కలదు సుకమని' నన్ను కల్లోలం జేసిండ్రు
నా బిడ్డెలు పిడికెడు బువ్వకు అడివిల అన్నలైతుండ్రు
మస్కట్ తొవ్వల్ల మరిగిపోతుండ్రు
గా పొద్దు నీ సెరని యిడిపించనీకి కొట్లాడిన నా పోరగాండ్లని
పిట్టలోలె కాల్చి సంపితే
గీనాడు కనిపించని కుట్రలు పెట్రోలై హత్యలు జేస్తూ..
నన్ను సావుల రేవు జేస్తున్నరు
ఎన్నేండ్లున్నా వేరు దప్పది.. ఎప్పటికైనా వలస పక్కల బల్లెమై
మేలుకొనే వుంట
వాడెన్నిసార్ల ధోక జేసినా సల్లారని బూడిదిని
వానికి నాలుగు గాదు నలబై తల్కాయలుండొచ్చు
నేను వూరూరికి నినాదమై వురుముతూ
ధూంధాంతో దిక్కుల్ని దుక్కు దున్నినా
వాని కమిటీ తంత్రాల తాయత్తుల్ల కాటగల్సిన
సూరుకు సెక్కిన సుట్టాకునైన పులి నోట్లె జిక్కిన పాలపిట్టనైన
నేను నేనుగ నిలబడందే
ఎల్లి ఎల్లమ్మ.. నర్సిగాడు నర్సయ్యలు కారురా బిడ్డలారా
నా పీడలకు పాడెగట్టి నా గడ్డ మీద నాకు
బొట్టువెట్టి బోనమండి అస్సోయిదూలాతో
డప్పు సప్పుల్లతో దండోరేసే నా రోజెన్నడో.....

- జూపాక సుభద్ర
Andhra Jyothi News Paper Dated : 24/05/2010

అణగారిన అస్తిత్వాల్ని అణగదొక్కడమే మార్క్సిజమా?--- జూపాక సుభద్ర

రంగనాయకమ్మ వేసుకున్న ప్రశ్నలు చెప్పుకున్న జవాబుల గురించి మాట్లాడే ముందు 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' నేపథ్యం వివరించాల్సిన అవసరముంది. జనవరి 2009లో విశాఖలో నిర్వహించిన సభలో దళిత బీసి మైనారిటీ అస్తిత్వాల రచయిత్రులు కొన్ని ప్రతిపాదనలు, చర్చలు లేవదీయడం జరిగింది. లక్ష్యాలు కూడా రూపొందించడం జరిగింది.

పురాణాల నుంచి ఆధునిక స్త్రీవాద సాహిత్యం దాకా అణగారిన జాతుల (దళిత బహుజన మైనారిటీ ఆదివాసీ) స్త్రీలను మరుగుపర్చడం జరిగింది. ఈ సాహిత్యాలేవీ వీరి స్థితిగతుల్ని సమస్యల్ని కుల, శ్రమ దోపిడీని, సంస్కృతిని పట్టించుకోలేదు. చర్చించలేదు. సమాజానికి ఉత్పత్తి శ్రమనందించే అణగారిన స్త్రీలను సాహిత్యంలో భాగం చేయలేదు. వీరిని వూరిలో అంటరానోల్లని చేసినట్లే సాహిత్యంలోనూ దూరముంచారనే అవగాహనని సభ ముందుంచాము.

సమాజంలో స్త్రీలు కూడా కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా దొరసానులుగా, కూలీలుగా వున్నారు. వారి జెండర్ సమస్యలు ఒకే మూసగా లేవు. అణగారిన జాతుల స్త్రీల సమస్యలు, గడపదాటని దొరసాండ్ల సమస్యలు ఒక్కటి కావు. ఇలాంటప్పుడు స్త్రీలంతా ఒక్కటే అని చెప్పడంద్వారా అణగారిన జాతుల స్త్రీల సమస్యల్ని చర్చించే అవకాశం లేకుండాపోతుంది.

పురుషాధిక్యత నుండి విముక్తే స్త్రీలందరి విముక్తిగా ఆధిపత్య కులాల మహిళలు చెప్పడం యితర స్త్రీల చుట్టూత వున్న రాజకీయ ఆర్థిక సాంఘిక శ్రమ కుల సమస్యల్ని మగ పెత్తనాల సమస్యల్ని వెలుగులోకి రానివ్వకుండా అణచివేయడమేనన్న విషయాల్ని సభ అంగీకరించింది. 

స్త్రీవాద సాహిత్యం ప్రధానంగా కోస్తాంధ్ర ఆధిపత్య కులాల స్త్రీల నుంచే వచ్చింది. ఈ సాహిత్య ఉధృతి, ఉత్పత్తి పెరిగినా, తరిగినా మెజారిటీ స్త్రీలైన దళిత బహుజన మైనారిటీ ఆదివాసీ స్త్రీలకు ఒరిదింది, తగ్గింది ఏమీలేదు. ఈ అస్తిత్వాల స్త్రీలకు కులం ప్రాంతం మతం మగాధిపత్యం, ఆసామి అజమాయిషి, దొర్సాని పెత్తనాలు అంటరానితనం అణచివేతలున్నాయి.

ఈ అణచివేతల నుండి వీళ్లు విముక్తి కావలసివుంది. 'స్త్రీవాదం' అనే పదం యిన్నాల్లు కోస్తాంధ్ర ఆధిపత్య కులాల స్త్రీల సమస్యలకే పరిమితమైవుంది. ఉమ్మడి వేదికకి ఈ పదం యిమడదని అనగా విస్తృత అస్తిత్వాలుగా వున్న అణగారిన స్త్రీలకు సరిపోదు అనే అభిప్రాయాన్ని సభ ఆమోదించింది. 

అయితే మా ఈ చర్చల్ని, ప్రతిపాదనల్ని, ఆమోదాల్ని, దానికి సంబంధించిన రిపోర్టును పక్కనబెట్టి సభలో వీగిపోయిన శ్రమ సంబంధాల స్త్రీల సాహిత్య, శ్రమ తప్ప వేరే అస్తిత్వాలు లేవనే వాదన రిపోర్టు పత్రికల్లో రావడం జరిగింది. సభా నిర్వాహకులు ప్రత్యక్షంగా వ్యతిరేకించకపోగా పరోక్షంగా అనుకూలతను వెలిబుచ్చడం జరిగింది. సభా చర్చలు ఆమోదాలు ఎక్కడా వెలుగు చూడలేదు. యిలాంటి అణగదొక్కే అనుభవాల అవమానాల్తో వీరి ద్వంద్వ నీతికి వ్యతిరేకంగా అణగారిన అస్తిత్వాల రచయిత్రులు 'మట్టిపూలు'గా సంఘటితమయ్యారు. 

ఒకవైపు దళిత బహుజన మైనారిటీ రచయిత్రుల అభిప్రాయాల్ని అతి దారుణంగా అణచివేసి యిప్పుడు 'ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక' అని పెట్టుకున్న ఆధిపత్య కులాల రచయిత్రులు మరోవైపు తమ అనుకూలురైన అణగారిన కులాల రచయిత్రుల్ని వేదికలో పెద్దపీటలేసి తమ ఆధిపత్య జెండర్ ప్రయోజనాల్ని కొనసాగించే పనిలో పడ్డారు. తద్వారా అణగారిన జాతుల స్త్రీలను అణచివేసే కార్యక్రమం పెట్టుకున్నారు. విశాఖ సభలో ఓడిపోయిన, కాలం చెల్లిన వాదనలు అణగారిన స్త్రీల భిన్న అస్తిత్వాల పుటంలో బూడిదైన వాదాన్ని రంగనాయకమ్మ మార్క్సిస్టు పుటంలో పెట్టి వూదుకుంటున్నారు. 

నిజానికి ఈ చర్చా పాఠం సందర్భం స్త్రీల భిన్న అస్తిత్వాల మీద జరగాల్సినది. స్త్రీల భిన్న అస్తిత్వాల చుట్టూ అల్లుకుపోయిన దోపిడీ కుల రాజకీయాల గురించి జరగాల్సిన చర్చ. కాని రంగనాయకమ్మ చాలా పకడ్బందీగా ఆ ప్రస్థావనే లేకుండా, లేవదీయకుండా జాగ్రత్త పడింది. అస్తిత్వమంటే ఏమిటి? అని ప్రశ్న వేసుకొని జాతుల్లో కులాల్లో మతాల్లో తేడాలున్నాయని జవాబు చెప్పుకుని స్త్రీలల్లో వున్న ఎక్కువ తక్కువల వూసుగాని, ప్రస్థావన గాని చేయకపోవడం ద్వారా ఆధిపత్య కుల దొర్సానితనాన్నే ప్రదర్శించింది. అణగారిన స్త్రీల అస్తిత్వాల్ని తొక్కేసింది. 

కులమనేది శ్రమవిభజనే కాదు శ్రామికుల మధ్య విభజన కూడా సృష్టించిందని అంబేద్కర్ చెప్పాడు. నేడు సమాజంలో వున్న భిన్న అస్తిత్వాల మీద చర్చ నడుస్తున్నది. కాని భిన్న అస్తిత్వాలతో వున్న మహిళలకు సంబంధించిన అస్తిత్వాల చర్చకు మాత్రం అవకాశం యివ్వడం ఆధిపత్య కుల స్త్రీలకు యిష్టంలేదు. మా సమస్యలు వేదిక లెక్కడం లేదు. వెలుగు చూడ్డంలేదు. 

సాహిత్యంలోనూ అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నాం. మా సమస్యల్ని ఆధిపత్య కుల మార్క్సిస్టు రచయిత్రి అర్థం చేసుకోగలదా? అస్తిత్వాలు అర్థం కావాలంటే కులవ్యవస్థను అర్థం చేసుకోవాలి. కుల సమాజంలో పుట్టి ఉత్పత్తి శక్తుల్ని, ఉత్పత్తి సంబంధాల్ని మానవ సంబంధాల్ని నియంత్రించేది, నిర్దేశించేది కులం కాదు అని ఎట్లా చెప్పగలము. 

ఆమె ఏకరువు పెట్టిన కార్మికులు, పెట్టిబడిదారులు కూడా కుల వ్యవస్థ పునాదుల్లోనే వున్నారని తెలవదా! ఇక్కడ సమాజిక సాంస్కృతిక రూపం నిర్ణాయక మౌళిక అస్తిత్వం కులమే అని అనుభవంలోకి రావాలంటే అణగారిన కులాల్లో స్త్రీగా పుడితేనే తెలుస్తుంది. అణగారిన కులాలవాళ్లే శ్రమ చేసేవాళ్లుగా, ఆధిపత్యకులాలవాళ్లే శ్రమని దోచేవాళ్లుగా వ్యవస్థీకృతంగా ఎందుకు కొనసాగుతున్నారో చర్చ చేయండి. ఆ చర్చకోసం ప్రశ్నలు వేసుకోండి.. యింకా అస్తిత్వాలు బాగా అర్థం అవుతాయి. 

రోడ్లూడ్చే, పాకీ, పారిశుధ్య శ్రమలో ఆధిపత్య కులాలవాళ్లు ఎందుకు లేరు? దళిత కులాలవాళ్లే ఎందుకున్నారు? యిది శ్రమ విభజనా? కుల విభజనా? కులం సృష్టించే మానవ, ఉత్పత్తి సంబంధాల్ని, సంస్కృతుల్ని వివక్షల్ని మార్క్సిజం వంటి సిద్ధాంతాలు ప్రశ్నించలేవు, పరిష్కరించలేవు. ఈ విషయాలు లేవనెత్తిన కులాల్ని బహుజన ప్రయోజనాల్ని దెబ్బతీసే వాదాల్తో అణచివేస్తున్నాయి. మార్క్సిజంని వ్యక్తిగత ఆస్తిగా చూసే రంగనాయకమ్మ కూడా తన చర్చా ప్రశ్నల్లో మూసేసింది. ఆధిపత్య దోపిడీ గురించి మాట్లాడే యీ రచయిత్రి అణగారిన స్త్రీలపై వుండే ఆధిపత్యాలపట్ల మౌనం వహించి మరుగున పడేసింది. 

సామాజిక అసమానతల్నుంచే అస్తిత్వాలేర్పడ్డాయని, అసమానతలు పోయిన్నాడే అస్తిత్వాలు పోతాయని యీ రచయిత్రికి తెలవ దా? అస్తిత్వాలంటే హక్కులు సాధించుకునేందుకు సాధనాలుగా వున్నాయని అస్తిత్వాల్ని చులకన చేసి అవమానించడం ఆధిపత్య కుల అహంకారానికి నిదర్శనం. అస్తిత్వ పోరాటాలు అస్తిత్వాల్ని మోయడానిక్కాదు, నిర్మూలించడానికే. 

హక్కులు, అవకాశాలు, స్వేచ్ఛ ఉన్న కులాలకు అవి సాధించుకోవాల్సిన అవసరం లేదు. అవి సాధించుకోడానికి అస్తిత్వాలుగా కదులుతున్నారంటేనే వాళ్లెంతగా హక్కులు కోల్పోయారో, ఎంతగా హక్కులు కొల్లగొట్టబడినారో అర్థం చేసుకోవచ్చు. కులం వల్ల అన్నీ అమరిన వాళ్లకేం అర్థమవుతాయి హక్కుల్లేని అస్తిత్వాలు! మొత్తానికి ఆధిపత్య కుల మార్క్సిస్టు రచయిత్రి మేమెదుర్కొంటున్న ఎన్నోరకాల అణచివేతలకు సంబం ధించిన అణగారిన స్త్రీ అస్తిత్వాల్ని చర్చ చేయకుండా తొక్కేసింది.

పురుషాధిపత్యం పోవాల ని కోరుకుంటున్న ఆధిపత్య కులాల స్త్రీలు అణగారిన స్త్రీల అస్తిత్వాల్ని అణగదొక్కడం, పూడ్చేయడం ప్రజాస్వామికం కాదు, ఆధిపత్య కుల మార్క్సిజమే.

అణగారిన కులాల స్త్రీలపై ఆధిపత్య కులాలు చేసే అన్ని రకాల అణచివేత రాజకీయాల్ని ఎదించడానికి దళిత బహుజన ఆదివాసీ మైనారిటీ రచయిత్రులంతా సంఘటితం కావాలి.

- జూపాక సుభద్ర
Andhra Jyothi News Paper Dated 5/07/2010 

అణగారి వర్గాలపై వివక్ష - జూపాక సుభద్ర


మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమని పీటవేసి చెప్పినంతగా ఆచరణ లో కనిపించడం లేదు. మాఫియా యాజమాన్యాలు అనే పరిస్థితి ఉంది. ఆధిపత్య హిందూ సీమాంధ్ర మగ వ్యాపారుల పెట్టుబడుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా మీడియా పనిచేస్తున్నది. శ్రామిక కులాల మైనారిటీల, మహిళల ప్రాతిని ధ్యం మీడియాలో నామ మాత్రంగానే ఉంది.

ఈ వర్గాల పోరాటాలను, సమస్యలను పతాక శీర్షికన ప్రచురించడం మీడియాకు అప్రస్తుతం. అశేష పీడిత ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛకు వేదిక కావాల్సిన మీడియా యాజమాన్యాల స్వేచ్ఛకే పరిమితమవుతున్నది. జనాభాలో 85 శాతం ఉన్నది పీడిత కులాల వారు, మైనారిటీలు, మహిళలు. కానీ వారి చేతుల్లో మీడియా సంస్థలు లేవు. ఈ సంస్థలకు సామాజిక బాధ్యత ఉంటే పీడి త కులాల, మహిళల సమస్యలకు 85 శాతం కేటాయించాలి.

కానీ అలా జరగడం లేదు. ఏవో కొన్ని చిన్న వార్తలు, వ్యాసాలు ప్రచురించి సామాజిక బాధ్యత నెరవేరుస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి. కానీ దారిద్య్రం, ఆకలి, నిరక్షరాస్యత, అంటరానిత నం, దురాచారాలు, నిరుద్యోగం, దోపిడీ, ప్రాంతీయ అసమానతలు అన్నీ దళిత బహుజన ఆదివాసీ ,మైనారిటీలు, ఈ వర్గాల మహిళలే ఎదుర్కొంటున్నారు. వీరు ఎదుర్కొంటున్న సమస్యల కన్నా మించిన వార్తలు ఏముంటాయి? 

మీడియాలో ఆంధ్ర ప్రాంత మగవారే ఎక్కువ. ఒకటి అరా శ్రామిక కులాల, ఆధిపత్య కులాల మహిళలు కనిపించినా దళితుల ప్రాతినిధ్యం కనిపించడం లేదు. అనేక ఉద్యమాల ఫలితంగా పత్రికలలో ఒక పేజీ, టీవీల్లో అరగంట కేటాయించినా దాని లో పెద్ద కులాలకు సంబంధించిన ఫ్యాషన్స్, వంటలు, ముగ్గులు ఉంటాయి. ఇవీ కాకపోతే పురాణాల్లోని ఆధిపత్య కులాల మహిళల వ్యక్తిత్వాలను ఆవిష్కరించి తరించిపోతారు! టీవీ చర్చల్లో నిత్యం ఒకే రకమైన అంశాలు పునరావృతమవుతూ ఉంటాయి.

ఆ చర్చల్లో మహిళలు ఉండరు. అందువల్ల మహిళా కోణం కనిపించడం లేదు. సమగ్రత లోపిస్తున్నది. అయితే వినోదానికి మాత్రం మహిళలనే ఉపయోగించుకుంటారు. ఈ విధంగా సమాజంలో జెండర్ అసమానతలను మీడియా తొలగించక పోగా పెంచి పోషిస్తున్నది. మీడియా సంస్థల్లో ఊడ్చేవాళ్ళు, ట్రాన్స్‌పోర్టు కార్మికులు బహుజన, దళిత, ఆదివాసీ, మైనారిటీల వారు కాగా పాత్రికేయులుగా, సాంకేతిక సిబ్బందిగా, ప్రాడక్షన్ మేనేజర్లుగా, యాంకర్లుగా, న్యూస్‌రీడర్లుగా ఆధిపత్య కులాలు, ప్రాంతాల వారే ఉంటున్నారు. 

రాజకీయ పార్టీల ప్రతినిధులు, సెలబ్రిటీలు, వ్యాపార, సినిమా, క్రీడా రంగాలే మీడియాకు ప్రధానం. ఇవన్నీ పీడిత కులాలకు సంబంధం లేని అంశాలు. పూర్వం శ్రామిక కులాలకు అక్షరాలను నిషేధించారు. ఇప్పుడు మీడియా గర్భగుడిలోకి కూడా రానివ్వడం లేదు. అణగారిన సామాజిక వర్గాల వార్తలపై కత్తిరింపులు, నిషేధాలు, వక్రీకరణలు మొదలైనవన్నీ వివక్షలో భాగమే. కుల, ప్రాంత, మత, జెండర్ వివక్షకు సంబంధించి మరింత చర్చ జరగాల్సి ఉంది. మీడియా ఎవరి ప్రయోజనాలు కాపాడుతున్నదనే విషయంపై కూడా విస్తృత చర్చ జరగాలి. మీడియా ప్రజాస్వామీకరించబడాలి. పెట్టుబడుల సంకెళ్ల నుంచి బయటపడాలి. 
- జూపాక సుభద్ర
Andhra Jyothi News Paper Dated 15/06/2010

Monday, January 23, 2012

మీరెంతో మేమంత – మీకెంతో మాకంత


మీరెంతో మేమంత – మీకెంతో మాకంత

Posted By  on October 1, 2011
జె.సుభద్ర
ఆకాశంలో సగం భూమ్మీద సగం గ్లోబులో సగం పోరులో సగం. పేరుకే యీ సగాలు. భాగమనేటప్పటికి ఎక్కడినోల్లక్కడేే మూతబడ్తయి. 
ప్రతోల్లు ఆకాశంలో సగం అనేది నాగరికమైన ష్యాషనైంది. అందని ఆకాశంలో సూడని సుక్కల మైదానంలో సగం అని అనడం మహిళలకు ఏమి సంతోషం? ఏమి లెక్క? మాకు లెక్కల్తో పాటు పక్కా భాగస్వామ్యాలు కావాలి. మీరెంతో మేమంత. మీకెంతో  మాకంత రావాలి. ఒక సగం ప్రపంచాన్ని దాని వాటాల్ని, భాగస్వామ్యాల్ని పక్కకు బెట్టే రాజకీయాలే యింకా కొనసాగుతున్నయి. యీ పక్కకు పెట్టె పన్నాగాలు ఒక్క ఆధిపత్యా కులాల మగ ప్రపంచమే కాదు సమ న్యాయం సమాన భాగస్వామ్యం కోరుతున్న అణగారిన కులాలు కూడా వారి సమూహంలోని సగాల్ని పక్కన పెడ్తున్నరు. పంపకాల న్యాయాల్లో వారి సగాన్ని అనాచ్చం చేస్తున్న దుర్మార్గాల్ని నేటి ఉద్యమాల్లో చూస్తున్నాం.
యిపుడు నడుస్తున్న తెలంగాణ ఉద్యమంలో నాయకత్వాలు ఆధిపత్య కులాలున్నాయని రేపటి తెలంగాణలో సామాజిక న్యాయాల వాటా తేల్చాలని ఒక చర్చ జరుగుతోంది. అణగారిన కులాల నుంచి అయినా తెలంగాణ ఉద్యమ నాయకత్వంలో వున్న ఆధిపత్య కులాలకు  పేనుబార్తలేదు, సీమకుడ్తలేదు. అట్లా వుండడంగూడ పెద్ద రాజకీయమే. దళిత బహుజన మేధావులు భౌగోళిక తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ కావాలి అంటున్నరు. గడిచిన అనేక ఉద్యమాల్లో సామాజిక న్యాయాలకు సంబంధించిన ఒప్పందాలు జరుగుతానే వున్నయి. అవి ఆధిపత్య కులాలకు, అణచబడిన కులాలకు మధ్య ప్రతి ఉద్యమ సందర్భంగా ఒప్పందాలు జరుగుతునే వున్నయి. విషాదమేంటంటే ఆ ఒప్పందాల్లో ఆ యిరువర్గాల్లో మహిళలు లేకపోవడం.
జాతీయోద్యమం నుంచి, ప్రత్యేకాంధ్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉద్యమాలకు సంబంధించి 1952, 1969 ఉద్యమాల్లో ఒప్పందాలు జరుగుతూనే వున్నవి. జాతీయోద్యమంలో అంబేద్కర్‌ నాయకత్వంలో నిమ్నకులాలకు సమాన భాగస్వామ్య వాటాలు, సామాజిక న్యాయాల ఒప్పందం జరిగింది. కానీ హిందూగాంధీ సమాన భాగస్వామ్యాలు దళితులకా! అమ్మో! యింకేముంది వాల్లు మన నెత్తి మీద వుంటారు అట్లా జరగనీకి వీల్లేదని బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేసి నిమ్నకులాలను ఓడించాడు. అటు గాంధీ వర్గాల్లో- యిటు అంబేద్కర్‌  వైపు జరిగిన ఒప్పందాల్లో, వైఫల్యాల్లో మహిళలు  వారి ప్రాతినిధ్యాలు, భాగస్వామ్యాలు కనిపించవు- అత్యధికంగా అణచివేతకు గురైన మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలి. యీ మహిళలకు చరిత్రలో కోల్పోయిన అవకాశాలకు యుద్ధ పరిహారం కల్పించాలి. ఆంధ్ర రాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో కూడా జరిగిన పెద్ద మనుషుల ఒప్పందాలు తర్వాత చెల్లని పైసలే అయినయి. యీ పెద్ద మనుషుల్లో దళితులు మహిళలు లేరు.  మొత్తం ఉద్యమ చరిత్రలన్నింటిని చూస్తే మహిళలు గుంపు గుర్తుగా, గుంపుల ముంపుగానే మిగిలిపోయిండ్రు.
యిప్పుడు నడుస్తున్న తెలంగాణ ఉద్యమంలో గూడ మహిళల్ని పక్కన బెడ్తున్నరు. యిదివరకు భాగస్వామ్యాలకుగాక కనీసం ఉద్యమాల్లో, వూరేగింపులో ధర్నాల్లో, హర్తాల్లో, కోరస్‌ నినాదాలకో ముందు నిలుచో బెట్టేవారు. కాని టీవీ ఛానల్ల రాకతో మహిళల్ని వెనక్కు తోసి మగ మహానాయకులే ముందుంటుండ్రు. మమ్మల్ని రానియ్యట్లేదని ఏ మహిళ అయినా అడిగితే ‘వస్తే వద్దంటున్నమా’ అనే పడికట్టు, చేతికి మట్టంటని మాటలు మాట్లాడ్తున్నరు. కాని రానియ్యని లోతుపాతుల జెండర్‌ రాజకీయాల్ని చర్చ చేసే వేదికలు సమూహాలు, సందర్భాలు లేకుండా పోతున్నయి.
ఇక్కడ చెప్పొచ్చేదేమంటే సామాజిక తెలంగాణ అని , సామాజిక ఒప్పందాలు జరగాలని వాదిస్తున్న చర్చిస్తున్న దళిత బహుజన మేధావులు తెలంగాణలో సగం ప్రపంచంగా వున్న మహిళల సామాజిక న్యాయవాటాలను విస్మరిస్తున్నరు. బహుజన, దళిత సామాజిక పునాదులమీద తెలంగాణ రాష్ట్రం నిర్మాణం కావాలంటున్నారేగాని జెండర్‌ సమన్యాయాల గూర్చి సమవాటాల గూర్చి పల్లెత్తు మాట, పదం ఒలకడంలేదు. తెలంగాణలోని ఆధిపత్య కుల రాజకీయ పార్టీలకు ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీలకు మధ్య సామాజిక ఒప్పందాలు జరగాలనడం బాగానే వుంది. యీ కులాలకు జనాభా ప్రాతిపదికన విద్య ‘ఉద్యోగ, ఉపాధి’ రంగాల్లో దామాషా ప్రాతినిధ్యంగా వుండాలని ఒప్పందాల ప్రతిపాదనలు మహిళలక్కూడా చేయాలి అనీ, వారి జెండర్‌ అన్యాయాల్ని, అసమానతల్ని  ఏ ఒక్క మేధావి దళిత బహుజనులనుంచి లేవనెత్తలేదు. ఎస్సీలకు యీ న్యాయాలు, ఎస్టీలకు ఫలానాన్యాయాలు, అట్లనే బీసీలకు, మైనారిటీలకు కావాలని నిర్దిష్టంగా వుండాలని గొంతు చించుకుంటున్న వాల్లు మహిళలకు కూడా సమన్యాయాలు, భాగస్వామ్యాలు కావాలని, వుండాలని ప్రతిపాదించలేదు. అట్లాంటి వాల్లను సామాజిక మేధావులని, న్యాయనిర్ణేతలని ఎట్లా లెక్క కడతారు.
ఇది అస్తిత్వాలయుగం. అన్ని అస్తిత్వాలు ఉద్యమిస్తున్న సందర్భమిది. కులం, మతం, జెండర్‌, ప్రాంతం వేటి అస్తిత్వాలు వాటికున్నయి. సామాజికంగా. కులం, మతం, ప్రాంతాల అస్తిత్వాల గురించి చర్చిస్తున్నవాల్లు జెండర్‌ అస్తిత్వాల గురించి కూడా చర్చించాల్సిన సామాజిక బాధ్యత అందరిదీ. ఒక సగం ప్రపంచం జనాభా దామాషా వాటాల్ని అవాచ్యయం చేయడం సామాజిక న్యాయాలు అనబడవు