Showing posts with label ఈశ్వరీబాయి వర్ధంతి. Show all posts
Showing posts with label ఈశ్వరీబాయి వర్ధంతి. Show all posts

Sunday, February 23, 2014

'మగ చెట్టు'తో పనిలేని మహిళా నేత! - సతీష్ చందర్


P
 
2 
 
2 
 
0 
 
 

ఇప్పటి 'చెంచాల' యుగంలో, అగ్రవర్ణ పార్టీల అగ్రవర్ణ నేతలు చెప్పిన దానికెల్లా తలాడించే నేతలే షెడ్యూల్డు కులాల, తెగల నుంచీ ఎన్నికవుతున్నారు. మహిళా ప్రతినిధుల సంగతి సరేసరి. పదవీ స్వీకారం చేసిన తొలిరోజే వీరి చేత ఈశ్వరీ బాయి జీవితాన్ని కంఠస్తం చేయించాలి. అగ్రవర్ణ నేతల ముందు తలవంచటం మానకపోయినా, తలవంచినప ప్రతీసారీ, కనీసం తప్పు చేస్తున్నామన్నామన్న భావన వెంటాడుతుంది.
పైకి రావాలీ, పైకి రావాలీ అని పెద్దవాళ్ళు అంటూంటే, ముందు పైపై దీవెన అనుకుంటాం. నిజంగా పైకి రావటానికి ప్రయత్నించినప్పుడు తెలుస్తుంది, అది దీవెన కాదు, కేవలం హెచ్చరిక అని. 'బిడ్డా! పైకి రానివ్వర్రా, జాగ్రత్త' అన్న అంతరార్థం అందులో ఉంది.
పైకి వెళ్ళాలంటే, మెట్టు మెట్టుకీ చెట్టు పేరు చెప్పాలి. కులమో, గోత్రమో, శాఖో, ఉపశాఖో తెలిసేట్టు చేయాలి. అట్టడుగు వర్గాలకు చెప్పుకోవటానికి చెట్లుండవు. ఉన్నా, అవి జడలు విచ్చి, ఊడలు వేసి ఉండవు. ఏ రంగంలో అయినా అంతే, అన్ని రంగాలనూ తనలో లయం చేసుకోగల రాజకీయ రంగం అయితే మరీను.

ఆడవాళ్ళకయితే చెట్టు పేరు తప్పని సరి అయిపోతుంది. ఆ చెట్టెప్పుడూ మగ చెట్టయ్యే ఉండాలి. భర్త చాటు భార్యలకో, తండ్రి నీడన ఉన్న కూతుళ్ళకో దారులు దొరుకుతుంటాయి. అదీ కూడా చెట్టు కూలాక, మాత్రమే 'సానుభూతి'కి ప్రతీకలుగా వారు చట్టసభలకు వస్తుంటారు. అందుకే రాజకీయాల్లో మహిళలు పేర్లు చెప్పమనగానే తొలుత 'వితంతువు' పేర్లే స్ఫురణకు వచ్చాయి. వస్తున్నాయి కూడా.
అలాంటిది, అయిదు దశాబ్దాల క్రితమే, ఏ 'మగ చెట్టు' పేరూ చెప్పుకోకుండా, తెలంగాణ గడ్డ మీద చట్ట సభకు ఒక అట్టడుగు (అప్పటి 'అస్పృశ్య') వర్గాల నుంచి ఒక మహిళ సర్వస్వతంత్రంగా అడుగు పెట్టటం చిన్న విషయం కాదు. మానవుడు చంద్రమండలం మీద తొలిసారిగా పాదం మోపినంత గొప్ప విషయం. ఈ మాత్రం వివరణ చాలు, తెలుగువారు పోల్చుకోవటానికి. ఆమె ఎవరో కాదు. జె. ఈశ్వరీ బాయి. (1967లో నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి అంబేద్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ టికెట్టు మీద ఎన్నికయ్యారు. రెండవ దఫా 1972లో కూడా మళ్ళీ అక్కడి ప్రజలు ఆమెనే అసెంబ్లీకి పంపించారు)
ఆమెకు పెళ్లంటే ఏమిటో తెలిసేటప్పటికే పెళ్ళి (13వ ఏట) అయిపోయింది. తెలిశాక, తనకు తగనివాడని అనుకున్నారో ఏమో, తెగతెంపులు చేసుకుని, సొంత కాళ్ళ మీద నిలవాలనుకున్నారు. అప్పటికే ఆమెకో ఆడబిడ్డ పుట్టేసింది. అప్పుడు తెలిసింది పైకి రావటమంటే ఏమిటో...! పైకి రానివ్వమనే వారిపై యుద్ధమే, ఎదగటమంటే. తాను చదివారు. తన బిడ్డను చదివించారు. ఈ రెండూ నడవటానికి నలుగురికీ చదువు చెప్పారు. (ట్యూషన్లు చెప్పారు). తన ఆశించినట్లుగానే తన బిడ్డను డాక్టరుని (ఇప్పటి మంత్రి గీతారెడ్డి) చేశారు. ఇంతవరకూ అయితే, మహిళా పత్రికల్లోనో, అనుబంధాల్లోనో రాసుకునే ఓ 'సాధారణ విజయగాథ' ఆమె జీవితం ముగిసి పోయేది. కానీ ఆమె చదువు విస్తృతి పెరిగింది. అంబేద్కర్ రచనల్ని, ఉపన్యాసాల్నీ స్పృశించి ంది. కదలిపోయింది. అంబేద్కర్ ఎదుగుదలలో కూడా 'పైకి రానివ్వకుండా అడ్డుకునే శక్తులు' అడుగడుగునా ఎదురువచ్చా యనీ, కానీ ఆయన్ని 'అంగుళం కూడా వెనక్కి కదలించి లేక పో యాయ'ని ఆమె తెలుసుకున్నాక, ఎక్కడలేని ధైర్యం వచ్చింది. 'బిడ్డను' లాలించటమే కాదు, రాజ్యాన్ని పాలించటమూ తనకు తెలుసునని నిరూపించాలనుకున్నారు. నిరూపించారు.
కానీ 'మాంచాలను కొలిచి, మంగమ్మను తలచి, సరోజినీ దేవి పటం కట్టి పూజించే' ఈ 'పుణ్య' భారతంలో 'ఆయుధం పట్టిన' పంచాది నిర్మలలనే కాదు, అసెంబ్లీకి వచ్చిన ఈశ్వరీ బాయిలను కూడా సౌకర్యవంతంగా మరుస్తారు.
ఎదిగిపోవటే కాదు, ఎదిగినంత యెత్తులో కడదాకా ఉండి పోవటం కష్టమే. అంటే అవే పదవుల్ని పట్టుకుని వేళ్ళాడటం కాదు, అవే విలువల్ని పట్టుకుని ఉండిపోవటం. అంబేద్కర్‌వాదిగానే అంతిమ శ్వాస వరకూ జీవించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రం పేరుమీద అభివృద్ధిలో రెండు వందల యేళ్ళు అగాధమున్న తెలంగాణ, ఆంధ్రలను కలపటానికి ఆదినుండీ ఆమె వ్యతిరేకే. తాను ఊహించినదే జరిగినదని 1969 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలోనూ అసెంబ్లీలో చెప్పారు. విద్యార్థుల మీద కాల్పులు జరపటం మీద అప్పటి ముఖ్యమంత్రిని అదే శాసన సభలో కడిగిపారేశారు. చెన్నారెడ్డి ఈ ఉద్యమాన్ని 'తెలంగాణ ప్రజా సమితి' పేరు మీద కొనసాగిస్తే, దానిని కాం గ్రెస్‌లో కలిపేసుకోవటంపట్ల అప్పటి ఇందిరా గాంధీపైనే సభలో ధ్వజమెత్తారు. 'పార్టీ సమస్యను పరిష్కరించుకుని, ప్రాంత సమస్యను పరిష్కరించినట్టుగా నమ్మ బలకటాన్ని' తప్పు పట్టారు.

ఇక షెడ్యూల్డు కులాల సమస్యలు వచ్చినప్పుడు కానీ, వారి మీద జరిగిన అత్యాచారాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కానీ, ఆమె ఆవేశానికి కట్టలు ఉండేవి కావు. 'అభ్యంతరకర వ్యాఖ్యలు' పేరు మీద ఆమె మాటల్ని తొలగించేవారు. నిజమే. అట్టడుగు వారి 'ధర్మాగ్రహం' ఇప్పటికీ పైనున్న వారికి అభ్యంతరకరమే.
ఇప్పటి 'చెంచాల' యుగంలో, అగ్రవర్ణ పార్టీల అగ్రవర్ణ నేతలు చెప్పిన దానికెల్లా తలాడించే నేతలే షెడ్యూల్డు కులాల, తెగల నుంచీ ఎన్నికవుతున్నారు. మహిళా ప్రతినిధుల సంగతి సరేసరి. పదవీ స్వీకారం చేసిన తొలిరోజే వీరి చేత ఈశ్వరీ బాయి జీవితాన్ని కంఠస్తం చేయించాలి. అగ్రవర్ణ నేతల ముందు తలవంచటం మానకపోయినా, తలవంచినప ప్రతీసారీ, కనీసం తప్పు చేస్తున్నామన్నామన్న భావన వెంటాడుతుంది.
- సతీష్ చందర్
(ఫిబ్రవరి 24న జే.ఈశ్వరీ బాయి వర్ధంతి)
- Andhra Jyothi Telugu News Paper Dated: 23/2/2014

దళితుల కలికితురాయి ఈశ్వరీబాయి By ఆచార్య జి. వెంకట్రాజం


ఆంధ్రవూపదేశ్ రాజకీయాలతో, దళిత సముద్ధరణతో పరిచయమున్న వారందరూ జె.ఈశ్వరీబాయి పేరు విని ఉంటారు. ఆమె నిజాం రాష్ట్రంలో తెలుగువారి ముద్దుబిడ్డ. ధైర్యసాహసాలున్న వీరవనిత, చైతన్య ఉద్యమ స్వరూపిణి. సంఘసేవా పరాయణురాలు, బలహీన దళిత పీడిత ప్రజల ఉద్ధారకురాలు, అంబేద్కర్ అడుగుజాడలో నడిచినవారు, రాజకీయ నాయకురాలు, మంచి శాసనసభ్యురాలు. ఆమెది కళ్లలా కపటంలేని నిర్మల హృదయం. లంచగొండి అధికారులకు సింహస్వప్నం. ఆమెకు ప్రజాసేవయే జీవిత పరమార్థం. రాజకీయ రంగంలో నైతిక విలువల కోసం పోరాటం సాగించిన ధైర్యశాలి. వారికి అకుంఠిత దేశభక్తి, దేశాభిమానం ఉన్నది. ఆమె మానవతావాది, నిగర్వి నిరాడంబరి, నిస్వార్థ సంఘసేవిక, ప్రస్తుతం ఆంధ్రవూపదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకొన్న డాక్టర్ జె.గీతాడ్డి కన్న తల్లి. 1918 డిసెంబర్ 1న సామాన్య దళిత కుటుంబం లో పుట్టారు. వారి తల్లి రాములమ్మ, తండ్రి బల్లెపు బలరామస్వామి. ఆయన నిజాం స్టేట్ రైల్వేస్‌లో పనిచేశారు. వారు సికింవూదాబాద్‌లోని చిలకలగూడలో నివసించారు. బలరామస్వామికి ఆరుగురు సంతానం. నలుగురు అబ్బాయిలు-బాబురావు, పాండురంగం, కిషన్, రవీందర్. ఇద్దరు అమ్మాయి- ఈశ్వరీబాయి, మాణికమ్మ పెద్దన్న బాబూరావు. వీరి జీవితంలోని ఒడుదుడుకుల్లో అండదండగా నిలచారు.

ఈశ్వరీబాయి సికింవూదాబాద్‌లోని ఎస్‌పీజీ మిషన్ పాఠశాలలో ప్రాథమిక విద్యను కీస్ హైస్కూల్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. వారికి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిషు, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. స్వశక్తిపై జీవించాల్సిన అవసరం వచ్చినప్పుడు సికింవూదాబాద్‌లోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. దీనితోపాటు సంపన్నవంతుల ఇళ్ళలో పిల్లలకు ట్యూషన్ కూడా చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేషనింగ్ శాఖలో కొంతకాలం ఉద్యోగం చేశారు. తల్లిదంవూడుల కోరిక మేరకు పూనాలోని ధనిక కుటుంబానికి చెందిన దంత వైద్యుడు డాక్టర్ లక్ష్మినారాయణతో పదమూడేళ్ల వయస్సులోనే పెళ్ళయింది. వారి వైవాహిక జీవితం కొంతకాలంపాటు సాఫీగా సాగింది. వారికి జన్మించిన అమ్మాయే డాక్టర్ జె. గీతాడ్డి. వీరు ఆంధ్రవూపదేశ్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈశ్వరీబాయికి భర్తతో మనస్పర్ధ లు వచ్చి తన పుట్టింటికి వచ్చారు.

ఈశ్వరీబాయి జీవితం వడ్డించిన విస్తరి కాదు. జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వైవాహిక జీవితంలో విడిపోయిన తరువాత వారు సంఘసేవ వైపు దృష్టి మళ్లించారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ ఉపన్యాసం, సిద్ధాంతాలు, ఆశయాలు, భావజాలం పట్ల ఆకర్షితురాలైంది. సమాజంలోని హెచ్చుతగ్గులు, కటిక పేదరికం, అంధ విశ్వాసాలు , అమాయకత్వం, ఈర్ష్య దేషాలను నిశితంగా ఆలోచించినప్పుడు వారి మనసు కకావికం అయ్యేది. దీనికి పరిష్కారం అంబేద్కర్ ఆశయాలే అని గట్టిగా భావించారు.
1951లో హైదరాబాద్, సికింవూదాబాద్ నగరాల పురపాలక సంఘం ఎన్నికలు ప్రప్రథమంగా జరిగాయి. అప్పటిదాకా నిజాం ఫర్మానాతో ఏర్పడే పురపాలక సంఘం మొదటిసారిగా ప్రజాస్వామ్యరీతిలో ఓటింగ్ పద్ధతిలో పురుడు పోసుకోవడానికి శ్రీకారం చుట్టింది. ఆనాడు జంటనగరాల్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, సోషలిస్ట్ పార్టీలు బలమైన రాజకీయ పార్టీలు, అయినప్పటికీ ఈశ్వరీబాయి చిలకలగూడ వార్డు నుంచి ఎన్నికయ్యారు. అర్థబలం, అంగబలం, పార్టీబలం లేకున్న వారు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం వారికే సాధ్యమయింది.

ఈ విజయం వెనక శ్రమించినవారు వారి సోదరుడు కిషన్ ఈశ్వరీబాయి తనవార్డులో రోడ్లు వెడల్పు చేయించారు.వీధుల్లో నల్లాలు ఏర్పాటు చేయించారు. వీధిదీపాలు, మరుగుదొడ్లు వంటి ప్రజాసౌకర్యాలను కల్పించారు.అంతేకాక రెక్కాడితే డొక్కాడని కార్మికులకు ఇళ్లస్థలాలను ఇప్పించారు. ఆమె అనేక కమిటీలో సభ్యురాలుగా ఉన్నందున ఎందరో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడ్డాయి. మున్సిపల్ కౌన్సిలర్‌గా నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా అహర్నిశలు శ్రమించారు.

1967లో ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన సార్వవూతిక ఎన్నికలు జరిగాయి. ఈశ్వరీబాయి నిజామాబాద్ జిల్లా శాసనసభ నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పోటీ చేశారు. వీరిపై భారత జాతీయ కాంగ్రెస్ పార్టీనుంచి అప్పటి దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి టి. సదాలక్ష్మీ పోటీచేశారు. అయినప్పటికీ విజయబావుటాను మరోసారి ఎగురవేశారు.వారు శాసనసభలో ప్రజోపయోగకరమైన ప్రశ్న లు వేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆమె అనేక పాలన సంస్కరణలకు వెన్నంటి నిలిచారు. విద్యారంగంలో, స్థానిక పరిపాలనాశాఖలో అనేక సంస్కరణలను తెచ్చారు. స్టాంపు డ్యూటి పెంపును అడ్డుకోవడంతో చైనా భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడిని ఖండించడంలో ప్రము ఖ పాత్ర వహించారు. తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను ఎండగట్టడంలో చేనేత ఉత్పత్తుల పన్నురద్దులో, ప్రభుత్వ సంస్థల పక్షపాత వైఖరులను వెలుగులోకి తేవడంలో వెన్నుముకగా నిలిచారు. 1972 లో రాష్ట్ర శాసనసభకు రెండోసారి ఎన్నికయ్యారు. అంతేకాక రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆంధ్రవూపదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకురాలుగా ఒక సంవత్సరం పనిచేశారు.

1951లో జగజ్జీవన్‌రామ్ నాయకత్వంలోని దళిత లీగ్ శాఖను హైదరాబాద్‌లో స్థాపించారు. షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి పనిచేసే నాలుగు సంస్థల్లోని యునైటెడ్ షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్, దళిత జాతీయ సమాఖ్య, దళిత వర్గాల లీగ్. 1957లో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల షెడ్యూల్డ్ కులాల సమాఖ్యలు విలీనమై ఆంధ్రవూపదేశ్ షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ ఏర్పడింది. అందులో ఈశ్వరీబాయి ప్రధానకార్యదర్శిగా పనిచేశారు. 1958లో సికింవూదాబాద్‌లో జరిగిన షెడ్యూల్డ్ కులాల కార్యకర్తలు, నాయకులు సభలో పాల్గొన్నారు.

1960లో జరిగిన ఆంధ్రవూపదేశ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండి యా సంస్థాగత ఎన్నికల్లో వారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక అయ్యారు. 1962లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రవూపదేశ్ శాఖకు కార్యదర్శి అయ్యారు. జీవితాంతం ఆపార్టీలో పనిచేశారు. వీరు దళితులపై జరుగుతున్న అక్రమాలపై తన వాణిని వినిపించారు. అందులో దళితులపై అత్యాచారాలు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ తాలూకా జనంపేటలో దళితులపై భూస్వాముల అత్యాచారాలు, కృష్ణా జిల్లా వణుకూరు గ్రామంలో దళితులను వెలికితీయడం వంటి సంఘటనలను, ఖమ్మంజిల్లాలో సంఘటనలు ప్రభుత్వ దృష్టికి తెచ్చారు. వరద బాధితులకు సహాయం, మహిళా సంక్షే మం, శాంతిభవూదతలువంటి అనేక అంశాలపై శాసనసభలో తనగొంతును వినిపించారు. అనారోగ్యంతో 1991 ఫిబ్రవరి 23న తుదిశ్వాస వదిలారు.
‘మా అమ్మగారు ప్రతి విషయంలోనూ క్రమశిక్షణ పాటించేవారు. సమయపాలనతోపాటు ప్రతిపని అత్యంత సమర్థత శ్రద్ధతో నిర్వహించేవారు. నన్ను ఎంతో క్రమశిక్షణతో పెంచారు. చిన్నవయస్సులోనే బాలబాలికలకు మంచి విషయాలు బోధించాలని పెద్దలపట్ల వినయవిధేయతలు, తోటివారితో వాత్సల్యం, గౌరవభావంతో మెలగడం వంటి అలవాట్లు నేర్పాలని ఆమె అభిలాషించే వారు’. అని గర్వంగా చెప్పుకునే ముద్దుపట్టి డాక్టర్ జె. గీతాడ్డిని కన్నతల్లి ఈశ్వరీబాయి.

-ఆచార్య జి. వెంకట్రాజం
ఉస్మానియా యూనివర్సిటీ
(నేడు ఈశ్వరీబాయి వర్ధంతి) Namasete Telangana Telugu News Paper Dated: 23/2/2014