Showing posts with label గోగు శ్యామల. Show all posts
Showing posts with label గోగు శ్యామల. Show all posts
Monday, July 29, 2013
Friday, December 21, 2012
సాంస్కృతిక పునరుజ్జీవనం ---- గోగు శ్యామల
‘తెలంగాణ ధూంధాం’ ఇందూరు జిల్లా కామాడ్డిలో 2002 సెప్టెంబర్ 30న చిందుఎల్లమ్మ కాలి గజ్జెల సాక్షిగా పురుడు పోసుకున్నది. అద్బుత కళారూపమైన చిందు పేరెత్తి గొప్ప పని చేసిం డ్రు. తెలంగాణ వృత్తికులాలు, తెగలకు చెందిన అనేక కళారూపాలు కలగలిసిన ధూంధాం విశాలాంధ్ర దళారీ రాజకీయ శక్తులకు ఎలాంటి సందీయకుండా, సీమాంధ్ర టీ వీ చానళ్ల, పత్రికల, రాజకీయ పార్టీల దుష్ప్రచారానికి ధీటుగా, సకలజనుల కళారూపాలతో ప్రకాశిస్తున్న ధూంధాం ఇది.
నిజమే! తెలంగాణ ప్రజలందరికీ ఇది సాంస్కృతిక ఆయుధమే. కానీ ‘కత్తికి రెండువైపుల పదును’ అన్నట్టు మనకంటే ఎక్కువ, మనకంటే ముందు మన కళారూపాలు సాంస్కృతిక ఆయుధంగా మారింది సమైక్యాంవూధులకే. వీర తెలంగాణ పేరుతో విశాలాంవూధ ను, దున్నేవానికే భూమి, విశాలాంవూధలో ప్రజారాజ్యం, భూమి, భుక్తి, విముక్తి, ‘మరో ప్రపంచం మరో ప్రపంచం’ అనే నినాదాలు, పాటలు పాడి, మన కళారూపాలను వాడుకుని లగడపాటీలను, కావూరీలను, రామోజీలను, జగన్, వైఎస్‌లను తెలంగాణ నెత్తిమీద కూసోపెట్టిండ్రు. మన నీళ్లు, నిధులను, సర్వాన్నీ దోచిండ్రు.
ఇదంతా వృత్తికారుల కళారూపాలను సాంస్కృతిక ఆయుధంగా మన పై ఎక్కుపెట్టి, మనల్ని మతగొల్పి, జడ్తవట్టిచ్చి ఎర్రజెండా పేరుతో బలిచ్చిండ్రు. మన జమిడీకే కథలు, మాదిగ మాష్టి డప్పులు, కంజెర్లు ఇతర వృత్తికులాల కళారూపాలైన బుడిగ, బుర్ర కథలు, వాడుకొని, ఒగ్గు, గొంగడి వేషాలు వేసి, అన్నీ పార్టీలు కలగలిసన విశాలాంధ్ర, ఐఎంఎఫ్ అమెరికన్ డాలర్ ఆంధ్రాను తెచ్చిండ్రు. తెలంగాణ ప్రజలను బిచ్చగాళ్లను చేసిండ్రు. ఇదంతా తెలంగాణ కళారూపాలను ఆయుధంగా మల్చుకోవడం వల్ల మాత్రమే వారికి సాధ్యమైంది. అంటే యాభై ఏండ్లకిందటే వీటిని ఆంధ్రోళ్లు ఆయుధంగా చేసుడు మొదలుపెట్టిండ్రు. యాభై ఏండ్లు గా పాతుకుపోయిన విశాలాంధ్ర లూట్ మార్‌ను ఎండగట్టడంలో గత పదేండ్లుగా ధూంధాం, ధూం తడాఖనే చూపిస్తున్నది. ఇది తెలంగాణ సకల జనుల అనేక కళారూపాల సమ్మేళనం.
ఇందులో తెలంగాణ అస్తి త్వం కోసం, వనరుల, నీళ్ల, నిధుల, విద్య, ఉద్యోగాల, ఆత్మగౌరవం, అన్నింటికి మించి స్వయం పాలిత రాష్ట్రం కోసం రాజీలేని సాంస్కృతిక యుద్ధాన్ని ధూంధాం విజయవంతంగా నడుపుతున్నది. ఇది పార్టీయేతర సాంస్కృతిక యుద్ధం. ఈ ధూంధాం ఈ వర్గం, ఆ వర్గం అనే తేడాలేకుండా, ఎలాంటి విదేశీ పాశ్చాత్య భావజాలం లేకుండా అపూటమైన పునరుజ్జీవన ఉద్యమం. పునరుజ్జీవన ఉద్యమం అంటేనే చాలామంది మేధావులకు బెంగాలో, లేదా యూరప్ రెనైస్సాన్స్ మాత్రమే యాదికొస్తాయి. అక్కడ ఎంతమంది కవులు, గాయకులు, రచయితలు పుట్టిండ్రో తెలువది కానీ బెంగాల్ నిండ తొక్కుడు రిక్షాలు కాకుండా, పిక్కలు గడ్డకట్టంగా దేశంలో ఎక్కడా లేని గుంజుడు రిక్షాలు ఇప్పటికీ కనిపిస్తాయి.
గత పదేళ్ల సాంస్కృతిక పునరుజ్జీవనంతో తెలంగాణ వేలాదిమంది కవులును, రచయితలను, గాయకులను, కథకులను ప్రపంచం మీదికి తెచ్చింది. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనం ఏ ఎజెండా నుంచి వచ్చింది కాదు. ‘మాది మాకు’ అనే నేటివిటీ నుంచే వచ్చింది. ఈ ఒరవడిని ఎవరైనా గుర్తించకుండా ఉంటే అది వారికే నష్టం. ఎందుకంటే దేశంలో ఇలాంటి సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం జరగలేదు. దీని యాభైఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు ఉన్నాయన్నది మరువకూడదు. ఈ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పదేళ్లుగా తమ ఆటపాటలతో ధూంధాం జీవం పోస్తున్నది.
సమైక్యాంధ్ర అగ్రకుల మనువాదం, టీవీ, సినిమాల ద్వారా తెలంగాణ మీద విషం గక్కే గోబెల్స్ ప్రచారమై, ఫాసిజమై, దొరతనమై, తెలంగాణ ప్రజానీకంపై, తెలంగాణ సంస్కృతిపై, కళారూపాలపై దాడి చేసిం ది. కమ్యూనిస్టు ముసుగులేసుకొని కళారూపాల్లోకి, వాయిద్యాల్లో జొర్రిం ది. ఆ రూపాలను లోబరుచుకుని తన విశాలాంధ్ర దళారీ దోపిడీ సిద్ధాంతాన్ని అంటువ్యాధిలా అంటించింది. యాభై ఏళ్లుగా వివిధ రకాలుగా బలితీసుకుంది. తెలంగాణ జీవావరణాన్ని, జీవనోపాధులను విధ్వంసానికి గురిచేసింది. ఇలాంటి చోట తేటనీళ్ల చెలిమె వెలసినట్లు ధూంధాం తెలంగాణలో మొల్కల పున్నమైంది. తెలంగాణ వాకిట్లో వేపచెట్లు పచ్చగా విస్తరించి ఉన్నట్టు ధూంధాం అంతటా ఆటపాటలతో, రాష్ట్రం కోసం చైతన్యం పంచుతూ విస్తరించింది. ధూంధాంకు రసమయి బాలకిషన్ రథసారథిగా బాధ్యతనెత్తుకొని ఎంతమంది సాంస్కృతిక ఉద్యమ సారథులను తయారు చేసిండో! తెలంగాణ సకల రూపాలు తల్లిపాల స్వచ్ఛత గలవి. ఈ వృత్తి కళారూపాలతో రాష్ట్రం వచ్చే వరకు, తర్వా త కూడా ధూంధాం, మన సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా నడపాలి.
-గోగు శ్యామ
Namasete Telangana News Paper Dated: 22/12/2012
Friday, October 26, 2012
ఆస్ట్రేలియాలో తెలంగానం(సాహిత్య యాత్ర)---గోగు శ్యామల
ఆరోజు ఉదయం 9 గంటలకు నేను సిడ్నీలో ఫిలిఫ్ స్ట్రీట్‌లోని ట్రావెలాడ్జిలో దిగాను. నేను హడావిడిగా తయారై వెళ్లడానికి సిద్ధంగా ఉన్న బస్‌లో ఎక్కాను. ఒక్కసారి అందరూ హాయ్ అన్నారు. వారందరకి నేను ‘హాయ్, నమస్కార్ ’ అని బదులు చెప్పిన. కానీ అంత మంది నా కోసం ఎదురు చూస్తున్నరని నేను ఊహించలేదు. ఆ క్షణం ఉక్కిరిబిక్కిరయిన. వారికి ‘నమస్కారం’ అని మామూలుగా విష్ చేయడం, ఏదో వెల్తి అనిపించింది. నా అస్తిత్వం జైపూర్ లిట్రరీ ఫెష్టె నుంచే వారందరికి తెలిసిందనేది నాకు తట్టింది. వెంటనే సీట్లో కూర్చున్నదాన్ని పైకి లేచి నిలబడి ‘జై తెలంగాణ’ అని తిరిగి విష్ చేసిన. అందరూ ముక్తకం ‘జై తెలంగాణ’ అని బదులు చెప్పిండ్రు. అప్పుడు నా మనసు నిమ్మలమయింది. వారందవరో తెలుసా? భారత దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖ రచయితలు.
అందులో ప్రముఖ రచయిత ‘యయాతి’, ‘తుగ్లక్’, ‘నాగమండల’ మొదలగు గొప్ప రచనలు చేసి, పద్మభూషణ్, అవార్డు గ్రహీత కన్నడ రచయిత గిరీష్ కర్నాడ్ ఉన్నారు. ఉర్దూలో చారివూతకమైన మౌఖిక కథలను చెప్పే సాంప్రదాయాన్ని పునరుద్ధరించిన ప్రముఖ కళాకారుడు రచయిత మహ్మద్ ఫారుఖి ఉన్నారు. అరుణాచల్‌వూపదేశ్ చరివూతను, సంస్కృతిని ప్రముఖంగా రాస్తూ, ‘రివర్’పోయమ్స్, ‘ది లెజెండ్స్ ఆఫ్ పెన్‌సామ్’ తదితర పేరు గాంచిన రచనలు చేసి పద్మశ్రీ, 2011లో ‘ది ఫోర్తు హైమెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియన్’ అందుకున్న మమాంగ్‌దాయ్ ఉన్నారు. 2012లో జైపూర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సాహిత్య సంబరాల నిర్వాహకుల్లో ఒకరైన మితాకపూర్ ఉన్నారు.
‘ది ఫేస్ బిహైండ్ ది మాస్క్’ (తమిళ సాహిత్యంలో స్త్రీ) ‘ఎ పర్పుల్ సి’ (కథా సంకలనం) వెలువరించి ‘అంబయ్’ కలం పేరుతో రాస్తున్న సియస్ లక్ష్మి ఉన్నారు.‘అకర్మషి’ ఆత్మకథ, నవలలు రాసిన ప్రముఖ మరాఠీ దళిత రచయిత షరణ్‌కుమార్ లింబాలే ఉన్నారు. ‘లిటానిష్ ఆఫ్ డచ్ బెటరి’ నవల వలన ప్రముఖంగా జాతీయస్థాయిలో పేరుగాంచిన కేరళ రచయిత యన్ యస్ మాధవన్ ఉన్నారు. ‘అరౌండ్ ది ఎర్త్, కాసీ లెజెండ్స్’ రచనల ద్వారా పేరొందిన, కాసీ, ఇంగ్లిష్ భాష ల్లో రాస్తున్న మేఘాలయ రచయిత యనపామ్ సింగ్ నాంగ్‌యనర్రి ఉన్నారు. ‘మిట్రో ’ ‘విననా లోకో’ ‘ప్రియ బయాని సాహెబ్’ ‘కౌన్ బహర్’ రచనల ద్వారా ప్రముఖంగా ముందుకొచ్చిన గుజరాతీ రచయిత ప్రబోద్ పరిక్ ఉన్నారు.
‘ది వాల్స్ ఆఫ్ ఢిల్లీ’ ‘ది గర్ల్ విత్ ది ఎల్లో అంబ్రెల్లా’ రచనలతో ఎన్నో మన్ననలు పొందిన హిందీ రచయిత ఉదయ్ ప్రకాశ్ ఉన్నారు. పెంగ్విన్ పబ్లిషర్ నుంచి శివవూపియ ఉన్నారు. ఇంకా సిడ్నీలో కార్యక్షికమ నిర్వాహకులు ఉన్నారు.కల్మషంలేని మనస్తత్వాలతో ‘జై తెలంగాణ’ అనడంతో నా ఆలస్యం ద్వారా వారిని ఇబ్బందిపెట్టిన సంగతి కూడా నేను మర్చిపోయిన. ఇంక మా బస్సు సిడ్నీ ప్రధాన పట్టణం నుంచి వెస్టన్ సిడ్నీలోని మెల్‌బోర్న్ వైపువెళ్లింది. అట్ల పరమట్టా కేంపస్‌లోకి ప్రవేశించింది. కేంపస్ ఆవరణమంతా తేటగా తాజాగా కడిగేసినట్లున్నది.
పొద్దుపొడ్పు కిరణాలు పడి చెట్టు ఆకులపై నిలిచున్న నీటి బిందువులు తళుక్కున మెరుస్తున్నయి. అప్పటికే నిర్వాహకులు సుసాన, నికొలస్‌లు వేగంగా మీటింగ్ హాలులోకి వెళ్లుతుంటే మేము వారిని అనుసరించాం. మీటింగ్ హాలు కారిడార్‌లో అప్పటికే మా కోసం ఎదురు చూస్తు న్నారు. అందులో ముగ్గురు భారతీయ మహిళలు, మిగితా వారంతా ఆస్ట్రేలియన్ ఫాకల్టీస్ ఉన్నారు. అయితే నేను ఎప్పుడెప్పుడు మృదులను చూస్తానా అని ఎదురుచూస్తున్న. ఎంతో ఆశతో ఎదిరి చూస్తున్న మృదుల ఈ ముగ్గురిలో ఎవరై ఉంటారా’ అని? ఆతృతతో చూస్తున్న.
నలుపు రంగు చీరకు పసుపు పచ్చ అంచున్న పోచంపల్లి పట్టు చీర కట్టుకున్న ఆమెను చూస్తున్నా.. చీర చాలాబాగుంది. అందులో అది మా తెలంగాణలోని పోచంపల్లి పట్టు చీర. ఆమె చాలా చురుకుగా కనిపిస్తుంది. ఇతరులతో మాట్లాడుతూనే నన్ను గమనిస్తున్నట్లున్నది. నా దగ్గరకు వచ్చి హాయ్ గోగు ఐయామ్ మృదుల అన్నది. ఇంక నా సంతోషానికి అవదుల్లేవు. దానికి రెండు కారణాలున్నయి. ఒకటి నాకు సిడ్నీలో నిర్వహిస్తున్న సాహిత్యసభలో పాల్గొనే అవకాశం రావడానికి గల ప్రధాన కారకుల్లో ఈమె ఒకరు. నన్ను ఎప్పటికప్పుడు ఇంటర్‌నెట్ మెయిల్లో కలిసేది. రెండుసార్లు ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి నాతో ప్రత్యక్షంగా మాట్లాడింది.విదేశీ ప్రయాణాలు అలవాటులేని నాకు ప్రతి అంశాన్ని ఎంతో ఓపికతో వివరించింది.
రెండవ కారణం తాను తెలంగాణ పోచంపల్లి పట్టు చీర కట్టుకుంది. ఆమెనే ఈ మృదుల. మృదులానాథ్ చక్రబర్తి. ఇంక ప్రారంభ కార్యక్షికమంలో యూనివర్సిటీ ఆఫ్ వెస్టన్ సిడ్నీ వైస్‌చాన్స్‌లర్, వివిధ డిపార్టుమెంటులకు సంబంధించిన ప్రొఫెసర్లు వారి వారి సందేశాలను ఇచ్చారు. తరువాత అక్కడికి వచ్చిన రచయితలను, వారి నేపథ్యాలను మృదుల పవర్ పాయింట్ ప్రెజెం ద్వారా ఆమె ఇంగ్లిష్‌లో వివరించింది. అందులో నా గురించి సంక్షిప్తంగా ఇట్ల చెప్పింది. ఈమె గోగు శ్యామల. తెలుగులోనే రాస్తుం ది, కానీ తెలంగాణ తెలుగులో రాస్తుంది.
నల్లపొద్దు (దళిత స్త్రీల సాహిత్య సంకలనం నల్లరేగటి సాళ్లు (మాదిగ, మాదిగ ఉపకులాల ఆడోళ్ళ కథలు) ఎల్లమ్మ (అనేక అస్తిత్వాల ఆడోళ్ళ కథలు), వాడపిల్లల కథలు, నేనే బలాన్ని(టి.యన్ సదాలక్ష్మి బతుకు కథ) సదాలక్ష్మి గూర్చి ఇంకొంత వివరంగా చెబుతూ ‘ఈమె దళిత రాజకీయ నాయకురాలు, మొదటి దేవాదాయ శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రిగా పనిచేసింది. 1969లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఈమె నాయకత్వం వహించింది. ఈ చరివూతను గోగు శ్యామల సదాలక్ష్మితో దఫ దఫాలుగా కూర్చొని రికార్డు చేసి రాసింది. ఇంగ్లిష్‌లో అనువాదంచేసే ప్రయత్నం జరుగుతున్నది.‘ఫాదర్ మే బి ఎ ఆన్ ఎలిఫెంట్ మదర్ మే బి ఎ స్మాల్ బాస్కెట్.....బట్.’ అనే కథా సంకలనం జైపూర్ లిట్రేచర్ ఫెస్టివల్లో రిలీజ్ అయింది.
అద్భుతమైన కథలు. కావాల్సిన వారికి రేపటి నుంచి స్టేట్ లైబ్రరీలో జరగబోయే సెషన్స్‌లో రచయితలందరి పుస్తకాలను అందుబాటులో పెడతామని ముగించింది. అందరొక్కసా రి నా వైపు అభిమానంతో చూసి చప్పట్లు కొట్టిర్రు. అట్ల అందరి గురిం చి నా గురించి అంత బాగా పరిచయం చేయడం, అందులో మొదటది ‘తెలంగాణ’, రెండవది ‘దళిత’ అని నాకు సంబంధించి ముఖ్యమైన అస్తిత్వంగా ప్రస్తావించడం, వారంతా హర్షం వ్యక్తం చేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. కష్టమైనప్పుడే కండ్లు తడి అయితయి కదా. ఆకలి, అలసట సంబరం కలగల్సిన మిగతా రచయితలకు కావచ్చు, కాకపోవచ్చు నాది మాత్రం ఆ పరిస్థితి.
ప్రారంభ సెషన్‌లో అలసటను, ఆకలిని మర్చిపోయిన నేను మృదుల ప్రత్యేక శ్రద్ధతో వండించి, వార్చి న భోజనాలు నన్ను మరో లోకంలోకి తీసుకెళ్ళింది. అబ్బో కలర్ ఫుల్ గా అలంకరించిన ఆ డైనింగ్ యాదికి తెచ్చుకోకుండా ఎట్ల ఉండగలం. వాటి మధ్యలో ఒక అందమైన కవర్‌తో ప్యాక్ చేసి ఉంది. ఎలియట్ వెయిన్‌బర్గర్ రాసిన ‘ వైల్డ్‌లైఫ్ ’ పుస్తకమున్నది. దాని పైనా పేరు రాసి ఉంది. నా ప్యాకు నేను తీసుకుని దాచుకున్నాను. అందరి మీద అట్లనే ఉన్నది. గిరీష్ కర్నాడ్ గారు నా దగ్గరకొచ్చి ‘తెలంగాణ ఎప్పుడు వస్తుంద’ని అడిగిండు. ప్రత్యేక రాష్ర్టం కోసం పోరాటం అయితే పెద్ద ఎత్తున చేస్తున్నాము. పోయినసారి మిలియన్ మార్చ్ చేశాం. ఈసారి డిసెంబరు 30న హైద్రాబాదులో పెద్ద ‘మార్చ్’ జరగబోతున్నది.
వెయ్యి మందిదాక విద్యార్థులు ప్రాణాలిచ్చిండ్రు. అన్ని వర్గాల ప్రజలు 40 దినాల దాక ‘సకల జనుల సమ్మె’ చేసిండ్రు. ఇప్పటి వరకు తెలంగాణ కోసం ప్రజలు చెయ్యాల్సిన పోరాటాలన్ని చేసిం డ్రు. చేస్తుండ్రు. ఇంక మిగిలింది కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రా న్ని ఏర్పాటు చేయడమే’ అన్నాను. ‘అవును తెలంగాణ ప్రజలు నిజం గా సీరియస్ పీపుల్. నేను చిన్ననాటి నుంచి వివిధ సందర్భాలలో తెలంగాణ గూర్చి వింటున్నాను. ఇప్పుడు చూస్తున్న. ఒకటి మాత్రం నిజం తెలంగాణ ప్రజలు ఊరుకోరు. తమ రాష్ట్రాన్ని తెచ్చుకుంటారు’ అన్నారు. మేం మాట్లాడుతుంటే మా చుట్టూ గుమిగూడి వింటున్న వారిలోఎపూక్స్ వ్రైట్స్, మృదుల, సి.యస్ లక్ష్మి, మమాంగ్‌దాయ్‌లున్నారు.
తెలంగాణ ప్రజలు రాష్ర్టం కోసం చేస్తున్న పోరాటం పట్ల తన నమ్మకాన్ని, అభిమానాన్ని గిరీష్ గారు అంత దృఢంగా చెప్పడం చూసి నేను అవాక్కయిన. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న రచయిత గిరీష్ కర్నాడ్ ద్వారా తెలంగాణ గురించి ఆస్ట్రేలియా రచయితలకు, మన ఇండియాలోని ఇతర రాష్ట్రాల రచయితలకు ఈ సందర్భంలో తెలియడం ఎంతో ముఖ్యమనిపించింది.
మర్నాడు సెప్టెంబరు నాలుగవ తేదీనాడు మొదటిరోజు మొదటి సెషన్‌లో ‘పాత సాంప్రదాయం కొత్త సంస్కృతి’ అనే శీర్షిక గల ప్యాన ల్లో నా పేపరును ప్రెజెంట్ చేసిన. అందులో దక్కన్‌లోని తెలంగాణ చరిత్ర, సంస్కృతిలలో మాతృస్వామిక వ్యవస్థ పునాదిగా ఉన్న కుటుం బ వ్యవస్థ కొనసాగుతున్నది, జీవావరణాన్ని, జీవవైవిధ్యాన్ని వనరులను ఆలంబన చేసుకుని, వాటిని పరిరక్షిస్తూ, వృద్ధి చేస్తూ, వినియోగించుకుంటూ, నాగరిక ఆధునిక సమాజాన్ని నిర్మించిన క్రమాన్ని నేను పాత సాంప్రదాయంగా వివరించిన. ఇందులో ప్రత్యేకంగా ఉత్పత్తి నైపుణ్యంలో అంతర్భాగంగా పని, పాట, ఆటల స్వభావాన్ని కలిగి ఉన్నది.
ఇందులో ప్రధానంగా ఉత్పత్తి యూనిట్‌గా కుటుంబ వ్యవస్థ పనిచేసిన సమాజంగా నిర్మితమైన క్రమంలో వీటన్నింటిలో స్త్రీ అనివార్యంగా కేంద్రబిందువైంది. ఈ క్రమంలోనే నాగరిక సమాజ నిర్మాణంలో అనేక అస్తిత్వాల సమాజాల భాగస్వామ్యాన్ని నా పేపరులో క్లుప్తంగా చెప్పాను. నాగరికతను, సంస్కృతిని, చరివూతను నిర్మించిన అస్తిత్వ సమాజాలే కొత్త సంస్కృతిలో అదృశ్యులుగా, అస్పృశ్యులుగా చేయబడిన తీరును చెప్పాను. ఆధునిక తెలంగాణ సమాజంలో వలస పీడనను, అణిచివేతను, పరాయికరణను, నియంతృత్వపు ఆధిపత్యాలను వ్యతిరేకించే పోరాటాలే నేడు కొనసాగుతున్నవి. జీవ వైవిధ్యం కుటుంబ వ్యవస్థను పునర్మించుకోవడంలో భాగంగా నేటి ప్రత్యేక రాష్ర్ట ఉద్యమం కొనసాగుతున్నది. వీటినే ప్రతీకలుగా ఉద్యమంలో ఉపయోగించడం తొలిదశ పోరాటం నుంచి మలి దశ పోరాటం వరకు కొనసాగుతున్న విధానాన్ని చూస్తున్నాం.
మాతృవవ్యస్థ, ఆత్మగౌరవ, స్వయంపాలన, సమానత్వపు ఆకాంక్షలు వెల్లువలై అలుగు దుంకిన చెరువు నీళ్లోలే వెల్లు ఈ ఉద్యమంలో తెలంగాణ తల్లిగా, బతుకమ్మగా, సమ్మక్క సారక్కలుగా, జాతర్లుగా, బోనాలుగా మాతృ వ్యవస్థ ప్రతీకలుగా, ఉద్యమ రూపాలుగా ముందుకు రావడం దక్కన్, తెలంగాణ ప్రత్యేకతనే చెప్పవచ్చు. వీటిలో వృత్తి కళాకారులు, కులాలుగా పేరుపడిన సమాజాలు డక్కలి, చిందు, బయిండ్ల, మాల దాసరి, బుడ గ జంగాలు, మాష్టీలున్నారు. వివిధ కళారూపాల ద్వారా మౌఖిక సాహిత్యాన్ని ఇప్పటికీ బతికిస్తున్నది ఈ కళాకులాల ఆస్తిత్వ సమాజా లే.
దీనినే తరతరాలుగా తమకు దక్కిన వారసత్వంగా నమ్మి, సాంప్రదాయంగా బతుకుతున్న తీరు కొత్త సంస్కృతిలో తెరమరుగైన ఆ కులాలు, కళారూపాలు అంతరించే, పరాయికరించబడే, క్షీణించబడే స్థితి దాపురించింది. అనే అంశాలను మౌఖిక సాహిత్యంలోని పాటల ను, సంగీత వాయిద్యాలను, సంభాషణలను ఉదాహరణలుగా పేర్కొంటూ వివరించాను. వీటితోపాటు ప్రధానంగా భాష గురించిన చారివూతక రాజకీయాలు, ‘అసలు తెలుగు’ అనే ప్రత్యేకాంశాలను వివరించాను. ఇందులో ప్రధానంగా ‘తెలంగాణ, దళిత ఇండిజీనస్’ రచయి త్రిగా నాకు వారిచ్చిన గుర్తింపునకు, గౌరవానికి అనుగుణంగా నా ప్రసంగం, ప్రశ్నలకు జవాబులు నడిచినాయని చెప్పాలి.
కానీ నేను అంతదూరం వెళ్ళి తెలంగాణ, దళిత రచయిత ప్రాతినిధ్యానికి నేనెంత వరకు న్యాయం చేసిన్నో నాకు పూర్తిగా అర్థం కాలేదు. ఈ రకమైన ప్రశ్నల పరంపరలో ఎదురు చూస్తున్న నాకు తోటి రచయితల స్పందన కొంతవరకు ఊరటనిచ్చిందనే చెప్పాలి. తెల్లవారి నుంచి సి.యస్ లక్ష్మిని ఉదయం కల్సిన వెంటనే నేను ఆమెకు గుడ్‌మార్నింగ్ చెపుతుం ఆమె నాకు ‘జై తెలంగాణ’ అనడం మొదలుపెట్టింది. మూడో రోజు ఉదయం మా హోటల్‌కి ఒక కిలోమీటరు దూరం ఒపెరా హౌజ్ బీచ్ ఉంది. అక్కడికి ఉదయం నడ్చుకుంటూ వెళ్దామని ఆ ముందు రాత్రే అనుకున్న ప్రకారం బయలుదేరి నం. వెళ్తున్నదారి మధ్యలో ఉన్న హస్పిటల్ ముందు ఓ బలిష్టమైన అడవి పంది విగ్ర హం ప్రతిష్టించి ఉన్నది.
దాని పునాది గచ్చుపై ఈ విధంగా రాసిఉంది ‘నా మూతిని పట్టుకొని మీ మనసులో కోరికలు కోరుకున్నట్లయితే అవి నెరవేరుతాయి‘ అని రాసి ఉంది. ‘గోగు నీవు దాని మూతిని పట్టుకుని మీ తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకో. నేను నా స్పారో సంస్థ బాగా నడవాలని కోరుకుంట’ అన్నది. ఆమె చెప్పినట్లే కోరుకున్న.
మూడోరోజు ఉదయం సెషన్స్‌లో పాల్గొంటున్నప్పుడు ప్రారంభంలోనే మృదుల ఓ శుభవార్తను వెూసుకొచ్చింది. ఈరోజు సాయంత్రం మనం ఇండస్ (ఇండియన్ ఆస్ట్రేలియన్ అసోసియేషన్) వారు ఇచ్చే డిన్నరుకు వెళుతున్నం. అందరూ సిద్ధంగా ఉండండి అన్నది. ప్రత్యేకంగా నా వైపుకు తిరిగి గోగు శ్యామల మీ తెలంగాణ వారు కూడా వస్తున్నారు. నిజానికి నేను తెలంగాణ వారి కోసం, ఆంధ్రావారి కోసం రోజూ ఎదురుచూస్తున్నా ఎవరైనా తెలుగువారు వస్తారే చూసుడేకాదు, రోజూ సభలో పాల్గొనడానికి వస్తున్న కర్ణాటకకు చెందిన శ్రీనివాస్‌ను అడుగుతున్న, ఈయన సిడ్నీ శ్రీనివాస్ పేరుతో మంచి పుస్తకాలను రాసిండు. ఎదురు చూసినా కానీ ఒక్క గోల్డి ఒసీరి తప్ప ఎవ రూ రాలేదు. ఈరోజు తెలంగాణ వారిని కలవబోతున్నాం అంటే చాలా సంతోషమయింది.
అనుకున్నట్లే సిడ్నీ నగరంలో స్టేట్ లైబ్రరీకి దాదా పు 30 కిలోమీటర్ల దూరంలోఉన్న ఇండియన్ హోటల్‌కు చేరుకున్నం. ఇండియాలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చాలా మంది ఇక్కడ గుమిగూడి ఉన్నారు. గుంటూరుకు చెందిన భాస్కర్ ఉన్నారు. మమ్ములను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానింంచారు. ఇండస్ అధ్యక్షుడు డాక్టర్ యాదుసింగ్ అందరు తమ పరిచయాలను చేసుకోవాలని ప్రకటించడంతో తమ తమ పరిచయాలను చేసుకుంటున్నారు. అధ్యక్షుడు ఇండస్‌ను గురించి క్లుప్తంగా పరిచయం చేశాడు. వేదికపై మధ్యమధ్యలో ఓ వ్యక్తి హిందీ పాటలు పాడుతున్నాడు.
అతన్ని మధ్యలో కాస్త ఆపిం చి ఇప్పుడు తెలంగాణ వారు వచ్చారు మనతో జాయిన్ అవుతారు. ‘మనందరికి తెలుసు తెలంగాణలో ప్రత్యేక రాష్ర్టం కోసం ఉద్యమం నడుస్తున్నద’ని అధ్యక్షుడు అనే వరకు నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారు రావడం వారిని చూసిన వెంటనే మా సొంత మనుషులు వచ్చిన భావం కలిగింది. ఉపేందర్, సోమేశ్వర్, స్వర్ణ, ప్రసాద్ రావడం వస్తూ వస్తూనే జై తెలంగాణ అని పలకరించారు. మమ్ముల చూస్తున్న నాతోటి ఇతర భాషా రచయితలు ‘మీ తెలంగాణ వారొచ్చిరి. నీవింక తెలంగాణ తెలుగు మాట్లాడొచ్చు’ అన్నరు.
ఈ రచయితలు ఎంత మనసెరిగిన వారో కదా అని వారిని అభినందించిన. నిజ మే ఆ వారం రోజులుగా మాట్లాడితే ఇంగ్లిష్ లేకుంటే హిందీ బిగవట్టుకొని మాట్లాటం వల్ల నాకు నేను నా నోటిని పరిమితం చేసుకున్నట్లయింది. వారితో మాట్లాడడం మొదలు తరువాత నేను మాత్రం స్వేచ్ఛగా మాట్లాడాను. తెలంగాణలో ఎవరు ఏ జిల్లా అంటే ఒకరు ఖమ్మం, నల్గొండ, పాలమూరు, హైద్రాబాదు. తూప్రాన్. ఓల్డ్ సిటీ ఇట్ల ప్రతి ప్రాంతం నుంచి ఏరి, కూర్చినట్టు మనవారు సిడ్నీలో ఉన్నారనిపించింది. అధ్యక్షుడు ఇండస్‌ను క్లుప్తంగా పరిచయం చేయడం. తెలంగాణ గూర్చి ఈయనకు బాగానే తెలిసినట్టున్నది, చెబుతూనే ఉన్నడు ‘సౌత్ ఇండియాలో ప్రతేక రాష్ర్టం కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేస్తున్నారు.
నేను ఉత్తరవూపదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతానికి చెందిన వాణ్ని, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి అనేది మనం నమ్ముతున్నాం, చూస్తున్నాం, కనుక తెలంగాణ వారికి తెలంగాణ రాష్ర్టం కావాలి, మాకు బుందేల్‌ఖండ్ రాష్ర్టం కావాలి.’ అని ముగించాడు. మన పోరాటాలను ఆయన కనులారా చూడని వ్యక్తి తనకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు, మన రాజ్యాంగంలోని చిన్నరావూష్టాల నియమాన్ని గౌరవించి తన విశాల దృక్పథంతో ప్రకటించిండు. అక్క డ ఉన్న భారత ప్రజలందరి ముఖాలలో అంగీకారం ఉన్నది. గుంటూ రు భాస్కర్‌కు కూడా అంగీకారమున్నది.
ఎఎల్‌ఎఫ్ ఉత్సవంలో పాల్గొన్న బహుభాషా, సంస్కృతి రచయితలకు, సన్మా నం చేయడం, ఎవరి రాష్ర్ట రచయితకు ఆ రాష్ర్ట వారితో ఇండస్ జ్ఞాపికను బహూకరించారు. నాకైతే సహజంగా తెలంగాణ ఫోరం వారితో జ్ఞాపికను అందచేయించారు. అపుడు కొన్ని ముచ్చట్లు ఉపేందర్, ప్రసాద్ తెలుగులో మాట్లాడిండ్రు, నేను తెలుగులో మాట్లాడిన. ఆ వాతావరణం చూసిన తరువాత ఆంధ్రవూపదేశ్‌లో కొంతమంది మేధావులుగా, రాజకీయనాయకులుగా, ప్రధానక్షిసవంతి తెలుగురచయితలు, సినీ రంగం లో ప్రధానంగా ఉన్నవారు, రాజకీయ నాయకులు. వీరందరికన్నా ఆస్ట్రేలియా సిడ్నీలోని ప్రజలు ఎంతో గొప్పవారనిపించింది. తెలంగాణలో జరిగేవన్నీ కనులార చూసుకుంటూ కూడా తెలంగాణకు మద్దతుగా నోరు విప్పరు.
వారికి తెలంగాణ ప్రజల ఆకాంక్ష వారికి అర్థం కావడంలేదా? వారు అర్థం చేసుకోదలుచుకోలేదనిపించింది. ఆస్ట్రేలియాలో ముఖ్యంగా సిడ్నీలో తెలంగాణ రాష్ట్ర పోరాటానికి సంఘీభా వం, ఆదరణ రావడానికి కారణం అక్కడి తెలంగాణ బిడ్డలు తమ కుటుంబాల సమేతంగా ఇట్ల రాత్రింబగళ్ళు తపించి, కష్టించి తెలంగాణ పోరాటాన్ని ‘ప్రపంచ ప్రఖ్యాత’ స్థాయిలోకి తీసుకొచ్చారు. సుదీ ర్ఘ కాలం నుంచి ‘ఆవూస్టేలియా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం’, ‘ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరమ్’ పేరుతో చేస్తున్న ఉద్యమ కార్యాచరణ ఫలితమే నేడు నాకు కనిపించిన సంఘీభావం, ఆదరణ అనిపించింది.
సిడ్నీలో తెలంగాణలోని పది జిల్లాల వారున్నారు. కానీ ఇండస్ నిర్వహించిన కార్యక్షికమానికి కొద్ది మంది మాత్రమే వచ్చారు. తెలంగాణ రాష్ర్టం కోసం వారు పడుతున్న తపన, సంఘీభావాన్ని కూడగట్టాలనే నిరంతర ఆరాటాన్ని ప్రత్యక్షంగా చూసింది నేనేనని గర్వపడుతున్న. అంతేకాదు వారి ఆవేదనను, ఆగ్రహాన్ని కూడా చూసిన. ‘ఆ ఎమ్యెల్యేలు అట్లెందుకు మాట్లాడుతున్నడు? పర్కాల నియోజక వర్గంలో ఆమెకన్ని ఓట్లు ఎట్ల పడినయి? తెలంగాణ కోసం పని చేయకుండా ఇంత మంది మీరేం చేస్తున్నారు? అని నావైపు మళ్లింది వారి ప్రశ్న. వారి ప్రశ్న న్యాయమయింది.
కానీ కడ్పు చించుకుంటే కాళ్లమీద వడ్డట్లున్నది. అధికార రాజకీయ పార్టీల నాయకులు ప్రజలతో ఆడుతున్న నాటకాలు, సీమాంధ్ర నాయకులతో లాలూచీలు, వారికి తొత్తులుగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమానికి అడ్డంకిగా తయారైన తీరు. ఇంటి దొంగలు, బయటి దొంగలను గురించి చాలాసేపు చర్చ జరిగిం ది. కొంత దూరంలో ఉన్న ఇండియాలోని ఇతర భాషా రచయితలు మమాంగ్‌దాయ్, మాధవన్, శరణ్‌కుమార్ లింబాలె, ప్రకాశ్, శివవూపియలు నా దగ్గరకొచ్చి ‘శ్యామల ఫేస్ ఈజ్ డిలైటింగ్ నవ్’ అన్నరు. శ్యామలా నీవు వారితో మాట్లాడుతున్నావా? కొట్లాడుతున్నావా? అరే మీరు చాలా సీరియస్‌గా చర్చిస్తున్నరు వారు దళితులా అని అడిగిం డు. లేదు వారంత ఆధిపత్య కులాల రెడ్డీలు, వెలమలు, బ్రాహ్మణులు కావచ్చని సమాధానం చెప్పిన. ఆధిపత్య కులాలు, దళితులు కలిసి తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నరా? అడిగిండు.
ఔను.. అది తెలంగాణ గొప్పతనం. రాష్ట్రాన్ని బుడగ జంగాల నుంచి బ్రాహ్మణుల దాక అన్నికులాలు, తెగలు, అన్ని వర్గాలు, అన్ని రంగాలు ప్రజలు ఉద్యమిస్తున్నారని చెప్పిన. ఎందుకు ఆధిపత్య కులాలవారు తెలంగాణను అడుగుతున్నారు? నన్ను ఎదురు ప్రశ్న అడిగిండు? తెలంగాణలో కులాల మధ్య అంతరాలు, వ్యత్యాసాలున్నప్పటికీ తెలంగాణ ఆధిపత్య కులాల వారు ఆంధ్రా పాలకుల దృష్టిలో బానిసలే, లేదా అంటరానివారే. ఈ ధోరణి పాలన విధాన నిర్ణయాల్లో , ఉద్యోగ పంపకాల్లో, నీటి, చదువు, ఆరోగ్యపు, నీటిపారుదల పంపకాల్లో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ‘తెలంగాణ ప్రాంతాన్ని అసాంతం మేం ఆక్రమించుకు న్నం’ అనే భావనలో సీమాంధ్ర ఆధిపత్య కులాల పాలకులు వ్యాపారులు బతుకుతున్నారు.
తెలంగాణ ఆధిపత్య కులాలు మాత్రం వారిని మా కులం వారని చూస్తారు. ఆ కులాల్లో వియ్యమందుకున్నా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులను కూడా సాధికారతతో నిర్వహించలేని పరాధీనతలో కొనసాగుతున్నారు. అందుకే ప్రస్తుతం తెలంగాణను మొత్తం నీరులేని, చదువులేని, పంటలేని, కరెంటు లేని చీకటి వాడ వెలివాడను చేసిండ్రు ఆంధ్ర పాలకులని.. తెలంగాణ ప్రజలకం తా అర్థమయింది. కనుకనే అన్ని కులాలు, తెగలు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రజలు వారివారి ప్రత్యేక అస్తిత్వాలతో ఉద్యమిస్తున్నారు.
అధికార, ప్రతిపక్ష, కమ్యూనిస్టు, మత పార్టీలే డైలమాలోనో, వ్యతిరేకంగానో, తొత్తులుగానో ఊగిసలాడుతూనో, అవకాశవాదంగానో కొనసాగుతున్నారని వివరించిన. శరణ్ కుమార్ లింబాలే ఇంతింత పెద్ద కండ్లు చేసి ‘అరే తెలంగాణలో ఈ రకమైన ఉద్యమాలు, రాజకీయాలున్నాయా? మహారాష్ర్టలో ఈ రకమైన పరిస్థితి కనడబడదు. మాకైతే నిజంగా తెలంగాణ కొత్త సమాచారాన్ని విజ్ఞానాన్ని ఇచ్చింది.’ అన్నడు. ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం సూత్రధారుల్లో ఒకరైన వినోద్‌డ్డి ఎలిటె ద్వారా ఎక్కువ వివరాలను తీసున్నంక తెలంగాణ ఉద్యమ నేపథ్యం, మలుపులు వివరంగా అర్థమయింది.
సిడ్నీలో తెలంగాణ వారు ఒక రాజకీయ అస్తిత్వంతో తమ పోరాటానికి ఇతరుల మద్దతును కూడగట్టడంలో విజయవంతమయ్యారనే చెప్పాలి.
ఈ నేపథ్యంలోనే.. వీరు తెలంగాణ ఏమి కోరుకుంటున్నదనే వివరాలను స్పష్టంగా పిటిషన్‌లో రాసి ఆస్ట్రేలియాలోని తెలంగాణ ప్రజలంతా సంతకాలు పెట్టి భారత ప్రధానికి అందజేశారు. ఆనాటి నుంచి తెలంగాణ అస్తిత్వ సమాజం ‘బతుకమ్మ’ పండుగ ఉత్సవాలను జరుపుకుంటున్నది. అదేవిధంగా ‘ఆపరేషన్ పోలో’ అమరవీరులను స్మరించుకుంటుంది. అలాగే చారివూతక ఘట్టాలతో ఆస్ట్రేలియా తెలంగాణ ఫోరం తన కోసం ప్రణాళికా సూత్రాలను తయారు చేసుకున్నది. ఇందులో తెలంగాణ చరిత్ర, వర్తమాన, భవిషత్తు రాజకీయ, సాంస్కృతిక, ఆర్థికాంశాలు మిళితమయ్యే విధంగా రూపొందించుకున్నారు. అందులో తెలంగాణ ప్రజలు రజాకారుల నుంచి విముక్తి కోసం ఆనా డు పోరాడినారు. ఈ రోజు సీమాంధ్ర పాలకుల పీడన నుంచి విముక్తి కోసం పోరాడుతున్నారు.
ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతిని కొనసాగించడం దానిని భవిషత్తు తరాల కోసం కాపాడుకోవడం ముఖ్యమైన ఆచరణగా పెట్టుకున్నారు. అవి బతుకమ్మ, బోనాలను జరుపుకోవడం అనే ఆచరణగా పెట్టుకోవడం. ఈ ఒరవడితోనే మొదట టిడియఫ్, తర్వాత ఏ దేశానికాదేశం తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాపితంగా తెలంగాణ రాష్ర్ట ఉద్యమాన్ని విస్తరింప జేశారు. ఆ విధం గా ఖండాంతరాలు దాటినా తెలంగాణ ప్రజలు విముక్తి కోసం పోరాడి పేగుబంధపు రుణం తీర్చుకుంటున్నారు. అపుడర్థమయింది నాకు ఎంతో కాలం నుంచి పోరాడుతున్నారు కాబట్టే ‘ఆవూస్టేలియా ఇండియా లిటరేచర్ ఫోరమ్’లో తెలంగాణ దళిత రచయివూతిగా నేను మాట్లాడిన ప్రతి మాట ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.
-గోగు శ్యామ
Namasete Telangana News Paper Dated : 24/10/2012
Tuesday, March 13, 2012
Rising Moon ---Gogu Shyamala
Namasete Telangana Jindagi Page by Katta Kavitha Date : 13/03/2012 http://epaper.namasthetelangaana.com/Details.aspx?id=1672&boxid=247652112
Monday, January 9, 2012
పితృస్వామ్య ఆధిపత్యం!
'కుట్రల్ని ఎత్తి చూపడం ద్రోహమా?' పేరుతో (ఆంధ్రజ్యోతి, జనవరి 6) సుదర్శన్ బాలబోయిన, వేణుగోపాల్‌రెడ్డి బండారీలు రాసిన వ్యాసం చదివాక కొన్ని అభిప్రాయాలు చెప్పాలనిపించింది. మొదట ప్రొ.కంచె ఐలయ్య రాసిన వ్యాసానికి స్పందిస్తూ సూరేపల్లి సుజాత కొన్ని విషయాలతో ఏకీభవిస్తూ, మరికొన్ని విషయాలపై అభ్యంతరాన్ని చెబుతూ చర్చించారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమ సందర్భంలో దళిత, బహుజనుల పాత్ర, దృక్పథం గురించి ఈ ఇద్దరి చర్చల్లో ఆస్కారముండడం తెలిసిందే.
చర్చలోని ప్రత్యేకాంశాల పట్ల సుదర్శన్, వేణుగోపాల్ రెడ్డిలు తమ స్పందనను ఎంతో బాగా చర్చించుకోవచ్చు. కానీ అనిశ్చిత, అసంబద్ధ పద్ధతిలో వీరు చర్చను సాగించారనిపించింది. వీరు పరిశోధక విద్యార్థులయినప్పటికీ 'నీవు మా సార్ను తిడ్తవా? నీకెంత ధైర్యం' అన్న విధంగా మందలించిన తీరు ఒకటైతే, ఆమె తన అభిప్రాయాలను ఎంతో స్పష్టంగా వివరించినప్పటికీ వీరు మాత్రం పూర్తిగా భిన్నమైన రీతిలో వక్రీకరించడం రెండవది.
సూరేపల్లి సుజాత తన వ్యాసంలో గాని, అంతకుముందు రాసిన వ్యాసాల్లో ఎక్కడా టిఆర్ఎస్‌ను, కెసిఆర్‌లను సమర్థించడం కాని, వెనకేసుకు రావడం గానీ కనబడదు. ఈ విషయం అర్థం కావడానికి ఇప్పటికీ సుజాత బ్లాగ్‌లో వీరిద్దరూగానీ, ఇంకెవరైనాగానీ చదువుకోవచ్చు. (Telanganaonline.org/Surepalliలో లేదా (Sujatha Surepalli Facebook). ఈమెను కెసిఆర్ సపోర్టర్‌గా నిలబెట్టిన ఘనత ఈ ఇద్దరు వ్యాసకర్తలది.
ఉస్మానియా యూనివర్శిటీ కేవలం ఉద్యమాలకే కాదు, జ్ఞానానికి, మంచి విశ్లేషణలకు కూడా అది పుట్టినిల్లే. ఈ నేపథ్యమంతా తెలంగాణ ఉద్యమంలో భాగం కావడం కూడా ఉద్యమ స్వభావమే. ప్రతి ఒక్కరికి అవకాశాన్ని, విజ్ఞానాన్ని, అనుభవాన్ని, ఆవేదనను సైతం తెలంగాణ ఉద్యమం ఇచ్చిందని ఎవరూ కాదనలేరు. దీనిని మర్చిపోరాదు. సుజాత రాసిన తీరు 'సార్ మీలాంటి వాళ్ళే తెలంగాణ ఉద్యమం గూర్చి, దళిత బహుజనుల గురించి ఈ రకంగా మాట్లాడితే ఇంకెవరు సార్, సరిగ్గా మాట్లాడేది...' అన్న విధంగా వుంది.
ఇంతకు ముందు ఐలయ్య రాసిన పుస్తకాలు, దళిత బహుజన దృక్పథంతో చేసిన ప్రసంగాల పరిచయ ప్రభావమే ఆమెను ఆ విధంగా రాయించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అదే ఐలయ్య స్థానంలో వేరే వ్యక్తి ఉండి ఉంటే సుజాత వ్యక్తీకరణ ఇంకో విధంగా ఉండేది. ఐలయ్యనేమో 'నేనెట్ల హిందువునైత..?' అనే వరకు ఆగక, 'నేనెట్ల తెలంగానోన్నైత' అన్న తీరుగా రాస్తుండడం స్కాలర్లకేకాక స్కూలు పిల్లలకు కూడా బాగానే తెలిసింది. ఈ తీరు సుజాతనే కాక తెలంగాణలోని సకల జనులను, ఇక్కడి అన్ని వృత్తికులాల వారినీ, బి.సి. మైనారిటీ కులాలను, తెగలను కూడా కలవరపెట్టింది. ఐలయ్య అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం.
తన భావవ్యక్తీకరణ తనది. కాని తెలంగాణ ఉద్యమంలో (నాయకత్వంలో కాదు) స్వరాష్ట్రకాంక్షతో ఉన్న దళిత, సబ్బండ కులాలు, ఆదివాసీలు, ముస్లిం, ప్రభుత్వ రంగ ఉద్యోగులు, కార్మికులు, ప్రత్యేకంగా విద్యార్థుల గురించి ఐలయ్య నిర్థారణలు చేయడం మాత్రం తన వ్యక్తిగత విషయం కానేరదు. అది ఆ ఇద్దరు వ్యాసకర్తల వ్యక్తిగత విషయం అంతకంటే కాదు. 'కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా, తెలంగాణ, సీమాంధ్ర అగ్రకుల నాయకత్వం, తెలంగాణ పేరుతో శూద్ర కులాలను ఉద్వేగంలో ముంచెత్తి దహించి వేస్తుంది' అని ఐలయ్యతో పాటు వీరిద్దరు వ్యాసకర్తలు కూడా చెపుతున్నారు.
వీరు మాత్రమే కాంగ్రెస్ కుట్రలను కొత్తగా డిస్కవరీ చేసినట్లు దానినే పట్టుకొని విమర్శస్తున్నట్లు పదేపదే చెప్తున్నారు. అయితే దొరలు చేసే ద్రోహాలు, కుట్రలు తెలవందెవరికి..? అవి అందరికీ తెలిసినవే కదా... ఇవేవి చరిత్ర, వర్తమానాలలో కొత్తవికావు. అయినా వీటిని విప్పిచెప్పడంలో ఎవరికీ అభ్యంతరం లేదు. కాని '...శూద్ర కులాలను ఉద్వేగంలో ముంచెత్తి దహించివేస్తుంది...' అని వీరు అనడం చూస్తే.. తెలంగాణ శూద్రులను వీరు ఏమి అర్థం చేసుకున్నారు అనేదే ప్రశ్న.
స్వరాష్ట్రం కోసం సబ్బండ కులాలు ఉద్యమం చేస్తున్నపుడు తమ మూలాలను, తాము ఆకాంక్షించే కొత్త రాష్ట్రంలో తమ భవిష్యత్తును, దేవులాడుకుంటున్న క్రమంలో పరాయీకరణకు గురౌతున్న తెలంగాణ సహజ వనరులను, మాయమైన తమ మగ్గాలను, పాడుబడిన వాములను, చల్లారిపోయిన కొలిమిలను, ఇక్కడి అగ్రకులాల తోడ్పాటుతో సెజ్‌లలో కార్పొరేట్ల చేతులవడ్డ తమ విలువైన భూములను కోల్పోతున్న నేపథ్యం నుంచి ఇక్కడి జనం ప్రత్యేక తెలంగాణను కోరుకుంటున్నారు. ఈ పోరాటంలో ఆత్మగౌరవాన్ని, హక్కులను బలంగా నిలబెట్టుకోవడానికి మహాత్మాజోతిరావు ఫూలేను, సావిత్రిబాయిఫూలేను, డా.బి.ఆర్.అంబేద్కర్, కాన్షీరామ్‌ల సిద్ధాంతాలను ఆలోచనలను ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు.
చెప్పేదేమంటే, సీమాంధ్ర, సమైక్యాంధ్ర అగ్రకులాల కుట్రలే కాదు... వాటిని లెక్కపెట్టకుండా తాము చేసిన పోరాటం, ఆత్మగౌరవ పోరాట వ్యక్తీకరణలు తెలంగాణ చరిత్రలోనూ, ఇప్పుడు ఇక్కడనే ఉన్నాయి. వీటన్నిటిని ఎవరు గుర్తించాలి? ఆధిపత్యకులాల వారు ఎందుకు గుర్తిస్తారు? మన బహుజనులే గుర్తుంచుకోవాల్సి ఉన్నది. దీన్ని గుర్తించి అందుకు సిద్ధాంత తాత్విక దిశను సూచించే బదులు, 'శూద్రులు, బహుజనులు మత్తులో ఉన్నారని, ఉద్వేగంలో మునిగినారని, గొడ్లలాగ తలలూపుతున్నార'ని అనడం ఈ బహుజనులను మరోమారు అవమానపర్చడమే అవుతుంది. అలా కాకుండా బహుజన ప్రజల గురించి కొంతైనా బాధ్యతతో మాట్లాడతారని ఆశిస్తారు.
తెలంగాణ ప్రజలు దశాబ్దాల తరబడి పరాయిపాలనలో టైగర్‌జోన్ పేరుతో, సింగరేణి ఓపెన్ కాస్ట్ మైనింగ్ పోలవరం పేరుతో, సెజ్‌లు, థర్మల్ ప్రాజెక్టుల పేర్లతో తమ సర్వస్వం, పరాయీకరణకు గురౌతూ ధ్వంసమౌతుంటే ఎంతో సంక్లిష్టస్థితులలో కూడా శాంతియుతంగా ఉద్యమిస్తుంటే... దీనినే అడ్డంగా వ్యతిరేకించడం ఏమనుకోవాలి?
తెలుగుదేశం, కాంగ్రెస్‌లకు, చంద్రబాబుకు, టిజి వెంకటేశ్, జెసి. దివాకర్‌రెడ్డిలకూ, వీరి సమైక్యాంధ్ర సర్కార్‌కు, జగన్, కిరణ్, లగడపాటి, కావూరి లాంటి వారికీ అయిలయ్య, వేణుగోపాల్ రెడ్డి బండారి, సుదర్శన్ బాలబోయినలకు నడుమ ఉన్న తేడా ఏముంది? ఇదే పెట్టుబడిదార్లు, రాజకీయ నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమం నడిపిస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలను వారు చీ కొట్టినప్పుడు 'తెలంగాణలో గుడ్లగూబలు కూడా గుడ్లు పెట్టవు..' అన్నప్పుడు జవాబుగా ఐలయ్య ఆయన శిష్యులు ఏమైనా వ్యాసాలు రాశారా?
ఈ ఇద్దరు వ్యాసకర్తలూ, ఐలయ్య కూడా దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిద్దాం. ఎందుకంటే వెనుకబడిన కులం, ప్రాంతీయ అస్తిత్వం నేపథ్యం నుంచి ఐలయ్య వచ్చారు కాబట్టి ఎవరైనా తన సపోర్టును ఆశించడంలో తప్పు లేదు. గీంతదానికే ఒంటికాలు మీద లేవడం అవసరమా? అది పితృస్వామ్య ఆధిపత్య లక్షణం తప్ప మరేం కాదుగదా!
- గోగు శ్యామల
తెలంగాణ మహిళా రచయితల మేధావుల వేదిక
Andhra Jyothi News Paper Dated 10/01/2012
Saturday, December 24, 2011
ఆమె దారి ఆదర్శం..!
తెలంగాణ రాష్ట్రం వస్తే బొమ్మరిల్లులా దిద్దుకుంటం’ అని ఏర్పడబోయే కొత్త రాష్ట్రం రూపురేఖలను, స్వభావాన్ని నాడే తేల్చి చెప్పింది టి.ఎస్. సదాలక్ష్మి. ప్రత్యేక రాష్ట్రం పట్ల తన ఆకాంక్షతో పాటు, స్పష్టమైన అవగాహన కలిగి ఉన్న ఆమె 1969 నాటి ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆమె తన ఉద్యమ ఆచరణ ద్వారా గడించిన అనుభవం, పోరాట పటిమల గురించిన వివరమంతా తెలంగాణ చరివూతలో ముఖ్యభాగమే.
ఒక తల్లి తన పిల్లలకు వివరిస్తున్న తీరులో తన చివరిరోజుల్లో సైతం, ‘ఎప్పుడైనా.. తెలంగాణ రావాలంటే చెయ్యాల్సింది ఒక్కటే’ అని కరాఖండిగా చెప్పారు. ‘తెలంగాణలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చుండి ఒక నిర్ణయం తీసుకుని, మాకు తెలంగాణ రాష్ట్రం కావాలె మేం సపరేటవుతమని గట్టిగా నిర్ణయించుకుంటే, తప్పకుండా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టగలుగుతారు. ముందయితే మీరు ఏకతాటిమీదకు రాండ్రి!’ అని సూటిగా చెప్పగలగడానికి తన సుదీర్ఘమైన రాజకీయ ఉద్యమ జీవిత నేపథ్యమనే చెప్పుకోవాలి. తెలంగాణలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చుండి ఒక నిర్ణయం తీసుకోవాలని సదాలక్ష్మి చెప్పిన ప్రకారంగా 1969 నాటి తొలి దశ ఉద్యమంలో గానీ లేదా మలిదశ ఉద్యమం నాటికి గానీ తెలంగాణలోని రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చి ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది.
ఈ రకమైన ఐక్యత కోసమే కేసీఆర్ తన ఆమరణ నిరాహారదీక్ష తరువాత అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలవడం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఐక్యపోరాటాన్ని వివిధ అంచెలుగా ఉద్యమాన్ని కొనసాగించడాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. డిసెంబర్ 23 ప్రకటన వెలువడి రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఉద్యమం సకల జనుల సమ్మె స్థాయిని అందుకున్నప్పటికీ తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చుండి ఒక నిర్ణయం తీసుకోవాలని సదాలక్ష్మి చెప్పిన ప్రకారంగా ఐక్యం కాలేకపోవడం దారుణం. ఆరు దశాబ్దాలకుపైగా తెలంగాణ ప్రజలు రాష్ట్రం కోసం దశలవారీగా పోరాటం చేస్తున్నారు. అనేక వైవిధ్యాల ప్రజాసమాజాలైన ఉత్పత్తి కులాలు, ఉత్పత్తియేతర ఆధిపత్య కులాలు, తెగలు, దళిత కులాలు, మతాలు ఈ ఉద్యమంలో భాగమయ్యాయి.
సమాజంలో అన్ని రంగాలు వైద్య, న్యాయ, విద్య, విద్యుత్తు, రక్షణ, మున్సిపల్, పారిశుద్ధ్య, అడ్మినివూస్టేషన్లలోని ఉద్యోగులు ఉద్యమంలో తమ భాగస్వామ్యాన్ని చాటారు. సమాజంలో వివిధ అంతరాలు ఉన్నట్టు, వివిధ రంగాలలో అంతరాలున్నాయి. ఉదాహరణకు అధికారి నుంచి గుమాస్తా వరకు, ఆఫీసర్ల నుంచి రోడ్లు ఊడ్చే స్వీపర్ల వరకు అంతరాలు, ఆధిపత్యాలు లేకుండా జై తెలంగాణ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు అద్భుతమైన పోరాట రూపాలను ఆవిష్కరిస్తున్నారు. ఈ పోరాటాన్ని నిర్వహిస్తున్న నాలుగు తరాలు ఒక కుటుంబంలో ఉండి వారసత్వంగా పోరాటాన్ని నడిపిస్తున్నారు. సకల జనుల సమ్మె స్థాయి వరకు ప్రజలు చారివూతాత్మకమైన పోరాటం చేస్తున్నప్పటికీ, రాజకీయ పార్టీలు, నాయకులు ఎప్పటికప్పుడు ప్రజల ఆకాంక్షలను అణచివేస్తూ ప్రజావూదోహులుగా కొనసాగుతూ వస్తున్నా రు.
కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన ద్రోహాలు ఒక క్రమం అయితే స్థానికంగా తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నాయకులు నేతలు చేసిన ద్రోహం మరొక క్రమంగా చెప్పుకోవాలి.
తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కొంతమంది సీమాంధ్ర పెట్టుబడిదారులకు, ఢిల్లీలో తిష్ట వేసిన కాంగ్రెస్ పార్టీలోని దోపిడీశక్తులకు తొత్తులుగా మారారు. వారి బానిసబుద్ధికి మించిన ద్రోహబుద్ధి మరొకటి లేదు. వీరు చేసే దుష్ట చేష్టల వల్లనే తెలంగాణ మోసం మీద మోసం జరుగుతున్నది. అది పెనం నుంచి పొయ్యిల పడుతున్నది. ఇవి ఒకటి తర్వాత ఒకటి బయటపడ్డాయి.
1. తెలంగాణ ప్రజల డిమాండ్ ప్రకారం రాజీనామాలు చేయకపోవడం
2. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడానికి అధిష్ఠానాన్ని ఒప్పించే సామర్థ్యం వీరికి లేకపోవడం.
3. అవకాశం చేతికొచ్చినప్పుడు కనీసం అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకపోవడం అనేది ప్రజావూపతినిధులుగా వారు నిర్వహించాల్సిన బాధ్యతను విస్మరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజావూపతినిధులు అనే మాటకు వీరు తెలంగాణ రాష్ట్రం విషయంలో పూర్తిగా అర్థం మారేలా వ్యవహరించారు. ఈ సందర్భంలో టి.ఎస్. సదాలక్ష్మి నాటి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షురాలిగా ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆ వారం పది రోజుల్లోనే ర్యాలీలు, సత్యాక్షిగహాలు, దీక్షలు, జైల్‌భరోలు, మానవహారాలు, సత్యాక్షిగహాలతో ఆంధ్ర సర్కారును గడగడలాడించారు.
ఇది ఒక ఎత్తుఅయితే 1969 మార్చి 8,9 తేదీలలో రెడ్డి హాస్టల్‌లో నిర్వహించిన కన్వెన్షన్‌తో హైదరాబాద్ మొత్తం దిగ్బంధం అయిన సంగతి నాటి ప్రధాని ఇందిరాగాంధీ తెలుసుకున్నారు. హుటాహుటిన అర్ధరాత్రి ఫ్లెట్‌కు హైదరాబాద్‌లో దిగారు అంటేనే ఆ కన్వెన్షన్ ప్రభావం ఎంత ఉందో మన ఊహించుకోవచ్చు. ఆంధ్ర గవర్నర్‌తో జాతీయ జెండాను ఎగురవేయనీయలేని గట్స్ సదాలక్ష్మివి. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందడ్డి సదాలక్ష్మి తఢాఖాకు తట్టుకోలేక బుల్లెట్ ఫ్రూఫ్‌ను ధరించారు. ఒకానొక ఆర్థిక గడ్డు పరిస్థితుల్లో తన బంగారు నగలు, వెండి సామాను అమ్మి వచ్చిన డబ్బుల తో ఉద్యమం నడిపిందని నేటికి ఆమె శిష్యులు చెబుతారు. నాయకురాలిగా నేటికీ సదాలక్ష్మి అనుభవాలు, ఆలోచనలను తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ టీడీపీ నాయకులు వ్యక్తిగతంగా, రాజకీయంగా అనుసరించక తప్పదు. అప్పుడే ప్రజావూపతినిధులుగా వారు రాజకీయ భవిష్యత్తును కలిగి ఉంటారు. లేదా రాజకీయ భవిష్యత్తు ఉండదని వారు సదాలక్ష్మి జయంతి సందర్భంగానైనా పునఃపరిశీలన చేసుకోవాలి.
-గోగు శ్యామల
తెలంగాణ మహిళా రచయితల మేధావుల వేదిక
నేడు టి.ఎస్. సదాలక్ష్మి జయంతి
Saturday, October 15, 2011
గాంధీ-కోతి కథలు వద్దు - గోగు శ్యామల Andhra Jyothi Dated 16/10/2011
గాంధీ-కోతి కథలు వద్దు
- గోగు శ్యామల
తెలంగాణ స్వరాష్ట్ర పోరాటం గూర్చి కంచ ఐలయ్య ఒక సామాజిక శాస్త్రవేత్తగా తెగ బాధపడుతున్నారు. 'గాంధీతాతా నువ్వే చెప్పు' (అక్టోబర్ 11, ఆంధ్రజ్యోతి) అన్న ఐలయ్య వ్యాసం ప్రకారం ఆయన బాధపడుతున్న అంశాలివి: (అ) తెలంగాణ బిసిలు, 'కమ్మ క్యాపిటల్' పాలన తెలంగాణ ప్రజలకు ఒక వరంలా ప్రాప్తించిన తరువాతనే కొంతైనా బతుకు దెరువులతో అటు ఇటు కదలగలుగుతున్నరట;
(ఆ) రెడ్లు, కమ్మలు అధికారం కోసం కొట్లాడుకుంటుంటే కమ్మలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని బాధను వ్యక్తం చేసిండు; (ఇ) ఇదే సమయంలో తెలంగాణ రెడ్లను, వెలమలను కమ్మొళ్ళు తమ కాళ్ల కింద తొక్కేసిండ్రని ఇంకో తీరు బాధపడ్డడు; (ఈ) అన్ని రంగుల పార్టీల కోతులన్నీ కరప్షన్‌తో చిన్న రాష్ట్రాల ఉద్యమాన్ని జోడించి సోనియా గాంధీని ఇటలీకి పంపించాలని వ్యూహం పన్నుతున్నారని బాధపడ్డడు.
ఒక దిక్కు ఢిల్లీలో రాజఘాట్ దగ్గర మూడు కోతుల వెనుక ఓ అజ్ఞాత కోతికూడా ఉందని ఐలయ్య అంటుండు. మరి ఈ కోతుల గుంపును ఉత్తర తెలంగాణలో తంతే హైదరాబాద్ పరుపులో పడ్డరని రాసిండు. ఐలయ్య ప్రకారం తన్నింది గూడా కోతే గదా? తన్నింది, తంతె పడింది ఒకే జాతి కోతులే గదా? తెలంగాణ ఇస్తే హైదరాబాద్‌లో గుజరాత్ మారణకాండ రిపీట్ అయితదని అసదుద్దీన్ ఓవైసీని మించి అనవసర బీకర భాష వాడి పంచాంగం చెప్పిండు. అయినా ఒక చిన్న ప్రశ్న. తాను చెప్పిన ఆ అజ్ఞాత కోతికి కాశాయ కోతికి జోడీ కుదిర్చి.. వానర రామదండుకు నాయకత్వానికి జోడీ కుదిర్చి ఊచకోత పంచాంగం జెప్పిండు.
ఇంత జోడీలు కుదిర్చె ఐలయ్యగారు బహుజనుల జోడీలను యాడ ముదిరిపెట్టిండు? అసలు ఆయన జెప్పే పంచాంగం ఏంది? బహుజన పంచాంగమా? సోనియా గాంధీ కాంగ్రెస్ పంచాంగమా? విశాలాంధ్ర, సమైక్యాంధ్ర కోసం ఈ కోతుల పంచాంగమా? అంబేద్కర్ చిన్న రాష్ట్రాల ఆవశ్యకత సూత్రీకరణను డిస్‌ప్రూఫ్ అని చెప్పే ప్రయత్నం చేయడానికి గాంధీ మనుమడి అవతారమెత్తిండేమో?
ఐలయ్య ఒకటి మాత్రం గుర్తించుకోవాలి. మనువాదులకు, ద్విజులకు, ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని అవతారాలెత్తినా అంబేద్కర్ సిద్ధాంతాన్ని డిస్‌ప్రూఫ్ చేయడానికి సాధ్యం కాలేదని, అంతనుకుంటే తొక్కి పెట్ట వచ్చు, అణిచిపెట్ట వచ్చు. కాని డిస్‌ప్రూఫ్ అనే ప్రసక్తి చరిత్రలో, ముఖ్యంగా వర్తమానంలో జరగలేదు. అయినా ప్రత్యేక తెలంగాణకై బహుజనుల ఆకాంక్ష పట్ల తన వైఖరేందో ప్రకటించలేదు.
'తాతా తాతా' అంటూ గాంధీ చెప్పిన కోతుల కథ ను అడ్డం పెట్టుకొని డొంకతిరుగుడు కథలు చెపుతుండు. ప్రస్తుతం ఈ కథలు చెప్పుడు ఐలయ్యకే కాదు ఎవ్వరికీ సాధ్యపడదు. ఎవ్వరైనా కూడా నాలుగు కోట్ల ప్రజలు మూకుమ్మడిగా 'సకలజనుల సమ్మె'లో పాల్గొని తమ ఆకాంక్షను చాటుతున్నపుడు ప్రత్యేక తెలంగాణకు అనుకూలమా లేక గుప్పెడు దళారీలు, పెట్టుబడీదారులు, మాఫియాలు డబ్బుసంచుల బలంతో ముందుకు తెస్తున్న సమైక్యాంధ్ర, విశాలాంధ్ర డిమాండుకు అనుకూలమా తేల్చి చెప్పాల్సిందే.
నేటి సకల జనుల సమ్మె తెలంగాణ ఉద్యమపు అత్యున్నత దశ. ప్రపంచంలో కనివినీ ఎరుగని రీతిలో ఇది జరుగుతున్నది. ఈ ఉద్యమాన్ని ప్రధానంగా అనేక ఉత్పత్తి కుల, తెగ, జాతి అస్తిత్వాల ప్రజలు నడిపిస్తున్నారు. 1969 కంటె ముందునుంచే లక్షలాది ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆ ఉద్యమం నేడు కోట్ల జనసంఖ్యలో పాల్గొనే దశకు చేరింది. దీనితోపాటు అనేక అస్తిత్వాలు పాలుపంచుకుంటున్న రాజకీయేతర, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమమిది.
'ఇది మాది' 'మాది మాక్కావాలె' అంటే ఈ ప్రాంతం మాది. ఇక్కడి సమస్త వనరులు, నీరు, భూమి మాది అనీ తేల్చి చెపుతున్నారు. "ఇక్కడ పరాయి పాలన వద్దు, మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంట ం!'' అని ఉద్యమం చేస్తున్నరు, ప్రాణ త్యాగాలు చేస్తున్నరు. 'మాకు స్వాతంత్య్రం వచ్చింది' అనుకున్న తరువాత దాదాపు 'భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా మందుకొచ్చిన రాజకీయేతర ప్రాంతీయ అస్తిత్వ అతిపెద్ద ఉద్యమం ఇదే' అని కూడా చెప్పుకోవాల్సి ఉంది.
అయితే అధికార రాజకీయ పార్టీలు, వాటి పెత్తనాన్ని సపోర్టు చేసే శక్తులు బెల్లమున్న దగ్గర ఈగలు ముసిరినట్లు, ఓట్లు, సీట్లు, అధికార అందలం కోసం ఉద్యమం చుట్టూ అలుముకోవచ్చు. వారి వారి పంపకాల సమస్యలు ఉద్యమం చుట్టూ ముసురుకోవచ్చు. అంతమాత్రాన రెడ్డి వెలమ, కమ్మ అనే మూడు పాలకవర్గ కోతులు గుంపు కథ తెలంగాణ రాష్ట ఉద్యమానికి, చోదక శక్తులుగా ఉన్న బహుజనులకు ఎట్ల సరిపోతది? దేశంలో అన్నీ రాజకీయ పార్టీలు, కూటములు, శక్తులు, ప్రభుత్వ వ్యవస్థలు, కాంగ్రెసు, కాషాయ కూటమి మొదలుకొని కమ్యూనిస్టు, మార్క్సిస్టు, లెనినిస్టు, మావోయిస్టుల దాకా తెలంగాణతో సహా యావత్ దేశంలో విఫలమయిన నేపథ్యంలో కోట్ల ప్రజలు పాల్గొని నడుపుతున్న మహా ఉద్యమం నేటి సకలజనుల సమ్మె.
తెలంగాణలో సామ్రాజ్యవాద కార్పొరేట్ల, దళారుల పెత్తనం కింద కొనసాగుతున్న వనరుల దోపిడీని పై రాజకీయ శక్తులు ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలా, కండ్లప్పగించి శ్రోతల తీరులో చూస్తున్నారు. వారి సిద్ధాంతాల నాటి నుంచి నేటి వరకూ పూర్తిగా దిగజారిన నేపథ్యంలోనే స్వరాష్ట్ర ఉద్యమం నడుస్తున్నది. అందుకే అనేక సాంప్రదాయ ఉత్పత్తి వృత్తుల, అస్తిత్వ బహుజన ప్రజల ఆకాంక్షలు నెరవేరకపోగా తరతరాల నాటి కుటుంబ వృత్తులకు, వృత్తులే, జాతులకు జాతులే నేడు అంతర్ధానానికి, అడ్డు, అంతులేని విధ్వంసానికి గురయితున్నవి. ఈ దశలోనే తెలంగాణ ఉద్యమం, సకల జనుల సమ్మె పెల్లుబుకింది.
అంతేకాని ఎవరో మూడు కో తులో, ఏదో అధికార కోతుల గుంపులో, లేదా అజ్ఞాత రాజకీయ కోతులో తెలంగాణ ఉద్యమాన్నిగాని, సకల జనుల సమ్మెను గాని చేయడంలేదు. తెలంగాణ ప్రాంతాన్ని, జీవావరణాన్ని, వనరులను, వీటిపై ఆధారపడి బతికే అనేక ఉత్పత్తి అస్తిత్వాల బహుజన సమాజాన్ని, దాని పోరాట చరిత్రను ఈ కోతుల గుంపులకు మెడలో మెడల్స్‌గా వేసి అప్పజెప్పడమే వ్యాసకర్త ఉద్దేశంగా కనిపిస్తున్నది. ఇది ఏం సామాజిక శాస్త్రం? ఏ సామాజిక వర్గాల ప్రయోజనమో వ్యాసకర్త స్పష్టం చేయాల్సి ఉన్నది.
తెలంగాణ ఉద్యమం పట్ల వలసాంధ్రా కోతి రాజకీయాలకు మన సోషల్ సైంటిస్ట్ బలైండా? బక్రా అయిండా?? ఎందుకంటే ఉద్యమం కీలక దశలోనున ్న సందర్భంలో అడుసుమిల్లి , లోక్‌సత్తా జయప్రకాశ్‌లు, ముఖేష్ నాగేందర్లు, లగడపాటి, రాయపాటి, కావూరి, రేణుకా చౌదరి, శైలజానాథ్, జేసి, టీజీల లొడలొడలన్నీ ఫేలైనవి. ఈ స్థితిలో బహుజన మేధావి అయిన కంచ ఐలయ్యగారి ద్వారా గాంధీ-కోతి కథలతో బహుజనులను బక్రా చేద్దామనుకున్న కాంగ్రెస్ కోతిరాజకీయాలకు తానే బక్ర అయిండా? అన్నది తేలడానికి వారాలు కాదు రోజులు చాలు.
ఇప్పటికైనా సారూ.. కోతి కథలు పక్కకు పెట్టి చెవులు, కండ్లు మూసుడు మాని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ లోతులను, బహుజన ఆకాంక్షలను ఉన్నదున్నట్లు మాట్లాడితే బాగుంటుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం, వలసాంధ్ర దోపిడి పీడనల నుంచి విముక్తి కోసం లక్షలాది మంది ప్రభుత్వోద్యోగులు, ఎవరికి వారుగా, సమిష్టిగా - సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, న్యాయ శాఖలోని ప్రభుత్వోద్యోగులకు తోడు అడ్వొకేట్లు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, యాజమాన్యాలు, టీచరు మొదలుకొని అన్ని తరగతుల ఉద్యోగులు, ఆఫీసరు మొదలుకొని గుమాస్తా వరకు సమ్మె చేస్తున్నరు.
ఇదే సకలం, కనీవినీ ఎరుగని రీతిలో కొనసాగుతున్నది. కులవృత్తులవారిగా చూస్తే చాకలి, మంగలి, అవుసుల తదితర పంచదాయిల పోరాటం, మాదిగ, గొల్లకుర్మ, ముత్రాసి, గంగపుత్రులు, బేగరి, గౌడు, లంబాడ, కోయ, గోండు, మున్నూరుకాపు, మాల, ముస్లిం, క్రిస్టియన్, అర్చకులు, జండరు పరంగా అన్ని అస్తిత్వ సమాజాల్లోని స్రీలు పోరాడుతున్నారు. ప్రతిపనిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ప్రజలు పోరాడుతూ వందలాది విద్యార్థుల బలిదానాలతో, కష్ట నష్టాల కోర్చి సకల జనుల సమ్మె వరకు చేరుకున్నారు.
అద్వితీయమైన నేటి మన సకల జనుల సమ్మెను పట్టుకొని 'గీ చిన్న తెలంగాణ' అనీ ఒక సోషల్ సైంటిస్ట్ అంటాడా? ఈయనకు గీ తెలంగాణ రాష్ట్రం బాధకన్నా.. గా 'సోనియా కాంగ్రెస్‌ను, అధికారంను వదిలి ఇటలీ తిరిగి పోతన్నదే' అనే బాధనే మిన్ననా? ఇదేం తర్కమో బహుజనులు బాగానే అర్ధం చేసుకోగలరు. వలసవాద కోతి రాజకీయాలను, రాజకీయ శక్తులను బాగానే అర్థం చేసుకున్నందువల్లనే సకల జనుల సమ్మెలో పాల్గొంటున్నరు. మొదటిసారి తెలంగాణలో అన్ని దళారీ రాజకీయ పెత్తనాలను తిరస్కరించి స్వతంత్ర ఇచ్ఛతో తమ తమ సమస్యలకు స్వతంత్రమైన స్వపరిపాలన, రాజకీయ అధికారాల కోసం తమ భవిష్యత్తును నిర్ధారించుకునే దిశగా, నిర్మించుకునే దిశగా తెలంగాణ కోసం సకల జనులు కదిలిండ్రని అర్ధం చేసుకోవాల్సి ఉంది.
- గోగు శ్యామల
రచయిత్రి
Subscribe to:
Posts (Atom)
