Showing posts with label ఉ.సా. Show all posts
Showing posts with label ఉ.సా. Show all posts

Friday, November 29, 2013

నవ ‘భారత రత్న’ (మహాత్మా ఫూలే) By ఉ.సా


మహాత్మా ఫూలే ఆధునికారంభ కాలంనాటి భవిష్యత్తు కాల దార్శనికత కాల పరీక్షలో నెగ్గి ఆధునికానంతర కాలంలో సైతం మన దేశ బడుగు వర్గ బహుజనులకు క్రాంతి దర్శిగా, దేశీయ లౌకిక సామాజిక ప్రజాస్వామ్య శక్తులకు స్ఫూరిదాయకంగా నేటికీ మార్గనిర్దేశం చేస్తోంది. నవంబర్‌ 27న ఫూలే 123వ వర్ధంతి సందర్భంగా ఆ మహాత్ముని పాత్రను ఓసారి సంస్మరించుకుందాం. ఆనా డు మహాత్మా ఫూలేే తాను జీవించిన కాలం (1827-90) నాటి సమ కాలీన ఆధునిక ప్రపంచగమ నాన్ని గమనించి, ఆ కాలం తెచ్చిన జ్ఞానోదయ మహోదయాన్ని సమర్ధవంతంగా ఆకళింపు చేసుకొన్నాడు. ప్రగతిశీల లౌకిక ప్రజాస్వామ్య హేతుబద్ధ ఆధునిక ప్రాపంచక దృక్పథంతో ఆనాటి మన దేశ కాల స్థితిగతులకు ఆధునికతను అన్వయించడంలో సృజనాత్మక, చరిత్రాత్మక పాత్ర నిర్వహించాడు. 

తాను ఆకళింపు చేసుకొన్న ఆధునిక ఆలోచనా లోచనాలతో నవభారత నిర్మాణానికి నాందిపలికాడు. అందుకే ఆ నవభారత పితామహుడు మహాత్మ ఫూలే మనదేశ వినీలాకాశంలో ఆధునిక వైతాళిక ధృవతారగా నేటికీ వెలుగొందు తున్నాడు. 1855లో ఫూలే రాసిన నవయుగ నవభారత రత్న లాంటి ‘తృతీయ రత్న’ నాటికే ఆ చరితార్ధుని ఆధునిక తాత్త్వికతకి చారిత్రక సాక్ష్యాధారంగా నిలుస్తుంది.ఇప్పటికి (2013) 158 ఏళ్లక్రితం 1855లో మహాత్మా ఫూలేే మరాఠీ మాతృభాషలో, వ్యవహారిక పరిభాషలోరాసిన ‘తృతీయ రత్న’ నాటిక నేటికీ ఇంగ్లీషు లింకు భాషలోకి, మిగతా దేశ భాషల్లోకి తర్జుమా కాకపోవడంతో ఈ మహోన్నత ఆధునిక తాత్త్విక రచన సందేశం అందాల్సిన వాళ్లకి, అందాల్సిన సమయంలో అందకుండా పోయింది. ఈ లోటు పూడ్చే విధంగా ఇప్పుడు ఈ గ్రంథాన్ని తెలుగులో తేవడం జరిగింది.ఫూలే రచనల్లో ‘గులాం గిరి’ ముఖ్యమైన రచనే అయినా, అంతకంటే గొప్ప రచనగా పేర్కొనదగిన ‘తృతీయ రత్న’ ఆ ప్రాముఖ్యతను సంతరించుకోలేకపోయింది. 

1855లో ఫూలే తొలిరచనగా ‘తృతీయ రత్న’ ప్రచురితమైన 18 ఏళ్ల తర్వాత, 1873లో ప్రచురితమైన ‘గులాంగిరి’ ఎంత ప్రామాణికమైనదైనా, అంతకంటే ముందే దానికి తాత్త్విక భూమికను సమకూర్చిన ‘తృతీయరత్న’ అంతకంటే తలమానికమైనది. బ్రాహ్మణీయ వైదికార్య వేదవేదాంగ వర్ణాశ్రమ చారిత్రక మూలాలను వెలికి తీసే హేతుబద్ధ చారిత్రక దృక్పథంతో తన సమకాలీన సామాజిక స్థితిగతులను వాస్తవికంగా అంచనా వేసిన ‘గులాంగిరి’ ఇతివృత్తం సిద్ధాంత అవగాహనకు సంబంధించినది. ఆధునిక ప్రాపంచిక దృక్పథాన్ని అలనాటి మనదేశ పరిస్థి తులకు సృజనాత్మకంగా అన్వయించి, అప్పటి దేశకాల స్థితిగతుల దశాదిశ నిర్దేశం చేసిన ‘తృతీయ రత్న’ ఇతివృత్తం ఆధునిక తాత్త్విక దృక్పథానికి సంబంధించి నది. ఏ సిద్ధాంత అవగాహనకైనా, మరే అవగాహనకైనా తాత్త్విక భూమికే తలమానికం. కనుక బ్రాహ్మణేతర సిద్ధాంత గ్రంథమైన ‘గులాం గిరి’ ప్రామాణికమైనదైతే, భారతదేశ ఆధునిక తాత్త్వికతకి అద్దంపట్టే ‘తృతీయ రత్న’ దానికి తలమానిక మైన దవుతుంది.

1855లో మహాత్మా ఫూలే రాసిన ‘తృతీయ రత్న’ లేదా తృతీయ నేత్ర అనే నాటిక ఆయన తొలి రచనగా పరిగణ పొందుతున్నా మూఢాచార గాఢాంధకార చీకట్లను పారద్రోలిన పొద్దు పొడుపు లాంటి ఆ జ్ఞాననేత్ర రచనకంటే ముందే- 1848లోనే తొలికోడి కూతలాంటి మేలుకొలుపుతో ఆయన తన బ్రాహ్మణేతర సామాజిక విప్లకార్యాచరణకు అంకు రార్పణ జరిపాడు. భారత దేశంలోనే, దేశ చరిత్రలోనే తొట్టతొలి సారి ఫూలే సావిత్రి భాయి ఫూలేే దంపతు లిద్దరూ శూద్రాతి శూద్ర బాలబాలికల కోసం ప్రప్రథమ ప్రాథమిక పాఠశాలలు తెరిచారు. ‘తృతీయ రత్న’ నాటికలోని ముఖ్యపాత్రలైన పాటిల్‌- జోగాభాయి భార్యాభర్త లిరువురిని అలాటి వయోజన విద్యాలయాల్లో చేర్చడంతోనే ఆ నాటికకి ముగింపు పలికారు. అందుకే ఫూలే తన ‘తృతీయ రత్న’ నాటికకి ‘తృతీయ నేత్ర’ అని కూడా మరో పేరు పెట్టారు.తృతీయ రత్న లేదా తృతీయ నేత్ర నాటికలో మహాత్మఫూలే నిక్షిప్తంచేసిన రెండు ముఖ్యాంశాల్ని ప్రస్తావించుకోవాలి.

ఇందులో ఫూలే రెండురకాల తృతీయ ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించాడు. బ్రాహ్మణీయ హిందూ పునరుద్ధరణ వాదులకు (రివైవలిస్టులు), సంస్కరణవాదులకు (రిఫామిస్టులు) భిన్నంగా బ్రాహ్మణేతర హిందూయేతర బహుజన సామాజిక విప్లవ (రెవల్యూషనిస్టు) ప్రజా పంథాని తృతీయ ప్రత్యామ్నాయంగా ప్రతిపాదిం చాడు. తదుపరి బ్రిటిష్‌ రాజ్‌కి, హింద్‌ స్వరాజ్‌కి భిన్నంగా ‘స్వతంత్ర బహుజనరాజ్‌’ రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ప్రతిపాదించాడు. జీవితాన్ని బట్టే చైతన్యం ఉంటుందని ఫూలే జీవితాచరణ చెప్పకనే చెబుతోంది. ఇది తన జీవితం ఒడిలో నేర్చుకొన్న జీవితానుభావం, జీవితావసరం. అభ్యుదయవాదులైన అగ్రవర్ణ మార్క్సిస్టులకు విప్లవం అవసరం కాదు, ఆదర్శం. ఫూలేకి ఆదర్శమే కాదు, అవసరం. అగ్రవర్ణ నేషనలిస్టులకు అది ఆదర్శం కాదు, అవసరమూ కాదు. కారణం వారి జీవితం కుల పీడనకు గురైన పీడిత కులం కాదు.

బడిలో కలిసి చదువుకోవడం వలన ఓ బ్రాహ్మణ విద్యార్థితో ఏర్పడిన స్నేహ సంబంధంతో- 1848లో అతని వివాహానికి హాజరైనప్పుడు జరిగిన అవమానకరమైన సంఘటన బ్రాహ్మణిజంతో రాజీలేని పోరాటానికి ఫూలేేని పూర్తిగా సంసిద్ధం చేసింది. అట్టడుగు పాదాల నుండి పుట్టిన శూద్రులు అగ్రవర్ణాల వారి పాదాల దగ్గర బానిసల్లా పడి ఉండే గులాం గిరి చేయకుండా, శూద్ర ధర్మాన్ని అతిక్రమించి బ్రాహ్మణుల పెళ్ళి ఊరేగింపులో పాల్గొని- అగ్రకుల దురహం కారులు- ‘బ్రాహ్మలందరి కంటే వెనక నడువ్‌, లేదా వెనక్కి వెళ్ళిపో’ అని శాసించిన అవమానకరమైన సంఘటన ఫూలేేలో స్వాభిమాన చైతన్యా నికి నాంది పలికింది. ఆధునిక వ్యక్తిగత స్వేచ్ఛా, సమాన త్వాలను కులం నియం త్రిస్తుం దనే సత్యం జీవిత ఆచరణలో బైటపడి జ్ఞానోద యమైంది. కులవ్యవస్థని, కుల నియంత్రణని దెబ్బతీయకుండా, కుల అంతస్థుల్ని కూలదోసే కుల విప్లవ పోరాటాన్ని నిర్మించకుండా ఆధునిక ఫలాలు అందరికీ సమానంగా అందవన్న సత్యం అనుభవంలోకి వచ్చింది. జీవితాచరణలో వచ్చిన ఈ అనుభవమే ఫూలే సత్యశోధక విప్లవాత్మక ఆలోచనా విధానానికి ప్రేరణనిచ్చింది. అగ్రవర్గాలకు ఊడిగం చేయటమే శూద్రుల విధఇని, అందువల్ల విద్యా విజ్ఞానం, ఆస్తి, అధికారం వారికి నిషేధం అని, ఈ విధి నిషేధాల ఆంక్షల్ని అతిక్రమిస్తే శిక్షకు గురికాక తప్పదని మనుధర్మం శాసిస్తుంది.

‘విధి నిషేధాల శిక్షాస్మృతి మనుస్మృతి’ శాసించే ఈ అనుశాసనంతో ఈ బ్రాహ్మలు శూద్రాతి శూద్రులను శాసించడం లేదా? అనే మౌలికమైన ప్రశ్నని పాత్రోచిత సంభాషణల ద్వారా ఫూలే లేవనెత్తుతాడు. ఈ మౌలిక ప్రశ్నకు సమాధానంగా ‘మనుధర్మ ధిక్కారం ధర్మధిక్కారం కాదు, అధర్మ ధిక్కారం’, అని ‘బ్రాహ్మణధిక్కారం దైవధి క్కారం కాదు, అదైవ ధిక్కారం’ అనే బ్రాహ్మణేతర సామాజిక విప్లవ చైతాన్యాన్ని రగిలిస్తాడు. ఇది తొలిమెట్టు. ఇలా నాలుగు స్థాయిల్లో బ్రాహ్మణేతర సామాజిక విప్లవ చైతన్యాన్ని పెంపొందించటం కోసం ‘బోధించి, పోరాడి, సమీకరించేందుకు’ ఈ నాటికను ఆచరణాత్మక సాధనంగా చేసుకొన్నాడు. తదుపరి ఈ దృక్పథాన్ని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓ సందేశాత్మక నినాదంగా మార్చాడు. మహాత్మా ఫూలేని తన గురువుగా గౌరవించిన అంబేడ్కర్‌ సార్వజనీన మత లక్షణం లేకపోవటమే కాదు, అసలు మత లక్షణమే లేని ‘సనాతన ధర్మ’ నిజానికి మతమే కాదన్నాడు అని చాటిచెప్పాడు. సార్వజనీన ఆధ్యాత్మిక మత ధర్మానికి విరుద్ధమైన ఈ సంకుచి తత్వానికి బ్రాహ్మణిజమే మూలకారణం అని ఎత్తి చూపుతాడు. 
ఈ మత ధర్మమే మనుధర్మానికి మూలాధారమని ఫూలే స్పష్టంచేస్తాడు. 

బ్రాహ్మణులకు అద్వితీయ అగ్రజాత్యాన్ని కట్టపెట్టటం కోసమే బ్రాహ్మణులను దైవ సమానులను చేశారని చెపుతాడు. బ్రాహ్మణీయ అగ్రవర్ణాలకు ఊడిగం (గులాంగిరి) చేయడం కోసమే శూద్రులను రెండుకాళ్ల పశువులుగా ద్వితీయ స్థానానికి, అతిశూద్రులను పశువులకంటే హీనంచేసి తృతీయస్థాయికి నెట్టారంటారు. అలా ఈ వర్ణాశ్రమ బ్రాహ్మణిజం- ఎవరి వర్ణాన్ని బట్టి వారు, ఎవరికి వారు తమ వర్ణ ధర్మాన్నే స్వధర్మంగా భావించి స్వచ్ఛందంగా అనుసరించే స్వచ్ఛంద బానిసత్వాన్ని నెలకొల్పిందని తేల్చి చెప్పారు. దాన్నే గులాంగిరి అని పేర్కొన్నారు. చాతుర్వర్ణాశ్రమ సనాతన ధర్మాన్ని రక్షించే అనుశాసనమే మను శాసనం అని చెప్పాడు. ఇక మనుధర్మాన్ని ధిక్కరిస్తే శంభూకునిలా శిరచ్ఛేదం చేయడానికి ఇది ప్రాచీన యుగం నాటి రామరాజ్యం కాదన్నాడు. శూద్రాతిశూద్రుల తలకాయల్ని ఏనుగులచేత పుచ్చకాయల్లాగా తొక్కించటానికి ఇది మధ్యయుగాల నాటి బ్రాహ్మణీయ పీష్వా రాజుల రాజ్యంకాదన్నాడు. 

చట్టంముందు, విద్యముందు అందరూ సమానమే అని చెప్పే రూల్‌ ఆఫ్‌ లా పాటించే ఆంగ్లేయుల ప్రభుత్వం మధ్యయుగాల నాటి రాచరిక రాజ్యం కాదని, అది ఆధునిక యుగమని చెప్పి వారికి జ్ఞానోదయాన్ని కలిగించాడు. ఒక్క మాటలో విద్యా విజ్ఞాన ఆధునిక జ్ఞానోదయా లతో పాటు పౌరసమాజానికి సంబంధించిన సాంఘిక, సాంస్కృతిక, భావజాల రంగాల్లో బ్రాహ్మణేతర భావ విప్లవ మహోద్యమమే శూద్రాతిశూద్ర బహుజనులను మేల్కొల్పుతుందని ఈ నాటిక చాటి చెబుతుంది. దురాచారాల్ని రూపుమాపే హేతుబద్ధ ఉద్యమం, సాంస్కృతిక పునర్జీవనోద్యమం, బ్రాహ్మణ మతానికి ప్రొటెస్ట్‌ తెలిపే పొటెస్టాంట్‌ ఉద్యమం- నిర్మించిన ఫూలే బ్రాహ్మణేతర భావజాల విప్లవ పోరాటమే- సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక విప్లవ పోరాటానికి తాత్విక భూమికను సమకూర్చింది. ఫూలే స్థాపించిన సత్యశోధక సమాజ్‌ బడుగు వర్గ బహుజనుల పురోగతి కోసం, ప్రగతి కోసం, సాధికారత కోసం- సాంఘిక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక న్యాయ పోరాటానికి శంఖంపూరించింది. అందుకే ఆయన్ని సామాజికన్యాయ పితామహు డిగా చరిత్ర రికార్డు చేసింది. కనుక తృతీయ రత్న లాంటి తృతీయ నేత్ర నాటికను బ్రాహ్మణిజంపై బ్రాహ్మణేతర బహుజనుల తిరుగుబాటుగా అభివర్ణించవచ్చు.
నేడు మహాత్మా ఫూలే వర్ధంతి

Surya Telugu News Paper Dated : 27/11/2013 

Saturday, October 26, 2013

సీమాంధ్ర అగ్రకుల కురుక్షేత్రం By ఉ.సా,


విభజన ప్రక్రియ వేగవంతం
ఇంకా పరిరిస్తామంటున్న నేతలు 
ఓటు బ్యాంకు కోసమే సమైక్యవాదం 
అభద్రతాభావం అగ్రకుల పాలక వర్గాలకే! 
బడుగు వర్గాలను అణచివేసే ఎత్తుగడ 
స్వయం కృషితోనే బడుగులకు అధికారం 

ఓ పెద్ద భాషా రాష్ట్రంగా 1956లో అవతరించిన ఆంధ్ర ప్రదేశ్‌ 56 ఏళ్ల తర్వాత తెలంగాణ, ఆంధ్ర అనే రెండు చిన్నరాష్ట్రాలుగా విభజితం కాబోతోంది. విభజన ప్రక్రియని నిరోధించి సమైక్యాంధ్రను పరిరక్షించి తీరుతాం అంటూ సమైక్యాంధ్ర పరిరక్షకభటులు అశోక్‌బాబు, కిరణ్‌బాబు, జగన్‌బాబు, చంద్రబాబులు పునరుద్ఘాటిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానం, యుపిఎ క్యాబినెట్‌ నోట్‌, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, విభజన విధి విధానాలపై మంత్రిత్వ శాఖల కార్యదర్శుల కసరత్తు, విభజన బిల్లు రూపకల్పన వంటి చర్యలతో విభజన ప్రక్రియ వేగవంతమవుతూనే ఉంది. కనుక సమైక్యాంధ్ర రక్షకభటుల మేకపోతు గాంభీర్యం ఎలాఉన్నా, ఆచరణలో వారు విభజన పరిణామాన్ని నివారించలేకపోతున్నారన్నది నిజం. ఈ సంగతి సామా న్యాంధ్రుల కంటే ఈ సోకాల్డ్‌ సమైక్యాంధ్రవాదులకే బాగాతెలుసు. ప్రత్యేకతెలంగాణ రాష్ట్రఏర్పాటు అనివార్యమని తెలిసే, తెలంగాణపోతే పోయిందని సీమాం ధ్రపై రాజకీయ ఆధిపత్యం కోసం వారు పడుతున్న పాట్లని, పన్నుతున్న ఎత్తుగడల్ని పరిశీలించి చూస్తే అసలు సంగతి బయటపడుతుంది. అయినా ఇంకా సమైక్యాంధ్రని పరిరక్షిస్తామని సీమాంధ్ర సామాన్యాంధ్రుల్ని మభ్యప్టెటంలో మరుగు పడిన మర్మం ఏమిటన్నదే పసిగట్టాల్సిన ముఖ్యాంశం. రాష్ట్ర విభజన అనివార్యమైతే జరిగే పరిణామం ఏమిటో పరిశీలిస్తే ఈ మర్మాన్ని పసిగట్టేందుకు ఆధారం దొరుకుతుంది. ప్రత్యేక తెలంగాణరాష్ట్రం ఏర్పడితే వెంటనే ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా రాయలసీమాంధ్రప్రాంతం దానంతటదే మరో రాష్ట్రంగా ఏర్పడుతుంది. అంటే సీమాంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతంతో ఉన్న భౌగోళిక ప్రాదేశిక సంబంధం తెగిపోయి తెలంగాణ ప్రాంతం తెలంగాణ వారి స్వపరిపాలనాధికారం క్రిందికి పోతుంది. 

విశాలాంధ్రలో వలసాంధ్ర పెట్టుబడిదారీ, పెత్తందారీ పాలనకి తెరపడిపోతుంది. ఆ రకంగా తమ అక్రమఆస్తులకు, వలసాధిపత్యానికి భత్రలేని అభద్రతా భావాన్నే సామాన్యాంధ్రుల అభద్రతా భావంగా చిత్రిస్తున్నారు. తమ స్వప్రయోజనాలకోసం తెలంగాణని అడ్డుకోవడాన్నే సామాన్యాంధ్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణగా చిత్రిస్తున్నారు. పాలకవర్గాల భావననే ప్రజల సమైక్య భావనగా చలామణి చేస్తున్నారు. భౌగోళిక ప్రాదేశిక సంబంధంతో పాటు సీమాంధ్ర కమ్మ, రెడ్డి అగ్రకులాధిపత్య శక్తులకు- తెలంగాణలోని వెలమ, రెడ్డి అగ్రకులాధిపత్య శక్తులకు అగ్రకుల సామాజిక సంబంధం కూడా తెగిపోయి, అగ్రకులాధిపత్య సంఘటితశక్తి అసంఘటితశక్తిగా మారి శక్తిహీనమవుతుంది. నిజానికి ఈ పరిణామంలో ఇమిడి ఉన్న భాషా ప్రయుక్త, ప్రాదేశిక అంశాలకంటే అగ్రకులాధిక్య సామాజికాంశమే వారికి కీలకాంశం. ఈ అంశమే సమైక్యాంధ్ర పరిరక్షణలో మరుగుపరచిన అసలుమర్మం. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చనంతా భాషా ప్రయుక్త, ప్రాదేశిక అంశాలకే పరిమితం చేస్తున్నారు. అలా చేయటంలో కూడా వారి పన్నాగం ఉంది.
‘ఒకే జాతి, ఒకే భాష, ఒకే రాష్ట్రం’ అంటూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వారు ఎక్కుపెట్టిన సమైక్యాంధ్ర నినాదానికి డబుల్‌ ఎఫెక్ట్‌ ఉంది. 

ఒకవైపు అది విభజన పరిణామాన్ని నివారించే ఎత్తుగడగా పనిచేస్తుంది. మరోవైపు రాష్ట్ర విభజన నివారించలేని అనివార్య పరిణామం అని తెలిసినా, ఆ నిజాన్ని కప్పి పుచ్చి తమ స్వప్రయోజనాల కోసం విభజన వ్యతిరేక సెంటిమెంట్‌తో కూడిన సమైక్యాంధ్ర భావోద్వేగాన్ని రగిలిస్తుంది. ఆ భావోద్వేగాన్ని కాంగ్రెస్‌ వ్యతిరేక, సోనియా వ్యతిరేక రాజకీయ ఎత్తుగడగా మలచుకుంటారు. విభజనకి కారణమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రఏర్పాటును వ్యతిరేకించే నెపంతో, తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి సీమాంధ్రప్రాంతాన్ని ఓట్‌బ్యాంక్‌జోన్‌గా మార్చుకునే ఎత్తుగడగా ఉపయోగపడుతుంది. ఈ సీమాంధ్ర ప్రాంతీయతత్వం ముసుగులో రాయలసీమ రెడ్డి సామాజిక వర్గానికి- కోస్తాంధ్ర కమ్మ సామాజిక వర్గానికి మధ్య రగులుతున్న అగ్రకులాధిపత్య పోటీని మరుగుపరచే అవకాశం లభిస్తుంది. 

ఇరువర్గాలు కలిసి ఎస్‌.సి, ఎస్‌.టి, బిసి మైనార్టీ బడుగువర్గాలను అణచివేసే అగ్రకుల యత్నాన్ని కప్పిపుచ్చటానికి తోడ్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ పెద్ద రాష్ట్రం, తెలంగాణ- ఆంధ్ర చిన్నరాష్ట్రాలుగా విడిపోవడంవలన తెలంగాణ ఆంధ్ర అగ్రకుల సామాజికశక్తులకు మధ్యఉన్న అగ్రకులాధిపత్య సంఘటిత సామాజిక సంబంధం అసంఘటితంగా మారిన సామాజిక పరిణామాన్ని బడుగువర్గ చిన్నకులాల సాధికారతకి ఉపయోగపడకుండా పక్కదారి పట్టించే పన్నాగానికి తోడ్పడుతుంది. ఈ పన్నాగమే సమైక్య సీమాంధ్ర ప్రాంతీయతత్వ సామాజిక మర్మం.అందుకే తెలంగాణ ఉద్యమం ‘తొలికోడి కూత’ లాంటిదని, తెలంగాణ వ్యతిరేక, సీమాంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమం కీ ఇస్తే మోగే ‘అలారం మోత’ లాంటిదని అంబేడ్కరిస్టు కవి మిత్రుడు కోయి కోటేశ్వరరావు వ్యాఖ్యానించాల్సి వచ్చింది. అప్పుడు 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌, తెలుగుదేశం, కమ్మ, రెడ్డి అగ్రకుల సామాజిక వర్గాలు తెలంగాణ సెంటిమెంట్‌ని ఓట్‌బ్యాంక్‌ ఎత్తుగడగా వాడుకొని ఏరుదాటి తెప్పతగలేసి పరవంచనకి పాల్పడిప్పుడు వారికి ఈ సమైక్యాంధ్ర సెంటిమెంట్‌ గుర్తుకురాలేదు. ఇప్పుడు సమైక్యాంధ్ర సెంటిమెంట్‌తో సీమాంధ్ర ప్రాంతీయ తత్వాన్ని ఓట్‌బ్యాంక్‌ ఎత్తుగడగా మలుచుకొని ఆత్మవంచనకి పాల్పడుతున్నప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ గుర్తుకు రావడంలేదు. 

ఎక్కడైనా ఎప్పుడైనా ఈ అగ్రకులాధిపత్య పాలవకర్గ శక్తులకు అధికారమే పరమావధి తప్ప, ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్‌ పట్ల గాని, సీమాంధ్ర సమైక్యాంధ్ర సెంటిమెంట్‌ పట్ల గాని వారికి ఎలాంటి కమిట్‌మెంట్‌ లేదు.
అందుకే తాము తెలంగాణ సెంటిమెంట్‌ని గౌరవిస్తామని, తాము తెలంగాణ ఇచ్చేవాళ్లం కాదు, ఇస్తే అడ్డుకొనే వాళ్లం కాదని ఆనాడు చిలకపలుకులు పలికిన వైఎస్‌ఆర్‌సిపి అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన రాగానే ప్లేటు ఫిరాయించారు. ఇరు ప్రాంతాల సమన్యాయం అంటూ సన్నాయి నొక్కులు నొక్కి చివరికి సీమాంధ్రలో సమైక్యాంధ్ర సమరశంఖం పూరించి, సీమాంధ్రకి తానే ఏకైక పొలిటికల్‌ హీరోగా మారాలని చూస్తున్నాడు. ఆముసుగులో రెడ్డి సామాజికవర్గాన్ని సమీకరిస్తూ అగ్రకులాధిపత్యాన్ని నెలకొల్పుకుంటు న్నాడు. అదే సమయంలో తన ప్రత్యర్ధి అయిన కమ్మ సామాజికవర్గ ఆధిపత్యాన్ని, ఆ వర్గానికి కొమ్ముగాసే తెలుగుదేశాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు. తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం లేఖ ఇవ్వడం వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందని దుమ్మెత్తిపోస్తూ ఆత్మస్తుతి పరనిందలకి పాల్పడుతున్నాడు. మరోవైపు ఈఅగ్రకులాధిపత్య సీమాంధ్ర రాజకీయకురుక్షేత్రంలో తానెక్కడ వెనుకబడి పోతానో అని బెంబేలెత్తుతున్న టిడిపి అధినేత చంద్రబాబు పోటీ దీక్షలతో, పోటీయాత్రలతో జగన్‌తో పోటీపడుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటువల్ల సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ఎదురయ్యే సమస్యల్ని పట్టించుకోకుండా, సమన్యాయం పాటించకుండా రాజకీయ లబ్ధి కోసం ఏకపక్ష నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలుగుజాతి ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని సీమాంధ్రప్రజల్లో తెలంగాణ వ్యతిరేకతను, కాంగ్రెస్‌ వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఉన్న తెలుగుదేశాన్ని సర్వనాశనం చేయడం కోసమే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఈ ఘాతుకానికి పాల్పడిందనిచెప్పి ‘సోనియా క్విట్‌ ఇండియా’ అంటూ నినదించారు సీమాంధ్ర ప్రజల్లో పెల్లుబుకుతున్న కాంగ్రెస్‌ వ్యతిరేకతను వైసిపి సొమ్ము చేసుకోకుండా అడ్డుకట్ట వేయడంకోసం కాంగ్రెస్‌కి- వైసిపికి మధ్య మ్యాచ్‌ఫిక్సింగ్‌ జరిగిందని ఎండగడుతున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌ తన సొంత పార్టీని సైతం ఫణంగా పెట్టి దత్తపుత్రుడైన జగన్‌ని దరి జేర్చుకుందని చాటింపు వేస్తున్నాడు. 
తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపట్ల సీమాంధ్రలో పెల్లుబుకుతున్న కాంగ్రెస్‌ వ్యతిరేకత కాంగ్రెస్‌కి రాజకీయంగా నష్టంచేసే పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పునరాలోచనలో పడేది. గతంలో లాగా రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయేది. కానీ తెలంగాణ అనుకూల ఓటుతో తెరాసని, తెలంగాణ వ్యతిరేక ఓటుతో వైసిపిని దరి జేర్చుకునే ఎత్తుగడలతో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కి పాల్పడింది గనుకనే ఆ భరోసాతో రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేస్తోందని వారి గుట్టును రట్టు చేస్తున్నాడు. రాష్ట్ర విభజన వేగవంతం చేయటానికి కాంగ్రెస్‌కి సహకరించి, సిబిఐ కేసునుండి బయటపడటానికి కాంగ్రెస్‌ సహకారం తీసుకొనే పరస్పర సహకార ఒప్పందం కుదుర్చుకున్న వైసిపి అవకాశవాదం, సమైక్యావాదం ముసుగులో విభజన వాదమేనని ఎండగడుతున్నాడు. 

ఆ రకంగా పరోక్షంగా సమైక్యాంధ్ర పరిరక్షణలో తనకు తానే సాటి తప్ప జగన్‌లాంటి వాళ్లు తనకు పోటీ రాలేరని చాటి చెపుతున్నాడు. అయినా ఎందుకైనా మంచిదని రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యాన్ని తట్టుకోవడంకోసం, రెడ్డి సామాజికవర్గం సమీకరణను అడ్డుకోవడంకోసం కాంగ్రెస్‌లోని కాపు సామాజికవర్గాన్ని తమవైపు తిప్పుకోవటం ద్వారా పై చేయి సాధించే ఎదురు ఎత్తుగడ వేశాడు. కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవి సోదరులు నాగబాబు, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతున్నారని తమ మీడియాద్వారా పుకార్లు పుట్టించారు. తమని సంప్రదించకుండా ఊహాగానాలతో తమపై ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారాలు చేయడం అనైతికంఅని వారు బహిరంగంగా ఖండించాల్సి వచ్చింది. కానీ చాపక్రింద నీరు లాగా ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. అందుకు కారణం లేకపోలేదు. సీమాంధ్ర ప్రాంతంలోని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రెడ్డి సామాజికవర్గం వారంతా, కాంగ్రెస్‌ అధిష్ఠాన దత్తపుత్రుడైన జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీలోకి ప్లేటు పిరాయిస్తున్నారు. అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డి, కడపలో అదినారా యణరెడ్డి వంటివారు ఇప్పటికే వైసిపిలోకి ఫిరాయించారు. 

ఇంకా అనేకమంది అదే బాట పట్టేట్టున్నారు. అలాగే కాంగ్రెస్‌లోని కమ్మ సామాజికవర్గం ప్రతినిధి రాయ పాటి సాంబశివరావు వంటివారు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరడానికి లేదా మరో పార్టీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అదే వర్గానికి చెందిన లగడపాటి వంటివారు జగన్‌తో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ సంగతి బాహాటంగా బయట పెడుతూ కాంగ్రెస్‌ ఆ దత్తపుత్రుడిపై ఆధారపడితే తమ భవిష్యత్తేమిటి అని నిలదీస్తున్నారు. ఆ రకంగా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీలోని కమ్మ, రెడ్డి సామాజికవర్గాలు వైసిపిలోకో, తెలుగుదేశంలోకో ఫిరాయిస్తే ఇక కాంగ్రెస్‌లో మిగిలేది కోనసీమ కళింగ సీమలకు చెందిన కాపు- తూర్పు కాపు సామాజిక వర్గాలే. సీమాంధ్రలో కాంగ్రెస్‌ పట్ల పెల్లుబికుతున్న వ్యతిరేకత వల్ల నష్టపోయేది కూడా ఆ సామాజికవర్గాలే. కనుక ఆ వర్గాన్ని తెలుగుదేశం వైపు తిప్పుకుంటే కమ్మ- కాపు సామాజికవర్గాల కలయిక వల్ల పల్నాటి సీమ, కోనసీమ, కళింగసీమ ప్రాంతాల్లో కోస్తాంధ్ర అంతటా తెలుగుదేశం తిరుగులేని శక్తిగా మారుతుంది. జగన్‌వర్గం, రెడ్డివర్గం వైసిపిని కేవలం రాయలసీమకు పరిమితంచేసి ఏకాకినిచేస్తే సీమాంధ్రలో అధికారం తెలుగుదేశం కైవసమవుతుంది.

ఇలా కమ్మ రెడ్డి, కురు పాండవుల మధ్య ఓ వైపు అంతర్గత అగ్రకులాధిపత్య కుల కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుండగా మరోవైపు కురు పాండవులేకమై నూరు+ అయిదు= నూట అయిదై, బడుగువర్గ కులాల ప్రతినిధులపై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నారు. ఉత్తరాంధ్ర కళింగ సీమలో పిసిసి అధ్యక్షుడు బొత్సా సత్యనారాయణ విద్యాసంస్థలపై, ఆస్తులపై విధ్వంసక దారులకు పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో బొత్సను రాజకీయంగా అప్రతిష్ఠపాలు చేయడం కోసం శాంతిభద్రతల సమస్యను సృష్టించి కర్ఫ్యూ విధించే పరిస్థితి కల్పించారు. అందుకు వారిపై ఆగ్రహించిన బొత్స సత్యనారాయణ 4, 8 శాతం కంటే మించిలేని కమ్మ రెడ్డి సామాజికవర్గాలే ఎల్లకాలం రాజ్యమేలాలా, చిన్న రాష్ట్రాల్లో అయినా బడుగువర్గ చిన్న కులాలు సాధికారత సాధించటాన్ని వారు సహించలేరా అని బహిరంగంగానే తన అక్కసు వెళ్లగక్కారు. కోనసీమలో దళిత సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపి హర్షకుమార్‌ విద్యాసంస్థలపై, ఆస్తులపై విధ్వంసక దాడులకు పాల్పడ్డారు. పల్నాటిసీమలో మరో దళిత సామాజికవర్గ ప్రతినిధి రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్య రావుపై, ఆయన ఇంటిపై భౌతికదాడలుకు దిగారు. అదే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో అధిష్ఠాన ఆదేశానికి కట్టుబడి ఉంటామని నిర్ణయం జరిగినా ఆయనపై ఎక్కడా ఈగ వాలలేదు. అలాగే కమ్మ సామాజికవర్గానికి చెందిన పురంధేశ్వరి విజయవాడ నడిబొడ్డున అధిష్ఠాన నిర్ణయాన్ని సమర్ధిస్తూ సమావేశం జరిపినా సమైక్యవాదు లెవరూ ఆమెని పల్లెత్తుమాట అనలేదు. 

నన్నపనేని రాజకుమారి తెలుగుదేశం అయినా, పురంధరేశ్వరి కాంగ్రెస్‌ అయినా- పార్టీలకతీతంగా వారిరువురూ లగడపాటి కమ్మ సామాజికవర్గానికి చెందినవారు కనుక బెజవాడలో వారికి బ్రహ్మరథం పట్టారు. ఇదంతా గమనిస్తే చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాల సాధికారతకి తోడ్పడుతుందని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ చెప్పిన జోస్యాన్ని బడుగువర్గాల వారు గ్రహించనీయకుండా చేయడం కోసమే ఈ అగ్రకుల సామాజికాంశాన్ని చర్చకు రానీయకుండా జాగ్రపడుతున్నారు. సమైక్యాంధ్ర పేరిట సీమాంధ్ర ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ఆ ముసుగులో సాగుతున్న అగ్రకుల కురుక్షేత్ర సంగ్రామాన్ని కప్పిపుచ్చాలని చూస్తున్నారు. ఇంతజరుగుతున్నా బడుగువర్గ అంబేడ్కరిస్టులు ఈ పన్నాగాన్ని పసిగట్టి ఎండగట్టడంలో విఫలమైనారు. ఎలాంటి స్వయంకృషి లేకుండా, ఈ సావకాశాన్ని సకాలంలో సద్వినియోగంచేసుకొనే క్రియాశీలకపాత్ర లేకుండా- చిన్నరాష్ట్రాల ఏర్పాటు దానికదే చిన్నకులాలను అందలమెక్కించదు. కాకపోతే అగ్రకులాధిపత్య శక్తుల దయాదాక్షిణ్యాలపై పూర్తిగా ఆధారపడి ఉండే ఆశ్రీతవాద దుస్థితిలో కొంతమార్పు తెచ్చి, స్వయంశక్తితో స్వతంత్రశక్తిగా మారి సాధికారత సాధించే సావకాశం లభిస్తుంది.

ఈ నేపథ్యంనుంచి చూసినప్పుడు విశాలాంధ్రలో అయినా, విభజనాంధ్రలో అయినా, తెలంగాణ- ఆంధ్ర విలీనంలో అయినా, అలీనంలో అయినా భౌగోళిక ప్రాదేశిక అంశంతో సామాజికఅంశం కూడా ముడిపడి ఉంటుందని ఆనాడే చాటిచెప్పిన అంబేడ్కర్‌ సమగ్ర దృక్పథాన్ని ఆకళింపు చేసుకోకపోతే ఈ చారిత్రక సదావకాశాన్నికూడా సద్వినియోగం చేసుకోలేం. పైగా చిన్నరాష్ట్రాల్లోకూడా పెద్ద కులాలే పాగా వేసే పరిస్థితి పునరావృతమవుతుంది. ఆశ్రీతవాద అవకాశవాద కుహనా సామాజిక న్యాయ దళారీ శక్తులే దండుగట్టి అగ్రకుల శక్తులకు అండదండలందిస్తాయి. ఇదే ఇప్పుడు నడుస్తున్న వర్తమాన చరిత్ర. ఈ చరిత్రను తిరగరాయకుండా, మరో చరిత్రను సృష్టించలేమని ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది.

Suryaa Telugu News Paper Dated: 27/10/2013 

Sunday, October 20, 2013

పెద్ద రాష్ట్రాలు- పెద్ద కులాలు By ఉ.సా,


రాష్ట్రాల ఏర్పాటులో సావూజిక అంశాలు 
సీవులో ప్రధాన అగ్రకులంగా రెడ్లు 
కోస్తాలో కవ్ము కుల ఆధిపత్యం 
తెలంగాణలో వెలవు, రెడ్ల ప్రాబల్యం 
అణిగి వుణిగి ఉంటున్న బడుగు కులాలు
అన్ని భాషా రాష్ట్రాలో అగ్రకులాధిక్యతే 
ప్రజాస్వావ్యు ప్రయోజనాలు నిష్ఫలం 

భాషా రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకతను నెరవేర్చేటప్పుడు ఆ రాష్ర్ట భౌగోళిక ప్రాదేశిక అంశంతో పాటు, ఆ ప్రదేశానికి సంబంధించిన ప్రజల సామాజిక స్థితిగతుల అంశాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి అంబేడ్కర్‌ ఆలోచనలను పరిశీలిస్తే ఈ సమగ్ర దృక్పథం ఆవశ్యకత ఏమిటో స్పష్టంగా అర్ధమవుతుంది. ‘భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సందర్భంలో ఆ భాషా రాష్ర్టం స్వ యం పోషకంగా మనగలుగు తుందా? అనే అంశాన్ని మొదగా పరిశీలించాలి. తదుపరి రెండవ అంశంగా ఆయా (పెద్ద, చిన్న) రాష్ట్రాల ఏర్పాటుకి సరిపడినంత భౌగోళిక విస్తీర్ణం, తగినంత జనాభా నిష్పత్తి ఉన్నాయా అనే అంశాల్ని పరిశీలించాలి. మూడవ అంశంగా ఆ రాష్ట్ర జనం ఏఏ కులాలకు చెందినవారో, ఆ కులాల పొందిక, ప్రభావం వివిధ ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో, ఆ ప్రాంతపు అస్తిత్వం యొక్క సాంసృ్కతిక ప్రత్యేకత ఏమిటో పరిశీలించాలి’ అంటారు నవభారత రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్‌. అంబేడ్కర్‌. 

‘దేశ మంటే మట్టి కాదోయ్‌ మనుషులోయ్‌’ అన్నట్లు భారత దేశమైనా, ఆంధ్రప్రదేశమైనా ప్రాదేశిక అంశాన్నే గాక మానవ సమాజానికి సంబంధించిన సామాజిక అంశాల్ని కూడా పరిణలోకి తీసుకోకపోతే, దేశభక్తి- ప్రాదేశిక స్వాతంత్య్రానికే పరిమితమై దేశ ప్రజల స్వాతంత్య్రాన్ని విస్మరిస్తుంది. అలాగే భాషా రాష్ర్ట వాదుల భాషాభిమానం భాషారాష్ట్రాల ఏర్పాటుకే పరిమితమై, ఆయా రాష్ట్రాల ప్రజల బాగోగుల సంగతి విస్మరిస్తుంది. పెద్ద రాష్ట్రాల సంగతే కాదు చిన్న రాష్ట్రాల సంగతైనా అంతే. అందుకే పెద్ద, చిన్న భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును సమగ్రదృష్టితో పరిశీలించిన అంబేడ్కర్‌ ఆలోచనలు అంత శాస్త్రీయతను, ఆచరణీయతను సంతరించుకొన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద రాష్ట్రాలు పెద్ద కులాల విషయంలో ఆయన చేసిన సాధారణ విశ్లేషణ ఏమిటో పరిశీలిద్దాం. అలాగే భాషారాష్ర్టం పేరిట వివిధ ప్రాంతాల్ని విశాలాంధ్రలో విలీనం చేసిన ఆంధ్రప్రదేశ్‌ వంటి పెద్ద రాష్ర్టం విషయంలో స్వయంగా ఆయన చేసిన ప్రత్యేక విశ్లేషణని ప్రత్యేకంగా పరిశీలిద్దాం. 

‘భాషా ప్రయుక్త (పెద్ద) రాష్ట్రాల్లో ఒకటి రెండు ప్రధాన కులాలు అగ్రకులాలుగా, మరికొన్ని ఇతర కులాలు అధిక సంఖ్యాక ప్రాబల్య కులాలుగా పెద్ద సంఖ్యలో ఉంటాయి. అలాంటి ప్రధాన అగ్రకులాలపై, ఇతర అధికసంఖ్యాక ప్రాబల్య కులాలు- ఆ రెండింటిపై అల్పసంఖ్యాక అస్పృశ్యకులాలు ఆధారపడి, అణిగిమణిగి ఉండే కుల వ్యవస్థ సర్వ సాధారణ వ్యవస్థగా అన్ని భాషా రాష్ట్రాల్లో కొనసాగుతుంటుంది’ అన్నారు. ఈ సాధారణత్వానికి ఆంధ్రప్రదేశ్‌ మినహాయింపు కాదు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌ భాషా రాష్ర్టంలో కోస్టల్‌ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతీయ సాంస్కృతిక ప్రత్యేకతలో వైవిధ్యం ఉంది. ఈ వైవిధ్యాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లోని కులాల పొందిక, ప్రభావాలు కూడా విభిన్నంగా ఉన్నాయి. రాయలసీమలో రెడ్డి కులం ప్రధాన అగ్రకులంగా ఆధిపత్యం చలాయిస్తున్నది. కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలపై కోసాంధ్ర కమ్మ కులం ప్రధాన అగ్రకులంగా ఆధిపత్యం చలాయిస్తున్నది. ఇక తెలంగాణ ప్రాంతంలో ఉన్న కులాలపొందిక మరోవిధంగా ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వెలమ కులం అగ్రకులంగా గుత్తాధిపత్యం చలాయిస్తుంటే, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో రెడ్డి కులం మరో అగ్రకులంగా గుత్తాధిపత్యం చలాయిస్తోంది. వలసాంధ్రకులంగా తెలంగాణకి వలసవచ్చిన కమ్మ అగ్రకులస్థులు తెలంగాణ అంతటా గణణీయంగానే ఉన్నారు. 

తెలంగాణలో ఉన్న వెలమ కులం, రాయలసీమాంధ్రలో ఏ ప్రాంతంలోనూలేదు. తెలంగాణ-ఆంధ్ర రెండు ప్రాంతాలను పోల్చిచూస్తే రాయలసీమలో ప్రధానంగా, ఇతర కోస్తా జిల్లాల్లో పాక్షికంగా ఉన్న రెడ్డి అగ్రకులం తెలంగాణలో కూడా ప్రధాన అగ్రకులంగా ఉండటంతో రెండు ప్రాంతాల కలయిక వలన దాని అగ్రకుల సంఘటిత శక్తి రెట్టింపయ్యింది. తెలంగాణ, ఆంధ్ర వంటి చిన్న రాష్ట్రాల విలీనం వల్ల ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ పెద్ద రాష్ర్టంలో, భౌగోళిక వైశాల్యంతో పాటు రెడ్డి అగ్రకులం జనాభా నిష్పత్తి, దాని సంఘటిత శక్తి కూడా ప్రబలంగా పెరిగిపోయి అది అత్యంత శక్తిమంతమైన ఆధిపత్యకులంగా పరిణమించింది. అలాగే తెలంగాణలో తిష్ఠ వేసిన వలసాంధ్ర కమ్మ కులం, వెలమ కులంతో చేతులు కలిపి రెడ్డి అగ్రకుల గుత్తాధిపత్యానికి గట్టి పోటీదారుగా మారింది. 

ఆ రకంగా ప్రాంతాల వారీ, కులాలవారీ పొందికను బట్టి, పోటీని బట్టి భాషా ప్రయుక్త రాష్ర్టం పేరిట వివిధ ప్రాంతాల్ని విశాలాంధ్రలో విలీనం చేసిన తొలిభాషా రాష్ర్టంగా ఆంధ్రప్రదేశ్‌ పెద్ద రాష్ట్రాన్ని ఓ ఉదాహరణగా తీసుకుని సామాజిక విశ్లేషణ చేసిన అంబేడ్కర్‌ ‘ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్‌నే తీసుకొంటే ఆ భాషా ప్రయుక్త (పెద్ద) రాష్ర్టంలో రెడ్డి, కమ్మ వంటి రెండు ప్రధాన అగ్రకులాలు వివిధ ప్రాంతాల్లో గుత్తాధిపత్యం చలాయిస్తున్నాయి. వ్యవసాయం, వ్యాపారం, ఉన్నతోద్యోగాల్లాంటి ముఖ్యరంగాలపై ఆ రెండు ప్రధాన అగ్రకులాలే ఆధిపత్యం చలాయిస్తున్నాయి. అధిక సంఖ్యాక ఇతర వెనుకబడిన కులాలకు, అల్ప సంఖ్యాక అస్పశ్య కులాలకు చెందిన బడుగువర్గ చిన్న కులాలవారు అగ్రకులాధిపత్య (పెద్ద) కులాలపై ఆధారపడి అణగిమణిగి బ్రతుకు ఈడుస్తున్నారు...

...ఇలాంటి భాషా ప్రయుక్త (పెద్ద) రాష్ట్రాల్లో చిన్నకులాలవారు తమ అభ్యున్నతికి, సాధికారికతకి (ఈ అగ్రకులాధిపత్యశక్తులను ఎదిరించి) ఆస్కారం ఉందని ఆశించేందుకు ఏం మిగిలింది? తాము స్వయంగా (రిజర్వేషన్లు లేకుండా) శాసనసభకు ఎన్నిక కాగలమని చిన్న కులాల వారు ఆశించగలరా (రిజర్వేషన్లులేని బడుగువర్గ బిసి కులాల వారికి రాజ్యాధికారంలో కనీస ప్రాతినిధ్యమైనా లభిస్తున్నదా?)! ప్రభుత్వ ఉద్యోగాల్లో (ఉన్నతోద్యోగాల్లో బిసిలు 5 శాతం మించడం లేదు) తమ వాటా తాము పొంది ఈ సమాజంలో తమకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని నిలబెట్టుకోగలమని వారాశించగలరా? తమ ఆర్థిక ప్రగతి కోసం ఆ భాషా ప్రయుక్త (అగ్ర కులాధిపత్య పెద్ద) రాష్ర్ట ప్రభుత్వం శ్రద్ధ వహించగలదని వారు విశ్వసించగలరా? ఈ రకమైన దుస్థితి నెదుర్కొంటున్న బడుగువర్గ చిన్న కులాల వారి సామాజిక స్థితిగతుల్లో సామాజిక మార్పు తీసుకురాకుండా, కేవలం భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పరచడమంటే దాని అర్థం ప్రధాన అగ్రకులాధిపత్య శక్తులకు ఆయా భాషా రాష్ట్రాల్లో స్వపరిపాలనాధికారం కట్టబెట్టటమే అవుతుంది. అప్పుడు అలాంటి రాష్ట్రాలను కేవలం (ప్రాదేశికంగా) భాషా ప్రయుక్తరాష్ట్రాలు అనేకంటే (సామాజికంగా) ఆంధ్రప్రదేశ్‌ని రెడ్డి (కమ్మ) రాష్ర్టమని, పంజాబ్‌ని జాట్‌ రాష్ర్టమని, మహారాష్ర్టని కున్బీ మరాఠా రాష్ర్టమని అంటే బాగా అర్థమవుతుంది’ అని భాషారాష్ట్రాల అగ్రకుల బాగోతాన్ని బట్టబయలు చేశారు. 

అందుకే అంబేడ్కర్‌కి భాషా ప్రయుక్త రాష్ట్రాల, పెద్ద రాష్ట్రాల ఏర్పాటు పట్ల అంత సదాభిప్రాయంలేదు. కుల వ్యవస్థ ప్రబలంగా ఉన్న భారతదేశంలో సామాజిక సమతుల్యత గురించి పట్టించుకోని భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వల్ల భాషాతత్వం అగ్రకులతత్వానికి మారు పేరుగా పరిణమిస్తుందన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ తెలుగుభాషా రాష్ట్రాన్ని కమ్మ రాష్ర్టం లేదా రెడ్డి రాష్ర్టం అని అనాల్సివస్తుందన్నారు. భాషా రాష్ర్ట ఏర్పాటు వల్ల ఒనగూడే ప్రాదేశిక ప్రజాస్వామ్య ప్రయోజనాన్ని ఈ అగ్రకుల సామాజిక నిరంకుశాధిపత్యం నిష్పయోజనంగా మార్చుతుందన్నారు. ఆయన అన్నట్టే తెలుగు రాష్టమ్రంటే- కమ్మ దేశంగా, రెడ్డి దేశంగా, తెలుగు దేశం పార్టీ అంటే కమ్మ అగ్రకుల శక్తుల కొమ్ముగాసే కమ్మదేశం పార్టీగా, ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే రెడ్డి కాంగ్రెస్‌ పార్టీగా, రెడ్డి అగ్రకుల శక్తుల కొమ్ముగాసే పార్టీగా మారడమే అందుకు నిదర్శనం. అందుకే బడుగు వర్గ చిన్న కులాల హక్కులకు భాషారాష్ట్రాల ప్రభుత్వాల్లో కన్నా కేంద్ర ప్రభుత్వంలోనే ఎక్కువ రక్షణ ఉంటుదని అంబేడ్కర్‌ భావించి దళితుల హక్కులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా కట్టుదిట్టమైన రక్షణ కల్పించాడు. 

అభివృద్ధిని వికేంద్రీకరించడంతో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరించాలని వాదించే నికార్సయిన ప్రజాస్వామ్యవాది అంబేడ్కర్‌, బడుగువర్గ దళిత కులాల హక్కుల రక్షణ భాద్యత కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంచక తప్పదని భావించాడంటే భాషారాష్ట్రాల ముసుగులో నిరంకుశాధిపత్యం చలాయించే ప్రాంతీయ అగ్రకుల శక్తుల ధాష్ఠీకాన్ని ఎంతగా అభిశంసించాడో అర్థమవుతుంది. అలాగని భాషా ప్రయుక్తరాష్ట్రాల ఏర్పాటులో ఇమిడి ఉన్న ప్రజాస్వామ్య సూత్రం ఎడల తన సూత్ర బద్ధ వైఖరిని ఎన్నడూ విడనాడలేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఆవశ్యకత గురించి ఆయన చెప్పినంత గొప్పగా మరే భాషా రాష్ర్ట వాదీ చెప్పలేదంటే అతిశయోక్తి కాదు. ‘ఒక జాతికి చెందిన తామంతా ఒక భాషా మాట్లాడే సజాతీయులం అనే భావనలేని మిశ్రమ భాషా రాష్ట్రాల్లో, ఒక భాష మాట్లాడే వారి పట్ల మరొక భాష మాట్లాడే వారు పరభాషా విద్వేష్వాన్ని, వ్యతిరేకతని కలిగి ఉంటారు.

అందువల్ల ఒకే భాష మాట్లాడే సజాతీయ భావనలేని మిశ్రమ భాషా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం సరిగా పనిచేయలేదని చరిత్ర చాటి చెబుతోంది. కనుక బొంబాయి, మద్రాసు, కలకత్తావంటి మిశ్రమ భాషా రాష్ట్రాల్లో కంటే ఏక భాషాప్రయుక్త రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం మరింత మెరుగ్గా పని చేయగలుగుతుంది’ అని స్పష్టంచేశాడు. కనుక భాషా రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన వ్యతిరేకం కాదు. ఆ మేలిముసుగులో అగ్రకులా ధిపత్య శక్తులు, అధికార దుర్వినియోగంతో అన్యాయానికి, అణచివేతకి పాల్పడకుండా హద్దుల్లో ఉండడానికి ఖచ్చితమైన కొన్ని అదుపాజ్ఞలతో సామాజిక సమతుల్యతను (చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌) కాపాడేలా తగిన చర్యలను తీసుకోవాలన్నాడు. అలాగే అస్పృశ్య అల్ప సంఖ్యాక చిన్న కులాల హక్కుల పరిరక్షణకు ప్రత్యేకమైన రక్షణ చర్యలు (సేఫ్‌గార్డ్‌‌స) తీసుకోవాలన్నారు. 

అంతేకాదు అధికారంలో, అభివృద్ధిలో బడుగువర్గ చిన్నకులాలకు వారి జనాభాకి తగిన ప్రాతినిధ్యాన్ని, భాగస్వామ్యాన్ని కల్పించే విధంగా సమ్మళిత అభివృద్ధితో కూడిన భౌగోళిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పినప్పుడే భాషా ప్రయుక్త రాష్ట్రాలతో కూడిన భారత సంయుక్త రాష్ట్రాల సమాఖ్య బాగుపడుతుందన్నారు. దేశానికి స్వాతంత్య్రం లభించి, ఓటు విషయంలో అందరూ సమానులే అనే రాజకీయ సమానత్వం లభించినా (కుల-వర్గ), సామాజిక- ఆర్ధిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. సాంఘిక, ఆర్ధిక, రాజకీయ సామాజిక న్యాయంతో ఈ సామాజిక అన్యాయాన్ని సామాజిక అసమానతల్ని సత్వరమే రూపుమాపి సామాజిక సమతుల్యత సాధించకపోతే ఎంతో శ్రమకోర్చి రూపొందించుకున్న మన దేశ ప్రజాస్వామ్యం అగ్రకుల ధనిక సామ్యంగా భ్రష్ఠు పట్టిపోతుం దని-రాజ్యాంగాన్ని పార్లమెంటుకు సమర్పించే సమయంలోనే మన దేశ రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. 

సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో అవినీతిమయమైన నేరపూరిత రాజకీయాల నుండి దేశ రాజకీయ రంగాన్ని ప్రక్షాళనం చేయాలని డిమాండ్‌ చేస్తున్న సోకాల్ట్‌ ప్రజాస్వామ్య వాదులు అందుకు మూలమైన బ్రాహ్మణీయ హిందూ మత తత్వ అగ్రకుల ధనిక స్వామ్యాన్ని రాజకీయాలనుండి ప్రక్షాళన చేయాలని మాత్రం నేటికీ కోరడం లేదు. విశాలాంధ్రలో ప్రజారాజ్యం, విశాల భారతావనిలో సమాఖ్యరాజ్యం అని ఆదర్శాలు వల్లించిన ఆనాటి కామ్రేడ్లు సైతం భారత సంయుక్త భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో లౌకిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని సోషల్‌ జస్టిస్‌ సోషలిజాన్ని విస్మరించి విశాలాంధ్ర పేరిట అగ్రకుల వలసాంధ్ర పెట్టుబడిదారీ, పెత్తందారీ రాజ్యాలు నెలకొల్పిన కమ్మ, రెడ్డి కామ్రేడ్లుగా మారారు.

Suryaa Telugu News Paper Dated: 20/10/2013 

Saturday, April 13, 2013

ఫూలేనాటికి మతతత్వం లేదు ---ఉ.సా,



‘కుల మత వేర్పాటు వాద పాచి కలతో భారతదేశ ప్రజలను విభజించి పాలించిన బ్రిటిష్‌ వలస పాల కులు ఆనాడు మన మెదళ్లలో ఎక్కించిన మతోన్మాద మత్తు మతతత్వ విపత్తుగా మారి ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉంది. మన దేశ ప్రజల మెదళ్లలో పేడ, చెత్త పేరుకు పోయి నట్లు మతోన్మాదం నిండిపోయింది. ఉర్ధూ భాష ముస్లింలదని, సంస్కృత భాష బ్రాహ్మణులదని భాషలను సైతం మతంతో కులంతో ముడిపెడుతున్నారు. భారతదేశాన్ని హిందూ దేశం (హిందుస్థాన్‌)గా కాకుండా ఆధునిక లౌకిక ప్రజాస్వామ్య దేశంగా మార్చేందుకు నెహ్రూ హయాంలో కాంగ్రెస్‌ ఎంతో కృషి చేసింది. కానీ ఆ కృషి నిరుపయోగంగా మారింది. అలాగే పాకిస్థాన్‌ దేశాన్ని ఇస్లామిక్‌ దేశంగా మార్చేందుకు ఉగ్రవాద ముఠాలు ఒకరినొకరు హతమా ర్చుకొంటున్నాయి. చివరకు పిల్లలు సైతం స్వేచ్ఛగా బడికి వెళ్లి చదువుకోలేని స్థితి ఏర్పడి పాకిస్థాన్‌ పాగల్‌స్థాన్‌ గామారింది’ అని వాపోతూ ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ జస్టిస్‌ మార్కెండేయ్‌ కట్జూ ఏప్రిల్‌ 6,7 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన ఉర్దూ భాషా సదస్సులో, మీడియా సదస్సులో విమర్శనాత్మక వాఖ్యలు చేశారు.

ఇందుకు మూలకారణాలను వెలికితీస్తూ గత చరిత్రలోకి వెళ్ళి, 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో హిందువులు, ముస్లింలు ఏకోన్ముఖంగా చేసిన తిరుగుబాటును ఎదుర్కొనే క్రమం లో- ఏర్పడిన మత సామరస్యాన్ని, జాతీయ సమైక్యతని దెబ్బతీసే విధంగా బ్రిటిష్‌వారు వారిమధ్య మత విద్వేషాల్ని రెచ్చగొట్టి, మత కలహాలను సృష్టించి మతోన్మాద మతతత్వానికి నాంది పలికారన్నా రు. 1857కి ముందు వరకు మన దేశంలో మతతత్వం లేదని చెప్ప డానికి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో ఇరుమతాలవారు ఏకో న్ముఖంగా తిరుగుబాటు చేయటమే నిదర్శనమన్నారు. 

అదే కాదు మరో నిదర్శనం కూడా ఉంది. 1857కి ఒక ఏడాది ముందు 1855లో మహాత్మ జ్యోతిరావు ఫూలే రాసిన ‘మూడో నేత్రం’ అనే చారిత్రాత్మక నాటిక మరో ఆధారం. బ్రిటిష్‌ వలసపాల కులపై త్వరలో తిరుగుబాటు జరగబోతోందనే రాజకీయ తుఫాన్‌ హెచ్చరిక ఆ నాటికలో నిక్షిప్తమైంది (మరాఠీ మూలం నుండి ఆ నాటిక తెలుగులోకి అనువాదమై పూలే జయంతి రోజున వెలుగు లోకి వస్తోంది). ఆ తదుపరి ఏడాది తర్వాత జరిగిన తిరుగుబాటుకి ఆయన సజీవ సాక్షిగా ఉన్నాడు. కానీ ఆయన ఆ తిరుగుబాటును దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా పరిగణించలేదు. అందుకే దాన్ని స్వాగతించలేదు, సమర్థించలేదు.

బ్రిటిష్‌ వారితో పాటు ఇండియాలో ప్రవేశించిన ఆధునికత వల్ల, కాలానుగుణ్యమైన మార్పులను జరగనీయకుండా ఈ దేశ బ్రాహ్మణీయ అగ్రవర్ణ శక్తులు మోకాలొడ్డి అభివృద్ధి నిరోధక తిరోగామి మార్గం పట్టాయి. పూర్వ వైభవాన్ని తిరిగి పొందటం కోసం, మధ్య యుగాల నాటి ఫ్యూడల్‌ రాచరిక వ్యవస్థను తిరిగి నెలకొల్పటం కోసం బ్రాహ్మణ, క్షత్రియ, మొగలాయి చక్రవర్తులు చేసిన తిరుగుబాటు- ఉమ్మడి రాజ్యకాంక్షతో చేసిన తిరోగమన శక్తుల తిరుగుబాటేతప్ప దేశ స్వాతంత్య్రంకోసం, దేశ ప్రజల అభ్యున్నతి కోసం చేసిందికాదని ఫూలే స్పష్టంచేశాడు. బ్రిట ిష్‌ వలసపాలకులు తుపాకీ తూటాలకు ఆవు, పందికొవ్వు వాడడంవలన హిందు, ముస్లింసైని కులు చేసిన తిరుగుబాటులో కనిపించే ఇరుమ తాలవారి ఐక్యత యాదృచ్ఛికమే. ఆ సంఘటన లు జరగకపోయినా తిరుగుబాటు జరిగేదనని చెప్పాడు.అంతేకాదు ‘ధర్మోరక్షితే రక్షితః’ అంటూ ‘(మను) ధర్మాన్ని రక్షిస్తే (మను) ధర్మమే రక్షిస్తుంది’ అనే భరోసాతో- ప్రాచీన మధ్యయు గాల కాలమంతటా రాజరిక పాలనాధికార పరిరక్షణ సాధనంగా చలామణఇయిన మను ధర్మం ఆధునిక కాలపరీక్షకి గురై మొదటిసారిగా ఆత్మ రక్షణలో పడింది. 

వ్యక్తి స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆధునిక లౌకిక ప్రజాస్వామ్య భావన- వ్యక్తి స్వేచ్ఛను అనుమ తించని కుల వారసత్వ లక్షణాన్ని (హెరిడిటరీని) సవాల్‌ చేసింది.ఈ నేపథ్యంలో మౌలిక సామాజిక మార్పులు అనివార్యమయ్యే పరిస్థితిని ఎదుర్కోవటానికే బ్రిటిష్‌ వారిపై తిరుగుబాటు జరిగింది. 
కానీ ఆ తిరుగుబాటు విఫలమై తమ పన్నాగం ఫలించకపోవడం తో సనాతన బ్రాహ్మణవాదులు ఓ మెట్టుదిగక తప్పలేదు. ఆధునిక కాలం తెచ్చిన మార్పుల్ని పూర్తిగా అడ్డుకో లేమని గ్రహించిన కొంత మంది లిబరల్‌ బ్రాహ్మణవాదులు, డిఫెన్సు ఎత్తుగడలకు పాల్ప డ్డారు. బ్రాహ్మలు భూదేవుళ్ళుకాదు, వాళ్లను ధిక్కరించటం దైవధికా ర్కరం కాదని ధ్వజమెత్తిన ఫూలే బ్రాహ్మణేతర వాదాన్ని ఎదుర్కోలేక ఆత్మరక్షణలో పడిన మనువాద బ్రాహ్మణులు ఆత్మరక్షణా చర్యలకి పాల్పడ్డారు. బ్రాహ్మడు దైవాంశ సంభూతుడేగాని దైవ సమానుడు కాదని, దేవుడు కాదని, అసలు దేవుడు బ్రహ్మ దేవుడని నచ్చజెప్పడా నికి తిలక్‌ ‘బ్రహ్మసమాజ్‌’ను స్థాపించాడు. వేదకాలం నాటి వైదిక ఆర్యుల్లో అసలు వర్ణధర్మంలేదు, మనుధర్మం లేదు, అస్పృశ్యత లేదు, అది బ్రాహ్మణసమాజ్‌కాదు- అని నచ్చచెప్పటానికి దాయానం ద ‘ఆర్యసమాజ్‌’ను స్థాపించారు. ఈ రెండూ దగాకోరు వాదాలేనని ఫూలే స్థాపించిన ‘సత్యశోధక్‌ సమాజ్‌’ ఎదురుదెబ్బ తీయడంతో ఈ డిఫెన్స్‌ఎత్తుగడలు రక్షించలేవని నిర్ధారణకు వచ్చినాక ప్రయో గించిన బ్రహ్మస్త్రమే హిందూత్వ.

అయితే ప్రెస్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ కట్జూ వ్యాఖ్యానించినట్లు 1857 నాటి తిరుగుబాటు ను ఎదుర్కొనడానికి తిరుగుబాటుదారుల మధ్య నెలకొన్న మత సామరస్య జాతీయ ఐక్యతను దెబ్బతీయడా నికి విభజించిపాలించే విధానంతో బ్రిటిష్‌వారే మత విద్వేష చిచ్చు రేపి మతతత్వానికి నాంది పలికారన్న పరాప రాధం నిజమే కానీ- అది ఎంత నిజమో, మతధర్మ రక్షణ ముసుగులో మనుధర్మ రక్షణ కోసం బ్రాహ్మణీయ అగ్రవర్ణ పాలకవర్గ శక్తులు కూడా అదేపని చేశాయన్న స్వయం కృతాపరాధంకూడా అంతే నిజం. అలాగే వైదికార్య సనాతన వలసవాదులకి, అధునా తన బ్రిటిష్‌ వలసవాదులకి విభజించి పాలించడం వెన్నతోపెట్టిన విద్య- అనేది కూడా అలాంటి నిజమే. హిందూత్వ అనుసరించే, విభజించి పాలించే విధానం బ్రిటిష్‌ వలసవాదుల నుండి అరువు తెచ్చుకున్నది కాదు. బ్రిటిష్‌ వారు దాన్ని ఒక విధానం (పాలసీ)గా మాత్రమే ఇండి యాలో అమలు జరిపారు. 

కాని అంతకుముందే ప్రాచీనకాలంలో సంచార జాతిగా ఇండియాకి వలసవచ్చిన వైదికార్య శ్వేతజాతి ఈ దేశ మూలవాసుల్ని ఆనాడే విభజించి పాలించింది. ఈ కుటిలోపా యాన్ని ఒక విధానంగా అమలు చేయటం మాత్రమే కాకుండా, ఆ విధానాన్ని అన్వయించటానికి ‘బ్రాహ్మణీయ నిచ్చనమెట్ల సమాజం’ (ఎ సిస్టమ్‌ఆఫ్‌ బ్రాహ్మణికల్‌ గేడెడ్‌ సోషల్‌ఆర్డర్‌)గా దాన్ని నిర్మిం చింది. ఆ ‘కుల కవచ కుండలమే’ భేదోపాయ బ్రాహ్మణిజం. అందు వల్ల ఈ దేశంలో మతధర్మానికి వర్ణాశ్రమ మనుధర్మాన్ని అదనపు ప్రత్యేక ధర్మంగా, అదనపు ప్రత్యేక రక్షణకవచం (డాలు)గా మలచా రు. ఈ దేశానికి పరిమితమైన ఈ కుచ్చితమైన సామాజిక పరిమితి వల్ల, ఈ మతానికి ఆధ్యాత్మిక మతధర్మంతోపాటు సార్వజనీన స్వభావంలేని ప్రాదేశిక, సంకుచిత మనుధర్మం తోడైంది. ఈ దేశ రాజ్యానికికూడా మనుధర్మ రాజ్యస్వభావం సంక్రమించింది. ఈ దేశపాలకులకు, పాలనకు ఈ స్వయంనియంత్రిత వర్ణాశ్రమ (మను)ధర్మం ఎంతగానో తోడ్పడిందని, అందువల్ల ఆధునిక యుగంలోసైతం దీన్ని పరిరక్షించడం అవసరమని, అంతగా అయి తే అస్పృశ్యులను కూడా హిందూ హరిజనులుగా గుర్తిస్తామని డాబి.ఆర్‌.అంబేడ్కర్‌తో ఆనాడు మహాత్మాగాంధీ వాదించిన విషయం గమనార్హం. 

ప్రాచీన యుగాంతంలో దాస శూద్ర బానిసలు తమ దాస్య శృంఖలాలను తెంచుకోవడం కోసం బౌద్ధం ఇచ్చిన భరోసాతో బహు జనులై తిరుగుబాటు చేస్తే, ఆనాడు అగ్రవర్ణాల ద్విజులకు మైనారిటీ అభద్రతాభావం ఏర్పడి అపాయంలో పడ్డారు. ఈ స్థితిని మార్చుకో వడం కోసం శూద్రవర్ణ బహుజనుల్ని రెండుగా విభజించి, అందులో మెజారిటీ శూద్రులకు ద్విజులతో సమానంగా సవర్ణ, స్పృశ్య సామా జిక హోదా కల్పించి తమవైపు తిప్పుకొన్నారు. మైనారిటీ అతి శూద్రులకి, అస్పృశ్య, అవర్ణ ముద్రవేసి అసమానులుగా వారిని ఊరునుండి, శూద్రులనుండి వేరుచేసి, ఏకాకుల్ని చేశారు. సవర్ణ- అవర్ణ, స్పృశ్య- అస్పృశ్య కుల ప్రాతిపదికపై మధ్యయుగాలనాటి సమాజాన్ని రెండు సామాజిక వర్గాలుగా విభజించి పాలించారు. ఇలా మెజారిటీ శూద్రులని విడగొట్టి పాలించే (డివైడ్‌ అండ్‌ రూల్‌) బ్రాహ్మణికల్‌ పాలసీకి విరుగుడుగా- కూడగట్టిపాలించే (యునైట్‌ అండ్‌ రూల్‌) నాన్‌బ్రాహ్మణికల్‌ ప్రత్యామ్నాయ పాలసీతో ఆధునిక యుగ వైతాళికుడు మహత్మా జ్యోతిరావు పూలే శూద్ర, అతిశూ ద్రులను బహుజనులుగా సంఘటితంచేసి ప్రాచీనకాల బౌద్ధ బహుజనవాదాన్ని ఆధునిక దశకు అన్వయించి ఈ దేశ సామాజిక విప్లవ దశాదిశలను నిర్దేశించిన విషయం గమనార్హం. 

ఈ దేశీయ ప్రత్యామ్నాయాన్ని దెబ్బతీసి ఆధునిక యుగంలో సైతం, అగ్రవర్ణ ఆధిపత్యాన్ని రక్షించుకొనేందుకు జాతీయతత్వం ముసుగులో ఆధునిక మనువాద హిందూత్వను సృష్టించారు. స్వపర మతవిద్వే షాల్ని రెచ్చగొట్టి దేశ ప్రజలను మతపర మైన రెండు సామాజిక వర్గాలుగా విభజించిపాలించే పథకం పన్నారు. వాస్తవానికి పరమత అసహనంతో ఇతరమతాల అస్తిత్వాలను సహించలేని ఈ హిందూ త్వ ఫాసిజం కేవలం ఫాసిజం మాత్రమే కాదు, వాటి అస్థిత్వాలను కబళించే అంతర్గత వలసవాదం. 

ఈ హిందూత్వ ఫాసిస్టుదాడుల అసలులక్ష్యం జాతీయ మతధర్మ రక్షణ ముసుగులో మను ధర్మరక్షణే గనుక దీనికి పరిష్కారం మతో న్మాద, మతతత్వ పరిష్కారాల పరిధిలో లభించదు.హిందూత్వ ఫాసిజంలో మతోన్మా దం, మతతత్వం కూడా మిళితమై ఉన్నా మూలకారణం మాత్రం బ్రాహ్మణిజాన్ని రక్షించే మనుధర్మరక్షణే. కనుక దీనికి పరిష్కారం- ఈ పరిధినఇధిగమించే మనుధర్మేతర, బ్రాహ్మణేతర, బహుళ బహు జన లౌకిక, సామాజిక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయ అవగాహన పరిధిలోనే లభిస్తుంది. 156 ఏళ్ళక్రితమే ఈ పరిష్కారాన్ని దేశ ప్రజ ల ముందుంచిన ఆధునిక నవభారత దశాదిశ నిర్దేశక మార్గదర్శి మహాత్మఫూలే చూపిన మార్గంతప్ప మరో మార్గాంతరం లేదు.

Surya Telugu News Paper Dated : 11/4/2013

Friday, June 15, 2012

మార్క్స్ చాలడు-అంబేద్కర్ కావాలి --- ఉ.సా


కులాన్ని సాంఘికార్థిక అంశంగా, ఇండియా సమాజాన్ని కుల-వర్గ సమాజంగా విశ్లేషించిన అంబేద్కర్ ఆలోచన విధానం కావాలి. ఒక్కమాటలో చెప్పాలంటే'మార్క్స్ చాలడు, అంబేద్కర్ కావాలి'. 


ఎర్రాఎర్రటి నరుడో భాస్కరుడు, నల్లానల్లటి దళిత సూరీడు శివసాగరుడు (కెజి సత్యమూర్తి) ఇటీవల అమరుడైన సందర్భంగా 'సామాజిక విప్లవమూర్తి'గా ఆయన్ని స్మరించుకొంటూ అనేక మంది పలు వ్యాసాలు రాశారు. ఆ వ్యాసాల్లో సత్యమూర్తిని సామాజిక విప్లవ మూర్తిగా అభివర్ణించడాన్ని రంగనాయకమ్మ సహించలేకపోయారు. అలాగే మన దేశ కులవ్యవస్థను, కులాధీన వర్గ వ్యవస్థను జమిలిగా మార్చటానికి అంబేద్కర్ కావాలి, మార్క్స్ కావాలని నొక్కి చెప్పిన సత్యమూర్తి విశ్లేషణని గొప్ప దేశీయ మార్క్సిస్టు-అంబేద్కరిస్టు తాత్విక విశ్లేషణగా కొనియాడటాన్ని కూడా ఆమె సహించలేకపోయారు. 



రంగనాయకమ్మ దృష్టిలో అంబేద్కర్ సాంఘిక సంస్కర ణవాద సంఘసంస్కర్త మాత్రమే. కనుక ఆయన్ని బలపర్చే వారెవరైనా అలాంటి సంఘ సంస్కర్తలే అవుతారు. గతంలో సత్యమూర్తి విప్లవ కమ్యూనిస్టు అయినా ఒకసారి అంబేద్కర్‌ని బలపర్చినాక ఆయన్ని కూడా సంస్కరణ వాదిగానే చూడాలి తప్ప సామాజిక విప్లవ యోధుడిగా చూడటానికి వీల్లేదు... అలా చూస్తే ఆమె సహించలేదు. కులపరమైన సాంఘిక వివక్షకి పరాకాష్ఠ అయిన అంటరాని దళిత సమస్య కుల వ్యవస్థతో సంబంధంలేని సాంఘిక దురాచార సమస్యగా గాంధీ చిత్రీకరించారు. ఆ వ్యవస్థకు ఎలాంటి విఘాతం కలిగించని హరిజనోద్యమం ద్వారా ఆ సాంఘిక దురాచారాన్ని ఆయన పోగొడతానన్నాడు. 



కానీ అంబేద్కర్ కుల వ్యవస్థతో ముడిపడి ఉన్న దళిత సమస్య కుల వ్యవస్థలో సమూలమైన మార్పు తేకుండా పరిష్కారం కాదని కుల నిర్మూలనా దృక్పథాన్ని ప్రతిపాదించారు. చారిత్రక దృష్టితో కులాల మూలాల్లోకి వెళ్ళి'అస్పృశ్యతకు మూలం కుల వ్యవస్థలో ఉంది. కుల వ్యవస్థకు మూలం వర్ణాశ్రమ వ్యవస్థలో ఉంది. వర్ణాశ్రమ ధర్మం మత పరిరక్షణలో ఉంది. దాని మూలం అగ్రవర్ణ నిరంకుశాధికార రాజ్యాధికారంలో ఉంది' అన్నాడు. కుల నిర్మూలనా విధానంతో రాజ్యాధికారం అనే మాస్టర్ కీ చేజిక్కించుకోవాలన్నాడు. తద్వారా సాంఘిక ఆర్థిక రాజకీయ సామాజిక న్యాయంతో కుల వ్యవస్థను సమూలంగా మార్చాలని, కులాంతర వివాహాల ద్వారా కులాలను రద్దుచేయాలని అప్పుడే దళిత సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. 



అంబేద్కర్‌ను స్వీయాత్మక దృష్టితో చూడటం కారణాన అంబేద్కర్‌ను సాంఘిక సంస్కరణవాదిగా రంగనాయకమ్మ చిత్రీకరించారు. అంబేద్కర్ సాంఘిక, ఆర్థిక, రాజకీయ సామాజిక, న్యాయ సామాజిక విప్లవ కుల నిర్మూలనా పోరాటాన్ని కేవలం సాంఘిక పోరాటంగా కుదించి చూస్తున్నారు. కులాలను రద్దు చేసే కులాంతర వివాహాల సాంఘిక కార్యక్రమానికి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆమె అంటున్నారు. కానీ అట్టడుగు కులాల వారందరి ఆర్థిక పరిస్థితులు మారకుండా, కులాంతర వివాహాలు నిరభ్యంతరంగా జరిగే వాతావరణం ఏర్పడకుండా కులాల రద్దు అసాధ్యం అని ఆమె అన్నారు. శ్రామిక వర్గ సంబంధాల్లో మార్పు కోసం జరిగే వర్గ విప్లవ పోరాటం ద్వారానే అది సాధ్యమని అంటున్నారు. 



దళిత సమస్యను కేవలం ఉపరితల సమస్యగా, సాంఘిక సమస్యగా మాత్రమే రంగనాయకమ్మ చూస్తున్నారనడానికి 'దళిత సమస్య పరిష్కారానికి అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి' అనే రంగనాయకమ్మ పుస్తకమే నిదర్శనం. మార్కిజాన్ని ఆర్థిక నిర్ణాయక పెడధోరణిగా మార్చిన ఈ అగ్రకుల మూస మార్క్సిస్టులు ఇండియాలో వర్గాన్ని ఆర్థికంగా, కులాన్ని సాంఘికంగా విశ్లేషించిన అవాస్తవిక విశ్లేషణని అంబేద్కర్ ఖండించి తిరస్కరించారు. ఆర్థిక నిర్ణాయకవాద మూస మార్క్సిస్టు అయిన రంగనాయకమ్మ అంబేద్కర్‌పై బురద జల్లుతున్నారు. 



శ్రమనేగాక శ్రామిక వర్గ సంబంధాల్ని శ్రామిక కుల సంబంధాలుగా మార్చిన కులవ్యవస్థ కేవలం ఉపరితల సాంఘిక వ్యవస్థ కాదని అంబేద్కర్ చెప్పారు. ఈ దేశంలో కుల అంతస్తుల వారీగా ఏర్పడిన 'కుల-వర్గ ఆస్తులు-అంతస్తులే' అందుకు తిరుగులేని నిదర్శనం. కనుక కులం ఉపరితల సాంఘిక వ్యవస్థ అని ఫ్యూడల్ కుల వృత్తులు చెదిరిపోతే కులాలు అంతరించిపోతాయని, కులాల్లో వర్గాలేర్పడితే కులం వర్గంగా రూపాంతరం చెందుతుందని అంచనా వేసిన మూస మార్క్సిస్టుల అంచనాలు అభూత కల్పనలుగా మారి కాలదోషం పట్టి కాలగర్భంలో కలిసిపోయే సమయం ఆసన్నమైంది తప్ప అంబేద్కర్ అంచనాలు విఫలం కాలేదు. 



కులాన్ని సాంఘికాంశంగా పరిగణించే రంగనాయకమ్మలాంటి మూస మార్క్సిస్టుల అంచనాలు తప్పని ఇప్పటికే చరిత్ర నిరూపించింది. మన దేశ సామాజిక వ్యవస్థని కుల వర్గ వ్యవస్థగా చూడాలని, కుల-వర్గ సామాజిక విప్లవ పోరాటంతో మార్చాలని చెప్పిన ఏకైక సామాజిక శాస్త్రవేత్త, సిద్ధాంతవేత్త అప్పటికీ ఇప్పటికీ అంబేద్కర్ ఒక్కడే. 'ఈ సందర్భంగా కుల వ్యవస్థకు సంబంధించి ఒక ముఖ్య లక్షణం గురించి నొక్కి చెప్పాలి. 



అదేమిటంటే కులమూ వర్గమూ ఒకే రకమైనవి కాకపోయినా కుల వ్యవస్థ వర్గ వ్యవస్థను గుర్తిస్తుందని స్పష్టంగా చెప్పగలం. బ్రాహ్మణీయ హిందూ సమాజం అనేక కులాలుగా విభజింపబడినట్లే కులాలు అనేక వర్గాలుగా విభజింపబడ్డాయి. అందుకే ఈ కులవర్గ సమాజంలో కుల చైతన్యంతో పాటు వర్గ చైతన్యం కూడా ఉంది.. దీనికి రుజువులు కావాలనేవారు మద్రాసు బొంబాయి రాష్ట్రాల్లో జరిగిన బ్రాహ్మణేతర ఉద్యమాన్ని పరిశీలించవచ్చు' అని స్పష్టం చేశారు. (హిందూయిజం తాత్విక భూమిక-కులం, వర్గం-అంబేద్కర్). బ్రాహ్మణేతర బహుజనోద్యమం వర్గాన్ని విస్మరించినందువల్ల శూద్ర వ్యవసాయ కులాలకి చెందిన వారు భూస్వాములై, అగ్రకుల పాలక వర్గాలుగా, నూతన సంపన్న వర్గాలుగా పరిణమించటాన్ని నివారించలేకపోయిందని అందులోని లోపాన్ని గుణపాఠం తీసి చెప్పారు. 



'ప్రపంచ కార్మికులారా ఏకంకండి' అని కార్మికవర్గ అంతర్జాతీయ దృక్పథంతో మార్క్స్ ఇచ్చిన పిలుపును మూస మార్క్సిస్టులు భ్రష్టు పట్టించారు. ఏ కులం వారైనా, ఏ దేశం వారైనా పేదలంతా ఒక్కటే.. బాధలన్నీ ఒక్కటే అని ప్రపంచ పేదల్లారా, ఏకంకండి అని ఆ నినాదాన్ని వక్రీకరించి వివిధ దేశాల, జాతుల, ప్రత్యేక కుల సమాజాలకు అతీతంగా ఒకే మూసలో (వర్గ మూసలో) పోసే వాదాన్ని అంబేద్కర్ తిరస్కరించారు. 'మానవుల సమూహమే సమాజం అనే సామాజిక దృక్పథం మోసపూరితమైనది. ఏ దేశ సమాజంలోనైనా వర్గాలు ఏర్పడుతాయి. 



ప్రపంచమంతటా ప్రతి దేశంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక వర్గానికి చెంది ఉంటాడని మార్క్స్ చెప్పిన సార్వజనీన వర్గ దృక్పథమే సరైంది. విలక్షణ ప్రత్యేక కుల వ్యవస్థ ఉనికిలో ఉన్న ఇండియా సైతం అందుకు మినహాయింపు కాదు. కాకుంటే ఇండియాలో వర్గంతోపాటు కులం కూడా ఉందన్న కుల వర్గ సామాజిక వాస్తవికతను ఇండియన్ అగ్రవర్ణ మార్క్సిస్టులే సరిగా గుర్తించటం లేదు. ఇండియాలో వర్గం కుల నియంత్రణకి గురవుతోందని, శ్రమ విభజనను శ్రామికుల విభజనగా మార్చి విభజించి పాలించే బ్రాహ్మణిజాన్ని దేశీయ సామాజిక ప్రత్యేక శత్రువుగా గుర్తించాలి' అని అంబేద్కర్ హెచ్చరించారు. 



కనుక వర్గాన్ని నియంత్రించి వర్గపోరాటానికి అడ్డంకులు కల్పించే కుల నియంత్రణని అరికట్టే కుల నిర్మూలనా పోరాటం చేపట్టకుండా, యథాతథ 'కులం పునాదుల మీద (వర్గ ఉద్యమాన్ని గాని, జాతీయోద్యమాన్ని గాని) ఒక జాతిని గానీ, నీతిని గానీ నిర్మించలేదు' నిర్మించినా కుల నియంత్రణకి గురికాకుండా నివారించలేదు. అందుకే 'ప్రపంచ కార్మికులారా ఏకంకండి' అని కార్మిక వర్గ అంతర్జాతీయ దృష్టితో మార్క్స్ ఇచ్చిన పిలుపు ఇండియాలో యథాతథంగా అమలుకాదని అంబేద్కర్ తమ 'కుల నిర్మూలన'లో స్పష్టం చేశారు. ఆ కారణంగా ఇండియాలో కమ్యూనిస్టులు ఫ్యూడల్ వ్యతిరేక వ్యవసాయ విప్లవ వర్గపోరాటంపై కుల ప్రభావాన్ని నివారించలేకపోయారు. 



దాంతో 'దున్నే వానికే భూమి' అని వారు ఇచ్చిన నినాదం వ్యవసాయ కులాలకి చెందిన కమ్మ, రెడ్డి, కాపు, వెలమ 'కౌలుదారులకే భూమి'గా పరిణమించింది. పర్యవసానంగా వ్యవసాయేతర శూద్ర అతిశూద్ర కులాలవారికి చారిత్రక అన్యాయం జరిగింది. అలా అంబేద్కర్ చెప్పిందే నిజమైంది. కనుక ఈ వాస్తవాల్ని తారుమారు చేసి, తలకిందులుగా చూపుతున్న రంగనాయకమ్మ వాదాన్ని సరిదిద్ది తలపైకి కాళ్ళు కిందికి పెట్టి చూద్దాం. కులాన్ని సాంఘికార్థిక అంశంగా, ఇండియా సమాజాన్ని కుల-వర్గ సమాజంగా విశ్లేషించిన అంబేద్కర్ ఆలోచన విధానం కావాలి. ఒక్కమాటలో ఈ మూస మార్క్సిస్టు 'మార్క్స్ చాలడు. అంబేద్కర్ కావాలి'.

ఉద్యమాల ఉపాధ్యాయుడు
Andhra Jyothi News Paper Dated : 16/06/2012

Friday, February 24, 2012

ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం నిరర్థకం--- ఉ.సా.



హిందూత్వ కమ్యూనల్ ఫాసిజాన్ని కేవలం ఆధ్యాత్మిక మతకోణంలోనో లేక మతాతీత లౌకిక కోణంలోనో ఎదిరించి ఓడించడం కష్టం. దాని లోగుట్టు కులం కనుక మౌలిక, సామాజిక, ప్రజాస్వామిక విప్లవ ప్రత్యామ్నాయాలను చేపట్టక తప్పదు. 


సనాతన బ్రాహ్మణ మతం నవీన కాలంలో హిందూ మతంగా రూపాంతరం చెందింది. ఆ తరువాత కూడా దానిలో రావాల్సినంతగా ఆధునిక ప్రజాస్వామిక మార్పులు రావటం లేదు. ఇకనైనా హిందూ మతం తన ఆధ్యాత్మిక ఫాసిస్టు లక్షణాన్ని సంస్కరించుకొని , ఆధ్యాత్మిక ప్రజాస్వామ్య లక్షణాన్ని సంతరించుకోవాలని, లేనిపక్షంలో సమీప భవిష్యత్తులో అది అంతరించిపోవడం ఖాయం అనేది ప్రొఫెసర్ కంచ ఐలయ్య అంచనా. ఇది సంచలనాత్మక వివాదంగా మారింది. 



ఐలయ్య అంచనాని పరిశీలించే ముందు ఆయన్ని ఓ మౌలిక ప్రశ్న ను అడగాల్సివుంది. హిందూ మతంగా బ్రాహ్మణ మతం తీసుకొన్న మార్పు మతపరమైన ఆధ్యాత్మిక మార్పా? లేక మతాన్ని రాజకీయాల తో ముడిపెట్టే రాజకీయ పరమైన మతతత్వ మార్పా? రెండవదే అయినప్పుడు ఎవరి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఆ మార్పును ఆ మా ర్పుగానే పరిగణనలోకి తీసుకొని దాని మంచి చెడ్డల గురించి సమగ్రం గా చర్చించాలి. అయితే ఐలయ్య అసలు సంగతి పక్కన బెట్టి తన పాక్షి క పరిమితుల్ని దానికి ఆపాదించారు. ఇది తగదు. అందువల్ల అసలు వి షయం పక్కదారి పట్టి కొసరు విషయానికే చర్చ పరిమితమవుతుంది. 



సమగ్ర నిర్దిష్ట చారిత్రక దృష్టితో చూసినప్పుడు అధునాతనకాలంలోనే సనాతన ధర్మ మతం హిందూ మతంగా ఎందుకు పేరు మార్చుకొంది? ఈ మార్పు ఆధునికతకు అనుగుణంగా మతాన్ని రాజకీయాల నుంచి, రాజ్యాధికారం నుంచి వేరు చేసి వ్యక్తిగత విశ్వాసానికి పరిమితంచేసే లౌకిక ప్రజాస్వామ్యాన్ని స్వాగతించటం కోసం జరిగిన మార్పా? అందులో భాగంగా మధ్యయుగాలనాటి మతపరమైన మూఢాచారాలను సంస్కరించే, మత సమానత్వాన్ని లేదా ఐలయ్య పరిభాషలో ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని ఆవిష్కరించటానికి జరిగిన మార్పా? లేక ఆధునికత విసిరిన సవాల్‌కి జవాబుగా ఆధునికతకు విరుద్ధంగా కుల రక్షణ కోసం మతాన్ని జాతిగా మభ్యపెట్టి మతాన్ని రాజకీయాలతో ముడిపెట్టి ఇండియన్ నేషనలిజాన్ని హిందూత్వ కమ్యూనల్ ఫాసిజంగా రూపాంతరం చెందించిన మతతత్వమా? ఈ విషయం గ్రహించకుండా హిందువానంతర స్పిరిట్యువలిజానికి ఆధునికాంతర కమ్యూనలిజాన్ని జోడించకుండా కంచ ఐలయ్య చేసిన పాక్షిక చర్చ నిరర్థకమే కాదు అనర్థకంగా మారుతోంది. 



హిందువానంతర భారతావనిలో హిందూ మతం త్వరలో అంతరించిపోతుందనే కంచ ఐలయ్య అంచనాకి ఆయన చెప్పే ఆధారాలపై జరుగుతున్న చర్చను పరిశీలిద్దాం. ఇకనైనా హిందూ మతం తననితాను సంస్కరించుకోవాలి; లేదంటే అరబ్ దేశాల ఇస్లాం మతం, పశ్చి మ దేశాల క్రైస్తవ మతం లాంటి బ్రాహ్మణేతర, హిందూయేతర విదేశీ మతాల మత మార్పిడి దెబ్బకి హిందూ మతం దెబ్బ తిని, మైనారిటీ అగ్రవర్ణ మతంగా నామమాత్రంగా మారుతుంది; లేదూ ఆ మాత్రమైనా ఉనికిలో లేకుండా అంతరించి పోవటమో జరుగుతుందని ఐల య్య అన్నారు. 



ఒకప్పుడు భారతదేశంలో భాగమైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఇప్పుడు ఇస్లాం దేశాలుగా మారినట్లే సమీప భవిష్యత్తులో మిగతా భారతదేశం కూడా ఏదొక హిందుయేతర మత ప్రదేశంగా మారుతుందని ఆయన సంచలనం రేకెత్తించారు. అరబ్ దేశాల్లో ఇస్లాం కి, పశ్చిమ దేశాల్లో క్రైస్తవ మతానికి ఇలాంటి విపత్తు సంభవించే సమస్యలేదని, అవి ప్రవర్ధమానమై వర్ధిల్లుతాయని, భారతదేశం కూడా వా టి ప్రభావంలోకి వెళుతుందని మరింత అభ్రతా భావాన్ని కల్పించారు. 



మధ్యలో అసందర్భంగా మార్క్స్ ప్రస్తావన తెచ్చి ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలో మతం అంతరించి పోతుందని మార్క్స్ చెప్పిన జోస్యం నిజం కాదని నిరూపించబడిందనీ, పెట్టుబడిదారీ ప్రపంచంలో క్రైస్తవం అద్భుతంగా విరాజిల్లటమే అందుకు నిదర్శనమని ఐలయ్య సొంత భాష్యం చెప్పారు. కానీ మార్క్స్ అలా చెప్పలేదు. ఆధునిక పెట్టుబడిదారీ యుగంలో మతం రాజకీయాల నుంచి వేరుపడి, వ్యక్తిగత విశ్వాసానికి పరిమితమయ్యే లౌకిక ప్రజాస్వామ్యం ఆవిర్భవిస్తుందని చెప్పాడు. ఐలయ్య లాగా మతమే సర్వస్వంగా సర్వ నామజపం చేయలేదు. 



వ్యక్తిగత ఆస్తి పునాదిగా ఏర్పడిన కుటుంబం, మతం, రాజ్యం లాంటి వ్యవస్థలు వ్యక్తిగత ఆస్తి రద్దు అయ్యే దాకా రద్దుకావని మార్క్స్ చెప్పాడు. అంతే తప్ప ఐలయ్య లాగా అర్థాంతరంగా మతం అంతరించి పోతుందనే అభూత కల్పనలతో అశ్రాస్త్రీయ జోస్యాలు ఆయన ఎన్నడూ చెప్పలేదు. మార్క్స్ మాత్రమే కాదు, అంబేద్కర్ కూడా మార్క్స్ చెప్పినట్లు మత ధర్మ రక్షణ ముసుగులో మనుధర్మ కవచంగా మారిన హిందూ మతం కుల నిర్మూలన జరగకుండా అంతరించదని స్పష్టంచేశారు. 



పరోక్షంగా పరదేశమతాల మతమార్పిడిలను ప్రోత్సహిస్తూ పరదేశ ప్రాపకం కోసం పాకులాడే ఐలయ్య లాంటి పరాయికర మేధావులు ఇలా మాట్లాడటమంటే విదేశీ జోక్యాన్ని కోరే దేశ ద్రోహానికి పాల్పడటమేనని కొందరు దేశ భక్తులు ఆయనపై ముద్ర వేసే ప్రయత్నం చేశారు. అసలు వైదికార్య బ్రాహ్మణులే విదేశీయులని, బ్రాహ్మణ మతమే విదేశీ మతమని ఐలయ్య అభిమానులు కొందరు ప్రత్యారోపణ చేస్తూ పనిలోపనిగా ఆర్య ఆత్మ గౌరవాన్ని చాటుకొన్న 'ఆర్యసమాజ్' ప్రవక్త దయానందుడిని అభినందించారు. ఈ అపోహల్ని తొలగించే ప్రయత్నంలో భాగంగా ఈ పరిణామం పరదేశ మతాల పరాపరాధం వల్ల జరగదని, హిందూ మత ఆధ్యాత్మిక ఫాసిజం స్వయం కృతాపరాధం వల్లనే అలా జరుగుతుందని ఐలయ్య స్పష్టం చేశారు. 



స్వాతంత్య్రానంతర, హిందూ అనంతర కాలపు పరిణామాలు, అనుభవాలను చూద్దాం. బిసిల అభ్యున్నతికి రాజ్యాంగం ప్రసాదించిన మండల్ రిజర్వేషన్స్‌ని బ్రాహ్మణీయ శక్తులు అడ్డుకొన్నాయి. వాటి అగ్రకుల నిరంకుశత్వాన్ని ఎదిరించిన బిఎస్‌పి, దళిత- బిసిల సమైక్యతని నినదించింది. మండల్‌ని మందిర్‌గా మార్చి ముస్లిం మైనారిటీకి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన హిందూ మెజారిటీయన్ మతతత్వ ఫాసిజాన్ని ఎదిరించి దళిత-ముస్లిం సమైక్యతని బిఎస్‌పి నినదించింది. ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీల బహుజన శక్తితో హిందుత్వని ఓడించి జయించింది. హిందూత్వంపై ఈ విజయాన్ని సాధించే శక్తి లౌకిక సామాజిక ప్రజాస్వామ్యమే తప్ప ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం కాదని హిందువానంతర, ఆధునికానంతర చరిత్ర నిరూపించింది. 



కనుక పూర్తి స్థాయిలో హిందుత్వను ఎదుర్కొనే ప్రత్యామ్నాయాన్ని పక్కదారి పట్టించి ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం పేరిట మతం చుట్టూ తిప్పే పై పై చర్యలతో హిందుత్వను ఎదిరించటం, సంస్కరించటం కల్ల. సామాజిక కోణానికి చెందిన అంబేద్కర్, ఫూలే విగ్రహాల విధ్వంసాన్ని కూడా మత కళ్ళద్దాలతో చూసి ఈ వివాదాన్ని మత పరమైన హింసాత్మక విధ్వంసంగా అభివర్ణించటం వాస్తవ విరుద్ధ స్వీయాత్మక కోణం తప్ప వేరుకాదు. హిందూత్వ కమ్యూనల్ ఫాసిజాన్ని కేవలం ఆధ్యాత్మిక మతకోణంలోనో లేక మతాతీత లౌకిక కోణంలోనో ఎదిరించి ఓడించడం కష్టం. దాని లోగుట్టు కులం. కనుక మౌలిక, సామాజిక, ప్రజాస్వామిక విప్లవ ప్రత్యామ్నాయాలను చేపట్టక తప్పదు. ఈ మనువాద మర్మం అర్థం కావాలంటే హిందుత్వ ఆవిర్భావ పూర్వాపరాలను పరిశీలించటం అవసరం. 



పురాతన కాలంలో వైదికార్యులు మన దేశంలో స్థాపించిన సనాతన మనుధర్మ మతం లేదా వైదిక మతం పుట్టుక రీత్యా భారతదేశంలో పుట్టిన దేశీయ జాతీయ మతం అయితే కావచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మతం జాతి కాదు. అది హిందుత్వ జాతి ముసుగేసుకొన్న మతమే. వైదికమనుధర్మ మతాన్ని స్థాపించింది ఈ దేశంలోనే కావచ్చు. కానీ స్థాపించిన వారు మాత్రం ఈ దేశీయులు కాదు. ఈ దేశ మూల వాసులు కాదు. మూల వాసుల కోసమూ కాదు. పశ్చిమాసియా నుంచి ఈ దేశానికి వలస వచ్చిన పరదేశీయులే వైదిక మతాన్ని స్థాపించారు. కనుక వైదిక మతం పరదేశ మతం కాకపోవచుచ్చుగానీ పరదేశీయులు స్థాపించిన మతమే. ఈ దేశంలో జొరబడిన పరదేశీయుల పరిరక్షణ కోసం ఏర్పడిన మతమే. దానికి పరదేశీయ మూలాలు ఉండబట్టే ఈ దేశ మూల వాసులు నిర్మించిన సింధు నాగరికత నామాన్ని నిస్సిగ్గుగా అరువు తెచ్చుకొని వైదిక మతాన్ని హిందూ మతమని నామకరణం చేశారు. అందు వల్లనే వేదవేదాంగాల్లో, పురాణాల్లో హిందువు అనే పదాన్ని చూపించలేకపోతున్నారు. 



అంతేకాదు, ఈ మోసపూరిత చర్య ఈ దేశ మూల వాసీ సింధుభూమికి సొంత అస్తిత్వం లేకుండా చేసి వేద భూమిగా వక్రీకరించి పరాయీకరించటం కాదా? అంతటితో ఆగకుండా ఈ దేశంలో ఈ దేశస్థులు స్థాపించిన జైప, బౌద్ధ, సిక్కు మతాలను సైతం దశావతారాల్లో, హిందూ మహాసముద్రంలో కలిపేసే హిందూ సామ్రాజ్యవాదంతో వాటికి సొంత అస్తిత్వం లేకుండా చేయలేదా? ఇతర మతాలకు సొంత అస్తిత్వం లేకుండా చేస్తే తప్ప వైదిక మత అస్తిత్వానికి భద్రత లేకపోవటానికి మూలకారణం వర్ణాశ్రమ మను ధర్మ వైదిక మతం పీడిత కులాల చెరసాల కావటమే. కనుక ఇది స్వయంకృతాపరాధం కాదా? ఈ అపరాధ పరంపరను కప్పిపుచ్చుకునే ఆధునిక అవతారమే హిందుత్వ కాదా?



Andhra Jyothi News Paper Date 25/02/2012 

Monday, October 3, 2011

ఈ ఆరోపణలు అనైతికం - ఉ.సా Andhra Jyothi 04/10/2011


ఈ ఆరోపణలు అనైతికం

- ఉ.సా

దొర గడీలను కాచే వారెవరైనా, దొరలచేత ఉసిగొల్పబడే దొర జీతగాళ్లెవరైనా వారిని తప్పకుండా తప్పుపట్టాల్సిందే. వారి నిజస్వరూపాన్ని బైటపెట్టి జనం ముందు దోషులుగా నిలబెట్టాల్సిందే. జనం వారిని తిరస్కరించి పక్కన బెట్టాల్సిందే. కానీ అలా తప్పుపట్టే నైతిక అర్హత ఆ తప్పు ఎన్నడూ చేయని నిర్దోషులకే వుంటుందిగాని దోషులకు ఉండదు. పీడిత ప్రజల పక్షాన నిలబడి అగ్రకుల పాలకులపై రాజీలేని పోరాటం చేయటానికి బదులు ఏదో ఒక సాకుతో ఎల్లప్పుడూ ఏదో ఒక అగ్రకుల దొరల పంచన జేరి వంచనకు పాల్పడే అసాంఘిక శక్తులకు అసలే ఉండదు.

అనునిత్యం దొర గడీలను కాచే అలాంటి అసాంఘిక శక్తులతో అంట కాగుతున్న గుడిపల్లి రవి లాంటి వారు 'దొర గడీలను కాచే వారితో జాగ్రత్త' (సెప్టెంబర్ 28, ఆంధ్రజ్యోతి) అని మాపై నిందారోపణకు పాల్పడ్డారు. ఇది 'దొంగే దొంగ దొంగ' అని బుకాయించటం తప్ప వేరు కాదు. వీరు తమ తెలంగాణ వ్యతిరేక, అసాంఘిక పాత్రను కప్పిపుచ్చుకోవటం కోసం, అదేమని ప్రశ్నించిన ప్రతివారినీ దళిత వ్యతిరేకులుగా, దొర గడీలను కాచే అగ్రకుల తొత్తులుగా ముద్రవేసి బ్లాక్ మెయిల్ చేసి వారి నోరు మూయించటం ఓ తంతుగా మారింది. అలాంటి వారికి వంత పాడటం ఇప్పుడు గుడిపల్లి వారి వంతుగా మారింది.

న్యాయమైన సామాజిక న్యాయాన్ని తెలంగాణకి అన్యాయం చేసే సాధనంగా, క్రమబద్ధీకరణకు మారుపేరైన వర్గీకరణను తెలంగాణకి అడ్డుపుల్లగా మారుస్తున్న వారి అక్రమాల నిజస్వరూపాన్ని బైటపెట్టినందుకు మాపై గుడిపల్లి బృందం కత్తికట్టింది. తమ దిగజారుడుతనాన్ని మాకు కూడా అంటగడుతూ మమ్మల్ని అప్రదిష్టపాలు చేస్తూ మా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే వ్యక్తిగత నిందారోపణలకు పాల్పడ్డారు.

మహనీయుల మార్గదర్శకత్వంలో గులాంగిరీకి తావులేని మా స్వతంత్ర ప్రత్యామ్నాయ సుదీర్ఘ ప్రజా ఉద్యమ జీవితంలో ఏనాడైనా ఏ సాకుతోనైనా ఏ అగ్రకుల దొరల పార్టీకైనా, జీతగాళ్లుగా మారి దొర గడీలను కాచిన సందర్భం ఒక్కటంటే ఒక్కటైనా ఏ ఒక్కడైనా చూపించగలడా? అని బహిరంగంగా సవాల్ చేస్తున్నాం. అసత్యాలతో అర్ధ సత్యాలతో, అసందర్భమైన అభూతకల్పనలతో గుడిపల్లి వారు మా పై ఎన్ని నీలాపనిందలు మోపినా వారు సైతం మా విషయంలో అలాంటి సందర్భం చూపించలేకపోయారు.

భౌగోళిక తెలంగాణ వాదాన్ని విమర్శనాత్మక దృష్టితో సమర్థిస్తూ తెలంగాణకి జైకొట్టే సామాజిక తెలంగాణ వాదం సైతం దొర గడీలను కాచే వాదమే అని వారు చేసిన అవగాహనా రాహిత్య ఆరోపణ సిద్ధాంత పరమైందే గాని వ్యక్తిగతమైంది కాదు. అందులోఎవరు ఏ గడీలను కాస్తున్నారో, సూడో సామాజిక న్యాయ ముసుగులో ఆ గూడుపుఠాణీ ఎలా దాస్తున్నారో ఈ 'అసాంఘిక శక్తుల' 'సామాజిక సమైక్యాంధ్ర వాదాన్ని' బైటపెడుతూ సైద్ధాంతికంగానే నిగ్గు తేల్చుకొంటాం. అంతకంటే ముందు గుడిపల్లి లాంటి అనైతిక అర్భకులు మాపై చేసిన నిరాధార నిందారోపణల అసందర్భ అసత్యారోపణలను వివరాల్లోకి వెళ్లి పరిశీలిద్దాం.

మొట్ట మొదటగా గుడిపల్లి అన్నట్లు 'సామాజిక న్యాయం గురించి, సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు' నిజంగా మాకే వుంది. 'రాయితీలు మాకు రాజ్యాధికారం మీకు' అనే పరస్పర సహకార 'రహస్య' ఒప్పందాలతో అగ్రకుల పాలక వర్గ పార్టీల దొర గడీలను కాస్తూ స్వార్థపర సంకుచిత ప్రయోజనాల కోసం బహుజన ప్రజా ప్రయోజనాలను అనునిత్యం తాకట్టు పెట్టే దొర జీతగాళ్లకు లేదు. 'సాంఘిక ఆర్థిక రాజకీయ పరమైన సకల సామాజిక రంగాల్లో సమ భావ, సమ భాగ, సమతుల్య, సామాజిక ' పరివర్తక' సాధనమైన సామాజిక న్యాయాన్ని 'వర్తక' సాధనంగా తాకట్టు పెట్టే వాళ్లకు అసలే లేదు. ఉ.సా. సుదీర్ఘ ఉద్యమ జీవితంలో సగ జీవితం లేని గుడిపల్లి లాంటి వారితో సామాజిక న్యాయం గురించి గుణపాఠాలు చెప్పించుకునే దుస్థితి మాకు పట్టలేదు.

ఇక భౌగోళిక-సామాజిక తెలంగాణ వివాదంతో ఎలాంటి సంబంధం లేని మరో ముఖ్యమైన అంశంగా కుల-వర్గ-జమిలి సిద్ధాంతాన్ని అసందర్భంగా చర్చలకు తెచ్చాడు గుడిపల్లి. 'కుల -వర్గ దృక్పథం నుంచి తెలంగాణ సమస్యను విశ్లేషించి ఉ.సా. కొత్తగా భౌగోళిక-సామాజిక తెలంగాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కానీ ఉ.సా.కి తన సిద్ధాంతం పట్ల తనకే నమ్మకం, విశ్వాసం లేదని' గుడిపల్లి మరో ఆరోపణ చేశాడు. ఈ భౌగోళిక-సామాజిక తెలంగాణ సిద్ధాంతం ఇప్పుడు కొత్తగా ఉ.సా. ప్రతిపాదించింది కాదు.

1997లోనే ఉ.సా., వీరన్న ఇరువురూ కలిసి సంయుక్తంగా రూపొందించిన ఆనాటి 'తెలంగాణ మహాసభ' సిద్ధాంతం ఇది. 'చిన్న రాష్ట్రాల ఏర్పాటు చిన్న కులాలకు తోడ్పాటు'నిస్తుందనే అంబేద్కర్ ఆలోచనా విధానం స్ఫూర్తితో 'ప్రత్యేక తెలంగాణ! తెలంగాణలో దళిత బహుజన ప్రజారాజ్యం' ఆనాడు రూపొందించిన మేనిఫెస్టో 'తెలంగాణ మహాసభ' పత్రికలో ప్రచురితమయింది. ఈ విషయాన్ని ఆ పత్రికా సంపాదకుడే ఇటీవల టీ.వీ.ఛానెల్ చర్చలో స్వయంగా ప్రస్తావించాడు. ప్రజాయుద్ధ సాయుధ పోరాట పంథాలో ఆనాడు 1998లో వీరన్న స్థాపించిన సిపిఎస్‌యుఐ పార్టీని పార్లమెంటరీ పంథాలో పనిచేసే పార్టీగా దిగజార్చి, దాని ఆవిర్భావ సభకి దొర గడీలను కాచే వారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన గుడిపల్లి మాటలకి ఏ విశ్వసనీయతా లేదు.

అలాగే ఒకప్పుడు మారోజు వీరన్నతో కుల వర్గ జమిలి పోరాటమే సరైనదని, ఒంటరి వర్గ పోరాటం ఒట్టి పోరాటమని చెప్పిన ఉ.సా. అందుకు విరుద్ధంగా ఒంటరి వర్గపోరాటమైనా, కుల పోరాటమైనా విజయవంతమవుతాయని బెంగాల్, యుపి అనుభవాలను ఉదాహరణగా చెప్పినట్లు అర్ధ సత్యాలతో, అసత్యాలతో గుడిపల్లి మరో కట్టు కథ చెప్పాడు. బెంగాల్ సిపిఎం అనుభవంలో అగ్రకులాధిపత్య స్వభావం, యుపిలో బిఎస్‌పి, ఎస్‌పి అనుభవంలో పెట్టుబడిదారీ సంపన్నవర్గ స్వభావం సంతరించుకోవటంతో అవి రెండు కులవర్గ అసమానతలను తొలగించలేని అసమగ్ర అనుభవాలేనని ఉ.సా. తేల్చి చెప్పారు. ఆయన ఎప్పుడూ తాను చెప్పిన మాట తప్పలేదు. పార్లమెంటరీ పంథా పార్టీ ఆవిర్భావ సభకి దొర గడీలను కాచే దొర జీతగాళ్లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు తప్ప ఉ.సా.ని ఆహ్వానించలేకపోయారంటే ఎవరు దొర గడీలను కాచేవారో, ఎవరు దొర గడీలను కూల్చేవారో వేరే చెప్పక్కర్లేదు.

- ఉ.సా
కొంకల వెంకట నారాయణ
పావని నాగరాజు
సి.హెచ్.లక్ష్మణ్

Sunday, September 4, 2011

భౌగోళిక, సామాజిక తెలంగాణ - ఉ.సా చైర్మన్ - సామాజిక ఆంధ్ర - తెలంగాణ సమన్వయ కమిటీ Andhra Jyothi 19/08/2011


భౌగోళిక, సామాజిక తెలంగాణ
- ఉ.సా
తెలంగాణకి జైకొట్టే నిజమైన సామాజిక తెలంగాణ వాదులకు, మోసపూరిత ఎత్తుగడలతో తెలంగాణను దెబ్బకొట్టే సూడో సామాజిక న్యాయవాదులకు మధ్య తేడా చూడకుండా విచక్షణా రహితంగా ఇరువుర్ని ఒకేగాటకట్టి తప్పుపట్టటం తప్పు. ఈ అనుచిత వైఖరి సూడో సామాజిక తెలంగాణ వాదాన్ని ఎండగట్టలేని నిరర్థక వైఖరిగానే గాక నిజమైన సామాజిక తెలంగాణ వాదాన్ని దెబ్బతీసే అనర్థదాయక వైఖరిగా పరిణమిస్తుంది. తెలంగాణ ఉద్యమ "తొలిలక్ష్యం భౌగోళికమే'' అని ఆగస్టు 16న ఆంధ్రజ్యోతిలో చిక్కుడు ప్రభాకర్ రాసిన వ్యాసం పర్యవసానం ఇదే.
ప్రభాకర్ ఒకవైపు తమది కేవలం భౌగోళిక తెలంగాణవాదం కాదని దానికి ప్రజాస్వామ్య తెలంగాణవాదాన్ని కూడా జోడించామని చెప్పుకుంటారు. మరోవైపు అందుకు విరుద్ధంగా సామాజిక తెలంగాణ వాదాన్ని తప్పుపట్టే ద్వంద్వవైఖరి అనుసరిస్తున్నారు. అంటే పరోక్షంగా ప్రజాస్వామ్య తెలంగాణవాదానికి కూడా విరుద్ధమైన ఆత్మహత్యా సదృశ్యానికి పాల్పడటమే. పరోక్షంగానేకాదు "సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల కబంధహస్తాల నుంచి భౌగోళిక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతే సామాజిక లేదా ప్రజాస్వామిక తెలంగాణ'' అని ప్రత్యక్షంగానే చాటిచెపుతున్నాడు.
సామాజిక తెలంగాణవాదాన్ని దెబ్బకొట్టటానికి ప్రజాస్వామ్య తెలంగాణ వాదాన్ని వదులుకోవటానికి కూడా సిద్ధపడుతున్నాడు. "తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో తెలంగాణ పునర్నిర్మాణంలో సామాజికన్యాయాన్ని ఓ ముఖ్యమైన సామాజికాంశంగా పరిగణిస్తాం'' అని వాగ్దానం చేసిన "తెలంగాణ ప్రజాఫ్రంట్''కి కార్యదర్శిగా చలామణి అవుతున్న ప్రభాకర్ ఆ ఫ్రంట్ విధాన ప్రకటనకే విరుద్ధంగా వ్యవహరించటమేమిటి? ఇలాంటి అనుచితమైన ఆత్మహత్యాసదశ్యవైఖరితో ఆత్మవంచనకి ప్రభాకర్ ఎందుకు పాల్పడుతున్నాడో పరిశీలించేముందు ఒక విషయం స్పష్టం చేయాలి.
ఆనాడు "విశాలాంధ్రలో ప్రజారాజ్యం'' అన్నట్లు నేడు "ప్రత్యేక తెలంగాణలో ప్రజారాజ్యం'' అని తక్షణ దీర్ఘకాలిక ఉమ్మడి లక్ష్యాలను ఏకకాలంలో కలిగిఉండే వర్గవాదుల్లాగా మేము వర్గకుల వాదంతో "ప్రత్యేక తెలంగాణలో సామాజిక ప్రజారాజ్యం'' అంటున్నాం. ఇలాంటి ఉమ్మడి లక్ష్యాలతో 1997లోనే అమరుడు మారోజు వీరన్న సహచరులుగా, ఆయన అడుగుజాడల్లో మేము అనుసరిస్తున్న భౌగోళిక - సామాజిక తెలంగాణవాదం తెలంగాణకి జైకొట్టే వాదమేకాని - దెబ్బకొట్టే వాదం కాదు, దెబ్బకొట్టనిచ్చేవాదం కూడా కాదు.
ఈ నేపథ్యంలో సమయానుకూలంగా మాటమార్చే ప్రభాకర్ సమయానుకూలవాదం సంగతేమిటో పరిశీలిద్దాం. "తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ'' అధినేత అయిన ప్రభాకర్‌తో కలిసి ఆ మధ్య ఓ టి.వి. ఛానల్‌వారు నిర్వహించిన భేటీలో నేను స్వయంగా పాల్గొన్నాను. ఆ సందర్భంలో ప్రజాస్వామ్య తెలంగాణవాదాన్ని తప్ప భౌగోళిక తెలంగాణ వాదాన్ని ససేమిరా బలపర్చేదిలేదని ప్రభాకర్ చేసిన వితండవాదానికి నేనేకాదు ఆనాడు ఆ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రేక్షకులంతా సాక్షులే. సీమాంధ్ర ప్రాంతీయ అగ్రకుల సంపన్నవర్గాల వలస పెత్తందారీ తనానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతం వారు చేసే భౌగోళిక తెలంగాణ పోరాటం దానికదే ప్రాంతీయ ప్రజాస్వామిక పోరాటం అవుతుంది.
కనుక ప్రజాస్వామ్య వాదులంతా దాన్ని బేషరతుగా బలపర్చాలని నేను వాదించాను. ప్రభాకర్ బలపర్చనన్నాడు. పౌరహక్కుల సంఘంలోనూ కొంతమంది ఇలాగే వాదించారని, అయినా తాను ఒప్పుకోలేదని చెప్పాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడివడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారుల ఆధిపత్యం పోయి తెలంగాణ భూస్వామ్య పెట్టుబడిదారుల ఆధిపత్యం ఏర్పడుతుంది తప్ప,
ఈ అధికారమార్పిడి వలన తెలంగాణ పేదప్రజలకు ఒరిగేదేం లేదని, తెలంగాణలో విప్లవకారులు చేసిన భూస్వామ్య వ్యతిరేక పోరాటానికి తాళలేక ఆనాడు పట్నాలు పారిపోయిన దొరలే ఈనాడు ప్రత్యేక తెలంగాణవాదం ముసుగులో మళ్లీ గ్రామాలకి తరలివస్తున్నారని, అందుకే ఈ బూటకపు భౌగోళిక తెలంగాణ వాదానికి భిన్నంగా నూతన ప్రజాస్వామ్య విప్లవం ద్వారా ఏర్పడే ప్రజాస్వామ్య తెలంగాణ లక్ష్యాన్ని ఎంచుకొన్నామని చెప్పాడు.
ఇప్పుడేమో ఈ వాదాన్ని తలక్రిందులు చేస్తూ భౌగోళిక తెలంగాణ ఏర్పాటు సామాజిక లేదా ప్రజాస్వామిక తెలంగాణకు... ముందు షరతుగా భావించి ముందు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలంటున్నాడు. 'ఈ మహత్తర అవకాశాన్ని వదిలి వాస్తవానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే చరిత్రలో తప్పుచేసిన వారిగా మిగిలిపోతాం' అంటున్నాడు. ప్రభాకర్ సమయానుకూల వాదంలో ఎంత సమయస్ఫూర్తి వున్నా సామాజిక ప్రజాస్వామిక స్ఫూర్తిలేని ఆయన వితండవాదానికి చివరికి ఆయనే చిక్కాడు.
గతంలో ప్రజాస్వామిక తెలంగాణ వాదాన్ని తప్ప భౌగోళిక తెలంగాణ వాదాన్ని బలపర్చేదిలేదని వితండవాదం చేసిన ప్రభాకర్ లాంటివారు ఇప్పుడు భౌగోళిక తెలంగాణ వితండవాదాన్ని ఆశ్రయించటానికి బహుశా ఆయనే అన్నట్లు భౌగోళిక తెలంగాణవాదం ముసుగులో దాగుతున్న తెలంగాణ దొరల సారధ్యంలో ఏర్పడిన తెలంగాణ పొలిటికల్ జెఎసిలో ఆర్నెల్లు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సావాస దోషమే కారణమేమో! ఆర్నెల్లు సావాసం చేస్తే వీరువారవుతారన్నట్లు ప్రజాస్వామ్య తెలంగాణ వాదం భౌగోళిక తెలంగాణవాదంగా రూపాంతరం చెందిందన్నమాట.
ఈ వైఖరి కేవలం చిక్కుడు ప్రభాకర్‌కే పరిమితమైందికాదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న "తెలంగాణ ఐక్యకార్యాచరణ కమిటీ''లాగే ఇతరుల సారథ్యంలో పనిచేసే "తెలంగాణ జనసభ'', "తెలంగాణ ఐక్యవేదిక'' "న్యూడెమోక్రసీ'' లాంటి ప్రజాస్వామిక తెలంగాణవాద వేదికలన్నీ కట్టగట్టుకొని, భౌగోళిక తెలంగాణే ఏకైక లక్ష్యంగా గల తెరాస జేఏసీలో భాగస్వాములై తమ స్వతంత్ర అస్తిత్వాన్ని కోల్పోయి, చివరకు వారి మనుగడే దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది.
ఈ నష్టాన్ని గ్రహించిన కొన్ని సంస్థలు తెరాస జేఏసీ నుంచి వైదొలగి తెలంగాణ ప్రజాఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ లాంటి ప్రజా ఉద్యమ సంస్థల్ని ఏర్పరచి, తమ స్వతంత్రతను నెలకొల్పుకొన్నా స్వతంత్ర ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా ఎదగటంలో విఫలమై తెరాసతోపాటు కాంగ్రెస్, తెలుగుదేశం లాంటి అగ్రకుల పాలకవర్గ పార్టీల విశాలకూటమిని ఏర్పరచి అందులో ఒదిగిపోవాలని చూస్తున్నాయి. అందుకోసం ఎన్ని మెట్లయినా దిగుతామంటున్నాయి. 1997 డిసెంబర్ 28, 29 తేదీలలో "ప్రత్యేక తెలంగాణ - ప్రజాస్వామిక ఆకాంక్షలు'' అన్న అంశంపై వరంగల్‌లో జరిగిన సదస్సు సందర్భంగా "అఖిలభారత ప్రజాప్రతిఘటనావేదిక'' (ఎఐపిఆర్ఎఫ్) ప్రచురించిన కరపత్రంలో ఏం చెప్పారో చూద్దాం.
"ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగుతున్న (భౌగోళిక) తెలంగాణ పోరాటం దానికదే తమపై దోపిడీని పూర్తిగా తొలగించలేదని... కోస్తాంధ్ర, పాలకవర్గాల నగ్నదోపిడీకి వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతూనే తెలంగాణలోని భూస్వామ్య వర్గాలను, వారి ఏజెంట్లను, దేశవ్యాప్త బడాబూర్జువా భూస్వామ్య శక్తులను కూడా ఓడించి ప్రజాస్వామిక శక్తుల విజయానికి తోడ్పడనిదే దోపిడీని పూర్తిగా రూపుమాపుకోలేమని గ్రహించిన చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు నేడు (భౌగోళిక తెలంగాణతోపాటు) ప్రజాస్వామిక తెలంగాణ కోసం కూడా పోరాడుతున్నారు''... "కనుక ఈ పోరాటం కోస్తాంధ్ర పాలకవర్గ కూటమికి మాత్రమే వ్యతిరేకమైందికాదు... తెలంగాణలోని భూస్వామ్య వర్గాలకు కూడా వ్యతిరేకమైందన్న విషయం సుస్పష్టం''గా తేల్చిచెప్పారు.
తక్షణ, దీర్ఘకాలిక ఉమ్మడి లక్ష్యంతో, ఏర్పరిచిన ఆ సంస్థలు భౌగోళిక తెలంగాణ దృక్పథంతో పాటు, వర్గపరమైన ప్రజాస్వామిక దృక్పథాన్ని కూడా జోడిస్తే, సామాజిక తెలంగాణ వాదులు కులపరమైన సామాజిక ప్రజాస్వామ్య దృక్పథాన్ని కూడా జోడించి, "తెలంగాణలో సామాజిక ప్రజారాజ్యం - సామాజిక ప్రజాస్వామ్య రాజ్యం'' అనే నినాదాలను రూపొందించి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని చరిత్రాత్మకమైన మలుపు తిప్పారు. భౌగోళిక తెలంగాణ పోరాటం ప్రధాన స్రవంతి పోరాటంగా వున్నా సామాజిక ప్రజాస్వామిక పోరాటం సైతం ఈ దశలోనే ద్వితీయాంశంగానైనా ఏకకాలంలో ఉనికిలో ఉండాలి.
ఇటువంటి భౌగోళిక సామాజిక ఉమ్మడిలక్ష్యంతో స్వతంత్రంగా పనిచేయాల్సిన ప్రజాస్వామిక తెలంగాణ వాదులు ఆ బాధ్యతను విస్మరించటం క్షంతవ్యంకాదు. సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యాన్ని మలిదశకు వాయిదావేసి, "తొలిలక్ష్యం భౌగోళికమే''నని ముందు భౌగోళిక తెలంగాణ తర్వాత ప్రజాస్వామిక తెలంగాణ అని రెండు దశల సిద్ధాంతం మాట్లాడమంటే తమ వైఖరికి తామే కట్టుబడకుండా వైదొలగటమే అవుతుంది. ఇలాంటి ఉమ్మడి లక్ష్యంలేని తెలంగాణ అగ్రకుల పాలకవర్గ పార్టీల రాజకీయ కూటమి పంచన చేరటమంటే, మళ్లీ తమ స్వతంత్ర అస్తిత్వాన్ని కోల్పోయి వారి తోక పట్టుకు పోవటమే అవుతుంది.
తాము సారథ్యం వహించాల్సిన దళిత బహుజన శ్రామికవర్గ-కుల పీడిత ప్రజలను వారితో కొట్టుకుపోనివ్వటమే అవుతుంది. తెలంగాణకి జైకొట్టే సామాజిక తెలంగాణ వాదం భౌగోళిక తెలంగాణ వాదానికి బాసటగా నిలిచి సహకరించే సైదోడు సానుకూలవాదమేగాని, దానికి ఎదురు నిలిపి పోటీపెట్టి (ఇౌఠn్ట్ఛట ఞౌటజీnజ) దెబ్బకొట్టే ప్రతీఘాతుక ప్రతికూల వాదం కాదు. ఎవరైనా అలాంటి తప్పుడు పనికి పాల్పడితే ఆ తప్పు సూడో సామాజిక న్యాయ అవకాశవాదులదే అవుతుంది గాని దాన్ని నిజమైన సామాజిక తెలంగాణవాదులకు అంటగట్టరాదు.
నిజానికి ముందు భౌగోళిక తెలంగాణ తర్వాతే సామాజిక తెలంగాణ అని సోకాల్డ్ ప్రజాస్వామ్య తెలంగాణ వాదులు, తెలంగాణ అగ్రకుల దొరలు చేసే ఈ వితండ వాదాన్నే సూడో సామాజిక న్యాయవాదులు కూడా అనుకరిస్తున్నారు. "ముందు వర్గీకరణ బిల్లు తర్వాతే తెలంగాణ బిల్లు'' "ముందు మన్యసీమ రాష్ట్రం తర్వాతే తెలంగాణరాష్ట్రం'' అంటూ తెలంగాణేతర అంశాల్ని తెలంగాణకి ఎదురుపెట్టి, పోటీపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు.
ప్రాంతీయ వెనుకబాటు తనమే ప్రాతిపదిక అయితే తెలంగాణ ప్రాంతం కంటే అత్యధికంగా వెనుకబడి వున్న మన్యం ప్రాంతాన్ని ముందుగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచటం న్యాయమనే ఈ వాదన మన్యం రాష్ట్రం కోసం చేసేవాదన కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని మోసపూరితంగా అడ్డుకోవటానికి చేసేవాదన. ఈ వాదన ప్రకారం వెనుకబాటుతనం ప్రాతిపదికపై మన్యం రాష్ట్రం ఏర్పర్చాల్సిన పనిలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పర్చాల్సిన పనికూడా లేదు. రెండు ప్రాంతాలకి గూర్ఖాహిల్ కౌన్సిల్ లాగా అటానమస్ అభివృద్ధి మండలాలు ఏర్పరిస్తే చాలు అంటూ ముగుస్తుంది.
కనుక తెలంగాణేతర అంశాల్ని తెలంగాణకి ఎదురుపెట్టి, పోటీపెట్టి, దెబ్బకొట్టాలని చూస్తున్న ఇలాంటి కొందరు అవకాశవాదులు చిరంజీవిలాంటి సూడో సామాజిక న్యాయవాదులే తప్ప నిజమైన సామాజిక న్యాయవాదులు కాదు. తెలంగాణ వాదాన్ని కాదని తెలంగాణలో ఏ రాజకీయపార్టీ కాలూనలేని స్థితిని గ్రహించి, ఆ గండం గట్టెక్కించుకొని తెలంగాణతో సహా మొత్తం ఆంధ్రప్రదేశ్‌ని స్వీప్‌చేసి ఎన్టీఆర్‌లాగా ముఖ్యమంత్రి అయిపోవాలని సినిమా కలలుగన్న చిరంజీవి కూడా 2009 ఎన్నికల సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో రథయాత్ర చేసినపుడు ఇలాగే దొరల తెలంగాణ కాదు సామాజిక తెలంగాణ అని డైలాగులు దంచాడు.
మరి ఆంధ్రలో కూడా సమైక్యాంధ్ర కాదు, సామాజిక ప్రత్యేకాంధ్ర కావాలని ఎందుకు రథయాత్ర చేయలేదు అని తెలంగాణ వాదులు నిలదీస్తే తెల్లమొహం వేశాడు. ఆ దెబ్బకు తన కుటిల ఎత్తుగడలు పారకపోవటంతో ఆ తర్వాత సమైక్యాంధ్ర అవతారమెత్తిన చిరంజీవి నిజస్వరూపమేమిటో ఆనాడే బట్టబయలైంది. మిగతా సూడో సామాజిక తెలంగాణ వాదులు సైతం ఇందుకు మినహాయింపు కాదు.
- ఉ.సా
చైర్మన్ - సామాజిక ఆంధ్ర - తెలంగాణ సమన్వయ కమిటీ