Showing posts with label యం.ఎఫ్.గోపీనాథ్. Show all posts
Showing posts with label యం.ఎఫ్.గోపీనాథ్. Show all posts

Friday, December 5, 2014

చెదలు పట్టిన చైతన్యం - డా. ఎం.ఎఫ్‌. గోపీనాథ్‌



‘మన రాష్ట్రం-మన పాలన’ అనుకున్న మూడవ రోజు నుంచే రైతుల బతుక్కి భరోసా లేక 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఉద్యమానికి ఊపిరిలూదిన ఉస్మానియా విద్యార్థుల్ని ‘నియామకాలు-నిధులు-నీళ్ళు’ నినాదాలు ఎక్కిరించి నిరాహారదీక్షకు నెట్టబడ్డారు. హైదరాబాద్‌ చుట్టూరా ఉన్న 21 లక్షల ఎకరాల భూమి బడా పెట్టుబడిదారులకు అధికారిక ధారాదత్తం కాబోతున్నది. దళితుల మూడు ఎకరాల భూమి నినాదం అమలు ‘చంద్ర’ మండలంలోనో లేక అంగారక గ్రహంలోనో సాధ్యమయ్యేట్లున్నది.
పాలక వర్గం మేధావుల్ని ఎంత ఎక్కువగా తనలో యిముడ్చుకుంటుందో, అంత స్థిరంగానూ, అంత ప్రమాదకరంగానూ దాని పాలన తయారవుతుంది.
- మార్క్స్‌
ఆంటోనియో గ్రాంసీ 1930ల్లో ఇటలీ సమాజంలో వస్తున్న మార్పుల్ని ఆ సమస్యల పట్ల మేధావుల స్పందనను గురించి వివరించే క్రమంలో మేధావుల్ని రెండు రకాలుగా విభజించాడు. వారినే సాంప్రదాయక మేధావులు, సజీవ మేధావులు అన్నాడు. సాంప్రదాయక మేధావులు యథాతథ వాదులు-పాలక వర్గ పక్షపాతులు. పాలక వర్గాల దోపిడీకి, అరాచకాలకు రంగులద్దుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేవారు. ఈ కోవలకి చెందినవారే మతాధిపతులు, పూజారులు, సామాజిక శాస్త్రవేత్తలు/ఆర్థిక శాస్త్రవేత్తలు తదితరులూను. ప్రజల సమస్యల పట్ల సానుభూతి, సహా నుభూతి ఉన్న మేధావి వర్గం సాంప్రదాయ మేధావివర్గానికి భిన్నంగా ఉంటుంది. దీన్నే ఆర్గానిక్‌ ఇంటెలెక్చువల్స్‌/ సజీవ మేధావి వర్గం అన్నాడు గ్రాంసీ. ఉదాహరణకు వామపక్ష మేధావులు, తెలంగాణ మేధావులు మొదలగు వారు. సాంప్రదాయక మేధావులతో గానీ, సజీవ మేధావులతో గానీ సమస్య లేదు. సమస్య ఎప్పుడొస్తుంది? సజీవ మేధావులుగా చలామణీలో ఉన్న వామపక్ష, దళిత, తెలంగాణ మేధావులు ఏ ఉద్యమాల గురించి అయితే ప్రజలకు వివరించి, ప్రజల్ని భాగస్వాములుకండని ప్రభోదించారు కదా. మరి ఆ ఉద్యమాల్ని స్వార్థపరులు కొందరు హైజాక్‌చేసి, నిరంకుశ నాయకులుగా తయారయ్యారో, తయారవుతున్నారో ఆ నిరంకుశత్వాన్ని నిరసించవల్సిన ఈ సజీవ మేధావులు సడెన్‌గా బ్రెయిన్‌లెస్‌/ స్పైయిన్‌లెస్‌ మృత జీవులుగా మారిపోతున్నప్పుడు తప్పక సమ స్య వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో గానీ, తెలంగాణ రాష్ట్రం కొరకు జరిగిన పోరాటంలో గానీ పాల్గొన్న ‘వామపక్షం’ బురఖా వేసుకొన్న మేధావులు, తెలంగాణ ఉద్యమ ముసుగు వేసుకొన్న భూస్వామ్య బ్రాహ్మణీయ శక్తులకు అన్ని విధాల తమ సహాయ, సహకారాలందించారు. సామాజిక తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణకు ప్రతిగా కుట్రపూరిత దొరస్వామ్య అనుకూల ‘గెట్టు’ తెలంగాణకే మద్దతుపలికారు. మొదట తెలంగాణ రానియ్యండన్న మోసపూరిత వాదనతో తెలంగాణలోని సోషల్‌ ఆర్గనైజేషన్స్‌ అన్నింటినీ నిర్వీర్యం చేసారు. వామపక్ష విప్లవ పార్టీలకు మద్దతుదారులుగా చలామణి అవుతున్న కొందరు మేధావులు. తెలంగాణ భూస్వామ్య ప్రతినిధి అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఏకంగా సివిల్‌ లిబర్టీస్‌ మీటింగ్‌కి గౌరవ అతిథిగా ఆహ్వానించారు.
ఈ మేధావులు ఎందుకు యింతగా దిగజారారు? మావోయిస్ట్‌ ఎజెండానే మా ఎజెండా అన్న కేసీఆర్‌ సాధారణ ప్రజాస్వామ్య హక్కు అయిన సభ జరుపుకునే హక్కుని గూడా (గత సెప్టెంబర్‌ 21న) దక్కనియ్యలేదు. మరి తెలంగాణ మేధావి వర్గం నోరెందుకిప్పట్లేదు? ఇవి క్రోనీ కేపిటలిజం రోజులు. క్రోనీ కాపిటలిజం (ఆశ్రిత పెట్టుబడి), క్రోనీ మేధావుల్ని (ఆశ్రిత మేధావుల్ని) తయారు చేసుకుంది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల సందర్భంలో గానీ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ‘బి’ కేటగిరీ విద్యార్థుల ఫీజు ఉమ్మడి రాష్ట్రంలోను, పక్క రాష్ట్రంలోను అంతకు ముందున్న రూ.5 లక్షల 25వేల నుంచి అకస్మాత్తుగా రూ.9.5 లక్షల నుంచి 12 లక్షల వరకు పెంచినప్పుడు కానీ నోరెత్తని తెలంగాణ ఉద్యమ మేధావివర్గం మౌనాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తెలంగాణ రైతులు అనుభవిస్తున్న కరెంట్‌ కష్టాల్ని తీర్చడానికి మూడు సంవత్సరాలు అవసరమా? ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో కుదుర్చుకున్న 1000 మెగావాట్ల కరెంట్‌ని తెలంగాణ రైతులకు అందించటానికి, కరెంట్‌ స్తంభాలు, వైర్లు వేయడానికి మూడు సంవత్సరాలు పడ్తాయా? అంతకన్నా సులువైన మార్గం తెలం గాణ విద్యుత్‌ ఉద్యోగ మేధావులు సూచించలేరా? తెలంగాణ ప్రభుత్వం-ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాల మధ్య జరిగిన సామరస్య ఒప్పందాల్ని కేంద్రప్రభుత్వం తనకు నష్టం లేనంతవరకు ఒప్పుకుని తీరుతుంది. ఉన్న కరెంట్‌లైన్ల ద్వారానే రామగుండం నుంచి కేంద్రానికి వెళ్ళే భాగాన్ని తెలంగాణకి మళ్ళించి వెంటనే తెలంగాణ రైతు ఆత్మహత్యల్ని ఆపవచ్చు. మరి ఇంతటి ప్రాముఖ్యం ఉన్న విషయాన్ని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మేధావివర్గం చర్చకెందుకు పెట్టడం లేదు? ప్రత్యేక రాష్ట్రం వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ‘తెలంగాణ జిందా తిలిస్మాత్‌’ని ప్రజాసమూహాల మెదళ్ళకి నిత్యం పూసిన మేధావివర్గం యిప్పుడు పట్టిన మౌన వ్రతానికి అర్థం ఏమిటి? రైతు ఆత్మహత్యలు పక్క రాష్ట్రంలో లేవా అని ప్రశ్నించే మేధావి వర్గం, కాంగ్రెస్‌, టీడీపీ పాలన వల్లనే ఈ ఆత్మహత్యలు అంటున్న తెలంగాణ మీడియా, కాంగ్రెస్‌ని, టీడీపీని ఓడించి టీఆర్‌ఎస్‌కి అందుకే కదా పట్టం కట్టామని గజ్వేల్‌లోనే ఓ రైతు నిలదీసినప్పుడు ఏమి సమాధానం చెప్పారు? దొరసాని బతుకమ్మకి పది కోట్లు, మెట్రోపాలిస్‌ డ్రింకింగ్‌-డ్యాన్సింగ్‌ పార్టీకి 500 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆత్మహత్యలు చేసుకొన్న రైతు కుటుంబాన్ని ఓదార్చే, బతుకు భరోసా ఇచ్చే టైం గానీ లేదా? రైతు కుటుంబాల బాకీలు గరిష్ఠంగా మూడు లక్షల దాకా ఉంటాయేమో. ఆ మాత్రం అయినా అందించి బజారున పడ్డ ఆ కుటుంబాలను ఆదుకోవచ్చు. ఆ మేరకు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మేధావులు రాష్ట్ర ముఖ్యమంత్రిని ‘బాంచెన్‌ దొరా అప్పుల పాలైన మన రైతుల బాకీ తీర్చి రైతుల బతుక్కి భరోసా యివ్వండని’ అయినా ప్రాధేయపడవచ్చు తప్పులేదు!
దళితులకు మూడెకరాల భూమి, పెట్టుబడి ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో తొలి దళిత ముఖ్యమంత్రి లాంటి నినాదమేనని యిప్పటికే స్పష్టమయింది. మహబూబ్‌నగర్‌లో పంచిన పట్టాలు (భూమికాదు) పట్టుకొని ‘మూడు ఎకరాలు’ భూమెక్కడుందా ఆని వెదుకుతున్నారు దళితులు. దివంగత రాజశేఖర్‌ రెడ్డి అన్నట్లు దళితులకు భూ పంపిణీ ‘ఒక నిరంతర ప్రక్రియ’ అంటే అది ఎప్పటికీ ముగియదు. తెలంగాణ భూమండలం మీద భూమి దొరకట్లేదు కాబట్టి, ‘చంద్ర’ మండలంలోనో, అంగారక గ్రహంలోనో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానంటారేమో కేసీఆర్‌!
అరవై సంవత్సరాల మన తల్లి తెలంగాణ దాస్య శృంఖలాలు తెంపి వలస పాలకుల కబంధ హస్తాల చెరనుంచి ‘గెట్టు’ తెలంగాణని మాత్రమే సాధించుకున్నామన్న విషయం మరచిపోవద్దు. తెలంగాణ వెనుకబాటుతనానికి కారకులైన ఏ భూస్వామ్య వర్గాలు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి తరిమివేయబడ్డారో ఆ దొరల చేతిలోకే నూతన తెలంగాణ రాష్ట్ర అధికారం బదలాయించబడ్డది. భారతదేశ స్వాతంత్య్ర పోరాట ఫలితం ఏ విధంగానైతే యూరో ఆర్యన్ల నుంచి ఇండో ఆర్యన్ల చేతిలోకి అధికార మార్పిడి జరిగిందో అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్‌ వలన మూడు లక్షల మంది గిరిజనులను బలిచ్చి హైదరాబాద్‌ని పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా, గవర్నర్‌ పాలన క్రింద ఉండే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్న తరువాత ‘గెట్టు’ తెలంగాణ ఇవ్వబడింది. ఇది ఆంధ్ర పెట్టుబడిదారీ వలసవాదానికి, తెలంగాణ భూస్వామ్య నయా పెట్టుబడిదారీ వర్గానికి మధ్య కుదిరిన ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ పవర్‌ ఎగ్రిమెంట్‌ ఫలితమే. తెలంగాణ శ్రమ సంస్కృతి ‘బంగారు బతుకమ్మ దొరసాని’ అవతారం ఎత్తి కళ్ళముందే కదలాడసాగింది. స్వచ్ఛమైన తెలంగాణ భాషా సంస్కృతి, బూతు భాషా సంస్కృతిగా మీడియాకెక్కింది. పండగరోజే యింట్లో పీనుగులున్నట్లు ‘మన రాష్ట్రం-మన పాలన’ అనుకున్న మూడవ రోజు నుంచే రైతుల బతుక్కి భరోసా లేక 480 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు.
ఉద్యమానికి ఊపిరిలూదిన ఉస్మానియా విద్యార్థుల్ని ‘నియామకాలు-నిధులు-నీళ్ళు’ నినాదాలు ఎక్కిరించి నిరాహారదీక్షకు నెట్టబడ్డారు. హైదరాబాద్‌ చుట్టూరా ఉన్న 21 లక్షల ఎకరాల భూమి బడా పెట్టుబడిదారులకు అధికారిక ధారాదత్తం కాబోతున్నది. అయితే దళితుల మూడుఎకరాల భూమి నినాదం అమలు ‘చంద్ర’ మండలం లోనో లేక అంగారక గ్రహంలోనే సాధ్యమయ్యేట్లున్నది. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న లక్షల దళిత కుటుంబాలకు ఈ మూడు ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వం అధికారిక నిశ్శబ్దం పాటిస్తుంది. ఆంధ్రా వలస పాలకుల హయాంలో మూతపడ్డ అజాంజాహి మిల్స్‌, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సంగతేందో యిప్పటివరకు నోరు మెదపలేదు. నిజాం, పాలేరు షుగర్‌ ఫ్యాక్టరీలను రైతుల నోళ్ళలో దుమ్ముకొట్టి కారుచౌకగా అమ్మినప్పుడు వేసిన రంకెలు ఏమయ్యాయి? ‘మన ఊరు-మన ప్రణాళిక’ మన దొర-మన దొర దోపిడీగా మరానున్నదా? మావోయిస్ట్‌ ఎజెండానే మన ఎజెండా అన్న నాయకులకు మరి ఆదిలాబాద్‌లో ఎన్‌కౌంటర్లు చెయ్యమని మావోయిస్టులే చెప్పారా? ఇవన్నీ తెలిసిన మేధావి వర్గం మౌనమేలా? తెలంగాణలోని అన్ని కుల/వర్గాల సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునే జిందా తిలిస్మాత్‌గా చూపించిన మేధావివర్గం పట్టిన ఈ నూతన మౌనదీక్షను అర్థం వెతుక్కోలేని స్థితిలో చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలున్నారనే భ్రమకు గురౌతున్నారా ఈ మేధావులు? ఈ 13 సంవత్సరాల్లో దళిత చైతన్యం ధ్వంసం చేయబడ్డది. వామపక్ష భావజాలాన్ని భ్రష్టు పట్టించారు. విద్యార్థుల భవిష్యత్తు అంధకారమౌతుంది. రైతులు ఆత్మహత్యలే పరిష్కారమనుకుంటున్నారు. కరెంట్‌ కష్టాలు తీరేట్లు లేదు. మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల సమస్యల్ని ప్లేబాయ్‌ క్లబ్‌లో, ఫేజ్‌-3 క్లబ్లుల్లో, కరీంనగర్‌ని న్యూయార్క్‌గాను, నిజామాబాద్‌, ఖమ్మంలను లండన్‌ గాను అనుకొని, హైదరాబాద్‌ని గ్లోబల్‌ సిటీ అనుకుని బతికేయండని అంటున్నారు. అట్లా అనుకుంటూ ఈ పాపం అంతా పక్కరాష్ట్రం వాళ్ళ మీదకు నెట్టేసి బతుకులీడుద్దామా? గెట్టు తెలంగాణని గట్టు మీద పెట్టి జన తెలంగాణని సాధించుకుందామా? ఇక బేరసారాల రాజకీయాలను పక్కన బెడదాం.
డా. ఎం.ఎఫ్‌. గోపీనాథ్‌
అధ్యక్షులు, తెలంగాణ జనసమితి

Andhra Jyothi Telugu News Paper Dated: 05/12/2014 

Monday, September 23, 2013

నా మంచం నాఇష్టం! (Book Review) డా ఎం.ఎఫ్‌. గోపీనాధ్‌ రచన ‘నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా? అయితే సంతోషం!’ ఆవిష్కృతమవుతున్న సందర్భంగా ఆ పుస్తకంలోని కొన్ని భాగాలు)


నా కంప్యూటర్‌ నా ఇష్టం, నా ఫేస్‌ బుక్‌ నా ఇష్టం- అనాలి గానీ నా మంచం, నా ఇష్టం ఏంటి అనుకుంటున్నారా? భూమికి ఆత్మగౌరవానికి సంబంధం ఉన్నట్లే ఈ దేశంలోని గ్రామీణ జీవితంలో మంచానికి ఆత్మగౌరవానికి, కుల అణచివేతకు సంబంధం ఉందని నా నమ్మకం. చాలా మంది నాగరీకులు ఒప్పుకోకపోవచ్చు. కాని కుర్చీ కన్నా మంచానికే ఈ దేశ గ్రామీణ జీవితంలో విలువెక్కువ. మీరు నాలాగా ఊరోళ్లైతే మంచానికి ఆత్మగౌరవానికున్న లింక్‌ ఏమిటో అర్థం అవుతుంది. ఆ లింకేంటంటే ఈ దేశంలో మనుష్యులందరూ సమానం కాదని, అట్లా ఉండటానికి వీల్లేదని వేదాలు ఘోషించాయి. అట్లా అని బ్రాహ్మణేతరులను నమ్మించారు. అందుకే దోపిడీ కులపోడొస్తే, దోపిడీకి గురయ్యే కులపోడు మంచం మీద కూర్చోటం అపచారం, అరిష్టం అయింది. మా ఇండ్లలో అంటే మాల మాదిగిండ్లల్లో కూడా మంచాలు ఉంటాయి. పందిరి మంచాలు లేకపోయినా కుక్కి మంచాలైనా ఉంటాయి.

కనీసం ఒక్క మంచమైనా ఉంటుంది. మా కన్నా పై కులపోళ్లు మా ఇంటికి ఎవరొచ్చినా, లేక అటువైపు వెళ్తున్నా మేమందరం అంటే లేవలేని గర్భిణీ స్త్రీలైనా, ముసలోళ్లైనా దిగ్గున లేచి లెంపలేసుకోవాలి. వాళ్లు వచ్చినప్పుడే కాదు, రాకముందు కూడా మంచంలో కూర్చున్నందుకో, ‘మంచం’ అనే వస్తువును ఇంట్లో ఉంచుకున్నందుకో కాని, మా వాళ్లు తరతరాలుగా లెంపలేసుకుంటున్నారు. మా చిన్నప్పుడు, మా గూడెంలో మా పెద్దోళ్లు మాకు నేర్పే రూల్‌ నెం.1. పెద్ద కులపోళ్లు వస్తే మంచం మీద కూర్చోకూడదు. రూల్‌ నెం.2. కూర్చుంటే దిగ్గున లేచి, లెంపలేసుకోవాలి. రూల్‌ నెం.3. తలకు చుట్టుకున్న తలగుడ్డ తీసి, మంచాన్ని దులిపి ‘కూర్చోండయ్యా’ అని, వంగి రెండు చేతులు మంచం వైపు చూపించాలి. 

దీనికి భిన్నంగా జరక్కూడదు. ఒక వేళ ముసలివాళ్ళు మంచం మీద పడుకోవాలనుకుంటే మంచాన్ని తలక్రిందులుగా వేసి అంటే మంచంకోళ్ళు పైకి, నులక క్రిందకు వచ్చేటట్లు వేసికొని పడుకోవాలి. ఊరు, వాడకు సరిహద్దు మా ఇల్లు. మా ఇంటికి పడమర మాల ఇళ్లు, తూర్పున ఒక గౌండ్ల ఇల్లు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత కంసాలోళ్ల ఇల్లు. దాని పక్కనే వేరే ఊరు నుండి వచ్చిన రెడ్డోళ్ళ ఇల్లు, దక్షిణాన కొంచెం మోతుబరి రెడ్ల ఇళ్ళు, ఉత్తరాన దొడ్లు ఉన్నయి. మా ఇంటికి ఉత్తరాన ఉన్న దొడ్లలో నుండి మెయిన్‌రోడ్‌కు (డొంక)కు అనధికార దారి ఉంది. ఆ దారి గుండా నడిస్తే శూద్రోళ్లకు ఒక అరకిలోమీటర్‌ దూరం కలిసి వస్తుంది, మెయిన్‌రోడ్‌ ఎక్కటానికి. చిన్నప్పటి నుండి నాకొక అలవాటు ఉంది. అదేంటంటే, నా మంచంలో నేను కూర్చోవటం. ఎవరొచ్చినా సరే మంచం మీద నుండి లేవకపోవటం. 

ఈ అలవాటు ఈ దేశంలోని దళితులకు నిషిద్ధం. కానీ నేనట్లా అనుకోలేదు. నా మంచం నా ఇష్టం. అందుకే మా ఇంటి ముందు దారి ప్రక్కన మంచం వేసుకుని స్వేచ్ఛగా కూర్చోని బువ్వ తినేవాణ్ణి. శూద్ర కులాలు అంటే రెడ్లు, కోమట్లు, కొన్ని బీసీల కులాలవాళ్లు ఆ దారి వెంట వెళ్తున్నప్పుడు లేచేవాణ్ణి కాదు. ఈ ‘సద్గుణా’లేవీ నాకబ్బలేదు. అందుకు నేను ఏనాడూ చింతించలేదు. పైగా గర్వపోతుననే పేరు కూడా వచ్చింది. సోకాల్డ్‌ అగ్రకులాల్తో ‘గర్వపోతు’నని 1965ల్లోనే పిలిపించుకున్నానంటే, మీకేమనిపిస్తుందో నాకు తెలీదు కానీ మరో జన్మంటూ ఉంటే మా వూళ్లోనే, మా కులంలోనే లేదా అలాంటి కులంలో ఏదో ఒక దాన్లో పుట్టి అయ్యంకాళి అంత ఎత్తున ఎదిగి నడిమంచంలో మళ్లీ మళ్లీ కూర్చోవాలనిపిస్తుంది.

ఆ నా అలవాటును సవాలుగా తీసుకున్నారో, లేక అవమానపడ్డారో కాని ఆయా కులాలవాళ్లు ఆ దారిన రావటం మానేశారు. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను కానీ మా పెద్దయ్య కొడుకు శౌరి అన్నయ్య మాత్రం ‘జాగర్తరా! మనం అడవిలోకి పోతే ఏ చెట్టు మీద గొడ్డలేస్తాం? మంచిగున్న దాని మీదే కదా! మరి మా అందరిలో నువ్వే చదువుకుంటున్నావు. నీ పోకడేమో పెద్ద కులపోళ్ళని లెక్కచేయడం లేదు. జాగర్త!’ అన్నాడు.
......
మా ఊళ్ళో నేను ప్రైమరీ స్కూల్‌లో చదివేటప్పుడు మా ఊరి పంతులమ్మగారు (బ్రాహ్మణావిడ) ఒక పరీక్ష పెట్టారు. ఒక పుస్తకంలో రాజస్తాన్‌, భోజ్‌పూర్‌, ఉదయ్‌పూర్‌, జైపూర్‌, జంతర్‌మంతర్‌ లాంటి పదాలతో కూడిన పాఠం ఉంది. ఈ పాఠాన్ని తప్పుల్లేకుండా అందరూ చదవాలి. ఒకవేళ చదవకపోతే చదివినవాళ్లతో లెంపకాయ వేయిస్తానన్నారు పంతులమ్మగారు. మొదట మా క్లాస్‌లోని రెడ్డోళ్ళ పిల్లల్ని చదవమంది. అ పదాల్ని పలకలేక చదవలేకపోయారు. నన్ను చదవమంటే చదివాను. పంతులమ్మగారు లెంపకాయ వేయమంది. రెడ్డి పిల్లవాడి చెంప మీద ఒక్కటేశాను. వెంటనే పెద్ద గొడవ మొదలైంది. పంతులమ్మగారిని నిలదీయటానికి ఓ గుంపు స్కూల్లోకి వచ్చింది. ‘ఎంత ధైర్యం? మాలోడి చేత రెడ్డోరి పిల్లల్ని కొట్టిస్తావా?’ అని. పంతులమ్మ బిక్క మొఖం వేసి స్కూల్‌కు శెలవిచ్చింది.
.....
ఒకరోజు పంతులుగారు వానొచ్చినందువల్ల గోసీడు నుండి రాలేదు. బడిలో పిల్లలందరం గోల చేస్తున్నాం. అంతలోనే ఏమైందో ఏమోగాని మా దళిత పిల్లల్ని ఊరోళ్ళ పిల్లలందరూ కలిసి చీపుర్లు తీసుకుని బడి నుండి వెళ్ళగొట్టారు. ఇప్పటికీ ఈ సంఘటన నాకు అవమానంగా తోస్తుంది. బహుశా ఇలాంటి కార్యక్రమాలన్నీ అంటరానివాళ్ళ చదువును అడ్డగించే హిందూ ప్రణాళికలో భాగమనుకుంటాను. లేకుంటే అంత సడెన్‌గా ఒక రిఫ్లెక్స్‌లాగా ఊళ్లో అన్ని కులాల పిల్లలు ఏకమై మాలోళ్ళ పిల్లల్నందరినీ బడి నుండి గెంటేయడమేమిటి? ఇలాంటి హిందూ స్వభావానికి భిన్నంగా ‘మీరు చదువుకోవాలి’ అని స్కూల్స్‌ పెట్టిన క్రిస్టియన్స్‌ను, ‘మీరు ఆరోగ్యంగా ఉండాలి’ అని 150 సంవత్సరాల క్రితమే మిషన్‌ ఆసుపత్రులు కట్టించిన క్రిస్టియన్‌ మతాన్ని మేము గౌరవించి, మతం మార్చుకుంటే గాంధీలాంటి రుషులకు ఎందుకు కోపం? మేం చదువుకోవడం, జ్ఞానాన్ని పొందడం, ఆత్మగౌరవంతో బతకడం, గాంధీలాంటి అభివృద్ధి నిరోధకులకు ఇష్టముండదు కాబోలు. 

మేము చదువుకున్న ప్రైమరీ, హైస్కూల్‌ పుస్తకాల్లో ఒక ఫూలేని గురించికానీ, అంబేడ్కర్‌ గురించి కానీ, సావిత్రీబాయి ఫూలే గురించి కానీ ఏమీ లేదు. అభివృద్ధి నిరోధకులైన కులతత్వవాదుల గురించి మాత్రం గుట్టల కొద్దీ గుప్పించారు. నేను ప్రైమరీ స్కూల్లో చదువుతుండగా మాకు మహాత్మా గాంధీ గురించి ఒక పాఠం ఉంది. పాఠంలో అన్ని సుగుణాలతోపాటు ‘గాంధీగారు ఎప్పుడూ అబద్ధం ఆడలేదు’ అని మా పంతులుగారు ఒకటే మెచ్చుకుంటున్నారు. నా చిన్న మెదడుకు అప్పుడే ఒక అనుమానం కలిగింది. అసలు అబద్ధం ఆడకుండా ఉండడం ఏ మనిషికైనా ఎట్లా సాధ్యం? అని. ఇప్పుడనిపిస్తుంది. వకీలు వృత్తిని చేపట్టిన వ్యక్తికి, వ్యాపార కులం నుండి వచ్చిన వ్యక్తికి అబద్ధం చెప్పాల్సి రావడమనేది వాళ్ల వృత్తే కదా! ఇది చాలా వాస్తవ విరుద్ధమైన విద్యా బోధన. 
... 
1978 ఫిబ్రవరి 24న ఆర్‌ఈసీ వరంగల్‌లోని ఒక హాస్టల్‌లో నేను ‘వైట్‌మాన్‌’ అనే ప్రకాశ్‌ మాస్టర్‌ (ఐ.వి. సాంబశివరావు)ను కలవటం జరిగింది. ఆయన రహస్య జీవితం గడుపు తున్నారని, రాడికల్‌ విద్యార్థి రాష్ట్ర మహాసభలకు ఇంచార్జ్‌గా వచ్చారని తర్వాత తెలిసింది. ఆయన ఆ రోజు ‘చెరుకూరి రాజ్‌కుమార్‌ అధ్యక్షుడిగా, రవి ఉపాధ్యక్షుడిగా, నేను ప్రధాన కార్యదర్శిగా మరి కొంతమందిని మహాసభ ఎన్నుకో బోతున్నదని, బాధ్యతగా ఉండాలని చెప్పారు. అధ్యక్షుడిగా రవిని ఉంచాలని వరవరరావు పట్టుబట్టాడని, అయినా పార్టీ ఒప్పుకోలేదని ‘వైట్‌మాన్‌’ తర్వాత చెప్పారు. ఈ విషయం రవి చాలాసార్లు, అక్కడక్కడ రాజ్‌కుమార్‌కన్నా తనకే అధ్యక్షుడయ్యే అర్హత ఉందని అన్నందువల్ల ఒక ఎగ్జిక్యూటివ్‌ మీటింగ్‌లో, అనేక ఇతర అభియోగాలతో కలిపి రవిని ప్రకాశ్‌ మాస్టర్‌ నిలదీయటం, రవి తన తప్పు ఒప్పుకుని, ఉపాధ్యక్షుడిగా రాజీనామా చేస్తాననడం, ప్రకాశ్‌ మాస్టారే వారించి, సవరించు కోమనడం... 

ఇవన్నీ 1978లో జరిగాయి. వాస్తవంగా రాజ్‌కుమార్‌కున్న పట్టుదల, నిరాడంబరత, నిజాయితీ, సిద్ధాంత పరిజ్ఞానం రవిలో పదోవంతు కూడా లేదనేది వాస్తవం. మరి వరవరరావు రాజ్‌కుమార్‌ను ఎందుకు వద్దన్నాడు? రవిని ఎందుకు సపోర్ట్‌ చేశాడు? రవి బ్రాహ్మణుడు, వరవరరావు బ్రాహ్మణుడు. రాజ్‌కుమార్‌ బ్రాహ్మణుడు కాదు. రవి 1979లో ఖమ్మంలో జరిగిన రాడికల్‌ యూత్‌ లీగ్‌ సభల్లో పనిచేసి ఆ తర్వాత బాంబే వెళ్లిపోయాడు. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ తమ్ముడు కాబట్టి ఒకసారి కలిశాడు. రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యాడు. 1978 ఫిబ్రవరి, 25, 26 తేదీల్లో వరంగల్‌లో రాడికల్‌ విద్యార్థి సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలు ప్రారంభమవుతాయన్న రోజు ఉదయం, లిన్‌పియావో గ్రూపుకు చెందిన రామిరెడ్డి (ఇప్పుడు ప్రొఫెసర్‌ రామిరెడ్డి) నాయకత్వంలో కరపత్రాలు పంచు తున్నారు.

‘కొండపల్లి బొమ్మలు కొలువు తీరటానికి తప్ప పోరాటానికి పనికిరా’వని, ‘నరకండి, చంపండి భూస్వాముల్ని’ అని నినాదాలు ఇచ్చుకుంటూ వెళ్తున్న పదిమందిని చూశాము. ఈ మహాసభల్ని లీగల్‌గా ఉన్న వరవరరావు అన్నీ తానై నడుపుతున్నాడు. నాకు పరిచయం లేదు. అరుణ్‌ శౌరి (బ్రాహ్మణుడు, బిజెపీ ప్రభుత్వంలో పబ్లిక్‌ సెక్టార్‌ని నిండా ముంచిన మంత్రిత్వశాఖ మంత్రి) ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథి, ప్రారంభోపన్యాసకులు. ఈ వ్యక్తిని ప్రారంభోపన్యాసానికి ఆహ్వానించడానికి బాధ్యులు వరవరరావే. భారతీయ చరిత్రలో అభివృద్ధి నిరోధక బ్రాహ్మణులకు, లిబరల్‌ బ్రాహ్మణులకు, హాట్‌లైన్‌ ఎప్పుడూ ఆపరేట్‌ అవుతుం దనటానికి అరుణ్‌శౌరి, వరవరరావుల అనుబంధమే ఒక తాజా ఉదాహరణ. అంబేడ్కర్‌ మీద విషం వెళ్లగక్కిన ‘వర్షిప్పింగ్‌ స్మాల్‌ గాడ్స్‌’ అనే పుస్తకాన్ని రాసిన అరుణ్‌శౌరి, అంబేడ్కర్‌ను అవమానించి, తర్వాత అంబేడ్కర్‌ యువజన సంఘాలు దండెత్తాయని, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మోకరిల్లిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ (ఎం.పి.) వరవరరావుకు మిత్రులవటం యాదృచ్ఛికం కాదు.
.....
ఉస్మానియాలో ఎండీ. చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది. కరీంనగర్‌ జిల్లా మిట్టపల్లి ప్రాంతానికి చెందిన ఒక వెలమ దొరను పీపుల్స్‌వార్‌ స్క్వాడ్‌ గొడ్డలితో నరికింది. ఆ పేషెంట్‌ న్యూరో సర్జరీ వార్డులో ఉన్నాడు. ఓ రాత్రి డ్యూటీలో పేషెంట్‌కు బాగాలేదని అక్యూట్‌ మెడికల్‌ కేర్‌లో ఉన్న మాకు ‘కాల్‌’ వచ్చింది. వెళ్ళి మెడికల్‌ హిస్టరీ తీసుకుంటే, పేషెంట్‌ చెప్పాడు ‘నక్సలైట్లు నరికారు’ అని. పేషెంట్‌కి కావల్సిన వైద్యం అందించి వచ్చాను. తరువాత ఒకానొక సందర్భంలో ఈ విషయం చర్చకు వచ్చింది. ఒకరు అన్నారు కదా ‘పార్టీ చంపాలనుకున్న వాడు కదా. ఫినిష్‌ చేసేస్తే సరిపోయేది’ అని. ‘ఆ పని చేయాల్సింది పార్టీ. డాక్టర్‌ కాదు. శుత్రువైనా వైద్యం కొరకు వస్తే రక్షించే పంపుతాము. ఆ దొరగాడు మరలా వస్తాడు కదా! మీ చేతికి చిక్కుతాడు కదా!’ అన్నాను. ఇలాంటి అభిప్రాయలున్న నాపట్ల నిమ్స్‌ హాస్పిటల్‌లో చేరే పోలీసులకెందుకు భయం అనుకున్నాను. లేని జబ్బుల్ని అడ్డం పెట్టుకొని జైళ్ళు, కోర్టుల నుండి తప్పించుకోటానికి హాస్పిటల్స్‌లో చేరి, హాయిగా మందుకొట్టే రాజకీయ నాయకులకు, కార్పొరేట్‌ గుండాలకు ‘రహస్యం’ బయటపడ్తుందేమోననే భయం ఉండాలి గానీ వీళ్ళ కెందుకు భయం? 
...
మానవత్వాన్ని మంటగలిపి, మారకపు విలువల్నే ప్రధానం చేసిన మృగాల మధ్య, కత్తుల వంతెన మీద నుండి నడుచుకుంటూ ఊరుకి వాడకీ మధ్యనున్న సరిహద్దుల్ని చెరిపే ఒక సున్నితమైన వృత్తిని సుమారుగా రెండు దశాబ్దాలు కొనసాగించిన, వైవిధ్యభరితమైన దళిత జీవితం అది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో గెస్టోపో కాన్సెంట్రేషన్‌ క్యాంపులో డాక్టర్‌ నార్మన్‌ బెతూన్‌ని నాజీ జర్మన్‌లు శారీరకంగా హింసించిన ఘటనలకన్నా కౄరంగా నన్ను ‘క’మ్మం సమాజం మానసికంగా హింసించింది. ఆ హింస ‘క’మ్మం రైటిస్టుల నుండి కాకుండా సోకాల్డ్‌ లెఫ్టిస్ట్‌(?) శిబిరం నుండి రావటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఆ హింస మీకు అర్థం కావాలంటే మీరు దళితులుగా పుట్టాలి. దళితులుగా పుట్టటం, బాధలు ఆనుభవించటమే కాదు ముఖ్యం. వీళ్లనెదిరించాలనే దృఢ నిశ్చయం, దాసోహమనకూడదనే ఆత్మగౌరవం, నిత్య నూతనంగా భగభగ మండే నిప్పుల కొలిమిలో రాటు దేలుతూ ఉంటేనే ‘ఆ హింస’ మీకు అర్థం అవుతుంది. ఒక వైపున ‘రాజ్యం’ నీలి నీడలు, మరోవైపు దోపిడీ కుల సామాజిక పీడన. నా కంట్లో నా వాళ్లతోనే పొడిపించే కుటిల రాజకీయం. నిస్సహాయతలో ఉన్న నా పునాది కులాలు! ఇదీ రెండో భాగంలో మీరు చదవబోయే విషయం.

అరుణ్‌ శౌరి (బ్రాహ్మణుడు, బిజెపీ ప్రభుత్వంలో పబ్లిక్‌ సెక్టార్‌ని నిండా ముంచిన మంత్రిత్వశాఖ మంత్రి) ఆర్‌ఎస్‌యూ రాష్ట్ర మహాసభలకు ముఖ్య అతిథి, ప్రారంభోపన్యాసకులు. ఈ వ్యక్తిని ప్రారంభోపన్యాసానికి ఆహ్వానించడానికి బాధ్యులు వరవరరావే. భారతీయ చరిత్రలో అభివృద్ధి నిరోధక బ్రాహ్మణులకు, లిబరల్‌ బ్రాహ్మణులకు, హాట్‌లైన్‌ ఎప్పుడూ ఆపరేట్‌ అవుతుం దనటానికి అరుణ్‌శౌరి, వరవరరావుల అనుబంధమే ఒక తాజా ఉదాహరణ. అంబేడ్కర్‌ మీద విషం వెళ్లగక్కిన ‘వర్షిప్పింగ్‌ స్మాల్‌ గాడ్స్‌’ అనే పుస్తకాన్ని రాసిన అరుణ్‌శౌరి, అంబేడ్కర్‌ను అవమానించి, తర్వాత అంబేడ్కర్‌ యువజన సంఘాలు దండెత్తాయని, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మోకరిల్లిన ఉండవల్లి అరుణ్‌కుమార్‌ (ఎం.పి.) వరవరరావుకు మిత్రులవటం యాదృచ్ఛికం కాదు.

కరీంనగర్‌ జిల్లా మిట్టపల్లి ప్రాంతానికి చెందిన ఒక వెలమ దొరను పీపుల్స్‌వార్‌ స్క్వాడ్‌ గొడ్డలితో నరికింది. ఆ పేషెంట్‌ న్యూరో సర్జరీ వార్డులో ఉన్నాడు.... ఒకరు అన్నారు కదా ‘పార్టీ చంపాలనుకున్న వాడు కదా. ఫినిష్‌ చేసేస్తే సరిపోయేది’ అని. ‘ఆ పని చేయాల్సింది పార్టీ. డాక్టర్‌ కాదు. శుత్రువైనా వైద్యం కొరకు వస్తే రక్షించే పంపుతాము. ఆ దొరగాడు మరలా వస్తాడు కదా! మీ చేతికి చిక్కుతాడు కదా!’ అన్నాను. 

నా పొగరు మిమ్మల్ని 
గాయపరచిందా?
అయితే సంతోషం!
ఎం.ఎఫ్‌. గోపీనాధ్‌
వెల: రూ. 100
ప్రతులకు
హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, 
ప్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌
గుడిమల్కాపూర్‌, 
హైదరాబాద్‌, 500 006
ఫోన్‌: 23521849

(సెప్టెంబర్‌ 28వ తేదీన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో డా ఎం.ఎఫ్‌. గోపీనాధ్‌ రచన ‘నా పొగరు మిమ్మల్ని గాయపరచిందా? అయితే సంతోషం!’ ఆవిష్కృతమవుతున్న సందర్భంగా ఆ పుస్తకంలోని కొన్ని భాగాలు) 

Surya Telugu News Paper Dated: 23/09/2013 

Tuesday, August 27, 2013

ముళ్లదారి By ఎం. ఎఫ్ గోపీనాథ్ రాసిన ‘నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం’! పుస్తకానికి అల్లం రాజయ్య రాసిన ముందుమాటలోంచి కొన్ని భాగాలు


డాక్టర్ గోపినాథ్ తన పుస్తకానికి ముందుమాట రాయమంటే నేను ఆశ్చర్యపోయాను. అంత అనుభవం, లోతైన బహుముఖ అధ్యయనం నాకు లేదు. వేల సంవత్సరాలుగా ఎదుదురుగా నిలబడి యుద్ధం చేస్తు న్న, సర్వసంపదల సృష్టికర్తలైన ప్రజారాశుల్లో... ఆ సంపదను చేజిక్కించుకుని వారి మీద అధికారం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలకపక్షాల లోతుపాతులు-కార్యకర్తగా, నాయకుడిగా ఆయన మమేకత్వం- విశ్లేషణ నాలాంటి వాడికి అందనిది.


అంటరాని కులంలో పుట్టి, కులాల ముళ్లకంచెలు దాటి, లేమిని ఎదిరించి, మారుమూల పల్లె ఎల్లలు దాటి-ఏకలవ్యుడిలా అనేక విద్యలు అభ్యసించినవారు ఆయన. అడుగడుగునా, దారి పొడుగునా రాజీలేని పోరాటంలో-ఒంటరిగా అనుభవించిన వొత్తిడి అనుభవిస్తున్న తీవ్రత మాటలకందనిది.
గజిబిజిగా అస్తుబిస్తుగా, వెనుకా ముందులుగా, కాలువలుగా, వాగుల్లాగా ప్రవహించిన వ్యాక్యాల లోతుల్లో తడి.. నా కళ్లల్లోకి ప్రవహించి.....



ఈ పుస్తకం చదవడానికి చాలారోజులు పట్టింది. ఇది రొమాంటిక్ ఫిక్షన్ కాదు. కథ కాదు-కవిత్వం కాదు- భయంకరమైన కఠోరవాస్తవం. రాసిన వాక్యాల వెంట, రాయని మరెన్నో తెలిసిన ఘటనలు చుట్టుము గోపి పల్లె బతుకు. మోకాలుముంటి దిగబడే దారులు, అడపాదడపా స్కూలుకు వచ్చే పంతుళ్ళు, ఊరి కొట్లాటలు, పసి మనసుల్లో ఎగిసిన, కలతపెట్టిన ఘటనలు... పశువులు, పంటలు, ఎండా, వానా, చలి, చేపలు, కన్నీళ్లు, కష్టాలు ప్రతిదీ-గుండె గొంతుకలోన గుబగుబలాడినయ్.
పల్లె-అందునా భారతీయ పల్లె-నిరంతర యుద్ధక్షేత్రం కదా! పల్లెలోని మనుషులు భూమి చుట్టు అల్లుకొని, కులాలుగా, వర్గాలుగా స్త్రీ పురుషులుగా, అనేక రకాలుగా విడిపోయి, ఒకరితోనొకరు తలపడుతూ, కలబడుతూ, హింసించుకుంటూ, నిత్యం గాయపడి నొప్పులతో బతుకుతారు కదా! దుర్భర దారిద్య్రం, అంతులేని వేదన-ఊపిరాడని పల్లెటూల్ల పిల్లగాండ్లు-అలాంటి ఒంటరితనాల్లోంచి-సంక్లిష్ట భారతీయ పల్లె బతుకు నుంచి బయటపడటానికి పడిన పాట్లు ఈ పుస్తకం...



భూమి కోసం, తాము సృష్టించిన సంపద కోసం ప్రజలు పోరాడుతున్న వేల సంవత్సరాల యుద్ధభూమి పల్లె-అయినా మాయోపాయాలతో సంపద పంచబడని, దోపిడీ చెక్కుచెదరని, స్థితిలో... సుదీర్ఘ యుద్ధాల్లో కూడా- తమ సృజనాత్మకతను, జ్ఞానాన్ని, అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ కొనసాగుతున్న-తలవంచని కింది కులాల వీరయోధుల కుటుంబంలో నుండి సాగిన జీవనయానం-ఆయన యుద్ధ బీభత్స అనుభవాలు నన్ను కకావికలు చేశాయి. ఆయనలాగే నాకు ఆ పల్లె కలలు, నెత్తుర్లు చిమ్మంగా కొట్టుకున్న కలలు... సుదీర్ఘ యుద్ధాల పీడకలలు, పెనుగులాడినకొద్దీ మునుపటికన్నా లోతుగా దినదినం యుద్ధరంగంలోకి నెట్టబడుతున్న పల్లెలు-అడవులు-ఎక్కడేమిటి అన్ని రకాల సంపద, వనరులు, సుడిగాలిలా-ఎలుగడిలా పరివ్యాప్తమౌతున్న యుద్ధరంగంలో నిలబడి చావోరేవో తేల్చుకోవాల్సిన సందర్భంలో ఈ పుస్తకం...



గోపి పల్లె నుండి బయటపడిన కాలం-అన్ని రకాలుగా ప్రజాస్వామ్యం మాయ బట్టబయలైన సమయం. నెహ్రూ ప్రవచించిన సంక్షేమం-గాంధీ హరిజనోద్ధరణ కానరాలేదు. మరింత పేదవాళ్లయ్యారు. అంబేడ్కర్ ప్రవచించిన రాజ్యాంగంలోని సామాన్యుల హక్కులు కాలరాచివేశారు. తెలంగాణలో 1969 వరకు దళిత కులాలు పేద పిల్లలు గోపిలాగే అనేక ప్రశ్నలు లేవనెత్తారు. జీవతమొక అగ్నిగుండమని గుర్తించారు. 



ప్రపంచవ్యాపితంగానే ఇది కోపోవూదిక్త కాలం. దేశవ్యాప్తంగా రెక్కవిప్పుతున్న రెవల్యూషన్ నక్సల్బరీ కొత్తదారిలో యాంగ్రీ యంగ్‌మెన్ సమస్తాన్ని ప్రశ్నించడమే కాదు, దాన్ని మార్చాలని బయలుదేరిన యువకులు...1969లో మొదలైన తెలంగాణ విద్యార్థుల ప్రత్యేక తెలంగాణ పోరాటం-1972 వరకు 370 మంది విద్యార్థుల హత్యతో....మరోమారు తెలంగాణ రక్తసిక్తమైంది. అప్పటికే తెలంగాణ సాయుధపోరాటం చెల్లాచెదురైన అనుభవం తెలంగాణ ప్రజలకున్నది. ఎప్పటిలాగే ప్రజలు తమ బిడ్డలను పోగొట్టుకుం అధికారాన్ని, ఆస్తుల్ని పంచుకున్నారు. కాని మానని గాయం మాటేమిటి? అది లోలోపల సలిపింది. రగిలింది. 1974 వరకు తెలంగాణలో అన్ని యూనివర్సిటీల్లోని ఆ మాటకొస్తే రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోని-విప్లవ విద్యార్థులు స్పష్టమైన ప్రణాళికతో ఏకమయ్యారు. రాడికల్ విద్యార్థి సంఘంగా ఏర్పడి ‘రోడ్ టు రెవల్యూషన్’ రచించుకున్నారు. ఉస్మానియాలో జార్జిడ్డిని మతవాదులు చంపేశారు. అగ్గిరాజుకుంది. అత్యవసర ప్రకటన తర్వాత దేశమే పెద్ద జైలు అయ్యింది. నిర్బంధంలో జైళ్లు కొత్త రకం పాఠశాలలయ్యాయి. చరివూతను, రాజకీయాలను, తత్వశాస్త్రాన్ని, ఉత్పత్తి, పంపకం, పెట్టుబడి భూమిక గురించి, భూమి గురించి తెలుసుకున్నారు.



ఎమ్జన్సీ ఎత్తివేత తరువాత రాడికల్ విద్యార్థులు ‘రోడ్ టూ రెవల్యూషన్’లో భాగంగా తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాల్లో లీనమయ్యారు. ఈ రోడ్డు మీదికొచ్చి కలిసిన గోపి 1978 ఫిబ్రవరిలో రాడికల్ విద్యార్థి సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. చెరుకూరి రాజకుమార్(ఆజాద్) ఈ సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. 
ప్రపంచంలోనే మొదటిసారిగా విద్యార్థులు గ్రామాలకు తరలారు. అదివరదాకా స్కూళ్లు, కాలేజీల్లో కల్లబొల్లి చదువుల స్థానే-వాళ్ల గ్రామాలను, ప్రజల జీవితాన్ని మార్క్సిజం వెలుగులో అధ్యయనం చేశారు. ప్రజల దగ్గరికి విద్యార్థులు వెళ్లడమనే ప్రక్రియ ఉత్తర, దక్షిణ తెలంగాణల్లోనే కాదు-కోస్తాలో, రాయలసీమలో ఒక ఉప్పెనలా సాగింది. 



అయితే ఈ పుస్తకం మర్యాదస్తుల పుస్తకం ఎంత మాత్రం కాదు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి నిరంతరం అవమానపరిచే-గాయపరిచే-హత్యచేసే ప్రపంచంలో ఒక దళితుడి తీవ్రమైన తిరుగుబాటు గొంతు. ఇది కల్పిత సాహిత్యం కాదు. కటిక వాస్తవం. సాంప్రదాయిక పద్ధతికన్నా భిన్నంగా మన సాహిత్య వాతావరణానికి అలవాటులేని పద్ధతిలో ఇలాంటి పుస్తకం రాయడంపచురించడం ఒక సాహసమే.అక్టోపస్‌లాగా, మృత్యువులా విస్తరిస్తున్న ప్రపంచీకరణ నేపథ్యంలో..వూపపంచ ప్రజలందరు తమ బలం, బలహీనతలను అంచనా వేసుకోవడానికి ముఖ్యంగా ప్రజా ఉద్యమాలు ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలి. ప్రజా పోరాటాల్లో సమస్త కులాలు, సమస్త శక్తులు భుజం భుజం కలిపి పోరాడడానికి ఈ పుస్తకం తోడ్పడుతుంది..



ఈ పుస్తకం నా అంచనా ప్రకారంగా రెండు రకాలుగా ప్రతి స్పందనలు చెలరేగడానికి కారణం కాగలదనిపిస్తున్నది. దొంగకు తేలుకుట్టినట్లు ఈ పుస్తకాన్ని పట్టించుకోకపోవడం. రెండోది వాయిపూంట్ రియాక్షన్. ఇంతదూరం నడిచి కూడా.. గోపి కత్తి అంచు మీదనే ఉన్నాడనిపిస్తుంది. ఇందులోని కొన్ని మాటలు మార్చవచ్చు. తొలగించవచ్చు. తద్వారా గోపికి మంచి పేరు రావచ్చు. మేధావిగా గుర్తింపు పొందవచ్చు. శత్రువులు తగ్గిపోవచ్చు... అయితే ఇది దృక్పథానికి సంబంధించిన సమస్య. ఇది లొంగిపోవడానికి, పోరాడటానికి సంబంధించిన సమస్య. లొంగిపోవడం, పోరాడటం అనేవి మనిషి పుట్టుకతోనే దోపిడీ సమాజాల్లో వెంటాడేవి. పోరాడటం గోపి నడక, ఆచరణ, నైజం.. అయినా పోరాటం మనిషి తనంతట తాను ఎంచుకునేది కాదు. అది అనివార్యంగా రుద్దబడేది. అత్యంత విషాదం ప్రపంచంలో ఇదే. ఈ కాలంలో ప్రపంచంలో ఏ మనిషి యుద్ధం బయట ఉండగలడు?అనూహ్య ప్రదేశమైన అబూజ్‌మడ్ ఇప్పటికీ కులం, మతం, స్వంత ఆస్తి తెలియని ఆదివాసుల మీద ప్రజాస్వామిక గణతంత్ర ప్రభుత్వ సైన్యం ఆధునిక ఆయుధాలతో మానవ రహిత యుద్ధ విమానాలతో దిగుతోంది. మూలవాసుల ఆస్తుల్ని, దేశాల సరిహద్దుల్ని చెరిపేసి కొల్లగొట్టబడే ప్రపంచీకరణ అనే సామ్రాజ్యవాద గొప్ప దోపిడీ సన్నివేశం లో ప్రతిదీ ఒక పేలే తుపాకే. అది కొండచిలువలా నోరు తెరుచుకున్న రోడ్డు కావచ్చు. కుప్ప తెప్పలుగా విస్తరించే నెట్ వర్కులు, మీడియా మాయాజాలం కావచ్చు. అది స్వైన్ ఫ్లూ కావచ్చు. ఎయిడ్స్ కావచ్చు. కార్చిచ్చులా గుప్పుమనే మరేదైనా కావచ్చును...



భారతదేశంలో ఆడ మగ, ముసలి ముతక, పిల్లా పీచు అన్ని కులాలు దళారులుగా లొంగిపోవడానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి వేల సంస్థలు నెట్ వర్కులు, టీవీలు, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అట్లా లొంగిపోకుండా, దళారులుగా రూపాంతరం చెందకుండా మిగిలిన వారిపై దాడి కోసం భారత దేశం మనం చెల్లించే పన్నులతో ప్రపంచంలోని ఆయుధాలన్నీ కొనుగోలు చేసి అమెరికా వారి పర్యవేక్షణలో పెద్ద యుద్ధ రంగం సిద్ధం చేస్తోంది. 
అదిగో అలాంటి సన్నివేశంలో, సందర్భంలో పోరాడే ప్రజల పక్షాన నిలబడి లోపలి, బయటి వైరుధ్యాలను మనతో పంచుకుంటున్నాడు.. అలాంటి జ్వరతీవూవత గల గోపిని ఆలింగనం చేసుకుంటూ... ... 

-అల్లం రాజయ్య



(ఎం. ఎఫ్ గోపీనాథ్ రాసిన ‘నా పొగరు మిమ్మల్ని గాయపరిచిందా? అయితే సంతోషం’! పుస్తకానికి అల్లం రాజయ్య రాసిన 
ముందుమాటలోంచి కొన్ని భాగాలు...)

Namasete Telangana Telugu News Paper Dated : 28/08/2013 

Thursday, May 31, 2012

మార్క్సిజమ్@యెటకారమ్.కామ్--- డా. ఎం.ఎఫ్. గోపీనాథ్



అణచివేయబడ్డ కుల, వర్గాలకు అంబేద్కరిజం - మార్క్సిజం అనేవి రెండు ఆయుధాలు. ఆ ఆయుధాల్ని ఈ దేశంలోని దళిత జాతులు ఏ విధంగా ఉపయోగించుకోవాలో తేల్చుకోవాల్సిన కీలకమైన అంశం. అంబేద్కరిజం వద్దనే మూస మార్క్సిస్టులకు, మార్క్సిజం వద్దనే అవకాశవాదులకు రంగనాయకమ్మ లాంటి వారి దగ్గరే ఆశ్రయం దొరుకుతుంది. 

"All that I know is that I am not a Marxist." - Karl Henrich Marx మహనీయులకు, మహోన్నత తత్వవేత్తలకు తమ పరిమితుల్ని వినయంగా ఒప్పుకోవటం అనేది ఒక సలక్షణం. తను ప్రతిపాదించిన సిద్ధాంతం 'సమగ్రమైన ప్రాపంచిక దృక్పథం' అని కూడా మార్క్స్ చెప్పుకోలేదు. కానీ మార్క్సిజాన్ని ఒక సైన్స్‌గా కాకుండా మతగ్రంథంగా భావించే నకిలీ మార్క్సిస్టులు కొందరు అన్నీ వేదాల్లోనే ఉన్నాయంటున్న మత మౌఢ్యుల వలె అన్నీ మార్క్సిజంలోనే ఉన్నాయంటున్నారు. ఆ కోవకు చెందినవారు రంగనాయకమ్మ. సింపుల్ లాజిక్ ఏమిటంటే మార్క్సిజంలోనే అన్నీ ఉంటే, లెనినిజం ఎందుకు? మార్క్సిజమ్-లెనినిజంలోనే అంతా ఉంటే మావోయిజం ఎందుకు? మార్క్సిజం- లెనినిజం- మావోయిజం అనే ప్రాపంచిక దృక్పథాలు సర్వవేళలా, సర్వావ్యవస్థల్లో సకల దేశాలకు సమగ్ర సిద్ధాంతాలైౖతే అవి బైబిల్/ఖురాన్/భగవద్గీత మాత్రమే అవుతాయి. సైన్స్ కాదు. 

'అస్తవ్యస్త సంస్కర్తలు' (ఆంధ్రజ్యోతి, మే 15) వ్యాసంలో బుద్ధుడిని, అంబేద్కర్‌ని, సత్యమూర్తిని దేనికీ పనికిరానివాళ్లుగా మన ముందు నిలబెట్టే ప్రయత్నం చేశారు రంగనాయకమ్మ. కె.జి.సత్యమూర్తి మరణం తర్వాత ఆ మహా విప్లవకవి పట్ల తెలుగునాట సామాజిక విప్లవశ్రేణుల స్పందన చూసి ఆమె అలా స్పందించారు. తాను రాసిన 'దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి' అనే పుస్తకంలోని చర్చను చీల్చి చెండాడిన సత్యమూర్తిని 'తెలివిలేనివాడిగా' నిలబెట్టాలనుకున్నారు. ఈ వృత్తి విప్లవ రచయిత్రి ఆ విధంగా స్పందించకుంటేనే ఆశ్చర్యపోవాలి. రంగనాయకమ్మకు వ్యంగ్యం, వెటకారం పట్ల ఉన్న ప్రేమ, గురి సిద్ధాంత చర్చపట్ల ఉండదు. 

ఈ విషయాన్ని ఆమె రాసిన 'రామాయణ విషవృక్షం' నుంచి మొన్నటి 'అస్తవ్యస్త సంస్కర్తలు' వరకు ఒకే మూస పద్ధతిలో అదే బాణిలో కొనసాగించారు. పిల్లలకు చెప్పే పొడుపు కథల్లా ఆమె రచనల్లో (అంధకారంలో.... తప్ప) వ్యంగ్యం, వెటకారం మిటకరిస్తూ ఉంటాయి. ఆమె దృష్టిలో సిపిఐ నుంచి మావోయిస్టుల వరకూ ఎవ్వరూ మార్క్సిజాన్ని తనలాగా అర్థం చేసుకోలేదు. ఇక చేసుకోలేరని కూడా ఆమె దృఢంగా నమ్ముతారు. నమ్మకాలకు, విశ్వాసాలకు మార్క్సిజం అనే సైన్స్ వ్యతిరేకమని వారు ఊహించరు. వర్తమాన మార్క్సిజానికి తానే సోల్ డిస్ట్రిబ్యూటర్‌గా, పేటెంట్ హక్కుదారుగా ఉండాలని ఆ విధంగా గుర్తించబడాలని, పోరాట రహిత మార్క్సిస్టుగా మిగిలిపోవాలని కోరుకుంటూ ఉంటారు. 

అదొక మానసిక పరిస్థితి. పడక్కుర్చీ పాండిత్యం. ప్రజా ఉద్యమాల్లో పోరాటాల్లో పాల్గొన్న అనుభవం ఉంటే రంగనాయకమ్మకు ఇలాంటి మానసిక స్థితి దాపురించేది కాదు. మొండి వైఖరిని ప్రదర్శించేవారు కాదు. 2010 అక్టోబర్, నవంబర్ మాసాల్లో నేను రాసిన 'దళిత మేధావులు - వామపక్ష మేధావులు' వ్యాసంలో నేను, ఇప్పటి వరకు చేతబడి, బాణామతి తదితర క్షుద్ర విద్యలకు ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలు కారణమని హేతువాదుల నిజనిర్ధారణ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కాని చేతబడి అనేది అక్షరం, మంత్రం స్వచ్ఛంగా పలకలేని నిరక్షరాస్యులైన శ్రామిక కులాలు (ఎస్సీ, ఎస్టీ, బీసీలు) ఎలా చేస్తారు? అధర్వణ వేదం చదువుకున్న పురోహితులు కదా మంత్రాలు స్వచ్ఛంగా పలకగలిగేది? కానీ ఈ దేశ చరిత్రలో ఏ ఒక్క పురోహితుడినైనా చేతబడి చేశారని పళ్లూడగొట్టిన దాఖలాలు ఉన్నాయా? చేతబడికి ఆస్తి తగాదాలకు అధికార ధిక్కారాలకు అవినాభావ సంబంధం ఉన్నాయని రాశాను. 

ఖైతాపూర్‌లో మాదిగ వెంకటయ్య తన భూమిని ఆర్టీసీ డ్రైవర్ రెడ్డి కబ్జా చేయబోగా అడ్డుకున్నాడు. అందుకు ఆగ్రహించిన రెడ్డి మాదిగ వెంకటయ్యను, అతని మిత్రుణ్ణి చేతబడి చేశారని పుకారు పుట్టించి, ఆ ఇద్దరినీ సజీవ దహనం చేయించాడు. ఈ విషయాన్నే నేను ఉదహరించినప్పుడు రంగనాయకమ్మ 'సజీవ దహనం చేసినవాళ్లు మీ ఎస్సీ, బీసీలే కదా!' అని రాశారు. ఏ మార్క్సిజమ్ ప్రకారం ఆమె అలా స్పందంచారో ఆమెకే తెలియాలి. అత్తలు కోడళ్లను హింసిస్తారన్నప్పుడు, కిరోసిన్ పోసి, గ్యాస్ లీక్ చేసి తగలపెడతారన్నప్పుడు సాధారణ ప్రజలు అనుకునే స్త్రీకి స్త్రీయే శత్రువు అని కూడా రంగనాయకమ్మ సెలవిస్తారా? లేదా పురుషాధిక్య సమాజం వేసే వెర్రివేషాలను హిందూ విషసంస్కృతిలో భాగంగా చూస్తారా? 

తన 'అస్తవ్యస్త' వ్యాసంలో రంగనాయకమ్మ ఇలా రాశారు. 
1. మార్క్సిజాన్ని ఎవరికిష్టమైనట్లు మార్చేసి దాన్ని దేశీయ మార్క్సిజంగానో జాతీయ మార్క్సిజంగానో చేయాలని ప్రయత్నించే... అని రాశారు. పెట్టుబడిదారీ దేశాల్లోని వర్గ సంబంధాలకు, వైరుధ్యాలకు వ్యవసాయక దేశమైన చైనాలోని వర్గ సంబంధాలకు, వైరుధ్యాలకు తేడా గమనించే, మావో చైనా సమాజాన్ని 5 కేటగిరీల కింద విభజించి ఏఏ సమూహాలు విప్లవానుకూలం? ఏయే సమూహాలు విప్లవ వ్యతిరేకులు? ఏయే సమూహాలు తటస్తులు? అని విశ్లేషించి, మార్క్సిజాన్ని చైనా నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి విప్లవ పోరాటాన్ని జయప్రదంగా నడిపించారు. అదే విధంగా ఇండియాలోని దోపిడీ కులాలు ఏవి? దోపిడీకి గురయ్యే కులాలు ఏవి? అని విశ్లేషించటం మార్క్సిజం ప్రకారం నేరమౌతుందా? కులాల పుట్టుక, కొనసాగింపుకు గల కారణాలను మొట్టమొదట డా.బి.ఆర్. అంబేద్కర్ వెలికి తీసి ప్రపంచంలో ఎక్కడా లేని ఈ సంక్లిష్ట సామాజిక వ్యవస్థకు కారణం బ్రాహ్మణిజం, హిందూ మత గ్రంథాలు అని తేల్చారు. బ్రాహ్మణిజాన్ని, ఈ హిందూ మత గ్రంథాలను నిషేధిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదన్నారు. ఇందులో రంగనాయకమ్మకు అభ్యంతరం ఎందుకుండాలి? 

2. అంబేద్కర్ ప్రతిపాదించిన కుల నిర్మూలనా సిద్ధాంతం వర్గ నిర్మూలనా సిద్ధాంతానికి వ్యతిరేకమైందా? కుల నిర్మూలనా సిద్ధాంతం కుల నిర్మూలనకు ఉపయోగపడదని, దానికి ప్రత్యామ్నాయంగా కులాంతర వివాహాల్ని పరిష్కార మార్గాలుగా చూపుతున్నారు రంగనాయకమ్మ అండ్ కో. అందుకుగాను "100 కులాంతర వివాహాల్ని పరిశీలించి అవి ఏ కారణాల వల్ల జరిగాయో ఆ కారణాల్ని పట్టుకోవాలి. కులాంతర వివాహాలు నిరభ్యంతరంగా జరగటానికి ఏ పరిస్థితులు అవసరమో వాటిని సమాజం నిండా ఏర్పరిచే మార్గమే కులాల రద్దుకు శాశ్వత పరిష్కారం అవదూ?'' అని రాసి "కుల నిర్మూలనకు ఒక మహత్తర చికిత్సను ప్రతిపాదిస్తున్నారు.'' కులాల పుట్టుకకు శ్రమ విభజనే కారణమని చెప్తూ, శ్రమదోపిడీ పోతే 'కులసమస్య' తీరుతుందని ఇప్పటి వరకూ చెప్తున్న మనువాద మార్క్సిస్టు మాయావాదానికి వంతగా రంగనాయకమ్మ కొత్త సిద్ధాంతంతో తానే రాసిన 'బలిపీఠాన్ని' బద్దలు కొట్ట ప్రయత్నిస్తున్నారు. కులాంతర వివాహాల మంత్రాలతో 'కులం' చింతకాయలు రాల్తాయని ఉపదేశిస్తున్నారు రంగనాయకమ్మ. 

3. "భారతదేశపు శ్రామిక వర్గంలో ప్రధాన భాగమైన ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర బృందాల్ని శ్రమ దోపిడీ నుంచి బయటపడమని ప్రేమతో చెప్పే సిద్ధాంతం వైపు మొహాలు తిప్పకపోవడమే అసలైన ఆశ్చర్యం.'' - శహబాష్! ఈనాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీలు శ్రామికవర్గంలో ప్రధాన భాగం అని ఒప్పుకుంటున్నారు రంగనాయకమ్మ! ఈ కులాల సమూహాలు 'మొహం' తిప్పకపోతేనే మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం నడిచిందా? 1969 వసంత మేఘ గర్జన ఉరిమిందా? ఈనాటి దండకారణ్య ఉద్యమాన్ని ఈ కుల సమూహాలు లేకుండా కేవలం నూటికి 10 మంది కూడా లేని దోపిడీ కులాలు నిర్మిస్తున్నాయా? ఈ పోరాటాల్ని రంగనాయకమ్మ లేక వారు రాసుకుంటూ పోతూ, అమ్ముకుంటూ పోయిన పుస్తకాలు చేసాయా? 

ఇక బుద్ధుణ్ణి తీసుకుంటే - "అది అష్టాంగ మార్గం. అది అన్నిటికీ నిరుపయోగం'' అని సెలవిచ్చారు. కానీ త్రిపిటకాల సారాంశంలో టూకీగా 1. మానవ సమాజంలో దు:ఖానికి కారణం భిన్న ప్రయోజనాల మధ్య ఘర్షణ. 

2. సంపద మీద వ్యక్తిగత ఆధిపత్యం మరో వర్గానికి దు:ఖాన్ని (దోపిడీకి గురవటం) కల్గిస్తుంది.

3. ఈ దు:ఖానికి గల కారణాన్ని నిర్మూలించడం ద్వారా దు:ఖాన్ని పోగొట్టడం సంఘ శ్రేయస్సుకు అవసరం.

4. మనుష్యులందరూ సమానులే!

5. మతానికి దేవు ణ్ణి కేంద్రంగా చేయటం తప్పు.

6. సత్యం కోసం, న్యాయం కోసం కాకపోతే యుద్ధం చేయటం తప్పు.

7. ఏదీ శాశ్వతం కాదు. ప్రతిదీ మా ర్పుకు లోనవుతుంది.

8. మనిషిని కొలవటానికి ప్రతిభ తప్ప పుట్టుక ప్రమాణం కాదు.

9. ముఖ్యమైనది ఉన్నత ఆదర్శాలు తప్ప ఉన్నత కులం కాదు. ఇవీ 2500 సంవత్సరాలకు పూర్వం బుద్ధుడు బోధించిన విషయాలు. పైన పేర్కొన్న బుద్ధుని బోధనల్లో ఆక్షేపించవలసింది ఏముంది? హింస ఒక 'క్రీడ్'గా కాకుండా ఒక 'నీడ్'గా మాత్రమే ఉం డాలన్నాడు బుద్ధుడు. రాజ్యం ఉంటే హింస అనివార్యం. మాక్స్ స్టిన్న ర్ అన్నట్లు ప్రజాస్వామ్యంలో నేరస్తుణ్ణి రాజ్యం ఉరితీస్తే అది చట్టం. అదే పని వ్యక్తి చేస్తే నేరమౌతుంది. అందుకే హింసారహిత మానవ సమాజాన్ని బుద్ధుడు ఆకాంక్షించాడు. రాజ్యమే అంతరించిపోవాలన్నాడు మార్క్స్. మరి బుద్ధుడికి, మార్క్స్‌కు వైరుధ్యమెక్కడ? శ్రామిక వర్గ నియంతృత్వం శాశ్వతంగా ఉండటం క్షేమం కాదన్నాడు అంబేద్కర్. శ్రామికవర్గ నియంతృత్వమే కాదు ఏ నియంతృత్వమూ రాజ్యమూలేని సమాజాన్ని ఆకాంక్షించాడు మార్క్స్. ఈవిషయాల్ని రంగనాయకమ్మ గమనిస్తే అనవసరమైన వివాదాల్లోకి పోనక్కరలేదు. 



1930-40 సంవత్సరాల్లో రంగనాయకమ్మ మేధోపూర్వీకులు (ఇ.ఎం.ఎస్., డాంగే) సమకాలీకులు (బిపిన్‌చంద్ర, అరుణ్‌శౌరి) అం బేద్కర్‌ను చీలిక ఉద్యమకారుడని, డేంజరస్ బ్రిటిష్ ఏజెంటనీ ఆడిపోసుకున్నారు. కానీ ఆనాడే అంబేద్కర్ సోషలిస్టులకు ఇచ్చిన సలహా ఏమంటే ఈ దేశంలో మీరు ఏ దిక్కుకు నిలబడి చూసినా మీకెదురుగా కులభూతం దారికడ్డంగా నిలబడి ఉంటుంది. అట్టి కులభూతాన్ని సం హరించకుండా సోషలిజాన్ని నిర్మించలేరన్నారు. 

ఈ సలహా ఇచ్చి ఇప్పటికి 77 సంవత్సరాలు. ఈ 77 సంవత్సరాల్లో సోషలిజం స్థాపన లో ఎంత దూరం వచ్చారు? సెలిన్ హారిసన్ అనే రాజకీయ విశ్లేషకు డు (మోస్ట్ డేంజరస్ డికేడ్స్ పుస్తక రచయిత) 1960ల్లోనే 'భారతీ య వాస్తవాలకు వ్యతిరేక దిశలో దేశ కమ్యూనిస్టు నాయకత్వం శరవేగంతో పరుగెత్తుతుంది'' అన్నారు. అందుకే 1920ల్లో ప్రారంభమైన చైనా క మ్యూనిస్టు పార్టీ అక్కడి సామాజిక వాస్తవాలకు అనుగుణంగా మార్క్సి జాన్ని ఉపయోగించుకుని 27 సంవత్సరాల్లో విప్లవాన్ని జయప్రదం చేస్తే, మనదేశంలో ఇప్పటికీ ఎక్కడున్నామో అందరికీ తెలిసిన విషయమే. 

ఆధునిక ప్రపంచ చరిత్రలో 19వ శతాబ్దంలోను, అంతకు ముందు కూడా వచ్చిన వివిధ సంస్కరణోద్యమాల గర్భం నుంచే 20వ శతాబ్దపు విప్లవాలు పుట్టాయనడానికి అనేక చారిత్రక రుజువులున్నాయి. మనదేశానికి సంబంధించినంతవరకు అణచివేయబడ్డ కులాల చైతన్య ఉద్యమాలు, దోపిడీ కుల వ్యతిరేక ఉద్యమాలు, విప్లవ రాజకీయ సిద్ధాంత ప్రాతిపదికన ఏర్పడలేదనేది వాస్తవం. అయినప్పటికీ వర్గ స్పృహగల రాజకీయ ఉద్యమాలను నిర్మించటానికి కుల నిర్మూలనోద్యమాలు ఆటంకం కాకపోగా పునాదిగా ఉపయోగపడతాయనటానికి అనేక ఉదాహరణలున్నాయి. 

వాటిని అర్థం చేసుకోవటానికి ఆ ప్రజా సమూహాన్ని వర్గ పోరాటాల్లోకి ఆహ్వానించటానికి కులాల అస్తిత్వాన్ని గుర్తించ నిరాకరించే మనువాద విధేయులైన మార్క్సిస్టుల దగ్గర ఎజెండా ఏది? దీన్నే అదునుగా తీసుకున్న దళిత మేధావులు కొందరు రంగనాయకమ్మలాగే మాకు మార్క్సిజం వద్దు, అంబేద్కరిజం చాలు - అంటున్నారు. వీళ్లెందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? కమ్యూనిస్టు పార్టీల్లో పనిచేసి, ఆ పార్టీల్లోని అగ్రకుల నాయకత్వం యొక్క దాష్టీకాన్ని ఎదుర్కోలేక బయటకు వచ్చిన వీళ్లు మార్క్సిజానికి - ఆయా పార్టీల నాయకత్వానికి మధ్య ఉన్న తేడాను గుర్తించలేకపోతున్నారు. మార్క్సిజం అనేది పీడిత జాతుల విముక్తి కొరకు రూపొందించబడ్డ తాత్విక సిద్ధాంతం అన్న విషయం గ్రహించలేకపోతున్నారు. కారణాలు అనేకం. కానీ వాస్తవం ఏమంటే... దగ్గర దారిలో వర్గ రాజకీయాలకు దూరంగా, ఉన్న వ్యవస్థలోనే జూనియర్ పార్టనర్స్‌గా కుదురుకుందామనే ఆలోచన వీళ్లల్లో ప్రబలంగా ఉంది. 

అందుకే అంబేద్కర్‌ను అడ్డంగా పెట్టుకుంటున్నారు. వీళ్లు ఆచరణాత్మక రాజకీయాల పేరిట వర్గేతర రాజకీయాల్ని, కులసంకర రాజకీయాల్ని ఆశ్రయిస్తున్నారు. ఇది గాంధీ వారసత్వమేగాని అంబేద్కరిజం కాదు. అణచివేయబడ్డ కుల, వర్గాలకు అంబేద్కరిజం-మార్క్సిజం అనేవి రెండు ఆయుధాలు. ఆ ఆయుధాల్ని ఈ దేశంలోని దళిత జాతులు ఏ విధం గా ఉపయోగించుకోవాలో తేల్చుకోవాల్సిన కీలకమైన అంశం. అంబేద్కరిజం వద్దనే మూసమార్క్సిస్టులకు, మార్క్సిజం వద్దనే అవకాశవాదులకు రంగనాయకమ్మ లాంటి వారి దగ్గరే ఆశ్రయం దొరుకుతుంది.
- డా. ఎం.ఎఫ్. గోపీనాథ్
మేనేజింగ్ డైరెక్టర్,
ఫూలే- అంబేద్కర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్

Andhra Jyothi News Paper Dated : 01.06.2012 

Friday, April 13, 2012

బీసీరిజర్వేషన్లు-అంబేడ్కర్‌----యం.ఎఫ్.గోపీనాథ్



‘చరిత్రలో అపార్ధాలకు, వాస్తవాల వక్రీకరణలకు పరిమితులుండవు’
- ఎరిక్‌ ఫ్రామ్‌

నష్టం చేసింది గాంధీ, నెహ్రూ, పటేల్‌ 
అంబేడ్కర్‌పై అపోహ లెందుకు?
హిందూ సమాజంలో భాగంగా ఉండడమే! 
కింది సమాజంపై ఆధిక్యతా భావం 
బీసీ రిజర్వేషన్లకోసం అంబేడ్కర్‌ పోరాటం 

Ambedkar

ఈ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2010 ఆగస్టు నుండి అణగారిన కులాల మేధావులతో, ఉద్యమకారులతో, రాజకీయ నాయకులతో కనీసం 20 సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాల్లో అనేక విషయాలతో పాటు రెండు ముఖ్యమైన విషయాలు యథాలాపంగా చర్చకొచ్చేవి. అవి 1. కులాల అవిర్భావం, 2. బీసీల, క్రైస్తవుల రిజర్వేషన్లు- వీటి విషయంలో అంబేడ్కర్‌ పాత్ర. 2011 జూన్‌ 11న విజయవాడలో డా అంబేడ్కర్‌ రాసిన ఏడవ సంపుటి (శూద్రులెవరు) గురించి రైల్వే ఉద్యోగులు ఒక సమావేశం నిర్వహించారు.

ఒక మిత్రుడు మాట్లాడుతూ ‘డా అంబేడ్కర్‌ ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్స్‌ కల్పించినట్లే బిసిలకు, మత మైనారీటీలకు కూడా కల్పిస్తే బాగుండేది’ అన్నారు. ఇదే విషయం చాలా మంది నుండి చాలా సందర్భాలలో వినిపిస్తోంది. అంతే కాదు, కొంతమంది దళిత క్రిస్టియన్స్‌కి రిజర్వేషన్‌ సదుపాయం రాకుండా డా అంబేడ్కర్‌ అడ్డుపడ్డాడని కూడా ఒకరు చెప్పారు. చదువుకున్న వాళ్ళ నుండి చదువులేని రాజకీయ నాయకుల వరకు బీసీల, దళిత క్రిస్టియన్ల రిజర్వేషన్‌ విషయంలో వాస్తవాలకు భిన్నంగా ఎందుకు అపోహపడి అంబేడ్కర్‌ని అపార్ధం చేసుకొం టున్నారు? వీళ్ళను మోసగించిన గాంధీ, నెహ్రూ, పటేల్‌ లను వదలిపెట్టి, బీసీల రిజర్వేషన్‌, దళిత క్రిస్టియన్‌ రిజర్వేషన్‌, మతమైనారీటీల ప్రత్యేక హక్కుల కోసం నీ- నా భేదం లేకుండా అణగారిన కులాలన్నింటికోసం, మహిళల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి పోరాడిన డా అంబేడ్కర్‌ని అపార్ధం చేసుకోటానికి గల కారణం ఏమిటి? బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పట్ల బీసీ కులాల మేధావులు, మత మైనారిటీల మేధావులు 1994కి ముందు పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నారు. మతమైనారీటీల విషయం అంతకన్నా భిన్నంగా లేదు.

కారణం ఏమిటి? బీసీలు బ్రాహ్మణీయ హిందూ సమాజంలో భాగంగా ఉండడం; బ్రాహ్మణీయ సోషల్‌ ఆర్డర్‌ని తూ.చ తప్పకుండా పాటించడం; తమ పైన ఉన్న సమాజం మీద కోపం కన్నా, తమ కింద ఉన్న సమాజం మీద ఉన్న ఆధిక్యతా భావంతో కూడిన ఆనందం, తృప్తి; అణచివేస్తున్న హిందూ సింబల్స్‌ (దేవుళ్ళు, దేవతలు)నే ఆరాధించటం; మహాత్మాపూలే, సాహుజీ మహరాజ్‌, నారాయణ గురు వంటివారి గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయకపోవడం. ఇవన్నీ సాధారణ ప్రజలలోఉండే సాధారణ లక్షణాలు. 

బాబా సాహెబ్‌ని మాల మాదిగలే ఎప్పుడూ విగ్రహాలు పెట్టి, జయంతులు, వర్ధంతులు చేస్తారు. కాబట్టి అంబేడ్కర్‌ కూడా అంటరాని వాడనుకోవడంలో చదువులేని బీసీలను తప్పు పట్టనవసరం లేదు. మాల మాదిగలు క్రీస్తు మతాన్ని తీసికొన్నందువల్ల ఏసుక్రీస్తు కూడా అంటరానివాడనే నమ్మకం హిందువుల్లో ఉండటం సహజ పరిణామమే. ఈ దేశంలో ఒక వేళ విద్యుత్తును, మోటార్‌ సైకిల్‌ను, ఆవిరి ఇంజిన్లను అంబేడ్కర్‌ కనిపెట్టినట్లయితే వాటిని కూడా ఈ బ్రాహ్మణీయ హిందూ సమాజం వాడక పోయేదేమో! ఈ భావన సగటు హిందూ మైండ్‌కి ఉండడంలో తప్పులేదు. కానీ చదువుకున్న లాయర్లు, జడ్జీలు, రాజ్యాంగ నిపుణులు, లెక్చరర్లు, రీడర్లు, ప్రొఫెసర్లు, ఉద్యమాల్లో పాల్గొనే బీసీలు, మత మైనారీటీలు- తమకోసం అంబేడ్కర్‌ చేసిన కృషి గురించి తెలిసుకోక పోవడం, తెలిసినా చెప్పక పోవడం నిజంగా విచారించవల్సిన విషయం.

అసలు విషయం ఏమిటంటే- వాస్తవ చరిత్రను చదవక, అవగాహన చేసుకోక పోవడమే! గాంధీ, నెహ్రూ, పటేల్‌ తరుపున వకాల్తా పుచ్చుకున్న బ్రాహ్మణీయ హిందూ మీడియా మరో కారణం.
డా అంబేడ్కర్‌ పట్ల ఉన్న అపోహల్ని సవరించుకోవడం అనేది అణగారిన కులాల, వర్గాల నాయకులకు, ఆ వర్గాల ప్రజలకు ఎంతైనా అవసరం. అందుకే 1930 నుండి 1951 వరకు- అంటే లండన్‌లో జరిగిన మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు మొదలుకుని 1951 సెప్టెంబర్‌ 27న అంబేడ్కర్‌ కేంద్ర క్యాబినెట్‌కి రాజీనామా చేసిననాటి వరకు జరిగిన పరిణామాల్ని కూడా ఒకసారి పరిశీలించాలి. రాజ్యాంగంలోని 330, 332 అధికరణల ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు, 15(14), 16(4) అధికరణల ప్రకారం కార్యనిర్వాహక శాఖల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించిన డా అంబేడ్కర్‌- బీసీ వర్గాల రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సభలో తీవ్ర పోరాటం చేశారన్న వాస్తవం రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చల మినిట్స్‌ చూస్తే తేలుతుంది.

రాజ్యాంగ పరిషత్‌కు బీసీల ప్రయోజనాలను కాపాడే‚ ఒక్క వ్యక్తి కూడా ఎందుకు ఎన్నిక కాలేదు? రాజ్యాంగ రచనా సంఘంలో బీసీల తరుపున వాదించే ఒక్క నిపుణుడు కూడా ఎందుకు లేడు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పవల్సింది గాంధీ, నెహ్రూ, పటేల్‌లే.
కొల్హాపూర్‌ సంస్థానాధీశుడైన ఛత్రపతి సాహు మహారాజ్‌ తన సంస్థానలోనే తన పర్సనల్‌ సెక్రెటరీగా ఒక జైన మతస్థుణ్ణి నియమించుకున్నాడు. అతను పట్టభద్రుడు కాదన్న విషయాన్ని సాకుగా చూపి- బ్రిటిష్‌ ప్రభుత్వాధికారులతో కుమ్మక్కయిన బ్రాహ్మణవర్గం మహారాజు పర్సనల్‌ సెక్రటరీని పదవినుండి తీసివేయించింది. అప్పుడు పట్టభద్రుడైన బ్రాహ్మణేతరుని కోసం వెదికితే ఒక్క వ్యక్తి కూడా దొరకలేదు. అంటే ఆనాడు ఒక్క బ్రాహ్మణేతరుడికి కూడా ఇంగ్లీష్‌ చదువులు చదివే అవకాశం గానీ, డిగ్రీ వరకు చదవే అవకాశంగానీ లేదు. సమస్యకు మూలం తెలుసుకున్న సాహు మహారాజ్‌ 1901లో వెనుకబడిన కులాల పిల్లలకు స్కూళ్ళు, హాస్టళ్ళు తెరిచాడు. 1902 జూలై 26 నుండి ఈ కులాలకు విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించాడు. 

మహత్మా పూలే, సాహు మహారాజ్‌ ల చరిత్ర తెలుసుకొన్న బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ అణచివేతకు గురై, వెనక్కునెట్టి వేసిన కులాల, మత మైనారీటీలందరి కోసం పోరాడాడు. మొదటి రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వీరందరికి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రత్యేక సదుపాయల్ని కల్పించే విధంగా బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని ఒప్పించాడు. కాని రెండో రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వచ్చిన మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ భారతీయులందరికి తానే ప్రతినిధినని మొండికేశాడు. అందుకు అంటరాని కులాలు ఒప్పుకోలేదు. గిరిజనులు డా అంబేడ్కర్‌ని వ్యతిరేకించలేదు. ముస్లిం మైనారీటీల తరుపున జిన్నా వకాల్తా పుచ్చుకున్నాడు. బీసీలు గాంధీని నమ్మి, మహారాష్ట్ర బీసీ నాయకుడైన జాడే జవాల్కర్‌ నాయకత్వంలో ‘మా నాయకుడు డా అంబేడ్కర్‌ కాదు, గాంధీనే’ అని బ్రిటిష్‌ ప్రిమియర్‌కి టెలిగ్రామ్‌ లిచ్చారు. ఇదీ రికార్డయిన చరిత్ర. 

డా అంబేడ్కర్‌ నాయకత్వంలో కమ్యూనల్‌ అవార్డు ద్వారా ప్రత్యేక నియోజకవర్గాలు సాధించుకున్న అంటరాని కులాల నోట్లో దుమ్ముకొట్టే పూణే ఒప్పందాన్ని తన ఆమరణ నిరాహార దీక్ష ద్వారా సాధించుకున్నాడు గాంధీ. 1946లో రాజ్యాంగ పరిషత్‌కు జరిగిన ఎన్నికల్లో డా అంబేడ్కర్‌ని గాంధీ, నెహ్రుల కాంగ్రెస్‌ ఓడించింది. అప్పుడు డా అంబేడ్కర్‌ని నామ శూద్రుల నాయకుడైన జోగేంద్రనాథ్‌ మండల్‌ పశ్చిమబెంగాల్‌కు ఆహ్వానించి జైసూ ్‌కుల్నార్‌ జిల్లాల నుండి గెలిపించి రాజ్యాంగ పరిషత్‌కి పంపించారు. 1946లో అప్పటి వరకు బెంగాల్‌ విభజనకు ఒప్పుకోని హిందూ మహాసభ, కాంగ్రెస్‌ నాయకత్వం, పశ్చిమ బెంగాల్‌లోని జైసూల్‌ కుల్నార్‌ జిల్లాలను జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్‌ అడక్కపోయిన కూడా 1947లో పాకిస్థాన్‌కి ఇచ్చేసింది కాంగ్రెస్‌. అంబేడ్కర్‌ని రాజ్యాంగ పరిషత్‌లోకి రానీయకుండా చేయడానికి నామ శూద్రుల (జొగేంద్రనాథ్‌ మండల్‌) జనాభా 50 శాతం ఉన్న ప్రాంతాన్ని పాకిస్థాన్‌ కివ్వడానికికూడా వెనుకాడలేదు హిందూ మహసభ, కాంగ్రెస్‌ నాయకత్వం. 

అప్పుడు బ్రిటిష్‌ ప్రిమీయర్‌ ఒత్తిడి మేరకు పూణే నుండి ఎన్నికైన ఒక కాంగ్రెస్‌ బ్రాహ్మణ సభ్యుణ్ణి విరమింపజేసి డా అంబేడ్కర్‌ రాజ్యాంగ సభకు ఎన్నిక కావటానికి కాంగ్రెస్‌ సహకరించవలసి వచ్చింది.1947 జులై 9న అంబేడ్కర్‌ రాజ్యాంగ సభకి ఎన్నిక కావడం, 1947 జులై 10న బ్రిటిష్‌ ప్రభుత్వం భారత దేశానికి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్య్రం ఇస్తామని ప్రకటించడం జరిగిపోయాయి. ఈ రెండు సంఘటనలు యాథృచ్ఛికం కావు.1902 జులై 26న కొల్హాపూర్‌ సంస్థానంలో ప్రారంభమైన వెనుకబడిన కులాల రిజర్వేషన్లు 1922 వరకు కొనసాగాయి. 1932లో రెండవ రౌండ్‌ టేబుల్‌ సమావేశమప్పుడు రిజర్వేషన్ల విషయంలో గాంధీ బీసీలకిచ్చిన వాగ్ధానాన్ని స్వాతంత్య్రం వచ్చిన తరువాత నిలబెట్టుకోలేదు. 

మరలా బీసీల రిజర్వేషన్‌ విషయాన్ని రాజ్యాంగ పరిషత్‌లో డా అంబేడ్కర్‌ లేవనెత్తినప్పుడు సర్ధార్‌ వల్లభ భాయి పటేల్‌ ‘షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌, షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ అంటే సరే, మరి ఈ బీసీ లంటే ఎవరు’ అని బీసీ రిజర్వేషన్లను- ‘లిస్టెడ్‌ క్యాస్ట్స్‌’ కాదన్న సాంకేతిక అంశాన్ని లేవనెత్తి అడ్డుకున్నాడు. అప్పుడు అంబేడ్కర్‌ రాజ్యాంగంలోని 340 అధికరణం ద్వారా బీసీ కులాల జాబితాను తయారుచేయడానికి, వారికి రిజర్వేషన్లు కల్పించటానికి ఒక కమిషన్‌ను నియమించాల్సిన ‘రాజ్యాంగపర ఆదేశా’న్ని జారీ చేయించాడు. 1947 తర్వాత ఓబీసీల జాబితాను బి.ఆర్‌. అంబేడ్కరే తయారు చేశాడు. కానీ 1951 వరకు బీసీ కమిషన్‌ నియమించడానికి నెహ్రూ మంత్రివర్గం ముందుకు రాకపోగా ఆ విషయంలో డా అంబేడ్కర్‌ని అడ్డుకున్నది. 

అదే సమయంలో మహిళా హక్కులకు సంబంధించిన హిందూకోడ్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలన్న డా అంబేడ్కర్‌ ప్రతిపాదనను నెహ్రు కెబినెట్‌ తోసి పుచ్చింది. బీసీ కమిషన్‌ ఏర్పాటును, హిందూకోడ్‌ బిల్లును కాంగ్రెస్‌ ప్రభుత్వం అడ్డుకోవడం వల్లనే నెహ్రు కేబినెట్‌లో 4 సంవత్సరాల 56 రోజులు న్యాయశాఖ మంత్రిగా ఉన్న డా అంబేడ్కర్‌ 1951 సెప్టెంబర్‌ 27న రాజీనామా చేశాడు. తన రాజీనామా పత్రాన్ని కూడా రాజ్యసభలో చదవకుండా అయ్యంగార్‌ ద్వారా నెహ్రు అడ్డుకున్నాడు. అందువల్ల పార్లమెంట్‌ రికార్డుల్లో డా అంబేడ్కర్‌ రాజీనామాకు గల రెండు కారణాలు రికార్డు కాలేదు. కానీ ఆనాటి పత్రికలు అంబేడ్కర్‌ రాజీనామాకు గల కారణాల్ని ప్రచురించాయి.

ఇదే సందర్భంలో లక్నోలో జరిగిన ఒక సంఘటనని గుర్తుకు తెచ్చుకోవాలి. 1948 ఏప్రిల్‌ 24, 25 తేదీలలో షెడ్యూల్డ్‌ క్యాస్ట్స్‌ ఫెడరేషన్‌ సమావేశాలు జరుగుతున్నాయి. ఆర్‌.యల్‌. చంద్రాపురి అనే బీసీ నాయకుడి నేతృత్వంలో కొందరు బీసీ నాయకులు డా అంబేడ్కర్‌ని లక్నోలో కలిసి ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ లకు కూడా నాయకత్వం వహించవల్సిందిగా కోరారు. అప్పుడు డా అంబేడ్కర్‌ ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కల్సి ఒక శక్తిగా ఎదిగితే యుపీలో ముఖ్యమంత్రిగా ఉన్న గోవింద్‌ వల్లబ్‌ పంత్‌ మీ బూట్లకు లేసులు కట్టే పనికి పూనుకుంటాడు’ అన్నారు. ఈ వార్త కూడా అప్పటి పత్రికల్లో వచ్చింది. ఈ వార్త చదివిన చాచా నెహ్రు, ఆర్‌.యల్‌. చంద్రాపురికి క్యాబినెట్‌ మంత్రి పదవిని ఎరగా వేస్తే చంద్రాపురి దాన్ని తిరస్కరించారు. 

తన రాజీనామా తరువాత దేశవ్యాప్తంగా బీసీల చైతన్యయాత్రను డా అంబేడ్కర్‌ ప్రారంభించిన దరిమిలా, దానిని అడ్డుకోవటానికే నెహ్రు బీసీ కమిషన్‌ వేశాడు. డా అంబేడ్కర్‌ కృషి ఫలితంగా 340 అధికరణాన్ని రాజ్యాంగంలో చేర్చడం వల్లనే బీసీల కమిషన్‌ ఏర్పాటుకు మార్గం ఏర్పడ్డదన్న విషయాన్ని బీసీలు గుర్తించాలి. బీసీల రిజర్వేషన్లను దెబ్బ తీయడానికే కాకా కాలేల్కర్‌ అనే పూణే బ్రాహ్మణుణ్ణి బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా నెహ్రూ నియమించాడు. అదే సమయంలో బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరించవల్సిందిగా ముఖ్య మంత్రులకు నెహ్రూ రహస్య లేఖల్ని రాసిన విషయాన్ని 1977 లో పార్లమెంట్‌లో హోమ్‌ మంత్రిగా ఉన్న ఛౌదరి చరణ్‌సింగ్‌ బయటపెట్టాడు. 

అంతేకాదు కాకా కాలేల్కర్‌ 2218 కులాలను బీసీలుగా గుర్తించి నెహ్రు ప్రభుత్వానికి సమర్పించగా, దాన్ని తొక్కిపెట్టమని అప్పటి రాష్టప్రతి రాజేంద్రప్రసాద్‌ నెహ్రూకు రహస్య లేఖ రాసిన విషయాన్ని ‘రాజేంద్ర ప్రసాద్‌ లేఖలు’ అనే గ్రంథాన్ని రాసిన డా వాల్మికి చౌదరి (రాజేంద్ర ప్రసాద్‌ సెక్రెటరీ) బయట పెట్టాడు. ఆ లేఖను అందుకున్న నెహ్రు వెంటనే కాకా కాలేల్కర్‌ను పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌కి పిలిపించి మందలించగా, అప్పుడు కాకా కాలేల్కర్‌ తానిచ్చిన రిపోర్టు బీసీల ప్రయోజనాలను కాపాడదని, అందువల్ల ఆ సిపార్సులను వెనక్కి తీసుకుంటున్నానని31 పేజీల ఉత్తరాన్ని ప్రభుత్వానికిచ్చాడు.

ఈ లేఖను సాకుగా తీసికొని- కమిషన్‌ అధ్యక్షుడే అంగీకరించని సిపారసులను అమలు చేయలేమని- పార్లమెంట్‌లో ప్రకటించాడు నెహ్రూ. దరిమిలా నెహ్రూ వారసులైన దేశ పాలకులు బీసీ రిజర్వేషన్లవిషయాన్ని 20 సంవత్సరాలు పార్లమెంట్‌లో చర్చకు రానీయకుండా అడ్డుకోగలిగారు.1977లో కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పతనమైన తరువాతనే మురార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఉన్నప్పుడే బీసీల సమస్యను అధ్యయనం చేయడానికి ఓబీసీకి చెందిన బిందేశ్వర ప్రసాద్‌ మండల్‌ అనే ఎంపీ అధ్యక్షతన ఒక కమిటీని రాజ్యాంగం లోని 340 ఆధికరణం ద్వారా ఏర్పరిచారు. తరువాత జరిగిన పరిణామాలు ఇటీవలి చరిత్రే. 

ఇక క్రిస్టియన్‌ మైనారిటీల రిజర్వేషన్ల్‌ విషయానికొస్తే, ఇక్కడా డా అంబేడ్కర్‌కి అడ్డుపడ్డది గాంధీ శిష్యుడు కాంగ్రెస్‌వాది అయిన కేరళ సిరియన్‌ క్రిస్టియన్‌ (నంబూద్రి బ్రాహ్మణ క్రిస్టియన్‌) అన్న విషయం చరిత్రలో దాగిన సత్యం. రాజ్యాంగ పరిషత్‌లో దళిత క్రిస్టియన్స్‌కి రిజర్వేషన్స్‌ కల్పించాలని డా అంబేడ్కర్‌ ప్రతిపాదించినపుడు, కేరళలో దళిత క్రిస్టయన్స్‌ని సిరియన్‌ క్రిస్టియన్‌ చర్చీలలోకి కూడా అడుగుపెట్టనివ్వని క్రిస్టియన్‌ (సిరియన్‌) ప్రతినిధి ‘అవర్‌ క్రిస్టియన్స్‌ ఆర్‌నాట్‌ బెగ్గర్స్‌’ (మా క్రిస్టియన్లు బిచ్చగాళ్ళు కాదు) అని, ‘మా క్రిస్టియన్స్‌కి రిజర్వేషన్స్‌ అవసరం లే’దని దళిత క్రిస్టియన్ల నోట్లో దుమ్ము కొట్టిన చరిత్ర దళిత క్రిస్టియన్స్‌కి తెలి యకపోవడం చరిత్రని చదవకపోవటమే. క్రిస్టియన్‌ మత మార్పిడులను వ్యతిరేకించిన గాంధీ, నెహ్రుల ఫోటోలను అగ్రకుల క్రిస్టియన్‌ సంస్థలు నడిపే స్కూళ్ళు, కాలేజీల్లో పెట్టి పూజిస్తారు. రాజ్యాంగంలో 51వ ఆర్టికల్‌ ద్వారా మైనారిటీ హక్కుల్ని పొందు పరిచేందుకు కృషిచేసిన డా అంబేడ్కర్‌ని ఆడిపోసుకోటానికి, హిందూ క్రిస్టియన్ల పెద్దలు బ్రాహ్మణ భావజాల పీడితులైనందుకు, వాళ్ళ భావదారిద్య్రానికి విచారిం చాలి. 

gopi
ఈ భావ దారిద్య్రం ప్రభావం ఎంతంటే- తనని విద్యార్ధి దశలో అవమాన పర్చి, స్వంత ఇంటి నుండే వెలి కావడానికి కారణమైన బ్రాహ్మణిజాన్ని జీవితాంతం చీల్చి చెండాడి, ప్రత్యమ్నాయ సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపిన మహాత్మా పూలేకి- దండలేస్తున్న కొంతమంది కూడా డా అంబేడ్కర్‌- పూలే గురించి రాయలేదని కువిమర్శలు చేస్తున్నారు. ధనం జయ కీర్‌ని పూలే గురించి రాయలని కోరి, పూలే గురించి తను రాసిన వివరాల స్క్రిప్ట్‌ను ఆయనకు ఇచ్చి, పూలే జీవిత చరిత్ర రాయడం పూర్తి అయినతరువాతనే తన జీవిత చరిత్రను రాయా లన్న అంబేడ్కర్‌ని అపార్ధం చేసుకుంటున్నారు. డా బి.ఆర్‌. ఆంబే డ్కర్‌ రాసిన స్క్రిప్ట్‌కి ‘మహత్మా ఫూలే- ది ఇండియన్‌ సోషల్‌ రివల్యూషన్‌’ అనే నామకరణం కూడా చేశారు. తాను రాసిన ‘శూద్రులెవరు?’ అనే గ్రంథాన్ని ఫూలేకి అంకిత మిచ్చి, తన ముగ్గురు గురువుల్లో ఫూలేని చేర్చుకున్న డా అంబేడ్కర్‌ గురించి అపార్థం చేసుకోకుండా ఉండాలంటే వీళ్ళు కూడా మనువాద ప్రభావం నుండి బయటపడాలి! 
ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయం

Surya News  Paper Dated : 14/04/2012

Monday, April 2, 2012

పోరాటమా? కుల దాష్టీకమా? - డా.ఎం.ఎఫ్.గోపీనాథ్,



అవసరం ఉండి అవకాశాలున్న ప్రతి మనిషి అన్యాయం చేయటానికి వెనుకాడడనే సాధారణ సూత్రీకరణకు కొంతమందే మినహాయింపు. రాష్ట్ర ఖనిజ సంపదను కట్నంగా రాసివ్వాలన్నా, వక్ఫ్ భూముల్ని లాక్కొని లంకంత ల్యాంకో టవర్‌లను కట్టాలన్నా పెట్టి పుట్టాల. దానికి మాయ ఉండాల. డబ్బుండాల. దబాయింపు సెక్సనుండాల. (వరస మార్చినందుకు రావిశాస్త్రిగారికి క్షమాపణలు). 

ఫిబ్రవరి 28న 'కార్మిక సంఘాల నాయకత్వంలో సార్వత్రిక సమ్మె' జరిగింది. ఆ సమ్మె ఫలితంగా ఏమోగాని ఓ దళిత కాలేజీ ప్రిన్సిపాల్ 'లైంగిక వేధింపుల' సెక్షన్ కింద బుక్కయ్యాడు. అతను ఆసుపత్రి పాలయ్యాడు. మార్చి23న సస్పెండయ్యాడు. ఆ కథకన్నా ముందు గతంలోని కొన్ని సంఘటనలు. 

1979లో గుంటూరు మెడికల్ కాలేజీలో ఉన్న దళిత మెడికోలకు, ఎస్ఎఫ్ఐలోని అగ్రకుల మెడికోలకు గొడవ జరిగింది. ఆ గొడవలో రాడికల్ విద్యార్థులు (మెడికోలు) ఎవరికి మద్దతు తెలపాలనే సమస్య వచ్చింది. ఆ దళిత విద్యార్థులు ఏ వామపక్ష సంఘాల్లో లేరు. అప్పుడు కొండపల్లి సీతారామయ్యగారు రాడికల్ విద్యార్థి సంఘానికి ఒక సాధారణ సూత్రం చెప్పారు. 'ఎప్పుడూ పైకి కనపడే సంఘటన, సందర్భాలకన్నా, ఆ సంఘటనల వెనక ఉండే సామాజిక కారణాల్లోకి వెళ్తే, దౌర్జన్యం చేసి కూడా కప్పి పుచ్చుకునే అవకాశం అగ్రవర్ణాలకే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దౌర్జన్యాలు చేసే అవకాశం, అవసరం తక్కువ ఉన్న దళితులకే రాడికల్స్ మద్దతుండాలి'. 

ఈ ప్రపంచంలో అత్యాచారం చేసే అవకాశం స్త్రీలకు లేనట్లే, అన్యాయం దౌర్జన్యం చేసే అవకాశం దళితులకు లేదు. ఉదాహరణగా ఒక సారి ప్రభుత్వాధికారుల్లో లంచాల సమ స్య చర్చకొచ్చింది. నా మిత్రుడొకరు ఆర్ అండ్‌బిలో ఇంజనీరు. ఒక 'పని' చేసిపెట్టి నందుకు ఒకే ర్యాంకులో ఉన్న ఇద్దరు ఇంజనీర్లకు ఒక కాంట్రాక్టరు ఒక లక్ష (నా మిత్రుడికి), ఇంకొక ఇంజనీరుకు (అగ్రకుల ఇంజనీర్‌కు) ఐదులక్షలు ఇచ్చాడట. ఇదెక్కడి 'అన్యాయం' అండీ. ఆ ఇంజనీరు కన్నా నేనే ఎక్కువ కష్టపడ్డా ఆ కాంట్రాక్టర్ బిల్లు కొరకు అన్నాడు. నేనన్నాను. సాంఘిక గణితశాస్త్రం ప్రకారం నీకు లెక్క ప్రకారమే ముట్టింది లంచం. ఎందుకంటే 'లంచం' అయినంత మాత్రాన, నీవు పంచముడన్న వాస్తవంమరిస్తే ఎలా అన్నాను. పాపం ఇంకేం మాట్లాడలేదతను. 

1980లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో దళిత-వామపక్ష విద్యార్థుల ఐక్యతతో విద్యార్థి ఉద్యమాలు ఉన్నత దశలో ఉన్నాయి. అప్పటి వరకు రైటి స్ట్‌ల కంట్రోల్లో ఉన్న మెడికల్ కాలేజీ 1978 నుంచి మా చేతిల్లోకి వచ్చింది. మమ్మల్ని తమ శక్తివంచన లేకుండా అణచివేయటానికి కొంతమంది ప్రొఫెసర్లు (పి.ఎస్.రెడ్డి, వాఘ్రే తదితరులు), ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. అంతేకాదు కొంతమంది నన్ను చంపటానికి సికింద్రాబాద్ గూండాలను పురమాయించారు. వాళ్ల కుట్రలు సాగలేదు. అదే సమయంలో మా విద్యార్థి ఉద్యమాలపట్ల సానుభూతితో మాకు మద్దతుగా ఉన్న దళిత ప్రొఫెసర్లు నిశ్శబ్దంగా మాకు సహాయపడుతున్నారు. 

ఒకరోజు సాయంత్రం కాలేజి హాస్టల్(ప్రిన్సిపాల్ లాడ్జ్)కు తీసుకుని వెళ్లగా, అక్కడ ఒక అగ్రకుల మెడికో నాయకుడు (లిన్‌పియావో సానుభూతిపరుడు), సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసన్ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ అయిన ఒక దళితుణ్ణి కొట్టాలని ఎస్సీ, బీసీ విద్యార్థుల్ని తయారుచేసి మీరు కూడా రేపు 10 గంటలకు రావాలన్నాడు నాతో. కారణం ఏమంటే ఈ ప్రొఫెసర్ కొంతమంది దళిత విద్యార్థుల్ని ఫెయిల్ చేశాడట. ఫెయిల్ అయిన ఆ విద్యార్థులు క్రానిక్ రిఫర్డ్స్. ఆవారాగా తిరిగేవాళ్లు. అటువంటప్పుడు విద్యార్థి ఉద్యమాల్ని అణచివేస్తూ, ఉద్యమాల్లో పనిచేసే విద్యార్థుల్ని బెదిరించే ప్రొఫెసర్స్ అయిన పిఎస్ రెడ్డి లాంటి వాళ్లను మొదట టార్గెట్ చేద్దామన్నాను. 

పిఎస్ రెడ్డి లాంటి వాళ్లను కొడితే రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది. 'మొదట తేలికపాటి టార్గెట్‌ను ఎంచుకుంటే స్టూడెంట్స్‌కు కూడా ట్రైనింగ్ అవుతుంది' అన్నాడా విద్యార్థి నాయకుడు. 'సరే అని చెప్పి ఆ రాత్రి ప్రొఫెసర్ జి.ఎ. ఇంటికి కబురుపెట్టాను. మూడు రోజులు లీవ్ పెట్టమని'. నాలుగో రోజు నలుగురు విద్యార్థులతో నిజనిర్ధారణ కమిటీ వేసి ప్రొఫెసర్ జి.ఎ. దగ్గరికెళ్లి విచారించగా ఆయన పరీక్ష చేసిన విద్యార్థులెవరూ ఫెయిల్ కాలేదు. వేరే ప్రొఫెసర్స్ ఫెయిల్ చేశారు. సారీ చెప్పి వచ్చాము. 

2000 సంవత్సరంలో ఖమ్మం జిల్లాలో కూసుమంచి మండలాధికారిగా దళితుడైన ఐ.భూషణం వచ్చారు. ఆయనకు ఆ మండలంలోని ఒక వామపక్ష పార్టీ ఏదో పనిచేబితే చేయలేదు. అందుకుగాను ఆ వామపక్ష పార్టీలోని ఒక దళితుణ్ణి ఆ మండలాధికారి మీదకు ఉసిగొల్పి నిరాహార దీక్ష టెంట్ వేయించారు. 1985లో కారంచేడులో అగ్రకుల భూస్వాములు మాదిగల్ని నరికి చంపారు. అప్పుడు అధికారంలో ఉన్న టిడిపిలో మంత్రి అయిన రాజయ్యను రాయభారం పంపింది ఆ పార్టీ. 1991లో చుండూరులో అగ్రకులాలు మాలల్ని నరికారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గుడిసెల వెంకటస్వామిని రాయబారం పంపింది. 

రాజయ్య - మాదిగ, వెంకటస్వామి - మాల. కుల సమీకరణ సరిపోయింది. 2009-10లో టిఆర్ఎస్ నాయకుడు ఖమ్మంలో నిరాహార దీక్ష విరమించుకున్నప్పుడు తెలంగాణలోని యూనివర్సిటీ విద్యార్థులు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని బతికించారు. ఆ ఉద్యమాన్ని చీల్చి, నిర్వీర్యం చేయటానికి సమర్థులైన ఇద్దరు దళిత పోలీసు అధికార్లను టిఆర్ఎస్ + కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల్ని కులం పేరుతో చేరదీసి, ఆ విద్యార్థి ఉద్యమాన్ని చీల్చింది. 

ఫిబ్రవరి 28న 11 కార్మిక సంఘాల నాయకత్వాన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా, వామపక్షాలు ఆర్గనైజ్డ్‌గా ఉన్న ఖమ్మంలో 'సమ్మె' జయప్రదమైంది. ఇది విద్యార్థుల ఉద్యమాల కొరకు విద్యార్థులు పాల్గొనే సమ్మె కాదు. పైపెచ్చు అది పరీక్షల సమయం. వారం రోజుల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం, కలవారి విద్యార్థులు రోజూ 15-18 గంటలపాటు కష్టపడుతున్న సమయం. ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు కూడా తాము బాధ్యత వహిస్తున్న ఇంటర్ విద్యార్థుల రిజల్ట్స్ మెరుగుపర్చాలనే ఉద్దేశ్యంతో కాలేజీ నడుపుతున్నారు. ఈ ప్రిన్సిపాల్ రాకముందు 2010లో 22 శాతంగా ఉన్న పరీక్షా ఫలితాలు 2011లో 45 శాతానికి పెరిగాయి. 

ఫిబ్రవరి 28న సమ్మె రోజు వామపక్ష పార్టీల విద్యార్థి నాయకులు కాలేజీ విద్యార్థుల్ని బయటకు పంపమనటాన్ని వ్యతిరేకించిన ప్రిన్సిపాల్, స్టాఫ్‌తో గొడవపడి ఫర్నిచర్ ధ్వంసం చేసారు. ప్రిన్సిపాల్ తన బాధ్యతగా పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు విద్యార్థులపై కేసులు బుక్ చేసారు. అందుకు ప్రతిగా అప్పటివరకు ఎజెండాలో లేని 'విద్యార్థినిలను ప్రిన్సిపాల్ లైంగికంగా వేధిస్తున్నట్లు' ప్రిన్సిపాల్‌పై 17 మంది అమ్మాయిల చేత కేసు పెట్టించారు. ఈ కేసు వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయి. కాలేజీలో విద్యార్థినుల హాజరు శాతం తగ్గుతున్నందున కొంతమంది విద్యార్థినులకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ హాల్ టిక్కెట్లు ఇవ్వలేదు. 

అందువల్ల కొన్నిచోట్ల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా మీడియాలో చూస్తున్నాం. ఫిబ్రవరి 27న ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు ప్రిన్సిపాల్‌ను కలిసి హాజరు శాతం తక్కువ ఉన్న విద్యార్థినుల హాల్‌టిక్కెట్స్ అడగటం, ప్రిన్సిపాల్ తన పరిధిలో లేదని చెప్పటం అక్కడ వాగ్వివాదం జరగటం జరిగిపోయాయి. మరుసటి రోజు గొడవ చేద్దామనే ఆ విద్యార్థి నాయకులు కాలేజీకి వచ్చి రెచ్చిపోయి ఫర్నిచర్ ధ్వంసం చేయటం, ప్రిన్సిపాల్ కేసు పెట్టడం అయిన చాలా సేపటికి 'విద్యార్థినులను లైంగికంగా వేధించా'డనే విషయం, 27న లేనిది పోలీసు కేసు అయిన తర్వాత ఎలా వచ్చింది? ఒకవేళ ప్రిన్సిపాల్ బీసీ కులస్తుడైతే లైంగిక వేధింపులతోపాటు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చేత ఎట్రాసిటీ కేసు కూడా పెట్టించేవారు కాదా ఈ నాయకులు? 

ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టాన్ని నిజంగా దుర్వినియోగపరుస్తుంది అవకాశవాద అగ్రవర్ణ రాజకీయ నాయకులే. అందుకు తాజా ఉదాహరణ ఖమ్మం పట్టణంలో అగ్రకులానికి చెందిన ఒక కార్డియాలజిస్ట్, హాస్పిటల్ బిల్డింగ్ యజమానికి మధ్య హాస్పిటల్‌ను ఖాళీ చేయించే విషయంలో జరిగిన గొడవ. ఆ కార్డియాలజిస్ట్ ఖాళీ చేయటానికి కొంత గడువు కావాలని కోర్టుకెళ్లాడు. కోర్టులో కేసు వాపస్ తీసుకోమని బెదిరిస్తూ, ఆ బిల్డింగ్ యజమాని ఒక రాజకీయ నాయకుడి సహాయం కోరాడు. ఆ రాజకీయ నాయకుడు తన దగ్గర పనిచేస్తున్న ఒక ఎస్సీ కుర్రవాడిని ఒక రాత్రి ఆ డాక్టర్ దగ్గరకు పేషెంట్ రూపంలో పంపి, అలజడి చేసి, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు పెట్టించారు. 

ఈ డాక్టర్ ఐఎంఏలో సభ్యుడు. తన మీద అన్యాయంగా బనాయించిన కేసు విషయం సహాయం కొరకు ఐఎంఏ సహాయం కోరాడు. ఐఎంఏ ఏం చేయగలం? అన్నది. అప్పుడు నేనన్నాను. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టాన్ని ఈ విధంగా దుర్వినియోగం కానివ్వను. నేను ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానన్నాను. చివరకు ఆ డాక్టర్, బిల్డింగ్ యజమాని, రాజకీయ నాయకుడు ఒకే అగ్రకులానికి చెందినవారు కాబట్టి రాజీపడ్డారు. 

భారత ప్రభుత్వ నేర నమోదు శాఖ రిపోర్టు ప్రకారం పెరుగుతున్న నేరాల్ని దృష్టిలో పెట్టుకుంటే రాజకీయ ఒత్తిడితోగాని, అధికార బలంతోగాని, కండబలంతోగాని పోలీసు స్టేషన్లో రికార్డుకాని కేసుల సంఖ్య తక్కువేమీ కాదు. ఎట్రాసిటీ కేసుల్లో లైంగిక వేధింపుల కేసుల్లో, అత్యాచారాల కేసుల్లో నేరస్థులు ఎవరు? జవాబు చాలా స్పష్టం. అగ్రవర్ణాల పురుషులు. 1998లో ఖమ్మం జిల్లా, నాయకన్ గూడెం గ్రామ దళిత కాలనీలో ఒక రాత్రి 11 గంటల వరకు మీటింగ్ నడుస్తుంది. అందరూ దళితులే. ఆ మీటింగ్‌లో అంతకు ముందే జరిగిన ఒక అత్యాచారం కేసు విషయంలో చర్చ జరుగుతుండగా, నేనొక ప్రశ్న వేశాను. 

ఆ మీటింగులో ఉన్న దళితులకు, అత్యాచారాలు, దళిత, గిరిజనుల ఆడవాళ్ల మీదే ఎందుకు జరుగుతున్నాయి అన్నాను. 'మేం పేదలం మాకు దిక్కు లేదు' అన్నారు. మరి కమ్యూనిస్టుల ప్రకారం అగ్రవర్ణాల్లో కూడా పేదలున్నారు కదా! అగ్రకులాల స్త్రీల మీద అత్యాచారాలు ఎందుకు జరగటం లేదు? (ఈ మధ్యనే డిజిపిగారన్నట్లు) దళిత స్త్రీలు అగ్రవర్ణాల పురుషుల్ని రెచ్చగొట్టే డ్రస్సులు వేసుకుంటున్నారా? లేక దళితుల స్త్రీలు అగ్రకుల స్త్రీల కన్నా అందంగా ఉంటారా? లేక దళిత మగవాళ్లు నపుంసకులా అన్నాను. చివరగా మీ సమాజాన్ని, మీ ఆడబిడ్డల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే తెగింపు ఒక్కటే మార్గమని సభ ముగించాం. 

పురాణాల్లో పరుశురాముడు తన తల్లి శిరస్సు నరికాడట తండ్రి ఆజ్ఞ ప్రకారం. బిజెపి నుంచి మొదలుకొని విప్లవపార్టీల్లో పనిచేస్తున్న దళిత, బహుజన రాజకీయ కార్యకర్తలకు నా విజ్ఞప్తి ఏమంటే మీ పార్టీల్లోని అగ్రవర్ణాల దాష్టీకాన్ని ప్రదర్శించటానికి మమ్మల్ని దారికి తెచ్చుకోవటానికి ఇప్పుడిప్పుడే చదువుల్లో ఉద్యోగాల్లో నిలదొక్కుకుంటున్న మమ్మల్ని టార్గెట్ చేయకండి. ఆ పనిచేయటానికి ఎలాగు అగ్రకుల ప్రభుత్వ యంత్రాంగమున్నది. మీకు చేతనైతే దళితులకు అండగా ఉండండి. చేతకాకపోతే దళితులకు దూరంగా ఉండండి. 

- డా.ఎం.ఎఫ్.గోపీనాథ్,
మేనేజింగ్ డైరెక్టర్, ఫూలే, అంబేద్కర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్
Andhra Jyothi News Paper Dated : 3/4/2012 

Saturday, February 25, 2012

మార్క్సిజం ముసుగులో కుల రాజకీయం - ఎమ్. ఎఫ్. గోపీనాథ్


మార్క్స్ అదృష్టవంతుడు. అంబేద్కర్ దురదృష్టవంతుడు. మార్క్స్‌కు ఏంగెల్స్ వంటి మిత్రుడు, లెనిన్, స్టాలిన్, మావో వంటి సైద్ధాంతిక, తాత్విక, రాజకీయ వారసులు ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన వర్గ నిర్మూలనా సిద్ధాంతాన్ని వారు అభివృద్ధి చేశారు; మార్క్సిజం అజేయమని నిరూపించారు. అంబేద్కర్ ప్రతిపాదించిన కుల నిర్మూలనా సిద్ధాంతాన్ని అభివృద్ధి చేయడం అటుంచి, అవగాహ న చేసుకొన్నవాళ్ళే కరువయ్యారు. ఏప్రిల్ 14, డిసెంబర్ 6 భజంత్రీలు మాత్రమే ఉన్నా రు. 

అంబేద్కర్‌ని అర్థం చేసుకొన్న వాళ్ళ కన్నా, అపార్థం చేసుకొన్న వాళ్ళే ఎక్కువ. దేశవ్యాప్తంగా రెండు రకాల నేరాలు చట్టబద్ధంగా జరుగుతున్నాయి. ఒకటి-అనాది గా అంటరానికులాలపై జరుగుతున్న ఊరు బహిష్కరణలు, హత్యలు, అత్యాచారాలు; రెండు-జలియన్‌వాలాబాగ్; భగత్ సింగ్, భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరితీత; ఆదిభట్ల కైలాసం, వెంపటావు సత్యం నుంచి చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్) ఎన్‌కౌంటర్ వర కు జరిగిన చట్టబద్ధ (!) హత్యలు.

ఈ నేరాలు ఈ దేశ మూల వాసుల్ని అణచివేసి, వారి ధన, మాన ప్రాణాల్ని దోచుకోవటానికి క్రీ.పూ. 2500 నుంచి పరాయి ఆటవిక ఆర్య తెగలు సాగిస్తున్న దండయాత్ర, దమనకాండలో భాగమే అని కొంచెం లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది. నాటి సుగ్రీవుడి లాంటి చిదంబరం, హనుమంతుడి లాంటి మహేంద్రకర్మ, అంగదుడులాంటి రమణ్‌సింగ్‌లు వర్తమాన ఆర్యులకు దొరికి నప్పుడు మూలవాసుల (ఆదివాసీ, ఎస్‌సి, బిసి, మైనారిటీల) బతుకులకు భద్రత ఎక్కడ ఉంటుంది? 

భారతదేశంపై ఆర్యుల దండయాత్రలో మూడు దశలు ఉన్నాయి. మొదటి దశలో సింధు నాగరకతను ధ్వంసం చేశారు. ఆ తరువాత తమలో తాము కలహించుకొంటూ నే (కురుక్షేత్ర సమరం ఇందుకొక ఉదాహరణ) నరకుడు, బకుడు, జరాసంధుడు మొదలైన మూల వాసుల రాజులను సంహరించారు. రెండో దశలో రాముడు, శంభూకుడు, వాలి, రావణులను సుగ్రీవుడు, విభీషణుడు లాంటి కోవర్ట్స్ సహాయంతో సంహరించా రు. ఇక మూడవ దశ వర్తమాన కాలానిది.

ఈ దశలో మధ్య భారతం మీద ఆర్య-ద్రావిడ సంయోగ చిహ్నమైన చిదంబరం నాయకత్వంలో అణచివేయబడ్డ జాతులకు అండగా నిలిచిన ఆజాద్ లాంటి వారిని హతమారుస్తున్నారు. ఈ దండయాత్రను తిప్పికొట్టవలసిన శక్తులు ఐక్యంగా కదలవలసిన సమయమిది. తాత్వికరంగంలో రామాయణ, భారత కట్టుకథల్ని మూల వాసుల కోణం నుంచి పరిశీలించవలసి ఉన్న ది.

చరిత్రలో దాచబడ్డ వాస్తవాలను వెదికి తీయవలసి ఉంది. ఈ కోణం నుంచి ఆలోచిస్తేనే కారంచేడు మాదిగల, చుండూరు మాలల, ఖైర్లాంజి మాంగ్‌ల హత్యాకాండను అర్థం చేసుకోగలుగుతాం. అణచివేతకు గురైన కులాల సమస్యల్ని వామపక్షాలు అర్థం చేసుకోవలసివుంది. పెట్టుబడిదారీ వ్యవస్థని, సామ్రాజ్యవాదాన్ని మూలవాసుల నాయకత్వం అర్థం చేసుకోవాలి. కాని జరుగుతోన్న, నడుస్తోన్న ఉద్యమాల చరిత్ర ఇందుకు భిన్నంగా, వ్యతిరేకంగా చోటుచేసుకొంటోంది. 

వర్గం ప్రధానమని, కులం అప్రధానమనేది మన వామపక్ష మేధావుల సునిశ్చిత విశ్వాసంగా ఉంది. 1936లో 'ఇండియన్ లేబర్ ఫ్రంట్'ని ప్రారంభించిన సందర్భంగా అంబేద్కర్ చెప్పిన 'అశేష భారత ప్రజలకు బ్రాహ్మణిజం, పెట్టుబడిదారీ విధానం మధ్య ఉన్న వైరుధ్యాలే ప్రధానమన్న' సూచనను అప్పటి, యిప్పటి వామపక్షీయులు పట్టించుకోడం లేదు.

కంచికచర్ల, కారంచేడు, పదిరికుప్పం, నీరుకొండ, చీమకుర్తి, చుం డూరు, వేంపెంట, తిమ్మ సముద్రం, ప్యాపిలి, కీల్వణ్ మణి, బెల్చి, ఖైర్లాంజి ఘటనలు కేవలం వర్గ వైరుధ్యాల ఫలితమని నమ్మాలా? నా అనుభవంలోని ఒక వింత సంఘటనను పేర్కొంటాను. జస్టిస్ పున్నయ్య కమిషన్ ఖమ్మం వచ్చినప్పుడు జరిగిన ఒక సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ వారు నన్ను ప్రాంభోపన్యాసం చేయమన్నారు. 

నా ప్రసంగంలో ఒక వాస్తవాన్ని ప్రస్తావించాను. 'ఆనరబుల్ జస్టిస్, మీరు ఖమ్మం జిల్లాలో కుల వివక్ష గురించి పరిశీలించే క్రమంలో ఆల్ ఈజ్ వెల్ వితిన్ ఖమ్మం అనిపిస్తుంది. రెండు గ్లాసుల పద్ధతి కొరకు వెదికితే నిరాశ మిగులుతుంది. ఖమ్మం కేంద్రంగా 50 కిలో మీటర్ల రేడియస్‌లో భూముల రికార్డులు పరిశీలించండి. యాభై ఏళ్ల క్రితం దళితులపేరు మీద ఉన్న ఇనామ్ భూములు ప్రస్తుతం ఈ కమ్యూనిస్టు పార్టీల నాయకుల ఆధీనంలో ఉన్నాయి.

ఫలానా గ్రామంలో మాదిగలకు చెందిన 140 ఎకరాల భూమి ఇప్పుడు ఆ ఊరి కమ్యూనిస్టు నేత చేతిలో ఉంది! ఇలా చాలా గ్రామాలపేర్లు ప్రస్తావిం చి మాకు ఈరోజు అగ్రకులాల గ్లాసుల్లో నీళ్ళు, చాయ్ త్రాగాలనే కోరిక ఏ మాత్రం లేదు. రాజ్యాంగ విరుద్ధంగా దళితుల ఇనామ్ భూముల్ని, సారా తాపించి, ఆ కుటుంబంలో తల్లీ బిడ్డలకు తెలియకుండా కొనడం నేరం. కమ్యూనిస్టులమనుకునే వాళ్ళు అసలే ఈ పనులు చేయకూడద'ని అన్నాను. ఏ పార్టీ అయితే ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసిందో ఆ పార్టీ నాయకత్వమే ఆ సమావేశాన్ని బాయ్‌కాట్ చేపింది! 

తెలంగాణ సాయుధ పోరాటకాలంలో నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ ప్రాంత దళ కమాండర్ (ఒక అగ్ర కులస్తుడు) భూస్వాముల భూమిని పంచుతూ తన కులస్తుల భూమి పంపకాన్ని వాయిదా వేశాడు. ఆ దళంలోని ఎస్‌సి, బిసి వర్గాలకు చెందిన సభ్యులు భూపంపకంలో కుల సమస్య గురించి పార్టీ ప్రావిన్షియల్ కమిటీకి ఒక లేఖ రాశారు. సర్ ఆర్థర్ కాటన్ 1850ల్లో గోదావరి, కృష్ణాదులపై బ్యారేజీల నిర్మాణాన్ని పూర్తిచేసిన తరువాత ఉభయ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల్లో చిన్న, మధ్య తరగతి రైతులుగా ఉన్న ఒక సామాజికవర్గం వారు 1930 నాటికి పీజెంట్ బూర్జువాలుగా అభివృద్ధి చెందారు.

నిడుబ్రోలులో ఎన్‌జి రంగా స్థాపించిన రైతు శిక్షణాలయంలో తెలంగాణలోని నీటి వనరుల గురించి, సారవంతమైన భూముల గురించి సమాచారం తెలుసుకొని తెలంగాణను దోచుకోవడానికి బాటలు వేశారు. ఆంధ్ర వలసల్ని సాఫీగా సాగించడానికి ఈ పీజెంట్ బూర్జువాలకు 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అనే కుట్రపూరిత నినాదం తోడ్పడింది.

తదనంతర కాలంలో ఈ పీజెంట్ బూర్జువాలే సోవియట్ యూనియన్, తూర్పు యూరోప్ కమ్యూనిస్టు దేశాలకు వరిధాన్యం, పొగాకు ఎగుమతులు ప్రారంభించారు. 1970ల్లో మాదాల నారాయణస్వామి నాయకత్వంలో సిపిఐ (ఎంఎల్) పార్టీ ఒకటి ఉనికిలోకి వచ్చిన తరువాత గుంటూరు పొగాకు కమ్యూనిస్టు చైనాకు ఎగుమతవడం ప్రాంభమయింది.

ఏతా వాతా తెలంగాణప్రాంత శ్రామిక కులా ల శ్రమ పెట్టుబడిని కోస్తా జిల్లాల అగ్రకుల కమ్యూనిస్టు నాయకత్వం బాగా ఉపయోగించుకొంది. ఆ శ్రామిక కులాల వారి త్యాగాలను తమ కులాల నుంచి అభివృద్ధి చెం దిన పీజెంట్ బూర్జువాల ప్రయోజనాలను కాపాడడానికి ఉపయోగించుకున్నారు, ఉపయోగించుకుంటున్నారు. రైతు సంఘాలను, రైతు కూలీల సంఘాలను, ఫ్యాక్టరీ యజమానుల సంఘాలను, ఆ ఫ్యాక్టరీలలో పనిచేసే కార్మిక సంఘాలను కమ్యూనిస్టు పార్టీ లే నిర్వహిస్తున్నాయి! వామపక్షపార్టీలు చెప్పేవి వర్గ రాజకీయాలు (మార్క్సిజం), చేసే వి కుల రాజకీయాలు (మనువాదం) అనడానికి ఇంతకన్నా ఇంకేమి రుజువు కావాలి? 

మార్క్సిస్ట్ విశ్లేషణకు శ్రమ, ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలు అనేవి ప్రాథమిక అంశాలు. మరి ఈ దేశంలో శ్రమ ఎవరిది? అంటే ఏ కులాలది? ఉత్పత్తి సాధనాలు ఏ కులాల చేతిలో ఉన్నాయి? ఉత్పత్తి ఏ కులాల స్వంతం? భారతీయ సమాజంలో శ్రామి క కులాలు, శ్రమ దోపిడీకులాల విభజనలో సమస్యేమిటి? సమస్యలేదు. నిజానికి స్పష్టత ఉంది.

1919లోనే ప్రాచ్య జాతుల గురించి లెనిన్ ఏమి చెప్పారో చూడండి: 'తూర్పు జాతుల ప్రజల్లో అధిక సంఖ్యాకులు శ్రామిక ప్రజలకు సిసలైన ప్రతినిధులు. వీరు పెట్టుబడిదారీ ఫ్యాక్టరీలు అనే శిక్షణాలయాల్లో శిక్షణ పొందిన కార్మికులు కారు. కానీ మధ్యయుగాలనాటి పీడనకు గురి అవుతూ దోచుకోబడుతున్న శ్రామిక రైతు జన బాహుళ్యానికి సిసలైన ప్రతినిధులు.

జనాభాలో అత్యధిక భాగం రైతులుగా ఉండి, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా కాకుండా, మధ్యయుగాల నాటి అవశేషాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించటం కర్తవ్యంగా ఉన్న పరిస్థితులకు ఆ సార్వత్రక సిద్ధాంతాచరణను వర్తింపచేయాలి. అది కష్టసాధ్యమైన నిర్దిష్ట కర్తవ్యం. అయితే ధన్యవాదాలర్పించవలసిన కర్తవ్యం'.

లెనిన్ పేర్కొన్న రైతు జనబాహుళ్యం మనదేశంలోఎవరు? భూమిలేని, మానవ జీవిత హుందాకు నోచుకోని, ఊరికి దూరంగా ఉండే దళితులు కారా? కమ్యూనిస్టు నాయకులకు, మేధావులకు ఒక విజ్ఞప్తి: మనం కలిసి కదిలిన రోజు, అమాయకంగా ప్రాణాలు కోల్పోతున్న పోలీసు, పారామిలిటరీ దళాలు, దారి తప్పిన సల్వాజుడుం తమ మూల వాసుల మూలాల్లోకి వెళ్ళి ఈ దేశంలో అనాదిగా హతులౌతున్న మూల వాసుల రక్షణకై నిలబడతారు. ఇకనైనా ఎజెండా మార్చండి. 

- ఎమ్. ఎఫ్. గోపీనాథ్
(ఫూలే-అంబేద్కర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఖమ్మం)
Andhra Jyothi News Paper Dated : 8/06/2010