Showing posts with label మల్లెపల్లి లక్ష్మయ్య. Show all posts
Showing posts with label మల్లెపల్లి లక్ష్మయ్య. Show all posts

Saturday, February 25, 2012

ఉద్యమకారుల దిక్సూచి

ఇక్కడ అత్తలూరి శేషయ్య గారి ఇల్లు ఎక్కడో చెపుతారా? వెనుక రిక్షాలోనుంచి వచ్చిన ప్రశ్నకు ఇటు తిరిగాడు నడివయస్కుడు. ఎవరో అపరిచితురాలి నోటి వెంట తన పేరు వినపడగానే ఏదో అర్థం అయ్యీ అవనట్టు తలూపాడు. తన యింటి అడ్రసు అడిగిన ఆమె వైపు తేరిపార చూశాడు. ఆమెకు 45 ఏళ్లుంటాయేమో తెల్లగా ఉంది. ఒక పక్క జుట్టు నెరసినట్టుంది. 

ఆమె ఒడిలో ఏదో గుడ్డలో చుట్టివుంది. రిక్షాలో మరో పక్క చిన్న బుట్ట. అందులో ఏవో గుడ్డలు కుక్కివున్నాయి. రిక్షా ముందు తన యింటికి దారి చూపిస్తూ నడిచాడు అత్తలూరి శేషయ్య. తన వెనకే రిక్షాలో అపరిచితురాలు. ఓ పూరి గుడిసె ముందు రిక్షాని ఆపి లోపలికెళ్లాడు. తన భార్య, ఆరుగురు పిల్లలతో ఇంటి బయటకు వచ్చాడు.

అప్పుడు గమనించారు వాళ్లు రిక్షాలో వచ్చిన అపరిచితురాలి చేతిలో నెల కూడా నిండని పసికందుని. నల్లగా నిగనిగలాడుతోందా పసిబిడ్డ. పాప ఒంటినిండా గుడ్డలు కూడా లేవు. చాలీ చాలని పాత గౌను తప్ప. గుడ్డల్లో చుట్టి వుంచిన పసిగుడ్డుని చేతులు ముందుకు సాచి 'ఈ పాపని మీ అబ్బాయి మల్లికార్జునరావు మీకివ్వమని చెప్పాడు' అన్నది. నల్లగా, సన్నగా ఊపిరి ఉందో లేదో అన్నట్టున్న ఆ అమ్మాయిని తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు.

navya.రెండు నిముషాల తరువాత అందరిలో నుంచి ఓ పదమూడేళ్ల పిల్లవాడు రెండడుగులు ముందుకేసి చేతులు సాచడం, ఆ నడివయస్కురాలు ఆ పసిగుడ్డుని ఆ బాలుడి చేతిలో పెట్టి వెనుతిరిగి వెళ్లిపోవడం అంతా ఐదు నిముషాల్లో జరిగిపోయింది.

చేతిలో పాపని లోపలికి తీసుకెళ్తున్న ఆ అబ్బాయి వెనకే నడుస్తూ.. 'కొండపల్లి సీతారామయ్యగారు పంపిస్తానని చెప్పింది డాక్డర్ దేవినేని మల్లికార్జునరావు కొడుకుని కదా?' అనుకుంటూ లోపలికి నడిచారు ఆ పిల్లవాడి తల్లి శిరోమణి, తండ్రి అత్తలూరి.

ఆ రోజు నుంచి ఆ దంపతుల ఎనిమిదో సంతానంగా ఆ పాపకి వాళ్ల హృదయాల్లో చోటునిచ్చాడు. ఆరు నెలల వరకు ఆ పాప ఏ తల్లి కన్నబిడ్డో, తమ దగ్గరికి ఎందుకు పంపించారో వారికి తెలియదు. కానీ నక్సలిజం బాటలో నడిచిన తమ కొడుకుని ఆ పసిబిడ్డలో చూసుకుంటూ ప్రేమగా పెంచుకున్నారు. 

సరిగ్గా ఏడాది తరువాత ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఒక వ్యక్తి వచ్చాడు. ఆ శీతాకాలపు రాత్రి వచ్చిన వ్యక్తితో పాటు ఆ కుటుంబ సభ్యులందరూ పొయ్యి చుట్టూ కూర్చొని వున్నారు. పొయ్యిచుట్టూ చేరి చలికాచుకుంటున్న అక్కడి వారి గుండెలు ఉద్వేగంతో కొట్టుకుంటున్నాయి. ఆ నెగడు వెలుతురులో ఎదురుగా నులకమంచంపై పడుకోబెట్టిన పాప ప్రశాంతంగా నిద్రపోతోంది.

ఈ పాప ఎవరు? ఆ యింటి యిల్లాలు మూడోసారి వేసిన ప్రశ్నకి సమాధానంగా తెల్లటి చిన్న కాగితాన్ని ఆమె చేతిలో పెట్టాడా వ్యక్తి. ఆ కాగితం పూర్తిగా తెరచి చదివిందో లేదో వెంటనే దాన్ని తీసుకొన్ని పొయ్యిలో వేశాడతను. పక్కనుంచి తొంగి చూసిన ఆ తల్లి కొడుకు జవహర్ మనసులో అనుకుంటున్నట్టుగా పైకే చెప్పేశాడు.

అంతే ఆ పేరు వినగానే అక్కడున్న వారి గుండెల్లో రాయి పడింది. అయితే యేడాదిగా తాము పెంచుకుంటున్నది ఓ నక్సలైటు నాయకుడి కూతురినా? అందరి చూపులూ అప్రయత్నంగా నిద్దరోతున్న పసిబిడ్డపై పడ్డాయి. 'ఈ విషయం బయటికి పొక్కితే...' అనే ఆలోచనే వారికి వెన్నులో ఒణుకు పుట్టించింది. అప్పటికే శ్రీకాకుళ గిరిజన సాయుధ రైతాంట పోరాటపు వీరగాథలు రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదిపేశాయి.

అనేకమంది విప్లవకారులను ప్రభుత్వ సాయుధ బలగాలు మట్టుబెట్టాయి. అటువంటి పోరాటానికి నాయకత్వం వహించిన వారిలో ఒక నాయకుడి కూతురిని తాము పెంచుతున్నామన్న విషయం వారిని భయమో, ఆనందమో తెలియని సందిగ్ధంలోకి నెట్టింది. 

అప్పటికే నక్సలైట్లలో కలిసిన తమ కొడుకు జాడ పోలీసులకు తెలియకుండా ఊరూరు తిరుగుతూ తలదాచుకుంటున్నవారికి యిప్పుడు ఈ పాప రాబోయే ఉపద్రవం చెప్పకనే చెప్పినట్టయ్యింది. పేగు బంధం కాకపోయినా పెనవేసుకున్న అనుబంధంతో ఆ పాప సంవత్సరానికే అంతులేని ఆప్యాయతను పొందింది. పాపని విడిచిపెట్టలేని నిస్సహాయ స్థితికి వారిని చేర్చింది.

'పాప మాతోనే ఉంటుంది. మేం గంజి తాగితే అదీ తాగుతుంది. ఈ పేదరికాన్ని, భరించలేక, పోలీసుల వేధింపులకు తాళలేక మేం చచ్చిపోతే తనూ చనిపోతుంది. అంతేకాని ఈ పరిగుడ్డూ ఎవరి బిడ్డ అయినా వెనకడుగు వేసేది లేదు. తనని వదిలి మేం ఉండేదీ లేదు' స్పష్టంగా, దృఢసంకల్పంతో అన్న ఆమె మాటలతో సంతృప్తిగా గుండెనిండా ఊపిరి పీల్చుకున్నాడు ఆ పాపని వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తి.

అతని పేరు చింతాల సింగన్న అలియాస్ నాయుడు ఈ విషాద దృశ్యకావ్యంలో అదృశ్య నాయకుడు ఎవరో కాదు ఇటీవల అస్తమించిన విప్లవ సూర్యుడు, శ్రీకాకుళ పోరాటయోధుడు పైలా వాసుదేవరావు. కనులు కూడా తెరవని ఆ పురిటి గుడ్డుకు తండ్రి పైలా వాసుదేవరావు. 

ఆయన సహచరిణి పైలా చంద్రమ్మ ఒక ఆసుపత్రిలో జన్మనిచ్చిన ఆ పాపనే ఈమె. ఆమె పేరు అరుణ. పిల్లలు ఉద్యమానికి అవరోధంగా భావించిన ఈ దంపతులు తమ బిడ్డను వదులుకోవాలనుకున్నారు.1972 ప్రాంతంలో విప్లవోద్యమంపై అమానుష నిర్బంధం సాగింది.

పిల్లలను పెంచడం అంటే ఇంటికే బందీ కావల్సివస్తుందని భావించిన విప్లవ నాయకులు కొందరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్నారు. అనివార్య పరిస్థితుల్లో పిల్లలను కన్నవాళ్లు తమ పిల్లలను ఎక్కడో పెంచడానికి ఇచ్చేవారు. కొందరు బంధువుల ఇళ్లల్లో పిల్లలను పెంచితే పైలా దంపతులు పరిచయం కూడా లేని ఉద్యమాభిమానులకు పాపను ఇచ్చారు.

పార్టీనాయకులు ఎక్కడ ఇచ్చారో చాలాకాలం వీరికి తెలియదు. ఎవరిబిడ్డనో పెంచిన వారికి తెలియదు. కన్న బిడ్డ సుదూరంలో పెరుగుతున్న సమయంలోనే, ఆ జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతుండగానే ఆయన సహచరిణి చంద్రమ్మ 1975లో అరెస్టయి, 1986 దాకా జైల్లోనే ఉన్నారు. 

అయినా పైలా చెక్కుచెదరలేదు. వాసుదేవరావు ఉత్తరాంధ్రలో సామాజికంగా ఆధిపత్య స్థానంలో ఉన్న కళింగ కులానికి చెందినవాడు. ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు తనతోపాటు కిందికులాల వారికి ఇంట్లో భోజనం పెడితేనే తాను తింటానని మొండికేసి గెలిచిన చైతన్యశీలి. నేను ఆయనను ఐదు గంటలపాటు చేసిన ఇంటర్వ్యూలో అనేక అంశాలు చోటు చేసుకున్నప్పటికీ , ఆయన జీవిత గమనపు అంతస్సూత్రం ప్రజల పట్ల ఆయనకున్న అభిప్రాయమని నిర్ధారించుకున్నాను. 

కమ్యూనిస్టులకు సిద్ధాంతాలు, రాజకీయాలు చాలా ముఖ్యమే. కానీ అంతకన్నా ముఖ్యం ప్రజలతో మమేకం కావడం, అంటి పెట్టుకొని ఉండడం, కష్టసుఖాల్లో పాలుపంచుకోవడమని ఆయన అభిప్రాయం. ఆ ఇంటర్వ్యూలో ఈ విషయాలే పదేపదే చెప్పారు.

ప్రజలతో ఎవరు నిలబడితే, ప్రజలు వాళ్లను నిలబెడతారని భావించారు. అందుకే ఆయన ప్రజల పట్ల ప్రేమను, గౌరవాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. విప్లవోద్యమం చీలికవల్ల నష్టపోయిందని చెప్పినప్పటికీ , ప్రజల్లోకి వెళ్ళాల్సినంతగా వెళ్ళక పోవడంవల్ల కూడా చాలా నష్టపోయామని ప్రకటించిన నాయకుడు పైలా వాసుదేవరావు. ప్రజా జీవితంలో భాగం కావాలనుకునే కార్యకర్తలకు, నాయకులకు వాళ్ళ రాజకీయాలేమైనప్పటికీ, సిద్ధాంతాలు వేరైనప్పటికీ వాసుదేవరావు ఉద్యమం-జీవితం ఒక దిక్సూచి. 

- మల్లెపల్లి లక్ష్మయ్య 
(నేడు హైదరాబాద్‌లో పైలా వాసుదేవరావు సంస్మరణ సభ)
Andhra Jyothi News Paper Dated : 20/04/2010

'భావాల ఆవాహన'లో వక్రదృష్టి -మల్లెపల్లి లక్ష్మయ్య


'రాజ్యాంగ ముసాయిదా కమిటి సభ్యులు ప్రదర్శించిన చొరవ, చూపిన ఉత్సాహం మరువలేనిది. ప్రత్యేకించి కమిటి చైర్మన్ డాక్టర్ అంబేద్కర్ తన అనారోగ్యాన్ని లెక్క చేయకండా శ్రమించిన తీరు ఎనలేనిది. ముసాయిదా కమిటీకి అంబేద్కర్‌ను చైర్మన్‌గా నియమించడం ఎంతో సరైన చర్యగా అనిపిస్తున్నది. ఆయన ఈ పని ఎంతో సమర్థంగా నిర్వహించడమే కాకుండా, దానికి శోభ ను చేకూర్చారు' అంటూ రాజ్యాంగ రచనలో అంబేద్కర్ కృషిని రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కొనియాడారు.

అంబేద్కర్ చరిత్రాత్మక కృషిని తక్కువ చేయడానికి, వాస్తవాలను వక్రీకరించడానికి కొంతమంది మేధావులు పనిగట్టుకొని ప్రయత్నిస్తున్నారు. అరుణ్ శౌరి (జర్నలిస్టు, మాజీ కేంద్రమంత్రి) కొన్నే ళ్ళ క్రితం అంబేద్కర్‌ను అవమానపరుస్తూ పుస్తకమే రాశారు. ఇప్పుడు ఆ బాధ్యతను జర్నలిస్టు, రాజకీయ నాయకుడు సుదీంధ్ర కులకర్ణి చేపట్టినట్టు కనిపిస్తోంది. 'భావాల ఆవాహన' (జూలై 2, ఆంధ్రజ్యోతి) శీర్షికన ఆయన రాసిన వ్యాసం అటువంటి ప్రయత్నానికి ఆరంభంగా తోస్తున్నది. 

రాజ్యాంగం అమలులోకి వచ్చి అర వై సంవత్సరాలు అయిన సందర్భంగా 'రాజ్యాంగ సభ చర్చలు'చదవడంపై దృష్టి పెట్టినట్టు, తనను ఆకట్టుకున్న అంశాలపై వ్యాఖ్యానం చేస్తున్నట్టు కులకర్ణి ఆ వ్యాసంలో పేర్కొన్నారు. మన మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కృషిని, ఆయన ఆలోచనల గొప్పదనాన్ని కులకర్ణి తన వ్యాసంలో ప్రశంసించారు. 

అది అభ్యంతరకరం కాదు. అయితే నెహ్రూను అంబేద్కర్‌తో పోల్చడానికి కులకర్ణి ప్రయత్నించారు. 'రాజ్యాంగ పరిషత్ చర్చల్లో అన్నిటా అగ్రగామిగా పాల్గొన్నదెవరో తెలుసా? నెహ్రూ. డాక్టర్ అంబేద్కర్ కాదు. నెహ్రూ ప్రసంగించిన ప్రతిసారి రాజ్యాంగ సభ యావత్తూ ఒక స్పష్టమైన ఆలోచ నా మగ్నతలోకి వెళ్ళేది' అంటూ ఇద్దరినీ ఒకచోట చేర్చారు. 

నెహ్రూ దేశానికి ప్రధాని. రాజ్యాంగ సభకు దిశా నిర్దేశం చేయాల్సిన వ్యక్తి. ఆయన మేధా శక్తి మీద ఎవరికీ తక్కువ అంచనా ఉండడానికి వీలులేదు. రాజ్యాం గ సభ చర్చలను నేను కూడా అధ్యయనం చేస్తున్నాను. అయితే నెహ్రూను గొప్పచేయడం కోసం అంబేద్కర్ మహోన్నత కృషిని తక్కువ చేయవలసిన అవసరం లేదు. చేయడానికి వీలులేదు.

పైగా ప్రజలందరూ ఇంతవరకు తప్పుగా భావిస్తున్నట్టు, అంబేద్కర్ కంటే నెహ్రూ నిర్వహించిన గొప్ప పాత్రను తన పరిశోధన ద్వారా నిరూపించినట్టు కులకర్ణి భావిస్తున్నారు! అయితే నెహ్రూ, అంబేద్కర్‌లు రాజ్యాంగ సభలో వేర్వేరు పాత్రలు పోషించారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెహ్రూ వ్యవస్థకు నాయకుడైతే, అంబేద్కర్ రాజ్యాంగ రచనా సభకు నేతృత్వం వహించారు. మరి అంబేద్కర్‌ను తక్కువ చేయడానికి పదే పదే ఎందు కు ప్రయత్నిస్తున్నారు? రాజ్యాంగ రచనలో ఆయన కృషి పైన దేశంలో విస్తృతం గా చర్చ జరుగుతున్నది. ఆ మహోన్నత విధి నిర్వహణలో ఆయన చూపిన ప్రజ్ఞ ఎందరినో ఆశ్చర్యచకితులను చేసింది. 

రాజ్యాంగ సభ చర్చల'ను అధ్యయనం చేస్తున్న కులకర్ణికి అంబేద్కర్ కృషి అడుగడుగునా కన్పించివుండాలి. ఆయన సుదీర్ఘమైన ప్రసంగాలు ఎన్నో ఉన్నా యి. ముఖ్యంగా ' రాజ్యాంగ లక్ష్యాలు- ఆశయాలు' అన్న అంశంపై అంబేద్కర్ ప్రసంగం అవిస్మరణీయమైనది. మరే రాజ్యాంగ నిర్మాత ప్రసంగానికి అది గౌణమైనది కాదు. 1949 నవంబర్ 25న రాజ్యాంగ బిల్లుపై జరిగిన చర్చలో భారత ప్రజాస్వామ్య వికాసంలో రాజ్యాంగం నిర్వహించబోయే పాత్రను ఆయన విపులంగా వివరించారు.

ఆ సందర్భంగా జాతి ఎన్నటికీ మరచిపోకూడని హెచ్చరిక లు కూడా చేశారు. 'మనం ఈ రాజ్యాంగం ద్వారా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మాత్రమే అందిస్తున్నాం. రాజకీయ ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యం పునాదుల మీద నిలచి ఉంటుంది. కానీ మన దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయి. వాటిని రూపుమాపకుండా రాజకీయ ప్రజాస్వా మ్యం మనజాలదు' అనే సత్యాన్ని అంబేద్కర్ విస్పష్టంగా చెప్పారు.

ఆయన ఇంకా ఇలా అన్నారు: '1950 జనవరి 26 నుంచి మనం (భారతీయులం) వైరుధ్యమయమైన జీవితంలోకి అడుగు బెడుతున్నాం. ఆర్థిక, సామాజిక అసమానతలు కొనసాగుతున్న ఈ సమాజంలో రాజకీయ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదపుటంచులో నిలబెడుతున్నాం. ఎంతకాలం ఇది సాగుతుంది? ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ అసమానతలను నిర్మూలించాలి. లేనట్లయి తే ఎంతో శ్రమ కోర్చి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య సౌధాన్ని, ఎవరైతే బాధలకు గురవుతున్నారో వారు కూల్చి వేస్తారు'.

అంబేద్కర్ హెచ్చరిక ప్రాసంగికత నేటి పరిస్థితులకు ఎంత గా ఉన్నదో మరి చెప్పాలా? 315 అధికరణలు, ఎనిమిది షెడ్యూళ్ళలో రాజ్యాంగ ముసాయిదాను రూపొందించారు. విపుల చర్చల అనంతరం దానిని 395 అధికరణలు, ఎనిమిది షెడ్యూళ్ళ సంవిధానంగా తీర్చిదిద్దారు. మూడు సంవత్సరాల పాటు రాజ్యాంగ రచనకు నిరంతరం మేధో మధనంచేశారు. ఈ మొత్తం ప్రక్రియలో అనేక మంది మహా మహులు పాల్గొన్నారు. అయి తే కేంద్రబిందువుగా అన్నింటా తానై నడిపిన ఒకే ఒక్క వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. 

కులకర్ణి ప్రస్తావించిన కె.ఎం.మున్షీతో సహా రాజ్యాంగ సభ సభ్యులు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ కృషిని బహుధా ప్రస్తుతించారు. ఫ్రాంక్ ఆంథోని, పట్టాభి సీతారామయ్య, జగత్ నారాయణ్ లాల్, మహావీర్ త్యాగి, తాజముల్ హుస్సేన్, సురేష్ చంద్ర మజుందార్, పండిట్ బాల క్రిష్ణశర్మ మొదలైన వారు అంబేద్కర్ కృషికి కీర్తిహారతులు పట్టారు.

మహావీర్ త్యాగి మాటలను ప్రత్యేకంగా పేర్కొనా లి. 'ప్రజల కోసం ఒక అందమైన చిత్రాన్ని తానే అన్నీ అయి గీసిన ఒక ప్రధాన చిత్రకారుడు డాక్టర్ అంబేద్కర్. అటువంటి అరుదైన చిత్రమే ఈ మన భారత రాజ్యాంగం' అంటూ అంబేద్కర్‌ను మహావీర్ త్యాగి కవితాత్మకంగా కొనియాడారు. భారత రాజ్యాంగ రచనలో అంబేద్కర్ కృషిని తక్కువ చేయడానికి ప్రయత్నించడం అవివేకమే కాక అహంకారం కూడా అవుతుందేమో!
-మల్లెపల్లి లక్ష్మయ్య
Andra Jyothi News Paper Dated :  16/07/2010

భాగ్యరెడ్డి వర్మ అడుగుజాడల్లో.. -మల్లెపల్లి లక్ష్మయ్య


హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్ చౌరస్తాలో ఉన్న భవనంపై 'ఆది హిందూభవన్' అని రాసి వుంటుంది. అటువైపుగా వెళ్ళుతున్న వాళ్ళమం తా చాలా సార్లు ఆ అక్షరాలను చూస్తూ ఉంటాం.' ఆది హిందూ భవన్' అనే పేరు చూసి దానిని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లేదా విశ్వహిందూపరిషత్‌కు చెందిన భవనమనుకునే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే అది, ఆ సంస్థల వైఖరికి భిన్నమైన భావజాలంతో సామాజిక సమానత్వం లక్ష్యంగా సాగిన ఉద్యమానికి కేంద్రమనే విషయం కొద్దిమందికే తెలుసు. ఆ ఉద్యమ క్రేందం నిర్వాహకుడు ఎం.బి.గౌతమ్. సంస్కర్త , మానవతావాది అయిన గౌతమ్ 98 ఏళ్ళ నిండు వయస్సులో గురువారం నాడు అంతిమ శ్వాస విడిచారు. 

హైదరాబాద్ సంస్థానంలోనే కాక, యావత్ తెలుగు ప్రాంతంలోను, ఆ మాట కొస్తే దక్షిణ భారతావనిలో, అంతేకాదు యావద్భారతదేశంలో తొలితరం దళిత నాయకులలో ఒకరైన భాగ్యరెడ్డి వర్మ కుమారుడు గౌతమ్. సంఘసేవను తండ్రినుంచి వారసత్వంగా గ్రహించిన గౌతమ్ తన జీవితం ప్రారంభం నుంచి తుదివర కు అణగారిన వర్గాల వారి శ్రేయస్సకు, ముఖ్యంగా ఆ వర్గాల బాలికల విద్యాభ్యాసానికి నిబద్ధతతో కృషిచేసిన ఉదాత్తుడు. 'ఆది హిందూభవన్'ను భాగ్యరెడ్డివర్మ 1920లో నిర్మించారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ భవనం సామాజిక సేవా కార్యకలాపాలకు కేంద్రంగా భాసిల్లింది. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలోని అనేక భవనాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అదృశ్యమయ్యాయి. అయి తే గౌతమ్ తన తండ్రి నిర్మించిన భవనాన్ని చివరివరకు ఆయని నిలువెత్తు ఉద్యమ స్ఫూర్తికి ప్రతీకగా నిలబెట్టారు. ఇది ఎంతైనా స్ఫూర్తిదాయకమైన విషయం. 

భాగ్యరెడ్డి వర్మ దంపతులకు గౌతమ్ ఏకైక సంతానం. 1913 ఆగస్టు 22న జన్మించిన గౌతమ్ నిజాం కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలోను, రజాకార్ల వ్యతిరేక పోరాటంలోను పాల్గొన్న కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ కాలంలోనే గౌత మ్ తన ఉపాధ్యాయ జీవితాన్ని ప్రారంభించారు. 1942 వరకు బాల బాలికలకు ఉమ్మడి పాఠశాలగా ఉన్న పాఠశాలను బాలికల పాఠశాలగా మార్చి ఇప్పటివరకు నడిపారు. ఆ పాఠశాల నిర్వహణ గౌతమ్ సామాజిక నిబద్ధతకు ఒక నిలువెత్తు సాక్ష్యం. గౌతమ్ అవివాహితుడు. జీవితాన్ని సామాజిక సేవలకే అంకితం చేశారు.

1942-52 సంవత్సరాల మధ్య ఉపాధ్యాయుడు గా పనిచేస్తూనే గౌతమ్ హైదరాబాద్ సంస్థాన రాజకీయాలలో చురుగ్గా పాల్గొన్నారు. 1952లో జరిగిన మొట్ట మొదటి శాసనసభా ఎన్నికలలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. బూర్గుల రామకృష్ణరావు నేతృత్వంలోని హైదరాబాద్ రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసిన భూసంస్కరణల కమిషన్‌లో గౌతమ్ సభ్యలు. దళితులకు, పేదలకు భూములు దక్కడానికి ఆ కమిషన్ సభ్యులుగా ఆయన శ్లాఘనీయమైన కృషి చేశారు. గౌతమ్ 1962లో శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యారు. 1971 లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు. 1972 లో భారత ప్రభుత్వం గౌతమ్ సామాజిక సేవలను గుర్తించి ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 

గౌతమ్ జీవితం, ఆయన కృషీ దళితులకు ఆదర్శప్రాయమైనది. ఆయన నిర్వహించిన, దాదాపు వందేళ్ళ చరిత్ర కల 'భాగ్య మెమోరియల్ బాలికల పాఠశాల' ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై తగు చర్యలు తీసుకోవాలి. ఈ నివాళిని ముగించే ముందు ఒక బాధాకరమైన వాస్తవాన్ని ప్రస్తావించక తప్పదు. శుక్రవారం ఈ వ్యాసం రాస్తున్న సమయానికి మాజీ శాసనసభ్యుడైన గౌతమ్ మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సంతాప ప్రకటన చేయలేదు. ఇది దళిత జాతిని అవమాన పరిచినట్టే అవుతుంది. అంతేకాదు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టవుతుంది. గౌతమ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. కనీసం ఆ సమయంలోనైనా ప్రభుత్వం స్పందించాలి.
-మల్లెపల్లి లక్ష్మయ్య
Andhra Jyothi News Paper Dated : 10/07/2010