Showing posts with label కనీజ్ ఫాతిమా. Show all posts
Showing posts with label కనీజ్ ఫాతిమా. Show all posts

Friday, November 15, 2013

పటేల్ పంథాలో మోదీ! - కనీజ్ ఫాతిమా

అరవైఆరేళ్ల స్వాతంత్య్రమనంతరం కూడా భారతీయ ముస్లింలు, దళితులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఈ లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశంలో ముస్లింలు పరోక్ష అస్పృశ్యతను, ప్రత్యక్ష వివక్షను ఎదుర్కొంటున్నారు. దళితులు ఇప్పటికీ అంటరానితనమనే దురాచారానికి బాధితులుగా ఉన్నారు. ఇంకా పలు వివక్షలకు గురవుతున్నారు. చరిత్రను వక్రీకరించి దేశ విభజనకు ముస్లింలు కారకులని నిందించడం ద్వారా చరిత్రను మార్చి వేయలేరు.
హిందుత్వ భావజాలం చరిత్రను వక్రీకరించింది. అగ్రకుల పాలక వర్గాల వారు ఆ అసత్య చరిత్రను వెనుకబడిన వర్గాలు, ముస్లింలను మరింత అణచివేయడానికి ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. వల్లభ్‌భాయ్ పటేల్‌ను నరేంద్ర మోదీ ప్రశంసించడాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి. సర్దార్ పటేల్ కాంగ్రెస్ వాది అయినప్పటికీ గత కొంత కాలంగా హిందుత్వ వాదులు ఆయన్ని తమ లక్ష్యసాధనలో ఒక కొత్త పాచికగా ఉపయోగించుకొంటున్నారు. హైదరాబాద్‌లోను, దేశంలోని ఇతర ప్రాంతాలలోను ముస్లింలపై ప్రభుత్వ సైనిక దళాలు పటేల్ హయాంలో పెద్ద ఎత్తున హింసాకాండకు పాల్పడ్డాయి. బాబ్రీ మసీదు కూల్చివేతలో పి.వి.నరసింహారావు పాత్ర ఉంది. చరిత్రను వక్రీకరించడమే కాదు, కాషాయీకరించారు కూడా. ప్రభుత్వ అండదండలతో హిందుత్వ ఆధిపత్యం సైతం పటేల్ హయాంలోనే ప్రారంభమయింది. నరేంద్ర మోదీ పాలనలో అది వేళ్ళూనుకుంది. పరిస్థితి ఎంతగా మారిపోయిందంటే పాఠశాలల్లో స్వాతంత్య్ర దినోత్సవం నాడు బాల బాలికలు జాతీయ గీతాలకు బదులు ముస్లిం వ్యతిరేక గీతాలు ఆలపిస్తున్నారు.
వ్యాపారం కోసం మన దేశానికి వచ్చిన బ్రిటిష్ వారు క్రమంగా రాజకీయ పెత్తందార్లు అయ్యారు. భారతీయ సమాజంలో వివిధ మతాల, కులాల, ఆచారాల వైవిధ్యాన్ని గమనించి విభజించి పాలించు అనే కుటిలనీతితో భారత ఉప ఖండానికి సార్వభౌములయ్యారు. అదే కుటిలనీతితో ఈ ఉపఖండాన్ని భారత్, పాకిస్థాన్‌లుగా చీల్చారు. దేశవిభజన వెనుక హిందూమత అగ్రకులాలవారి కుట్ర ఉన్నది. బ్రిటిష్ వలసపాకులు దాన్ని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు. మొట్టమొదటి ముస్లిం రాజులైన బహదూర్ షా జాఫర్, అవధ్ సంస్థానాధీశురాలు, టిప్పు సుల్తాన్‌లతోపాటు ఝాన్సీ లక్ష్మీ బాయి, తాంతియాతోపే తదితరులు భారత స్వాతంత్య్ర మహా సంగ్రామాన్ని ప్రారంభించారు. 1857లో ప్రజ్వరిల్లిన ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామాన్ని బ్రిటిష్ వారు అణచివేశారు. దరిమిలా భారత్‌కు స్వాతంత్య్ర సాధనకై దియోబంద్, ఇతర ప్రదేశాలలోని ముస్లిం మత పెద్దలు భారతీయులలో స్వాతంత్య్ర కాంక్షను సజీవంగా నిలిపారు.
వీరిలో కొందరు స్వయంగా ప్రాణత్యాగం చేశారు. సర్దార్ భగత్ సింగ్, అష్ఫాకుల్లా ఖాన్ లాంటివారు దేశ మాత స్వేచ్ఛకు ఉరికంబమెక్కారు. వారు ఇచ్చిన నినాదమే 'ఇంక్విలాబ్ జిందాబాద్' (ఉత్తేజకరమైన ఈ నినాదానికి చాలా విశాలమైన అర్థమున్నది). భగత్ సింగ్‌కు ఉరిశిక్షను తప్పించడానికి గాంధీ చిత్తశుద్ధితో కృషిచేయలేదు. అధికారంలో పాలుపంచుకోవడానికై గాంధీ, ఆయన సహచరులు పర పాలకులతో చర్చలు జరిపారు. అవి సఫలం కాకపోవడంతో స్వాతంత్య్ర పోరాటం చేశారు. ఈ పోరాటంలో ముస్లింలు ఎవరికీ తీసిపోని బృహత్తర పాత్ర నిర్వహించారు. అయితే ఇప్పుడు ముస్లిం త్యాగధనులను ఎవరూ స్మరించడం లేదు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, రఫీ అహ్మద్ కిద్వాయి ఇప్పుడు ఎంతమందికి గుర్తున్నారు?
వలస పాలకుల 'విభజించి పాలించు' విధానాన్నే భారతీయ నాయకులూ అనుసరించారు. దేశ విభజనకు మౌలికంగా ఒక ప్రణాళికను ప్రతిపాదించింది చక్రవర్తుల రాజగోపాలాచారి. 1943లో ఆయన తన సుప్రసిద్ధ 'సి.ఆర్. పథకం'ను ప్రతిపాదించారు. పాకిస్థాన్ ఏర్పడితే ముస్లింలు ఆ దేశానికి వెళ్ళిపోతారని, అప్పుడు భారత్‌లోని వెనుకబడిన వర్గాల వారు, ఆదివాసీలపై అగ్రకుల పాలక వర్గాలు తమ ఆధిపత్యాన్ని యథాతథంగా కొనసాగించవచ్చనేది కాంగ్రెస్ నాయకుల యోచన. దేశ విభజనపై మౌంట్‌బాటెన్ ప్రతిపాదనను జిన్నా అంగీకరించలేదు. అయితే బలవంతం చేయడంతో ఆయన అంగీకరించక తప్పలేదు. అయినా దేశవిభజనకు జిన్నా కారకుడని ఆయనపై నింద మోపారు. 1932లో వలసపాలకులు కమ్యూనల్ అవార్డు ప్రకటించారు. దాని ప్రకారం ముస్లింలను ముస్లింలే ఎన్నుకొనే హక్కు లభించింది.
గాంధీ, పటేల్‌లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ హక్కును వదులుకోవాలని ముస్లింలను తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. అధికార బదిలీ తరువాత దేశపాలనలో హిందువులు, ముస్లింలు, అణగారిన వర్గాలవారికి సమాన హక్కు ఉంటుందని 1945లో లార్డ్ వేవెల్ ప్రకటించారు. పటేల్ ఇందుకు ససేమిరా అన్నారు. హిందూ అగ్రకులాలవారితో సమానంగా ముస్లింలూ అధికారంలో భాగస్వాములు కావడం కాంగ్రెస్ నాయకులకు ఇష్టంలేదు. దేశాన్ని విభజిస్తే అధికారం పూర్తిగా తమ చేతుల్లో ఉంటుందని భావించారు. దేశ విభజనతో రాజ్యాంగ సభలో ముస్లింల రాజకీయ వాణిని విన్పించేవారు ఎవ్వరూ లేకపోయారు. రాజ్యాంగ సభ ఆమోదించిన లక్ష్యాల తీర్మానం మైనారిటీలకు హమీ ఇచ్చిన రాజ్యాంగ హక్కులను వదులుకోవాలని ముస్లింలపై పటేల్ ఒత్తిడిచేశారు. స్వాతంత్య్రానికి ముందు ముస్లిం ప్రజాప్రతినిధులను ముస్లింలే ఎన్నుకునే హక్కు, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సదుపాయాన్ని రద్దు చేస్తూ ఒక తీర్మానాన్ని 1947లో రాజ్యాంగ సభ ఆమోదించింది. దీనిపై నిరసన తెలుపలేని నిస్సహాయస్థితిలో ముస్లింలు అప్పటికే పడిపోయారు.
మత ప్రాతిపదికన దేశ విభజన జరిగింది. ఇందుకు ముస్లింలే కారకులని నిందించారు. ముస్లిం మేధావివర్గాల వారు పాకిస్థాన్‌కు వెళ్ళిపోయారు. పాకిస్థాన్‌కు వెళ్ళకుండా భారత్‌లో ఉండిపోయిన వారు మౌనంగా ఉండిపోయే పరిస్థితులు కల్పించారు. పటేల్ మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మౌలానా ఆజాద్ సైతం ఏమీ మాట్లాడలేకపోయారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసేందుకు పటేల్ ఆదేశాలపై జరిగిన 'పోలీసు చర్య'లో ముస్లింలు పెద్ద ఎత్తున ఊచకోతలకు గురయ్యారు. పటేల్ కాంగ్రెస్‌వాది అయినప్పటికీ మౌలికంగా ముస్లిం వ్యతిరేకి. కనుకనే ఇప్పుడు మోదీ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. దేశానికి ప్రథమ ప్రధానమంత్రి పటేల్ అయినట్టయితే చాలామేలు జరిగివుండేదని మోదీ అంటున్నారు. పటేల్ ప్రధాని కాలేదు కనుక తాను ప్రధానిని కావాలని ఆయన కోరుకుంటున్నారు. తద్వారా పటేల్ చేయలేని పనులను తాను చేయగలనని మోదీ భావిస్తున్నారు. పటేల్‌ను ప్రధాన మంత్రిగా నామినేట్ చేయకపోవడానికి కారణం లేకపోలేదు. అప్పట్లో అంతర్జాతీయ వ్యవహారాలపై భారతీయ నాయకులలో నెహ్రూ, జిన్నాకు మాత్రమే సమగ్ర అవగాహన ఉండేది. పటేల్‌ను ఉక్కు మనిషిగా గౌరవిస్తున్నారు.
550 సంస్థానాలను శాంతియుతంగా భారత్‌లో విలీనం చేసిన రాజనీతిజ్ఞుడుగా ప్రశంసిస్తున్నారు. అయితే ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్‌పై జరిగిన 'పోలీసుచర్య'లో ముస్లింలు అసంఖ్యాకంగా ఊచకోతకు గురయ్యారన్న వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. ఆనాటి చేదు స్మృతులు ముస్లింలకు ఇప్పటికీ తీవ్ర మనస్తాపం కలిగిస్తున్నాయి. అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనలకు నిజాం నవాబును కారకుడుగా చేసి 'పోలీసుచర్య' దురాగతాలను సమర్థించడం న్యాయబద్ధం కాదు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే 1948లో ఆవిర్భవించిన ఇజ్రాయెల్‌కు తక్షణమే గుర్తింపునివ్వాలని పటేల్ వాదించారు. దీనిని బట్టి ముస్లింల పట్ల ఆయన వైఖరి ఏమిటో విశదమవుతుంది. పెట్టుబడిదారులకు, అమెరికాకు పటేల్ అనుకూలురు. ఆరెస్సెస్ సభ్యుడు కాకపోయినప్పటికీ ఆయన లౌకికవాదీ కాదు, ప్రజాస్వామ్య వాదీకాదు. నెహ్రూ సైతం పటేల్‌ను మతతత్వవాదిగా పేర్కొన్నారు.
మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడానికి సహకరించిన వారు లౌకికవాదులు ఎలా అవుతారు? గాంధీ హత్య అనంతరం ఆరెస్సెస్‌ను నిషేధించారు. అయితే గాం«ధీ హత్యకు కారణమన్న ఆరోపణపై గాక ఆరెస్సెస్ నాయకుల ప్రసంగాలు మతతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనే కారణంతో నిషేధించారు! ఆరెస్సెస్ పట్ల పటేల్ మెతకవైఖరి చూపేవారనడానికి ఇది నిదర్శనం. మరి మోదీ ఇప్పుడు పటేల్‌ను ప్రశంసించడంలో ఆశ్చర్యమేముంది? పటేల్ ప్రగాఢ హిందూ మత అభిమాని. మోదీ గట్టి హిందుత్వ వాది. హిందూ జాతీయ వాదాన్ని విశ్వసించే వ్యక్తి మోదీ. గుజరాత్‌లో విజయం అనంతరం యావద్భారతాన్ని హిందుత్వ ప్రయోగశాలగా మార్చడానికి మోదీ ఉవ్విళ్లూరుతున్నారు. మోదీని ప్రశంసిస్తున్న ప్రముఖులు 2002 నాటి గుజరాత్ మతతత్వ అల్లర్లను సమర్థిస్తున్నారు. మానవాళి సంక్షేమం పట్ల శ్రద్ధ చూపేవారెవరూ అభివృద్ధి నెపంతో మోదీని ప్రశంసించరు. ఆయనకు ఎటువంటి మద్దతునివ్వరు. భారత ప్రజలు తనకు మద్దతునివ్వరన్న సత్యం మోదీకి బాగా తెలుసు. కనుకనే ఆయన అన్ని రకాల వింత ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఒకే రకం వ్యక్తులు. కొన్నిసార్లు ఒకరు ఉగ్రవాదానికి ముస్లింలే కారకులని నిందిస్తారు. మరొకరు ఖండిస్తారు. ఈ ఆరోపణ -ఖండన పునరావృతమవుతుంటాయి.
మోదీ తాను నెలకొల్పబోయే పటేల్ విగ్రహ నిర్మాణానికి దేశమంతటి నుంచీ ఇనుమును స్వీకరిస్తాను కానీ 'నిజాం ఇనుము'ను స్వీకరించనని అన్నారు. పటేల్ హయాంలో హైదరాబాద్ ముస్లింలపై పెద్దఎత్తున హింసాకాండ జరిగింది. అటువంటి హింసాకాండే గుజరాత్‌లో మోదీ పాలన తొలినాళ్ళలో జరిగింది. అందుకే పటేల్‌తో తనను తాను సమానం చేసుకొని, ఆ దివంగత నేతను మోదీ ప్రశంసిస్తున్నారు. భారత్‌ను ప్రజాస్వామిక, లౌకిక రాజ్యంగా పిలుస్తున్నారు. అయితే దేశంలో నిజమైన అర్థంలో ప్రజాస్వామ్యం, లౌకిక వాదం లేదు. తమను తాము లౌకికవాద పార్టీలుగా చెప్పుకుంటున్న రాజకీయ పక్షాలు ప్రజాస్వామిక విలువలు, రాజ్యాంగ హక్కుల అమలుకు ప్రాధాన్యమివ్వాలి.
అరవైఆరేళ్ల స్వాతంత్య్రానంతరం కూడా భారతీయ ముస్లింలు, దళితులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం లేదనడానికి ఇంతకంటే నిదర్శనం మరేమి కావాలి? ఈ లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశంలో ముస్లింలు పరోక్ష అస్పృశ్యతను, ప్రత్యక్ష వివక్షను ఎదుర్కొంటున్నారు. దళితులు ఇప్పటికీ అంటరానితనమనే దురాచారానికి బాధితులుగా ఉన్నారు. ఇంకా పలు వివక్షలకు గురవుతున్నారు. చరిత్రను వక్రీకరించి దేశ విభజనకు ముస్లింలు కారకులని నిందించడం ద్వారా చరిత్రను మార్చివేయలేరు. చరిత్ర తనకుతాను పునరావృతమవుతుంది. కనుక మన చరిత్రను మనం నిష్పాక్షికంగా అధ్యయనం చేయాలి. ఎటువంటి పక్షపాతం లేకుండా చరిత్రను రాసుకోవాలి. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకు చరిత్రను వక్రీకరించేవారి మాటలను విశ్వసించగూడదు.

- కనీజ్ ఫాతిమా
సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ

Andhra Jyothi Telugu News Paper Dated: 16/11/2013 


Monday, June 17, 2013

లక్ష్యం సరే, మార్గం మాటేమిటి?By కనీజ్ ఫాతిమా


June 18, 2013
ప్రత్యేక తెలంగాణ లక్ష్యసాధన పేరుతో మత మైనారిటీల భద్రతను విస్మరించడం సమంజసమేనా? ఉద్యమానికి నాయకత్వం వహిస్తోన్న పార్టీతో సహా పౌర, మానవ హక్కుల బాధ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజాసంఘాల కార్యకర్తలు సైతం మతతత్వ రాజకీయాలకు తోడ్పాటు నివ్వడం తగునా?... 2009 నవంబర్ నుంచి సంభవించిన సంఘటనలను గుర్తు చేసుకోండి. వాస్తవాలేమిటో స్పష్టమవుతాయి.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ దూరదృష్టితో, మానవుల మధ్య నెలకొనివున్న సకల అంతరాలకు అతీతంగా, భారత పౌరులందరికీ సమాన హక్కులు కల్పించారు. ఆ ఉన్నతాదర్శాలు బోలు మాటలుగా మిగిలిపోయాయి. ప్రభుత్వాలు వాటిని అమలుపరచడంలో విఫలమవుతున్నాయి. దళితులు, ఆదివాసీలు, మైనారిటీల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకొని చిన్న రాష్ట్రాల నేర్పాటు చేయాలని అంబేద్కర్ సూచించారు. జాతి శ్రేయస్సు కోసమే ఆ మహానుభావుడు ఈ సూచన చేశారు. అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుందని, పౌరులు తమ హక్కులను సమానస్థాయిలో పొందగలుగుతారని ఆయన భావించారు. స్వార్థ ప్రయోజనాల కోసం లౌకిక/జాతీయ రాజకీయ పక్షాలు చిన్న రాష్ట్రాల నేర్పాటును వ్యతిరేకిస్తాయని, మతతత్వ పార్టీలు సంకుచిత లక్ష్యాలతో ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్‌కు మద్దతునిస్తాయని అంబేద్కర్ కలలోనైనా ఊహించివుండరు. ధనాశ, అధికార లాలసతో నేటి రాజకీయవేత్తలు నిబద్ధతతా రాహిత్యంతో వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణకై ప్రస్తుత ఉద్యమం ప్రారంభమైన దరిమిలా ఈ ప్రాంతంలో సంభవిస్తోన్న రాజకీయ పరిణామాలే ఇందుకు నిదర్శనం కాదా?

నిన్న గాక మొన్నటివరకు తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించిన 'నాగం జనార్థన రెడ్డి' విషయాన్నే చూడండి. ఆయన ఇటీవల 'భారతీయ జనతా పార్టీ'లో చేరారు. ఆయన చర్య సామాన్య ప్రజలను ముఖ్యంగా ముస్లింలు, దళితులను దిగ్భ్రాంతి పరిచింది. ఎందుకంటే, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఆయన చిత్తశుద్ధితో కట్టుబడివున్నారని వారు అంతవరకు విశ్వసించడం జరిగింది. అయితే ఆయన తన అగ్ర కుల అభిజాత్యాన్ని చూపించారు. ప్రజల నుంచే గాక, బీజేపీ శ్రేణుల నుంచి కూడా ఆయన త్వరలోనే తీవ్ర పర్యవసానాల నెదుర్కోవలసి వుంటుందనడం సత్యదూరం కాబోదు. బీజేపీలో చేరక ముందు, చేరిన తర్వాత కూడా కేసీఆర్‌ను ఆయన తీవ్ర ంగా విమర్శించారు. ఆ విమర్శలను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గతంలో అంటే బీజేపీలో చేరక ముందు కేసీఆర్‌పై నాగం విమర్శలు ఆయన సొంత అభిప్రాయాలు. మరి ఇక ముందూ ఆయన ఆ స్వతంత్ర వైఖరిని కొనసాగిస్తారా? లేక బీజేపీ విధానాలకు కట్టుబడి తనను తాను పరిమితం చేసుకుంటారా? కేసీఆర్‌పై విమర్శలు తన సొంత వైఖరా లేక బీజేపీదా? దయచేసి, ఈ విషయమై వివరణ ఇస్తారా నాగం గారూ? ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ హైజాక్ చేసిన నాటినుంచీ తెలంగాణ రాష్ట్ర సమితిని గానీ, కేసీఆర్‌ను గానీ ఆ పార్టీ ఒక్కసారి కూడా విమర్శించనే లేదు. తదుపరి సార్వత్రక, శాసన సభా ఎన్నికలు (2014) సమీపిస్తుండడంతో స్వార్థ ప్రయోజనాల కోసం ఈ మార్పులన్నీ చోటు చేసుకొంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో అన్ని విధాల లబ్ధి పొందడానికే ఇలా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ రాజకీయ నాయకులకు తెలంగాణ, దాని ప్రజల పట్ల అవాజ్య ప్రేమానురాగాలు ఏమీలేవు.

ప్రస్తుత తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచీ 'ఇదిగో తెలంగాణ వచ్చేసినట్టే'నని కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. ప్రతిసారీ ఆయన తెలంగాణ ప్రజల ఆశలను భగ్నం చేశారు. సకల జనుల సమ్మె విఫలమయ్యింది టీఆర్ఎస్, రాజకీయ జాక్, టీఎన్‌జీవోల కారణంగానే కాదూ? దరిమిలా కేసీఆర్ హఠాత్తుగా ఇలా తెలంగాణను సాధించలేమని, ఎన్నికలలో పోటీచేసి అత్యధిక సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకోగలమని ప్రకటించారు. ప్రజలు తెలివిహీనులా? తెలంగాణను సాధించడం జరిగితే కేసీఆర్ తన పార్టీని ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం చేసి, తానూ, తన కుటుంబం రాజకీయ లబ్ధి పొందుతారని తెలంగాణ ప్రజలకు అర్థమయింది. తెలంగాణ పేరిట సీట్లు సాధించుకొని తద్వారా స్వప్రయోజనాలను నెరవేర్చుకోవడానికే ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ లక్ష్యంతోనే ఆయన 2014 ఎన్నికలకు సంసిద్ధమవుతున్నారు. కనుకనే ప్రత్యేక తెలంగాణను కేసీఆర్ సాధించలేరని సామాన్య ప్రజలు ఇప్పటికే విశ్వసిస్తున్నారు.

ఇంతవరకు తాము స్వంత బలంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తామని టీఆర్ఎస్ నాయకులు చెబుతూ వచ్చారు. అయితే హఠాత్తుగా తమ వైఖరిని మార్చుకొని బీజేపీతో సహా ఏ పార్టీ పట్ల తమకు ఎటువంటి వ్యతిరేకత లేదనే కొత్త పల్లవి అందుకున్నారు. ఈ కొత్త వైఖరి ద్వారా, కాంగ్రెస్‌తో సర్దుబాటుకు తమ ప్రయత్నాలు ఫలించకపోతే బీజేపీతో జట్టు కట్టడానికి వెనుకాడబోమనే సూచనలు అందిస్తున్నారు! తత్కారణంగానే బీజేపీని, దాని రాజకీయాలను టీఆర్ఎస్ విమర్శించడం లేదు. నాగం జనార్థన రెడ్డి బీజేపీలో చేరినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు నాగం వారిని విమర్శించారే గానీ బీజేపీని పల్లెత్తు మాట అనలేదు. ఏమి ఈ రాజకీయ కపటం! కాంగ్రెస్, బీజేపీలు ఒకే నాణేనికి బొమ్మ బొరుసు వంటివని ముస్లింలు ఇంతవరకూ భావిస్తూ వచ్చారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అదే నాణేనికి ఒక ముఖమని స్పష్టమయింది. కాకపోతే ఒకసారి బొమ్మ వైపో ఇంకోసారి బొరుసు వైపో అది కన్పిస్తుంటుంది!
తెలంగాణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తాము మాత్రమే తెలంగాణను ఇవ్వగలమని, మరే పార్టీకి అది సాధ్యంకాదని బీజేపీ మరీ మరీ చెబుతోంది. రాజకీయాలలో కాకలుతీరిన యోధులు, కొత్తగా ప్రవేశించిన వారు ఎందరో ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు. తద్వారా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆ పార్టీ హైజాక్ చేసిన నాటి నుంచీ ఉద్యమం కూలిపోయిందని, తెలంగాణ అంతటా మతతత్వ దాడులు పెచ్చరిల్లి పోయాయనే వాస్తవాన్ని ప్రజలు విస్మరించలేదు. 2009లో ఉద్యమం పునఃప్రజ్వరిల్లిన అనంతరం భైంసా, కరీంనగర్, సిద్ధిపేట, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నల్లగొండ, కామారెడ్డి, ఆదోని, హైదరాబాద్ నగరంలోనూ తరచు ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవినిస్తామని ప్రకటించిన కేసీఆర్ సైతం ముస్లింలపై జరుగుతోన్న ఈ దాడులను ఖండించ లేదు. ఉగ్రవాదం నిరోధక చర్యల పేరిట అమాయక ముస్లిం యువకులను అరెస్ట్ చేయడం జరుగుతోంది. 'ఇది అన్యాయం, ముస్లింల పట్ల వివక్ష చూపడమేనని' ఏ నాయకుడైనా ఎప్పుడైనా ఖండించాడా? సమాధానం స్పష్టమే. నిజామాబాద్ ఉపఎన్నికలో ముస్లిం ఓటర్లు బీజేపీ అభ్యర్థికి మద్దతునిచ్చారు. ఎందుకు? తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి విషయమై యావత్ ముస్లిం ప్రజలకు చిత్తశుద్ధి ఉన్నందువల్లనే కాదూ?
మరి మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలో జరిగిందేమిటి? అక్కడ టీఆర్ఎస్, రాజకీయ జాక్, బీజేపీ ఏకమై ముస్లిం అభ్యర్థిని ఓడించారు. అగ్రకులాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించాలని ఈ పార్టీలు సదా కోరుకొంటున్నాయి. కనుకనే సంగారెడ్డిలో ఒక నాయకుని ఆదేశాల మేరకు ప్రత్యర్థి పార్టీ వారు ముస్లింలపై రెండు రోజుల పాటు దాడులు చేశారు. వారి దుకాణాలను దగ్ధం చేశారు; జీవనాధారాలను కూల్చివేశారు. ఈ దాడులను ఆపడానికి టీఆర్ఎస్ నాయకులు ఎవ్వరూ ప్రయత్నించనే లేదు. జరగాల్సిన విధ్వంసం జరిగాక కోదండరామ్ రెడ్డి, రమా మెల్కోటే తదితరులు సంగారెడ్డిని సందర్శించారు.

దాడుల బాధితులతో గాక వాటితో ప్రమేయమున్న వారిని మాత్రమే ఈ ప్రముఖులు కలుసుకున్నారు.
గత రెండు సంవత్సరాలుగా పౌర, మానవహక్కుల కార్యకర్తలు, మేధావులు, రచయితలు, కళాకారులు సైతం తెలంగాణ పేరిట మతతత్వ పార్టీకి మద్దతు నివ్వటాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వివిధ ప్రజాసంఘాల నాయకులు సైతం ఇలా వ్యవహరించడం ఎంతైనా శోచనీయం. వారు తమ లక్ష్యాన్ని మరచిపోయి స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం పునఃప్రారంభమైన తరువాత ముస్లింలపై పెచ్చరిల్లిన దాడులను ఈ ప్రజాసంఘాలేవీ ఖండించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతికై కలసికట్టుగా పనిచేసేందుకై ఈ బడుగువర్గాల సంఘాలు, వాటి నాయకులు గతంలో మహాజన సంఘర్షణ సమితి అనే పార్టీని సైతం ఏర్పాటు చేశారు. ఆ పార్టీ ఏమైంది? ముస్లింలపై దాడుల పట్ల ఈ బడుగు వర్గాల వారూ ఎందుకు మౌనం వహిస్తున్నారు? బీజేపీతో కలసిపనిచేస్తుండడం వల్లే వారలా వ్యవహరిస్తున్నారని చెప్పక తప్పదు. దళిత నాయకులు, మేధావుల కర్తవ్యమేమిటి? తమ అణగారిన జాతి అభ్యున్నతికి అంకితమవ్వడమే. మరి సంకుచిత లక్ష్యాలకు అంకితమైన రాజకీయ పక్షానికి తోడ్పాటునివ్వడమేమిటి? ముస్లిం మేధావులు, రాజకీయ పక్షాలు తమతో కలసి పనిచేసేందుకు ముందుకు వస్తున్నారన్న సత్యాన్ని దళిత వర్గాలు గుర్తించకపోవడం చాలా విచారకరం.

తెలంగాణ ఉద్యమం పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారిని బీజేపీ ఆకట్టుకుంటోంది. తన కార్యకర్తల సంఖ్యను పెంచుకొంటోంది. మతతత్వ భావజాలానికి ప్రాధాన్యమిచ్చే రాజకీయవేత్తల రాజకీయాలను వీరు ఎందుకు అర్థం చేసుకోరు? తెలంగాణ పేరిట ప్రజలు వంచనకు గురవుతున్నారు. తెలంగాణ ప్రజల అమాయకత్వం వల్లే ఇది జరుగుతోంది సుమా! తమ ఉద్యమం ప్రపంచంలో ఎక్కడైనా సరే సామాజిక ఉద్యమాలకు ఆదర్శప్రాయమైనదని తెలంగాణ ఉద్యమ కార్యకర్తలు అంటుంటారు. మరి ముస్లింలపై మతోన్మాదుల, దళితులపై అగ్ర కుల పెత్తందారుల దౌర్జన్యాలు, దురాగతాలను వీరు ఎందుకు ఖండించరు? ఆంధ్రులు మతతత్వవాదులని, తెలంగాణ ప్రజలు కాదని తెలంగాణ ఉద్యమనాయకులు, కార్యకర్తలు అంటారు. అయితే మరి గత మూడున్నర సంవత్సరాలుగా తెలంగాణలో చోటుచేసుకొంటోన్న సంఘటనలు చెబుతున్న సత్యమేమిటి? తెలంగాణ ఉద్యమ నాయకులు, కార్యకర్తలే ఆంధ్ర నాయకుల కంటే ఎక్కువ మతతత్వవాదులని, యావత్ తెలంగాణ ప్రజలనందరినీ మతతత్వ వాదులుగా మారుస్తున్నారని చెప్పక తప్పదు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొనివున్న పరిస్థితులకు తెలంగాణ నాయకులే బాధ్యులు. తెలంగాణ ప్రజలు ఈ వాస్తవాలను అర్థం చేసుకోవల్సిన సమయమాసన్నమయింది. 2009 నవంబర్ నుంచి సంభవించిన సంఘటనలను గుర్తు చేసుకోండి. వాస్తవాలేమిటో స్పష్టమవుతాయి. సరైన నిర్ణయానికీ మీరు రాగలరు.
- కనీజ్ ఫాతిమా
సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ

Andhra Jyothi Telugu News Paper Dated : 18/6/2013

Wednesday, January 23, 2013

రాజకీయ కక్షతోనే అణచివేత - కనీజ్ ఫాతిమా



 రాజ్యాంగ వ్యవస్థలు మతతత్వంతో నిండిపోయాయి. రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ఏర్పడిన సంస్థలు దృక్పథలేమి వల్ల కర్త్యవం గ్రహించలేకున్నాయి. వామపక్షం కూడా మత శక్తుల వ్యూహాలను తమకు అనుకూలంగా వినియోగించుకొనే ఎత్తుగడనే అనుసరిస్తుంది. రేటింగ్ కోసమే మీడియా మతం పేరుతో వివాదాన్ని సృష్టించాయని అనుకోకూడదు. మీడియా జాతీయ, రాష్ట్ర స్థాయిలో హిందూత్వ శక్తులు బలపడే విధంగానే మత విద్వేషాలను ప్రసారం చేస్తున్నది నిజం. ఈ విధంగా సకల వ్యవస్థలు, సంస్థల పతనం వల్ల సమాజంలోని అల్ప సంఖ్యాకుల రాజ్యాంగ హక్కులు ప్రమాదంలో పడుతున్నాయి. ముఖ్యంగా ముస్లిం సమాజం ఒంటరిపాటుకు, వెలివేతకు, అణచివేతకు గురవుతుంది. 

ఇది ముస్లిం సమాజం వరకే పరిమితమై ఆగిపోదు. ఇతర సమాజాలకు వ్యాపించి తీరుతుంది. దేశ భద్రత ప్రమాదంలో పడటమే కాదు, సమాజ పరివర్తన ఆకాంక్షించే కింది కులాల ఉద్యమం నిర్వీర్యమై పోతుంది. ఇక ఆ తర్వాత ప్రజాస్వామ్యం అనే భావనే బతికి ఉండదు. చట్టం పరిధిలో, మైనార్టీ హక్కుల రక్షణ, గుర్తింపు అన్న అంశంలో రెండు ప్రధానమైన ఉద్దేశ్యాలున్నాయి. ఒకటి, ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాన్ని మెజార్టీ వర్గమే నడుపుతుంది. అందువల్ల రాజ్యాన్ని మైనార్టీల పట్ల దౌర్జన్యపూరితంగానూ అణచివేత స్వభావంతోనూ ఉండకుండా నియంత్రించటం. 

రెండు, మైనార్టీలకు ఒక రక్షణ ప్రదేశాన్ని ఏర్పాటు చేయటం. తద్వారా వారి ప్రత్యేకమైన గుర్తింపును భద్రపరుచుకొని జాతీయ అభివృద్ధి, పురోగతికి తోడ్పడతారు. లౌకిక రాజ్యం అని రాజ్యాంగం ప్రకటించి, మైనార్టీలను రక్షించాలని పరోక్షంగా రాజ్యాన్ని ఆదేశించింది నిజమే. అయితే ఆచరణలో రాజ్యం మతాల విషయంలో తటస్థ వైఖరిని అవలంభిస్తుందా? మత మైనార్టీలను రాజ్యం కాపాడుతున్నదా? అక్బరుద్దీన్ ఖైదు నేపథ్యంలో భారత రాజ్యం యొక్క స్వభావం, దాని ప్రవర్తన గురించి రాజ్యాంగ దృష్టి నుంచి ఆలోచిస్తే కొన్ని ప్రశ్నలకైనా సమాధానం దొరుకుతుంది.రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సమస్య సంపూర్ణంగా రాజకీయపరమైంది. 

రెండు మత సమూహాల మధ్య విభేదాలను సృష్టించడానికి వాస్తవాలను వక్రీకరించి ప్రజలకు సమర్పించిన సమస్య. ఇది రాజ్య ప్రాయోజిత కార్యక్రమం. దీన్ని ప్రత్యేకించి పెద్ద పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు చేశాయి. 2014లో రాబోతున్న ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తున్నాయి. పాదయాత్రలు, ప్రదర్శనలు, బహిరంగ సభలు వంటివి అన్ని పార్టీలు చేపట్టినట్టే ఎంఐఎం కూడా నిర్మల్‌లో ఒక బహిరంగ సభ నిర్వహించింది. 

అందులో ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఉపన్యాసాన్ని సాకుగా తీసుకుని కొంతమంది ఎంఐఎం వ్యతిరేకులు 'విద్వేష ఉపన్యాసం' అని మౌఖిక ప్రచారం చేశారు. ఈ 'విద్వేష ఉపన్యాసం' ప్రచారం వల్ల అనతి కాలంలోనే హిందూత్వ శక్తులు ఈ సమస్యను పట్టుకున్నాయి. గంటా యాభై నిమిషాలున్న అక్బరుద్దీన్ ఓవైసీ ఉపన్యాసాన్ని ముప్పై నిమిషాలకు కుదించి ఎడిట్ చేశారు. అది విన్న సామాన్యుడెవరైనా సరే అధిక సంఖ్యాక సమాజానికి వ్యతిరేకమైన విద్వేష ఉపన్యాసమని తప్పకుండా నమ్ముతారు. 

జాతీయ, స్థానిక మీడియా 'విద్వేష ఉపన్యాసం' ప్రచారం చేస్తూ అక్బరుద్దీన్ కేసు విచారణ నేరుగా ప్రారంభించింది. గతంలో కూడా ఇదే విధంగా మీడియా వ్యవహరించింది. అమాయక ముస్లిం యువకులను చట్టవిరుద్ధంగా ఎత్తుకుపోయి, హింసించి, అరెస్టు చేసి తీవ్రవాదులనే ముద్ర వేసినప్పుడు కూడా మీడియా తీవ్రవాదుల అరెస్ట్ అనే ప్రచారం చేసింది. ఆ తీరులోనే అక్బరుద్దీన్ విషయంలోనూ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. 

కానీ విషాదం ఏమిటంటే తీవ్రవాదులనే ఆరోపణలతో అరెస్టు చేయబడ్డ అమాయకులు నిర్దోషులని నిరూపణ జరిగిన తర్వాత ఇదే మీడియా కనీసం పశ్చాత్తాపం చెందినట్టు కనిపించలేదు. అక్బరుద్దీన్‌ను భారత్ వ్యతిరేకి, మతతత్వవాది అని మీడియా ఆరోపణలు చేసింది. అక్బరుద్దీన్ మొత్తం ఉపన్యాసంలో ఎక్కడా 'హిందువులు' అనే శబ్దమే ఉపయోగించలేదు. అమెరికా ముస్లిం దేశాల్లో తీసుకొస్తున్న సమస్యలు, ముస్లింల మధ్య అది సృష్టిస్తున్న విభేదాల వల్ల సంభవిస్తున్న అనైక్యత సమస్యను లేవనెత్తుతూ సాగింది. 

జాతీయ స్థాయిలో బీజేపీ, ఆరెస్సెస్, వీహెచ్‌పీ, హిందూ వాహినీ వంటి సంస్థలు ముస్లింలను ఊచకోత కోస్తుంటే పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారనీ, బాధిత ముస్లిం సమాజాన్నే శాంతి భద్రతల సమస్యకు మూలమనే పద్ధతిలో రక్షణ సంస్థలు నిందిస్తున్నాయనీ, ముస్లింలను హిందూత్వ శక్తుల నుంచి కాపాడకపోగా హిందూత్వ సంస్థలకే పోలీసులు సహకరిస్తున్నారని చెబుతూ హిందూస్థాన్‌లో ముస్లింలు 25 కోట్లు ఉన్నారని, పోలీసులకు చేతకాకపోతే పక్కకు జరిగితే పరిస్థితిని వారే చక్కదిద్దుతారనే భావంతో మాట్లాడారు. 

ఒక వాక్యాన్ని దానికి ముందు చెప్పిన విషయం నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. కానీ సందర్భం నుంచి విడదీసి వందకోట్ల మందిని చంపుతామనే అర్థం తీసి వివాదం సృష్టించారు. హిందూత్వ శక్తులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యను మొత్తం హిందువులకు ఆపాదించటమే ఇక్కడ ట్విస్టు. హిిందువులు కేవలం ఒక మత సమూహం. హిందూత్వం అనేది ఒక భావజాలం. మతతత్వ రాజకీయాలను హింసాత్మక పద్ధతుల్లో వ్యక్తీకరించేవారు హిందూత్వవాదులు. 

అక్బరుద్దీన్ హిందూ దేవుళ్లను అవమానించాడనే మరో ఆరోపణ కూడా చేశారు. కానీ నిజానికి ఆయన రామ్‌జఠ్మలానీ మాటలనే గుర్తు చేశారు. రాముడు అసలు లేనే లేడనీ, ఒక వేళ రాముడుంటే అయోధ్య అతని జన్మస్థలం కాదనీ రామ్‌జఠ్మలానీ అన్నారనీ, రాముడు ఉన్నదీ లేనిదీ నిరూపించాలని హిందూ మతాధిపతులను రామ్ జఠ్మలానీ ప్రశ్నించాడనీ అక్బరుద్దీన్ ఆ ప్రసంగంలో పేర్కొన్నాడు. ఈ ప్రశ్న రామ్‌జఠ్మలానీ అడిగాడు కాబట్టి ఎవరూ ఏమీ అనరనీ, అదే అక్బరుద్దీన్ మాట్లాడితే అరెస్టు చేస్తారని కూడా అక్బర్ అన్నాడు. నిజానికి, మేధావులు ఇప్పటికే చెప్పిన విషయాలను తన మాటల్లో అక్బరుద్దీన్ వ్యక్తీకరించాడు. 

రాముడి ఇతివృత్తం గురించి ఒక రామ్‌జఠ్మలానీయే కాదు జాతీయోద్యమ కాలంలోనే రాజ్యాంగ నిర్మాత డా. అంబేద్కర్, పెరియార్ రామస్వామి వంటి మహా పురుషులు పెద్ద పెద్ద గ్రంథాలే రాశారు. హిందూ మతానికి చెందిన అనేక మంది పెద్దలు, మతాలకు సంబంధం లేని మానవతావాదులు, చరిత్రకారులు, మేధావులు ఎన్నో పుస్తకాలు రాశారు. కంచ ఐలయ్య లాంటి దళిత మేధావులు దేవుళ్ల ఉనికి గురించీ, వేదాలు, పురాణాల గురించీ మాట్లాడారు. మరి వాళ్లందర్నీ ఎందుకు అరెస్టు చేయలేదు? రాజద్రోహం, రాజ్యం మీద యుద్ధం, దేశ లౌకికత్వానికి ముప్పు వంటి కేసులు పెట్టలేదేమీ? కేవలం వాళ్లు మెజార్టీ మతానికి చెందిన వారు కావటం వల్లే కదా? ఇది కేవలం అక్బరుద్దీన్‌కు సంబంధించిన సమస్యగా లేదు ఇప్పుడు. 

మెజార్టీ రాజ్యం యొక్క వివిధ సంస్థలు విపరీత వాదనలతో అణచివేతను సమర్ధించుకుంటున్నాయి. ఏదైనా ఒక తప్పు మెజార్టీ వర్గం చేస్తే అది తప్పని పరిగణించబడటం లేదు. కానీ అదే తప్పును మైనార్టీ వర్గం చేస్తే అది తప్పని చెప్పటమే కాదు, రాజద్రోహం, అసాంఘిక చర్య, ప్రజాస్వామ్యానికి చేటు, లౌకికత్వానికి పెనుముప్పు అంటున్నారు. 

చార్మినార్ సమస్య నేపథ్యంలో రాష్ట్ర, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎం మద్దతు ఉపసంహరించుకున్నది. ఈ సందర్భంలో ఎంఐఎం పార్టీని అణచివేసేందుకు కాంగ్రెస్ అక్బరుద్దీన్ ఉపన్యాసాన్ని ఒక సాకుగా చూపిస్తుంది. అందువల్ల అంతర్గత విభేదాలను పక్కకు పెట్టి ఈ దేశ నిజమైన భూమిపుత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సమైక్యమై గుర్తింపులను నిలబెట్టుకోవాలి. ఐక్యంగా హిందూత్వ ఫాసిజాన్ని నిలువరించాలి. 

- కనీజ్ ఫాతిమా
సహాయ కార్యదర్శి, సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ

Andhra Jyothi Telugu News Paper Dated : 23/1/2013

Saturday, June 16, 2012

ముస్లిం రిజర్వేషన్లు-రాజ్యాంగ రక్షణ----కనీజ్ ఫాతిమా



ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం 2004లో జీవో33ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం 2011లో 4.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. అప్పటి నుంచి మైనార్టీలకు ముఖ్యంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ అనేకమంది వాదిస్తున్నారు. ముస్లింలకు విద్యా, ఉద్యోగరంగాల్లో 4.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. తీర్పులు వెలువరించే సమయంలో న్యాయాధిపతులు రాజ్యాంగంలోని ఆయా ఆర్టికల్స్ స్పిరిట్‌ను అర్థం చేసుకున్నట్లు లేదు.ముస్లింల కు రిజర్వేషన్లను వ్యతిరేకించేందుకు ఎప్పటికప్పుడు కొత్త వ్యక్తీకరణలు వస్తున్నా యి. మతపరమైన రిజర్వేషన్లకు రాజ్యాంగ అనుమతి లేదనీ, సమాజాన్ని విచ్ఛి న్నం చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పు ముస్లింలతో సహా ఇతర మైనార్టీల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపబోతున్నది. సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని కేంద్రం నివేదించింది. సుప్రీంకోర్టు కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ మీద అసహనం ప్రదర్శించింది.రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే ఇవ్వడానికి కూడా నిరాకరించింది. మైనార్టీ రిజర్వేషన్లు ఇవ్వడానికి గల డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ను కోర్టుకు సమర్పించాలని సూచించింది. 

రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెం టనే మద్రాసు రాష్ట్రంలో కొనసాగుతున్న ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ సమ్మతం కాదని మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగింది. పార్లమెంటులో కూడా దీనిపై చర్చ జరిగింది. మద్రాసు కోర్టు న్యాయాధీశులు రాజ్యాంగం సారాన్ని అర్థం చేసుకోలేదని, వారు కేవలం న్యాయశాస్త్ర నిపుణులుగానే మిగిలిపోయారని అప్పటి పార్లమెంటులో డాక్టర్ అంబేద్కర్ వ్యాఖ్యానించారు. మద్రాసులో ఎప్పటి నుంచో అమలవుతున్న ఓబీసీ రిజర్వేషన్లు కొత్త రాజ్యాంగం ప్రకారం న్యాయసమ్మతమేననీ, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 16 హామీ ఇస్తున్న ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తాయని ఆయన వాదించారు. ఆయన వాదనను అంగీకరించి తొలి రాజ్యాంగ సవరణ ఓబీసీ రిజర్వేషన్ల కోసం చేశారు. ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని నాడు మద్రాసు కోర్టు తీర్పు ఇచ్చినట్టే, నేడు ఆంధ్రవూపదేశ్ హైకోర్టు మైనార్టీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తీర్పుఇచ్చింది. మైనార్టీ రిజర్వేషన్లను కోర్టులు కొట్టివేస్తాయని 2007లోనే బాలగోపాల్ ఊహించారు.

రాజ్యాంగం ఈ దేశ పౌరులకు మౌలిక హక్కులు కల్పించింది.విద్యా, ఉద్యోగ రంగాలు ఈ హక్కుల కిందే పరిగణింపబడ్డాయి. వీటిని నిరాకరించే అధికారం ఏ వ్యవస్థకూ లేదు. ఆర్టికల్ 13(2), 3 (ఎ) ప్రకారం మౌలిక హక్కులకు భంగకరమైన ఎలాంటి చట్టమైనా రాజ్యాంగం ప్రకారం చెల్లదు. ఆర్టికల్ 14 ప్రకారం ఈ దేశంలోని పౌరులంతా చట్టం ముందు సమానులే. అంటే అన్ని మతాల ప్రజలు చట్టం ముందు సమానులే. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విద్యా,ఉద్యోగ హక్కులతో పాటు, జీవించేహక్కు, ప్రాతినిథ్యం వహించేహక్కును మౌలిక హక్కు ల పరిధిలోనే పెట్టాలని రాజ్యాంగ సభలో వాదించారు. ఈ హక్కులను మార్చే అధికారం ఎవరికీ లేదని ఆర్టికల్ 13 ఆదేశిస్తుంది. అందుకే మౌలిక హక్కులే రాజ్యాంగం అసలైన నిర్మాణం. ఆర్టికల్ 15 పౌరులకు ప్రాతినిధ్యహక్కు కల్పిస్తుంది. ఆర్టికల్ 15(4), (5) ప్రకారం సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడి న వర్గాలకు స్పెషల్ ప్రొవిజన్ చేసేందుకు రాజ్యాన్ని ఆటంకపరిచేదేదీ లేదు. ఆర్టికల్ 16(1), (2), (4)విద్యా, ఉద్యోగ రంగాలలో పౌరులందరికీ సమానత్వం కల్పించబడింది. ముస్లింలు, ఇతర మైనార్టీలు ఈదేశ పౌరులు. అందువల్ల రాజ్యాంగం హామీ ఇచ్చిన మౌలిక హక్కులను వారికి ఇవ్వాలి. కానీ న్యాయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నది. విద్యా, ఉద్యోగాలలో మైనార్టీలకు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నది. రాష్ట్ర హైకోర్టు మైనార్టీ రిజర్వేషన్లు ఆర్టికల్ 15,16 పరిధిలోకి రావని తీర్పు ఇవ్వడం ఆశ్చర్యం. ఫండమెంటల్ రైట్స్ గురించి ఏర్పా టు చేసిన ప్రతి ఆర్టికల్‌లో తొలుత మతం అనే పదాన్నే చాలా స్పష్టంగా వాడా రు. ఈ మౌలిక హక్కులను ఉల్లంఘించరాదని రాజ్యాంగం నిర్దేశిస్తుంటే న్యాయవ్యవస్థ మాత్రం మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని అంటున్నది. మైనార్టీ రిజర్వేషన్ జీవోను, ఆర్డినెన్స్‌ను మూడుసార్లు న్యాయవ్యవస్థ కాలరాసిం ది. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని వక్రీకరించడం కాదా ఇది? మతం పేరుతో పౌరుల పట్ల వివక్ష చూపించరాదని రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. ముస్లింలు ఆర్థికంగా, సాంఘికంగా, విద్యా, ఉద్యోగపరంగా దయనీయ స్థితిలో ఉన్నారని అనేక కమిషన్లు చెప్పాయి. న్యాయవ్యవస్థ ముస్లింల అభివృద్ధి కోసం ప్రత్యేక రిజర్వేష న్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఆదేశాలివ్వడం లేదు? 

ముస్లింలను ఓబీసీ జాబితాలో చేర్చే విషయంలో ఒక సాంకేతిక సమస్య ఇమి డి ఉన్నది. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండరాదనే ఒక వాదన ఉన్నది. ఈ సమస్య ఆరు దశాబ్దాలుగా ఉన్నది. అయితే మండల్ కమిషన్ కేసులో జస్టిస్ జీవన్‌డ్డి తీర్పు చెప్పారు. ఆ తీర్పులో ‘వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ 50 శాతం మించరాదనేది సాధారణ నియమం. ప్రత్యేకమైన అంశాలలో దీనికి మినహాయింపులు ఉండొచ్చు. ఇదే కాదు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లు కాకుండా, ఇతర కారణాల ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ వర్తించదు’ అన్నారు. అందువల్లే స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం, వికలాంగులకు, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా వంటి వాటిలో మూడు శాతం రిజర్వేషన్లు అమలువుతున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడు అగ్రకులాలు ఎలాంటి వాదనలు చేశాయో, ఇప్పుడు ముస్లిం, ఇతర మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తే మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని అలాంటి వాదనలే చేస్తున్నారు. ఏదైనా కులం సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడితే దాన్ని వెనుకబడిన వర్గంగా గుర్తించి రిజర్వేషన్లు కల్పిస్తే, అది కులం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు కాదనినాడు సుప్రీంకోర్టు తెలిపింది. అదే సూత్రం ప్రస్తుత పరిస్థితుల్లో వర్తిస్తుంది. సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన సమూహాలకు రిజర్వేషన్లు కల్పించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఈ సందర్భంలోనే ‘ఒకవేళ ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ముస్లింల్లో వెనుకబాటు తనం ఉందని గుర్తిస్తే, వారికి రిజర్వేషన్ ఇవ్వొచ్చు’ అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది.

ముస్లిం, ఇతర మైనార్టీలకు బీసీ రిజర్వేషన్ల నుంచి కోటా కేటాయించడం వల్ల బీసీ సోదరులు ముస్లిం వ్యతిరేకులుగా మారుతున్నారు. నిజంగా ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పం ప్రభుత్వాలకు ఉంటే 50 శాతం సీలింగ్‌ను తొలగించాలి. ముస్లిం, ఇతర మైనార్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేష న్లు కల్పించాలి. ఓబీసీల్లోని 27 శాతం నుంచి 4.5 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం అంటే ముస్లింల, ఇతర మైనార్టీల ప్రాతినిథ్య హక్కును తగ్గించడమే అవుతుంది. బీసీలకు, ముస్లింలకు మధ్య గొడవపెట్టే ఎత్తుగడను ప్రభుత్వం అమలు చేస్తున్న ది.బీసీల వైఖరి కూడా ముస్లింల పట్ల అహేతుకంగా ఉన్నది. బీసీలు అగ్రకుల రాజకీయాలను సరిగ్గా అర్థం చేసుకోవా లి.మాయావతి అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తే బీజేపీ, కాంగ్రెస్‌లు ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. అలాగే బీసీలు కూడా ఈ రిజర్వేషన్లను వ్యతిరేకించలేదు. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగ సమ్మతం కావు. మరి అగ్రకులాలకు కల్పించే రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకమని ఏ ఒక్క బీసీ సం ఘమూ కోర్టులో కేసువేయలేదు. మతం పేరుతో ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్న బీసీ సంఘాలు అగ్రకులాలకు ఇచ్చే రిజర్వేషన్లు మతపరమైనవని ఎందుకు వాదించడం లేదు? కోర్టులు కూడా అగ్రకులాలకు రిజర్వేషన్లను ఎందుకు తిరస్కరించడం లేదు? వెనుక బడిన ముస్లిం లకు, ఇతర మైనార్టీలకు రిజర్వేషన్లు ఇస్తామంటే మతం పేరుతో ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.అందువల్ల ముస్లింలకు ఇతర మైనార్టీలకు రిజర్వేషన్ ఇవ్వ డాన్ని న్యాయవ్యవస్థతో సహా ఎవరూ వ్యతిరేకించ కూడదు. న్యాయ వ్యవస్థ ద్వారా కూడా మైనార్టీలకు న్యాయం జరగకపోతే.. ప్రజలు ఎన్నుకున్న పార్లమెం ప్రజలకు సరియైన న్యాయం చేయాలి. ఈ దేశపౌరులైన ముస్లింలకు రాజ్యాం గబద్ధమైన న్యాయంచేసే అత్యున్నత అధికారం పార్లమెంటుకే ఉన్నది. కాబట్టి బీసీ రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేసినట్లే, జనాభా ప్రాతిపదికన మైనార్టీ రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేయాలి. ముస్లిం, ఇతర మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పం, నిజాయితీ కేంద్ర ప్రభుత్వానికి ఉంటే, గతంలో బీసీ రిజర్వేషన్ కోసం రాజ్యాంగ సవరణ చేసినట్లే చేయాలి. అలా కాకుండా జీవోలు, ఆర్డినెన్స్‌ల పేరుతో మైనార్టీలను మభ్యపెట్టాలని చూస్తే, ముస్లిం, బీసీల మధ్య ఘర్షణ పెట్టాలని చూస్తే ప్రభుత్వం భంగపడక తప్పదు. 

-కనీజ్ ఫాతిమా
(సివిల్ లిబర్టీస్ మానిటరింగ్ కమిటీ సహాయ కార్యదర్శి

Namasete Telangana News Paper Dated : 17/06/2012