Showing posts with label ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్). Show all posts
Showing posts with label ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్). Show all posts

Friday, December 21, 2012

అంబేడ్కర్‌వాద ఫలమే ‘ఉపప్రణాళిక’---Donda Badraiah



విప్లవాన్ని వ్యాఖ్యానించడం కాదు, దాన్ని ఆచరించడమే ముఖ్యమని లెనిన్‌ చెప్పాడు. దళిత గిరిజన ఉప ప్రణాళిక బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందిన వారం రోజులకే ఉపప్రణాళికకు చెందిన రూ.8 కోట్లను భారత ఎన్నికలసంఘం నిర్వహించాల్సిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను భద్రపరచే గోదాములకోసం మళ్ళించడాన్ని బట్టి, ఈ వర్గాల అభివృద్ధిపట్ల ప్రభుత్వాల చిత్తశుద్ధిని గమనంలోకి తీసుకోవలసిఉంది. దేశంలోని దళిత, ఆదివాసి వర్గాల ప్రజల అభివృద్థికి ప్రభుత్వాలు కొన్ని పథకాలు, చట్టాలు రూపొందిస్తున్నాయి. వాటిలో భాగంగా 1974లో ఎస్‌టి ఉప ప్రణాళిక, 1979లో ఎస్‌సి ఉపప్రణాళిక ప్రకటించారు. ఆ తరువాత 20 సూత్రాల పథకం వచ్చింది. 

వీటిని అమలు చేయడంలో ఇవే ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడంవల్ల దళిత ప్రజలు ఇప్పటికీ ఆశించిన అభివృద్ధిని సాధించలేక పోయారు. ఆ పథకాలను సక్రమంగా అమలుచేసి ఉంటే, నేడు ఎస్‌సి ఉపప్రణాళిక, ఎస్‌టి ఉపప్రణాళిక చట్టబద్ధత బిల్లు అవసరం ఉండేదికాదు. ఎస్‌సి, ఎస్‌టి ఉపప్రణాళిక చట్టబద్ధత బిల్లును శాసనసభ, శాసనమండలి ఆమోదించడం ఆహ్వానించదగింది. అయితే ప్రభుత్వం ఈ వర్గాల ప్రజలను అన్నిరంగాల్లో అభివృద్ధిలోకి తేవాలనే ఈ బిల్లును తీసుకువచ్చిందా అనేది ఆలోచించాలి. ఈ బిల్లును ఆమోదించినంత మాత్రాన ఆ వర్గాల ప్రజలు లక్షాధికారులు కాలేరు. ఈ బిల్లులో అనేక లోపాలున్నాయి. 

ఆ ఫలితమే బిల్లు ఆవమోదించిన వారం రోజులకే రూ. 8 కోట్లను మళ్లించడమే కాక, ప్రభుత్వం కనీసం దీనిపై సంజాయిషీకూడా ఇవ్వకపోవడం సిగ్గుపడాల్సిన విషయం. ఈ బిల్లును ఆమోదించేందుకు జరిగిన సమావేశాల్లో చిన్న, పెద్ద తేడాలేకుండా అన్ని పార్టీలు తామంటే తాము ఎస్‌సి, ఎస్‌టిల అభివృద్ధికి కృషిచేశామని, ఇక ముందుకూడా వీరి సర్వతోముఖాభి వృద్ధికి కట్టుబడిఉంటామని పోటీపడి చెప్పుకున్నారు. ఒక అంశం ఆకాంక్షగా రూపాంతరం చెందాలంటే దాని వెనుక ఎంతో సాహిత్య, సాంస్కృతిక బావజాలంతోపాటు స్థానిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు కూడా కారణమౌతాయి. దానికోసం ఎంతోమంది తమ విలువైన కాలాన్ని, మేధస్సును, శ్రమను ధారపోయాల్సి ఉంటుంది. అదే విధంగా సామాజిక న్యాయం అంశం ఈ రాష్ర్టంలో 80వ దశకంనుండి ఉనికిలోకి వచ్చింది. 

అదేకాలంలో జరిగిన కారంచేడు సంఘటన- ఈ దేశంలోనే సామాజిక సంక్షోభానికి సంకేతంగా రాజకీయ కుల పైశాచికత్వానికి ప్రతీకగా జరిగింది. ఈ ఘటన తర్వాత చుండూరు ఘటనతో బాధితుల ఉద్యమం సామాజిక న్యాయ అంశంతో రూపుదిద్దుకుంది. అప్పుడు దళిత ఉద్యమ వేడి ఢిల్లీని తాకింది. పర్యవసానంగా అనేక సామాజిక పరిణామాలు ఈ రాష్ర్టంలో చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత బహుజన సమాజ్‌ పార్టీ సామాజిక న్యాయం కోణంలో ‘ఓట్లు మావే, సీట్లూ మావే’ అంటూ రాజకీయ పిలుపు నిచ్చినప్పటికి సరియైన వ్యూహం లేక, నాయకుల మధ్య ఐక్యత లేక ఆ పార్టీ చతికిలపడిపోయింది. ఆ ఉద్యమాలన్నిటికి సైద్ధాంతిక భూమిక బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనా విధానం. 

ఈ ఆలోచనకు తోడుగా మహాత్మాజ్యోతి రావు ఫూలే సామాజిక ఉద్యమ స్ఫూర్తి కూడా ఎస్‌సి, ఎస్‌టిలకు తోడుగా బలహీన వర్గాలను కలుపుకు పోయేందుకు దోహదపడింది. ఈ విధంగా రాష్ర్టంలో దళిత గిరిజన బలహీన మైనారిటీ వర్గాలలో- సామాజికన్యాయ కోణంలో ఆర్థిక, రాజకీయ న్యాయం జరగాలనే ఆకాంక్ష క్రమంగా బలపడింది. ఎస్‌సి, ఎస్‌టిలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, అవమానాలపై ఉద్యమాలు చేయడం అవసరం. దళిత, బలహీన వర్గాలకు భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ చొరవతో రాజ్యాంగంలో పొందు పరచిన రక్షణలు ఒక వైపు ఉన్నప్పటికీ, ఆ హక్కులు, రక్షణలు రాజ్యాంగానికి పరిమితమైతేనే సరిపోదు. వాటిని సాధించుకోవడానికి నిరంతరం పోరాటాలు చేయాలి.

ఎందుకంటే ఈ పాలక ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఉన్న రక్షణలను కల్పించవు. అవి ఈ దేశ సామాజిక వ్యవస్థను, కుల కట్టుబాట్లను ఎదిరించేవిగా ఉన్నాయి. అంతే కాకుండా ఈ సమాజంలోని ప్రజలు కులాలుగా చీలిపోయి ఉన్నారు. రాజ్యాంగం అందరూ సమానమే అని చెబుతుంది. అయినా, అందరూ సమానమే అనే ప్రగతిశీల భావాన్ని దేశపాలకులు వెంటనే ఒప్పుకోరు. వారు పాలకులుగా ఉండేందుకు రాజ్యాంగం మీద ప్రమాణంచేసి పదవుల్లోకి వస్తారు. కాబట్టి రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పుకుంటూనే, ఆ రాజ్యాంగంలో ఉన్న హక్కులను అమలు చేసేందుకు ఇష్టపడరు. అందుకే దళిత, బలహీన వర్గాలు నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఆ హక్కులను ప్రభుత్వాలచేత అమలు చేయించుకుంటూ ఉపయోగించుకోవాలని అంబేడ్కర్‌ ఆనాడే చెప్పారు. 

ఈ భావజాలాన్ని గౌరవించిన అనేక మంది సామాజిక ఉద్యమకారులు ఆ హక్కుల కోసం ఉద్యమాలు చేస్తూ, వాటి ఆధారంగా ఈ వర్గాలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ దేశంలో అంబేడ్కర్‌ భావజాలాన్ని, సైద్ధాంతిక విధాలను వేలాదిమంది అంకిత భావంతో అనునిత్యం తమ రచనల ద్వారా, పోరాటాల ద్వారా సమావేశాల ద్వారా ఈ వర్గాల ప్రజలకు తెలియజేయడంలో నిమగ్నమవుతున్నారు. ఆ ప్రభావం ప్రభుత్వాలు తీసుకునే విధానాలపై పడుతుంది. ప్రభుత్వాలు తమ విధానాల్లో ఈ వర్గాల ఆకాంక్షలను జోడింప చేస్తున్నాయి. ఆవిధంగా జోడించిన విధానమే ఎస్‌సి, ఎస్‌టి ఉపప్రణాళికలకు చట్టబద్ధతను కల్పించే బిల్లును ఆమోదించడం. 

అయితే ఇంతకు ముందు కూడా ప్రభుత్వాలు ఈ వర్గాల కోసం పలు కార్యక్రమాలు చేపట్టాయి. అందుకు ఆ వర్గాల ప్రజలు డిమాండ్‌ చేసి, పోరాటాలు చేస్తే గాని ప్రభుత్వాలు స్పందించలేదు. ఈ ప్రభుత్వాల పనితీరును అంబడ్కర్‌ స్వయంగా చూశారు కాబట్టి, ఈ దేశ సామాజిక వ్యవస్థ- ఆర్థిక, రాజకీయ వ్యవస్థలపై బలమైన ప్రభావాన్ని చూపించడాన్ని ఆయన అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి, ఈ వర్గాల ప్రజలు రాజ్యాంగంలోని హక్కులు, రక్షణలను పరిరక్షించుకోవాలంటే నిరంతరం ఉద్యమాలు చేయాలని పిలుపు నిచ్చారు. ఆ పిలుపు ఈ దేశంలోని దళిత, ఆదివాసి, బలహీన వర్గాలను నడిపిస్తోంది. డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ తన జీవిత చరమాంకంలో దళిత గిరిజన వర్గాలకు చెందిన రాజకీయ నాయకులు, అధికారుల గురించి చాలా వేదనకు లోనయ్యారు. 

ఈ వర్గాల రాజకీయ నాయకులు, అధికారులు వారి వ్యక్తిగత జీవితాల, కుటుంబాల ఉన్నతికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, వాఉ ఈ వర్గాల ప్రజలకు మేలు జరిగేందుకు ఉపయోగపడాలని వాంఛించారు. అందుకే ఈ వర్గాలకు చెందిన ప్రజలు విద్యపై దృష్టి పెట్టి విద్యాధికులై ఈ దేశ సామాజిక వ్యవస్థను అర్థం చేసుకొని, చైతన్యవంతులై రాజ్యాంగంలోని రక్షణల అమలుకు పోరాటాలు చేయాలని స్పష్టంచేశారు. ఆయన చెప్పిన మాటలు నేటికి కూడా అక్షర సత్యాలుగా మనముందు సాక్షాత్కరిస్తున్నాయి. ఈ దేశపాలకులు, ప్రభుత్వాలకు దళిత గిరిజన వర్గాలను మిగతా వారితో సమాన స్థాయికి తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉంటే ఈ 65సంవత్సరాల కాలం పడుతుందా? ఈరోజు ఈ ఉపప్రణాళిక అవసరం ఉంటుందా? రాష్ర్టంలో, 

దేశంలో నెలకొన్న దళిత ఆదివాసీల ఉద్యమ చైతన్యం వల్ల, ఆ వర్గాల ఉద్యమ నాయకుల త్యాగాల వల్ల, తద్వారా ఈ దేశంలో వ్యాప్తి చెందిన అంబేడ్కర్‌ భావజాలం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టవలసి వస్తోందని ఏ రాజకీయ నాయకుడు గుర్తించడం లేదు. ఇదేదో తాము సాధించిన ఘనతగా, లేదా తమ పార్టీ దాచుకున్నదంతా ఈ వర్గాల ప్రజలకు ఊరికే ఇస్తున్నంత ఘనంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అసెంబ్లీలో నాయకులు తమ తమ పార్టీల గొప్పతనాల గూర్చి ఉపన్యాసాలు ఇచ్చారు కానీ, ఈ 65 సంవత్సరాలుగా ఈ దుస్థితికి ఈ ప్రభుత్వాలే కారణమని ఎవరైనా చెప్పారా? తమ పార్టీ ఈ వర్గాలకు దాచిపెట్టిందని ఒకరు, ఈ వర్గాలకోసమే పుట్టిందని ఇంకొకరు, 

dontha
మా పార్టీలేకపోతే ఈ వర్గాలు అగ్రకులాల చెప్పులక్రింద ఉండేవారని మరొకరు పోటీపడి ఉపన్యాసాలు ఇచ్చారు. దళిత గిరిజన వర్గాల ప్రజలు ఈ సామాజిక వ్యవస్థ మూలాలను అర్థంచేసుకొని తద్వారా ఆర్థిక, రాజకీయ వ్యవస్థలను అందుకోవడంతోనే అభివృద్థి జరుగుతుందని, హక్కులను ఈ ప్రభుత్వాలు అమలు చేయవు కాబట్టి వాటికోసం ఉద్యమాలే శరణ్య మని, హక్కులు భిక్షమెత్తుకుంటే రావు, పోరాడి సాధించు కోవాలని అంబేడ్కర్‌ ఉపదేశించాడు. ఈ ఆలోచనా విధానంతో ఉద్యమాలు చేస్తూ, అంబేడ్కర్‌ చెప్పిన భావజాలాన్ని సాహిత్యపరంగా, కళల ద్వారా, పోరాటాల ద్వారా ఎవరైతే వ్యాప్తి చేస్తున్నారో వారి విజయంగా ఈ ఉపప్రణాళికా బిల్లును భావించాలి.

Surya News Paper Dated : 21/12/2012

Friday, December 14, 2012

ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌పై పాలకపార్టీల 'నయవంచన' ఎంవిఎస్‌ శర్మ


  Thu, 13 Dec 2012, IST  

  • ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని కోరుతూ ప్రజా ఉద్యమాలు జరిగాయి. కెవిపిఎస్‌ నడిపిన ఉద్యమం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు, ప్రజా సమీకరణలు ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి. అటు టిడిపిగానీ, ఇటు కాంగ్రెస్‌ కానీ సబ్‌ప్లాన్‌ అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఈ ఆందోళనల అవసరమే ఉండేదిగాదు. రూ.30,000 కోట్ల నిధులు మళ్లింపు జరిగి ఉండేది కాదు. ఎస్సీ, ఎస్టీలు ఇప్పుడున్న దయనీయ పరిస్థితిలో ఉండేవారూ కాదు. ప్రజా ఉద్యమాల ఒత్తిడికి దిగొచ్చి ప్రభుత్వం ఏదోవిధంగా స్పందించక తప్పలేదు.
''ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీలకు ఎవరైనా మేలు చేశారంటే అది ఒక్క కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. ఎప్పటికీ ఎస్సీ, ఎస్టీలు మాతోనే ఉంటారు.'' గ్రామీణాభివృద్ధి మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ డిసెంబర్‌ 11న శాసనమండలిలో బల్లగుద్ది మరీ చెప్పిన మాటలివి.
''ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి మేం అంకిత భావంతో పనిచేస్తున్నాం గనుకనే దేశంలోనే మొట్టమొదటిగా ఇటువంటి బిల్లు తెచ్చాం. దేశానికే ఆదర్శప్రాయంగా మనం ఉన్నాం. మా చిత్తశుద్ధిని శంకించకండి.'' ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అదే రోజున అదే సభలో చేసిన ప్రసంగంలో భాగం ఇది.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ బిల్లు డిసెంబర్‌ 11న శాసనమండలిలో కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. గవర్నర్‌ ఆమోదముద్ర పడితే ఇది చట్టం అయినట్టే. ఈ చట్టంతో పదేళ్లలో సామాజిక సమానత్వాన్ని, సమతుల్యతను సాధించేయబోతున్నామని కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పలు పోతోంది. ఆ ఘనత అంతా తమకే చెందాలని, ఇంకెవ్వరికీ దక్కరాదని వాదిస్తోంది. ఆ పార్టీ నాయకులు, మంత్రులు వాదిస్తున్నట్టు ఆ చట్టం ద్వారా అంత మేలు ఒనగూరితే అభ్యంతరమేముంది? కానీ బిల్లులోని కొన్ని క్లాజులను చూస్తే ఈ బిల్లు వల్ల ఎస్సీ, ఎస్టీలకు ఒరిగేదేముంది? అన్న సందేహం కలుగుతుంది. ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (పిడిఎఫ్‌) తరపున ముఖ్యమైన సవరణలను ఏడింటిని ప్రతిపాదించాము. ఆ సవరణలను ప్రవేశపెట్టడానికి సైతం అధికార పక్షం అంగీకరించలేదు. బిల్లు ఉద్దేశాలను, లక్ష్యాలను బలోపేతం చేసే ఈ సవరణలపై ముఖ్యమంత్రితో సహా ఎవరూ స్పందించలేదు. ఈ అధికారపక్షం తీరు చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధిపై కచ్చితంగా అనుమానం కలుగుతుంది.
సబ్‌ప్లాన్‌ భావన 1980 నుంచీ ముందుకొచ్చింది. జనాభాలో ఎస్సీ, ఎస్టీలు ఎంత శాతం ఉన్నారో, అంత శాతం నిధులను ప్రభుత్వం వారికి కేటాయించి వారి అభివృద్ధి కోసం ఖర్చు చేయాలన్నది సబ్‌ప్లాన్‌ ఉద్దేశం. అయితే ఈ లక్ష్యం ఏమాత్రమూ నెరవేరలేదని ప్రభుత్వమే అంగీకరిస్తున్నది. ఈ సంవత్సరం ఫిబ్రవరి - మార్చి నెలల్లో జరిగిన బడ్జెట్‌ సమావేశాలలో శాసనమండలిలో సబ్‌ప్లాన్‌పై రెండురోజుల పాటు చర్చ జరిగింది. ఆ చర్చలో కాంగ్రెస్‌, తెలుగుదేశం 'సబ్‌ప్లాన్‌ అమలు జరగకపోవడానికి కారణం మీరే అంటే ... కాదు మీరే'' అని పరస్పరం నిందించుకున్నాయి. సబ్‌ప్లాన్‌పై ప్రణాళికా సంఘం మార్గదర్శకాలు జారీచేసి 32 సంవత్సరాలైంది. ఈ కాలంలో తెలుగుదేశం 17 సంవత్సరాలు, కాంగ్రెస్‌ 15 సంవత్సరాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి. సబ్‌ప్లాన్‌ అమలు పట్ల ఈ రెండుపార్టీలూ శ్రద్ధ పెట్టలేదు. ఫలితంగా రూ.30,000 కోట్లకు పైగా సబ్‌ప్లాన్‌ నిధులు ఖర్చు అవకుండా మురిగిపోయాయి లేదా ఇతర పద్దులకు మళ్లించబడ్డాయి.
పున్నయ్య కమిషన్‌ మేమే వేశామని, సిఫార్సులను ఆమోదించామని టిడిపి చెప్పుకుంటూ ఉంటే కోనేరు రంగారావు కమిషన్‌ను నియమించి సిఫార్సులను ఆమోదించినది మేమని కాంగ్రెస్‌ చెప్పుకుంటోంది. ఈ రెండు కమిషన్ల సిఫార్సులనూ ఆచరణలో నీరుగార్చారు.
ఈ నేపథ్యంలోనే ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని కోరుతూ ప్రజా ఉద్యమాలు జరిగాయి. కెవిపిఎస్‌ నడిపిన ఉద్యమం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు, ప్రజా సమీకరణలు ప్రత్యేకించి చెప్పుకోవాల్సినవి. అటు టిడిపిగానీ, ఇటు కాంగ్రెస్‌ కానీ సబ్‌ప్లాన్‌ అమలు పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఈ ఆందోళనల అవసరమే ఉండేదిగాదు. రూ.30,000 కోట్ల నిధులు మళ్లింపు జరిగి ఉండేది కాదు. ఎస్సీ, ఎస్టీలు ఇప్పుడున్న దయనీయ పరిస్థితిలో ఉండేవారూ కాదు. ప్రజా ఉద్యమాల ఒత్తిడికి దిగొచ్చి ప్రభుత్వం ఏదోవిధంగా స్పందించక తప్పలేదు. అయినా కిందపడ్డా నాదే పైచేయి అన్న చందాన కాంగ్రెస్‌ పార్టీ వ్యవహరిస్తోంది. ఎస్సీ, ఎస్టీల పట్ల మేమే మొనగాళ్లం అంటున్న కాంగ్రెస్‌ గడిచిన ఆరు దశాబ్దాల కాలంలో సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం ఏమీ చేయలేకపోయామని సబ్‌ప్లాన్‌ చట్టాన్ని ఇప్పుడు చేయడం ద్వారా పరోక్షంగా అంగీకరించినట్టే గదా? ఇదే ప్రస్తావిస్తే మాత్రం ఉన్న మాటంటే ఉలుకెక్కువ అన్నట్టు కాంగ్రెస్‌ మంత్రులు ఉక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారు.
మా చిత్తశుద్ధిని శంకించవద్దంటూ ముఖ్యమంత్రి పదేపదే అంటున్నారు. కానీ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు, సిపిఐ(ఎం) ఎమ్మెల్సీ సీతారాములు ప్రతిపాదించిన సవరణలన్నింటినీ తిరస్కరించారు. ఈ సవరణలన్నీ సబ్‌ప్లాన్‌ చట్టాన్ని పటిష్టం చేయడం కోసం ప్రతిపాదించినవే. చిత్తశుద్ధి ఉంటే ఈ సవరణలనెందుకు తిరస్కరించారో ముఖ్యమంత్రి చెప్పాలి.
1. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులో 3వ క్లాజులో ఎస్సీ, ఎస్టీల జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఉంది. పైకి చూస్తే ఇది బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తికి మించి కేటాయించరాదు అని దీని అర్థం. దీనిపై ప్రతిపాదించిన సవరణలో ఎస్సీ, ఎస్టీల జనాభా నిష్పత్తికి తగ్గకుండా కేటాయించాలని ఉంది. దీనినెందుకు ప్రభుత్వం తిరస్కరించింది?
ఈ చట్టం లేకపోయినా ప్రతి సంవత్సరమూ సబ్‌ప్లాన్‌లో జనాభా నిష్పత్తి ప్రకారం కేటాయిస్తూనే ఉన్నారు. అవి పూర్తిగా ఖర్చు కాకుండా మురిగిపోతూనే ఉన్నాయి. ఒక సంవత్సరం కేటాయించిన నిధులు ఏ కారణం వల్లనైనా ఖర్చుకాకపోతే ఆ నిధుల్ని తరువాత సంవత్సరపు కేటాయింపులకు అదనంగా తోడు చేయాలి. బిల్లులో జనాభా నిష్పత్తి ప్రకారమే కేటాయించాలని నిర్దేశించాక ఈ అదనపు నిధుల్ని కేటాయించడం వీలు కాదు. ఒక సంవత్సరంలో కేటాయించిన నిధులు ఖర్చుగాకపోతే అవి మురిగిపోవడమే. ఆ మేరకు ఎస్సీ, ఎస్టీలు నష్టపోవడమే. కానీ పిడిఎఫ్‌ / సిపిఎం ప్రతిపాదించిన సవరణను అంగీకరించి ఉంటే ముందటేడాది ఖర్చుకాని నిధుల్ని తరువాయి ఏడాది కేటాయింపులకు అదనంగా కలిపే వీలుంటుంది.
బడ్జెట్‌ కేటాయింపులు అదే ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసి తీరాలని చెప్పినా అది ఆచరణకు సంబంధించిన విషయం గనుక ఏవో కారణాల వల్ల, ఆటంకాల వల్ల ఖర్చు అవకపోవచ్చు. కనుక వాటిని తరువాతి సంవత్సరానికి 'క్యారీ ఓవర్‌' చేయడానికి చట్టంలో వీలుండాలి.
2. ఇప్పటివరకూ ఖర్చుకాని సబ్‌ప్లాన్‌ నిధులను గుర్తించి ఆ మొత్తాన్ని రానున్న సంవత్సరాల్లో అదనపు నిధులుగా కేటాయించాలని ఇంకో సవరణ ప్రతిపాదించాము. దీనినీ తిరస్కరించింది ప్రభుత్వం.
3. ఎస్సీలలో, ఎస్టీలలో వివిధ కులాల మధ్య, తెగల మధ్య ఉన్న అంతరాలను గుర్తించి వారిమధ్య సమతుల్యత సాధించాలని ఆరో క్లాజులో పేర్కొన్నారు. అదే క్లాజులో షెడ్యూల్డ్‌ ప్రాంతంలో ఉన్న గిరిజనులపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని పేర్కొన్నారు. షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చకుండా ఉంచిన గిరిజన గ్రామాలు 840కి పైగా ఉన్నాయి. షెడ్యూల్డ్‌ ఏరియాలోకి వచ్చే అవకాశంలేని గిరిజన తండాలు వందలాది ఉన్నాయి. 840 గ్రామాలను షెడ్యూల్డ్‌ ఏరియాలో చేర్చాలని, గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలని ఎన్నో సంవత్సరాల నుంచి మొరపెడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే ఉంటోంది. ఇప్పుడీ చట్టంలోనూ వారిని పట్టించుకోలేదు. మేము ప్రతిపాదించిన సవరణను సైతం తిరస్కరించింది. అయినా గిరిజనుల పట్ల మాకే చిత్తశుద్ధి ఉందని అంటుంటే ప్రభుత్వాన్ని నమ్మేదెలా?
4. సబ్‌ప్లాన్‌ నిధుల ఖర్చును పర్యవేక్షించడం కోసం ఒక ప్రత్యేక కార్యదర్శి ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు. అయితే ఆ కార్యదర్శి ఆర్థికశాఖలో భాగంగా ఉండాలని అన్నారు. ఇప్పటివరకూ సబ్‌ప్లాన్‌ నిధులు సక్రమగా ఖర్చుగాకుండా ఉంటే వాటిని దారి మళ్లించింది ఆర్థికశాఖే. మళ్లీ ఇప్పుడు ఆ శాఖ పరిధిలోనే ఈ సబ్‌ప్లాన్‌ కార్యదర్శి ఉండాలంటే దానివల్ల ఒరిగేదేమిటి? అందుకే మేము సబ్‌ప్లాన్‌ కార్యదర్శికి స్వయం ప్రతిపత్తి ఉండేలా, ఆర్థికశాఖకు లోబడకుండా నేరుగా నిధులు మంజూరు చేసే అధికారం ఉండాలని సవరణ ప్రతిపాదించాము. అలాగే ఆర్థికశాఖ బడ్జెట్‌ నిధులను ఆయా శాఖలకు నేరుగా ఇచ్చే విధానానికి బదులు బడ్జెట్‌ ఆమోదం పొందగానే ఆ నిధులు సబ్‌ప్లాన్‌ఖాతాలో నేరుగా జమకావాలని ప్రతిపాదించాము. వీటినీ ప్రభుత్వం తిరస్కరించింది.
5. సబ్‌ప్లాన్‌ చట్టం అమలును పర్యవేక్షించడానికి ఒక రాష్ట్ర కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని, దానికి ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని బిల్లులో ప్రతిపాదించారు. మరి కౌన్సిల్‌లో తక్కిన సభ్యులు ఎవరు అన్నది బిల్లులో పేర్కొనలేదు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అన్ని పార్టీలూ, అన్ని పక్షాలూ కట్టుబడి ఉన్నాయి. కనుక ఈ కౌన్సిల్‌లో ముఖ్యమంత్రితోబాటు వివిధ సంక్షేమ శాఖల మంత్రులు, శాసనసభ, శాసనమండలిలోని ఫ్లోర్‌లీడర్లు సభ్యులుగా ఉండాలని సవరణ ప్రతిపాదించాం. దానినీ తిరస్కరించారు.
6. సబ్‌ప్లాన్‌ అమలులో తేడా వస్తే జోక్యం కల్పించుకోవడానికి, సరిదిద్దడానికి వీలుగా అంబుడ్స్‌మన్‌ను నియమించాలని సవరణ ప్రతిపాదించాం. నిజానికి మంత్రివర్గ ఉపసంఘం కూడా దీనిని ప్రతిపాదించింది. కానీ ప్రభుత్వం తిరస్కరించింది. లోకాయుక్త వ్యవస్థ ఎటూ ఉంది గనుక అంబుడ్స్‌మన్‌ వేరే అవసరంలేదన్నది ముఖ్యమంత్రి వాదన. ఇది తప్పు. ముప్పై రెండేళ్లుగా సబ్‌ప్లాన్‌ ఉంది గదా? మరి ఈరోజు చట్టం ప్రత్యేకంగా ఎందుకు తేవాల్సి వచ్చింది? ఆచరణలో విఫలమైనందువల్లనే గదా? అటువంటి వైపల్యాలు మళ్లీ వస్తే వెంటవెంటనే జోక్యం చేసుకోడానికి అంబుడ్స్‌మన్‌ వ్యవస్థ తోడ్పడుతుంది.
7. గత ఇరవై సంవత్సరాలుగా సరళీకరణ విధానాలు అమలవుతూనే ఉన్నాయి. వీటివలన అత్యధికంగా నష్టపోతున్నది ఎస్సీలు, ఎస్టీలు. ప్రాజెక్టుల భూ సేకరణలో, సెజ్‌ల భూసేకరణలో భూములు కోల్పోతున్నది వీరే. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం రద్దు వలన టౌన్లలో భూమి దొరకక శివార్లకు నెట్టివేయబడుతున్నదీ వీరే. జలయజ్ఞంలో నిర్వాసితులవుతున్నదీ వీరే. ముంపుకు గురవుతున్నవి గిరిజన గ్రామాలే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేర వేల కోట్లు కార్పొరేట్‌ విద్యా సంస్థల పరమౌతుంటే పశువులు కూడా మనలేని ఘోరమైన పరిస్థితుల్లో 'సంక్షేమ' హాస్టళ్లలో నానాపాట్లూ పడుతున్నది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులే. ప్రైవేటు రంగానికి పెద్దపీట వేసిన కారణంగా, అక్కడ ఉద్యోగాలలో రిజర్వేషన్లు లేని కారణంగా ఎస్సీ, ఎస్టీలు అన్యాయమైపోతున్నారు. మైనింగ్‌లో ప్రైవేటు శక్తుల ప్రవేశం వలన నిర్వాసితులవడమేగాక, దాని పర్యవసానంగా వాతావరణ కాలుష్యానికి బలవుతున్నదీ వీరే. సరళీకరణ విధానాల అమలు పర్యవసానంగా ఎస్సీలలో, ఎస్టీలలో పేదరికం పెరిగింది. సామాజిక అంతరాలు పెరిగాయి. ఇదంతా ప్రభుత్వం చలవే. ఈ సబ్‌ప్లాన్‌ చట్టానికున్న డొల్లతనాన్ని సరిచేయడానికి మేము ప్రతిపాదించిన సవరణలన్నింటినీ తిరస్కరించారు. పైగా తామే ఎస్సీ, ఎస్టీల తరపున నిలిచే మొనగాళ్లం అంటున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వారే తీరని అన్యాయం చేస్తూనే, తామే న్యాయం చేసిన, చేస్తున్న, చేయగల వాళ్లం అంటున్నారు. ఇదే కాంగ్రెస్‌ నయవంచన.
సబ్‌ప్లాన్‌ చట్టంలో ఒక భాగం మొత్తం బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు సరైన వాటా కేటాయించి ఖర్చు చేయడం, రెండో భాగం ఎస్సీలలో, ఎస్టీలలో ఉపకులాల మధ్య, వివిధ తెగల మధ్య అంతరాన్ని సరిచేయడం. మొదటి భాగాన్ని వదిలేసి రెండో భాగం మీదే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు యుద్ధం చేసుకున్నాయి. ఎందుకంటే మొదటి భాగానికి సంబంధించి రెండు పార్టీలూ యథాశక్తి ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేశాయి. ఆ విషయం ముందుకు రాకుండా ఉండడానికి, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం ఎజెండాను వీలైన మేరకు రాజకీయ వివాదాస్పద అంశంగా మార్చడానికి రెండో భాగం మీదే చర్చంతా నడిచేలా చూశాయి. ఈ నాటకం కూడా ఎస్సీ, ఎస్టీలు గమనించాలి.
సామాజిక వివక్షత కేవలం ఎస్సీల సమస్యగానో, ఎస్టీల సమస్యగానో చూడడం తప్పు. దేశం, రాష్ట్రం మొత్తంగా అభివృద్ధి చెందాలంటే ఆ క్రమంలో సామాజిక అంతరాలను, వ్యత్యాసాలను, అణచివేతను నిర్మూలించడం అవసరం. ఈ అంతరాలను, వ్యత్యాసాలను, అణచివేతను పెంచివేసే సరళీకరణ విధానాలను ఓడించే ఉద్యమంలో అందరూ కలిసి ముందుకు సాగాల్సి ఉంటుంది. అందులో భాగంగా పాలక పార్టీల నయవంచనను ప్రజల ముందు బట్టబయలు చేయడం ఎంతైనా అవసరం.
(వ్యాసకర్త శానన మండలిలో పిడిఎఫ్‌ పక్ష నేత) 


సబ్‌ప్లాన్‌ చట్టం అమలును పర్యవేక్షించడానికి ఒక రాష్ట్ర కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని, దానికి ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి ఉంటారని బిల్లులో ప్రతిపాదించారు. మరి కౌన్సిల్‌లో తక్కిన సభ్యులు ఎవరు అన్నది బిల్లులో పేర్కొనలేదు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి అన్ని పార్టీలూ, అన్ని పక్షాలూ కట్టుబడి ఉన్నాయి. కనుక ఈ కౌన్సిల్‌లో ముఖ్యమంత్రితోబాటు వివిధ సంక్షేమ శాఖల మంత్రులు, శాసనసభ, శాసనమండలిలోని ఫ్లోర్‌లీడర్లు సభ్యులుగా ఉండాలని సవరణ ప్రతిపాదించాం. దానినీ తిరస్కరించారు. 
-ఎంవిఎస్‌ శర్మ
Prajashakti Telugu News Paper Dated: 13/12/2012
  

Wednesday, December 12, 2012

ఉప ప్రణాళికలు--Sampadakiyam



దేశంలో అభ్యుదయ చట్టాలనేకం ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు ఆచరణకు నోచుకోకుండా ప్రజలకు అక్కరకు రాని చుట్టాలుగానే రుజువు చేసుకుంటున్నాయి. అందుచేత చట్టబద్ధత కల్పించడమే కాకుండా ఆ చట్టాన్ని సమగ్రంగా అమలుకు నోచుకునేలా చేయడం అవసరం. దళితులు, ఆదివాసీల ఉప ప్రణాళికలకు, వారి జనాభా దామాషా మేరకు ప్రణాళికా నిధుల కేటాయింపు జరిగేలా చూసి అవి అందుకోసమే ఖర్చు అయ్యేలా చూడడం అత్యంత ఆవశ్యకం. 

దళితులు, ఆదివాసీలతో బాటు వెనుకబడిన తరగతుల కోసం కూడా జనాభాలో వారి దామాషాకు అనుగుణంగా ప్రణాళిక నిధులను కేటాయించి వారి వికాస అభివృద్ధుల కోసం ఖర్చు చేసినప్పుడే దేశంలో, రాష్ట్రంలో సామాజిక న్యాయం కొంతమేరకైనా అమలులోకి వచ్చినట్టు కాగలదు.ఈ వర్గాల ప్రజల జీవితాలలో వికాసం సాధించకుండా తమది ఆమ్‌ ఆద్మీ పార్టీ అని చెప్పుకునే హక్కు ఏ ఒక్క పార్టీకి ఉండదు. ముఖ్యంగా సంక్షేమానికి తిలోదకాలిచ్చి జాతీయ, అంతర్జాతీయ సంపన్న వర్గాల సేవలో తరించే విధానాలకు పట్టం కడుతున్న యుపిఎ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు అసలు ఉండదు. 

దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా షెడ్యూల్డు కులాలు, తెగల (ఎస్‌సి, ఎస్‌టి) ఉప ప్రణాళికలకు చట్టబద్ధత కల్పించేందుకు నడుం బిగించిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేము. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ చొరవతో కిరణ్‌ కుమా ర్‌ రెడ్డి ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి పలుసార్లు సమావేశాలు, చర్చలూ జరిపి ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తేనుండడం అత్యంత హర్షించదగ్గ పరిణామం. ఎస్‌సి, ఎస్‌టి ఉప ప్రణాళికలకు చట్టరూపమిచ్చేం దుకు ఈ నెల 30, డిసెంబర్‌1వ తేదీలలో శాసన సభను ప్రత్యేకంగా సమావేశపరచాలని తీసుకున్న నిర్ణయమూ శ్లాఘించదగినది. ఇందుకు ముందు గా ముసాయిదాను ఆమోదించడం కోసం బుధవారంనాడు రాష్ట్ర మంత్రి వర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. శతాబ్దాల తరబడి సమాజంలో అట్టడుగున పడి ఉండి గట్టిగా నిలబడడానికి కాళ్ళ కింద నేల కూడా కరవెై ఇప్పటికీ అధ్వాన స్థితిలో కొనసాగుతున్న బహుజనులే దేశ జనాభాలో అత్యధికంగా ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే బడుగు భారతమే అసలు భారతం. దేశానికి కండ, గుండె బిసి,ఎస్‌సి, ఎస్‌టిలే. అయితే అగ్రవర్ణ పాలకవర్గం విభజించి పాలించే సూత్రానికనుగుణం గా వీరిలో కొందరిని సామాజిక చట్రం వెలుపల, మరికొందరిని లోపల ఉంచి చీల్చడం జరిగింది.

ఈకారణంగా ఎస్‌సి, ఎస్టీలు ఆర్థిక దోపిడీతో బాటు తీవ్రమైన సామాజిక న్యూనతకూ గురయ్యారు, అవుతున్నారు. ఈ దారుణాన్ని దృష్టిలో ఉంచుకునే రాజ్యాంగకర్తలు ఎస్‌సి, ఎస్‌టిలకు రాజ్యాం గంలోనే ప్రత్యేక రక్షణలు కల్పించారు. వీరి సత్వరాభ్యున్నతి కోసం సానుకూల చర్యను ఉద్దేశించారు. అదే రిజర్వేషన్ల రూపంలో వీరికి ప్రత్యేక రాజ్యాంగ కవచంగా ఏర్పడింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ఐదవ, ఆరవ షెడ్యూళ్ళు, దళితులు (ఎస్సీ), ఆదివాసీల (ఎస్టీలు)కు ప్రత్యేక రక్షణలు కల్పిస్తున్నాయి. రాజ్యాంగం 330 ఆర్టికల్‌ రిజర్వేషన్లను హామీ ఇస్తున్నది. ఈ ఏర్పాట్లేవీ ఈ వర్గాల సత్వర వికాస, అభివృద్ధులను సాధించలేకపోయాయని దళితుల వర్తమాన వాస్తవ స్థితిగతులు చాటుతున్నాయి. ఎస్‌సి, ఎస్టీయేతర గ్రామీణప్రజలలో మూడింట ఒకవంతుమం ది మాత్రమే భూమిలేని వారు కాగా దళిత గ్రామీణులలో మూడింట రెండు వంతులమంది భూమిలేని వారని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ఎస్‌సి, ఎస్‌టియేతరులలో నాలుగో వంతు మంది దినకూలీపెై ఆధారపడి బతుకుతుండగా, ఎస్‌సి, ఎస్‌టిలలో 60 శాతం మందివి రోజు కూలీ బతుకులే. 

ఈ దుస్థితి నుంచి వీరికి వీలెైనంత తొందరగా విముక్తి సాధించడానికి వీలుగా ఆరవ ప్రణాళిక (1980-85)లోనే ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రణాళికాబద్ధ ఆర్థిక ఉన్నతిని కల్పించి, సమాజంలోని ఇతర వర్గాలతో సమాన స్థాయికి వారిని ఉత్కృష్టపరచాలన్న ఆలోచన ప్రాణం పోసుకున్నది. ఫలితంగా ఈ రెండు వర్గాలకు స్పెషల్‌ కాంపొనెంట్‌ (ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక) ప్లాన్‌ను అమలులోకి తేవాలనుకున్నారు. అది చివరికి ఉపప్రణాళికల రూపుదాల్చింది. కేం ద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి రంగాలన్నింటికీ చెందిన ప్రణాళికా నిధుల నుంచి ఎస్‌సి, ఎస్‌టిల జనాభా దామాషా మేరకు నిధులను సేకరించి ఎస్‌సి,ఎస్‌టి ఉప ప్రణాళికలను అమలు పరచాలన్న సంకల్పంతో ఈ వ్యూహం బయలుదేరింది. రాష్ట్రాలలో ఎస్‌సి, ఎస్‌టి అభివృద్ధి కార్పొరేషన్లను నోడల్‌ ఏజెన్సీలుగా ఏర్పాటు చేసి ఈ నిధుల ఖర్చును పర్యవేక్షింప చేయాలని సంకల్పించారు. ఇంత మహత్తరమైన ఆలోచన ఆచరణలో నీరుగారిపోయి ఆ నిధులు హుసేన్‌ సాగర్‌ సుందరీకరణ వంటి అమాంబాపతు పనులకు కూడా మళ్ళిపోయిన బాధాకరమైన చరిత్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నది. 

రాష్ట్రాలు ఈ ఉప ప్రణాళికలను పరిపూర్ణంగా అమలు చేస్తే, ప్రోత్సాహక గ్రాంటునివ్వాలని సంకల్పం చెప్పుకున్న కేంద్రం కూడా అత్తకు చెప్పి తెడ్డు నాకిన కోడలిని తలపిస్తూ ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రణాళికా కేటాయింపులలో భారీగా తొర్ర పెట్టింది. 2001 లెక్కల ప్రకారం జనాభాలో ఎస్‌సిలు 16.6 శాతం, ఎస్‌టిలు 8.2 శాతం ఉన్నారు (రాష్ట్ర జనాభాలోనూ వీరి దామా షా ఇలాగే ఉన్నది. ప్రస్తుతం ఈ రెండు వర్గాలూ కలిసి 28 శాతంగా ఉంటారని అంచనా) . 2006-07లో కేంద్ర ప్రణాళికా కేటాయింపు 1,65,499 కోట్ల రూపాయలు కాగా, అందులో 4.25 శాతం అనగా కేవలం 7,031.86 కోట్ల రూపాయలనే దళితుల కోసం కేటాయించారు. అలాగే 2007-08లో కేవలం 6.1 శాతం, 2010- 11లో కేవలం 8.21శాతం మాత్రమే ప్రత్యేకించారు. మన రాష్ట్రంలోనెైతే గత 19 ఏళ్ళుగా 26,000 కోట్ల రూపాయల సబ్‌ ప్లాన్‌ నిధులను ప్రభుత్వాలు దారిమళ్ళించాయి, 

అందులో నుంచి 500 కోట్ల రూపాయిలు పెట్టి దళితుల కోసం సాగుకు అనువెైన భూమిని కొనుగోలు చేసి పంచాలని, మరో 500 కోట్ల రూపాయలతో కార్పస్‌ ఫండ్‌ నెలకొల్పాలని, ఎస్‌సి, ఎస్‌టి హాస్టళ్ళన్నింటినీ రెసిడెన్షియల్‌ పాఠశాలలుగా మార్చాలని, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగానిిస్తున్నట్టుగా దళితవాడలకు కూడా ఇరవెై నాలుగు గంటలూ విద్యుత్తు సరఫరా చేయాలని అందుకుగాను బకాయి నిధులలో నుంచి 100 కోట్లు తీసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ వంటి సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇక నుంచి రాష్ట్ర బడ్జెట్లలో ఎస్‌సి, ఎస్‌టి ఉపప్రణాళికలకు, వారి జనాభా దామాషా మేరకు 28000 కోట్ల రూపాయలు కేటాయించి విధిగా వారి అభ్యున్నతికే ఖర్చు చేయాలనీ కోరుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ప్రత్యేక సమావేశాలలో చట్ట రూపు ఇవ్వబోతున్న ముసాయిదాలో ఈ నిర్ణయాలు లేకపోవడం పట్ల నిరసన తెలుపుతున్నాయి.

ఈ డిమాండ్లను పట్టించుకొని అటువంటి వాటికి కార్యరూపమిచ్చినప్పుడే ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో జరుపుతున్న శాసనసభ విశేష సమావేశాలకు గాని, తీసుకురాదలచుకున్న చట్టానికి గాని సార్ధకత.దేశంలో అభ్యుదయ చట్టాలనేకం ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు ఆచరణకు నోచుకోకుండా ప్రజలకు అక్కరకు రాని చుట్టాలుగానే రుజువు చేసుకుంటున్నాయి. అందుచేతచట్టబద్ధతకల్పించడమే కాకుండా ఆ చట్టాన్ని సమగ్రంగా అమలుకు నోచుకునేలా చేయడం అవసరం. దళితులు,ఆదివాసీల ఉప ప్రణాళికలకు, వారి జనాభా దామాషా మేరకు ప్రణాళికా నిధుల కేటాయింపు జరిగేలా చూసి అవి అందుకోసమే ఖర్చు అయ్యేలా చూడడం అత్యంత ఆవశ్యకం. దళితులు, ఆదివాసీలతో బాటు వెనుకబడిన తరగతుల కోసం కూడా జనాభాలో వారి దామాషాకు అనుగుణంగా ప్రణాళిక నిధుల ను కేటాయించి వారి వికాస అభివృద్ధుల కోసం ఖర్చు చేసినప్పుడే దేశంలో, రాష్ట్రంలో సామాజిక న్యాయం కొంతమేరకైనా అమలులోకి వచ్చినట్టు కాగలదు.ఈ వర్గాల ప్రజల జీవితాలలో వికాసం సాధించకుండా తమది ఆమ్‌ ఆద్మీ పార్టీ అని చెప్పుకునే హక్కు ఏ ఒక్క పార్టీకి ఉండదు. ముఖ్యంగా సంక్షేమానికి తిలోదకాలిచ్చి జాతీయ, అంతర్జాతీయ సంపన్న వర్గాల సేవలో తరించే విధానాలకు పట్టం కడుతున్న యుపిఎ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు అసలు ఉండదు.

Surya Telugu News Paper Dated: 29/11/2012 

Tuesday, December 11, 2012

ఉపప్రణాళికః చిత్తశుద్ధి--- TA Pradeep Kumar



షెడ్యూల్డ్‌ కులాలు, తెగల అభివృద్ధి కోసం1979వ సంవత్సరంలోనే ఉపప్రణాళికను కేంద్రప్రభు త్వం రూపొందించింది. కాని యస్సీ, యస్టీల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సబ్‌ప్లాన్‌ నిధులు, విధులు నిత్యం దారి మళ్ళుతు న్నాయి. సబ్‌ప్లాన్‌ అసలు లక్ష్యం అమలు జరగటం లేదు. దేశంలోనే యస్సీ,యస్టీల కోసం రూ పొందించిన ఉపప్రణాళిక కు చట్టబద్ధత తీసుకొనివ చ్చి న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం విశేషం. 1982 నుం డి 2012 ఆర్ధిక సంవత్సరంవరకు 30,990 కోట్ల నిధులు దారిమళ్ళాయనే ఒక అంచనా వుంది. ప్రణాళికా సంఘం మార్గదర్మక సూత్రాల ప్రకారం జనాభా నిష్ప త్తిని బట్టి యస్సీ, యస్టీలకు అందవలసిన నిధులు గత 22 ఏళ్ళుగా దారి మళ్ళు తూనే ఉన్నాయి. 

మొదటినుంచి కాంగ్రెస్‌పార్టీ దళితులు, గిరిజనులను మోస గిస్తూనే వస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జనాభాలో యస్సీ,యస్టీలు 24 శాతం మం ది ఉన్నారు. 2011- 2012 ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర బడ్జెట్‌ 1,45, 000 కోట్లు. అది రేపటి ఆర్థిక సంవత్సరానికి రెట్టింపు కావచ్చు కూడా. అయితే రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లోని 25 శాతం నిధులను యస్సీ, యస్టీలకు ఎలా వినియోగిస్తార నేదే ప్రశ్న. యస్సీ, యస్టీలకు సంబంధించిన పథకాల రూపకల్పన సవ్యంగా జరగ కపోతే వారికి కేటాయించిన నిధులు ఎప్పటిలాగే మురిగిపోతాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర నరసింహ అధ్యక్ష తన సబ్‌ప్లాన్‌ కమిటీ యస్సీ,యస్టీలపై చేసిన అధ్యయనం ఎట్టకేలకు శాసనసభలో పదేళ్ళ చట్టంగా ఆమోదితమైంది. 

శాసనసభలో ఈ చట్టం ఆమోదం కోసం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి చేసిన ప్రయత్నం గొప్పది కావచ్చు. కానీ యస్సీ, యస్టీ సబ్‌ప్లాన్‌ అమలు తీరు ఎలా వుం టుందనే ప్రశ్న ప్రజలను వేధిస్తోంది. గడచిన 22 సంవత్సరాలలో దళితులకు సం బంధించిన నిధులు దారి మళ్ళిన తీరు చూస్తూనేవున్నాం. ఇది ఇలా వుంటే బాధ్య తగల మన శాసనసభ్యులు 178 మంది సబ్‌ప్లాన్‌ చట్టం తీసుకొచ్చే సమయంలో గైర్హాజరయ్యారు. కేవలం 116మంది మాత్రమే హాజరయ్యారు. దళితుల నిధుల్ని దొడ్డి దారిన పంది కొక్కుల్లా కాజేసిన పాలకులకు సక్రమంగా చట్టాన్ని అమలుచేసే చిత్తశుద్ధి ఎక్కడిది. ప్రభుత్వం దళిత గిరిజనులను అభివృద్ధి పథంలో ఏమాత్రం నడిపించగలదో వేచి చూడాలి. 

ఆరు దశాబ్దాలలో దళితులు, గిరిజనులు అభివృద్ధి చెందలేదు. రెండు గ్లాసుల పద్దతి, కుల దూషణ, కులం పేరుతో హింస, దళితుల పొలాల్ని, పంటల్ని అగ్రవర్ణ ప్రజలు ఆక్రమించుకోవడం, దేవాలయ దర్శనాలకు దళితులను నిషేధించడం నేటి సమాజంలో మామూలుగానే జరుగు తున్నాయి. కేవలం రిజర్వేషన్‌లు యిచ్చి నూటికి ఒక్కణ్ణి చూపి అభివృద్ధి అంటే యిదే అనే ధోరణిలో ప్రభుత్వం వుంది. అమానుషంగా దళితులపై జరిపిన హింసకు న్యా యం ఎక్కడ దొరుకుతుంది? 2007వ సంవత్సరంలోనే డావై.యస్‌.రాజశేఖర రెడ్డి రాష్ట్ర ముఖ్య మంత్రిగా వున్నప్పుడు దళిత, గిరిజనుల కోసం ప్రత్యేక నోడల్‌ ఏజెన్సీలను ఏర్పాటు చేసి, పొరుగు రాష్ట్రాల్లో యస్సీ, యస్టీల నిధుల వినియో గాన్ని పాటిస్తున్న విధివిధానాల్ని అధ్యయనం చేసేందుకు మన శాసనసభ్యులను పంపారు. 

యస్సీ,యస్టీ నిధులను ఏవిధంగా మన రాష్ట్రంలో వినియోగిస్తున్నారో పర్యవేక్షించేందుకు అపెక్స్‌ కమిటీని కూడా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి పాలనా అధికారాన్ని చేజిక్కించుకొన్న తరు వాత శాసన సభ్యులు యితర రాష్ట్రాల్లో జరిపిన అధ్యయనాన్ని గానీ, అపెక్స్‌ కమిటీ సిఫారసులనుగానీ పట్టించుకొన్న దాఖ లాలు లేవు. దీని ద్వారానే నోడల్‌ ఏజెన్సీ పనితీరు, ప్రభుత్వం అసలు రూపం రాష్ట్రంలోని దళితులకు తెలిసిపోయింది. చట్టం రూపంలో సబ్‌ప్లాన్‌ను రూపొం దించినా దాని పనితీరు మెరుగు పరచాల్సింది మాత్రం ప్రభుత్వం, అధికారులే. యస్సీ, యస్టీల కోసం తయారుచేసిన ఈ బిల్లుకు కాలపరిమితి విధించడం అనేది దళిత గిరిజనులను అన్యాయం చేయడమే. ఉపాధి హామీ, సమాచారహక్కు చట్టం, గృహహింస చట్టంలాంటి అనేక చట్టాలు ఈ పదేళ్ళలో వచ్చినవే. 

వాటికి ఎలాంటి కాలపరిమితి విధించ లేదు. కేవలం దళితుల్లో అవగాహన లేకపోవుట వల్లనే ఇలా చేస్తున్నారు. భవిష్యత్తులో సబ్‌ ప్లాన్‌ రద్దయినా ఆశ్చర్యం లేదు. చట్టానికి కాల పరిమితి విధించడమంటే దళితుల స్వేచ్ఛకు హద్దులు వేసినట్లే. యస్సీ, యస్టీ జనా భా ప్రాతిపదికన వారి ఆర్థిక,విద్య, జీవన ప్రమాణాల మెరుగుదలతో పాటు ఆయా వర్గాల ప్రజలకు భద్రత, సామాజిక హోదా కల్పించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దే శం. ఈ చట్టంద్వారా గొప్ప ఫలాలు సాధించవచ్చు. దళితుల భూములు వారి చేతు ల్లో లేవు. దళితుల్లో 92 శాతం మందికి భూమి లేదు. ప్రభుత్వమే దళితులకు భూమి కొనుగోలు చేసి ఇస్తే దళితులు రైతులు అయిపోయేవారు. 

వ్యవసాయ కూలీలుగా వున్న దళితులు రైతులుగా మారటమే కాదు తమ జీవన ప్రమాణాలు సైతం పెరిగే అవకాశం వుంది. వ్యవసాయ కూలీలుగా ఉన్న యస్సీలకు భూమిపై యాజ మాన్యపు హక్కులు ఏర్పడితే ముందు వారి చేతికి పాస్‌పుస్తకం అందుతుంది. అప్పుడు వారు బ్యాంకుల ద్వారా ఋణం పొందుతారు. అందుకే దళితులకు భూ పంపిణీ కార్యక్రమం అమలు చేయాలి. భూమిహక్కుని యివ్వాలి. యస్సీ, యస్టీలు చనిపోతే సమాధి చేసేందుకు శ్మశానాలు లేవు. ప్రభుత్వం పట్టుదలతో తీసుకొని వచ్చిన ఉపప్రణాళిక చట్టం 2012నందు శ్మశానాల కోసం బడ్జెట్‌ నిధులు కేటాయించాలి. 

ఆంధ్రప్రదేశ్‌ షెడ్యూల్డు కులాలు, తెగల సబ్‌ప్లాన్‌ (ఆర్థిక వనరుల ప్రణాళిక, కేటాయింపులు- వినియోగం) చట్టం 2012 లోని ముఖ్యాంశాలు. 1. సబ్‌ప్లాన్‌ పఠిష్టంగా, పారదర్మకంగా అమలుపరిచేందుకు గాను, అన్ని ప్రభు త్వ శాఖలను పటిష్టపరచాలి. ఆర్థిక శాఖలో సబ్‌ప్లాన్‌ చట్టం కోసం ఒక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. 2. యస్సీ,యస్టీలకు, యితర వర్గాల మధ్య ఉన్న అంత రాలను తగ్గించేలా ఆయా వర్గాలకు ప్రత్యక్ష, నాణ్యమయిన లబ్దిని కలిగే పధకాలను తయా రుచేయాలి. 3. యస్సీ,యస్టీలకు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, హాబిటేషన్ల వారీ గా, బడ్జెట్‌ రూపకల్పనకు 6 నెలలముందే అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిం చాలి. బాగా వెనుకబడిన యస్సీ, యస్టీ ప్రాంతాలపై దృష్టి వుంచాలి. 

వార్షిక బడ్జె ట్‌ ఆమోదం పొందిన వెంటనే వివిధ శాఖలకు సబ్‌ప్లాన్‌లలో చూపించిన నిధుల ను విడుదల చేయాలి. 4. ఈ చట్టం అమలుకుగాను సాంఘీక, గిరిజన సం క్షేమ శాఖలు నోడల్‌ శాఖలుగా వ్యవహరిస్తాయి. ఆయా శాఖల మంత్రుల అధ్య క్షతన ఉండే కమిటీలు నోడల్‌ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ ఏజెన్సీలు సబ్‌ప్లాన్‌ అమలు, పనితీరును పరిశీలించి అభివృద్ధి మండలి ఆమోదానికి పంపుతాయి. జిల్లా కలెక్టర్‌ చైర్మన్లుగా, జిల్లాస్థాయి పర్యవే క్షక కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఇవి జిల్లా ప్రణాళిక కమిటీలు అమలును సమీక్షి స్తాయి. 

ఈ చట్టం క్రింద కేటాయించే నిధుల దారి మళ్ళింపు గాని, ఖర్చుచేయని పక్షంలో మురిగిపోయేందుకు గాని అవకాశం ఉండదు. ఈ నిధులను ఖర్చు చేయ డంలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించే అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసు కొంటారు. మంచి పనితీరు కనపరచిన అధికారులకు ప్రోత్సాహకాలిస్తారు. 5. రాష్టమ్రుఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే యస్సీ,యస్టీ అభివృద్ధి మండలి ఈ చట్టం ద్వారా సంక్రమించే అధికారాలు, విధులను పర్యవేక్షిస్తుంది. ఈ మండలి ఒక సంవత్సరంలో రెండుసార్లు సమావేశం కావాలి. ఈ మండలి ఆమోదం పొం దిన తరువాతే సబ్‌ప్లాన్‌ పథకాల నిధులను గ్రాంట్స్‌ డిమాండ్స్‌లో సబ్‌ప్లాన్‌ కోసం ప్రత్యేక పద్దులలో చూపిస్తారు. 6. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో నోడల్‌ ఏజెన్సీలు సబ్‌ప్లాన్‌ అమలుతీరును పరిశీలించి అభివృద్థి మండలి ఆమోదానిి పంపుతాయి.

pradeep
అదేవిధంగా ఒక శాఖ నుండి మరో శాఖకు నిధులను బదలాయింపు చేసేందుకు ఎదురయ్యే అవరోధాలను గుర్తించి వాటిని అధిగమించే చర్యలను సిఫారసు చేస్తుంది. నోడల్‌ ఏజెన్సీలకు సహకరించేందుకు గాను ఆయా శాఖల పరిధిలో పరిపాలన,సాంకేతిక సహకార యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి శాఖలో సబ్‌ప్లాన్‌ సహకార యూనిట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దళితుల అభ్యున్నతి కోసం చట్టం రూపకల్పన ఎలా వున్నా అమలు తీరు లోప భూయిష్టంగా వుంటే దళిత, గిరిజన, బడుగు,బలహీన వర్గాల ప్రజలకు న్యాయం చేకూరదు. నాణ్యమైన పాలన అందించబడదు. చట్టం పటిష్టంగా వుండాలి. పని తీరు, అమలు గొప్పగా వుండాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు కనబడతాయి.

Surya News Paper Dated: 12/12/2012 

Thursday, December 6, 2012

Sub-Plan


Eenadu Telugu News Paper Dated: 7/12/2012

వృత్తిదారులకు ప్రత్యేక సబ్‌ప్లాన్‌ పి జమలయ్య


 (రచయిత ఎపి చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌   Wed, 5 Dec 2012, IST  

తలసరి దినసరి ఆదాయపు రాష్ట్ర సగటు రూ.27.47. తలసరి దినసరి పేదరికపు హద్దు రూ.20లు. ఈ హద్దుకు దిగువన అంటే రూ.20 కంటే తక్కువ తలసరి దినసరి ఆదాయం పొందేవారు 50 శాతం మంది ఉన్నారు. మిగిలిన 50 శాతం మందికి కూడా రూ.27కు మించి లేదు. ఈ నేపథ్యంలో చేతివృత్తులకు రక్షణ, వృత్తిదారుల సంక్షేమానికి, సామాజిక భద్రత కోసం ప్రత్యేక సబ్‌ప్లాన్‌ రూపొందించాలి.


వృత్తులకు రక్షణ కల్పించటానికి, ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధిని చూపించటానికి, వృత్తుల్లో ఉపాధి దెబ్బతినకుండానే ఆధునీకరించటానికి ఇప్పుడున్న దానికన్నా మెరుగైన జీవనం గడిపే విధంగా వృత్తిదారుల సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. వృత్తిదారుల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి వారి అభివృద్ధికి ఖర్చు చేయాలి. ఈరోజు ప్రపంచీకరణ నేపథ్యంలో చేతి వృత్తులు దెబ్బతింటున్నాయి. కొన్ని వృత్తులు కనుమరుగౌతున్నాయి. వృత్తిదారులు ఉపాధి కోల్పోయి వీధిన పడుతున్నారు. చేనేత, స్వర్ణకారుల్లో ఆకలిచావులు, ఆత్మహత్యలకు గురౌతున్నారు. కల్లుగీత గతం కంటే మరింతగా దెబ్బతిన్నది. క్షౌర, రజక లాంటి సేవా వృత్తులు యాంత్రీకరణ వల్ల ఆదాయం కోల్పోతున్నాయి. పెత్తందారుల నుంచి కుల వివక్ష, అవమానాలు, బహిష్కరణలు, దాడులు, దౌర్జన్యాలకు గురౌతున్నారు. కోస్టల్‌ కారిడార్‌ ప్రాంతాల్లో మత్స్యకారులు బలవంతంగా వృత్తి నుంచి గెంటివేయబడి నిర్వాసితులు అవుతున్నారు. మైదాన ప్రాంతాల్లో కాంట్రాక్టు వ్యవస్థ వల్ల కూడా వృత్తి దెబ్బతింటోంది. గొర్రెలు, మేకల పెంపకం వృత్తిలోకి పెట్టుబడిదారులు ప్రవేశిస్తున్నారు. పేదవారికి రుణాలు ఇవ్వకుండా అనేక ఆటంకాలు పెడుతున్నారు.


మన రాష్ట్రంలో చేతివృత్తుల వారు ప్రధానంగా వెనుకబడిన తరగతులవారే. 1986లో బిసి వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ జరిపిన సర్వే ప్రకారం దాదాపు 7.64 కోట్ల మంది రాష్ట్ర ప్రజానీకం ఉంటే, వెనుకబడిన తరగతులవారు సుమారు 2.80 కోట్ల మంది ఉన్నారు. వారిలో 1.80 కోట్ల మంది 63 రకాల వృత్తి పనులను చేస్తున్నట్టు ప్రభుత్వ సమాచారం చెబుతోంది. వీరే కాక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, ఇతర గ్రామీణ పేదలకు చెందిన ఇతర వృత్తులవారు లక్షలాది మంది ఉన్నారు. (ఉదాహరణకు చర్మకారులు, అద్దకం వంటివి) వీరందరితో కలిపి 2 కోట్ల మంది ఉంటారు. అంటే సుమారు 4వ వంతు. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా రాష్ట్ర జనాభాలో 4వ వంతు మంది వివిధ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలుస్తోంది.


చేనేత, కల్లుగీత, చేపల వేట, పశుపోషణ, పాల వ్యాపారం, కంబళ్ళ తయారీ, గొర్రెల, మేకల పెంపకం, మట్టి పని, బంగారం పని, ఇనుప పని, ఇత్తడి, శిల్పాలు చెక్కటం, వడ్రంగం, బట్టలుతకటం (లాండ్రీ), దూది వడకడం, కుండలు చేయడం, క్షౌర, మేళం, నూనె గానుగ, మాంసం అమ్మకం, బుట్టల తయారీ, చిన్న వ్యాపారాలు, (పూసలు, సూదులు), దర్జీ పని, రంగులు వేయటం, ఒగ్గు, తప్పెట గుళ్ళు, గొరవయ్యలు, మంద హెచ్చుల, పడపోత్ర, గంగిరెద్దుల మొదలగు కళాకారులున్నారు. ఒకే వృత్తిలో వివిధ కులాల వారు ఉన్నారు. ఒకే కులం వారు వివిధ వృత్తులను కూడా నిర్వహిస్తున్నారు.


విస్తరిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ ఒకవైపు, మరోవైపు కొనసా గుతున్న ఫ్యూడల్‌ వ్యవస్థల ఫలితంగా మనదేశంలో చేతివృత్తిదారుల బ్రతుకులు నానాటికీ కునారిల్లి పోతున్నాయి. పెట్టుబడిదారీ విధానంలో లాభాలే ప్రధానం. ఏది లాభసాటిగా ఉంటే దాన్నే చేపడతారు. ఫలితంగా చేతి వృత్తులకు ఏవిధంగానూ రక్షణ లేకుండా పోయింది. పేదలకు జీవనాధారంగా ఉన్న చేతి వృత్తుల రంగాలలోకి దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు ప్రవే శిస్తున్నారు. చేతివృత్తులపై ఆధార పడి జీవిస్తున్న లక్షలాది కుటుం బాలు తమ ఉపాధి కోల్పోయి వీధుల్లోకి నెట్టబడు తున్నారు. ఈ వృత్తిదారుల రక్షణ బాధ్యత లేదన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. మరోవైపు గ్రామాల్లో భూస్వామ్య విధానం నాశనం కాకపోవటంతో కుల వివక్షకు, అవమానాలకు, దాడులకు, దౌర్జన్యాలకు చేతివృత్తుల వారు గురవుతున్నారు. వారు భూస్వాముల చెప్పుచేతల్లో బ్రతకవలసి వస్తోంది. సామాజిక న్యాయ సాధన కోసం అంటూ ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు నూతన ఆర్థిక విధానాల అమలుతో గాలిలో పేల పిండిలా కొట్టుకుపోయాయి. ప్రభుత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్థలలో నియామకాలపై విధించిన నిషేధం ఈ వర్గాల నుంచి వచ్చిన యువతీయువకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తల్లిదండ్రులకు భారమై నిరాశా నిస్పృహల మధ్య అసహనంతో వారు జీవిస్తున్నారు.


ప్రభుత్వ దోపిడీ విధానాల వల్ల ఇప్పటికే కేవలం వృత్తినే నమ్ముకొని జీవించేవారు అనేక మంది ఆ వృత్తిలోనే కూలీలుగా మారుతున్నారు. ఈ వృత్తుల ఉత్పత్తుల ద్వారా మార్కెట్‌లోకి ప్రవేశించి యజమానులుగా మారడం లేదా ఈ వృత్తులతో సంబంధం లేకపోయినా పెట్టుబడిపెట్టి, పరికరాలు అద్దెకిచ్చి పని చేయించేవారు పుట్టుకొచ్చారు. కాంట్రాక్టు పద్ధతి, పీస్‌ పద్ధతి రంగంలోకి వచ్చింది. ఏడాది పొడుగునా పని లేకపోవడం, చాలీచాలని వేతనాలు, ధరల పెరుగుదల, వీటిన్నింటితో పస్తులు నిత్యకృత్య మయ్యాయి. పనులు కోల్పోయి రోడ్డున పడి వేరే వృత్తులకు పోదామన్నా అక్కడ కూడా ఉపాధి అవకాశాలు మృగ్యమౌతున్నాయి.


తలసరి దినసరి ఆదాయపు రాష్ట్ర సగటు రూ.27.47. తలసరి దినసరి పేదరికపు హద్దు రూ.20లు. ఈ హద్దుకు దిగువన అంటే రూ.20 కంటే తక్కువ తలసరి దినసరి ఆదాయం పొందేవారు 50 శాతం మంది ఉన్నారు. మిగిలిన 50 శాతం మందికి కూడా రూ.27కు మించి లేదు. ఈ నేపథ్యంలో చేతివృత్తులకు రక్షణ, వృత్తిదారుల సంక్షేమానికి, సామాజిక భద్రత కోసం ప్రత్యేక సబ్‌ప్లాన్‌ రూపొందించాలి.


వృత్తిదారుల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించి, సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం కొనసాగుతున్న వృత్తులకు దేశీయ, విదేశీ పరిశ్రమల ఉత్పత్తుల నుంచి రక్షణ కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రభుత్వ విధానాల వలన ఉపాధి కోల్పోయినవారికి ప్రత్యేక శిక్షణనిచ్చి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వాగ్దానాలు చేసినప్పటికీ అమలుకు నోచుకోలేదు. ఉపాధి దెబ్బతినకుండా సాంకేతిక పరిజ్ఞానం అందించి ఉపాధిని నిలబెట్టి ఆదుకోవాలి. వృత్తుల నిర్వహణకు అవసరమైన ముడిసరుకులు, పరపతి, భూమి, నీరు, రోడ్లు మొదలగు మౌలిక సదుపాయాలు కల్పించాలి. వృత్తుల ఉత్పత్తులకు మార్కెట్‌ సౌకర్యం, గిట్టుబాటు ధర, సేవా వృత్తులకు చేసిన శ్రమకు తగిన ప్రతిఫలం అందించాలి. సహకార రంగాన్ని సమర్థవంతంగా నడపాలి. వారందరినీ సహకార రంగంలోకి తెచ్చి ఉపాధి భద్రత కల్పించాలి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అత్యవసర సహాయాన్ని అందించి, శాశ్వత నివారణా చర్యలు చేపట్టాలి. వృత్తిదారులందరికీ ఆర్థిక సహకారం అందించడానికి చేతివృత్తిదారుల బ్యాంకును ఏర్పాటు చేయాలి. వారికి ఫించన్లు, ఎక్స్‌గ్రేషియో, బీమా, వికలాంగుల సహాయం మొదలగు వాటికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. వృత్తిదారులపై జరుగుతున్న కుల వివక్ష, దాడులు, దౌర్జన్యాలను అరికట్టడానికి ప్రత్యేక సామాజిక రక్షణ చట్టం రావాలి. బాధితులను ఆదుకోవడానికి స్పెషల్‌ కాంపోనెట్‌ను ఏర్పాటు చేయాలి. బాలబాలికలందరికీ ప్రత్యేక ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసి నర్సరీ నుంచి పిజి వరకూ ఉచిత విద్యను అందించాలి. ప్రతి కుటుంబానికీ ఇంటి స్థలం ఇచ్చి, ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి. అవసరమైన దగ్గర హౌస్‌ కమ్‌ వర్క్‌ షెడ్‌ ఏర్పాటు చేయాలి. వృత్తిదారుల పేటలు, పల్లెల అభివృద్ధికి డ్రైనేజీ, రోడ్లు, మంచినీటి సౌకర్యం, విద్యుత్‌, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. వృత్తిదారులు నివసిస్తున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హాలు, ప్రాథమిక వైద్యశాలలు, పాఠశాలలు, గ్రంథాలయాలు ఏర్పాటుచేయాలి. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు ప్రకారం ప్రతి కుటుంబానికీ మూడెకరాల భూమి ఇవ్వాలి. వృత్తిదారుల మహిళలకు ఆరోగ్య భీమా, ప్రసూతి వైద్య ఖర్చులు, ప్రసూతి సమయాల్లో ఉపాధి భృతి, తల్లితో పాటు పిల్లలకు పౌష్ఠికాహారం అందించే కేంద్రాలను స్థాపించాలి. వృత్తి కళాకారులకు సాంస్కృతిక సంక్షేమ బోర్డును ఏర్పాటుచేసి కళల పరిరక్షణ, ఉపాధి గ్యారంటీ, గుర్తింపు కార్డులు, ప్రోత్సాహక అవార్డులు, ప్రదర్శనలకు అవసరమైన శిక్షణ, దుస్తులు, పరికరాలు ఇవ్వాలి. ఉచిత రైలు, బస్సు సౌకర్యం కల్పించాలి.


పి జమలయ్య
(రచయిత ఎపి చేతి వృత్తిదారుల సమన్వయ
కమిటీ రాష్ట్ర కన్వీనర్‌) 
-పి జమలయ్య (రచయిత ఎపి చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌

Prajashakti Telugu News Paper Dated: 5/12/2012

Tuesday, December 4, 2012

సంపాదకీయం 'ఉప' విజయం



దళిత, ఆదివాసీ ప్రజల అభివృద్ధికి ఉద్దేశించిన ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్) బిల్లుకు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఉప ప్రణాళిక, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లు-2012'కు రాజకీయ పక్షాలన్నీ మద్దతు ఇచ్చాయి. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య బిల్లుకు ఆమోదం లభించినప్పటికీ మొత్తం మీద ఆహ్వానించదగిన చట్టం ఇది. ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు ప్రత్యేకంగా మూడు రోజులు సమావేశమైన శాసనసభ ఉత్కంఠభరితంగా ముగిసింది. సబ్ ప్లాన్‌లో 'ఏబీసీడీ' వర్గీకరణకు అనుగుణంగా నిధులు కేటాయించాలంటూ బిల్లుకు తెలుగుదేశం సవరణను ప్రతిపాదించింది. ఈ సవరణ ప్రతిపాదనను కాంగ్రెసేతర ప్రతిపక్షాలన్నీ సమర్థించడంతో ఓటింగ్‌కు దారితీసింది. చివరికి ఓటింగ్‌లో 22 మంది సభ్యుల మెజారిటీతో ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం తిరస్కరించింది. రాష్ట్ర సర్కారు ఈ ఉప ప్రణాళిక చట్టాన్ని చారిత్రాత్మకమైనదిగా అభివర్ణిస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు, వివిధ ప్రజాసంఘాలు సర్కారు వైఖరిని తప్పుబట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు అసమగ్రమైనదిగా విపక్షాలు విమర్శిస్తూ దాదాపు 42 సవరణ ప్రతిపాదనలు చేశాయి. అయితే ప్రతిపక్షాల సవరణలన్నీ మూజువాణి పద్ధతిలో తిరస్కారానికి గురయ్యాయి.

బిల్లులోని కొన్ని క్లాజులపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. సబ్ ప్లాన్‌పై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం చేసిన అనేక సిఫార్సులు బిల్లులో చోటుచేసుకోకపోవడాన్ని తప్పు పట్టాయి. సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల్లోని వెనుకబడిన వర్గాలను గుర్తించి వారికి ప్రాధాన్యమిచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సూచిస్తున్న బిల్లులోని రెండవ అధ్యాయంలోని ఆరవ క్లాజును ఎస్సీ వర్గీకరణ ప్రాతిపదికగా సవరించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. తెలుగుదేశం పార్టీ తాను వర్గీకరణకు అనుకూలమన్న సంకేతాలిచ్చేందుకు ఈ సందర్భం ఉపయోగపడింది. వైఎస్ఆర్‌సీపీ ఈ అంశంపై తెలుగుదేశాన్ని సమర్థించడంతో ఆ పార్టీని ఇరకాటంలో పడేసింది. సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తున్న సభ గతంలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపాధి, విద్యావకాశాల్లో వర్గీకరణను కోరుతూ మరోసారి తీర్మానిస్తూ, సబ్‌ప్లాన్‌కు కూడా దాన్ని వర్తించే విధంగా రాజ్యాంగ బద్ధమైన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీని కోరి ఉంటే బావుండేది.

'జనాభా నిష్పత్తికి తగ్గకుండా నిధులు కేటాయించా'లన్న ఉప సంఘం సిఫార్సులను విస్మరించి ఎస్సీ జనాభా ప్రాతిపదిక ప్రకారం నిధులు కేటాయించాలని 12వ క్లాజులో ప్రభుత్వం పొందుపరచడం వివాదాస్పదమైంది. దీనివల్ల ఖర్చు చేయకుండా మురిగిపోయిన నిధులను ఆ తర్వాతి సంవత్సరం బడ్జెట్‌లో కలపాలంటే జనాభా పరిమితి అడ్డంకిగా నిలుస్తుంది. దాంతో ఇప్పటివరకు దారి మళ్ళిన దాదాపు 25 వేల కోట్ల రూపాయల నిధులు అందని ద్రాక్షగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. దానికి తోడు బిల్లులో సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయని అధికారులపై చట్టపరమైన చర్యల ప్రస్తావన లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి రానున్న సబ్ ప్లాన్ చట్టం వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాల పోరాట స్ఫూర్తిని ప్రతిఫలించలేదు.

మూడు దశాబ్దాల క్రితమే ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్, ట్రైబల్ సబ్‌ప్లాన్‌ల రూపకల్పనకు కేంద్రం నిర్ణయించింది. బడ్జెట్ ద్వారా బడుగుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన అభివృద్ధి కోసం, వారి పని పరిస్థితులు, జీవన ప్రమాణాల మెరుగుదల కోసం 1979లో సబ్‌ప్లాన్ వ్యూహాన్ని రూపొందించింది. జనాభా దామాషాను బట్టి షెడ్యూల్డ్ కులాలకు 16.2 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 6.6 శాతం నిధుల్ని ప్రణాళిక బడ్జెట్‌లో కేటాయించవలసి ఉన్నది. బడ్జెట్‌లో ఎస్‌సి, ఎస్‌టిలకు 23 శాతం ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ వ్యయం ఎన్నడూ 8 శాతానికి మించనే లేదు. మన రాష్ట్రంలో 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నోడల్ ఏజెన్సీలను నియమించి నిధులు కేటాయించినా నామమాత్రంగా కూడా ఖర్చు చేయలేదు. పులివెందుల అభివృద్ధికి, జలయజ్ఞం, ఔటర్ రింగ్ రోడ్డు, హుస్సేన్‌సాగర్ ఆ«ధునికీకరణకు ఆ నిధులను మళ్ళించారు. సబ్ ప్లాన్ కేటాయింపులు లేకపోవడమో, ఖర్చు చేయకపోడమో మాత్రమే కాదు సార్వజనీన కార్యక్రమాలకు చేసిన వ్యయంలో కొంత భాగాన్ని సబ్‌ప్లాన్ ఖర్చుగా చూపిస్తున్నారు. రహదారులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు వంటి వాటి ఖర్చు కూడా సబ్‌ప్లాన్‌లో చూపిస్తున్నారు. సబ్ ప్లాన్ నిధులను ఇతరత్రా అవసరాలకు మళ్ళించకుండా కనీసం వైద్యం కోసమైనా ఖర్చు చేసి ఉంటే వందలాది ఆదివాసులు బతికి ఉండేవారు.

గడచిన ఐదేళ్ళలో మన రాష్ట్రంలో సబ్ ప్లాన్ నిధులు 65 శాతం మాత్రమే వినియోగంలోకి వచ్చాయి. అదే మహారాష్ట్రలో 105 శాతం, గుజరాత్‌లో నూరు శాతం, తమిళనాడులో 90 శాతం పైగా సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేశారు. రాష్ట్ర పాలకుల్లో రాజకీయ దృష్టి, ప్రజా ఉద్యమాల తనిఖీలేని కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. అంబేద్కర్ చెప్పినట్టుగా సామాజిక నియోజకవర్గాలను ఏర్పాటు చేసి ఉంటే భిన్నమైన పరిస్థితికి అవకాశం ఉండేది. పదేళ్ళ కాలపరిమితి, అంబుడ్స్‌మెన్ వ్యవస్థ లేకపోవడం, నామమాత్రమైన నోడల్ ఏజెన్సీల ఏర్పాటు వంటి లొసుగులు ఎన్ని ఉన్నప్పటికీ సబ్ ప్లాన్ చట్టం సాధించడం అన్నది నిస్సందేహంగా ఒక ముందడుగే. దళితులు, ఆదివాసీ హక్కుల చట్టాలకు పట్టిన గతే ఈ చట్టానికి కూడా పట్టకుండా ఉండేలా అప్రమత్తంగా ఉండాలి.

Andhra Jyothi News Paper Dated: 4/12/2o12