Friday, September 30, 2011

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌ By కొడిచర్ల వెంకటయ్య Surya News Paper 1/10/2011


కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్‌
hyd
ప్రజాస్వామ్యంలో పౌరులే నిర్ణేతలు. పాలకులు ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడినప్పుడు ప్రజలు తమ వ్యతిరేకతను బంద్‌లు, హర్తాళ్ళు, ధర్నాల ద్వారా తెలియజేస్తూ పాలకులకు తమ ఆకాంక్షలను గుర్తెరిగిస్తారు. ప్రజా పాలనకు వ్యతిరేకంగా నిర్వహించే నిరసనల కారణంగా పౌర సమాజానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరసనకారులు కార్యాచరణను రూపొందిస్తారు. ప్రజల కోసం చేసే ఎలాంటి కార్యక్రమం అయినా, అదే ప్రజలకు హాని కలుగకూడదు.


స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ సైతం పర దేశీయులపై శాంతియుతంగానే యుద్ధం ప్రకటించారు. రెండు వందల సంవత్సరాలకు పైబడి దేశాన్ని ఏలుతూ, రవి అస్తమించని బ్రిటిష్‌ తెల్ల దొరల సామ్రాజ్యాన్ని దేశం నుంచి పారద్రోలడానికి గాంధీ ఎంచుకొన్న మార్గం అహింస! దేశ ఔన్నత్యాన్ని, త్యాగ నిరతిని, సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుతూనే పౌరుషాన్ని, వీరత్వాన్ని సైతం శాంతి మార్గం ద్వారానే ఉద్యమాలకు మళ్ళించి దేశ ప్రజలను ఒక్కతాటిపై ఆయన నిలబెట్టాడు. అందుకే గాంధీ కాస్తా మహాత్మా గాంధీ అయ్యాడు. భారత దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చిన సుమారు 398 రోజుల తర్వాత, నిజాం ప్రాంతంలో 1946నుంచి జరుగుతున్న తెలంగాణ సాయుధ భూపోరాటం ఒకవైపు, దేశ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభభాయ్‌ పటేల్‌ ఒత్తిడి మరో వైపు నిజాం నవాబును తల దించుకునేలా చేశాయి. ఫలితంగా 1948 సెప్టెంబర్‌ 17 న నిజాం నిరంకుశ పాలన అంతమైంది. భారత దేశంలో నిజాం ప్రాంతం విలీనమైంది.

1952లో తెలుగు భాష మాట్లాడేవారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలని, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావాలని ఉద్యమించిన పొట్టి శ్రీరాములు ఆ కాంక్షను నెరవేరుస్తూ 1953 అక్టోబర్‌ 1న దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కేంద్ర ప్రభుత్వ అంగీకారం, 1956 నవంబర్‌ ఒకటిన తెలుగువారి స్వప్నం ఆంధ్రప్రదేశ్‌ అవతరణ. నిజాం నవాబును రాజప్రముఖ్‌ పదవినుంచి తొలగించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తొలి గవర్నర్‌గా త్రివేది నియామకం జరిగింది. కానీ అప్పటివరకు ఆంధ్ర ప్రాంతాలుగా ఉన్న సిరోంచ, బస్తర్‌, కోరాపుట్‌, మరాట్వాడా, ఔరంగాబాద్‌, ఫర్‌బనీ, నాందేడ్‌, గుల్బర్గా, గంజాం, బళ్ళారి, రాయచూర్‌, ధర్మపురి మొదలైన ప్రాంతాలను మధ్యప్రదేశ్‌, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్టల్రలో కలిపారు.

అంతకు ముందు 1955 ఆగస్టు 7న విశాలాంధ్ర కోసం హైదరాబాద్‌ మేయర్‌ నాయకత్వంలో హైదరాబాద్‌నుంచి స్థానిక ప్రతినిధులు కర్నూలు, గుంటూరు, విజయవాడలలో పర్యటించి విశాలాంధ్ర కోసం జనం సమష్ఠిగా పోరాడాలని పిలుపునిచ్చారు. 1955 నవంబర్‌ 12న విశాలాంధ్ర కోసం రెండు ముఖ్యమైన సమావేశాలు జరిగాయి. చారిత్రాత్మకంగా 1955 నవంబర్‌ 24న చార్మినార్‌ వద్ద జరిగిన సభకు రావి నారాయణరెడ్డి అధ్యక్షత వహించగా కాళోజీ నారాయణరావు ప్రారంభోపన్యాసం చేశారు. ఆ సభలో 500 మందికి పెగా ప్రతినిధులు విశాలాంధ్రకోసం ప్రతిన చేశారు. 1955 నవంబర్‌ 22న శాసన సభలో చర్చ అనంతరం జరిగిన ఓటింగ్‌లో 103 మంది విశాలాంధ్రకు అనుకూలంగా ఓట్లు వేయగా, 29 మంది మాత్రమే వ్యతిరేకించారు.

1949 డిసెంబర్‌ 1న తాత్కాలిక ముఖ్యమంత్రిగా వెల్లోడి నియామకం జరిగింది. ఆ సమయంలో కొంతమంది మద్రాస్‌ వారిని పదవులలో నియమించగా వారికి వ్యతిరేకంగా 1952లో ఇడ్లీ, సాంబార్‌ గోబ్యాక్‌ అంటూ చిన్నపాటి ఉద్యమాన్ని నడిపారు. 1952 ఎన్నికల్లో తెలంగాణలోని 98 శాసన సభ స్థానాలలో కేవలం 42 స్థానాల్లో పోటీ చేసిన వామపక్ష కూటమి 36 స్థానాల్లో నెగ్గింది. మరో 10 స్థానాల్లో వారు బలపరచిన అభ్యర్ధులు గెలిచారు. కాంగ్రెస్‌ 98 స్థానాల్లో పోటీ చేసి 41 స్థానాల్లో గెలిచింది (ఇవి కూడా పిడిఎఫ్‌ పోటీ చేయని స్థానాలు). రావి నారాయణ రెడ్డి ఈ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు సాధించి దేశంలోనే రికార్డు నెలకొల్పారు. ఈ ఎన్నికల్లో గెలిచిన కొండా వెంకట రంగా రెడ్డి ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడగా, సౌమ్యుడైన బూర్గుల రామకృష్ణ రావును ముఖ్యమంత్రిని చేశారు. నాడు ముఖ్యమంత్రి పీఠం దక్కలేదన్న దుగ్ధతో కొండా వెంకటరెడ్డి క్రమంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీర్చి దిద్దే ప్రయత్నం చేశారు. దొరల, పటేళ్ళ స్వార్ధ బుద్ధితో సంకుచిత ధోరణితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం నిరుద్యోగ రాజకీయ నాయకులకు ఉపాధిగా మారుతూ వస్తోంది.

1956 ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంగా 10 సూత్రాలతో పెద్దమనుషుల ఒప్పందం చేసుకున్నారు. అందులో ఉర్దూ భాష ప్రాధాన్యతను, ముల్కీ నిబంధనలను, కేంద్ర వ్యయం, పాలనా వ్యయాన్ని దామాషా పద్ధతి ప్రకారం ఖర్చు చేయాలనీ, తెలంగాణలో మిగిలిన రెవెన్యూను తెలంగాణలోనే ఖర్చు చేయాలనీ, అధికారాలతో కూడిన ప్రాంతీయ అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయాలనీ, మంత్రి వర్గంలో 60:40గా ఉండాలని, ఒక ప్రాంతంలో ముఖ్యమంత్రి ఉంటే, మరో ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి ఉండాలనీ ఒప్పందంలో రాసుకున్నారు. కానీ ఆ తర్వాత చేసుకున్న బాసలను మరచారు. 1957లో తెలంగాణ ప్రాంత శాసన సభ్యుల పదవీకాలం ముగియడంతో కేవలం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ఎన్నికలు జరిగాయి. తెలంగాణ ప్రాంతంనుంచి ఎన్నికల్లో పాల్గొంటున్న నాటి నాయకులు కానీ, ప్రత్యేక తెలంగాణ వాదానికి పునాదివేసిన కొండా వెంకట రంగారెడ్డి కానీ నాటి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఆనాడే ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదా?

నిజాం పాలనలో విద్య విషయంలో తెలంగాణ ఎంతో వెనుకబడి ఉంది. ఆ రోజుల్లో ఉర్దూ ప్రాధాన్యతా పాఠశాలలు మాత్రమే ఉండడం ఒకటైతే, తెలంగాణ ప్రాంతంలోని దొరలు బీసీ, ఎస్సీ, ఎస్టీలను పాఠశాలలకు దూరంగా ఉంచారు. ఉపాధ్యాయులను, వైద్యులను అవసరార్ధం (ముల్కీ నిబంధనలు అమలులో ఉన్నప్పటికీ) అనేక వేల మందిని హెచ్చు జీతాలు ఆశచూపి ఇతర ప్రాంతాలనుంచి పిలిపించి స్థానిక జిల్లా, సమితి అధ్యక్షులు భర్తీ చేశారు. నిజాం పాలనలోనే వాణిజ్య వ్యవసాయ సాగుకోసం సీమాంధ్రులనుంచి ఎందరో వ్యవసాయ దారులను, రైతులను తెలంగాణకు రప్పించారు. ఆ క్రమంలో వచ్చినవారే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పూర్వీకులు.
కాలక్రమేణా తెలంగాణలో విద్యార్థులు పెరిగి ఉద్యోగార్ధమై వచ్చేటప్పటికీ చలా వరకు ఉద్యోగాలు అప్పటికే భర్తీ అయ్యేవి. ఈ కారణంగా 1968 అక్టోబర్‌ 10న తెలంగాణ పరిరక్షణ దినాన్ని పాటించారు. కాలక్రమేణా పాల్వంచ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో తెలంగాణ ప్రాంతీయులకు ఉద్యోగాలివ్వాలనే డిమాండ్‌ మొదలైంది.

అనంతరం 1969 జనవరిలో ఖమ్మంలో రవీంద్రనాధ్‌ చేపట్టిన నిరాహార దీక్షతో ఉద్యమం మొదలైంది. 1969 జనవరి 20నుంచి జరిగిన ఆందోళన హింసాయుతంగా మారింది. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ పోరాటానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి యూనియన్‌ జనరల్‌ సెక్రెటరీ మల్లికార్జున్‌ నేతృత్వం వహించారు. అదే సంవత్సరం జనవరి 24న సదాశివ పేటలో జరిగిన కాల్పులకు నిరసనగా గాంధీ వైద్య కళాశాలలో శంకర్‌ అనే విద్యార్థి చనిపోయాడు. అది తెలంగాణ సాధనలో మొదటి బలిదానంగా చరిత్రలో నిలచిపోయింది.

1967లో జరిగిన ఎన్నికల్లో కొండా వెంకట రంగారెడ్డి మేనల్లుడు డా మర్రి చెన్నారెడ్డి హింస, మతవాదం, అధిక ఎన్నికల వ్యయం కారణాలవల్ల హైకోర్టు, సుప్రీం కోర్టులు 6 సంవత్సరాల ఎన్నికల బహిష్కరణ విధించడంతో మంత్రి పదవి కోల్పోయి ఖాళీగా ఉన్న సమయంలోనే అప్పుడే అంకురార్పణ జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ వాదానికి మద్దతు పలికి తెలంగాణ ప్రజాసమితిని స్థాపించారు. అనంతరం సాగిన తెలంగాణ ఉద్యమంలో ఎందరో బలిపశువులయ్యారు. దాదాపు 369 మంది విద్యార్ధులు ప్రాణాలర్పించారు. 1971లో ఆయన తన తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్‌లో కలిపారు. అనంతర కాలంలో ఇంద్రారెడ్డి, జానారెడ్డి, చిన్నారెడ్డి మొదలైనవారు ప్రత్యేక తెలంగాణకోసం నినదించినా ప్రజలు అంతగా ఆదరించలేదు. 1999లో కేంద్రంలో వాజ్‌పేయి నాయకత్వంలో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో ఉత్తరాఖండ్‌, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ అప్పటికే ప్రతిపక్షంలో ఉండి, తెలంగాణ కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీని ఏర్పాటు చేసుకుంది. దీనికి అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ రాజశేఖర రెడ్డి దర్శకత్వం వహించగా, సోనియా గాంధీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

అప్పుడు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీలో తెలంగాణ ప్రాంతం నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి మరణం అనంతరం కీలక వ్యక్తిగా ఎదిగిన ఆనాటి శాసన సభ డిప్యూటీ స్పీకర్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తనకు కేబినెట్‌లో మంత్రి పదవి రాలేదనే దుగ్ధతో ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని భుజానికికెత్తుకున్నారు. ఈ క్రమంలో 2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రకటించిన అనంతరం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఆ పార్టీ బోణీ చేయడం ప్రారంభించింది. అనంతరం పెద్దగా ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమాలు చేసిన దాఖలాలు లేకున్నా సీమాంధ్రుల మీడియా టీఆర్‌ఎస్‌కు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని 46 సీట్లలో పోటీచేసి 26 సీట్లలో టీఆర్‌ఎస్‌ గెలిచింది. అనంతరం 10 మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌ను వదలి కాంగ్రెస్‌లో చేరారు. మిగిలిన 16 మందిని రాజీనామా చేయించిన అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 8, టీడీపీ 3, కాంగ్రెస్‌ 5 సీట్లలో గెలుపొందాయి. 2009 ఎన్నికల అనంతరం వైఎస్‌ఆర్‌ మరణంతో కేసీఆర్‌ మరోసారి ఉద్యమాన్ని తెరపైకి తెచ్చే యత్నంలో ఖమ్మంలో చేపట్టిన దీక్ష, విరమణలను మీడియా పెద్ద ఎత్తున ప్రసారం చేయడంతో ప్రజల్లో నిరసన బయలుదేరడం, శ్రీకాంతాచారి మరణం, చిదంబరం ప్రకటనలు, శ్రీకృష్ణ కమిటీ నివేదికలు ఒకదానికొకటి ముడిపడిన సంఘటనలు మన ముందున్నవే.

1956 నుంచి తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నదనేది ఉద్యమకారుల ఆరోపణ. అందుకు అప్పటినుంచి ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుల ప్రమేయం లేదంటారా? తెలంగాణ అభివృద్ధి కాకపోవడానికి సీమాంధ్రులే కారణమవుతే, అప్పటినుంచి ఇప్పటివరకూ ఎన్నికవుతున్న తెలంగాణ ప్రాంత నేతల తాతలు, తండ్రులు, కుమారుల తప్పు లేదంటారా? ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా, ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులే రేపటి తెలంగాణలో సైతం ప్రజాప్రతినిధులనే విషయం ఒప్పుకోక తప్పదు కదా! బంద్‌లు కారణంగా, రోజు కూలీలుగా బతికే నల్లగొండ, పాలమూరు, మెదక్‌, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలనుంచి వచ్చినవారి కష్టాల మాటేమిటి? ఢిల్లీ ఎపీ భవన్‌లో చావబాదిన దళిత సోదరుడి ఘోష ఎవరికైనా పట్టిందా?
65 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో 14 కొత్త రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి.

వాటిలో పంజాబ్‌- హర్యానా విషయంలో రాష్ట్ర రాజధాని చంఢీగఢ్‌ను మాత్రం ఉమ్మడి రాజధానిగా చేస్తూనే 141 చ.కి.మీ. విస్తీర్ణంతో కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించారు. 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి ఏకైక పరిష్కార మార్గం హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం (20 సంవత్సరాల వరకు), హైదరాబాద్‌ను 10 సంవత్సరాల వరకు ఉమ్మడి రాజధానిగా ఉంచడం. ఇందుకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమిస్తున్న పెద్దలు కొంత పట్టు విడుపులకు దిగుతేనే సమస్య పరిష్కారం అవుతుందితప్ప, నేను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అనడం మాదిరిగానే ఉంటుంది. 
కొడిచర్ల వెంకటయ్య

తెంచితేనే మంచిది By - నారదాసు లక్ష్మణ్‌రావు Andhra Jyothi 1/10/2011


తెంచితేనే మంచిది

శాంతియతు ఉద్యమాలకు తలదించరా? బలప్రయోగాలకే తలొగ్గుతారా? గుండెలు మండుతున్నాయ్. యావత్ తెలంగాణ రావణ కాష్టంలా మండుతున్నది. మా సకల జనుల సమ్మెను విరమించి, మరో పదునైన పోరాటరూపానికి సిద్ధమవక ముందే, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నాం.

అడుక్కుంటే ఇచ్చేది బిచ్చం-లాక్కుంటే వచ్చేవి హక్కులు - డాక్టర్ అంబేద్కర్
తెలంగాణ ఉద్యమం ఇవాళ అనేక అస్తిత్వ పోరాటాలకు కొత్త చూపు. తమ హక్కును సాధించుకోవడానికి సకల జనులను సమ్మిళితం చేసిన సరికొత్త పోరాట రూపు. జై తెలంగాణ అనే ఒకే ఒక్క నినాదం నాలుగున్నర కోట్ల ప్రజలను ఏకం చేసి పోరాట శక్తిగా మలచిన తారక మంత్రం. స్వాతంత్య్రోద్యమం తరువాత ఆత్మగౌరవం, స్వయం పాలన కోసం తెలంగాణ చేస్తున్న మహా సంగ్రామం ఓ అత్యున్నత చైతన్య స్ఫూర్తి.

ఆకాంక్షల వ్యక్తీకరణ, నిరసనలు, నిరాహార దీక్ష ల నుంచి 'సకలజనుల సమ్మె' ద్వారా పదునెక్కిన ఉద్యమం రేపటి ప్రత్యక్ష పోరు వైపుకు పరుగులు తీస్తున్న చారిత్రక సందర్భం. త్యాగాల బాటలో విద్యార్థులు, ప్రజలు ఒక వైపు, ద్రోహాల త్రోవలో రాజకీయ నేతలు మరోవైపు నిలబడి ఉద్యమ చారిత్రక నేపథ్యంలో ఎవరు ఎటువైపో స్పష్టమైన విభజన రేఖ గీయబడిన పరిస్థితిని మనం చూస్తున్నాం.

సకల జనుల సమ్మెను ఒకసారి పరిశీలిస్తే, ఎవరి పాత్ర ఎలాంటిదో స్పష్టంగా తెలిసిపోతుంది. ఒకటో తారీఖున జీతాలు వస్తేనే కానీ కుటుంబం నడవని పరిస్థితి ఉద్యోగులు, కార్మికులది. సమ్మె కాలంలో జీతాలు చెల్లించకపోతే తమ కుటుంబం అస్థిరతకు లోనవుతాయని తెలిసినా, ప్రభుత్వం తీసుకోబోయే కక్షసాధింపు చర్యలకు బలి కావలసి వస్తుందని తెలిసినా, ఏడికైతే గాడికాయె తెలంగాణ వచ్చే దాకా తెగించి కొట్లాడుతామని ఉద్యమ చైతన్యంతో ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు.

దసరా పండుగ వస్తే, సింగరేణి సంబరాల జాతర అవుతుంది. ఉద్యమం కోసం ఆ సంబరాలను త్యాగం చేస్తే మళ్లీ వచ్చే దసరాను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటామంటూ తెగువతో, ఎందరు పోలీసులను మొహరించినా, ఎన్ని బెదిరింపులకు గురిచేసినా బొగ్గు పెల్ల పెకిలించక ఉద్యమానికి ఊపిరందిస్తున్నారు సింగరేణి కార్మికులు. ఆర్టీసీ, వివిధ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులు, అప్రెంటీస్ ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలు పోతాయని బెదిరించినా, తమకు తాము ఉద్యోగాల కంటే ముఖ్యమైనది తెలంగాణ సాధనే అనే మొక్కవోని ధైర్యంతో సమ్మెలో కొనసాగుతున్నారు.

దసరా సెలవులకు ముందురోజు పాఠశాలల్లో చేరకుంటే సెలవులన్నీ జీత నష్టపు సెలవులుగా మారతాయని తెలిసినా ఒక్క ఉపాధ్యాయుడు కూడా విధుల్లో చేరక ఆర్థిక ప్రయోజనాల కంటే ఆత్మ గౌరవమే తమకు ముఖ్యమని ఉడుంపట్టుతో ఉపాధ్యాయులు సమ్మెలో భాగస్వాములవుతున్నారు. ఐఐటి, ఏ.ఐ.ట్రిపుల్ఇ. లాంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో తమ బిడ్డలు వెనకబడే ప్రమాదముందని తెలిసినా, పిల్లలు కాలేజీలకు వెళ్ళకున్నా, తమ పిల్లల ప్రయోజనాలకంటే, తెలంగాణ సకల జనుల ప్రయోజనాలు ముఖ్యమని ప్రకటిస్తూ తల్లితండ్రులు ఉద్యమానికి కొండంత అండగా నిలుస్తున్నారు. ఎస్మా, జి.ఓ.177 లాంటి బూచీలు చూపించినా, బూటుకాలితో వాటిని తన్నేసి అన్ని శాఖల ఉద్యోగులు ఐక్యతా భావంతో సమ్మెను విజయవంతం చేస్తున్నారు.

ఇక సకల జనుల సమ్మెలో యావత్ తెలంగాణ ప్రజానీకం చూపిస్తున్న తెగువ, ఉద్యమాల చరిత్రలో కథలు, కథలుగా చెప్పుకొనే, వీరగాథలుగా పాడుకొనే సాహసోపేత తెలంగాణ చరిత్ర. గ్రామ గ్రామాన సకల కులాల సబ్బండ వర్ణాలు, తెలంగాణ ద్రోహులకు ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. వాడ వాడలా ధూం ధాం పాటలతో, డప్పుల దరువులతో గుండె గుండెలో తెలంగాణ నినాదాన్ని హృదయ స్పందనగా చేస్తున్నారు. చౌరస్తాలన్నీ దీక్షా శిబిరాలై ప్రజలకు దిశా నిర్దేశనం చేస్తున్నాయి.

రోడ్లన్నీ వంటావార్పులతో ఉద్యమ బంధాన్ని బలోపేతం చేస్తున్నాయి. దారులన్నీ బతుకమ్మ పాటలు, కోలాటపు ఆటలతో కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. కవులు, కళాకారులు ఉద్యమ భావజాల వ్యాప్తికై కవాతు చేస్తున్నారు. జాతీయ రహదారుల దిగ్బంధనానికై పిలుపునిస్తే, జాతరగా జనం తరలి వచ్చి విజయవంతం చేశారు. రైల్ రోకోకు పిలుపునిస్తే, రైలు పట్టాలనే పీకి వేస్తామంటూ రగిలిపోయి రాత్రిల్లు కూడ ఆ పట్టాలపైనే నిద్రోయే పోరాట పటిమను చాటారు. ఇప్పుడు యావత్ తెలంగాణ సకల జనుల సమ్మెతో సల సల కాగుతున్న ఉష్ణ కాసారాం. ఉద్రేక, ఉద్వేగాలతో బద్దలవడానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతం.

సమ్మె ఇంత తీవ్రంగా ఉన్న, దాని ప్రభావమే లేదని కళ్ళకు రేచీకటి సోకిన రేణుకా చౌదరి రెచ్చగొట్టే దగుల్బాజీ మాటలు, అభిషేక్ సింఘ్వీ అనుచిత వ్యాఖ్యలు, ఉద్యమ ప్రభావమే లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తప్పుడు నివేదికలు. రాష్ట్రంలోని ఒక ప్రాంతం ఆత్మహత్యలు, నిత్య సంఘర్షణలతో అట్టుడికి పోతున్నా దేశ ప్రజలకు చేరవేయని జాతీయ మీడియా బాధ్యతారాహిత్యం.

ఇవన్నీ ఒక ఎత్తైతే, ప్రజల ఓట్ల భిక్షతో పదవులు పొంది, సీమాంధ్రులకు అమ్ముడుపోయి, తెలంగాణ ఉద్యమ కోవర్టులుగా మారి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ, హీన మానవ నేరస్థులు ప్రజాకోర్టులో శిక్షించబడడానికి సిద్ధంగా ఉన్నారు మన తెలంగాణ నేతలు.

తెలంగాణకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఒకే రోజు తమ పదవులకు అలాగే తెలంగాణ పట్ల ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్న పార్టీల సభ్యత్వాలకు రాజీనామా చేసి మరునాటి నుంచే తెలంగాణ ప్రక్రియ మొదలు కాదా అని ఈ రోజు తెలంగాణ ప్రజానీకం ప్రశ్నిస్తోంది. అలా చేయకుండా తెలంగాణ జెండా చేతిలో పట్టడానికి, తెలంగాణ నినాదాన్ని నోటితో పలకడానికి అర్హత ఎట్లా ఉంటుందని కూడా ప్రజలు సూటిగా నిలదీస్తున్నారు.

అంతా ఒక సాచివేత ధోరణి. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కావాలంటూ మోసపూరిత వ్యాఖ్యలు. అసలు దోషి కేంద్ర ప్రభుత్వమే. అసలు నేరస్థురాలు కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే 2009 డిసెంబర్ 7నాడు అఖిలపక్ష సమావేశంలో ఏకాభిప్రాయాన్ని ప్రకటించిన తరువాత, డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటుకై కేంద్రం పక్షాన సాక్షాత్తు హోంమంత్రి ప్రకటన చేసిన పిదప, ఆంధ్రోళ్ళ కుట్రలతో తానూ భాగస్వామియై, మళ్లీ ఏకాభిప్రాయ ప్రకటన పేరుతో ఇచ్చిన తెలంగాణను వాపసు తీసుకొని యావత్ తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీయే.

సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రభుత్వం ఒక రాష్ట్ర విభజనకు పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండక పోవడానికి కారణం ఏమిటి? చేతగానితనమా? ఆంధ్రులకు అమ్ముడుపోయిన స్వార్థమా? లేక తెలంగాణ ప్రజలు అమాయకులని, సంపదలో వెనుకబడ్డ వారనీ, ఏం చేసినా చెల్లుతుందనే ఒక నిర్లక్ష్య భావనా? ఇప్పుడు నిలదీయాల్సింది, నిగ్గు దేల్చాల్సిందీ కేంద్ర ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ వైఖరీనే! అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజలు బిచ్చంలా అడుక్కోవడం కాకుండా హక్కులా తెలంగాణను లాక్కోవడానికి అంతిమ పోరాటానికి సిద్ధమయ్యారు. ఉద్యమ సెగ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాకి, కార్యాచరణకు పూనుకోవాలంటే ఇంతకు ముందే చెప్పినట్లు మూకుమ్మడిగా తెలంగాణ ప్రజా ప్రతినిధులు పదవులకు, పార్టీ సభ్యత్వాలకు రాజీనామాలు చేయాలి.

తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరుస్తూ, తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపిస్తూ, కుట్రపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేపు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక ఉద్యమం కొనసాగుతున్నపుడు అన్నికాల శక్తులు అందులో ఉంటాయన్న విషయం మరచిపోరాదు.

ఇప్పటివరకు మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడం, మమ్మల్ని మేము అనేక ఇబ్బందులకు గురిచేసుకుంటూ ఉద్యమాన్ని కొనసాగించడమే చూశారు. ఇకపై మా లక్ష్యాన్ని మార్చుకొని మరో పోరాట స్వరూపాన్ని రూపొందించుకొనే అనివార్యతలోకి మమల్ని మీరు నెట్టివేస్తున్న పరిస్థితుల్లో నెత్తుటి సంతకాలు చేయడానికి సిద్ధమవుతున్నారు మా పోరు బిడ్డలు. నేటి స్వాతంత్య్రోద్యమ పోరాటం కూడా సత్యాగ్రహ నినాదంతో మొదలై బలమైన ఉద్యమంగా రూపుదిద్దుకున్నా, బ్రిటిష్ వారు దానిని చిన్న చూపు చూస్తూ, తాత్సారం చేస్తూనే వచ్చారు.

ఎప్పుడైతే భగత్ సింగ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో బాంబులు పేల్చాడో, ఎప్పుడైతే సుభాస్‌చంద్ర బోస్ అజాద్ హింద్ ఫౌజ్‌ను స్థాపించి బ్రిటీష్ వారిపై ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించాడో, అప్పుడే ఇక తమ ఆటలు సాగవని తెలుసుకొని స్వాతంత్య్రాన్ని ప్రకటించడానికి సిద్ధమయ్యింది బ్రిటీష్ ప్రభుత్వం. ఇది చారిత్రక సత్యం.

శాంతియతు ఉద్యమాలకు తలదించరా? బలప్రయోగాలకే తలొగ్గుతారా? గుండెలు మండుతున్నాయ్. పొట్టలు ఎండుతున్నాయ్. ఆవేశం రగులుతున్నది. సహనం నశిస్తున్నది. సహనం నశిస్తే అశాంతి చెలరేగుతది. విధ్వంస భావనలకు పునాదులు పడుతయ్. యావత్ తెలంగాణ రావణ కాష్టంలా మండుతున్నది. ఇలాంటి సంక్షుభిత వాతావరణంలో విజ్ఞతను ప్రదర్శించండి.

పరిష్కార మార్గం కనుగొనండి. కాలానికి వదిలివేస్తే కాలకూట విషమవుతుంది తెలంగాణ. మా సకల జనుల సమ్మెను విరమించి, మరో పదునైన పోరాటరూపానికి సిద్ధమవక ముందే, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నాం. భౌతిక దాడుల భావన ప్రజల మెదళ్ళలో మెదలకముందే భవిష్యత్తును చక్కదిద్దాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అని గుర్తుచేస్తున్నాము. అందుకే మళ్లీ చెబుతున్నాం. అన్నదమ్ముల్లా విడిపోదాం. ఆత్మీయుల్లా కలిసుందాం. రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి చెందుదాం.

ఈ నేలపై చిందిన వీరయోధుల నెత్తుటి సాక్షిగా, ఈ గాలిలో వీచే పోరుపాటల పల్లవుల సాక్షిగా గతం, వర్తమానం, భవిష్యత్తును విశ్లేషిస్తూ చెబుతున్నాం.. 'ఇప్పుడిది తెగించిన తెలంగాణ, ఇక తెగిపోతేనే మంచిది'.

- నారదాసు లక్ష్మణ్‌రావు
శాసనమండలి సభ్యులు 

ఈ చెలగాటం మానండి - కొత్త పలుకు By - ఆర్కే Andhra Jyothi 1/10/2011


ఈ చెలగాటం మానండి
- కొత్త పలుకు

తెలంగాణ సమస్యను ఏ విధంగా, ఎంత త్వరగా కేంద్రం పరిష్కరిస్తుందా? అని రాష్ట్ర ప్రజానీకం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నది. సకల జనుల సమ్మె కొనసాగే కొద్దీ ప్రజల జీవితాలు ఛిద్రం అవుతాయి. ఉద్యమకారుల్లో సహనం నశించి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అనాలోచిత నిర్ణయాలు, రాజకీయ సంకుచిత ప్రయోజనాల కోసం అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ప్రస్తుత పరిస్థితులలో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వెదకాలనుకోవడం అవివేకమే అవుతుంది.

అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత్ - పాకిస్థాన్‌ల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొల్పాలన్న ఉద్దేశంతో, ఇరుదేశాల మధ్య రైలు సర్వీసులను ప్రారంభించారు. అయితే, ఆ రైళ్ళలో ప్రయాణికుల సంఖ్య కంటే భద్రతా దళాల సంఖ్యే ఎక్కువగా ఉండేది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఇప్పుడు సీమాంధ్ర - తెలంగాణ సరిహద్దుల్లో ఇటువంటి వాతావరణమే నెలకొంది.

హైదరాబాద్ నుంచి సీమాంధ్రకు వెళ్లే బస్సులన్నింటినీ రాత్రిపూట ఒకేసారి వదిలి, వాటికి రక్షణగా పోలీసులను పంపుతున్నారు. అయినా, సీమాంధ్ర సరిహద్దులో ఉన్న తెలంగాణ జిల్లాలకు చెందిన కొంతమంది బస్సులపై రాళ్ళు రువ్వుతూనే ఉన్నారు. ఫలితంగా ప్రయాణికులు అప్పుడప్పుడు గాయపడుతున్నారు. విజయవాడలో చదువుతున్న తన కుమార్తెను దసరా సెలవుల కోసం ఇంటికి తీసుకురావడానికి బస్సులో బయలుదేరిన తెలంగాణకు చెందిన మిత్రుడు ఒకరు తన ప్రయాణ అనుభవాన్ని వివరిస్తూ, దశాబ్దాలుగా కలిసి ఉన్న ప్రజల మధ్య ఇంత ద్వేషం అవసరమా? అని ప్రశ్నించారు.

అవును, నిజమే! ఇంత ద్వేషం అవసరం లేదు. కానీ, ఆయా రాజకీయ పార్టీల నాయకుల ప్రకటనలతో సమస్య పరిష్కారం కాకపోగా, ఉభయ ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లుతున్నాయి. తెలంగాణ ఇవ్వకపోతే తలకాయలు కోసుకుంటాం, లేదా కోస్తామని తెలంగాణ నాయకులు... రాష్ట్రాన్ని విడగొడితే తలలు తెగుతాయనీ, తాము గాజులు తొడుక్కుని కూర్చోలేదని సీమాంధ్ర నాయకులు చేస్తున్న ప్రకటనలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత అటుగానీ, ఇటుగానీ ఒక్క నాయకుడు కూడా త్యాగాలు చేయలేదు. ఆర్థికంగా నష్టపోలేదు. తమ చర్యలు, చేష్టల ద్వారా ప్రజలను మాత్రం నలిగి పోయేలా చేస్తున్నారు. రాజధానిలో సీమాంధ్ర ఉద్యోగులపై అడపా దడపా దాడులు కూడా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సెంటిమెంట్ ఇంతింతై వటుడింతై అన్నట్టు... ఈ ప్రాంత ప్రజల్లో బలంగా ఏర్పడింది. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారికి మూడినట్టే! తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు స్వయంగా ప్రకటించినట్టు ఉద్యమ నాయకులు ఇప్పుడు పులి మీద స్వారీ చేస్తున్నారు. దిగితే పులి తినేస్తుంది. దిగకపోతే ఎంత కాలం అలా స్వారీ చేయాలో తెలియని పరిస్థితి!

తెలంగాణ సాధన క్రమంలో చివరి ఆయుధంగా సకల జనుల సమ్మెను ప్రారంభించారు. ఈ సమ్మె ప్రారంభమై 18 రోజులు గడిచిపోయాయి. మరెన్ని రోజులపాటు సమ్మె సాగుతుందో తెలియదు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారికి కూడా ఎంతకాలం సమ్మె కొనసాగించాలో తెలియదు. ఆర్థికంగా, మానసికంగా దెబ్బతింటున్నా అంతిమ ఫలితం ఎలా ఉంటుందో అన్న సందేహం ఉద్యమకారుల్లో లేకపోలేదు.

ఏ ఇద్దరు ఉద్యమ నాయకులు కలిసినా తెలంగాణ వస్తుందంటావా? అని ప్రశ్నించుకోవడం ఇందుకు నిదర్శనం. అలా అని, తాము తలపెట్టిన సకల జనుల సమ్మెను ఫలితం రాకుండా మధ్యలో విరమించ లేరు. సంఘటితంగా జరుగుతున్న ఉద్యమం అటుంచి, తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కూడా ఎంతో ఆశతో, ఉత్సాహంతో సమ్మెలో పాల్గొనడానికి వస్తున్నారు. వారు నిరుత్సాహపడితే పరిణామాలు ఎలా ఉంటాయో తెలియదు. ఈ సమస్యకు పరిష్కారం ఎలా ఉండబోతున్నదన్న విషయం ఎవరూ స్పష్టంగా చెప్పలేక పోతున్నారు. కానీ, సమ్మె కారణంగా సకల జనులు అవస్థలు పడుతున్న విషయం వాస్తవం.

ఒకప్పుడు దేశంలోనే అగ్రగామిగా వెలిగిన మన కార్పొరేట్ రంగం కుదేలవుతోంది. కొమ్ములు తిరిగిన కంపెనీలనుకున్నవి కూడా వివిధ కారణాల వల్ల పరపతి పుట్టక డీలా పడుతున్నాయి. ఒకవైపు సి.బి.ఐ. విచారణ, మరోవైపు సకల జనుల సమ్మె కారణంగా వ్యాపారాలు దెబ్బతిని, బ్యాంకు కిస్తులు కూడా కట్టలేని స్థితికి బడా బడా కంపెనీలు చేరుకుంటున్నాయి. "దీర్ఘకాలంగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా, నాలుగు దశాబ్దాలుగా అహర్నిశలు శ్రమించి అభివృద్ధి చేసిన నా కంపెనీ ఇప్పుడు ఉత్పత్తి ఆగిపోయి, నిధుల లేమితో సతమతమవుతున్నది'' అని ఒక పారిశ్రామికవేత్త కన్నీళ్ళ పర్యంతం అయ్యారు.

సమ్మెలో పాల్గొంటున్నట్టు ప్రకటిస్తున్న తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్తలు, విద్యాసంస్థల అధిపతులది కూడా ఇదే పరిస్థితి. "తెలంగాణకు జై అనకపోతే ఎక్కడ వెలివేస్తారోనన్న భయంతో సమ్మెకు సై అని ప్రకటించాం. నిజానికి, మా ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఏడాది సీట్లు కూడా భర్తీకాలేదు. తెలంగాణలో గొడవల వల్ల ఇక్కడి పిల్లలు కూడా విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరువంటి ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్నారు'' అని ఒక ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది.

అదే సమయంలో పదవ తరగతి, ఇంటర్మీడియేట్ రెండవ సంవత్సరం చదువుతున్న పిల్లలున్న తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. ప్రపంచీకరణ పుణ్యమా అని, అన్నింటా పోటీ పెరిగింది. 1969లో తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు చదువుల్లో ఇంత పోటీ లేదు. ఇప్పటి పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. రాష్ట్ర స్థాయి పరీక్షలలో పోటీ పడడంతోపాటు, జాతీయ స్థాయి కోర్సుల కోసం కూడా పోటీ పడవలసి ఉంటుంది.

ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదివే వారి పరిస్థితి అంతో ఇంతో మెరుగ్గా ఉన్నప్పటికీ... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల గోస ఎవరికీ పట్టడం లేదు. ఇవ్వాళ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నది బి.సి.లు, దళిత వర్గాలకు సంబంధించిన పేదలే. ప్రైవేట్ పాఠశాలల సంస్కృతి రాక పూర్వం ప్రభుత్వ పాఠశాలల్లో, అగ్రవర్ణాల వారితోపాటు బడుగు వర్గాల వారి పిల్లలు కూడా కలిసిమెలిసి చదువుకునేవారు. దీనివల్ల సామాజిక ఆర్థిక వ్యత్యాసాల గురించి వారిలో ఒక అవగాహన ఉండేది.

అప్పట్లో డబ్బున్న వారి పిల్లలకు చదువు పెద్దగా అబ్బేది కాదు. పేదల పిల్లలే కష్టపడి చదువుకునే వారు. ఇప్పుడు కార్పొరేటు పాఠశాలలు వచ్చిన తర్వాత, చదువు కూడా డబ్బున్న వారి సొంతం అవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేదలు మాత్రం మంచి చదువులకు దూరం అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు సకల జనుల సమ్మెలో చేరడం వల్ల బడుగు వర్గాల పిల్లలకు నష్టం జరుగుతున్నది. బిడ్డ పుట్టే ముందు పురిటి నొప్పులు సహజమని పొలిటికల్ జె.ఎ.సి. చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఇందుకు సమాధానంగా చెబుతున్నారు. అయితే, పురిటి నొప్పులు గంటా రెండు గంటలు ఉంటాయి కానీ... సంవత్సరాల తరబడి కాదు కదా! అని బాధితులు తమ మనసులోనే ప్రశ్నించుకుంటున్నారు. బహిరంగంగా తమ ఆవేదనను వ్యక్తం చేయగలిగే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో లేదు.

రాష్ట్ర ప్రజల మధ్య ఇంత తీవ్రస్థాయిలో విభజన ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రాన్ని కలిపి ఉంచాలనుకోవడం అవివేకం అవుతుంది. అయితే, ఈ సమస్యను పరిష్కరించే క్రమంలో, విజ్ఞతతో పట్టు విడుపుల ధోరణి ప్రదర్శించవలసిన నాయకులు, రాజకీయ ప్రయోజనాల వేటలో మునిగి తేలుతున్నారు. తెలంగాణ కోసం సొంత పార్టీలనే ధిక్కరించి బయటకు వచ్చి స్వతంత్రంగా వ్యవహరిస్తున్న నాయకులకు కూడా ప్రజల ఆదరణ అంతగా లభించడం లేదు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఉదంతాన్నే తీసుకుందాం! ముఖ్యమంత్రి పైన, కాంగ్రెస్ పార్టీ పైన ఆయన ధ్వజమెత్తారు. మంత్రిగా ఉంటూ విద్యుత్ కొరత తీర్చాలంటూ నడిరోడ్డుపై బైఠాయించారు. అయినా, నల్లగొండ జిల్లాలో తెలంగాణ వాదుల చేతిలో ఆయనకు పరాభవమే ఎదురైంది. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళిన నాగం జనార్దన రెడ్డికి పరాభవం ఎదురుకాకపోయినా, ప్రజల ఆదరణ మాత్రం లభించడం లేదు. దీంతో ఆయనతో పాటు జట్టు కట్టి, పార్టీకి దూరమైన మిగతా ముగ్గురు శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడానికి రాయబారాలు నడుపుతున్నారు.

ఇవ్వాళ తెలంగాణలో రాజకీయ పార్టీగా అయినా, ఉద్యమ పార్టీగా అయినా తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటే గుర్తింపు పొందుతోంది. ఆ పార్టీకి చెందిన శాసన సభ్యులు ఇదివరకే ఒకసారి రాజీనామాలు చేసి గెలుపొంది, మళ్ళీ రాజీనామా పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు కూడా రాజీనామాలు చేశారు. ఇందులో ఎవరి రాజీనామాలనూ స్పీకర్ ఇంతవరకు ఆమోదించ లేదు. టి.ఆర్.ఎస్. ఎంపీలైన చంద్రశేఖర రావు, విజయశాంతి రాజీనామాలు కూడా ఆమోదం పొందలేదు.

అయినప్పటికీ... కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులకే తెలంగాణ వాదుల నుంచి సెగ తగులుతోంది. వాస్తవానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సహకరించని పక్షంలో తెలంగాణ ఏర్పాటు అసాధ్యం. తెలంగాణ సాధించవలసిన పార్టీ, సహకరించవలసిన ఇతర పార్టీలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడగా... టి.ఆర్.ఎస్. పరిస్థితి పైచేయిగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే జాతీయ స్థాయిలో బి.జె.పి. కూడా సహకరించాలి.

అంటే, తెలంగాణ ఏర్పాటులో కీలకపాత్ర పోషించవలసిన కాంగ్రెస్, బి.జె.పి.లకు తెలంగాణ ప్రాంతంలో రాజకీయంగా ఒనగూరుతున్న ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. తెలంగాణ సెంటిమెంట్ మొత్తాన్ని టి.ఆర్.ఎస్. గంపగుత్తగా తీసుకోవడంతో, మిగతా పార్టీల పరిస్థితి పక్క వాయిద్యంగా మారిపోయింది.

ఈ కారణంగానే తెలంగాణ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చే పక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితిని తమ పార్టీలో విలీనం చేయక తప్పదని కాంగ్రెస్ పెద్దలు షరతులు పెడుతున్నారు. అయితే, తెలంగాణ మొత్తం రాజకీయంగా తన ఆధిపత్యంలోకి రావడంతో, ప్రస్తుత పరిస్థితులలో కె.సి.ఆర్. ఈ షరతుకు అంగీకరిస్తారో లేదో తెలియదు. తెలంగాణలో తన పార్టీని రాజకీయంగా బలోపేతం చేసుకునే దిశగా ఆయన కొన్ని చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ముందుగా తెలుగుదేశం పార్టీకి చెందిన శాసన సభ్యులను తన పార్టీలో కలుపుకొంటున్నారు.

తర్వాత వంతు కాంగ్రెస్ పార్టీది కావచ్చు. ప్రత్యేక తెలంగాణ కావాలన్న ఆ ప్రాంత ప్రజల సెంటిమెంట్‌ను సోపానంగా మలచుకొని, కె.సి.ఆర్. ప్రారంభించిన ఈ రాజకీయ క్రీడ వల్ల, సొంత పార్టీ నాయకులనే నమ్మలేని స్థితి కాంగ్రెస్, తెలుగుదేశం అధినాయకులకు ఏర్పడింది. పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే... తమ పార్టీల ముఖ్య నేతలతో జరిపిన సమావేశాల వివరాలను కె.సి.ఆర్.కు తెలియజేయడానికి ఈ రెండు పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు పోటీ పడుతున్నారు.

బుధవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాం నబీ ఆజాద్‌తో సమావేశమైన తెలంగాణకు చెందిన మంత్రులు, ఎం.పి.లు, శాసన సభ్యుల్లో పలువురు, సమావేశం ముగిసిన వెంటనే ఆ వివరాలను కె.సి.ఆర్.కు, కోదండరామ్‌కు, స్వామిగౌడ్ వంటి ఉద్యోగ సంఘాల నాయకులకు వివరించడానికి పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా ఇవ్వకపోయినా, 'మీ రాజకీయ భవిష్యత్‌కు నాదీ పూచీ' అని కె.సి.ఆర్. ఇచ్చిన హామీతో కాంగ్రెస్‌లో ఉంటూనే కొంతమంది ఆయనకు విధేయులుగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణకు చెందిన ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడికి రాజ్యసభ సీటు, మరికొంత మందికి ఎం.పి. టికెట్లు, శాసన సభ టికెట్లు ఇస్తానని కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి కూడా ఇటువంటి హామీలే లభించినట్టు చెబుతున్నారు. బాన్స్‌వాడ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి, రాజీనామా చేసి టి.ఆర్.ఎస్.లో చేరిన పోచారం శ్రీనివాస రెడ్డిని ఉప ఎన్నికలలో టి.ఆర్.ఎస్. అభ్యర్థిగా పోటీ పెట్టడం గమనార్హం. రాజీనామాలు చేసి మళ్లీ పోటీచేసి గెలవడం, తెలంగాణ సాధనకు ఎలా దోహదపడుతుందో వారికే తెలియాలి!

అయితే, కె.సి.ఆర్. ఎత్తుగడలను పసిగట్టిన కాంగ్రెస్ పెద్దలు ఆచితూచి వ్యవహరించబోతున్నారు. అక్రమాస్తుల కేసుల్లో చిక్కుకుని సి.బి.ఐ. విచారణ ఎదుర్కొంటున్న జగన్మోహన రెడ్డి ప్రభావం ప్రజల్లో పలుచబడుతున్న విషయాన్ని గమనించిన కాంగ్రెస్ అధిష్ఠానం, సీమాంధ్రలో రాజకీయంగా బలపడటానికి తీసుకోవలసిన చర్యలపై కూడా దృష్టి సారించింది.

సీమాంధ్రలో జగన్ బెడద, తెలంగాణలో కె.సి.ఆర్. ముప్పు కారణంగా ఇప్పటి వరకు పాలుపోని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు... ఇప్పుడు జగన్ బలహీనపడటం ఊపిరినిచ్చింది. దీంతో తెలంగాణ సమస్యను పరిష్కరించడంపై దృష్టిని కేంద్రీకరించారు. అయితే, క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయించుకుని అమెరికా నుంచి తిరిగి వచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇప్పటికీ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేని స్థితి ఉంది. 2014లో జరిగే ఎన్నికలలో పార్టీకి ఆమె సారథ్యం వహించే అవకాశం లేదని కాంగ్రెస్‌వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు 2జీ కుంభకోణంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా తెలంగాణ సమస్యపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించలేక పోతున్నారు. ఈ కుంభకోణంలో కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం పాత్ర ఉందన్న అర్థం వచ్చేలా, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ప్రధాన మంత్రి కార్యాలయానికి అందిన నోట్ తాను రాయలేదని చెప్పడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రణబ్ ముఖర్జీ గురువారం నాడు కొంత ప్రయత్నం చేశారు.

ప్రణబ్ ప్రకటనతో కథ సుఖాంతం అయిందని చిదంబరం ప్రకటించుకున్నారు. ప్రధాని కార్యాలయానికి పంపిన నోట్‌ను ప్రణబ్ రాశారా, అధికారులు రాశారా? అన్నది ముఖ్యం కాదు. అందులోని సందేహాలను నివృత్తి చేయవలసిన బాధ్యత తమపై ఉందని ఇరువురు కేంద్ర మంత్రులు విస్మరించడం విడ్డూరంగా ఉంది. కేంద్ర ఆర్థిక శాఖ అధికారులే ఆ 'నోట్'ను రూపొందించారని అంగీకరిద్దాం. అధికారుల అభిప్రాయాలకు విలువ ఉండదా? 'మేమిద్దరం మాట్లాడుకున్నాం.

ఇప్పుడు సర్దుబాటు చేసుకున్నాం' అని మంత్రులు అంటే సరిపోతుందా? ఈ విషయం పక్కన బెడితే తెలంగాణ సమస్యను ఏ విధంగా, ఎంత త్వరగా కేంద్రం పరిష్కరిస్తుందా? అని రాష్ట్ర ప్రజానీకం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నది. సకల జనుల సమ్మె కొనసాగే కొద్దీ ప్రజల జీవితాలు ఛిద్రం అవుతాయి.

ఉద్యమకారుల్లో సహనం నశించి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉంది. అనాలోచిత నిర్ణయాలు, రాజకీయ సంకుచిత ప్రయోజనాల కోసం అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈ పరిస్థితిని మరెంతో కాలం భరించే స్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు.

రెక్కాడితే గానీ డొక్కాడని వారి గురించి ఆలోచించవలసిన బా«ధ్యత రాజకీయ పార్టీలపై ఉంది. ప్రస్తుత పరిస్థితులలో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వెదకాలనుకోవడం అవివేకమే అవుతుంది. తెలంగాణ ఇవ్వాలనుకుంటే ఆ విషయాన్ని స్పష్టంగా ప్రకటించి, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న వారిలో నెలకొన్న భయాందోళనలు, సందేహాలను నివృత్తి చేయడానికి పూనుకోవాలి. అదే సమయంలో, రాజధానిలో నివసిస్తున్న సీమాం«ద్రుల రక్షణకు భరోసా ఇవ్వవలసిన బాధ్యత తెలంగాణ ఉద్యమకారులపై కూడా ఉంది.

హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్ రాజధాని చేసి ఉండకపోతే సీమాంధ్రకు చెందిన వారు ఇక్కడికి వచ్చి ఉండవలసిన అవసరం ఉండేది కాదు. రాజధాని అంటే అందరిదీ అన్న భావన అన్ని ప్రాంతాల వారిలోనూ ఉంటుంది. ఈ వాస్తవాన్ని గుర్తించి ఉద్యోగాలు, ఇతరత్రా విషయాలలో తమకు జరిగిన అన్యాయాన్ని సీమాంధ్ర నాయకులకు, ప్రజలకు వివరించి వారి మద్దతు పొందడానికి తెలంగాణ ఉద్యమ నాయకులు ప్రయత్నించడం అవసరం.

ఇందుకు భిన్నంగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం, సమస్య పరిష్కారానికి విఘాతం కలిగేలా ప్రకటనలు చేయడం వంటివి ఉభయ ప్రాంతాల నాయకులు విడనాడాలి. దంచుడు, నరుకుడు వంటి పద ప్రయోగాల వల్ల కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూరవచ్చు గానీ, సామాన్య ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు. మొత్తం వ్యవహారంలో హైదరాబాద్‌ను ఏమి చేయాలన్నదే కీలకంగా మారిన విషయం వాస్తవం. ఆ తర్వాత నదీ జలాల పంపకం ముఖ్యమైనది.

తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచన ఉంటే, ఈ రెండు అంశాలపై చర్చను ప్రారంభిస్తే ఏదో ఒక పరిష్కారం లభించకపోదు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి రెండు ప్రాంతాలను విడగొట్టాలన్న ప్రతిపాదనను కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే, ఆ దిశగా చర్చల ప్రకియకు శ్రీకారం చుట్టడం తక్షణ అవసరం. అంతేకానీ... ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకునే హక్కు రాజకీయ పార్టీలకు లేదు. ఆర్థికంగా నష్టపోతూ, మానసికంగా వేదనకు గురవుతున్న ప్రజల గురించి ఆలోచించని రాజకీయ వ్యవస్థ ఉన్నా ఒక్కటే, లేకపోయినా ఒక్కటే! తెలుగు ప్రజలు అనుభవిస్తున్న క్షోభకు త్వరలోనే ముగింపు లభిస్తుందని ఆశిద్దాం!
- ఆర్కే

దళితులకు దూరమైన బతుకమ్మ By - ఆశాలత Andhra Jyothi 1/10/2011


దళితులకు దూరమైన బతుకమ్మ

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి చిహ్నం. తెలంగాణ పోరాటానికి వ్యక్తీకరణగా కూడా మారింది. దసరా పండుగకు ముందు వచ్చే బతుకమ్మ పండుగను తెలంగాణ స్త్రీలందరూ జరుపుకుంటారనే అభిప్రాయం సాధారణంగా అందరిలోను వుంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా రోడ్లపై బతుకమ్మ ఆడుతున్నప్పుడు ఈ అభిప్రాయం బలంగా నాటుకుంది. కాని ఇందులోను కులభేదం ఉందని, దళిత స్త్రీలు బతుకమ్మ పండుగ జరుపుకోరనే నిజం అంత విస్తృతంగా బయటికి రాలేదు.

అసలు బతుకమ్మ మాదే, ఎన్నడో మా తాతలనాడు పెద్ద కరువొచ్చి తిననీకి తిండిలేక అడ్డెడు తవుడుకు (నూకలు కూడా దొరకని పరిస్థితి) బతుకమ్మను పై కులాలవారికి అమ్ముకున్నారట, అప్పటి నుండి మాకు బతుకమ్మ లేదు అని మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతపు మహిళలు చెప్పారు.

బతుకమ్మను పేర్చి దాని చుట్టు పాటలు పాడుతు ఆడుకోవాలన్న కోరిక వున్నా ఎన్నడో పెద్దలనాడు పోయిన ఆచారాన్ని ఇప్పుడు మళ్ళీ మొదలుపెడితే ఏం కీడు జరుగుతుందోననే సంశయము, నిరాశ కూడా ఆ దళిత స్త్రీల మాటలలో వ్యక్తమయింది.

దళిత స్త్రీలు బతుకమ్మ పండుగ జరుపుకోకపోవటానికి సిద్ధిపేట - కరీంనగర్ ప్రాంతపు ముదిరాజ్ కులానికి చెందిన స్త్రీలు మరొక వివరణ చెప్పారు, అదేమిటంటే - బతుకమ్మకు ప్రసాదంగా మేము పెరుగన్నం, పులిహోర, చింతకాయ పచ్చడి, నువ్వులపొడి, బెల్లం పెడతాము. వాళ్ళు ఎద్దు కూర తింటారు కదా, వెనుకట్కి వాళ్ళు ఎద్దు కార్జం ప్రసాదంగా పెట్టారట, దానితో గౌరమ్మకు కోపమొచ్చి వాళ్ళ దగ్గరి నుండి వెళ్ళిపోయిందట.

ఏది ఏమైనా దళితులు గతంలో బతుకమ్మ పండుగను జరుపుకునేవారని, ఆ తర్వాత అది వారికి కాకుండా పోయిందని పై రెండు వివరణలను బట్టి తెలుస్తోంది. తిండిలేక బతుకమ్మను పై కులాలవారికి అమ్ముకున్నామని దళిత స్త్రీలు నమ్ముతున్నప్పటికీ, అగ్ర కులాలవారు దళితుల పేదరికాన్ని, నిస్సహాయతను ఆసరా చేసుకుని వారిని పండుగనుండి దూరం చేసివుండవచ్చు అనటంలో ఎటువంటి సందేహము ఉండనక్కరలేదు.

శతాబ్దాలపాటు సాగిన, ఇంకా సాగుతున్న క్రూర కుల పెత్తనం, దురహంకారం దళితుల మాన ప్రాణాలనే కాలరాయగా లేనిది, వారి పండుగలను స్వంతం చేసుకుంటే ఆశ్చర్యపడనక్కరలేదు. ఎద్దుకూర ప్రసాదం పెట్టారు కనుక గౌరమ్మకు కోపమొచ్చి మాలమాదిగలనుండి వెళ్లిపోయిందని వారిని కించపరిచి, అవమానించి, వారిపై పెత్తనం చేసే కులాలవాళ్ళు అనటం బ్రాహ్మణీయ హిందూమత సంస్కృతికి అద్దం పడుతుంది. బతుకమ్మను దళితులనుండి లాక్కోవటానికి ఇటువంటి కథలల్లారని భావించటానికి ఆస్కారం కల్పిస్తుంది.

నైజాము పాలననాటికే దళిత స్త్రీలు బతుకమ్మ పండుగ జరుపుకోవటంపై నిషేధముందని, ఆ కాలంలో బి.సి.లలోని కింది కులాలవారు బతుకమ్మ పండుగ జరుపుకునేవారని, దొరల గడీలముందు పేదింటి మహిళలచేత బలవంతంగా బతుకమ్మ ఆడించేవారని చారిత్రక సాహిత్య ఆధారాలున్నాయి.

బతుకమ్మను క్రింది కులాల పండుగగా భావించి గతంలో రెడ్డి, వెలమ స్త్రీలు జరుపుకునేవారు కాదని, తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత బతుకమ్మ తెలంగాణ ఆకాంక్షకు ప్రతిరూపంగా మారటంతో, అధికారాన్ని స్వంతం చేసుకోవటానికి ఈ పెత్తందారీ కులాల స్త్రీలు కూడా రోడ్లపైకి వచ్చి బతుకమ్మ ఆడటం మొదలు పెట్టారని కంచ ఐలయ్య ఇదివరకే విశ్లేషించారు. తెలంగాణ తల్లి విగ్రహం తలపై దళితులు చేసుకునే బోనాలను ఉంచకుండా చేతిలో బతుకమ్మను ఎందుకు పెట్టారని కూడా ఐలయ్య ప్రశ్నించారు.

దళితులకు బతుకమ్మను దూరం చేసినప్పటికీ ఈ రోజున కూడా దళిత స్త్రీలు బతుకమ్మను పేర్చటానికి తంగేడు, గునుగు పూలు ఏరి పై కులాలవారికి తెచ్చిస్తారు. మాదిగలు డప్పు కొట్టనిదే సద్దుల బతుకమ్మనాడు బతుకమ్మలు చెరువుకు బయలుదేరవు. గౌరమ్మను పెట్టి బతుకమ్మను పేర్చి పండుగ చేసుకునే అవకాశం లేక బతుకమ్మపై ఆశ చావక దళిత స్త్రీలు తమ వాడలలో విడిగా బతుకమ్మపాటలు పాడుతూ ఆడుకుంటారు. రాజకీయ చైతన్యం పెరిగినచోట్ల బి.సి. స్త్రీలు, దళిత స్త్రీలు కలసి ఆడుకోవటం ఇటీవలి పరిణామం.

దసరా పండుగకు 9 రోజుల ముందు పెద్దల అమావాస్య నాడు మొదలై అష్టమినాడు చేసే సద్దుల బతుకమ్మ వరకు తెలంగాణలో గ్రామగ్రామాన 'బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో' అనే పాట సాయంత్రంపూట అలలు అలలుగా వినిపిస్తుంది, గంటలతరబడి స్త్రీలు లయబద్ధంగా, అలుపులేకుండా పాడుతు, ఆడుతుంటారు.

ఈ పాటలలో చోటుచేసుకునే అనేక జానపద కథలు తెలంగాణ చరిత్రను వివరిస్తాయి. బతుకమ్మను పేర్చటానికి గునుగు, తంగేడు, బంతి, చేమంతి, గుమ్మడి వంటి పలురకాల పూలు కావాలి. ఆ పూలు సకాలంలో పూయాలంటే వర్షాలు సకాలంలో పడాలి, వాతావరణం అనుకూలించాలి. ఈ పూలకు పొలాలలో వేసే పంటలకు సంబంధముంది. చెలకభూములలో వేసే మొక్కజొన్న పంటలో గునుగు కలసి పెరుగుతుంది (కలుపు మొక్క అనలేము).

ఇప్పుడు మొక్కజొన్న బదులు ప్రతి పంట వచ్చేసింది, దానికి వేసే రసాయనాలు గునుగుకు విషంగా మారిపోయాయి. బతుకమ్మను సాగనంపటానికి చెరువులనిండా నీరుండాలి. సెజ్‌లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, పెట్టుబడిదారులకు భూములు నైవేద్యమైపోయాయి, మిగిలిన భూములలో పంటలు మారిపోయాయి. చెరువులు ఆక్రమణకు గురై, మట్టిమేటలు వేసి, కంపెనీలు వదిలే కాలుష్యాన్ని నింపుకున్న మురికి గుంటలుగా మారాయి. నేడు తెలంగాణలో బతుకమ్మ పండుగ జరుపుకోవటమే గగనమైపోయింది. వనరుల దోపిడీతో తెలంగాణ తల్లడిల్లుతున్నట్లే పూలు లేక నీళ్ళు లేక బతుకమ్మ బోసిపోతున్నది.

బతుకమ్మ పండుగలో కుల పెత్తనముంది, వర్గ దోపిడీ వుంది, స్త్రీ సమస్య వుంది, వనరుల పరాయీకరణ వుంది. బతుకమ్మకు తెలంగాణ ఆకాంక్షకు చాలా పోలిక వుంది. బతుకమ్మ దళితులకు దూరమయినట్లు తెలంగాణ వనరులలో, ఆత్మగౌరవంలో, స్వయంపాలనలో, నిర్ణయాధికారంలో దళితులకు, పీడిత తాడిత బహుజనులకు, శ్రామిక స్త్రీలకు భాగం లేకుండా పోయే ప్రమాదం పొంచి వుంది.

అయితే తాతలనాడు బతుకమ్మను జారవిడుచుకున్నట్లు దళిత బహుజనులు తెలంగాణను జారవిడుచుకోవటానికి సిద్ధంగా లేరు. బతుకమ్మను లాక్కున్నంత సులభంగా ఈ రోజున పెట్టుబడిదారులు, దొరలు తెలంగాణను స్వంతం చేసుకోలేరు. ఎందుకంటె తెలంగాణ ఆకాంక్ష బతుకమ్మలాగే పల్లెపల్లెన కొలువై అణగారిన ప్రజల నరనరాన జీర్ణించుకుని ఉంది.
- ఆశాలత

ఆదివాసీ ప్రజలపై జరిగిన అకృత్యాలసంచలన తీర్పు - సంపాదకీయం Andhra Jyothi 1/10/2011


సంచలన తీర్పు
- సంపాదకీయం

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా వాచతి ఆదివాసీ ప్రజలపై జరిగిన అకృత్యాల కేసు దాదాపు రెండు దశాబ్దాలకు ఒక కొలిక్కి వచ్చింది. ఆ కేసులో 215 మంది ప్రభుత్వ అధికారులకు శిక్ష విధిస్తూ ధర్మపురి సెషన్స్ కోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం ఇంతమంది ప్రభుత్వ అధికారులను ఒకేసారి శిక్షించడం చాలా అరుదైన విషయం.

1992లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కోసం గాలింపులు చేస్తున్న అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు ఆదివాసీ గూడేలపై దాడి చేసి అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. వాచతి ప్రజలు, తమిళనాడు మానవ హక్కుల సంఘాలు సుదీర్ఘకాలంగా నడుస్తున్న వాచతి కేసును సత్వరం పరిష్కరించాలని ఉద్యమించడంతో జాతీయ మానవహక్కుల కమిషన్ ఈ కేసును పర్యవేక్షించింది.

వీరప్పన్ గంధపు చెక్కల స్మగ్లింగ్‌కు డి ఎంకె రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, బడా వాణిజ్యవేత్తల అండదండలున్నాయి. ముఖ్యంగా అటవీ ప్రాంత గ్రామాల్లో పెద్దఎత్తున విస్తరించిన వన్నియార్ (అగ్నికుల క్షత్రియులు) కులం అండదండలు కూడా వీరప్పన్‌కు ఉంది. వారిని వదలిపెట్టి జయలలిత ప్రభుత్వ ఆదివాసీ ప్రజలపై దాడులకు ఒడిగట్టింది. అకృత్యాలకు పాల్పడిన అధికారులను ఆ ప్రభుత్వం వెనకేసుకొచ్చింది.

స్మగ్లింగ్‌ను అరికట్టే ముసుగులో అధికారులు తమ ఇళ్ళను ధ్వంసం చేశారని, ఆస్తులను గుంజుకున్నారని, పశువులను చంపి వే శారని తమకు న్యాయం చేయాలని వాచతి ప్రజలు అనేక ఉద్యమాలు చేపట్టారు. పర్యవసానంగా 1995లో వాచతి కేసును మద్రాసు హైకోర్టు సిబిఐకి అప్పగించింది. తరతరాలుగా దేశంలోని ఆదివాసుల హక్కులు, ఆస్తులు, ఆవాసాలు పరాయీకరణకు గురవుతూనే ఉన్నాయి.

దాన్ని ప్రతిఘటించిన ప్రతిచోటా రాజ్యం వారిపై తీవ్రంగా విరుచుకపడుతూనే ఉంది. పశ్చిమాన అబూజ్‌మడ్ పర్వత ప్రాంతాలు కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలు, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ , ఒరిస్సా రాష్ట్రాల్లోని ఆదివాసీ ప్రాంతాలు కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలోని అటవీ ప్రాంతాలు కావచ్చు - దేశంలో ఎక్కడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల ఉద్యమాలను నిర్ధాక్షిణ్యంగా అణచి వేస్తున్న చరిత్రే.

స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్దాలు కావస్తున్నప్పటికీ ఆదివాసుల దయనీయమైన పరిస్థితులలో ఎలాంటి మార్చు చోటు చేసుకోలేదు. వారి సంస్కృతి సంప్రదాయాల సంరక్షణకు ఉద్దేశించి రాజ్యాంగంలో పొందుపరచిన ఆదివాసీ చట్టాలు, హక్కులను ప్రభుత్వాలు ఏళ్ళ తరబడి నిర్లక్ష్యం చేశాయి. ఫలితంగా నాగరిక సమాజాన్ని వారు నమ్మలేని స్థితి ఏర్పడింది. స్వదేశంలోనే పరాయివారుగా న్యూనతా భావంతో బతకాల్సిన దుస్థితి వచ్చింది.

హక్కుల అమలు కోసం, సాధనకోసం రాజ్యాంగ వ్యవస్థలపై ఒత్తిడి చేయాలని వారికి స్పృహ లేకపోవడం సహజం. మోసపూరిత వ్యాపారస్తులు, స్మగ్లర్లు వంటి వారినుంచి సంరక్షించి, వారిలో ఆ స్పృహ పెంపొందించడం ప్రభుత్వాల విధి. అలాంటిది వాచతిలో కంచెలా సంరక్షించాల్సిన ప్రభుత్వమే కాటు వేసింది. వీరప్పన్‌ను పట్టి బంధించాలనుకుంటే అతనికి సహకరించే ఆదివాసులను హింసించాలని ఏ చట్టాలు చెబుతున్నాయి? వీరప్పన్ గంధపు చెక్కల స్మగ్లింగ్ వ్యాపారంలో నైతిక , చట్టబద్ధ అంశాలు వాచతి ఆదివాసీలకు ఏ మాత్రం అర్థమై ఉంటాయి? అర్ధమైనా, అర్ధంకాకపోయినా ఏళ్ళతరబడి నిర్లక్ష్యానికి గురయి, ఉపాధిలేక, కష్టాలు కడగండ్లతో కాలం వెళ్ళదీస్తున్న ఆదివాసులకు గంధకపు చెక్కల స్మగ్లింగ్ కూడు పెడుతుండడంతో వాళ్ళు వీరప్పన్‌కు సహకరించి ఉండొచ్చు.

ఆ ప్రజల దైనందిన జీవిత సమస్యల్ని పరిష్కరించడం ద్వారా ప్రభుత్వాలు వారి జీవితాల్లో వెలుగు నింపండం ద్వారా వారిని గెలుచుకోగలిగితే తాము కోరుకున్నట్లుగా వీరప్పన్ పట్టివేత సులభ సాధ్యమవుతుంది. అలాకాక వీరప్పన్‌కు సహకరిస్తున్న అమాయక ఆదివాసీ ప్రజలను హింసించడం ఏపాటి ప్రజాస్వామికం? దాదాపు ఇరవై మంది మహిళల్ని ట్రక్కులలో సమీపంలోని ఫారె స్టు బంగళాకు తరలించి అధికారులు వారిని చిత్ర హింసలకు గురిచేసి, అత్యాచారాలకు పాల్పడడం సభ్య సమాజం తలదించుకునే చర్య కాదా?

ఆదివాసులపై జరుగుతున్న అనేక అకృత్యాలు కేసులుగా నమోదు కాకుండానే కాలగర్భంలో కలసి పోతున్నాయి. కన్నీటి గాథలుగా వారి మనస్సులలో గాయాలుగా మిగిలిపోతున్నాయి. ప్రజాస్వామిక వాదులు, హక్కుల ఉద్యమకారులు ఏవైనా పెద్ద పెద్ద సంఘటనలను పట్టించుకుని ఉద్యమిస్తున్న సమయంలోనే అవి మీడియా ద్వారా వెలుగుచూస్తున్నాయి.

చాలా కేసులు పోలీసు స్టేషన్ల వరకు వెళ్ళకుండా భయం వల్లనో, ఆశ చూపడం వల్లనో మధ్యలోనే వీగిపోతున్నాయి. ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఒకటుందన్న విషయం ఆదివాసీలకు తెలియకపోవడంలో విడ్డూరం లేదు గాని, ప్రభుత్వ యంత్రాంగం దాన్ని నిర్లక్ష్యం చేయడం అమానుషం. సభ్య సమాజంలో పెద్ద సంచనలం సృష్టించిన ఒకటి రెండు కేసులు కోర్టుల వరకూ వెళ్ళినప్పటికీ న్యాయం జరుగుతుందన్న ఆశలేదు, పైగా తీర్పు కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూపులు చూడాలి. కొన్ని సందర్భాల్లో పోలీసు కేసు నమోదు చేసుకోవడానికి పెద్ద పోరాటమే చేయవలసి వస్తుంది.

మన రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలోని జి మాడుగుల మండలంలోని వాకపల్లిలో 11 మంది ఆదివాసీ మహిళలపై మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్న గ్రేహౌండ్స్ పోలీసులు 2007లో అత్యాచారం జరిపిన ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటనపై బాధిత ప్రజలు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించినప్పటికీ, ఇప్పటి వరకు పోలీసు స్టేషన్‌లో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. పైగా ప్రభుత్వం పోలీసులను సమర్థించింది.

మహిళల ప్రవర్తన పట్ల అనుమానాలను వ్యక్తం చేసి అవమానపరచింది. గ్రే హౌండ్స్ పోలీసులపై కేసుల పెట్టకుండా ప్రభుత్వం పక్షపాతంతో వ్యవహరించింది. వాకపల్లి అకృత్యానికి పాల్పడ్డ పోలీసులపై కేసు నమోదు చేయాలన్న విషయంపై రాష్ట్ర హైకోర్టులో ఇప్పటికీ వ్యాజ్యం నడుస్తోంది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే భావంతో నడుస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆదివాసీలకు మినహాయింపు ఉందన్న కఠోర వాస్తవానికి వాకపల్లి సంఘటన ఒక నిదర్శనంగా మిగిలింది.

ఆదివాసీ ప్రాంతాలలోని నీరు, అడవి, భూములు దేశ సహజ వనరుల వాణిజ్యానికి లక్ష్యాలుగా మారాయి. దేశ, విదేశీ కార్పొరేట్ శక్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండదండలతో, దేశంలోని విశాల అటవీ ప్రాంతాలలో పరచుకున్న ఖనిజ సందలను వెలికితీసేందుకు ఆదివాసీలను పెద్దఎత్తున నిర్వాసితులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. విశాఖ మన్యంలోని 515.89 టన్నుల బాక్సైట్ తవ్వకానికి అడ్డుగా ఉన్న ఆదివాసీలను తొలగించటానికి వాకపల్లి బల్లుగూడలో అత్యాచారం జరిపితే, ఒరిస్సా కందహాల్‌లో నలుగురు ఆదివాసీ మహిళలపై సిఆర్‌పిఎఫ్ జవాన్లు అకృత్యాలకు పాల్పడ్డారు.

మావోయిస్టుల నిర్మూలనకు ఉద్దేశించిన 'గ్రీన్ హంట్' కార్యక్రమంలో భాగంగా దండకారణ్యంలోని ఆదివాసీ ఆవాసాలన్నీ వాకపల్లి, వాచతిలలో జరిగిన తీరులోని అకృత్యాలను నిత్యం భరిస్తూనే ఉన్నాయి. ఏళ్ళతరబడి నాగరిక ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురయిన ఆదివాసీలు ఈనాడు పెద్దఎత్తున జరుగుతున్న కార్పొరేట్ దాష్టీకాన్ని ధిక్కరిస్తున్నారు. తమ వనరులు, ఆవాసాల రక్షణ కోసం ఉద్యమబాట పట్టారు. వాళ్ళకు మార్గదర్శకత్వం వహిస్తోంది మావోయిస్టు శక్తులు కావొచ్చు, కాక పోవచ్చు.

దాంతో అడవిలో శాంతి భద్రతల కోసం ఈ ప్రభుత్వాలు పెద్దఎత్తున భద్రతా దళాలను ఆదివాసీ ప్రాంతాలలో మోహరించాయి. భూగోళంలో తమ వనరులు హక్కుల కోసం ఉద్యమిస్తున్న మూలవాసులు, ఆదివాసుల పట్ల ప్రభుత్వాలన్నీ ఒక్కతీరుగానే ప్రవర్తిస్తున్నాయి. అయితే పౌర ప్రజాస్వామిక ఉద్యమాల కృషి, ఒత్తిడి కారణంగా వెలువడిన 'వాచతి' తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం.

హైదరాబాదే తెలంగాణ సంస్కృతి By -ఎం. వేదకుమార్ Namasethe Telangana 1/10/2011

హైదరాబాదే తెలంగాణ సంస్కృతి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఒక కొలిక్కి వస్తున్న సందర్భంలో హైదరాబాద్‌ను మళ్లీ తెరపైకి తెస్తే, ఆ సాంస్కృతిక కేంద్రాన్ని వదులుకొని తెలంగాణ కావాలని ఇక్కడి ప్రజలు ఎవరూ కోరడం లేదు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొంతకాలం ఉంచుకునేందుకు అవకాశం కల్పించాలని కోరడంపై కూడా తెలంగాణ ప్రజల అభివూపాయాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే నిర్ణయించాలి.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఒక కొలిక్కి వస్తున్న సందర్భం ఇది. తెలంగాణ సమాజమంతా సకల జనుల సమ్మెలో ఉంది. రోజురోజుకూ ఉద్యమం ఉధృతమవుతోంది. బొగ్గుబాయిల్లో పెల్ల కదలడం లేదు. బడులకు తాళాలు పడ్డాయి. రోడ్లపైన బస్సులు తిరగడం లేదు. రైలింజన్ పట్టాపూక్కడం లేదు. ప్రభుత్వ ఆస్పవూతులలో వైద్యం చేయమని డాక్టర్లు స్కెతస్కోపులు తీసేసి జై తెలంగాణ అని నినదిస్తున్నారు. విద్యార్థులు రోజూ ర్యాలీలు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. మూడున్నర లక్షలమంది ఉద్యోగులకు నేతృత్వం వహిస్తున్న స్వామిగౌడ్‌పై పోలీసులు దాడి చేశారు.

లక్షన్నర మంది ఉపాధ్యాయులు నిరసన దీక్షలు చేస్తున్నా రు. అరవై వేల మంది ఆర్టీసీ కార్మికులు విధులను బహిష్కరించారు. సకల జనుల సమ్మె పద్దెనిమిది రోజులు గడిచింది. ఈ సమయంలో కేంద్రం నోరు పెకులుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేందుకు హైదరాబాద్‌ను మళ్లీ అడ్డుపెట్టే యత్నాలు సీమాంధ్ర పాలకులు చేస్తున్నారు. హైదరాబాద్ నగరం ఆస్తుల నగరంగా చూసేవాళ్లకు మా ఆస్తులున్నాయని అంటున్నారు. తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌ను తమ చెమటతో నిర్మించిందని సాంస్కృతికంగా ఈ నగరం తెలంగాణ గుండెకాయ అని పోరాడుతున్నారు. ఆస్తుల కోసం కొందరు హైదరాబాద్ మాదంటుంటే, తెలంగాణ ప్రజలు మాత్రం ఇది మా సాంస్కృతిక కేంద్రమని నినదిస్తున్నారు.


సీమాంవూధులకు ఇప్పటికీ కల్చరల్ క్యాపిటల్ లేదు. అందుకే ఆర్థిక సంస్కృతి కోణంలోనే హైదరాబాద్ నగరంపై చర్చను లేవదీస్తున్నారు. వారొక నిర్దిష్టమైన సంస్కృతిని రూపొందించుకోలేదు. ఆర్థిక అభివృద్ధిని బట్టి కల్చర్ మారుతుంది. అందుకే సీమాంవూధులకు బలీయమైన సాంస్కృతిక పునాదులు లేవు. హైదరాబాద్ నగరం 400 సంవత్సరాల చరిత్ర కలది. దాని పక్క నే గోల్కొండ ఉంది. ముస్లిం పాలనలో తెలుగు సంస్కృతి హైదరాబాద్‌లో నిక్షిప్తంగా ఉంది. హైదరాబాద్‌లో ఇప్పటికీ సజీవంగా ఉన్న సంస్కృతిని చూస్తే అది తేటతెల్లమవుతుంది. ఇక్కడ వ్యవసాయం, చేతి వృత్తులు, కళలు, చిత్రకళ ప్రత్యేకమైన రూపంలో కనిపిస్తాయి. ఇది దక్కన్ పీఠభూమి. ప్రజల సంస్కృతి తెలంగాణది. తెలుగువాళ్ల కాలమని చెప్తున్న శాతవాహన కాలం ముందు నుంచి కూడా నాణేల తయారీ, చిత్రలేఖనం, గృహ లిపులున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సంస్కృతిని చూడాలి. తెలంగాణ ప్రజల నుంచి విడదీయలేని భాగం హైదరాబాద్ నగరం. ఉక్కుతో చేసిన కత్తులు, లోహపు పనిముట్లు, రాగి, వెండి, ఇత్తడితో చేసిన మూర్తులు, ఆదాయాల అలంకారాలు, రాజధాని నగిషీ పనులు చూస్తే వాటిలో తెలంగాణ సంస్కృతి విరాజిల్లుతూ ఉంటుంది.
ఈ కళల మూలాలన్నీ హైదరాబాద్ నగరంలో సజీవంగా ఉన్నాయి. నకాషీ చిత్రకళ, పని విధానం, అలంకరణ సామాగ్రి చేసే అనేకమంది నిపుణులు హైదరాబాద్‌లో ఉన్నారు. వీళ్లకు సంబంధించిన కళల రూపాలన్నీ 1956 తర్వాతనే క్రమంగా కనుమరుగవుతూ వచ్చాయి. బోనాలు, సదర్, హోలీ, సంక్రాంతి, బతుకమ్మ వంటి స్త్రీలకు సంబంధించిన ఆచారాలతో కూడినవి ఇక్కడ కనిపిస్తాయి. క్రతుకర్మ కాండలతో కూడిన కళారూపాలు సజీవంగా ఉండటమే కాకుండా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ ఉన్నాయి. ఈ తెలంగాణ సంస్కృతి కోస్తాంధ్ర మూల సంస్కృతి కంటే ఎంతో భిన్నమైనదని అనేక ఉదాహరణలు తెలుపకనే తెలుపుతున్నాయి. హైదరాబాద్‌లో నిర్మించిన కట్టడాలు భారతీయ మొగల్ శిల్ప వాస్తు సమ్మేళనమే కాకుండా పర్షియన్, యూరోపియన్ నిర్మాణ రీతులను పుణికిపుచ్చుకోవటం వల్ల ఒక కొత్త కట్టడ కౌశల్యాన్నీ రూపొందించుకున్నాయి.

ఇది హైదరాబాద్ ప్రత్యేకతగా చెప్పుకోవాలి. గోల్కొండ నవాబులు, గోల్కొండను రాజధానిగా చేసుకున్న కుతుబ్‌షాహీలు హైదరాబాద్ రాజధానిగా నైజాం ప్రభువులు స్థానిక తెలుగు సంస్కృతులపై ఆధిపత్యాన్ని ప్రదర్శించి వాటిని తగ్గించే ప్రయత్నం ఏనాడు కూడా చేయకపోవడం గమనించదగ్గ విషయం. ఒక తెలుగు వారి సంస్కృతే కాకుం డా పార్శీలు, మర్వాడీలు, గుజరాతీలు, ఎన్నోమతాల సంస్కృతిపై తమ ప్రమేయాన్ని చొప్పించలేదు. ఆ సంస్కృతులు ఇప్పటికీ ఉన్నా యి. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన బంజారాలకు సంబంధించిన బాట్లు, దాడీలనే ఉపకులాలు చెప్పే పృధ్వీరాజ్ చౌహాన్ వీరగాథను పాడే సాంప్రదాయం తెలంగాణలో ఉంది. ఈ సాంప్రదాయం ఉత్తరభారతదేశంలోనూ, ఆంధ్రవూపదేశ్‌లోని ఇతర ప్రాంతాలలోను మాయం కావ డం పరిశోధకులు తమ పరిశోధనల ద్వారా తెలియజేశారు. ఇక్కడి ప్రజలపై పాలక వర్గాల ప్రభావం వేషభాషల్లోనే కనిపిస్తుంది. అంతర్గతమైన మానవ సారంగా, మానవ సారపు వారసత్వంగా లభించిన సాంస్కృతిక సంపద ఎక్కడ తవ్వినా బయటపడుతుంది. హైదరాబాద్‌ను రాజధానిగా చేసుకుని 400 ఏళ్లు పరిపాలించిన పాలకులు తెలంగాణ సంస్కృతికి సలాం చేశారు. ఉపకుల వ్యవస్థలో భాగమైన ఉపకులాలను పోషించారు. వాటికి సంబంధించిన రాగి శాసనాలు చూస్తే మిరాశీ హక్కులు ఇవ్వబడినట్టు తెలుస్తుంది.


ప్రపంచీకరణ దేశ దేశాల సంస్కృతిని, నాగరికతలను ధ్వంసం చేస్తూ వస్తున్నది. స్థానికతను నామరూపాలు లేకుండా చేయటమే గ్లోబల్ విలేజ్‌మ్కాట్ లక్ష్యం. నేడు ప్రపంచపటంలో ప్రపంచీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక సాంస్కృతిక పోరాటంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చూడాలి. తెలంగా ణ ఉద్యమంలో వెల్లివిరుస్తున్న సాంస్కృతిక సంపదం తా అది హైదరాబాద్ స్టేట్ సాంస్కృతిక సంపదే. అందు కే ఈ ప్రపంచీకరణ కాలంలో కూడా హైదరాబాద్ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి సజీవంగా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఒక కొలిక్కి వస్తు న్న సందర్భంలో హైదరాబాద్‌ను మళ్లీ తెరపైకి తెస్తే, ఆ సాంస్కృతిక కేంద్రాన్ని వదులుకొని తెలంగాణ కావాల ని ఇక్కడి ప్రజలు ఎవరూ కోరడం లేదు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొంతకాలం ఉంచుకునేందుకు అవకాశం కల్పించాలని కోరడంపై కూడా తెలంగాణ ప్రజల అభివూపాయాన్ని పరిగణనలోకి తీసుకుని మాత్రమే నిర్ణయించాలి. హైదరాబాద్ సంస్కృతే తెలంగాణ సంస్కృతి. ఈ రెంటిని విడదీసి చూడడమంటే బిడ్డను తల్లిని వేరు చేసి చూడడమే అవుతుంది. ఒక ప్రాంతం సంస్కృతిని తమలో కలుపుకోవచ్చు కాని ఒక ప్రాంతం సంస్కృతిని కోట్లు పెట్టి కొనాలని చూడడం అవివేకం. చరివూతలో ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఆక్రమణదారులు కూడా ఆ ప్రాంత చరివూతను, సంస్కృతిని ముట్టుకునేందుకు జంకుతారు. ఒక్క వ్యాపార ఆర్థిక సంస్కృతి నుంచి వచ్చిన వాళ్లు మాత్రమే హైదరాబాద్ గురించి చర్చిస్తున్నారు. ప్రజల సంస్కృతికి పట్టం కట్టిన హైదరాబాద్‌ను వదిలి తెలంగాణ ప్రజలు ఉండలేరు.
-ఎం. వేదకుమార్
ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అధ్యక్షులు

Thursday, September 29, 2011

బతుకమ్మ కాదు.. రాజకీయాలాడాలి - కంచ ఐలయ్య Andhra Jyothi 30/09/2011


బతుకమ్మ కాదు.. రాజకీయాలాడాలి

- కంచ ఐలయ్య

తెలంగాణలో బతుకమ్మ పండుగ బి.సి.ల పండుగ. బ్రాహ్మండ్లు, కోమట్లు, రెడ్లు, వెలమలు ఎప్పుడు ఆడెటోళ్లు కాదు. మాదిగ మాలోళ్లను కూడ సూదరోళ్లు తమలో భాగం చేసుకొని ఆడనిచ్చెటోళ్లు కాదు. పెతరమావాస్యనాడు, సద్దుల పండుగనాడు డప్పు కొట్టి దరువేసే డ్యూటీ మాదిగల్ది. కాని బతుకమ్మల్ని పేర్చుకొని శూద్ర ఆడోళ్లతో ఆడే హక్కు తెలంగాణలో కూడా వీళ్లకు లేదు. అగ్రకుల దొరసాన్లు బతుకమ్మలు పేర్చుకొని ఎన్నడు చెరువు దగ్గరకు వచ్చేటోళ్లు కాదు.

ఇప్పుడు బతుకమ్మ ఉద్యమ పండుగైంది. మంచిదే. ఆ పండుగల వైపు కన్నెత్తి చూడని వెలమ, రెడ్డి దొరసాన్లు, అక్కడక్కడ బాగ చదువుకున్న బ్రాహ్మణ అమ్మగార్లు బతుకమ్మ ఆడుతున్నారు. బతుకమ్మ ఇప్పుడు ఊరూరి పండుగ అంటున్నారు. టి.వి.ల్లో చదువుకున్న దొరసాన్లు పట్టుబట్టలు కట్టుకొని (సెల్వార్ కమీజు లేసుకొని కాదు, జీన్‌పాంట్లు తొడుక్కొని అంతకన్నా కాదు) 'బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో' అంటూ ఉయ్యాలూగుతుంటే అందరు ఆనందంగా చూస్తున్నారు. కాని ఊరి బతుకమ్మల్లో ఈ ఉద్యమ ఉర్రూతలో కూడ మాదిగ, మాల ఆడోళ్లు పట్టుబట్టలు కట్టుకొని దొరసాన్ల పక్కన నిలబడి బతుకమ్మ లాడుతున్నారా!

సహజంగా బతుకమ్మ ప్రకృతిని ప్రతిబింబించే పూల పండుగ. మొదటి తొమ్మిది రోజులు ఆడోళ్ల పండుగ, ఆడబిడ్డలు అన్నదమ్ముల మెడలొంచి బట్టలు కొనుక్కునే పండుగ, నగలు చేయించుకునే పండుగ. సద్దుల తెల్లారొచ్చే దసరా తాగి, తినే మొగోళ్ళ పండుగ. ఆనాడు ఆయుధ పూజ అగ్రకుల సంస్కృతి అయితే, మందు తాగడం, మాంసం తినడం కింది కులాల పండుగ రూపం. ఈ పండుగను తెలంగాణ దొరలు వాళ్ల అవసరాన్ని బట్టి వాడుకున్నారు. సాధారణంగా బతుకమ్మ వరి కలుపుల సందర్భంగా వస్తుంది.

ఇంకా వానాకాలం ఉండి, చెరువులు కుంటలు కళకళలాడే రోజుల్లో వచ్చే పండుగ ఇది. ఆడోళ్లు బతుకమ్మలాడుతుంటే మొగపిల్లలు పాపెడు కాయలతో గొట్టాలాడే పండుగ ఇది. కాని దొరలు కలుపులు తీసే ఆడోళ్లను కనీసం సద్దుల పండుగనాడు కూడ కాస్త పొద్దుగాల యింటికి పోనివ్వకపోయేది. దాంతో ఆ తల్లులు తమ పసిపిల్లలకు సైతం డొప్పల్లో పాలు పిండి ఇంటికి పంపిన సంస్కృతి ఇక్కడి దొరలకున్నది. అందుకే దొరలున్న గ్రామాల్లో ఆడోళ్లు బతుకమ్మలాడేప్పుడు ఇట్ల పాడేటోళ్లు:

బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో
బంగారు బతుకమ్మ.. ఉయ్యాలో
బట్టలిప్పి దొరలు.. ఉయ్యాలో
బతుకమ్మ లాడిస్తే.. ఉయ్యాలో
డొప్పలల్లో దొరలు.. ఉయ్యాలో
పాలు పిండి - పంపే.. ఉయ్యాలో
పాపాలు చేసిండ్రు.. ఉయ్యాలో
పాణాలు తీసిండ్రు.. ఉయ్యాలో...

తాంబాలాల్లో బతుకమ్మను పేర్చుకొని, నట్ట నడుమ బొడ్డమ్మను పెట్టుకొని సద్దుల పండుగ రోజున కూడ సద్దికి బువ్వలేక మొక్కజొన్న పాలా లేంచుకొని, సత్తు పిండి కొట్టుకొని, చెరువులో బతుకమ్మను వదులుతూ గౌరమ్మ గౌరమ్మ ఎన్నియలో
బంగారు గౌరమ్మ ఎన్నియలో
గంగలో కలువమ్మ.. ఎన్నియలో
కష్టాలు కడతేర్చి.. ఎన్నియలో
కన్నీళ్లు కడతేర్చు ఎన్నియలో

అని పాడి, తినడానికి పెరుగు బువ్వ కూడ దిక్కు లేక, సత్తు పిండి బుక్కి ఇక్కడి బి.సి ఆడోళ్ళు ఇండ్లకు పోయిన రోజులెన్నో! ఈ స్థితిలో కూడ మాదిగ, మాలోళ్ళు డప్పులు కొడుతూ దూరం నిలబడాల్సిందే. గ్రామాల్లోని ఈ స్థితిపై ఎన్నడూ కనికరం రాలేదు.

అదే దొరలు ఈ ప్రాంతానికి, ఈ దేశానికి ప్రమాదమని కమ్యూనిస్టు ఉద్యమం, నక్సలైట్ ఉద్యమం పుట్టాయి. ఈ క్రమంలోనే ముందు రెడ్డి దొరల నాయకత్వంలో 1969 తెలంగాణ ప్రాంతీయ ఉద్యమం పుట్టింది. ఇప్పుడు వెలమ దొరల నాయకత్వంలో నడుస్తుంది. ఈ రెండు ఉద్యమాలు కూడ బతుకమ్మ పండుగలో మాదిగ, మాలల నుండి, చాకలి, మంగలి కులాలు, మిగతా బిసి కులాలతో కలిసి బతుకమ్మ ఆడాలని, ఆకలిని, అంటరానితనాన్ని ఈ ప్రాంతం నుండి పారదొయ్యాలని సాంస్కృతిక ఉద్యమాన్ని నడుపలేదు. 1969 నుండి ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో నక్సలైట్లు, వెలమ, రెడ్డి దొరలు ఒక్కటయ్యారు.

ఇప్పుడు విప్లవకారులు, వెలమలు, రెడ్లు కలిసి తెలంగాణ ఉద్యమం నడుపుతున్నారు. ఈ క్రమంలో రెడ్డి, వెలమ దొరలు, తిరిగి గ్రామాల్లోకి పోవడమే కాక తెలంగాణ తల్లి పేరుతో పట్టుబట్ట కట్టుకొని, బంగారు నగలు పెట్టుకున్న ఒక దొరసాని చేతిలో బతుకమ్మను పెట్టారు. ఎంత విచిత్రం!

ఇప్పుడు బి.జె.పి, టిఆర్ఎస్, విప్లవ పార్టీలు 'సిద్ధాంతానికతీతంగా' తెలంగాణ తెస్తరట. ఒక దొర్సాని నాయకత్వంలో ఊరూర బతుకమ్మ ఉయ్యాలలూగుతున్నది. ఈ ప్రాంతంలో అందరికీ సమాన చదువు అమలై ఉంటే బతుకమ్మ పండుగను దళితులు, బి.సి.లు, అగ్రకుల స్త్రీలతో కలిసి ఆడుకుంటే పరిస్థితి భిన్నంగా ఉండేది.

కమ్యూనిస్టు ఉద్యమమో, మావోయిస్టు ఉద్యమమో తెచ్చిన మార్పులో దళితులో, బి.సి.లో ఉద్యమానికి నాయకత్వం వహించి ఒకనాటి దొరలు పాలితులుగా మారో కార్యకర్తలుగా పనిచేసే ఉద్యమమేదో నడుస్తుంటే ఇక్కడి దళిత-బహుజనులు ఆనందపడితే అర్థముంది. కాని దొరలు దొరసాన్లు కొత్త తరహా ఉద్యమం నడుపుతున్నారు. ఒకవైపు సమాజాన్ని మార్చే చదువును సంపూర్ణంగా ఈ ప్రాంతంలో బందుపెట్టి, ముఖ్యంగా ఇక్కడి బి.సిలచేత బతుకమ్మలాడిస్తూ, వాళ్ళు ఈ ప్రాంతంపై సంపూర్ణ అధికారం సాధించడానికి రాజకీయాలాడుతున్నారు. అంటే ఇక్కడి దళిత, బహుజనులు నిరంతరం బతుకమ్మ, లేదా ధూం ధాం ఆడాలి. వాళ్ళు రాజకీయాలాడుతారు. దళితులు అన్నిటికీ డప్పులు కొట్టాలి.

ఇప్పుడు సంవత్సరాల తరబడి స్కూళ్ళు, కాలేజీలు బందు పెట్టి బతుకమ్మ లాడిస్తుంటే, ఆ పిల్లల తల్లులు ఏ పాట పాడాలి. గౌరమ్మ, గౌరమ్మ... వలలో
బంగారు - గౌరమ్మ... వలలో
దొరల రాజ్యమొస్తే - వలలో
ధరలు తగ్గుతాయి - వలలో
'ఆడి' కార్లళ్ళో... వలలో
ఆనంద భోగాలు.... వలలో
మనింటికొస్తాయి... వలలో అని పాడుకోవాలి. ఊరూరి బతుకమ్మ "ఆంధ్ర టివి''లలో ఐక్య సంఘటన ఎందుకు కట్టింది? ఆం«ద్రులు కరుణించి డోనేషన్లు ఇస్తే ఇప్పుడు బతుకమ్మలు పూలతో కాదు, నోట్లతో పేర్చొచ్చు!

బి.జె.పి., టిఆర్ఎస్, ఒక మావోయిస్టు గ్రూపు (న్యూడెమోక్రసీ) రాబోయే ఎన్నికల్లో పొత్తుల పోటీ చెయ్యొచ్చు. ఈ పొత్తు పేరు 'తెలంగాణ విప్లవ'మని కూడ పెట్టొచ్చు. ఈ ప్రాంతపు బి.సి.లంతా రేపు నరేంద్ర మోడీ బి.జె.పి ప్రధాన మంత్రి కేండేట్ ఐతే బతుకమ్మలా కదిలి ఆ కూటమికి ఓటు వెయ్యవచ్చు. బి.జె.పి 'వచ్చేది మేమే ఇచ్చేది మేమే' అనే నినాదంతో మన చేత ధూం «ధాం ఆడించవచ్చు.

కాని క్రమంలో మనరక్తం పంచుకొని ఇక్కడ బతుకుతున్న ముస్లింల సంగతేమైతుందో ఎవరు ఆలోచించాలి? ఇక్కడి సంస్కృతిని, విద్యను సర్వనాశనం చేసిన దొరలు దొరసాన్లు ప్రత్యేక రాష్ట్రం పేరుతో ఇక్కడి దళిత-బహుజనుల్ని తోలుబొమ్మల్ని చేస్తే జరిగేదేంటి? రాబోయే తెలంగాణను ఎవరు పాలిస్తారు. ఇక్కడి స్కూళ్ళను బందుపెట్టి, తెలంగాణ ఉద్యమ నాయకులందరు తమ పిల్లల్ని విదేశాల్లోనో, ఇతర రాష్ట్రాల్లోనో చదివిస్తుంటే మన ఉపాధ్యాయులంతా ఉర్రూతలూగుతూ పాటలు పాడుతున్నారు.

ఈ మధ్య ఒక తెలంగాణ ఉపాధ్యాయ విద్యావేత్త తెలంగాణ వచ్చేవరకూ స్కూళ్ళు నడువకుండా చూసి తమ సత్తా చాటుకోవాలన్నారు. ఏ స్కూళ్ళను? ప్రభుత్వ స్కూళ్ళను! తెలంగాణ వచ్చినంక బతుకమ్మ లాడే బి.సి. స్త్రీలు మంత్రులౌతారా! ఐతే చదువు సరిగా రాకుండా ఫైల్లెట్ల రాస్తారు? ఈ ప్రాంతపు యస్.సి., యస్.టి., బి.సి. తల్లుల కర్తవ్యం స్కూళ్ళు బందు పెడుతుంటే, ఆనందపడి బతుకమ్మ లాడితే లాభం లేదు. ఈనాటి బతుకమ్మకు రాజకీయాలు లేకుండా లేవు?

దొరల ఉపన్యాసాలకు రెచ్చిపోయి, ఆత్మహత్యలు చేసుకున్న పిల్లల తల్లులు ఏం బతుకమ్మ లాడుతున్నారు? వాళ్ళకు తినడానికి తిండి ఉందా? ఒకపక్క కొడుకుల్ని, బిడ్డల్ని, ఆకుల్లా రాల్చేసిన ఉద్యమంలో దొరసాన్లకు పట్టుబట్టలు కట్టుకొని 'ఆడి'కార్లల్లో ఎట్లా తిరుగబుద్ధవుతుంది? ఇదే సంస్కృతిని తెలుపుతుంది. వీళ్ళ పట్టుబట్టల్ని, బంగారు నగల్ని, ఆడికార్లని వేలం వేసినా, పిల్లల్ని కోల్పోయిన తల్లులకు కనీసం కట్టుకోడానికి బట్టలు దొరుకుతాయి.

ఈ ప్రాంతపు బడుగు జీవులు, రాజకీయాలు దొరలకు, దొరసాన్లకు వదిలి వీళ్ళు బతుకమ్మలాడినంత కాలం వీళ్ళ బతుకు బతుకమ్మే అవుతుంది. దానితో ఆడుకొని చివరికి గంగలో కలుపుతారు. తెలంగాణ రాష్ట్రం వచ్చే లోపే వాళ్ళు బతుకమ్మ లాడుతుంటే ఇక్కడి బడుగు జీవులు రాజకీయాలాడే అగ్రిమెంట్‌కు సిద్ధమేనా? అడుగండి.

- కంచ ఐలయ్య
వ్యాసకర్త సామాజిక శాస్త్రవేత్త, సుప్రసిద్ధ రచయిత

పాఠ్యపుస్తకాలలో తెలంగాణ భాషేది? By -చుక్కా రామయ్య Namasethe Telangana 30/09/2011

పాఠ్యపుస్తకాలలో తెలంగాణ భాషేది?
musal-talangana patrika telangana culture telangana politics telangana cinema
తెలంగాణ భాష వంకర భాష కాదు. ఇతర భాషలను జీర్ణం చేసుకునే విస్తృతి ఉన్న భాష. టీచర్ ఆ భాషలో, ఆ యాసలో మాట్లాడితేనే విద్యార్థి వింటాడు. విషయాన్ని తొందరగా అర్థం చేసుకో గలుగుతాడు. ఆ యాస భాషల్లోనే టీచర్ మాట్లాడాలి. అప్పుడే పిల్లలు మనం చెప్పే చదువులో తన జీవితాన్ని చూసుకుంటారు.


ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాకింగ్ చేస్తుంటే, రాఘవడ్డి అనే పాత మిత్రుడు కలిశాడు. యిద్దరం మాట్లాడుకుం టూ నడుస్తున్నాం. ‘నిన్న వాకర్స్ మీటింగ్ అయ్యింద’ని చెప్పాడు. అందులో ‘నేనొక ప్రశ్నను గెలిచా’నన్నాడు. ‘ఏమి ప్రశ్న’ అన్నా ను. ‘చుక్కా రామయ్యది ఏ ఊరు?’ అని అడిగారు. ‘కొందరు భువనగిరి అని, కొందరు సిద్దిపేటని చెప్పారు. మరికొందరు మహబూబ్‌నగర్ జిల్లా అని చెప్పారు. ఆయనది వరంగల్ జిల్లా పాల్కురికి సోమనాథుడు జన్మించిన పాలకుర్తి పక్కనే ఉన్న గూడూరు’ అని నేను చెప్పాను. ‘గూడూరు ఊళ్లో ఒక గుడి ఉత్సవ కార్యక్షికమం జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్లానని, ఆ గుడిని రామయ్య తండ్రి కట్టించారు. అప్ప టి నుంచి రామయ్య తెలుసునని వాకర్స్ మీటింగ్‌లో చెప్పాన’ని నాకు చెప్పాడు. ఇలాంటి అనుమానాలు ఎందుకొస్తాయి? ఇది నాఊరు గూడూ రు అని చెప్పుకోవడానికి ఆ ఊళ్లో భూమ న్నా, ఇల్లన్నా ఉండా లి. నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉద్యోగం చేస్తూ ఏ ఊరికి బదిలీ అయితే అక్కడే ఉండేవాణ్ణి. సెలవుల్లో కూడా అక్క డే ఉండేవాణ్ణి. సెలవుల సమయంలో ఆ చుట్టుపక్కల ఊళ్లల్లోని ప్రజలతో కలిసేవాణ్ణి. పిల్లలు కూడా తమ ఊళ్లకు నన్ను వేసవి సెలవుల్లో తీసుకుపోయేవారు. దీని వలన ఆ పిల్లల తల్లిదంవూడుల జీవన విధానం చూసే అవకాశం లభించింది. క్లాసురూములో చదువు చెప్పేటప్పుడు స్థానిక సమస్యలతోనే ఆనాటి పాఠాన్ని ఆరంభించేవాణ్ణి. ఉపాధ్యాయునికి కేవలం సబ్జెక్ట్ రావటమే కాదు, ఆ పిల్లల నేపథ్యం కూడా తెలిసి ఉండాలి. ఆ నేపథ్యాన్ని చెప్పుకుంటూ, వారి గ్రామాల్లోని సంఘటనలను గుర్తుచేస్తూ పాఠం చెబితే విద్యార్థి తన పరిసరాలను తన జీవితానికి సంబంధించినదనుకుని ఆ చదువుపై శ్రద్ధను చూపుతాడు. నేడు ప్రభుత్వ స్కూళ్లలోకి దళితులు, గిరిజనులు, పేదవర్గాలు, బహుజన వర్గాలకు చెందిన పిల్లలు ఎక్కువగా వస్తున్నారు. ఆ పిల్లలందరినీ క్రమం తప్పకుండా బడులకు తేవాలని ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా వారిలో 60 శాతానికి మించి అక్షరాస్యత పెరగటం లేదు. దానికి కారణం ఏమిటి? పిల్లలు తమ జీవితాలను ఆ పుస్తకా ల్లో చూసుకోవటం లేదు.

పాఠ్యపుస్తకాల ముద్రణ విషయంలో నేటికీ పాత పద్ధతులనే అవలంబిస్తున్నారు. పాఠ్య పుస్తకాలకు సంబంధించి సిలబస్‌ల రూపకల్పనలో సాంప్రదాయబద్ధంగానే కొనసాగుతున్నారు. ఈ విధానం లో మార్పులు తేకపోతే చదువు అన్ని వర్గాల వాకిళ్లలోకి పోలేదు. దీనికోసం ప్రభుత్వమే పెద్ద కృషి చేయవలసి ఉంది. ఈ పని ఎన్నిసార్లు చెప్పినా ప్రభు త్వం పెడచెవిన పెడుతోంది. ప్రాథమికస్థాయిలో విద్యార్థికి పరిసరాలతో ఎంతో సంబంధం ఉంటుంది. ప్రాథమిక పాఠ్యాంశాల తయారీలో స్థానిక వ్యవహారిక భాషను ఉపయోగించాలి. అప్పుడు విద్యార్థి ఇబ్బంది పడడు. పాఠం చదువుతుంటే అది తనకు బాగా తెలిసిన విషయ మే అన్నట్లుగా విద్యార్థి ఫీల్ కావాలి. తన జీవితమనుకుంటే పాఠ్యపుస్తకా న్ని, పాఠశాలని విద్యార్థి వదిలిపెట్టడు. ఇది ఆచరణాత్మకంగా, ఒక ఉపాధ్యాయుడిగా 60 ఏళ్లలో నేను గమనించిన అంశం. అందుకే ఇంటిభాష ప్రాథమిక స్థాయి లో ప్రవేశపెట్టాలని కొంతకాలం ప్రభుత్వంతో పెనుగులాడాను. ఫలితం మాత్రం రాలేదు. పాఠ్యపుస్తకాల తయారీ అంటే ఏదో పదిమంది టీచర్లు కలిసి పాఠ్యపుస్తకాన్ని తయారు చేసి ఇవ్వటమే కాదు అన్ని ప్రాంతాల విద్యార్థులకు వారివారి మాతృభాషల్లో పాఠ్యపుస్తకాలు తయారుచేయాలి. ఆ పని చేయటం అంత సులభమైనదేమీ కాదు. దాని కోసం సుదీర్ఘమైన అధ్యయనం, పరిశోధన నిరంతరం కొనసాగాలి. పుస్తకాల ముద్రణ కోసం తెలుగు అకాడమీని ఏర్పాటు చేసుకున్నాం.

raju29-talangana patrika telangana culture telangana politics telangana cinema
తెలంగాణ భాష , ఆచారాలు, ఈ ప్రాంత విశిష్టత, తరతరాల తెలంగాణ, సంస్కృతి, ఇక్కడి ప్రజల వ్యక్తిత్వాలు, వృత్తులు, ఆలోచనా విధానాలు, సంప్రదాయాల గురించి చెప్పే ప్రయత్నం ఇప్పటివరకు తెలు గు అకాడమీ చేయలేదు. ఇంటర్, డిగ్రీ, తదితర పాఠ్యపుస్తకాలు ముద్రణ చేయటం, వాటిని విక్రయించటం దీనికే తెలుగు అకాడమీ కాలమంతా సరిపోతోంది. ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిని అకాడమీ వెలుగులోకి తేలే దు. తెలుగు సమాజంలో భిన్న కోణాలను, భిన్న సంస్కృతులను వెలుగులోకి తేవడంలో తెలుగు అకాడమీ చేయవలసిన కృషి ఎంతో ఉంది. బతుకమ్మ పండుగ గురించి ఇక్కడి ప్రజలు ఆందోళన చేస్తే గత ఏడాది ఢిల్లీలో రిపబ్లిక్ డే సందర్భంగా బతుకమ్మను ప్రదర్శనగా పెట్టారు. ఇక్కడి ప్రజలు ఆందోళన చేయకముందే ఆ బాధ్యతను తెలుగు అకాడమీ భుజం మీద వేసుకొని నిలబడి ఉంటే బాగుండేది. బతుకమ్మకు సంబంధించిన, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అనేక విషయాలను వెలుగులోకి తేవాలి. ఈ పనిని బిఎన్ శాస్త్రి కొంత వరకు చేశారు. అకాడమీ చేయాల్సిన పనిని బిఎన్ శాస్త్రి తన రెండు చేతులతో నెత్తికెత్తుకున్నారు. ఇంకా తెలంగాణ జనపదాలకు సంబంధించిన పరిశోధన ప్రొ. జయధీర్ తిరుమలరావు నేటికీ కొనసాగిస్తున్నారు. ఈ పనిని అకాడమీ తన భుజాలపై వేసుకోవాలి.నేను మహబూబ్‌నగర్‌కు బదిలీ అయినప్పుడు బస్‌స్టాండ్‌లో దిగి స్కూల్ ఎక్కడ అని అడిగాను. వాళ్లు చెప్పలేదు. ఒక కండక్టర్ వచ్చి సారు ‘శాల’ ఎక్కడని అడుగుతున్నారన్నాడు. బడిని కన్నడంలో ‘శాల’ అంటార ని చెప్పాడు. ఏమి ‘బీకు’ అన్నాడు. అంటే ఏమి కావాలన్నాడు. కన్నడ ప్రభావం మహబూబ్‌నగర్ జిల్లా మీద, అక్కడి భాష మీద ఉన్నది. ఇది చిన్న విషయమే కావచ్చును. అదే నిజామాబాద్, ఆదిలాబాద్ వెళితే మహారాష్ట్ర మరాఠీ భాష ప్రభావం కనిపిస్తుంది. అదే నల్లగొండ జిల్లా సరిహద్దు కోదాడకు వెళితే కృష్ణా జిల్లా ప్రభావం కనిపిస్తుంది. మిర్యాలగూడ వెళితే గుంటూరు జిల్లా ప్రభావం కనిపిస్తుంది. తెలంగాణ భాష వంకర భాష కాదు. ఇతర భాషలను జీర్ణం చేసుకునే విస్తృతి ఉన్న భాష. టీచర్ ఆ భాషలో, ఆ యాస లో మాట్లాడితేనే విద్యార్థి వింటాడు. విషయాన్ని తొందరగా అర్థం చేసుకోగలుగుతాడు. ఆ యాస భాషల్లోనే టీచర్ మాట్లాడాలి. అప్పుడే పిల్లలు మనం చెప్పే చదువు లో తన జీవితాన్ని చూసుకుంటారు. తమ పరిసరాలను పోల్చుకుంటారు. ముఖ్యంగా ప్రాథమిక దశలో ఇంటి భాషకు, స్కూల్ భాషకు దూరం పెరగకూడదు. ఇది మనదేశంలోనే కాదు, ఇంగ్లాండులో కూడా స్కాట్‌లాండ్ భాష ఒక రకంగా ఉండదు. ఆంధ్రవూపదేశ్ ఏర్పడిన నాటినుంచి మన వాళ్లు ఈ ప్రయత్నం చేయకపోవటం వల్లనే మన పాఠ్యాంశాలు సామాన్యుల జీవితాల్లోకి చొచ్చుకుపోలేకపోయాయి. వాళ్ల భాషను గేలి చేస్తే ఆ సంబంధిత వర్గాలు దూరమైపోతాయి. బడి పెట్టగానే సరిపోదు. విద్యావ్యాప్తి జరగాలంటే ఆ ప్రాంతంలో లీనమైపోవాలి. అందు కే ఇది మిషనరీలా పనిచేయాలి. ఇతర దేశాల క్రైస్తవులు మన దగ్గరికి వచ్చినప్పుడు విద్యావ్యాప్తి కోసం భాషనే కాదు, ఆ ప్రాంత ప్రజలు మాట్లాడే భాషను అలవర్చుకున్నారు. వారి జీవితాలను ఆకళింపు చేసుకున్నారు. అదే తరగతి గదిలో మాట్లాడారు. తనున్న సమాజంలో టీచర్ గర్భితం కావాలి. అప్పుడే విద్యార్థి టీచర్ చెప్పే పాఠంలోకి వెళ్లగలుగుతాడు. ఇప్పటికైనా తెలుగు అకాడమీ వారు అన్ని ప్రాంతాల సంస్కృతులను ప్రతిబింబించే విధంగా అన్ని ప్రాంతాల భాషలపై పరిశోధనలు చేయాలి. ఒకటి నుంచి ఏడవ తరగతి వరకు పాఠ్య పుస్తకాలలో పాఠ్యాంశాలను ఇంటిభాషలోనే రాసేందుకు పాఠశాల విద్యాశాఖ తీర్మానించాలి. ఇది ఎంత తొందర గా చేస్తే అంత మంచిది. దీని వల్ల విద్యార్థుల డ్రాప్ అవుట్‌లను తగ్గించవచ్చును. అప్పుడే మన ప్రాథమిక విద్య గడపదాటుతుంది.
-చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు

ఇది ప్రజాస్వామ్యమేనా? By పొ.హరగోపాల్ Namasethe Telangana 30/09/2011

ఇది ప్రజాస్వామ్యమేనా?
మూడు వారాలుగా లక్షలాదిమంది తెలంగాణ పౌరులు, భిన్న రంగాలకు చెందినవాళ్లు-విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్మికులు, ప్రభుత్వోద్యోగులు, రైతులు, గ్రామీణ ప్రాంత పేదలు, కాంట్రాక్టు ఉద్యోగులు-నిజానికి సమస్త రంగాల నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో రాజీ లేకుండా పోరాడుతున్నారు. దేశంలో రెండు మూడు దశాబ్దాలుగా ప్రయోగించిన శాంతియుత పద్ధతులన్నింటిని ఉపయోగిస్తున్నారు. నాకు తెలిసి దేశంలో ఇంత శాంతియుత పోరాటాలు చాలా అరుదుగా జరిగాయి. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాల య విద్యార్థులతో పాటు తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల కాలేజీ విద్యార్థులు పాటించిన అసాధారణ సంయమనం, పరిణతి నమ్మశక్యంకాని స్థాయిలో ఉన్నాయి. దీనికి రాజకీయనాయకులకు, ఉద్యమకారులకు, ఉద్యమ నాయకులకు అభినందనలు చెప్పవలసిందే.

ఇంత శాంతియుత ఉధృత ఉద్యమానికి ఏ స్థాయిలో కూడా స్పందించని రెండు ప్రధాన రాజకీయ పార్టీలను, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, అన్నిటికి మించి బాధ్యతారహితమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనాలో, ఎలా అర్థం చేసుకోవాలో, ఏం అంచనా వేయాలో అర్థం కావడం లేదు. ఈ మొత్తం ప్రక్రియను చూస్తుంటే.. ఇప్పుడు మనం పాలకులు చెప్పే అతిపెద్ద ఉదార ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామా? లేక ఒక ‘ప్రజాస్వామిక భ్రాంతి’లో బతుకుతున్నామా? అనే ఒక మౌలిక ప్రశ్న అడగవలసిన సమయం, సందర్భం ఇది.


మావోయిస్టు ఉద్యమం గురించి మాట్లాడుతూ గత వారం కేంద్ర హోం మంత్రి చిదంబరం ‘మీరు మీ ఆయుధాలను, మీ సిద్ధాంతాలను వదలవలసిన అవసరం లేదు. కేవ లం హింసను ఆపండి’ అని ఒక సూచన చేశాడు. మావోయిస్టులు ‘మాది హింస కాదు ఇది ప్రతిహింస’ అని వాళ్ల పోరాటం ప్రారంభమైన నాటి నుంచి నాలుగు దశాబ్దాలుగా చెపుతూనే ఉన్నారు. హింస, ప్రతిహింస వలయాన్ని దాటి అసలు ఈ హింసకు మూల కారణా లు సామాజికార్థిక నిర్మాణంలో ఎక్కడ ఉన్నాయో వెతకవలసిన అవసరం చరివూతకు ఉంటుంది. చిదంబరం లాంటి వ్యక్తులకు, ఫిలాసఫి చదవకపోవడం వలన చారివూతక స్పృహలేకపోవడం వల్ల సందర్భంతో సంబం ధం లేకుండా మాట్లాడుతుంటారు. అంతేకాక ఉద్యమకారులు ప్రధాన జన జీవన స్రవంతిలో కలిసి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, ఎన్నికలలో పోటీచేసి రాజ్యాధికారంలోకి రావచ్చు గదా అని హోంమినిస్టరే కాదు చాలా మంది మధ్యతరగతి విద్యావంతులు, మేధావులు మాట్లాడుతుంటారు. ఈ వాదనలను ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఉద్యమ అనుభ వం నుంచి పరీక్షించవలసిన అవసరముంది.


చిదంబరం గారు 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీల సమావేశం తర్వాత, దాదాపు అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలిపిన తర్వాత, అసెంబ్లీలో తీర్మానం పెట్టండి మేం మద్దతు ఇస్తాం అని చంద్రబాబు స్వయంగా ప్రకటించిన తర్వాత ఈ ప్రకటన చేశారు. బహుశా ప్రజాస్వామ్య వ్యవస్థలో 9 డిసెంబర్ ప్రకటన ఒక శాంతియుత ఉద్యమ విజయంగా భావించిన తరుణంలో రాజకీయ పార్టీలు ప్లేటు ఫిరాయించాయి. దీంట్లో కాంగ్రె స్ పార్టీని ప్రధానంగా తప్పుపట్టాలి. కేంద్రంలో అధికారంలో ఉండి ప్రభుత్వం తరఫున తమ హోం మంత్రి ప్రకటన చేసే దాకా ఆగి మరునాడే ‘మా ప్రాంత ప్రజల ఆకాంక్ష మేం సరిగా అంచనా వేయలేకపోయాం’ అని రాత్రికి రాత్రే జ్ఞానోదయం అయినట్టు మాట్లాడిన ఆంధ్ర ప్రాంత నేతలను ప్రజావూపతినిధులు అని మనం పరిగణించవచ్చా? అలాగే మరో ప్రాంతం నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి తాను చేసిన ప్రకటనను పునఃపరిశీలించవలసి వచ్చింది అని మాట మార్చిన చిదంబరంను కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మనం ఎలా అర్థం చేసుకోవాలి.

సమస్య జటిలం అయిందని ఒక న్యాయమూర్తితో కమిటీ వేస్తే, ఒక అవాస్తవ, అసందర్భ, అస్పష్ట రిపోర్టు ఇచ్చిన వారి గురించి మనం ఏం అనుకోవాలి? చిదంబరం, కేంద్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, కమిటీలు, కమిషన్‌లు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉత్పన్నమైన ఒక సమస్యకు శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కారం కనుక్కునే బదులు వాళ్లే సమస్యలో భాగమైతే సమస్యలకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది.


వ్యవస్థలు, సంస్థలు, వ్యక్తులు తమ పాత్ర తాము నిర్వహించనప్పుడు ఆ మొత్తం వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పోతుంది. విశ్వసనీయత కోల్పోయిన రాజకీయ వ్యవస్థ చట్టబద్ధమైన అధికారాన్ని చలాయించే నైతిక అర్హతను కోల్పోతుంది. అలా కోల్పోయినందువల్లే ప్రజలు ప్రత్యక్ష చర్యలకు పూనుకుంటారు. అన్ని సామాజిక, రాజకీయ ఉద్యమాలకు మూలం ఇదే. మావోయిస్టు పార్టీ లేదా ఇతర విప్లవ ఉద్యమాలు ‘ఇప్పుడున్న వ్యవస్థలో ప్రజల సమస్యలకు, వైరుధ్యాలకు పరిష్కారమార్గాలు లేవు కనుక మొత్తం వ్యవస్థకు శస్త్ర చికిత్స చేయవలసిందే’ అని అంటున్నాయి. అలాకాదు వ్యవస్థలో పరిష్కారాలు లభిస్తాయి అని అన్ని పార్లమెంటరీ రాజకీయ పార్టీలు వాదిస్తున్నాయి. మరి ఇలాంటప్పుడు తెలంగాణ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో వివరించవలసిన బాధ్యత ఆయా రాజకీయ పార్టీల మీద ఉంది.


రాజకీయ పార్టీలు తెలంగాణ సమస్యను పరిష్కరించలేకపోవడం, ప్రజా ఉద్యమాలను ప్రజల ఆకాంక్షలను గుర్తించలేకపోవడం ఎంత పెద్ద ప్రజాస్వామ్య విషాదమో ఊహిస్తేనే అందోళన కలుగుతుంది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఇప్పుడు వచ్చింది కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రతిగా ఆంధ్ర ప్రాంతంలో సమైక్య ఉద్యమం ప్రారంభించారు. సమైక్య ఉద్యమానికి మొదటి నాయకుడు ఒక కంపెనీ యజమాని. కంపెనీలు పెట్టుకొని కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న వారు ప్రజావూపతినిధులుగా ఎలా రూపాంతరం చెందుతారన్నది కూడా ప్రజాస్వామ్యానికి ప్రశ్నే. తమ సొంత ప్రయోజనాలు, లాభాల వేటలో ఉండేవారు తమ స్వప్రయోజనాన్ని, ప్రజా ప్రయోజనాన్ని ఎలా విడదీసి ప్రవర్తిస్తారో కనుగొనడం చిదంబర రహస్యమే. ప్రజా రాజకీయాలలోకి వచ్చేవాళ్లు సమష్టి ప్రయోజనం కొరకు పనిచేస్తారు అనే భూమిక ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు. తమ స్వప్రయోజనాన్ని, సమష్టి ప్రయోజనాన్ని కలిపి సమష్టి పేరు మీద లాభాలు చేసుకునే వారు ప్రజాస్వామ్య సంస్కృతికి దోహదం చేయగలరా! అనే ఒక సవాలు సమాజం ఎదుర్కొంటున్నది.

కంపెనీ యజమానులు హైదరాబాద్ నగరంలో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు.కోటాను కోట్లు లాభాలు గడించారు. అలాం టి ప్రజా ప్రతినిధులు ప్రజల కొరకా, నిధుల కొరకా అనే ప్రశ్న కూడా వస్తుం ది. ఆంధ్రప్రాంతంలో ‘సమైక్యత’ గురించి ఆలోచించే వారు కొంత మంది ఉండవచ్చు. నిజాయితీగా ఆలోచించే వాళ్లూ ఉండవచ్చు. వాళ్ల గొంతు ఎక్కడా వినపడడం లేదు. అలాంటి వాళ్లు తప్పక తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని గురించి ఆలోచిస్తారు. సానుభూతితో పరిష్కరించాలని ఒత్తిడి పెడతారు. తమ ప్రయోజనాలు కొన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాని కంపెనీ యజమానులు తెలు గు ప్రజల సమైక్యత గురించి మాట్లాడితే వాళ్ల అభివూపాయాలను ప్రజాభివూపాయం అని అనుకునే అమాయకపు స్థితిలో ప్రజలు లేకపోవడం యజమానుల ‘దురదృష్టం’.


తెలంగాణ ఉద్యమం కేసీఆర్ కుటుంబం నడుపుతున్నదనో, కొందరు రాజకీయ నిరుద్యోగుల వ్యూహమనో అంటున్న వాళ్లు మూడువారాలుగా లక్షలాది సంఖ్యలో కదులుతున్న జనాన్ని చూసైనా అలా వాదించడం మానుకోవాలి. ఉద్యమాలు ప్రారంభించిన వాళ్ల కు తమ రాజకీయ కారణాలుండవచ్చు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఆ స్థాయిలన్నీ దాటిపోయింది. ఇది ప్రజా ఉద్యమమని గుర్తించడం మొదట చేయవలసిన పని. ఇంత విస్తృతస్థాయిలో ప్రజలు కదిలినప్పుడు బలమైన ప్రజా ఆకాంక్షను గుర్తించకపోతే అది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు. ప్రజావూపతినిధులు పట్టించుకోనప్పుడు ప్రజలే ప్రత్యక్ష చర్యకు పూనుకున్నప్పుడు దాన్ని గౌరవించే సంస్కృతి లేకపోతే ఆ వ్యవస్థకు భవిష్యత్తు ఉంటుందని విశ్వసించలేము.


ఈ ఉద్యమాన్ని అణచివేయగలమని పాలకులు భావిస్తున్నట్లున్నారు. విచ్ఛలవిడిగా ప్రవర్తించే పోలీసులను మనం నాలుగు దశాబ్దాలుగా ఉద్యమాల అణచివేత పేర తయారు చేసుకొని ఉన్నాం. ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం పోలీస్ శాఖకు లెక్కలేనన్ని నిధులు సమకూర్చింది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ బలగాల మీద ఆధారపడి ఉండడమే, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాదనడానికి సాక్ష్యం. ఇది ప్రజాపాలన కాదని అతి సామాన్యుడికి అర్థమైపోయింది. ప్రజల బాగు కొరకు, సమాజ మార్పు కొరకు, భారత రాజ్యాంగం వాగ్దానం చేసిన సమసమాజ నిర్మాణం కొరకు పోరాడుతున్న ప్రజలపై ఇంత బలవూపయోగం అవసరం ఏమిటో ఏలిన వారే చెప్పాలి.

శాంతియుత తెలంగాణ భగ్గుమంటే ఎవరు బాధ్యులు? ఇంత శాంతియుత ఉద్యమానికి స్పందించని పాలకులు ప్రజలకు ఏం సందేశమిస్తున్నారో ఆలోచించాలి. ప్రజలు చరిత్ర నిర్మాతలు. తెలంగాణ చరివూతను ఇలా మార్చుకోలేకపోతే ఎలా మార్చుకోవాలో వాళ్లే నిర్ణయించుకుంటారు. ఇక తెలంగాణ ప్రజలకు ప్రజాస్వామ్యంలో శాంతియుత పద్ధతుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని మళ్లీ మాట్లాడే చారివూతక అవకాశం మిగలదని పాలకులు అర్థం చేసుకోవాలి.
పొ.హరగోపాల్

నిర్బంధపు జాడల్లో..By -జూలూరి గౌరీశంకర్ Namasethe Telangana 30/09/2011


9/29/2011 11:29:32 PM
నిర్బంధపు జాడల్లో..
రాజ్యం రాజ్యాంగబద్ధంగా ఉన్నట్టు అందంగా కనిపిస్తుంది. కానీ ప్రజా ఉద్యమాలు ఎక్కడ ఎగిసినా రాజ్యం వికృతంగా మారుతోంది. ప్రజా ఉద్యమాలను తన ఉక్కు పాదాలతో నలిపేయాలని భావిస్తోంది. అయితే తన దమననీతి చివరికి ప్రజా పోరాటాలకు ప్రాణం పోసి నిలబెడుతుందన్న చరివూతను గుర్తించదు. ఇలా ప్రపంచ చరివూతలో అనేక మంది రాజ్యాధినేతలు నిరంకుశంగా వ్యవహరించి ప్రజాపోరాటాల విజయానికి కారణభూతులయ్యారు. నిత్య నిర్బంధ చిత్రహింసల ఆర్తనాదా ల నుంచే ఉద్యమం జనిస్తుంది. ఈ సత్యం ఆయుధ పహారాల మధ్య, నిర్బంధాల నీడలో తల్లడిల్లిన తెలంగాణకు బాగా తెలుసు. భూమి, భుక్తి, విముక్తి కోసం తమ నెత్తురును చిందించడం లాంటివి ఈ తెలంగాణ నేలలో ఎక్కడ తవ్వినా సింగరేణి బొగ్గులా బయల్పడుతూనే ఉంటాయి. నా తెలంగాణ త్యాగాల వీణ. అదే ప్రపంచంలో తెలంగాణకు ఉన్నత స్థానాన్ని కల్పించింది. త్యాగాలతోనే తెలంగాణ ఉద్యమం బతికింది. కానీ స్వార్థం, కుళ్లు రాజకీయాలను, కుతంవూతాలను తెలంగాణ ఏనాడు దరికి రానివ్వలేదు.


ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమం అంత బలం గా లేదని, విద్యార్థులు గొంతు పెకిలిస్తే లాఠీలతో, తూటాలతో అణచివేస్తే మళ్లీ గొంతు మెదపరని స్టీఫెన్ రవీంద్ర ఊహించారు. ఆయన నేతృత్వంలో 2009లో విచ్ఛలవిడిగా లాఠీచార్జీ, కాల్పులు, బాష్పవాయువు ప్రయోగించారు. కానీ రాజ్యం, పోలీసులు తలచింది ఒకటైతే, అందుకు భిన్నంగా జరిగింది. దీంతో పోలీసులు, రాజ్యమే కాదు అన్ని రాజకీయ పార్టీలు తలకిందులయ్యాయి. పదేళ్లుగా రాజకీయ భావజాల ప్రచారం ఎంత చేసినా దానికన్న బలంగా.. ఈ సంఘటన తెలంగాణ మనోఫలకంపై పడింది. ఉద్యమం గడప గడప దాకాపోయింది. రాజ్య నిర్బంధం ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని వేడెక్కించడమే కాదు మరింత బలపడేటట్టు చేసింది. దీన్ని పోలీసులు, రాజ్యం గమనించి ఇలాంటి వికృత ఎత్తుగడలు వేయకుండా ఉంటే మంచిదని దాన్ని గుణపా తీసుకోవాలి. కానీ దానికి భిన్నంగా మళ్లీ అదే పనిచేస్తే దాన్ని ఏమనాలి? ఏ ఫలితాన్ని ఆశించి ఈ దాడులు చేస్తున్నారని? మొత్తం తెలంగాణ సమాజం వేస్తున్న ప్రశ్న.


ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లాఠీచార్జీ, కాల్పులు, బాష్పవాయువుల సంఘటనలతరువాత ఉద్యమ జ్వాలలు ఎగిశాయి. దాని తర్వాత మూడేళ్లకు మళ్లీ అలాంటి భయంకరమైన వికృత దాడులు వరంగల్‌లో చోటుచేసుకున్నాయి. ఒక విద్యార్థిని విచక్షణా రహితంగా కొట్టడమే కాదు, ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారు. ఈ విషయం మానవ హక్కుల కమిషన్ దాకా వెళ్లింది. దాంతో వరంగల్ మరొకసారి పోరుగల్లుగా మారింది. తెలంగాణ ఉద్యమానికి టీఎన్జీవోలు ప్రాణవాయువు లాంటివాళ్లు. మూడున్నర లక్షల మంది ఉద్యోగులు చేసిన పోరాటం, చివరకు ‘ఫ్రీజోన్’ విషయంపై కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్ష, ఆ తర్వా త ఉద్యమం ఎన్ని మలుపులు తీసుకుందో చూశాం. అటు విద్యార్థులు, ఇటు ఉద్యోగులు, ఆమరణదీక్షలు.. మొత్తం మీద డిసెంబర్ 9 ప్రకటన వెలువడింది. టీఎన్జీవో నేతలు స్వామిగౌడ్, దేవీవూపసాద్‌లు ఉద్యమ మార్గంలో వాళ్లెంచుకున్న దారిలో ఏనాడు వెనకడుగు వేయలేదు. ఆ సంఘం నిర్ణయం మేరకు స్వామిగౌడ్ సారథ్యంలో ముందుకుసాగారు.


ఆర్టీఏ కార్యాలయం దగ్గర స్వామిగౌడ్‌పై మఫ్టీలో ఉన్న పోలీసుల దాడులు, మళ్లీ అక్కడ స్టీఫెన్ రవీంద్ర, హరీశ్‌లకు మధ్య ఘర్షణలు, ఓ దళిత ఎమ్మెల్యేను కిందపడేసి తొక్కడం లాంటి ఘటనలతో తెలంగాణ ఒక్కసారిగా ఉద్వేగానికి గురైంది. స్వామిగౌడ్‌పై దాడి చేయడంతో ఉద్యోగులంతా భగ్గుమన్నారు. మళ్లీ ఉస్మానియా చరిత్ర పునరావృతమైంది. ఈసారి గ్రౌండ్ మారింది, అది ఆర్టీఏ కార్యాలయమైంది. ఆ సీను మొత్తానికి డైరెక్షన్ మళ్లీ స్టీఫెన్ రవీంద్రే కావడం విశేషం. ఈసారి అక్కడ విద్యార్థులు లేరు. సాక్షాత్తు ప్రజావూపతినిధులు, టీఎన్జీవోలు, రాజకీయ పార్టీల జాతీయ నాయకులున్నారు. ఎమ్మెల్యేలను ఈడ్చుకపోవడం, స్వామి గౌడ్‌ను ఎక్కడపడితే అక్కడ కనిపించకుండా గాయపరచారు. ఈసంఘటనలతో తెలంగాణ మళ్లీ భగ్గుమనే స్థితికి వచ్చింది. రాస్తారోకోలు, ధర్నా లు, బందులు, హర్తాళ్లతో దద్దరిల్లింది. స్టీఫెన్ రవీంద్ర వచ్చినప్పుడల్లా భయంకరమైన లాఠీచార్జీలు జరుగుతున్నాయి. అయితే ఉస్మానియా, ఆర్టీఏ ఈ రెండు సంఘటనల్లో తెలంగాణ ఉద్యమమే నైతికంగా విజ యం సాధించింది.


స్వామిగౌడ్ ఏదో టీఎన్జీవో సంఘానికి అధ్యక్షుడైన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని నరాలకెక్కించుకున్నవారు కాదు. తను ఎనిమిదవ తరగతి చదువుతున్నప్పుడే నాటి జై తెలంగాణ ఉద్యమంలోకి దూకి పోలీసు కాల్పులకు గురైనవారు. తన ఎడమ చేతికి తగిలిన తూటా దెబ్బసాక్షిగా తెలంగాణ కోసం పరితపించే స్వామిగౌడ్ అసలు సిసలు తెలంగాణవాది. స్వామిగౌడ్‌ను కొట్టడం వల్ల తెలంగాణ ఉద్య మం వేడెక్కింది. పోలీసులు విచ్ఛలవిడిగా నిర్బంధాన్ని ప్రయోగించిన ప్రతిసారి చరిత్ర ఒక మలుపు తీసుకుంటోంది.
-జూలూరి గౌరీశంకర్
తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యద

Wednesday, September 28, 2011

లోక్‌పాల్‌లో సామాజిక కోణం - ఎం.చెన్న బసవయ్య, ఎస్.మేల్లస్, డి.రవీందర్ Andhra Jyothi 29/09/2011


లోక్‌పాల్‌లో సామాజిక కోణం
- ఎం.చెన్న బసవయ్య, ఎస్.మేల్లస్, డి.రవీందర్

'సా మాజికన్యాయం', 'జెండరు న్యాయం' రెండూ నేడు విశ్వవ్యాప్తంగా ఆమోదం పొందిన సూత్రాలు. ఈ అంశాలు సామాజిక, రాజకీయ, ఆర్థిక, పరిపాలన మొదలైన విధానాలను రూపొందించే ప్రక్రియలో విధిగా గమనంలోకి తీసుకోవాలని అన్ని సభ్య దేశాలకు ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది. వీటికి భారత రాజ్యాంగం, ముఖ్యంగా ఇటీవల వచ్చిన పలు చట్టాలు కూడా ప్రాధాన్యాన్ని ఇచ్చాయి. కాని ఈ అంశాల పట్ల ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రభుత్వ లోక్‌పాల్ ముసాయిదా, టీమ్ అన్నాచే అత్యంత నీతిమంతంగా రూపొందించబడినదిగా చెప్పబడుతున్న జన్‌లోక్‌పాల్ ముసాయిదా సహితం శ్రద్ధచూపక పోవడం విచారకరం.

అవినీతిని నిరోధించే చట్టాలు, సంస్థలు సామాజిక, జెండరు న్యాయసూత్రాలకు అతీతంగా ఉంటేనే మంచిదని భావించడం జరిగిందా? ఏది ఏమైనా 'జన్' లోక్‌పాల్ ముసాయిదాలోని అంశాలు. ఇటీవల ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగిన ప్రచారోద్యమం, దాని తీరుతెన్నులు భారతసమాజంలోని దళిత, ఆదివాసి, వెనుకబడిన, మైనారిటీ, మహిళా వర్గాలను కలవరపెడుతున్నది.

ముఖ్యంగా 'అన్నిరకాల అవినీతికి రిజర్వేషన్లే మూలకారణమని మనువు చెప్పిన యోగ్యతా ఆధారిత సామాజిక వ్యవస్థను ఏర్పరచిప్పుడే భారత్‌లో నిజమైన విప్లవం వస్తుందని' విశ్వసించే 'క్రాంతికారి మనువాది మోర్చా, రిజర్వేషన్లను వ్యతిరేకించే 'యూత్ ఫర్ ఈక్వాలిటీ', రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి పలు హిందుత్వ సంస్థలు, బాబాలు, ఆధ్యాత్మిక గురువులు, కార్పొరేట్ మీడియా, సవర్ణ శిష్టులు నడిపే ఎన్జీవోలు మొత్తంగా 'జన్'లోక్‌పాల్ ప్రచారోద్యమంలో కీలక పాత్ర వహించడం, రిజర్వేషన్ల వ్యతిరేక పోస్టర్లను, స్లోగన్లను బాహాటంగా వాడటం హిందూ మతపరమైన చిత్రాలను , కీర్తనలను ప్రదర్శించడం, కీర్తించడం మొదలగు అంశాలు లౌకిక, సామాజిక, జెండరు న్యాయ దృక్పథాలతో ఆలోచించే వారిలో పలు అనుమానాలకు, ఆందోళనలకు తావిస్తున్నది.

వివక్షలను వ్యతిరేకించే పలు దళిత, ఆదివాసి, వెనుకబడిన, మైనారిటీ, మహిళాసంఘాల ప్రతినిధులు కలిసి ఒక 'బహుజన లోక్‌పాల్' ముసాయిదాను రూపొందించి పార్లమెంటు స్థాయీ సంఘానికి సమర్పించారు. 'జన్ లోక్‌పాల్'తో పాటుగా ఈ ముసాయిదాపై కూడా పార్లమెంటులో సమగ్ర చర్చ జరగాలని పౌరసమాజానికే చెందిన ఈ సంఘాలు కూడా కోరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌పాల్ వ్యవస్థలో ఉండవలసిన కొన్ని ముఖ్యమైన సామాజిక, జెండరు న్యాయసూత్రాల అంశాలను చర్చించే ప్రయత్నం చేద్దాం.

(అ) జన్‌లోక్‌పాల్ ముసాయిదాలో పేర్కొన్న అవినీతి, దుష్పరిపాలన, దుష్ప్రవర్తనల నిర్వచనాలను విస్తృతపరచవలసిన అవసరమున్నది. వీటిలో దళిత ఆదివాసివర్గాల అభ్యున్నతికి ఉద్దేశించని 'స్పెషల్ కాంపోనెంట్ ప్లానుల' నిధుల కేటాయింపులను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కాని ఇతర అవసరాలకు దారి మళ్లించడం, వాటిని లబ్ధిదారులకు కాకుండా ఇతరులకు ఉపయోగించడం, వీటికి సంబంధించిన పథకాలను రూపొందించక పోవడం, అమలు పరచక పోవడం ఈ నిధులను దుర్వినియోగం చేయడం అనే అంశాలను చేర్చాలి.

(ఆ) కేవలం లంచగొండితనమే కాక అన్ని రకాల వివక్షలను అవినీతిలో భాగంగా చూడాలి. ఇవి లోక్‌పాల్, లోకాయుక్త అధికారాలు, విధులలో భాగం కావాలి. లోక్‌పాల్, లోకాయుక్త సభ్యులలో దళిత, ఆదివాసీ, బలహీన, మైనారిటీ, మహిళాసభ్యుల ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలి. ఇది లోక్‌పాల్, లోకాయుక్త ఎంపికకు జరిగే కమిటీలలో ఇద్దరికీ తక్కువ కాకుండా ఈ వర్గాల సభ్యులు ఉన్నప్పుడే సాధ్యం కాగలదు. ఈ రెండు సంస్థలలోని సిబ్బంది నియామకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రిజర్వేషన్లు వర్తింపజేయాలి.

(ఇ) ప్రభుత్వ, జన్ లోక్‌పాల్ ముసాయిదాలలో సూచించిన కేవలం ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది మాత్రమే కాకుండా నేటి ఉదారవాద ప్రపంచీకరణలో భాగంగా అవినీతిని పెంచి పోషిస్తున్న కార్పొరేట్ సంస్థలు, మీడియా, ఎన్జీవోలు కూడా లోక్‌పాల్, లోకాయుక్త పరిధులలోకి తీసుకురావాలి.

(ఈ) లోక్‌పాల్, లోకాయుక్తలపై జాతీయ ఎస్‌సి, ఎస్‌టి, బలహీన వర్గాల మైనారిటీ, మహిళా కమిషన్ల పర్యవేక్షణ ఉండాలి. దళిత, ఆదివాసి, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలపై అవినీతి ఆరోపణలు నిర్ధారించే క్రమంలో సంబంధిత కమిషనుల అభిప్రాయాలను విధిగా తీసుకోవాలి. ఈ వర్గాలపై విచారణను ఈ వర్గాలకు సంబంధిత లోక్‌పాల్, లోకాయుక్త సభ్యుల నేతృత్వంలో చేయాలి. విచారణ పూర్తికాబడి శిక్ష విధించిన తదుపరి సదరు వర్గాలకు చెందిన వ్యక్తులు లోక్‌పాల్, లోకాయుక్త నిర్ణయాలు సముచితమైనవని కావని భావించినట్లయితే తగు ఆధారాలతో సంబంధిత కమిషన్లకు తమ కేసులను నివేదించుకునే అవకాశం ఉండాలి. నివేదనను ఆయా కమిషన్లు అంగీకరించినచో అట్టి కేసులపై లోక్‌పాల్, లోకాయుక్తలు జోక్యం చేసుకోకూడదు. ఇట్లాంటి కేసులపై సంబంధిత కమిషన్ల తీర్పు అంతిమంగా అమలుపరచాలి. వీటన్నిటికి సంబంధించి ఈ కమిషన్ల అధికారాలను, విధులను మార్పు చేస్తూ సవరణలు చేయాలి.

(ఉ) దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళల అభియోగాలపై లోక్‌పాల్, లోకాయుక్త , ఇతర కోర్టులు, కమిషన్లలో విచారణ జరుగుతున్నప్పుడు సదరు వ్యక్తులు తమ కేసులను వాదించడానికి న్యాయవాదులను నియమించుకోజాలని పరిస్థితిలో ఉన్నట్లయితే సదరు వ్యక్తుల విన్న పాల ఆధారంగా ప్రభుత్వమే వారికి న్యాయవాదులను నియమించి సంబంధిత ఖర్చులను కూడా భరించాలి.

(ఊ) జన్ లోక్‌పాల్ ముసాయిదాలో పేర్కొన్న లోక్‌పాల్, లోకాయుక్తల 'సుమోటో' నిర్ణయ విచారణ అధికారాలు దళిత, ఆదివాసి, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు వర్తింప చేయకూడదు. ఈ వర్గాలపై అవినీతి కేసులను లోక్‌పాల్, లోకాయుక్తలు 'క్వాసి సివిల్, క్రిమినల్'గా భావించాలి.

(ఎ) లోక్‌పాల్, లోకాయుక్తలలోని దళిత, ఆదివాసి, బలహీనవర్గాలు, మైనారిటీలు, మహిళా సభ్యులపైన అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని విచారించే అధికారం సంబంధిత కమిషన్లకు ఇవ్వాలి. ఈ వర్గాల వ్యక్తులు ఇతరులపై అవినీతి ఆరోపణలు చేసినప్పుడు వారికి ప్రత్యేక ఆరోణలు కల్పించాలి. ఎందుకంటే వారికి మిగతావారితో పోలిస్తే బెదిరింపులకు ఆస్తి, ఇతర నష్టాలకు గురికాబడే అవకాశాలు సమాజంలో ఎక్కువగా ఉంటాయి.

నిజానికి ప్రొఫెసర్ శివ్ విశ్వనాథన్ తన గ్రంథం 'ఫౌల్ ప్లే: క్రానికల్స్ ఆఫ్ కరప్షన్ ఇన్ ఇండియా' లో చెప్పినట్లు అవినీతి అనేది ఒక 'వ్యవస్థ పరమైన సమస్య'. చట్ట పరమైన జోక్యాలు అవినీతి నిరోధనలో ఒక స్థాయిలోనే పనిచేయగలవు కాని పూర్తిగా అవినీతిని నిరోధించలేవు. కావున లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటు అవినీతి నిర్మూలనలో ఒక మెట్టు గానే భావించాలి. అయితే ఈ మెట్టును నిర్మించే క్రమంలో సామాజిక జెండరు సూత్రాలు విస్మరించ రాదు. పైన పేర్కొన్న అన్ని అంశాలు భారత రాజ్యాంగం, ఇతర చట్టాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి లోబడిఉన్నవే కాని వ్యతిరేకమైనవి కావు. కావున వీటిని లోక్‌పాల్ బిల్లు రూపొందిన ప్రక్రియలో పార్లమెంటరీ లోక్‌పాల్ చట్టంలో పొందుపర్చాల్సిన అవసరముంది. అప్పుడే సామాజిక న్యాయం , జెండరు న్యాయంతో కూడిన లోక్‌పాల్ వ్యవస్థ మన దేశంలో ఏర్పడగలదు.

- ఎం.చెన్న బసవయ్య, ఎస్.మేల్లస్, డి.రవీందర్
ఆచార్యులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం

Monday, September 26, 2011

విభజన సీమాంధ్రకే మేలు -కారుమంచి కృష్ణ చైతన్య Andhra Jyothi 27/09/2011


విభజన సీమాంధ్రకే మేలు

-కారుమంచి కృష్ణ చైతన్య

'దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్' అన్న గురజాడ మాటలను మనం సరిగ్గా అర్థం చేసుకున్నామా? రాష్ట్ర విభజన అంటే మట్టి విభజనే కానీ మనుషుల విభజన కాదు కదా. ఇన్ని సంవత్సరాలుగా కలసివున్నా సఖ్యత కుదరలేదు. అందువల్ల సమైక్యతా లేదు. సఖ్యత లేని సమైక్యత ఆధిపత్యమే అవుతుంది కాని నిజమైన సమైక్యత కాదు.

పెట్టుబడిదారులకు లాభాపేక్ష తప్ప ఆత్మ గౌరవం ముఖ్యం కాదు. వారు సమైక్య మన్నా జాతీయ జెండా భుజాన వేసుకుని జాతీయ వాదమన్నా దాంట్లో వారి లాభాపేక్ష దాగి ఉంటుంది. కావున వారు విభజనను తమ స్వభావరీత్యా వ్యతిరేకిస్తారు . అయితే గత కొన్నేళ్లుగా 'జాగో-భాగో', 'మొత్తం సీమాంధ్రులు అంతా వలసవాద దోపిడీదారులు' అని, 'అడ్డమొస్తే నరుకుతామని, తరుముతామని'.. ఇలా పలురకాలుగా తెలంగాణ వాసులు తమ అయిష్టతను వ్యక్తం చేస్తున్నారు. సీమాంధ్రులను బాహాటంగా చీదరించుకొంటున్నారు.

ఇలా సీమాంధ్రుల ఆత్మగౌరవానికి సవాళ్లు విసురుతూ ఉంటే , ఏమైనా ఫరవా లేదు, మీరు తిట్టినా, కొట్టినా నిస్సిగ్గుగా ఇంకా కలిసే ఉండాల అని మనం (సామాన్య సీమాం ధ్రులు) వాదిస్తే మనకంటూ ఒక ఆత్మగౌరవం ఉన్నట్టా? లేనట్టా? ఈ సందేహం సహజంగానే కలుగుతుంది. తెలంగాణ వాళ్ళు అన్నట్టు మనమందరం ఆత్మగౌరవం లేని వాళ్ళుగా అంటే పెట్టుబడిదారులు, దోపిడీదారులు, వలసవాదులుగా మిగిలిపోవాల్సినదేనా? ఇంతకీ విభజన జరిగితే మనకొచ్చే నష్టం ఏమిటి? మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? జాగ్రత్తగా ఆలోచించి, ఖచ్చితమైన ప్రతిపాదనలు ముందుంచి అది విభజనకు అంగీకరిస్తే సీమాంధ్రకు లాభమే కాని నష్టం వాటిల్లదు.

విభజన జరిగితే నదీజలాల సమస్య తలెత్త గలదని సీమాంధ్రలో అనుమానాలు ఉన్న మాట వాస్తవం. అయితే తెలంగాణ విడిపోతే సీమాంధ్రకు అసలు నీళ్ళు రావని అనడం రాజకీయం కాని వాస్తవం కాదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు నదీ జలాలను పంచుకొంటున్నాయి. ఉదాహరణకు నైలు నదీ జలాలను పదకొండు దేశాలు వాడుకొంటున్నాయి.

మన దేశంలో గంగ, గోదావరి, నర్మద, కృష్ణ , కావేరీ నదీ జలాలను పలు రాష్ట్రాలు పంచుకుంటున్నాయి. నదీ జలాల పంపకాలపై అంతర్జాతీయ, జాతీయ చట్టాలు ఉన్నాయి. ఆ ప్రకారంగానే రేపు, కృష్ణా, గోదావరి నదీజలాలను తెలంగాణ, సీమాం ధ్రు ల మధ్య పంపకం చేయవచ్చు. అయితే ఇక్కడ సమస్యలేమీ ఉండవని అర్థం కాదు. సమస్యలు ఉంటాయి. కానీ వాటి పరిష్కారానికి మెరుగైన మార్గాలను ఎంచుకోవడంలో చాకచక్యత చూపించాలి.

ఉదాహరణకు ప్రస్తుతమున్న ట్రిబ్యునల్ వ్యవస్థ లోని లోపాలను సరిదిద్దే ఆలోచనలు చేయాలి. నదీజలాల సమస్య జాతీయ సమస్యకాబట్టి ఒక రాజ్యాంగ/ చట్ట బద్ధ జాతీయ నదీజలాల అథారిటీని పార్లమెంటు ద్వారా ఏర్పాటు చేయాలి; దానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చి దేశంలోని నదుల నీటిని పంచే బాధ్యతను అప్పగించాలి. ఈ పంపకంలో రాష్ట్రాల ప్రమేయం లేకుండా చేస్తే నదీజలాల సమస్యలు తీరే అవకాశం ఉండవచ్చు. కావున వీటికి సంబంధించిన నిర్దిష్టమైన ప్రతిపాదనలు పెట్టాలి.

హైదరాబాద్ నగరం నేడు సీమాంధ్ర విద్యావంతులకు ప్రధాన మజిలీగా మారింది. ఇందులో సందేహం లేదు. విభజన జరిగితే ఈ సౌలభ్యం చేజారుతుంది అనుకోవడం ఒక అపోహ మాత్రమే. చదువుకున్న, నైపుణ్యత కలిగిన యువతకు నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో మజిలీలు దేశ విదేశాలలో చాలా ఉన్నాయి. అంత మాత్రాన వాటిపై రాజకీయ ఆధిపత్యం కోరుకోవడం లేదే!

మరి ఒక్క హైదరాబాదు పైనే ఎందుకు? హైదరాబాదును మనమే (సీమాంధ్రులు) అభివృద్ధి చేసినాము అనడం కూడా రాజకీయమే కాని చారిత్రక వాస్తవం కాదు. హైదరాబాద్‌లో వివిధ రాష్ట్రాల, దేశాల వారు పెట్టుబడులు పెట్టి వారి వ్యాపారాలు వారు చేసుకున్నారు. అలాగే సీమాంధ్ర పెట్టుబడిదారులు వ్యాపారులు కూడా. విభజన జరిగితే హైదరాబాదుపై సీమాంధ్రుల రాజకీయ పెత్తనం మాత్రమే పోవచ్చు కాని వ్యాపార నష్టం జరగదు. ఎందుకంటే సీమ్రాంధ్రుల పెట్టుబడి వ్యాపారాలు కేవలం హైదరాబాదుకు పరిమితం కాలేదు.

పలు రాష్ట్రాలలో, దేశాలలో (ఒక్క సీమాంధ్రలోనే అంతగా లేవు!) నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. వాస్తవంగా ఆలోచిస్తే నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో ఒక అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్‌కు ఎప్పుడూ కూడా నైపుణ్యత కలిగిన సీమాంధ్ర, ఇతర రాష్ట్రాల యువతకు కూడా మజిలీగా కొనసాగే లక్షణాలు ఉన్నాయి. అవి కనుమరుగయ్యే అవకాశాలే లేవు. పోగా కొత్త సీమాంధ్ర రాష్ట్రం ఏర్పడితే కొంగొత్త అవకాశాలు (తెలంగాణకు సాధ్యం కాని) సీమ్రాంధ్ర యువతకు మెండుగా వస్తాయి.

రాష్ట్ర విభజన జరిగితే ప్రస్తుతం హైదరాబాదు ఇతర తెలంగాణ ప్రాంతాలలో ప్రభుత్వ రంగంలో (ప్రైవేట్ రంగంలోని వారిని, కేంద్ర ప్రభుత్వరంగం వారిని, ఇతర స్వచ్ఛంద రంగాలవారిని ముట్టుకోవ డం కుదరదు) పనిచేస్తున్న సీమాంధ్ర వారినందరినీ వారి వారి ప్రాం తాలకు తరలిస్తారు అనడం ఆచరణ సాధ్యం కాదు. ఇప్పటికే అమలులో ఉన్న చట్టాల ప్రకారం వీరంతా స్థానికులు అయినారు. సీమాంధ్ర రాష్ట్ర నూతన రాజధానిని ప్రసుత్తమున్న ఏ సీమాంధ్ర నగరంలో ఏర్పాటు చేయరాదు.

ఇరు ప్రాంతాలకు అనుకూలంగా ఉండే ప్రాంతంలో నూతన రాజధాని నిర్మించాలి. తద్వారా కొత్త ప్రాంతంలో నిర్మాణ రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఉత్పన్న మవుతాయి. ఇవన్నీ సీమాంధ్రులకే దక్కుతాయి. కొత్త రాజధానిలో కొత్త సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు అవడం వల్ల మరల తెలంగాణ వారికి లేని కొంగొత్త ఉద్యోగ అవకాశాలు సీమాంధ్ర యువతకే లభ్యం కాగలవు. కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యేవరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలి.

విభజన జరిగి కొత్త రాజధాని వస్తే దానిలో, సీమాంధ్రలోని ఇదివరకే అభివృద్ధి చెందిన నగరాలలో కొత్త పెట్టుబడులు వ్యాపారాలు మొదలయ్యే అవకాశాలు కూడా చాలా ఉండవచ్చు. అక్కడ ఏర్పడే కొత్త ప్రభుత్వ చొరవ, సంకల్పం, పనితనం, సామర్థ్యాలపై ( నిజానికి ఇవి సీమాంధ్రులు తలచుకుంటే అసాధ్యమైనవి కావు) ఇవి ఆధారపడే ఉంటాయి.

ఇవే కాకుండా తెలంగాణకు లేని ప్రకృతి వనరులతో కూడిన పొడవైనతీర ప్రాంతం సీమ్రాంధ్రకు ఉంది. ప్రపంచ అభివృద్ధి చరిత్రలో తీరప్రాంతాలు అభివృద్ధిచెందినంతగా భూపరివేష్టిత ప్రాంతాలు అభివృద్ధిచెందలేదు. ఇంతవరకు సీమాంధ్ర తీరప్రాంతం అభివృద్ధికి నోచుకోక పోవడానికి ఇక్కడి పాలకుల, పెట్టుబడిదారుల సంకల్ప లోపమే కారణం. కొత్త సీమాంధ్ర రాష్ట్ర ఏర్పాటు వీటిని అధిగమించే అవకాశాలను ఇస్తుంది.

రాయలసీమ అభివృద్ధి అంశానికి సంబంధించి ఈ ప్రాంతం ప్రస్తుత రాష్ట్ర ఇతర ప్రాంతాల కంటే వెనుక బడినది. రాజకీయంగా చూస్తే నీలం సంజీవరెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్‌రెడ్డి దాకా రాష్ట్రానికి అత్యధిక ముఖ్య మంత్రులను అందించిన ప్రాంతం రాయలసీమే. ఇంతమంది దిగ్గజాలు ఉన్నా ఆ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండడానికి కారణం నాయకుల స్వప్రయోజనాలే. వాస్తవాలను పరిశీలిస్తే వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుకబడవేయబడ్డ ప్రాంతంగా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ వున్న ఖనిజ సంపద ఇతర ప్రాంతాలలో లేదు. ఇక్కడ అపారమైన ఖనిజ వనరు లు, ఇనుము, యురేనియం, బంగారం, స్టెయటైటు, క్వార్జు, టన్గుస్ట ను, గ్రనేటు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి ప్రకృతి ప్రసాదించిన వనరులే.

అయినప్పటికీ వీటిలో ఇక్కడి ప్రజల భాగస్వామ్యం, హక్కులు కోల్పోయి కేవలం ప్రయివేటు ప్రయోజనాలకే కొల్లగొట్టబడుతున్నాయి. అందువల్లనే ఇక్కడి రాజకీయ నాయకు లు అత్యంత ధనవంతులు కాగలుగుతున్నారు. ప్రజలు మాత్రం వారి భూస్వామ్య, ఫాక్షను రాజకీయాలకు బలి పశువులు అవుతున్నారు. కావున ఈ ప్రాంతం, ఇక్కడి ప్రజలు అభివృద్ధికి ఇక్కడి రాజకీయనాయకులు వారి సంకుచిత, స్వార్ధ రాజకీయాలే కారణం. ఇక్కడి ప్రజల రాజకీయ చైతన్య స్థాయి పెరిగి ఇక్కడి రాజకీయ నాయకులను, రాజకీయాలను ఎదుర్కొన్న నాడే ఈ ప్రాంతం బాగుపడగలదు.

సీమ్రాంధ్రలో సాధ్యం కాగల పైన తెలిపిన అవకాశాల గురించి ఆలోచించకుండా సామాజిక, ఆర్థిక, రాజకీయ చతురతో కూడిన ప్రతిపాదనలను ముందుంచకుండా, వాటిపైన చర్చించకుండా, కేవలం ఎప్పటికీ సఖ్యత ఒనగూరని సమైక్యరాగాలాపన చేయడం సీమాంధ్ర సామాన్యప్రజలకు (రాజకీయ నాయకులకు, పెట్టుబడిదారులకు కాదు) ఒక వృధా ప్రేలాపనే అవుతుంది.

రాష్ట్రంలోని రెండు ముఖ్య పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం వారి వారి ఓట్ల రాజకీయాలకు, పెట్టుబడి వ్యాపారాలకే ప్రాధాన్యమిస్తున్నాయి.కాని ప్రజల చిరకాల సమస్యలకు కాదు. చివరికి 'ప్రజలే ప్రభువులు', 'అధికార వికేంద్రీకరణ', 'సుపరిపాలన' అని గంభీర ఉద్ఘాటనలు చేసే లోక్‌సత్తా కూడా సముచిత నిర్ణయం తీసుకోక పోవడం ద్వారా తన పరస్పర విరుద్ధ భావ దారిద్య్రాన్నే చాటుకున్నది.

సమస్యను తెగే దాకా లాగి ఇప్పటికే పెరిగిన ద్వేషాలను మరింతగా పెంచి పోషించడం వలన ఏ ప్రాంతానికీ ప్రయోజనాలు ఉండవు. మట్టిగా విడిపోయి మనుషులుగా ఉండాలనుకుంటే రాష్ట్ర విభజన జరగాలి. దీనితోనే ఇరు ప్రాంతాల ఆత్మగౌరవం నిలబడగలదు. అభివృద్ధి చెందగలదు. శాంతి నెలకొనగలదు అన్న సత్యాన్ని గ్రహించాలి. కావున సీమాంధ్ర ప్రజలు శాస్త్రీయంగా ఆలోచించి రాజకీయ పార్టీలకు అతీతంగా అడుగులు ముందుకు వేయాల్సిన కాలం ఆసన్న మైనది.

-కారుమంచి కృష్ణ చైతన్య (గుంటూరు)
అయ్యంగారి రాఘవశర్మ (చిత్తూరు)
(న్యూఢిల్లీలోని జెఎన్‌యు, ఢిల్లీ వర్సిటీలో పరిశోధక విద్యార్థులు)